“ఆయన పోయేరు. ఆయన తమ్ముడు ఒకడు కథలూ అవీ వ్రాస్తుంటాడు. జనసంఘం

ఈ దారి ఎక్కడికి?

(రధచక్రాలు - ఉత్తరగాధ)

మహీధర రామమోహనరావు

అవంతి ప్రచురణలు

ప్రజాశక్తి నగర్, విజయవాడ - 10

హృదయవేదన

నా రధచక్రాలు నవలకిది ఉత్తరకధ. ఇరవయి రెండేళ్ల అనంతరపు 1969 నవంబరు ఘటనలు ఇందులోని కధావస్తువు.

“మన తెలుగుదేశంలో జాతీయోద్యమాన్ని మూలమూలలకంటా తీసుకుపోవటంలో కాంగ్రెసు అసామాన్య కృషి చేసింది. రాజకీయవిజ్ఞానాన్నీ, త్యాగనిరతినీ ప్రజాసామాన్యంలోకి పాకించడంలో కమ్యూనిస్టుపార్టీ అసాధారణ కృషి చేసింది. ఈ పార్టీల కృషిని గుర్తించగలిగినప్పుడే ఆనాటి తెలుగు దేశం మనకర్ధం అవుతుంది.”

“1946 చివరి భాగం నాటి తెలుగుదేశం నా నవలకు పూర్వరంగం. మన తెలుగుదేశపు ప్రజావుద్యమాల అభివృద్ధిలో అది ఒక సంధియుగం.”

“అటుతర్వాత తెలుగుదేశంలో జరిగిన ఘటనలకు నాంది ఆ రోజుల్లోనే జరిగింది.”

రధచక్రాలు పీఠికలోని వాక్యాలివి. ఆ నవల ఉత్తరకధగా వ్రాసిన “ఈదారి ఎక్కడికి?” ఆనాటి మహోద్యమాలలో వచ్చిన విశీర్ణతను దీగ్భ్రమతో నెమరువేస్తూంది. ఈ విశీర్ణతకు కూడా బీజాలు ఆ నవలలోనే చిత్రించబడడం చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. సామాజిక వాస్తవికతాచిత్రణకది గీటు!

ఇందులోని ప్రశ్న - ఈ విశీర్ణతకు తప్పెవరిదనేది కాదు. అది ఎందుకొచ్చిందనీ కాదు. విశీర్ణత చారిత్రక సత్యం.

దీనినింకా ఎంత దూరం కొనసాగనివ్వాలనేదే ప్రశ్న.

ఇంకెంత దూ….రం….?

మహీధర

1-1-72

మద్రాసు

పూజ్యమిత్రులు

“చంద్రం” గారికి

మొదటి భాగం

ఒకటో ప్రకరణం

“అగ్రహారం. దిగేవారు ఎవరో దిగండి.” కండక్టరు కేక విని జానకి ఉలికిపడింది. వెనక చక్రాల్ని ఈడ్చుకుంటూ బస్సు ఒక్క వూపులో నిలబడింది.

“వేగం దిగాలి” అన్నాడు కండక్టరు.

ఈమారు అతని కంఠంలో దాష్టీకం వినబడింది. బండి కుదుపుకు తూలిపోతూనే జానకి లేచి నిలబడింది.

“పైన బెడ్డింగు వుంది, దింపు” అంటూ పురమాయించి, కొడుకు వెంటరాగా బస్సు దిగింది.

అప్పటికే కండక్టరు పైకెక్కాడు. “ఇదేనా చూసుకోండి” అంటూనే సమాధానం కోసం కూడా ఆగకుండా “అందుకోరా-“ అని క్రిందనున్న కుర్రవానికి అందించేడు. తాను దిగి వచ్చేశాడు.

‘మాదే’ నన్న మాట రవీంద్ర నోట వుండగనే ‘అది మీదే’నని భరోసా ఇచ్చేడు.

బస్సు కదిలిపోయింది.

“యారింటికి ఎల్తారండి?” అని అడుగుతున్నాడు, బెడ్డింగు అందుకొని కింద పెట్టిన కుర్రాడు.

తాను దిగవలసిన చోటు అదేనా అన్నట్లు జానకి దిక్కులు చూస్తూంది. గోదావరి వంతెన దాటి బస్సు వస్తూంటే, రోడ్డు ప్రక్కనున్న ఒకటో, రెండో చెట్లూ, మురుగు కోడు మీద వంతెనా లాంటివి ఆ మసక వెలుతురులో ఏవేవో పూర్వపు జ్ఞాపకాల్ని కెర్లించినట్లు తోచింది. కాని, ఇక్కడ అటువంటిది ఏమీ కనబడ్డం లేదు. ఈ దీపాలన్నీ వెలుగుతూంటే ఆ ప్రదేశం అంతా పట్టపగలులా వుంది కూడానూ!

“ఏమిటల్లా చూస్తున్నావు?” అన్నాడు రవీంద్ర.

“నేను ఎరిగిన చోటు కాదిది” అంది జానకి.

ఆమె ఆ రూపంలో ఆ రోడ్డును ఎరగదు. ఈ వేళప్పటికి ఆ ప్రాంతమంతా నిర్జనంగా వుండేది. ఓ దుకాణం, ఓ దీపం వుండేది కాదు. అల్లాంటిది బస్సువాడు కలకలలాడుతూ మంచి సందడిగా వున్న బజారులో కాఫీ హోటలుకెదురుగా, ఇదే అగ్రహారం అని దింపిపోయేడు. కాఫీ హోటళ్ళు, సోడా దుకాణాలు, సైకిలు షాపులు, పళ్ళషాపులు, బట్టల షాపులు, సెలూన్లు, చిల్లరకొట్లు నియాన్ లైట్ల వెలుతురులో మెరిసిపోతున్నాయి. రోడ్డంతా పట్టపగలులా వుంది. జనం గుంపులు గుంపులుగా వున్నారు. ఆమెకు దిగ్భ్రమగా వుంది.

“మనం దిగవలసింది ఇక్కడేనా? పొరపాటున బస్సువాడు మరో చోట దింపలేదుగద” అంది ఇంగ్లీషులో.

“కనుక్కుంటా వుండు” అని రవీంద్ర కాఫీ హోటలు గుమ్మంలో కిళ్ళీషాపు ముందు నిలబడి వున్నవారి వేపు వెళ్ళాడు. వారూ అతని రాక కోసం ఎదురు చూస్తూన్నట్లు తమ సంభాషణ ఆపేరు. బస్సు రావడం, పోవడం వారి ఏకాగ్రతకు భంగం కలిగించలేదు గాని, ఒక స్త్రీ కంఠంలో ఇంగ్లీషు వినబడి వారు తిరగబడి చూశారు.

“అగ్రహారం ఇదేనాండి?” అన్నాడు రవీంద్ర వారి దగ్గరగా అడుగు వేసి.

ఆపాటి ప్రశ్న నన్నడిగితే చెప్పనా అన్నట్లు కూలి కుర్రాడు ఎదురు ప్రశ్న వేశాడు,

“యారింటికెళ్ళాలండి?”

“సత్యానందం గారింటికి” అంది జానకి.

“పావలా ఇవ్వండి, నడండి” అంటూ వాడు బెడ్డింగు భుజానికెత్తుకున్నాడు.

రవీంద్ర పలకరించిన ఆయన జానకి సమాధానం విని ఒక అడుగు ఇవతలికి వేశాడు.

“అగ్రహారం ఇదేనమ్మా” అంటూ కూలి కుర్రాడికి ఎక్కడికి వెళ్లాలో చెప్పేడు. ‘సోమన్నా! తెలుసట్రా, ప్రెసిడెంటుగారు గుడివీధిలో క్రొత్తగా కట్టిన మేడ.’

అంతలో మళ్ళీ – “రిక్షాలో వెళ్ళండి. చీకటి, ఇబ్బంది పడతారేమో” అని సలహా యిచ్చేడు.

“సత్యానందంగోరి ఇల్లు నేను ఎరక్కపోడమేటండి” అంటూ జానకికి రిక్షాలో వెళ్ళడం అనవసర శ్రమ అని చెప్పేడు సోమన్న.

“రాజవీధిలోకి మళ్ళి పది అడుగులు వేస్తే గుడి వీదండి. రిక్షా ఎక్కి దిగినంత సేపు పట్టదండి.”

అంత దగ్గరలో వున్నదని చెప్పినందుకు తన కూలి నిరుకు చేసుకోడం అవసరం అనిపించి ‘పావలా ఇప్పించండి’ అన్నాడు.

ఆ గ్రామస్థుణ్ణి జానకి గుర్తుపట్టింది. ధైర్యం కలిగింది. తనను బస్సువాడు దింపింది, అగ్రహారంలోనే.

ఆయన మాత్రం జానకిని గుర్తు పట్టలేదు. ‘ఇల్లు దగ్గరేనమ్మా!’ అని ఆమెకు ధైర్యం చెప్పి, ఎరగని వాళ్ళను చేసి, హెచ్చు కూలి అడుగుతున్నందుకు సోమన్నని కోప్పడ్డాడు.

“కొత్తవాళ్ళని బురిడి కొట్టించకూడదు. పది పైసలు ఇస్తారు తీసుకెళ్ళు.”

సోమన్నకి కోపం వచ్చింది.

“మా బాబుల్నాడు ఈ బస్సులు వున్నయ్యేటండి” అన్నాడు.

ఆయన నవ్వేడు.

“లేవురా. ఇప్పుడున్నాయి గనకనే ఈ పదిపైసలూ వస్తున్నాయి. వెళ్ళు తీసుకెళ్ళు” అని ఆయన మిత్రబృందం వేపు అడుగు వేసేడు.

సోమన్న వెనక రాజవీధిలోకి మళ్ళుతున్న జానకికి వెనక నుంచి వారంతా తనను గురించే మాట్లాడుకోడం వినిపిస్తూంది.

“ఎవరామెట?”

“సత్యానందం ఇంటికిట. ఎవరో భద్రమ్మగారి బంధువులై వుంటారు” అంటున్నాడు, తమకు ధైర్యం చెప్పిన ఆయన.

“ఎక్కడో చూసిన మొహంలా వుంది” అంటున్నాడు మరొకడు.

రెండో ప్రకరణం

“ఆయన వెంకటనరసయ్యగారు కాదూ?” అంది జానకి తన అభిప్రాయాన్ని పరీక్షించుకొంటున్నట్లు.

సోమన్న ఇంకా కోపంలోంచి తేరుకోలేదు.

“ఆఁ ఆరె! ఎరువులూ, సిమెంటూ బ్లాకులో అమ్మి పది పన్నెండెకరాలు కొన్నారు. డబ్బు మూలుగుతోంది.”

“అలాగా!” అంది జానకి.

“బాబుల్నాడు ఎరుగుదురా అంట. బాబులు! పణసదార కిలో మూడు రూపాయలూ, నాల్రూపాయలూ ఎవరి బాబుల్నాడు అమ్మేరంట? కానీ ఇస్తే బెల్లం పట్టెడు ముక్క ఇచ్చేవోరంటుంది మా యమ్మ. ఇప్పుడు ఆపాటి ముక్క పావుకిలో అని అర్ధరూపాయి వూడగొడుతున్నారు. బియ్యం కిలో రూపాయి పావలా ఎవరి బాబులు ఎరుగుదురో....కూలాడి దగ్గరికొచ్చేతలికి పావలా కూలి బాబుల్నాడు నేదని గేపకం.”

“అల్లాగే. పావలా ఇస్తానులే” అని జానకి వానికి తృప్తి కలిగించింది....

నడుస్తున్న వీధి నిర్మానుష్యంగా వుంది. తలుపులు తెరిచే వున్నాయి, ఇళ్ళకి. సావిళ్ళలోంచి రేడియోలో తెలుగు వార్తలు వెంటాడుతున్నాయి. కాని, ఎక్కడా మనుష్య సంచారం వున్నట్టు లేదు.

“ఏడుగంటల వార్తలు వస్తున్నాయి. ఎక్కడా మనిషి పొడ కనబడదేమిటమ్మా!” అంటూ రవీంద్ర తల్లిని ఆశ్చర్యంగా ప్రశ్నించేడు.

“పల్లెటూళ్ళంటే ఏమిటనుకొన్నావు?” అంది జానకి. అంతలో పల్లెటూరి అలవాట్లు గుర్తొచ్చాయి.

“భోజనాల వేళ, అంతా యిళ్ళలో వుండి వుంటారు.”

