ఆమె తనను చూడడానికి వచ్చిందంటే తన మీద అభిమానం వుంచిందన్నమాట. వచ్చేటప్పుడు తనతో తెచ్చిన అభిమానాన్ని వెళ్ళేటప్పుడు ఆమె తీసుకెళ్ళలేదు. ఆమాట తోచినప్పుడు అతనికి చాలా బాధ కలిగింది.
ఆమె వచ్చి తనను చూడవలసిన పనిలేదు. ఒక్క సుందరరావు తప్ప వెనుకటి కమ్యూనిస్టు మిత్రులలో ఒక్కరూ తనను చూడడానికి రారు. కాని, ఆమె వచ్చింది. వచ్చిన మనిషిని తాను నొప్పించేడు.
దానివలన తాను సాధించినదేమిటి?-అనే ప్రశ్న కలిగింది. తానన్న మాట మాత్రం ఏమిటనే ఆలోచన వెంటనే కలిగింది. రాజకీయాలను గురించి తాను తన అభిప్రాయాలను గట్టిగా చెప్పేడేగాని జానకిని ఏమీ అనలేదు. చైనా రివిజనిస్టును యీసడించేడేగాని, కనీసం డాంగేపేరన్నా ఎత్తలేదు. కనక జానకి నొచ్చుకోవడం అనవసరం!
ఆమె అభిరుచులూ, అభిమానాలూ, వర్గస్వభావం బయటపడ్డాయి తప్ప తన తప్పు లేదు. విప్లవ అప్రమత్తతను చూపించేడు తాను.
“పెట్టీ బూర్జువా, ఇంటలెక్ట్యుయల్, రివిజనిస్టు....ఆ....ఇండివిడ్యుయలిస్టు....”
కాని జానకికి తగిలించిన యీ విశేషణాలు ఏవీ ఎంతోసేపు అతని మనస్సుకి శాంతినివ్వలేదు. తన ప్రవర్తనలో ఏదో లోపం వుండి వుండాలి-
పాతిక ముప్పయేళ్ళ క్రితం తాము తెచ్చిన ప్రజాయుద్ధ వాదాన్ని ఎందరో హర్షించలేదు. తిట్టేరు. మొగాన ఉమ్మివేసిన ఘటనలు కూడా వున్నాయి. కాని-
ఆ రోజులనాటి సత్యానందం గుర్తువచ్చాడు. చాలమందికన్న తమరిని సమర్థవంతంగా ఎదిరించినవాడే. కాని, ప్రజల కష్టాలలో కలిసి వచ్చేవాడు. మిత్రుడయ్యేడు. చివరికి తమ పార్టీవాడయ్యేడు.
కాని, తాను? తమతో వచ్చేవాళ్ళని కూడా ఎందుకు తరిమేస్తున్నాడు? ఊళ్ళో అందర్నీ తిట్టేడు. పోనీ వాళ్ళు తనకు వ్యతిరేకులు. కాని జానకి?
మనస్సులో ఏదో అసంతృప్తి కొట్టుమిట్టాడుతున్న ఘట్టంలో వీరాస్వామి పుస్తకాల సంచితో వచ్చేడు.
“ఏం మామా! బాగున్నావా?”
మామూలు పరిస్థితిలో అయితే ఏదో పుల్లవిరుపు మాటతో మనస్సు నొప్పించడానికి ప్రయత్నించేవాడే, జాన్. కాని యీవేళటి మనస్థితి వేరు. నెమ్మదిగానే పలకరించేడు.
“ఏమిట్రోయ్, శాన్నాళ్ళకి కనిపించేవు. ఆ సంచి అంతలా వుందేటి?”
“సాహిత్య వారం.”
అన్నాడేగాని పుస్తకాలు చూపించడానికి ప్రయత్నించలేదు. రెండు మూడేళ్ళ క్రితం వాళ్ళు యిల్లాగే తెస్తే, తాను వాటినన్నింటినీ తోసిపారేసేడు. మళ్ళీ తేలేదు. ఈవేళ ఎందుకొచ్చేడు?....నూతన మనస్థితిలో తానే అడిగేడు?
“ఏం పుస్తకాలు తెచ్చేవు?”
“పుస్తకాలు తేవడం కాదు-“ అన్నాడు వీరాస్వామి సంచి దగ్గరగా నొక్కుకుంటూ. జాన్‌కి కోపం వచ్చింది.
“మరి?”
“సాహిత్యవారంతో పాటు మేం స్థానికంగా నిర్బంధ వ్యతిరేక వారం కూడా జరుపుతున్నాం. ఈవేళ పాలెంలో సభ. దానికి నువ్వు అధ్యక్షుడుగా వుండాలి.”
వీరాస్వామి దేశంలో పడుచువాళ్ళు నిర్మాణం మాట వదలి టెర్రరిస్టు ధోరణికి ఎల్లా ఎగబడుతున్నారో చెప్పేడు. ఏ సమస్యనూ సరిగ్గా పరిష్కరించక, జనద్వేషం తెచ్చుకొన్న ప్రభుత్వం, ప్రజల కోసమే మహాత్యాగాలకి సిద్ధపడ్డ ఆ యువకుల మీద, వాళ్ళ అనాలోచిత పంథాను వుపయోగించుకొని జనం మీద కసి తీర్చుకొనేందుకు ఎల్లా ప్రయత్నిస్తూందో చెప్పేడు. ఇప్పుడు జగజెట్టులవంటి కుర్రవాళ్ళని కాపాడుకోడానికీ, ప్రజావుద్యమాలలోకి ప్రజల్ని తెచ్చేటందుకూ, ప్రభుత్వాన్ని ఒంటరిని చేసేటందుకూ, మనం అందరం కలిసి పని చెయ్యాలని మా కోరిక-అన్నాడు.
వీరాస్వామి ఎత్తును గ్రహించేనన్నట్లు జాన్ నవ్వేడు.
“పోలీసాళ్ళ పద్దులోకి ఎక్కించి మీరు చోద్యం చూడడానికా?”
