హైస్కూలులో రామకృష్ణ తుఫాను రోజున హెడ్మాస్టరును కొట్టబోవడం, తిట్టడం, రికార్డులు నేలను విసిరికోట్టడం, దేశనాయకుల పటాలు పగలగొట్టడమూ వార్త జనశక్తి పత్రికలో యువజనులు గ్రామంలోని పెద్దలు చేస్తున్న అన్యాయాలమీద జరిపిన పెద్ద తిరుగుబాటు చర్యలా వర్ణించబడింది. దానిని ఆధారం చేసుకొని పోలీసులు గ్రామంలో అరెస్టులు చేస్తారనే వదంతి ఒకటి వ్యాపించివుంది. రిపోర్టులేమన్నా వెళ్ళాయేమో. యేమని వెళ్ళేయో ఎవ్వరూ ఎరుగరు. మునసబు అనేక రకాలుగా మాట్లాడి మరింత గందరగోళం కలిగిస్తున్నాడు. యేవో కొన్ని అరెస్టులు జరుగుతాయనేది కింవదంతి. ప్రభుత్వ దౌర్జన్య విధానాన్ని ఖండిస్తూ సభలు పెట్టడంచేత నక్సలైట్లకు దమ్ము చిక్కిందనేది ఒకవాదం. దానికన్న హైస్కూలు తాళాలు పగలగొట్టి హరిజనులను పంపిన సుందరరావు మీదనే తప్పు మోపేవాదమూ వుంది.

ఆ మానసికాందోళనలో అందరికీ అది పోలీసులదాడి సూచనగానే వినిపించింది. లక్షిందేవమ్మ ఆదరాబాదరాగా మగడు పడుకున్న చోటికి పరుగెత్తింది. అప్పటికే ఆయన లేచివున్నాడు. చొక్కా వేసుకొంటున్నాడు. వెనకనుంచి వీధి తలుపులు బాదుతున్న చప్పుడు వినిపిస్తూనే ఉంది. లక్షిందేవమ్మ ఏడుపు మొహం పెట్టింది.

“వచ్చేసేరు.”

సుందరరావు సాధ్యమైనంత గంభీరంగా ముఖం పెట్టేడు.

“అరెస్టుల వార్త వెంటనే ఊళ్ళో తెలిసేలాగ చెయ్యండి” ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు; “సత్యనందానికి చెప్పి వెంటనే విశాలాంధ్రకి  టెలిగ్రాం పంపించమనండి.”

అప్పుడే అక్కడకు వచ్చిన పెద్దకూతురు విశాలాక్షి ఆశ్చర్యం కనబరచింది. “విశాలాంధ్రకా?”

తన ఆదేశం పునరావృత్తం చేయవలసి వచ్చినందుకు సుందరరావు చిరచిరలాడేడు.

“ఔను”, ఒక్కక్షణం ఆగి, తన అభిప్రాయం స్పష్టంగా చెప్తే తప్ప వాళ్ళకి అర్ధం అయ్యేలా లేదనుకొన్నాడు.

“మిగిలిన పత్రికల వాళ్ళకి నక్సలైట్ అనే పేరుంటే వారిని ఏంచేసినా పట్టడం లేదు. అరెస్టు చేసినా, చంపేసినా పేర్లు కూడా తెలియనివ్వడం లేదు. మనది వారపత్రిక అయిపోయింది. కనీసం అన్యాయం జరిగి పోతున్నదని వ్రాస్తూంది. విశాలాంధ్ర....”

వప్పగింతాల మాదిరిగా వినిపిస్తున్న ఆ మాటలు విని లక్షిందేవమ్మ బావురుమంది. వీధిలో ఇంకా తలుపు కొడుతూనే వున్నారు. సుందరరావుకి చిరాకు పుట్టింది.

“తరవాత ఏడవడానికి బోలెడంత వ్యవధి వుంటుంది. లే. విను, చెప్పేది.”

“సుందరావు బాబూ”

ఆ కంఠస్వరం జోగన్నది. సుందరరావు గుర్తుపట్టేడు.

“జోగడు కాదూ తలుపుకోట్టేది?”

లక్షిందేవమ్మ ఎడుపుమాని ఆలకించింది. సుందరరావు ఆ స్వరం జోగన్నదని స్థిరపరుచుకొన్నాడు. అయినా ఆలోచనలు పోలీసుల్నీ, అరెస్టుల్నీ  వదిలిరావడంలేదు. కనక జోగయ్య మరో పనిమీద వచ్చి ఉంటాడనే ఆలోచనే పోలేదు.

“ఈ గాడిద కొడుకు తీసుకొచ్చినట్లుంది”-అంటూ చాల దిగాలు పడ్డాడు.

“తలుపు తీయండి. పగలకొట్టి పోగలరు. పారిపోతున్నామంటూ,ఇక్కడే....”

పన్నెండో ప్రకరణం

తనదంతా వట్టి కంగారేనని తెలిసేక సుందరరావు మనస్సు కుదుటపడడానికి బదులు కోపోద్రిక్తం అయింది.

“ఏమిటింత రాత్రివేళ వచ్చేవు? వో రాత్రివేళ తలుపులు దబదబ లాడించి, ఊరందరినీ ఆదరకొట్టే బదులు, తెల్లవారేక రాకూడదూ? ఏమంత రాచకార్యం మునిగిపోయింది?”

ఆ విసురుచూసి జోగయ్య నవ్వేడు.

“ఏం పోలీసులనుకొన్నారా? బందిపోటు లొచ్చేరనుకొన్నారా?”

ఏమనుకున్నాడో సుందరరావు చెప్పలేదు. చుట్టుప్రక్కల ఇళ్ళవాళ్ళకి కూడా తమకు కలిగిన అనుమానాలే వచ్చేయి. కిటికీల్లోంచి తొంగి చూస్తున్నారు. పోలీసులెవరూ కనబడ్డంలేదు. ఉన్నదల్లా జోగన్న. వాళ్ళు మళ్ళీ కిటికీలు మూసేసుకున్నారు. ఒకరిద్దరుమాత్రం తలుపు తెరుచుకు వీధిలోకి వచ్చి వాకబు ప్రారంభించేరు.

“ఏమిటయ్యా హడావిడి!”

