“వెళ్ళి వస్తా.”
“మీరు చేసిన సాయానికి చాలా థేంక్సు.”
కనీసం ఎప్పుడన్నా కనిపిస్తూండమని మాటమాత్రంగా కూడా అనలేదు. తానే అన్నాడు.
“మళ్ళీ కలుద్దాం.”
సుశీల మరోమారు గుమ్మంలోంచి ‘థేంక్స్’ చెప్పిందేగాని అంతకన్నా ఏమీ అనలేదు.
అతడు వెళ్ళిపోయేక తన గదిలో పెట్టిన సామానులు చూసుకొన్నప్పుడు రంగనాయకులు తాను ఎవరి కోసమో అని కొన్న చీరల పాకెట్టు కూడా వానితోబాటుగానే వుంది. నారాయణను పిలిచింది.
“వారే అన్నీ తీసి యిచ్చేరండి.”
అతడు అవి బేరం ఆడినప్పుడే ఆమెకు అనుమానం వుంది. అది నిజం కావడం చిరాకనిపించింది.
“పొరపాటున ఇచ్చి వుంటారు. పట్టుకుపోయి యిచ్చెయ్యి.”
సుశీల ఆ చీరల పాకెట్టుతోబాటు మందుల కొట్టులో అతడిచ్చిన మూడు వందలూ కవరులో పెట్టి పంపేసింది.
“డాక్టరుగారు ఇంట్లోలేక ఎక్కడికేనా వెళితే పెద్దవారు ఎవరుంటే వారికి ఇచ్చేసిరా.”
నారాయణ వెళ్ళేసరికి రంగనాయకులు ఇంట్లోనే వున్నాడు. అతడు ఒక్కడే కాదు. సుందరరావు వున్నాడు. ఆయన భార్య వుంది.
ఆ వివరం చెప్పినప్పుడు సుశీల మనస్సు తృప్తిపడింది.
“సరిలే.”
ముప్ఫయ్యయిదో ప్రకరణం
వీరాస్వామి ఎంతో ఆదుర్దాగా, రోజుకుంటూ వచ్చి, జాన్‌కు సుందరరావు ఇచ్చిన ఆదేశాలను సత్యానందం చెవిని వేశాడు.
“మీటింగు ఏర్పాట్లు చేశాం. ప్రచారం చేస్తున్నాం. అన్నీచేసి, జనాన్ని పోగుచేసి వారి చేతుల్లో పెడతామేమోనండి.”
జాన్ కార్కానాలో పనిచేసే పరమేశు కబురు పెట్టేడు. కనక అది సరయిన సమాచారమే అయి వుంటుంది.
ఆ వార్త వినగానే సత్యానందానికి మొదట కలిగిన ఆవేశంలో – “జాన్నే సభలోకి రానివ్వకపోతే ఏం చేస్తాడేం?” అనేశాడు.
మరుక్షణంలో సర్దుకొన్నాడు.
“మనవాళ్లని మాట్లాడనివ్వరూ? ఒప్పుకోకండి. పదిమంది చేరి తప్పదు అంటే ఏం చేస్తాడేం?” అన్నాడు.
వీరాస్వామి విచారంగా అన్నాడు.
“కొట్లాటదాకా వస్తుందండి. మనం దెబ్బలు తింటామని కాదండి. కాని, సభ చెడిపోతుంది.”
సత్యానందం చాలా సేపు ఆలోచించేడు. గత అనుభవంతో నిజమే అనుకొన్నాడు.
“నిజమే వీరాస్వామీ. అల్లా జరగకూడదు. ప్రభుత్వ దురంతాలకి వ్యతిరేకంగా కూడా మనం నలుగురం ఒక్క మాటమీద పనిచేయలేక పోయామంటే మన వుద్యమానికే పెద్ద దెబ్బ.”
అయితే సత్యానందం ఇచ్చిన సలహా మాత్రం వీరాస్వామికి నచ్చలేదు. ఇంతవరకూ చేసినకన్న గట్టి ప్రచారం చెయ్యడం, సభను విజయవంతం చెయ్యడం, అది ముఖ్యం-అన్న సలహాను వీరాస్వామి వ్యతిరేకించేడు.
“మన పార్టీకింక గౌరవం ఏం వుంటుందండి? మనల్ని మాట్లాడనివ్వకపోతే మనం వేరే సభ పెట్టుకొందాం.”
పార్టీకి గౌరవం, బలం ఎల్లా కలుగుతుందనే విషయమై సత్యానందం కొన్ని ఏళ్ళుగా ఆలోచిస్తున్నాడు. పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విద్యావంతులైన యువకులలోకీ, విద్యార్థులలోకి పూర్వంలోలాగ ప్రవేశించడం లేదు. నేటి యువకులు సులువుగా బతికెయ్యడం మీద ఆసక్తి చూపుతున్నారు గాని, సంఘం గురించీ, సమష్టి గురించీ ఆలోచించే దృష్టి వారికి లోపించిందనే వాదనలను ఉగ్రవాద ఉద్యమం తోసేస్తూంది. లోపం ప్రజలలో లేదు. వారి విషయంలో పార్టీలు తీసుకొనే దృక్పథంలో వుంది గాని-అని అతడు ఆలోచిస్తున్నాడు.
ఆ ధోరణిలోనే వీరాస్వామిని నెమ్మదిగా దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించేడు.
ఈ సభల వుద్దేశం ఏమిటి? ప్రభుత్వం నిర్బంధ చర్యల నుపయోగిస్తూందంటే దేశంలో శాంతి – భద్రతలను అది తన వర్గానికైనా కల్పించుకోదా? నేరస్థుల్ని విచారణ చేసి శిక్షలు వేస్తే మనం తృప్తి పడతామా? ఉగ్రవాదుల దేశభక్తీ, ప్రజాసేవాసక్తీ, స్వార్దత్యాగమూ ఒక మూల ప్రభుత్వవర్గాల ద్వేషాన్నేగాని, ప్రజాభిమానాన్ని సంపాదించుకోవద్దా?
అనేక ప్రశ్నలు.
“వీటన్నింటినీ గురించి మన విశాలాంధ్ర రాయడం లేదాండి మరి?”
