“వ్యవస్థ మూలమట్టుగా మారి, ప్రపంచమంతా చక్కబడేవరకూ ఏదో ఒక చోటనో, ఏ కొంచెమో సమకూడిన లాభాన్ని వుపయోగించుకోకూడదంటారా?”

“నేనేమీ అనలేదు. ఇళ్ళస్థలాలు పుచ్చుకోడం నిర్బంధం కాదు. తమకు అనవసరం అనుకుని కొంతమంది పుచ్చుకోలేదు. దానికి కష్టపెట్టుకోనక్కరలేదు.”

సుశీల కష్టపెట్టుకోలేదు. కాని, స్థలం అనవసరమయి పల్లెలలో ఒక రాజకీయ పార్టీకి అనుచరులైనవారు దూరంగా వున్నారని ఆమె అనుకోలేదు.

తెల్లవారేసరికి వారు ఎందుకు సభలో లేరో ఊరంతా గుప్పుమంది. మిగిలిన పార్టీలవారంతా ఆ అయిదెకరాల ప్రదేశంలో వెలిసే పేటలో వీధులు ఎంత వెడల్పుండాలి! పాఠశాలకి ఎంత స్థలం ఎక్కడ వదలాలి? కుటుంబానికి ఎంత భూమి కేటాయించాలి? అనే విషయాల మీద తర్జన భర్జనలు సాగిస్తూంటే మార్క్సిస్టు పార్టీ అనుయాయులు ఆ వూరి పల్లెలోనివారేగాక, చుట్టుప్రక్కల గ్రామాల పల్లెలవాళ్ళు కూడా వచ్చేసి ఆ భూమిలో తెల్లవారేసరికి హద్దులు పెట్టేసుకొన్నారు. కొన్ని గుడిసెలు రాత్రికి రాత్రే తయారయాయి. మిగతావాళ్లు చీమల్లాగా అవిశ్రాంతంగా పని సాగించేస్తున్నారు. సర్వసేనాధిపతిలాగ సుందరరావు ఆ కార్యక్రమాన్నంతనూ దగ్గరుండి నడిపిస్తున్నాడు.

పదహారో ప్రకరణం

ఊరంతా తీర్థప్రజలా బాడవపొలంకేసి వెళ్ళి చూసి వస్తున్నారు.

“జనం ఇంతకాలం వోర్మి పట్టింది. ఇంకెంతకాలం? ప్రజలదీ భూమి. దానిని కుమారస్వామి హరిస్తూంటే చూస్తూ వూరుకొన్న ప్రభుత్వానికి, తమ ఆస్తిని స్వాధీనం చేసుకొన్న ప్రజల్న ఏమనడానికీ నైతిక అధికారం లేదు.” అన్నాడు సుందరరావు.

“తమ హక్కును ధృవపరుచుకొంటున్న ప్రజలు అవరోధాల్ని సహించరు. దెబ్బకి దెబ్బ తీస్తారు. దౌర్జన్యాన్ని దౌర్జన్యంతో ప్రతిఘటిస్తారు”-అని హెచ్చరించేడు.

“ఇంతకాలం ఆర్జీలు, దరఖాస్తులూ అంటూ రివిజనిస్టులు బూర్జువా, భూస్వామివర్గ కాంగ్రెసు ప్రభుత్వ రధానికి ప్రజల్ని లాగుడు పశువులుగా చేసిపెట్టేరు.

బలవంతుల దౌర్జన్యాలూ ధనవంతుల పన్నాగాలూ

ఇంకానా? ఇకపై చెల్లవు!”-అని ఎలుగెత్తి నినదించేడు.

ఒకదాని వెనుక నొకటిగా ఈ వార్తలు వస్తూంటే రంగనాయకులు తన తండ్రి మొండితనానికి విస్తుపోయేడు.

“ఇంతకాలం పట్టిన ఓర్పు ఈవేళ హఠాత్తుగా పోయిందే మీ నాన్నకి?” అంటూ మామగారు, విశ్వనాధం ఎగతాళిగా పకపక నవ్వేడు.

“ఏమయినా యుగంధరుణ్ణి చంపి పుట్టేడయ్యా! ఆ భూమినుంచి “స్క్వేటర్సు” ను తొలగించడానికి పోలీసు సాయం కోరితే ప్రభుత్వం-రివిజనిస్టులూ షరీకయ్యారని యాగీచేయవచ్చు. ఊరుకొని భూమి ఎల్లాగూ వదిలెయ్యదలుచుకొన్నాం గదా-యాగీ ఎందుకు? ఏ మాలపల్లె వాళ్ళు అనుభవిస్తేనేం, వూరుకుందాం-అనుకొంటే సత్యానందం వాళ్ళూ నవ్వులపాలవుతారు. మరి పలకరించే వాళ్ళుండరు. కర్ర తీస్తే....”

