“1950 తరవాత 62 వరకూ మన పనులు ఏమిటో చెప్పండి. డిసిప్లిన్ పేరుతో ఒకరినొకరం దిగతీసుకొన్నాం. విడిపోయాక పోటీకయినా జనంలోకి వెడుతున్నాం....”
“ఐక్యతకు కూడా డైలెక్టిక్స్ వర్తిస్తుందన్నాడు మావో. శుద్ధ సత్యస్వరూపంగా ఆలోచించకూడదంటావు.” అంది జానకి ఆశ్చర్యంగా.
“సందేహం ఎందుకు? మనపార్టీ చరిత్ర దానికి ప్రత్యక్ష ప్రమాణంగా ఉంటేనే. రెండు దృక్పథాలలో ఏది మేలో చరిత్ర...”
“డార్విన్ సిద్దాంతం పని చేస్తుందంటావు?”
“నిస్సందేహంగా. కేరళ, పశ్చిమ బెంగాలు చూడండి. అన్ని అవకాశాలు చేతుల్లో ఉన్నా అంత అద్భుతంగా ఆత్మహత్య చేసుకోగల శక్తిని మనవాళ్ళు కనబరచేరంటే ఏమనుకోవాలి?....”
ఆ మనవాళ్ళు మార్క్సిస్టులు. తామంతా ఒకప్పుడు కలిసే వున్నామనీ, ఇప్పుడూ తమ లక్ష్యం ఒకటేననీ మరవలేదన్నమాట. మంచిదే అనుకొంది జానికి.
కాని, జానకి అంగీకరించలేకపోయింది.
“ఎంత సర్వనాశనం అవుతూంది? ఎంత నష్టం?”
“తప్పదు. ప్రకృతి సూత్రం! ప్రకృతిలోనే వుంది బోలెడు నష్టం, వ్యర్ధం” అన్నాడు వెంకట్రావు.
బస్సులో ప్రమాణం చేస్తున్నంత సేపూ మాటలు లేకపోయినా ఆలోచనలు మాత్రం ఆ పరిధి నుంచి బయటపడలేదని అగ్రహారంలో దిగుతూనే వెంకట్రావు అన్న మాటలు స్పష్టం చేశాయి.
“ఉమ్మడిపార్టీ వారసత్వంలో వాళ్ళు పెద్దవాటాయే పుచ్చుకొన్నారు. ప్రజలా, పార్టీయా? ఏది ముందు? పార్టీ బలంగా వుంటే ప్రజలకి సేవ చేస్తుంది. బాగా సమర్ధవంతంగా చేస్తుంది. అందుచేత ముందు పార్టీని బలపరచుకోవాలన్న ధోరణిలో పడ్డాం. ప్రజలకి సేవ చెయ్యడంలో పార్టీ బలమవుతుందనే ఆలోచన వదిలేశాం. దానినే వాళ్ళూ పట్టుకొన్నారు. ఇంతవరకు ఈ ఏడెనిమిదేళ్ళలో వాళ్ళు చేసింది అదే. చేస్తున్నది అంతే.”
ఒక్క క్షణం వూరుకున్నాడు.
“మనకు కూడా కొద్దో గొప్పో ఆ వారసత్వం మిగలకపోలేదు. కాని దానిని వదల్చుకొనేందుకు పని ప్రారంభించేం. అది కాస్త సుగుణం. భవిష్యత్తు మీద ఆశ మిగిల్చింది.”
ఆ సంతృప్తి, దుఃఖం, బాధ చూసి జానికి నిర్విణ్ణురాలయింది.
“ఇది నా అభిప్రాయం మాత్రమేనండి” అంటూ గిరి గీసుకొని అతడు తన అభిప్రాయం తేల్చేడు.
“ప్రజల కోసం పార్టీ గాని, పార్టీ కోసం ప్రజలు కాదండి.”
“మంచి మాట అన్నావయ్యా!” అంది జానకి.
మూడో భాగం
ఒకటో ప్రకరణం
గుమ్మంలో నిలబడ్డ రామకృష్ణను చూడగానే జానకి గతుక్కుమంది. బలిష్టమైన, ఉన్నత విగ్రహం. వయస్సుకిమించి కనిపిస్తున్నాడు. మంచి తెలివీ, ఆలోచనావున్న ముఖం. తెలిసిపోతూనే ఉంది. కాని, నిల్చున్న తీరులో కనిపించే నిర్లక్ష్యం, మిలమిలలాడుతున్న కళ్ళలో కనిపించే అవిశ్వాసం,-ఆ ఆకారానికీ ముఖానికీ పొందిక లేదు. ఏదో లోపం వుంది. ఎక్కడుందో అర్ధం కాలేదు. పలకరించింది.
“నన్నెరగవు, పరిచయం చేసుకుందాం...”
రామకృష్ణ మాట పుల్లవిరిచినట్లు కటువుగా వినబడింది.
“ఎరక్కపోవడమేమిటి? ఎరుగుదును. మీరు జానకి. అతడు రవి”
భద్ర నవ్వింది.
“లోపలికి నడవండి” అంటూ, తాను వెళ్ళిపోయింది. ఆమె మాటను రామకృష్ణ వినిపించుకున్నట్టులేదు. తన వాదం సాగించేడు.
“ఇంక మీకు నేనెవరో తెలియలేదంటే....”
కొత్త మనిషిని, తమ ఇంటికి అతిధిగా వచ్చినామెను, తన తల్లికీ తండ్రికీ ఎంతో ఆప్తురాలనుకునే ఆమెను కటువుగా అనెయ్యడానికి జంకేడు. అతని సందేహం చూసి జానకే అందించింది.
“నా తెలివితేటల్ని అనుమానించాలంటావు. అంతేనా?”-అని నవ్వింది.
రామకృష్ణ తనకా అనుమానం లేదన్నాడు.
“అయితే నా నిజాయితీని శంకించాలంటావు.”
“అది చాల తీవ్రమైన పదం....”
“మరి?....”
“మీరూ సంప్రదాయం, మర్యాద, పెద్ద మనిషి తరహా మాటున చలామణి అవుతున్న బూర్జువా అసత్యాలకు దాసులేనే అనిపించింది. మిమ్మల్ని గురించి నేవూహించుకున్న చిత్రం వేరు....”