“అప్పుడేనా భోజనాలు?”

“బొంబాయిలాంటి పట్టణాల్లో అలవాట్లు వేరు. ఇక్కడ ఇంతే.”

“అమ్మో!” అన్నాడు రవీంద్ర. నెల్లాళ్ళు వుండాలని వచ్చిన వుత్సాహం బస్సు దగేసరికే హరించుకుపోయినట్లనిపించింది. జానకి నవ్వింది.

“ఇంకా వూళ్ళో అడుగేనా పెట్టకుండానే వెళ్ళిపోదామనేలా వున్నావే.”

తల్లి నవ్వుతూంటే, రవీంద్రా నవ్వేడు. వారి సంభాషణ వింటున్న సోమన్న – “తమరు బొంబాయి నుంచి వొత్తున్నారాండీ” అన్నాడు.

పరిసరాలూ, ఇళ్ళూ గుర్తు చేసుకొంటున్న జానకి ఏమీ సమాధానం ఇవ్వలేదు ఆ మాటకి.

“ఈ ఇల్లు....”

“డాకటేరుగారిదండి” అని సోమన్న ఆమె వాక్యం పూర్తి చేశాడు.

“సుందరరావుగారు బాగున్నారా?”

“డాకటరుగారి తండ్రిగారాండి?” అని సోమన్న ప్రశ్న.

“బావున్నారండి, ఆరికేమండి.”

జానకి సుందరరావును డాక్టరుగా ఎరుగును. సోమన్న మాట వింటే మరొకరెవరో డాక్టరన్నట్లుంది.

“మరి డాక్టరెవరు?”

“రంగనాయకులు గారండి. మంచి చెయ్యండి.”

“ఎవరు రంగనాయకులా?” అంది జానకి ఆశ్చర్యంగా. ‘అంతవాడయ్యాడన్న మాట.’ అనుకొంది, అర్థస్వగతంగా.

సోమన్న హూషారుగా చెప్పుకుపోయేడు.

“మీరు బస్సు దిగినకాడికి కూంత అసింటా వుందండి ఆసుపిటలు. మంచి బాబు! కూలోడు, బీదోడు అంటే ఉట్టినే మందిస్తారండి. ఇంజీషన్లూ అవీ మన్ని తెచ్చుకోమంటారండి....” హఠాత్తుగా వానికి తమ డాక్టరుగారిని జానకి ఏకవచనంలో పేర్కొందనీ, అంతవాడు అయ్యాడా అన్నదనీ జ్ఞాపకం వచ్చింది.

“తవరిది ఈ యూరేనాటండి.”

అనాలోచితంగా జానకి అనేసింది.

“ఆ. ఎప్పుడో, బతికున్న రోజుల్లో.”

అంతలో ఆమెకే అనుమానం కలిగింది. ఆ వుళ్ళో తాను బ్రతికినదీ ఒక బ్రతుకేనా అనిపించింది.

మాట మారుస్తూ “ఇదే కదూ గుడివీధి!” అంది.

“ఔనండి. ఆ కనపడేదేనండి సత్యానందం గారిల్లు.”

తాము ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చినవారిల్లు అదే అనేసరికి రవీంద్ర వుత్సుకత చూపుతూ ‘ఏదీ?’ అన్నాడు. ఆ చీకట్లో సోమన్న చూపిన ఇల్లేదో అతడికి తెలియలేదు.

“మిద్దెమీద లైట్లున్న ఇల్లండి. అదే ఆ లైటు స్తంబం అగతలండి.”

మూడో ప్రకరణం

ఇంటి గేటు ముందు జానకి చటుక్కున నిలబడింది. తాను ఎరిగిన ఇల్లు కాదది. అప్పుడు ఇల్లు వీధి మీదికే వుండేది. పూర్వకాలపు మండువా పెంకుటిల్లు. పెద్ద ఎత్తు అరుగులూ అదీ. ఇప్పుడు ఆ వెనకటి చిన్నెలే లేవు. దానిని పూర్తిగా తీసేసి కొంత ముందు జాగా వదిలి లోపలగా కట్టేరు. చుట్టూ ప్రహరీ. ఇంటికీ ప్రహరీకీ మధ్య నల్లని పోగులు కనబడుతున్నాయి. పూలమొక్కలు కాబోలు. మేడ మీదా, దిగువ గదుల్లోనూ ట్యూబ్‌లైట్లు వెలుగుతున్నాయి. హాలులో రేడియో పలుకుతూంది.

“ఊరూ ఇల్లూ మాత్రమేనా మనుష్యులు కూడా మారిపోయారా?” అనుకొంది.

“మెట్లు. జాగ్రత్తగా రా నాన్నా!” అంటూ నెమ్మదిగా గేటు తెరిచింది.

సావడిలోని లైటు వెలుతురు పడి, గేటు నుంచి ఇంటి వరకూ తిన్నని సిమెంటు దారి, దానికి అటూ యిటూ బంతి మొక్కల వరసలూ కనిపిస్తూ వున్నాయి.

వెనక వస్తున్న కూలి కుర్రాడికి, ‘గేటువేసి ర’మ్మని హెచ్చరిక చెప్తూ జానకి ముందుకడుగు వేసింది.

గేటు తీసిన చప్పుడు హాలులోకి వినబడి వుంటుంది. మాట వినిపించింది.

“అంత గట్టిగా ఎందుకే రాధీ, రేడియో? తగ్గించు. వీధిలైటు వేయి మీనా, ఎవరో వస్తున్నట్లున్నారు.”

“భద్రక్కే” అంది జానకి నెమ్మదిగా కొడుకుతో.

ఆమె అభిప్రాయాన్ని ధృవపరుస్తూ భద్ర గుమ్మంలోకి వచ్చింది, వరాండాలో లైటు రెండు మూడుమార్లు మిటకరించి, తెల్లగా వెలిగింది.

ఆ వెలుతురులో కొత్తవారెవరో బెడ్డింగు పట్టించుకొని వస్తూండడం గమనించి, భద్ర మెట్ల మీదకి అడుగుపెడుతూ ఆహ్వానించింది.

“రాండమ్మా! రాండి.”

ఆ ఆహ్వానమే ఆమె తనను గుర్తుపట్టలేదని చెప్తూంది.

ఆమె మెట్లు కూడా దిగి తమ ముందుకే వచ్చింది. అయినా గుర్తు పట్టలేదు.

జానకి మనస్సులో కొంటెతనం పొటమరించింది. కొంచెంసేపు ఆట పట్టించాలి!

“ఇల్లా ఇసకపూడి వెడుతూ బస్సు దిగేం. చీకటి పడిపోయింది. ఈ రాత్రికి....”

జానకి తమ రాకకో కథ కల్పించింది. ఆ కథను భద్ర నిజమనే నమ్మింది. జానకిని ఆమె గుర్తించలేదు. ఆమె కంఠస్వరమన్నా గుర్తు తెలియలేదు. చాల ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించింది.

“మంచిపని చేసేరు. చీకట్లో పుంతని పడిపోవాలి. రాళ్ళూ, ముళ్ళే కాదు. పురుగూ, పుట్రా తిరుగుతూంటుంది. అమావాస్య ముందు కూడానూ....”

ఏకటాకీని జానకి తమ యింటికి రావడం ఎంత మంచి నిర్ణయమో గుక్క తిప్పుకోకుండా చెప్పి, చివర మళ్ళీ అంది.

“వూరు గాని అడవి కాదు. మంచి పని చేశారు....రా, బాబూ!” అంటూ ఆమె వెనకనే వున్న రవీంద్రను సాదరంగా పలకరించింది. అతడు నమస్కరిస్తూంటే నవ్వుతూ ఆశీర్వదించింది.

“మీ అబ్బాయా? బాగుంది రాండి” అంటూ వారితో పాటు తానూ మెట్లపైకి వచ్చింది. బెడ్డింగు లోపలికి తీసుకెళ్ళమని సోమన్నను ఆదేశించింది.

“మీనా, బెడ్డింగు బల్ల మీద పెట్టించు తల్లీ!”

అష్టావధానం చేసినట్లు అందరితో మాట్లాడుతూ భద్ర గృహిణీ ధర్మం నిర్వర్తిస్తూంటే జానకి నవ్వు ఆపుకుంటూ ఆమె వెనకనే లోపలికి వచ్చింది.

బెడ్డింగు బల్ల మీద, చెప్పినచోట పెట్టేసి కూలి కుర్రాడు వచ్చి చెయ్యి చాపేడు. జానకి వాని చేతిలో పావలా పడేసింది. వాడు తన సంతృప్తిని నమస్కార రూపంలో వెల్లడించేడు. ‘దండాలండి.’

తర్వాత భద్ర వేపు తిరిగి, తాను లేకపోతే ఆ అతిధులు రోడ్డు మీద చాల కష్టపడి వుండేవారన్నట్లు వర్ణించేడు.

“సత్యానందంగోరి ఇల్లు ఎరుగుదురా అంటున్నారండి. వోరయ్య! ఆరిల్లు తెలీకపోడమేంటండి? ఈ వూరు వోలు మొత్తం మీద ఆరిని ఎరగనోళ్ళెవరండి? రాండి. తీసుకెళ్తానన్నా. ఎంకట నరసయ్యగోరు నేను సరిగ్గా తీసుకెల్లలేననేమో రిక్షా చేసుకు ఎల్లమన్నారండి. నేను తీసుకెల్లలేననే! పర్నేదు. నాతో రాండి. దిగెడతానన్నా” అంటూ వాడు వెడనవ్వు నవ్వేడు.

“మంచిపని చేసేవు. వెళ్ళిరా” అంటూ భద్ర వానిని పంపేసి, మళ్ళీ అతిధులు యోగక్షేమాలు అందుకొంది.

“కాళ్ళు కడుక్కుందురు గాని రాండి. అమ్మా అనూ! ఒక చెంబుతో నీళ్ళూ, తుండూ తెచ్చి ఇయ్యి....కొంచెం సేపు విశ్రాంతి తీసుకొనేసరికి వేణ్ణీళ్ళు కాగుతాయి....”

“మీరేమీ శ్రమ పెట్టుకోవద్దు. ఇప్పుడు వంటా వార్పూ అని కూర్చోకండి. మా వద్ద రొట్టే, బిస్కట్లూ వున్నాయి. ఈ రాత్రికి ఆశ్రయం దొరికింది....”

అది వూరే గాని అడవి గాదని భద్ర మరోమారు జ్ఞాపకం చేసింది. వేణ్ణీళ్ళు వద్దంటే వినలేదు. వినిపించుకోలేదు.

“చలి తిరిగింది. ఇంకా నయం మాకేమీ శ్రమ లేదు. కుక్కరు మీద వంటా, హీటరులో నీళ్ళూ – ఇదీ శ్రమేనా? మీబోటి వాళ్లు ఏమిస్తే వస్తారు. రాండి. కాళ్ళు కడుక్కుందురుగాని....”

ఆమె ముందు దారితీసి స్నానాలగది చూసింది-“సబ్బు అదిగో. నీళ్ళు అందులో వున్నాయి. తుండు ఇక్కడ పెడుతున్నా.”

భద్రకు తానెవ్వరో తెలియదు. తెలియకుండానే ఎంతో ఆప్యాయత కనబరుస్తూంది. తన మాట కూడా చొరనివ్వకుండా సౌకర్యాలు అమరుస్తూంది. ఆమెకు తానెవరో చెప్పకపోవడం ఒక విధంగా ఆటగా వున్నా కష్టంగానే వుంది. అయితే సత్యానందాన్ని కూడా కొంతసేపు ఆటపట్టించే వరకూ బయటపడదలచలేదు, జానకి.

‘అక్క మనస్సు ఆరోగ్యంగానే వుంది’ అనుకొంది. ఆమెను తన ఆత్మబంధువుగా భావించి అక్కడికే వెతుక్కుంటూ వచ్చినందుకు సంతృప్తి కలిగింది.

నాలుగో ప్రకరణం

జానకి సావట్లోకి వచ్చేసరికి రవీంద్ర పిల్లలతో స్నేహం చేసేసేడు.

మీనా చేతిలో అతడిచ్చిన బిస్కట్ల డబ్బా చూసి మంచిపని చేసేవన్నట్లు తల ఎగరేసింది.

“మీనా చాలా మంచి అమ్మాయమ్మా!”

అతని కవ్వింపు అర్థం చేసుకొంది, జానకి.