అరవైరెండు నుంచీ “ఇది దుందుడుకు విధానం” అనడం రాజకీయాల్లో పోలీసు చిఠ్ఠాలకి పేరు సప్లయి చేయడంగా ఎదుర్కోడం అలవాటయింది. జాన్ ఆ అలవాటుకొద్దీ అనేశాడు. కాని మీటింగు వుద్దేశం గుర్తు వచ్చి తన పొరపాటు అర్ధం అయింది. ఈమారు కూడా వీరాస్వామి వెనకటల్లే తనని హేళన చేస్తాడని అనుకొన్నాడు.
“పోలీసువాడిని గురించి అంత భయపడే వాడికి విప్లవం గురించి అంత ఆర్భాటం, అరుపులు ఎందుకంటార”న్న ప్రశ్నకు బదులు వీరాస్వామి అనునయించబోవడం ఆశ్చర్యమే అనిపించింది.
“నీలాంటివాడే అల్లాగంటే ఎలాగ? నువ్వు అల్లా అంటే ప్రభుత్వం ఎత్తు పారినట్లే కదా. కొట్టిపారేస్తే మరి వుద్యమాలూ వుండవు. నోరెత్తే దమ్ములూ ఎవరికీ వుండవనే కదా వాళ్ళ ఆలోచన....”
ఇంకా ఏం చెప్పునో? తాను భయపడినట్లే అనుకుంటున్నాడనిపించింది. వెంటనే సర్దుకొన్నాడు.
“కూర్చుని లేవకుండా వున్నా, నేనెందుకురా. మరొకర్ని చూడు. ఒకటి ఆలోచించు. సత్యానందంగారింటికి విశ్వంగారి భార్య వచ్చేరు. చదువుకున్న ఆవిడ. ఆవిడ వుంటే బాగుంటుంది....”
కాని వీరాస్వామికి జాన్ వుండడంలో విశేష ప్రయోజనం కనిపించింది.
“పోలీసాళ్లు చేసే దురన్యాయాలు చూపడానికీ, చెప్పడానికీ నీవే వుండాలని మేమంతా అనుకున్నాం. ఆవిణ్ణి మాట్లాడమందాం.”
జాన్ ఒక్కమారు కాళ్ళకేసి చూసుకొన్నాడు. ఇందాకా క్రింద పడ్డప్పుడు పెచ్చులేచిన మోచేయి తడుముకొన్నాడు.
“ఏనాడో ఈ పనికి పూనుకోవలసింది” అన్నాడు.
“మా పార్టీ ప్రభుత్వం ఆలోచనల్నీ చర్యల్నీ ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూనే వస్తూంది!” అన్నాడు వీరాస్వామి.
తమ పార్టీ కూడా ఏమీ లోటు చెయ్యలేదన్నాడు జాన్.
“మా పత్రికలో సంపాదకీయాలు వ్రాశారు.”
కాని యువత, ఎందరో విద్యావంతులు ఈ దుస్సాహసిక పంథాకు ఎందుకు విరగబడుతున్నారు? మావో పిలుపు ఒక సద్యః కారణం కావచ్చు. కాని, 1930-35 లో ఆకర్షించలేని దుస్సాహసికత ఈవేళ ఎల్లా, ఎందుకు ఆకర్షిస్తూంది? తమ కార్యక్రమాలు దానికెంతవరకూ బాధ్యం?
ఉగ్రవాదుల్ని తమకు ద్రోహం చేసినవారినిగా నిందించే మార్క్సిస్టుల వద్దా, వారిని దారి తప్పిన స్వార్ధ త్యాగులుగా వర్ణించే తమ వద్ద కూడ ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదని వీరాస్వామి ఎరుగును. కాగితం ఖర్చు కన్న తాము ఇద్దరూ ఇంతవరకు ఈ విషయమై విశేషంగా చేసినదేమీలేదనీ ఎరుగును. వూరుకొన్నాడు.
జాన్ సర్దుకొన్నాడు.
“ఒకరినొకరం అనుకొనేదేముందిలే. ఇప్పుడేనా తోచింది. మీరే నయం. కుర్రాళ్లు. వస్తాలే, కానీండి.”
ఇరవయితొమ్మిదో ప్రకరణం
వీరాస్వామి వెళ్ళగానే జాన్ కొలిమిపాక దగ్గరకెళ్ళి పనివాళ్ళందర్నీ పిలిచేడు.
“రాత్రి అమ్మవారి గుడి దగ్గిర మీటింగుంది. మీ వాళ్ళని పదిమందినీ వెంటేసుకురండిరా.”
“ఏం మీటింగేంటి?”
ఒక్కనిముషం క్రితం వీరాస్వామి తమకూ చెప్పేడు. అంతకుపూర్వం కూడా అందరికీ అందరికీ తెలుసు. కాని, ఏమీ ఎరగనట్లే అడిగేరు. తమకు యిష్టం లేనట్లు విసుక్కున్నారు. కొందరు పోలీసాళ్ళ భయం కూడా వెలిబుచ్చేరు.
వాళ్ళకి ఎల్లా చెప్పాలో జాన్‌కి తెలియలేదు. వోపిగ్గా చెప్పే అలవాటు ఈ ఇరవయ్యేళ్ళలోనూ పోయింది. ఎక్కడినుంచి ఎల్లా ప్రారంభించాలో కూడా తోచలేదు. కోపం వచ్చింది.
“ఎదవనాయాళ్ళలారా! ఇప్పుడే గదంటరా యీరాసామి చెప్పేడు.”
“సెప్పేడులే. ఇప్పుడీ తగులాటం ఎందుకని. ఏదో పని చేసుకు బతుకుతున్నాం....” పరమేశు అడ్డువేశాడు.
“ఒరే పరమేశుగా” అన్నాడు జాన్.
“సెప్పు.”
“మీ గూడెంలో గుడిసెలెన్నిరా?”
“నలబయ్యారు.”
“అందులో కాపరాలెన్నిరా?”
“మూడేళ్ళక్రితం తొంబయిరెండు.”
“ఈ మూడేళ్ళలో ఎవరూ మనువాడనే లేదంటరా!” అన్నాడు జాన్.
“సేనామంది ఆడేరు.”
అడిగినదానికే చెప్పి వూరుకొంటూ వుంటే జాన్‌కి కోపం వచ్చింది.
