“మన వైర్ లో ఎవరికన్నా ఆరోగ్యం, అనారోగ్యం మాట వ్రాసినట్లు లేదే!” అని సీతాపతి తన అనుమానానికి ప్రాతిపదిక లేకపోలేదని సూచించేడు.
“ఏం లేదు. కాని, మనం ఎడ్రసు అడగడమే సూచనగా భావించేమంది” అన్నాడు కుమారస్వామి, తన ఆరోగ్య వ్యవహారం ఇంకా కొందరికి ఆదుర్దా కలిగిస్తూందన్న సంతృప్తితో.
“తమాషాగా వుంది” అన్నాడు సీతాపతి. ఒక నిముషం వుండి మళ్ళీ మొదలుపెట్టేడు.
“కూడా భద్ర రావడం మంచిపని చేసింది. ఎందుకొస్తేనేం? మంచి పని చేసింది. వాళ్ళిద్దర్నీ కూడా మనం ఎరగం. ఎప్పుడూ చూడనైనా లేదు. ఆ స్థితిలో మనకే కాదు. ఆమెకీ ఎంతో చికాకే. నిజంచేత మన కన్న ఆవిడకే చాల బాధ కలిగి ఉండేది. నేను ఫలానా అంటే మనం నమ్మడమా? నమ్మకపోవడమా?”
“సరాసరి ఇంటికి రాలేదు. బ్రతికిపోయాం. లేకపోతే ఆ వేషం, ఆ నడక నాకు చాలా అసహ్యం అనిపించేయి. నేను మాట దాచుకోలేను. అనేస్తాను కూడా....” అని తన అమాయకత్వం వలన కలగవలిపి, తప్పిపోయిన ఇబ్బందులను తలుచుకుని తృప్త పడింది సూర్యకాంతమ్మ.
“అట్టే తెలివితక్కువగా మట్లాడకు” అంటూ కుమారస్వామి భార్యను గదిమేడు. జానకి వేషభాషలలోగాని, మాటలలోగాని తెచ్చి పెట్టుకొన్నట్లు లేదని కొడుకులకు వర్ణించేడు. వెంటనే సీతాపతి తండ్రి మాటను సమర్ధించేడు.
“మంచి ఉద్యోగంలో వుంది. బాగా చదువుకుంది. ఉంటున్నది బొంబాయి వంటి మహాపట్నంలో. సంఘంలో ఆమెకున్న స్థానంపట్టి ఆమె వేష భాషలుండడంలో ఆశ్చర్యంలేదు.”
“ఉద్యోగినిగా పదిమందితో బ్రతికే మనిషి ఏడుపు మొహం, ఈడుపు కాళ్ళు, దరిద్రం వోడుతూ ఉంటారా యేమిటి? ఆవిడది గట్టి ప్రాణం. ఉద్దండపిండం అయి వుంటుంది! ఇక్కడినుంచి వెళ్ళేసరికి మెట్రిక్ మాత్రమేట చదువుత! అల్లాంటిది పరాయి రాష్ట్రంలో వుద్యోగం చేసుకొంటూ, చదువుకొని లెక్చరరుగా పని చేస్తూందంటే, ఆవిడ దర్శనం చేసుకుంటే జన్మ తరిస్తుంది.”
-అని లక్ష్మీపతి అతిశయ అభిమానం కనబరిచేడు. అతని భార్య చదువుకొంది. ఆమె కూడా స్త్రీల కాలేజీలో లెక్చరరు. అది తల్లికి ఇష్టం లేదు. చివరికి వెళ్ళి వేరే కాపురం పెట్టుకోవలసి వచ్చింది. తల్లిని ఉడికించడానికి అతడీ అవకాశాన్ని వుపయోగించుకొన్నాడు.
మేనత్త జానకి వేషభాషలయెడ అయిష్టాన్ని వెలిబుచ్చినప్పుడే పైకివచ్చి, అంతా విన్న భద్ర కూడా తన అయిష్టం తెలిపింది.
“చచ్చిపోయిన వాళ్ళకోసం అస్తమానం ఏడుస్తూ కూర్చోరు ఎవరూ! కన్నవాళ్ళు మరిచిపోయినా, కట్టుకొన్నదానికి....”
సూర్యకాంతమ్మ బుస్సుమంది.
“కనక ఎడాదికోమాటు తద్దినం కూడా పెట్టనక్కరలేదు.”
“బ్రతికుండగా తినేశారు. చచ్చిపోయాక మహామూడుతుంది” అంది భద్ర అసహ్యం ఉట్టిపడేలా.
సూర్యకాంతమ్మ పళ్ళు కొరుక్కుని తల విదిలించింది.
ఆడవాళ్ళ మాటలలో మగవాళ్ళు కలగజేసుకోకుండా తమ ధోరణిలో ఉన్నారు.
“ఆమె మంచి సమర్ధురాలనడంలో సందేహం లేదు” అన్నాడు సీతాపతిరావు తమ్ముని మాటలను సమర్థిస్తూ.
వెంటనే సూర్యకాంతమ్మ అందుకుంది.
“అయ్యో సమర్ధురాలుగాకేం? వాడు జబ్బుపడి మంచాన వుంటే.”
“ఆ జబ్బు కూడా ఏమిటో, ఎందుకొచ్చిందో అది కూడా చెప్పు” అంది భద్ర కసిగా.
ఇరవయ్యేళ్ళ క్రితం అగ్రహారంలో ఠాణేదారు పంపిన మనుష్యులు కొట్టిన దెబ్బల మీద, మద్రాసులో పోలీసువాళ్లు మరో వరస కొట్టేరు. ఆ దెబ్బలకు విశ్వం మంచాన పడ్డప్పుడు జానకి అతనికి పరిచర్య చేసిన విషయాన్నీ సూర్యకాంతమ్మ ఎత్తుకుంది. ఠాణేదారు చర్యకు వెనక ఆనాడు దివానుగా వున్న కుమారస్వామి ప్రోత్సాహం వుంది. ఆ విషయాన్ని భద్ర గుర్తు చేసింది.
ఆనాటి కథలు తడువుతూంటే కుమారస్వామికి చికాకు కలిగి, అటు ఇటు కదులుతున్నాడు కుర్చీలో.
భద్ర మాటను సూర్యకాంతమ్మ లెక్కచెయ్యలేదు.
