“నమస్కారం. నా పేరు జానకి....తమరిని....”
బొంబాయిలో స్కూలు, కాలేజి, మహిళా సంఘాల పనులమీద కొత్తముఖాలు వస్తూ౦టారు. ఉభయుల్నీ ఎరిగి పరిచయాలు చేసే వాళ్ళుండరు. మామూలుగా తానే పరిచయం చెప్పుకోవాలి, చేసుకోవాలి. ఆ అలవాటులో జానకి మాట్లాడేసింది.
కనకరత్నమ్మ ప్రతినమస్కారం చేసింది. కాని, ఆ పరిచయ పద్ధతికి కంగారు పడింది. అపద్బా౦ధవిలాగ భద్ర అడ్డుపడింది.
“మీ వదినగారు. పద్మనాభం భార్య, కనకరత్నమ్మ. ఇది అన్నపూర్ణ. వాళ్ళ పెద్దమ్మాయి. సాయంకాలం వచ్చిందిగాని నువ్వు చూడలేదు.”
జానకి ఒక్కక్షణంలో ఆశ్చర్యంనుంచి తేరుకొని, అన్నపూర్ణ భుజం మీద చెయ్యేసింది.
“వెంటనే వెళ్ళిపోయేవేం? నేను ఎరక్కపోతే మాత్రం నువ్వేనా చెప్పొద్దూ!”
“దానికి చెడ్డ సిగ్గు” అని కనకరత్నం సాయం వచ్చింది.
“మంచిదానివే” అంటూ ఆమెను చెయ్యిపట్టుకు తీసుకెళ్ళి సోఫాలో పక్కన కూర్చోబెట్టుకొని కూర్చుంది.
“మీరు మా ఆడపడచు అవుతారు. కాని, ఒకర్ని ఒకరం ఎరగం. ఇది మా పిల్లలలో పెద్దది. నాయనమ్మగారి పేరు పెట్టారు. స్కూల్ ఫైనల్ ప్యాసయింది.”
“ఇందాకా భద్రక్క చెప్పింది. బాగా మార్కులు వచ్చేయట కదా పబ్లిక్‌లో....”
“మేనత్త పోలిక, చదువు బాగా వస్తుంది.”
అదంతా తనను పొంగేయడానికి ప్రయత్నంగా భావించి, జానకి చురుక్కుమనేలాగా చూసింది.
“నా పోలిక లెవరికీ వద్దు. ఆ పేరు పెట్టకండి.”
కనకరత్నమ్మ నాలుక కరుచుకొంది. జానకిని దువ్వడానికి ఉపయోగించిన మాట విపరీతార్ధం ఇచ్చిందని గ్రహించి నొచ్చుకొంది. ప్రసంగాన్ని మార్చింది.
“మీ స్వంత ఇల్లుండగా మరోచోట దిగేరు. వారు ఎంత కావలసిన వారైనా అది అన్యాయంకాదా? ఈ ఊళ్ళో వున్నన్నాళ్ళూ మీరుండవలసింది అక్కడే. మాతోపాటు కలో గంజో తాగాలిసిందే. మేనత్తగారనడంగాని, మిమ్మల్ని పిల్లలే ఏమిటి….”
“పిల్లల తల్లే ఎరగదు”-అంది, భద్ర.
జానకి అసలు విషయం వదలి సమాధానం ఇచ్చింది.
“అదింకా నా ఇల్లంటారేమిటి? మా అన్నయ్యకి ఎప్పుడో రాసి ఇచ్చేసేను. అది అతనిదే. మళ్ళీ మొదటికి తీసుకురాకండి.”
కనకరత్నమ్మ తృప్తి పడలేదు.
“బాగుందండీ. అన్నయిల్లేమిటి? చెల్లెలి ఇల్లేమిటి? ఒకరిదైతే రెండో వారిదైనట్లు కాదా....”
జానకి నవ్వింది.
“ఇప్పుడు సివిల్‌లా గురించి చర్చలా ఏమిటి గాని, కూర్చుని చెప్పండి.”
కనకరత్నమ్మను గురించి తెలుసుకోవడంలో సంభాషణ మార్గం మళ్ళించింది. ఆమె పుట్టిల్లు ఏ వూరు? ఇంటి పేరేమిటి? పెద్దవాళ్ళు బాగున్నారా? తోబుట్టువులు యెందరు? ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్లు? పిల్లలు? ఎవరెవరు యెక్కడెక్కడున్నారు?
జానకి ప్రశ్నలనంతం. వారిద్దరినీ మాటలకు వదలి భద్ర ఇంట్లో పని చూసుకు వస్తానని వెళ్ళింది. కనకరత్నమ్మ తన వాళ్ళందర్ని గురించీ మహోత్సాహంతో చెప్తూ అంది:
“మీరు యెరగకపోయినా మా అక్కయ్య ద్వారా అప్పుడప్పుడు మీ యోగక్షేమాలు తెలుస్తుంటాయి.”
అల్లా తెలిసింది ఒక్కమారే. అయినా, తామంతా ఆమె విషయంలో పరోక్షంగా శ్రద్ధ తీసుకొంటూనే వున్నట్లు సూచనగా ఆమె ఆమాట అంది.
తాను యెరగకపోయినా, తన్ను యెరిగినవారు ఎవరో తనను కనిపెట్టే వుంటున్నారనిపించి జానకి కంగారు పడింది.
“వారి పేరేమిటి?”
“మీరెరగరు. ఒకమారు మా అమ్మా, అక్కా కలిసి, మా అక్కకూతుర్ని స్కూలులో చేర్పించే విషయం మాట్లాడడానికి మీ వద్దకు వచ్చేరట....”
“ఎవరెవరో వస్తూనే వుంటారు. కాని, చాలమందికి నేను తెలుగుదాన్నని తెలిసివుండదు.”
“మా వాళ్ళకు మొదట అంతవరకే తెలుసు. మాటలో మీ పేరూ, ఇంటిపేరూ తెలిసింది. మా అమ్మ గ్రహించింది. ఆమెకు మీరు ఆ వూళ్లో వున్నట్లే అంతక్రితం తెలుసు. అవన్నీ నలుగురికీ తెలుస్తే మీ వుద్యోగానికి భంగం కలుగుతుందని మరి రాలేదట.”