“వారి ప్రజాశక్తీ వ్రాస్తూందిగా.”
“మన పార్టీ తీర్మానాలు చేసింది.”
“తీర్మానాలు చేయడం, ప్రకటనలు ఇవ్వడంలో రెండుపక్షాల నాయకులూ కూడా పోటాపోటీలు పడుతున్నారులే! వాటిని మనం అమలు జరపవద్దూ.”
ఆతని అభిప్రాయం వీరాస్వామికి అర్థం కాలేదు.
“ఇల్లా మనమే మన పనికి బందాలు వేసుకొంటూంటే....”
జాన్‌ను సభాధ్యక్షుడుగా పిలవమన్న సత్యానందం సలహాకు అది అధిక్షేపం. దానిని అతడు పట్టించుకోలేదు.
“దేశమూ, ప్రజలూకన్న పార్టీకి భిన్నమైన ప్రయోజనాలు లేవు. వాటిని రెంటినీ బలపరచడంలోనే పార్టీ బలపడుతుంది. మన పనులు ఆ లక్ష్యానికి తోడ్పడకపోతే పార్టీ బలపడదు. క్షీణిస్తుంది.”
“పార్టీ బలంగా లేకపోతే ప్రజలకీ దేశానికీ ఏం సాయపడుతుందండి? పైగా విప్లవం యొక్క ప్రస్తుత దశలో మన పార్టీ....”
“....నాయకత్వం వహించడం చరిత్ర నిర్దిష్టం కూడాను” అన్నాడు సత్యానందం అర్ధోక్తిలో.
మోనం వహించడం ద్వారా వీరాస్వామి ఆ మాటను ఆమోదించేడు. సత్యానందం ఒక్క క్షణం ఆగి తన అభిప్రాయాన్ని విస్తరించాడు.
“విత్తు ముందా, చెట్టు ముందా లాంటి సమస్య కాదయ్యా యిది. పార్టీని బలపరచుకొని ప్రజాసేవ ప్రారంభిస్తామనడం పాలకొల్లు గోపురం ఎత్తాలంటే ముందు ఆరునెల్లు బలియపెట్టమన్నట్లే వుంటుంది.”
పార్టీని గురించి ఆ విధంగా ఆలోచించడం వీరాస్వామికి ఒప్పదు. కాని, సత్యానందానికి మార్క్సిజం మీదగల అనంత విశ్వాసం ఎరుగును. అతన్ని పార్టీ వ్యతిరేకి అనలేడు. తమవాడు. తమ యూనిటుకు కార్యదర్శి కూడా. ఇంక పైకి అనకపోయినా, ఒకప్పుడు అతడు గాంధేయవాది అనేది గుర్తు చేసుకొని తృప్తిపడుతుంటాడు.
“మీ సలహా ఏమిటండి?”
“జానే అధ్యక్షుడు, నిర్బంధ వ్యతిరేక సభ. దానిలో ఎవరు ప్రసంగించినా దానిని జయప్రదం చేయడం మన లక్ష్యం కావాలి.”
“మనని మాట్లాడనియ్యకపోయినా?”
“మనం కూడా మాట్లాడి తీరాలనడం, జానో మరొకరో వద్దనడం సభలో గలభా జరగడం అవసరమా?”
“మన పార్టీని తిట్టినానా?”
“ఆ తిట్ల వలన వాళ్లకి లాభం వుంటుందా, వుండదా అన్నది చూసుకోవలసింది వాళ్ళు. ప్రజల్లో మనం చేసే పనినిపట్టి....”
వీరాస్వామి ఒప్పుకోలేదు.
“….తిడితే చీరి ఎండెయ్యాలంటా.”
సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. దీర్ఘకాల ప్రయోజనాలనూ, విస్తృత ప్రయోజనాలనూ గురించి ఆలోచించాలనడం గాంధేయవాదం, రివిజనిజం అని పేరుపెట్టే దశలో సత్యానందం నొక్కి చెప్పడానికి జంకేడు.
“ఇదిగో వీరాస్వామి, ఇక్కడ సభను జరపవలసిన బాధ్యతని నువ్వు తీసుకొన్నావు. నేను పోతారం పల్లెలో వుంటాను కదా, మన లక్ష్యం చెడకుండా ఎలాచేస్తే బాగుంటుందో నువ్వు, పరమేశు, మిగతా మీ పేట వాళ్ళు ఆలోచించి చెయ్యండి.”
సత్యానందం తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నాడనిపించింది.
“తమరే ఇక్కడి సభ సంగతి చూడండి. పోతారం సభకు మేమవరమో వెడతాము.”
“అది మాత్రం ఏం సబబు?”
వీరాస్వామి గడుస్తనంగా సమాధానం ఇచ్చేడు.
“మీరు చెప్పిందే కద. అనుకున్నదానికి అభ్యంతరం లేకుండా పని జరగాలి.”
సత్యానందం నవ్వేడు.
“సహాయ నిరాకరణమా?”
ముప్ఫయ్యారో ప్రకరణం
సందెవేళకి వీరాస్వామి రెండెడ్ల బండి ఒకటి తోలుకువచ్చి జాన్ కొలిమి పాక వద్ద వదిలేడు. దాని నొగలకి ఇరువేపులా ఎర్రజెండాలు కట్టి వున్నాయి.
“త్వరగా తయారవు, మామా! పదిమందిమీ కలిసి వూరేగింపుగా వెడదాం సభకి.”
“బండి ఎందుకురా, నడిచొస్తా.”
“ఆ కాళ్లతో తూలిపోతూ నువ్వు నడవకేం. చలి తిరిగేక కాళ్లు పట్టేస్తున్నాయన్నావు కూడాను.” అన్నాడు వీరాస్వామి.
జాన్‌కు తన స్థితి తెలుసు. అసలే అంతంతగా వున్న నడక. వో వర్షం కురిసినా, కాస్త చలి బాగా వున్నా కలకవేస్తాయి కీళ్ళు. కాలు తీసి కాలు వెయ్యలేడు. కాని పుట్టి, పెరిగిన వూరు. కష్టం చేసి గడపవలసిన బ్రతుకు. అక్కడ ఓ చిన్న సభకి అధ్యక్షుడుగా పిలిచారని బండి మీద వూరేగడం ఎల్లాగో అనిపించింది.
