“నిన్న మీరు తెచ్చిన ద్రాక్ష, ఏపిల్సు వున్నాయి....”

“పళ్లేలలో పెట్టి, అమ్మాయిని పిలిచి, పైకి పంపించు-“ అన్నాడు.

సత్యవతమ్మ సందేహిస్తూ అంది.

“పాలేర్ని పంపి, ఇడ్డెన్లు తెప్పించలేరా?”

“సరే. నువ్వీ లోపున మిగిలినవి చూడు. పనిపిల్లనీ, ఎవర్నీ పైకి పోనివ్వకు.”

చాలా కాలానికి అల్లుడు యింటికి వచ్చాడు. అతనితో కూతురుకు ఏకాంతం కలిగించాలని పెద్దవాళ్ళ తాపత్రయం.

“దుర్మార్గం అంతా తండ్రిది. లేకపోతే కుర్రవాడు చాల మంచివాడు. నిన్న పేటలో కనిపించిందట. బట్టలు తీసుకోవాలంటే కార్లో బండార్లంకా అక్కడికీ తీసుకెళ్ళి, తీసుకొచ్చి దిగపెట్టేడు” అంటూ సత్యవతమ్మ అల్లుడు మంచితనాన్ని వెయ్యిన్నొకటోమారు మెచ్చుకొంది.

“అతడు మాత్రం? మనిషి మహా మంచివాడు. కాని, పాడు రాజకీయాలు....”

సత్యవతమ్మ చటుక్కున అడ్డుపడింది.

“సరిలెండి! మీ అందరికీ మిగిలినవే అవి.”

విశ్వనాధం నవ్వుకొన్నాడు.

నలభయ్యొకటో ప్రకరణం

అద్దం ముందు కూర్చుని జడ వేసుకొంటున్న సుశీల గుమ్మంలో మాట వినబడి తిరిగి చూసింది. గుమ్మంలో రంగనాయకులు నిలబడి వున్నాడు.

“రావచ్చా?”

భార్యగా, ధైర్యంగా చనువు చూపలేకపోతున్నాడని ఆ అభ్యర్ధనే తెలుపుతూ వుంది. సుశీల ఒక చేత్తో జడ పట్టుకొని చటుక్కున లేచింది. ఎదురు వచ్చింది. గుమ్మంలో అతని పక్కనుంచే అడుగుపెట్టి వరండాలోకి దారితీస్తూ ఆహ్వానించింది.

అక్కడ నాలుగైదు కుర్చీలు, బల్లమీద రెండుమూడు పుస్తకాలు, పక్కనున్న రాక్‌లో ఇన్ని పత్రికలు వున్నాయి.

“కూర్చోండి. అయిపోయింది. మొహం కడుక్కు వచ్చేస్తా. ఈ లోపున ఏ పేపర్లో చూస్తూండండి.”

ఆమె తన గదిలోకి వెళ్ళి రెండు మూడు పత్రికలు తెచ్చింది. అతడు అప్పటికీ నిలబడే వున్నాడు. సుశీల నొచ్చుకొంది.

“నిలబడే వున్నారు. కూర్చోకపోయారా?”

“నువ్వు వెళ్ళిరా.”

సుశీల తిరిగి వచ్చేసరికి ఓ అరగంట పైగా గడిచింది. స్నానం చేసి, బట్టలు మార్చుకొని మరీ వచ్చింది.

వచ్చేసరికి అతడు ఏదో ఆలోచిస్తూ అల్లాగే కూర్చుని వున్నాడు. ఇందాకా తాను సరిగ్గా చూడలేదు. కాని, మనిషి బాగా డీలా పడిపోయాడు. రాత్రి తెల్లవార్లూ నిద్రలేకపోవడం, ఆలోచనలూ, మనోవ్యధాతో మోహం పీక్కుపోయినట్లయింది. నాలుగు మూడు ఏళ్ళక్రితం అతనిని ఆ స్థితిలో చూసివుంటే సుశీల తల్లక్రిందులయిపోయి వుండేది. ఇప్పుడామెకు చిరాకు మాత్రమే కలిగింది.

“మళ్ళీ ప్రారంభం కాబోలు. రెండేళ్లుగా ప్రాణం హాయిగా వుంది.” అనుకొంది.

తన్ను భార్యాధర్మం నిర్వహించమని మళ్లీ పీడించడానికే ఈ రాకపోకలని నిన్నటినుంచీ ఆమె భయం. ఆ భయంతోనే అతడు వచ్చినప్పుడు తాను ఎల్లా వ్యవహరించాలో, ఎల్లా మాట్లాడాలో అన్ని కోణాల నుంచీ ఆలోచించుకొని వుంది. అతని ఆశలకి ఏమాత్రం జాగా ఇవ్వదలుచుకోలేదు.

అయితే మనస్సుకి కష్టంగా వున్నా మర్యాద లోపం చెయ్యలేదు.

“కాఫీ తీసుకొస్తా కూర్చోండి.” అంటూ జీడిపప్పూ, బిస్కట్లూ సర్దిన ప్లేట్లు ఎదురుగా టేబులు మీద పెట్టింది.

“ఇవేం అనవసరం. సుశీలా కూర్చో. వో నిముషం కూర్చుని కబుర్లు చెప్తావని వచ్చా.”

కూజాలోంచి గ్లాసులోకి మంచినీళ్ళు వొంపి తెచ్చి పక్కన పెట్టింది.

‘ఒక్క నిముషం’ అని ఆమె క్రిందకు వెళ్ళిపోయింది.

నలభైరెండో ప్రకరణం

“డికాక్షన్ వుందా, పెట్టాలా అమ్మా!”–అంటూ వంటింట్లోకి వచ్చిన కూతురుని సత్యవతమ్మ దీక్షగా ఎగాదిగా చూసింది.  ఆడంబరంగా లేకున్నా కూతురు అపరిశుభ్రంగా లేదని గమనించింది. రాకరాక మగడు వస్తే ఏదో సామాన్యమైన చీర మాత్రమే కట్టిందని కొంచెం అసంతృప్తి కనబరచింది.

“అంతకన్న కాస్త మంచి చీర లేకపోయిందటే అమ్మా!”

“దీని కేమమ్మా. శుభ్రంగా వుంటేనూ?”