తాను రహస్య జీవితం గడుపుతూ కాలేజీలో వుద్యోగం చేసిందన్నట్లు సూచన వినిపించి జానకి నవ్వింది.
“నేనెప్పుడూ రహస్యంగా వుండలేదు. ఉండాలనుకోనూ లేదు. నా పేరుతోనే చదివా. ఆ పేరుతోనే వుద్యోగమూ చేస్తున్నా.”
“అలాగా”-అంది కనకరత్నమ్మ.
తన మగని క్షేమం కోసం కొంతకాలం ఆమె తన జాడ తెలియనివ్వలేదు. ఆయన మరణానంతరం ఆ జాగ్రత్త అనవసరం అయింది. కాని, ఎవ్వరికీ వ్రాయకపోవడం అలవాటయిపోయింది.- ఆ సంగతులూ, సంజాయిషీలూ అనవసరం. కనక వూరుకుంది.
“మీరు యెక్కడున్నదీ తెలియదు అన్నారు మీ అన్నగారు, వోమారు....”
“నా యెడ్రసు కావాలంటే దొరక్కపోయిందా?”
“మీరెప్పుడూ వ్రాయలేదు.”
“నిజమే. వీళ్ళిద్దరూ తప్ప నన్ను గురించి యెవ్వళ్లూ పట్టించుకోలేదు. తప్పెవరిదని కాదు. నేను పెళ్ళి చేసుకోడం తలవంపులనుకొన్న వాళ్ళకి వుత్తరాలు రాసి బాధించనా?”
ఆ విషయం నిజమని తెలిసినా కనకరత్నమ్మ ఒప్పుకోలేదు.
“అది కేవలం మీ భ్రమ.”
జానకి మర్యాద కోసం ఆ మాటను ప్రత్యాఖ్యానం చెయ్యలేదు.
“కావచ్చు. అంతే అయితే మంచిదే. ఆ భ్రమలోనే నేనెవరికీ వ్రాయలేదు. అదో అలవాటయిపోయింది. చివరికి వచ్చేటప్పుడు వీళ్ళకీ వ్రాయలేదు. వ్రాయనందుకు నాకెల్లాంటి అభ్యుత్థానం జరిగిందో అడగండి చెప్తుంది.”
అంటూ ఇంట్లోంచి వస్తున్న భద్రను చూపింది.
కొద్దిసేపు కబుర్లు చెప్పాక కనకరత్నం లేచింది.
“ఏం గొడవ చేస్తున్నారో పిల్లలు! చాలా సేపైంది వచ్చి. లేవండి. వెడదాం.”
“ఇప్పుడెక్కడికి?” అంది జానకి ఆశ్చర్యంగా.
“నిన్ను వాళ్ళింటికి పిల్చుకుపోడానికే వచ్చింది ఆవిడ. నువ్వు వచ్చేసరికి ఆ మాటే మాట్లాడుతున్నాం” అని భద్ర అందించింది.
“థేంక్స్” అన్న మాట జానకి నోట అప్రయత్నంగా వచ్చేసింది.
“అదేమిటి? మీ యింటికి మీరు రావడానికి నాకు థేంక్సా?”
“ఎంతో ఆప్యాయతతో పిలిచేరు. అదెంత మాట?”
కనకరత్నం అంగీకరించింది.
“పోనీండి. అల్లాగే. మరి లేవండి.”
“ఇప్పుడు కాదు. నేనింకా వుంటాగా. వెళ్ళేలోపున తప్పకుండా....”
“మంచివారే. ఇంకెప్పుడోనా? ఏం కుదరదు. మీరు రానిదే నేనిక్కడినుంచి వెళ్ళను.”
“హడావిడి ఏముంది? కూర్చోండి. దూరమా యేమన్నానా? అంత రాలేని వయసు పిల్లలున్నారా ఇంటి దగ్గర? వాళ్ళని కూడా చూసినట్లేనా అవుతుంది” అంది జానకి మొండిగా.
ఆ స్వరంలో తీవ్రతను హాస్యంలోకి మళ్ళిస్తూ భద్ర అంది.
“ఏం ఘొరావో సరదాగా వుందా?”
వెంటనే జానకి సర్దుకుంది.
“ఇంకా నెల రోజులుంటాను. వెళ్ళేలోపున తప్పకుండా....”
“….ఓ మారు మొహం చూపిస్తామంటారు. అంతేనా?”
జానకి నవ్వింది.
“మీ యింట భోజనం చెయ్యమంటారు. అంతేనా? నాకేమాత్రం అభ్యంతరం లేదు. కాని....”
“ఇప్పుడు కుదరకపోతే ఎప్పుడు వస్తారు చెప్పండి.”
దాని అంతేదో తేల్చుకుంటేగాని కదలనన్నట్లు కనకరత్నమ్మ అంటూంటే భద్ర అనునయంగా సర్దడానికి ప్రయత్నించింది.
“ఉంటుంది కద, తర్వాత మాట్లాడుకోకూడదా?”
“పీట మీద నుంచి లేవలేకుండేంత ఏర్పాట్లు చేద్దామనేనా? వద్దు. భరించలేను” అని జానకి హాస్యమాడింది. అంతలో ఖండితం చేస్తున్నట్లు “వదినా! భోజనాలూ అవీ అంటూ లేనిపోని బెడద తీసుకురాకండి....” అంది. మాట మధ్యలోనే కనకరత్నం అందుకుంది.
“బెడదా? వచ్చే పండుగేమిటో తెసుసా?”
పండుగ దృష్టిలో లేని జానకి భద్ర ముఖం వేపు చూసింది.
“ఇప్పుడు పండుగేముంది?”
భద్ర నవ్వింది.
“వారం రోజుల్లో దీపావళి వస్తూంటే ఆ ప్రశ్నేమిటి?”
“ఔను సుమీ. మరిచేపోయా.”
“దీపావళికి ఎక్కడెక్కడున్న ఆడపడుచుల్నీ తీసుకొస్తారు. మీరు వూళ్ళోకి వచ్చి....” అంటూ కనకరత్నం విషయం గాడి తప్పకుండా జాగ్రత్త పడింది.
“నేను రాలేదనే మాటెందుగ్గాని, ఈ పూటకి వదిలెయ్యండి. మీ ఆలుమగలు తేల్చుకొని పిలవండి.”
