“ఎందుకని అడగరేం?”
సత్యానందం నవ్వేడు.
“చెప్పు.”
“హరిజన పల్లెల వాళ్ళని తీసుకొచ్చి అందులో ప్రవేశపెట్టేను. ఆఖరు జట్టు కూడా వచ్చేరు. నేనిల్లా వస్తున్నాను.”
సత్యానందం కళ్ళ నీళ్లు వచ్చేయి.
“నేను చేసివుండవలసిన పని నువ్వు చేసేవు. నిన్ను క్షమించడమెందుకయ్యా!”
ఓ రాత్రివేళ జాన్ని మోసుకొని నలుగురు కుర్రవాళ్ళు క్లినిక్కు వచ్చి లేపేరు. అతని పాక కూలిపోయింది. అదివరకే ఆకులెగిరిపోయాయట. పెద్ద దెబ్బలు తగల లేదు. కాని పాత గాయాలు....మనిషి పడిపోయేడు.
అతనిని సర్దేసరికి మరో ఇద్దరు పల్లెనుంచి వచ్చేరు. వాళ్ళంతా కొంపలుపోయి నెమ్మదిగా వూళ్ళోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ తలోదారి అయ్యేరు. వాళ్ళకేదో చోటు చూపాలి.
“నాకేం తోచలేదు. వెంటనే హైస్కూలు బిల్డింగులు గుర్తు వచ్చాయి. వాళ్ళని తీసుకెళ్ళేను. మీకెవ్వరికీ చెప్పడానికి వ్యవధి లేదు. ఏదో చెయ్యాలి....”
సత్యానందం అతనిని మెచ్చుకున్నాడు.
“చాల మంచి పని చేసేవు. చాలా మంచిపని చేసేవు.”
రంగనాయకులు సంకోచిస్తూ మళ్ళీ మొదలెట్టేడు.
“మీ పల్లెను మీ నుంచి విదదియ్యాలనే ఆలోచనతో కాదు. వాళ్లు ఏమైపోతున్నారో అనిపించి బాడవలో మాలపల్లె వాళ్ళని కూడా తీసుకు వచ్చేను....”
సత్యానందం హృదయం నిండి వచ్చింది. కంఠం గద్గదికం అయ్యింది.
“ప్రజలకు సాయపడేందుకు పార్టీలు కాని వారిని మీవాళ్ళు, మావాళ్ళు అని పంచుకొనేందుకు కాదు. నువ్వు నాకంటె చిన్నవాడివి. నిన్ను మెచ్చుకోవడం తప్ప నీమీద నా మనస్సులో కలిగిన భావాన్ని మరో విధంగా చెప్పలేను. కాని చాలా మంచిపని చేసేవు.”
రంగనాయకులు సెలవు తీసుకొని లేచాడు. నాలుగు అడుగులు వేసి, మళ్ళీ వెనక్కి వచ్చేడు.
“డాక్టర్! నాకు ఒక ఆలోచన కలిగింది” అని సత్యానందం వెనుదిరుగుతున్న రంగనాయకుల్ని చూసి అన్నాడు.
“నాకో అభిప్రాయం కలిగింది. చెప్తాను. ముందు మీరేదో చెప్పబోయేరు. కానీండి”-అన్నాడు, రంగనాయకులు.
“ఈ తుఫాను కలిగించిన నష్టం ఎంతో ఇంకా తెలియదు. కాని వీధుల్లో చెట్లస్థితి చూస్తే చాల తీవ్రంగా వున్నట్లే అనుకొంటున్నా. వరదలూ, తుఫానులూ వెనక వచ్చే అంటురోగాల నష్టం తక్కువేం వుండదు. తుఫానుని మనం ఆపలేకపోవచ్చు. కాని, అంటురోగాల విషయంలో ఏ కొంచెమన్నా చెయ్యగలుగుతాం.”
తన మనస్సులోని ఆలోచనలను చదువుతున్నట్లే వినిపించి రంగనాయకులు తెల్లబోయాడు.
“నేనూ సరిగ్గా ఆ విషయమే చెప్పాలనుకొంటున్నా. మీరే ఎత్తుకున్నారు” అన్నాడు.
“పంచాయతీ బోర్డు నుంచి మందులకి కొంత సొమ్ము ఖర్చుచేద్దాం. కనీసం వూరువరకైనా వైద్యసహాయం నాలుగు మూలలా అందేటందుకు ఏర్పాటు చెయ్యగలవా?” అన్నాడు సత్యానందం.
రంగనాయకులు అంతపని తన ఒక్కనివల్లా జరగదన్నాడు. కాని అతడు చెప్పిన వుపాయం నిరాకరించతగినదిగా కనిపించలేదు.
“మీ రామకృష్ణ వూళ్ళో వున్నాడు.”
అయితే కొడుకు ఆ పనికి ఒప్పుకుంటాడనే విశ్వాసం సత్యానందానికి లేదు. అతడూ ఎదటనే వున్నాడు. కనక తన అవిశ్వాసాన్ని కనబరచలేదు. అందుచేత ఉమ్మడిగా సలహా యిచ్చేడు.
“ఆ బాధ్యత నువ్వు తీసుకో. నీకు కావలసిన సహాయం అడుగు. ఒక్క రామకృష్ణేనా? సుశీల వుంది. క్వాలిఫైడ్ డాక్టర్....”
రామకృష్ణ తన అనంగీకారం అక్కడే తెలిపేడు. అసలీ వైద్యవిద్యే వట్టి బూటకం అన్నాడు.
“మాకు నేర్పేది మందులు అమ్ముకొనేవాళ్ళకి జేబులునింపే చదువు. మన జనసామాన్యం వాటిని కొనలేదు. వారికి అందుబాటులో వుండే కూరాకు వైద్యం మాకు చేతకాదు. ఇదంతా వట్టి హంబగ్. నేను రాను.”
దానిమీద చర్చ ప్రారంభమయి అసలు విషయం మూలబడుతుందని జానకి చటుక్కున ఆడ్డుబడింది.