“వద్దెసే. నలుగురూ నగుతారు. కూలాడికి బండి కావలసి వచ్చిందా అనుకుంటారురా”-అన్నాడు.
వీరాస్వామి ఒప్పుకోలేదు. అయితే జాన్ అభ్యంతరానికి అతడు వూహించిన కారణం వేరు.
“బండి నొగలకి ఒక వేపున మా జెండా కట్టేను. రెండోది మీ జెండా. అలాకాదు. రెండువేపులా మీదే వుండాలంటే అల్లాగే చేద్దాం.”
జాన్ చుర్రుమనేలా చూసేడు. అతని మనస్సులో కలిగివుండని అభిప్రాయం అది. జెండాలు చూసేడు. కాని, ఆ ఆలోచన కలగలేదు.
“అది మీ జెండా ఎప్పటినుంచిరా. ఆ జెండా పట్టినందుకే కాళ్లు విరగ్గొట్టారు తెలుసా?”
వీరాస్వామి సిగ్గుపడ్డాడు. రమారమి పాతికేళ్ళు జాన్ పట్టుకొన్నది అదే జెండా. ఇప్పుడేనా ఆశయాలూ, ఆదర్శాలూ విషయంలో ఆ జెండాతో జాన్‌కు పేచీ లేదు.
ఆ మాటే చెప్పేడు జాన్. పైగా మరొకటి కూడా అన్నాడు.
“అసలు నా చేతిలో వుండవలసిందే, ఆ జెండా....”
వీరాస్వామి గడుగ్గాయి. ఆ అవకాశాన్ని వదులుకోలేదు.
“ఇంకేం మామా! మేమంతా నీ వెనక్కాల వుండేవాళ్ళమే.”
జాన్ కాదన్నాడు.
“వద్దులే ఎందుకైతేనేం. వేర్పడ్డాం. అల్లాగే వుండనీలే.”
అంటే అర్థం ఏమిటి? తమ జెండాయే బండి మీద వుండాలనా?....స్పష్టం కాలేదు. కాని, అదేమిటో తేల్చమని అడగదలచలేదు. ‘అతడినే చెప్పనీ.’ అనుకొన్నాడు.
“అయితే మేం బువ్వతిని పదిమందినీ కేకేసుకు వస్తాం. అందరం వూరేగింపుగా వెడదాం. నినాదాలు ఏమిటివ్వాలంటావు? నాకు తోచినవి రాసుకొచ్చా. వింటావా?”
ఆ మాట వినగానే జాన్‌కి ఇరవయ్యేళ్ళకి పూర్వం నాటి అలవాట్లు జ్ఞాపకం వచ్చేయి.
“మంచి పని చేశావు, ఏవీ వినిపించు విందాం.”
విన్నాడు. బాగున్నాయి-అనిపించింది. అవి ప్రధానంగా ప్రజా వుద్యమంలో ఐక్యతను గురించి నొక్కి చెబుతున్నాయి.
వీరాస్వామి వెళ్లిపోయాక కూడా అతడిచ్చి వెళ్లిన కాగితంలోని నినాదాలు జాన్ ఆలోచనలను వదలలేదు. ఐక్యత అన్నమాట ప్రమాదకరం కాకపోవడమే కాదు. అవసరమే కూడా.
కాని....
కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. చాలమంది ఆ చీలిపోవటం వలన చాల నష్టం కలిగిందంటారు. తాను ఆ మాటనెప్పుడూ ఒప్పుకోలేదు. పార్టీ చీలిపోక తప్పదు. జాతీయ విప్లవంలో కాంగ్రెసు పాత్ర ఏమిటి?-దీని విషయమై పార్టీలో తాను యెరిగినప్పటి నుంచి భిన్నాభిప్రాయం వుంది. అంతక్రితం కూడా వుందన్నారు.
అయితే అవి ఒక ఘట్టం దాకా ఘర్షించలేదు. స్వాతంత్ర్యం వచ్చాక ఆ వైవిధ్యంలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. దానిని పార్టీ నాయకత్వం సరిపుచ్చబోయింది. కాని కుదరలేదు. భిన్నభావాలు గలవారిని కలిపి వుంచే ప్రయత్నంలో పార్టీలో పని అంతా స్తంభించింది. విడిపోయాక ఇద్దరూ ప్రజలలో తమ పార్టీని బలపరచుకొనేటందుకు పోటీపడి పనిచేస్తున్నారని తన భావం. కాని ఈ ఐక్యత?....
బలప్రయోగం సమాజంలో మంత్రసాని వంటిదని మార్క్స్ అన్నాడుట. దానిని తాము ఖచ్చితంగా బలపరుస్తున్నారు.
మార్క్స్ నాటి పరిస్థితులు వేరు. నేడున్న పరిస్థితులలో శాంత పద్ధతులలో కూడ సోషలిజం వచ్చే అవకాశం లేకపోలేదు. అది విఫలం అయినప్పుడే బలప్రయోగం అంటున్నారు....రెండో వర్గం. అదే జరిగితే మరి విప్లవం అన్నదేముంది? కూడదని తన నమ్మకం.
ఈ రెండు ధోరణులకీ ఐక్యత యెల్లాగ?....
కాని,
కేరళలో మంత్రివర్గంలో తమ పార్టీ చెయ్యవలసిన పనిని సరిగ్గా చెయ్యలేదని తన అంతరాంతరాలలో వుంది. తమకు జనాన్ని తోడు తెచ్చుకొనేందుకు బదులు అందర్నీ యెదురు చేసుకొన్నారనిపిస్తూంది.
అన్నింటికన్నా గొప్ప తప్పు భూసంస్కరణల చట్టాన్ని తీసుకురాకపోవడం. తానే తెచ్చి గౌరవం దక్కించుకోవాలని ఆలస్యం చేసినట్లు మంత్రి చెప్పడం క్షమార్హం కాదు. ప్రజల అవసరం కన్న పార్టీకి ప్రాముఖ్యం ఇస్తే, ఆమె దానిని మరింత సాగలాగింది. పార్టీ అవసరం కన్న తన ప్రతిష్ఠ, ఆమెకు యెక్కువయిందనిపించింది.