“సేనమంది అంటే లెక్కలేదంట్రా. నాకు నీ సంగతి ఎరికలేదనే” నవ్వేడు. “వో నూరు వుంటయ్యా!”
ప్రతి కుటుంబానికీ ఇల్లేసుకుందికి బంజర్లో చోటు కావాలని ఏటా తాసీల్దారుకూ, కలక్టరుకూ ఆర్జీలు పెడుతూ తిరుగుతున్న వాళ్ళల్లో పరమేశు ఒకడు. ఆతడు కమ్యూనిస్టు పార్టీవాడు. తన రహస్యాలు లాగడానికి జాన్ ప్రయత్నం అని అనుమానం. జాన్ మార్క్సిస్టు. విసుక్కున్నాడు, పరమేశు.
“నే లెక్క తియ్యలేదు.”
జాన్ సర్దుకొని “పోనీలే” అన్నాడు.
“అంటే గుడిసెలేనా లేనివాళ్ళు ఒక్క మీ పేటలోనే ఏభయిమంది వున్నారు.”
“మీ పార్టీ వాడే జోగయ్యగారిని పెట్టకపోతే దివాను ఆక్రమించిన అయిదెకరాలూ ఎన్నడో లాక్కునుండేవాళ్ళం. మాకే కాకుండా వూళ్లో సేనామందికి వుండేవి” అన్నాడు పరమేశు.
వూళ్లో కమ్యూనిస్టుపార్టీ విడిపోయినాక జరిగిన అనేక కక్షసాధింపు పనులలో ఆ భూమి గొడవ ఒకటి. అందులో తమ పార్టీ పద్ధతి సరికాదేమోనని మధ్య మధ్య అనిపించినా, జనాన్ని చేర్చుకొని, బలపరచుకొనేందుకు వుంటుందనే ఆశతో తల వూపుతూ వస్తున్న జాన్ దానికి సమాధానం ఇవ్వలేదు.
“ఈ గవర్నమెంటుండగా మనకి ఇళ్ళూ లేవు. వాకిళ్ళూ లేవు. మన గవర్నమెంటు రాంగనే పనులు జరుగుతాయి. పదేనేళ్ల క్రితం ఛాన్సు వచ్చింది. కాని పడనీలేదు. ఊరికే చావడం గాని. అందుకోసం వీలైన చోట్లల్లో అల్లా మనోళ్ళని కూర్చోబెట్టి చెయిజారిపోకుండా చూస్తున్నాం. ఆ రోజు రావాలి.”
“వస్తూంది. నోరు తెరుచుక్కూకో....” అంటూ పరమేశు వెనక్కి తిరిగేడు.
“అల్లాగ లేనోళ్ళకి బూము లివ్వాలని, పెద్దోళ్ళ అన్యాయాలు పోవాలని అన్నందుకే మనూరి కేశవరావుగారిని గవర్నంటు హింసపెట్టి చంపింది.”
“మన్నీ చంపడానికా. మన కెందుకులే ఈ సబలు....” అని నలుగురూ లేచిపొయ్యేరు.
ముప్పయ్యో ప్రకరణం
నలుగురికీ నచ్చేలా చెప్పి సభకు తీసుకెళ్ళడానికై తాను చేసిన మొదటి ప్రయత్నం ఫలితం చూసి జాన్ స్తబ్ధుడైపోయాడు.
లోపల పరమేశేదో చెప్తున్నాడు. వాడే తన ప్రయత్నం అంతా భగ్నం చేశాడనిపించింది. తాను వడ్రం, కమ్మరం నేర్పి మంచి పని వాడినిగా చేసిన పరమేశు తనకే మేకై కూర్చున్నాడు. విశ్వాస ఘాతకుడు అని తిట్టుకున్నాడు.
“ఒరే పరమేశూ!”
నిశ్శబ్దంగా పాకలోంచి వచ్చి పరమేశు “ఏంటి?” అన్నాడు.
వాని గంభీరమైన, బలిష్ఠ విగ్రహం, ప్రశాంతమైన స్వరం విన్నాక జాన్ వానిని పోయి మరో పని చూసుకోమనలేకపోయాడు. వాడెళ్ళిపోతే తన పాక పడుకొంటుంది. అల్లాంటి పనివాడు మరొకడు దొరకడు. తగ్గేడు.
“ఏం పనిరా నువ్వు చేస్తున్నది? పనివాళ్ళని నాకు ఎదురు తిప్పుతున్నావటరా?”
ఆ స్వరంలో ఆరోపణకు బదులు ఆక్రందనం వినిపించింది. పరమేశు ఖచ్చితంగానే అన్నాడు.
“మరి సూరయ్యగారి బండికి పోలుకర్ర వేసి రేపు తెల్లారేటేలకు ఇయ్యాలన్నారు. పట్టాలింకా కాల్చనన్నా లేదు. ఏం చేస్తా?” అంటూ రోడ్డు వేపు చూసి ఉలిక్కిపడ్డాడు.
“అరుగో. సూరయ్యగారే వస్తున్నారు. ఏం చెప్తావో?”
జాన్ చిరాకుపడ్డాడు.
“సూరయ్యగారిదైనాక సుబ్బయ్యగారిది. ఆయెనక మరోరిది. ఇలా యేస్తూనే వుంటావు. ఈలోపున ఏ పోలీసోడో వచ్చి రమ్మంటాడు. అడిగేవోడు, పెట్టేవోడు లేకుండా చస్తాం.”
సూరయ్య వస్తూనే కార్కానా చుట్టూ తిరిగి వచ్చాడు. తన పని తాబేలు నడకలో నడుస్తూందనిపించింది.
“ఏమయ్యా! మన పని రేపటికి కూడా అయ్యేలా లేదే. మాట ప్రకారం చెయ్యలేకపోతున్నావు. నీకూ పనులు యెక్కువైనాయల్లే వుంది....”
జాన్‌కి బదులు పరమేశు సమాధానం ఇచ్చేడు.
“మీ పనే చేస్తున్నామండి. సాయంకాలానికి పట్టాలు ఎక్కించేస్తాం.”
జరగవలసిన పని పట్టాలు ఎక్కించడం కానే కాదు. సూరయ్యకి తెలుసు. ఆ మాటే అన్నాడు. రాత్రి తెల్లవార్లూ చేస్తేగాని తెమలదు.