“....పక్కలో కూర్చుని ఏం కబుర్లు? ఏం నవ్వులు? ఎన్ని కథలు? నే నొచ్చేసరికి చల్లగా జారుకొనేది? అప్పుడే అనుకొన్నా....”
“ఎప్పుడది? అతడీ ఇంట్లో ఎప్పుడున్నాడు? ఆవిడ ఎప్పుడొచ్చేరు?” అన్నాడు లక్ష్మీపతి ఆశ్చర్యంగా.
“మద్రాసులోలే....” అంది తల్లి.
“అప్పటికింకా వాళ్ళకి పెళ్లి కాలేదు” అంది భద్ర. పెళ్ళిమాట వచ్చేసరికి సూర్యకాంతమ్మ భగ్గుమంది.
“పెళ్లి! వెధవముండకి పెళ్లి! నువ్వూ, నీ మొగుడూ చేసిన పని కాదిది? రోగపడి వుండగా, రహస్యంగా దాచడం పేరున తీసుకు వచ్చి వాడి మంచం దగ్గర పెట్టేరు. నాకు తెలీదు అనుకోకు. అసలు వాడు దాన్ని ఎరగడు. మీరే అంటగట్టేరు. కాలి పారాణి తడి ఆరకుండా ఒకణ్ణి మింగింది. తర్వాత వీడు. “నీ పద మెంత సిరిగల పాదమే యమ్మా!” దీనిని కట్టకపోతే వాడు బ్రతికి ఉండేవాడేమో....”
“ఇతరుల జోక్యం లేకపోతే ఈ ఇంట్లో అన్నీ వేరే విధంగానే ఉండేవి” అంది భద్ర, చుర్రుమనేలా చూస్తూ.
“ఏమిటే భద్రా! నువ్వు కూడా దానితో సమంగా....” అన్నాడు కుమారస్వామి నొప్పిగా.
“ఏం లేదు మామయ్యా! ఆ పెళ్ళికి కొంతవరకు భాధ్యురాలిని నేను. అతగాడికి ఇల్లు కదిలి వీధిలోకి వెడితే దెబ్బలూ, కట్టిపోట్లూ తినకుండా తిరిగి ఇంటికి వచ్చే అలవాటు లేకుండాపోయింది. కనీసం కట్లుకట్టి, కాపడం పెట్టడానికేనా వో మనిషి ఉండాలని నేనే ప్రోత్సహించా. దాని గొంతు కోసింది నేనేనని ఇప్పుడు బాధ పడుతున్నా-” అంటూ చివాలున లేచి విసురుకు వెళ్ళిపోయింది.
ఏడో ప్రకరణం
కొడుకూ, భార్యా కాదన్నా, బొంబాయి మనుమడి ఎడ్రసు కోసం టెలిగ్రాం ఇప్పించినవాడు కుమారస్వామి. భార్యను బలవంతపెట్టి, హోటలులో వున్న జానకినీ, కొడుకునూ తమ కోడలూ, మనుమడూగా ఇంటికి తీసుకవచ్చినవాడు ఆయనే.
కానీ, జానకిని చూసేక, ఆమె స్వతత్రంభావాల్నీ, గాంభీర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ చూసేక అమెయెడ మెప్పుతోపాటు ఒక విధమైన ఈర్ష్యాభావం కూడా తలఎత్తింది. ఆమె తన దయాదాక్షిణ్యాలతో నిమిత్తం లేకుండా జీవించగలదు. సరాసరి హోటలులోనే దిగడం, రాత్రి భోజనానికి రా నిరాకరించడం, కేవలం నలుగురినీ పలకరించడానికి మాత్రమే ఆ ఇంటికి రావడమూ కష్టం అనిపించింది.
ఆ కష్టపెట్టుకోడానికి కారణం కోసం వెతుకుతూ అనుమానించ దగిన స్థితిలో ఆమె కొడుకును తీసుకువచ్చిందని నమ్మకం కల్పించుకో ప్రయత్నించేడు. వాళ్ళు అగ్రహారం వచ్చిన రోజున సత్యానందం, భద్రా కూడా గుర్తించలేకపోయారన్న వార్తను బలంచేసుకుని ఆలోచనలు సాగిస్తూండగా, సీతాపతిరావు మాటలు ఆలోచించ వలసినవిగానే తోచాయి.
భద్ర వెళ్ళిపోయేక సీతాపతి మళ్ళీ అసలు సమస్య గుర్తుచేసేడు.
“అసలు మనుష్యులే అయ్యుంటారు.”
ఆ ధృవీకరణ ఉద్దేశం దానికి వ్యతిరేకమయిన ఆలోచనలు సృష్టించడానికి మాత్రమేననీ, ఆస్తిలో వాటా పెట్టాలనే భయంతో ఆ అనుమానాలు సృష్టిస్తున్నాడనీ లక్ష్మీపతికి అన్నమీద అనుమానం. తల్లి తన భార్య మధ్య వైమనస్యాలలో అన్నగారూ, ఆయన భార్యా అవలంభించిన ధోరణిని అతడు ఎప్పుడూ అనుమానిస్తూ వచ్చాడు.
అన్నగారి మాటను అవహేళన చేస్తూ....”భద్ర వదినేనా మనవేనా?” అన్నాడు.
“ఒక్కొక్క ఘట్టంలో అదీ అలోచంచవలసే వుంటుంది-” అన్నాడు సీతాపతి.
లక్ష్మీపతి తెల్లబోయేడు.
“మనం ఎన్ని వినడంలేదు. మహా మహా వాళ్ళు బోల్తా కొడతారు. భద్ర ఊడిపడిందా? ఆ మధ్య విఘ్నేశ్వరరావు మేష్టారి తమ్ముడునంటూ ఒకడు వచ్చేడు. ఆయనకో తమ్ముడుండినమాట నిజమే. పదిహేను, పదహారేళ్ళ వయస్సులో ఇంట్లోంచి పారిపోయేడు. చాలకాలం వెతికేరు. జాడలేదు చచ్చిపోయేడనుకొన్నారు. తద్దినాలు కూడా పెడుతున్నారు. వో పాతికేళ్ళు పోయేక వో రోజున నేను మీ తమ్ముడినంటూ హాజరయ్యేడు. ఏమిటి గుర్తు? కథల్లోలాగ పుట్టుమచ్చలో, అమ్మకట్టిన తాయెత్తులో, మరొకటో ఏమీలేదు. ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. తల్లికూడా చెప్పలేకపోయింది....”
