“మీ చెల్లెలా? ఏరీ?”
“సత్యానందంగారింటికి వచ్చిందట, కొడుకూ, అదీ....”
“కొడుకున్నాడా?”
అతడు తలతిప్పేడు.
“ఓ ఇరవయ్యేళ్ళుంటాయి. బాగానే వున్నాడు. తండ్రి పోలికే.”
కనకరత్నమ్మ ఆ కుర్రవాని తల్లినీ, తండ్రినీ కూడా ఎరగదు. పెళ్ళి అయి తాను ఈ ఇంట అడుగుబెట్టడానికి రెండు మూడేళ్ళ క్రితమే ఆడపడుచు పెళ్ళి చేసుకు వెళ్ళిపోయింది. కనక వాళ్ళ పోలికలు చెప్పినా అర్థం కావు. వూరుకొంది.
“అన్నపూర్ణ అంది. ఇందాక వీధిన వస్తూంటే వాళ్ళ గుమ్మంలో కొత్త ఆమె ఎవరో కనిపించిందంది. బహూశా సాధన వాళ్ళ కాలేజీలో లెక్చరరో ఏమో అంది.”
“అయితే జానకే అయివుంటుంది. బొంబాయిలో ఏదో లెక్చరరుగానే వుందనుకొంటారు”-అన్నాడు పద్మనాభం.
“పలకరించిందా?” అన్నాడు.
“ఆమెకేం తెలుసు?”
“ఔను లే.”
ఒక్క నిముషం ఇద్దరూ వూరుకున్నారు. కనకరత్నమ్మే తెముల్చుకుంది.
“ఆ కుర్రాడేం చదువుకున్నాడు?”
“అడగలేదు. వేషం చూస్తే ఆర్టిస్టులా వున్నాడు.”
“చూసేనన్నారు మరి. పలకరించలేదా?”
తాను చేసినది పలకరించడం క్రిందకు వస్తుందో, రాదో అతనికే అర్థం కాలేదు. ఊరుకున్నాడు.
“ఓమారు వెళ్లి పలకరించి రండి. మనింటిక్కూడ రమ్మనండి.”-అని సలహా యిచ్చింది.
తన మనస్సులోని ద్వైవిధ్యాన్ని కమ్ముకుంటూ పద్మనాభం తనకు చెల్లెల్ని ఇంటికి పిలవడం యిష్టం లేనట్లు మాట్లాడేడు.
"ఎందుకొచ్చిన తద్దినం? వీధినపోయే పెద్దమ్మా! మా యింటిదాకా వచ్చి వెళ్ళమన్నట్లు! ఆడపిల్లల వాళ్ళం."
వితంతు వివాహం చేసుకొన్న చెల్లెలు ఇంటికి వస్తూ పోతూ వుంటే తన కూతుళ్ళకి పెళ్ళిళ్ళు కావేమోనని భయపడుతున్నట్లు..
పద్మనాభం అభ్యంతరాన్ని కనకరత్నమ్మ ఖాతరు చేయలేదు.
"సత్యానందంగారి వాళ్ళకు లేని భయం మనకొచ్చిందేమిటి?"
"వాడో కమ్యూనిస్టు. వాళ్ళందరిదీ వొకటే కూటం. అన్నింటికీ తెగించారు. తెగించిన వాడికి తెడ్డే లింగం."
కనకరత్నం చిరునవ్వు నవ్వింది.
"సత్యానందంగారూ మీరూ అంతా లొల్లాపత్తుగానే వుంటారుగదా!"
పద్మనాభం ఆ స్నేహాన్ని తేలికగా తోసేశాడు.
"చిన్నప్పటినుంచీ యెరుగుదుం. స్కూల్ ఫైనల్ దాకా వొకే స్కూలులో చదువుకున్నాం. అదీ మా స్నేహం. కాని, మా ఇద్దరి అభిప్రాయాలూ యెప్పుడూ ఉత్తర దక్షిణాలే."
మరల ఇద్దరూ వొక్క క్షణం నిశ్శబ్దం. తన భార్య ప్రశ్నకి తన సమాధానం పూర్తి అయినట్లు తోచక పద్మనాభం యీ మారు వివరణ అందుకున్నాడు.
"జానకి అన్నా, దాని మగడన్నా ఆ మగడు పెళ్ళాలిద్దరికీ వల్లమాలిన అభిమానం. అతడంటే ఆమెకు మేనత్త కొడుకు. కాని సత్యానందానికి? పెళ్ళాం తరఫు బంధుత్వమనా? ఉహు. బయటపడడానికి వీలులేకపోయిందిగాని మనస్సులో యెప్పుడూ వాడు కమ్యూనిస్టే. 1950లో అతగాడిని చంపేసేరన్నారు. కాంగ్రెసు మొహాన మసిపులమడానికి మంచి వీలు దొరికిందనుకొన్నాడు. అది అన్యాయం అన్నాడు. నేను కమ్యూనిస్టు పార్టీలో చేరుతున్నాను. ఏం చేస్తారో చెయ్యండి-అన్నాడు. వాడి వొంటిమీద దెబ్బ పడితే, ఊళ్ళో మాకు మంచినీళ్ళు పుట్టవని నేనూ, విశ్వనాధమూ కాళ్ళు విరగ్గొట్టుకొని బయటపడేశాము….అదో సాకు తప్ప వాడెప్పుడూ కమ్యూనిస్టే-”
మగని ధోరణి కనకరత్నమ్మకు సరిపడలేదు.
“సరే బాబూ! మీ రాజకీయాలు ఎలాగన్నా పోనియ్యండి. మనిషి మర్యాదలూ, బంధుత్వాలూ రాజకీయాలకోసం వదులుకోవాలా? చెల్లెలి మగడు కమ్యూనిస్టైతే మీకు పాపం చుట్టుకుంటుందా?”
తన అభ్యంతరం రాజకీయం కాదని వొప్పుకోలేడు, అతడు. ఊరుకొన్నాడు. కాని, కనకరత్నమ్మ వదలలేదు.
“మధ్యాహ్నం అందరి భోజనాలూ అయ్యాక నేను అల్లా వెళ్ళి వస్తా. ఈ లోపున మీరు వెళ్ళండి. పలకరించండి. చాలాకాలానికి వూళ్ళోకి వచ్చి మన యింటికి రాకపోవడం బాగులేదు. రమ్మని పిలవండి….”
