“అది ఆమె పేరిటే వుండి వుంటుంది.”
“సహజం. తీర్చవలసిందీ, సంపాదనపరురాలూ అదే కదా” అని భద్ర అందించింది.
కుమారస్వామి మరో విషయం ఆలోచించేడు.
“ఎంత ఇవ్వవలసి వస్తుందో తెలుసుకో. డబ్బు ఒకేమారు కట్టేస్తే వడ్డీ వుండదు గనుక తగ్గుతుంది. ఇల్లు ఇచ్చేస్తారు. అది కుర్రవాడికి వ్రాసేస్తాను.”
భద్ర మొదటి భాగానికి సంతోషించినా, చివరి చేర్పు విని తెల్లబోయింది.
“అంటే....”
“నేను కుర్రవానికి యివ్వాలనుకుంటున్నా. నువ్వు మాట్లాడి చూడు.”
“నేను అలాంటి మాటలకి పనికిరాను. కొడుకుల మీద మనకున్న ప్రేమ అందరికీ వుండదు. అదలా వ్రాయదు. నన్నే అడిగితే వద్దని చెప్తా.”
కుమారస్వామికి ఆ మాట చాల తీవ్రంగా తగిలినా విచలితుడు కాలేదు. ప్రశాంతంగా అన్నాడు.
“కుర్రవానికి నేనిచ్చేది స్థిరాస్తిగా వుండాలి. నేనే చెప్తా.”
“దానిని అవమానం చెయ్యకండి. అది చాలా అభిమానస్తురాలు.”
“ఇది అవమానమైతే అభిమానమెలా వుంటుందో? కుర్రవానికి పాతికవేలు రాకుండా అడ్డుపడడం అభిమానం అనిపించుకుంటుందా?”
“మన నిఘంటువులు వేరు.”
పదకొండో ప్రకరణం
గుమ్మంలో కారు ఆగిన చప్పుడు విని రవీంద్ర కిటికీలోంచి తొంగి చూసేడు. తాతగారి కారు. కుమారస్వామి దిగడానికి వీలుగా డ్రైవరు తలుపు తీసి పట్టుకు నిల్చుని వున్నాడు. రవి గబగబ యోదురు వెళ్ళేడు.
కారులోంచి కాలు క్రిందబెడుతూ కుమారస్వామి అడిగేడు: “బాబయ్య లేడా?”
“మీ కోసం ఇప్పటిదాకా చూసి, ఇప్పుడే యెవరో స్నేహితులు వచ్చి పిలుస్తే అలా వెళ్లేరు.”
మనమని భుజం మీద ఒక చెయ్యివేసి, రెండో చేతిలోని చేతికర్ర నేలని ఆనించి కుమారస్వామి బహుదర్పంగా ఇంటివేపు అడుగు పెట్టేడు.
సూర్యకాంతమ్మ కారు దిగడానికి జాప్యం చేస్తూంది. తమ కారు వచ్చేసరికి కోడలు వచ్చి స్వాగతం పలకాలి. రాజామణి ఆ అభిమానాన్ని ఇంతవరకూ పాటించింది. కాని, ఈవేళ రాలేదు. జానకి ఈ యింట్లో వుంది. ఆమె యెదుట రాజామణి ఇంకాస్త అణకువగా మర్యాద చేయాలనేది ఆమె ఆశ. కాని, తీరా వచ్చేసరికి మామూలు మర్యాద కూడా కరువైంది.
నడుస్తున్న రవీంద్ర నిలబడి నాయనమ్మ ఇంకా కారు దిగనే లేదని గమనించేడు.
“నాయనమ్మగారు!” అన్నాడు.
తన నిరీక్షణ నిరుపయోగం అని గ్రహించిన సూర్యకాంతమ్మ తానే కారు దిగింది. డ్రైవర్‌కి ఏదో పని పురమాయిస్తున్నట్లు నటిస్తూ ‘పదండి. వస్తున్నా’ నంది.
“రమణి అత్తయ్య ఏరి? రాలేదా?” అన్నాడు రవీంద్ర.
“మీ ఇద్దరికీ దోస్తీ బాగా కలిసిందిలా వుంది” అంటూ మీసాలలోనే నవ్వుకొన్నాడు, కుమారస్వామి.
“ఆమె చాలా మంచిది.”
కుమారస్వామి ఈ మారు పైకే నవ్వేడు.
“మిగిలిన వాళ్ళెవరూ నీకు నచ్చలేదన్నమాట.”
ఆ వ్యాఖ్యానానికి రవీంద్ర కంగారు పడ్డాడు. సిగ్గుపడ్డాడు. ‘అదేం కాదండి’ అన్నాడు.
కుమారస్వామి మనమని వీపు తట్టి దిలాసా యిచ్చేడు.
“తమాషాకు అన్నాను. భద్రా, అదీ మీ చిన్నత్తగారింటికి వెళ్ళేరు. ఓ పావుగంటలో వస్తారు.”
ఇద్దరూ నెమ్మదిగా సావిట్లోకి వచ్చారు. తాత అందించిన కర్ర గోడకి జేరవేసి, కండువా మడతకుర్చీ వీపున వేసి రవీంద్ర ఉపచారం చేస్తూంటే కుమారస్వామి శరీరాన్ని భారంగా పడకకుర్చీలోకి దింపేడు.
“రామయ్య తండ్రీ.”
తాతగారి సేవ ముగించి ఈమారు రవీంద్ర నాయనమ్మ వేపు తిరిగేడు.
“అమ్మా, పిన్నిగారూ లోపల వున్నారు. రాండి” అని అటు దారితీసేడు.
“వస్తున్నా కాదటోయ్” అంది సూర్యకాంతమ్మ.
తెలుగులో సర్వసమ్మేళనల నిశ్చితార్థం తెలియకపోయినా, నాయనమ్మ స్వరంలో ఏదో విలక్షణత తోచి రవీంద్ర గతుక్కుమన్నాడు.
అసలు యింటికి కొంచెం విడిగా వున్న వంట యింట్లోంచి జానకి కంఠం వినిపించింది.
“తాతయ్యగారూ నాయనమ్మగారూ వచ్చేరా? లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టు.”
ఆమె చేతిలో పని వుంది. అది పూర్తి చేయకపోతే పాడయిపోతుంది.