“అనూరాధ మాత్రం?”

మంచితనానికి పొగడ్త సంపాదించి, చెల్లెలు తనవంక కవ్విస్తూ చూస్తూంటే పదేళ్ళ అనూరాధకి తాను చేసింది పొరపాటనిపిస్తూంది. ఈమారు బెట్టుసరి చెయ్యకుండానే అతడిచ్చిన రెండో డబ్బా పుచ్చుకుంది.

అప్పుడే కాఫీ కప్పుతో హాలులోకి వచ్చిన భద్ర పిల్లల చేతుల్లో బహుమానాలు చూసి-“అవెందుకండీ-“ అంది.

జానకి చటుక్కున చనువుగా అంది.

“మాకు మాత్రం ఇవెందుకండీ?”

భద్ర ఒక్కేక్షణం తెల్లబోయి పక్కున నవ్వింది.

“ఊ. తీసుకోండి. చల్లారిపోతుంది. రా నాయనా!”

వారిద్దరూ చెరో కప్పు తీసుకు కూర్చున్నాక – “నీ పేరేమిటయ్యా! అడగేలేదు –“ అంది.

“రవీంద్ర.”

“మొహమాటపడకు. ఇంకావుంది. చల్లారిపోతుందని ఫ్లాస్కులో పోశా. ఎప్పుడెక్కేరో బస్సు. పాడు రోడ్లు, ఒళ్ళు హూనం అయిపోతూంది....”

“ఇంక అక్కర్లేదండి” అన్నాడు రవీంద్ర. జానకి చిరునవ్వు నవ్వింది.

“మా పొట్టల వైశాల్యం, ఆకలి పరిమితీ గురించి మీకేదో గట్టి అభిప్రాయమే వున్నట్టుంది-“ అంది.

భద్ర నవ్వింది.

“ఇంకా నయం..సరే కూర్చుని పిల్లలతో కబుర్లు చెప్తూండండి. వస్తా.”

ఆమెతో పాటు తానూ వంటింట్లోకి వెంబడించాలని వున్నా జానకి అతి కష్టం మీద నిగ్రహించుకొంది. వెడితే తాను ఎంతోసేపు రహస్యం కాపాడుకోలేదు.

రవీంద్రకు ఇదంతా ఇరకాటంగానే వుంది. తల్లి ఎంతో ఉత్సాహపడి వచ్చింది ఆ యింటికి. ఎంతో ఆప్తురాలని చెప్పిన ఆ యింటి గృహిణి ఆమెను గుర్తుపట్టలేదు. తల్లి అంత మారిపోయిందా? చిన్నప్పుడు యెల్లా వుండేదో....

అయితే వాళ్ళు తనను చూసి యిరవై ఒక్క ఏళ్లు గడిచేయనీ, తన్ను గుర్తుపట్టడం అనుమానమే అన్నట్లూ చెప్పింది. కనక, ఈ పరిస్థితి కష్టం అనిపించలేదు. పైగా కొంత వినోదంగానే వుంది.

“నువ్వేం చదువుతున్నావు?” అని జానకి అనూరాధను దగ్గరకు తీసుకొంటూ అడిగింది. ఆ ప్రశ్న తనను అడక్కపోవడం సహించరానిదిగా మీనాకు తోచింది. అక్కగారు సమాధానం యివ్వడానికి వ్యవధి ఇవ్వకుండా ఏమన్నా చెప్పినా వినబడకుండా పెద్దగా “అయిదోక్లాసు” అంది.

తనను చెప్పనీయకుండా అడ్డం వచ్చినందుకు అనూరాధ నిరసనగా చూసింది. కాని మీనా లెక్కచేయలేదు.

“క్రిందటి నెల గాంధిగారి మీద వ్యాసం వ్రాసినందుకు దానికి బొమ్మల పుస్తకం బహుమతి యిచ్చేరు, చూపించనా....”

రవీంద్ర “తరవాత చూపిద్దువుగానిలే” అన్నా వినిపించుకోకుండా, గంతులేసి చెయ్యి విడిపించుకొని పరుగెత్తింది.

రవీంద్ర నవ్వాడు.

జానకి “చిన్నతనం వుబలాటం” అంది.

పెద్ద ఆరిందాలాగ అనూరాధ –

“అదెప్పుడూ అంతే. ఎవ్వరిమాటా వినబడకుండా అరిచి చెప్తుంది.” అంది.

“నువ్వు? ఏమీ మాటే ఆడవు” అన్నాడు, రవీంద్ర. ఆనూరాధ సిగ్గుపడింది.

“మరి మీ అక్క సాధన ఏదీ?” అని జానకి అడిగింది. అంతలో మళ్ళీ నాలిక కరచుకొంది. ఆ యింటిలో ఎవ్వరినీ యెరగనట్లు నటిస్తున్నదాయె. మరి సాధన అనే అమ్మాయి, ఆమె అక్కగారు ఆ యింట్లో వున్నదని యెలా తెసుసన్న ప్రశ్న రాదూ?

వచ్చింది. యథాలాపంగా సాధన మేడమీద చదువుకొంటుందనేసినా, అనూరాధకు ఆ ప్రశ్న తోచకపోలేదు.

“మీకు మా అక్కయ్య తెలుసునా?”

జానకి యేంచెప్పాలా అని ఆలోచిస్తూంటే రవీంద్ర గంభీరంగా తల వూపేడు.

అనూరాధ తన వూహ పొడిగించింది.

“మీరెవరో తెలిసింది.”

రవీంద్ర వాళ్ళ అక్క క్లాస్‌మేట్ అయి వుంటాడు.

“మీరు మా అక్క కాలేజీలో లెక్చరరా?”

వయస్సును పట్టి రవీంద్రకూ, వేషధారణనుబట్టి జానకికీ పాత్రలను అనూరాధ నిర్ణయం చేసింది. కట్టు, బొట్టు, తలకట్టు, కాలిజోడు, చేతిన గడియారం, పర్సు – ఇవన్నీ ఆమె వుద్యోగాన్ని నిర్ధారణ చేయడంలో సాయపడ్డాయి.

ఔను, కాదు అననక్కర్లేకుండా మీనా పుస్తకం తీసుకొని తుఫానులా వచ్చింది.

రవీంద్ర ఆమెను పక్కనే కూర్చోబెట్టుకొని, బుద్ధిమంతుడల్లే ఆమె చూపిన బొమ్మలూ, చేస్తున్న వ్యాఖ్యలూ వింటున్నాడు.

జానకి అనూరాధని స్కూలు కబుర్లు అడుగుతూంది. ఆ మాటల మధ్యలో మీనా అందుకొనేవరకూ ఆమె అటు ఒక చెవివేసి వున్నదని ఎవ్వరికీ తెలియదు.

హఠాత్తుగా....’నిన్ననే….’ అంది. అంటూ చెప్పెయ్యనా అన్నట్టు అక్కవంక చూసింది. ఆమెకు అర్థం కాలేదు. కనుబొమలు కుంచించింది-‘నిన్ననేమిటి?’-అంది.

“మరేమోనే....”-అంటూ తాను చెప్పబోయే వార్తను గురించి వూరించింది.

రవీంద్ర చిరునవ్వుతో భుజం తట్టేడు.

“నిన్ననేమయింది?”

“రంగమ్మగారు సైన్సు మేస్టారిని చీపురుకట్ట తీసుకొని వీధిలోకి తరుముకొచ్చింది.” అంటూ కిలకిల నవ్వింది.

ఈ పిల్ల వూళ్ళోవున్న రంకు పురాణాలన్నీ ఏకరువు పెడుతుంది కాబోలురా, భగవంతుడా – అని జానకి భయపడింది.

ఆ ఘటనలో పదేళ్ళ అనూరాధకి వినోద భాగంకన్న విచారించవలసిన అంశం బలంగా కనబడింది. చెల్లెల్ని కోప్పడింది.

“ఎందుకా నవ్వు? పాపం రంగమ్మగారికి పిచ్చి ఎత్తింది.”

“పాపం” అని జానకి సానుభూతి చూపించింది. తన మాట శ్రోతల్ని కదిలించలేక పోవడం, అనూరాధ మాటకు జానకి సానుభూతి తెలపడం మీనాకు చిన్నతనం అనిపించింది. వెంటనే కధ మార్చింది.

“ఆవిడ కొడుకు చచ్చిపోయేడు. అందుకు పిచ్చిదైపోయింది.”

“ఔనా?” అంది జానకి.

అనూరాధ తల తిప్పింది.

“పాపం. ఎన్నేళ్లుంటాయి?”

“మా అన్నయ్యకి స్నేహితుడు. కేశవరావు అని”

సంభాషణ తన తలకు మించి సాగిపోతూంటే మీనాకు దాని మీద అభిరుచి పోయింది. మార్గాంతరం కోసం వెతుకుతుంటే వీధిగేటు చప్పుడయింది. మీనాక్షి ఒక్కగంతు వేసింది.

“నాన్నారు, వచ్చేశారు.”

ఒక్క పరుగున వచ్చిన కూతుర్ని చటుక్కుని ఎగరేసి ఎత్తుకుంటూ సత్యానందం సావట్లో అడుగు పెట్టేడు.

“నాకోసం ఎవరన్నా వచ్చేరా, తల్లీ” అంటూ బల్ల వేపు తిరిగేడు.

జానకి కుర్చీలోంచి లేచింది.

“కూర్చోండి” అని ఆమెను వారిస్తూంటే రవీంద్ర ముందుకు వచ్చేడు.

“నమస్కారం.”

సత్యానందం ప్రతి నమస్కారం చేసేడు.

“మీ అమ్మగారా! కూర్చోండి.”

అనూరాధ ఆమెను పరిచయం చేసింది. “అక్క కాలేజీలో లెక్చరరు. ఆయన అక్క....”

సత్యానందం మాట మధ్యలోనే సంతోషం తెలిపేడు.

“అలాగా, చాల సంతోషం. తమ దర్శనం ఎన్నడూ చెయ్యలేదు. కూర్చొండి. కూర్చో నాయనా! ఏదీ సాధన కనబడదు. ఎంత సేపయింది తమరు దయచేసి? రోడ్డుమీద ఎవరో చెప్పేరు. ఎవరో ఆడవాళ్ళు బస్సు దిగి మా యిల్లు అడిగేరని... తమరే నన్నమాట. చాల మంచిపని చేశారు.” అంటూ కూతుర్ని అడిగేడు.

“అక్కతో చెప్పేవా, మేడం వచ్చేరని?”

అనూరాధ చిన్నబోయింది, తన పొరపాటుకి.

“లేదూ? చెప్పొద్దు తల్లీ!...పోనీ అమ్మతోనన్నా చెప్పేవా?”

జానకి వస్స్తున్న నవ్వు ఆపుకొంటూ—‘అమ్మగారు కనిపించేరండి, కాఫీ అవీ యిచ్చేరు. వారి ఆదరణ మరిచిపోలేము. ఇప్పుడే లోపలికి వెళ్ళేరు,’ అంది.

భార్య వారికి కాఫీ అవీ యిచ్చి ఆదరించిందని విన్నాక సత్యానందం వారినే ‘ఎవరు? ఎందుకొచ్చేరు?’ లాంటి ప్రశ్నలు వేయడం అనవసరం అనుకొన్నాడు. భద్రని అడిగితే తెలుస్తుందనుకొన్నాడు.

“బాగుంది. బాగుంది. కూర్చోండి, సాధనను పంపిస్తాను.”

అతిధుల విషయంలో తన బాధ్యత తీరిందన్నట్లు సంతృప్తితో లోగుమ్మంవేపు కదిలేడు.

ఇంక జానకి పట్టలేకపోయింది. ఫక్కున నవ్వేసింది.

“ఏం బావా? మీ యింట్లో వాళ్ళందరికీ అంత మరుపు వొచ్చేసిందా? ”

ఆ నవ్వుకి నిలబడిపోయిన సత్యానందం ఆ ఆరోపణకి తెల్లబోయేడు.

“ఏమిటల్లా చూస్తావు?.... గుర్తు రాలేదూ? నేను జానకిని. వీడు రవీంద్ర... ”

ఆ పేర్లు ఎక్కడ విన్నానా యన్నట్లు సత్యానందం నోట్లోనే వల్లించుకొన్నాడు.

“జానకి ....రవీంద్ర... జానకి…”

జానకి అర్థం చేసుకొంది. తమరు అక్కడికి రాగలరనే ఆలోచన కూడా లేని మనిషికి ఆ పరిచయం కేవలం గంద్రగోళమే. ఇంక నవ్వలేకపోయింది.