అతను అర్ధం అవుతున్నాడనుకొంది జానకి.
“చూసేవా. ఒకరు చెప్పినదాన్ని బట్టి ఊహించుకొన్న చిత్రం వేరుగా వుంటుంది. మనం కళ్ళతో చూసి, ఏరుకున్న ప్రతిబింబం వేరుగా వుంటుంది. తమాషా ఏమిటంటే వాళ్ళందరి చిత్రాలలో లాగే మనదాంట్లో కూడా ఆత్మ ప్రత్యయములైన అభిమానాలూ, ఆలోచనలూ ప్రతిబింబిస్తాయి. అని నిజంగా మనచూపుకి మసక అద్దాలు కాక మానవే.”
“అంటే మనం మన నిజాయితీని కూడా అనుమానించుకోవలసిందే నంటారు.”
జానకి తల కదిలించింది.
“చూడు, నిజాయితీకి కొలబద్దలు ఏమన్నా వున్నాయంటావా? లేక కాళిదాసు దుష్యంతుడికిలాగా కొలబద్దలుగా ఉపయోగించగల నిజాయితీ కొందరికి మాత్రమే ఉంటుందంటావా?”
రామకృష్ణ కనుబొమలు ముడేశాడు.
“ఆ దుష్యంతుడు ఏం చెప్పాడో నాకు తెలియదు. ఒక ఫ్యూడల్ యుగపు కవి ఒక ఫ్యూడల్ ప్రభువు నోట ఏం చెప్పించివుంటాడో ఊహించగలను....”
“ఔనా మరి. మన ఆలోచనలు మనల్ని ఎలా తప్పుదారి పట్టించే అవకాశం వుందో చూడు. నువ్వు నన్ను, నేను నిన్ను ఇంతక్రితం చూడలేదు. ఆఖరుకి ఫోటోల్లో కూడా.”
రామకృష్ణ తల తిప్పేడు.
“ఏ వీధిలోనన్నా తారసపడితే, వీరు ఫలానా అని చెప్పుకోగల స్థితి మనకిద్దరికీ లేదు.”
రామకృష్ణ అంగీకరించేడు.
“కాని, ఇక్కడ మనకిద్దరికీ తెలిసింది. ఎలాగ? మీ అమ్మతో కలిసి మేమిద్దరం వస్తున్నామని నీకు తెలుసు. అలాగే నువ్వు వచ్చి ఇంట్లో వున్నానని నేనెరుగుదును. నన్ను మీ అమ్మతోగాక వేరే ఎక్కడో చూసి వుంటే, నిన్ను ఇక్కడగాక ఏ రోడ్డుమీదనో చూసి వుంటే....”
“గుర్తించలేము” అన్నాడు రామకృష్ణ.
“ఇంతక్రితం నా పలకరింపును మర్యాద పేరిట అబద్ధంగా వర్ణించావే, ఇప్పుడేమంటావు?”
“ఇదిలా జరుగుతే, అదలా జరుగుతే ననే తర్కం తప్పిస్తే, మీరు నన్ను, నన్ను మీరు గుర్తుపట్టగలిగేమన్న విషయంలో తేడా వుందా?”
“తర్కాన్ని ఒక్కొక్కప్పుడు విషయం సరిగ్గా అర్థం చేసుకునేందుకు బుద్ధిపూర్వకంగా ప్రవేశపెడతాం. కొన్ని సందర్భాలలో తెలియకుండానే తర్కభాగం పూర్తి అయిపోతుంది. ఇక్కడ జరిగిందదే. ఎందుచేత? మీ యింటి దగ్గరకు మేం వచ్చేసరికి ఇరవయ్యేళ్ళ కుర్రవాడు ఎవరు కనిపించినా రామకృష్ణ అనే అనుకోనా?....”
రామకృష్ణ నవ్వేడు, ఆమెకు సమాధానం ఇవ్వకుండా రవీంద్ర చెయ్యిపట్టుకొన్నాడు.
“నువ్వు రవీంద్రవు. దానికి తర్కం అక్కరలేదు. నీ ఫోటో సాధన దగ్గిర చూశా. నీ బొమ్మలన్నింటిని అనూరాధా, సాధనా చూపించేరు. చాల బాగున్నాయి. నువ్వు నిజమైన ప్రజాకళాకారుడివి.”
“అంటే?-“ అన్నాడు తెల్లబోయిన రవీంద్ర.
“అంటే బూర్జువా, ఫ్యూడల్, పిత్రుస్వామిక, ఆటవిక కళకారుడివి కాదు. నిజమైన విప్లవచిత్రకారుడివన్న మాట”-అని జానకి ఎగతాళి చేసింది.
రామకృష్ణ ఒక్క క్షణం మింగేసేలా చూసి వెళ్ళిపోయేడు. తన పొరపాటుకు జానకి నాలుక కరుచుకుంది.
రెండో ప్రకరణం
“మన జీవితాలు ఎక్కడో పట్టాలు తప్పాయి. ఎక్కడ తప్పేయో తెలియడం లేదు. కాని, తప్పిపోయాయి. తప్పేయి. నువ్వేమన్నా సలహా ఇవ్వగలవేమోననే నిన్ను తప్పకుండా తీసుకురమ్మన్నా. అవసరమైతే మళ్ళీ వెడుదువుగాని....”
అంటూ సత్యానందం ఇంటికి వస్తూనే జానకిని కూర్చోబెట్టేడు. ఒక్కక్షణం క్రితమే రామకృష్ణతోటి సంభాషణ చెమటలు పట్టించింది. చివరగా అతనిని వేళాకోళం చేసి వ్యవహారం పాడుచేశానని పశ్చాత్తాప పడుతున్న జానకి, సత్యానందం నిరుత్సాహానికి కూడా మూలం రామకృష్ణే అయివుంటాడనుకొంది.
“ఏం రామకృష్ణ వాదనలు వేసుకుంటున్నాడా?”
సత్యానందం చాలా నిరుత్సాహం కనబరచేడు.
“వాదనా? వాదనకి దిగుతే అదో అందం. ముందే తిట్టుబోతుతనంతో మన నోరు నొక్కడం. తర్వాత తన నిర్ణయాలు వినిపించడం. ఇందాకా నీతో ప్రారంభించినట్లే. అయితే కొత్తదానివీ, ప్రధమమూ గనక కొంచెం సందేహించేడు.”