పద్మనాభం విసువు కనబరిచేడు.
“ఈ ఇరవయ్యేళ్ళూ వున్నట్లు ఇప్పుడూ అక్కడే వుండకపోయిందా? వీళ్ళంతా సుఖంగా బ్రతికిపోతున్నారని బాధ పెట్టడానికి కాకపోతే యెందుకు వచ్చినట్లు?....”
తన భర్త చిరాకు పడవలసిన అవసరం ఏమీ లేదనిపించినా కనకరత్నమ్మ ఏమీ అనలేకపోయింది.
“బాగుందండీ మీ వరస! ”
“బాగుండకేం. వున్నది కాస్తా వూడ్చి పట్టుకుపోయినా రాజకీయ బాధితుడినిగా వో అయిదెకరాలు భూమివచ్చింది. ఇంత తిండి తింటున్నాం. దేహీ అనక్కర్లేకుండా నలుగురిలో తలలెత్తుకు తిరగగలుగుతున్నాం. ఇప్పుడీ రాకతో మళ్ళీ వెనకటి కథలన్నీ….”
కనకరత్నమ్మ యీమారు ఖచ్చితంగా అడ్డు తగిలింది!
“కథలూ లేదు కాకరకాయలూ లేదు. లక్షణంగా పెళ్ళి చేసుకు వెళ్ళారు. ఎప్పటివో మా ముత్తవ్వ రోజులనాటి మాట చెప్తారేం? పూర్వంలా పది పన్నెండేళ్ళ వయస్సులోనే ముండమోసి, చెవుల వెనక్కి ముసుగు తోసుకుంటూ...”
“అట్టే పింజారి కబుర్లు చెప్పకు. పడుపడనే సైతేగాని పడే నా సైతి లేదందిట, వెనకటికి. కబుర్లు చెప్తారు. చెయ్యగానే కాకుల్లా పట్టుకొంటారు. ఇంత ఊళ్ళో నేనమ్మా వున్నానని అది తెగించింది....కాని....”
“తెగించలేని కామయ్యగారి రాముడు స్థితి చూస్తున్నాంగా. ఏడాదికో భ్రూణహత్య చేస్తూ, నెత్తిన ముసుగు వేసుకోగానే సరిపోయిందా?....”
కామయ్యగారి రాముడు జీవితాన్ని వుదాహరించి ప్రత్యాఖ్యానం చేశాక పద్మనాభం మరి మాట్లాడలేదు. కనకరత్నమ్మ గుర్తుచేసిన ఆ హత్యాకాండకు బలి అయిన అజ్ఞాత శిశువుల్లో ఒకరిద్దరి పిత్రుత్వబాధ్యత పద్మనాభానిక్కూడా వుందని గ్రామంలో చెప్పుకొంటారు. దానిని కనకరత్నం ఎరుగునో, ఎరగదో. కాని, ఆ మాట వచ్చాక పద్మనాభం ఇంక వాదం అనవసరం అనుకొన్నాడు.
“అంతే నంటావా?” అన్నాడు. సన్నగా.
“ఓమారు ముందు మీరు వెళ్ళిరండి. తరువాత నేవెడతా.”
“ఏమో. ఇదంతా ఏం గొడవలు వస్తాయో చివరికి! నాకిష్టంలేదు సుమా.” అంటూనే లేచాడు. తుండు దులిపి భుజాన వేసుకొన్నాడు.
పదహారో ప్రకరణం
“ఒరేయ్! సత్యానందం!” అంటూ పద్మనాభం వీధి గుమ్మంలోంచే తన రాకను తెలియబరచేడు.
వంటింట్లో వున్న భద్ర ఆ కేక వినబడగానే కత్తిపీట ముందునుంచి లేచింది.
“మీ అన్నయ్య వచ్చేడు. సావిట్లోకి నడు. పలకరిద్దువు గాని....”
బియ్యంలో బెడ్డలు ఏరుతున్న జానకి ఆ మాటను పట్టించుకోలేదు.
“నా కెవ్వర్నీ పలకరించాలని లేదు. పలకరించాలనుకున్న వాళ్ళ ఇంటికి రానే వచ్చాను.” అంది తాపీగా.
“తెలియక అడుగుతా. నువ్వు మార్క్సిస్టువు కాదు గదా? -” అంది భద్ర.
ఆ మాట వెనుకవున్న ఆలోచనను జానకి గ్రహించింది. కసికి, తిట్టుబోతు తనానికి, భిన్నాభిప్రాయాన్ని చెవిని పెట్టలేకపోవడానికి, వ్యతిరేకులతో సామాన్య మర్యాదలు కూడా పాటించలేక పోవడానికీ దేశంలో ‘మార్క్సిస్టు’ పర్యాయపదం అయింది. ఆమెకు తెలుసు. భద్ర వెడుతూ అనేసిన మాట కొరడాతో ఛెళ్ళు మనిపించినట్లయింది.
ఒక్క నిముషం అలోచించి లేచింది....భద్ర వంటింటి గుమ్మంలోకి వచ్చేసరికే పద్మనాభం లోపలి హాలులోకి వస్తున్నాడు. ఆమెను చూసి ఆగేడు.
“వున్నావా?” అన్నాడు.
“ఎక్కడా మాట అలికిడి కూడా లేదు. పిల్లలంతా ఏరీ? వీధి తలుపులు బార్లా తెరిచి వున్నాయి. ఎవడో మాట అల్లా వుంచి, కుక్క వొచ్చి ఇల్లంతా చక్కబెట్టినా అంతేకద.”
“ఇప్పుడే పిల్లలు అల్లా తోటలోకి వెడతామని బయలుదేరి వెళ్ళేరు. నేను వంటింట్లోకి వెళ్ళా. ఆయన వీధి గదిలో ఉండాలే, లేరా?” అంటూ భద్ర నిజం, అబద్దాలూ కలబోసి సర్దుకొంది.
“కూర్చో. వో మాటు వదిన్ని ఆనక రమ్మన్నానని చెప్పు. ఎక్కడా కనబడ్డమే లేదు” అంది.
పద్మనాభం కబుర్లు చెప్తూనే హాలులోకి వెనుతిరిగేడు.
“దానికి పిల్లలతోనే సరిపోతూంది. చెప్తా. వస్తుందిలే, ఏడీ వీడేడి? కుర్రవాడి దగ్గరనుంచి ఉత్తరాలు వస్తున్నాయా?”