“రామకృష్ణ వాదనలో కొంత కొంత నిజం లేకపోలేదు. అయితే ఎంత నిజం, ఏది నిజం అనేది చర్చించడానికి సమయం కాదు. ఎవరికి తోచినపని వారు చేద్దాం.”
రంగనాయకులు ‘ఔన’న్నాడు.
“మీరెవ్వరైనా సుశీలతో మాట్లాడగలుగుతారా! ఈలోపున నేనింటికిపోయి బట్టలు మార్చుకొని వస్తా.”
ఆ దంపతుల మధ్యనున్న వైమనస్యాల నెరిగినవారెవ్వరూ రంగనాయకుల ప్రతిపాదనను అంగీకరించలేకపోయేరు.
వారి తటపటాయింపును గమనించినట్లు రంగనాయకులే మళ్ళీ అన్నాడు.
“ఇంటికెళ్ళేటప్పుడు ఆవిడని నేనే అడుగుతాను. మా కంపౌండరుని, మహిళా సంఘం నర్సునీ సాయం తీసుకొందాం. సత్యానందంగారూ! ఇది నా ఒక్కడివల్లా కాగలదికాదు. నలుగురం చేద్దాం. మీరంతా సరేనంటే జరుగుతుంది.”
మారు సమాధానం కోసం కూడా నిలబడకుండా రంగనాయకులు నిష్క్రమించేడు. జానకి సత్యానందానికి సలహా ఇచ్చింది.
“నువ్వు సుశీలతో మాట్లాడు. అతని ఆలోచన మంచిదే.”
ఆరో ప్రకరణం
బట్టలు మార్చుకొని రమ్మనీ, తాను ఈలోపుగా స్కూలుకు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూస్తాననీ రంగనాయకులును పంపేడుగాని, సత్యానందం వెంటనే కదలడానికి వీలులేకపోయింది. హైస్కూలు హెడ్మాస్టరునూ, మరో ఇద్దరు టీచర్లనూ వెంటబెట్టుకొని కామేశ్వరరావు వచ్చి పడ్డాడు. వస్తూనే సుందరరావూ కొడుకూ తుపాను పేరుతో తమరు కష్టపడకుండా మాలపల్లెలను కూడగట్టుకొనేందుకు పన్నిన కుట్రను వివరించడం ప్రారంభించేడు.
“అత్తగారి సొమ్ము అల్లుడు ధారపోసినట్లు హైస్కూలులోకి తెచ్చి తమ పల్లెవాళ్ళని మకాం పెట్టించేడు. మనకి చేతగాకనే వూరుకొన్నామా? హెడ్మాస్టరుది, స్కూలులో పూచికపుల్ల కదలకుండా చూసుకోవలసిన బాధ్యత. స్కూలు కమిటీ సెక్రటరీ విశ్వనాధం వున్నారు. పంచాయతీ అధ్యక్షులు మీరున్నారు. ఎవ్వరితోనూ చెప్పకుండా తన బాబు ముల్లె అయినట్లు అందులోకి తెచ్చిపెట్టేడు. ఇదేమిటంటే చూసేరా అని యాగీ చేసి మనల్నందర్నీ అప్రతిష్ఠల పాల్చేయొచ్చు. వూరుకొంటే చూసేరా మా పార్టీ పూనుకోలేకపోతే....”
కామేశ్వరరావు వాగ్థోరణి చికాకు కలిగిస్తున్నా సత్యానందం ఏమీ అనలేకపోతున్నాడు. అతడు తన పార్టీ సభ్యుడు. మిగిలిన ముగ్గురూ సభ్యులు కాదు. అతనిని వారి ముందు ఏమనడానికీ వీలు లేదు.
“మనం ముందే పూనుకొని వుంటే సుందరరావుగారికి అవకాశం వుండేది కాదు. చెయ్యలేకపోయేం. ప్చ్!” అన్నాడు, అతి సామాన్యంగా.
“మనం బాధ్యతలు గలవాళ్ళం. సుందరరావులా ఎల్లా చెయ్యగలం?”
కామేశ్వరరావు అవమానాన్ని పనిమాలా కోరుతున్నాడనిపించింది. కాని సత్యానందం చాల జాగ్రత్తగానే తూచినట్టు మాట్లాడుతున్నాడు.
“బోర్డు అధ్యక్షుడుగా మరి నే చెయ్యవలసిన బాధ్యతలు? వదిలెయ్యి. కనీసం మానవులయెడ మానవులు చూపవలసిన సద్భావం కూడా చూపలేకపోయేను. అదీ నా విచారం....”
ఇంక నువ్వు కట్టిపెట్టిమన్నట్లు అతని వేపు వీపు తిప్పి హెడ్మాస్టరును అడిగేడు.
“ఇంత గాలీ-వానలో వచ్చేరు. ఇదేనా విషయం?”
“చిత్తం.”
“మొన్న మీ యింటి బల్బు పగలగొట్టేరు. మీరూరుకొన్నారు. ఈవేళ హైస్కూలు గేట్లు విరగగొట్టేరు....” అని కామేశ్వరరావు మళ్ళీ సుందరరావు అపరాధ సహస్రం గుణించ ప్రారంభించేడు.
అతని మాటలు పట్టించుకోకుండా సత్యానందం హెడ్మాస్టరుతోనే మాట్లాడేడు.
“మేస్టారూ! ఏం భయం అక్కర్లేదు. అనుమతి కోసం అధికార్లని అడగడం, చెయ్యడం సాధ్యమయ్యే పనికాదు. ఆ సమయంలో చెయ్యగలదేం లేదు. సుందరరావుగారు మనుష్యమాత్రుడుగా చెయ్యవలసిన పనే చేశారు....”
పార్టీనాయకుల మధ్యనున్న కక్షలూ, అహంకారాలూ ఎరిగి, గాలి వాటం చూసుకుని, చుక్కానిపట్టే తెలివితేటలుగల హెడ్మాస్టరు సత్యానందం మాటలను తప్పుగా అర్థం చేసుకొన్నాడు. కామేశ్వరరావు వట్టి కబుర్లరాయడని ఎరుగును. ఆ వారంలో తమ పార్టీ జరుపుతున్న కార్యక్రమాలలో కలియకుండా ఏదో పని వుందని విజయవాడ వెళ్ళి నిన్ననే వచ్చేడని తెలుసు. అతనియెడ కోపంతో సత్యానందం సుందరరావు పార్టీమీద గల ద్వేషాన్ని మరిచాడని వుహ సాగించేడు. అందుచేత తన ధోరణిని సవరించుకొన్నాడు.