ఆమె మాట పూర్తిగాక పూర్వమే వెనక వేపున రవి గొంతు వినిపించింది.
“నాయనమ్మగారు వచ్చేరమ్మా!”
జానకి పని మధ్యలో ఒక్క క్షణం వెనక్కి తిరిగింది.
“వచ్చేరా? కూర్చోండి....ఆ పీట అలా వెయ్యరా నాన్నా!”
“వంట నీకు వప్పజెప్పి ఆవిడగారు యెక్కడికి వెళ్ళిందీ?” అంది సూర్యకాంతమ్మ.
ఇక్కడా కంఠస్వరమే పట్టియిచ్చి, జానకి తెల్లబోయింది.
“మన వంట పనికిరాదో ఏమో కర్మ” అనుకొంది. చెప్పనేనా చెప్పిందికాదే అనుకొని పైకి మాత్రం సర్దుబాటుగా అంది.
“పిల్లలకి నీళ్లు పోస్తున్నారు. వస్తారు.”
“ఇదో దురలవాటు. కూలీనాలీ చేసుకొనేవాళ్ళ యింటికి బంధువులు వస్తే, వాళ్ళూ వేతలకీ, కోతలకీ పోవాలట! ఏం మర్యాద పని!” అని కోప్పడింది.
జానకి చిరునవ్వుతో అంది.
“కూలివాడింటికి జమీందార్లు రారుకదా. వచ్చేవాళ్ళూ కూలివాళ్ళే అయివుంటారు. అందులో అమర్యాద యెవరికి?”
సూర్యకాంతమ్మ తెల్లబోయింది. ఆమె ధోరణిని కనిపెడుతున్న జానకి పొయ్యి దగ్గర నుంచి తిరక్కుండానే కొడుక్కు పని వప్పచెప్పింది. ఆడవాళ్ళ చెండాటలో అతని ప్రమేయం వుండకూడదు.
“తాతయ్యగారికి మంచినీళ్ళు కావాలేమో తెలుసుకో. కూర్చుని కబుర్లు చెప్తూండు. చేతిలో పని కాగానే నేనూ వస్తున్నా.”
“అలాగేనమ్మా” అంటూ రవీంద్ర గ్లాసులూ, జగ్గూ తీసుకొని సావిట్లోకి వెళ్ళిపోయేడు.
“చెప్పినట్టల్లా వింటున్నాడు. బాగానే తయారు చేశావు.”
అది మెచ్చుకోలో వెక్కిరింతో స్వరంపట్టి అర్థం కాలేదు.
“తయారీకేముంది! మనం మంచిగా వుంటే వాళ్ళూ వుంటారు. మనం ప్రేమగా వుంటే దగ్గరవుతారు. దులపరించుకొంటే దూరం అవుతారు.”
అతి సామాన్యంగా వున్న ఆ మాటలోకూడ తన జీవితాన్ని వెక్కిరించినట్లయి సూర్యకాంతమ్మ రవిలిపోయింది.
“మావాడు మాకు దూరం అయింది, మేము దులపరించుకోడం చేతనే అంటావు?” అనేసింది, పట్టలేక.
తనమాట సరాసరి తగిలిందని గ్రహించేక ప్రత్యర్ధి ముఖం ఎట్లుందో చూడాలనే కాంక్షను అతి నిగ్రహం మీద జానకి అణుచుకొంది. కాని సమాధానం ఇవ్వలేదు. వినిపించుకోనట్లూరుకుంది.
సూర్యకాంతమ్మ తన ప్రశ్నకు సమాధానం రాకపోవడం తృప్తిగాలేదు.
“ఏం అడిగితే మాట్లాడవేం....” అని గద్దించింది.
జానకి ఆమె గద్దింపు విననట్లు వెనక్కు తిరిగింది.
“అదేమిటి నిలబడే వున్నారా?” అంది మాట మారుస్తూ.
“ఎంత నాటకం ఆడుతున్నావే, నీ మొహంమండా” అని తిట్టుకొన్నా పైకి ఏమీ అనలేకపోయింది. తన మాటపైన మిగలనందుకు మనస్సులో రవరవలాడిపోయింది.
అవకాశం చూసుకొని, మగనితో చెప్పుకోనిదే ఆ కోపం చల్లారనూ లేదు.
“మహా పొగరుబోతు-“ అంది.
ఏదో జరిగిందని కుమారస్వామి గ్రహించేడు.
“ఏమయింది?”
ఈమారు స్వరసమ్మేళనలు లేకుండా పుస్తకపాఠంలా తమ మధ్య జరిగిన సంభాషణను చెప్పింది. భార్య స్వభావం ఎరిగిన కుమారస్వామి జరిగిన విషయం ఇంచుమించుగా వూహించడం కష్టం కాదు. అంతా విని నవ్వేడు.
సూర్యకాంతమ్మ చర్రుమంది.
“ఎందుకా నవ్వు?”
“ఒకటి చెప్తా వింటావా?”
“ఏమిటంది”-సూర్యకాంతమ్మ రుసరుసలాడుతూ.
“నీ గొప్పతనం వట్టి ఎరువునగ. నీ మగడు ఒకప్పుడు దివాన్గిరీ చలాయించేడు. అదీ నీ గొప్పతనం.”
“ఆడదాని కంతకన్న అదృష్టం ఏం వుంటుంది?”
“నీ భారతనారీ ధర్మదీక్షా, సంతృప్తీ నీ మొగుణ్ణి కావడం చేత నాకు బాగానే వినిపించవచ్చు. కాని, ప్రతివాళ్లూ అల్లా అనుకోరు.”
“దానికి అర్హత వుండాలి.”
“ఔనౌను. ఆమె స్వంతంగా రెక్కలు ముక్కలు చేసుకొంటేగాని బ్రతకలేని దురదృష్టవంతురాలే. కాని, ఆ దురదృష్టమే ఆమెలో వున్న గొప్పతనానికి మూలం. ఆమె కాళ్ళమీద ఆమె నిలబడగలదు. అదీ ఆత్మవిశ్వాశం. ఒకరి ప్రేక్ష్యం అక్కరలేదు. అదీ ఆమె గర్వం. ఒకరి ఆసరా వుందన్న గర్వం కాదు, లేకపోయినా బ్రతుకుతానన్న ధీమా.”