“రాత్రి ఇళ్ళ నుంచి కూడు తేడానికి మనిషిని పెట్టండి. సాయంకాలం కాఫీ తాగిరాండి. సత్తెం హోటలులో చెప్పి వెడతా. రాత్రి టీ కావలసి వుంటుందేమో ఆ ఏర్పాట్లు చూడండి. ఎల్లాగయినా రేపు పొద్దుటికి....”
“అవదండి....” అన్నాడు జాన్ ఖండితంగా.
“అల్లాగంటే ఎల్లాగయ్యా! దీపావళి ముసురు రాకుండా అరటిగెల తోలెయ్యాలని కదా. మళ్ళీ పైబండి చూసుకోనా....”
సూరయ్య అనునయంగా మాటలాడుతుంటే జాన్ కఠినంగా చెప్పలేకపోయేడు. పరమేళు అందుకున్నాడు.
“మీ పనే చేస్తున్నామండి. కాని, చెయ్యడానికేనా వ్యవధి కావాలి కదండి.”
“రాత్రికి మనుష్యుల్ని పెట్టు. మంచి పనివేళా పని చెడింది. అదనం అవుతే ఇచ్చేద్దాం” అన్నాడు సూరయ్య.
“రాత్రికి....” పరమేశు నీళ్లు నములుతూ జాన్ ముఖం చూసేడు.
“రాత్రి మీటింగు వుందండి” అన్నాడు జాన్. “పని చెయ్యలేము. నేను పరమేశూ కూడ వుండం.”
సూరయ్య మందహాసం చేసేడు.
“మొన్న వూరేగింపు. ఈవేళ సభ. రేపు మరొకటి. మరి పనులెలాగయ్యా?”
జాన్ దానిని హాస్యంగానే పరిగణించేడు.
“ఇవే కదండి మాకు సినిమాలు,”
“మొన్నటి వూరేగింపంటే అర్థం చేసుకోగలను. కేరళలో మీ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోసి కమ్యూనిస్టులు అందులో దూరేరు కనుక ద్రోహం చేశారన్నారు. ఆ ద్రోహానికి అసమ్మతి అన్నారు. బాగుంది. కాని వాళ్లు ఈవేళ పెడుతున్న సభకి నువ్వు అధ్యక్షత ఏమిటి?....”
“సైన్సు మేష్టారి కేశవరావుగారిని పోలీసులు చంపేశారు.”
“ఔనుట పాపం” అన్నాడు, సూరయ్య సానుభూతిగా. కాని, అతని ప్రశ్న మరింత విస్తరించింది. నక్సల్‌బరీ ఉగ్రవాదుల్ని పోలీసులు చంపారు. సరే కాని, వాళ్ళచేత బండబూతులు పడే జాన్ పార్టీ, సత్యానందం పార్టీ కూడా వాళ్ళ విషయంలో పనులు మానుకొని సభలూ అవీ చెయ్యడం ఏమిటంటాడు.
సూరయ్య పత్రికలు క్షుణ్ణంగా చదివే మనిషి. కమ్యూనిస్టులలోని వేరు వేరు శాఖలవారి ఆలోచనా ధోరణులలో వున్న తేడాలకన్న వాళ్ళ వాళ్ళ మధ్య వున్న ద్వేషాలు బాగా తెలిసినవాడు.
జాన్ ఓర్పుగా చెప్పడానికి పూనుకొన్నాడు.
“శ్రీకాకుళం కొండల్లో వాళ్ళకి అన్యాయాలు జరిగితేనూ, ఖమ్మం జిల్లాలో రైతులకి లేకుండా భూములు పెద్దోళ్ళు కాజేస్తేనూ కేశవరావుగారికి ఏం పట్టిందండీ!”
సూరయ్య కేశవరావు ‘బుద్ధిహీనత’కు సానుభూతి తెలిపేడు. ‘బాగా చెప్పేవు’ అన్నాడు.
“చదువుకుంటున్నాడు. మంచిగా చదువుతున్నాడట కూడా. కమ్మవారూ కాదూ. ఒక ‘ల’ కారం దాకా కట్నం యిచ్చి లక్షణమైన పిల్లను ఇస్తామని సంబంధాలు వస్తున్నాయట కూడానూ. అంతా పాడుచేసుకొన్నాడు. చివరికి ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు.”
తాను ప్రారంభించిన సంభాషణ ఎదురు తిరిగినట్లనిపించి జాన్‌కు విసుగు, కోపం వచ్చేయి.
“అదే జబ్బండి మాది కూడా. తిని కూర్చోలేక పెట్టుకొనే బాడఖా వ్యవహారాలండి” అంటూ వెటకారం చేసి, మూతి ముడుచుకున్నాడు.
ముప్ఫయ్యొకటో ప్రకరణం
రాత్రి తొమ్మిది గంటలకు పాలెంలో అమ్మవారి గుడి దగ్గర బహిరంగ సభకు జాన్ అధ్యక్షుడని మెగాఫోన్‌లో వీరాస్వామి చెపుతూంటే విన్న సుందరరావు మొదట నమ్మలేదు. తప్పు విన్నాననుకొన్నాడు. పనిమనిషి వీధిలోంచి వస్తూంటే అడిగాడు. తాను విన్నదానిని ఆమె ధృవపరచింది. ఆ మాట వినగానే సుందరరావుకి వొళ్ళెరగని కోపం వచ్చింది. కొడుకుని పిలిచేడు. వెంటనే జాన్ వద్దకు ఎవరినేనా పంపి రప్పించమన్నాడు.
వీరాస్వామి రివిజనిస్టు పార్టీవాడు. వాళ్ళ పార్టీ తరపున నిన్న సత్యానందం వచ్చి నిర్బంధ వ్యతిరేక దినం జరుపుతున్నాం రమ్మంటే తమ పార్టీ నిరాకరించింది. ఇప్పుడు వాళ్ళు మీటింగు పెడితే జాన్ అధ్యక్షుడా? క్రమశిక్షణ లేకుండా ఇలా ప్రతి ఒక్కరూ తలో పెత్తనం చేస్తే పార్టీ ఏమంటుంది? రాజకీయ పార్టీ కప్పలతక్కెడా, పీతల మంగలమూ అయితే సార్లపడిందే.
