భర్త వుండడని భద్రకు తెలుసు. వీధిలో సహచరుల్ని కూర్చోబెట్టి అతడు ఇంట్లో ఉపాహారాలు, ఫలహారాలూ సేవించడు. తింటే నలుగురూ తినాలి.

“వాళ్ళనికూడా వుండమనండి. మళ్ళీ ఏవేళవుతుందో తిరిగి వచ్చేసరికి.”

“కానీ. అయిదుగురికి చెయ్యి అలాఅయితే”-అంటూ అతడు సావట్లోకి వెళ్ళాడు.

“ఏం చేస్తావు?” అంటూ జానకి ఆమెకు సాయం కదిలింది.

పదో ప్రకరణం

“ఏమిటండి నిన్న రాత్రి ఏదో చాలా గొడవ జరిగిందట!” అంటూ కామేశ్వరరావు సత్యానందం రాగానే కుర్చీలోంచి లేచి ఎదురు వచ్చేడు.

“మీరంతా వచ్చేరా. రాండి. ఆఫీసుగదిలోకే వెడదాం” అంటూ సత్యానందం స్విచ్‌బోర్డ్ మీదున్న తాళంచెవి తీసుకున్నాడు.

“నిన్న మార్క్సిస్టు పార్టీవారు కేరళ వెన్నుపోటు నిరసనదినం జరిపేరు.”

“రంగమ్మ తన కొడుకును పట్టించియిచ్చేవని తిట్టిందట! వెన్నుపోటూ, కన్నుపోటూ రోగం బాగా కుదుర్చింది” అన్నాడు వెంకట్రామయ్య.

తాళం తీస్తున్న సత్యానందం ఆ మాటకు చురుక్కుమన్నట్లయి వెనుతిరిగి చూసేడు. కాని, అప్పుడేమీ అనలేదు.

గదిలోకిపోయి కూర్చున్నాక ఏ ఒక్కరితోనూ అన్నట్లుగా కాకుండా ఉమ్మడిగానే తన అసంతృప్తి తెలిపేడు.

“సుందరరావుగారి రోగం కుదరడానికి కేశవరావులాంటి మెరికల్లాంటి కుర్రవాళ్ళే చచ్చిపోవాలా?”

“అతని చావు కోరి తెచ్చుకొన్నది. మనమేం చెయ్యగలం?”-అన్నాడు వెంకట్రామయ్య.

“మీ సిద్ధాంతాం తప్పుదారిన పడిందని చెప్పి చూశాం. అలా చెప్పడం కేవలం రివిజనిజమేనన్నారు. విప్లవపంధా వదిలేశామట. ఇప్పుడేం మిగిలిందో....” అన్నాడు కామేశ్వరరావు.

మిగిలిన వాళ్ళుకూడా తప్పంతా కేశవరావుదే అయినట్లూ, పాలీసు వాళ్ళూ ప్రభుత్వమూ ఆత్మరక్షణ కోసం అతనిని చంపక తప్పదన్నట్లూ మాట్లాడుతూంటే సత్యానందానికి బాధ కలిగింది. ఈవేళ కూడా పుస్తకాల అమ్మకం మూలబడినట్లే అనుకొన్నాడు. నెమ్మదిగా ఆచి, తూచి మాటలారంభించేడు.

“కేశవరావు వాదం దృక్పధంలో వున్న భేదాన్ని తెలుపుతుందేగాని, అతడిని స్వార్ధపరుడనగలమా?”

ఎవ్వరూ అనలేరు. చిన్న వయస్సు. చదువుంది. ఒక ఏడాదిలో డాక్టరవుతున్నాడు. ఎక్కడ బోర్డు కట్టుకున్నా జీవితం సుఖంగా గడుస్తుంది. పెళ్ళి చేసుకొని, దేశం ఏమైపోయినా తాను సుఖపడగలడు. కాని, అతడా దారి తోసిపారేశాడు. తొక్కుతున్న దారి ముళ్ళదారి అని తెలుసు. కాని, అదే ఎన్నుకున్నాడు. ఎవరికోసం? ఎందుకోసం?

అందరూ ఆ మాట ఒప్పుకొన్నారు. కాని, ఎవ్వరూ అతని మాటల కటుత్వం మరిచిపోలేదు.

“మనం కమ్యూనిస్టులమే కాదన్నాడండి-“ అన్నాడు కామేశ్వరరావు.

“సోవియట్ యూనియనుది సోషల్ సామ్రాజ్యవాదం అన్నాడండి” అన్నాడు మందేశ్వరరావు.

“-చైనా మార్గమే మనదీ అన్నాడండి. కాదనడం వర్గ సంకరాన్ని కోరడంట. పార్లమెంటరీ విధానానికి అమ్ముడుపోవడమట. శాంతియుత సోషలిస్టు పంధా వట్టి మోసమన్నాడండి!” అంటాడు వెంకట్రామయ్య.

కాని, సిద్ధాంతాలలో వున్న లవలేశాలు, భేదాలు ఈవేళ అధికారంలో వున్నవారికి పట్టవు. కేశవరావు వాదనలు తెలియడానికైనా విచారణ అంటూ జరగలేదు. అతనిని వరంగలులో అరెస్టు చేశారు. పార్వతీపురం వద్ద చంపేశారు.

ఇది అన్యాయం. ఘోరం. తమ మాటకు ఎదురు చెప్పినవాడినీ, చెప్తాడనుకున్నవాడినీ దారిలోంచి తప్పించడానికి ఆ వాదాలు ఒక సాకు మాత్రమే.

ఆ పద్ధతిని ప్రభుత్వం అవలంబించదలచిందనీ, దానికి బాహాటంగా యేర్పాట్లు చేస్తూందనీ చెప్పడానికి హోం మంత్రి అన్ని పత్రికలకీ తన పూర్తి ప్రకటన యివ్వడమే సూచన.

ప్రభుత్వం దుర్బుద్ధిని, దురన్యాయాన్ని ప్రజలకి చెప్పాలి. దానికి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించాలి. లేకపోతే బంజర్ల సాగు వుద్యమం అంటున్న కమ్యూనిస్టు పార్టీ, ఇతర పార్టీలూ ఆ దాడులకు గురి అవుతాయి. అందుకే ప్రభుత్వం తయారవుతూంది. దానికి వ్యతిరేకంగా జనాన్ని, అన్ని పార్టీలవారినీ కూడగట్టాలి.