కోడలి విషయంలో అంత మెచ్చుకోలును సూర్యకాంతమ్మ సహించలేకపోయింది.
పన్నెండో ప్రకరణం
“సత్యానందం రాత్రి టెలిఫోన్ చేశాడు. వాళ్ళ పెద్దకొడుకు రామకృష్ణ వరంగలు నుంచి వచ్చేడుట....”
ముసలాయన మాట పూర్తికాకుండానే రవీంద్ర ఉత్సాహంతో అడిగేడు.
“ఎప్పుడు?”
వెంటనే తల్లివేపు తిరిగి “మనం వ్రాయగానే వచ్చేసేడన్నమాట” అన్నాడు.
జానకి నెమ్మదిగా అడిగింది.
“ఎప్పటివరకూ వుండేదీ చెప్పారా?”
కుమారస్వామి నసిగి, అనుమానిస్తూంటే, సూర్యకాంతమ్మ చెప్పింది.
“సోమవారంనాడు కాలేజీలో వుండాలిసిందే. వెంటనే రమ్మన్నాడు.”
“మనమూ వెడదాం” అన్నాడు రవి.
మాట మధ్యలోనే లక్ష్మీపతి ‘అప్పుడే’ అన్నాడు.
“ఇప్పుడే వెళ్ళడం ఏమిటి? మీరు వచ్చిందేది? వున్నదేది?” అంది రాజమణి.
అప్పుడే హాలులోకి వస్తున్న భద్రకు కూడా అదే సలహా యిచ్చింది.
“మీమాటే చెప్పుకుంటున్నాం. రాకరాక వచ్చేరు. ఇప్పుడే ప్రయాణం అంటున్నారుటేమిటి? అతడినే రమ్మని వైర్ చెయ్యండి.”
“ఔను. భద్రా. బాగుంటుంది. అల్లా చేద్దాం. అతడిని చాలాకాలమయింది చూసి....” అంటూ లక్ష్మీపతి భార్య సూచనను సమర్థించేడు.
“ఎంత సులువుగా అన్నారర్రా” అంటూ భద్ర నవ్వింది.
రాజామణి తెల్లబోయి “ఏం?” అంది.
“అంతమాట అన్నావు. చాలులే. వో కప్పు కాఫీ ఇయ్యి. మళ్ళీ మీ యింట ఏమీ పుచ్చుకోలేదని నెపం వేస్తావు” అంటూ భద్ర జానకితో కూడా చెప్పింది.
“పదిగంటలకి బస్సు వుందట. వచ్చేటప్పుడే కనుక్కున్నాం.”
“మేమూ వస్తున్నాం” అంది, అన్నీ నిర్ణయం అయినట్లే జానకి.
“వెడితే అది వెడుతుంది. మీరు వెళ్ళడానికి వీలులేదు....” అన్నాడు లక్ష్మీపతి.
“ఒక్కరోజు కూడా వుండకుండానా?” అంది రాజామణి. మళ్ళీ మొదలయింది.
“ఎంతసేపు రావాలి. ఎంతసేపు పోవాలి. వీలైతే మళ్లీ వస్తా. రామకృష్ణని వోమారు రమ్మని వ్రాశానా మరి....” అంది జానకి దృఢస్వరంతో.
“రామకృష్ణ తన కాబోయే భార్యను కూడా వెంటబెట్టుకొనే వచ్చేడుట. నీకు చూపించి పాస్ చేయించాలనుకొన్నాడో యేమో....” అంది నెమ్మదిగా, అవకాశం చూసుకొని భద్ర.
“గట్టివాడే.”
భద్ర చిరునవ్వుతో ఆమె మెచ్చుకోలును అంగీకరించింది.
“వీళ్ళిద్దర్నీ తీసుకురమ్మనీ, కావలిస్తే మళ్ళీ వెడుదురుగాననీ చెప్పేరు” అంది భద్ర జానకిని బలపరుస్తూ.
“ఆ మాట కూడా చెప్పేడన్నమాట. మరింకేం?” అంది జానకి లేస్తూ.
అంతవరకూ అన్నీ వింటూ కూర్చున్న కుమారస్వామి “నేను చెప్పకుండానే ప్రయాణ సన్నాహంలో వుంది” అనుకొన్నాడు.
“అప్పుడే తొమ్మిదయింది. హోటలులో ఎక్కౌంట్సు సరిచేసుకు బయలుదేరాలి. మాకు సెలవివ్వండి....” అంది జానకి.
కుమారస్వామి ఇంక వూరుకుంటే లాభం లేదన్నట్లు తన కుర్చీలో నిటారుగా కూర్చుని....”నీతో రెండుమాటలు చెప్పవలసి వున్నాయి. కనీసం ఒక రోజన్నా ప్రయాణం వాయిదా వేస్తే సావకాశంగా మాట్లాడవచ్చుననుకొన్నాను. ఈ హడావిడిలో నేనేం చెప్పేది? మీరు ఏం ఆలోచిస్తారు? దారిలోనో, ఇంటికి వెళ్ళాకనో భద్ర చెప్తుంది. ఆలోచించి నాకు వ్రాయండి” అన్నాడు.
భద్ర కాదంది.
“నేను సరిగ్గా చెప్పలేను. మీరు ఎదటపడి కూడా మధ్య నా రాయబారం ఏమిటి? నాకేం తెలియదు.”
విషయం ఏమిటో అర్థంకాక అందరూ ముఖముఖాలు చూసుకొంటున్నారు. కుమారస్వామి అందర్నీ కూర్చోమన్నాడు.
“ఆ నా మాటేదో నేనే చెప్తాను. దానికి సమాధానం వెంటనే ఇవ్వనక్కర్లేదు. ఆలోచించుకు చెప్పండి.”
అదేదో ఆస్తి విషయం అయివుంటుందని నలుగురూ అర్థం చేసుకొన్నారు.
అయిష్టంగానే జానకి కూర్చుని చెప్పేదేదో త్వరగా కానియ్యమన్నట్టు ముఖంవేపు చూసింది.
కుమారస్వామి చెప్పేడు.
“రవీంద్ర విషయం.”
జానకి అప్రయత్నంగా రవీంద్రను భుజంమీద చెయ్యివేసి పక్కకు తీసుకొంది, రక్షణ యిస్తున్నట్టు.