సుందరరావు మనస్సు మండిపోతూంది. ఆ కోపాన్ని హాస్యం మాటున దాచిపుచ్చుతూ అలవోకగా తేల్చివేసేడు;

“మనవాడు బుద్ధికి బృహస్పతే. కాని, బుద్ధి నిలకడకి మర్కట కిశోరం నయం. ఏదో గొప్ప ఆలోచన తోచివుంటుంది. దాన్ని తెల్లవారే వరకూ మగ్గేస్తే పులిసిపోదా? ఏమోయ్! అంతేనా? చూడు. ఎంతమందికి నిద్ర పాడుచేసేవో....”

జోగయ్య నవ్వుతూనే వున్నాడు. సుందరరావుకి చిరాకు కలిగినా పైకి తానూ నవ్వేడు.

“ఇరవై, పాతికేళ్ళనుంచి చూస్తున్నా, ఒక్కలాగే వున్నావోయ్.”

“బాగా చెప్పేవు” అని శ్రోతలు కూడా అంగీకరించి, నిద్ర తరవాయి అందుకోవడానికి వెళ్ళిపోయేరు.

నలుగురూ వెళ్ళిపోయేక సుందరరావు జోగాన్నను సావట్లోకి తీసుకువచ్చి కూర్చోబెట్టేడు. తానూ కూర్చున్నాడు.

“చెప్పు”

“ఊళ్ళో తాము పెడుతున్న సభలలో మనం కలిసిరానందుకు రివిజనిస్టులు మనమీద ప్రతీకారచర్యలు ప్రారంభించారు. మిమ్మల్ని ఏం చెయ్యలేరు. ‘ఊరందరికీ నేను లోకువ. నాకు నంబికొండయ్య లోకువ’ అన్నట్లు నేను దొరికాను. నామీద పడ్డారు.”

సభలు పెట్టడంలో తాము కలియకపోవడం, రివిజనిస్టులు కసితీర్చుకోడం మాట వచ్చేసరికి సుందరరావు సావధానంగా సర్దుకు కూర్చున్నాడు. ఒక్కక్షణం క్రితం జోగయ్య కలిగించిన ఆందోళన, కోపం మరిచిపోయేడు.

“అసలేం జరిగిందో చెప్పు.”

“కుమారస్వామిగారి పొలం నేను చేస్తున్నాను కదా. ఇస్తున్నానో, మానుతున్నానో ఆ పెద్ద బ్రాహ్మడు ఎప్పుడూ కూడ, ఏమిటింతే ఇచ్చేవేం అని అడగలేదు. ఆయనకి మన పార్టీ మీద అభిమానమే కాదు. సాటి బ్రాహ్మణాడిననీ, పిల్లలవాడిననీ నామీద ప్రత్యేకించి అభిమానం....”

“వట్టి భ్రమలకేం గాని, అసలు ఏం జరిగింది?”-అని సుందరరావు అతని వాక్ప్రవాహాన్ని అడ్డగించేడు.

“భ్రమ కాదండి. నిజం. ఆయన అన్న మాటలివి. వెనకోమాటు మీకు చెప్పేనుకూడా. ఆ రోజున నాకోసం స్వయంగా కబురు పంపి చెప్పిన మాటలే. ‘ఏమోయ్! జోగన్నా. నేనూ పెద్దవాడినైపోయేను. అదీగాక, అందరూ అన్ని పనులకీ తగరు. నీలాగ నేను దేశం కోసం పాటుపడాలంటే సాధ్యం కాదు. నాకు చేతా కాదు. నువ్వు ఆ భూమి చేసుకో. బ్రతుకు. పిల్లలవాడివి. సాటి కులంవాడివి. నేనే దేశానికి సేవ చేస్తున్నట్లు సంతోషిస్తాను”-అని పదిమాట్లు వప్పచెప్పేడు.

“అసలు విషయం చెప్పవోయ్ బాబూ!” సుందరరావుకు అర్థరాత్రి వేళ హడావిడి చేసి తన కులం, దేశసేవ గురించి జోగన్న చెప్పుకోడం చిరాకుగా వుంది. పైగా ఆ భూమిని జోగన్న చేయడాన్ని తామంతా బలపరిచారు. కులం చూసీ, అతని దేశసేవ చూసీ కాదు. అతని రౌడీతనానికి తమ పార్టీ మద్దతునిచ్చి, అది కాస్తా రివిజనిస్టుల పాలబడకుండా నిలిపేరు. ఇప్పుడదంతా తన ప్రజ్ఞే అంటే?

“ఆ భూమి నాకు లేకుండా చేస్తే తప్ప పార్టీని దెబ్బతియ్యలేమనుకొన్నారు కాబోలు. అది కాస్తా వ్రాయించుకొన్నారట.”

“ఎవరు, ఆ వ్రాయించుకొన్నది?”

“జానకి కొడుకు పేర వ్రాయించేరట.”

“అదేమిటి?”

“ఏమిటేమిటి? కోడలేగా జానకి. ఆ కుర్రాడు మనుమడే కాదండి?”

“ఔను సుమీ ఆ బంధుత్వం ఒకటి వుంది కాదూ. ఔను. అతనికి వ్రాసి ఇచ్చేడన్నమాట, ముసిలాయన.”

సుందరరావు ఆ సమాచారాన్ని మనస్సుకు పట్టించుకొనేసరికి ఒక్క క్షణం ఆలస్యం అయింది. ఈలోపున జోగన్న తన కధ సాగించేడు.

“వారం పదిరోజుల క్రితం సరిగ్గా తుపానుకి ముందు సత్యానందం స్వయంగా పెళ్లాన్ని తోడిచ్చి పంపించి చేయించిన పని ఇది....”

సత్యానందం ఈ పని చెయించేడంటే విప్లవానికి అది ద్రోహచర్యగానే భావించడం సుందరరావు స్వభావం. జోగయ్య తమ పార్టీవాడు. అందుచేత మరీ ముఖ్యం. అతనికి వత్తాసునివ్వక తప్పదు.

“ఏం ఫర్వాలేదు. నీమీద కసి తీర్చుకోడం అంటే పార్టీమీద కసి తీర్చుకోడం అన్నమాట. అది అంత సులభం కాదు. పార్టీ అంతా నీ వెనకనుంటుంది. ఫర్వాలేదు. కాని, అసలు ఏమయిందో చెప్పు....” అన్నాడు సుందరరావు.