“జాన్‌ని పిలుచుకు రమ్మను.”
సుందరరావు వుద్వేగాన్ని చల్లార్చడానికి రంగనాయకులు ప్రయత్నించాడు.
“మీకున్న బ్లడ్‌ప్రెషర్‌కి అలా వుద్రేక పడడం మంచిది కాదు. కొంచెం నెమ్మదించండి.”
కొడుకు సలహాతో సుందరరావు అగ్గిపుంతే అయిపోయాడు. రాజకీయ సమస్యను ఆరోగ్యం, జబ్బు పేరున దాటించెయ్యమంటున్నట్లు తోచి మరింత చికాకుపడ్డాడు. ఈమధ్య రంగనాయకులు ధోరణిలో మెతకదనం ఛాయలు అధికాధికంగా కనిపిస్తున్నాయనిపించింది. ఇదొకటి. కాని వైద్యుడుగా అతని సలహాను పాటించవలసిన అవసరం వుందని ఈ మధ్య, ముఖ్యంగా మొన్నటి నుంచి బాగా తోస్తూంది.
కష్టం మీద నిగ్రహించుకొని శాంతపడేందుకు ప్రయత్నించేడు.
“మన శరీరం గట్టితనం, వోటితనం పట్టి దేశ రాజకీయాలు నడవ్వు” అని తన ఆవేశాన్ని సమర్ధించుకొనేందుకు స్వల్ప ప్రయత్నం చేశాడు.
“మన శరీరానికి లాగే, రాజకీయాలకు కూడా ఆవేశాలూ, ఉద్రేకాలూ మంచివి కావండి” అన్నాడు రంగనాయకులు భయం భయంగానే.
సుందరరావు అతని వంక చురుక్కుమనేలా చూసేడు.
“ఎదుటివాడిని జోకొట్టడం, శాంతం పేరున చేతులు నలపడం మార్క్సిజానికి సరిపడదు. క్రమశిక్షణను భంగపరచి, పార్టీని ధ్వంసం చేస్తూంటే వూరుకోమనడం వుందే, జైలు భయం, లాఠీ భయం చూపించి విప్లవ చైతన్యాన్ని నీళ్లు కార్చడంవంటిదే. నీలో రివిజనిస్టు భావాలు తలఎత్తుతున్నాయి, జాగ్రత్త....”
ఒక చిన్న మాట అడ్డం వేసినా తండ్రి రెచ్చిపోతాడనే భయంతో రంగనాయకులు చల్లగా వూరుకున్నాడు.
“నేను పేట వెడుతున్నా, దారిలోనే గనక జాన్‌తో చెప్పి పంపిస్తాలెండి.”
సుందరరావుకు కొడుకు మీద నమ్మకం తగ్గింది.
“వద్దు. నే వెడతాలే.”
ఆయన ఆరోగ్యం విషయమై భయం కలిగినా రంగనాయకులు ఏమీ అనలేకపోయాడు. ఓ నిముషం వుండి సుందరరావే అన్నాడు.
“ఆస్తులు, ఆరోగ్యాలు పోయి, అనేక అనర్ఘరత్నాలను పోగొట్టుకొని అనంత త్యాగాలు చేసింది, పార్టీని గబ్బు పట్టిస్తూంటే చూస్తూ కూర్చోడానికి కాదు. ‘మా పార్టీలో మెతకమనుషుల కోసం తడుములాడకండి. ఆ ప్రయత్నంలో మరో శతాబ్దం ఆగవలసి వస్తుంది’ అన్నారు, మన నాయకులు కలకత్తాలో. అది మన సవాలు. మన ప్రతిజ్ఞ. మన లక్ష్యం. గుర్తుంచుకో.”
ముప్ఫయిరెండో ప్రకరణం
దూరాన సుందరరావును చూడగానే జాన్ భయపడ్డాడు. రంగనాయకులు ఇప్పుడే చెప్పి వెళ్లాడు. డాక్టరయితే తాను అధ్యక్షతకు వొప్పుకోవడం మంచిదే అనుకుంటానన్నాడు. కాని ముసలాయనకది నచ్చలేదని ముందే హెచ్చరిక చేశాడు. ఆయన మాట విన్నాక ధైర్యమే కలిగింది.
“ఇది ఒకరింటి పెళ్ళి కాదు. ప్రజాకార్యం. ఇందులో పాల్గొనడం పార్టీ లక్ష్యాలకు విరుద్ధం కాదు” అన్నాడు తాను.
కాని సుందరరావు ముందు ఆ విశ్వాసం నిలబడలేకపోయింది. ఆయన చెప్పింది ఏదీ ప్రత్యాఖ్యానం చేయవలసినట్లు కనబడదు. కాని....
దేశానికి మార్క్సిజమే శరణ్యం!
దానికి క్రమశిక్షణ గల మార్క్సిస్టు పార్టీ కావాలి.
వరుసగా తన విశ్వాసాలనే సుందరరావు ఏకరువు పెడుతున్నాడు. కాదనవలసిన పని కనబడ్డం లేదు.
“ప్రస్తుత రాజ్యాంగం ద్వారా సోషలిజాన్ని నిర్మించే అవకాశం వుంది, అంటారు రివిజనిస్టులు....” అంటూనే ‘ఏం ఔనా?’ అని గద్దించేడు సుందరరావు.
“చిత్తం.”
“మహాసముద్రంలాంటి మన దేశ రైతాంగం మధ్య అక్కడా అక్కడా చెదురు మదురుగా కనిపించే రైతాంగ, గిరిజన ప్రజల మిలిటెంటు పోరాటాలు చిన్న చీమలంత ద్వీపాలలా వున్నాయి. వాటిని చూపించి, పరిపక్వమైన జాతీయ విముక్తి యుద్ధాలంటూ అతిశయోక్తులతో కూడిన నినాదాలు ఇస్తున్నారు. వానికి అనుకూలంగా సిద్ధాంతాలు వల్లె వేస్తున్నారు, ఉగ్రవాదులు.
“మన పంధా ఈ రెండు ధోరణులకీ చేరదు. ఒప్పుకొంటావా?” అన్నాడు.