“తిట్టుబోతుతనం?” అని జానకి ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తింది.
“వాడిప్పుడు ఉగ్రవిప్లవవాది. మనం అంతా పురుగుల్లాంటివాళ్ళం. ఎట్సెట్రా”-అని సత్యానందం మందహాసం చేశాడు.
“వస్తూనే వాడో పద్యం నాకిచ్చేడు.”
“ఏమిటది?”
సత్యానందం జేబులోంచి ఒక కాగితం మడతతీసి, జాగ్రత్తగా విప్పి, చేతికిచ్చేడు.
“మహా జాగ్రత్తగా వుంచేవే?” అంది.
“కాకపోతే ఎలాగ? తెలుగుదేశంలో భిన్నతరాల మధ్య ఏర్పడుతున్న అనుబంధాలకు అది అద్దంలా అనిపించింది.”
జానకి ఒక్కమారు పైనుంచి క్రిందికంటా చూపు సారించి “ఏమిటిది?” అంది.
“నంగిమాటల దొంగవంచకుడిని,
కొడుకుమీద గుత్తాధిపత్యం చేసే పెట్టుబడిదారుని,
ముందుచూపులేని గుడ్డిగవ్వని,
పేడపురుగుని, పెంటపురుగుని, విషక్రిమిని,
ధర్మరాజుగా చెలామణి అయ్యే రోజులింకలేవు.
నీ స్వేచ్ఛాసాహసాల్ని భస్మంచేసి
లొంగదీసుకునే ప్రయత్నం ఇకసాగదు.”
విశేషణాలు బదలాయించి చదువుతూ సత్యానందం గొంతుపట్టేసినట్టు టక్కున ఆగేడు.
“మీవాడు కవిత్వం వ్రాస్తాడన్నమాట.”
“వాడిది కాదు. వరంగలులో వాని నేస్తుడు ఎవరో వ్రాసేరట.”
“బాగుంది.”
“వాళ్ళమ్మకింకా తెలీదు. తనవాటా డబ్బు ఇచ్చెయ్యమని వచ్చేడు”
“-అంటే రివిజనిస్టుతో సంబంధం వుంచుకోడం ఇష్టంలేకనా?”
“ఆయుధాల కోసం....”
“ఉహూ.”
“అడవుల్లోకి పోతాడుట.”
“చదువు మానేశా....”
“ఇదివరకే మానేసి వుండకపోతే....మన విద్యావిధానం ఒక పెద్ద కుట్ర....” అన్నాడు.
జానకి మనసులో అనేక ప్రశ్నలు మెదిలేయి. తండ్రికీ కొడుక్కూ వైమనస్యాలు వచ్చి ఈరూపం తీసుకున్నాయా? అసలు కుర్రవాడు ఎలాటి వాడు? దుస్సాహసాలు పెరిగాయా? వాటికి ఈ అతివాదం ఒక ముసుగా? డబ్బుకోసం ఈ పద్ధతులనవలంబిస్తున్నాడేమో?
కాని, ఆ ప్రశ్నలేవీ పైకి అడగలేదు. తాను ఎంత ఆప్తురాలననుకున్నా, తానే సలహా చెప్పమంటూ ఆ ప్రస్తావన తెచ్చినా కొడుకును గురించి తండ్రి ఏం చెప్పగలడు?
“గట్టి ఉద్దేశంతోనే అన్నాడంటావా?”
సత్యానందం తల తిప్పేడు.
“చిన్నప్పుడు వుద్యమాలు, పార్టీలు, రాజకీయాలూ అంటే నాకూ, మిత్రులకీ ఎంత అభినివేశం, ఆవేశం వుండేదో ఈ వేళ వానిలో అంతకన్నా తీవ్రమైన ఆవేశం వుంది. తన పూర్వతరం మీద వానికున్న ద్వేషం, అసహ్యం మాకెప్పుడూ లేదేమో. మనందర్నీ గురించీ వాడి నిర్వచనం ఒక్కటే. ఫిక్సడ్ డిపాజిట్ల ఆదాయం మీద బ్రతుకుతున్నారు-అన్నాడు.”
జానకి ముఖాన చిరునవ్వు తోచింది.
“బాగుంది. మంచి ఉపమానం.”
సత్యానందం విస్తుపోయేడు. జానకి కూడా అలాగే అంటూందే!
“కాకినాడలో నా మరిదిని చూశా. ఆయనకూ ఈ అభిమానాలూ, అసహ్యాలూ ఇంత తీవ్రంగానూ వున్నట్లనిపించాయి. ఇక్కడ మీవాడు. నేనెరగను కాని, పోలీసులు చంపేసిన కేశవరావూ ఇంత తీవ్రం, తీండ్రం చూపేవాడట....”
“కుర్రవాళ్ళు. ఒళ్ళెరగని శివాలు. మార్క్సిస్టులు బండిని పెడదారికి పట్టించారు. ఆ బండి అగాధంలోకి ఈడ్చేస్తూంది.”
“బావా, బండి పెడదారి పట్టడంలో మన బాధ్యత అసలు లేదనుకోకు. అంతర్జాతీయంగా పరిస్ధితులు మారి శాంతియుత పద్ధతులలో కూడ సోషలిజం వచ్చే అవకాశాలున్నాయని నీ వాదం. గీపెట్టుకు చచ్చినా అది జరగదని వాళ్ళవాదం....పరమార్ధంలో కమ్యూనిస్టులా, మార్క్సిస్టులా వాదనలకి కీలకం అది.”
“అంతేలే. దానికి వ్యక్తిగత స్వార్థాలూ, అహంకారాలూ జతపడి గంద్రగోళపరిచాయి గాని....” అన్నాడు సత్యానందం.
“ఈవేళ మనం కుర్రవాళ్ళని నిందించవలసిన పనేమిటి? నిన్న ఏదో సందర్భం వచ్చి మా మరిదిగారు భార్యతో అంటున్నాడు. ‘ఈ వ్యవస్థకు శస్త్రచికిత్స చేసి, కొత్తవ్యవస్థను స్థాపించాలంటే త్యాగాలు, బలిదానాలు తప్పవు’ అంటున్నాడు. ఎవరిదో కవిత్వంలోంచి కాబోలు. ఆ చదివిన పద్ధతి అలా వుంది.”