ఆమాత్రం దిలాసా ఇస్తే జోగన్నకు సంతృప్తి కలగలేదు. తానా మాట చెప్పగానే ఇంత ఎత్తు ఎగిరిపడి, తారాజువ్వలా లేస్తాడని అతని వుద్దేశం. అది జరగలేదు. కనక జరగవలసిందేమిటో తానే చెప్పేడు.

“ఇదేం లాభంలేదు. మనం కూడా చప్పబడిపోతున్నాం. పిల్లి గుడ్డిదైతే ఎలక ‘ఏదో’ చూపిందిట. వీళ్ళని కాలరాసెయ్యక పోతే లాభం లేదు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అని మాటల్లో చెప్తే చాలదు. చేతలు. చేతల్లో చూపాలి. మనలో ఆ జివ తగ్గిపోతూందనే నక్సలైట్లు విడిపోయేరు. ఇంకేనా మనకి తెలివి కలగకపోతే....”

తన పార్టీ స్తంభాలు కదిలిపోతున్నట్లే సుందరరావు వులికిపడ్డాడు.

“భూమి పట్టా ఆయనపేర వుంది. కాని, అందులో నువ్వు ఆరేడేళ్ళ నుంచి....”

“పదేళ్ళయింది దానిలో చేరి....”

“ఔనా మరి. ఒక్క కాగితమన్నా వుందా, కౌలు పేరునో, అద్దె పేరునో....ఏదో మాటగానన్నా....”-అని సుందరరావు ఆ భూమిని స్వాధీనంలో అట్టే వుంచుకోడానికి చట్టసంబంధమైన అవకాశాలేమున్నాయో తెలుసుకొనడానికి ప్రయత్నించేడు.

“ఆ ముసలాడు దివాన్గిరీ వూరికే వెలిగించేడా? ఒక్క కాగితం ముక్క పుట్టనివ్వలేదు. ఎప్పుడెళ్ళినా కబుర్లతోనే కడుపునింపి పంపేస్తూ వచ్చేడు.”

అంతేకాదు. ఆ పొలం చుట్టూ ముళ్ళతీగ వేయించి, మకాంపాక, నూయి, ఇతర మెరుగులు చేయించినది కుమారస్వామే. అందులో వేసిన మొక్కామొటికా చూడడానికి పాలేరుని పెట్టింది ఆయనే. మకాంపాకలో కాపురం వుంటూ, ఆ భూమి అంతా తనదిలాగ తిరగడం తప్ప జోగన్నకి బాధ్యత లేదు. ఆ పనికని నెలకేదో ఇంత అని కుమారస్వామి మనియార్డరు చేస్తున్నాడు. ఈ వివరాలేవీ సుందరరావు ఎరగడు. ఇప్పుడవన్నీ విని విసుక్కున్నాడు.

“మరి ఏం చేస్తావు?”

“మీరే చెప్పండి. మన పార్టీ పేరు ఇంతవరకూ వుపయోగించుకొని, ఇప్పుడు రివిజనిస్టుల చేతికి ఆ భూమి వప్పచెప్తూంటే మనం ఏమాత్రం ఒప్పుకోకూడదు”-అని జోగన్న నిర్దేశించేడు.

కాని, దానిని జోగన్న చేతిలో నిలవబెట్టడం ఎల్లాగో సుందరరావుకి అర్థం కాలేదు. ఆలోచించేడు. ఆయన ఆలోచనలను త్వరితపరుస్తూ జోగన్న చెప్పుకుపోతున్నాడు.

“నేను మార్క్సిస్టును. పార్టీ కార్యకర్తను. అందుచేతనే నాకు నిలవనీడలేకుండా చేస్తున్నారు. అల్లాచేస్తే లొంగిపోయి వాళ్ళ పార్టీలో చేరతానని వాళ్ళ వూహ. ఈ వార్త నాకు చెప్పిన కరణంగారు వెళ్ళి సత్యానందాన్ని కలుసుకు మాట్లాడమని అప్పుడే ఉచితసలహా ఇచ్చేరు కూడా....”

“అలాంటి పని చేసేవు గనక. కొంప తవ్వుకుపోతుంది”-అన్నాడు సుందరరావు.

“అందుకేగా ముందు మీవద్దకు వచ్చింది.”

“చట్టరీత్యా ఆ భూమిని నిలుపుకొనేందుకు నీవద్ద ఆధారాలేవీ లేవు.”

“నేను మార్క్సిస్టు పార్టీ వాడిని. మంచికీ చెడ్డకీ పార్టీని అంటిపెట్టుకొని వున్నాను. ఈ స్థితిలో నన్ను ఆదుకోవలసిన బాధ్యత పార్టీ మీద వుంది.”

అతని డిమాండు చూసి సుందరరావు చిరచిరలాడేడు.

“పార్టీ మన లాభాలకు కాదయ్యా. మనం పార్టీకోసం గాని....” అన్నాడు.

ఆ మాటకు జోగయ్య ఛర్రుమన్నాడు.

“అన్నింటికీ నన్ను వాడుకున్నారు, తిడితే భేష్ అన్నారు. రాయి విసురుతే భళా అన్నారు. తీరా మీ అవసరం వచ్చేసరికి నాలిక మడత వేస్తున్నారు.”

“తొందరపడకు.” అని సుందరరావు అతనిని శాంతపరచడానికి పూనుకొన్నాడు.

“ఇప్పుడున్న మార్గం ఒక్కటే.”

జోగన్న రుసరుసలాడుతూ ‘ఏమిటది’-అన్నాడు.

“జాగ్రత్తగా విను. ఆలోచించు....ప్రస్తుతం వున్న స్థితిలో నిన్ను అక్కడినుంచి పొమ్మంటే నువ్వు చెయ్యగలది లేదు.”

“ఏం లేదూ? నన్ను పొమ్మనడానికి ఎన్ని గుండెలుండాలి? ఎవరంటారో అనమనండి చూస్తా.”

“ఏం చేస్తావోయ్!”

“ఏం చేస్తానా? కత్తెడైతే పొడిచిపారేస్తా.”

“అలాంటి తెలివి తక్కువ మాటలు చెప్పకు. చేయకు. ఉరి తీసి పారేస్తారు. పిల్లలవాడివి.”

“ఇంత పిరికితనం! మాటలు చూస్తే మాత్రం కోటలు దాటిస్తారు. పెద్ద మార్క్సిస్టులమని కబుర్లు మాత్రం....”

