జానకి నవ్వింది. “నీ యిష్టం. యిందులో దగ్గర దూరం మాట ఏముంది? వీలూ, చాలూ గాని!”
భద్ర మళ్లీ ఆలోచనలో పడింది. తాను వచ్చిన పనికి, జానకి హోటలులో దిగడమే అనుకూలం అనుకుంది.
“తేల్చుకో త్వరగా” అని జానకి తొందరపెట్టింది.
భద్ర రిక్షాను కేకేసి, తన నిర్ణయం చెప్పింది.
“గాంధి నగరమే వెడతా.”
“పరిస్థితి ఏమిటో, వో అరగంటలో ఫోన్ చేస్తాను. చెప్పు. విశేషం ఏమీ లేకపోతే, ఒక్క గంట నిద్రపోయి వస్తాం.”
రెండో ప్రకరణం
స్నానం చేసి వచ్చేక ప్రాణం హాయిగా వుంది. ఇంకా రవీంద్ర స్నానాల గదినుంచి బయట పడలేదు. అతడు వచ్చేక భోజనం.
ఈలోపున అత్తవారింటి పరిస్థితి తెలుసుకోవచ్చు. అవసరం అనుకొంటే....
డైరీ తీసి నెంబరు వ్రాసుకొని, హోటల్ లౌంజిలోకి వెళ్ళి ఫోన్ చేసింది.
ఆవలివేపునుంచి ఎవరిదో స్త్రీ కంఠం.
“కుమారస్వామిగారిల్లు. ఎవరు కావాలి?”
“నా పేరు జానకి. అగ్రహారం నుంచి వచ్చిన భద్రగారున్నారా?”
“ఇప్పుడే వస్తారు. లైన్‌లో వుండండి.”
ఫోన్ క్రిందపెట్టి ఆమె వెళ్ళినా, ఆయింట జరుగుతున్న సంభాషణలన్నీ జానకి చెవిని బడుతున్నాయి.
“ఎవరో జానకట. నిన్ను పిలుస్తున్నారమ్మోయ్. నువ్వు వచ్చినట్లు ఇంట్లోనే నలుగురికీ తెలియలేదు. ఆవిడకెల్లా తెలిసిందోగాని....”
తరవాతిమాట భద్రది.
“మీ పెద్ద తోడికోడలు. మేమిద్దరం కలిసే వచ్చేం.”
ఆమె తన భర్త తమ్ముడి భార్య. ఏ తమ్ముడో? ఎందరు తమ్ముళ్లో?
ఆమె తన భర్త తమ్ముడి భార్య. ఏ తమ్ముడో? ఎందరు తమ్ముళ్లో?
మరుక్షణంలో భద్ర ఫోన్ తీసుకొంది. “ఎవరు జానకీ!”
“ఔను. అక్కడంతా క్షేమమేనా?”
“ఆ. ఏం కంగారు లేదు. విశ్రాంతి తీసుకొని రా. మామయ్యకీమధ్య బ్లడ్‌ప్రెషర్ కొంచెం హెచ్చిందట. అంతే. మరేం విశేషం లేదు.”
“ఎవరితోటి భద్ర మాట్లాడుతూంది, అప్పుడే” అని లోపలినుంచి ఒక వృద్ధకంఠం. బహుశా మామగారు అయివుంటారు.
“మేం వచ్చినట్లూ, ఇక్కడ దిగినట్లూ చెప్పలేదా?....” అని జానకి ప్రశ్న.
భద్ర నవ్వింది. “పనిగా చెప్పలేదంతే....నువ్వు మంచిపనే చేసేవు.”
జానకి నవ్వింది. “నువ్వూ మంచిపనులే చెయ్యాలని ప్రయత్నించు. లేనిపోని గొడవలు పెంచకు.”
జానకి వుద్దేశం అర్థం అయినా భద్ర దానిని అర్ధం చేసుకోనట్లే మాట్లాడింది. “నాదేం వుందే, అయినా నీకున్న మొండితనం నాకు లేదే తల్లీ!”
“శ్రీ శ్రీ చెప్పినట్లు ‘వడ్డించిన విస్తరి’ నీ జీవితం. నీకెందుకు వస్తుందమ్మా? నాది అవసరం. మరి నేనుండనా....”
జానకి ఫోన్ పెట్టేసింది. అప్పుడే వచ్చిన రవితో ‘భోజనానికి లేద్దామా?” అని కదిలింది.
“అత్తయ్యగారేనా?”
“ఔను. తాతయ్యగారు తిరుగుతూనే వున్నారుట! మనం ఓ గంట విశ్రాంతి తీసుకొని వెళ్ళవచ్చు.”
“భోజనం గదిలోకి తెమ్మంటా.”
“నేను చెప్పానులే. నడు.”
భోజనం చేస్తుండగా సెర్వరు కబురు తెచ్చాడు.
“ఎవరో ముసలి ఆయనా, వారి భార్యా, ఒక అమ్మాయి వచ్చేరు. మీ పేరు అడుగుతున్నారు.”
జానకి ఎవరా అని ఆలోచనలో పడ్డా, సెర్వరుకు చేయవలసిన పని పురమాయించడంలో పొరపడలేదు.
“నా కోసమేనా?”
“చిత్తం. జానకమ్మగారు ఒక గంట క్రితమే వచ్చేరని చెప్పేరు.”
“మనల్ని ఇక్కడ ఎరిగిన వారెవరు? మనం వచ్చినట్లేనా ఎవరికి తెలుసునబ్బా.” అన్నాడు రవీంద్ర సాలోచనగా.
“మేడమీదికి తీసుకొచ్చి లౌంజులో కూర్చోబెట్టు. తలో కాఫీ ఇయ్యి. పేర్లు తెలుసుకో....” అని సెర్వర్‌ను పంపేసి, కొడుకు ఆలోచనలకి సాయపడింది.
“మనల్ని ఎరిగింది అత్తయ్య. ఆవిడే చెప్పాలి. ఎవరికి? మీ తాతయ్యగారు, నాయనమ్మగారు వచ్చివుంటారా? ఏమో....” అంటూ జానకి ఆలోచనలూ, అనుమానాలూ కలబోసింది.
సెర్వరు తిరిగివచ్చేడు. వారు కూర్చున్నారు. పేర్లు అడిగితే ఇవ్వలేదు.