“బొంబాయినుంచి వస్తున్నాం...”

బొంబాయినుంచి అనడంతోనే సత్యానందానికి ఆమె గుర్తువచ్చింది. ఆశ్చర్యం, సంతోషంతో ముఖం వెలిగింది. చటుక్కున ముందుకు వచ్చి రవీంద్ర భుజం మీద చెయ్యివేసి, కౌగలించుకొన్నాడు.

“నువ్వు రవీంద్రవా? పెద్దవాడవయ్యావు. .”

అతని కళ్ళలో నీళ్ళు చూసి రవీంద్ర కదిలిపోయేడు.

“తమరందర్నీ చూడాలనే…..”

సత్యానందం కళ్ళు తుడుచుకుని సోఫాలో కూర్చున్నాడు. రవీంద్రను కూర్చోబెట్టుకొని-- 'రా, జానకీ', అన్నాడు.

పక్కనే కుర్చీలో కూర్చున్న జానకిని పరీక్షగా చూస్తూ, ‘ఎంత మారిపోయేవు!’ అన్నాడు.

తాను మారినట్లు జానకి ఎరుగును. కాని అత్యంత సన్నిహితులు కూడా గుర్తు పట్టలేనంతగా మార్పు వున్నదని ఆమెకు ఆ క్షణం వరకు తోచలేదు.

“గుర్తు పట్టలేకపోయాను” అన్నాడు.

ఆ మార్పు సంవత్సరాలని పట్టి వచ్చింది కానే కాదు. ఇద్దరూ ఎరుగుదురు. కాని పైకి ఒక్కరూ చెప్పరు. సత్యానందం చివరకు ఒక కారణం కల్పించుకొన్నాడు.

“ఊహించనిచోట, ఊహించలేని మనిషిని చూస్తే గుర్తుపట్టడం కష్టం.”

జానకికి తన ప్రయత్నం ఙ్ఞాపకం వచ్చి నవ్వింది.

“మీరెల్లా వున్నారో చూడాలని.. .”

“....ఉత్తరమేనా వ్రాయకుండా వచ్చేవు. ఔనా-” అన్నాడు.

నాలుగో ప్రకరణం

అంతలో భద్రతోకూడా ఇల్లాగే ఆటాడివుంటుందనిపించింది.

“ఇక్కడ ఇంత శాంతంగా కూర్చున్నావు. భద్రతోకూడా ఇల్లాగే నాటకం ఆడేవా?”

జానకి నవ్వింది. సందేహం ఏం వుంది?

సత్యానందం లేచి నిలబడి, ఆమె రెక్క పట్టుకు బయలుదేరతీసేడు.

“రా, లే... భద్రా! భద్రా! ”

పిలుపుమీద పిలుపుగా భర్తమాట విని భద్ర చేతిలో పని పక్కకి పెట్టి లేచింది. ‘వస్తున్నా’ అంటూ సమాధానం ఇస్తూ వంటింటి గుమ్మం లోకి వచ్చింది.

కొత్తగా తమ యింటికి వచ్చిన ఆమెను తన భర్త రెక్క పట్టుకు తీసుకు వస్తున్నాడు. ఆమె నవ్వుతూంది. వాళ్ళ వెనకాల ఆమె కొడుకూ, తమ పిల్లలూ తెల్లముఖాలు వేసుకు వస్తున్నారు. ఆ వూరేగింపు చూసి భద్ర తెల్లబోయింది.

సత్యానందం ఆమెను తీసుకువచ్చి తన యెదట నిలవబెట్టేడు.

“ఈమెగారెవరో గుర్తుపట్టేవా? జానకి... మన జానకి...ఇదిగో ఇతడు రవీంద్ర....కొడుకు... ”

ఆమెనోట అప్రయత్నంగానే ఆ పేరు మలిగింది... ‘జానకి’.

గబగబ వచ్చి రెండు భుజాలూ పట్టుకొని కుదిలించేసింది. కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కౌగలించుకొంది. ‘ఎంత నాటకమాడేవే!’ అని కోప్పడింది.

వాళ్ళిద్దరి ఉద్వేగాలూ, సంతోషాలూ చూస్తుంటే సత్యానందానికి కంఠం నిండి వచ్చింది. చటుక్కుని వెనక్కి తిరిగేడు.

“మనం పైకి పోదాం. రాండోయ్! వాళ్లని మాట్లాడుకోనీండి. ”

పిల్లల్ని వెంటబెట్టుకొని సత్యానందం మేడమీదకు వెళ్ళిపోయేడు.

“గుర్తుపట్టనట్లూ, ఎరగనట్లూ అంతసేపు ఎల్లా వుండగలిగేవంటా”

అదే ప్రశ్నను భద్ర అనేక దృక్కోణాలనుంచి వేస్తూంది. ఆ మాట వచ్చినప్పుడల్లా జానకి నవ్వుతూంటుంది.

“ముఖం ఎక్కడో చూసినట్లనిపించకపోలేదు. కాని, గుర్తు రాలేదు. గుర్తు అనిపించినా నువ్వని ఎల్లా అనుకుంటాం. మహాతల్లివి. ఉత్తరాలే వ్రాయడం మానేసేవు. వస్తావని ఎల్లా అనుకుంటాను. ఎంత మారిపోయేవు.”

జానకి మారిపోయిందనిపించినప్పుడల్లా ఆ మార్పుకు కారణభూతుడైన విశ్వం ఇద్దరి మనస్సుల్లో మెదులుతున్నాడు. కాని, ఇద్దరూ కూడ అతని పేరు పైకి చెప్పలేకుండా వున్నారు.

ఇరవై రెండేళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజుల్లోనే భద్ర జానకిని పెళ్ళి కూతుర్ని చేసి పంపింది. రెండేళ్ళ తర్వాత అతనిని పోలీసులు పట్టుకొని కాల్చేశారన్నారు. కాదు, కనిపించడంలేదన్నారు. భర్తతో రాష్ట్రం దాటి వెళ్లిన జానకి మరి తిరిగి రాలేదు. బొంబాయిలో వుందన్నారు. ‘ఏదో వుద్యోగం చేసుకుంటున్నా! నువ్వు పెట్టిన భిక్షే’ నంటూ ఎప్పుడో మొదటి రోజుల్లో వ్రాసిన జాబు తప్ప మళ్ళీ వుత్తరాలూ లేవు.

నాటికి....నేడు...మళ్ళీ...

ఇద్దరి మనస్సులలో ఆనాటి కధలు మెదులుతూంటే నిశ్శబ్దం అయిపోతుంటారు.

మళ్ళీ ప్రారంభం.

“నీది రాతి గుండె...” అని భద్రే మళ్ళీ మొదలెడుతుంది. జానకి నవ్వుతుంది.

అయిదో ప్రకరణం

భోజనం చేస్తూ చేస్తూ భద్ర దిగాలుపడి గోడకి జేర్లబడిపోయింది.

“కృష్ణుడు యేం చేస్తున్నాడో యేమిటో... ” అనుకొంది.

ఆమె కొడుకు రామకృష్ణ వరంగలులో మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. తెలంగాణా కల్లోలాల తాకిడికి కాలేజీ మూతపడి రమారమి ఆరునెలలు యింట్లోనే వుండిపోయేడు. ఆ మధ్యనే కాలేజీలు తెరుస్తే మళ్ళీ వెళ్ళేడు. అతడు అక్కడ యేం కష్టపడి పోతున్నాడో యని తల్లి ఆదుర్దా.

ఆమె ఆదుర్దాకి అర్థం లేదన్నట్లు జానకి చాల చులకన చేసింది.

“ఏం చేస్తుంటాడు? తొమ్మిదిన్నర అయిందా? హాస్టలులో భోజనాలయిపోయి వుంటాయి. గదుల్లో కూర్చుని చదువుకుంటూ వుండి వుంటారు. కాక పెళ్ళాం పిల్లకూడా అక్కడే చదువుతూందన్నావా? ఇద్దరూ ఏ సినిమా ప్రోగ్రామో వేసుకుని వుంటారు. ఏం చిన్నపిల్లాడా? పెళ్ళాన్ని ఏరుకోగల వయస్సు వున్నవాడు...”

“పాపం వాళ్ళలాంటి వాళ్ళు కారే---” అంది భద్ర.

జానకి నవ్వింది.

“మరి పెళ్ళాన్ని యేం చేద్దామనుకున్నాడంటావు?”

భద్ర కూడా నవ్వింది. అంతలో దిగాలుపడింది. “ఏమో, ఏం చదువో ఏం పాడో” అంది, భద్ర నిరుత్సాహంగా. “మా వూళ్ళో మీరు వుండడానికి వీలులేదు. లేచిపోండంటూంటే యెందుకక్కడికి చెప్పు? అక్కడగాక మరో చోట యేర్పాటు చెయ్యండంటే ఈయన వినిపించుకోరు. వాడంతకంటె. ఎక్కడ మాత్రం ఇంతకంటె బాగుందంటాడు. మధ్య నాకు మనసుండబట్టడంలేదు….”

“అంటాడేమిటి! నువ్వు పత్రికలు చూడ్డం లేదా?”

“చూడకేం చూస్తున్నా. అయితే అనుభవం మనది కాదు గనక అక్కడేమేనా మెరుగేమో ననిపిస్తూంటుంది.”

“రాసికి అంగోస్త్రం చుట్టేవాళ్ళు ప్రతిచోటా వెలిసేరు. అయితే బాధ పడేవాళ్ళు వేరు. ఎక్కడికక్కడే ఆదేశం తమ తాత ముల్లెలాగ అంగోస్త్రం చుట్టి కళ్ళురుముతున్న వాళ్ళు వచ్చేరు. తప్పదు. ఈ గొడవేదో ఎక్కడికాక్కడ చూసుకోవాలేగాని...”

తన కొడుకు చదువు కుదుటపడడం, ఎవ్వరూ వంటిమీద ఏ పెట్రోలో పోసి అగ్గిపుల్ల గియ్యకపోవడం తప్ప మరో ఆలోచనలేదు భద్రకి. ఇప్పటికేనా మరల కాలేజీలు తెరవనిచ్చినందుకు సంతోషం కనబరిచింది.

“ఏదో గుడ్డిలో మెల్ల. ఇప్పటికేనా చల్లబడ్డారు. అదీ నయమే.”

జానకి పకపక నవ్వింది.

“వాళ్ళెప్పుడూ గుడ్డివాళ్ళు కాదే తల్లీ! దేశం ఏమైపోయిందో, పిల్లగాళ్ళ చదువులు ఏమౌతాయో వాళ్ళకి పట్టిందంటావా? కాలెజీలూ, స్కూళ్ళూ మూతబడితే చదువు నష్టపోయింది నీకొడుకొక్కడిదేనా? కాదు, నూటికి తొంభయ్యయిదుమంది తెలంగాణం వాళ్ళదే. కాని చదువు పోగొట్టుకొన్న అభాగ్యుల్లో ఈ నాయకుల పిల్లలు వుండివుండరు. ఏమీ సందేహం అక్కర్లేదు.”

జానకి ధోరణిని అడ్డంకొడుతూ వీధిలో పెద్ద అలజడీ, కేకలూ వినిపించేయి.

ఇద్దరూ ఆలకించేరు. మొదట కొంతసేపు ఆర్థంకాలేదు. తర్వాత అవేవో నినాదాలు వినిపించేయి.

“ఏదన్నా వూరేగింపు వుందేమో, కేకలు అల్లా వున్నాయి, ” అంది భద్ర.

“ఎవరి వూరేగింపూ?”

“చెప్పలేం. బహుశా జనసంఘం వాళ్ళదేమో. ఈమధ్య ఒకటి రెండుమాట్లు వాళ్ళ హడావిడి విన్నాం.”

“అదీ వుందీ?”

“అయ్యో!”

“ఎవరేమిటి దాని పెద్దలు?”

“ఇంకా ప్రత్యేకంగా యెవరూ గోదాలోకి దిగినట్లు లేదు. షావుకారు జగన్నాధంగారు ఙ్ఞాపకం వున్నారా?”

“బాగుంది!”