“ఈపాటికి కట్టిపెట్టు. చావదలుచుకుంటే వెళ్లు. కాదు పార్టీ సాయం కావాలంటే చెప్పినట్లు విను....”

జోగన్న తగ్గేడు.

“ఏం చెయ్యమంటారు?”

“ఇది నువ్వొక్కడివీ తట్టుకోలేవు.”

“అందుకేగా వచ్చింది.”

సుందరరావు ఒక్క నిముషం ఆగేడు.

“మన పార్టీకి చెందిన ఇళ్లు లేనివాళ్లందర్నీ ఆ పొలంలోకి వెళ్ళి పాకలు వేసుకోమందాం.”

“మరి నాకు లాభం ఏమిటి?”

“నువ్వు ఆ యిల్లు వదలనక్కర్లేదు. లేపితే అందర్నీ లేపాలి. లేపేరా పార్టీ అంతా ఒక్కటిగా నిలబడుతుంది. మీ నివాసస్థలాల నుంచి మిమ్మల్ని లేపాలంటే....”

“కాని, హరిజనుల మధ్యన బ్రాహ్మణాణ్ణి....”

సుందరరావు అసహ్యం కనబరిచేడు.

“కమ్యూనిస్టు  పార్టీలో కులభేదాలు చెల్లవు. నీకిష్టం లేకపోతే, అక్కడి నుంచి ఇవతలికి వచ్చెయ్యి. మరో దారి లేదు. ఆ భూమిని పార్టీ వదలదు.”

“నేనక్కణ్నుంచి కదలను.”

“కదలకు. నేను కదలమనడం లేదు. నిన్ను కదపకుండా తోడు నిలబడాలనే నా వూహ. వెళ్లు. పైకి పోనివ్వకు. ఎల్లుండి....ఎల్లుండేమిటి....రేపే....తెల్లవారేసరికి పేటలవాళ్ళచేత....”

“అదేం కుదరదు. అది నా భూమి. ఎవడన్నా పాక, గీక వేశాడంటే అగ్గిపుల్ల గీసేస్తా. జాగ్రత్త.”

సుందరరావు నవ్వేడు.

“అట్టే, గప్పాలు చెప్పకు. కాళ్లు, చేతులు కట్టి ఆ మంటల్లో పారెయ్యగలరు.”

“ఏ లం....జ....కొడుకు వస్తాడో, చూస్తా. అల్లాంటిపని చేసేవంటే ముందు నీ కొంపకి చిచ్చెట్టేస్తా” అని జోగన్న లేచేడు.

“ఏడిశావులే. నిష్కారణంగా ప్రాణం మీదికి తెచ్చుకోకు” మన్న మాటలు సుందరరావు నోట్లో వుండగానే జోగన్న వీధిలోకి జువ్వలా దూసుకుపోయేడు.

పదమూడో ప్రకరణం

సత్యానందం నూతి పెరట్లో ముఖం కడుక్కుంటూంటే సరస్వతి వచ్చి కబురందించింది.

“మీకోసం ఎవరో వచ్చేరు, మామయ్యగారూ!”

“కూర్చోమను అమ్మా! వస్తున్నా.”

“సావిట్లో కూర్చోబెట్టేను.”

అతడు వేవేగ ముఖం కడుక్కుని అంత ప్రొద్దుటే వచ్చిందెవరా అనుకొంటూ హాలులో అడుగుపెట్టేసరికి జోగన్న బల్లమీద కూర్చుని వున్నాడు. సత్యానందాన్ని చూడగానే వులికిపడ్డట్లు లేచి, చేతులు జోడించి దండం పెడుతూ జోగన్న ఎదురువచ్చేడు.

“బుద్ధి గడ్డితింది. క్షమించండి-అని అడగడానిక్కూడా మొహం చెల్లడం లేదు. క్షమించేనంటే తప్ప, పిల్లలవాణ్ణి బతకలేను....”

గడగడలాడుతూ పశ్చాత్తాప ఖిన్నమూర్తిలా జోగయ్య వచ్చి తన కాళ్ళమీద పడిపోతూంటే, సత్యానందం చట్టున వెనక్కితగ్గి, అతని భుజాలు పట్టుకొని నిలబెట్టేడు.

“ఏమిటీ అన్యాయం? నాకేం అన్యాయం చేశావని నిన్ను క్షమించడం? బాగుంది. ఇది మరీ బాగుంది. మీ పిల్లలకేం వచ్చింది? అంతా బాగున్నారా?....”

తన పిల్లలకేం కాలేదని జోగన్న చెప్పేడు. తుఫాను బాధితులు ఇళ్ళు వేసుకొనేందుకు ప్రభుత్వం యిస్తానన్న డబ్బుకోసం దరఖాస్తు పెట్టేడు. తాశిల్దారు వచ్చి సాయం కావలసిన వాళ్ళ పేర్లలో తనదీ చేర్చేడు.

“మరింకనేం, ఫర్వాలేదు. ఈలోపున కావలసిన సాయం....”

మళ్ళీ జోగన్న దండాలు మొదలుపెట్టేడు.

“మీ మనస్సు అంత గొప్పది. తెలుసుకోలేకపోయేను. వెధవని. సుందరరావు ఇశారా యిస్తే, ఏదో గొప్పపని చేస్తున్నాననుకొని, రాయి విసిరి, మీ వీధిలైటు బద్దలు కొట్టేసేను. ఆయన చెప్పేడు. నేను విన్నా. వెధవని, కుంకని....”

జోగయ్య ఛటఫటా చెంపలు వాయించుకుంటూంటే, సత్యానందం చటుక్కున అతని చేయి పట్టుకొన్నాడు.

“వోస్. అదా! దానికింత బాధ పడాలా? ఏమీ లేదు. అప్పుడే మరిచిపోయా. పైగా నువ్వు విసిరినట్లు మేము చూడలేదు. అనుకోలేదు....”

“మీ మనస్సు గొప్పతనం అది. చవటపీనుగుని కానలేకపోయేను.”

“ఇంక మళ్ళీ అవేం చెప్పకు. అల్లా చెయ్యడం తప్పని తోచింది. చాలు. మళ్ళీ అల్లాంటివి చెయ్యకపోవడమే....”

మాట మధ్యలోనే జోగన్న అందుకొన్నాడు. “ఇంకానా?....ఇంక అల్లాంటి వెధవపని చేస్తానా? ఇంక ఆ అనుమానం తగిలితే చెప్పుచ్చుకు కొట్టండి ఇంక అల్లాంటి పనులు చెయ్యమనే వాళ్లతో ఏమీ సంబంధం పెట్టుకోను. మీకు వ్రాసి ఇస్తున్నా....”