“భోజనం చేసి రానీ కూర్చుంటాం” అన్నారు.
“సరే” అంది జానకి.
భోజనం కాగానే సెర్వరు ప్లేట్లు తీసుకు వెళ్ళిపోయేడు.
రవి పెట్టెలోంచి స్కెచ్ పుస్తకం తీస్తున్నాడు.
“ఇప్పుడవి ఎందుకోయ్?”
రవి నవ్వేడు.
“బొమ్మలు గీసుకుంటూ కూర్చుని మర్యాదలు మరిచిపోతావు గనక” అని హెచ్చరించింది.
ఇద్దరూ, తమ గదికి తాళం పెట్టి వెలుపలకు వచ్చారు.
దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకొనేవరకూ ఆగంతకులు ముగ్గురూ, గుర్తించలేదు తమరిని. తమకోసం వచ్చేరని తెలుసును గనక తప్ప వారు ముగ్గురూ ఎవరో తెలియలేదు జానకికి. ఆమె ముసలాయనను ఎన్నడూ చూడనేలేదు. అత్తగారిని చూసింది. కాని, పోలికలు తెలియలేదు. ఆ అమ్మాయి ఎవరో....”
“నమస్కారమండి. నా పేరు జానకి. తమరు నా కోసం అడిగేరట.”
ఆ మాట వినగానే చిన్న అమ్మాయి లేచింది. చటుక్కున ప్రతి నమస్కారం చేసింది.
“మా భద్ర వదిన చెప్పింది. మీరు యిక్కడ వున్నారని. వీరు మా నాన్నగారు, మా అమ్మగారు....” అంటూ పరిచయం చేసింది.
వృద్ధదంపతులు వారిని చూసినప్పుడు తాము వచ్చినది వారికోసమేననుకోలేదు. హోటలులో దిగిన మరి ఇతరులెవరో అనుకొన్నారు.
కాని, పరిచయం వారిని నిస్తబ్ధుల్ని చేసింది. తమ ఎదుటనున్న ఆ గంభీరవిగ్రహాన్ని చూసి, జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.
చేతి కర్రమీద గడ్డం ఆన్చి, ముందుకు వంగి నిశ్శబ్దంగా చూస్తున్నాడు, ఆయన. ఆ చూపులలో ఏదో అనుమానం. ఆశ్చర్యం, ప్రశంస కనిపిస్తున్నాయి. తాము వచ్చింది ఈమెకోసమేనా? జానకి బ్రాహ్మణాగ్రహారంలో పుట్టి పెరిగిందన్నారు. ఆ లక్షణాలేవీ తన యెదుటనున్న విగ్రహంలో లేవు.
సూర్యకాంతమ్మ కూడా తెల్లబోయింది. తన కొడుకు మరణించేడు. అతని భార్య ఆంధ్ర బ్రాహ్మణ వితంతువులాగ సంప్రదాయ సిద్ధంగా ముసుగుతో వుండడం ధర్మం. ఆ ఆకారం లేకపోయినా దీనంగా, రోగిష్టిగా ముక్కుతూ, మూలుగుతూ, బెదురుతూ, భయం భయంగా ఎంతో దయనీయంగా వుండి వుంటుందని ఆమె కల్పన.
కాని వారి ఎదటనున్న విగ్రహం వారి ఆలోచనలకు ఏమాత్రం సరిపడలేదు. ఆమె బాగా ఎత్తరి. ఆ ఎత్తుకు తగిన పుష్టితో మంచి ఆరోగ్యంగా కనిపిస్తూంది.
అక్కడక్కడ తెలుపు తిరుగుతున్నా పెద్ద జుట్టు. నీటుగా దువ్వి వలలో బిగించింది.
కుడి చేతిన రెండు బంగారు గాజులు. ఎడమ మణికట్టున వాచి తప్ప ఇతర నగలు లేకపోయినా శరీరవర్ణం ఆ లోటు కనబడనీయడం లేదు. నిరాడంబరంగా వున్నా మంచి ఖరీదయిన చీర కట్టింది.
ఆమెను చూసి, ఎవరో తెలుసుకోగానే ముసలువాళ్ళిద్దరి మనస్సులూ విభిన్నభావ సంభ్రమాలకి లోనయ్యేయి.
వారా సంభ్రమం నుంచి తేరుకొనే లోపునే జానకి కూమారుని వంక తిరిగింది.
“నానీ. చూడు. వీరు నీ తాతగారు! వీరు నాయనమ్మగారు.”
రవీంద్ర చేతులు జోడించి వినయంగా నమస్కారం చేసేడు. అతని రెక్కబట్టుకొని ముందుకు నెట్టుతూ అతని పరిచయం చేసింది.
“మీ మనమడు. పేరు రవీంద్ర.”
ముసలివాళ్ళ దృష్టి మళ్ళింది. ఎదుటనే వున్న తల్లి పోలికలు కనిపిస్తున్నా, అంతకన్న భిన్నమైన ఏవో పోలికలు ఇద్దరి మనస్సులలోనూ మెదిలాయి.
ముసలాయన ఆశీర్వదిస్తున్నట్లు చేయి జాపేడు. అతనిలో కొడుకును చూసుకొంటూంటే కంఠం నిండి వచ్చింది.
సూర్యకాంతమ్మ కూడా కదిలిపోయింది. డగ్గుత్తికతో-“ఇలారా, నాయనా!” అంది.
ముసలివాళ్ళ పరిస్థితి చూసి జానకి కదిలిపోయింది. చిన్నగా కొడుకును ముందుకు నెట్టింది. అతడు పోయి వృద్ధదంపతుల నడుమ కూర్చున్నాడు.
జానకి వారితో వచ్చిన పడుచు ప్రక్కన కూర్చుంది.
“నువ్వెరివో తెలిసింది. కాని పేరు ఎరగనమ్మా!”
ఆ ఏకవచన ప్రయోగం సూర్యకాంతమ్మకు నచ్చలేదు.
“మీ ఆడపడుచు” అని గుర్తు చేసింది. జానకికి అర్థం కాలేదు.
“మిమ్మల్ని పరిచయం చేయడంలోనే తానెవరో చెప్పేసింది, గడుస్తనంగా.”