అందరూ అంగీకరించేరు. “కాని ఏలాగ? ఎవరొస్తారు?” అని అందరికీ అనుమానమే.

సత్యానందం ఒక ప్రతిపాదన చేశాడు.

“మనం సాహిత్యవారం ప్రారంభిస్తున్నాం. ఇది జరిగినన్నాళ్లూ చుట్టుపక్కల వూళ్లూ, పేటల్లో సభలు పెడదాం. ఆ విధంగా రెండూ ఒకదానికొకటి జతపడి మంచిపని జరుగుతుంది.”

“మన రాష్ట్రపార్టీ అనుమతి....”

అని కామేశ్వరరావు నీళ్ళు నమిలాడు. గ్రామపార్టీ సభ్యులలో చదువుకొన్నవాళ్ళలో అతడొకడు. ఏ పనీ జరగకుండా పార్టీ నిర్మాణ సూత్రాల సాయంతోనే ఆటంకాలు సూచించగల అద్భుత మేధావంతుడని అతనిమీద సత్యానందానికి అభిప్రాయం వుంది. అందుచేత నెమ్మదిగానే మందలించేడు.

“ఇదిగో చూడు. మనం చేసే పనులన్నింటికీ అల్లా అనుమతి తెచ్చుకు మరీ చేద్దామంటే కుదురుతుందా? ఆ అనుమతి కోరడం అసలు పని ఎగగొట్టడానికి ఒక మార్గం అవుతుందంతే. పార్టీ స్థూలంగా వో మార్గం యిచ్చింది. నిర్బంధ వ్యతిరేకత. ప్రాధమిక హక్కుల కోసం ఆందోళన. ప్రజల ఆవశ్యకతల కోసం పని చెయ్యడం. ఆ పనిలో అన్ని పార్టీలనూ తోడు తెచ్చుకోడం....”

“కాంగ్రెసు వాళ్ళని కూడానా?”

“మన వూళ్ళలో కాంగ్రెసును అభిమానించే జనం వున్నారు మరి....”

“సిండికేటు జట్టును....”

“వాళ్ళు మనుష్యులలోకి రారంటే తప్ప నిర్బంధ వ్యతిరేకతకై జనసంఘం వాళ్లు వస్తే మాత్రం నువ్వెందుకు కాదనాలి!”

“ఎవ్వరూ కలిసి రారండి” అని వెంకట్రామయ్య నిస్పృహ.

“కలిసి వచ్చేందుకు ప్రయత్నించాలి” అన్నాడు సత్యానందం దృఢంగా.

“అయితే ఇవ్వాళ పాలెంలో మీటింగు పెడదాం. మేం జనాన్ని కలుసుకుంటాం. మీరు పార్టీ పెద్దల్ని కలుసుకోండి,” అన్నాడు మందేశ్వరరావు.

సత్యానందం అంగీకరించేడు.

“కామేశ్వరరావు నాతో వస్తాడు.”

“నేనెవరి దగ్గరకేనా వస్తాగాని సుందరరావు మొహం చూడను. అతడు....” కామేశ్వరరావు ఆయన గుణవర్ణన చేసేవాడే కాని, సత్యానందం ఆపేడు.

“నీ అభ్యంతరం నేనెరుగుదును. కాని, యిది ప్రజా కార్యమయ్యా!....”

“ప్రజా కార్యమో, ప్రభు కార్యమో. నా పార్టీని తిట్టేవాడి మొహం చూడ్డం కూడా నాకు అసహ్యం.”

“మనం కమ్యూనిస్టులం. మనకు ప్రజలను కాదన్న పార్టీ వేరే లేదు. అందుచేత....”

“నా వల్ల కాదండీ.”

“రానంటున్నాడు కద, పోనీండి,” అని వెంకట్రామయ్య సర్దబోయేడు.

“పోనీయకేం వుంది? నేనే వెళ్ళి వస్తా, నాకల్లాంటి పట్టింపులు లేవు. అంతే.

‘ఒరులేయవి యొనరించిన, నరవర!

అప్రియంబు తన మనంబున కగు, దా నొరులకు

నని సేయకునికి పరాయణము

పరమ ధర్మపధముల కెల్లన్‌’

- అన్నాడు భారతకారుడు. కమ్యూనిస్టు జీవిత పద్ధతుల్లో అదొక మాత్రమని నా అభిప్రాయం సుమా:”

“మీరు కమ్యూనిస్టు అయినా గాంధీయిజాన్ని వదలలేదు” అన్నాడు కామేశ్వరరావు.

సత్యానందం నవ్వే దానికి  సమాధానం.

పదకొండో ప్రకరణం

గుమ్మంలోకి వచ్చిన సత్యానందాన్ని తండ్రి చూసేడనీ, చూడనట్లు నటిస్తున్నాడనీ రంగనాయకులు గ్రహించేడు. కాని, ఆ విషయం ఎరగనట్లే తాను నటించదలచేడు.

“రాండి, బాబాయి!” అని ప్రత్యుత్థానంగా ఆహ్వానిస్తూ తండ్రికి అతని రాక తెలిపాడు.

“సత్యానందంగారు వచ్చారు.”

సుందరరావు అప్పుడేనా తాను చదువుతున్న ప్రజాశక్తి పత్రికలోంచి తల ఎత్తలేదు. కాని, కొడుకు మాట వినబడినందుకు గుర్తుగా ‘హు’ అని ముక్కేడు.

తనకు లభించగల స్వాగతం ఎలా వుంటుందో సత్యానందానికి తెలుసు. ఎరిగి వుండే వచ్చాడు. కనక కష్టం పెట్టుకోలేదు. పైగా డాక్టరు కొడుకు పిలిచాడు. మర్యాద చేస్తున్నాడు. చాలు. అదీ లేకపోయినా ఫర్వాలేదు. కనక తాత్సారం చేయకుండా తాను వచ్చిన పనికి ఉపోద్ఘాతం ప్రారంభించేడు.

“నిన్న రాత్రి మీ వూరేగింపు మా యింటి దగ్గర వుండగా జరిగిన సంఘటనకు నాకెంతో విచారంగా వుంది....”