“అది సత్యమే కానీండి. కాని గేటు విరగ్గొట్టడం తాళాలు పగలగొట్టడం....చాలా గొడవ తెస్తుందండి. పైగా లైబ్రరీ, రికార్డులు, ఫర్నిచరు, సైన్సు పరికరాలు ఏవి పాడుచేసినా కొంపలారిపోతాయి....”
“ఏం ఫర్వాలేదు మేస్టారూ! మనుష్యుల ప్రాణాలకన్నా ఎక్కువేమిటి, ఇవన్నీ. ఒకవేళ ఏదన్నా జరిగినా, పొరపాటున జరుగుతుంది గాని బుద్ధిపూర్వకంగా చెయ్యరు. అటువంటివి వస్తే సర్దుకోవాలి. సర్దుకొందాం. లేవండి. వోమారు స్కూలుకేసి వెళ్ళివద్దాం. రాగలరా?”
“చిత్తం.”
“మీరు?”
మిగిలిన టీచర్లు ఇతర పనులు కారణం చెప్పారు.
“పనులు చూసుకోండి. కామేశ్వరరావూ మన వాళ్ళు నలుగురినీ వోమారు తీసుకురాగలవా? వాళ్ళకి భోజనాల యేర్పాటు యేదో చూడాలి కదా.”
“మా దూడల పాక పడిపోయింది.”
“దూడలకి దెబ్బలు తగలలేదు కద.”
“లేదు. ఆవుని యింటి వసారాలోకి తెచ్చేం కనక బతికిపోయింది.”
“పోనీలే” అని సంతృప్తి కనబరచేడు సత్యానందం.
“పాకలో అటక నిండా కమ్మా, డొక్కా తడిసిపోయింది. దానినేదో చూడకపోతే రేపు పొయ్యిలో పిల్లి లేవదు.”
“అయ్యయ్యొ పాపం. డొక్కపేడు తడిస్తే ఎల్లాగ? మాలపల్లెలకి ఇవన్నీ అలవాటే. కనక వెళ్ళిరా....”
సత్యానందం అవహేళనకి కామేశ్వరరావుకి కోపం వచ్చింది. కాని, ఏమీ అనలేదు.
“రామకృష్ణా! నువ్వు పోయి వెంకటేశ్వరరావు, మందేశ్వరరావుల్ని పిలుచుకురా. స్కూలు దగ్గరికి రమ్మను. ....రాండి మేస్టారూ! మీకేం పని లేకపోతేనే. ప్రజాసేవ నిర్బంధం కాదు. పైగా సుందరరావుగారికి తగిలినట్లు చీవాట్లు కూడా తగలొచ్చు!”
ఏడో ప్రకరణం
కొంతదూరం వెళ్ళేక సత్యానందానికి జ్ఞాపకం వచ్చింది.
“మీరు స్కూలుకి వెళ్ళండి. నేను విశ్వనాధంగారితో మాట్లాడి వీలైతే తీసుకొస్తా. సాధ్యమైనన్ని గదులు చూపించండి. కొంచెం పెద్ద వాళ్ళని చూసి, గంద్రగోళం చెయ్యకుండా చూడమనండి. అంతలో వాళ్ళకేదో ఏర్పాడు చూస్తాం.”
హెడ్మాస్టరు “చిత్తం” అని ముందు కడుగువేసేడు.
స్కూలు దగ్గరకు వెళ్ళేసరికి చూసిన దృశ్యానికి హెడ్మాస్టరు తల తిరిగిపోయింది.
వర్షంలోకి దింపడం ఇష్టంలేక ఇద్దరు అమ్మలు తమ పిల్లల్ని స్కూలు అరుగు కొసన దొడ్డికి కూర్చోబెడుతున్నారు. చూడగానే హెడ్మాస్టరు కోప్పడ్డాడు.
“వుండవలసిన చోటు ఇల్లా గలీజు చేసుకొంటే అపరిశుభ్రం మాట అల్లా వుంచండి, ఏ అంటురోగాలన్నా వచ్చేయంటే....”
హెడ్మాస్టారు గొంతు వినగానే ఎక్కడెక్కడున్నవాళ్ళూ ఆయన ఎదుటికి వచ్చేరు. దండాలు పెట్టేరు. రాత్రి తాము పడ్డ ఇబ్బందులు చెప్పుకొన్నారు. డాక్టరు రంగనాయకులు చేసిన సాయం పొగిడేరు.
హెడ్మాస్టారు తాను రాగానే కనిపించిన అసహ్యకర దృశ్యాన్ని మరవలేకున్నాడు. అంతమందిని తడిగుడ్డలు, బాడికాళ్లు, తడిసి చీకిరి బాకిరిగా వున్న తలలుతో ఒక్క చోట చూసేసరికి మరింత అసహ్యం కలిగింది.
“అత్తగారి ఆస్తిని అల్లుడు ధారపోశాడన్నట్లు రంగనాయకులుగారిదేం పోయింది? విద్యాలయం అంటే ఎంత పరిశుభ్రంగా వుండాలి? అది సరస్వతీదేవి ఆలయం అన్నమాట. దానిని ఎంత పవిత్రంగా వుంచాలి?”
సరస్వతీదేవి మందిరాన్ని అపవిత్రం చేస్తూ తాను వచ్చేసరికి జరుగుతున్న అకార్యాన్ని చెప్పేడు.
“ఇల్లాంటి అభాగ్యులు కనకనే పొట్ట చీరి డోలు కట్టినా ‘ఢం’ అని పలకడం లేదు.”