మళ్ళీ ఏకవచనం? సూర్యకాంతమ్మకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మొగం ఎర్రబడింది. కుమారస్వామి భార్య వుద్దేశం గ్రహించేడు.
“మా ఆఖరు అమ్మాయి రమణి” అని పరిచయం చేసేడు. సూర్యకాంతమ్మ ఆమె చదువు చెప్పింది.
“ఎం. ఎస్‌సి. చదువుతూంది. సెలవులకి వచ్చింది.”
తన కూతురు చదువులో కూడా ఏమాత్రం తక్కువ కాదు సుమాయని జ్ఞాపకం చేయడం ఆమె వుద్దేశం. కాని జానకి ఆమె అసలు హెచ్చరికనింకా గ్రహించలేదు.
“చాలా బాగుంది. సబ్జక్టు ఏమిటమ్మా!”
కుమారస్వామి భార్య మాట్లాడేందుకేమాత్రం అవకాశం ఇచ్చినా రభస సృష్టించగలదని భయపడ్డాడు. ఇంక తానే ఇతరుల మాట చొరనివ్వకుండా సంభాషణ ఎత్తుకున్నాడు.
“మీ పెద్ద వదినగారమ్మా! కాలేజీలో లెక్చరరు. ఏమిటి మీ సబ్జక్టు”
కోడలు అయినా, తనకన్న బాగా చిన్నదైనా చనువుగా ఏకవచన ప్రయోగం చెయ్యలేకపోయేడు.
“తమరు నన్ను మన్నించడం న్యాయం కాదండి. నువ్వనడం తప్పు కాదు.”
చటుక్కున సూర్యకాంతమ్మ అందించింది.
“ఆడపడుచును నువ్వనకూడదు. ఆ మాత్రం తెలియదా?”
జానకి తెల్లబోయింది. ఇందాకటి నుంచీ ఆమె ప్రయత్నం అదన్నమాట. అంతలో సర్దుకొని క్షమార్పణ చెప్పుకొంది.
“క్షమించండి.”
తల్లి మాటకు రమణి సిగ్గుపడింది.
“ఏమీలేదు. చిన్నదానిని మీరు మన్నించడం ఏమిటి?”
జరగవలసిన పని జరిగిపోయేక కుమారస్వామి మనమని వంక తిరిగేడు. ఆప్యాయంతో అతని భుజం మీద చెయ్యి వేసేడు.
“భద్ర చెప్పింది.”
“ఎండలో కష్టపడి వచ్చేరు. మేమే వస్తున్నాము. అత్తయ్యతో చెప్పింది అమ్మ.”
దానికి ఆ వృద్ధుడు చెప్పింది ఏమిటో తల్లి కొడుకులిద్దరికీ కొరుకుడు పడలేదు.
“ఇరవయ్యేళ్ళ క్రితం ఇలాగే హోటలు నుంచి వాడిని తీసుకెళ్ళలేకపోయా. వాడు మళ్ళీ ఇంటికి రాలేదు. అల్లాంటి పనే మళ్ళీ చేస్తానేమోననిపించింది. నిన్ను చూడాలనే వచ్చేనోయ్....” అన్నాడు ఆయన.
రవీంద్ర ‘థేంక్స్’ తెలిపాడు.
తండ్రి మాటలకి వ్యాఖ్యానంలాగ రమణి చెప్పుకుపోయింది.
“భద్ర వదిన చెప్పింది. సరిగ్గా తండ్రి పోలికే. ఆ వయస్సులో అతడు అల్లాగే వుండేవాడంది. ఇంక ఆయన ఒక్క నిముషం ఆగలేదు.”
ఒక్క నిముషం ఆగి మళ్ళీ చెప్పింది.
“మా అన్నయ్యని చూసిన గుర్తు కూడా లేదు నాకు. వాళ్లు మరిచిపోలేదు. ఓమారు ఇంటికి వచ్చేడట. ఇద్దరూ ఆయన అని తెలియక చిరాకు పడ్డారట. తెలిసి చేసింది కాదు, ఆ పని. కాని, దాని ఫలితం మనస్సుని కోతపెడుతూనే వుంది.”
జానకికి ఆ ఘటనలు, ఆ చరిత్రలు ఏమీ తెలియవు. కాని ఆ వృద్ధదంపతుల మనోభావాలు కర్ణాకర్ణిగా వింది. ముసలాయన పంపిన మనుష్యులే భర్త మీద దౌర్జన్యం చేయడం తెలుసు. కనక వారి మనస్సు కోత గురించి ఆమెకు ఏమాత్రం సానుభూతి కలగలేదు.
కాని, ఆ యిద్దరిలో తన భర్త మీద దౌర్జన్యం చేయించేడన్న కుమారస్వామిని చూస్తూంటే జానకికి ఆ కథ నిజమే అయి వుంటుందా అనిపించింది. కాని, సూర్యకాంతమ్మ యెడ ఆమెకు సద్భావం కలగడం లేదు. చిన్నప్పుడు పెళ్ళికాకపూర్వం ఆమెను మద్రాసులో చూసింది. అప్పుడైనా ఆమె ఎల్లాగో వున్నట్లే అనిపించింది. మగని దివాన్‌గిరీ ఆమెకు మెడనరం పట్టించింది. ఆ వుద్యోగం యిప్పుడు లేకపోయినా ఆ నరం సర్దుకొన్నట్లు లేదు.
ముసలాయన మనమడి భుజం పట్టుకొని కోడలివేపు తిరిగేడు.
“మీరిద్దరూ లేవండి. మనింటికి పోదాం. మనిల్లు వుండగా మీరిక్కడ వుండడం బాగులేదు.”
“లేవండమ్మా!” అని సూర్యకాంతమ్మ మగని పిలుపును బలపరిచింది.
వారు వచ్చేరన్నప్పుడే విశ్రాంతి ఆశ వదులుకొంది, జానకి.
“మేమూ బయలుదేరే ఏర్పాటులోనే వున్నాం” అంటూ కొడుకును రాక్షాలు చూడమని పురమాయించింది.
“ఇక్కడ టాక్సీలు లేవులా వుంది” అంది రమణితో.
“అక్కర్లేదు, కారుంది.”