మళ్ళీ అదే సమస్య. వీటికీ ఐక్యతకీ యెల్లా లంకె కుదురుతుంది?
పార్టీ ప్రజల కోసమా?
ప్రజలు పార్టీ కోసమా?
ప్రజలా? పార్టీయా?
హఠాత్తుగా అతని ఆలోచనా ధోరణిని భంగపరుస్తూ జోగయ్య మాట వినిపించింది.
“ఇదిగో జాన్! సుందరరావుగారు నీకు ఈ నినాదాల కాగితం ఇవ్వమని పంపేరు. ఆనక వూరేగింపులోనూ, సభలోనూ ఇచ్చేందుకన్నారు.”
జాన్ దానిని తీసుకొన్నాడు.
మొట్టమొదట సందేహం కనబడలేదు. రెండు మూడు తప్ప మిగిలినవి ఏ మార్క్సిస్టు పార్టీకీ అభ్యంతరం కానివే.
కాని, ఆ రెండు మూడిటి క్రిందా గీత గీసి వుంది. అవి తమ పార్టీ ప్రత్యేకత్వాన్ని నిలుపుకొనేందుకు వ్రాసినవి – అని అభిప్రాయమన్న మాట.
జాన్ యెరుగును. ఆ పదాలు వుపయోగించాక పై నినాదానాల పస మిగలదు. ఏకభావం వుండదు. ఆ నిందలెవ్వరూ సహించరు!
ముప్ఫయ్యేడో ప్రకరణం
రాత్రి పాలెంలో అమ్మవారి గుడి దగ్గర జరిగే సభకి పిల్లల్ని వెంటవేసుకొని జానకి బయలుదేరింది.
జాన్ సూచన అంటూ వీరాస్వామి వచ్చి పిలిచేడు. ఆ పిలుపు గురించి, వుత్సాహం చూపలేకపోయినా, మరియమ్మ వచ్చి చెప్పాక మరి కాదనలేకపోయింది.
“నీకీ మీటింగుల సరదా ఇంకా పోలేదటే....” అంటూ భద్ర తాను ఇంట్లోనే బైఠాయించింది.
“నువ్వు కూడా రారాదూ? బావ లేడు కదా. ఒక్కర్తివీ కూర్చుని ఏం చేస్తావు? లే!” అని జానకి ప్రోత్సహించింది.
“అమ్మా! తల్లీ! మీకూ మీ మీటింగులకీ వో దండం! ఆ జరగడాలూ జరగడం జరిగిందిలూ వింటూంటే ఒంటి మీద తేళ్ళూ, జెర్రులూ పాకినట్లు వుంటుంది. వద్దు.”
ఆమె ముఖభంగిమలు చూసి జానకి నవ్వింది. కాని, ఆమె అంటున్నదేమిటో అర్థం కాలేదు.
“అదేమిటి?”
“కమ్యూనిస్టులు సబ్జక్టివ్గా ఆలోచించకూడదని మార్క్సో, లెనినో ఎవరో అన్నారటగా?”
“అనే వుంటారు. అన్నదెవరయినా అది మంచి లక్షణం కాదా”
“దాన్ని మెలితిప్పి, జరగడం శబ్దం తెచ్చి, మీవాళ్ళు గబ్బు పట్టించినంత బ్రహ్మాండంగా మరొకరు చెయ్యలేరు. చివరికి తెలుగుభాషలో దానిని తప్పనిసరి సహాయక్రియ చేసిపెట్టారు. రేడియో విను. ఆ జరగడం వుపయోగించే జబ్బు యెంత బాగా వ్యాపించడం జరిగిందో తెలుస్తుంది.”
జానకికా మాట తోచలేదు. ఆశ్చర్యంతో కళ్లు విప్పార్చి చూసింది.
“కర్తృత్వం మీద వేసుకోవాలంటే మేము అల్లా చేశాం ఇల్లా చేశాం అనాలి. ఆ పని తగలడితే బాధ్యత తమదవుతుంది. ఆ బెడద తప్పించుకొనేందుకు తెచ్చేరు, ఈ జరగడాన్ని. మేము చేశాము కాదు. అది అల్లా జరిగింది. అందులో కర్త లేదు. కర్తృత్వం బాధా లేదు. దేశం రోజు బాగుండక అది అల్లా జరిగింది. మేమేం చెయ్యం? మీ ప్రారబ్ధం. ఏడవండి! అని చెప్పడం.”
జానకి నవ్వింది.
“కమ్యూనిస్టులు చెప్పే మాటలు, చేసే పనులలో ఒక్కటేనా నీకు నచ్చింది వుందా?”
భద్ర తన అశక్తతను కనబరచింది. అంతలో-
“శాంతియుత సహజీవనం ఒక్కటే నచ్చింది” అంది.
“లేకపోతే బావకి విడాకులు ఇవ్వాలి గనక....” అని జానకి హాస్యమాడింది.
“అంతే మరి. సుశీల అంటే ఒంటరిది. పుట్టిల్లంటూ వుంది. వో వుద్యోగం వుంది. గనక మీవాళ్లు చేసిన పనికి బ్రతికిపోయింది. నలుగురు పిల్లలతో నేనేం కావాలి?”
“అప్పుడు బావనే పొమ్మందువేమో.”
“ఒక్కొక్కప్పుడు అనెయ్యాలనే వుంటుంది. అంతలో పాపం అనిపిస్తుంది. పొమ్మంటే భోజనం ఏం చేస్తారు? పోనీలే వుండనిద్దామనుకొంటుంటాను.”
జానకి నవ్వింది.
“ఆ లెనిన్ దూరదృష్టి గలవాడు. మీ కమ్యూనిస్టులు తెచ్చే కుక్క జట్టీలు ఆ పుణ్యాత్ముడూహించేడు. వీళ్ళకి ఇంట్లో విస్తరి వేసే యోగం కూడా వుండదేమోనని ఆలోచించేడు. మనవాళ్ళు కర్మయోగాన్ని సృష్టించినట్లు ఆయనగారు ఈ శాంతియుత సహజీవనం పట్టుకున్నాడు. మీరంతా బ్రతికిపోయారు....”