సత్యానందం జ్ఞాపకం చేసుకొన్నాడు.
“రామకృష్ణా అన్నాడమ్మా! అటువంటిదే. చెప్తావుండు-‘నేను చిందించిన రక్తం ఈ సంధ్య, నేటి స్వప్నం రేపటి ఉషస్సు-అదీ” అన్నాడు.
“ఔనా! యువతరంలో రేగుతున్న మహోజ్వలమైన జ్వాల అది! కాని, రాజకీయపార్టీలు యువజనులు తేలిగ్గా బతికెయ్య చూస్తున్నారంటున్నాయి. మన పార్టీ యువతరాన్ని ఆకర్షించలేక పోతున్నదని మనం అందరం, ఇద్దరు కలుసుకున్నప్పుడల్లా గోలపెట్టడం మామూలైపోయింది. ఇప్పుడేమంటావు? వాడు బాగా చెప్పాడు. ఫిక్సడ్ డిపాజిట్ల మీద బ్రతుకుతున్నామన్నాడూ? బ్రహ్మాండంగా అన్నాడు....”
జానకి ఫక్కున నవ్వేసింది. సత్యానందం నుదురుకొట్టుకున్నాడు.
“కాని, దాని ఫలితం ఎంత భయంకరం? మన పిల్లలు తమకూ, దేశానికీ కూడా కాకుండా అయిపోతున్నారు. ఈ త్యాగాలు, ఈ ఆత్మార్పణలు నిష్ప్రయోజనం కావలసిందేనా? ఏమిటి దారి?”
జానకి “వాళ్ళని మార్చడం సులభం కాదు”-అంది.
“వాళ్ళకి చావు భయం లేదు. ఆస్తి మమకారం లేదు. దేశం బాగుపడాలనే మహదావేశం వుంది. కాని, వారు దారి తప్పేరు. తమ త్యాగాలు, సాహసాలు, దేశభక్తి కొరగాకుండా చేసుకొంటున్నారు. ఏం? ఎందుచేత? వాళ్ళ తండ్రులు ఎంతెంతో త్యాగాలు చేసినవాళ్ళే. ఎంతో అనుభవం వున్నవాళ్ళే. కాని, వీళ్లు అనుభవంలేని వాళ్ళలాగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? దానికి కారణం మనం!”
“మనమా?” అన్నాడు సత్యానందం విచారం, దిగ్భ్రమతో.
“మనమే. ఇంకా అనుమానమా? 1948-50 పోరాటాలు వ్యక్తి హింసావాదంగా దిగజారి శిథిలం అయాయి. కారణం ఏమిటి? ప్రజాపోరాటాలు వ్యక్తి దౌర్జన్యవాదంగా ఎందుకు మారినాయి? ఓ వంటబ్రాహ్మణ్ణో, ఓ గ్రామ కరణాన్నో, పటేలునో పెద్ద పధకం వేసుకొని చంపడం విప్లవకార్యం ఎందుకయింది? ఒక మహోద్యమంలో దౌర్జన్యాలు జరగడం వేరు. దౌర్జన్యాలనే వుద్యమంగా నడపడం వేరు. ప్రజావుద్యమాలలో వున్న ఈ కీలకాన్ని గురించి మనం చెప్పడానికి ఏం ప్రయత్నించేము? చెప్పు! ఈ విధంగా సిద్ధాంతజ్ఞానాన్ని మన తరువాతి తరానికి ఇవ్వలేదు. ప్రజాసంఘాలను నిర్మించడం కాగితాలకే పరిమితం చేశాం. మహా అయితే పార్టీలోని ముఠాల బలాబలాల ప్రదర్శనకు అవి రంగస్థలం అయాయి తప్ప మనం చేసిందేమిటి? తమరి నెదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యువతరం చేతికి నిర్మాణాల బలం యివ్వలేదు. మెదడుకు సిద్ధాంతాల పరిజ్ఞానం కలిగించలేదు. వాళ్ళు ప్రపంచాన్ని చూసేసరికి ఏం మిగిలింది? చిద్రుపలైన పార్టీలు. ఛాయామాత్రమైన అనుభవం. భయానకమైన తప్పుడు భావాల వారసత్వం. మనం వదిలిన కొస వాళ్లు అందుకొన్నారు. ప్రజాసంఘాలనవసరం. వ్యక్తిగత సాహసచర్యలతో విప్లవం. రెనే దెబ్రే పుస్తకం చదివేవా? గువేరా డైరీ చదివేవా? అవి వాళ్ళకి ప్రమాణ గ్రంధాలయాయంటే తప్పెవరిది? తప్పొప్పులు వేర్పరించుకోలేని స్థితికి వాళ్ళని వొదిలేశాం. బావా! తప్పు మనది. యువతరం నష్టపడింది. దాని బాధ్యతలో ఎవరిదెంత వాటాయన్న జిజ్ఞాస అనవసరం. ఏం చెయ్యాలో ఆలోచించాలి.”
సత్యానందం లేచి ఆందోళనగా అటూ, ఇటూ పచార్లు చేయడం ప్రారంభించేడు.
“రామకృష్ణ విషయం ఏం చెయ్యను?”
“మీ రామకృష్ణని దృష్టిలో పెట్టుకొని ఏమీ చెయ్యలేవు. నువ్వు మంచిదనుకున్న పని చేయి. అది నిజంగా ప్రజలకు సాయపడుతూందనే విశ్వాసం కలిగి, తమదారి తప్పు అనే పరిజ్ఞానం ఏర్పడితే తప్ప యువజనం తిరిగి చూడదు....”
“ఈలోపున?....”
“ఈ ఇరవయి పాతికేళ్ళ అవజ్ఞతకి మూల్యం చెల్లిస్తాం. మనం ప్రజల విషయంలో ద్రోహమే చేసేమంటే కోపం వస్తూందా? నిజంగా మనం చేసిన దాని ఫలితం అదే. దానికెంతో మూల్యం చెల్లించాలి. ఇంకా అది పూర్తికాలేదు. ఒకతరం జనాన్ని పోగొట్టుకొన్నాం. ఇప్పటికేనా కళ్ళు తెరుస్తామా?....”