“ఆయన పోయేరు. ఆయన తమ్ముడు ఒకడు కథలూ అవీ వ్రాస్తుంటాడు. జనసంఘం పత్రిక వుంది బెజవాడలో. ఆ పత్రికవాళ్ళు జరిపిన కథల పోటీలో అతని కథకి బహుమతి వచ్చింది. నెల్లాళ్లక్రితం వాళ్ళింటికి జనసంఘం నాయకులు వచ్చి వూళ్ళో మీటింగు పెట్టి వెళ్ళేరు. అంతే.”

ఇంతలో వూరేగింపు వారి వీధిలోకే తిరిగినట్లు తోచింది. నినాదాలు బిగ్గరగా, స్పష్టంగా వినిపిస్తున్నాయి.

“ప్రజాద్రోహులు... నశించాలి.”

జానకి భద్ర ముఖంలోకి చూసింది. ఆమె జానకి విస్తట్లో పెరుగు పోస్తూ, “మార్క్సిస్టులదై వుంటుంది-“ అంది అనుభవఙ్ఞానంతో.

జానకి చటుక్కున లేచింది. భద్ర లబలబలాడింది.

“భోజనం పూర్తి చెయ్యి. తిట్లతో కడుపు నిండదు. వాళ్ళ విప్లవం తిట్లు వినడానికి అన్నం మానుకోవాలా ఖర్మ!” అంటూ చేయిపట్టుకులాగి కూర్చోబెట్టింది. జానకి ‘చూడాలి’ అంది.

“ఏమీ బెంగపెట్టుకోకు. నీకోసం అయినా పదినిమిషాలు మన గుమ్మంలో నిలబడతారు. ఫర్వాలేదు.”

భద్ర జానకి చెయ్యి వదలలేదు.

భోజనం పుర్తిచేశాక చేయి వదిలింది.

“ఆకు నే తీస్తా. చేయి కడుక్కువెళ్ళి ఆ వినోదం ఏదో చూడు.”

కాని, జానకి లేచిపోలేదు. ఇద్దరూ కలిసే వీధిగుమ్మంలోకి వచ్చేరు.

వస్తూ భద్ర గేటుమీద ఆర్చిలో వున్న లైటు వేసింది. మెర్క్యురీ లైటు వెల్తురు వెన్నెలలాగ వీధి అంతా నిండింది.

ఆరో ప్రకరణం

మేడ మీద పిట్టగోడ నానుకొని నలుగురైదుగురు చూస్తూండడం, వీధి తలుపు తీసుకొని ఆడవాళ్ళు గుమ్మంలో నిలబడడంతో ఊరేగింపు కంఠం ఏకస్వరంలో నిలబడింది. స్వరమూ దృఢపడింది. దానికి వూతలా బిగించిన పిడికిళ్ళు గాలిని గుద్దుతున్నాయి.

“ప్రజా ద్రోహులు...”

ఆ కీచుగొంతుక విని జానకి అటు తిరిగింది. ఆశ్చర్యం కలిగింది.

“వాడు జోగన్న కాడూ?”

“ఆ జోగన్నే.”

“వాడు మార్క్సిస్టా?”

“ఆ.”

“ఎప్పటినుంచి?” అంది జానకి. ఆమెకు గ్రామంలో రౌడీగా పేరు పడ్డ జోగన్నను మార్క్సిస్టులు జేరతియ్యడం వింతగా వుంది.

“52 ఎన్నికల్లో మందలో కలిసేడు. పార్టీ కలిసివున్న కాలంలోనే కమ్యూనిస్టు విభూతి ఇచ్చేరు. ఇప్పుడు మార్క్సిస్టు...” అంటూ భద్ర సంగ్రహంగా చెప్పేసింది.

“ఇంక వూరుకో. మనం మాట్లాడుకోడం చూసి వాళ్ళు మరీ రెచ్చిపోతారు” అంది.

కాని, ఆ వినడమో, విన్నట్లు వూహించడమో అదివరకే జరిగిపోయింది. నినాదాలు చిత్ర చిత్ర రూపాలలో ప్రస్తరిస్తున్నారు.

“ప్రజాద్రోహులు-నశించాలి.”

“కమ్యూనిజానికి వెనుపోటు పొడిచిన-”

“బూర్జువా భూస్వామి కాంగ్రెసుతో చేతులు కలిపిన-”

గుమ్మానికి ఎదురుగా వూరేగింపు నిలబడిపోయింది. వూరేగింపు ముందు లావుపాటి బట్టతల మనిషి ఎవరా అని జానకి ఆలోచన. ఆయన ఎవరో భద్ర నోట విని నిర్విణ్ణురాలే అయిపోయింది.

“డాక్టరు సుందరరావుగారా!”

భద్ర తలవూపి వూరుకుంది.

“పక్కన ఆ కళ్ళజోడు?”

“ఆయన కొడుకు రంగనాయకులు.”

“అతడు డాక్టరుట కాదూ?”

“ఊ.”

“ఇద్దరూ...”

“ఈవేళ పరమ మహేశ్వరులు. వీరశైవులు....”

జానకి ముఖాన చిరునవ్వు తోచింది. వర్ణన వినేసరికి.

“ఈ నాలుగైదేళ్లనుండి మాకు మధ్య మధ్య కమ్యూనిస్టు తిట్టు పదకోశంలో కొత్తగా చేరిన పదాలు వినే అవకాశం కలిగిస్తున్నారు.”

వరండాలో స్త్రీల పెదవుల కదలికలు తమ్ము గురించే అనిపించి వూరేగుంపులో కీచుగొంతు మరింత పదునెక్కింది.

“పోలీసుబంట్లు ..... నశించాలి.”

మేడమీద పిల్లలు పెద్దగా నవ్విన ధ్వని. సత్యానందం కంఠం వినబడి జానకి తిరిగి చూసింది. వీధి గదిలో అతడు కూర్చుని వున్నాడు. తలుపులు, కిటికీలు అన్నీ తెరిచి, లైట్లు వేసి వున్నాయి. ద్వారం మీద బోర్డు కనిపిస్తూంది.

-“భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామశాఖ కార్యాలయం--”

ఊరేగింపు అక్కడెందుకు నిలబడిందో జానకికి అర్థం అయింది.

“ఏమిటి బావా!”

“మీరు పైకి వెళ్లండి. అల్లా నవ్వకూడదని పిల్లలకి చెప్పండి. మర్యాద కాదు.”

ఆ మాట పూర్తి కాకుండానే వీధిలో పెద్ద గంద్రగోళం ప్రారంభమయింది. భద్ర ఆదుర్దాగా మెట్ల చివరకు గబగబ నడిచి నిలబడింది.

“అయ్యో! రంగమ్మగారు.”

మరుక్షణంలో గట్టిగానే మగణ్ణి కేకేసింది.

“త్వరగా రాండి. రంగమ్మగారిని పట్టుకోండి. సుందరరావుగారి మీదపడి కొడుతూంది. అయ్యో చొక్కా చింపేస్తూంది.”

బ్రాహ్మణాగ్రహారంలో ఆడదాని నోట ఎప్పుడైనా వినిపించే అవకాశం వుందా అనిపించేటంత జుగుప్సాకరమైన పదజాలంతో రంగమ్మ సుందరరావును తిడుతూంది. మీదపడి రక్కింది. ఆ ఆవేశంలో ఆమె నోటినుంచి వెలువడ్డ తుంపరలతో ఆయన ముఖం తడిసిపోతూంది.

హఠాత్తుగా వచ్చిపడ్డ ఈ ఉత్పాతం ఏమిటో, ఎందుకో మొదట ఆయనకు అర్థం కాలేదు. సత్యానందం ఇంటి వద్దకు వచ్చేకనే ఆమె తన మీద పడిపోయిందని చూసేడు. ఆమె ఎక్కడనుంచి వచ్చిందో చూడలేదు. కాని, ఆ యింట్లోనుంచే వచ్చిందనిపించింది. సత్యానందమే ఆమెను తమ మీదికి వదిలి వుంటాడు. పోలీసు బంట్లు అని తామిచ్చిన నినాదం నొప్పి కలిగించింది. ఈ దౌర్జన్యానికి పూనుకొన్నారనిపించింది. శత్రువు మరింత పొడుచుకుని, కుళ్ళేటట్లు చేయడానికై మళ్ళీ ఆ నినాదం ఇచ్చేడు.

“పోలీసు ఏజెంట్లు….”

రంగమ్మను దూరంగా లాగేయడానికి చేసే ప్రయత్నంలో ఎవ్వడూ దానినందుకోలేదు. కాని, ఆ నినాదమే రంగమ్మ ఆవేశాన్ని రెచ్చకొట్టింది.

“నాబాబుని పోలీసులకి వప్పచెప్పిన లాంజ....కొడుకువి నీవే కాదట్రా….నిన్ను చంపేస్తా. మహమ్మాయి వండేస్తా….పేగులు తోడేస్తా. నీ కడుపు కాలిపోనూ….”

రంగమ్మ ఆయాసపడిపోతూంది. పట్టుకొన్న వాళ్ళకి లొంగడంలేదు. వాళ్ళ చేతుల్లోంచి బయటపడడానికి గింజుకొంటూంది. గిజాయించుకొంటూంది. సైన్సు మాస్టారు ఆమెను అనునయించడానికి ప్రయత్నిస్తున్నాడు.

“రంగా! రంగా! తప్పు, చూడు. నువ్వు ఎవరిని తిడుతున్నావో చూసేవా? ఇదుగో డాక్టరుగారు. వాళ్ళ నాన్నగారు ఆయన. రంగా! విన్నావా?....”

“నేను వినను, వీడా డాక్టరుగారి తండ్రి! కాదు. పోలీసు ఏజంటు వీడే. ఆరోజున నాబాబును చైనా మనిషి అని పట్టించి ఇచ్చేడు. వీడే, వీడే!”

ఆ ఆరోపణ సుందరరావును నిర్వాక్కుణ్ణి చేసింది. తమ పార్టీలోంచి నక్సల్ బరీ వాదులు విడిపోయి, జనశక్తిని  స్వాధీనం చేసుకొన్నప్పుడు వాళ్ళ చర్యల్ని ఖండిస్తూ సభలు పెట్టేడు.

“భగత్ సింగ్ మార్గమే మా మార్గం” అన్న నినాదాలు ఇవ్వడం లోని ప్రమాదాలు అతి ఓర్పుగా వివరించేడు. పోలీసులు, ప్రభుత్వం వలన రాగల నిర్బంధాలు చెప్పేడు. గ్రామంలో ఆ జట్టు కుర్రాళ్ళకి రంగమ్మ కొడుకు కేశవరావు నాయకుడు. అతడు తనతో వేసుకొన్న వాదనలు ఖండించి, తన మతం స్థాపించుకొన్నాడు. దానినే ఈమె పోలీసులకు వప్పచెప్పడంగా వర్ణిస్తూంది. సుందరరావుకి అసహ్యం వేసింది. తాను కుర్రవాడిని ఆ ప్రమాదంలో పడకుండా కాపాడాలనుకొన్నాడు. వినలేదు. పోయి, మిడతలా మాడిపోయేడు. దానికి తననే తిట్టడం దుర్భరం అనిపించింది. కాని, ఏమీ చెయ్యలేడు. ఆడది. ఆత్మరక్షణ పేరుతోనేనా నాలుగు తగిలించడానికి వీలులేదు.

సత్యానందం ఇంక దూరంగా ఉండలేకపోయేడు. గబగబ ముందుకొచ్చి సుందరరావు మొగం మీదకు పోతున్న రంగమ్మ చేయి గట్టిగా పట్టుకొన్నాడు.

“భద్రా, జానకీ ఈవిణ్ణి పట్టుకోండి.”

నలుగురూ పోగడి, ఆమెను భర్త సాయంతో బయటకు తెచ్చేరు.

“కాస్త శా౦తించేవరకూ లోపలికి తీసుకురాండి” అని భద్ర లోపలికి దారి తీసింది. దానివలన రాగల నిందను యెరిగినా సత్యానందం యేమీ అనలేదు.

తీసుకుపోతున్నా ఆమె అరుస్తూనే వుంది-”నువ్వు పోలీసోళ్ళ తాబేదారువురా….నిన్ను చంపేస్తా….”

ఆ అల్లరికీ, తిట్లకూ, సత్యానందం సుందరరావుయెడ సానుభూతి చూపేడు.

“ఆవిణ్ణీ, ఆవిడ మాటల్నీ పట్టించుకోకండి. కొడుకుపోయిన దుఃఖంలో ఆమెకు మతిపోయింది. మనం అంతా ఎరిగిందే....”