పత్రికలోంచి తల ఎత్తకుండానే సుందరరావు గుర్రుమన్నాడు.

“మీ యింటి దగ్గర జరిగి వుండకపోతే విచారపడవలసి వుండేది కాదు.”

ఆ మాటలోని పొడుపును సత్యానందం గుర్తించదలచలేదు.

“సుందరరావుగారూ! ఆ ఘటన మనకెంత కష్టం కలిగించినా ఆవలి వ్యక్తినీ, దానికి వెనకనున్న....”

“కారణం నువ్వే గనక అనుభవించమంటావు” అన్నాడు, అర్ధోక్తిగా.

“….కధనూ మనం ఎరుగుదుం. ఆ రంగమ్మగారు చాల యోగ్యత గల మనిషియని మనం ఎరుగుదుం. అందుచేత, మనకి బాధ కలిగించినా పట్టించుకోకూడదంటాను. ఏమంటావు డాక్టర్‌!” అన్నాడు, సత్యానందం ఒక్క బిగిని. తండ్రి కొడుకులనిద్దర్నీ కలిపి.

“పాపం, కొడుకు పోయిన బాధలో ఆమెకు మతి పోయింది” అని రంగనాయకులు సానుభూతి ప్రకటించేడు.

సత్యానందం యిచ్చకాలాడుతుంటే తన కొడుకు తానతందాన అంటున్నాడనిపించి సుందరరావు పళ్లు నూరేడు. కాని యేమీ అనకుండా పత్రికలో తల దూర్చేశాడు.

ఆ విధంగా ఉపోద్ఘాతం ముగించి సత్యానందం ఇంక అసలు కధకు వచ్చాడు.

“నక్సలైట్లను అణచివెయ్యడం పేరుతో ఆంధ్ర ప్రభుత్వం శ్రీకాకుళం, ఖమ్మం జిల్లాలను నరకకూపం చేస్తూంది. పోలీసులూ, గ్రామ పెత్తందార్లూ 20 ఏళ్ళనాడు తెలుగుదేశం అంతటా సాగించిన దుర్ణయాలను ఇప్పుడా జిల్లాలలో సాగిస్తున్నారు. ఎవడి చేతనో “మావో కావాలి” అనిపించి, ఆ దురంతాలు  మిగతా జిల్లాలకి కూడా పాకిస్తే ఆశ్చర్యపడనక్కర్లేదు....”

సుందరరావు పత్రికలోంచి తల ఎత్తకుండానే తగిలించాడు.

“మన రాష్ట్రప్రభుత్వం కాంగ్రెసులో వచ్చిన చీలికలలో అభ్యుదయ పక్షానికి చెందిన వాళ్ళదేననుకొంటాను?”

నాలుక చివర వరకూ వచ్చిన ఎత్తిపొడుపు మాటను సత్యానందం అతి కష్టం మీద ఆపుకొన్నాడు.

“కాంగ్రెసులో ఏర్పడుతున్న పృధకీకరణం గురించి మన పార్టీలు రెంటికీ భిన్నాభిప్రాయాలున్నాయి. ఈనాడు ఆ సంస్థలో వస్తున్న చీలికలో దాని ప్రతిబింబం కనిపిస్తూందని మా అభిప్రాయం. మీరు....”

“మా అభిప్రాయాన్ని మేం చెప్పుకోగలం. ఆ శ్రమ నీకు వద్దు!....

“ఎందుకు చెప్పుకోలేరు? నాకా అనుమానం ఏమాత్రం లేదు. అయితే అధికారంలో వున్న కాంగ్రెసు ముఠాను సమర్థించే వాళ్ళంతా అభ్యుదయవాదులా? ఎవరి శాతం ఎంత?....అనే చర్చ ప్రస్తుతం కాదు. ఆ పార్టీ రాజకీయ నాయకత్వం గురించి మనకు భిన్నాభిప్రాయం వున్నా నక్సలైట్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ఇద్దరం వ్యతిరేకిస్తున్నాం....”

రంగనాయకులకు ఆ శబ్దం చాల చప్పగా వినిపించింది. వెంటనే “ఖండిస్తున్నాం” అన్నాడు.

“ఆ దురంతాలు కట్టిపెట్టేటట్లు ప్రచారం, ఆందోళన చెయ్యాలనేదీ మీ పార్టీ ఆశయమే.”

“మేం చేస్తూనే వున్నాం” అన్నాడు సుందరరావు.

“అందుకే మీ వద్దకు వచ్చాను. నవంబరు వారోత్సవంలో దీనిని ప్రధానంగా తీసుకు పని చెయ్యాలనీ, దానికి సాధ్యమైనంత వరకు అన్ని పార్టీలనూ కలుపుకొని, సాధ్యమైనంత హెచ్చుమందిలోకి దీనిని పాకించాలనీ నిశ్చయించుకొన్నాం. ఆ వుద్దేశంతోటే మీవద్దకొచ్చాను.”

“మీ ప్రయత్నం ఆలోచించవలసిందే” నన్నాడు రంగనాయకులు.

“అంతకంటె ముఖ్యంగా చేయవలసినవీ ఆలోచించవలసినవీ బోలెడు వున్నాయి” అన్నాడు సుందరరావు.

“తప్పకుండా. అవి ఆలోచించడం కోసం ఇద్దరికీ అంగీకారం వున్న యిల్లాంటి ముఖ్య అవసర విషయాన్ని వాయిదా వెయ్యవద్దు. ఏమంటావు, రంగనాయకులు!”

“నువ్వు బాతాఖానీకొచ్చేవా?....”

రంగనాయకుల్ని సంబోధించినందుకది హెచ్చరిక. సత్యానందం సర్దుకొన్నాడు.

“చెప్పండి.”

“పార్టీ తరపున పార్టీతో మాట్లాడదలచుకుంటే చెప్పవలసిందీ, చెయ్యవలసిందీ వేరు. కాక, వ్యక్తులతో కబుర్లు చెప్పిపోదలచుకొంటే, మంచిది. మీ మీటింగు ఆలోచన బాగుంది. కానివ్వండి....”

“మీరు మీ పార్టీ తరపున సభల ఏర్పాట్లలో కలిసి రావాలనే మా కోరిక.”

“అయితే అంతకు ముందు జరగవలసింది ఒకటుంది” అన్నాడు, సుందరరావు.