“మధ్యన పల్లెల వాళ్లు కొట్టుకు చావడమేగా. ఈ యౌగంధర్యం పర్యవసానం?”-అని సుశీల ఈసడించింది. ఆమె వరస చూస్తే రాత్రి తన్ను ఇంటికి తీసుకొచ్చినందుకే పశ్చాత్తాపపడుతున్నట్లనిపించింది.

రంగనాయకులు లేచేడు.

ఆ వ్యాఖ్యాలలో నిజం వుంది. తనకు తెలుసు. తన తండ్రి ఆలోచనలన్నీ ఒకేదారిన పోతున్నాయి. ముందు తమ పార్టీని బలపరుచుకోవాలి. దానికై ఇతరులికి ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలోని రెండో జట్టుకి నామరూపాలు లేకుండా చెయ్యాలి. ఆయన దృష్టిలో తక్షణ కర్తవ్యం అది. తన మామగారి వూహ నిజమే అయివుంటుంది.

కాని దానిని తాము ఆపలేరు. మరేమిటి చెయ్యడం?

“క్లినిక్‌కు వస్తున్నావా?”

“మీరు వెళ్ళండి.”

రంగనాయకులు ఒక్క క్షణం ఆగేడు.

“నా మీద కోపం పెట్టు....”

సుశీల అర్థోక్తిలోనే కట్టె విరిచినట్టు సమాధానం చెప్పింది.

“మీ పార్టీ కోసం కాదు నే వచ్చేది. జనం కోసం. ఆ కుర్రాళ్ళూ, నేనూ సహాయ కార్యక్రమాలలోకి రావడం మీ కోసం కాదు. అందుచేత మేము ఈ పూటనుంచి వెళ్ళమేమో అనుకోకండి. మీరు చూపినట్టు ఒంటెత్తు....”

రంగనాయకులు బాధపడ్డాడు.

“ఈ కుట్ర పనిలో నాకు వాటా లేదనీ, ఇందుకోసమే రాత్రి మీటింగుకు దూరంగా వుండలేదనీ నమ్మలేవూ?”

“మీ గత చరిత్ర ఆ విశ్వాసం కలగనీయడం లేదంది” బండగా సుశీల.

“మీ వైరాగ్యం, రాజకీయాలకు దూరంగా వుంటాననడం ఆ వొంటెత్తుతనానికి మారురూపాలేననే జ్ఞానం లేకపోయింది.”-అనేసింది కూడా.

రంగనాయకులికి అభిమానం అనిపించింది. సుశీల మొహం ముడుచుకొనే వీడ్కోలు యిచ్చింది.

ఆమె మరల రమ్మనలేదని గమనించేడు. కుదుటబడిందనుకున్న తన జీవితం మళ్ళీ మొదటికొచ్చింది. దేశంలో ప్రజల జీవితం అల్లకల్లోలంగా వుండగా ఒక వ్యక్తికి సుఖజీవితం వుండదన్న మాట గుర్తు వచ్చింది. “ఎవరన్నదీ మాట”-అనుకుంటూ గుమ్మం దిగేడు, రంగనాయకులు.

పదిహేడో ప్రకరణం

వీధిలోకి వచ్చేక మాములుగా ఇంటివేపు అడుగుపెట్టేడు. కాని, మనస్సు ఎదురు తిరిగింది. అది తన తండ్రి యిల్లు. రక్త బంధుత్వమే కాదు. రాజకీయ సమభావం కూడా ఆ యింటిని ఆత్మీయం చేసింది. ఇటీవల రాజకీయ భావాలు సందేహాస్పదం అవుతున్నకొద్దీ ఆ యింటికి రావడం, అక్కడ వుండడం కష్టంగానే వుంది.

ఈవేళటి ఘటన రాజకీయ సమభావాన్ని పూర్తిగా చంపేసింది. తండ్రి అనుసరిస్తున్న ఈ మార్గం ఎక్కడికి తీసుకెడుతుంది?

రంగనాయకులు నిలబడిపోయేడు. ఇంటికి వెళ్లాలనిపించలేదు. తిన్నగా క్లినిక్‌కు వెళ్ళేడు. అది తాళం వేసివుంది! తాళం చెవికోసం ఇంటికెళ్లాలి. లేకపోతే కంపౌండరు తెచ్చి తలుపు తెరిచేవరకూ కూర్చోవాలి.