ఆ వోదార్పు సుందరరావుకు తోడికోడలి దెప్పుడులా వినిపించింది. కోపంతో పెదవులు అదిరిపోతున్నాయి.

“నీకిందులో పాత్ర యేమీ లేదనుకోవాలనా?” అన్నాడు.

నీ మాటకు విలువనివ్వడం అనవసరం అన్నట్లు సత్యానందం మరేమీ అనకుండా వెనుతిరిగేడు.

అతడూ వెనుతిరగగానే వూరేగి౦పులోంచి యెవరో విసిరిన రాయి తగిలి, గేటులో పైన వున్న లైటు డోము పగిలి గాజుముక్కలు గల్లున క్రిందపడ్డాయి.

సత్యానందం చటుక్కున నిలబడ్డాడు.

వెనకనుంచి డాక్టరు రంగనాయకులు గొంతు ఖంగుమని వినిపించింది.

“ఎవరిదా పని?”

ఎవ్వరూ మరల మాట్లాడలేదు. మరల అతని కంఠమే వినిపించింది.

“క్షమించండి! సత్యానందంగారూ!”

వెనువెంటనే సుందరావు కయ్ మన్నాడు.

“ప్రజావుద్యమాలకు వెన్నుపోటు పొడిచే ద్రోహచర్యలమీద ప్రజల కోపం బహుముఖాలుగా వ్యక్తమవుతుంది. ప్రజల న్యాయమైన ఆగ్రహానికి కమ్యూనిస్టులు క్షమార్పణ చెప్పుకోనక్కర లేదు.”

“బాగా చెప్పేరు. కుర్రాడు. అతడికింకా అనుభవం చాలదు” అన్నాడు వెక్కసంగా సంత్యాన౦దం. గాజు పెంకులమీద అడుగు పడకుండా, జాగ్రత్తగా చూసుకొంటూ అతడు లోపలికెళ్ళేడు.

“భద్రా, వాళ్ళంతా వెళ్ళిపోయేక చీపురు తీసుకొని గేట్లో గాజుపెంకులు ఓ పక్కకు తుడిచెయ్యవోయి. ఎవరన్నా తొక్కితే కాలు తెగుతుంది.”

“గాజు పెంకులు ఎక్కడివి?” అంది భద్ర ఆశ్చర్యంగా.

“మెర్క్యురీ లైటు డోము పగిలిపోయి౦దిలే” అన్నాడు, సత్యానందం తాపీగా.

వెనకనుంచి కొత్త నినాదం వినిపించింది.

ప్రజాసేవకులమీద రివిజనిస్టుల దౌర్జన్యాలు-”

ఆ గొంతు సుందరరావుది.

“నశించాలి” అది ఊరేగింపు వాంఛ. సుందరరావు దానిని నిరాకరించేడు.

“శాపనార్ధాలు లాభంలేదు. ఖండితంగా చెప్పాలి-’సాగనివ్వం’ అనండి.”

ఏడో ప్రకరణం

రంగమ్మ దుఃఖానికి కారణం విని జానకి నిర్విణ్ణురాలయింది. ఆమెకు తన జీవితం జ్ఞాపకం వచ్చి తూలిపోయింది.

ఆమె పరిస్థితిని గమనించి భద్ర కంగారు పడింది. పెద్దకూతురును పిలిచింది.

“పిన్నిని మేడమీదకు తీసుకుపోయి పక్క వెయ్యి. ఒంట్లో బాగులేదు.”

తల్లి అనారోగ్యం వార్త విని రవీంద్ర పరుగెత్తి వచ్చేడు. సాధనా, అతడూ చెరో చెయ్యీ పట్టుకొని ఆమెను మేడమీద గదిలో పడుకోబెట్టేరు. ఇద్దరూ చెరొకవైపునా కుర్చీలు లాక్కుని కూర్చున్నారు.

“ఎల్లా ఉందమ్మా?”

“నాకేంరా, బాగానే వున్నా-” అంది కాని, ఆ మాటతోనే ఏడ్పు వచ్చేసింది. నోట్లో పైటకొంగు కుక్కుకొని, పరుపుమీద బోర్లా దొర్లి తల దాచుకుంది. పక్కలు యెగరెయ్యడం చూస్తే ఆమె వెక్కివెక్కి ఏడుస్తున్నదని అర్ధం అవుతూంది. సాధన ఏమిటిది అన్నట్లు అతనివంక చూసింది. ఊరుకోమన్నట్లు కన్ను మలిపేడు. తల్లి నడ్డిమీద సమాశ్వసనంగా చెయ్యి వేసుకొని నిశ్శబ్దంగా కూర్చున్నాడు.

తల్లి దుఃఖకారణం రవీంద్ర గ్రహించేడు. అతడు తండ్రిని ఎరగడు. కాని, అతని మరణగాధ తెలుసు. ఆ గాధ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తల్లి అల్లా ఏడుస్తుంది. ఒకటిరెండు రోజులు మందకొడిగా, పరధ్యానంగా వుంటుంది.

రంగమ్మ దుఃఖకారణం వినడంతో జానకికి భర్త గుర్తు వచ్చేడు. రవీ౦ద్ర కూడా భయపడుతూనే వున్నాడు. వీధిలో జరిగిన గంద్రగోళం, గలభా యేమిటో సాధన యిందాక అతనికి చెప్పింది.

“ఆవిడ పేరు రంగారజమ్మ. అంతా రంగమ్మగారంటారు. మా ఊరి హైస్కూలు సైన్సు మేష్టారి భార్య.”

“కొడుకు చచ్చిపోతే పిచ్చి యెక్కిందని యిందాకా అనూరాధ చెప్పింది, ఈవిడేనా?”

“ఎప్పుడు చెప్పిందీ, అప్పుడే.”

“మేం వచ్చినప్పుడేలే.”

“ఆమెకి ఒక్కడే కొడుకు. వరంగల్ లో అన్నయ్యతో మెడిసిన్ చదువుతున్నాడు. నెలరోజుల క్రిందట అరెస్టు చేశారన్నారు. ఆ మాట వినగానే రంగామ్మగారికి మతి చలించింది.

“ఆయన నక్సలైటా?”

“ఔనట.” అని సాధన తలవూపింది. “మంచివాడూ, తెలివిగలవాడూ, ఫైనలియర్ లో వున్నాడు. మా నాన్నతో అస్తమానం వాదం వేసుకొనేవాడు. మా అన్నయ్యా అతడూ చాల స్నేహంగా వుంటారు. ఈ వార్త విన్నాక మా అన్నయ్యని గురించి అమ్మ బెంగపెట్టుక్కూర్చుంది….”

....రాత్రి పన్నెండు కొట్టేవరకూ ఆ యింట్లో యెవ్వరూ నిద్రపోలేదు. సరదాగా రెండునెలలు గడపాలని జానకి ఇరవైయయేళ్ళ తర్వాత ఊళ్లోకి రావడం, మనస్సులోని గాయం కలకవేసి జానకి బాధపడడం సత్యానందం దంపతుల్ని ఎంతో ఖిన్నపరచింది. చాలసేపు దగ్గర కూర్చుని ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పారు. పిల్లలంతా నిద్రవచ్చి పోయి పడుకున్నారు. కొంత సర్దుకొన్న దనిపించేక సత్యానందం వెళ్ళిపోయేడు. భద్ర ఆమె పక్కనే మంచం వేసుకు పడుకుంది.

ఇద్దరికీ నిద్రలేదు. ఆ సంగతి ఇద్దరూ యెరుగుదురు. కాని ఇద్దరూ ఎరగనట్లే చాలసేపు నటించేరు.

ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. అంతా నిద్రపోయారు. ఆ నమ్మకం కలిగేక భద్ర లేచి కూర్చుంది.

“జానకీ!”

“ఊ.”

“నిద్రపోలేదూ?”

“రావడంలేదు.”

భద్ర మంచం మీద వొరిగింది.

“కళ్ళు మూసుకో, అదే వస్తుంది.”

మరల కొంచెం సేపయ్యాక జానకి పలకరించింది.

“అక్కా!”

“ఊ.”

“నన్ను పెళ్ళి చేసుకొని ఉండకపోతే ఆయన బ్రతికి వుండేవారేమో. నా దురదృష్టం ఆయన్ని కొట్టుకుపోయిందో, ఏమో....”

భద్ర లేచి కూర్చుంది. ఆ అనుమానానికి సమాధానం ఏం వుంది? కోపం చూపింది.

“ఏం మతిగాని పోయిందా యేం? చదువుకున్నదానివి కూడాను.”

“కాదక్కా! ఎంత చదువుకున్నా ఆ అనుమానం సెలవేస్తూనే వుంది. మన పూర్వం వాళ్ళు పెట్టిన నిషేధాలూ, చెప్పిన అభ్యంతరాలూ నిజమేనేమో అనిపిస్తూంటుంది. ఒక ని౦డుప్రాణాన్ని నా అజ్ఞానానికి బలిపెట్టేనేమో.”

ఆమె దుఃఖం చూస్తూంటే భద్రకూ కంఠం నిండి వచ్చింది తన బలహీనతను కమ్ముకొనేందుకు అవహేళనకు అందుకుంది.

“ఇది మరీ బాగుంది కాదూ! చాలా బాగుంది. వెర్రి కుదిరింది. రోకలి తలకు చుట్టమన్నాడట నీలాంటివాడే. కాకపోతే ఏమిటే అది అప్పుడు-ఆ మూడు నాలుగేళ్ళలో ఒక్క తెలుగు దేశంలో మూడునాలుగు వందలమందిని పోలీసాళ్ళు చంపేశారన్నారు. మళ్ళీ యిప్పుడు ఈ ఏడాదీ ఆరు నెలలలోనూ అప్పుడే ఏభై అరవై మందిని చంపేశారంటున్నారు. చంపివేయబడ్డవాళ్ళంతా వితంతువుల్ని పెళ్లాడినవాళ్ళు కారు. వాళ్ళ పెళ్ళాలు చెడ్డ నక్షత్రం చూసుకొని సమర్తాడినవాళ్ళూ కాదు....”

ఒక్క నిముషం ఊరుకొని భద్రే మళ్ళీ అంది.

“పాపం కేశవరావుకి పెళ్ళే కాలేదు. మరాతనికి ఎవరి శని చుట్టుకుంద౦టావో.”

ఆ మాటకి కూడా జానకి వెక్కి వెక్కి ఏడవడమే గాని ఏ సమాధానమూ ఇవ్వలేదు. ఆమెను చూస్తూంటే భద్రకు కళ్ళనీళ్ళు తిరిగేయి. ‘ఊరుకో’ అనబోయింది ఆ మాట అనబోయేసరికి తనకే కంఠం నిండి వచ్చింది. ఊరుకుంది.

కొద్దిసేపటికి యిద్దరూ సర్దుకొన్నారు. భద్ర కళ్ళు తుడుచుకొంది.

“ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నీలాగే ఆలోచించడం మొదలెడితే దానికి అంతం ఉందా? మన దురదృష్టాలు ఈ హత్యలకి ప్రోత్సాహం ఇప్పిస్తే మరి అయ్యో అనుకోవలసిన పని కూడా వుండదు.”

“తెలుసు....నాకు తెలుసు. ఇది వట్టి మూర్ఖత్వమని. కాని మనసు నిలబడదు. ఒక్కొక్కప్పుడు ఆయన బ్రతికే వున్నారేమో ననిపిస్తుంది. ఆ ఆశ కలిగినప్పుడు అన్నం కూడా నోటికి పోదు....లేకపోతే చెట్టంత మనిషి ఏమయిపోతారు?....అందరి విషయంలోలాగ ఆయన మరి లేరనుకొంటే వుండే బాధ వేరు. ఒక ఏడుపు ఏడుస్తాం. మరి వూరుకొంటాం. మనస్సుకీ ఆరాటం వుండదు.”

వీపు రాస్తూ, భద్ర కాతర స్వరంలో అడిగింది-”నీకింకా ఆశ ఉందా?”

జానకి తల అడ్డంగా తిప్పింది. అందులో ఆమెకు ఏమాత్రం సందేహం లేదనేదే కనిపిస్తూంది. కాని మాటమాత్రం అంత ఖండితంగా లేదు.