“అయితే సరే. వస్తున్నాము. ఒక్క క్షణం కూర్చోండి....నానీ, ఏమన్నా తీసుకోవాలా?....మీరు కూడా రాండి! మొఖం కడుక్కోరూ!” అని రమణిని బయలుదేరతీసింది.
“మీరు అల్లా నన్ను మన్నిస్తూంటే నాకు చచ్చినంత సిగ్గుగా వుంది.”
“ఏమీ లేదు.”
కుమారస్వామి కూతురును పిలిచేడు.
“డ్రైవరుని పిలు. కూలి కుర్రాడిని తీసుకొని పైకి రమ్మను.”
“ఏం కావాలం”ది జానకి.
“మీ సామానులు తెచ్చి కారులో....”
జానకి అటువంటి ప్రశ్నా, సమస్యా రాగలదని ముందే సిద్ధపడింది.
“అద్దె రెండు రోజులకి ముందే కట్టేశాను. వుండనియ్యండి. తరవాత చూడొచ్చు.”
అమె తన ఆహ్వానం కోరుతూ హోటలులో తాత్కాలికంగా మకాం పెట్టలేదన్న మాట. తమ యింట బసచేసే ఆలోచన ఆమెకు లేదని ముగ్గురూ గ్రహించేరు.
“అల్లా ఎందుకు చేశావమ్మా!” అని మాత్రం అనగలిగేడు కుమారస్వామి. అయితే ఆ మాటలోనే మనస్సులోని నొప్పి అర్థం అయింది. నిరుత్సాహంగా-
“సరే....సరే....లేవండి” అన్నాడు.
జానకి రమణినీ, కొడుకునూ వెంటబెట్టుకొని తమ గదివేపు నడిచింది.
ఆమెవేపే చూస్తున్న సూర్యకాంతమ్మ నెమ్మదిగా అంది.
“ఏమిటా వేషం? ఏమి పోకిళ్ళు? ఏమిటా విరుగుబాటుతనం?”
భార్య మనస్సులోని ఈర్ష్యను కుమారస్వామి అర్థం చేసుకొన్నాడు.
“ఆమెతో లేనిపోని గొప్పలకుపోయి కలహం పెంచుకోకు. ఈ కుర్రాడేనా దగ్గరగా రానీ.”
“ఏం ఫర్వాలేదు. వాళ్ళూ ఎత్తుమీదే వచ్చారు. బెంగెట్టుకోకండి.”
మూడో ప్రకరణం
తమ గదిలోకి వెళ్ళేక జానకి కబుర్లు ప్రారంభించింది. తాను వెడుతున్న యింట్లో పిల్లలు ఎవరుంటారో, ఎందరు వుంటారో తెలుసుకోవాలి. పిల్లలున్న చోటికి చేతులూపుకొంటూ వెళ్ళడం మర్యాద కాదు. కొందరికిచ్చి మరికొందరిని వదలడం సబబూ కాదు.
“మీ చిన్నన్నగారు ఎక్కడుంటున్నారు?”
“మనం వెడుతున్న యింట్లోనే. ఇంకో అన్నయ్య ద్వారకానగర్‌లో వుంటున్నారు.”
“అయితే జ్యోతి అని ఒక వదినగారు వుండాలి. ఏ అన్నగారి భార్య?”
“మీరు చిన్నన్నయ్య అన్నారే ఆయన భార్య. చనిపోయి పదేళ్ళయ్యింది.”
“అయ్యో పాపం! పిల్లలా?”
“లేరు. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఈమెకు నలుగురు....”
“ద్వారకానగర్‌లో అన్నయ్యకి?”
“ఇద్దరు. ఆవిడ మీలాగే లెక్చరరు.”
“ఆయన?”
“ఆయనాను.”
“మీకు అక్కగార్లుండాలి కదూ?”
“ఇద్దరు. వాళ్ళ అత్తవారిది ఈ వూరే. పెద్దావిడది జగన్నాధపురం. రెండో ఆమె ఈండ్రపాలెంలో వుంటున్నారు.”
గదిలోకి అప్పుడే వస్తున్న రవీంద్ర తల్లి సంజ్ఞమీద వారి దగ్గరకు వచ్చేడు.
డబ్బు తీసుకెళ్ళి నాలుగైదు బిస్కట్ పేకెట్లు, స్వీట్స్ పట్టుకురా నానీ!”
“అంతకంటె పళ్ళు తేవడం బాగుంటుంది కాదమ్మా!”
“బాగుంటుందనుకో. కానీ పళ్ళ దుకాణాలు ఎక్కడున్నాయో నీకెల్లా తెలుస్తుంది? బిస్కట్లు, స్వీట్స్ అయితే దిగువనున్న కిళ్ళీషాపులో వున్నాయి.”
“ఔననుకో. పళ్ళయితే తాతగారు కూడా తినగలుగుతారు.”
అతని సమాధానం విని రమణి నవ్వింది. తండ్రి విషయంలో అతడు కనపరచిన ఆప్యాయతకు ఆమె ఎంతో సంతోషించింది. అతని చేయి పట్టుకొంది.
“రా నేను చూపిస్తా.”
ఇద్దరూ వీధిలోకి బయలుదేరేరు.
“ఇప్పుడే వచ్చేస్తాం. మీరు వుండండి. వదినగారు వస్తున్నారు.” అని రమణి తల్లిదండ్రులను సమాధానపరచింది.
జానకి వారి వెనకనే వచ్చింది.
“ఎక్కడికమ్మా వాళ్ళిద్దరూ వెళ్ళేరు?”
“వాడు ఏదో కావాలనుకొన్నాడు. ఆమె చూపిస్తానన్నారు.”
“డ్రైవర్ని పంపుతే అతడే తెచ్చేవాడు కదా” అన్నాడు ముసిలాయన.
జానకి ఏమీ అనలేదు. మరో పావుగంటలో ఇద్దరూ తిరిగి వచ్చేరు.
“లేవండి, వెడదాం.”
“ఏంకావాలో తెచ్చుకొన్నారా?” అన్నాడు కుమారస్వామి.
“ఆ” – అంది. రమణి తానే.
