మరియమ్మ కామాట మీద విశ్వాసం లేదని ఆమె ముఖమే చెప్తూంది. జానకి తన అభిప్రాయాన్ని వివరించడానికి పూనుకొంది.
“మార్క్సు చెప్పిన వర్గకలాహం ఇది. మన దేశంలో వున్న కులాలు ఆ వర్గ కలహానికి కొన్ని కొత్త మలుపులూ, మెలికలూ తెచ్చాయి. వర్గ కలహంలో ప్రారంభంలో ఎప్పుడూ చారిత్రకంగా భవిష్యత్తులో ప్రధాన పాత్ర నిర్వహించలవసిన వర్గమే బలహీనం. చారిత్రక గతి ఒక్కటే దానికి గల బలం! మిగిలిన బలాలని అది కాలక్రమంలో కూర్చుకోవాలి. అధికారంలో వున్నవాళ్ళదే అంగబలం, అర్ధబలం. అనుభవ బలం వాళ్ళకే వుంటుంది. వీటన్నింటికన్నా వాళ్ళకి ఎక్కువ బలకరం అధికారహీనులలో కలిగే కోపం. ఆవేశం. తమమీద తమకే కలిగే జాలి. ఇంకా ఎంతకాలం అనే ఆదుర్దా. మేం బ్రతికుండగానే అదేదో చూడాలనే అహంభావం. ఏదో మూలనుంచి ప్రారంభిస్తే అదే తేలుతుందనే దుస్సాహసం. తాము తప్ప మిగతా ప్రపంచం వట్టి వాజలనే ఒంటెత్తుతనం. ఇవి శత్రువులకి గొప్ప ఆసరా” అంది.
స్పష్టంగా పేర్లు పెట్టకపోయినా జానకి ఎవర్ని గురించి మాట్లాడుతూందో గ్రహించడం మరియమ్మకు కష్టం కాదు.
“అందరిలాగే మీరూ కమ్యూనిస్టులదే తప్పంటున్నారు.”
జానకి తన వాదం అసంపూర్ణంగా నడుస్తూందని అర్ధం చేసుకొంది. ఇంకాస్త వివరణ కావాలి.
“ప్రభుత్వంలో వున్నది ప్రజావ్యతిరేకులుగాని ప్రజలు కారు. వాళ్ళ పొట్టలు వాళ్ళకి ముఖ్యం. లోకం ఆకలి వాళ్ళకి పట్టదు. పట్టడంలేదన్న గోల ప్రజలకు చూపి వాళ్ళని తయారు చేయడానికేగాని, అందువలన పెద్దమార్పు వస్తుందని కాదు....”
“నక్సలైట్లు చెప్తున్నదే అది కదా” అంది మరియమ్మ నెమ్మదిగా.
“చెప్పడం నిజమే. కాని, వాళ్ళ పనులు చూస్తే అధికారంలో ఉన్నవాళ్ళ నుంచి పెద్ద ఆశలు పెట్టుకొని, అవి జరగకపోయేసరికి అగ్గి పుంతలైపోయారనిపిస్తుంది. లేకపోతే ఆ ఆవేశాలూ, అక్రోశాలు ఉండవు.”
ఒక్క క్షణం ఊరుకొని మళ్ళీ సాగించింది.
“విప్లవకారులు ఆత్మ మన: ప్రవృత్తి ప్రకారం చేసెయ్యకూడదనే మార్క్సిజం ఎప్పుడూ చెపుతూంది. మన౦ అనుకున్న మాత్రాన, అనుకున్న విధంగా విప్లవాలు రావు. వానికి బాహ్య అభ్యంతర పరిస్థితులు కలిసిరావాలి. కలసి వచ్చేందుకు మనకృషి కావాలి....”
ఎన్ని దృక్కోణాలనుంచి చెప్పినా ఇంకా ఏదో మిగిలిపోతున్నట్లే వుంది.
మరియమ్మ చర్చనింక పొడిగించ తలచలేదు. గడియారం వ౦క చూసింది.
“ఒంటిగంట. మరి పోతా.”
గుమ్మంవరకూ ఇద్దరూ ఆమెను సాగనంపేరు.
“మీ బాబుతో చెప్పు. వీలయితే నేడు, లేకపోతే రేపు వచ్చి చూస్తా” నంది జానకి.
ఇరవయ్యో ప్రకరణం
మరియమ్మ వెళ్ళిపోయాక కూడా వారిద్దరూ చాలాసేపువరకు తమ తమ ఆలోచనల నుంచి తెరుకోలేకపోయారు.
“మనిషి తేడా, మాట తేడా తప్ప వీళ్ళందరిదీ ఒకటే ధోరణి....” అంది భద్ర.
జానకికి అర్ధం కాలేదు. “అంటే?”
“మరియమ్మకి కాస్త నేర్పూ, ఓర్పూ ఉన్నాయి. మనష్యుల్ని శత్రువుల్ని చేసుకోదు. మంచి చేసుకోగల తెలివి వుంది. వాళ్ళ అయ్యకి అవేమీ లేవు. అప్రయోజకపు అహంకారం తప్ప. తనతో పాటు మిగతా వాళ్ళంతా కూడా ‘అశ్శరభ శరభ’ అనాలి. అలా అనడం లేదని ఎక్కడ లేని విషం కక్కుతాడు.”
జానకికి అదంతా పొడుపుకథలా వుంది. ‘అశ్శరభ శరభ’ అన్నమాట వీరశైవాన్ని జ్ఞాపకం చేసింది. ప్రసంగవశ౦లో దాని ప్రసక్తి అర్ధం అయింది. చిన్నగా నవ్వింది.
“ఏమంటాడు?”
“మా చిన్న కులాల మాట వచ్చేసరికి మీ పెద్దకులాల వాళ్ళంతా ఒక్కటేనని మీ బావమీద కారాలు నూరుతాడు. ఈయన నేరమల్లా దేశాన్ని తోడు తెచ్చుకోవాలేగాని శత్రువుల్నీ, తటస్థుల్నీ చేసుకోకూడదంటారు. దేశమంతా ఇంకా మారలేదేమంటాడు అతగాడు....ఒక్కమాటు మారుతుందా? ఓర్పుతో చేతికందిన కొమ్మ పట్టుకులాగి దూరం దానిని దగ్గరకు తెచ్చుకో. అంతేగాని చిటారుకొమ్మ కోసం లొట్టలేస్తే అది చేతికందదయ్యా అంటారీయన..”