సత్యానందం తల చేతబట్టుకొని కూలబడ్డాడు....”అయ్యో!”
మూడో ప్రకరణం
తూర్పు కోస్తా బహు తీవ్రమైన తుపాను దెబ్బకి అల్లల్లాడి పోతూంది.
ధారాపాతంగా వర్షం, చెట్లని మెలితిప్పేస్తున్న గాలి. తలుపులు బిగించి లోపల కూర్చున్నా ప్రకృతి విజృంభణకు ఇళ్ళే కదిలిపోతూన్నట్లనిపిస్తూంది. రామకృష్ణకి మంచం దిగాలని కూడా అనిపించడంలేదు. వెంటిలేటర్లలోంచి పడుతున్న వెలుతురు చూస్తే తెల్లవారినట్లుగా వుంది. కాని మబ్బుల్లో ఎంత పొద్దుపోయిందీ తెలియడం లేదు. గాలి హోరు, వాన హోరులో యింట్లో ఎవరన్నా లేచేరో లేదో కూడా తెలియడం లేదు. ఒక్క నిముషం లేచి కూర్చుని, మళ్ళీ పడుకుంటూండగా తల్లి గొంతుక వినిపించింది.
“ఏరా?”
కంఠస్వరం కొత్తగా వినిపించి రామకృష్ణ వులికిపడ్డాడు. “ఊ” అంటూ దుప్పటి సడలించకుండానే మంచం మీద సర్దుకొన్నాడు.
“ఏం ఇంకా లేవలేదూ?”
“రాత్రి గాలికి నిద్రపట్టలేదమ్మా!”
“ఇనప్పెట్టె లాంటి ఇంట్లో పరుపులూ, దిండ్లూ మధ్య పవ్వళించేవు. బయట గాలీ, వానగా వుంది గనక నీకు నిద్ర పట్టలేదు. కదూ.”
“గాలికి ఇల్లే వూగిపోతూంటేను?”
“ఈ వన్నెవాడివి అడవుల్లో, దారీతెన్నూ లేని పుంతల్లో, తిండీ తిప్పలూ లేకుండా పోలీసాళ్ళు ఏ మూలనుంచి వస్తున్నారోయని కాపలా కాచుకుంటూ ఒక్కరోజన్నా నిలబడగలనని ఎల్లా అనుకొన్నావోయ్.”
తన రాక ఏమిటో, ఎందుకో తండ్రి ఆమెకు చెప్పేసేడన్న మాట. చెప్పకుండా వుంటాడని తానూ అనుకోలేదు. ఆ మాటవింటే ఆమె ఏడుస్తుంది. బ్రతిమాలుతుంది-అని అతని అంచనా. ఆమె ఏడ్పును చూడలేడు. తనకీ ఏడుపు వచ్చేస్తుంది. అల్లాంటి పరిస్థితిని ఎదుర్కోలేకనే అతడు ఇంటికి రావడానికీ, తండ్రిని డబ్బు అడగడానికీ తటపటాయించేడు. కాని, ఇంక ఆలస్యం అయిపోతూంది. పళ్ళ బిగువు మీద వచ్చేడు. తల్లి వూళ్ళోలేదు. సంతోషం కలిగింది. తండ్రితో జగడం వేసుకొన్నాడు. లేకపోతే ఈ బంధాలనుంచి బయటపడడం సాధ్యమయ్యేలా కనిపించలేదు. రాజకీయాలలో తేలిక చేశాక, ఆయన జీవితాన్నే వెక్కిరించడం, ఆయన నడవడికను యద్దేవా చెయ్యడం, ఆయననే తుస్కారించడం కష్టం కాలేదు. కాని, తండ్రిలాగ తల్లి వాదన వేసుకోదు. ఏడుస్తుంది. ఆమెను అపహాస్యం చేసేందుకు ఆమెకు రాజకీయాలు లేవు. ప్రేమగా బ్రతిమలాడుతుంది. ఆవిడ ఆయుధాలు భిన్నం. వాటిని ఎదుర్కోడం గురించి తెల్లవార్లూ ఆలోచిస్తూనే వున్నాడు. ఏమీ తోచలేదు. మెండితనంగా భరించి, తోసుకుపోవడం తప్ప మరి దారి లేదనుకున్నాడు. కాని, తీరా చూస్తే ఆమె ధోరణి తాను భయపడినట్లుగా లేదు. వాదనలోకి వెడితే అది తనకు అనువైన మార్గమే. అందుచేత దుప్పటి కూడా తియ్యకుండానే ఆమె దాడిని ఎగతాళిలో తోసెయ్యబోయేడు.
“కించిద్భోగం భవిష్యతి-అన్నారు కదమ్మా!”
ఈమారు తల్లి నిజంగా నెత్తిన పెద్ద బాంబే పడేసింది.
“సరస్వతితో సరాగాలు కూడా కించిద్భోగంలో భాగమేనా?”
రామకృష్ణ ముసుగు లోపలనే నీరు విడిచిపోయేడు. నిజానికి సరస్వతి తన భార్య. తమ చదువుల మూలంగా ఆగేరు. తమ ప్రయత్నాలు గురించి ఆమెతో చెప్పాలనే ఆలోచనతోనే ఆమెను అగ్రహారం రమ్మని రాసేడు. వచ్చింది. తల్లిలేని అవకాశం తీసుకొని, ఆడపిల్లల్ని క్రిందికి పొమ్మని మేడ స్వాధీనంలో వుంచుకొని ఆమెతో ఈ రెండురోజులు మంతనాలు సాగించేడు. ఆ మంతనాలకు ముందు అతడు ఏ నిర్ణయాలు చేసుకొన్నా, ఆమె ఎదుట అవి నిలబడలేదు. అవి ఎవ్వరికీ తెలియలేదని అతని విశ్వాసం. ఇప్పుడు తల్లి ఆ ప్రసక్తి తెచ్చేసరికి గుండెలు ఆగిపోయినట్లయింది. మాట్లాడలేదు.
భద్ర వదలలేదు. ఝణంఝణ లాడించసాగింది.