తమ్ముడని తెలిసినా విఘ్నేశ్వరరావు ఎరగనట్టు నటిస్తున్నాడని వీధిలోవాళ్ళు అనుకొన్నారు. రామచంద్రాపురం తాలూకాలోది వో పాతిక ఎకరాల పల్లమూ, స్వగ్రామంలోదీ, కాకినాడలోదీ ఇళ్ళూ వున్నఅన్నదమ్ములు పంచేసుకొన్నారు. ఒకరు అమ్ముకు లేచిపోయేరు. వేరొకరు పెంచి పెద్దది చేసుకొన్నారు. పెద్ద సంసారంవున్న విఘ్నేశ్వరరావు తన వాటా ఇల్లూ, భూములూ నిలుపుకొన్నాడు. ఆ రోజున ఆ తమ్ముణ్ణి గుర్తిస్తే అవన్నీ తిరగతోడాలి. ఈ గొడవలన్నీ ఎందుకని వూరుకొన్నాడంటారు.
“ఆస్తి వున్నచోట పెళ్ళామే ఎరగనంటుంది. భోనాల్ సన్యాసి కేసు వినలేదా?-అన్నాడు లక్ష్మీపతి.
అన్నదమ్ముల సూటిపోటీ మాటలు వింటూ ఊరుకోలేక పోయేడు కుమారస్వామి.
“ఒరేయ్. ఏదన్నా విషయం వచ్చినప్పుడు నాలుగు దిశలనుంచీ ఆలోచిస్తాం. ఆలోచించడం అంటే అందరూ తలోమూలకి లాగడం కాదు.”
“అందర్నీ అనుమానించడమా?” అన్నాడు, లక్ష్మీపతి.
“నేనేమీ ఎవ్వరినీ అనుమానించలేదు” అంటూ సీతాపతి తన వాదాన్ని సమర్థిచుకొన్నాడు.
ఆ చర్చను తెంపేస్తూ కుమారస్వామి ఆదేశించేడు.
“భద్రని పిలవండి పైకి.”
సూర్యకాంతమ్మ మెట్లవేపు బయలుదేరింది.
“అనుమానించవలసినవైతే వేరే వున్నాయి. ఈమెను అన్నయ్య పెళ్ళి చేసుకొన్నాడా? ఆ కుర్రాడు వాళ్ళ పిల్లవాడేనా? ....ఇంకా ఎన్నో వున్నాయి. అవేమీ నే తీసుకురాలేదు” అంటూ సీతాపతిరావు తానేమీ తప్పుపని చేయడం లేదని నిరూపించుకొన్నాడు.
భద్రను వెంటబెట్టుకొని సూర్యకాంతమ్మ వచ్చింది.
‘కూర్చో’ మంటూనే కుమారస్వామి భద్రను ప్రశ్నించేడు.
“విశ్వపతి పెళ్ళి ఏ పద్ధతిలో జరిగింది?”
“ఏం?” అంది భద్ర అనుమానంగా.
ఈమారు సీతాపతి స్పష్టంగానే అడిగేడు. “ఏమీలేదు. అది నిజమైన పెళ్ళేనా? కాదా? అన్నది జరిగిన పద్దతినిపట్టి వుంటుంది కదా!”
భద్రకు కోపంవచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. కాని, ఇంకా ఏం వస్తాయో విందాం-అన్నట్టు చూస్తూ వూరుకొంది.
“విషయం వచ్చింది గనక అడగవలసి వచ్చింది. లేకపోతే వీటి అవసరం వచ్చేదికాదు. వాళ్ళ పెళ్ళి ఏ పద్ధతిగా జరిగిందన్నానని నీకు కోపంవచ్చింది....”
“ఒళ్ళు మండేమాటకి కోపం ఎందుకు?”-అని భద్ర విసిరేసింది.
“పోనీ నువ్వు ఏమన్నా తప్పదు. అది హిందూ మతధర్మం ప్రకారం జరిగిందా?”
భద్ర ఖండితంగా చెప్పేసింది.
“లేదు.”
“పోనీ, రిజిస్ట్రేషను?”
“నే నెరిగినంతవరకు లేదు.”
“దండలపెళ్ళి అయివుంటుంది. కమ్యూనిస్టులు సభలలో పెళ్ళిళ్ళు అయాయనిపిస్తారు. దానికి విలువ ఏముంది?”
“వాళ్ళకో పిల్లాడు కలిగాడు. పెళ్ళికి అంతకన్న విలువ ఏం వుంది?-“ అంది భద్ర రోషంగా.
ఆమెచేతిలో ఏముంటే అది విసురుతుందనే భయం లేకపోతే సీతాపతిరావు నవ్వి ఉండేవాడు.
“పిల్లలు కలగడానికి పెళ్ళి కావడానికీ సంబంధంలేదు. ఆడదీ మగాడూ వుంటే, వాళ్ళు వద్దనుకోకపోతే తప్ప బోలెడంత మంది పిల్లలు, పెళ్ళి ఉద్దేశం వేరు.”
“ఏమిటా వేరూ, చిగురూ? ఆత్మిక పవిత్రతా. ఔన్నత్యంవంటివా?”-అంది భద్ర హేళనగా.
“సందేహం ఏముంది?” అన్నాడు, సీతాపతి. మిగతా వాళ్ళంతా అతి శ్రద్ధగా ఆ వాగ్వాదం వింటూ కూర్చున్నారు.
“ఆ ఆత్మిక పవిత్రతా, ఔన్నత్యమూ, అగ్నిహోత్రం ముందు కళ్ళనీళ్ళు పెట్టుకొంటేనూ, రిజిస్ట్రారుముందు కొయ్యబొమ్మలా మొహం పెట్టుకొని, దస్తావేజుమీద చేసినట్లు సంతకం చేస్తేనూ మాత్రమే పట్టుబడుతుండా?”
“ఎన్నిమాటలు నేర్చేవే?”-అంది, దవడలు నొక్కుకుంటూ సూర్యకాంతమ్మ. కుమారస్వామి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆయన ఈ చర్చను కావాలనే సాగనిస్తున్నాడని భద్ర నిశ్చయించుకొంది. లక్ష్మీపతి ఏమీ మాట్లాడం లేదు. దీనిలో అతని పాత్ర ఏమిటో?