భర్తకూ, జాన్కూ మధ్య జరిగిన వాగ్వాదాలసారం భద్ర అంశాల వారీగా చెప్పుకొచ్చింది.... ఆ వాగ్వాదాలు నేటివి కావు. అనాదిగా వస్తున్నవే. అయితే వాని రూపం కొత్తది.
“ఉహూ” అంది జానకి తలపంకిస్తూ.
“ఇద్దరి మాటల్లోనూ కొద్దో గొప్పో నిజం వుంది.”
ఆ మాటకి భద్ర ఆవేశపడింది.
“మరియమ్మ వచ్చింది. కబుర్లు చెప్పింది. మనతోపాటే కూర్చుంది. ఏ పునిస్త్రీ ఆడపడుచు వచ్చినా చేసినట్లే బొట్టు పెట్టి పంపించాం. ఇందులో మనం కులం మాట ఏం తెచ్చాం? ఎందుకది?”
“సమస్య నిన్ను గురించీ, నన్ను గురించీ కాదమ్మా! దరహం మీద దేశంలో జరుగుతున్నది గాని....” అంది జానకి సర్దుబాటుగా.
భద్ర బుస్సుమంది.
“ఇదిగో సర్దిచెప్పకు. వీళ్ళ విప్లవం వంటలు చేసుకు బ్రతికే వెంకట్రాముడుగాణ్ణి చంపడం వరకే. అది వట్టి అర్థం లేని పని అన్నారట మీ బావ. అప్పటికీయన పార్టీ సభ్యుడయి ఎంతో కాలం కాలేదు. నిర్భంధకాండ చూసి అప్పుడే విప్లవ...ఏదో మాట వుందే యిక్కడ... అభినివేశం చెల్లా చెదరయిపోయిందన్నాడట.”
జానకి నవ్వింది. భద్రా కలిసింది.
“ఇప్పుడు నవ్వుతున్నాం. కాని, అవేం రోజులు! పట్టుకొన్నవాళ్ళని పట్టుకొన్నట్లు ఏదో నెపంతో కాల్చేస్తున్న రోజులు. ఈయన్ని పట్టుకుపోయేరు. ఓ వారం రోజులు నిద్రా ఆహారం లేవనుకో. ఏ క్షణంలో ఏ వార్త వింటామోననే. పాపం విశ్వనాధం, మీ అన్నా అడ్డపడ్డారు. ఈయన బ్రతికి వచ్చేరు. అలా బ్రతికి వుండడం వీళ్ళ కంటికి మహానేరం అయిపోయింది. పార్టీ రహస్యాలు చెప్పేసి ప్రాణం దక్కించుకొన్నారని కొన్నాళ్ళు, క్షమార్పణ చెప్పుకొని బయటపడ్డారని కొన్నాళ్ళు...”
ఆనాటి భయాలు, ద్వేషాలు, అనుమానాలు, కక్షలు, అపనిందలతో బాగా పరిచయం వున్న జానకి మాట తప్పించడానికై ‘వెంకట్రాముడు ఎవరు?’ అంది.
“రోడ్డుపక్క రావికింద వెంకమ్మ మనవడు. వంటలుచేసుకు బతికే వాడు. ఙ్ఞాపకం లేదూ? మరచిపోయి వుంటావు. ఆ రోజుల్లో ప్రతిచోటా పోలీసు చౌకీలు పెట్టేరు కాదూ. మనూళ్ళోనూ పెట్టేరు. రోడ్డు పక్కనుంది గనుక వెంకమ్మగారి వీధిగది అద్దెకు తీసుకున్నారు. ఇంక అక్కడ కూర్చుని దారిన వచ్చేపోయే వాళ్ళని బతకనిచ్చేవారు కారు. ఎవరు నువ్వు? ఎక్కడికెళుతున్నావు? ఎందుకు? ఎరిగున్నవాళ్ళని చూపించు-అంటూ నానా హంగామా జేసేవారు. వాళ్ళకి కావలసింది ఓ పావలా డబ్బులు. ఆఫిసరు అయితే ప్రమోషను. వాళ్ళను చూసి ఈ వెంకట్రాముడూ మొదలెట్టేడు. గొప్ప అనుకొన్నాడో, అధికారం వెలిగిస్తున్నాననుకొన్నాడో, వెర్రి వెధవ. వో రోజున పదిమంది ఆ యింటిమీద పడ్డారు. పోలీసాళ్ళు పారిపోయారు. ఈ వెర్రి పీనుగ తలుపు తీసుకొని ఏమిటేమిటని గుమ్మంలోకి వచ్చేడుట. దంజెప్పెట్టుగా నరికి పారేశారు.”
“అభాగ్యుడు” అంది జానకి సానుభూతిగా.
“అలా అన్నందుకే జాన్ మీ బావ మీద పడిపోయేడు. “మీదేం పోయిందండీ! ఆడు కొట్టించింది నన్ను. నీడని కూర్చుని ఎన్నేనా నీతులు చెప్పొచ్చును,” అన్నాడు. నేవిన్నా, మండీపోయింది. చెప్పొద్దూ.”
“ప్రతి చిన్న మాటకీ మండిపోతే ఎలాగ?” అంది జానకి.
కొద్ది గంటలక్రితం అన్నగారిమీద ‘గయ్’ మని పడిపోయిన మనిషి నోట ఆ హితోపదేశం. భద్ర ఆశ్చర్యంతో తేరిపార చూసి, తల పంకించింది.
“ఔనమ్మా! తన కంతి అంత నొప్పి మరొకటి లేదు అన్నాట్ట.”
సందర్భం అర్థం అయి జానకి నవ్వింది.
“అహం అల్లా అనిపిస్తుందిలే ఎవరికైనా….” అని ఆత్మ విమర్శ చేసుకొంది.
“అహం కాదు, నీ మొహం కాదు, పరోపదేశ పాండిత్యం....”
“ఔనమ్మా! బాబూ! ఒప్పుకొన్నా కదా!....నీకంత కష్టం కలిగించేది అందులో ఏముందని గాని….”
“ఆ మాట తలుచుకొంటూంటేనే వొళ్ళు రవిలి పోతుంది. నస్మరంతి గాళ్ళని గురించి చెప్పకు....” అంది వెక్కసంగా భద్ర.