“ఎవరు మీ నాయకుడు? కోయల్నీ కొండవాళ్ళనీ పట్టివుంచి, ఏకంచేసి నిలపడంకోసం అతడు నాలుగు తెగలనుంచి పెళ్ళాల్ని చేసుకొన్నాడుట! ఈమధ్య అయిదోదాన్ని కూడా కట్టుకొన్నాడని పత్రికల్లో చదివాం.”
పత్రికలనేసరికి రామకృష్ణకి వెర్రికోపం వచ్చింది. దుప్పటి తన్నేసి లేచేడు.
“బూర్జువా, ప్రజాద్రోహి, అభివృద్ధి నిరోధక, రొచ్చుగుంట పత్రికల మాటలు నమ్మకూడదమ్మా!”
“నమ్మకూడనిదేది? అయిదోపెళ్లి మాటా? మొదటి నాలుగూ కూడానా? కాక, అసలు అతడే అబద్ధమా?....”
భద్ర కుర్చీ లాక్కుని కూర్చుంటూ, ఆ సదసత్సంశయం తెల్చుకోదలచుకొన్నట్లు డుబాయిస్తూంటే రామకృష్ణ తెల్లబోయేడు.
“ఏం మాట్లాడవు?....” అని భద్ర గద్దించింది.
“నేనెప్పుడూ ఆలోచించలేదు”-అన్నాడు పిల్లిలా.
“ఇంక ఏమిట్రా నువ్వు ఆలోచించింది? అడువుల్లోకి నువ్వేనా వెళ్ళడం, లేక దేశాన్నంతనీ అడవులకి పట్టిద్దామనుకున్నావా? మీ నాయకత్వం సంఘాన్ని ఎక్కడికి తీసుకెడుతుంది? మీరు అసహ్యించుకుని విషం కక్కే బూర్జువా, ఫ్యూడల్ యుగాలకి కూడా కాదు. ఇంకా వెనక్కి. సెల్యూకసు కూతుర్ని చంద్రగుప్తుడు పెళ్లి చేసుకొన్నాడు. గజపతిరాజుల కూతుర్ని కృష్ణదేవరాయలు చేసుకొన్నాడు. బహు భార్యత్వమే కాదు. ఆడుదాని ద్వేషం కూడా వాళ్ళకి పాటింపు కాకపోయింది. ఈనాటి పడుచు వాళ్లు ప్రేమా, పెళ్లీ అంటున్నారు....”
“నేనేమన్నానమ్మా!....” అన్నాడు రామకృష్ణ సమాధాన పరిచే ప్రయత్నంలో.
“ప్రేమించేను. పెళ్లి చేసుకొంటానన్నావు. మేమంతా సంతోషించాం.”
“మరి?”
“ఇదేమిటి? అడవుల్లోకి పోతానంటూ నీకు మళ్లీ ప్రేమ-పెళ్ళి ఏమిటి? ఎందుకు? దాని గొంతు కొయ్యడానికా? లేకపోతే మీ నాయకుడిలా ఇక్కడొకర్నీ అక్కడొకర్నీ కట్టుకొని మైదానాలకీ పర్వత ప్రాంతాలకీ వారధి కడదామనా?”
రామకృష్ణకి మాట తోచడం లేదు. తన మనస్సులోనిది పూర్తిగా చెప్పడం ఇష్టంలేదు. ఏం చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో అర్థం కావడంలేదు.
“బహు భార్యత్వాన్ని ఆఖరుకి చట్టం కూడా నిషేధించింది. అది బూర్జువా ప్రభుత్వం చేసిన చట్టం గనక ధిక్కరించాలా? కుళ్ళిపోయిన, కుష్టు సమాజంలోని ఆచారం గనక నిరాకరించాలా? విప్లవానికి అవసరమైతే ఆ శ్రీకృష్ణపరమాత్మ కాలం నాటికి సర్దుకొన్నా ఫర్వాలేదా?....”
తానూ, తన మిత్రులూ ఎవ్వరూ కూడ ఆ వార్తలో వున్న గుంట చిక్కుల్ని గురించి ఆలోచించలేదు. ఒక విధంగా నలుగురు పెళ్ళాల్ని చక్కబెడుతున్న అతని మగటిమిని మెచ్చుకొన్నారేమో కూడా. అతడు పార్టీలో ఎటువంటి నాయకుడో తాము ఎరగరు. గెరిల్లా యుద్ధపు అవసరాలు కొత్త నాయకత్వాన్ని, కొత్త నిర్మాణాన్ని తెస్తాయన్నాడు రెనేదెబ్రే. ఇప్పుడు తల్లి మరో ప్రశ్నను తెస్తూంది. సామాజిక లక్ష్యాలు కూడా మారుతాయా?
ఆ ఆలోచనలలో తల్లి తన సమాధానం కోసం కాచుకొని వున్నదని కూడా మరిచేడు. కాని, ఆమె వదలలేదు.
“ఏం మాట్లాడవు?” అని గర్జించింది.
“ఏం చెప్పమంటావు?”
“ఏమిటా? మిమ్మల్ని పెళ్లి చేసేసుకోమన్నాం. చదువులు కావాలన్నారు. సరేనన్నాం. ఇప్పుడు త్యాగం చెయ్యడానికి అడవుల్లోకి పోతానంటూ ఆ అమ్మాయిని రప్పించి, ఇక్కడ కాపురం ప్రారంభించడంలో ఏమిటి నీ వుద్దేశం?”
“మాట్లాడుకోడం కూడా పనికిరాదా?” అన్నాడు, రామకృష్ణ మొండిగా.
మనస్సులో రగులుతున్న కోపాన్ని భద్ర అణుచుకొన్నా, అతని మొండి సమాధానానికి ఏ రూపంలో సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు. తల్లినోరు నొక్కగలిగిన ధైర్యంతో రామకృష్ణ మరో అడుగు ముందుకు వేసేడు.
“నీకెవరు చెప్పారో, వట్టి కల్పనలు. మేమంత నిగ్రహం లేని వాళ్ళమా?....”
ఇంకా అతడెటువంటి ధీమా, దబాయింపూ చూపగలిగేవాడో, కాని భద్ర భగ్గుమంది.
“సరస్వతీ!”