అక్కడ చేరిన వాళ్ళంతా వచ్చింది మొదలు ఆ క్షణం వరకు ఏదో మూల ఆ విధంగా దేహబాధలు తీర్చుకొన్నవాళ్లే. కాని, ఒక్కరూ ఒప్పుకోలేదు. తాము తప్ప మిగతావారినందర్నీ కలిపి తిట్టేరు. తమకేం తెలియదన్నారు.
“ఎదవనాయాళ్ళండి, బుద్దిలేని యెదవలండి.”
హెడ్మాస్టరు వాళ్ల బలహీనత నెరుగును. దానినక్కడ వదిలేసి వుండాలి. అతి సహజములైన దేహబాధలకు మార్గం చూపాలి. వాళ్ళ స్థితి గమనించాలి. సమయం చూడాలి. సానుభూతితో వాళ్ళకి చెప్పాలి. కాని అవేమీ ఆయనకు పట్టలేదు. తన రాజ్యంలోకి అడవి మృగాల్లా ఈ అలగాజనం వచ్చి సర్వం ధ్వంసం చేసేస్తున్నారనేదొక్కటే బాధ. కాని, తరిమెయ్యలేడు. గ్రామంలోని రెండు బలమైన పార్టీలు వాళ్లయెడ సానుభూతి చూపుతున్నాయి. వారికి సాయం చేయడానికి పూనుకొన్నాయి. తానేం చెయ్యగలడు? ప్రతి చిన్నదానికి నసపెట్టగలడు. వాళ్ళని సాధ్యమైనంత త్వరగా పోయేటట్లు అరికాళ్ల క్రింద మంటలు పెట్టగలడు.
అదే ప్రారంభించేడు.
“ఇదిగో చూడండి. పిల్లలు కూర్చునే బెంచీలు యిల్లాగేనా బాడి చేయడం?”
అయిదు నిముషాలు ఆ వుపన్యాసం సాగింది. మళ్ళీ మరో విషయం.
“బీరువాలూ, పుస్తకాలూ, కాగితాలూ ఎవ్వరూ ముట్టుకోకుండా చూడండి. అయ్యో! రికార్డు గది తలుపు తాళం కూడా విరిచేసేరే. గుమాస్తా ఏడుస్తాడు. అందులోకెవ్వరూ వెళ్ళవద్దు....”
అందరికీ విసువు పుట్టింది. కోపం వస్తూంది. తమ స్థితి చూడముచ్చటగా వుందని వాళ్లూ అనుకోడం లేదు. కాని ఏం చేస్తారు? మారుగుడ్డ లేదు, మార్చుకొనేందుకు. హోరున వర్షం కురుస్తున్నా వొళ్లు శుభ్రం చేసుకొందుకు ఇన్ని నీళ్లు పట్టడం సాధ్యం కాదు. ఏమీలేదు. కడుపులోకి తిండి లేకపోయినా దేహ బాధలు తప్పవు. వానిని తీర్చుకొనేందుకు ఏర్పాట్లు లేవు. తమ గుడిసెల్లో అలవాటుపడ్డదే యిక్కడా చేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే తామూ అలా చెయ్యరు. తమకూ తెలుసు. కాని,....
కాస్త సానుభూతి చూపడం లేదు. ఎల్లా బ్రతికొచ్చేరని లేదు. గంజి తాగేరా? పిల్లగాళ్ళు అల్లా ఏడుస్తున్నారు. వాళ్ళకి బువ్వ మాటేమిటి?-ఒక్కమాటా, పలుకూ లేదు. వచ్చింది మొదలు ఒకటే రంధి.
ఈమారు హెడ్మాస్టరు పంధా మార్చేడు. గోడనున్న గాంధిగారి పటం చూసి ఆయన హరిజనులకు చేసిన సేవ ఎల్లా బూడిదలో పోసిన పన్నీరయిందో చెప్తూ దుఃఖపడ్డాడు. ఆ దుఃఖభారంతో సుమతీశతక పద్యం జ్ఞాపకం చేసుకొన్నాడు.
“కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి....”
“నోర్ముయ్యి” అన్న ఆదేశం వినబడి హెడ్మాస్టరు “ఆ....” అని తల ఎత్తేడు.
ఎదుట గుమ్మంలో రామకృష్ణ కళ్ళ నిప్పులు కురిపిస్తూ ఒక్కమారు విదిలించేడు.
“మీలో ఒక్కడు నోరు మూయించలేకపోయేడా? ఇందాకటి నుంచి చూస్తున్నా. ఒకటే వోండ్రపెట్టడం. మీరూరుకుంటే ఇల్లాగే మీకు వెర్రెత్తించెయ్యగలడు. తన్నండి నాలుగు. చూస్తారేం.”
రామకృష్ణ ముందుకు రావడం చూసి హెడ్మాస్టరు హడలిపోయేడు. పారిపోవడానికి ప్రయత్నిస్తూంటే లోపలికి గెంటేసేడు. అతని భయం, బలహీనత స్పష్టమైన కొద్దీ రామకృష్ణకి కసి పెరుగుతూంది.
“ఇది విద్యాపీఠమా? సరస్వతీ మందిరమా? ఈ రికార్డులు వాళ్ళని రక్షిస్తవా? ఈ గాంధీ వాళ్ళని ఉద్ధరించేడా....”
ఒక్కొక్క వస్తువును హెడ్మాస్టరు కాళ్ళ ముందు విసిరికొట్టేడు. నాయకుల పట్టాలు నేలబెట్టి కొట్టేడు. రికార్డులన్నీ బీరువాలోంచి లాగి బయట పారేసేడు.
ఇంత గంద్రగోళం జరుగుతున్నా, హరిజన పేటలవాళ్ళు ఒక్కళ్లూ అతనికి సాయం రాలేదు. పరమేశు గుమ్మంలో నిలబడి వున్నాడు. అతని పక్కనే ఒక కుర్చీ వేయించుకొని జాన్ కూర్చున్నాడు. పేటల్లో పడుచుకారు అంతా హెడ్మాస్టరును చూసి నవ్వుతున్నారు. రామకృష్ణ ఒక్కొక్క సంచెడు రాకార్డులు విసిరిపారేసినప్పుడూ వో పటం నేలబెట్టి కొట్టినప్పుడూ విజయధ్వనులు చేస్తున్నారు.