“సెలవివ్వండి.”

“నిన్న మా పార్టీ జెండాకు ఆ వెర్రిదాని చేత అవమానం చేయించేవు. దానికి క్షమార్పణ చెప్పుకుంటే తప్ప మీ పార్టీతో ఏ పనికీ కలియడం సాధ్యం కాదు.”

సత్యానందం తెల్లబోయేడు.

“నేను చేయించానా?”

“వందమంది చూసేరు.”

“నీ అభిప్రాయం కూడా అంతేనా? డాక్టర్‌!”

రంగనాయకులు సిగ్గుపడ్డాడు. తల తిప్పుకొన్నాడు. సత్యానందం తండ్రి కొడుకుల్ని మార్చి మార్చి చూసేడు.

“అది నా ఇంటి ముందు జరిగిందని తప్ప ఆ ఘటనతో నాకేమీ సంబంధం లేదు. నాకు సంబంధం లేని ఒక పని కోసం క్షమార్పణ చెప్పుకోవలసిన అవసరంలేదని నే వెళ్ళిపోవచ్చు. కాని, నా క్షమార్పణ ఒక ప్రజాకార్యం బాగుపడడానికి తోడ్పడితే ఆ మాట చెప్పడానికి నాకభ్యంతరం లేదు.”

సుందరరావు విజయం సాధించినట్లు, పరాజితుని వంక పురుగుని చూసినట్లు చూస్తూ చిరునవ్వు నవ్వేడు. రంగనాయకులు సిగ్గుతో ముణుచుకు పోతూంటే సత్యానందం క్షమార్పణ చెప్పుకొన్నాడు.

“ఆమె చేసిన తప్పుకు ఆమె తరపున నేనే క్షమార్పణ చెప్పుకుంటున్నా.”

“ఆమె మతిలేనిది. ఆమె నీ చేతి పనిముట్టు అయింది. తప్పు నీది. ఆమెను ప్రోత్సహించినందుకు, ఆమెచేత ఆ పాడు పని చేయించినందుకు నువ్వు బహిరంగ సభలో, నడివీధిలో క్షమార్పణ చెప్పాలి.”

ఈమారు పురుగును చూసినట్లు చూడడం వంతు సత్యానందానిది.

పన్నెండో ప్రకరణం

సత్యానందం వెళ్ళిపోయాక సుందరరావు నిస్తబ్ధుడుగా కూర్చున్న కొడుకు వంక తిరిగేడు.

“ఏమిటి నీ ధోరణి? ఖండిస్తున్నాం, అని అతగాడి మాటలకి తానతందాన మొదలెట్టేవు! కాలు తడి కాకుండా మెరక దారి చూసుకోవాలని బుద్ధి పుట్టిందేమిటి?”

పిరికితనం పేరెట్టి, వెక్కిరించి నోరు నొక్కేస్తే తప్ప పార్టీలో ఏకభావం నిలబెట్టలేమనే అభిప్రాయం సుందరరావుది.

కమ్యూనిస్టు పార్టీలో దుందుడుకు ధోరణుల్ని విమర్శించినవారికి పిరికితనం ఆరోపించి, నోరు నొక్కడం ఇరవయ్యేళ్ళ క్రితం బ్రహ్మాండంగా పని చేసింది. ఇప్పుడూ అదే పంధా.

అంతవరకూ మనస్సులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలన్నీ మెరక దారి ప్రసక్తి రాగానే ఇంకిపోయేయి.

“మనం కూడా....” అంటూ నత్తులు కొట్టేడు.

“ఔనోయ్‌....” అని సుందరరావు గర్జించేడు!

“మీరంతా అదృష్టవంతులురా. తినే దెబ్బలూ, పడే  జైళ్ళూ అవేవో మేము అనుభవించేశాము. ఒక్కొక్క పుస్తకానికి నానా మారాముళ్ళూ పడి తెచ్చి చదివేం. ఇప్పుడవేం మీకక్కర్లేదు. వో మారేనా లెనిన్‌ను చదివేరా? మాకు వంకలు పెట్టబోతున్నావూ? ఏమిటి, నీ – ‘మనం కూడా....?’ లెనిన్ ఏమన్నాడో తెలుసా? రాజకీయ, సాంఘిక, నైతిక పదజాలాలన్నింటి వెనకా, ప్రకటనలూ, వాగ్దానాలూ అన్నింటి వెనకా వర్గ ప్రయోజనాలు వుంటాయి. ఆ విషయాన్ని తెలుసుకోనంత కాలం ప్రజలు రాజకీయాల్లో మోసపోతారు. ఇది గతంలో జరిగింది. ఇక ముందూ జరుగుతుంది అన్నారు ఆయన. మరిచిపోకు.”

“వాళ్ళు తలపెట్టింది ప్రజాకార్యం. దానికే మనమూ....” అని నసిగేడు, రంగనాయకులు.

సుందరరావు నవ్వేడు.

“బాగుందయ్యా! ఒకే లక్ష్యం కోసం అని అందరూ చెప్తారు. కాని అనుసరించే పంధానుబట్టి లక్ష్యం స్వభావమే మారిపోతుంది. మరిచిపోకు. మనది విప్లవ పంధా. వాళ్ళది సంస్కారవాద పంధా. రివిజనిస్టు మార్గం. మనది కార్మిక మార్గం. వాళ్ళది బూర్జువా పంధా.”

అదేమిటో అర్థం కానట్లు రంగనాయకులు తండ్రి ముఖం వంక దేబెగా చూసేడు.

“రాజకీయాలను తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా పుచ్చుకుంటామంటే కుదరదు. ఒక చిన్న వూళ్ళో మనం తీసుకొనే ధోరణి పట్టి అంతర్జాతీయ రాజకీయాలదాకా మన అభిమానాలూ, తెలివీ తేలిపోతుంది.”