పద్మనాభం కుశల ప్రశ్నలు వేస్తూ హాలులోని కుర్చీలో కూర్చున్నాడు. అతనికి జానకి కనిపించలేదు. ఆమెను గురించి ప్రసంగం ఎల్లా తీసుకురావాలో అర్ధం కావడంలేదు. ఇదివరకు ఆ పేరు తనముందు తీసుకురావద్దని శాసించిన వారిలో భద్రా ఉంది. ఆమెవద్ద ఇప్పుడు తానే సరాసరి జానకి ప్రసంగం తేవడం చేతకాలేదు.
ఎల్లాగా అనుకుంటూండగా టేబిలు క్రింద ఆడవాళ్ళ కాలిజోడు కొత్తది కనిపించింది.
“ఇందాకా అన్నపూర్ణ మీ ఇంటికి సాధన కాలేజీ లెక్చరరు ఎవరో వచ్చేరు కాబోలు అంది. అదిగో కాలిజోడు కనిపిస్తూంది. ఆవిడ ఏరీ....?”
భద్ర నవ్వింది.
“సాధనా లేదు. లెక్చరరూ లేదు. ఎవరిని చూసి ఏమనుకుందో. అది ఎప్పుడొచ్చింది ఇల్లాగ?...నిన్నరాత్రి....”
వెనకనే వస్తున్న జానకి భద్ర పడుతున్న ఇబ్బందిని గ్రహించింది. తానే బయటపడింది.
“అంతా బాగున్నారా?” అంది.
“ఎవరు? జానకి!”-నిజానికి పద్మనాభం స్వరంలో ఆశ్చర్యమూ, గుర్తింపు కష్టమూనే తోచేయి. చెల్లెలు మారి ఉంటుందనుకొన్నాడు. కాని, ఈ రూపంలో అతడు ఊహించనేలేదు.
పరోక్షంలో ఇద్దరి మనస్సులలో కనిపించిన వైమనస్యం కొద్దిగా కూడా పలకరింపులలో వినబడకపోయేసరికి భద్ర ‘అమ్మయ్య’ అనుకొంది. వాళ్ళు మనోద్వేగాలు కూడగట్టుకునేందుకు వ్యవధి ఇస్తూ తానే సంభాషణ నడిపింది.
“నిన్నరాత్రి వచ్చింది. వొంట్లో బాగులేదు. ఎక్కడికీ కదలలేదు. బహుశా అన్నపూర్ణ దీనినే చూసి ఉంటుంది. కూర్చోవే. కబుర్లు చెబుతూండండి. కాఫీ తెస్తాను.”
“ఇప్పుడు కాఫీ ఎందుకమ్మా!” అని పద్మనాభం అభ్యంతరం చెప్పినా భద్ర వినిపించుకోలేదు.
“ఫర్వాలేదు. క్షణంలో పని. కూర్చుని మాట్లాడుకొంటూ వుండండి.” అని వెళ్ళిపోయింది.
“నిన్నరాత్రి వచ్చేవా? ఏమిటి అనారోగ్యం?”
“ముందు తీసుకొంటున్నావా? ఎన్నాళ్ళనుంచి? ఫర్వాలేదు. అక్కడున్నవాళ్ళు దీర్ఘకాలం బ్రతుకుతారంటారు.”
“పాపీ చిరాయుః అన్నారు కదా”-అంది జానకి అన్నగారి ధైర్య వచనాలను తేలిక చేస్తూ.
పునర్వివాహం చేసుకోడం మహాపాపంగా తాను భార్యతో అన్నమాటకు ఇది ఎత్తిపొడుపులా వినిపించి పద్మనాభం ఉలిక్కిపడ్డాడు. వెంటనే బదులు తీర్చేడు.
“మీరు నమ్మే మార్క్సిజం పుణ్యపాపాలను ఒప్పుకోదు కాబోలునే” అన్నాడు.
జానకి కూడా మాట తనమీద ఉంచుకోలేదు.
“అది ఒప్పుకోనివి చాలా వున్నాయి. ఏం చేస్తాం? అన్నింటికీ మన మాటా, ఇష్టానిష్టాలు సాగిచస్తాయా? అందుకే సహజీవనం అంటూ వోమాట అడ్డుపెట్టుకొని లాక్కొస్తున్నాం.”
ఆ మాటకు అర్ధం ఏమిటో తెల్చుకోలేక పద్మనాభం ఆగిపోయేడు. ఇష్టం లేకపోతే మాత్రం నీతో మాట్లాడక తీరుతుందా అంటూందా? ఏమో. కాని, పద్మనాభం నిగ్రహించుకొన్నాడు. రాకరాక ఊళ్ళోకి వచ్చిన చెల్లెల్ని పనిమాలా వెళ్లి తిట్టివచ్చేడంటారని పస్తాయించేడు. అతడేమన్నా అంటేనే బదులు చెప్దామన్నట్లు జానకి ఊరుకుంది.
చిన్న ట్రేలో కాఫీలు పెట్టుకొని హాలులోకి వస్తూ, భద్ర వారిద్దరూ నిశ్శబ్దంగా కూర్చుని ఉండడం చూసింది. దానికి ఏదో కారణం ఊహించుకొని సర్దుబాటుగా మాట్లాడింది.
“పిల్లవాడు తోటనుంచి వచ్చేక బయలుదేరి వద్దామనుకొంటూంది. ఇంతలో నువ్వే వచ్చేవు” అంది.
“ఔనౌను. నీ కొడుకు వున్నాడన్నారు. మరిచేపోయాను. ఏడీ. తోటలో కెళ్ళేడా?....” అని పద్మనాభం అందుకొన్నాడు.
అంతవరకూ తన కొడుకు గురించే ప్రస్తావించనందుకు మనస్సులో కటకట పడుతున్న జానకి ఇప్పుడు తమ సంభాషణ ఆ దారికి పోవడం ఇష్టంలేక మాట మార్చింది.
“అప్పుడే ఎప్పుడు తయారుచేసేవు కాఫీ” అంటూ ట్రేలోంచి ఒక కప్పు తీసి అన్నగారికిచ్చి తానొకటి తీసుకొంది.
“కూర్చో నువ్వుకూడా.”
మూడోకప్పు చేతిలోకి తీసుకొంటూ భద్ర కూర్చుంది.