జోగయ్య జేబులోంచి ఒక కాగితం మడతతీసి, విప్పి సత్యానందం చేతికిచ్చేడు.

“చిత్తగించండి. దీని నకలు సుందరరావు ముఖాన కొట్టివచ్చేను. నేను మీ పార్టీలో చేరిపోడానికి వచ్చేను....”

సత్యానందం ఉలికిపడ్డాడు.

“ఇప్పుడు ఆ ప్రసక్తి ఏం వచ్చింది? సావకాశంగా ఆలోచించుకో. తొందరవద్దు.”

గ్రామంలో రౌడీగా, చంపడానిక్కూడా వెనుతియ్యనివాడుగా ప్రసిద్ధీ, స్వానుభవమూ వున్నా, 52 ఎన్నికలలో తమతో పనిచేసినాక జోగయ్యను పార్టీలో చేర్చుకొన్నారు. కూడదన్నవాళ్లు, ఎప్పుడో తప్పు చేసినందుకుగాను మరి బాగుపడే అవకాశం లేకుండా చెయ్యరాదన్న సమాధానంతో గమ్మునైపోయారు. అతనిని పార్టీలో చేర్చుకోరాదన్న వారిలో సత్యానందం ఒకడు. పార్టీ విడిపోయినప్పుడు అతను మార్క్సిస్టుల వెంటబోవడం కమ్యూనిస్టు పార్టీ అదృష్టంగా భావించినవారిలో అతడొకడు. ఇప్పుడు తిరిగివస్తానంటూవుంటే భయమే అనిపించింది.

“మనవి రెండూ ఏకలక్ష్యం గల పార్టీలు. ఇప్పుడు యేవో విభేదాలు....”

“చెప్పేకాదా! బుద్ధి గడ్డి తిని మార్క్సిస్టులతో చేరేనని....వాళ్లవలన దేశం ఉద్ధరించబడుతుందని భ్రమపడ్డా. వాళ్ళ విప్లవపదజాలం చూసి మోసపోయా.”

జోగయ్యను బాగా ఎరిగిన సత్యానందం ఆ ఆత్మ విమర్శనకు ఉబ్బితబ్బిబ్బు కాలేదు. పైగా కొత్త చిక్కులు ఎదురు కాగలవని భయపడ్డాడు. ఇలాంటి ఫిరాయింపులకు బ్రహ్మానంద పడేవాళ్ళ చేతిలో కాగితం పడితే, కళ్ళకద్దుకొని విశాలాంధ్రకు పంపేస్తారు. వాళ్లు గుడ్డిగా వేసేస్తారు. ఇంక ఇక్కడుంటాయి తమ పాట్లు. వూళ్లోవాళ్ళే కాదు. జోగయ్యే తమ మొహాన ఉమ్మేసినా వేస్తాడు.

జోగయ్యకు తన స్థానం, దానికి గల బలం బాగా తెలుసు. తన చేతిలో కాగితం చదివి వినిపించసాగేడు.

“కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి పార్టీగా కలిసి వున్నప్పుడే-ఇప్పటికి దరిదాపుగా పదిహేనేళ్ళనుంచి నేను పార్టీ సానుభూతిపరుడుగా, పార్టీ సభ్యుడుగా వుంటున్నా. అంతకు పూర్వం కూడ ప్రజాజీవన సాధనాలన్నింటినీ బూర్జువా, భూస్వామి వర్గాలూ, వారి పడితొత్తులుగా బ్రతుకుతున్న కాంగ్రెసు ప్రభుత్వమూ తమచేత బట్టుకొని, దేశంలో అనేక కొట్లమందిని బహిరంగంగా తమ ఇనప పిడికిలితో పట్టివుంచినట్లే నన్నూ నొక్కి వుంచినా, నా మనస్సు, నా ఆత్మ విప్లవపార్టీ అయిన కమ్యూనిస్టుపార్టీతోనే వుంది. 1952 ఎన్నికల నుంచి నా వోటు కంకి, కొడవలికే పడింది....”

సత్యానందం ఏదో అనాలి గనక, “ఔనౌను. నాకూ గుర్తుంది” అన్నాడు. ఆ ఎన్నికలలో జోగన్న ఎన్నికల క్యాంపులో వలంటీరుగా వున్నాడు. ఆ మాట అన్నాక తన పొరపాటు గుర్తు వచ్చింది. ఎలా సర్దుకోవాలో తోచక కంగారు పడ్డాడు. కంగారు కప్పిపుచ్చుకొనేందుకు పొడిదగ్గు నటించేడు.

జోగయ్య తన పత్రంలో మాటలకి ముఖతః వివరణనిచ్చేడు.

“నాబోటి సందిగ్ధాత్మకులకి మీరే దారి చూపేరు. ఆ గడ్డు నిర్బంధపు రోజుల్లో కమ్యూనిస్టు పేరుచెప్తే పట్టుకుపోయి కాల్చివేస్తున్న రోజుల్లో మీరు బాహాటంగా ప్రకటన చేసి “కమ్యూనిస్టు పార్టీతో చేరుతున్నాను. ఏం చేస్తారో చెయ్యండి” అన్నారు. ఆనాటికి మీకు కమ్యూనిస్టులయెడ విశ్వాసం లేదు. విశ్వంగారిని అన్యాయంగా కాల్చివేసినందుకు అసమ్మతిగా మీరు ఆ ప్రకటన చేశారు. చేరేరు....”

తనకు 1950 నాటికి కమ్యూనిజం మీద విశ్వాసం ఏర్పడిందనీ వారి పంధా మాత్రమే నచ్చలేదనీ చెప్పాలని వున్నా జోగయ్య మాటలకి తాను సమాధానం చెప్పుకోడం ఇష్టంలేక సత్యానందం తెరిచిన నోరు మూసేసుకొన్నాడు.

జోగయ్య తన ధోరణి సాగించేడు.

“దేశ భవిష్యత్తు కమ్యూనిస్టు పార్టీతోనే వుందని నమ్ముతున్నా, భయంతో మూల ఒదిగి కూర్చున్న మాబోటిగాళ్ళకు, మిమ్మల్నీ, మీ సాహసాన్నీ చూసేసరికి, కనువిప్పే కలిగింది. మీరు మాకు ‘మార్గదర్శీ మహర్షి....”