రంగనాయకులికి తండ్రి మనస్సు అర్థం అయింది. విప్లవం సమకూడాలంటే లెనిన్ మూడు జరగాలన్నాడు. శత్రుకూటం శైథిల్యం, ప్రజలలో విప్లవాభిముఖ్యం, వారిని నడపగల పార్టీ. మొదటి రెండూ సమకూడేయి. మూడోది గట్టిపరచుకోవాలి. ఆ ప్రయత్నం నాలుగైదేళ్ళుగా ఏకాగ్రతతో చేస్తున్నా తమ అడుగు ముందుకు పోవడం లేదు. పైగా కేరళలో తమ పార్టీ ఏకాకి అయింది. పశ్చిమ బెంగాల్‌లో అదే జరుగుతూంది. కారణం తమ ఆలోచనలలో లోపం వున్నదని రంగనాయకులు వూహ. మిగిలిన పార్టీలు అడ్డు వస్తున్నాయి. గనక వానిని పుటమార్చి, బలం తెచ్చుకొని, విప్లవం నడిపి, సోషలిజం....

తండ్రియందు ఎంత గౌరవం, ఆయన మాటయందు గురి, నాయకత్వంలో భక్తి భావం వున్న రంగనాయకులు అన్యాపదేశంగానైనా తన అభిప్రాయం సూచించకుండా వుండలేకపోయేడు.

“జనం అందర్నీ సమకూర్చాలని కదా ఆయన ప్రయత్నం....”

సుందరరావు కొడుకు అనుమానాల్ని అవహేళన చేసేడు.

“ఒరేయి రాజకీయాల్లో తల నెరిసిందిరా నాది. కుర్రనాగమ్మవు. ఒంటిమీద కంతి కొయ్యడం నేర్చుకున్నావు గాని, సమాజం కంతి కోసే పని మేము నేర్చాం. అందులో రాటుదేలాం. ఎవరెందుకు మాట్లాడుతున్నారో, మాకు అర్థం అవుతుంది. పద్మనాభం సిండికేట్ ముఠా గనక అధికారంలో వున్న కాంగ్రెసు ముఠా మీది కసికొద్దీ, ప్రభుత్వాన్ని పడతిట్టడానికి సభకి రావచ్చు. అధికార కాంగ్రెసు ముఠా అభ్యుదయవాదులుగా పోజు పెడుతున్నారుగా. అందుచేత విశ్వనాధం ‘నేనూ బండెద్దునే. నా ముడ్డికీ పేడరాయ’మని తయారవచ్చు. తప్పంతా పోలీసులదేనని తప్పుకోవచ్చు. కాని, ఈ దొంగల్ని మనం ఎలా కలుపుకు కూర్చుంటాం? ఇదేం విందుభోజనమా? రాజకీయాలురా అబ్బాయి! రాజకీయాలు!”

ఎన్నో చెప్పాలనుంది. కాని, రంగనాయకులకి మాట తొణకలేదు. సుందరరావు వదలలేదు.

‘వ్యక్తులుగా వస్తే వాళ్ళని తప్పక రమ్మందాం. మన వాళ్ళు ‘ప్రజాతంత్ర వాదుల్ని’ కలుపుకోమంటున్నారు. కాని అడ్డమైన ఆడవా పార్టీనీ బండిలోకి ఎక్కించుకోమనలేదు....”

డాక్టరు రంగనాయకులికి నోరు విడలేదు. లేచేడు....”సరే, కానీండి” అన్నాడు.

సుందరరావుకు అర్థం అయింది. తల పంకించేడు. కాని, ఆఖరి మాటగా మరో వాదం జతపరిచేడు.

“శత్రువును గాఢంగా ద్వేషించలేనివాడు మిత్రుణ్ని ప్రేమించనూలేడన్నాడు స్టాలిన్. వీళ్ళకి నక్సలైట్ల మీద నిజంగా అభిమానం వుంటే ఆ సభకి కాంగ్రెసు వాళ్ళని పిలుస్తామనరు.”

పదమూడో ప్రకరణం

“బెల్లం కాచే చెట్లు చూపిస్తానంటూంది, సాధన. వోమారు వాళ్ళ పొలం పోయివస్తామమ్మా!” అని రవీంద్ర తల్లి అనుజ్ఞ కోరుతూంటే వెనకనే వచ్చిన పిల్లలు పకపకా నవ్వుతున్నారు. జానకికీ నవ్వు వచ్చింది.

“బెల్లం చెట్లని కాయదోయ్, వీళ్ళు నిన్ను ఆట పట్టిస్తున్నారు.”

రవీంద్ర “వోహో, అల్లాగా”-అంటూ సాధన వేపు చూసి తల పంకించేడు. సాథన తన్ను కానట్లు నిర్లక్ష్యంగా వూరుకొంది. ఆమె పెదవుల వొంపులో చిరునవ్వూ, కళ్ళ మెరుపులో కొంటెతనం తొంగిచూడకుండ లేదు.

జానకికి అర్థం అయింది.

కొడుకు పుట్టింది లగాయతు బొంబాయి వదలకపోవడం చేత, అతనికి నిత్యావసర వస్తువులు చాలవాని స్వస్వరూప జ్ఞానం లేదు. కొబ్బరికాయ ఎలా వుంటుందనే విషయం పిల్లలతో వాదన వేసుకున్నాడు. సత్యానందం అటకమీది కాయ తీయించి, వలిపించి చూపితే తప్ప, అంతవరకూ  బోడకాయనే అసలు కొబ్బరికాయగా భావిస్తున్నట్లు అతనికి తెలియదు. అక్కడికీ అతనిని తాను ఎగ్జిబిషన్లకు తిప్పింది. సినీమాలలో చూపింది. పాఠాలు చెప్పింది. కాని, అతనికా చదువు చాలదు. ‘అన్నీ తిరిగి చూసిరావడం అవసరం’ అనుకొంది. కాని పొలాలు, తోటలు వెంట పంపితే ఏం ఆపదలు వస్తాయోననే భయం రెండోపక్క వుండనే వుంది.

“బొంబాయిలో లాగ సిమెంటు రోడ్లుండవు. బెడ్డలు కత్తుల్లా వుంటాయి. ముళ్లు. తోటలో నడుస్తూంటే పార్కులో తిరిగినట్లుంటుందనుకుంటున్నావేమో. గట్టున పోతుంటే చిత్రమూలం, ఉత్తరేణివెన్నులు బట్టలు దూసుకొని వదలవు.”

ఆ ఇబ్బందుల మాట విన్నాక రవీంద్రకు అదేమిటో చూడాలిసిందేననిపించింది.

“బూట్లు వేసుకు వెడతాలే” అన్నాడు.