“నీలాంటి అతిధి వస్తే చిన్నపుచ్చుకోకుండేందుకే “ఇన్‌స్టెంట్ కాఫీ” డబ్బా ఒకటి ఎప్పుడూ ఇంట్లో వుంచుతాం. పాలు కాగుతూనే ఉంటాయి.”
సంభాషణ బాధాకరం కాని మార్గం పట్టడంతో పద్మనాభం సర్దుకొన్నాడు.
“మార్కెట్టులో కొచ్చిన ప్రతి కొత్త సౌకర్యాన్నీ సత్యానందం ఇంట్లోకి తెస్తాడు. వాడిని చూసి గాస్ స్టవూ, కుక్కరూ వూళ్ళో వో అరడజను మంది తెచ్చేరు.”
“తెచ్చేరు గనకనే ప్రాణం హాయిగా ఉంటూంది. ఎవరన్నా కొత్త మొహం అరుగుమీద కనిపిస్తే వీళ్ళకి వొండిపెట్టాలి కాబోలురా భగవంతుడా అని భయపడి పోనక్కర్లేదు.”
“ఆఁ. రాయసాలు బలిసి. మన పెద్దవాళ్ళకి ఈ గ్యాసుపొయ్యిలు తెలుసా? కుక్కర్లు ఎరుగుదురా? ఎంతవంటా డొక్కలూ, కమ్మలూ, పిడకలూతోనే కాదూ. బొగ్గుల కుంపటీ, కిరసనాయల్ స్టవూ ఈమధ్య వచ్చిన నాగరికాలు....” అంటూ అధునాతన సౌకర్యాల అనావశ్యకత మీద బండి తోలేడు.
అతని చేతినున్న ఖరీదైన వాచీచూసి “ఈ మనిషి ఎప్పుడూ ఒక్కలాగే వున్నా” డనుకొంది జానకి. మనస్సులోని వెలపరాన్ని దాచుకొంటూ, పైకి సౌమ్యంగానే అంది.
“మన అవసరాల్ని పట్టి సౌకర్యాలు.”
“పిల్లల చదువులంటూ వచ్చేక....” అంటున్న భద్ర మాటను మధ్యలోనే తుంచేస్తూ, పద్మనాభం-“మీ పిల్లలేనా చదువుతున్నది. మేం ఎవ్వరం చదవలేదా? మా పిల్లలు చదువుకోవడం లేదా?” అన్నాడు. వెటకారంగా.
చటుక్కున జానకి సంభాషణ మార్చింది.
“నీకు పిల్లలెందరు? ఏం చదువుతున్నారు?” అంది.
“ఆరుగురు. అంతా ఆడపిల్లలే” అంది, భద్ర.
“ఏదో చదువుతున్నామంటారు. అవన్నీ వాళ్లమ్మే చూసుకొంటుంది” అన్నాడు పద్మనాభం.
వివరాలు భద్ర చెప్పింది.
“వాళ్ళ పెద్దపిల్ల మన సాధన ఈడుది. స్కూల్ ఫైనల్ ప్యాసయింది. మానిపించేసేడు. మంచి తెలివిగల పిల్ల.”
“చదువుతా మన్నంత వరకు చెప్పించడానికి మనకేమన్నా పెద్దలు సంపాదించిన ఆస్తులేం లేవు. ఆ రాజకీయ బాధితుడునిగా అయిదెకరాలు భూమి దొరికింది గనక వీధిన పడడంలేదు. అంతే.”
“ఏం బీద అర్పులారుస్తావయ్యా!” అని భద్ర ఏదో చెప్పబోతూండగానే అడ్డుకొన్నాడు.
“అదీగాక, నువ్వూ బి.యే. చదివేవు. చదివి ఏం చేస్తున్నావు? వంటింట్లో ఉండేదానికి కాలేజీ చదువులెందుకు? అసలే సీట్లు దొరకడం లేదే అని గోల పెట్టేస్తూంటే....జనం...”
సంభాషణ ఎటు మార్చినా వెక్కిరింత, పెచీలోకి తిరుగుతూండడం జానకికి చాల ఇబ్బందిగా వుంది. ఏమిటీ పీడ అనుకుంటూండగా పద్మనాభానికి జానకి కొడుకు మాట గుర్తు వచ్చింది.
“మీ కుర్రాడు ఇందాకా పొలం వెడుతూ రోడ్డు దగ్గర ఎదురయ్యేడు. ఆర్టిస్టు వేషంలో వున్నాడు. ఏం చదువుతున్నాడు?” అన్నాడు.
“ఆర్టిస్టు వేషం ఎమిటి! ఆర్టిస్టే” అంది భద్ర.
“జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్” లో చదివేడు. కమ్మర్షియల్ ఆర్టూ, కార్టూన్ డ్రాయింగులో డిప్లొమా తీసుకొన్నాడు, ఈ ఏడాదే.”
చెల్లెలు చెప్తున్న చదువులు గురించి పద్మనాభానికేమీ తెలియదు. కార్టూన్ మాట విన్నాడు. దానికి స్కూలూ, పరీక్షా, చదువులూ ఉన్నాయా? తెలియదు.
“ఇదీ ప్రపంచం, చిత్రలోకం, లోకం తీరు, పెద్దమనిషి వంటివేనా కార్టూన్ డ్రాయింగ్ అంటే?”
బొంబాయిలో ఇంతకాలమూ వుండిపోవడంచేత తెలుగు పత్రికలతో విశేష సంభంధం లేని జానకికి ఆ పేర్లు ఏమిటో తెలియక తెల్లబోయింది.
“కొంచెం ఇంచుమించుగా అంతే” అంది భద్ర.
“ఆ వంకర టింకర బొమ్మలకి వో స్కూలూ, వో డిప్లొమానా?” అన్నాడు వికారంగా ముఖంపెట్టి పద్మనాభం.
అడక్కుండా, పెట్టకుండా తన అజ్ఞానాన్ని అంత సులభంగా బయటపెట్టుకొన్న అన్నగారిమీద అప్రయత్నంగానే అసహ్యం కలిగింది. కాని, పైకేమీ అనలేదు. భద్రే సమాధానం ఇచ్చింది.