“ఔనులే. శుభ్రంగా వున్నా....” అంది, ఆమె మనస్సులో అసంతృప్తి అలాగే మిగిలి వుంది. కాని, ఆ మాటనింక సాగించలేదు. పళ్లేలలో ఇడ్లీ సర్దుతూంది.

“పనిపిల్ల తెస్తుందిలే. నువ్వెళ్ళి కబుర్లు చెప్తూండు.”

“ఇవన్నీ ఎవరు తెచ్చేరు? నాన్నగారు వెళ్ళేరా? ఇంట్లో పళ్ళూ, బస్కట్లూ అవీ ఉన్నాయి కదా? ఆయన్ని శ్రమ పెట్టేవా?”

“ఇందులో శ్రమకేముంది? ఎవరన్నా పరాయివాళ్లకు చేస్తున్నామా, ఏమన్నానా?”

అంటూనే స్వరం తగ్గించింది. “ఏమంటున్నాడు?”

తల్లి ప్రశ్నకు ఏడవాలో, నవ్వాలో అర్థంగాక సుశీల పక్కున నవ్వింది. వేళాకోళంగా సమాధానం ఇచ్చింది.

“అనేందుకు ఏముంది? వేరే కాపురం పెట్టుకొందాం. మా నాన్న పెట్టుకోమంటున్నారు. అన్నా”రంది.

ఆ నవ్వుకూ ఆ మాటకూ పొంతన కుదిరినట్లు కనబడకపోయినా సత్యవతమ్మ ఆ మాటను నమ్మదలచింది. ఆమెకు అల్లుని మంచితనం మీద అంత విశ్వాసం. ఆ విశ్వాసంతోనే కూతురుకు నాలుగు మాటలు హితవు చెప్పింది.

“కాపురం పాడుచేసుకోకు. ఉద్యోగం, సద్యోగం ఆడదానికి కొంతవరకు కాలక్షేపంగా వుండొచ్చు. కాని, అవి సుఖం ఇవ్వవు. పడుచు రక్తం బలిమిలో నాకొకరి లెక్కేమిటనిపిస్తుంది. కాని, కాస్త వడిమళ్లేక పలకరించేవాడూ, ఆదరించేవాడూ లేకపోతే....”

తల్లి చెప్పకుండానే, రక్తం వడిమళ్ళక పూర్వమే అవన్నీ తనకు ఇప్పుడే దాఖలాగా కనిపిస్తున్నాయి. ఒంటరితనం బాధగానే వుంది. కాని, దానినుంచి బయటపడడానికై అవమానకరమయిన పరిస్థితికి తల ఒగ్గలేకుండా వుంది. కాని, ఆ మాట తల్లికి అర్థం కాదు. చాటుగా వస్తేనేం మగడే కదా. ఒకరో, ఇద్దరో పిల్లలు కలిగితే అతడే దారిన పడతాడంటుంది. లేదా, ఆ ముసిలాడు కలకాలం వుంటాడా?....అంటుంది.

ఆ చర్చలూ, వాగ్వాదాలూ మగడు ఇంట్లో వుండగానే ప్రారంభం కావడం ఇష్టంలేక, తల్లి కళ్ళ ముందు నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలనుకొంది.

“ఆయన ఒక్కర్నీ కూర్చోబెట్టి వచ్చా. మళ్ళీ పని పిల్ల ఎందుకు? ధెర్మాస్ గ్లాసులు వున్నాయిగా. కాఫీ వానిలో పొయ్యి.”

తాను మాట్లాడడం నిలుపుతే, తల్లి మళ్ళీ ప్రారంభిస్తుందేమోనన్నట్లు గబగబ ఏదో ఒకటి చెప్పేస్తూంది. “గ్లాసులు శుభ్రంగా వున్నయ్యా?”

“కడిగిపెట్టేను” అని తల్లి చెప్తున్నా మళ్లీ తాను కడిగి తెచ్చింది. వానిలో కాఫీ నింపింది.

బయలుదేరుతూంటే సత్యవతమ్మ ఏదో సందుచేసుకొని మాట దూర్చింది.

“మధ్యాహ్నం భోజనానికి వుంచెయ్యి.”

“హాస్పిటలు మూసేయమంటావా?”

“నీదంతా సోద్దెం. హాస్పిటలు పని అయ్యాకనే రాకూడదా?”

కూతురు ఏమీ అనకపోయినా, ఆమె హడావుడి చూసి, ఆ జంట సఖ్యపడిపోయారనే ఆమె ధృవపరచుకొంది.

సుశీల పైకి వెళ్ళిన మరునిముషంలో ఎవరో అతిధుల కోసం కాఫీ కావాలని లోనికి వచ్చిన విశ్వనాధం చెవిలో ఆ శుభవార్త పడేసింది. అతడు నవ్వేసేడు.

“నీదంతా మాలోకం. వూళ్ళోకి పోలీసువాళ్లు వచ్చారు. సర్కిలూ, ఎస్. ఇ. ఇప్పుడు మన సావిట్లోనే వున్నారు. వాళ్ళకి ఆరు కాఫీలు పంపు. మనలో మనమాట. వాళ్లు వచ్చేరని తెలిసే అతగాడు ఇటు మళ్ళేడని నా వూహ.”

సత్యవతమ్మ విస్తుపోయింది. కూతురు కాపురం కుదుటపడుతుందనుకొంటూంటే, మళ్ళీ ఈ జైళ్ళూ, అరెస్టులూ అడ్డమవుతాయేమోనని భయపడింది. ఏడేళ్ళ క్రితం చిన్నగా ప్రారంభమైన తగాదా జైళ్ళూ, కేసులూ మూలంగానే బిగిసి ఇంత తెచ్చిందని ఆమె అభిప్రాయం.

“మరి వాళ్ళనిక్కడకెందుకు తెచ్చేరు?”

భార్య ఆరోపణకి విశ్వనాధం తెల్లబోయేడు.

“నే తేవడం ఏమిటి నీ మొహం. ఈవేళ కొత్తగా వచ్చేరా? ఎప్పుడు ఏ పోలీసు ఆఫీసరు వచ్చినా మన యింట్లో కాఫీయేనా త్రాగకుండా వెళ్ళేడా? అలాగే యిప్పుడూ వచ్చేరు.”

“మరి అతని కోసం వచ్చేరని అంటారేం?”