“ఇదివరకు అంటరానివాళ్ళూ, చెప్పరానివాళ్ళూ అన్నారు. ఇప్పుడు తలచరానివాళ్ళు కూడా వచ్చేరన్నమాట. మొత్తంమీద మన నడక అభ్యుదయ పథంలోనే వుంది” అని జానకి యెకసక్కెం చేసింది.
భద్రకు తన పొరపాటు అర్థం అయినా, తన మాటను సమర్థించుకొనే ప్రయత్నం మానలేదు.
“కాకపోతే….?”
“అతడేమన్నాడో, నీకంత కష్టం కలిగించిన మాటేమిటో యింతవరకు చెప్పలేదు తెలుసా?”
తనకు కోపం, ద్వేషం కలిగించినదేమిటో చెప్పకపోతే తనదే తప్పని నిర్ణయం జరిగేలా వుంది. భద్ర ఆ సందర్భం వివరించసాగింది.
“మీ బావలాంటి వాళ్ళు మంచిగా, తియ్యగా మాట్లాడి తమరి….అక్కడో పడికట్టు మాట వుందే….చెప్తా....”
“విప్లవ చైతన్యమా....?” అని జానకి అందించింది.
“ఆ. సరిగ్గా అదే.....నీకీ మాటలన్నీ వచ్చేసేయే....”
“నేనూ ఆ పార్టీ మనిషినే కాదుటమ్మా!” అంది జానకి.
“సడే, సౌరభ్యం, మీరేవిట్లు?”
మీ కులం ఏమిటనడానికి తెలుగు జిల్లాల్ల్లో ‘మీరేవిట్లు’....అనడం వుంది. రోజుకి ఒకటిగా కమ్యూనిస్టులలో గ్రూపులు ఏర్పడుతుండడం గురించిన వెక్కిరింత అది. జానకి విరగబడి నవ్వింది.
భద్ర తన ప్రశ్నను అక్కడితో వదిలేసి తన కథ అందుకుంది.
“మా విప్లవ చైతన్యం మొక్క పోగొడుతున్న నిగూఢ శత్రువులు మీరు....ఇంత పెద్ద మాట నాదిలే….కాని అతనిదోమాట వుండలి....ఆ….ప్రథమ శత్రువులు-అదీ!”
“అన్నాడూ, ఆ మాట?”
“ఆహా! శత్రువుల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు నిర్ణయించే వాగ్వాదం లోనే మీ బతుకులు తెల్లారిపోతున్నాయి. వెలమ వారి పంక్తి చేసుక్కూర్చున్నారు. అయితే ఒక నాడేనా సరిగ్గా తేల్చుకోగలిగేరా యని నా అనుమానం. కాని అతడు తేల్చుకొని తన నిర్ణయం కూడా చెప్పేసేడు.”
“ఏమిటది?....”
ఆ నిర్ణయం ఏమిటో వెంటనే చెప్పకుండా భద్ర దానిమీద తనకు కలిగిన అభిప్రాయాన్ని చెప్పింది.
“అది విన్నక 1955 యెన్నికల్లో తెలుగుదేశాన్ని మీ నాయకుల చేతుల్లో పెట్టకపోవడం తెలుగువాళ్ళు చేసిన ఒకే మంచిపని అనుకున్నాను. ఆ విధంగా మీ పార్టీకి ప్రాణం పోశారు. లేకపోతే యీ వేళ కేరళలో చేసినపనే పదిహేనేళ్ళ క్రితం తెలుగుదేశంలో చేసి వుండేవారు.”
ఆనాటి ఘటనల ఙ్ఞాపకంతో జానకి ప్రశ్నించింది.
“ఏమన్నాడు? నిన్ను కాడికి కట్టిస్తానన్నాడా?”
“అల్లా అన్నా అదో అందం..... ‘మిమ్మల్ని కాల్చిపారెయ్యాలి’ అన్నాడు.”
జానకి వెలపరించుకొంది.
“పోలీసోళ్ళ దెబ్బలు తిన్నకసి....నోటి వట్టం….” అంది.
“తెగులు. ఆ మాట వినేసరికి నాకు కంపరం పుట్టుకొచ్చింది.
బ్రిటిష్ వాళ్ళు చేశారు. హిట్లరు చేశాడు. ఇక వంతు వీడిదన్నమాట.... మళ్ళీ యీ గుమ్మం తొక్కేవంటే గరిట కాల్చి వాత బెట్టేస్తా. అరుగు దిగమన్నా. తెల్లబోయేడు. అతడు చూస్తుండగానే పనిపిల్లచేత అతడు కూర్చున్నచోటు వేణ్ణీళ్ళతో కడిగించా.”
జానకి కళ్ళు చక్రాల్లా అయాయి.
“....మరింకెప్పుడూ యీ గుమ్మం తొక్కలేదు” అని భద్ర తన కథ ముగించింది. జానకి అదివిని ఒక్కక్షణం నిర్వాక్కురాలే అయింది. ఒక్క క్షణం పోయాక అంది.
“ఎంతపని చేశావు. అక్కా!”
“నువ్వూ ఆమాటే అన్నావూ?”
“అబ్బే!....”
“మీ బావ కూడా అదే అన్నారు. ఆయనకి చెప్పిన సమాధానమే నీకూను. మీ రాజకీయాలు పదట కలపండి. మీ లెఫ్ట్ రైట్లతో నాకేం పనిలేదు. మనం మనుషుల్లా బతకాలి. పశువులకి రాజకీయాలెందుకు? వాటికి అవేమీ తెలియవు. వాటి ఆవేశాలూ, అభిమానాలూ అన్నీ యెలిమెంటల్. కాని, ఈ మనుష్య పశువులు....”
ఆవేశంలో భద్ర కంఠం నిండి వచ్చింది. జానకి నచ్చచెప్తున్నట్టు పూనుకొంది.