“ఏం. ఏ. లూ, ఎం. ఎస్‌సి. లూ, పి. హెచ్ డి. లూ చేసినా మళ్ళీ ఏ మీబోటిగాళ్ళనో రాజబంధువుల్ని పట్టుకోవాలి. బాబ్బాబు ఎక్కడో వో బంట్రోతు పనేనా ఇప్పించమని కడుపూ కాళ్ళూ పట్టుకోవాలి. అంతకంటె స్వతంత్రమైన బ్రతుకు ఆర్టిస్టుది....”
రాజబంధువు అన్న పదమూ, ఉద్యోగాలు తమ చేతుల్లో ఉన్నాయన్న పొగడికా విన్నాక పద్మనాభం బోర విరుచుకొంది. ఈ పది పదిహేనేళ్ళుగా అగ్రహారం హైద్రాబాదు మధ్య తిరిగిన అనుభవంతో హామీ ఇచ్చేడు.
“ఏ బి.యే.యో అయిపోతే ఏ ఆఫీసులోనన్నా చెయ్యి పట్టుకు వేయించవచ్చు...”
మాట మధ్యలో భద్ర అందుకొంది.
“దురదృష్టం. ఇప్పుడా అవకాశమూ లేదనుకొంటా.”
కాంగ్రెసులో వచ్చిన తగాదాలలో పద్మనాభం ఒక వర్గంవాడు. ఇప్పుడు పద్మనాభం మాట హైద్రాబాద్ లో వినేవాడుండడని భద్ర కవ్వించింది.
“ఇల్లలకగానే పండగ అవదమ్మా! ఇవతల వున్నవాళ్ళు దిగ్దంతులు. కుర్రవాజమ్మలని రొష్టు పెట్టడం ఎందుకు! గంతులెయ్యనీ. ఆయాసం వచ్చి వాళ్ళే చతికిలబడతారని చూస్తున్నారు. ఈ ఉడత వూపులకి కదిలే మొదలా కాంగ్రెసు? ఏం ఫర్వాలేదు.”
ఇంక అంతకన్న రెచ్చగొట్టడానికి భద్ర సాహసించలేకపోయింది. జానకి కూడా అన్నగారి రాజకీయాలూ, అహంభావమూ, దురహంకారమూ వెలపరం కలిగిస్తూంటే ఊరుకొంది. ఒక్క నిమిషం ఆగి పద్మనాభమే మళ్ళీ ప్రారంభించేడు.
“ఏ బి. యే. యో అయిందనిపించవలసింది. కూడెట్టనా, గుడ్డపెట్టనా ఎందుకొచ్చిన పిచ్చి గీతలు” అని సలహా ఇచ్చేడు.
జానక్కి వొళ్ళు మండింది.
“ఖుదా హాఫిజ్!”
ఆ మాటకి అర్ధం తెలియకపోయినా, సందర్భం, ఉచ్చరించిన పద్దతీ, ముఖ కవళికా చూసాక ఆ మాట తన గొప్పతనాన్ని తేలికపరిచేదేనని నిర్ణయించుకోడం కష్టం కాలేదు. తనచేత తిట్లూ, మొట్టికాయలూ తిన్న జానకి మాటతీరూ, ఆలోచనా ధోరణీ తనకు ఏమాత్రం అందడం లేదు. ఆమె ఆకారమే చెప్తూంది-ఇరవై రెండేళ్ళనాటి జానకి కాదు. పట్నవాస జీవితంలో అలవడ్డ ప్రాగల్భ్యమే కాదు. చదువు, సంస్కారం-జానకి సర్వవిధాలా చాలాచాలా ఎత్తు పెరిగిపోయింది. ఆమె ఎదట అడుగడుగునా తన లొచ్చు స్థితి కనిపించిపోతూంది. వయస్సు పెద్దరికం, మగతనం, రాజకీయ జీవితమూ ఆ లోచ్చుదనాన్ని అంగీకరించడం లేదు. చటుక్కున లేచేడు.
“ఆనక మీ వదిన వస్తుంది. ఉంటావుగా-” అన్నాడు.
ఈ మారు మాటలో మృదుత్వం లేదు. ఆ కరుకుదనానికి కారణం జానకి అర్ధం చేసుకొంది. ఏమీ అనదలచలేదు. మర్యాద తప్పకుండానే సమాధానపూర్వకంగా అంది.
“పాపం పిల్లలతో సతమత మవుతూండి వుంటుంది. ఆమెను శ్రమ పెట్టడం...”
“శ్రమేమిటిలే. వస్తుంది” అనేశాడు.
అన్నాక జానకి మాటకు వేరే అర్ధం ఉందేమో ననిపించింది. చూడ్డానికి రాకపోయినా విచారపడనన్న పుల్లవిరుపా? తానే వస్తానన్న సానుభాతా? తెలియలేదు.
“సరే. ఏం చేస్తుందో రాత్రి భోజనానికి నువ్వూ, కొడుకూ అక్కడికే రాండి.”
జానకి ముఖంలో కనబడిన అయిష్టాన్ని భద్ర గమనించింది.
“పగలు ఏదోవేళ వస్తుందిలే. మళ్ళీ రాత్రనీ, వో భోజనమనీ ఎందుకు?”
“పగలు రాదేమో అనుకొన్నా. అల్లా అయితే ఈ పూటే, రా” అన్నాడు.
జానకి చర్రున మాట విసిరేసింది.
“పగలు వీధిలోకి రాకూడని పనేం చెయ్యలేదు. అంత రాత్రిళ్ళే తిరిగడానికి.”
“మనం అనుకోగానే సరా! లోకం కూడా మెచ్చాలి. సరే, అవన్నీ ఇప్పుడెందుకులే....” అని సాచేసాడు.
జానకి మాత్రం అంత సులభంగా తోసేయ్యలేదు. మాట మధ్యలోనే తుస్కారించింది.
“లోకం మెచ్చని నా పనికి ఇతరులెవ్వరూ కష్టాలు తెచ్చుకోవద్దు. నేనేమీ తప్పు పని చెయ్యలేదు. ఇతరులకి బాధ కలిగించకుండా నా బ్రతుకేదో నేను బ్రతుకుతున్నా. లోకం మర్యాదగా భావించే పద్ధతిలోనే బ్రతుకుతున్నా. కాని నా వలన మీకు అప్రతిష్ట కలుగుతుందని తోస్తే పిలవకండి. రాత్రీ, పగలూ అనేదేముంది?....