భార్య ప్రశ్నలకి విశ్వనాధం భగ్గుమన్నాడు.

“ఎవరన్నారు? వెధవ ప్రశ్నలూ నువ్వూనూ. సరిగ్గా వినిపించుకోవు, ఏడవ్వు. ఊళ్ళో నాలుగు రోజుల నుంచి వూరేగింపులూ, సభలూ జోరుగా జరుగుతున్నాయిటేమిటని వచ్చేరు. వాళ్లు వచ్చేరనేగాని, ఎందుకు వచ్చేరో విని వుండడు. బుడుంగుమని మనింట్లో దూరేడు. క్రిందికి రానివ్వకు. మనం ఏదో చేసేశామని ఏడుస్తారు. ఆలోపున నేను వీళ్ళని వదుల్చుకుంటా.”

విశ్వనాధానికి అల్లునియెడ వ్యతిరేకత లేకపోయినా, అతని రాజకీయాల మీద ఏమాత్రం గౌరవం లేదు.

నలభైమూడో ప్రకరణం

మర్యాదకు ఏమాత్రం లోటు రాకుండా, చనువుకు అవకాశం ఇవ్వకుండా సుశీల అసిధారావ్రతంగా వ్యవహరిస్తూంది.

తాను తెచ్చిన ట్రే టీపాయి మీద పెట్టింది.

“ముఖం కడుక్కుంటారా? ఇదిగో వాష్‌బేసిన్. కుళాయిలో నీళ్లు వస్తాయి. ఇంతలో తుండు తెస్తున్నా.”

అతడు ముఖం కడుక్కునే లోపల గదిలోకెళ్ళి, చలవ చేసిన తుండు తెచ్చి వాష్‌బేసిన్ ప్రక్కనే వున్న ‘రాక్’ మీద వేసింది. దానిని తన చేతికి అందివ్వబోవడం లేదనే విషయాన్ని రంగనాయకులు గమనించేడు.

అతడు ముఖం తుడుచుకు వచ్చేసరికి తినుబండారాలు సర్దింది. కాని రంగనాయకులు అవేమీ ముట్టుకోలేదు.

“ఒక్క కాఫీ చాలునోయ్. ఇవన్నీ అనవసరంగా తెచ్చేవు.”

“ఫర్వాలేదు....పోనీ రెండు బస్కట్లేనా తీసుకోండి.”

అతడు మర్యాదకు ఒకటి తీసుకొని, కొరికి ప్లేట్‌లో పెట్టేసి, కాఫీ ముగించేడు.

సుశీల పనిమనిషిని పిలిచి బల్ల శుభ్రం చేయించింది.

పనిమనిషిని పంపేసి సుశీల వచ్చి, ఎదురుగా కుర్చీలో కూర్చుంది.

“ఇప్పుడు చెప్పండి. రోడ్డు మీద క్లినిక్ తెరిచేరట....”

సిగరెట్టు ముట్టించి తన సంభాషణ ఎక్కడినుంచి ప్రారంభించాలో తేల్చుకోలేక, సోఫాలో జేరబడి ఆలోచిస్తూ కూర్చున్న రంగనాయకులు ఆ ప్రారంభానికి తెల్లబోయేడు.

ఏదో ముఖపరిచయం వున్నవాళ్ళు, యాదృచ్ఛికంగా కలుసుకున్నప్పుడు వేసే కాలక్షేపం ప్రశ్నలా వినిపించింది. అతడు నిరుత్సాహంగా ఆమె ప్రశ్నలకి ఒకటి రెండు సమాధానాలిచ్చేడు. క్రమంగా సంభాషణ మొండిపడింది. ఇద్దరూ ఒక్క నిముషం నిశ్శబ్దంగా కూర్చున్నారు.

అతడు ఆరిపోతున్న సిగరెట్టుతోనే వేరొకటి ముట్టించి, మొదటిది ఆష్‌ట్రేలో నొక్కేసేడు.

కాఫీ త్రాగేక ఈ అరగంటలో అది మూడో సిగరెట్టని సుశీల లెక్కపెట్టింది. సంబంధంలేని పరాయివాడయినా, అతి సన్నిహితుడయినా వ్యాఖ్యానం చేసే ఘట్టం. కాని అది చనువులోకి లెక్క అవుతుందేమోనని భయపడి వూరికుంది, ఇప్పుడు.

రంగనాయకులు తల వంచుకొని, సిగరెట్టు చివరినుంచి, బద్ధకంగా లేస్తున్న సన్నని పొగతీగ వంక చూస్తూ ప్రారంభించేడు.

“ఈ మధ్య మన జీవితం గురించి అస్తమానం ఆలోచన వస్తూంది.”

సుశీల ఏమీ అనలేదు. ఒక్క నిముషం ఆగి అతడే ప్రారంభించేడు.

“రమారమి ముప్ఫయ్యేళ్ళు వచ్చేయి. ఈ జీవితంలో మనకిగాని, దేశానికిగాని వుపయోగపడే పని ఏమన్నా చేశామాయన్న ప్రశ్న పదే పదే కలుగుతూంది.”

ఆ ఆలోచనలకు తాను ఏ విధంగా ప్రతిస్పందించాలో ఆమెకు అర్థం కాలేదు. సహజమైన ప్రతిస్పందన కలగలేదు. వూరుకుంది.

అతడు ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు.

“తప్పు నాదేనంటే క్షమించగలవా?”

ఆ ప్రశ్న కూడా అతనియందు సానుభూతి కలిగించలేదు. “నేను క్షమించడం కోసమా తప్పు మీద వేసుకోవడం?” అనిపించింది. అయితే అదే భావాన్ని మరో రూపంలో వ్యక్తీకరించింది.

“క్షమించడానికి మీరు చేసిందేముంది? అదేమీ పెట్టుకోకండి.”

“కాదు సుశీలా!”

ఏవిధంగానూ గత జీవితాన్ని గుర్తు చేసుకోజాలనంత అసహ్యం సుశీల మనస్సులో పేరుకొని వుంది. దానిని మరిచిపోలేదు. తుడిచిపెట్టనూ లేదు. మరల మరల తవ్వుకొని మనస్సుకి వ్యథ తెచ్చుకొనే ధోరణి లేదు.