కొంతసేపటికిగాని రామకృష్ణకు ఆ భీభత్సకాండను నడపడంలో తనకెవ్వరూ తోడురాలేదని గ్రహణకు రాలేదు. గుమ్మంలో రివిజనిస్టొకడూ నయా రివిజనిస్టొకడూ నిలబడీ, చదికిలబడీ వున్నారు. వాళ్ళు ప్రజాప్రవాహానికి అడ్డుకట్టు వేస్తున్నారనిపించింది.
“లేవండి. దారికడ్డం తొలగండి.”
పరమేశు కదలలేదు.
“తొందరపడకండి. ఆయనను తిట్టి లాభం ఏమిటి? వీళ్ళను ఆడిస్తున్నవాళ్ళూ, ఆసరాగా వున్నవాళ్ళూ వేరు. రాండి.”
జాన్ అతనిని సమర్థించేడు.
“ఇది ఒక్కళ్ళవలన అయ్యే పని కాదు బాబూ!”
రామకృష్ణ తెల్లబోయేడు.
జనం ఒక్కళ్లు కదలడం లేదు. తిడుతూంటే కదలలేదు. వాళ్ళకి తోడు నిలిస్తే కదలలేదు. వాళ్ళతో వున్న రాజకీయవాదులు తన పక్క చేరడానికి బదులు తన్ను తొందర పడవద్దంటున్నారు. దేశమా ఏమయిపోతున్నావనిపించింది.
చేతిలోని పుస్తకాలు హెడ్మాస్టరు మొగాన కొట్టేడు.
“తిట్టు. నీచేత తిట్లు తినడానికే వీళ్లు పుట్టేరు. ఈ పందులకి బురదలో దొర్లాలని తప్ప మరో కోరిక లేదు. దొర్లనీ. దొర్లినందుకు తిట్టు” అంటూ ఆవేశం పట్టలేక భళ్ళున ఏడ్చేడు.
ఎనిమిదో ప్రకరణం
సత్యానందం వాళ్ళకోసం అన్నాలు పట్టించుకొస్తూ ఆ కేకలూ, ఏడ్పూ విన్నాడు. ఆ కేకలు ఎవరి మీద? ఆ ఏడ్పేమిటి? స్వరం అనుమానం కలిగించినా అది కొడుకుదే అనుకోలేకపోయేడు.
తాతన్న ఎదురొచ్చేడు. అతని ముఖంలో ఆత్రం కనబడుతూంది. ఎవరికో ముఖం చాటు చేస్తున్నట్లు కనబడుతున్నాడు.
“ఏమిటది వెంకట్రావూ?”
తాతన్న కధ అంతా చెప్పేడు.
“అబ్బాయిగారు తొందరపడుతున్నారు. ఇటువంటి పనుల వలన విప్లవం రాదని మీరేనా చెప్పండి.”
అంత ఆదుర్దాలోనూ సత్యానందానికి నవ్వొచ్చింది!
“విప్లవం ఆలోచన వచ్చేవరకూ మీరంతా ఎందుకూరుకున్నారు? నువ్వున్నావు, పరమేశు, జాన్ ఇందరున్నారు. హెడ్మాస్టరును మొదటే మందలించలేకపోయారా?” అన్నాడు సత్యానందం.
“అసలు తప్పు మనవాళ్ళదండి.”
“అల్లాంటి తప్పు చేస్తుంటే మీరెందుకు వూరుకున్నారు?”
“మన మాట ఎవరు వింటారండి. పోవోయ్! మహా చెప్పొచ్చేవు అనేస్తే....”
సత్యానందం వెరగుపడ్డాడు, ఆ మాటకి. తమ మాట జనం వినరేమోనన్న అనుమానం కమ్యూనిస్టులకి కలిగి వుండని రోజులు, ఆనాటి వారి ఆత్మవిశ్వాసం గుర్తువచ్చి, నిట్టూర్పు విడిచేడు.
“ఇదిగో వెంకట్రావు! హెడ్మాస్టరు చదువుకొన్నవాడు. ఇంగితం తెలిసి వుండాలి. తెలియలేదు. గుడిసెల్లో మురికికూపాల్లో బతికిన జనం వీళ్లు. వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు తెలియవు. పైగా వాళ్ళున్న పరిస్థితి ఏమిటి? పోనీ, తెలిసినవాళ్లు మీరంతా వున్నారు. మీరు ఎందుకు చెప్పలేదు? అలాగని హెడ్మాస్టారి కథ ముదురుతున్నప్పుడు ఆయనతో అయ్యా! మీరు చేస్తున్న పని మంచిది కాదని....”
వెంకట్రావు “బాబోయ్” అన్నాడు.
“ఆయన అలా వున్నారనా! పైకి మెత్తగా వుంటూ ఎంత పనేనా చెయ్యగలడు. స్కాలర్షిప్ రావడం ఆలస్యం చేస్తే చాలదా? ఆ కక్ష పెట్టుకొని కుర్రగాళ్ళ పరీక్ష తప్పించేస్తే?....”
సత్యానందం తెల్లబోయేడు. అంతలో అతని వంక జాలిగా చూసేడు. మళ్ళీ తామంతా కొంచెం ఇంచుమించు అదే ధోరణిలో వ్యవహరిస్తున్నామని గుర్తు వచ్చింది.
“నీదేముందిలే. మన బతుకే ఒరగేసుకుపోవడంగా తయారయింది. కనీసం కుర్రవాళ్లు ఆరోగ్యంగా వున్నారు. వాళ్ళకి హృదయం వుందనిపించుకున్నారు. ఆ ఆవేశాలు మన అసమర్ధతకి రియాక్షన్ ఏమో!”