పద్మనాభానికి చెల్లెలి నిర్లక్ష్యం తామసం కలిగించింది.
“అంత ఆత్మవిశ్వాసం ఉన్నదానివి ఈ ఇరవయ్యేళ్ళూ ఎందుకు మొహం చాటు చేశావు?” అన్నాడు హేళనగా.
తోక తొక్కిన తాచులాగ జానకి బుసలు కొట్టింది.
“మీ ఎవ్వరి ప్రాపకం అక్కర్లేదు, కనకనే.”
“ఇప్పుడు వచ్చిందా అవసరం?”
“ఎవరి అవసరం వచ్చినా నీ అవసరం, నీబోటివాళ్ళ అవసరం రాలేదు. రాదు” అంటూ జానకి విసురుకొని లోపలికి వెళ్ళిపోయింది.
చురచుర తాటాకు మంటలాగా చూస్తుండగానే పాకిపోయిన ఆ కలహాన్ని నిలవరించడానికి అదను దొరక్క భద్ర తెల్లబోయి చూస్తూంది.
“ఏం మాటయ్యా, అది”-అని పద్మనాభాన్ని మందలింపుగా అంది.
“చేసిన పనికా, పట్టిన అదృష్టానికా ఆ మిడిసిపాటు? కాని కూటికి కక్కుర్తిపడ్డా కడుపునిండకుండా చేస్తివేమయ్యా దేవుడా అని ఏడవక ఏం చూసుకొని ఆ ఎగిరిపాటు?”
పద్మనాభం గిరుక్కున తిరిగేడు.
“ఏం మనిషివయ్యా” అనేసింది, భద్ర. ఆమె కంఠంలో వినిపించిన జుగుప్సను అతడు పట్టించుకోలేదు. తన తిట్టే చివరిది. అది అతని తృప్తి. ఆ తృప్తితోనే చరచర వీధిలోకి నడిచేడు.
విసురుగా వచ్చిన పద్మనాభం గేటు తెరిచేసరికి అప్పుడే గుమ్మంలోకి వచ్చిన పిల్లల జట్టును చూసి చటుక్కున నిలబడ్డాడు. అతనిని చూడగనే అందరికన్న ముందున్న రవీంద్ర రెండుచేతులూ జోడించేడు.
“మామాజీ! నమస్తే” అన్నాడు.
చెల్లెలు చేసిందన్న “కక్కుర్తిపని” ఫలితం ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తూంటే పద్మనాభానికది గౌరవంగా గాక, వెక్కిరింతగానే కనబండింది. కోపం వచ్చింది. గుడ్లు ఎర్రజేసేడు. హుంకరించేడు. ఆ విధమైన ప్రవర్తన అర్ధంగాక రవీంద్ర తెల్లబోయి పక్కకు తప్పుకొన్నాడు. అతనిని దూసుకొని పద్మనాభం వీధిలోకి వెళ్ళిపోయేడు.
ఆశ్చర్యంతో రవీంద్ర తన వెనకనే వున్న సాధనను కళ్ళతోనే ప్రశ్నించేడు.
“ఏమిటీ మనిషి?”
ఆమె తెలియదనట్లు పెదవి విరిచింది. ఊరుకోమన్నట్లు కన్నులరమోడ్చి, తల వంచింది.
మీనాక్షి అమాయికంగా అనేసింది.
“పద్మనాభం మామయ్యా, నాన్నా వాదించుకొన్నారేమో.”
పదిహేడో ప్రకరణం
భోజనాలయ్యాయి. పిల్లలంతా మేదమీడకు చేరేరు. పెద్దవాళ్ళు సావిట్లో కూర్చుని తాంబాలాలు వేసుకొంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
“సాయంకాలం నాలుగింటికి అల్లా పాలెంవేపు వెడదాం. ఓమారు జాన్‌నీ, వాళ్ళనీ చూసివద్దాం” అంది జానకి.
“జాన్‌నా?” అన్నాడు సత్యానందం. ఏదో జ్ఞాపకం వచ్చినట్లు కళ్ళల్లో మెరుపు కనబడింది.
“ఔను. అదీ ఆలోచనే. కాని, ఈవేళ నాకు కుదరదు. వీలయితే నువ్వు పోయి చూసి రా. లేదా, రాత్రే కదా వచ్చేవు. ఒంట్లో బాగా లేదనుకొన్నావా. ఊరుకో. రేపు వుదయం వెడదాం.”
“పోనీలే. నీపని చూసుకో, ఏమైంది? అమ్మకాలు ప్రారంభమైనట్లేనా?”
“అయినట్లే, వాటిని నిర్బంధ వ్యతిరేక వారంతో జత కలిపాం. ఈవేళ ఇసకపూడిలో సభ. రాత్రి. అదీ మా హడావిడి. “
అతనిమాట పూర్తికాకుండానే మేడమీదినుంచి ఉరకలేస్తూ మీనా పరుగెత్తి వచ్చింది.
“మరియమ్మ!”
“ఏమిటా ఉరుకులు. మెట్లమీదినుంచి పడ్డావంటే తొస్సిదానివైపోతావు” అంటూ భద్ర ఆప్యాయంగా కూతుర్ని దగ్గరికి తీసుకొంది.
“మరియమ్మ!”-అంది, మీనా ఆయాసపడుతూ.
“ఏదీ?”
“గుడిమూలలో కనిపించింది.”
తనపని అయిపోయినట్లు మళ్ళీ పరుగెత్తబోతూంటే సత్యానందం గమ్మున చేయి పట్టుకున్నాడు.
“ఏమిటా హడావిడి?”
“ఉండండి నాన్నారూ! బావ ఫోటో తీస్తున్నాడు.”
“వాళ్ళు ఫోటోల హడావిడిలో వున్నారు”-అంది జానకి.
“ఎవరు, రవీంద్రా తీసేది? కెమేరా తెచ్చేడా?....అయితే నేనూ వస్తానుండు”-అంటూ సత్యానందం లేచి మీనాను ఎత్తుకొన్నాడు.
“గౌను నలిగిపోతుంది, నాన్నారూ”-అని మీనా లబలబలాడింది. సత్యానందం ఆమెను ముద్దుపెట్టుకొని దింపేడు.
“తొరగా వెడదాం. రాండి”-అంటూ మీనా తండ్రి చెయ్యి వదిలించుకొని మెట్లవేపు పరుగు తీసింది.