అందుచేత ఆ ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంపెయ్యాలి. చిరాకు అనిపించినా, ఖండితంగానే చెప్పింది.

“మీకు కావలసింది విడాకులు. నాకేమీ అభ్యంతరం లేదు. ఒకళ్ళనొకళ్ళం అవమానించుకోకుండా తేల్చేసుకుందాం. నాకు సాధువమ్మలమీదా దేవుడమ్మలమీదా భక్తి లేదు. కాని, వాళ్ళ ఆశ్రమాలు మర్యాదగా విడాకులు తీసుకోడానికి ఉపయోగపడుతున్నాయి. అంతకన్న మంచిమార్గం వేరేదేనా వుంటే చెప్పండి. అలాగే చేద్దాం. దానికోసం ఈ క్షమార్పణలూ, చిన్నపుచ్చుకోడాలూ అనవసరం....”

తన మాటలకు రంగనాయకులు బాధ పడడం కనిపించింది.

“నాకు కావలసింది విడాకులు కావు సుశీలా! నువ్వు, నువ్వే కావాలి.”

“నేనా?” ఆమె తల అడ్డంగా తిప్పింది.

రంగనాయకులు ఆమె నిరాకరణను పట్టించుకోకుండా తన ప్రతిపాదనను స్పష్టం చేశాడు.

“రెండేళ్ళ క్రితం అన్నావు. వేరే కాపురం పెట్టుకుందాం అన్నావు. మా నాన్నగారు కూడా....”

తండ్రియందున్న భక్తి భావంతో ఆమాట అనేశాడే గాని, ఆ ప్రసక్తి తీవ్ర వ్యతిరేకత కలిగించవచ్చునని కానలేకపోయేడు. తన తండ్రి ఆలోచన అదేననడంతో సుశీల దానికి విలువనివ్వనక్కరలేదనే నిర్ణయానికి వచ్చింది.

“ఏదో చిన్నతనం. అనుభవం లేకపోవడంచేత ఏమిటేమిటో అన్నాను. అవన్నీ యిప్పుడు తవ్వుకోవడం ఎందుకు?”

“కాదు సుశీలా! నా బ్రతుకంతా ఎండమావుల వెంట పరుగులెత్తినట్లుగానే వుంది. ఈ బ్రతుకేమిటి? ఎందుకు బ్రతుకుతున్నానో అర్ధం లేకుండాపోయింది. సుశీలా నాకు నీ తోడు కావాలి....నమ్ము.”

తనకామె అవసరం ఎంతో వుంది. ఆమాటే పదిమాట్లు చెప్పేడు. ఆ అవసరం యిదివరకు అనిపించి వుండలేదు. అది యిప్పుడెందుకవసరమయిందో చెప్పలేదు. అది దైహికావసరం కాదు. ఆత్మికావసరం. గతంలోలాగ రాజకీయాలు తృప్తినివ్వలేకున్నాయి. తండ్రిమీద భక్తి గౌరవాలు యిదివరకటల్లే ఆ రాజకీయాల మీద భక్తి విశ్వాసాల్ని కుదరనివ్వడం లేదు. వాటిని అనాలోచితంగా ఆమోదించలేకున్నాడు. తమరు విప్లవం అనుకొంటున్నది తమరిని ఏకాకుల్ని చేసింది. క్రియారూపంలో ఆ విప్లవం సహభావకుల మీద సాగిస్తున్న విద్రోహంగా తయారయింది. కల్తీలేని విశుద్ధ లక్ష్యం అన్నది అందర్నీ తిట్టడం, ఎవ్వరినీ సహించలేకపోవడం, పెద్దరికం కోసం ఏ పాడుపనినైనా సమర్థించడమూగా తయారయింది. తాను తప్పుదారిని పడ్డానా అనిపిస్తూంది. కాని సిద్ధాంతాలో? అవన్నీ మార్క్సో, లెనినో చెప్పినవేనే! వాటిని తప్పనాలా? కాక తాను అర్థం చేసుకోడం తప్పిందా?”

ఎన్నో ప్రశ్నలు. అన్నీ ప్రశ్నలే. కాని, అవేవీ పైకి చెప్పలేడు. కాలక్రమేణా సుశీలకు చెప్పగలడేమోగాని, ఈ క్షణంలో అసంభవం.

ఇప్పుడు చెప్పడానికైనా తన ఆలోచనలు తనకే స్పష్టంగా వున్నట్లు లేవు. అదికాక అభిమానమో? తనకిప్పుడు అసంతృప్తిగా అనిపిస్తున్న రాజకీయాభిప్రాయాల కోసమే సుశీలను దూరం చేసుకొన్నాడు. వాటియెడ తనకు యిప్పుడు విశ్వాసం లేదంటే ఆమె నమ్ముతుందా?

ఆమెను నమ్మించడం కష్టం! కష్టం!

ఆమె తన్ను ఒక్కమాట అనలేదు. ఏమన్నా అంటే, తిట్టినా, దవడలు వాయించినా సహించేవాడు. మెత్తపడుతూందనుకొనేవాడు. కాని, ఆమె ఎత్తుబడే వేరు....

“ప్రపంచానుభవం లేక భిన్నాభిప్రాయాలున్నా సహజీవనం సాధ్యమే అనుకొన్నా. కాని తెలిసింది. సాధ్యం కాదు....రెండేళ్ళ క్రితం నా ఆలోచనలూ, రాజకీయాలూ వట్టి ఎలిమెంటల్. ఇప్పుడు ఖచ్చితమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఏర్పడి నువ్వు చేస్తున్నదేమిటని అడక్కండి. ఈ క్షణం వరకు తెలుగు దేశపు కవుల ఒరవడిలోనే నేనూ వున్నాను. జరుగుతున్న చరిత్ర నచ్చడం లేదు. ఎవ్వరిమీదా, దేనిమీదా విశ్వాసం, నమ్మకం లేదు. ఏదో జరగాలని తపన. ఆ జరిగేదాంట్లో అంతా పాల్గొనాలి. ఎవ్వరూ ఆటంక పరచరాదు. కాని, అందరూ పాల్గొనడం లేదు. ఎన్నో ఆటంకాలు. పాల్గోని వారిమీద కోపం. ఆటంకాలకు అసహనం. నేనొక్కర్తెనూ చెయ్యగలది కాదని నిరుత్సాహం. ఆ నిరుత్సాహానికి మూలం మిగతా ప్రపంచం. కనక వాళ్ళంతా విప్లవ, అభివృద్ధి నిరోధకులు. నేనే విప్లవమూర్తిని. నన్నెవ్వరూ గుర్తించకపోతే విప్లవానికి భవిష్యత్తేముంటుంది? అదింకోబాధ. ఇంత అవ్యవస్ధితమైన మనస్సుతో మీకు నేను తోడేమిటి? తోడుమాట దేవుడెరుగు...ఇదుగో చూసేరా. నాకేమాత్రం నమ్మకంలేని దేవుడు కూడా నాలుక చివరే వున్నాడు. ...నేను మీకు జీవితంలో ఆలంబన ఏమిటి?”