“మనకి యెంతో ప్రేమ వున్నవాళ్ళయినా, పరమద్వేషం వున్నా వాళ్ళు చచ్చిపోయారంటే కూడా నమ్మలేం. అల్లూరి సీతారామరాజు కోసం మరో వందేళ్ళు గడిచాక కూడా వెతుకుతాం. సుభాష్ బోసు మాటేమిటి? వాళ్ళమీద మనకున్న ప్రేమా, అభిమాన౦ అట్లాంటివి. ఎంతో ద్వేషించే హిట్లరు నిజంగా చచ్చిపోయాడంటారా అని పాతికేళ్ళ తరవాత కూడా ఎందరు ప్రశ్నించడం లేదు? మనుష్యుల బలహీనత అది. నా విషయంలో అదే జరుగుతూంది.”

ఒక్క నిముష౦ తటపటాయించినట్లు ఆగింది.

“ఇప్పటికీ ఆ ఆశ చచ్చిపోయిందనుకోలేను. ఆయన వచ్చి నాకోసం అక్కడ వెతుకుతుంటారేమో. నేనిక్కడున్నానే, పోదామా-అనిపిస్తూందంటే నమ్ముతావా?”

“నీకు మతిపోయింది.”

“రాత్రి రంగామ్మగారిని చూసినప్పటినుంచి మనస్సు తరుముతూంది.”

“ఏమిటి నీ ఆశకి ఆధారం?”

“ఏమీలేదు. భ్రమ.”

చాలసేపు ఇద్దరూ ఊరుకొన్నారు. తరవాత మళ్ళీ జానకే ప్రారంభించింది.

“మేము చంపెసేమంటే ఆరోజుల్లో కాదు, ఈరోజుల్లో మాత్రం పోలీసులకి అడ్డు ఏముంది? పట్టుబడి పారిపోతూంటే కాల్చేశామంటారు. ఎదురుబొదురు కాల్పుల్లో చచ్చిపోయారంటారు. ఆత్మరక్షణకి కాల్చేశామంటారు. వాళ్ళకి ఎదురేముంది? కాని ఇక్కడ అటువంటిదేమీ లేదు. మనిషి అదృశ్యం అయిపోయేడు. ఏమయిపోయినట్లు? గవర్నమెంటు ఎక్కడికేనా ప్రవాసం పంపేసి ఎరగనట్లు నటిస్తూందా?”

తానే నమ్మలేని కారణాలనూ, అనుమానాలనూ జానకి బయట పెట్టింది. వానికున్న ఆపత్తులరీత్యా ఇంతవరకు వానిని ఎవ్వరి దగ్గరా చెప్పలేకపోయింది. తన చదువునూ, తెలివినీ అపహాస్యం చేస్తారని భయం. భద్రకూడా ఆ దుఃఖంలో సహభాగురాలు. కనుక వానిని చెప్పడానికి సిగ్గు కలగలేదు.

భద్రకు అసలు రావలసిన ప్రశ్న తోచలేదు. క్షీణస్వరంతో “ఎక్కడికి పంపిస్తారంటావు?” అంది. ఆ ప్రశ్న చూస్తే, అమెకది ఆలోచించవలసిన సంగతేనని తోచిందనిపిస్తుంది.

జానికికి ధైర్యం చిక్కింది. తన మనస్సులోని అనుమానాలను ప్రస్తరించసాగింది.

“అండమాన్, నికోబార్ దీవులు సముద్రం మధ్యలో, ఉత్తర దక్షిణాలకి ఓ వెయ్యిమైళ్ళ పొడుగున, చిన్నా పెద్దా రెండుమూడు వేలవరకూ ఉన్నాయంటారు. ఏ దీవిలోనేనా వున్నారేమో....సాధ్యం కాదంటావా?”

భద్రకు ఆమెమీద విపరీతమైన జాలి కలిగింది. సాధ్యంకాదని చెప్పడానిక్కూడా మనసొప్పలేదు.

“వెర్రిదానివి” అంటూ కౌగిలించుకొంది.

చాలాసేపు ఇద్దరూ ఒకరినొకరు ఆనుకొని నిశ్సబ్దంగా కూర్చున్నారు. మరల జానకే ఆరంభించి౦ది,

“ఎక్కడికేనా కదిలితే చాలు-ముందు ఏయే కాగితాలు ఏం చెయ్యాలో, ఎవరికి ఏమేం ఇవ్వాలో అన్నీ వప్పగి౦తలు పెట్టేవారు, అనుకొన్న వేళకు రాకపోతే ఏం చెయ్యాలో చెప్పేవారు.”

భద్ర మామూలుగానే అనేసింది.

“మళ్ళీ రామనిపించేది కాబోలు.”

ఆ వప్పచెప్పడాలు మామూలే నంది జానకి.

“ఎందుకా వప్పగి౦తలు? పట్టుబడితే చంపేస్తారనే జ్ఞానం ఉన్నట్లే కద! కాని ప్రాణం అంటే తీపి, చావంటే బెదురూ లేదా? అంత నిర్లిప్తంగా ఎల్లా ఉండగలిగే వారు?”

తన ప్రశ్నకి తానే సామాధానం ఇచ్చుకొంది. “ప్రజలకీ, దేశానికీ మంచి చేస్తున్నామనే విశ్వాసం! ఆ ప్రయత్నంలో మనప్రాణం పోయినా ఫర్వాలేదనే నిర్లక్ష్యం!....మొదట వెర్రిభయం వేసేది. ఏడుపు వచ్చేది. తిరిగొస్తే చంటిపిల్లలా కరుచుకుపోయేదాన్ని....”

ఆ మానసికాందోళన తీవ్రతను తన అనుభవాలతో భద్ర సరిచూసుకొంటూ౦ది.

“క్రమంగా ఆ వప్పగి౦తలు అలవాటయిపోయాయి. భయం వెయ్యడం మానింది. ఈమారు సంతోషమూ కలగడంలేదు. వీధిలోకిపోయి వచ్చినట్లే అనిపించసాగింది. కాని....ఒకమాటు….వెళ్ళిన మనిషి మరి రాలేదు.”

జానకి నోట మాట డెక్కుపట్టినట్లయింది. క్షీణస్వరంతో మూలిగింది.

“మరి....రానేలేదు.”

జానకి చాలాసేపు ఏడ్చింది. ఏళ్ళ తరబడి చెప్పుకునేందుకు ఎవరూ లేక, అణచిపెట్టుకొన్నబాధ, ఒక్కమారు కట్టలు తెంచుకొని బయటకు పొంగినట్లుయింది. భద్ర ఆమె కళ్ళు తుడిచి దగ్గరకు తీసుకొంది.

“ఇంతకాలం ఇంత బాధను ఎల్లా దాచుకొన్నావే తల్లీ!”

ఏదో జ్ఞాపకం వచ్చినట్లు జానకి చెప్పుకుపోయింది.

“ఆశ అనిపిస్తూంటుంది.”

“హఠాత్తుగా మాయమైన మనిషి అంత హఠాత్తుగానూ వచ్చేస్తారేమో. తీరా వస్తే నేనక్కడ లేకపోతే?....”

ఆమె బొ౦బాయినే కాదు, ఆ వీధిని, ఆ యింటిని కూడ వదలలేకపోయింది. అక్కడే వుద్యోగం చేసుకొంటూ పై చదువులు చదివింది. ఆ చదువు మనస్సుకో వ్యావృత్తి కలిగించడం కోసం. పరీక్షలు ప్యాసయింది. ఉద్యోగాలు మారింది. కాని ఇల్లు మార్చలేదు, చాలాకాలం....

ఆ ఆశ పోనేలేదు. హైర్-పర్చేజు పద్ధతిలో ఫ్లాట్ కొనుక్కున్నా అది ఎవరికో అద్దెకిచ్చి తాను మొదటి చోటనే ఆ ఇంట్లోనే వుంది. ఆ ఇల్లు తీసేశారు. అప్పుడు తన ఇంటికి వెళ్ళినా వారానికి వోమారేనా పాత ఇంటి వీధికి వెడుతుంది. అక్కడున్న పార్కులో కూర్చుని వస్తూంటుంది.

ఆ కథ విని భద్ర కూడా కళ్ళనీళ్ళు పెట్టుకొంది.

వారి కబుర్ల సడి విని పక్కగదిలో పడుకున్న సత్యానందం లేచి వచ్చాడు. లైటు వేసేడు. ఇద్దరూ కూర్చుని వున్నారు.

“మీరిద్దరూ నిద్రపోనేలేదా? ఎంత అయిందో చూసుకొన్నారా? రెండు దాటింది.”

భద్ర కళ్ళు తుడుచుకుంటూ గోడనున్న గడియారం వంక చూసింది. సత్యానందం గ్రహించేడు.

“ఏమిటిది! భద్రా! నువ్వుకూడానా! దానికి ధైర్యం చెప్పడానికి బదులు నువ్వూ ఏడుస్తున్నావూ? ....బాగుంది వరస! ....ఏమిటిది జానకీ!” అంటూ ఊరడింపుగా తల నిమిరేడు.

“నాకొకరు ధైర్యం చెప్పాలిసిన అవసరం ఉందా బావా! రాయయిపోయా కదా!"" అని జానకి ఏడ్చింది.

"వూరుకో. అలా కాగలిగితే మంచిదే. కావడం అవసరం కూడా. లేకపోతే మన దేశంలో ఒక్కరోజు బతకలేము" అన్నాడు, సత్యానందం సగం వోదార్పుగా, సగం విశ్వాసంతో.

ఎనిమిదో ప్రకరణం

రాత్రి ఘటనలు సత్యానందం మనస్సుకు చాలా చాలా కలవరం కలిగించాయి. వానిమీద వచ్చిన వ్యాఖ్యలు విన్నప్పుడు చాలా బాధ కలిగింది.

ఊరేగింపులో వాళ్ళు తన్ను తిట్టేరు. తన పార్టీని తిట్టేరు. ఈ తిట్లు ఈ అయిదు ఆరేళ్ళుగా అలవాటయిపోయాయి. ఇప్పుడు బాధ కలగడం లేదు. నవ్వూ రావడంలేదు. జాలి కలుగుతూంది.

రాజకీయ పార్టీలలో తిట్లూ అహంభావప్రదర్శనా బలహీనతకు గుర్తు. బలహీనతను కమ్ముకొని, శక్తి పెంచుకొనడానికి వానినే అధారం చేసుకొంటే మరింత బలహీన పడతారు.

కేరళలో ఐక్య సంఘటన ప్రభుత్వం అల్లాగే శిథిలం అయింది. పశ్చిమబెంగాల్ ఐక్యసంఘటనలో మార్క్సిస్టు పార్టీ అటువంటి స్థితినే తెచ్చుకొంటూంది. కాని సుందరరావు దానినెందుకు గుర్తించడు? అతనికి తన కన్న యెక్కువ పార్టీజీవితం వుంది. ఆ ప్రారంభ దినాలలోనే మార్క్సిజం గురించి బాగా చదివేడు. నిజం చెప్పాలంటే తనకే సిద్ధాంత పరిజ్ఞానం తక్కువ. కాని, తనకే యింత విస్పష్టంగా కనిపిస్తున్న ప్రమాదం సుందరరావుకు యెందుకు తెలియడం లేదు? ఎందుకు అర్థం చేసుకోడు? తన సిద్ధాంత పరిజ్ఞానం తక్కువగనక తన ఆలోచనే తప్పుతూందా? అయితే అనుభవం?

తన యింటి గేటు మీది లైటు డోము అయిదారు రూపాయిలిస్తే వస్తుంది. అదో నష్టం కాదు. దానిని పూడ్చుకోవడం కష్టంకాదు.

కాని, రంగమ్మగారి బాధ అతని కడుపులో చెయ్యిపెట్టి కలిపేస్తూంది. ఆమెది తీరే నష్టంకాదు. చెట్టంత కొడుకు. నేడో రేపో చేతికి అందుకొంటాడనుకొన్నవాడు. పైగా ఏకపుత్రుడు. పోయేడంటే యెంత బాధ? ఆ బాధలో ఆమెకు మతే పోయింది. అంతేకాదు. ఎంతో శాంతురాలనీ, మంచి మనిషి అనీ పేరు పడ్డ ఆమె పెద్దపులి అయ్యింది....అయ్యయ్యో...! అనుకొన్నాడు.

కాని, ఆమె దుఃఖం, అంత బాధ కూడా గ్రామంలో అందరి సానుభుతీ సంపాదించలేదు. అదే అతని బాధ. వారి వ్యాఖ్యలు చూస్తూంటే దేశం ఏమయిపోతూందనిపిస్తూంది. స్వాతంత్ర్యానికి పూర్వం జనంలో వున్న సహృదయత ఏమయింది? ఏమయింది!