వరండాలో రోగుల కోసం వేసిన బల్లమీద కూర్చున్నాడు. రోడ్డున పోతున్నవారు ఆశ్చర్యంగా చూసేరు. ఒకరు అడిగేసేరు కూడా.

“ఏమిటి డాక్టరుగారూ. అల్లా వున్నారేమిటి? అక్కడ కూర్చున్నారు, తాళంచెవి లేదా?”

“కంపౌండరు వస్తున్నాడు”-అని అబద్ధమాడేడు. అప్పటికింకా ఏడు కూడా కాలేదు. కంపౌండరు ఎనిమిది దాటితేగాని రాడు.

ఎదుటింటి వెంకట్రామయ్య లోపలినుంచే ఆ సమాధానం విని కుర్చీ తెచ్చి అరుగుమీద వేశాడు. ఆహ్వానించేడు.

“రాండి. ఇల్లా కూర్చోండి డాక్టరుగారు. అక్కడ ఒక్కరూ కూర్చున్నారేమిటి?”

ఇంక అక్కడ కూర్చోడం సాధ్యమనిపించ లేదు. నోటికి వచ్చిన అబద్ధం ఆడేడు.

“ఏం లేదు. హైస్కూలుకెళ్ళి నలుగుర్నీ వోమారు చూసిరావాలి. కంపౌండరుకి కబురు పంపేను. వస్తూంటాడు. రాగానే అల్లా పంపించండి.”-అంటూ రోడ్డుమీదికి వచ్చేడు.

“వెడుదురుగాని. కాస్త కాఫీ తీసుకు వెళ్ళండి….” అంటూ వెంకట్రామయ్య మెట్లు దిగి వచ్చేడు. వస్తూనే తన గోడు ప్రారంభించేడు.

“మీరు మొన్న ఇచ్చిన మందు పనిచేసినట్లే కనిపిస్తూంది. కడుపు వుబ్బరం....”

రోగాల గురించి ఆలోచించే స్థితిలో లేదు మనస్సు. కాని, ఆ మాట చెప్పలేకపోయేడు.

“తగ్గుతుంది. నాలుగురోజులు మానకుండా తీసుకోండి. పథ్యం జాగ్రత్త-“

అంటూ ముందుకు నడిచేడు, రంగనాయకులు. ‘వస్తా,’

వెంకట్రామయ్యని వదుల్చుకొన్నాక మరి అక్కడ నిలవబుద్ధిపుట్టలేదు. హైస్కూలు మాట తోచాక వెళ్ళి జాన్‌తో మాట్లాడాలనిపించింది-‘అతడికి ఈ కుట్ర తెలిసివుంటుంది? తెలిసి కూడా రాత్రి సభలో పాల్గొని వుంటాడా?”

కాని, జాన్ ఎరగడని తేలింది.

“మీరు రాలేదు, నిన్నటి సభకి. అప్పటికేమీ అనిపించలేదు. కాని, పొద్దున్న ఈ వార్త వినగానే అపనమ్మకం అనిపించింది, చెప్పొద్దూ.” అన్నాడు జాన్.

జాన్ ఎరగడు. అతనికి సన్నిహితంగా వుండే నలుగురు, అయిదుగురు హరిజన పల్లెవాళ్లూ ఎరగరు, సుందరరావు పధకాన్ని. వాళ్ళంతా ఇప్పుడు చిరచిర లాడుతున్నారు. జాన్‌లో విప్లవజ్వాల చల్లారిపోయిందన్నారు. అతనితో వుండడం అతనిని గౌరవించడం వలననే తమకు ఇళ్ళ స్థలాలు లేకుండాపోయాయి-అని వారి విచారం.

ఆమాట వినగానే జాన్‌కు చిర్రుపుట్టింది.

“ఇప్పుడేమయింది? వెళ్ళండి. మీరూ వో పాక వెయ్యండి. సాయంకాలం లోపున వీపులకి మందెయ్యమని మళ్ళీ వద్దురుగాని.”

“మేమే అంత గాజులు తొడిగించుకున్నాం. మామీద చెయ్యెవడు వేస్తాడో రమ్మను. ఖైమా వండేస్తాం.” అన్నాడు, శేషప్ప కస్సుమంటూ.

“ఆ వచ్చేవాళ్ళు నీచేత దెబ్బలు తినడానికి రారు. పోలీసులూ, తుపాకులూ బందోబస్తుతో వస్తారు. దెబ్బలు తిని బయటికి గెంటించుకోవాలంటే వెళ్ళండి”-అన్నాడు జాన్ పిరికిమందు పోస్తూ.