ఆమె తనను, తన రాజకీయాల్ని, తన పార్టీని ఎగతాళి, యద్దేవా చేస్తున్నట్లనిపించి రంగనాయకులు తెల్లబోయేడు.

“ఇప్పుడవన్నీ తవ్వుకోడం అవసరమా? మనం జీవితాన్ని….మళ్ళీ....సరికొత్తగా….”

సుశీల తల తిప్పింది.

“చూడండి, నేనేమీ తవ్వుకు రాలేదు. నా మనస్థితి చెప్పేను. వద్దంటారూ....మా బాగు....”

రంగనాయకులు కంగారుగా-”వద్దనడం లేదు”-అన్నాడు.

“జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించడం అంటే ఏమిటి మీ ఉద్దేశం? కొత్తదిగా కాదు. ఉన్నది ఉన్నట్లుగా నడపగలమా? ఇదివరకు జరిగింది అంతా ఏమౌతుంది? ఎప్పటికప్పుడు కొత్తగా ప్రారంభిస్తూండడానికి మనకున్న జీవితాలెన్ని?”

రంగానాయకులు నిర్వాక్కుడయ్యాడు. సుశీల తల అడ్డంగా తిప్పింది.

“వద్దు. మీకు సాధ్యంకాని పనులు ఎత్తుకోవద్దు. మీ మనస్థితికి కేరళా, పశ్చిమబెంగాలూ సజీవ సాక్ష్యాలు. నేను ఎక్కడో దూరంగా పడి ఉంటున్నా. నన్నొదిలి వెయ్యండి. మంచో, చెడ్డో, పొరపాటో, గ్రహపాటో జరిగిపోయింది. దానినిప్పుడు చెరిపివెయ్యలేము. చేయగలదల్లా నేను ఇందాక చెప్పింది.....”

“క్షమించి, మరచిపోలేవూ?”

“నేను క్షమించడానికి ఎంత దానిని? మరచిపోవడంతో పనేముంది? జ్ఞాపకం వుంచుకొని చేసేదేముంది?”

రంగనాయకులు వచ్చిన పని విఫలం అయింది. మోకాళ్లమీద చేతులు ఆనించుకొని లేస్తూంటే ఒక్కక్షణం సుశీల మనస్సు కదిలి పోయింది. ఆ మనిషికి అభినయం చేతకాదు. ఏదో మానసిక సంఘర్షణలో వుండి వస్తే తాను తరిమెయ్యడం లేదు గదా అనిపించింది.

కాని, అంతలో టేబిలుమీద ‘అశాంతి’ పత్రిక కనిపించింది. దానిలో నవంబరు 1 న అగ్రహరంలో జరిగిన ఊరేగింపు వార్త గుర్తువచ్చింది. ఆ పత్రిక రంగనాయకులు మిత్రుడే తెస్తున్నాడు. దానిలో రంగనాయకులు వ్రాస్తూంటాడు. ఆ వార్త గుర్తు వచ్చేక అతని యెడ కలిగిన అనుతాపం ఆవిరైపోయింది.

మెట్లవరకూ సాగనంపి సుశీల బహు మర్యాదగా సెలవు తీసుకొంది.

“సెలవు”

“థేంక్స్.”

నలభైనాలుగో ప్రకరణం

వంటింటి గుమ్మంలోంచి సత్యవతమ్మ పలకరించింది.

“అప్పుడే వెళ్ళిపోతున్నావా?”

అతనిని ఆపుచెయ్యడం ఆమె ఉద్దేశం. సావిట్లో పోలీసు అధికార్లు ఇంకా కాఫీలు తాగడంలోనే వున్నారు. అటువేపు అల్లుణ్ణి రానీయవద్దని మగని ఆదేశం. కాని, ఆమె అతడు దిగిరావడం చూడనేలేదు. తాను చూసేటప్పటికే అతడు సావడి గుమ్మంలో వున్నాడు. పలకరిస్తే  అతడు ఆగుతాడని ఆమె వూహ. కాని, అతడు వెనకకన్నా చూడలేదు. పరధ్యానంగానే సమాధానం ఇచ్చేడు.

“మళ్ళీ వస్తానండి.”

సావట్లో అడుగు పెట్టేసరికి కుర్చీలలో పోలీసు ఆఫీసర్లు. గుమ్మంలో మెట్ల క్రింద ఇద్దరు పోలీసులూ కనబడి గతుక్కుమని నిలిచిపోయేడు.

సబినస్పెక్టరు పలకరించనే పలకరించేడు.

“హలో! డాక్టరు గారు!”

వెంటనే ఆ డాక్టరు ఎవరో సర్కిల్ ఇనస్పెక్టరుకు పరిచయం చేసేడు.

“లోకల్ మర్క్సిస్టుపార్టీ....”

విశ్వనాధం తన బంధుత్వం తెలిపేడు.

“మా అల్లుడు....”

“ఎవరు, డాక్టరమ్మ భర్తా?”

అల్లుడిని కూర్చోమననా, వద్దా అని సందేహిస్తున్న విశ్వనాథం, అతడక్కడి నుంచి కదలకపోవడం చూసి ఆహ్వానించేడు.

“రావయ్యా, కూర్చో.”

“దయచేయండి డాక్టరు గారూ! తమరు మాకిక్కడ పరిచయం కావడం చాలా మంచిదయింది” అంటూ ఎస్. ఐ. తన ఆహ్వానం కూడా జతపరిచేడు.