ఆ పిలుపు కోసమే, గుమ్మం వెలుపల నిలబడి వుందోయేమో, ఆ పిలుపు గొంతులో వుండగనే సరస్వతి గదిలోకి వచ్చింది. భద్ర కుర్చీ వెనుక తల వంచుకొని నిలబడింది.
ఆమె రాకతో అతనికి పరిస్థితి అర్థం అయిందనిపించింది. ఇంకా ఏం చెప్పింది? ఎంతవరకు చెప్పింది? పోలీసువాడికేనా ఇలా చెప్పేసే మనిషే కదా అనిపించింది. “ఇంత బలహీనురాలా తనకి పెళ్లాం?” అనిపించింది. కోపం వచ్చింది. మంచం మీద నుంచి వురుకుతున్నట్లు గమ్మున జరిగి, కాళ్ళు క్రిందకి వ్రేలాడేసుక్కూర్చుని ముందుకు వంగేడు.
“నువ్వే చెప్పావా?”
సరస్వతి కంగారుపడింది.
“వారికి అన్నీ తెలిసిపోయాయి.”
భద్ర మధ్యవుండి అతని చూపుల తీవ్రతకి తల పంకించింది.
“వీడూ....నువ్వు ఎన్నుకొన్న మగడు! ఒక్కక్షణం క్రితం సర్వం మిధ్య అన్నాడు. ఈ క్షణంలో డబాయిస్తున్నాడు. కళ్ళెర్ర జేస్తున్నాడు. అభాజనుడు....” అని భద్ర కుర్చీలోంచి లేచింది.
అదివరకు తాను చేసింది తప్పో ఒప్పో కాని, ఇప్పుడు చేసింది మాత్రం గొప్ప తప్పు అని రామకృష్ణ గ్రహించేడు. తల్లిని శాంతపరచడం తక్షణావసరం. అంతకన్న ముఖ్యావసరం సరస్వతి మంచితనాన్ని కాపాడుకోవడం. నూతన రాజకీయాలు గతాన్నంతనూ తుడిచి పెట్టేద్దామంటున్నాయి. పెళ్ళి అనేది కొత్తదా, పాతదా? ఏ రూపంలో? అవన్నీ ఆలోచించుకోవలసి వుంటుందనుకోలేదు. ఇప్పుడా వ్యవధి లేదు. చటుక్కున సర్దుకొన్నాడు.
“హఠాత్తుగా అడుగుతే, ఏం చెప్పాలో తెలియక....”
“అప్పుడేరా, మన అంతరంగం బయటపడేది. అప్పుడే నువ్వు ఏం మనిషివో, ఎటువంటివాడివో....” ఒక్క విదిలింపుతో అతనిని పక్కకు పెట్టింది.
“నువ్వు పెద్దచదువు చదువుతున్నావు. మంచిచెడ్డలు ఎరుగుదువు. కాని ఆడపిల్లవు. వీడు నా కొడుకే అయినా జాగ్రత్త. పెళ్ళిచేసుకోండి వెంటనే....” అంది.
సరస్వతి తల వొంచుకొంది.
“రిజిస్టర్డు పెళ్ళి చేసుకొని ఆరునెలలయిందండి.”
“ఔనమ్మా!” అన్నాడు, ప్రాధేయపూర్వకంగా రామకృష్ణ.
భద్ర తెల్లబోయింది. ఒకవిధంగా ఇంతవరకూ మనస్సును వేధిస్తున్న చింతతీరింది. కాని, అదివరకు లేని కొత్త బాధ కలిగింది. తమ అంగీకారం వున్నా, తమకు తెలియకుండా పెళ్ళి చేసుకోడం ఎందుకు? తమరిని ఖిన్నపరచడం నూతన రాజకీయాలలో భాగమా? భద్ర ఒక్క క్షణం వూరుకుంది.
ఆమె వెనుకనుంచి సరస్వతి ఏదో సంజ్ఞ చేస్తూంది. కాని, రామకృష్ణకు అది అర్థం కాలేదు. చేసేది లేక సరస్వతే ముందుకు వచ్చింది.
“నాదేనండి తప్పు. నా పట్టుదలేనండి.”
ఆమె మాటలు వినిపించుకోనట్టు భద్ర కొడుకును అడిగింది....
“అడవులకి పోయే ఆలోచన కొత్తగా పుట్టిందా?” అంది.
“ఇద్దరం కలిసి వెళ్ళిపోవాలనేనమ్మా!”
భద్రకు దుఃఖం ఆగలేదు. గబగబా గదిలోంచి నిష్కృమించింది. వెనక వస్తున్న కొడుకునూ, కోడలినీ చేయి విదిలింపుతో వారించి, తలుపులు ‘ఛట్టు’నవేసి వెళ్ళిపోయింది.
సరస్వతి భర్తను కోప్పడింది.
“మామూలుగా జరిగిపోయేవాటికి పెద్ద పెద్ద మాటలతో మెలికలు వెయ్యడం, సాఫీగా జరిగే వానిని గొడవలోకి తేవడం ఎందుకంటే విన్నారు కాదు. చూడండి. అనవసర విప్లవంతో ఎంత రభస తెచ్చారో.”
క్రిందనుంచి పిలుపు వినబడి ఇద్దరూ ఆలకించారు.
“రామకృష్ణా! సరస్వతీ! రవీ!”
సరస్వతి గుమ్మంవేపు కదులుతూ.
“రాండి”-అంది. “జానకమ్మగారు!”
నాలుగో ప్రకరణం
రాత్రి తెల్లవార్లూ పెనుగాలి, కుంభవృష్టి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తగ్గుతున్నట్లనిపించి సత్యానందం వీధి తలుపు తెరిచాడు.
ఝుమ్మున గాలి అతని చేతుల నుంచి లాక్కుని తలుపుల్ని గోడకేసి కొట్టింది. విసురుకు వర్షపుజల్లు వరండా దాటి సావట్లోకంటా వచ్చేసింది.