నాలుగో ప్రకరణం
కారు ఒక పెద్ద ఆవరణలో ప్రవేశించి ఒక మేడముందు నిలబడింది. ఆవరణ చాల పెద్దదే. దానిలో వో క్రమం లేకుండా పది కొబ్బరిచెట్లు, నాలుగు జీడిమామిడిచెట్లు, రెండు మామిళ్ళు కనిపించాయి. దొడ్డి అంతా మెరకలు, పల్లాలు. కొంతమేర ఇసుక. కొంతమేర మన్ను, నానా చెత్త మొక్కలతో కీసర, బాసరగా వుంది. రోడ్డునుంచి మేడ ముంగిలివరకూ దారి కాస్త తెరిపిగా వుందేగాని, శుభ్రంగా లేదు. దొడ్డిలాగే మేడ కూడా పెద్దదిగా కనిపిస్తూంది. దొడ్డిలాగే అదీ వెలవెలపోతూ వుంది. చటుక్కున చూస్తే ఏదో శిధిలమందిరం అనిపిస్తుంది. కాని, కాదు. అందులో శైథిల్యం ఏమీ లేదు.
గుమ్మంలో కారు ఆగిన చప్పుడు విని ఏడెనిమిదిమంది పిల్లలు పరుగెత్తి వచ్చారు. అంతా మండిగం దగ్గర అటూ ఇటూ సర్దుకున్నారేగాని రాలేదు.
రమణి వదినగారి వేపు చూస్తూ “అక్కయ్యలు ఇద్దరూ వచ్చేరులా వుంది.” అంది.
“అందర్నీ ఇక్కడే చూడగలుగుతా” నంది జానకి.
ముసలాయన కారు దిగి ఒక్కమారు వెనక్కి తిరిగి “రాండి” అని ఆహ్వానించి తాను ముందుకు నడిచేడు.
“ఇంట్లో నలుగురినీ పరిచయం చేసుకొని పైకిరా, రవీ!” అని తను మేడ ఎక్కేడు.
రవీంద్ర వినయంగా “అల్లాగే నండి” అన్నాడు.
“నేను తీసుకొస్తాలెండి....” అని రమణి వాగ్దానం చేసింది.
కుమారస్వామి మేడమీదకు వెళ్ళిపోయేక కుర్రవాళ్ళ పురోగమనం ప్రారంభమయింది. క్షణం క్రితం పిల్లలులాగా ఒదిగివున్న వాళ్ళంతా పెద్దపులులులాగా తయారయేరు. వాళ్ళను నిలబెట్టడానికీ, ఎవరెవరేమిటో చెప్పడానికి రమణి ప్రయత్నించింది. కాని సాగలేదు.
కొడుకు చేయిపట్టుకొని జానకి గుమ్మంలోకి వచ్చేసరికి ఎనిమిదేళ్ళ పిల్ల గబగబా ముందుకు వచ్చింది.
“మీరు ఎవరూ?”
వెనకనే వున్న రమణి ముందుకువచ్చి ఆ పిల్లను దగ్గరకు తీసుకుంది.
“పెద్ద అత్తయ్యగారిని అలా అడగవచ్చునా?” అని మందలించింది.
ఆ పిల్ల ఎవరో చెప్పడానికి జానకి వేపు తిరిగేసరికి అంతకన్న పెద్ద వాడు ముందుకొచ్చేడు.
“ఏం కావాలి? ఎందుకొచ్చేరు?”
ఈమారు పక్కనేవున్న సూర్యకాంతమ్మ వో అడుగు ముందుకు వేసి వానిగడ్డం పుణికింది.
“ఏం కావాలా? నీ కోసమే, నిన్ను చూసిపోదామనే వచ్చేరురా” అంది. అంటూనే ప్రక్కకితిరిగి “పెద్దాతని పెద్దకొడుకు....” అంది. అంతలో తెలివి తెచ్చుకుని సర్దుకొంది.
“అదే సీతాపతి కొడుకు.”
తన భర్తను ఆ యింట్లో పెద్దకొడుకుగా కూడా మరచిపోయారని జానకి గ్రహించింది.
ఇంతలో డ్రైవరు పళ్ళబుట్ట తెచ్చి అక్కడ పెట్టడంతో పిల్లల దృష్టి అటు మళ్ళింది. ఇంట్లోకి దారి విడింది.
లోపలి హాలులోకి వెళ్ళేసరికి నలుగురైదుగురు ఆడవాళ్లు కూర్చుని వున్నారు. సూర్యకాంతమ్మ వారికి రవీంద్రను పరిచయం చేసింది.
“రామానుజమ్మగారూ! ఇదిగో. ఇతడు మా విశ్వపతి కొడుకు. ఈవిడ ఇతని తల్లి. బొంబాయిలో వుంటున్నారు. ఈవేళనే వచ్చారు.”
జానకి ఆ పండు ముత్తయిదువుకు నమస్కారం తెలిపింది. ఎవరన్నారో మొదట తెలియకపోయినా ఒకరివెనకనొకరు “కూర్చోండి. కూర్చోండి” అని నలుగురూ ఆహ్వానించేరు. వారితోపాటు చాపమీద కూర్చుంటూ కొడుకుతో “తాతగారు రమ్మన్నారు కదా. వెడతావా. బుల్లి అత్తయ్యగారిని తీసుకెళ్లు” అంది.
సూర్యకాంతమ్మ మొదట పరిచయం చేసింది అతడినే అయినా, కూర్చున్నవారిలో ఒకావిడ మళ్ళీ అడిగింది.
“మీ అబ్బాయా? ఇలా రా నాయనా?”
రమణి ఆమె ఎవరో చెప్పింది.
“పెద్ద అత్తయ్య.”
రవీంద్ర నమస్కారం తెలిపేడు.
“నీ పేరేమిటయ్యా!”
ఒకమారు చిన్న అత్తయ్య, ఇంకోమారు పిన్నమ్మ, మరోమారు రామానుజమ్మ వరసగా, అనంతంగా వేస్తున్న ప్రశ్నలకు రవీంద్ర బెరుకు బెరుకుగా సమాధానాలు ఇస్తున్నాడు. మధ్యమధ్య నన్ను బయటపడెయ్యమన్నట్లు రమణివంక చూస్తున్నాడు. ఆమె తెల్లబోయి, నిస్సహాయంగా నిల్చుంది.
“ఏం చదువుకున్నావు?”
“తెలుగు వచ్చునా?”