రంగనాయకులు కూర్చున్నాడు. విశ్వనాధం అతడు వెళ్ళిపోడానికి కారణం చూపిస్తూ-”ఈవేళ క్లినిక్‌కు వెళ్ళడం ఆలస్యం అయిందేం”? అని అందించేడు.

“రోడ్డుమీద మనం చూసిన....”

సర్కిలు జ్ఞాపకానికి సబినస్పెక్టరు సాయం ఇచ్చేడు.

“రెడ్‌గార్డ్ క్లినిక్ వీరిదే” అన్నాడు.

ఔనన్నట్లు రంగనాయకులు తల ఊపేడు.

“ఏదన్నా పనిమీద వెళ్ళేరా?”

“ప్రత్యేకంగా ఏం లేదు” అన్నాడు సర్కిలు.

“నక్సల్‌బరీ ఉగ్రవాదుల్ని సమర్థిస్తూ, ఈ చుట్ట ప్రక్కల పది గ్రామాల్లో ఊరేగింపులూ, సభలూ, తీర్మానాలు, టెలిగ్రాములూ చాలా ఉధృతంగా సాగుతున్నట్లు రిపోర్టులు వచ్చేయి. మీ పార్టీ కూడా అందులో ఉన్నదట....”

రంగనాయకులు ధృడకంఠంతో పోలీసు ఉద్యోగి మాటను సవరించేడు.

“అవేమీ ఉగ్రవాదుల చర్యల్ని సమర్ధించడానికి జరగలేదు. ఉగ్రవాదులని పేరెట్టి మీకూ, ఊళ్ళల్లో పెత్తందార్లకీ అడ్డం అనుకొన్నవారిని అరెస్టు చెయ్యడం, చంపడం పనికి రాదంటున్నారు. మీటింగులలో అదొక భాగం....”

“దానిలో మీ పార్టీ కూడా....”

“అల్లా చంపడానికి మేమూ వ్యతిరేకమే”

“డాంగేగారి పార్టీతో మీరూ....”

ఊరేగింపులూ, సభలలో తమకు పాత్రలేదని పోలీసువానికి చెప్పడానికి అభిమానం అనిపించింది.

“ఒక్కవారే కాదు. నాగిరెడ్డిగారి పార్టీ...”

“వారిందులో కథానాయకులేనాయే. చెప్పేదేముంది?”

తన మాటకు అడ్డం రావడం చిరాకు అనిపించింది. కటువుగా అనేశాడు.

“బుద్దిగలవాడెవడేనా చెప్తాడు. ఈ రెండురోజుల సభలకీ మా మామగారు, పద్మనాభంగారూ. కాంగ్రెసులో వున్న రెండు శాఖలూ కూడ ఈ వూరికి సంబంధించినంతవరకు చేరేరు.”

రంగానాయకులు లేచేడు. “నాకు పనుంది సెలవు.”

“ఒక్కమాట” అన్నాడు ఎస్. ఐ. డాక్టరు కూర్చున్నాడు.

“చెప్పండి.”

“మీ నాన్నగారు మరొకవిధంగా సెలవిచ్చేరు. తమరు చెప్పింది వేరుగా ఉంది” అంటూ సర్కిలు వేపు తిరిగి,

“ఇందాకా మనం మాట్లాడింది వీరి తండ్రిగారితోనే” అన్నాడు.

“సుందరరావుగారు?”

“చిత్తం” అన్నాడు ఎస్. ఐ.

తండ్రి ఏం చెప్పేడో వాళ్ళనుంచే వినాలని రంగనాయకులు నిరీక్షించేడు.

సబినస్పెక్టరు అది చెప్పకుండా విషయాంతరం ఎత్తుకొన్నాడు.

“నవంబరు 1వ తేదీన మీరందరూ ఊరేగింపుగా వెళ్లి సత్యానందం గారి ఇంటివద్ద అల్లరి చేశారనీ. వారి వీధిలైట్లు పగలగొట్టేరనీ తెలిసింది.”

రంగనాయకులు ఖండితంగా గర్జించేడు.

“వట్టి అసత్య సమాచారం!”

“మా వద్ద మీవాళ్ళ సాక్ష్యమే వుంది సార్! కాగితం సాక్ష్యం….” అని నవ్వేడు సి.ఐ.

రంగాయకులు తెల్లబోయేడు. సత్యానందమేనా, మరెవ్వరేనా రిపోర్టు చేసేరేమో. అతని ఆలోచనలు పలువిధాలుగా పోయాయి. ఇంతవరకూ జరిగిన సంభాషణ అంతా తనచేత వాగించడానికి ఆడిన నాటకం అనిపించింది.

“సాక్ష్యం వున్నప్పుడింకేం. కేసు పెట్టడానికి అభ్యంతరం ఏం వుంది? కేసు పెట్టమని డిమాండు చేస్తున్నాను. విచారణలో అన్నీ తేలుతాయి.”

సర్కిల్ ఇన్‌స్పెక్టరు కనుసంజ్ఞతో సబినస్పెక్టరు తన జేబులోంచి ‘అశాంతి’ పత్రిక పైకి తీసేడు. దూరం నుంచే చూపుతూ....”ఈ పత్రిక మీద మీ అభిప్రాయం ఏమిటి సార్!” అనడిగేడు.

“ఎందుకోసం?”

“అందులో పడే వార్తలు నమ్మవచ్చునా అని....”

“నమ్మకమైన వార్తలే వేస్తారనాలి” అన్నాడు, రంగనాయకులు. అంతలో ఏదో తోచింది. మళ్ళీ అన్నాడు.

“కాని, పత్రికల వార్తలన్నింటికీ వున్న ఇబ్బందే దానిలో వానికీ వుంటాయి. విలేకరుల వార్తలన్నింటికీ బాధ్యత వహించడం కష్టం.”

“దీనిని చదివి చెప్పండి” అని పత్రికలో ఒక వార్త చూసి చేతికి అందించేడు.

సబినస్పెక్టరు చూపిన శీర్షిక చదివేసరికి రంగనాయకులు తల తిరిగిపోయింది.

“కమ్యూనిస్టుల ఊరేగింపుపై రివిజనిస్టుల అఘాయిత్యం: ప్రజలచే తగు సమాధానం; రివిజనిస్టు నాయకుని బహిరంగ క్షమార్పణ.”