తొమ్మిదో ప్రకరణం
రిజిష్టర్డు కవరులో వచ్చిన దస్తావేజును చూసి సత్యానందం ఆశ్చర్యపడ్డాడు, పోస్టుమాస్టరు చెప్పినప్పుడే. కవరు చేతికి వచ్చేవరకూ, అదేమిటో అర్ధంగాక ఒకటే కంగారు పడ్డాడు. ముందు వుత్తరం కోసం వెతికేడు. అది లేదని నిశ్చయించుకున్నాక కాగితాలు విప్పేడు. దస్తావేజు. మొదటి మారు చదివినప్పుడు ఆ కంగారులో ఏమీ అర్థం కాలేదు. ఇంటి పేరుతో సహా రవీంద్రనాధరావుకు దానక్రయద్యధికారాలతో భూమినిస్తున్నట్టున్న దస్తావేజుకి తలా తోకా కనబడలేదు. ఎవరో ఆ రవీంద్రనాధరావు?
మరల మొదటికి వచ్చేడు. ‘ఆ’ అనుకొన్నాడు. తన తెలివితక్కువతనానికి ఒక్కమారు నవ్వుకున్నాడు.
“భద్రా, జానకీ.”
వాళ్లు వచ్చేలోపున మరోమారు చదివేడు. ఈమారు నవ్వు రాలేదు. ఆలోచనలో పడ్డాడు.
“ఎందుకు పిలిచావు?” అంది జానకి.
“ఆ కాగితాలేమిటి?” అంది భద్ర.
చూడమంటూ దస్తావేజు జానకి చేతబెట్టి, విషయం భార్య చెవిని వేసేడు.
“బాడవ పొలం మీ మామయ్య మనమని పేర వ్రాశారు. అదీ దస్తావేజు.”
భద్ర సంతృప్తి కనబరచింది.
“గుడ్డిలో మెల్ల.”
సత్యానందం ఏదో చెప్పబోయి, మళ్ళీ అంతలో వూరుకొన్నాడు.
“మేం వచ్చిన సాయంకాలం నుంచీ గాలీ-వానగానే వుంది. తుఫాను వచ్చిన తర్వాత వచ్చిన మొదటి టపా ఇది. ఆయన ఎప్పుడు రిజిస్టరు చేయించేరు? ఎప్పుడు పోస్టు చేశారు?” అంది భద్ర.
“అది సరే. ఈ భూమి ఎక్కడుంది? ఆయనకు ఈ వూళ్ళో భూమి వున్నదని విన్న గుర్తు లేదే” అంది జానకి.
“దివానుగా వున్నప్పుడు సంపాదించేరులే” అన్నాడు సత్యానందం.
ఆ సంపాదన ఏమాదిరిదో క్రమంగా బయటపడింది.
కుమారస్వామి దివానుగా వున్న రోజుల్లో కరణానికి, రివెన్యూ ఇనస్పెక్టరుకూ ఇంత మేతవేసి బాడవలో మురుగు కాలవనానుకొని వున్న బంజరు భూమిని తనపేర పట్టా పుట్టించుకొన్నాడు. పేరు మారింది. పన్ను చెల్లుతూంది. కాని అది ఎవ్వరికీ తెలియదు.
లంక మాలపల్లిని జమీందారు లంకలోంచి తరిమేయగలిగేడు. 1948 లో ప్రారంభమైన నిర్బంధ విధానంతో మాలపల్లె గట్టిదెబ్బ తినేసింది. అటుతర్వాత బాడవలో బంజరుకోసం దరఖాస్తు పెట్టేరు. అప్పుడున్న హరిజన తాశీల్దారు సంతకం పెట్టేడు.
కాని, తీరా చూస్తే అది దివాను పేరట పట్టా అయివుంది. అది అన్యాయం అని గ్రహించి తాశీల్దారు పాత కాగితాలు తిరగవెయ్యడం ప్రారంభించేడు. అతని నోరు మూయడం సాధ్యంగాక ఎక్కడికో బదిలీ చేయించేరు. కాని భూమి విషయం తగువులో పడింది.
కథనంతనూ చెప్పి సత్యానందం ఆ విధంగా మనుమనికి ఆ భూమి వ్రాయడంలో వున్న ఎత్తుగడను ఊహించేడు.
“పల్లెవాళ్ళ తరపున కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నం చేస్తూనే వుంది. తిరగతోడుతూనే వుంది, వ్యవహారాన్ని. పార్టీ చీలిపోయేక పల్లెలోనూ చీలిక వచ్చింది. ఆ భూమిని మీ మామగారు జోగన్నకి కౌలు కిచ్చేరు.”
“ఏ జోగన్నకి?” అంది జానకి ఆశ్చర్యంతో.
“మరే జోగన్న! రంగమ్మవ్వగారి జోగన్నే” అంది భద్ర.
“మరి అతడు మార్క్సిస్టేమో” అని, జానకి ఆశ్చర్యం కనబరచింది.
“మీ మామగారు రాజకీయాలు ఏమీ ఎరగనట్లుంటాడు గాని, చాణక్యుడు. కమ్యూనిస్టు పార్టీలోవున్న తగవులకి మూలం తెలిసినా తెలియకపోయినా పట్టుదలలు గ్రహించేడు. జోగన్నని పిలిచి కౌలూ, కదపా లేకుండా ఆ భూమిని చేసుకోమన్నాడు...”
“మరి సుందరరావుగారు ఎలా వొప్పుకొన్నారు?” అంది జానకి.
“మాలపల్లె, మాదిగపల్లెల వాళ్ళు అంతా తమ పార్టీపక్షాన వుంటే ఒప్పుకోనేవాడు కాదు. కాని, అటూ ఇటూ అయ్యేరు. తమ పార్టీలోకి రానివాళ్ళని శిక్షించేందుకు, ఆశ పెట్టేందుకు అదో ఆయుధం అనుకున్నాడు. జోగన్నకి వెనకబలం ఇచ్చేడు.”
అంతా ఒక్క నిముషం ఊరుకొన్నారు. ఆ పేచీ లోతులు మనస్సుకి పట్టినాక జానకి “మరి ఇప్పుడిదేమిటి?” అంది.
“ముసలాయన మంచి యౌగంధరాయణం తలపెట్టేడు. పల్లెవాళ్ళు పేచీ మానలేదుగా. మీమీద అభిమానంగా వున్నాను గనుక, ఆ అభిమానంతో నేను పల్లెవాళ్ళని దిగతీస్తాననో, లేకుంటే విశ్వం అంటే వున్న గౌరవం, అభిమానంకొద్దీ...”