సాధన అభ్యంతరం చెప్పింది. రెండుచోట్ల పంటబోదెలు తగులుతాయి. బూట్లు విప్పడం, తొడగడం పెద్ద బెడద. పైగా కాలికి ఏ బురదన్నా పట్టుకొంటే అవి చేతపట్టుకు నడవాలి. మామూలు ఆకుజోడు వేసుకోమంది.

అతడు లోనికి వెళ్ళి దుస్తులు మార్చుకు వచ్చేలోపున, అతని కూడా వెడుతున్న చిన్నపిల్లలకి జానకి పదిమాట్లు జాగ్రత్త చెప్పింది.

“నూతి దగ్గరకు వెళ్ళనీయకండి. ఎరగక తొంగి చూస్తాడు. తూలిపోతే ప్రమాదం. పంట కాలవల దగ్గర జాగ్రత్త.”

“అలాగే అత్తయ్యా!” అని సాధన హామీ యిచ్చింది.

తనకంటె చిన్నపిల్లలకి తన రక్షణ భారం వప్పచెపుతూంటే రవీంద్రకి అభిమానమే కలిగింది.

“ఏమిటమ్మా! నువ్వు మరీను.”

అతని అభిమానం చూస్తే తన తెలివితక్కువతనానికి జానకికి నవ్వు వచ్చింది.

వెళ్ళి రమ్మంది.

కాని వాళ్ళు తీరా వెళ్ళేక అన్నీ భయాలు. ఒకటే దిగులు.

“పట్టణంలో కార్లూ, ప్రమాదాలూ భయం వుంది వాడు చెప్పినట్లు. కాని, అవి మనం ఎరిగిన నిత్యభయాలు. వానికి మనస్సు అలవాటు పడిపోయింది. కాని మోకాలులోతు మించని పంటబోదె, దాని మీద వేసిన తాటిపట్టె ఒంటిబద్ద పెద్ద భయం. ఏమంటే వాడు ఎరగనిది...” అంటూ జానకి తన భయానికి కారణ కల్పన ప్రారంభించింది.

“కొడుకుని చంకదింపడంలేదు. జాగ్రత్త.” అని అప్పుడే రెండు మాట్లు వేళాకోళం చేసిన భద్ర ఆమె ఆరాటం చూసి జాలిపడింది.

“మరెందుకు వెళ్ళనిచ్చేవు. ఆనక మీ బావగారితో వెళ్ళునుకదా!”

అంతలో మళ్ళీ దిలాసా ఇచ్చింది.

“ఫర్వాలేదులే. అనూరాధ అల్లరిబాజాయే గాని, సాధన అల్లా కాదు. ఏం భయం లేదు.”

“వాడికి తెలుగుదేశం తెలియదు. తనవాళ్ళనెవరినీ ఎరగడు. అదివరకీ ఇరవయ్యేళ్ళలో బొంబాయి పరాయిదేశం అనిపించలేదు. కాని ఫిబ్రవరిలో శివసేన వాళ్ళ అల్లర్లూ, ఆ ప్రభుత్వం వాటిని సాగనిచ్చిన తీరూ చూశాక వాడి మాట ఏమిటనిపించింది.....”

“పత్రికల్లో చదివేంగాని….అదీగాక అదేదో బెల్గాం గురించిన పేచీ అనుకున్నామే….” అని భద్ర ఆశ్చర్యపడింది.

“అది పైకి చెప్పేది. అసలది ప్రజాతంత్ర వుద్యమాల్నీ, ప్రజా వుద్యమాల్నీ బద్దలుకొట్టడానికి పుట్టింది….”

“మన తెలంగాణా….”

“అబ్బెబ్బే! వాటికి పోలికలేదు. ఇది గ్రామపెత్తందార్లు కట్టిన ముఠాలాంటిది. కాని, అది ఒక ఫాసిస్టు సంస్థ.”

ఇద్దరూ ఒకనిముషం వూరుకున్నారు. జానకే మళ్ళీ ప్రారంభించింది.

“అప్పటినుంచీ వాడిని మన ప్రాంతం తీసుకురావాలని ఆలోచన. ఇక్కడున్న బంధువులు మాత్రం ఎవరు? ఒక్క మీరు. మీకు పరిచయం చేయాలి. నేను లేకపోయినా వాడు అగతికుడు కాకూడదు.”

భద్ర కోప్పడింది.

“నువ్వు లేకపోవడం ఎందుకు రావాలి. పాడు మాటలూ నువ్వూను”

జానకి మ్లానహాసం చేసింది.

“ఏం ఓఘాయిత్యమా?”

“వయస్సు మీరిపోయిందా? ముసలి కబుర్లూ నువ్వూను. వట్టినే కూర్చుంటే దిక్కుమాలిన ఆలోచనలన్నీ వస్తాయి. పో. వోమారు వీధిలోకి వెళ్ళి నలుగురినీ పలకరించిరా. అవతల వీధిలోనే కదా మీ అన్నయ్యగారిల్లు. వోమారు చూసి పలకరించిరా. బాగుండదు!”

“ఎవరికి?” అంది జానకి ఎకసక్కెంగా, అయిష్టం కనబరుస్తూ.

“ఏమిటే ఆ ప్రశ్న.”

“ఔనమ్మా! మేమిద్దరం ఓ తల్లిబిడ్డలం అంటారు. కానీ మామధ్య ఆ ప్రేమా, పేగూ లేదు. బహుశా వో చెల్లెలు వున్నదనే గుర్తే వాడికి వుంటుందనుకోను. ఇంక బాగుండనిదెవరికి? లోకానికా? చూద్దాంలే. లోకం కోసమే అయితే అంత ఈపూటే వెళ్ళడం అనవసరం.”

భద్ర ఏమీ అనలేదు. కాని ఆ సమాధానం ఆమెకు నచ్చలేదని ముఖమే చెప్తూంది.

“సడే, సంబడం. వంటపని చూసుకొందాం, రా. పిల్లలొచ్చే వేళకి అవాలి.”