“కాదనుకో. కాని, ఎవరేనా అనవచ్చు, మాదీ పవిత్రబంధమే. మా అత్మలకూ ఔన్నత్యం లభించింది. ఆస్తిలో వాటా యివతల పెట్టమనవచ్చు. వానికి కొలబద్దలేమున్నాయి? ఆ పేరుతో ఎవరన్నా, దేశంలో ఎక్కడన్నా ఆస్తికయినా హక్కు చూపవచ్చు.”
“ఆ హక్కు కోరకపోతే....”
“పేచీ ఏం వుంది? వాళ్ళు తమ అత్మోన్నతికీ, పవిత్రతకీ సాక్ష్యాలూ, నిదర్శనలూ చూపించనక్కర్లేదు.”
భద్ర ఒక్కనిముషం మాట్లాడలేకపోయింది.
“ఆత్మానందాన్ని, ఐహిక భోగానికి జతచేయబోతేనే సమస్యలన్నీ”-అని సీతాపతి సూత్రీకరించేడు.
భద్ర కోపాన్ని దిగమింగుకుంది.
“ఒకప్పుడు మరియమ్మ అనే కమ్యూనిస్టు ఇలాగే చెప్పింది. అది వాళ్ళ సిద్ధాంతాల తిక్కక్రింద కొట్టిపారేశా. ఇప్పుడు ఆమాటే నీనోట వినిపించింది. ఆశ్చర్యమే. అయితే మీ ఇద్దరిలో తేడా లేకపోలేదు. ఆ కమ్యూనిస్టులు కట్టె విరిచినట్లు చెప్పేరు. నీనుంచి అసలు విషయం రాబట్టడానికి అరగంట పట్టింది.....”
ఆ పోలిక సీతాపతికి నచ్చలేదు. మరియమ్మ అంటే ఎవరో? కిరస్తానీ అంటే బహుశా ఏ హరిజనో అయివుంటుంది. ఏం పోలిక?
“”మంచి సామ్యమే తెచ్చేవు” అన్నాడు.
“అదీ ఓ పొరపాటే”-అని భద్ర తనమాట సవరించుకొంది.
“వాళ్ళు మాట్లాడేదేమిటో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. నీకు తెలియదు. అంతే తేడా!”
లక్ష్మీపతి చిరునవ్వుతో మెచ్చుకుంటూ భద్రవేపు చూసేడు.
సీతాపతి ముఖం ఎర్రబడింది.
సూర్యకాంతమ్మ నోరు తెరిచింది.
కుమారస్వామి నవ్వేసేడు.
“ఏదో కాంగ్రెసువాడని పిల్లనిస్తే అతడు కమ్యూనిజం పుచ్చుకు కూర్చున్నాడు. సరి. ఆయన అడుగుజాడలలో నడుస్తూ, భారతీయ గృహిణిననిపించుకొన్నావు”-అని హాస్యం చేసేడు.
భద్ర ఒక నిశ్చయానికి వచ్చింది.
“మీరెవ్వరూ బాధపడకండి. జానకి పెళ్ళి ఎల్లా జరిగినా దాని అత్మకేమీ ఢోకా కలగలేదు. బావ చిన్నప్పుడు మీరు పెట్టింది, ఏం తిన్నాడో. ఇల్లువదిలాక మీనుంచి ఒక్కకానీ ఎరగడు. అది అతడి పెళ్ళాం. ఆస్తి కోసం వచ్చిందనుకొంటారేమోనని దాని హడలు. ఆ ప్రోత్సాహం నాది. తండ్రికి న్యాయంగా రావలసింది కొడుక్కు సంక్రమించకుండా ఎందుకు అడ్డుపడతావని నేనే పెచీపెట్టా. కాని అదే ఒప్పుకోలేదు. “ఇరవయ్యేళ్ళ కాలంలో వాడి ఎడ్రసు కావాలంటే దొరకకపోయిందా? నాకా భ్రమ లేదు. నువ్వు పెట్టుకోవద్దు” అంది.
“ఆ కుర్రాడు దాని కొడుకు. దారిపొడుగునా నన్ను ఊదరెట్టేశాడు. ఆస్తిమాట ఎత్తవద్దన్నాడు. నా అంతట నేను ఎత్తనని మాట ఇచ్చేను. అటువంటి మనుష్యులు వాళ్ళిద్దరూ. మీ ఇంటికి సరాసరి నేను వచ్చాను. కాని, అది రాలేదు. పోయి హోటలులో దిగింది. కుర్రవాడు పెద్దవాడయ్యాడు. ఎప్పుడేనా తనవాళ్ళ నెవరినీ చూపించనే లేదంటాడేమోనని తీసుకు బయలుదేరింది. మీ టెలిగ్రాం లేకపోయినా ఓ రోజున వచ్చి మీ నలుగురినీ పరిచయం చేసి వెళ్ళిపోయేది. మీరు పిలుస్తారనే ఆలోచే లేదు దానికి. మీరు పిలిచినట్లుగా భావించడంలేదు. ఒక్కటి. టెలిగ్రాం చూసి, పెద్దవాళ్ళని కుర్రవాడు చూడలేకపోతాడేమోనని కాస్త హడావిడి పడింది. దానికీ నేనే కారణం....”
తమరి గురించి జానకి ఊహలంటూ భద్ర చెప్తూంటే నలుగురూ స్తబ్దులయ్యారు.
“నా మాట విని ఆస్తి గురించి బెంగపడకండి. అది ఆస్తికోసం రాలేదు. నేనే మొదట ఏమో అనుకొన్నా. కాని నేనూ ఇప్పుడు దాని అభిప్రాయాన్నే బలపరుస్తున్నా. మీ ఆస్తి స్పర్శ ఏమూలనుంచి తగిలినా వాళ్ళకి క్షేమం కాదు. మీకేనా అది అరగడంలేదు. దానికెందుకు? కనీసం మాట దక్కించుకోండి. తన మగడి వాళ్ళు ఎటువంటి మనుషులో దానికి వినికిడిమీద మాత్రమే తెలుసు. తెలిసిందేదీ మీకు ప్రతిష్ఠ అయినది మాత్రంకాదు. నాకు తెలుసు. ఇప్పుడది రుజువు చేసుకోవద్దు....”