“అతనికి ఏదో ఏర్పాటు చెయ్యాలనుకొంటున్నా.”
తడారిపోతున్న గొంతుతో జానకి నెమ్మదిగా అంది.
“అదంతా అనవసరం. అనవసరం.”
కుమారస్వామి తన అభిప్రాయం వివరించాడు.
“తాత్కాలికంగా పాతిక, ముప్ఫయివేల ఆస్తి యివ్వాలని వా వూహ. అది అతనికి స్థిరాస్తి రూపంలో వూండాలని నా వుద్దేశం.”
“వద్దు, తాతయ్యగారూ! అలాంటి ప్రయత్నం వద్దు.” అన్నాడు రవీంద్ర ఆదుర్దాతో.
“నువ్వేం చెప్పకోయ్” అని శాసించేడు కుమారస్వామి. ఆ శాసనాన్ని సాధ్యమైనంత మృదువు చెయ్యడానికి, “నువ్వింకా కుర్రాడివి. నాలుగేళ్లు పోతేగాని....” అన్నాడు, చిరునవ్వుతో.
మళ్లీ ఒక్కక్షణం ఆగి తన ప్రతిపాదన నలుగురి ముందూ పెట్టేడు.
“నువ్వు యింటికి యిరవయ్యేళ్లదాకా వాయిదాలు కట్టాలనుకుంటాను.”
జానకి ఏమీ అనలేదు.
“ఆ ధనం ఒక్కమారే యిచ్చేస్తే వడ్డీ తగ్గుతుంది.”
ఈమారు కూడా ఔనూ కాదూ అన్న సమాధానం రాలేదు. ఒక్క క్షణం ఆగి కుమారస్వామే తరువాయి అందుకున్నాడు.
“ఆ డబ్బు వెంటనే జమకట్టేద్దాం.”
లక్ష్మీపతి వెంటనే “ఆ ఆలోచన చాల మంచిదే” నన్నాడు.
“మళ్లీ యిదేమిటమ్మా, ఇప్పుడు....” తల్లి ఏమీ మాట్లాడలేకపోవడం చూసి, రవీంద్ర ఆదుర్దాగా, నెమ్మదిగా అడిగేడు. ఆమె “నాకేనా, ఏమీ తెలియదు”-అంది.
నిన్నటినుంచి ఆ యింట్లో జరుగుతున్న చర్చలేవీ ఆమెవరకూ రాలేదు.
తన ప్రతిపాదనను ఎంతో సంతోషంతో స్వీకరించవలసిన యిద్దరూ మౌనంగా వుండడం చూసేక కుమారస్వామి వుత్సాహం చల్లారింది. కాని తప్పదు. తన ప్రతిపాదన పూర్తి చెయ్యాలి.
“డబ్బు కట్టేశాక ఆ యిల్లును రవీంద్ర పేరిటికి యాజమాన్యం మార్పించాలి. అది నేనాతనికి యిచ్చినట్లు వుండాలి.”
తండ్రి ప్రతిపాదనకు లక్ష్మీపతి చిన్నపుచ్చుకొన్నాడు. రవీంద్ర ముఖం జేవురించింది.
కాని భద్ర హాస్యం చేసింది.
“మామయ్య గడుసువాడు. ఇరవయ్యో, పాతికో వేలిచ్చి నలభయి, ఏభయివేల యిల్లు యిచ్చామన్న పేరు కొట్టెయ్యాలని ఎత్తు.”
మనస్సులో ఆ అవరోధానికి కష్టం అనిపించినా కుమారస్వామి తొందరపడలేదు.
“అమ్మాగారు కొడుక్కు ఆ మాత్రం యివ్వతగరా?”
“అమ్మగారు యిచ్చేదానికి యీ మెలిక యెందుకు?” అన్నాడు లక్ష్మీపతి.
“ఈయనకు వయస్సు పెరిగినకొద్దీ మతిపోతూంది”-అనుకొని విసుక్కొన్నాడు.
రవికి ఆ మెలికలోని గూఢార్థం అవగతమయి ముఖం జేవురించింది.
జానకి ముసలాయనకు తనమీద గల అపనమ్మకం ఈ ప్రతిపాదనకు మూలం అనుకొంది. కోపం వచ్చింది. కాని, అంతలో సర్దుకొంది.
“మీకు వానియందున్న అభిమానానికి చాల సంతోషం. ఆ ఫ్లాట్‌కి పదిహేనేళ్ళు దరిదాపుగా కట్టాలి; ఇప్పటి లెక్కన, నా వుద్యోగకాలం మరో పదిపన్నెండేళ్ళు వుంది. ఆ కాలం లోపల కట్టెయ్యగలను. నాకు సాధ్యం కాకపోతే అప్పుడు వాడే చూసుకొంటాడు. ఏదో సంపాదనలో పడతాడు గనుక కష్టం కాదు. వాడి ఖర్చులు వాడు చూసుకొంటే నేను నా వ్యవధిలోపలే పూర్తి చెయ్యగలననుకొంటున్నా....”
“త్వరగా తేలిపోయే అవకాశం వుందిగనక....” అన్నాడు కుమారస్వామి.
“అదే చెప్పబోతున్నా” అంది జానకి. “రవీంద్ర పేరిట మార్చవలసిన అవసరం నాకేమీ కనబడదు. నిజానికి యీ క్షణం వరకు వాడికి నేను, నాకు వాడు తప్ప ఆసరా ఎవ్వరూ లేరు. వాడికి వయస్సు వచ్చింది. చదువూ ఒకదశకు వచ్చింది. ఏదన్నా వుద్యోగంలో చేరతాడు. పెళ్ళీ చేసుకొంటాడు. మూడోమనిషి వచ్చాక, తన కుటుంబం పెరిగాక అతని అభిమానాలూ, ప్రేమలూ మరో ఆశ్రయం చూసుకోడం సహజం. నేను ఎవ్వరికీ బరువుకావడం నాకిష్టం వుండదు. నాకూ ఒక ఆధారం వుండాలి. ఆయిల్లు నాది....”
“నీ కొడుకు నీకు అన్యాయం చేయడు.” అన్నాడు కుమారస్వామి.