“పోలీసుల్ని తెప్పిస్తారంటావా?”-అన్నాడు కాశయ్య అక్కడి నుంచి జారుకుంటూ.

“కూర్చో వెళ్ళకు” అని జాన్ గదిమేడు. కాశయ్య నిలబడ్డాడు.

“ఆ అయిదెకరాలూ ఇళ్ళకోసం మనకి వదిలేస్తామన్నారు. ఇంటికి అయిదు సెంట్లు వుండాలనుకున్నాం. పేర్లు తీసుకొంటే అందరికీ వచ్చేలా లేదు. నాలుగే అనుకొన్నాం. అందులో నీ పేరూ వుందా?”-అని జాన్ అడిగేడు.

“మా అన్నయ్య పేరు లేదు” అన్నాడు కాశయ్య.

“అతడికి పుంతలో వుందిగా.”

“ఆడూ, నేనూ ఒకేచోట వుండాలి” అన్నాడు మొండిగా కాశయ్య.

“మరి నిన్నొదిలి ఆడెల్లి అక్కడ హద్దులు పెట్టుకొన్నాడేం?”

కాశయ్య మాటాడలేదు.

“ఇల్లా జరుగుతుందని నీకు తెలుసునన్నమాట” అన్నాడు జాన్, అనుమానంతో, ఉక్రోషంగా.

“నాకేం తెలియదు”-అని కాశయ్య నిర్లక్ష్యంగా విసురుకుపోయేడు.

అతడు వెళ్ళినవేపే చూస్తూ జాన్-‘ఈడికి తెలుసును’ అన్నాడు.

మిగిలినవాళ్ళు అంగీకరించేరు.

“ఈపని చెయ్యవలసినప్పుడు చెయ్యలేదు. అవసరం లేని ఈ క్షణంలో చేశాం. పల్లెవాళ్ళమీది అభిమానమా, మనకి పేరు రావాలనే దురహంకారమా? గొప్ప తప్పు చేశాం. అన్యాయం....”అని రంగనాయకులు బాధ.

జాన్ తన మనస్సులో అనుమానం బయటపెడుతూ రంగనాయకులు మాటకు అడ్డంవచ్చేడు.

“వీళ్ళని ఖాళీ చేయించడానికి సత్యానందంగారు పోలీసుల్ని తెస్తారేమో....”

“ఆశ్చర్యం ఏముంది? వాళ్ళకి మాత్రం ప్రతిష్ఠ అక్కర్లేదూ, ఈపాటికే ఆ పని చేసి వుండకపోతే....”

తామే ఇవ్వడానికి సిద్ధమైన వస్తువును, చేతిలోంచి వొడేసి లాక్కుంటే ఎవరికైనా కోపం వస్తుంది. కోపం వచ్చేక ఔచిత్యానౌచిత్యాలు చూడడు. తనకు శక్తి వుంటే అదేదో తానే చూస్తాడు. లేకపోతే  తోడు తెచ్చుకొంటాడు. ఆ ఆలోచనతోనే  రంగనాయకులు తక్షణం తాము ఏదో ఒకటి చెయ్యాలన్నాడు.

“మన పార్టీల మధ్య వున్న కక్షతో నాన్నగారు ఈ పని చేసేరు. ఇప్పుడు సత్యానందంగారు పోలీసు సహాయం కోరితే మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. జరిగేదదే. ఇది ఒకప్పుడు గవర్నమెంటు బంజరు అయినా ఒకరికి పట్టా అయిన భూమి అది. దానిని వారు పంచిపెడతామనుకొన్నారు. గనుక మనం చేసిన పని తప్పే. మనం చేసిన ఈ పనితో వొళ్ళు మండి నిన్నటి రాత్రి వుద్దేశం మార్చుకొని, అది తమవాళ్ళకే ఇవ్వాలనే పునర్నిర్ణయానికి వచ్చినా రావచ్చు” అన్నాడు.

“తమవాళ్ళకే అంటే” అన్నాడు శేషప్ప.

“మీ నాన్నగారు మిమ్మల్ని లెక్కేసుకోలేదు. ఇప్పుడు ఆరూ మమ్మల్ని వొదిలేస్తారంటారా?” అని అతని మనస్తాపం.

అతని విచారం చూసి జాన్ వెక్కిరించేడు.

“ఈడూ మీవాడే బాబూ! ఈడికీ వో నాలుగు సెంట్లు ఇమ్మని ఆరితో సెప్తాలే.”