భద్ర మరి సమాధానానికి ఎదురు చూడకుండా లేచి వెళ్ళిపోయింది.
లక్ష్మీపతి కూడా లేచేడు.
“ఇంక అనవసరమయిన మనోవ్యధ ఎందుకు? మనసులు పాడు చేసుకోవద్దు. అందరూ మనలాగే వుండరు.....”
“భద్ర మాటలకేం గాని....” అంటూ సీతాపతి ఏదో చెప్పబోయేడు. కాని, లక్ష్మీపతి వినదలచుకోలేదు.
“చీకటిపడింది. ఆస్తిమీద, అందులోనూ పిలిచి ఇస్తామంటున్నా, అంత మమకారంలేని మనిషి ఎలా ఉంటారో, పలకరించి ఇంటికి వెడతా....” అంటూ ఓ అడుగువేసి మళ్ళీ వెనక్కితిరిగేడు.
“రేపు ఆమెనూ, కుర్రాడినీ మా ఇంటికి తీసుకెళతా. భద్రతో చెప్తా. మీరు ముగ్గురూ రండి. దేవతార్చన అక్కడే చేద్దురుగాని....”
సూర్యకాంతమ్మ నవ్వింది.
“దంజ్యాలు తీసేశాక అర్చన ప్రారంభించేవేం?”
లక్ష్మీపతి నవ్వేడు.
ఎనిమిదో ప్రకరణం
లక్ష్మీపతి హోటలుకౌంటరు వద్ద గుమాస్తాను అడిగేడు.
“పదో గదిలోవారున్నారా?”
ఉన్నట్లు తెలుసుకొని పైకెళ్ళేడు. లౌంజ్లో కూర్చుని సెర్వరు కుర్రవానికి తనపేరు వ్రాసిన చీటీ ఇచ్చి పంపేడు.
రెండు నిమిషాలలో రవీంద్ర వచ్చేడు. ఆ వచ్చినవారు తన పినతండ్రే అయివుండవచ్చుననే ఆలోచనే లేదు. వస్తూనే పరిచయం తెలుపుకొన్నాడు.
“నేనే రవీంద్రను....తమరు”
“ఆ చీటీ పంపింది నేనే; రా ఇల్లా కూర్చో....”
రవీంద్ర సంకోచిస్తూ పక్కన కూర్చున్నాడు. లక్ష్మీపతి అతని చేయి తనచేతిలోకి తీసుకుని రాస్తూ అన్నాడు.
“ప్రవర ఇల్లాంటి సందర్బాలలో స్వయం పరిచయానికి వీలుగా వుంటుంది. కాని ఏం చెయ్యను! నేను లక్ష్మీపతినంటే నీకు తెలియలేదు. మనమధ్య బంధుత్వం కలిపిన మనిషిని మనం ఇద్దరం ఎరగం. మన బంధుత్వంలో ఉన్న సమానలక్షణం అది. ఇంతకీ నువ్వు రవీంద్రవేనా?”-అని నవ్వేడు.
“మీరు చూడాలనుకున్న జానకీదేవి మా అమ్మగారే.”
“నేను మీ నాన్నగారి తమ్ముళ్ళలో ఒకడిని. పేరు చెప్పే కదా.”
రవి మరోమారు నమస్కారం తెలిపేడు.
“మధ్యాహ్నం తాతయ్యగారింటికి వెళ్లాం. రమణి అత్తయ్యా నేనూ మంచి ఫ్రండ్సు అయాం.”
లక్ష్మీపతి చటుక్కున ఆనేశాడు.
“మిగలినవాళ్ళు కాలేకపోయారన్నమాట.”
రవీంద్ర గంభీరంగా అదేం కాదన్నాడు.
“అదేం కాదండి. మిగతా వాళ్ళంతా బాగా పెద్దవాళ్ళో, బాగా చిన్నవాళ్ళో కాదాండి.”
లక్ష్మీపతి మనస్సులో అతనిని మెచ్చుకున్నాడు.
“అక్కడ రాజామణి అన్నామె కనిపించిందా?”
“పేర్లు చెప్పలేనండి. ఇద్దరు అత్తయ్యలు....రమణిగారితో కలిసి ముగ్గురు అత్తయ్యల్ని చూశా. ఒక పిన్నమ్మగారు కనిపించేరు.”
“మీరు చూడని ఆమె ఇంకొకామె వుంది.”
“ఔనౌను. రమణి అత్తయ్య చెప్పారు. ద్వారకానగర్లోనో, మరెక్కడనో ఉన్నారట ఆమె. కాలేజీలో లెక్చరరట. రేపు ఏదో వేళ వెళ్లి వారిని చూసిరావాలనుకున్నాం.”
“వెతుక్కుంటూ మీరు వెళ్ళవలసిందేగాని, వారెవ్వరూ రారా?” అన్నాడు లక్ష్మీపతి కొంటెగా. రవీంద్ర గ్రహించినట్లు లేదు.
“ఇందులో వంతులకేముందండి. మేము వచ్చినట్లేనా వారు ఎరగరు కదా. తెలియగానే తాతయ్యగారూ, నాయనమ్మగారూ వచ్చేరు. పాపం ఎండలో రావడం చేతనో ఏమో తలనొప్పి వచ్చింది.”
లక్ష్మీపతికి ఆ సమాధానం బాగా నచ్చింది. సంతోషంగా భుజం తట్టేడు.
“అదీ అలావుండాలి. హుందాగా-”
తన మాటలో విశేషం ఏం ఉండి, పినతండ్ర్రి ఆ సంతోషం తెలిపాడో రవికి అర్ధంకాలేదు. అతని ముఖం వంక చూసేడు. ఆ కళ్ళలో నీళ్ళు కనబడ్డాయి. కంగారు పడ్డాడు....
“నేనేమన్నా....”
లక్ష్మీపతి కళ్ళు వొత్తుకున్నాడు.
“ఏమీ లేదు. నీ సమాధానం నాకెంతో సంతోషం కలిగించింది. మీ అమ్మగారు నీకు మంచి మనస్సు ఇచ్చేరు. ఆ ఆరోగ్యం కాపాడుకో. సుఖపడతావు.”
అతని అభిప్రాయం ఏమిటో, ఎందుకో తెలియలేదు. ఊరుకున్నాడు.
లక్ష్మీపతి మాట మారుస్తూ-”ఏం చదివేవు?” అన్నాడు.