పద్నాలుగో ప్రకరణం

సాధనతో ఏవేవో కబుర్లు ఆవేశంగా చెప్తూ వీధివెంట పోతున్న రవీంద్ర చాలమంది దృష్టినే ఆకర్షించేడు. పైజామా, లాల్చీలో మంచి ఆరోగ్యంగా వున్న ఎత్తైన విగ్రహం. తెలుగు, హిందీ, ఇంగ్లీషు వాళ్ళకి తెలియని మరేదో భాషాపదాలు మాటలలో దొర్లిపోతున్నాయి. అతని రెండుచేతులూ చెరోవైపునా పట్టుకొని మీనా, అనూరాధా సగర్వంగా నడుస్తున్నారు. అతనిని చూడగనే ప్రకాశమ్మ, భాగ్యమ్మ, బంగారమ్మలంతా వెనుతిరిగి చూసేరు. ఇతడెవరా అనుకొన్నారు. ఆ ఆలోచనకు సమాధానం దొరకక, సరాసరి సాధననే అడిగేద్దామనుకొనేసరికి వాళ్ళు దాటిపోతున్నారు.

ఆ ఆందోళనను రవీంద్ర గ్రహించలేదు. కాని, సాధన గ్రహించింది. గ్రహించినా, ఏమీ ఎరగనట్లే, రవీంద్రతో సంభాషణలో మునిగివున్నట్లే నడిచిపోతూంది.

రోడ్డు ఎక్కుతూంటే, కాఫీ హోటలు గుమ్మాలు దిగి తమవేపే వస్తున్న పద్మనాభం కనిపించేడు. సాధన నెమ్మది స్వరంలో రవీంద్రను హెచ్చరించింది.

“మీ అంకుల్.”

రవీంద్రకు ఆ బాంధవ్యం అర్థం కాలేదు. తన తండ్రికి తమ్ముళ్ళున్నారని తల్లి చెప్పింది. తనకూ ఒక అన్న వున్నాడని చెప్పింది. అయితే అతడెవ్వరినీ చూడలేదు. కనక ఈ ఇంగ్లీషు భాషా బంధుత్వ పదం- 'అంకుల్ ' ఎవరికి వర్తిస్తుందో? అడిగి తెలుసుకొనేందుకు వ్యవధి లేదు.

“వో” అని మాత్రం వూరుకొన్నాడు.

పద్మనాభం దగ్గరకు వచ్చేసేడనేగాదు. అంతకన్న తన మాటను వివరించవలసి వుండవచ్చని కూడా సాధనకి తోచలేదు.

మీనాక్షి చిన్నపిల్లల వుబలాటం చూపుతూ – ‘పద్మనాభం మామయ్య’ అని కేకపెట్టి, చనువుగా చెయ్యి పట్టుకొంది.

“ఇల్లా ఎక్కడికే పొద్దుటే బయలుదేరేరు?” అని అడుగుతూ పద్మనాభం అందరి ముఖాలూ చూసేడు. వాళ్ళతోవున్న రవీంద్రను ఎవరా- అనుకొన్నాడు. అనుకోవడం, అడగడం ఒక్కమారే జరిగిపోయాయి.

“ఎవరి అబ్బాయే.”- అని సాధనను అడిగేడు. ఆమె చెప్పేలోపున సరాసరి రవీంద్రనే అడిగేసేడు.

“ఏ వూరు నాయనా! మీది?”

ఆ హటాత్ప్రశ్నకు రవీంద్ర సిధ్ధంగా లేడు. కంగారుపడ్డాడు. బొంబాయిలో ఆ మాదిరి ప్రశ్న వస్తే ‘ఆంధ్ర’ అనో, ‘రాజమండ్రీ’ అనో చెప్పినవాడే. ఈమారు తడుముకోకుండా ‘బాంబే’ అన్నాడు.

“జానకి అత్తయ్య కొడుకు” - అని సాధన తనవంతు ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. జానకి అత్తయ్య యెవరో యెరగనని చెప్పడానికి పద్మనాభం సంకోచించలేదు.

“నేనెరగని జానకి అత్తయ్య యెవరే నీకు బొంబాయిలో”-అన్నాడు గద్దింపుగా.

ఈమారు సాధన తెలివిగా ఆ అత్తయ్య యెవరో చెప్పింది. అయితే చెప్పినతీరు మాత్రం వేరు.

“మీ మామయ్య ఈయన. మీ అమ్మకి అన్నయ్య”-అని రవీంద్రకు పరిచయం చేసింది.

రవీంద్ర వెంటనే చేతులు జోడించి ‘నమస్కారం’ అన్నాడు.

ఆ సమాచారానికి పద్మనాభం విస్తుపోయేడు. అతడు తనకో చెల్లెలు వున్నదన్న విషయాన్ని మరచేపోయేడని చెప్పవచ్చు. బాలవితంతువైవుండి మళ్ళీ పెళ్ళి చేసుకోవడం తమ కుటుంబ పరిశుద్ధతకు పెద్ద మచ్చ తేవడమేనని అతని భావం. వీరేశలింగం పంతులుగారి సంస్కారోద్యమం ఫలితంగా దేశంలో వితంతు వివాహాలంటే వ్యతిరేకత తగ్గినా, అది తమ అగ్రహారంలోకి అంతవరకు ప్రవేశించలేదు.

పైగా, చేసుకొంటూ కమ్యూనిస్టు విశ్వాన్ని చేసుకోడం తన రాజకీయ విశ్వాసాల్ని అవమానించడంగా భావించేడు.

జానకి పెళ్ళికాగానే ఇల్లు మాత్రం అన్నకు వ్రాసి యిచ్చేసి, భూమి అయిదెకరాలూ అమ్మేసుకొని భర్తతో వెళ్ళిపోయింది. అంతవరకూ తనకు ఆధారంగావున్న ఆ భూమిని అమ్ముకోవడం పద్మనాభానికి నచ్చలేదు. తిట్టేడు. మొగుడు యావలోపడి గొంతు కోసుకొంటున్నదన్నాడు. ఆ భూమికోసమే విశ్వం ఆమెను పెళ్ళి చేసుకొంటూన్నాడు-అన్నాడు.

“ఈ డబ్బు నలుగురు కామ్రేడ్సూ మార్చుకు తినేస్తారు. తర్వాత ఫోవే ముండా అంటారు. దీనిపని వపనమే”-అంటూ పద్మనాభం ఆ శబ్దార్థం కోసం బాధపడనక్కర్లేకుండా, యెడమ అరచేతిలో కుడిచేతి చూపుడువేలు అటూ ఇటూ తిరగేసి రుద్దుతూ, చిటికెలు వేసేడు. అప్పటికీ దానిని కత్తి నూరడంగా అర్థం చేసుకోలేకపోతారేమోనని నిఘంటువు చదివేడు.