అంటూ గాంభీర్యం తెచ్చిపెట్టుకొని సిద్ధాంత నిర్వచనం చేసింది భద్ర.
జానకి సభ నుంచి తిరిగి వచ్చేవరకూ భద్ర మేలుకొని కూర్చునే వుంది.
ఆమె వస్తూనే ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండానే వెంటనే కాకినాడకు బయలుదేరాలంది. తొండలే విడిపించింది.
“ఇంత రాత్రివేళ కాకినాడ ప్రయాణమేమిటమ్మా! అదీగాక దీపావళి వెడితేగాని నేనెక్కడికీ బయలుదేరబోవడం లేదు. అది సరే గాని....”
భద్ర ఆమె మాటను వినిపించుకోదలచలేదు. “మళ్ళీ కాదనకు....”
“పిల్లలంతా యింటికి వచ్చేరా?”
“వచ్చేరు. అంతా పడకలేశారు. సరా. యింక విను. మీ బావా, నేనూ ఇదే చెప్పాలనుకొన్నాం. మన కక్షలూ, కార్పణ్యాలూ చచ్చేవాళ్ళ దగ్గర కాదు. అదాగాక....”
భద్ర మాటలలో ఏదో విశేషం వున్నదనిపించి, జానకి ఆమె ముఖంవేపు చూసింది.
“ఏమిటమ్మా నువ్వు చెప్పేది? నాకు కక్షలేమిటి? ఎవరా చచ్చిపోతున్నావారు?”
భద్ర తెల్లబోయింది.
“మీ బావ కనిపించేరా?”
“ఆ.”
“కనిపించి ఏమీ చెప్పలేదూ?”
“లేదు. వీరాస్వామీ వాళ్ళూ వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. త్వరగా యింటికి వెళ్ళమన్నాడు. అంతే.”
భద్ర నిస్పృహగా తల వేలవేసింది.
“నిన్ను వెంటనే తీసుకొస్తానని బయలుదేరేరు. ఈయనగారికి రాజకీయాల్లో మతి కూడా పోతూంది.”
“వర్తమానకాల క్రియేగనక యింకా ఏ కొంచమో మిగిలివున్నట్లేనా అనుకోవచ్చా?”-అంటూ సత్యానందం యింట్లో అడుగుపెట్టేడు.
“మీరూ, మీ పనులూ! తెల్లవారగట్ల రమ్మని గుర్రబ్బండి చెప్పేరా?”
“ఏమిటే కథ? కాకినాడకి గుర్రబ్బండిలో ప్రయాణమా యేమిటి?” అని జానకి యెగతాళి చేసింది.
“కంగారుపడకు. కూర్చో” అని సత్యానందం బుజ్జగిస్తూనే భార్యను శాసించేడు. రెక్కపట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టేడు. జేబులోంచి టెలిగ్రాం తీసి జానకి చేతుల్లో పెట్టేడు.
“మీరు వెళ్ళిన వో పదినిముషాలకి వచ్చిందట. నేను రాగానే చెప్పింది.”
“దీంట్లో ఏముంది, ఇంత కంగారుకి? మా ఎడ్రసు కావాలన్నారు. రాద్దాం.”
“అసలు ఆ ఎడ్రసు అడగడంలోనే వుందని నా అనుమానం. ముసలాయన ఏ జబ్బుగానైనా వున్నారేమో. లేకపోతే హఠాత్తుగా మీ ఎడ్రసు యెందుక్కావలసి వచ్చింది?”-అన్నాడు సత్యానందం.
జానకికి ఆ అనుమానం అర్థం లేనిదనిపించింది.
“జబ్బుగా వుంటే మాత్రం ఎడ్రసు అవసరం ఏముంది? ఏదో మామూలుగా అడిగి వుంటారు.”
“దానికి టెలిగ్రాం యెందుకు?” అంది భద్ర.
“పోనీ నువ్వే చెప్పు.”
“ఎడ్రసు కావాలన్నారు గనక పెద్ద ప్రమాదం ఏమీ వుండి వుండదు. కాని, యిచ్చింది టెలిగ్రాం కనక ఏ జబ్బుగానైనా వున్నారేమో. కాకపోయినా పెద్దతనం....” అంది భద్ర.
“డెబ్బయి దాటివుంటాయనుకుంటా”-అంది జానకి సాలోచనగా. ఆ మాట చూస్తే భద్ర వాదన నచ్చినట్లే అనిపించింది.
“డెబ్భయ్యయిదు” అన్నాడు సత్యానందం.
“మళ్ళీ కాదనకు....” భద్ర మళ్ళీ ప్రారంభించబోయింది.
మాట మధ్యలోనే జానకి తన అంగీకారం తెలిపింది.
“వెడతాం లే. ముసలాయననీ, తండ్రిగారి వైపువాళ్ళనీ కుర్రవాడికి చూపించాలనేది మేం బయలుదేరిన కారణాలలో ఒకటి. నువ్వు చెప్పిందీ సబబుగానే వుంది. ఆయన పెద్దవారా...”
“అయితే సర్దుకో. నేను సుబ్బరాజు బండి చెప్పివచ్చా. అమలాపురంలో కోటిపల్లి రేవులోకి వెళ్ళే మొదటి బస్సుకి అందించేలా రమ్మన్నా”నంటూ, సత్యానందం గడియారం వేపు చూసేడు.
“ఒంటిగంట దాటింది. ఇంక పడకేం వేస్తారు. నువ్వు సర్దుకున్నావా?”
“ఆ.” అంది భద్ర.
“పిల్లలెవరు వస్తారు?” అని జానకి ప్రశ్న.
“మళ్లీ యెల్లుండి వచ్చేస్తాం. వాళ్ళెందుకు?” అంది, భద్ర.
ముప్ఫయ్యెనిమిదో ప్రకరణం
“నానీ!”
మంచి నిద్రలో వున్నా తల్లి పిలుపు వినబడి రవీంద్ర చటుక్కున లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుముకుంటూ “ఇప్పుడెంత అయిందమ్మా!” అన్నాడు.