రవీంద్ర చెప్పేడు. లక్ష్మీపతి ఆసక్తితో అతని ముఖంవంక చూసేడు.
“కళాకారుడి వన్నమాట. మా ఇంట్లో ఒక ఆర్టిస్టు! చాల బాగుంది”
తన చదువుకి ఈ సంఘంలో విలువ వున్నట్లు అంగీకరించిన కొద్దిమందిలో ఈయన ఒకడు. ఆమాటే చెప్పినప్పుడు లక్ష్మీపతి నవ్వేడు.
“ఏం విచారపడకు. ఇందులో ఒక రహస్యం వుంది. నిజంగా ప్రతిభ, ప్రజ్ఞ ఉంటే తప్ప దీనిలో రాణించలేరు. మేష్టరీ, డాక్టరు, వకీలు లాంటి వాళ్ళ చదువులున్నాయి చూడు. పేస్ మార్కుల మట్టుకు ఏదో పింగిస్తే మరి వాళ్ళకింక ఫర్వాలేదు. దేశాన్ని చిత్రవధ చేసేసినా మరి అడిగేవాడుండడు. చిత్రకారుడిది అలా కాదు. బొమ్మ అందంగా వుంటే చాలదు. గీతలు భావస్ఫోరకం కాకపోతే మన ముఖం ఎవడూ చూడడు. అణా డబ్బులు రాలవు. కనక ఇందులో పేస్ మార్కులు తెచ్చుకొన్నానంటే చాలదు. ప్రతిభ వుండాలి. ప్రజ్ఞ కూర్చుకోవాలి. సులువుగా బ్రతికేసే దారి ఎదట వుండగా అనవసరశ్రమ ఎందుకనే మనస్తత్వం తప్ప ఏం ఫర్వాలేదు....తాతగారి స్కెచ్ వేసవట కదా.”
“మేం రావడంలో ముఖ్యమైన ఉద్దేశం బందులందరివీ ఫోటోలో స్కెచ్ లో తీసుకోవాలనేనండి. మేము ఎవ్వరినీ ఎరగం కదాండి.....”
“వారంతా నిన్ను ఎరుగుదురా?”
“ఎరగరనుకోండి. నేను తెలుగుదేశాన్ని చూడనే లేదు. అన్నీ కలసివస్తాయని రెండుమూడేళ్ళుగా అనుకొంటూ వస్తున్నాం. కుదరలేదు.”
“పోనీలే. మంచిపని చేశారు. అమ్మ ఏం చేస్తున్నారు?”
“తల పోటుగా వుందని పడుకున్నారు.”
లక్ష్మీ పతి అలోచించేడు.
“సరి లేపకు. రేపు ప్రొద్దున్న వస్తా. మీ ఇద్దరూ మా ఇంటికి....ఎక్కడో తెలుసా? ద్వారకానగర్....అక్కడికి....”
“తాతయ్యగారికి ప్రామిస్ చేశాం.”
“నేను చెప్పే వచ్చేను.మళ్ళీ చెప్తా.”
లక్ష్మీపతి ఫోన్ తీసేడు.
“నాన్నగారూ! నేను లక్ష్మీపతిని....వదినగారు ఒంట్లో బాగులేదని పడుకొన్నారుట....రవీంద్రని చూశా....రేపు సెలవు పెడతాను....వీరిద్దరూ మా ఇంటికి వస్తారు....రమణిని తీసుకుని మీరిద్దరూ రాండి. భద్ర ఉందా? పిలవండి....అంతా కాఫీలకే రాండి.”
మరుక్షణంలో ఫోన్ మీద భద్ర గొంతు వినిపించింది. జానకి తలపోటు మాటవిని కంగారు పడింది.
“నేను రానా?....”
“రాగలవా? నువ్వు మాట్లాడి వప్పించగలుగుతే ఈ రాత్రికే మా ఇంటికి తీసుకు వెడతా. పిలిస్తే పలికే తోడు లేకుండా, పొరుగూళ్ళో.... హోటలు....”
రవీంద్ర ఆటంకం చెప్పాడు.
“పొరుగూరూ, హోటలూ ఏమిటండి. బాగానే ఉందండి.”
“మనవాళ్ళ ఇళ్ళకన్న హోటలే బాగుంటుందంటావు? భలే వాడివిలో....(ఫోనులో) అబ్బే రవీంద్ర....”
“నిన్ను పిలుస్తూందోయ్” అని ఫోన్ అందించేడు.
“నేను....అత్తయ్యగారూ! కాఫీ తాగి పడుకుంది....నిద్రపోతూంది....ఫర్వాలేదు....చీకట్లో రాకండి….అబ్బే! ఏం లేదండీ....కావలిస్తే నేను పిలుస్తాగా....నంబరుంది....”
తొమ్మిదో ప్రకరణం
తెల్లవారేసరికి తల్లీ, కొడుకూ స్నానాలు సహా పూర్తిచేసేశారు. ఆకాశం మబ్బుమబ్బుగా ఉంది. చలిగా ఉండి జానకి స్వెట్టరు వేసింది.
“అంత చలిగా ఉందా?-” అన్నాడు రవీంద్ర.
“చన్నీళ్ళు పోసుకున్నా కదా? చలి అనిపిస్తూంది.”
“వేణ్ణీళ్ళు తెప్పించుకోవచ్చు కదా, అమ్మా! రాత్రి ఒంట్లో బాగులేదని పడుకొన్నావు కూడాను....ఏమన్నా జ్వరంగాని....” అంటూ తల్లి చేయి పట్టుకు చూసేడు.
“జ్వరం ఏం లేదోయ్. కాస్త బడలిక చేసిందంతే. ఓ కప్పు కాఫీ తీసుకుంటే....”
జానకి బటన్ నొక్కింది. దూరంలో ఎక్కడో గంట మోగిన చప్పుడు.
“ఏదన్నా టిఫిన్ కావాలా?”
రవీంద్ర వద్దన్నమాట పూర్తి కాకపూర్వమే సెర్వర్ హడావిడిగా వచ్చేడు.
“రెండు కాఫీలు!....”
కాఫీ చప్పరిస్తూ జానకి నెమ్మదిగా ప్రశ్నించింది.
“ఎల్లా ఉంది అనుభవం?”
రవీంద్ర ఒక్క నిముషం ఆలోచించేడు.