“నువ్వే సెప్పాలి. ఆరు నీ మాట విన్నారు. నడం డెస్సే. మనమే అడుక్కుందాం.”

వాళ్ళిద్దరు ముగ్గురూ వెళ్ళిపోతూంటే, చూస్తూ రంగనాయకులు మందహాసం చేసేడు.

“మనకంటే రివిజనిస్టాళ్ల మనసులూ, ఆలోచనలే ఆరోగ్యవంతంగా వున్నాయి డాక్టరుగారూ!” అన్నాడు జాన్. “ఇప్పుడేం చేద్దాం?”

“అదే తోచడం లేదు....ఈ పార్టీతోనూ, పార్టీ కార్యక్రమంతోనూ సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పి, బాడవ పొలం ఆక్రమణ తప్పు అని బాహాటంగా రంగంలోకి దిగకపోతే మా నాన్నగారి విసురు తగ్గదు. వీళ్లందర్నీ పోలీసు లాకప్పులకీ, పల్లెల్లో కొట్లాటలకీ బలి కాకుండా కాపాడడానికి అదొక్కటే మార్గం. మనం ఈ పద్ధతిని వ్యతిరేకించాలి. తప్పదు. నువ్వు రాకపోతే నేనొక్కణ్ణేనా దిగి తీరుతా. వీళ్లు మనని అగాధం, సుడిగుండంలోకి దింపేరు. చాలు!” అన్నాడు రంగనాయకులు.

పద్ధెనిమిదో ప్రకరణం

నిముషాలమీద బాడవ పొలంలోంచి మార్క్సిస్టు బైఠాయింపుదార్లని వెళ్లగొట్టేందుకు ఏం చేద్దామంటూ కామేశ్వరరావు సైకిలుమీద హడావిడిగా వచ్చేడు.

బైఠాయింపుదార్లు వట్టినే భూమి ఆక్రమించుకొని ఇళ్లు వేస్తున్నారనేకన్న నక్సలైట్ల దాడిగా రిపోర్టునిస్తే త్వరగా పని జరుగుతుందేమో ఆలోచించమని సలహా పట్టుకు వచ్చేడు.

అప్పుడే సుందరరావును కలుసుకొని వచ్చిన సత్యానందం మనస్సులో ఎంత మంట మండుతున్నా ఆ సలహాలకు కటకట పడ్డాడు.

“నువ్వు కమ్యూనిస్టువి కూడా. నువ్వు అంటున్నదేమిటో తెలుసా?”

“ఇంకా మెత్తమెత్తగా మాట్లాడతారేమిటండీ. మీరిల్లా నీళ్లు నమిలే మన పార్టీనీ దశకు తెచ్చారు”-అని కామేశ్వరరావు చుర్రుమన్నాడు.

సత్యానందానికి నవ్వొచ్చింది.

“ఏం చేద్దామంటావు? స్పష్టంగా చెప్పు.”

“మీ గాంధేయ కమ్యూనిజం మనల్ని గంగలో దింపుతుంది. లేకపోతే మన పార్టీని బలపరచేటట్లుగా ఆ ఇళ్ల స్థలాలను కేటాయించడానికి బదులు పార్టీ భేదాలతో నిమిత్తం లేకుండా ఇళ్ళులేని హరిజనులందరికీ అని అడ్డం పెట్టేరు....”

“ఇది నా మొదటి తప్పు. జానకీ విన్నావా?”-అన్నాడు సత్యానందం.

తన వాదాన్ని యింత తేలిగ్గా తీసుకొంటూంటే కామేశ్వరరావుకు కోపం మిక్కుటమయింది.

“దేశంలో పోలరైజేషన్ వచ్చేసింది. మీరిది గమనించకపోవడం ఆత్మ వినాశకరంగా పరిణమిస్తూంది....”

“బాగుందయ్యా, బాబూ! పోలరైజేషన్ వచ్చింది. సరే. ఎవరి మధ్య? నాకూ సుందరరావుకూ మధ్యనా? మార్క్సిస్టు-లేక కమ్యూనిస్టు పార్టీల మధ్యనా? లేక ఈ రెండు పార్టీల వెనకా వున్న వాళ్ళ మధ్యనా? ఈ పోలరైజేషన్‌లో మన ఆత్మనాశనం గాకుండా నేనేం చెయ్యాలిసుంటుంది? వాళ్ళని నక్సలైట్‌లని పోలీసు రిపోర్టు ఇవ్వాలి. వాళ్ళొచ్చి ఆ పోలరైజేషన్‌లో నష్టకరంగా వున్న అంశాన్ని కోసి పారేస్తారు, కాదూ? ఇప్పుడు పోలీసులూ, మనమూ కాంగ్రెసు ప్రభుత్వము దానిని బలపరుస్తున్న బూర్జువా-భూస్వామి వర్గాలు ఈ పోలరైజేషన్‌లో ఒక అంశం అన్నమాట. చాల బాగుంది. అద్భుతంగా వుంది....”