అందరూ తలొకటీ, క్రమం లేకుండా అడుగుతున్న ప్రశ్నలు కొద్దిసేపటిలో ఒక క్రమంలో పడ్డాయి. రామానుజమ్మే అడిగింది.
“కొడుక్కి పోచ పడిందా అమ్మా!”
ఆ అవకాశం చూసుకొని రవీంద్ర వారి మధ్యనుంచి దాటుకొన్నాడు.
“తాతయ్యగారు కనిపెట్టుకొని వుంటారు. వెళ్ళొస్తానండి.”
పెద్ద మేనత్త ధారాళంగా అనుమతించింది.
“వెళ్ళిరా అమ్మా!”
ఊహించి వుండని ప్రశ్న వలన కలిగిన సంభ్రమం నుంచి జానకి సర్దుకొంది.
“లేదండి.”
“అదేమిటమ్మా! ఇరవయ్యేళ్ళ కొడుకుండగా ఎవరో కర్తృత్వం మీద వేసుకొని తద్దినం పెట్టడం కర్మ ఏం వచ్చింది? అలా ఎందుకు చేశావు, తల్లీ!” అని పెద్ద ముత్తయిదువ రామానుజమ్మ అనుతాపం చూపింది.
అనుకోని దారికి మళ్ళిన సంభాషణకు జానకి మరింత తత్తరపడింది. తద్దినం, కర్తృత్వం వగైరా మాటలతో మనస్సులోని గాయం పచ్చి చేసింది. బాధ కలిగింది. నిగ్రహించుకొని వూరుకుంది.
ఈమారు రామానుజమ్మ సూర్యకాంతమ్మకు సలహా యిచ్చింది.
“మీరు పెద్దవాళ్ళిద్దరూ వో మంచి ఘడియ చూసి, వో జందెప్పోగు వేసెయ్యండి. బ్రాహ్మడికి గర్భాష్టకంలో ఉపనయనం అయిపోవాలి. రోజులిలా వచ్చేయి గనకగాని, మా చిన్నప్పుడు ఇలా వుండేదా?”
జానకికి బురదలో చిక్కుపడ్డట్టు అనిపించింది. ఒడుగు చేయడం, సాంప్రదాయికాచారాలూ యెడ తనకు విశ్వాసం లేకపోవడమే కాదు. ఖచ్చితమైన అభ్యంతరాలున్నాయి. వేల సంవత్సరాలు మానవజాతి సాధించిన మానసికపురోగతిని అవహేళన చేయడమే, వానిని ఆచరించబోవడమని ఆమె విశ్వాసం.
కాని ఆ వాదనలూ, ప్రతివాదనలూ ప్రవేశపెట్టేందుకు అది సమయమూ కాదు, సందర్భమూ కాదు. అక్కడున్న జనం దానిని వినిపించుకోనూ లేరు.
హఠాత్తుగా రంగంలో భద్ర ప్రవేశించి, కొద్దిసేపు ఆమెనా చిక్కులోంచి బయటపడేసింది. మనస్సు కూడదీసుకొని తయారుకావడానికి ఆ వ్యవధి సరిపడింది.
“ఎంతసేపయిందే జానకీ, వచ్చి? ఈ పొరుగునే మా వూరి అమ్మాయి వుంది. వోమారు చూసివద్దామని అలా వెళ్ళా....”
“అత్తగారూ, మామగారూ హోటలుకే వచ్చేరు. విశ్రాంతి మాట తరువాత చూసుకోవచ్చని వారితో వచ్చా....”
“రవీంద్ర ఏడీ?”
“వాళ్ళ తాతగారితో వున్నాడు.”
సూర్యకాంతమ్మ తెగిపోయిన సంభాషణను తిరిగి అతుకుపెట్టింది.
“రవీంద్రబాబుకి మమ్మల్ని ఇక్కడ వొడుగు చేసెయ్యమంటున్నారు రామానుజమ్మగారు.”
భద్ర కళ్ళలో కొంటెతనం కనబడింది.
“బాగానే వుంటుంది. అయితే జానకి ఏమంటుంది?”
“కడిగిన ముఖం, వేసిన దంఝం వుండటం మంచిదంటారు పెద్దలు” అని కృష్ణవేణి అంది.
“అవును నీ కూతురుకు ఈడే కూడ. పనిలో పని ఆ ముడి కూడా వేయించెయ్యండి. మేనరికం....” అంటూ రామానుజమ్మ నవ్వింది.
కృష్ణవేణి సాంప్రదాయికాచారాలు పాటించే సనాతన కుటుంబంలో కోడలు. తన తమ్ముడు వితంతువును వివాహం చేసుకొన్నాడు. ఆ జంటకి పుట్టినవాడు రవీంద్ర. అతనికి పిల్లనిస్తుందా? కాని, ఆమాట చెప్పవలసిన పనిలేదు. నవ్వేసి వూరుకుంటే పోతుంది. కాని, ఆమె వూరుకోలేదు. వెంటనే తన కుటుంబం యొక్క శిష్టత్వాన్ని వర్ణించింది.
“ఈనాడు కూడా మావారు మూడుప్రొద్దులా సంధ్య వార్చందే విస్తరి దగ్గర కూర్చోరు.”
భద్ర అంత ఒడుపుగానూ అనేసింది.
“మా జానకికి బ్రాహ్మణ్యం, పూజలూ అంటూ చేపలపడవలు కాంట్రాక్టు చేసే వాళ్ళంటే అసలు భరించలేదు.”
కృష్ణవేణి భర్త హరనాధం కాకినాడ రేవులో, ఆంధ్రప్రభుత్వం చేపలు పట్టడానికై ప్రవేశపెట్టిన మోటారుబోట్లు కాంట్రాక్టు చేశారు.
కృష్ణవేణి తెల్లబోయింది. జానకికి అసలు విషయం తెలియకపోయినా భద్ర వెక్కిరింతను అర్థం చేసుకుంది. సర్దుబాటుగా అంటున్నాననుకొంది.
“ఈ కర్మకాండల మీద నాకూ, మావాడికీ కూడ నమ్మకంలేదండి”
నలుగురూ తెల్లబోయేరు. ఆడదానినోట అటువంటి భావం వినడం వారందరికీ ఆశ్చర్యంగానే వుంది.