“అదేమిటల్లా అంటారు? దీనికి ఆయనతో మాట్లాడడం ఏమిటి? ఆయనే చెప్పేరు పిలుచుకురమ్మని.”
“పొద్దుట నాతోనూ చెప్పేడు. నేను రావడం వలన మీకు ఏదో తరిగిపోతుందనేం కాదు. కాని, ఇతరవిధాలయిన కష్టాలుంటాయి. వాడితో ఆ మాటా చెప్పేను.”
కనకరత్నం చాలాసేపు నిర్వాక్కురాలుగా కూర్చుండిపోయింది. ఆడపడుచు మాటల నుంచి ఆ అన్నా చెల్లెళ్ళ మధ్య నడిచిన సంభాషణను వూహించడానికి ప్రయత్నించింది. చివరకు నీరసంగా లేచింది.
“క్షమించండి.”
జానకి ఆమె చేయి తన చేతిలోకి తీసుకొంది.
“కష్టపెట్టుకోవద్దు. కోపమూ వద్దు. బొంబాయిలో బయలుదేరేటప్పుడే ఇక్కడ రాగల సమస్యలు మనసులో మెదిలేయి. ఇదివరకల్లా అనేకమార్లు ఏ సెలవులకో రావాలనుకోడం, మానుకోడం జరిగింది. చివరికి మోగమాటాలూ వద్దు. పేచీలూ వద్దు. తిన్నగా వెళ్ళి ఓమారు నలుగుర్నీ చూసేద్దామని వచ్చా. చూస్తా. వెళ్ళిపోతాను. లేనిపోని సమస్యలు నాకు తేవద్దు. మీరు కల్పించుకోవద్దు.”
కనకరత్నమ్మ బయలుదేరబోయింది.
“ఉండు. బొట్టు పెట్టుకు వెడుదువుగాని.”
బొట్టు పెట్టించుకొని వెడుతూ, వెడుతూ నిలబడింది.
“చూసేరా, నా తెలివి, మీ అబ్బాయిని చూడనేలేదు.”
అల్లుడనే బంధుత్వపు పిలుపు నుపయోగించలేదని భద్ర గమనించింది.
“మేడ మీద వున్నారు అంతా. పైకి వెడదాం రాండి.”
-అంటూ జానకి ముందుకు అడుగువేసింది. కనకరత్నమ్మ కూతురుతో-“నువ్వెళ్ళి చెల్లాయిలు ఏం చేస్తున్నారో చూస్తావా? నేను ఇప్పుడే వస్తా” అంది.
“ఇద్దరం కలిసే వెడదాం” అంటూ అన్నపూర్ణ వారితోపాటే తానూ బయలుదేరింది.
ఇరవయ్యయిదో ప్రకరణం
కనకరత్నమ్మని గుమ్మం వరకూ సాగనంపి వెనుతిరుగుతూంటే బయట మాట వినిపించింది.
“వియ్యపురాలిని చూడడానికి వచ్చేవులా వుంది. వుందా? ఏం చేస్తూంది?”
“ఉన్నారు.”
మొదటి గొంతు వినగానే భద్ర సన్నగా విసుక్కుంది.
“ఈ పూటకింక అన్నప్రాశన యోగం లేదు” అంది. అంటూనే పైకిమాత్రం ముఖాన చిరునవ్వు చూపుతూ ఆహ్వానించింది.
“రాండి, సత్యవతమ్మగారూ! చీకట్లో బయలుదేరేరు!....విశ్వనాధంగారి భార్య సత్యవతమ్మగారే. గుర్తుపట్టేవా?” అంటూ జానకికి గుర్తు చేసింది.
బాగా మారిపోయేరు. గుర్తుపట్టలేను, చెప్పకపోతే....అనుకొంది, జానకి.
“దయచెయ్యండి.”
జానకి వచ్చినట్లు తనకు ఎవరు చెప్పారో, ఆ మాట వినగానే తనకెంత ఆనందం కలిగిందో, ఏమనుకొందో, ఇంట్లో పని ఎల్లా వదిలేసి వచ్చిందో గుక్క తిప్పుకోకుండా సత్యవతమ్మ చెప్పుకుపోతూంది.
రెండు మూడుసార్లు తన మాట చొప్పించి ఆమె వాక్ప్రవాహానికి అడ్డు వేయడానికి భద్ర ప్రయత్నించి కొంతసేపటికి సాధించింది.
“ఈవేళే అనుకున్నాం. పిల్లలంతా పెద్దవాళ్ళయి ప్రయోజకులయ్యారు. ఆవిడే పట్టుపట్టి సుశీలను డాక్టరు చదివించేరు అనుకొన్నాం.”
“నేనీ వూరి నుంచి వెళ్ళేనాటికి సుశీల మూడు నాలుగేళ్ళ పిల్ల అనుకుంటాను. పెద్దదై, మెడిసిన్ చదివింది అన్నమాట. బాగుంది. ఇప్పుడేం చేస్తూంది? పెళ్ళయిందా? పిల్లలా?” అని జానకి మాట కలిపింది.
“అయ్యో పెళ్ళీ, పిల్లలూ....” అని సత్యవతమ్మ నాటకీయంగా చేతులు వెతకలేసి నిస్పృహ కనబరచింది.
కూతురు పెళ్ళి మాట వచ్చేసరికి దేశ రాజకీయ పార్టీలను తిట్టి, ఛషట్కారాలు కురిపిస్తుందని ఎరిగిన భద్ర ఆమె ఆ నిస్పృహ నుంచి బయటపడక పూర్వమే మాట అడ్డం వేసింది.
“ఊళ్ళో వుందిట కాదా. వుద్యోగం మానేసిందనీ, ఇక్కడే ప్రాక్టీసు పెడుతుందనీ ఎవరో అన్నారు.”
“ఇంకా రాజీనామా ఇవ్వలేదట. దిక్కూ, దివాణం లేని ఎక్కడో మారుమూల వూళ్ళో, జనం మీరు మాకు వద్దో అంటూంటే, అక్కడెందుకే అంటే నీకు తెలియదమ్మా అంటుంది. అసలు గొడవ దానికి ఇక్కడ బోర్డు కట్టడం ఇష్టం లేదు. అడవిలోనన్నా మేలే అంటుంది. అతడికి పోటీ వచ్చినట్లు అవుతుందనో యేమో-ఏమీ చెప్పదు.”