చదవడానికి వ్యవధినిచ్చి సబినస్పెక్టరు తన అభిప్రాయాన్ని ధృవపరుస్తూ తన మాట జ్ఞాపకం చేశాడు.

“మాకు తగిన సాక్ష్యం లేందే మాట్లాడం సార్!”

రంగానయకులుకి ఏం చెప్పడానికీ తోచలేదు. తండ్రి పంపివుంటాడు. ఎందుకిల్లాంటి పని చేసేడు?

అడగాలి. చర్రున లేచేడు.

“కూర్చోండి. అప్పుడే వెళ్ళిపోతానంటారే.”

“రోగులు కనిపెట్టుకొని వుంటారు. వెళ్ళాలి. మీరు విచారణ కానివ్వండి. ఏదన్నా పనుంటే ఒంటిగంట వరకూ క్లినిక్‌లోనే  ఉంటా” అంటూ రంగనాయకులు వెళ్ళిపోయేడు.

నలభైఐదో ప్రకరణం

ఇంటికి వెడుతూనే రంగనాయకులు తండ్రిని నిలేసేడు.

“ఏమిటా వార్త? ఎవరు పంపేరు? మన పార్టీకి పరువేమన్నా మిగులుతుందా?”

అన్నిటికన్న రంగానయకులకి పెద్ద దిగులు అబద్ధాలూ, అతిశయోక్తులూతో పార్టీకి ప్రతిష్ఠ మిగలదని. కాని, ఆ వార్త గురించి తండ్రి చేసిన వ్యాఖ్య అతడిని నిరుత్తరుణ్ణి చేసింది.

“మన ఊరేగింపుని అల్లరి చేయడం జరిగిందా లేదా? జరిగినచోటు ఏది?  మన ఊరేగింపులో వాళ్ళు గాక అక్కడ ఉన్న వాళ్ళెవరు? నా చొక్కా చిరిగింది. నా మొహాన ఉమ్మివేయడం జరిగింది. అంత అల్లరి చేసినా మన వాళ్ళు ఘట్టిగా నిలబడ్డం జరిగిందా, లేదా? చివరికి సత్యానందం అంతమంది ముందు అన్న మాటల అర్ధం ఏమిటి?”-అనేక ప్రశ్నలు.

“....ప్రజలు గట్టిగా ప్రతిఘటించారు. తగిన శాస్తి చేశారు. దానితో రివిజనిస్టులు నీళ్ళు నములుతూ నిష్క్రమించేరు.”

.....ఏమిటీ వాక్యాల అర్ధం? జోగయ్య చేసిన పనిని సమర్ధిస్తూన్నారనేనా? అల్లాంటి పనులు చెయ్యమని హుషారు చెయ్యడమేనా?

రంగనాయకులు ఆక్రోశానికి జాలి ఉట్టిపడేలా చూడడమే సుందరరావిచ్చిన సమాధానం.

“నాన్నగారూ! మీకు నేను చెప్పవలసినవాడిని కాను. కాని, మీరు చెప్తున్న దాని మీద మీకు నిజంగా నమ్మకం ఉందా? ఈ పద్ధతులు పార్టీని బలపరుస్తాయా? ఏమిటిది?”

ఎప్పుడూ తనకు ఎదురుచెప్పని కొడుకు నేడు తన ఇంగితాన్నే ప్రశ్నిస్తున్నాడు. సుందరరావుకు కోపమూ, ఆభిమానమూ కలిగేయి.

“ఒరేయ్! పార్టీకి ఏది బలం? ఏది క్షేమం అనేది మొన్న పుట్టిన నీనుంచి నేర్చుకోవాలంటావు. మనది సమరశీలమైన పార్టీగా నిర్మించాడు లెనిన్. అది అల్లా వుండాలసిందేనని ఆయన అభిప్రాయం. అల్లాగే వుంటుంది. మనమీద దుర్మార్గం చేస్తే ఊరుకోము. కంటికి కన్ను, పంటికి పన్ను వసూలు చేసి తీరుతాం.”

చివరి మాట అనేటప్పుడు తండ్రి కళ్ళలో కనిపించిన కాఠిన్యం చూసి రంగనాయకులు వెరగుపడ్డాడు. ఒక్కక్షణం ఈ మనిషికి మతి సరిగ్గా ఉన్నదా అనిపించింది. అంతలో ఆయనకున్న ఉద్రేక స్వభావం, రక్తం పోటు జ్ఞాపకం వచ్చేయి. తగ్గేడు. కాని ఈమారు కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగానే చెప్పేడు.

“అయితే సత్యానందంగారి గేటుమీద దీపం రాయిపుచ్చుకు బద్దలు కొట్టడం మన పార్టీ కార్యక్రమంలో భాగంగానే జరిగిందనుకోవాలా?”

కొడుకు ప్రశ్న సుందరరావుకి ఇబ్బందిగా కనిపించింది. తమతమ పార్టీ వాళ్ళు చేసిన, పైకి చెప్పుకోలేకపోయినా, తమరు కాదనలేని ఘటనలు జరిగినప్పుడు మూజుమానీగా అవన్నీ ప్రజల పనిగా, ప్రజల న్యాయమైన కోపోద్రేకానికి ప్రతిచర్యగా జరిగినట్లు చెప్పుకోవడం ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తూంది. అందరూ అదేపని చేస్తున్నారు. కొత్తేముంది? దీనికి ఇంత గొడవా ప్రశ్నలూ ఏమిటి?

“ఇది చిన్న విషయమే. శాంతంగా ఆలోచిస్తే కూడదని నేనూ అంటాను. కాని, ఏ ఫలితాన్నీ విడిగా చూడకూడదు. దానికి మూలం ఎటువంటి కవ్వింపో ఆలోచించాలి. కార్యాకారణ సంబంధం గమనించకపోతే వచ్చే ముప్పే ఇది....”

తండ్రితో ఇంక మాట్లాడి లాభం లేదనుకొన్నాడు. ఇంకొక్క ప్రశ్న ఉండిపోయింది. తన తండ్రి చెప్పిందీ, సభల గురించి తాను చెప్పిందీ తేడాగా ఉందన్నాడు ఎస్.ఐ. ఏమిటో అది. అడిగేడు.

సుందరరావుకు ఆ ప్రశ్న మళ్ళీ కోపం తెప్పించింది.