సూర్యకాంతమ్మే ముందు తేరుకొంది.
“మనం చేస్తున్నవన్నీ నమ్మకం వుండే చేస్తున్నామా? పెద్దలనాటి నుంచీ వస్తున్న అలవాట్లూ, ఆచారాలూ....”
ఒకరికి మనచేత్తో ఉపనయనదీక్ష ఇవ్వడం అనేది మహోత్తమపుణ్యకార్యంగా జమ. ఈ వృద్ధాప్యంలో తలవని తలంపుగా స్వర్గద్వారాలు తెరిచే అటువంటి మహోత్కృష్ట కార్యం చేయగల అవకాశం వచ్చింది. దానిని ఆమె పోనియ్యదలచలేదు.
జానకీ వదలలేదు.
“నమ్మకం లేకపోవడమే కాదు. అది తప్పు అని తెలిసి చెయ్యడం”
“మనం బ్రాహ్మలుగా పుట్టడం కూడా తప్పేనా?” అంది రామానుజమ్మ ఎంతో బాధతో! “ఏం చదువులు వొచ్చేయర్రా”-అని అంగలార్చింది.
“మన పుట్టుక మన నిమిత్తం లేకుండా జరిగిపోయింది. అందరిలాగే మనమూ పుట్టాం” అంది భద్ర.
“ఓ దారం మెళ్ళో వేసుకుని ఆ పుట్టుకకి ఘనత ఆపాదించుకోడం, మిగిలిన వాళ్ళందరికీ దూరంగా వుండడం అదీ....అసలు తప్పు....” అంది జానకి.
సంభాషణ ఆ విధంగా తిరగడం అందరికీ సముద్రపు నీళ్లు పుక్కిలించినట్లు అనిపించింది. కృష్ణవేణి హేళన చేసింది.
“మా అమ్మకోడళ్లు పండితురాళ్లు.”
సూర్యకాంతమ్మ రుసరుసలాడింది.
“గుణాలకొద్దీ రణాలు.”
జానకి చిరునవ్వులో మనస్సులోని క్రోధాన్ని దాచిపెట్టింది. భద్ర ముఖం జేవురించడం చూసి వూరుకోమన్నట్టు కన్నుగీటింది.
విషయం వేడిలో పడిందని గ్రహించి రామానుజమ్మ చటుక్కున మాటమార్చింది.
“నువ్వుంటున్నది బొంబాయిలోనా అమ్మా?”
పదినిముషాలు ఆమాటలూ ఈమాటలూ చెప్పి జానకి లేచింది.
“ఒక్కమారు మామగారికి కూడా కనిపించి వస్తా. తరవాత అందరి దర్శనం చేసుకుంటా, సెలవిప్పిస్తే.”
“ఉంటారా! మా యింటిక్కూడా వోమారు రాండి” అని ఆహ్వానించింది కృష్ణవేణి.
“అందరినీ చూడాలనేకదా వచ్చింది.” అంటూ భద్రను వెంటదీసుకొని మేడమీదికి వెళ్ళింది.
“మహాగర్విష్టిలా వుంది” అంది కృష్ణవేణి.
“మాట దుడుకుతనం ఎక్కువ”….అంది శారద, ఆమె తోడికోడలు. ఆమె ఇంతసేపూ నిశ్శబ్దంగా కూర్చుని సంభాషణ వింటూంది.
అయిదో ప్రకరణం
ఇంటికి రాగానే సీతాపతి భార్యముఖతః జానకి రాక గురించి విన్నాడు. కాఫీ కప్పుతో పాటు వివరాలు కూడా అందచేసింది, కళ్ళు తిప్పుతూ.
“చాల ఘటికురాలల్లే వుంది. మహా తెలివిగలది....మగాళ్లు ఆవిడ ముందు యెందుకూ చాలరు.”
“అంటే....” అన్నాడు, సాలోచనగా.
“నన్నూ, రాజామణినీ పీకి పిండిపెట్టినట్లు అనుకున్నారు మీ అమ్మగారు. గరిట కాల్చి వాతబెట్టినట్లు నోరు నొక్కేసింది....” అని జానకి ఘటికురాలుతనానికి బలం చేర్చింది.
సీతాపతిరావు వూరుకొన్నాడు. తన అమాయకత్వాన్ని చెప్పేందుకై అత్తగారి రాలుగాయితనాన్ని వర్ణించ బూనుకొందా, ఆ రోజున అసలు విషయం బయటపడదు.
“వాళ్ళ కుర్రాడెల్లా వున్నాడు?”
“అబ్బో, తల్లిని మించిన గడుస్తనం. తాతగారిని బాగా లాయమారుతున్నాడు. ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి బొమ్మ గీసేడు. తాతగారి కోసమని అతడే బత్తాయిలూ, ఆపిల్సూ కొనుక్కొచ్చాడుట. మొత్తం మీద తల్లీ కొడుకూ ముసలాయన్ని బుట్టలో పెట్టేరు.”
బుట్టలో పెట్టడం యెందుకో శారద చెప్పనక్కర్లేదు. సీతాపతి యోరుగును. ఆస్తి కోసం. ఈమధ్య పంపకాలు, ఆస్తివాటాలు గురించి ఇంట్లో చర్చలు వస్తున్నాయి. శారద తన వుహలు నిరాధారం కాదని సాక్ష్యాధారాలు చూపించింది.
“పెద్దాడు కడుపున పడ్డప్పుడు కాన్పు కష్టమయి చచ్చిపోతానేమోనని అంతా కాంగారుపడ్డప్పుడు మీ అమ్మా నాన్నా వచ్చి చూడలేకపోయేరు. అలాంటివాళ్లు ఆవిడ వచ్చి హోటలులో దిగిందని భద్రమ్మగారు చెప్పేసరికి గడగడలాడుతూ స్వయంగా వెళ్ళి దర్శనం చేసుకొని మరీ తీసుకొచ్చేరు.”
“భద్ర వచ్చిందా?”
“అసలావిడ వెంట వదలడం లేదు. మీద ఈగవాలితే చెప్పుచ్చుకుంటూంది.”
“వాళ్ళిద్దరికీ మంచి స్నేహమటలే....” అన్నాడు సీతాపతిరావు.