జానకి నవ్వింది.
“వాళ్ళే వదిలేసుకుంటారనా?” అంది.
“అలాంటిదేదో ఆయన మనస్సులో వుండి వుంటుంది” అన్నాడు సత్యానందం.
“మీరు మరీ ‘సినికల్’ గా తయారవుతున్నారు. ఏది చేసినా తప్పులెన్నే అలోచంలోంచేనా చూడడం?” అని భద్ర కోప్పడింది.
“అలాగే అనుకొంటూండు” అన్నాడు సత్యానందం.
పదో ప్రకరణం
ఆ కబురు విన్నప్పుడు రవీంద్ర దిగ్భ్రమ చెందినట్టు తల్లి ముఖం వంక చూసేడు.
“ఏమిటిది? భూమి ఏమిటి? మనకెందుకు?”-అన్నాడు.
జానకి నవ్వింది.
“విశ్వనాధ సత్యనారాయణగారి భాషలో చెప్పాలంటే ఎందుకనే ప్రశ్న ఏమిటి? నీ పూర్వజన్మ సంచితం అనుకో. ఆ నమ్మకం లేకపోతే పూర్వావురుష సంచితం అనుకో. ఏదయినా ఫలితం ఒక్కటే. నీకు అయిదెకరాల భూమి రావలసి వుంది. వచ్చింది. నువ్వు వద్దనుకొన్నా మానలేదు. మీ తండ్రిగారు కాలదన్నుకు పోయినా పోలేదు. మామయ్య చెప్పినట్టు తాశీల్దారు ఆ భూమిని పల్లెవాళ్ళకి ఇళ్ళ స్థలాలకి ఇచ్చివేస్తానన్నా సాగలేదు. ఆ భూమి నీది. నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎవ్వరూ-ఆఖరుకి నువ్వు కూడా కాదనలేని విధంగా-నీ చేతికి వచ్చింది. రాజ్య పురుష ముద్రిక నెత్తిన వేసుకొని మరీ వచ్చింది. కర్మకైనా కర్మ తప్పదు. ఆ ముద్రిక మొహాన వుంటే తప్ప జీవుని కర్మసంచితానికి కూడా విలువ లేకపోవడం దురదృష్టమే, అనుకో...”
ఆ మాటల ధోరణికి రవీంద్ర తెల్లబోయేడు. ఎగతాళికి నలుగురూ నవ్వేరు.
రవీంద్రకు అభిమానం కలిగింది.
“నాకీ భూమి అక్కర్లేదు.”
కాకినాడనుంచి తల్లి అంత తొందరగా వచ్చెయ్యడానికి కారణం తాతగారు చూపిన వ్యవహార ధోరిణి అవమానకరంగా ఉండడమేనని అతని మనస్సులో కష్టంగానే వుంది. ఆ కష్టం అతని కంఠస్వరంలో, మాటతీరులో వినిపించి చటుక్కున నవ్వులు నిలిచిపోయేయి. జానకి ఆప్యాయంగా అతని భుజంమీద చెయ్యివేసి దగ్గరకు తీసుకొంది.
“భూమి అక్కర్లేదంటే ఏమౌతుంది? అది నీ పేర పెట్టేశారు. ఇంకనుంచి హరిజనులు ఇళ్ళస్థలాల కోసం పెట్టే తగువు నీతో జరుగుతుంది.” అన్నాడు సత్యానందం.
“ఆ భూమి నాకక్కర్లేదు మొర్రో అంటూంటే నాతో తగువెందుకు?” అన్నాడు రవీంద్ర. “ఎవరిక్కావలసింది వాళ్ళని పట్టుకుపొమ్మనండి.”
“భేషయిన ఆలోచన. ఇళ్ళులేని వాళ్ళని వేసుకోండని హుషారిస్తే క్షణంలో రెండు సమస్యలూ పరిష్కారం అయిపోతాయి.” అని రామకృష్ణ తన ఆనందం వెలిబుచ్చేడు.
“బాగుంటుంది కాదూ?” అన్నాడు రవీంద్ర.
జానకి వెక్కిరించింది.
“అల్లా, ఇల్లాంటి బాగుండడమా? బ్రహ్మాండంగా వుంటుంది. మాలపల్లె, మాదిగపల్లె మాకంటె మాకంటారు. ఈలోపున కమ్యూనిస్టులు-మార్క్సిస్టులు అది మాదేనంటారు. ముందొచ్చినవాడు వెనకవాడిని, వాళ్ళిద్దరూ తరవాత వాడిని తన్నుతారు. వీళ్ళందర్నీ కలిపి జోగన్న తంతాడు. మంచి చూడముచ్చటగా వుంటుందిలే...”
తన ఆలోచనకు అంత విపరీత పర్యవసానం కల్పించినందుకు రామకృష్ణ ఉలిక్కిపడ్డాడు.
“ఇచ్చెయ్యదలచుకొన్నప్పుడు సరిగ్గా వీధులువేసి, స్థలాలు విడదీసి ఇవ్వాలి. ఎవ్వరో ఒక్క పార్టీవాళ్ళనో, ఒక్క మతంవాళ్ళనో, ఏ బలవంతుడో మిగిలినవాళ్ళని గదిమెయ్యకుండా...” అంటూ సత్యానందం భూమి పంచడానికి వోపద్ధతి సూచించేడు.
“మన చెయ్యి లేకపోతే అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. జనం అంత బుద్ధిహీనులుకాదు. వాళ్ళకి తమ క్షేమం తెలియదా?” అన్నాడు. రామకృష్ణ, తన ఆలోచనలను సమర్ధించుకుంటూ.
“అదేం మాటలెండి. జనం తమ బాగును తామే చూసుకోగలిగితే ఈ దురవస్థ ఎందుకు?” అంది సరస్వతి.
సంభాషణ ధోరిణి వింటూన్న భద్ర మనస్సులోని ఆవేదనను నిలుపుకోలేకపోయింది.