“రెండున్నర. నువ్వు లేచి మొహం కడుక్కొని, వేణ్ణీళ్ళు సిద్ధంగా వున్నాయి. స్నానం చెయ్యి. కాకినాడ వెడుతున్నాం.”
ఆ హఠాత్ప్రయాణం ఏమిటో అర్థం కాలేదు, రవీంద్రకు.
“ఏమిటమ్మా అంత తొందర? రాత్రి అనుకోలేదే.”
“లేదు. మనం వెళ్లేక తాతగారి నుంచి టెలిగ్రాం వచ్చిందట.”
విషయం అంతా విని రవీంద్ర ఒక్క నిముషం ఆలోచించేడు.
“దానికి టెలిగ్రాం ఎందుకు? ఎడ్రసు పంపమని వోకార్డు చాలదా?”
“అందుకే భద్రా బయలుదేరుతూంది. మీ తాతగారు అనారోగ్యంగా వున్నారేమోనని-“
“సాధన వస్తూందా?”
“దాని పనేముంది?”
“ఎరగనిచోటి కెడుతున్నాం. కాస్త మాట్లాడడానికేనా వుంటుంది. లేకపోతే తోచదు.”-అని రవీంద్ర నసిగేడు.
“ఎరగనిచోటికి వస్తున్నామని మున్నీని రమ్మన్నావా? అల్లాగే ఎక్కడికక్కడే స్నేహాలు చేసుకోవాలిగాని. మాటాపలుకూ కోసం మనుష్యుల్ని ఎగుమతి చేస్తూంటారా?”
రవీంద్ర ఏమీ అనలేకపోయేడు. మున్నీ బొంబాయిలో వాళ్ల స్కూలులోనే చదువుకొంటున్న అమ్మాయి. చాలా మంచి అమ్మాయని కొద్దినెలలు తెగమెచ్చుకొన్నాడు. ఇంటిక్కూడా తీసుకొచ్చి పరిచయం చేసేడు. కాని తరవాత ఆమె మాటే మరిచిపోయేడు.
ఒక్కనిముషం వున్నాక తన మాట తీవ్రతను తగ్గించేందుకు జానకి అంది. “దానికి చదువుంది....”
రవీంద్ర కూడా సర్దుకొన్నాడు.
“నాలుగురోజులకి మునిగి పోతుందిట. ఉండు, బయలుదేరతీస్తాను” అని లేచేడు.
“కూర్చోవోయ్” అంటూ జానకి అతని చేయి పట్టుకొని కూర్చోపెట్టి అంది.
“అత్తయ్య మనతో వస్తూంది. మరిక్కడ మామయ్యకి ఎవరు వండిపెడతారు?”
మాట మధ్యలోనే జ్ఞాపకం వచ్చింది. ఆ దంపతుల్ని తాను కూడా కొడుక్కి అత్త, మామల్నే చేస్తూంది.
“వెళ్ళేముందు మనం మాట్లాడుకోవాలి. అక్కడికెళ్లేక కుదరకపోవచ్చు. కూర్చో.”
రవీంద్ర బుద్ధిగా కూర్చున్నాడు.
“చూడు. అక్కడివాళ్లతో నాకేం పరిచయం లేదు. మీ తాతగారినీ, నాయనమ్మగారినీ ఒక్కమారు చూసేను. నువ్వదీలేదు. నువ్వు కూడా చూడాలన్నావు. బయలుదేరాం! ఆయన ఏమాత్రమో సంపాదించేరు. ఆ ఆశతో వచ్చామనుకొంటారేమో అని సందేహించాం....”
“అవన్నీ ఆలోచించుకొన్నాం కదమ్మా!”
“ఆలోచించినప్పుడు మనంతకి మనం బయలుదేరుతూన్నాం. కాని యిప్పటి స్థితి వేరు. వారుకూడా నీకోసం వాకబులో వున్నారు. రెండోది అత్తయ్య.”
మళ్లీ అదేమాట. కొడుకు పిలుపు తన ఆలోచనలని దారి మళ్లించిందనుకొంది.
“అత్తయ్యేమిటి?”
“ఆమె నీకోసమే బయలుదేరుతూంది.”
“ఎందుకు?”
“నీకు అన్యాయం జరక్కుండా అడ్డుపడతానని చెంగు నడుమున దోపింది.”
రవి ఆలోచించేడు.
“లేనిపోని తగవుల్లో పడతామేమో. అసలు వెళ్లకపోతేనేం?”
“ఇంతవరకూ వచ్చింది కనక మానడం సబబుకాదు. వెడదాం. వోమారు నలుగుర్నీ చూడు. నీకూ, నాకూ పెద్ద అభ్యుత్థానం జరుగుతుందనుకోకు. నీకోసం యిరవయ్యేళ్ళ అనంతరం వాకబు ప్రారంభించిన ముసలి ఆయన మీ నాన్నని చంపించెయ్యడానికి మనుషుల్ని పంపేరు....”
“అప్పటి మనుష్యుల్ని వో మారు చూడాలి” అన్నాడు.
“చూద్దువుగాని. మనం వచ్చిన రోజున వూరేగింపులోంచి రాయి విసిరి వీధిలైటు బద్దలు కొట్టేడన్నారు, జోగన్నఅని. వాడొకడు ఆ జట్టులో....”
“ఓహో....”
“ఇందాక మీటింగులో మొదట మాట్లాడేడు. అతని అన్నగారు సూరి అని వుండేవాడు. అతను ఆ రోజున ఆ దెబ్బలన్నీ తిని మీ నాన్న ప్రాణం కాపాడేడు. 50లో అతణ్ణి పోలీసులు కాల్చేసేరట.”
ఇద్దరూ చాలాసేపు ఎవరి ఆలోచనల్లో వారు కూర్చుండిపోయేరు. చివరికి రవీంద్రే అన్నాడు.
“మన ఆలోచనలన్నీ అనవసరం హైరాణా తప్ప వేరు కాదమ్మా.”
“అంతే అయితే ప్రాణం సుఖమే. కాని, భద్రక్క వదిలేలా లేదే.”
వారిని వెతుక్కుంటూ సత్యానందం వచ్చేడు.