ఒప్పుకోకపోవలసిన అవసరం కనబడలేదు, జాన్‌కి.
“ఎడా పెడా వస్తున్న ఈ సంఘర్షణలలో మనం మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలంటావా?” అన్నది సుందరరావు తరువాతి ప్రశ్న.
“తప్పకుండా” అన్నాడు జాన్ ధైర్యంగా.
టక్కున సుందరరావు ప్రశ్న వేశాడు.
“మరి ఇప్పుడు నువ్వు చేసిన పనేమిటి!”
అదే అతనికి అర్థం కాలేదు.
“ఇది రివిజనిస్టులు ఏర్పాటు చేస్తున్న సభ. దానికి నువ్వు అధ్యక్షుడివి. అందులో వాళ్లు ఏమి మాట్లాడుతారో. దానికి నీవు బాధ్యత వహిస్తావా? ఏమీ మాట్లాడకపోయినా వాళ్ళ సభలో మనం మాట్లాడడం ఏమిటి? నీకంత నాయకత్వం కావాలంటే సభ ఏర్పాటు, పార్టీ తరఫున, నువ్వే....”
నాయకత్వం మాట వచ్చేసరికి జాన్ చిన్నపుచ్చుకొన్నాడు.
“నాయకత్వం కోసమే ఇది చేశానంటారా! మీరు కూడా.”
“నేనడం కాదయ్యా! వూళ్లోవాళ్ళు, ప్రజలు అడిగారు. నిన్న వచ్చి సత్యానందం అడుగుతే నువ్వు ససేమిరా అన్నావు. ఈవేళ జాన్ ఒప్పుకున్నాడు.-అంటున్నారు.”
“ఆయన మిమ్మల్ని అడిగేరనీ, మీరు కాదన్నారనీ వీరాస్వామి చెప్పలేదు.”
“ఎందుకు చెప్తాడూ? మనం ఇంత ఇలాగున్నామని, ఎవరి మగ్గానికి వారే సేనాపతులమని గ్రహించేశారు.”
జాన్ ఆలోచిస్తున్నాడు. చటుక్కున తోచింది.
“అతడేనా నన్ను మార్క్సిస్టు పార్టీ తరఫున రమ్మనలేదండి. పోలీసు దౌర్జన్యాలకి గురయిన వాడినిగా....”
“నీవు పార్టీ సభ్యుడవు. పార్టీ జీవితానికి భిన్నమైన జీవితం వుందా నీకు? ఇదెప్పటి నుంచి?....”
ఏమనాలో జాన్‌కి తెలియలేదు. తన ఆలోచనల ప్రకారం వేరే జీవితం లేదు. కాని....
“పార్టీ శ్రద్ధ తీసుకోవలసిన కొత్త పరిస్థితి తెచ్చేవు. దీనిని పార్టీలో చర్చించవలసిందే.”
జాన్ హడలిపోయేడు.
సుందరరావే అడిగేడు.
“ఏం చెయ్యదలిచేవు యిప్పుడు?”
“చెప్పండి” అన్నాడు, జాన్ నీరసంగా.
“మనది బూర్జువా, పెటీబూర్జువా పార్టీల వంటిది కాదు. విమర్శ, ఆత్మ విమర్శ మన పార్టీలో క్రమశిక్షణకి మూలం.”
జాన్ చటుక్కున ఒప్పుకొన్నాడు.
“నేను చేసింది తప్పే.”
“అందరూ చేస్తారు తప్పులు. తప్పు చేయని వారెవరు?” అన్నాడు సుందరరావు వుదారంగా.
రంగనాయకులు కూడా తప్పు ధోరణిలోనే వున్నాడని చెప్పడమో, మానడమో అర్థం కాలేదు. చెప్పకూడదనుకొన్నాడు జాన్.
“తప్పు తెలుసుకోడం....”
జాన్ ముఖం చిట్లించేడు. తాను మెత్తబడితే సవారీ ప్రారంభిస్తున్నాడనిపించింది.
సుందరరావు గ్రహించేడు, తాను అతి చేస్తున్నానేమోనని.
“అయిందేదో అయింది. సభకి అధ్యక్షుడివిగా వెళ్ళు.”
“మరి!”
“మన పార్టీ ఆధ్వర్యాన జరిగినట్లే సభ వుండాలి. మనవాళ్ళే మాట్లాడాలి.”
అది సాధ్యమా అని ఆలోచిస్తూంటే సుందరరావు ఖండితం చేసి వెనుతిరిగేడు.
“జ్ఞాపకం వుంచుకో, రేపు పార్టీకి రిపోర్టు తయారు చెయ్యి.”
ముప్ఫయిమూడో ప్రకరణం
బళ్ళగేటులో నిలబడి వున్న సుశీలను చూసి రంగనాయకులు చటుక్కున కారు ఆపేడు. పక్కగా వచ్చిన కారును చూసి వులికిపడి వెనక అడుగు వేసిన సుశీల వెంటనే వినిపించిన పలకరింపు విని తలయెత్తి చూసింది.
“ఊరినుంచి ఎప్పుడొచ్చేవు?”
రంగనాయకులు పలకరిస్తూనే కారు దిగివచ్చేడు.
చూపులు, మాటలు నిలిచిపోయిన రెండేళ్ళ అనంతరం మగడు వచ్చి పలకరిస్తూంటే సుశీల నిస్తబ్ధురాలయింది. అటువంటి ఘట్టం తటస్థపడితే అభిమానపడి మాట్లాడక వూరుకోడం సరికాదనీ, ముఖ పరిచయంగల వారితో వ్యవహరించినట్లు మసలుకోడమే సబబు అనీ అదివరకే ఆమె అనేకమార్లు అనుకొంది. అల్లాంటి ఘట్టమే వస్తే తన ముఖ కవళికలను ఏలా అదుపులో పెట్టుకోవాలో కూడా ఒద్దికలు వేసుకొంది. తీరాచేసి అటువంటి ఘట్టం నిజంగా తటస్థపడేసరికి దిగ్భ్రమ కలిగినట్టయింది. వెంటనే మాట్లాడలేకపోయింది. అది సిగ్గు కాదు. అభిమానం కాదు. కోపం కాదు. చిత్రమైన మనస్థితి. గమ్మున మాట రాలేదు. పెద్దమనిషి పలకరిస్తూంటే సమాధానం యివ్వకపోవడం మాత్రం మర్యాదా? సర్దుకొంది.