మబ్బులు మూసుకొని వున్నా వీధంతా తెరిపిగా కనిపించింది. వాకిట్లో వున్న పువ్వుల మొక్కలు ఒక్క ఆకు లేకుండా దుళ్లిపోయి నేలనంటుకుపోయాయి. కొమ్మలు విరిగి దొడ్డి అంతా దొర్లుతున్నాయి. వీధిలోవున్న కొబ్బరిచెట్ల తలలు వడేసి మెలి తిప్పినట్లు, విరిగిపోయి వ్రేలాడుతున్నాయి. వాని మొవ్వుటాకులు కూడా నిల్చుని లేవు. చాల ఆకులు చిరిగిపోయి మానుచుట్టూ రాచుకొంటూ వ్రేలబడి వున్నాయి.
ఇంటికి ఎదురుగా వున్న పెంకుటింటి మీద పెంకులు జారిపోయాయి. పెణకలు విరిగిపోయాయి.
అది చూసేక హరిజనపేట మాట గుర్తు వచ్చింది. పడుకోబోయేటప్పుడు అనుకొన్నారు, వాళ్ళని గురించి.
ఆమాట తోచగానే మనస్సు కలకవేసింది-“పేటవాళ్లు ఏమయిపోయేరో....”
ఇనప్పెట్టెలా వున్న తమ యిల్లు ఈకాడికి వచ్చింది. హరిజనపేటలు నామరూపాలు మిగిలాయా? ఆడాళ్లు, ముసిలాళ్లు, పిల్లలు, ఏమయ్యారో....
ఒక్కక్షణం ఆగలేకపోయేడు. రాత్రే ఎందుకు వాళ్ల సంగతి చూడలేదనిపించింది. అందులో పంచాయతీబోర్డు అధ్యక్షుడుగా కాడా తనకు ఆ బాధ్యత వుంది. అంతకన్న అధికం కమ్యూనిస్టుగా. తన అశక్తతకి సిగ్గుపడ్డాడు.
జానకి చెప్పినట్లు కుర్రాళ్లు తిట్టేరంటే ఆశ్చర్యమేముందని తన్ను కించపరుచుకొన్నాడు.
“మెత్తదనం, మెత్తదనం” అనుకున్నాడు.
భార్యని కేకేసేడు. వంటింట్లో వున్నదేమో ఆమెకు మాట వినిపించలేదు. జానకి వచ్చింది.
“ఏం బావా?”
“వీధి తలుపు వేసుకోండి.నేనల్లా పల్లేకేసి పోయొస్తా. ఒక్క యిల్లు కూడా వుండేలా లేదు. అంతా ఏమయ్యారో.”
ఆ మాట తమకందరకూ రాత్రే తోచింది. కాని, ఆ చీకట్లో, గాలిలో, వర్షంలో వెళ్ళడం సాధ్యం కాదనిపించింది. చెట్లు కూలుతున్నాయి. నీటికి మెరకలూ, పల్లాలూ సరిసమానం అయిపోయాయి. చలి. జాలిపడ్డారు. ఇరవయ్యేళ్ళ పరిపాలన అనంతరం కూడా దేశాన్ని ఆ స్థితిలోనే వుంచిన కాంగ్రెసును తిట్టుకొన్నారు. తమ అసమర్థతను చూసి మనస్సులోనే గుంజాటన పడ్డారు. అంతే. వూరుకున్నారు.
“నడు, నేనూ వస్తున్నా” నంది.
“ఈ గాలీ, వర్షంలో నువ్వెందుకుగాని, నువ్వూ భద్రా ఇంత గంజేనా కాచండి. అవసరం కావచ్చు.”
ఆ మాటా నిజమే అనిపించింది.
“అయితే కుర్రాళ్ళని తీసుకెళ్ళు”
కుర్రవాళ్ళని సుఖంగా పడుకోనివ్వక గాలీ వానలో కష్టపెడతామా అనిపించింది.
“ఎందుకులే, పడుకున్నారు పడుకోనీ....”
కాని, జానకి ఒప్పుకోలేదు.
“ఇల్లా దయతలచే కుర్రాళ్లని పాడుచేస్తున్నాం.” అంది.
“రామకృష్ణా! రవీ!” అని పిలుస్తూ లోపలికి వెళ్ళింది.
ఆమె ఆలోచన మంచిదేననిపించి వరండాలోకి వేసిన కాలు వెనక్కి తీసుకొని, సత్యానందం వెనక్కి జరిగేడు.
అయిదో ప్రకరణం
వాళ్ళు ముగ్గురూ గుమ్మంలోకి వెళ్లబోతూండగానే, గేటు తలుపులు తీసుకొని ఎవరో వెనకనుంచి నెట్టుకుని వస్తున్నట్టు డాక్టరు రంగనాయకులు తూలిపోతూ వరండాలోకి వచ్చేసేడు. వస్తూనే ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే క్షమార్పణ వినిపించేడు.
“క్షమించాలి. సత్యానందంగారూ! మిమ్మల్నడక్కుండా....”
అతని స్ధితి చూసి సత్యానందం తనను అడక్కుండా చేసిన అపరాధం గురించి ఆసక్తి కనబరచలేదు.
“ఈ గాలీ వర్షంలో ఎక్కడినుంచి వస్తున్నావు! ఆ బట్టలేమిటి? వళ్ళంతా బురదేమిటి? క్షమించమని అడగడానికి ఇంత తుపాను వేళ....”
జానకి కోసం వెనుతిరిగి చూసేడు. వీధిలోకి బయలుదేరుతున్న వారికోసం కాఫీలు తీసుకొని ఆమె వస్తూంది. సత్యానందం రంగనాయకులును కూర్చోబెట్టి ఒక కప్పు చేతికిచ్చేడు.
“ముందిది త్రాగు. తరవాత చెప్పు.”
రంగనాయకులు తాను వచ్చిన పని చెప్పబోవడం, సత్యానందం గద్దించి కాఫీ గుర్తుచేయడంతో మరి వూరుకొన్నాడు. కాఫీ త్రాగి కప్పు క్రిందపెట్టేడు.
“ధేంక్సు.”
“ఇప్పుడు చెప్పు. నాకు నువ్వేం అపకారం చేసేవో, ఎందుకు ఆ క్షమార్పణ చెప్పుకోవలసి వచ్చిందో?”
“మీకుగాని, హెడ్మాస్టరుకుగాని చెప్పకుండా హైస్కూలు బిల్డింగు తాళాలు బద్దలు కొట్టేశాను....”