“ఏమిటిది జానకీ! భద్ర నువ్వేదో అంటున్నావంటుంది. న్యాయంగా అతడికి రావలసిన ఆస్తిమాట యెత్తవద్దన్మావుట. ఏమిటది? ఆయన కొడుకుల్లో విశ్వం ఒకడు. అతనికీ ఆ ఆస్తిలో వాటా వుంది తెలుసా?”
“అసలు అధికారం వున్న మనిషే యెన్నడూ ఆ ఆశ పెట్టుకోలేదు బావా!....”
“ముసలాయనకి కొడుకు మీద వున్న కోపం మనమని మీద వుండకపోవచ్చు.”
రవీంద్ర తన అభిప్రాయం చెప్పేడు:
“ఓమారు మిమ్మల్నందర్నీ చూడాలని బయలుదేరాం. వెడుతున్నాం గనక నాన్నగారి బంధువుల్ని కూడా చూడాలనుకొన్నాం. వారికీ అటువంటి అభిప్రాయమే ఏదో వున్నట్లు తెలిసింది. మంచిదే. వోమారు వెడతాం. చూసి వచ్చేస్తాం. లేనిపోని సమస్యలు కల్పించుకోవద్దు. అర్థంలేని పని అది.”
సత్యానందం చాలా ఆప్యాయంగా అతని భుజం తట్టేడు. నవ్వేడు.
“దారిలో మీ అత్తయ్యని వొప్పించు.”
“నే చెప్తాలెండి. ఆమె నా మాట కాదనరు.”
సత్యానందం పట్టలేనంతగా నవ్వేడు.
“ఆవిడ సంగతి నీకు తెలియదు. కానీ, ప్రయత్నం చెయ్యి.”
ముప్ఫయితొమ్మిదో ప్రకరణం
దీర్ఘకాలం ఎడబాటు తర్వాత సుశీలను చూసినప్పుడు తనకు కలిగిన ఆనందమే, తన పలకరింపుతో ఆమెకూ కలగాలని డాక్టరు రంగనాయకులు కోరిక. కాని, ఆమె ఆనందంగాని, అభిమానంగాని చూపలేదు. కనబరచినదల్లా ఉదాసీనత.
ఒకప్పుడు తనయందు యెంతో ప్రేమ కలిగి, తాను లేకపోతే బ్రతకలేనన్న సుశీల నేడు ఉదాసీన. ఆమె దృష్టిలో తానూ ఒక గ్రామస్థుడు. అంతే. ఇతర గ్రామస్థులతో వ్యవహరించినట్లయినా ఆమె తనతో మాట్లాడలేకుంది. అది చూస్తే బాధ కలుగుతూంది. వూళ్ళోవారికిచ్చేపాటి విలువ కూడా తనకు ఇవ్వలేదాయని మనస్సు మధనపడుతూంది. దానికితోడు తల్లీ, తండ్రీ ముందు నారాయణ తెచ్చి చీర ప్యాకెట్టు, డబ్బున్న కవరు ఇచ్చెయ్యడం మొగాన కొట్టినట్టే అనిపించి బాధ పడ్డాడు.
తెల్లవార్లూ, ఒకటే ఆలోచనలు. తిరిగి వచ్చిన ఆ వస్తువులను చూసి వాటి కధ నారాయణ నోట, వానికి తెలిసినంతవరకు విని, తలిదండ్రులు ముఖ ముఖాలు చూసుకోడం మనస్సును కలిచేస్తూంది. ఇదివరకటిలాగ తండ్రి రాజకీయాలయెడ విశ్వాసం మనస్సులో కుదురుకోవడం లేదు. ఆ విశ్వాసంతో దూరంగా పెట్టిన భార్య దూరమైపోయింది. ఇంక మిగిలిందేమిటి?
తమ మధ్య ఏర్పడిన అగాధం వ్యక్తిగతం కాదు. రాజకీయం. కాని తన రాజకీయాలకు అడుగూడిపోయిందనిపించి, కంగారు పట్టుకొంది.
కాంగ్రెసులో క్రమంగా పెచ్చు పెరిగిపోతున్న పోలరైజేషన్‌తో సమంగా అతని రాజకీయ భావాలు గంద్రగోళంలో పడిపోతున్నాయి. కాంగ్రెసు ప్రభుత్వం దేశంలోని పెద్ద బ్యాంకుల్ని జాతీయం చేయడం అతడికి మంచిదనిపించింది మొదట. కాని, తన పార్టీ సిద్ధాంతవేత్తల వాదనలు విన్నాక దానికి పెద్ద విలువనివ్వనక్కర్లేదనే అనుకొన్నాడు. ఎ.ఇ.సి.సి.ని సమావేశపరచడం గురించి రేగుతున్న సంఘర్షణ, కాంగ్రెసులో చీలికలు, కుస్తీలు పెద్ద-చిన్న పిశాచాల తగువులాటగా మాత్రమే అనుకోమంటే-పోనీలే అనుకొన్నాడు.
కాని కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రధామ భాగస్వామి అయిన తమ పార్టీ వ్యవహరించే తీరు అతనిని చాలా గంద్రగోళంలో పెట్టింది. తాము ఇతరులతో వ్యవహారాలు చెండనాడుకొన్నారు. కాని, ప్రజల్ని? అత్యవసరం అని తాము చెప్పే భూసంస్కరణల బిల్లును తీసుకురావడానికి రెండేళ్ళు ఎందుకు పట్టింది? ఆ ఆలస్యానికి రివిన్యూ మంత్రి చెప్పిన కారణం విన్నాక – ప్రజాశక్తి వ్రాతలూ, తన తండ్రి వాదనలూ నచ్చడం లేదు. అసలు తమ పార్టీ పుట్టుకే పెద్ద అభాండంగా కనిపిస్తూంది.
సరిహద్దుల్లో చైనా జరిపిన (1962) దాడిని తానూ తండ్రీ సమర్థించారు. అది దేశద్రోహమని సుశీల ఎదుర్కోవడంతో తమ భార్యాభర్తల మధ్య తగవు రగిలింది. పాకిస్తాను చేసిన యుద్ధాన్నీ, దానికి చైనా పరోక్షంగా వత్తాసు యివ్వడాన్నీ తమ వాదనలు ఒక విధంగా సమర్థించేయి. దానితో తమ భార్యాభర్తల మధ్య తగవు తారస్థాయికి పోయింది.