“రెండురోజులయింది.”
ఒకమాట వచ్చేక మరి కష్టం కనిపించలేదు. మనస్సు నిలదొక్కుకుంది.
“ఎవరూ చెప్పలేదే” అనుకొన్నాడు, రంగనాయకులు గట్టిగానే. ఎవరు చెప్తారని ఆశించేడో?
సుశీల ఏమీ అనలేదు. అతని ముఖంకేసి వోమారు చూసి తల తిప్పుకొంది.
ఆ చూపులో మనిషి నలిగినట్లు కనిపించేడు. ఎందుచేతనో? ఆరోగ్యంగా వున్నావా అని అడగడం ఉచితమా, కాదాయని తటపటాయించింది. కాని అడగలేదు.
అతడే ప్రశ్నించేడు.
“ఎక్కడికన్నా వెడుతున్నావా? ఇంటికేనా?”
“ఇక్కడికే వచ్చాను.”
“పని అయిందా?”
ఆమె ఏమీ చెప్పలేదు. అతడే ఆహ్వానించేడు.
“రా. పోదాం.”
సుశీలకు ఏం చెయ్యాలో తోచలేదు. కదలలేదు. ఏమీ అననూలేదు. రంగనాయకులు కారు తలుపు తీసిపట్టుకొని మరల పిలిచేడు.
“సుశీలా.”
“మీరు వెళ్ళిరండి. నేను యింకా ఏవేవో తీసుకోవాలి.”
“ఇందులో వెడుతూ తీసుకోకూడదా?”
“యాదగిరి రిక్షా తీసుకొచ్చా. వాడు హోమియో స్టోర్సుకెళ్ళేడు. రాంగనే మిగతాపనులు చూసుకొని నెమ్మదిగా వస్తాం.”
“అన్నీ పూర్తిచేసుకొనే వెడదాం. నాకూ ఏం తొందరలేదు.”
చర్చ పొడిగించడం మర్యాదగా తోచలేదు.
సుశీల చటుక్కున వచ్చి కారులో కూర్చుంది.
కారు హోమియో స్టోర్సు ముందు ఆగింది. షాపు యజమాని రంగనాయకులును చూడగానే మెట్లు దిగి వచ్చి స్వాగతం యిచ్చేడు.
“పెట్టెలలో సర్దుతున్నారు. ఒక్క పదినిముషాలు” అన్నాడు, క్షమార్పణ చెప్పుకొంటున్నట్లు, సుశీలతో.
ఆమె రంగనాయకులు మొగం వేపు చూసింది.
“మీరు వెళ్ళండి. నేను అవి తెచ్చుకొని వస్తాను. మీరు అనవసరంగా పని పాడు చేసుకోడం ఎందుకు?”
“ఫర్వాలేదు. తీసుకొనే వెడదాం.”
షాపువాడు లోపలికి ఆహ్వానించేడు.
“లోపలికి దయచేయండి.”
ఇద్దరినీ కూర్చోబెట్టి కాఫీలు తెప్పించేడు. కెల్లీలు తెప్పించేడు.
“డాక్టర్ సుశీల మా వైద్య పద్ధతికి ‘కన్వర్టు అయ్యారు....” అన్నాడు అతడు ఆనందంతో. ఆతడు రంగనాయకుల వైద్యపద్ధతి నెరుగును. అల్లోపతి వైద్యం ఒక్కటే శాస్త్రీయం అని అతని భావం. అందులోనూ చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే అభిప్రాయం. అందుచేత అయన పెద్దమోతాదులతో, మంచి బలమైన మందులే వాడతారు.
హోమియో స్టోర్సు యజమాని భావం గ్రహించి రంగనాయకులు చిరునవ్వు నవ్వేడు. ఏమీ అనలేదు.
అతడు వాదన వేసుకోకుండా వూరుకోడం సుశీలకు ఆశ్చర్యం వేసింది.
“మమ్మల్ని కొంచెం త్వరగా పంపేస్తారా?” అంది.
షాపు యజమాని ‘ఇదిగో’ అంటూ పనివాళ్ళని తొందరపెట్టడానికి లోనికి వెళ్ళేడు.
ఇంతకాలం తర్వాత సంభాషణ ఎల్లా ప్రారంభించాలో యిద్దరికీ అర్థం కావడం లేదు. ఇంతలో పనివాని చేత రెండు మూడు మందుల పెట్టెలూ, ఒక పుస్తకాల కట్టా పట్టించుకు వెళ్ళి షాపు యజమాని కారులో పెట్టించేడు.
సుశీల లేచింది.
“మరి సెలవా?”
వెడదామని తనతో అనలేదని రంగనాయకులు గమనించేడు. అతడు ఆరేడేళ్ళనాటి తమ కొత్త కాపురపు రోజులతో ఆమె ప్రస్తుత పద్ధతులను అడుగడుగునా పోల్చుకొంటున్నాడు. తమ మధ్య ఎంత దూరం వుందో కొలుచుకొంటున్నాడు.
“నా మూలంగా మీకు ఆలస్యం అయిపోతూంది.”
మర్యాదలు, క్షమార్పణలే గాని, ఆ మాటల్లో సాన్నిహిత్యం కనబడలేదు.
రంగనాయకులు లేచేడు.
కారులో కూర్చున్నాక రంగనాయకులు మాట కలపడానికి ప్రయత్నించేడు. ఆమె చాలవానికి ఏకాక్షర సమాధానాలనిస్తూంటే, అతడు ఆ సంభాషణ ఎంతోసేపు సాగించలేకపోయాడు. వూరుకొన్నాడు.
కారు పేట ఊరు దాటి అగ్రహారం రోడ్డుకి తిరిగింది. ఆమె ఏ దుకాణం వద్దా కారు ఆపమనలేదు.
“ఏవో కొనాలనుకొన్నావనుకొంటాను.”
“తరవాత చూసుకొంటాలెండి.”
“అదేం.”
“అదంత ముఖ్యమూ కాదు. దానికంత తొందరా లేదు.”