తనకూ కొడుకుకూ మనస్పర్థలు సృష్టించడానికే ఈ ప్రసంగం తెస్తున్నట్లు కుమారస్వామి ఆలోచనలకు జానకి అర్ధం తీసింది.
“నేనూ అదే ఆలోచిస్తున్నా. ఒక మంచి విషయం గుర్తు చేశారు. తల్లేమిటి, కొడుకేమిటి – ఆస్తి, డబ్బు విషయంలో ఎవరి జాగ్రత్తలో వారుండడం మంచిదే. నాకింతవరకు ఆ ఆలోచన లేదు. మీరు జ్ఞాపకం చేశారు. తప్పేంలేదు. వ్యవహారధర్మం అన్నది చాల గౌరవనీయమైన మాట. సందేహం లేదు. మీ వయస్సు దానిలో పండిపోయింది. కనక మీ ఆలోచన శిరోధార్యంగాని కొట్టివేయవలసింది కాదు....ఆ యిల్లే నా ఇన్నేళ్ళ శ్రమకి మిగిలేది. ఆమాత్రం ఆసరా నాకు వుండాలి. అది వాడికి బదలాయించే వుద్దేశం నాకు లేదు. వాడు అడగనూ లేదనుకోండి. ఆ ఆలోచన వాడికి వుందనుకోను.”
“లేదు. నేనెప్పుడూ అనుకోలేదు. అనుకోను.” అన్నాడు రవీంద్ర లేస్తూ.
జానకి లేచింది.
“సెలవిప్పించండి.”
“అయితే నాకు తోచిన పద్ధతిలో నేను నా అభిప్రాయం అమలు జరుపుతాను.”
జానకి ఏమీ అనలేదు. గంభీరంగా వీధివేపు నడిచింది.
“రవీ! రిక్షాని పిలువు.”
సావట్లోంచి కుమారస్వామి కొడుక్కు పని పురమాయించేడు.
“డ్రైవర్ని పిలిచి వారిని బస్ వరకూ తీసుకెళ్లి విడవమను.”
“అక్కర్లేదు మామగారూ! ఈ కాస్త దూరంలో కారు అనవసరం” అంటూ రిక్షాలో అడుగుపెట్టింది జానకి.
పదమూడో ప్రకరణం
భద్ర కూడా వెళ్ళిపోయేక కుమారస్వామి కొడుకులనిద్దరినీ పిలిపించేడు.
“ఈపాటికి వాళ్ళు బస్సు ఎక్కే వుంటారు” అన్నాడు కుమారస్వామి.
వాళ్లు తన ఔదార్యాన్ని గుర్తించకుండా వెళ్ళిపోయినందుకు ఆయనకు కష్టంగానే వుంది. కాని పైకేమీ అనలేదు.
“మీరు మర్యాదగా వ్యవహరించలేదు. ఆమె తన మర్యాద దక్కించుకొని తప్పుకొన్నారు. డబ్బు ఆశను తల్లీకొడుకుల మధ్య ప్రవేశపెట్టబోవడం చాలా అన్యాయం. అల్లా చెయ్యడంలో మీ వూహ ఏమిటి?”-అంటూ లక్ష్మీపతి తండ్రిని దుయ్యపట్టుకొన్నాడు. సీతాపతి తండ్రిని సమర్థించేడు.
“సాయపడతానంటే చెండనాడుకుపోయిన వాళ్ళని సమర్థిస్తావేం? పాతిక ముప్ఫయివేలు....”
లక్ష్మీపతి అన్నగారివేపు అసహ్యం వుట్టిపడేలా చూసేడు.
“నీ పాతిక-ముప్ఫయివేలకి విలువ ఎంతో అర్థం అయిందా? నువ్వు పంపుతానన్న కారులో కూడ అడుగుపెట్టలేదు. రిక్షా చేసుకొన్నారు. నీ విలువ అది!”
“పీడాపోయిరి. నెత్తిమీద పెద్దమ్మ తాండవిస్తూంటే అదృష్టం పట్టాలంటే మాటలా?” అంది, సూర్యకాంతమ్మ నిర్లక్ష్యంగా. “అక్కర్లేదని తోసుకుపోయిన వాళ్ళని బతిమాలీ, బామాలీ, భంగపోతారేం ఖర్మ!”
భార్య మాటలు కుమారస్వామికి వోదార్పునివ్వలేదు. కరుగ్గా కొడుకుల్ని ఆదేశించాడు.
“మీరిద్దరూ వుండండి. రిజిస్ట్రారు ఆపీసుకి వెడదాం.”
లక్ష్మీపతికి అర్థం కాలేదు.
“ఏమిటి పని?”
కుమారస్వామికి కోపం వచ్చింది..
“నా ఆస్తి తినడానికి మిగిలిన వాళ్ళకెంత అధికారం వుందో విశ్వపతి కొడుక్కీ అంత అధికారం వుంది.”
“మా సంతకాలు అవసరమా? అది మీ స్వార్జితం” అన్నాడు సీతాపతి.
“అది నా స్వార్జితమే. కాని, తర్వాత మీరెవ్వరూ అన్యాక్రాంతం చేశాననడానికి వీలులేకుండా మీరు కూడా వుండాలనుకొంటున్నా.”
తండ్రి ఆవేశం చూసి సీతాపతి జంకేడు.
“ఇది మరీ బాగుంది. పెద్దతనం వస్తున్నకొద్దీ బుద్ధి పెడతలపట్టడం అంటారు-ఇదే కాబోలు!” అంటూ సూర్యకాంతమ్మ కోప్పడింది.
ఒక గంట క్రితం తనను భారతనారీరత్నం అంటూనే ఎందుకూ కొరగాని దద్దమ్మగా చిత్రించడం, కోడల్ని దురదృష్టవంతురాలు అంటూనే ఆకాశానికి ఎత్తడం ఆమె మరవలేదు. ఆ కోపం తీరలేదు.
ఈమారు కుమారస్వామి నవ్వలేదు. నెమ్మదిగా చెప్పలేదు. కంయ్‌మన్నాడు.
“ఛ, పో అవతలికి. తాచుపాము, పెద్దపులి నయం నీకన్న....”
సూర్యకాంతమ్మ ఏడ్పు మొహం పెట్టి జారుకొంది.
కుమారస్వామి తన నిర్ణయాలను స్పష్టంగా చెప్పేడు.