“ప్రపంచాన్ని అంత తేలిగ్గా నిర్వచించడం సులభం కాదు అక్కా! వందలూ, వేలయేళ్ళు, జనం తమరిని కాలికింద మట్టేసేరన్న తెలివిడి, మనుష్యులుగా బతకలేకపోతున్నామన్న బాధ, త్వరలో నలుగురిలా బ్రతుకుదామన్న కోరిక, ఇంకా యెంతకాలం ఇల్లాగా అన్న నిరుత్సాహం, ఆవేదన కదిలించేస్తూంటే కలిగిన బక్కకోపం అది. ప్రపంచగతిని అర్థం చేసుకోడం లేదని వాళ్ళని అంటున్నాం. మనంమాత్రం వాళ్ళని అర్థం చేసుకొంటున్నామా?”
భద్రకు ఆ మాటలు నచ్చలేదు.
“మీ బావా అల్లాగే అన్నారు.”
“అంటారు!”
“కాని, మీ ఆలోచనలు పెడదారి పట్టేయి. దానికి మొదట బలి అయిపోయేది మీరే. ఆ బక్కకోపం, కసీ మామూలు మనిషిలో అయితే నువ్వు అన్నదే. కాని, మీరంతా రాజకీయవేత్తలు. మీకే అధికారం వస్తే….”
అనేక సందర్భాలలో వ్యక్తిగత ప్రతీకార వాదాన్ని నిరసిస్తూ తానూ ఇల్లాగే వాదించింది. కాని, వేరొకరినోట తమ పార్టీ వానిమీద ఆ విమర్శ ఆ రూపంలో రావడం జానకికి కష్టంగా వుంది.
“మావో నాశనం చేసింది కమ్యూనిస్టుల్నీ, కమ్యూనిస్టు పార్టీనే. నా అనుమానం ప్రజలలో పుట్టిన అపవాదు వుట్టిదై వుండదనే...”
విశ్వం మరణం గురించిన ప్రవాదాన్నే భద్ర ఉటంకిస్తున్నదని జానకి గ్రహించింది.
“అనుమానాలతో, దేశాన్ని నాశం చెయ్యవద్దంటున్నాం. అంటూనే రుజువులేని అనుమానాలతో యెవరిమీదనో నిందవేయడం మంచిది కాదు.”
భద్ర చుర్రుమనేలా చూసింది.
“సడే.”
“కాదక్కా!”
“అక్కా లేదు బొక్కా లేదు. నోరు ముయ్యవే. గాంధీగారి “బుర్ర తిరుగుడు” సిధ్ధాంతం మీకు పట్టుకుంది.”
ఇరవయ్యేళ్ళ క్రితం చూసిన మనిషి కాదని అడుగడుగునా అనిపిస్తున్నా భద్రలో వచ్చిన తేడా ఏమిటో జానకికి అంతవరకు అర్థం కాలేదు. పల్లెటూరి జీవితంలో మాటలు, ఆలోచనలు అన్నీ మోటుదేలిపోయాయి. ఆశ్చర్యమే అనిపించింది.
ఇప్పుడేం చెప్పీ లాభం లేదనిపించింది. “నీదో పిచ్చి”-అని సాచేసింది.
ఇరవయ్యొకటో ప్రకరణం
కాని సత్యానందంతో మాట వచ్చినప్పుడు అంత తేలిగ్గా తోసెయ్యలేక పోయింది.
“ఏమిటిది బావా? మీ అభిప్రాయాలు మంచివో, చెడ్డవో ఇంట్లో ఆడవాళ్ళకి నచ్చచెప్పుకోనక్కర్లేదా?”
సత్యానందం ఉక్రోషం కనబరిచేడు. కాని, నవ్వుతూనే-
“ఏం చెయ్యమంటావు? తన్నేదా?”
ఒకనాడు పెద్దవాళ్ళనీ, ఆచారాల్నీ ధిక్కరించి భార్యల్ని ప్రపంచంలోకి తెచ్చింది వీళ్ళేనా?....అనిపించి జానకి నిర్విణ్ణురాలే అయింది.
“కొడితే తప్ప ఆడదానికి ఏదీ అర్థం కాదనేనా నీ ఆలోచన….”
సత్యానందం తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు.
“ప్రపంచంలో అందరూ ఒకే స్థాయికి పెరుగుతున్నారనుకుంటున్నావేమిటి?” అని ఎకసక్కెం చేసి తప్పించుకో చూసేడు.
“అక్కయ్యని ఇతరుల స్థాయికి దిగతియ్యడానికి నువ్వు ఏ మార్గం అవలంబించేవో గాని….”
సత్యానందానికి ఈమాటు మాట తోచలేదు. ఇంక భార్యను సమర్థించేడు.
“మోటుగా, కోపంగా నోరు చేసుకొందేగాని భద్ర యెదుర్కోలు న్యాయమేనంటాను. నువ్వేమనుకొన్నావో గాని….”
జానకి తెల్లబోయింది.
“సంఘంలో ఇదివరకు జరిగింది న్యాయమా అంటే మనుష్యుల దృష్ట్యా కాదు. సంఘం దృష్ట్యా అవును. కాని, ఆ అన్యాయం నేడూ సాగడం సంఘం దృష్ట్యా కూడా సరికాదు. నిజమే. ఆ అన్యాయం ఒక సాంఘిక న్యాయంగా, ధర్మంగా మన రక్తమాంసాలలో జీర్ణించిపోయింది. దానిని వదల్చుకొనేందుకు ప్రయత్నాలు సాగుతూనే వున్నాయి. దానికోసం తొందరపడ్డం న్యాయమే....” సత్యానందం ఒక్క నిముషం ఆగేడు!
“మరి!” అని జానకి కదిలించింది.
“కాని, దానికి మార్గం నన్నో, మరొకరినో వురి తియ్యడం కాదు. నన్నూ మరికొందరినీ తోడు తెచ్చుకోవాలిగాని. నిజంచేత మేము తమతో కూడా వున్నవాళ్ళమేగాని వ్యతిరేకులం కాదు....”
జానకికి కష్టం అనిపించింది.
“నోటివట్టం మాట పట్టుకొని సాగదియ్యకు బావా! జాన్ నిన్ను వురి తియ్యలేడు. ఖమ్మంలో హరిజనయువకుడి చేతులకి కిరసనాయలు గుడ్డలు చుట్టి వెలిగించేరు.ఒంగోలువద్ద వూళ్ళో చెరువుకి మంచి నీళ్ళకు వస్తే పొడిచి చంపేరు. కంచికిచెర్లలో కిరసనాయిలు మీదపోసి అంటించేరు. ఈ దౌర్జన్యాలని సమర్థించినవాడు మంత్రిగానే వున్నాడు. వాళ్ళు క్రియలు చేస్తున్నారు. వీళ్ళు….”