“పోటీ మాట ఏలా వున్నా ఈ చిన్నవూళ్ళో ఇబ్బందిగానే వుంటుంది. దానికి తోడు ఒకే వీధిలో అంత ఎడంలో ఎదురు బొదురు యిళ్లు కూడాను.”
వాళ్ళ మాటలేమిటో, దేనిని గురించో అర్థంగాకపోయినా భద్ర సంజ్ఞ గమనించి జానకి వూరుకుంది. సత్యవతమ్మే ప్రారంభించింది.
“జానకీ, భద్రా మీరిద్దరూ చెప్పి దానిని వొప్పించాలి. వెధవ చచ్చినాడు, ఆ ముసలి వియ్యంకుడు పీనుగ లేకపోతే కుర్రాడు మంచివాడు. ఇంకా మన వస్తువే కాస్త పెంకి ఘటం. చెప్పొద్దూ. ఎదుట వుండి కనిపిస్తూంటే కాపురం కుదుటపడుతుందని నా ఆశ.”
“అన్నీ సర్దుకొంటాయి....” అని భద్ర ఆశ్వసనం ఇవ్వబోయింది.
“సర్దుకోక ఏం చేస్తాయి? అయితే మన ప్రయత్నం వుండొద్దూ? ఏమీలేదు. రైళ్ళూ, బస్సులూ మారి రెండు రోజులు ప్రయాణం చేస్తేగాని చేరలేని వుళ్ళో....”
“ఎక్కడది?” అంది జానకి వూరుకోలేక.
“ఆదిలాబాదు జిల్లాయట. నెలరోజులు ఏమైపోయిందో అని హడలి చచ్చేం. మందులివ్వక జనాన్ని చంపేస్తూందంటూ కరపత్రం వేశారు. కొమరయ్యగారు తెచ్చి యిచ్చేరు.”
తమ వూరి పరిణామాలు ఎరగని జానకికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు.
“కొమరయ్యగారూ?”
“విశ్వనాధంగారూ, ఆయనా జాయంటుగా కంట్రాక్టులూ, ఎరువుల వ్యాపారమూ చేస్తున్నారు. వరంగల్లు వారిది. ఇక్కడే వుంటున్నారు.”
“చాటున చెప్పకోవాలి. ఛస్తే చెప్పుకోవాలంటారు. చాల మంచివారు. రెడ్లు. అసలు పేరు కుమారగిరిరెడ్డిట. ఆయనే ఆ కరపత్రం తెచ్చేరు! అప్పుడు ఆయన్నే తోడు చేసుకొని వాళ్ళ నాన్న ఎల్లాగో వెళ్ళేరు. వచ్చేలోపున ఎన్ని కబుర్లు? ఎన్ని నీలివార్తలు?....”
తెలంగాణా గంద్రగోళం కబుర్లు వినాలని జానకి ఆతురత కనబరిచింది. కాని సత్యవతమ్మ వినిపించుకోలేదు.
“ఆ పాడు వూళ్లు వదిలెయ్యి అని అంతా చెప్పాం. వాళ్ళ నాన్నగారు దానికి పెళ్ళప్పుడు ఓ పాతికవేలు యిచ్చారు. చాలకపోతే నా నగలు ఇచ్చేస్తా. ప్రాక్టీసు పెట్టుకో. ఈ వూళ్ళోకి రా. లేదా అమలాపురం, రాజమండ్రి, కాకినాడ-ఎన్నిచోట్లు లేవు. ఉహు కాదంటుంది. “నీ మొహం నాకు కనిపించకూడదు జాగ్రత్త....” అని సొడ్డేసినట్టు....”
అదేదో అర్థం గాకపోయినా, అది భార్యాభర్తల మధ్య తగవు అయివుంటుందని జానకి భావించింది. ఇటువంటివి ఒకరు సలహా యివ్వగలవీ, యిస్తే ఆచరించగలవీ కాదనిపించింది.
ఏదో ఒకటి అనాలి గనక భద్ర చిన్న సలహా యిచ్చింది.
“సుశీల వూళ్ళో వుంది గనక, అతణ్ణి పండుక్కి పిలవండి. ఎదుటపడితే వాళ్ళే సర్దుకుంటారు.”
“అయ్యో....” అని సత్యవతమ్మ నుదురు కొట్టుకుంది.
నిరాశ వెనుక వెంబడించే తీవ్రపదజాలానికి భయపడి భద్ర వెంటనే ఆమె స్థితికి అంగీకారం తెలిపింది.
“ఔనులేండి. ఆ మాటా నిజమే. తండ్రి మాట ప్రకారం పెళ్లాన్ని పుట్టింటికి పంపేసి, చాటుమాటున తనే వస్తుంటానంటే అభిమానం వున్న ఏ ఆడది ఒప్పుకొంటుంది? గతి లేనిదీ, మతిలేనిదీ అయితే ఏమోగాని....”
తన కూతురు చేసింది సరిగ్గా లేదనిపిస్తున్నా ఆమె అభిమానం న్యాయమే అన్న ప్రశంస సత్యవతమ్మకు చాల తృప్తినిచ్చింది. కాని, అసలు స్థితి మనశ్శాంతి నివ్వలేకపోతోంది.
“అన్నీ వున్నాయి. అంచుకు తొగురు ఒక్కటేలేదు” అని డీలాపడిపోయింది.
“ఆడదానికి అణుకువ వుండాలి. చైనావాడు దేశంలోకి వస్తేనేం? దేశం పదట కలిస్తేనేం! మగాళ్ళేదో ఏడుస్తారు. ఆ గొడవలన్నీ పెట్టుకోకపోతే వాళ్లకి కాలక్షేపం వుండదు. మళ్లీ మన్నే చంపుకు తింటారు. పడి వుండనీ. ఇంత వుడకేసి పడెయ్యడమూ, పిల్లల్ని చూసుకోడమూ గాకపోతే తనకీ రాజకీయాలెందుకు?”