“అగ్రహారంలో పొలం నాలుగెకరాలూ కుర్రవాని పేర వ్రాసేశాను. గుమాస్తా వెంకటేశ్వర్లుకి చెప్పి పంపించా. ఈపాటికి రిజిస్ట్రారు ఆఫీసులో దాఖలుచేసి వుంటాడు. మనం వెళ్ళి సంతకాలు పెట్టాలి. తయారుకాండి.” ఒక్కనిముషం ఆగి మళ్ళీ అన్నాడు, “దీపావళి బహుమతిగా వానికి అందాలి.”
లక్ష్మీపతి ఆశ్చర్యంగా తండ్రి ముఖం చూసేడు.
“అది పల్లెలవాళ్ళు ఇళ్ళకని దరఖాస్తులు వెయ్యడం, తాసీల్దారు శాంక్షను చెయ్యడం....”
“కలక్టరు ఆ వుత్తర్వులు రద్దుచేశాడు” అన్నాడు సీతాపతిరావు.
“కాని వాళ్ళు దానిమీద ఆశ వదులుకోలేదు. అప్పీళ్ళు చేస్తున్నారు. రాయబారాలు నడుపుతున్నారు.”
“అవేం లాభం లేదోయ్. చట్టరీత్యా తగిన బందోబస్తు చేశాం....” అన్నాడు కుమారస్వామి.
“కాని....” లక్ష్మీపతికి అనుమానం తీరలేదు.
“నాకు తెలుసు. జోగన్నగాడిని కుక్క కాపలాకి పెట్టిందెందుకు? ఎవ్వళ్ళూ వచ్చి ఆక్రమించుకోకుండా వాడు! ఇప్పుడు ఆ భయం అక్కర్లేదు. వాళ్ళ నాన్నమీద వున్న అభిమానంతో పల్లెలవాళ్లు ఇంక అది కావాలనరు. వీళ్ళ వ్యవహారాలు చూసిపెట్టే బాధ్యత సత్యానందం తీసుకొంటాడు. నాకు తెలుసు. కనక అసలు భయం లేదు.”
“వొద్దు. కుర్రవాడిని ఈ గొడవల్లోకి నెట్టవద్దు. నాకిష్టం లేదు. ఏగాని యివ్వకపోయినా సరేగాని, వాడిని లేనిపోని గొడవలలోకి దూర్చి పాడు చేయవద్దు.”
కుమారస్వామి అనునయించేడు.
“ఇందులో గొడవలు లేవు. గంద్రగోళాలు లేవు. లేనిపోని దుశ్శంకలు పెట్టకు.”
“వాడికి ఇంత డబ్బు ఇవ్వండి....” లక్ష్మీపతి మార్గాంతరం చెప్పేడు.
“నేను సంపాదించింది నా చేతులతో అమ్మలేను. మీకు డబ్బు ఇచ్చేసి ఆ భూములు నేను చూసుకోలేను. నాకా వయస్సూ లేదు. అభిరుచీ లేదు. మీకిచ్చేస్తున్నా. ఏం చేసుకొన్నా మీ యిష్టం. చేసుకోండి. మానుకోండి. అమ్ముకోండి. పంచిపెట్టుకోండి. వీలయితే నే బ్రతికి వుండగా ఆ పని చెయ్యకండి. నేను హరీ అన్నాక మీ యిష్టం!”
“ఇంక బ్యాంకులో డబ్బు మా యిద్దరిదీ. మా తరువాతనే దానిని ఎవ్వరికిచ్చినా?”
“కొంత వాళ్ళకివ్వండి. దానిని మేం ఇద్దరం సర్దుతాం....” అన్నాడు లక్ష్మీపతి మళ్ళీ.
“నేనెక్కడినుంచి తెచ్చేది? నాది మా పై ఖర్చులకే చాలడం లేదు.” అన్నాడు, సీతాపతి భయం భయంగా.
కుమారస్వామి చిన్నగా నవ్వేడు.
“వదిలెయ్యండి. నేను ఎవరి దయమీదా ఆధారపడతలచలేదు.”
కాని లక్ష్మీపతి తండ్రిని వదిలిపెట్టలేదు.
“అల్లాంటప్పుడు ఆ సలహా ఆమెకు మీరే ఎందుకిచ్చేరు?”
ఇంక ఆపమన్నట్లు కుమారస్వామి చేయి వూపేడు.
“ఆమె తన గోరోజనం కనబరచింది. నాకు చాల సంతోషం కలిగింది. మంచి ఆత్మవిశ్వాసం వున్న మనిషి. నాకు నచ్చింది. ఈ భూమిని వుపయోగించుకోగలది ఆవిడే. మీరిద్దరూ కూడ కాదు. ఆమెకు భద్రా, సత్యానందం ఆసరాగా వుంటారు. మీకు ఆ వూళ్ళో మంచినీళ్ళు కూడా పుట్టవు. నాకు తెలుసు. మరోచోట భూమి యిస్తే వాళ్లు ఏమీ చేసుకోలేరు. నేను ఆలోచించే అది యిస్తున్నా. మరి ఏమీ చెప్పకండి....లేవండి!”
కుమారస్వామి కొడుకులిద్దరూ లేచేరు.
“మంచిదే, కానీండి,” అన్నాడు లక్ష్మీపతి, కండువా భుజాన వేసుకొంటూ.
పధ్నాలుగో ప్రకరణం
కాకినాడ బస్సుస్టాండులో కనబడ్డప్పటినుంచీ ‘ఎవరా అతడు’ అని జ్ఞాపకం చేసుకొనేటందుకు ప్రయత్నిస్తూంది. అతనుకూడా అల్లాంటి అనుమానంతోనే వున్నట్లు తోచింది. భద్రకు చూపి ఎవరంది.
“మనూరివాడే. మీ పార్టీవాడే, వెంకట్రావు.”
“వెంకట్రావు!” లీలగా జ్ఞాపకం వచ్చింది. తానూరు వదలి వెళ్ళేసరికి వో యిరవై ఏళ్ళ కుర్రవాడు. కొద్దిపాటి చదువు. కూలిపని చేసుకు బతికేవాడు. పెద్ద కుటుంబం. గడ్డు బీదరికం. అల్లాగే వచ్చి, మధ్య మధ్య పార్టీపనుల్లో సాయపడేవాడు. కాని అతని పేరు వెంకట్రావా?