“స్నేహం లేదు సింగినాదం లేదు. మనం యెరగని స్నేహాలేమిటి? బొంబాయిలో ఇల్లు వుందట. ఏమాత్రమో పిచికలు దగ్గర చేరేవుంటాయి. మచ్చిక చేసుకొంటే, కానీ ఖర్చు లేకుండా కూతురికి మొగుడు అమరుతాడు.”
“బాగుంటాడా?”
ఎంత బాగుంటాడో శారద ఒక చిన్న ఉదాహరణతో చెప్పేసింది.
“చేసుకోవచ్చునైతే మీ బుల్లి చెల్లెలు పైకి పోనివ్వదు.”
“ఏమిటా మాట? ఎవరన్నా వింటే....” సీతాపతిరావు నిస్సహాయక గదమాయింపు వినిపించేడు. శారద లెక్కచేయలేదు.
“చూస్తుంటే లేదుగాని, వింటే వచ్చిందా? ఆ కుర్రాడిని మీ చెల్లెలు ఒక్కక్షణం వెంట వదలడం లేదు. ఎక్కడ ఏం లోటు వస్తుందో. యెక్కడ కష్టపడిపోతాడో అని వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉంటూంది. చివరకి మేటినీ పేరెట్టి లాక్కుపోయింది.”
సీతాపతిరావు ఏమీ అనలేదు. ఒక్క నిముషం ఊరుకుని శారద మళ్ళీ అంది.
“కుర్రాడు బాగానే ఉన్నాడు. గునపంలా, ఒడ్డూ పొడుగూ వుంది. అయితే చదువూ సంధ్యా అట్టే వున్నట్టు లేదు.”
“అదేం మరి? బొంబాయిలాంటి పట్టణంలో వుండి, తాను చదువుకొని వుద్యోగం చేసుకుంటూ కూడా ఆమె కొడుక్కి చదువెందుకు చెప్పించలేదు?”
“రాదేమో! ఏం గొడవో ఏమో కాని, భద్రమ్మగారు మాత్రం డిగ్రీలమీద వెలపరం చూపిస్తున్నారు. మంచి ఆర్టిస్టు. స్వతంత్రమైన జీవనం. వెధవ డిగ్రీలు వుండి లాభమేం? అంటూ అతణ్ణి తెగ మెచ్చుకొంటున్నారు.”
“ఆవిడేం మాట్లాడలేదా? ఎంతసేపూ భద్ర ఏమందో చెప్తున్నావు?”
“మూగిదేం కాదు. కొడుకు వడుగు చెయ్యలేదా అన్నారు ఎవరో అక్కడ. ‘వడుగెందుకు?బ్రాహ్మడి ఎక్కువేమిటి? ఎవళ్ళు పుట్టినా ఒకటే దారి! చెరిగేసింది....బాబోయ్.....”
“మా అమ్మ ఏమంది?”
“ఆవిడ ధోరిణి ఏమీ నచ్చలేదు మీ అమ్మగారికి. అందుచేత వాళ్ళు కూడా మీ అమ్మగారిని వదిలేసి నాన్నగారిని పట్టుకున్నారు” అని శారద తేల్చింది.
“ఉహూ” అన్నాడు సీతాపతి సాలోచనగా.
ఆరో ప్రకరణం
తండ్రిని చూసి విషయాలు తెలుసుకోవాలని సీతాపతిరావు మేడమీదికి వెళ్ళేడు. ఆయన హాలులో పడక కుర్చీలో కళ్ళు మూసుకొని పడుకొని వున్నాడు. తలగట్ల కుర్చీ వేసుకు కూర్చుని తల్లి ఆయన నుదురు రాస్తూంది. తమ్ముడు లక్ష్మీపతి కూడా అక్కడే వున్నాడు.
“అలా పడుకున్నారేం?” అని సీతాపతిరావు నెమ్మదిగా ప్రశ్నించేడు.
“ఏం లేదు. కొంచెం అలసటగా ఉందన్నారు” అంది సూర్యకాంతమ్మ.
“భోజనం చేసేక ఓ నిముషం పడుకోవాలి. ఈ వేళ కుదిరింది కాదు. అంతే. మరేం లేదు.....” అన్నాడు కుమారస్వామి.
“అటువంటి పనెందుకు చేశారు? వయస్సు వచ్చాక కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఎంత అవసరమైన పనివున్నా ఆరోగ్యం కన్నానా?” అని సీతాపతి సన్నగా మందలించేడు. కొడుకు మందలింపు ముసలాయనకు చాలా సంతృప్తి కలిగించింది.
“విశ్వపతి పెళ్ళాం, కొడుకూ వచ్చి హోటలులో ఉన్నారన్నారు. ఇంటికి రమ్మందామని వెళ్ళేను. దానితో నిద్ర చెడింది.”
“మీదంతా లేనిపోని హైరాణ. ఊళ్ళోకి వచ్చినావిడ ఇంటికి రాకుండా వెళ్ళిపోతారా! వెళ్లి పిలుస్తేగాని రారంటే నేనో, తమ్ముడో వెళ్లి వచ్చేవాళ్ళం కదా! మీరు ఎందుకంత ఆయాసపడ్డం!” సీతాపతిరావు తన తండ్రి అనలోచితంగా, అనర్హుల విషయంలో ఆ ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తేల్చేడు.
“శారద చెప్తూంటే నాకు నమ్మకం కలగలేదు. ఎడ్రసు అడుగుతూ నిన్ననేకదా వైర్ చేశాం. విమానంలో రావాలన్నా వ్యవధి చాలదే! అప్పుడే ఎల్లా వచ్చేరంటాను నేను. అది వివరం చెప్పలేకపోయింది. మీరు చూసేరా? వాళ్ళేనా? గోగోల్ వ్రాసిన ఇన్ స్పెక్టర్ జనరల్ లో లాగ ఎవరినన్నా చూసి వాళ్ళనుకొంటున్నారా అన్నాను.”
“అబ్బెబ్బే అదేం మాట. వాళ్ళే ....” అన్నాడు కుమారస్వామి.
“ఊరికే హస్యనికన్నాను. అంతే. మీరు చెప్పినట్టే అంది శారద. అలా ఎందుకనుకుంటారు? భద్ర చెప్పిందిగదా అంది. ఇంతకీ ఆమె వచ్చిందట. ఏది?”