“”మీకేమన్నా మతిపోయిందేమిటి? నిరాధారంగా వున్న స్థితిలో వో నాలుగైదెకరాలు ఇచ్చేడాయన. ఆయన సంపాదించిన పద్ధతి బాగులేదని వంకలెంచుతున్నారుకదా. ఆయన ఎవరి భూమన్నా లాక్కున్నాడా? దిక్కూ దివాణంలేని బంజరేకదా తీసుకున్నది. బంజర్లు ఆక్రమించుకోమన్నది మీ ఉద్యమంకాదా?” అంటూ భద్ర ఆ భూమిని అట్టే ఉంచుకొనేందుకై నైతిక వాదాల్ని సమకూర్చడానికి ఆయాసపడుతూంది.
ఆ మాట విని సత్యానందం ఫక్కున నవ్వేడు.
“అయితే ఆ భూమి వదులుకోకుండా అట్టే ఉంచుకోడం న్యాయమేనంటావు.”
“ఎప్పుడూ తమరూ తమ సుఖాలూ....తమ కుంటుంబాల సంక్షేమం....ప్రపంచం ఏమైపోయినా సరే-చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష. ఈ కుళ్ళు వ్యవస్థ, కుష్టు సమాజం....ఇందులో మనుష్యుల మనస్సు...అంత సులభంగా మారదు....”-అంటూ రామకృష్ణ తన తీర్పు వినిపించేడు.
జానకి తాపీగా అడిగింది.
“మరి దీనికి మందేమిటంటావు?”
“దోపిడిని ప్రోత్సహించే ఈ వ్యవస్థను సమూలంగా పెకలించే....నిర్మూలించే సాంఘిక చైతన్యం....సాంస్కృతిక చైతన్యం ఆచరణలోకి రావాలి”-అంది సరస్వతి.
“అంతేనా?”-అని జానకి.
రామకృష్ణ తలతిప్పేడు.
“ప్రపంచంలోని మట్టిని, గాలిని సాంతం పంచుకొంటూ సామాన్యజనం అన్ని హక్కుల్నీ అనుభవించే అవకాశం ఇచ్చేది ఈ మహా చైతన్యం.”-అని సరస్వతి తన మాటకు వ్యాఖ్యానం జతపరిచినది.
“ఆ చైతన్యమే సామాన్యజనం....సామూహికంగా....అగ్ని పర్వతంలాగా....విరజిమ్మే లావా....అదే విప్లవం....”
“అంటే సామాజిక చైతన్యం ... ఒక పద్ధతిలో సాగే నిర్మాణయుతమైన చైతన్యం అవసరమంటావు.” అని జానకి నిగ్గదీసింది.
“కాదనలేదే....” అన్నాడు రామకృష్ణ.
“మరి ఇంతకు పూర్వం నువ్వు రెండు సమస్యలూ పరిష్కారం కావడానికి ఒక మార్గం చూపేవే. ఈ రెండింటికీ పొత్తు ఏవిధంగా చూపుతావు?” అంది జానకి.
“ఈ కుర్రనాగామ్మలిద్దరూ తెలీని ప్రజ్ఞలకిపోయి, ఆ కాస్త భూమీ వదిలేస్తామంటూంటే నువ్వు నక్సలైట్ పద్ధతి మంచిదా చెడ్డదా అని పట్టుకొన్నావెం?” అని భద్ర జానకిని కోప్పడింది.
జానకి చాల గంభీరంగా తిరిగి చూసింది.
“నా ఆస్తి వాడిపేర వ్రాయడానికి నిరాకరించేను. కనకనే వాడి తాతగారు ఆ భూమి వాడిపేర పెట్టేరు. అది వాడి ఆస్తి. దానిని గురించి సలహా ఇచ్చే అధికారం కూడా నాకు లేదు.”
“మా కుర్రవాళ్ళకి వదిలేస్తే ప్రపంచం ఎప్పుడో బాగుపడేది” అన్నాడు రామకృష్ణ.
“వాళ్ళకేం తెలుసునే-” అంది భద్ర.
జానకి ధీమాగా అంది. “ఏం ఫర్వాలేదు. ముసలాయనకి కుట్ర బుద్ధి వుందనుకోడం ఎందుకు? మంచికే చేసేరనుకొందాం. ప్రస్తుతం వున్న పరిస్థితిలో రవీంద్ర ఆ భూమిని ఇళ్ళ స్థలాలకు ఇచ్చేయ్యాలనుకోడమే బాగున్నట్లు తోస్తూంది సుమా!”-అంది.
“అయిదెకరాలూనా?” అంది, భద్ర. అంతా వదిలెయ్యకుండా కొంతేనా మిగుల్చుకోమంటున్నట్లు.
జానకి ఔనంది.
“అది వాడి ఆస్తేం కాదు ఆని తండ్రి తాతలదీ కాదు. ఊరివాళ్ళ భూమి. ఏకారణానో వాడిచేతికి వచ్చింది. ఆస్తి మమకారం ఏర్పడి నేను వదలనంటే నేను చెయ్యగలదేం లేదు. కాని, అల్లా జరగడంలేదు. వాడు న్యాయమైనపనే చేస్తానంటున్నాడు. దానికి అడ్డుపడడం, మినహాయింపులు పెట్టడం ఎందుకేమిటి? వద్దు. మంచిపనికి మనం అడ్డంకావద్దు. ఆపని ఎల్లాచేస్తే మంచిదో, మనకు తెలిసింది చెప్దాం. ఎక్కడైనా పొరపాటు వస్తే సరిదిద్దుదాం. అంతేగాని, ఊరిభూమిని మిగుల్చుకోమని మనం సలహా ఏమిటి? నువ్వేమంటావు. బావా!”
పదకొండో ప్రకరణం
ఒక రాత్రివేళ వీధి తలుపు దబదబ బాదిన చప్పుడు వినిపించి సుందరరావు ఇంట్లో యావన్మందీ ఒక్కమారుగా లేచి కూర్చున్నారు. అందరికీ ఒక్కటే ఆలోచన కలిగింది. పోలీసులు ఇల్లు చుట్టుముట్టి తలుపు కొడుతున్నారని అందరికీ ఒక్కమారే అనిపించింది.