“నాకు తెలుసు నోటివట్టం మాత్రమేనని. ఒక మహావిప్లవ ప్రవాహంలో ఏవో కొన్ని దుర్ఘటనలు జరిగిపోతాయేమోనని భయపడ్డం కాదిది. ఎందుచేతనంటే విప్లవాలు యెవరిమీదనో కక్షకోసం జరగవు. కాని, ఇక్కడ ఈ మాట వచ్చిందెవరినోట? ఏ రూపంలో వచ్చింది? అతని మనస్సుకది సూచన. నేనైనా భద్రపనిని హర్షించాననుకోకు. కాని, అతని ధోరణివలన ఫలితాలు ఎల్లా వుంటాయో, భద్ర ప్రత్యక్ష నిదర్శనం-” అన్నాడు.
జానకి ఏమీ అనలేకపోయింది. ఈ మాదిరి అసంబధ్ధ ప్రలాపాలూ అప్రయోజక దురహంకారాలూ వెనుకనే ప్రజాహంతకులూ, ప్రజాకంటకులూ చక్కగా దాగుతారు.
“అయ్యయ్యో!” అని జానకి మనస్సులోనే ఆక్రోశించింది.
ఇరవైరెండో ప్రకరణం
“అత్తయ్య ఏరీ?” అంటూ వచ్చిన సాధనను భద్ర దగ్గరకు పిలిచింది.
“ఇల్లా రా. ఏం చేస్తున్నారు మీరంతా? ఒక్కరూ కనబడ్డం లేదు. కూర్చో.”
సాధన కూర్చుంది.
“అత్తయ్య యేరీ?” అని మళ్ళీ అడిగింది.
“అత్తయ్య యెవరే? జానకా? మంచి వరసే కలిపేవు.”-అని తన మనస్సులోని సమస్యను ఎగతాళిలోకి మార్చి భద్ర నవ్వింది.
సాధన తెల్లబోయింది.
“ఏం?”
“ఆవిడ మీ నాన్నని ఏమని పిలుస్తుంది? నన్నే మంటుంది? నువ్వా పిలుపేమిటి?”
“ఓస్. అదా?” అని సాధన తేల్చేసింది.
“నాన్నగారు ఆమెకు ఏమన్నా మేనబావా? నువ్వు అక్కవా? ఆ పిలుపు ఆవిడకి బాగుంది. అల్లా పిలిచింది. నాకు ఇల్లా పిలవడమే బాగుంది సుమా!” అంది.
“ఆమె మగడు నాకేమౌతాడు?”
“ఏమన్నా అవనీ. ఆయన ఇప్పుడు లేరు.”
“బాగుందర్రా మీరూ, మీ వాలకాలూ.” అని భద్ర నవ్వేసిందే గాని, అంతకన్న లోతుకు పోలేకపోయింది.
“అలసటగా వుందని పడుకొంది. ఎందుకు?” అని మాట మార్చేసింది.
“బావ కెమేరాలోకి ఫిలిం అడిగి తెమ్మన్నాడు. పెట్టెలో వుందిట.”
“ఏం?ఎక్కడికేనా వెడతారా?”
“గన్నవరం అక్విడక్టు చూసివద్దామన్నాడు. వెడతాం.”
“దానిని లేపవద్దు. అతడినే వచ్చి తీసుకోమను. పెందరాళే వచ్చెయ్యండి. శీతకాలపు పొద్దు కూడా.”
సాధన వెళ్ళింది.
భద్ర చాలాసేపు అక్కడే కూర్చుని తన మనస్సులో కలిగిన భయం గురించి ఆలోచిస్తూంది.
ఇరవైమూడో ప్రకరణం
జానకి నిద్ర తెలివి వచ్చేసరికి ఇంట్లో యెక్కడా మనుషుల అలికిడే వినిపించలేదు. గది అంతా చీకటిగా వుంది. తలుపుల సందుల్లోంచి వస్తున్న మసకవెలుతురు బట్టి వేళ తెలియడంలేదు. బహుశా తెల్లవారుతున్నదనుకొని చటుక్కున లేచింది.
గది తలుపులు తెరిచేసరికి అర్థం అయింది. సూర్యాస్తమయపు వేళ.
ఎక్కడా మాట వినబడలేదు. “ఏమైనారు వీళ్ళంతా?” అనుకుంది.
స్నానాల గదిలోకి వెళ్ళి ముఖం కడుక్కు వస్తూంటే పనిమనిషి యెదురు అయింది.
“అమ్మగారెక్కడ గౌరీ!”
“మేడమీద వున్నారండి.”
బధ్ధకంగా వుంది. కాఫీ తాగుతే బాగుండుననిపించింది.
పనిమనిషితో ‘పిలుచుకు రమ్మ’ని చెప్తూండగా భద్రే మెట్లపైన కనిపించింది. ‘లేచావా?’ అని పలకరిస్తూ దిగి వచ్చింది.
“ఎంతసేపు పడుకున్నావో తెలుసా? రెండున్నరకి పడుకున్నావు. అయిదు దాటింది. ఈ లోపున రెండు మాట్లు వచ్చి చూసిపోయా.”
“లేపలేకపోయావా?”
“అలసి వున్నావు. ఒళ్లెరక్కుండా నిద్రపోతున్నావు. లేపాలనిపించలేదు. మంచం పక్కనే టేబిల్ మీద ఫ్లాస్కులో కాఫీ పోశాను. చూసుకున్నావా?”
“థాంక్సు” చెప్పి కాఫీ ఇమ్మ౦దామనే అనుకు౦టున్నానంది జానకి.
భద్ర కాఫీ కప్పుల్లో పోసి ఒకటి ఆమెకిచ్చి, వేరొకటి తాను తీసుకొంది.
జానకి మంచం మీద కూర్చుని కాఫీ చప్పరించింది. తాజా పాలతో చేసినదని రుచి చెప్తూంది.
“అప్పుడే పాలు వచ్చేయా?”
“సాయంకాలం పిల్లల కోసం ఆవుని ఇంటిదగ్గరే వు౦చేస్తారు. పనిమనిషో, నేనో పాలు తీస్తాం.”