“మీటింగులూ, అక్కడ జరిగేవానితో పార్టీకేమీ సంబంధం లేదని చెప్పా...జాన్ తన స్వంత పూచీపై దానిలో పాల్గొన్నాడని చెప్పా, నక్సల్‌బరీలని సమర్ధించేరన్న నెపంతో దాడి మనమీద పడిపోకూడదు. అక్కడ జరిగేవానికీ, చెప్పేవానికీ మన బాధ్యత లేదు. మన యూనిట్లని మనం కాపాడుకోవాలి. మన బలం పెంచుకోవాలి.”

రంగానాయకులికి ఆ ధోరిణి వెక్కసం అనిపించింది.

“ఈవేళనుంచి నేను కూడా నా స్వంత పూచీమీద ఆ సభలలో కలగచేసుకోవాలనుకొన్నా. ఈవేళ నరేంద్రపురం పాలెంలో సభకి వెడుతున్నా, ఏమంటారు?”

“ఏం బెదిరిస్తున్నావా?”

రంగనాయకులు ఒక్క క్షణం జంకేడు. “ఇందులో బెదిరింపేం వుంది?”

“పార్టీ వ్యవహారాలలో బంధుత్వాలు అడ్డం కావు. నువ్వు వెళితే జాన్ లాగే నువ్వూ క్రమశిక్షణ భంగానికి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది.”

రంగానాయకులకి అది కొత్తగా వినిపించింది.

“అతనిమీద క్రమశిక్షణ ఎందుకు?”

సుందరరావు కొడుకును ఆలోచనలో పెడుతున్నానని తృప్తి పడ్డాడు.

“తెలుస్తుందిగా.”

“చెప్పండి, వింటా.”

సుందరరావు తృప్తిగా కుర్చీలో సర్దుకొన్నాడు. పెదవులు ముడిచి ఇంత పొడుగు చేసి ఒక్కనిముషం గంభీరంగా కూర్చున్నాడు.

“చెప్తా విను. పార్టీని సంప్రదించకుండా దాని ప్రతిష్ఠకు భంగకరంగా, స్వంత నిర్ణయాలు చేసేయగల వ్యక్తివాద స్వభావం, తరవాత పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా, అది నిర్ణయించిన నినాదాలను నిర్లక్ష్యం చేసి, పార్టీ శత్రువులతో కలిసి ప్రజా ప్రయోజనాన్ని భంగాపరచడం...చాలునా?”

“చాలు. నాకూ సంజాయిషీ అడిగించుకోవాలనుంది. జాన్ చేసినది మంచిదనే నేనూ అనుకొంటున్నా....”

తెల్లబోతున్న తండ్రి తెరుకొనేవరకూ ఆగి మళ్ళీ అన్నాడు.

“దానివలన ప్రజాకార్యం, ప్రయోజనం నెరవేరుతుందనేదే నా విశ్వాసం!” అని రంగనాయకులు లేచేడు.

“మీరు చేస్తున్నది ఎంత నష్టమో వినాశకరామో మీకు తోచడం లేదు. జోగన్న చేసింది పార్టీ క్షేమమూ, జాన్ చేసింది ప్రజాప్రయోజనాలకు నష్టమూ అయితే నేను ఆవిధంగా నష్టపరచడమే మంచిదనుకొంటున్నా.”

తన బెదిరింపు వ్యర్ధం అనిపించేక సుందరరావు నీళ్ళు కారిపోయేడు. మిగిలినదొక్కటే...

“పెళ్ళాన్ని మంచి చేసుకొనేందుకు అదే మార్గం అనుకొన్నావు....”

“లేదు. ఇంక ఆ దారి మూసుకుపోయింది. నాలాగే ఇతరుల జీవితాలూ పాడు కాకూడదని!”

రెండో భాగం

ఒకటో ప్రకరణం

కాకినాడలో బస్సు దిగి జానకి తిన్నగా హోటలుకే రిక్షా మాట్లాడింది. సరాసరి మామగారింటికి వెళ్ళడానికి ఆమెకి మనస్సు ఒప్పలేదు.

“అప్పుడే పది కావచ్చిందా? ఎటూ కానివేళ వెళ్ళి వాళ్ళని ఇరుకున పెట్టడం. ఏ హోటలులోనో గది తీసుకొని, విశ్రాంతి తీసుకొని వస్తాం.”

ఇరుకున పెట్టడంకన్న ఆ యింట్లో తనకి ఎటువంటి స్వాగతం లభిస్తుందో అన్న అనుమానం ఆమెను ప్రధానంగా వేధిస్తూంది. ఎప్పుడూ మొగమేనా చూసివుండని కోడలి మీద, ఆ కొడుకు పోయాక, వారికి అభిమానం వుండవలసిన పనీ లేదు. ఆ అవకాశమూ లేదు.

పైగా గతరాత్రి మీటింగులో వుపన్యసించవలసి రావడం, తరవాత ప్రయాణ సన్నాహంతో నిద్రే లేదు. తోడు గుర్రపుబండిలో, బస్సులలో ఇరుక్కుని ప్రయాణం. చాల అలసటగా వుంది. తాము వెళ్ళవలసిన యింట్లో పరిస్థితి ఏమిటో తెలియదు. అందరూ ఆరోగ్యంగానే వున్నా, అంతా ఆదరణా, అభిమానమూనే చూపినా కొత్త యిల్లు. ఎరగని జనం. ఒక్క నిముషం విశ్రాంతిగా వుండాలన్నా సాధ్యం కాదు.

అగ్రహారంలో వుండగా ఇవన్నీ ఆలోచించుకొన్నవే. హోటలులో జానకీ, కొడుకూ దిగాలన్నదీ, ఏ హోటలులోనా అనేదీ అక్కడే నిశ్చయించుకొన్నారు. కాని తీరా సమయం వచ్చేసరికి భద్ర హోటలు ఆలోచనను వొప్పుకోలేకపోయింది. ఆమెకు మేనత్తగారింటితో పుట్టింటితో వున్నంత అనుబంధం వుంది. అయినా జానకి రాకుండా తానా యింటికి వెళ్ళనంది.

ఈ దారి ఎక్కడికి? (రధచక్రాలు - ఉత్తరగాధ) · 第 8 / 15 段