“చాల గందరగోళంగా ఉంది. రమణి అత్తయ్య నాకు నచ్చింది. తాతయ్యగారు కూడా ఫర్వాలేదు. అయతే ఒకటి అనిపిస్తూంది. మనిషి తన మనస్సులోని చీకటి కోణాల్ని ప్రత్యేకించి తనవాళ్ళ దగ్గరే చూపిస్తాడు ఎందుకో మరి.”
ఆ జిజ్ఞాస ఎందుకు వచ్చిందా-అనుకొంది జానకి.
“ఏం? ఎందుకనుకొన్నావు?”
“కారణం చెప్పలేను. రమణి అత్తయ్య మాట్లాడుతుంటే, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్లు వుండదు. మిగిలినవారితో ఏమిటో ఎబ్బెట్టుగానే ఉంది....”
“వయస్సు తేడాలు కావచ్చునేమో.”
“పెద్దఅత్తయ్యగారి కాంతం నాయిీడుదే కద….”
ఆ అమ్మాయి మాటలు, చేతలు బహుశా జానకికీ నచ్చలేదో ఏమో. ఆమె ఆలోచిస్తూ ఊరుకుంది.
“ఆ టెలిగ్రాం పట్టి మన ఆలోచనలు చాల తలక్రిందులుగా నడిచేయి. మనం ఇక్కడ అవాంఛనీయ అతిధులం....” అన్నాడు రవీంద్ర. జానకి మ్లానహాసం చేసింది.
“అగ్రహారంలో మనం అత్తయ్యగారింటికి సరాసరి వెళ్ళగలిగాం. ఇక్కడ తిన్నగా హోటలులో దిగేం. బంధుత్వం లెక్కచూస్తే వీళ్ళు మనకు దగ్గర. కాని, మన మనస్సులలో ఆ దగ్గరతనం లేదు. పైకి చెప్పక పోవచ్చు. కాని, మనపనిలో ఆ భావం వుంది. అదే వారి మనస్సులలో ప్రతిబింబిస్తూందేమో...”
తల్లి సుదీర్ఘ సమాధానం రవీంద్రకు తృప్తి కలిగించలేదు.
“మనం చేస్తున్న పనుల మంచి చెడ్డల్ని విమర్శించుకోడం, పరిశీలించుకోడం మంచిదే. తప్పు కాదు. కానీ, మనం చేసేవన్నీ తప్పుగానే అనుకుంటే....”
“తప్పు అనుకోడం కాదోయ్. ప్రతి చిన్న విషయంలోనూ క్రియ-ప్రతిక్రియ ఉంటాయి. దానిని తెలుసుకోడం ఆత్మనిందకు కాదు. పరాయి వాళ్ళ పనుల్ని కేవలం వ్యతిరేక దృక్పధం నుంచే చూడకుండా కొంచెం హద్దు పెట్టుకోవాలి....”
రవీంద్ర ఏ సమాధానమూ చెప్పేలోపున సెర్వరు వచ్చి చీటీ అందించేడు. జానకి చీటీ చూస్తూనే కప్పు బల్లమీద పెట్టింది.
“మీ బాబయ్య వచ్చేరు.”
“అప్పుడే వచ్చేశారే-”
“వారిని కూర్చోబెట్టి కాఫీ ఇయ్యి. వస్తున్నామని చెప్పు....”
“వారితో ఒక అమ్మగారు కూడా ఉన్నారు. చిన్నబాబును తీసుకొచ్చేరు” అన్నాడు సెర్వరు.
జానకి ఆశ్చర్యం కనబరచింది.
“భార్యనీ, పిల్లవాడినీ తీసుకోచ్చేరులా వుంది. ఈ చలిలో....సరి. నువ్వెళ్ళి చెప్పు” అని సెర్వరును పంపేసింది.
ఇద్దరూ లౌంజ్లోకి వెళ్లేసరికి లక్ష్మీపతి లేచి రెండడుగులు వేసేడు. రవీంద్ర వెంటనే పరిచయం చేసేడు…. ”బాబయ్యగారు....”
అతను వెంటనే భార్యవేపు తిరిగి “మా వదినగారు....” అని పరిచయం చేశాడు.
జానకి గబగబ వెళ్ళి తోడికోడలు చంకనున్న రెండేళ్ళ పసివానిని అందుకోంది. “కొత్త ఉందా?”
“పిలిచేవాళ్ళుండాలేగాని ....” అని రాజామణి చిరునవ్వుతో అందించింది. వాడు కళ్ళు చక్రాల్లా చేసి తనను అందుకొన్న కొత్తమనిషి వంక చూస్తున్నాడు.
“నన్ను ఎరగవు” అంటూ జానకి వాని బుగ్గలు పుణికింది. వాడు చిరునవ్వు నవ్వేడు.
“మేము ఫ్రండ్సు అయాం” అని జానకి మిగిలిన వారివేపు తిరిగింది.
“రాండి. కూర్చోండి....పొద్దున్న లేచేక చెప్పేడు....”
నలుగురూ కూర్చున్నారు.
“రాత్రి వచ్చేను. తలపోటుగా ఉందని పడుకున్నారట.”
వెంటనే రాజామణి మాట కలిపింది.
“ఇంటికొచ్చి చెప్పేరు. ఒంటరిగా హోటలులో ఎందుకు వదిలేసేరు. తీసుకురాకపోయారా?-అన్నా. వచ్చెయ్యవలసింది.”
“పెద్ద ఇదేం లేదు. పగలంతా అటూయిటూ తిరగడం. కొత్త చోటు, కొత్త పరిచయాలు. ఆ ఎక్సైట్ మెంట్ వలన కలిగిన బాధ. అందులో వెనకరాత్రి అసలు నిద్ర లేదు కూడా. అంతే. నిద్రపోయేసరికి తగ్గిపోయింది.”
“అయినాను! ఒంటిరిగా ఉండడం....” అని రాజామణి అంది.
“ఒంటరితనాని కేముంది? రవి వున్నాడు.”
“నిజమే అనుకోండి. అయినా దగ్గరలో వున్నాం గనక...”
థేంక్సు తెలిపి, జానకి మాట మార్చింది.
“మీరు కాలేజీలో పనిచేస్తున్నారట కాదూ. ఏ కాలేజీ....అసలు ఇక్కడవున్న కాలేజీలు ఏమిటో తెలియవనుకోండి....”