“అతని పేరు వెంకట్రావేనా?”
“అయితే తాతన్న అనేవారులే. కాని అసలు పేరు వెంకట్రావే....”
జ్ఞాపకం వచ్చింది. తాతన్న, ఇళ్లు కాలిపోవడం....సాయంకోసం వసూలైన డబ్బు కొద్ది....ఎవరికివ్వాలని చర్చ....దారిద్ర్యం, ఇంటి ఇబ్బందులూ చూసి అతడి పేరు సహాయం ఇచ్చేవాళ్ళ లిస్టులో చేర్చడం....అతడు వద్దనడం....ఆనాటి వ్యక్తి కనిపించేడు. సంతోషం అయింది.
కోటిపల్లిలో దిగగానే పలకరించింది.
“ఏం తాతన్నా! బాగున్నావా?”
ఎవరా తన్ను తాతన్న పేరుతో పిలిచేవారని వెంకట్రావు నిలబడ్డాడు.
“కాకినాడ నుంచి వస్తున్నావా? కొడుకు బాగా చదువుతున్నాడా?”-అని భద్ర కుశలప్రశ్న వేసింది.
“వీరు ఎవరో జ్ఞాపకం వుందా?” అంది భద్ర.
తనను తాతన్న అని పిలిచినవారు ఎవరో తెలియలేదని చెప్పడానికి సిగ్గుపడ్డాడు.
“ఎక్కడో చూసేననిపిస్తూందండి. కాని గ్యాపకం రాలేదండి.”
చటుక్కున గుర్తు వచ్చింది.
“అమ్మమ్మమ్మ!” అని తన మరుపుకు చాలా నొచ్చుకొన్నాడు.
“పద్మనాభంగారి చెల్లమ్మగారు.”
భద్ర గమ్మున సర్దింది.
“మీ బంధువురాలే. విశ్వంగారి భార్య.”
వెంకట్రావు ఉత్సాహం చల్లబడింది. నెమ్మదిగా విచారస్వరంతో కుశలం అడిగేడు.
“బాగున్నారా? అమ్మా? బాబు ఉన్నారన్నారు. ఈయనేనా? బొంబాయిలోనే ఉంటున్నారా?”
జానకి అతని ఆప్యాయతకు కదిలిపోయింది. అతని పరిస్థితి తెలుసుకోదలచింది.
“ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నావుట.”
అతడో రైతు వద్ద ఓ ఎకరం, మరొకరి వద్ద పన్నెండు కుంచాలూ కౌలుకు తీసుకున్నాడు. చేలో అయిదు బస్తాల ధాన్యం, గడ్డి మిగిలింది. ఎకరన్నర అరటి తోట వేసేడు. నిరుడు రైతుకు పదహారు వందలు ఇవ్వగా ఓ వెయ్యి మిగిలింది.
“బాగానే ఉందండి.”
“ఎంతమంది పని చేస్తారు!”
రోజు కూలి అయినా కిడుతుందా అని తెలుసుకోదలచింది జానకి.
వెంకట్రావు అవన్నీ అలోచించి లాభం లేదన్నాడు.
“ఆ లెక్కలు వేస్తె మా కూలిలో సగం కిట్టినా గొప్పేనండి. మా ఇంటిదీ, నేనూ ఏటిపొడుగునా, రాత్రీ పగలూ పనిలోనే ఉంటామండి. పని ఎద్దడి రోజుల్లో పిల్లగాళ్ళొస్తారు. ఆ నాలుగురోజులూ బడికి పోవడం మానాలండి. పైగా కూలికి మనుష్యుల్ని పెడుతూనే ఉండాలి. అదేం లెక్కకట్టి లాభం లేదండి. భూమి మాదికాదు. కౌలుకి దొరికింది. అదే గొప్పగా వుందండి. ఆ పొలంలోనే కూలి చేస్తున్నామనుకోండి....”
“లెక్కలేకుండా వ్యవసాయం ఏమిటయ్యా!....” అంది జానకి.
“అదీ నిజమేకానండి....” అని వెంకట్రావు నీళ్ళు నమిలేడు.
లెక్కలకి సరిపడదు. అన్నీ లెక్కలోకి రానూ రావు. గట్లమీద వేసిన బెండలో, పెండలం, కంద వంటివో నాలుగు రోజులు కూరలకి వస్తాయి. అది లెక్కకి వచ్చేటంత వుండదు. కాని, ఓ పూట గడుస్తుంది.
ఆ భూమే తనది అయితే? జీవితం ఎంతో సుఖంగా నడిచేది. తమ కష్టానికి తగిన ఫలితం వుండేది. కడుపునకింత తిండికి తడుముకోనక్కర్లేకపోయేది.
భూమి తనది కాకపోయినా హోదా పెరిగింది.
అతడిప్పుడు రోజు కూలీ కాదు. రైతు. ఆ ప్రతిష్ట తక్కువది కాదు. కావాలంటే ఎక్కడన్నా ఓ వంద రూపాయలు అప్పు పుడుతూంది.
పిల్లల్ని చదివించగలుగుతున్నాడు. హోదా పెరగడంచేత కాదు. దేశ పరిస్థితి మారింది. చదువులకి జీతాలు ఇవ్వనక్కరలేదు. హరిజనులకు ఇచ్చే విద్యార్ధి వేతనాలూ, సాయాలూ సంపాదించుకోడం తెలిసింది.
కాని...
“లెక్క వేసుకొంటే గుండెలు ఆగిపోతాయండి. ఏదో నడిచిపోతూంది. వెనకటికన్న బాగుంది. అంతే...”
“అదెల్లాగోయ్....!”
అంచనాకి దొరకని డబ్బు ఎక్కడినుంచి వస్తుంది? ధరలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో జనం పెరుగుతున్నారు. సౌకర్యాలూ, అవసరాలూ పెరుగుతున్నాయి. ఉత్పత్తి పెరుగుతూంది. కాని, పంపిణీలో మార్పు లేదు. ఫలితంగా ఏ రెండింటికీ పొంతన లేదు.