తన మాటల ప్రభావం సత్యానందం మీద ఏ విధంగా వుంటూందో గమనించడానికి, ఒక్క నిముషం ఆగి, అతని ముఖంలోకి చూసేడు.

జోగయ్యకు తాను మార్గదర్శినయ్యాననడం గర్వం కలిగించడానికి బదులు సత్యానందానికి అసహ్యమే కలిగించింది. కాని ఏమీ అనలేకపోయేడు.

“మీబోటి అసలు, సిసలు అభిమానులంతా పార్టీలోకి వచ్చాక కూడా, అందులో వుండడానికి ఏ మాత్రం అర్హతా లేని మాబోటిగాళ్ళు దానిని వదలలేదు. దానికి గబ్బు పట్టించాం. మీబోటివాళ్ళందర్నీ బయటికి పోయేలా చేశాం. ఇంత చేసిన నన్ను “మార్గదర్శీ మహర్షిః” అంటున్నావంటే....”

దానిని అవహేళనగా భావించే అవకాశం, అవసరం జోగన్నకు కనబడలేదు.

“మీరింకేమంటారు? మాకు ఎంత భక్తి విశ్వాసాలు పార్టీ మీదున్నా మంగలి మంత్రిత్వం దొరికింది. గాడిదలకి నాయకత్వం ఇచ్చి గంగిరెద్దులా తలలు వూపేం.”

ఆ సంభాషణ వెక్కసమనిపించి, సత్యానందం జోగన్న చేతిలోని కాగితం తీసుకుని చదవడంలో మునిగిపోయేడు. ఆఖరున మడిచి జేబులో పెడుతూ-“పార్టీశాఖ ముందుంచుతాను. నేనిది వుంచుకోవచ్చా?” అన్నాడు.

“మీకివ్వడానికే తెచ్చేను. దయవుంచండి. నన్ను పరాయివాడుగా చూడవద్దు. మీతో కలుపుకోండి. అదీ నా ప్రార్థన.”

సత్యానందం ఒక్క క్షణం ఆలోచించేడు. అసలు విషయం చెప్పకుండా అతనిని ఆహ్వానించేడు.

“రాత్రి ఒక ముఖ్యమైన విషయం గురించి సమావేశం జరుపుతున్నాం. దానికి నువ్వూ....”

“రావచ్చునా?”

“సానుభూతిపరుల్నే కాదు. కాంగ్రెసువారిని సహా పిలుస్తున్నాం. మార్క్సిస్టుపార్టీ ముఖ్యుడివి, నీకు....”

జోగన్న మొగం యింత పొడుగుచేసి బుస్సుమన్నాడు.

“ఆ పార్టీవాడినని మీరనడం అవమానంగా భావిస్తా!”

సత్యానందం అది సరికాదన్నాడు.

“మీకు కనువిప్పు కలిగించిన అంశం ఏమిటో నాకు తెలియదు. అయినా పార్టీలతో మనకున్న అనుబంధాలు అంత సులభంగా తెంచుకోగలమా?”

తెంచుకోగలమనడం అనిశ్చిత బుద్ధికి వుదాహరణ అవుతుందేమోననే భయంతో జోగన్న దిగులు మొహం పెట్టేడు.

“అదీ నిజమే అనుకోండి. ఇదివరకు ఇల్లా ఎన్నిమార్లు అనుకోలేదు. కాని చెయ్యగలిగేనా? అయితే ఈమారు పరిస్థితి వేరు. నేను నిశ్చయం చేసేసుకున్నా....”

“సరి, సరి. కాగితం చదివేను కాదూ. చూద్దాం. రాత్రి....”

“తప్పకుండా వస్తా.”

జోగన్న సెలవుదీసుకొని గుమ్మం దాకా వెళ్ళేడు. పొలం విషయం సత్యానందం తనకు తానై ఎత్తుతాడని తలుస్తే, అతడు మాట్లాడనేలేదు. ఇంక తానే ఎత్తాలి. చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చినట్టు అడిగేడు.

“ఒక సంగతి తెలిసింది.”

“ఏమిటది?”

“నేను కాపురం వుండి చేసుకుంటున్న బాడవ పొలం....”

“ఔను. కుమారస్వామిగారా పొలం మనమడికి వ్రాశారు. నిన్ననే సాయంకాలం టపాలో దస్తావేజు అందింది.”

“ఆయన నాకిచ్చేసిన పొలం అది....”

“నేనెప్పుడూ వినలేదే....”

“పెద్దవాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది”-అని జోగన్న తన వ్యథ వెలిబుచ్చేడు.

“ఈవేళ సభ దానిని గురించే. ఆ కుర్రవాడు తనకా భూమి అక్కర్లేదంటున్నాడు. పల్లెలవాళ్లు ఇళ్ళ స్థలాలకి కోరడం, తాశీల్దారు శాంక్షన్ చేయడం....”

“ఎప్పటి మాట అది. పదిహేనేళ్ళనాటి మాట....”

“ఔను, నువ్వూ ఎరుగుదువు. పల్లెలవాళ్ల ఇళ్ళ స్థలాలకి ఇచ్చేస్తానంటున్నాడు ఆ కుర్రవాడు....”

“ఆ,” అన్నాడు జోగన్న.

“ఔను. ఒక పార్టీ అనకుండా పల్లెల్లో ఇళ్ళు లేని కుటుంబాలవారికి ఇచ్చెయ్యాలని అనిపించింది అతనికి. ఒక పద్ధతి ప్రకారం స్థలాలు కేటాయించడం, ఎందరికి కావలసి వుంటుందో....”

“అది నాకిచ్చిన భూమి....” అన్నాడు జోగన్న నీరసంగా.

“ఆ విధంగా కాగితం వుంటే తీసుకురాండి. పేచీ పూచీ లేకుండా ముందే సర్దేసేద్దాం....”

జోగన్నకు ఏం తోచలేదు.

“మీటింగెక్కడ? ఎప్పుడు?”

“రాత్రి తొమ్మిదింటికి స్కూలు దగ్గరే. పల్లెలవాళ్లు ఇంకా అక్కడే వున్నారు కదా. వాళ్ళందర్నీ మరో చోటికి రమ్మని శ్రమ పెట్టటం ఎందుకని....”