రాజామణి తన వుద్యోగ స్థలం....వివరాలు చెప్తూండగా, సెర్వరు అందరికి ప్లేట్లతో టిఫిన్లు తెచ్చేడు. లక్ష్మీపతి ఆశ్చర్యం కనబరిచేడు.
“ఇది చాలా బాగుంది. మిమ్మల్ని తీసుకెళ్ళాలని మేం వస్తే, మీరు మాకు విందు చేస్తున్నారు” అంది రాజామణి.
“రెండు ఇడ్డెన్లు విందా?” అంది జానకి.
“మరి మా ఫ్రెండ్ మాటేమిటి?” అంటూ కుర్రవాడిని తీసుకుని గదిలోకి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు అతని చేతిలో ఒక ఆపిలూ, ఒక చక్రకేళీ వున్నాయి.
పదో ప్రకరణం
మేనత్త మగని కబురు విని మేడమీదికి వెళ్ళేసరికి భద్రకి మేనత్త ఆక్రోశం వినిపించింది. ఒక్క క్షణం నిలబడింది.
“మీరు ఎల్లాగూ మానరు. నన్ను మాత్రం వీధిలో పడెయ్యకండి. ఆడపిల్లలకి అన్యాయం చెయ్యకండి. రమణి ఇంకా పెళ్ళికుంది. దుడుగూ దుడుగూ చేతులు కడుక్కుని కూర్చోవద్దు.”
అంటూ సూర్యకాంతమ్మ చర్రున గదిలోంచి ఇవతలికి వచ్చింది. అక్కడ భద్రను చూసి గతుక్కుమంది.
“నీకోసమే ఎదురు చూస్తున్నారు వెళ్ళు.”
“వస్తున్నా.”
భద్ర రాంగానే కుమారస్వామి పెద్ద వుపోద్ఘాతం లేకుండా తన మనస్సులోని నిర్ణయాన్ని ఆమె ముందు పెట్టేడు.
“అతనికి కొంత ఆస్తి ఇవ్వాలని అనుకొంటున్నా.”
మేనత్త మాటల్నిపట్టి అటువంటిదేదో వున్నదని గ్రహించినా కుమారస్వామి నోట స్పష్టంగా విన్నాక భద్రకు ఆనందమే కలిగింది. కాని, సాయంకాలం జరిగిన చర్చల అరుచి ఇంకా మెదడును పట్టి వదలలేదు. నిగ్రహించుకొంది.
“అనవసరమేమో, మామయ్యా! ఆస్తులిస్తేనే బంధుత్వాలా? అయినా బావల్నీ, వదినల్నీ, చెల్లాయిల్నీ, అత్తయ్యనీ అడగండి. వాళ్ళకి ఈ దృష్టి లేదు.”
కుమారస్వామి క్లుప్తంగా అనేశాడు.
“అందరూ ఎరుగుదురు” ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు-“ఒప్పుకొన్నారు.”
“సరి. చెప్పేదేముంది? మీ యిష్టం.”
“ముసలివాళ్ళం. ఎప్పుడే అవసరాలు వస్తాయో. డబ్బు పంచదలచలేదు.”
“అది వుంచుకోండి. రమణి చదువూ, పెళ్ళీ మిగిలి వున్నాయి కదా” అంది భద్ర.
“ఇంక భూములు, ఇళ్ళు, స్థలాలు....”
“ఒకటి చెప్పవచ్చునా?”
“కానీ....”
“వాళ్లు తెలుగు దేశంలో వుండే ప్రయత్నంలో లేరు.”
“ఏదో శివసేన గొడవలుగా వుంది. అక్కడేం వుంటామంది ఆవిడ.”
“నిజమే. ఆ క్షణంలో అనిపించినా ఎక్కడికెడుతుంది? ఎక్కడ మాత్రం అలాంటి గొడవలు లేవు గనక! అవి సాగనిస్తే పిల్ల హిట్లర్లు ఈసుళ్ళలా పుట్టకురారూ? ఏం ఫర్వాలేదు.”
“మీరంతా రాజకీయాలలో మునిగి తేలుతున్నవాళ్లు. మీకు తెలుస్తాయి.”
“ఏం తెలియనివాడిలా ఏం నటిస్తావు, మామయ్యా? వాళ్ళంతా మీ బోటివాళ్ళ వర్దీలో పెరుగుతున్నవాళ్ళేగా?”
“పక్కదారిన పడ్డాం....చెప్పు” అంటూ కుమారస్వామి ప్రస్తుతం జ్ఞాపకం చేసేడు. భద్ర తాను ఎక్కడ పక్కదారి పట్టిందో జ్ఞాపకం చేసుకొనేందుకు ఒక్క క్షణం ఆగింది.
“బొంబాయిలో దానికి వుద్యోగం వుంది. ఇంకా పది పన్నెండేళ్లు చెయ్యొచ్చు. ఓ యింట్లో ఫ్లాట్ వుంది. వాడు ఏవేవో ఆలోచనల్లో వున్నాడు. అతడికీ మన ప్రాంతం వస్తేకన్న అక్కడనే భవిష్యత్తు వుంటుందనే భావం వుంది.”
తన మాటలు వింటున్నదీ, లేనిదీ చూసుకొనేందుకు వో క్షణం ఆగింది.
“ఊ చెప్పు” అన్నాడు కుమారస్వామి సాలోచనగా.
“మీరు భూమి పంచితే వాళ్ళేం చేసుకొంటారు?”
తన వాదాన్ని బలపరుస్తూ భద్ర భూమిని ఇస్తే వున్న ఇబ్బందుల్ని వివరించింది.
“ఇంక అయినకాడికి అమ్ముకుపోవాలి. లేదా ఎవరికో అమరకం చెయ్యాలి. ఆ డబ్బు రాదు. మనం ఎరగని గొడవలా?”
“నీ అభిప్రాయం ఏమిటి మరి?”
“ఎక్కువ తక్కువో కొంచెం సర్దుకొని డబ్బు ఇస్తేనే మేలు.”
“ఊ.”
కుమారస్వామి ఆలోచించేడు.
“బొంబాయిలో యిల్లు వాయిదాల పద్ధతి మీద తీర్చుకొనేటట్లు తీసుకొన్నదయి వుంటుంది” అన్నాడు.