“నీకు కూడా చేతనయి౦దన్న మాట. మంచిదే. ఇంతకీ పిల్లలేరీ? ఒక్కరి మాటా వినబడదు?”
“ఆక్విడక్టు చూస్తామని అంతా బయలుదేరి వెళ్ళారు. వచ్చే వేళ అయింది.”
జానకి ఆందోళన కనబరచింది.
“పెద్దవాళ్లెవరూ లేకుండానా? అల్లరి చేసి.....”
“ఇరవయ్యేళ్ళ కుర్రాడికి ఇంకా పెద్దవాళ్ళంటూ వో కాపలా ఏమిటే? ఇదేం పట్నమా యేమన్నానా? తప్పిపోతాడనుకోడానికీ,. దారి తెలియదనుకోడానికీ...”
మాట అనేశాక భద్రకే నవ్వు వచ్చింది. జానకికి పల్లెటూళ్ళ భయం వొకందుకు. భద్రకు పట్టణం భయం వేరొకందుకు.
తన అసందర్భ భయాన్ని కమ్ముకొనేందుకు వాళ్ళ ప్రయాణపు హడావిడిని భద్ర వర్ణించింది.
“ఏవేవో స్కెచెస్ వేసేడు. ఫోటోలు తీసేడు. పిల్లలంతా యెక్కడెక్కడి వాళ్ళూ చుట్టూచేరి రొట్టలేస్తున్నారు. అంతా కలిసే బయలుదేరారు.”
“తిన్నగా ఇంటికి వస్తారా?”
“ఇంకా నయం!”
కొడుకు స్వభావాన్ని తలచుకొని జానకి చిరునవ్వు నవ్వింది.
“వాడికి జనం కావాలి. చిన్ననాటినుంచీ అంతే. పదిమందినీ పోగు చేస్తాడు. ఏవేవో ఆటలు కల్పిస్తాడు....”
“గట్టివాడులే. నువ్వు నన్ను అక్కయ్యా అంటావు. అతగాడికి మాత్రం నేను అత్తయ్యని....”
తన మనస్సులో దొలుస్తున్న అనుమానాన్ని ఏదో విధంగా భద్ర బయట పెట్టేసింది. జానకి కనుబొమ్మలెత్తింది.
“నిన్న వచ్చినప్పటి నుంచీ అల్లాగే పిలుస్తున్నాడనుకు౦టానే...”
“నేను గమని౦చలేదు.”
“సాధన, పిల్లలూ కూడ నన్ను అల్లాగే పిలుస్తున్నారు సుమీ.”
“సాధనేమందో తెలుసా? నీకైనా ఆవిడ చెల్లెలు కావడానికి తోడబుట్టిందా ఏమన్నానా? అదో పిలుపు. అదామెకు బాగుంది. మాకు ఈ పిలుపే బాగుందంది.”
“అదెప్పుడు! ఆ మాట యెందుకు వచ్చింది?” అంది జానకి ఆందోళనగా.
“ఇందాకా. నేనే అన్నానులే.”
భద్ర ముఖంలో ఏదో బాధ కనబడుతూంటే జానకి సర్దుబాటుగా మాట్లాడింది.
“దానికి పెద్ద విలువ ఇస్తున్నావేమిటి కొంపదీసి?”
“వాని తండ్రి నాకు మేనత్త కొడుకు? అంటే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలూను. వావి....” అంది భద్ర సంకోచంగా.
జానకి కోప్పడింది.
“నీకు మతిగాని పోయిందా యేం? వావీ, వరసా అంటావు! చిన్న పిల్లల పిలుపులకి అర్ధాలు తీస్తావు!”
“కాదే బాబూ! మనస్సులోని ఆలోచనలకు మాటలు ప్రతిధ్వనులు.”
జానకి నవ్వేసింది. భద్ర బ్రతిమాలుతున్నట్లు అంది.
“జానకీ, మరొకలా అనుకోకు. రవీంద్రకూ, సాధనకూ వావి కుదిరితే నా అంత సంతోషపడేది వుండదు. కాని, చెల్లెలు వావి చెప్పకూడదు....”
జానకి విస్తుపోయింది. ఈ మారు ఆమెకు నవ్వు రాలేదు!
అగ్రహారంలో యెరిగినవాళ్ళు నలుగురినీ చూసి పోదామని ఇరవయ్యేళ్ళ తరువాత ఒక్కమారు వస్తే ఇదేదో కొత్తపేచీ.
“రేపో, యెల్లుండో లేచి పోతున్న వాడిని ఏమని పిలిస్తేనేమిటి, నీ వెర్రిగాని.....”
ఇద్దరూ కొద్దిసేపు వూరుకొన్నారు. జానకి మాట అర్ధం కొద్దిసేపటికిగాని భద్రకు అర్ధం కాలేదు. అర్ధం అయ్యాక చాల నొచ్చుకుంది.
“నువ్వూ, కొడుకూ రావడం నాకెంత సంతోషంగా వుందో తెలుసా? నీకెల్లా చెప్తే అర్ధం అవుతుంది? అతడిని చూస్తే అనుక్షణం మా బావే గుర్తు వస్తున్నాడు. ఆ వయస్సులో అచ్చం అల్లాగే వుండేవాడు. అందుచేతనే ఆ పిలుపు ఏమిటో ఎబ్బెట్టు అనిపిస్తూంది....”
తమ రాక విషయంలో భద్రకు అయిష్టం ఏమాత్రమూ లేదని జానకికి నమ్మకమే. కాని,
ఒక బలహీన దశలో తాను చూపిన అజ్ఞానాన్ని మందలించిన భద్ర నోట ఈ మాట! సంప్రదాయాల బలం యెరిగిన జానకి భద్ర ఆలోచనలకీ, భయాలకీ జాలిపడింది.
“చూడు. లేనిపోని ఆలోచనలు పెట్టుకొని, వాళ్ళ మనస్సులలో గంద్రగోళం సృష్టించకు. అన్నా, చెల్లాయీ అంటే ఆడ, మగ పొడిములు ఉడిగిపోవు. బావా, మరదలూ అంటేనే బయటపడవు.“
భద్ర ఏ సమాధానమూ ఇచ్చేలోపున పది పద్దెనిమిదేళ్ళ పిల్ల ఒకామె సావిట్లోంచి పిలిచింది.
“భద్రత్తయ్యా!”
“ఏమిటే, అన్నపూర్ణా!”