ఆ అభిప్రాయాలు వెంటనే ఖండించతగినవనిపించేయి జానకికి. రాజకీయాలు మగాడి కాలక్షేపానికి? పిల్లల్ని కనడం, పెంచడం ఆడదాని జీవిత లక్ష్యం? మరెందుకు సుశీల చేత మెడిసిన్ చదివించినట్లు? డబ్బుకా? గొప్పకా? నోరు తెరవకుండా భద్ర కాలు తొక్కేస్తూంది. ఏమిటో కధ! జానకికి ఈమారు కొంచెం అర్థం అయినట్లనిపించింది. అర్థమూ కాలేదు.
“దేశం పాడైపోతే మనకి మగాళ్లు దక్కుతారా? పిల్లలు దక్కుతారా? చూడండి, రంగమ్మగారిని....” అంది భద్ర.
ఏదో బాధకొద్దీ అనేసినా దేశం పాడైపోవడం సత్యవతమ్మకీ ఇష్టం కాదు. సిగ్గుపడి వెంటనే సర్దుకుంది....
“ఆ మాట ఆ వియ్యంకుడు పీనుక్కి వుండొద్దూ. కమ్యూనిస్టుననీ, గడ్డలిస్టుననీ తగలడతాడు....”
తాను భయపడ్డట్టే అయింది. సత్యవతమ్మ ఛషట్కారాలకు అందుకొంది. ఇంక వదలదు. వెంటనే మాట మళ్లించడానికి ప్రయత్నించింది.
“సుశీల అప్పుడే నిద్రపోకపోతే వోమారు నేను రమ్మన్నానని చెప్పండి. ఏదీ ఏడున్నరే అయిందా, మళ్లీ....”
“ఔనండీ” అంది జానకి.
భద్ర ఎత్తు పారింది. సత్యవతమ్మ లేచింది.
“మీరూ చుదువుకున్నవాళ్లు. కాస్త చెప్పండి తల్లీ! చెట్టంత కూతురు మోడులా తిరుగుతూంటే చూడలేకున్నాను.”
ఇరవయ్యారో ప్రకరణం
“కాలు తొక్కి చంపేసేవేమిటి? పచ్చిపుండైపోయింది.”-అని జానకి కాలు రాసుకుంది.
భద్ర నవ్వింది.
“గుడ్లెట్టే కోడిలా వున్నావు, నోరు తెరుచుకుని. ఏమన్నా నోరు విప్పేవో యింట్లో ఎవ్వరికీ అన్నయోగం, నిద్రయోగం వుండదు. ఇంకా పిల్లలకి అన్నాలు పెట్టలేదే, ఏమిగతిరాయని నా గుండెలు యింతసేపూ టువ్వుటువ్వుమంటున్నాయి తెలుసా?”
సత్యవతమ్మ పూర్వపు వ్యక్తిని తలుచుకొని జానకి ఆశ్చర్యం కనబరుస్తూ లేచి కుంటింది.
“వెనకటి మనిషి కాదు” అంది.
ఆమె కుంటడం చూసి భద్ర విచారపడింది.
“అంత గట్టిగా తొక్కేనా?”
ఆ మాటకు సమాధానం యివ్వకుండా సత్యవతమ్మలో యింత మార్పు ఎలా వచ్చిందో కారణాలు వూహిస్తూంది జానకి.
“విశ్వనాధంగారు బతికి వున్నారా?”
“నిక్షేపరాయుడులా. పెళ్లికొడుకులా వున్నాడు. మిల్లు మూడో కొడుకు చూసుకొంటున్నాడు. ఆయన ఢిల్లీ, హైద్రాబాదు, ఈ ఊరు మధ్య కదురులా తిరుగుతున్నాడు. కొంతకాలం ఆ గ్రూపు అంటాడు. ఈవేళ ఈ నాయకుడు పిలిచేడంటున్నాడు. ప్రస్తుతం రిక్విజిషన్ నోటీసు మీద సంతకాల హడావుడిలో వున్నాడు. ఒక్కరోజున యింటిపట్టున వుండడు.”
“అందుకే ఆవిడకి కాస్త వూపిరి చేరింది” అనుకొంది. “వెనుక నోరు విప్పేది కాదు. ఇప్పుడా కాలం కూడదీసుకుంటున్నట్లు మాట్లాడేస్తూంది.”
“పదేళ్ల నుంచి యింటి పరిస్థితులు మారేయి. పిల్లలంతా పెద్దవాళ్లు అయ్యారు. పెళ్లిళ్లయాయి. చదువుకొన్న కోడళ్ళూ, అల్లుళ్ళూ వచ్చారు. తనకీ రాజకీయహోదా పెరిగింది. మరి పెళ్లాం మీద చెయ్యిచేసుకోడము మానేడు.”
“అరవయ్యోపడిలో పడ్డాకకూడ కొట్టడమా?” అంది జానకి నొసలు చిట్లించి.
“నిజమే అనుకో. వో మారు లోకువ యిచ్చేక మగవాడే కాదు, ఆ పెద్దరికాన్ని ఎవ్వరూ వదులుకోరు. అదీగాక కొట్టినా కొట్టకపోయినా కొడతాడన్న భయమో? అదిప్పుడు లేదు. కోడళ్ళూ, అల్లుళ్ళ ముందు తాను చిన్నపుచ్చుకోనక్కర్లేకుండేందుకు ఆయనే పెళ్ళాన్ని కాస్త మంచిగా పలకరించడం నేర్చుకున్నాడు....”
“పోనీలే పాపం.”
“అసలు మార్పు సుశీల పెళ్లితో వచ్చింది. ఈ పెళ్లి చేయడం విశ్వనాధంగారికి యిష్టం లేదు. ఈవిడదే పట్టుదల.”
“వాళ్లు బంధువులా? కాదే. ఇద్దరి శాఖ ఒకటి కాదు కూడాను.”
భద్ర నవ్వింది.