“మీరు కబుర్లు చెప్పుకొంటూ౦డండి. నేను పైకిపోతా” నంటూ సత్యానందం కూతుర్ని కేకేసేడు.
“నేనూ వస్తున్నా, ఆగు మరి.”
మెట్లమీద మాయం అవుతూ మీనా పలికింది. “తొరగా రాండి.”
జానకి నవ్వింది.
“వాళ్ళతో మనం పోలేకపోయినా, మన్ని భరిస్తారు” అంది.
పద్దెనిమిదో ప్రకరణం
తనకు స్వాగతం చెప్తున్న భద్ర పక్కనే వున్న జానకిని మరియమ్మ గుర్తుపట్టలేకనే పోయింది.
“జానకమ్మగారు వచ్చేరని తెలిసింది. చూసిపోదామని వచ్చా” నంది మరియమ్మ.
తనను ఆమె గుర్తు పట్టలేదు. మరియమ్మ వస్తున్నదని మీనా వచ్చి చెప్పడం, ఆమెను చూస్తూనే భద్ర పేరుపెట్టి పిలిచి ఆహ్వానించడం వలన తెలిసిందేగాని ఆమె కూడా మారిపోయింది. మనిషిలో ఆ వెనకటి జీవనోత్సాహం లేదు. జుట్టు నెరుపు కనబడుతూంది. మనిషి లావు బారింది. ఆ మరియమ్మేనా ఈమె?-అనుకొంది.
“ఇప్పుడే మీమాట అనుకుంటున్నాం. నాలుగ్గంటలకి బయలుదేరి రావాలనుకొంటున్నాం. ఇంతలో నువ్వే వచ్చావు.”
అప్పుడుగాని మరియమ్మకు ఆ కొత్త యామెలో జానకి పోలికలు కనబడలేదు. “మిమ్మల్ని గుర్తుపట్టలేక పోయాను. బాగా మారిపోయేరు.”
“బాగున్నావా” అని జానకి ఆప్యాయంగా కుశల ప్రశ్న వేసింది.
“అదేబాగు” అంటున్న మరియమ్మను భద్ర లోపలికి రమ్మంది.
“గుమ్మంలో మాటలేమిటి రా, లోపలికి.”
పూర్వస్మృతులు మనస్సును కలతపెడుతుంటే ముగ్గురూ ఒక నిముషం మాట్లాడకుండా ముఖాలు చూసుకొంటూ కూర్చున్నారు. కొద్దిసేపట్లో జానకే తెముల్చుకొంది.
“మీ అయ్య ఎలా వున్నాడు?”
మరియమ్మ ఒక్క నిముషం తటపటాయించింది.
“లేచి నడవలేడు. పోలీసు క్యాంపులో కొట్టేశారు. రెండు కాళ్ళూ అవిటి అయిపోయాయి. అల్లుణ్ణి అడ్డం పెట్టుకొని ఈడ్చుకు వస్తున్నాడు.”
అల్లుడు అనేసరికి జానకి ఆమె ముఖం వంక చూసింది. యుద్ధకాలంలో ఆమె మగడు బర్మాలో చిక్కడి పోయాడనీ, కబురు లేదనీ అనుకొన్నారు. తిరిగి వచ్చేడు కాబోలు ననుకొంది.
ఆమె చూపు గ్రహించి భద్ర చెప్పింది.
“మరియమ్మ పోలీసు గొడవలు అయ్యాక మనువు చేసుకొంది. ఇప్పుడు ముగ్గురు పిల్లలున్నారు.”
“ఏమన్నా పెద్దవాళ్ళయ్యారా?”...అంది జానకి.
“ఏం పెద్దవాళ్ళు….అంతా, ఇంతా...” అంటూనే మరియమ్మ మాట మార్చింది.
“అన్నయ్యగారి ద్వారా మీకు ఇక్కడి కబుర్లు తెలుస్తూనే వుంటాయి.”
“ఏమీ రాయడు. ఎప్పుడేనా వ్రాస్తే అంతా బాగున్నారంటాడు.”
“ఏమంత సంతోషకరమైన వార్తలు? ఏదో ఉద్యోగంలో వున్నారు. ఇక్కడి కష్టవార్తలన్నీ వ్రాసేదేమిటని ఊరుకొని వుంటారు.” అంది మరియమ్మ.
“బొంబాయిలో పార్టీ మహాసభ జరిగినప్పుడు వచ్చేనని ఫోను చేసేడు. ఆహ్వాన సంఘం ఆఫీసులోనే వున్నాడు ఉండడం. ఓమారు నాకోసం వచ్చేడట. నేను లేను. సభలు అయ్యాక ఒకరోజు వుంటానన్నాడు....”
“ఇంతలో ఇక్కడ రామకృష్ణకి టైఫాయిడ్ వచ్చింది. నాకు గాభరా పుట్టి టెలిగ్రాం ఇచ్చేను. వచ్చేశారు….జానకిని చూడనేలేదు. ఒక్కమారు ఫోన్‌లో మాట్లాడగలిగేను. వచ్చేటప్పుడు ఫోన్ చేసినా అందలేదు”-అన్నారు....అంది భద్ర.
ముగ్గురూ ఒక్కక్షణం ఊరుకున్నారు. మరియమ్మ ప్రసంగం మార్చింది.
“ప్రొద్దుట మీ అబ్బాయిని చూసా! వీరి అమ్మాయిలతో పొలం వెడుతున్నారు. చిన్నపాప చెప్పారు. మా జానకి అత్తయ్య కొడుకు అన్నారు. నాకు అర్ధం కాలేదు. సాధన చెప్పారు. మీరూ వచ్చేరన్నారు. వెంటనే వచ్చి పడిపోవాలనిపించింది. కాని, ఆదివారం. సెలవుండే ఈ రోజునే అన్ని పనులూ వస్తాయి. అవన్నీ తెముల్చుకు వచ్చేసరికి ఈ వేళయింది.”
ఆ ఆప్యాయతకు మిగిలిన ఇద్దరూ కదిలిపోయేరు.
“ఇప్పుడే మా బావతో అంటున్నా. నాలుగ్గంటలకు వెడదామని” అంది జానకి.
“అంతవరకూ మనసొప్ప లేదు.”....అంది మరియమ్మ.