"మతి స్వాధీనంలో లేనప్పుడే మనిషి అసలు రంగు బయటపడుతుంది. అందరూ అనుకొనేటట్లు ఆమె శాంతురాలూ కాదు. మంచిదీ కాదు-" అన్నారు ఒకళ్ళిద్దరు, మనస్తత్వ పరిజ్ఞానం కనబరుస్తూ.

"సుందరరావుకి మంచి పరాభవం జరిగింది. మీరామెను పట్టుకొని వుండకూడదు. కమ్యూనిస్టు పార్టీలో చేరినా గాంధేయ మనస్తత్వం వదులుకోలేద"ని కొందరు తననీ తప్పు పట్టేరు.

"ఏ పార్టీవాడైతేనేం, అగ్రహారంలో బ్రాహ్మణ్ణి, కిందికులం మనిషి అల్లా బండబూతులు తిట్టడమా" అని కొందరు కలివిడంబానికి విస్తుపోయారు. సైన్సుమేష్టారూ, ఆయన భార్యా గ్రామంలో ఎంత మన్నన సంపాదించుకొన్నా కులానికి కమ్మ. పాత బెణుకులాగ ఈవేళ కూడా కులం సమస్య కలక వేస్తూనే వుంది?

ఏమిటిది మనం వెడుతున్నది ముందుకా, వెనక్కా? ఒక అడుగు ముందుకి - రెండడుగులు వెనక్కి-అన్న లెనిన్ పదం గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది.

....దానికి జానకి దుఃఖగాధ కూడా తోడయి మనిషి ఉంగీిడెత్తినట్లయిపోయేడు. ‘పంచ్’లో కాబోలు వేశారన్న కార్టూన్ మాట గుర్తువచ్చింది. మునిగిపోయిన వోడను పిల్లకు చూపి, తల్లిచేప-ఇల్లాంటివి ఇరవైయేళ్ళకు వోమారు పైనుంచి వస్తుంటాయి-అందిట. జానకికి ఆపద వచ్చి యిరవైయేళ్ళు కావచ్చింది! మళ్ళీ రంగమ్మ! దీనికి విముక్తి లేదా?

విముక్తి! దేశం విముక్తి పొందింది. కాని ప్రజలకి విముక్తి రాలేదు. "దేశమంటే మన్నుకాదోయ్, దేశమంటే మనుజులోయ్!" మన్ను, మనుష్యులు!

….జాతీయాభిమానం తలఎత్తిన రోజునే దేశ విముక్తి జరగలేదు. కనీసం నూరేళ్ళు పట్టింది. ఎన్నో సిపాయి తిరుగుబాట్లు, ఆత్మత్యాగాలు, సహాయనిరాకరణలు! సత్యాగ్రహాలు! శాసనోల్లంఘనలు! మళ్ళీ సైనికుల తిరుగుబాట్లు! సమ్మెలు!

అదంతా సుదీర్ఘమైన రక్త ప్రవాహాల గాధ! కన్నీటి గాధ! త్యాగాల గాధ!

అల్లాగని, జనం సుఖపడేందుకు చేసే ప్రయత్నాలలో ఈ ప్రాణహరణలు, కన్నీళ్ళూ తప్పనిసరి పీడలని సరిపుచ్చుకోవలసిందేనా? వీనికి విరుగుడేమిటి?

తెల్లవారి నిత్యజీవిత వ్యవహారాలలో పడినా అతనిని ఈ ఆలోచనలు వదలలేదు. యంత్రవత్తుగా పనులు చేసుకుపోతున్నాడు. భద్ర గమనించింది.

"ఏమల్లా వున్నారు?" అనడిగింది.

"ఏంలేదే. ఎల్లావున్నాను?"

అది ప్రశ్నా కాదు. సమాధానమూ కాదు. తప్పించుకొనేందుకు చేసిన వ్యర్థప్రయత్నం. భద్ర అర్థం చేసుకొంది.

"కూర్చోండి. కాఫీ ఇస్తాను" అని పీట వాల్చింది.

"జానకి ఏది?"

"స్నానంచేసి బట్ట కట్టుకొంటూంది. వస్తూంది."

"వోమాటు రంగమ్మగారింటికి తీసుకెళ్ళు. ఎవరో ఒకరు వస్తూ, పోతూంటే మనస్సుకి కాస్త ఉపశాంతి…."

భద్ర నిరుత్సాహంగానే అంగీకరించింది...."ఉపశాంతి కాకేముంది? జానకి ఏం చేస్తూంది? జ్ఞాపకం వచ్చినప్పుడు వో ఏడుపు ఏడుస్తారు. కళ్ళు తుడుచుకొని వూరుకొంటారు…."

సత్యానందం ఒక్క నిట్టూర్పు విడిచేడు. భద్రే అంది.

"ముఖ్యమంత్రి కాలేజీహాస్టల్‌మేటు, జైలుమేటు అన్నారు. మీకు స్నేహమూ వుంది. ఏమిటీ దురన్యాయం అని--వోమారు మాట్లాడిరారాదూ?"

సత్యానందానికి వెనుకటిగాధలు జ్ఞాపకం వచ్చి మ్లాన హాసం చేసాడు.

"ఇరవయ్యేళ్ళ క్రితం నువ్వే వో మాట అన్నావు గుర్తుందా?  ఏదో ఇల్లాంటి విషయమే వచ్చి నిన్ను మద్రాసు వెళ్ళి మీ బాబయ్యనూ, ముఖ్యమంత్రినీ కలుసుకురమ్మన్నాను. మంత్రులు బంధువులుగా లేనివాళ్ళేం చెయ్యాలన్నావు!"

"ఏమో ఏమన్నానో, కాని వెళ్ళేను కాదా!"

సత్యానందం ఆనాటి ఘట్టాలింకా జ్ఞాపకం చేసుకొన్నాడు.

"అప్పుడు జాన్ కూడా అదేమాట అన్నాడు. రాజకీయాలను బంధువుల మధ్య వచ్చిన పేచీలలాగా సర్దుకోబోతే ప్రజలకే నష్టం అన్నాడు..."

జాన్ ప్రసక్తిని భద్ర సహించలేకపోయింది.

"జాన్ మాటలు నాదగ్గిర చెప్పకండి. తానూ వో మనిషే. తవుడూ వో రొట్టే. అతగాడి మంత్రాంగమే వూరి నింతవరకూ తెచ్చింది."

"తొందరపడకు భద్రా! జాన్ బలహీనుడయి అల్లా తయారయాడు కాని, చెడ్డవాడు కాదు."

"మీరే మెచ్చుకోవాలి."

భార్య యిచ్చిన కాఫీ చప్పరిస్తూ సత్యానందం నిశ్శబ్దంగా వూరుకొన్నాడు. అతని మనస్సులో ఆనాటి కథలన్నీ సినీమాబొమ్మలలా కదులుతున్నాయి.

ఆనాడు ఉమ్మడి మద్రాసు అసెంబ్లీలో చర్చలు సాగుతున్నదృష్ట్యా అగ్రహారంలో జరుగుతున్న అసలు విషయాన్ని ముఖ్యమంత్రికి రాయబారి ద్వారా తెలుపుతే చాలునన్నాడు తాను. ప్రజలలో ప్రబోధంచేసి వారిని చైతన్యవంతుల్ని చేయడం అసలు చేయవలసిన పని అన్నాడు జాన్. ఆ పేరున సభలూ ప్రదర్శనలూ జరిపితే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, ప్రతిష్ఠకోసం పాకులాడేలాగ చేస్తామని తన భయం. తానే తప్పేడు.

కాని, చివరకు ఏం జరిగిందో ఎలా జరిగిందో. అంతా కలలో మాదిరిగా జరిగిపోయింది. ప్రజలలో చైతన్యం కావాలనే వాళ్ళు వాళ్ళ చైతన్యానికి విరుద్ధంగా నిర్ణయాలు చేసి వాటిని అమలు జరపండన్నారు. ఏవిధమైన సన్నాహాలూ లేకుండా, ప్రత్యక్ష పరిస్థితులను గమనించుకోకుండా దేశవ్యాప్త రైల్వేసమ్మె నిర్ణయం ఏమిటని ఆనాడు రహస్యదారుల్ని పడి గ్రామం చేరిన విశ్వాన్ని తానే అడిగేడు. ఆయనే ఒక విశ్వాసంతో గాక విమూఢదశలో పని చేస్తున్నట్టుగా అనిపించింది. ఆయనే కాదు. అందరూ అల్లాగే  కలలోలాగ, దిగ్భృమ చెందినట్లు, మోహావిష్టులలాగ పని చేస్తున్నారనిపించింది. తెలివి వచ్చి, కళ్ళు తెరచేసరికి తాము ఎవ్వరూ తమ స్థానాలలో లేరు.

తాను కమ్యూనిస్టు పార్టీలో చేరేడు. జాన్ ప్రజాప్రబోధం విడిచి ప్రజోద్ధరణకు పూనుకున్నాడు. విశ్వం అసలు లేకుండానే పోయేడు! నాటినుంచి నేటివరకు ప్రతి ఒక్కరూ తమ గుర్రాలమీద బిగిసే కూర్చున్నారనిపిస్తూంది. ఇదెల్లా జరిగింది? జరిగిన దెంతవరకు సవ్యం? ఏది సత్యం? ఏదసత్యం!

కరిగిపోతున్నాయి సరిహద్దు రాళ్ళు.

కదులుతున్నాయి కాలపుకీళ్ళు!

ఈ యింట్లో భయం వాసన

ఎటూ దారీ తెన్నూ లేదు

ఇది రాక్షసపతి రాజధాని.

బలిచక్రవర్తి నివాస భూమి.

“ఎవరిదీ పద్యం? ఎక్కడ చదివేను” అనుకొంటూ సత్యానందం గోడకి జేరబడ్డాడు.

తొమ్మిదో ప్రకరణం

“ఎవరో అబ్బాయి  వచ్చి కూర్చున్నాడులా వుంది బావా!”-అంటూ జానకి వంటయింట్లోకి వచ్చింది.

“ఒక్కరేనా?”-అంటూ సత్యానందం చేతిలో కప్పు కింద పెట్టేడు. అతడింకా చాలామంది రాకకి ఎదురుచూస్తున్నాడన్నమాట.

“ఏం విశేషం?”-అంది.

“సాహిత్యవారం.”

కమ్యూనిస్టుపార్టీ ప్రతి ఏడాదీ ఒక వారాన్ని సాహిత్యాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళడమే ప్రధాన కార్యక్రమంగా కేటాయించడం ఎన్నో ఏళ్ళుగా అలవాటు. దానికై పార్టీ యంత్రాన్నంతనూ కదిలిస్తుంది. పార్టీ సభ్యులంతా ఆ వారంరోజులూ శ్రద్ధగా పుస్తకాలు తీసుకొని వూళ్ళోకి వెడతారు.

ఆ మాట వినగానే భద్ర కంగారు కనబరచింది.

“వీధిలోకెడితే ఈపూట ఏ రెండింటికోగాని ఇంటికి తిరిగిరారన్నమాట. జానకి కూడా వచ్చింది. ఈవేళకి వాళ్ళని వెళ్ళిరమ్మనండి” అని సలహా యిచ్చింది.

సత్యానందం నవ్వేడు. ‘గట్టిదానివే’ అన్నాడు.

“అసలు నిన్ననే ప్రారంభించవలసింది. పుస్తకాలు పూర్తిగా చేరకా, అందరూ తెమిలి పనుల్లోంచి బయటపడకా వోరోజు వుట్టినేపోయింది.”

జానకి తన కోసం పని ఆపవద్దంది.

“ఈ ఏడాది మంచి పుస్తకాలు తెలుగువి వున్నాయా? లేక అన్నీ మాస్కో పుస్తకాలేనా?”

“వీధిగదిలో వున్నాయి. నీకు నచ్చినవేవో నువ్వే చూసుకో”-అని సత్యానందం కదిలేడు.

“పోనీ, ఏదన్నా టిఫిన్ చేస్తాను. తినివెళ్ళండి. ఇల్లాంటి పనున్నప్పుడు ముందు చెప్పకూడదా?”-అని భద్ర లేచింది.

“చెయ్యి. వుంటే వస్తా”నన్నాడు సత్యానందం.

ఈ దారి ఎక్కడికి? (రధచక్రాలు - ఉత్తరగాధ) · 第 1 / 15 段