సత్యానందం స్వరంలో గడిచినకొద్దీ హేళన బలపడుతూ అవహేళన విస్పష్టమయింది. చిట్టచివరకు విసవు, తేలికతనం విస్పష్టమయ్యాయి.

తన పోలరైజేషనూ, పోలీసు సహాయం కోరాలనడమూ మీద చేసిన వ్యాఖ్య విని కామేశ్వరరావు నిర్విణ్ణుడయ్యేడు.

“కామేశ్వరరావు, క్షమించు. తుఫాను ముందు మనం జరిపిన మీటింగులకి నువ్వు రాలేదు. నక్సలైట్లను గురించి మన అభిప్రాయమేమిటో నీవు తెలుసుకున్నట్లు లేదు. పార్టీ వారిని తప్పుదారి తొక్కిన దేశభక్తుల్నిగా, ప్రజాహితం కోరిన త్యాగమూర్తుల్నిగా భావిస్తూంది. ప్రభుత్వం ప్రజాక్షేమం కొంచెం కూడా కూర్చలేక పోవడం, తత్ఫలితంగా యువతలో వచ్చిన నిస్పృహా, తెగింపూ వారిని సృష్టించాయి. పోలీసులూ, నిర్బంధాలూ వారిని అణచలేవు-అని మన వాదం. యువకులలో విధ్వంస దృష్టిగాక, విప్లవదృష్టి కలిగించడానికి మనకో కార్యక్రమం వుంది. పోలీసు సాయం కోరడం మాత్రం దానిలో భాగం కాదు....”

“ఇప్పుడేం చేస్తారు మరి?” అన్నాడు కామేశ్వరరావు, తడిసిన పిల్లిలా ముడుచుకుపోతూ.

“అదే ఆలోచిద్దాం. కూర్చోండి” అంది జానకి.

సుందరరావుతో జరిగిన సంభాషణను సత్యానందం సూక్ష్మంగా చెప్పాక కామేశ్వరరావు మళ్ళీ అడిగిన ప్రశ్న “ఏం చేద్దామంటారు?” అనే.

“నువ్వు మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావనుకోలేదు” అన్నాడు సత్యానందం.

ఏమడగాలనుకొన్నాడో కామేశ్వరరావుకి అర్థం కాలేదు. తెల్లబోయేడు.

“పాకలు వేసినవాళ్లు ఎందరు? ఎవరెవరు?-అనే ప్రశ్న వేస్తావనుకొన్నా....”

గత రాత్రి నూరుమందికి స్థలాలు చూపగలమనుకొన్నారు. సుందరరావు పిలుపుకు వచ్చినవారు ముప్ఫయిమంది. వాళ్ళలో ఒక పాతికమంది తామూ స్థలం కేటాయించినవారే. అయిదుగురు పై వూళ్ళ వాళ్లు....ఇద్దరికి పుంతలో స్థలాలున్నాయి.

“పొలం అంతా జనమే కనిపిస్తున్నారు. ముప్ఫయిమంది పై చిల్లరేనా?” అన్నాడు ఆశ్చర్యంగా, కామేశ్వరరావు.

“భూమిలో బైఠాయించారని పోలీసు రిపోర్టు ఇద్దామన్నావే. ఆ బైఠాయింపుదారులలో ఏ నలుగురైదుగురో తప్ప మిగతా అంతా. మనం బైఠాయించమందామనుకొన్నవాళ్ళే.”

“మిగతా భూమి అల్లాగే వుందన్నమాట.”

“లేదు. జోగన్నకి పాకా, పాకచుట్టూ వున్న రెండేకరాలు పైగా చెలగా అట్టే వుంచారు. అది అతడిదీ-అదే అనుకొన్నా.”

“అయివుంటుంది. అబ్బాయితో నిన్న జోగన్న అల్లాంటిదే ఏదో చెప్పేడట. మీ తాతగారు, ఆ పొలం చూసినందుకు సగం నాకిస్తానన్నారు-అన్నాడుట.”