ఆమె సందేహం అతనికి అర్థం అయిందనిపించింది. హోమియో షాపులో ఆమె పర్సు తీస్తూంటే తాను యిచ్చేసేడు మూడువందల వరకూ.
“ఆ డబ్బు కూడా నేనే యిస్తానంటానేమోననా? ఇంక నా దగ్గర లేదు కూడాలే.”
సుశీల చిరునవ్వు నవ్వింది. ఆమె కొనుక్కోదలచింది యీ వూళ్ళో కాదు. బండార్లంకలో. అది తమరు వెడుతున్న దారిలో లేదు. వెనక్కి వెళ్లాలి. అదే చెప్పింది.
“నాలుగు నేత చీరలు తీసుకొందామని బండార్లంక బయలుదేరేను.”
“చెప్పేవు కాదేం?”
ఆతడు కారు తిప్పుతూంటే ఆమె వారించింది.
“మీకెందుకీ అనవసర శ్రమ. తరవాత చూసుకొంటాలెండి.”
ఆమె సాధ్యమైనంత దూరంగా వుండాలని చూస్తున్నట్లనిపించి కష్టం తోచింది.
“నీతో రావడం అనవసరం అంటావు.”
“అవసరం అనవసరం అనేవి మన పనుల ప్రాముఖ్యాన్ని పట్టే గాని ఎదటి మనిషిని పట్టీ, వాళ్లతో వుండే బాంధవ్యం పట్టీ కాదు గదా.”
రంగనాయకులు తెల్లబోయేడు. తాను రాజకీయాల విషయంతో చెప్పిన మాటల్నే ఆమె యిప్పుడు నిత్య జీవితంలో పెట్టింది. అంతే తప్ప అవే మాటలు. తన మాటను తనకే వప్పచెప్పినట్లనిపించింది.
ముప్ఫయినాలుగో ప్రకరణం
బట్టలు కొనడానికి తమలాగే వచ్చిన జనాన్ని చూశాకగాని, రంగనాయకులుకు దీపావళి దగ్గిరలో వుందన్న మాట గుర్తు రాలేదు.
“రెండు చీరలు నా కోసం కూడా ఎంపిక చేసిపెట్టు.”
“చీరల ఎన్నిక వ్యక్తి అభిరుచి పట్టి వుంటుంది. ఒకరికి బాగున్నది మరొకరికి నచ్చకపోవచ్చు. కారుంది కదా. ఓ పదినిముషాల పని. ఎవరికో వారినే తీసుకొచ్చి చూపించండి.”
అక్కడికక్కడే నిరాకరణకు సిద్ధపడలేక రంగనాయకులు అవి ఎవరికో చెప్పలేకపోయేడు.
ఆమె ప్రక్కనే నిలబడి ఆమె ఎంపిక, తన పూర్వానుభవం జతపరచి తనకు కావలసినవి వర్తకుడితోనే చెప్పి పేకెట్ చేయించాడు.
అవి ఎవరికనన్నా తెలుసుకోగోరుతుందేమోనని ఎదురు చూసేడు. వెనకటి మాదిరిగా బట్టల యెన్నికలో తన సలహా కోరుతుందేమోనని చూసేడు. అలా అడిగితే ఆమె తన పనులయందూ, అభిరుచులయందూ ఆసక్తి చూపుతున్నదనుకోవచ్చు.
వివాహం అయిన కొత్తలో ఆమె తాను కట్టే చీరలు, తొడిగే జాకెట్లు, చేసుకొనే అలంకారాలు అతని అభిరుచికి సరిపడేలా వుండేటందుకు యెంతో శ్రద్ధ చూపేది. తన బట్టల ఎంపికను మీద పడేస్తుంటే ఒక విధమయిన తృప్తీ, ఆనందమూ కలిగేవి. ఆ ఎంపిక బాగుంది అంటే కొండెక్కినట్లుండేది. అవన్నీ జ్ఞాపకం వచ్చాయి.
సుశీల ఏమీ అడగలేదు.
రంగనాయకులు ఒక్క నిట్టూర్పు విడిచేడు. షాపువాడు అందించిన పేకెట్టు కారులో పడేసుకొన్నాడు.
ఇంటివద్ద కారు ఆగడం, అందులోంచి రంగనాయకులు ముందు దగి వచ్చి తలుపు తీస్తూంటే కూతురు దిగడం చూసి, సత్యవతమ్మ మహదానందపడిపోయింది. గబగబ లోపలినుంచే పలకరించింది.
“రా, నాయనా రా. లోపలికి రా. ఇదెక్కడ కనిపించింది?....” అని అడుగుతూనే అతనిని లోనికి తీసుకురావలసిన పనిని కూతురుకు పురమాయించింది. తాను వారికి ఆతిధ్యం సమకూర్చే హడావిడిలో లోనికి వెళ్ళిపోయింది.
“రాండి, లోపలికి” అని సుశీల తల్లి ఆదేశాన్ని అమలు జరిపింది.
ఇద్దరూ సావట్లోకి నడిచారు.
“కూర్చోండి” అని సోఫా చూపింది.
“నారాయణతో చెప్పి పెట్టెలు లోపల పెట్టించేస్తా. నా మూలంగా మీకు చాలా ఆలస్యం అయిపోయి వుంటుంది.”
ఈలోపున సత్యవతమ్మ కాఫీలు తయారుచేసి కూతురుని పిలిచింది. అతనిని సావట్లోనే కూర్చోబెట్టినందుకు కోప్పడింది.
“నీకింకెప్పుడు బుద్ధి వస్తుందే?” అని విచారపడింది.
“నాకు వచ్చిందమ్మా బుద్ధి, ఇదివరకే” అంది సుశీల నిర్లక్ష్యంగా.
ఆమె కాఫీ తీసుకెళ్ళి యిచ్చింది. నారాయణ చేతికిచ్చి కారులో సామాన్లు పైకి పంపేసి, రంగనాయకులు అప్పుడే లోనికి వస్తున్నాడు.
కాఫీ త్రాగుతూ అతడు ప్రశ్నించేడు.
“సెలవు ఎన్నాళ్ళు పెట్టేవు?”
“పదో తేదీన వెళ్ళిపోతా.”