“వపనం క్షౌరముచ్యతే.”

కాని జానకి తిట్లనూ, శాపాలు, బెదిరింపులనూ లెక్కచేయలేదు.

ఇంక పద్మనాభం చెల్లెలిపేరు తనవద్ద వినపడరాదని ప్రతిఙ్ఞ చేశాడు. ఇంచుమించు ఆమాట నిలబెట్టుకున్నాడు.

ఆ నవదంపతులు వూరు వదిలిపోయేరన్నారు. కొంతకాలానికి అతనిని బొంబాయిలో పట్టుకొని పోలీసులు చంపేశారన్నారు. అయినా అతడు విచారపడలేదు.చెల్లెలు ఏమయింది? ఏం చేస్తూందని కనుక్కోనూలేదు.

ఈవేళ హఠాత్తుగా ఆ చెల్లెలి కొడుకు- ఇరవయ్యేళ్ళవాడు కట్టెదట నిలచి నమస్కరిస్తున్నాడు. ఆ నమస్కారం స్వీకరించాలన్న ఆలోచన కూడా తోచలేదు. ఆశ్చర్యంతో, మాటరాక నోరు తెరిచేడు.

‘జానకి….’

అతడాశ్చర్యం నుంచి తేరుకునేలోపునే సాధన ముందుకు అడుగువేసింది.

“మళ్ళీ కనిపిస్తాడు. తోటలోకి బయలుదేరాం. పొద్దు పోతుంది.”

రవీంద్ర మర్యాద తప్పకుండా సెలవు చెప్పుకొని మరి కదిలేడు.

పదిహేనో ప్రకరణం

పొలానికని బయలుదేరిన మగడు అంత త్వరగా ఇంటికి రావడం చూసి కనకరత్నమ్మ–“ఏమన్నా మరచిపోయారా?” అనడిగింది.

కాని పద్మనాభం ఏమీ అనలేదు. గదివేపు తిరగబోయిన వాడల్లా మనసు మార్చుకొని పెరట్లోకి నడిచేడు. తులసికోట పక్కద్వారం తెరుచుకొని వెనక పెరట్లోకి వెళ్ళేడు.

అక్కడ పెద్ద వుసిరిచెట్టు బాగా విస్తరించినది వుంది. దాని మొదట్లో చుట్టూ విశాలమైన అరుగు. తిన్నగా వెళ్ళి దానిమీద గుడ్డపరచుకు కూర్చున్నాడు.

స్నేహితులతో తరచువేసే పేకాటకు ఇమ్ముగా వుంటుందని వేసిన అరుగు అది. శుభ్రంగా మెత్తి, అలికి, ముగ్గులు పెట్టి వుంది.

పద్మనాభం అక్కడే వొరిగాడు. చెట్టునిండా వుసిరికాయలు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతున్నాయి. ఇదివరకెప్పుడూ అనిపించలేదుగాని, ఆ క్షణంలో ఆ చెట్టువేసింది జానకే అని గుర్తు వచ్చింది. క్షీరాబ్ది ద్వాదశినాడు పూజకోసం తెచ్చిన కొమ్మని నీరు తగిలేచోట గుచ్చింది. ఆ కొమ్మ వేళ్ళు పెట్టి చిగిర్చింది. ఈవేళ అది బాగా పెరిగి ఒక మహావృక్షం అయింది. ఆ మాట అతనికిదివరకెన్నడూ తట్టలేదు. కాని ఈవేళ తోచింది. అది జానకి వేసిన చెట్టు.

ఆ చెట్టు వేసిన జానకి వూళ్ళోకి వచ్చింది. కాని ఆ యింటికి రాలేదు. వచ్చివుంటే ఏం చేసేవాడు? తప్పకుండా తిట్టి, పొమ్మని, తలుపులు వేసుకొని వుండేవాడు. కాని, అతనికి ఆమె ఆ అవకాశం ఇవ్వలేదు. రాలేదు. అల్లా రాకపోవడం అభిమానం అనిపిస్తూంది.

కనకరత్నం దొడ్డి గుమ్మంలోంచి తొంగిచూసింది. ఆమె మొదట వూహించినట్టు భర్తతో మిత్రకూటం రాలేదు. అయితే మగడు చెట్టు క్రింద ఏం చేస్తున్నట్టు? వచ్చి చూసింది. అతడొక్కడే వున్నాడు. పడుకొని వున్నాడు.

“ఏమిటలా పడుకొన్నారేం?”-అంటూ ఆమె పెరట్లోకి అడుగు పెట్టింది.

పద్మనాభం పడుకున్నవాడు తల యెత్తేడు.

“ఏం లేదుగాని, ఇల్లారా. ”

ఆమె సమీపించింది.

“కూర్చో….”

“వంటింట్లో బోలెడు పనుంది. కూర్చుంటే ఎల్లాగ?”-అంటూనే అతనికి అంత దూరంలో అరుగును ఆనుకుని కూర్చుంది.

ఆమెకు దగ్గరగా వుండడానికి పద్మనాభం లేచి కూర్చున్నాడు.

“అంత దూరం ఏమిటి? ఇల్లా దగ్గరగా రా.”

“చెప్పండి, ఏమిటో.”- అంటూ కనకరత్నం దగ్గరగా జరిగింది.

“పిల్లలు ఏం గొడవ చేస్తున్నారో.”-అని తొందర చేసింది.

“మా జానకి వూళ్ళోకి వచ్చిందట.”

“మీ జానకి యెవరు?”....

అతడు చెప్పలేకపోయేడు. ఎప్పుడన్నా చెల్లెలు ప్రసక్తి వస్తే పళ్ళు పటపటలాడించిన తాను అనుకోకుండా ‘మా జానకి’ అనేశాడు. కాని ఆ ‘మా’ తన చెల్లెలేనని చెప్పలేకపోయాడు.

ఈ దారి ఎక్కడికి? (రధచక్రాలు - ఉత్తరగాధ) · 第 2 / 15 段