“నాతో మాట్లాడినప్పుడు అంతా తనకే ఇస్తానన్నారన్నాడులే” అన్నాడు సత్యానందం.

“ఇప్పుడేం చేస్తారు?”

కామేశ్వరరావుది మళ్ళీ అదే ప్రశ్న.

“ఏం చేస్తా”రనిగాక “ఏం చేద్దా”మనుకుంటే మంచిది కాదూ?” అని సత్యానందం మరో చురక తగిలించేడు.

కామేశ్వరరావు నిరుత్తరుడయ్యేడు.

“పోనీ ఏం చేశావని అడుగు. నేను రవీంద్రను వెంటబెట్టుకొని బాడవపొలం వెళ్ళేను. మన లిస్టులో వున్న వాళ్లందరికీ పాకలు వేసుకోమని చెప్పివచ్చాం.”

“మీరు చెప్పేదేమిటి. వాళ్ళే వేసేసుకొంటున్నారుగా....” అన్నాడు కామేశ్వరరావు.

“అంతే కాదుగా! వాళ్లు వేసుకొన్నట్లు మనకు దాఖలా కావాలి. కనక మధ్యాహ్నం 3 గంటలకు హైస్కూలుకి వచ్చి, జాన్‌కు చెప్పాలి. అతడు రశీదు ఇస్తాడు. అలా పుచ్చుకోకపోతే, అతడు స్థలం ఆక్రమణ చేసినట్లు లెక్కగట్టి తీసుకోవలసిన చర్యలు తీసుకొంటాం....”

“అంటే?....”

“అవసరమైన వన్నీను....!

“పోలీసును....”

“నీకు పోలీసు రంధి పట్టుకొందే”

“మరి....”

“స్థలాలు ఇవ్వాలనుకున్న వాళ్లు ఇంకా డెబ్బయిమందివరకూ వున్నారు. మనకి తన రాక గురించి చెప్పి, చీటి తీసుకోని వాళ్ళకి స్థలం వుండదు. అది మరొకరికిచ్చేస్తాం.”

“వాళ్ళల్లో వాళ్లు కొట్టుకొంటారేమో”-అన్నాడు కామేశ్వరరావు.

“పోలీసు వాళ్ళేగాని మనవాళ్లకి కొట్టే అధికారం, దెబ్బలుతినే అధికారం లేదా?”

“పాకవేసినవాడు కదలకపోతే....”

“చూద్దాం. వానికి ఇతరత్రా స్థలం లేకపోతే ఇద్దాం. తప్పేముంది? సుందరరావుగారు ఏదో చిక్కులు తెచ్చేరు. దానికి మనం రెచ్చిపోవడం అర్థం లేదు. కొంచెం వోర్పూ, ఆలోచనా చూపుతే....”

“మంచిపని చేసేవు”-అంటూ జానకి లేచింది.

పంధొమ్మిదో ప్రకరణం

సాయంకాలం అయ్యేసరికి సుందరరావు వోడిపోయాననుకొన్నాడు.

కొడుకు-తన మీద అంత భక్తి విశ్వాసాలుగల కొడుకు-ఈ ఇరవయ్యేళ్లూ తననే అంటిపెట్టుకొనివున్న జాన్-

-ఇద్దరూ బహిరంగంగా తన చర్యను దుయ్యబట్టినా సుందరరావు జంకలేదు.

పెద్ద రాజకీయపుటెత్తులో తమ పరమ శత్రువైన ‘రివిజనిస్టు’ పార్టీని నేల కరిపించేశాననుకొన్నాడు.

“పోలీసుల్ని తెచ్చేరా వీళ్ల పార్టీకి జనంలో పుట్టగతులుండకుండాపోతాయి. వూరుకున్నారా హరిజనపల్లెల్ని వదులుకోవలసిందే....అషయుతే భూదానం-ఇషయితే గోదానం....భేషుగ్గా కుదిరింది. తన్నుకు చావనీ” అనుకున్నాడు.

కాని మధ్యహ్నం అయ్యేసరికి రంగు మారింది. జోగన్నకి వదిలిన రెండెకరాల చిల్లరలో సత్యానందం జనాన్ని ప్రవేశపెట్టేడు.

గ్రామంలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులంతా, సానుభూతిపరులంతా హరిజనపేటలవారితో పెద్ద వూరేగింపుగా వచ్చారు. అడ్డం వచ్చిన జోగన్నను ఈడ్చేశారు. తాత్కాలికమైన హద్దులు పెట్టి పేరు పేరున ఇచ్చేశారు. ఆ భూమి పంపకం ఉద్యమంలో,

-రెండో భాగంగా తాను ప్రవేశపెట్టిన వారికి స్థల నిర్దేశం ప్రారంభించేరు.