జోగన్న ఈమారు సెలవు తీసుకోడం మరిచిపోయేడు.

పద్నాలుగో ప్రకరణం

“ఇంత పొద్దుపోయి వస్తున్నారు, ఎక్కడనుంచీ....”

“ఇసుక పూడిలో న్యూమోనియా కేసుంది కదూ, వెళ్ళేసరికి కలరా కేసొకటి తెచ్చేరు.”….అంటూ నడుస్తూనే రంగనాయకులు పరధ్యానంగా సమాధానం చెప్పేడు. అంతలో అడిగినదొక ఆడమనిషనీ, స్వరం ఎరిగినదేననీ అంతరాంతరాలలో అనిపించి చటుక్కున ఆగి వెనుతిరిగి చూసేడు. సుశీల. తనను ఇంత పొద్దుపోయి వస్తున్నానందేగాని, ఆమె కూడా అంతే కాదూ.

“నువ్వు, ఇంతదాకా హాస్పిటలులోనే వున్నావా? ఏం కొత్తరోగులు వచ్చేరా?”

తుపాను బాధితుల సహాయార్థం అన్ని పార్టీలవారూ కలిసి గ్రామంలో ఏర్పరచిన వైద్యశాలలో సుశీల రామకృష్ణ సహాయంతో పని చేస్తూంది, ఈ నాలుగు రోజులుగా. అది తన ప్రోత్సాహంతోనే ఏర్పడిందని తెలిసినా, కేవలం తమ పార్టీ పెత్తనం కింద లేదు. అధికార కమ్యూనిస్టుల స్థానిక నాయకుడు దాని ఏర్పాట్లు చూస్తున్నాడు. కనక తన తండ్రి అభ్యంతరం వుంది. ఇంకా తను ఆయనని తోసేసి బయటపడే మనస్థితిలో లేడు, తప్పదనిపిస్తున్నా. ఆయన బ్లడ్‌ప్రెషర్ ఆరోగ్యం దృష్ట్యా ఇంకా తొందరపడలేననుకొంటున్నాడు. కాని, రోజూ ఏదో వేళప్పుడు వెడుతున్నాడు. సాయం చేస్తున్నాడు. సలహాలిస్తున్నాడు. ఈ రాకపోకలలో సుశీలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాడు. ఇద్దరిమధ్యా వారంక్రితం వున్న దూరం తగ్గుతూంది. అదే అతని గొంతులో ప్రతిధ్వనించింది.

అతని కంఠంలోని ఆదుర్దా తనను గురించా, తుపాను తర్వాత గ్రామాలలో వ్యాపించగలవనుకొంటున్న అంటురోగాల్ని గురించా అనుకొంది సుశీల.

“స్కూలులో పేటలవాళ్ళకి ఇళ్ళస్థలాల కేటాయింపు గురించి నిశ్చయించడానికి నలుగురూ చేరేరు. మీరు వస్తారని చాలసేపు చూసేరు. రాలేదు. మీ పార్టీ వాళ్ళెవ్వరూ రాలేదు.”

తన ప్రశ్నకది సమాధానం కాదు! పైగా మరో ఆరోపణ.

“మా నాన్నగారు....”

“లేదు.”

“జాన్!”

“వచ్చేడేమిటి? అక్కడే వున్నాడు. కాని, అంతవరకూ అక్కడున్న మీ పార్టీవాళ్లు సమయానికి వెళ్ళిపోయేరు.”

రంగనాయకులు ఏదో చెప్పబోయి వూరుకున్నాడు.

“అక్కడినుంచే వచ్చేవు కాబోలు, ఏం నిర్ణయించేరు?”

“నువ్వే అక్కడికి వచ్చి వుంటే మా నిర్ణయాలు ఇంకా సమగ్రంగా వుండి వుండేవి. ఇప్పుడు అరకొరగా వదలవలసి వచ్చింది” అన్న మాటలు వినబడేవరకూ అతడు సుశీల వెనక మరికొందరున్న విషయమే గమనించలేదు.

“మీరూ వున్నారా? ఇంక మనకి రాజకీయాలలో వేలు పెట్టాలనే ఆసక్తి లేదు. డాక్టరు వృత్తిలోనే మనం చెయ్యగలదేదో చెయ్యడం....”

“అలాగని వూరుకోగలిగేవా? పేటలవాళ్ళని హైస్కూలులోకి తీసుకురావడం నీ ధర్మమే అని ఎందుకనుకొన్నావు?” అంది జానకి.

రంగనాయకులు నిరుత్సాహంగా నిట్టూర్పు విడిచేడు.

“మనుష్యుడు అలవాట్లకి దాసుడు. అదే అతని బలహీనత....” అన్నాడు రంగనాయకులు.

“కాని, నీ విషయంలో ఆ బలహానత జనానికి ప్రయోజనకరం. లేకపోతే ఏమవుతుందో ఆలోచించు. నీ వృత్తిధర్మం తప్పకుండా నువ్వు చేస్తావు. కాని ఈవేళ మన రోగాలలో మూడు వంతులు దారిద్ర్య మూలకాలు. మన దేశ రాజకీయాలకీ, దేశ దారిద్ర్యానికీ వున్న సంబంధం ఎరిగిన వాడివి.”

రంగనాయకులు చేయి విదిలించేడు.

“ఎరుగుదును. ఎరుగుదును. కాని....వద్దులేండి. వదిలెయ్యండి. మనకవి జీర్ణం కాలేదు.”

నాలుగైదు రోజులుగా అతని కుటుంబ వ్యవహారాలు పలు ముఖాల వింటూ వస్తున్న జానకి అతని నిస్పృహకి కారణం గ్రహించడం కష్టం కాలేదు. అతడి మార్క్సిస్టు పార్టీ పంధా తనకి తాను దిగ్బంధం చేసేసుకొంటూంది. ఆ దిగ్బంధంలో కాస్త ఆలోచించగల వాళ్ళకి ఊపిరి సలపడం లేదు. ఇదోరకమైన ఆత్మహత్య.

“ఏమోనయ్యా! మీరంతా ఇలా అవుతున్నారు. దానితో గోరంత పనులు కొండంతయి కూర్చుంటాయి. సరే ఇప్పుడీ వీథిలో చర్చలేమిటి గాని, భోజనం చేసేవా?” అంటూ ఆమె సుశీల భుజం తట్టింది.