“కమ్యూనిస్టులు పెళ్లాల్ని కొట్టరు. ప్రేమగా చూసుకొంటారు. సభలనీ, వూరేగింపులనీ, సంఘాలనీ కాస్త ప్రపంచం చూడనిస్తారు. ఉమ్మడి కుటుంబంలో మగ్గెయ్యరు....అని మీబోటివాళ్ళంతా వూళ్లో వో పెద్దనమ్మకం కలిగించి పోయేరు. ఆవిడ అదే పట్టుక్కూర్చుంది. పైగా పిల్లా, పిల్లాడు యిష్టపడ్డారు. సుందరరావుగారికి యిష్టం లేదట. కానీ కొడుకు యిష్టానికి వదిలేశారు. కట్నం యిస్తాను అన్నా రంగనాయకులు పుచ్చుకోనన్నాడు. కూతురుకు యిచ్చుకోమన్నాడు. ఇన్ని కలిసొచ్చాయి. పెళ్ళయింది. ఓ ఏడాది కాపురం చేశారు. ఇంతలో చైనా దండయాత్ర వచ్చింది. తప్పు చైనాదే అందిట సుశీల. సరిహద్దులో యుద్ధం చల్లారినా యింట్లో చల్లారలేదు. తండ్రి ఆదేశంతో అభివృద్ధి నిరోధక కూటానికి చెందిన పెళ్ళాన్ని రంగనాయకులు పుట్టింటికి పంపేసేడు. ఇందాకా ఆమె గొడవకంతకూ కారణం అది....”
“దారుణం....”
“మరీ అన్యాయంలే, అయినా....”
మాట మధ్యలోనే భద్ర నిగ్రహించుకొని వూరుకొంది.
“ఏదో అనబోయేవు. కానీ....”
“ఒద్దులే. మీరంతా ఏడుస్తారు.”
జానకి ఒక్క క్షణం వూరుకుంది.
“ఊళ్ళో వాళ్ళన్నా సర్దుబాటు చెయ్యలేక పోయారా?”
“లాభం లేదు. సుశీల చాల తెలివిగలది. మీరు చెప్తుంటారే, శాంతియుత సహజీవనం. అది సాధ్యమవుతుందేమోనని ప్రయత్నించింది. నువ్వు సుందరరావుగారిని ఎరుగుదువుగా. కోడలి రాజకీయాభిమానాలు సరియైన దారికి తేవాలని ఆయన నిరంతరోపన్యాసాలు ప్రారంభించేరు. ఉండి వుండి ఒక్కమాటతో సుశీల ఆయనకి విపరీతమైన కోపం తెప్పించేది....చివరకు ఆ పీడ భరించలేకపోయింది.”
“మొగుడేమంటాడు.”
“అతడి రాజకీయ దీక్ష అదివరకే స్థిరపడింది. అతడు పిత్రుభక్తికి కలియుగ రాముడు.”
“తండ్రీ కొడుకూ ఒకటయ్యారన్నమాట”-అంది జానకి.
“అదీ సరికాదు. అతడూ దానిని రాజకీయాల వరకే ఆపాలనుకొన్నాడు.”
“మరి.”
“ఇంట్లో గొడవ ఎక్కువయ్యేసరికి వెళ్ళి చదువు పూర్తిచేసుకోమని అతడే ప్రోత్సహించేడు.”
“ఏం చదివింది?”
“మెడిసిన్ మూడో ఏడాదిలో వుండగా పెళ్ళయింది. అది పూర్తి చేసింది.”
“మంచి పని చేసింది.”
“అంతా అదే అనుకున్నాం. ఏడుస్తూ కూర్చోకుండా పోయి చదివింది.”
“మరి వాళ్ళు కలియలేదు?”
“అంతే అనాలి. కోరి చేసుకొన్న పెళ్ళాం. రంగనాయకులు కొంతకాలం ఎటూ తేల్చుకోలేకపోయాడు. సుశీలే హద్దు గీసిందట.”
“ఏమంటుంది?”
“చదువు పూర్తి అయ్యేవరకూ మామూలుగానే వున్నారు. అంటే ఆవిడ పుట్టింట్లోనే వుందిలే. తరవాత ఒకటి చెప్పింది....మన రాజకీయాల మంచిచెడ్డలు కాలక్రమాన తేలుతాయి. మనం కలిసి కాపురం చెయ్యవచ్చుననుకొంటే ఆ యింట్లోంచి వచ్చెయ్యి. వేరే కాపురం పెట్టుకుందాం. అలా కాదు, నువ్వు పుట్టింట్లోనే వుండు. కడుపు చెయ్యడానికి నే వస్తుంటానంటే కుదరదు. గుమ్మం దిగు....” అని హద్దు గీసింది.
“అబ్బ! ఏం మాటలే! అది. మరీ మోటుగా తయారయేవు?”-అంది జానకి.
పకపక నవ్వే భద్ర యిచ్చిన సమాధానం.
ఇరవయ్యేడో ప్రకరణం
“ఏం జాన్ బాగున్నావా?” అంటూ పలకరిస్తున్న జానకినిగాని, ఆమె వెనకనేయున్న యువకుణ్ణిగాని జాన్ గుర్తుపట్టలేకపోయాడు.
“చిత్తమండి”-అని తెల్లబోయి చూస్తూంటే తానే పరిచయం చేసుకొంది. “నేను జానకమ్మను.”
అతనికి గుర్తు రాలేదు. ఎదుటవున్న నాగరికమూర్తికి ఆ పేరు అతికినట్లులేదు. అతడు ఎరిగిన జానకమ్మ పల్లెటూరి, బ్రాహ్మణ వితంతువు. పెళ్ళి చేసుకొన్నా ఆమెను అతడు ప్రస్తుత రూపంలో వూహించలేకున్నాడు. అతని కళ్ళు చూసి జానకి నవ్వింది.
“ఇంకా గుర్తు రాలేదు. మరిచిపోయేవు.”
ఆ మాటను అతడు ఒప్పుకోలేదు. అంత ఆప్యాయంగా పిలిచిన మనిషి తన్ను బాగా ఎరిగి వుండాలి. ఆమెను తాను మరిచిపోయేడు.
“అబ్బెబ్బే! తమరిని మరిచిపోవడమా? ఎప్పుడొచ్చేరు? ఎక్కడికొచ్చేరు.”
ఎక్కడికొచ్చేరో తెలుస్తే ఆమె ఎవరో వూహించవచ్చునని అతని ఆలోచన.
“మొన్న సాయంకాలం వచ్చేం”-అంది జానకి.
తెలియలేదు. కాని అతడు బయటపడలేదు.
“చాలాకాలానికి వచ్చేరు.”
ఆమెనీమధ్యకాలంలో చూసిన గుర్తులేదు. కనక ధైర్యంగానే అనేశాడు.
“మమ్మల్ని మరిచిపోయింది, నిజానికి మీరే....ఆ అబ్బాయి మీ కొడుకా? పేరేమిటి?”