ఆ జనాన్నీ వారి ఉత్సాహాన్నీ చూసేక తాను తెచ్చినవాళ్లు నీళ్ళు కారిపోయేరు. వాళ్ల ధైర్యం నిలపడానికి తాను చేసిన ప్రయత్యాలు ఫలించలేదు. ఒక్కొక్కళ్ళే జాన్ దగ్గరకు కదులుతున్నారు.

ఒకరు-ఇద్దరు-నలుగురు-అయిదుగురు....

“చెరువుకు గండి పడింది” అన్నాడు సత్యానందం కొడుకు, రామకృష్ణ నవ్వుతూ.

నిజమే. గండి పడింది. దానిని పూడ్చగల శక్తి తనకు లేదు. నిన్న ప్రొద్దుటినుంచి పడుతున్న శ్రమతో తల తిరిగిపోతూంది.

ఇంక అక్కడ అనవసరం తానుండడం. వెనుదిరిగేడు. కాని, రెండడుగులు కూడా వెయ్యకుండానే పడిపోయాడు.

స్మృతి తప్పుతున్న స్థితిలో ఎవరో తన పేరు పలుకుతున్నారు.

“సుందర....”

తరవాత ఏం తెలియదు....

నిస్సహాయ స్థితిలో ఉన్న తన్ను చేతులమీద ఇంటికి చేర్చేరు. ఇద్దరు డాక్టర్లు కష్టపడి తన్ను బ్రతికించేరు....

కాని, కాలూ చెయ్యి లేదు. మాట లేదు. కళ్లు వున్నాయి. తెలివి వుంది. చెవులు వినిపిస్తాయి.

తానొక జీవచ్ఛవం!

తానేమీ చెయ్యలేడు!

తన ఈ స్థితికి కారకులే తనకు మందులిచ్చి బ్రతికిస్తున్నారు. చూసుకో నిన్ను ఏ స్థితికి తెచ్చామో అని వెక్కిరించడానికే తన్ను బ్రతికిస్తున్నారనిపించింది.

మాలపల్లెలు వరసన తన్ను చూడడానికి వస్తున్నారు. గ్రామంలో జనం వస్తున్నారు. పైవూళ్ల వాళ్లు వస్తున్నారు.

వారందరూ రావడం తనమీద ప్రజలకుగల అభిమానానికి చిహ్నం అంటూంటే మనస్సు రగిలిపోతూంది.

“అబద్ధం. వీళ్లు ద్రోహులు. విప్లవ ద్రోహులు, వీళ్ళెవరూ నామీద ప్రేమతో రాలేదు. విప్లవాన్ని పూర్తిగా చంపేమో లేదో చూసుకొనేందుకు వస్తున్నారు.”-అని అరవాలనుంది. కాని నోరు లేదు. తన అశక్తతకు కన్నీళ్లు కారేయి. ఆ కళ్లనీళ్ళు చూసి చేసిన వ్యాఖ్య మరీ హింసించింది.

“మీకేం చెయ్యలేకపోయేను. అశక్తుడినైపోయానని కన్నీరు పెట్టుకుంటున్నారు” అంటున్నారు.

“లేదు. మీ పీక పిసికెయ్యాలనుంది. మీరంతా చస్తేగాని, మీ చితాభస్మం మీద గాని భావిసుఖమందిరం నిర్మించబడద”ని ఎలుగెత్తి చెప్పాలనుంది.

సత్యానందం, జానకి, ఆ కుర్రాడు ఆమె కొడుకు, వీళ్ళంతా శత్రువులు. విప్లవానికి శత్రువులు. పరమ శత్రువులు.

సుందరరావుకి మరల స్పృహ తప్పింది.

మళ్ళీ స్ట్రోక్ వచ్చిందని రంగనాయకులు కంగారుపడ్డాడు.

ఈమారు సుందరరావుకి మరల తెలివి రాలేదు. ఆ మెదడు నరాలు రాగద్వేషాలను ప్రకటించలేవు. శత్రు-మిత్రుల్ని వేర్పరించలేవు.

రంగనాయకులు బావురుమన్నాడు.

“ఈదారి ఇక్కడికి ఆఖరయిందా?”

End of Project Gutenberg's Ee Daari Ekkadiki, by Rama Mohana Rao Mahidhara

ఈ దారి ఎక్కడికి? (రధచక్రాలు - ఉత్తరగాధ) · 第 15 / 15 段