“భోజనమా?” అని రంగనాయకులు జ్ఞాపకం చేసుకొనేందుకు ప్రయత్నించేడు.

“లేదనుకుంటా. లేదు. కాఫీ పదిమాట్లు పడింది. ఇంక భోజనం ఏమిటి?” అన్నాడు.

జానకి నవ్వింది. “గట్టివాడివే. భోజనం కూడా మరచిపోయే స్థితికి వచ్చేవన్న మాట. వ్యవహారం చాలా బాగుంది....సుశీలా! ముందు ఇంటికి తీసుకెళ్ళు. ఆఖరుకి ఇన్ని అటుకులేనా మజ్జిగలో వేసి ఇయ్యి....” అని ఏకటాకీన బండి తోలింది.

సుశీల సంకోచిస్తూనే ఆహ్వానించింది. వారంనాడు తాను విడాకులు తీసుకోమని అతనిని ప్రోత్సహించిన విషయాన్నీ, దానికి వెనకనున్న వైమనస్యాన్నీ ఆమె మరిచిపోలేకుండా వుంది. ఈ రెండు మూడు రోజుల్లో జానకి ఆ విడాకుల ఆలోచన యెంత పొరపాటో చెప్పి వొప్పించినా, ఆ వొప్పుదలను కార్యరూపంలో పెట్టడం సాధ్యంకాలేదు. కాని, ఇప్పుడు జానకే చొరవ తీసుకోడంతో తప్పుకోలేక పోయింది.

“రాండి, ఫలహారమన్నా చేద్దురుగాని. తరవాత మాట్లాడుకోవచ్చు. మీరు కూడా రాండి” అని పనిలో పనిగా జానకిని కూడా ఆహ్వానించింది.

పదేళ్ళ వైమనస్యాలూ, మూడు నాలుగేళ్ళ ఎడబాటూ, ఘర్షణలతో నిండిపోయిన మనస్సులో ఆప్యాయత, చనువు, అధికారం చోటు చేసుకోలేకుండా వున్నాయి.

వారి మనస్థితిని అర్థం చేసుకొంది జానకి.

“నడవండి. నడివీధిలో ఈ కబుర్లు బాగులేదు.”

రంగనాయకులు వారం క్రితపు అనుభవంతో జానకి ప్రోత్సాహాన్ని వుపయోగించుకోలేకపోయేడు. తుఫాను బాధితుల సాయం కోసం సుశీలను వచ్చి తన క్లినిక్‌లో పనిచెయ్యమన్నాడు గాని, ఆమె నిరాకరణను మరిచిపోలేదు. దేశం కోసం వస్తానంది. వచ్చింది. ఆమె తనతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటుందనుకోలేదు. కాని ఒప్పుకొంది. వచ్చింది. ఆ రాక తన కోసం కాదని మొదటనే అర్థం చేసుకొన్నాక, అత్యవసరమైనంత వరకే ఆమెతో ప్రసక్తి పెట్టుకుంటున్నాడు. ఇవన్నీ జానకికి తెలియకపోవచ్చు. ఆమె యెదట ఏమీ అనలేక సుశీల పిలిచింది. ఆ స్థితిలో తాను ఆమెను చిక్కుల్లో పెట్టకూడదనుకున్నాడు.

“ఇంకా పోయి స్నానం చెయ్యాలి. బట్టలు మార్చుకోవాలి. ఇంటికి పోయి రేపు కనిపిస్తా. సెలవు.”

సుశీల ఈమారు ధైర్యం చేసింది.

“మీ బట్టలు కొన్ని ఇక్కడే వున్నాయి; హీటర్‌లో నీళ్లు కాగుతున్నాయి. ఇప్పుడెళ్ళి చన్నీళ్ళు స్నానం చేస్తారా? మంచి మాటే.”

రంగనాయకులు కింకా ధైర్యం చిక్కలేదు. సందేహించేడు.

“ఇంత రాత్రివేళ అందరికీ అనవసర శ్రమ కదూ.”

సుశీల అతని మనసు గ్రహించింది!

“శ్రమాలేదు. ఏమీలేదు. నడవండి.”

ఆ కంఠంలో అధికారదర్పానికి రంగనాయకులు తృప్తిపడ్డాడు. “థేంక్స్....” అని ఆమె ప్రక్కన అడుగు వేసేడు.

“ఎందుకేమిటి?”

“ఇంత రాత్రివేళ వెళ్ళి ఇంటిల్లిపాదికీ నిద్రాభంగం చెయ్యాలి.”

అతని నిస్సహాయతను అర్థం చేసుకొన్న సుశీలకు కంఠం నిండి వచ్చింది.

“నేనిక్కడున్నానుగా” అంటూ సుశీల తండ్రి ఇంటి గుమ్మం ఎక్కింది. గుమ్మం క్రీనీడలో రంగనాయకులు ఆమెను కౌగిలించుకొన్నాడు. సుశీల ప్రతిస్పందన అతనిని ప్రోత్సహించింది. ముఖాన్ని ముద్దులతో నింపుతూ ఆ ఉద్వేగంతో కళ్ళనీళ్ళు పెట్టుకొన్నాడు.

పదిహేనో ప్రకరణం

మీటింగులో జరిగిన విషయాలు వివరిచడానికి సుశీల నాలుగైదు మార్లు ప్రయత్నించింది. కాని రంగనాయకులు వినిపించుకోలేదు.

“వదిలెయ్యి. ఈ గొడవలే మన జీవితాన్ని పాడుచేశాయి. మరి బుద్ధి వచ్చింది. ఎవరి కష్టసుఖాలు వారు చూసుకోగలరు.”

“చూసుకోలేకపోతున్నారని అర్థం అయింది కదా! ఇన్నేళ్ళు ఎంత బాధపడ్డా ఇళ్ళస్థలాలు చూపు మేరకి కూడా రాలేదు. ఊరి పెత్తందార్లు అడ్డం వారి దయాధర్మాలతో నడిచే మంత్రులూ, ఆఫీసర్లూ అడ్డం. అసలీనాడున్న వ్యవస్థలో బీదవాడి ఉనికే అసంభవం అయింది.”

“ఇప్పుడేమన్నా మారిపోయిందా?” అన్నాడు రంగనాయకులు.

అతని ప్రశ్న అర్థం అయింది.

ఈ దారి ఎక్కడికి? (రధచక్రాలు - ఉత్తరగాధ) · 第 14 / 15 段