“సాధన ఏదీ?”
“వాళ్ళంతా కలసి ఆక్విడక్టు చూడబోయేరే. ఏం? పనుందా?”
“ఏం లేదు. వూరికెనే.”
అయినా ఆ అమ్మాయి ఒకటి రెండు నిముషాలు అక్కడే వేళ్ళాడి, వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిపోయాక గాని భద్ర తన పొరపాటును తెలుసుకోలేదు.
గబగబా వీధిలోకి వెళ్లి చూసింది. కాని, అన్నపూర్ణ కనబడలేదు. వెళ్ళిపోయింది. తిరిగి వచ్చింది.
“ఆ అమ్మాయి యెవరు అనేనా అడిగేవు కాదేమే?”....అంది.
“ఏం? ఏమయింది?”-అంది, జానకి తాపీగా.
“ఆ పిల్ల ఎవరో ఎరుగుదువా? అన్నపూర్ణ.”
ఆ పేరు చెప్తే చాలునన్నట్లు జానకి ముఖం చూసింది. కాని ఆమె గుర్తి౦చినట్లు లేదు. భద్రే చెప్పింది.
“నీ మేనకోడలు.”
“ఇంత పెద్ద పిల్ల వు౦దన్నమాట! అయితే వెళ్లిపోయిందా?”
“నిన్ను చూడాలనే వచ్చిందో ఏమో? నాకా ఆలోచనే తట్టలేదు. ఏదో ధ్యాసలో వున్నా...”
జానకి నొచ్చుకొంది.
“ఎరిగీ పలకరించలేదనుకుంటారో ఏమో ఖర్మ. బంధువులతో ఏదొచ్చినా తగాదాయే. ‘ఆ’ అంటే అపరాధం. ‘ఊ’ అంటే బూతుగా వుంటుంది.”
ఒక్కక్షణం క్రితమే బంధుత్వపు పిలుపులు గురించి జరిగిన సంభాషణ గుర్తువచ్చి భద్ర తెల్లబోయింది. అంతలో సర్దుకొని ఫక్కున నవ్వింది.
ఈమారు తెల్లబోవడం వంతు జానకిది.
“ఏం, నవ్వుతావు?”
భద్ర ఏమీ చెప్పకుండా ‘దెబ్బ కొట్టేవు’-అంది.
జానకికి అప్పుడు తన మాటకు అర్ధం జ్ఞాపకం వచ్చింది. తానూ నవ్వింది.
“ఛా. ఆ ఉద్దేశంతో అనలేదు.”
“అంటే అన్నావులే”- అంది భద్ర నవ్వుతూ.
ఇరవైనాలుగో ప్రకరణం
చీకటిపడ్డాక కనకరత్నమ్మ పెద్దకూతురు అన్నపూర్ణను వెంటబెట్టుకు వచ్చింది.
“పాపం, చిన్నవాళ్ళ౦దరినీ ఒంటిగా ఇంట్లో వదిలి వచ్చేవా? తీసుకు రావలసింది,” అంటూ భద్ర ఆమెకు గుమ్మంలో స్వాగతం ఇచ్చింది.
“తీసుకు రావలసిందే” అందామె విసుగుదలతో. “వచ్చింది మొదలు ఒకటే అల్లరి! ప్రాణాలు తోడేస్తున్నారు. కూర్చోనివ్వరు. మాట తొణకనివ్వరు.”
“పిల్లలయ్యేక అల్లరి చెయ్యరా? అల్లరిచెయ్యని పిల్లలంటే వాళ్ళలో ఏదో లోపం ఉందనే అనుకోవాలి.” అంటూ భద్ర పిల్లలకూ, అల్లరికీ ఉండవలసిన అవినాభావ సంబంధం వర్ణించింది.
“రాండి. ఇల్లా కూర్చుందాం” అంటూ సావిట్లో కుర్చీలవేపు దారి తీసింది.
“అన్నయ్యగారు వస్తారేమో. లోపలికే వెడదాం” అని కనకరత్నమ్మ సందేహించింది.
“రారు. ఇసకపూడిలో సభ వుందని వెళ్ళేరు. వచ్చేవేళకి రాత్రి బాగా పొద్దు పోతుంది.”
సభ ప్రసక్తి రాగానే గతరాత్రి సుందరరావుగారి ఊరేగింపు మీద రంగమ్మ చేసిన అల్లరీ, ఆమె పుత్రశోకం, రాజకీయాలు కబుర్లలో నలిగేయి.
“అదే ఈ చంపడాలూ, పోలీసు దౌర్జన్యాలూ గురించే ఈ వేళ సభ”-అంది భద్ర.
“ఔనమ్మా, మరీ ఘోరకలిగా వుంది. కాలేజీలో చదువుకొంటున్న కుర్రాడిని తీసుకెళ్ళి చంపెయ్యడం....ఈ దిక్కుమాలిన గవర్నమెంటు పోవాలన్నారంటే అనరూ. వాళ్ళు చంపాలనుకుంటే ఆశ్చర్యమా? పాపం రంగమ్మగారి శోకం తీరేది కాదు.” అంటూ కనకరత్నమ్మ విచారం కనబరిచింది.
“కూర్చోవే, అన్నపూర్ణా! లేకపోతే సాధనావాళ్ళూ వున్నారు మేడమీదికెళ్ళు. ఇందాకా నువ్వూ వెళ్ళేవు! మరో పది నిముషాల్లో వాళ్ళూ వచ్చేరు.”
అన్నపూర్ణ కదలలేదు. కూర్చోలేదు. తల వొంచుకుని, గోడనానుకొని తల్లి కుర్చీపక్క అలాగే నిలబడింది.
“వదినెగారు వచ్చేరన్నారు. ఇంట్లో వుంటారు. చూసిరమ్మని నేనే తరిమితే బయలుదేరింది. కనిపించలేదని తిరిగి వచ్చింది.”
“సాధన ఉందా అని అడిగింది. లేదన్నాను. నేనూ ఏదో ధ్యాసలో వుండిపోయా. జానకికి పరిచయం చేయాలని తోచనేలేదు. అది తోచి, తీరా చూస్తే ఇది వెళ్ళేపోయింది.” అని భద్ర సాయంకాలం ఘటన వివరించింది. మాట మారుస్తూ-
“వంటపని పూర్తిచేసుకొనే బయలుదేరినట్లున్నావు” అంది.