జీవితం ఏదో గడుస్తూంది. ఈ స్థితి ఇలా ఎందుకుందో ప్రశ్నేనా వేసుకోవద్దు అనుకుంటున్నాడు వెంకట్రావు. ఇరవై ఏళ్ళ క్రితం ఈతడే ఊరేగింపులలోనూ, సభలలోనూ పాడిన పాట గుర్తు వచ్చింది.
ఎండలో వానలో ఏనాటి కానాడు
బండచాకిరి చేసి బ్రతుకుతావేగాని
దినము నీ కూలితో-కూలోడా!
తిండైనా గడుచునా-కూలోడా?
జానకి ఆ మాట గుర్తుచేస్తే వెంకట్రావు ఒక్క నిముషం అలోచించేడు.
“ఊళ్ళల్లో చాలా మార్పు వచ్చిందండి. పల్లెల్లోనూ. ఆ రోజుల్లో ఆరణాలు, అర్ధరూపాయి కూలి గొప్పగా ఉండేది. ఈ వేళ మూడు రూపాయలు మగాడికి మామూలు. ఊరికే చదువులు వచ్చేయి. అన్నిచోట్లా స్కూళ్ళు వచ్చేయి. పంటలు పెరిగాయి. ఉద్యోగాలూ ఫరవాలేదు. ఎలిమెంటరీ స్కూలు మేష్టరుకీ, బంట్రోతుకీ నూరూ ముప్పాతికా జీతం ఎరుగుదుమాండి!”
“అయితే ఏమంటావు?”
“మనం వెనకటి పద్దతిలోనే ఆలోచించకూడదండి. పిచ్చికుంచాల్ని గురుంచి పాతికేళ్ళ క్రితం ఇచ్చిన ఉపన్యాసాలు ఈవేళ జనాన్ని కదలించవు. జీవితం సుఖవంతం అయిందనను. కాని, మన ఆలోచనల స్థాయి మారాలి. ఎల్లా మారాలి? ఎందుకు మారాలి? ...ఏమో. నాకు అర్ధం కావడం లేదు.”
మనస్సులో గూడు కట్టుకొన్న ఏవో ఆలోచనలు దారి దొరికి బయటపడినట్లుగా అనిపించి జానికి అతని మాటలు వింటూ కూర్చుంది.
“ఒక్కటి చెప్పమంటారా? మా పల్లెలో పుట్టిన కుర్రాడొకడు ఈవేళ ఇంజనీరయ్యేడు. మావాడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఇద్దరు బియేలయ్యారు. పది గుడిసెల్లో రేడియోలున్నాయండి. ఆరు సైకిళ్ళు.”
అమెరికా నిరుద్యోగి కుంటుంబాలు కూలిపని వెతుక్కుంటూ స్వంతలారీలో ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి తిరుగుతున్నట్టు ‘గ్రేప్స్ ఆఫ్ రాత్’ లో చదవడం గుర్తు వచ్చింది, జానకికి.
“దేశ సంపద పెరుగుదలపట్టి దారిద్ర్యం మట్టుకూడా పెరుగుతుంది.”
“అందుకేనండి. స్వాతంత్ర్యానికి పూర్వం చెప్పినవే...ఆలోచించినవే...”
వెంకట్రావు మాటను సగంలోనే జానకి అడ్డుకొట్టింది.
“కాని తిండి, పని అందరికీ లేదు. అదొకటి. గుంటూరు జిల్లా భీమవరం సర్పంచ్ నీ, మరో పది పన్నెండు మందినీ చంపేసి పేటనంతనూ తగులబెట్టిన ఘటన జరిగి ఇంకా ఆరునెలలు కాలేదు. ఇల్లాంటివన్నీ ఏమిటి?”
ఆ ప్రశ్నకు వెంకట్రావు ఆశ్చర్యమే కనబరిచేడు.
“మీరు చదువుకొన్నవారు. దానికి కారణం, సమాధానం మీకు అర్ధం కాలేదనుకోను. అగ్రహారంలో నాలుగు రోజులు వున్నారనుకొంటా. ఇరవయ్యేళ్ళకీ ఇప్పటికీ అక్కడ తేడా కనిపించనేలేదా?”
ఈ మారు తన స్థానం మారినట్లు అనిపించింది. మార్క్సిస్టులతో వాదించినప్పుడు తాను ముదలకిస్తూ వచ్చిన ప్రశ్నలనిప్పుడు వెంకట్రావు తెస్తున్నాడు. వాదనకి కూడా తాను ఈ స్థితిలో వుండడానికి ఆమె మనస్సు ఒప్పుకోలేదు.
“చూశాను. గ్రామంలో మార్పు వుంది. కాని, సమాజ స్థితిలో మార్పు వుందా? సంపద పంపిణీ మారిందా?”
మాటల మధ్యలో పడవ రేవు దాటింది. బస్సువేపు నడుస్తూ వెంకట్రావు అన్నాడు.
“మీ ఉద్దేశ్యం ఏమిటో నాకు తెలియదు. ఈ ఇరవయ్యేళ్ళూ దేశాన్ని పాలించింది కమ్యూనిస్టుల ప్రభుత్వంకాదు. కబుర్లు ఏం చెప్పినా వారు సోషలిజం స్థాపనకు ప్రత్నించేరనలేము. కాంగ్రెసు చీలిక తరవాత ప్రభుత్వంలో నిలదొక్కుకొంటున్న ఇందిరమ్మ కూడా ఈ వ్యవస్థను మార్చలేదు. ఈవేళ కనిపిస్తున్న అభినివేశం చాలదు, క్రియ జరగాలంటే...నాకు నమ్మకం కలగడం లేదు. ఈ వృద్ధజంబుకాలన్నీ మళ్ళీ ఇటే తిరిగి, ముక్కుతాళ్ళు బిగుస్తుంటారు. ఈ దశలో సమాజ వ్యవస్థ మారిందా అన్న ప్రశ్నకు అర్ధం ఏమిటి? మార్పు వచ్చి తీరాలని కోరేది మనం. ఆ మార్పు రాలేదంటే మన ఆలోచనలలో, మన పనులలో ఏదో లోపం వుందేమోననుకొని తిరిగి చూసుకోవడం అవసరం కాదూ? మన లక్ష్యాన్ని సాధించగల కృషి మనం చెయ్యడం లేదు.”
ఒక్క నిముషం ఆగి వెంకట్రావు మళ్ళీ సాగించేడు.