జాన్ చాలా తెలివిగా తన ప్రశ్నలన్నీ ఏరుకున్నాడు. వీనిలోవేనికీ ఆమెను ఎరిగివుండనక్కర్లేదు. కొద్దిపాటి ఆలోచనవుంటే చాలు....
ఆ ప్రశ్నలతో జానకి అతడు తనను గుర్తించినట్లే అర్థం చేసుకొంది. చిన్న నవ్వు....’ఔను....రవీంద్ర’ అనే సమాధానాలు, జాన్‌కు కావలసిన సమాధానం ఇవ్వలేదు.
“అక్కడే వుంటున్నారా? ఏపేట మరిచిపోయాను?” అన్నాడు.
“బైకుల్లాలో....”
ఆ పేరు అతడు ఎక్కడా చదివిన గుర్తులేదు. చదివినా గుర్తులేదు.
“అబ్బాయి ఎక్కడ చదువుతున్నారు. ఏం చదువుతున్నారు?”
“బొంబాయిలోనే, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో....”
ఒక్క క్షణంలో జాన్ ఆమె ఎవరో గ్రహించేడు. విశ్వం భార్య! జానకమ్మ!
తను అంతవరకూ తెలిసినట్లు నటిస్తున్నాననే మాట మరిచి, సంతోషంతో ఆమెకోసం అక్కడున్న కుర్చీపీట వెయ్యబోయేడు.
“చాల కాలానికి వచ్చేరు. మంచి....”
తన శరీరస్థితిని మరచి హడావిడిగా ఒక కాలు మీద బరువంతా మోపి, తిరిగి వొంగోడంలో తూలి బోర్లా పడిపోయేడు.
“అయ్యో!”
జానకీ, రవీ చటుక్కున వచ్చి, చెరోరెక్కా పట్టుకొని లేవదీసేరు.
“ఎక్కడన్నా దెబ్బతగిలిందా?” అని అతనిస్థితి ఎరిగిన జానకి అడిగింది.
“అల్లా పడిపోయేరేం, కళ్ళుగాని తిరిగేయా?” అన్నాడు రవీంద్ర.
వీరి రాకతో పనులు ఆపి, కొలిమి పాక వద్ద పనిచేస్తున్నవాళ్ళు నిలబడి ఆ సంభాషణ వింటున్నారు. జాన్ పడిపోవడంతో వాళ్ళంతా పరుగెత్తి వచ్చారు. ఒకరు కుర్చీ పీట నాలుగు కాళ్ళూ ఆనేలా చూసి వేశాడు. మరొకరు దానిమీద కూర్చునేటట్లు సాయం చేసేడు.
తన అశక్తత అల్లా ప్రదర్శితం అయినందుకు జాన్ చాల చిన్నపుచ్చుకొన్నాడు. పైగా అంతమంది అక్కడ చేరడం, తన విషయంలో ఆదుర్దా కనపరచడం కష్టం అనిపించింది. కోపం వచ్చింది. అందర్నీ పట్టుకు తిట్టడం లంకించుకున్నాడు.
“....కొడుకుల్లారా! ఏం సందు దొరుకుతుందా, పని ఎగగొట్టుదామా అని చూస్తూంటారు. సందు దొరికితే చాలు! పోండి.”
అతని తిట్లూ, కేకలూ విని జానకి ఆశ్చర్యపడింది. ఇరవయ్యేళ్ళ క్రితం మాలపల్లెలో పడుచుకారు ఈ జాన్ నాయకత్వాన ఎంతో ఆత్మాభిమానం చూపేవారు. వాళ్ళు మాటలో, మన్ననలో చూపుతూ వచ్చిన శ్రద్ధను సత్యానందం యెంతో మెచ్చుకొనేవాడు. ఇప్పుడీ పడుచువాళ్ళెవ్వరూ తిట్లకు మొగం చిట్లించినట్లు కూడా కనబడలేదు. ఆమె మనస్సుకు కష్టమే తోచింది.
“తొందరపడకు జాన్!”
తొందర వద్దన్న మాట అతని మనస్సును రగిలించింది. ఒక్క క్షణం క్రితం ఆమె రాకకు సంతోషం తెలిపేడు. కాని, ఆమె యిప్పుడు తన ఎదుట వుండడం సహించరానిదిగా కనిపిస్తూంది. కాని ఆమెను తిట్టలేడు.
“కడుపు నిండినవాళ్ళు ఎంతలేసి మాటలన్నా తొందరపడ్డట్లనుకోరు. నాబోటి బక్కవాడు ఏం చేసినా, ఏమన్నా తొందరపాటుగానే వుంటుంది.”
అతని మాటలలో కనిపించిన కసికి జానకి నిర్విణ్ణురాలయింది. అది యెందుకో అర్థం కాలేదు. భద్ర మాటలు గురించేమో.
ఇంక అక్కడ వుండడం మంచిదిగా తోచలేదు.
“మళ్ళీ కనిపిస్తా. వుంటాలే. నీ పనిచూసుకో” అని కొడుకుని పిలిచింది.
“వెడదామా?”
తన తొందరపాటుకు జాన్ సిగ్గుపడ్డాడు. సర్దుకొన్నాడు.
“ఈ అవిటివాణ్ణి జ్ఞాపకం వుంచుకొని వచ్చేరు. సంతోషం.”
జాన్ మర్యాదకు లేవబోయేడు. కాని, చేతకాలేదు.
“విప్లవకరపాత్ర ఇంకా ముగియలేదన్నాం కాంగ్రెసుకి. అందుచేతనే, వాళ్ళ పోలీసాళ్లు ఇంతతో వదిలేశారు.”
జాతీయోద్యమ గతిలో వివిధ దశలలో కాంగ్రెసు పాత్ర ఏమిటని యెప్పటికప్పుడు కమ్యూనిస్టు పార్టీ చర్చలు జరుపుతూనే వుంది. దానినిబట్టి పార్టీలో పంధాలో తీసుకొనే యెత్తుగడలు వుంటాయి. ఆ చర్చలతో అనంతంగా ఘర్షణ సాగుతూనే వుంది. అది తేలలేదు. పార్టీ బద్దలయింది. చిద్రువలైంది. కాని ఆ సమస్య అలాగే సెలవేస్తూనే వుంది.