“ఆ. అన్నీ అక్కడ పెట్టేసి, ఆకలివేస్తే చిన్నవాళ్ళకి పెట్టమని సరోజకి వప్పచెప్పి వచ్చా. మధ్యాహ్నం నుంచి రావాలని ప్రయత్నం. అమలాపురం వెడుతున్నానన్నారు. వచ్చేసరికి పొద్దు పోతు౦దన్నారు. అందుకే ఇప్పటికేనా తెమిలి బయట పడగలిగేను. ఇంతకీ ఏరీ వదినగారు! ఇంట్లో వున్నారా?”
“స్నానం చేస్తూంది. వస్తుంది.”
“జగడం వేసుకోడానికి వచ్చా. ఊళ్ళో తమ స్వంత ఇల్లు, స్వంత అన్నగారూ వుండగా ఇక్కడ దిగటం యేమిటో. మీతో ఎంత స్నేహం, ఎంత చనువూ వుంటే మాత్రం?”....అంది. కనకరత్నమ్మ కృత్రిమ గాంభీర్యం చూపుతూ.
“ఓస్, దానికి మాది మాత్రం పరాయి ఇల్లేమిటి? అప్పుడు నాకు మాత్రం కోపం రాదా? నేనూరుకొంటానా?” అని భద్ర ఆమె కోపాభినయాన్ని తేలగొట్టేసింది.
కనకరత్నమ్మ రాజీభావాన్ని కనబరచింది.
“పోనీ ఎక్కడోచోట దిగేరు. దిగేకైనా రాకూడదూ?”
“ఎందుకు రాదూ? అదీ సన్నాహంలోనే వుంది. పొద్దునంతా బడలికగా వుంది. మధ్యాహ్నం భోజనం చేసేసరికి పేట లోంచి.....”
ఎవరో రాజకీయ బంధువులు వచ్చివుంటారు. వీళ్ళ నాన్నగారు చెప్తుంటారు.”
అతి సామాన్యంగానే వున్నా ఆ మాట వెనక కొంచెం కష్టపెట్టుకోవడం వినిపించింది. తమ ఇంటికి రాలేదనేనా? కాక, స్వజాతి వాళ్ళూ, ఆత్మబందువులూ కన్న ఎవరో ఏ కాపుల ఆవిడో, సెట్టిబలిజ అమ్మో, మాల మాదిగలో ఎక్కువయ్యారని ఎగతాళా?-అర్ధం కాలేదు.
“అసలు బంధువులే లేకుండా పోయినప్పుడు మనిషి ఎవరినో ఒకర్ని బంధువుల్ని చూసుకొంటాడు. ఊరికే గాలిలో బ్రతకలేం కద!” అంది భద్ర.
“హస్యానికన్నాను” అని కనకరత్నం సర్దుకొంది.
పది నిముషాలు ఆమాటా ఈమాటా ఆడుతూ, చటుక్కున ప్రశ్నించింది.
“మా అల్లుడన్నా కనబడ్డే౦, చూద్దామంటే.”
“పిల్లలంతా పైన వున్నారు. లే, వెడదాం”-అని భద్ర లేచింది.
కనకరత్నం ఆమె చెయ్యి పట్టుకుకూర్చోబెట్టింది.
“వదినగారిని రానీ, వెళ్ళొచ్చు.”
“పోనీ నువ్వెళ్ళి మీ బావని పిలుచుకురావే” అంది అన్నపూర్ణతో భద్ర.
“నే నెరగను కదా!”
“పోనీ సాధనతో చెప్పు” అంది మధ్యేమార్గంగా.
“నాకు సిగ్గు బాబూ!” అని అన్నపూర్ణ మెలికలు తిరిగింది.
“ఎంత చెప్పినా అది అంతే”....అని కంకరత్నమ్మ అసహాయత తెలిపింది. అంతలో మళ్ళీ అంది.
“అత్తయ్యగారితో బొంబాయి వెళ్ళాలి. వాళ్ళింట్లో సోఫాలు, ఫాన్లు మంచి లైట్లు వున్నాయి. మనింట్లో చదువుకొనేందుకు మంచి లైటన్నా లేదని గునుస్తావు. మరి ఇప్పటినుండీ అత్తగారినీ, బావగారినీ మచ్చిక చేసుకోవాలి.”
ఆ కూతురు అతిసిగ్గూ, తల్లి హాస్యం భద్రకు వెలపరం అనిపించింది.
“నీ వెర్రిగాని వాళ్ళ నాన్నకి సరిపడొద్దా? లేనిపోని ఆశలు చూపించకు.”
తనను సమర్థిస్తున్నట్టే వున్నా ఆ మాటలోని ఎకసెక్కేన్ని కనకరత్నం అర్ధం చేసుకొంది. కాని వెనక తగ్గలేదు.
“మేనరికం ఆశ ఆడపడుచులకి ఉండడంలో ఆశ్చర్యంలేదు. కాదంటే పోయే బంధాలా ఇవి?”
కనకరత్నమ్మ గడుస్తనాన్ని భద్ర అర్ధం చేసుకొంది.
“ఒక పిల్లకైనా అవడమేనని పద్మనాభం సంప్రదాయాల గురించి రాజీ పడదామనుకొన్నా మీవాళ్ళు అందర్నీ కాదనగలవా? సోమయాజులుగారి దౌహిత్రివి కూడానూ.”
ఈ మారు కనకరత్నమ్మ మరో అడుగు ముందుకు వేసింది.
“అందరూ తింటున్నది కంబళ్ళలోనే.”
“బాగుంది. అల్లా అనుకోగలమా?”
“ఆయనగారు ఇవ్వగల కట్నాలకి అంతకన్నా మంచి సంబంధం తీసుకురాగలరా? అలాగని మేమూ లోటు చెయ్యం అనుకో.”
భద్రకు ఇదంతా పెద్ద వల పరుచుకుపోతున్నట్లు అనిపించింది.
“కట్నం పెద్దది ఇవ్వలేకపోతే మాత్రం కులం చెడగొట్టుకోవాలా?” అంది భద్ర.
“ఎవరికమ్మా కులాలూ, కట్నాలూ బేరీజు వేస్తున్నావు?” అంటూ జానకి సావిట్లో అడుగు పెట్టింది.