ఇద్దరూ కబుర్లలో పడ్డారు. వారిని మాటల్లో వదలి భద్ర ఇంట్లోకి బయలుదేరింది.
“ఇప్పుడే వస్తున్నా. కూర్చో.”
“పనులు చూసుకోండి. కబుర్లు చెప్పుకుంటూ౦టాం” అని మరియమ్మ అనుమతించింది.
పందొమ్మిదో ప్రకరణం
పళ్ళెంలో రెండు చపాతీలూ, కూరావేసి తీసుకొని, భద్ర హడావిడిగా వచ్చింది.
“ఆ బల్ల దగ్గరగా లాక్కో.”
మరియమ్మ మొగమాటపడింది.
“ఎందుకండి, ఇవన్నీ”
భద్ర వొప్పుకోలేదు. గడియారం వంక చూపింది.
“ఎంతయిందో చూసేవా?”
“పదకొండున్నర. మేము సాధారణంగా వొంటిగంట దాటేకనే తింటామండి”-అంది.
“వంట చేసుకొనే వచ్చేనండి” అంది.
కాని భద్ర వొప్పుకోలేదు. మరియమ్మ లేవకా తప్పలేదు. ఎక్కవ పట్టుదల కూడదనుకొంది.
“చెయ్యి కడుక్కు వస్తా.”
“స్నానాల గది ఎరుగుదువు గదా. తొట్టిలో నీళ్ళున్నాయి. చెంబూ, సబ్బూ అక్కడే వున్నాయి. తుండు దండెం మీద....”
మరియమ్మ వెళ్ళాక జానకి అమాంతం లేచి భద్రను కౌగిలించుకొంది. భద్ర నవ్వుతూ.
“ఏమిటీ, ఉప్పలాయి!” అంది.
“చాల మంచిపని చేశావు.”
ఏమిటో ఆ మంచిపని చెప్పకపోయినా భద్ర గ్రహించింది.
“మరియమ్మ చాలా మంచిమనిషే.”
“పేపర్లలో నేను చదువుతున్న వార్తలు పట్టి నేను ఊహించినది వేరు.”
ఆమె కంచికర్ల, ఒంగోలు, ఖమ్మం వగైరా చోట్ల హరిజనుల మీద జరిగిన దౌర్జన్యం వార్తలు గురించి మాట్లాడుతూందని భద్ర గ్రహించింది.
“నువ్వు చదివినవీ నిజమే. నువ్వు చూస్తున్నదీ నిజమే. ఇది వెనకటి అగ్రహారం కాదు. అన్ని వీదుల్లోకీ హరిజనులు ధారాళంగా వస్తున్నారు. అయితే అన్ని ఇళ్ళలోకీ రానివ్వడం లేదు. చదువుకున్న వాళ్ళనీ, ఉద్యోగాలలో వున్నవాళ్ళనీ కాస్త గౌరవించడం నేరుస్తున్నారు. మనింటికి వస్తారు. సుందరరావుగారింటికి వస్తారు. ఇంకొకరిద్దరుకూడా కలిసారు. వాళ్ళని రానిచ్చినందుకు మొదట తిట్టేరు. తరవాత అలవాటయిపోయింది. తమరు దూరంగా ఉంచినా, దగ్గరకు తీసినవారిని ఏమీ అనరు. మనతో సమంగా కూర్చో బెట్టుకొంటే చూడనట్లు పోతారు. కాని, తమతో సమంగా కూర్చో బెట్టడానికి వొప్పుకోరు.....ఇవన్నీ......”
“ఔనౌను. ఇలాంటివన్నీ ఏదో ఉత్పాతం విరుచుకు పడితే తప్ప! మామూలు రోజులల్లో మార్పు ఇంచుమించు కనబడనే కనబడదు.” అంది, జానకి.
మరియమ్మ చేతులు కడుక్కుని వచ్చింది.
“అక్కయ్యగారు, ఊరికే పంపరు. ఎప్పుడు వచ్చినా. రావడానిక్కూడా సిగ్గు అనిపిస్తుంది.”
“మంచిదానివి. అల్లాంటిపని చేశావు గనక.....ఇంతకీ ఒక చేపాతీ పెట్టడం కూడా ఒక పెట్టడమేనా?” అంది భద్ర.
మరియమ్మ ఉపాహారం చేస్తూ అంది:
“ఇక్కడ నన్ను చూసినవాళ్ళు, ఈ దేశంలో కంచికిచెర్లలూ, ఒంగోలు, భీమవరాలూ జరుగుతున్నాయంటే నమ్మరు.”
“అదే ఇప్పుడు అనుకుంటున్నాం” అంది జానకి.
“ఈ దురంతాలు కొత్తగా పెరిగిపోతున్నాయి. ఇదివరలో ఇంత దురన్యాయం లేదు. ఓ పాలేరుని కొట్టేరనో, దొంగతనం చేసేరని కొట్టేరనో విన్నాం. కాని....” అంది భద్ర.
“దురన్యాయాలు. దౌర్జన్యాలూ ఎప్పుడూ వున్నాయి. అయితే ఆ రోజుల్లో సంఘమే వాటికి అనుకూలంగా వుంది గనక బయటికి రాలేదు. మాలవాళ్ళు తమ ముఖాన బ్రహ్మ వ్రాసిపెట్టేడు. భరించక తప్పదనుకున్నారు. ఇప్పుడల్లా కాదుగా” అంది మరియమ్మ.
“ఈ వేళ ఇదేమిటని అడుగుతున్నారు. ఈ దురన్యాయాలు సహించమని నిలబడుతున్నారు. ఆ విధంగా నిలబడ్డం యి౦తవరకు పెత్తనం వెలిగించిన వాళ్ళకి కొత్త. అది భయంకరమని గోలెత్తుతున్నారు....” అంది జానకి.
“మార్క్సిస్టులో, నక్సల్‌బరీలో జనాన్ని రెచ్చగొడుతున్నారని ఎదురు పట్టిస్తున్నా” రంది భద్ర.
ఒక్క నిముషం ముగ్గురూ తమ తమ ఆలోచనల్లో పడిపోయారు. కొద్దిసేపున్నాక మరియమ్మే అంది:
“వాళ్ళకి ప్రమాదం ఎక్కడినుంచి వస్తుందో తెలుసును.”
ఆమె అభిప్రాయాన్ని, అభిమానాన్నీ జానకి అర్ధం చేసుకొంది.