ఇరవైఏళ్ల క్రితం పార్టీలో విశ్వం వాదించిన మాటలతో జాన్ అతని భార్యను యెత్తిపొడుస్తున్నాననుకొన్నాడు. కాని జానకి అది తన అభిప్రాయాలను యెత్తిపొడుస్తున్నట్లుగానే తీసుకొంది.
“మనం కమ్యూనిస్టులం. వ్యక్తిగతంగా మనం నష్టపడ్డాం. కష్టాలూ పడ్డాం. దాని పరిమితిని పట్టి దేశస్థితిని లెక్కపెట్టకూడదు.”
జాన్ భగ్గుమన్నాడు.
“కమ్యూనిస్టుపార్టీ సభ్యుడయ్యేడంటే అతడు వ్యక్తిగతమైన బంధాలనూ, వర్గబంధాలనూ వదుల్చుకోగలిగినట్లే. లేకపోతే ఈ ముళ్ళదారిలో కావాలని అడుగు పెట్టలేడు....”
జానకికి ఆ విశ్వాసం లేనట్లే అలవోకగా చిరునవ్వు నవ్వింది.
“నేనల్లా అనుకోలేను. లెనిన్ అయినా యెంతో మధనం, మనస్తాపం పొందకుండా వ్యక్తిగత ఆలోచనల్నీ, సబ్జక్టివిజాన్నీ వదుల్చుకొంటూ వచ్చేరని నేను అనుకోలేను. ఆ బలహీనత మనుష్యుడిలో సహజంగా వుంటుంది. కమ్యూనిస్టు అయినవాడు బుద్ధిపూర్వకంగా ప్రయత్నించి దానినుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాడు. బ్రాహ్మణత్వం, పంచమత్వంలాగ బూర్జువాతత్వం, కార్మిక వర్గస్వభావం జన్మసంచితాలు కావు. పార్టీ కార్డుతో పట్టుబడేవీ కావు.”
జాన్ తెల్లబోయినట్టు ఆమె వంక చూసేడు.
“1950 లో తెలుగుదేశంలో జరిగిందీ, ఈవేళ జరుగుతున్నదీ జాన్‌కి మాత్రమే దెబ్బలు తగలడం ఒక్కటేనా? దేశంలో బలి అయిపోయినా, పోతున్నా కుర్రవాళ్ళ ప్రాణాలకి విలువలేదూ. ఇరవై ఏళ్ళ స్వాతంత్ర్యం తర్వాత, మనిషి ఇతర గోళాలక్కూడా పోయి వచ్చేటంతగా సైన్సు వృద్ధిపొందిన 1970 నాడు కూడా జాన్‌కు చొక్కాలేకపోవడం ఒక్కటేనా జరుగుతూంట....”
ఇల్లాంటి ప్రశ్నలనామె చాలా వింటూంది. ఇంకా వినవలసి వుంటుందనీ తెలుసు. వాదనబలంలో లేదు వీనికి సమాధానం. ఒకరి అనుభవం నుంచి వ్యక్తి నేర్చుకొనేది చాలా తక్కువ. అతడే చూసుకోవాలి. ఆ అనుభవాన్ని కొందరు ఎన్నటికీ పాటించరు. నేర్చుకోలేరు. కొందరు చేసిన తప్పే చేయరు. కాని, వాళ్ళ జీవితంలో ఎన్నడూ సరిగ్గా సముచితమైన పని చేయరు....ఇప్పుడు తనకీ వాదం ఎందుకు?....అనిపించింది. నాలుగు రోజులుండి, నలుగురినీ చూసిపోదామని వచ్చినదానికి యీ రాజకీయ వాగ్వివాదాలు ఎందుకనిపించింది. జాన్ రాజకీయాలు ఎల్లా వున్నాయో వూళ్లోకి వచ్చిన రోజునే తాను వింది. అవి తనకు నచ్చవు. కానీ వచ్చింది. వాదం కోసమా? ఇష్టంలేక సాచేసింది.
“సరిలే. ఇప్పుడా చర్చలెందుకుగాని....”
జాన్ ఒప్పుకోలేదు. ఒక్క క్షణం క్రితం ఆమె తానూ కమ్యూనిస్టునే అని చెప్పింది. కమ్యూనిస్టు ఎన్నడూ తన వాదాన్ని చెప్పుకోడానికి సందేహించకూడదు. తప్పో వప్పో చర్చలో తేలుతుంది. అంతే కాని, పారిపోవడమా?
“మీరు కమ్యూనిస్టునే అన్నారు కాబోలు....”
“ఏమిటో పోనిద్దూ. కమ్యూనిస్టుననుకుంటే సరిపోతుందా? మన జీవితాన్ని మనం నడుపుకొనే పద్ధతి దానిని నిరూపించాలిగాని....”
ఆ మాట ఒప్పుకోడానికి జాన్‌కి ఏ మాత్రం అభ్యంతరం లేదు. అదే తానూ చెప్తాడు. కాని, ఆ మాటనే జానకీ అంది. ఏ అర్థంలో అందో తట్టలేదు. జానకి ఒక్కక్షణం ఆగి, మళ్ళీ అంది....
“మంచి కమ్యూనిస్టు ఎల్లా వుండాలి? లీ షావ్-చీ వో....”
చెవి మీద తేలు కుట్టినంతగా జాన్ ఉలికి పడ్డాడు.
“చెప్తూ, చెప్తూ లీ షావ్-చీ నే చెప్పేరూ? రివిజనిస్టు కుక్క.”
జానకికి అసహ్యం కలిగినా నవ్వింది.
“మనం చాలా కుక్కలకి పెద్దరికం ఇచ్చాము. వాటి ఏడుపులన్నీ గౌరీకల్యాణం పాడుతున్నట్లే తీసుకొని నోరు తెరుచుకు విన్నాం. గౌరీకల్యాణం కాదు, కుక్కల ఏడుపురా అన్నా అర్థం కాని దశ. ఏం చేస్తాం. దేశ దౌర్భాగ్యం!”
అంటూ గిర్రున తిరిగింది.
“పోయొస్తా. వెళ్ళేలోపున వీలైతే మళ్ళీ కనిపిస్తా.”
ఇరవయ్యెనిమిదో ప్రకరణం