ఇప్పుడు తన స్థితి ఏమిటి?
అంతర్జాతీయంగా చైనా, దేశంలో తమ పార్టీ మాటసాయం ఇచ్చేవారు కూడా లేకుండా చేసుకొన్నారు. మన తరపున మాట్లాడేవారు లేకపోవడమే సిసలైన మార్క్సిస్టు పంథాకు గుర్తు అయితే కేరళలో అది సిద్ధించింది. బెంగాల్లో కూడా ఆ రోజు అట్టే దూరంలో లేదనే తోస్తూంది.
అయితే నిప్పచ్చరం చేసుకోవడం మార్క్సిజానికి తోడ్పడుతుందనే నమ్మకం కలగడంలేదు. నవంబరు 1వ తేదీ తర్వాత కేరళలో పెద్ద విప్లవం వచ్చినంతపని అవుతుందని తామంతా భావించేరు. కాని, ఈ నాలుగురోజుల పత్రికలూ చూస్తే జనం తమ కోసం ‘అయ్యో’ అన్నట్లేనా కనిపించడం లేదు. బూర్జువా పత్రికలు వార్తలు దాచేశాయన్నాడు తన తండ్రి. ‘పంక్తుల మధ్య చదవడా’నికి కళ్ళు పత్తికాయలు చేసుకొన్నా ఫలితం లేకపోయింది.
పైగా నవంబరు 1న తాము తమ వూళ్లో జరిపిన వూరేగింపు ఘటనలు, మరునాడు సత్యానందంతో తండ్రి వ్యవహరించిన తీరు అతనికి వెక్కసమే కలిగించేయి.
ఈ పూర్వరంగంలో ఆతడు భార్యను దూరం చేసుకోడంలో తప్పు చేశాననిపించసాగింది. తెలంగాణా అల్లర్లలో ఆమె చనిపోయిందన్నప్పుడు బాధపడ్డాడు. బ్రతికి వుందన్నప్పుడు సంతోషంతో ఒక ఉత్తరం వ్రాసేడు. కాని, ఈ పరిణామాల అనంతరం తన బాధ్యత అంతేనా అనిపించసాగింది. ఆ ఆలోచనలు బలపడ్డాయి. ఆమెను మరల దగ్గర చేసుకోవాలనుకొన్నాడు. తన ప్రవర్తన అనంతరం ఆమెలో పూర్వపు సహృదయత ఏర్పడడం అసంభవం అనే ఆలోచన కూడా అతనికి తోచలేదు.
కాని, నేటి ఎదురు దెబ్బలతో అర్థం అయింది. సుశీలలో వెనకటి ఆప్యాయత లవలేశం కూడా మిగలలేదు.
ఆమెను పూర్వపు మనిషిని చెయ్యడం ఎల్లాగ?
తెల్లవార్లూ అదే ఆలోచన. తెల్లవారింతర్వాతా అదే ఆలోచన. ఆ అనుతాపంలో, ఒక దశలో, ఎంతో నిరాశ కలిగింది.
“కేశవరావు తప్పు సిద్ధాంతాల్ని మరింతదూరం లాగి ప్రాణం పోగొట్టుకొన్నాడు. నేను జీవితం పాడు చేసుకొన్నా. మా యిద్దరిలో ఎక్కువ దురదృష్టవంతులు ఎవరు అనుకోవాలో.”
నలభయ్యో ప్రకరణం
ఏవేవో ఆలోచనలతో కొట్టుకుపోతూ రంగనాయకులు, అత్తగారు పలకరించేవరకూ తాను వారి గుమ్మంలోకి వచ్చేననుకోలేదు.
“రావయ్యా. నిన్న సాయంకాలం యింట్లోంచి వచ్చేసరికే నువ్వు వెళ్ళిపోయేవు.”
అంతవరకూ ఒక ధోరణిలో సాగుతున్న అతని ఆలోచనలు ఆమె పలకరించడంతో మరోదారి పట్టేయి. తన అనునయ ప్రయత్నాలు అవమానంతో అంతం కాకుండేందుకు పెద్దవాళ్ళ సహాయం కోరాలనుకొంటున్నవాడల్లా హఠాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చేడు. తన రాజకీయ పశ్చాత్తాపం వేడిలో, భార్యతోడి అపవ్యవహారానికి ప్రాయశ్చిత్తంగా అవమానం భరిద్దామనే నిర్ణయానికి వచ్చేడు.
“సుశీల లోపల వున్నదాండి?”
“లోపలుంది. రా. మేడమీదికెళ్ళు.”
వీధిలో తన భార్య ఎవరినో పలకరిస్తుండడం వినబడి సావిట్లో రేడియో వద్దనున్న విశ్వనాధం లేచి గుమ్మంలోకి వచ్చేడు. భార్య వెనక వస్తున్నవాడు అల్లుడు.
“బహుకాలానికి. బహుకాలానికి. రావయ్యా. రా....ఏమే! ఏదీ అమ్మాయిని పిలు.”
చాలాకాలానికి వచ్చినందుకు శిక్షగా వీధిసావిట్లోనే కూర్చోబెట్టి కబుర్లు చెప్పి పంపేస్తాడేమిటి ఖర్మ-అనుకొన్నాడు, రంగనాయకులు. వాళ్ళకి ఆ అవకాశం కలిగించతలుచుకోలేదు.
“ఏదన్నా పనిలో వుందేమో కదిలించకండి. నేనే వెడతాను.”
అతని వుద్దేశం, తన పొరపాటు అర్థం అయింది. విశ్వనాధం సర్దుకొన్నాడు.
“మధ్య సావిట్లోంచి మెట్లున్నాయి. నీకు అడ్డమేమిటి? పైకి వెళ్ళు” అన్నాడు.
అల్లుడు మెట్లుమీదుగా పైకి వెళ్ళాక విశ్వనాధం భార్యకు పనులు పురమాయించసాగేడు....
“కాఫీ టిఫిన్ ఏమన్నా....”