"రావయ్యా! రా, విన్నావు కాదూ, రేపు తెల్లవారి ఏడు గంటల వేళకి గాంధీగారు వస్తారు. ఇక్కడ పది నిముషాలు వుంచడానికి

బ్రహ్మప్రళయం అయిపోయిందనుకో. మనవాడు...."

"అదే విన్నాను. అందుకే వచ్చేను. అల్లాంటి మహాపురుషుడు వచ్చినప్పుడు వారిని వేదోక్తాశీస్సులతో పంపడం మన గ్రామానికి

ప్రతిష్ఠ. వారి పనికి ఎంతో మేలూను. ఆ విషయం ఆలోచించేడో లేదోయని...."

చేతిలో వున్న పని పక్కనెవరికో వప్పచెప్పి రామనాధం శంకరశాస్త్రి దగ్గరకు వచ్చేడు. ఆయన సూచనకు హర్షించేడు.

"ఎవరెవరు వస్తారంటావు బాబాయి!"

"అది నాకు వదిలెయ్యి. సుబ్బావధాని ఇందాకా ఈమాట జ్ఞాపకం చేసేడు. ఇంకెవరూ రాకపోయినా మేమిద్దరం వుంటాం. ఇంక శివకామయ్యా

వాళ్ళూ కొద్దో గొప్పో స్మార్తం చెప్పుకున్న వాళ్ళేగా, వస్తారు."

ఆఖరున తాను తెచ్చిన తాటాకు రేకును శంకరశాస్త్రి రామనాధానికందించేడు.

చక్కని గుండ్రని అక్షరాలతో దానిమీద భగవద్గీత నుంచి ఒక్క శ్లోకం వ్రాసి వుంది. అక్షరాలు స్ఫుటంగా కనిపించేటందుకు

కాకరాకు పసరు రుద్ది వుంది.

మేనమామ చేతి క్రింది నుంచి బాలకృష్ణ చదివేడు.

'యదా యదా హి ధర్మస్య

గ్లానిర్భవతి భారత!

అభ్యుత్థానమధర్మస్య

సంభవామి యుగే యుగే'

ఆ శ్లోకం అర్థంగాని, ఎందుకోగాని ఎరగని బాలకృష్ణ ముచ్చటగా వున్న అక్షరాల పొందికను మెచ్చుకొన్నాడు.

"గంటంతో వ్రాశావా, సిరాతో వ్రాశావా తాతయ్యా?"

ఆ తాళపత్రం గాంధీగారికి విరాళంతోపాటు ఇవ్వడానికి తయారుచేశాడు ప్రత్యేకంగా శాస్త్రి.

"ఏం బాగుండదా?" అన్నాడు శాస్త్రి.

ముంగండ తరఫున గాంధీజీకి అది జ్ఞాపిక, ఆయన యెడ వారి విశ్వాసానికది గుర్తు. ఆయన సందేశం యెడ వారికిగల భక్తి

భావానికది సూచిక.

ముంగండే కాదు, తెలుగుదేశమే ఆ విశ్వాసంతో ప్రతిబింబించింది.

తోటలో దూరాన సూరాయి పాడుతున్న పాట విని శాస్త్రి తల ఎత్తేడు...

'సుందరమైన రాట్నమే

పసందు బాంబురా

సందేహమేలా అందులోనే

స్వరాజ్యమున్నాదిరా!'

శంకరశాస్త్రి తల పంకించేడు.

"ఒక్కొక్క జాతకం...."

--అని ఏదో అదృశ్యశక్తికి ఓ నమస్కారం చేశాడు.

రామనాధం నవ్వుకున్నాడు.

కొల్లాయిగట్టితేనేమి?

నేనెందుకు రాశాను?

Hidden Springs of the Indian National Movement ను తెలుగు నాటి కమ్యూనిస్టు Cadre కి

చెప్పడం కోసమే నేనీ నవలను వ్రాసేను.

1960ల నాడు నేను ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ పత్రిక విశాలాంధ్రలో సబ్‌-ఎడిటరుగా పనిచేస్తున్నాను. ఆ రోజులలో

ఆదివారం ప్రత్యేక సంచిక బాధ్యత నేను చూస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జయంతి సంచికకై వ్యాసాలు సేకరిస్తున్నాను. ఆ

సందర్భంగా వచ్చిన ఒక వ్యాసం నా మనస్సుకు చాలా బాధ కలిగించింది. 'అమృతాంజనం అమ్ముకోడానికి పుట్టిన ఆంధ్రపత్రిక

అల్లూరి సీతారామరాజును దౌర్జన్యకారిగా నిందించిం'దని రచయిత అభ్యంతరం. గాంధేయ అహింసావాదాన్ని సమర్థిస్తూ 1922లో

ఆంధ్రపత్రిక ఆ వ్యాఖ్య చేసి వుండవచ్చు. అభిప్రాయభేదంగా చూడాలి తప్ప అది నింద్యమేం కాదు. 1936నాడు

సోషలిస్టు-కమ్యూనిస్టు సాహిత్యాన్ని పల్లెటూళ్ళకు తీసుకెళ్ళినప్పుడు మా వాకబు గ్రామంలో ఆంధ్రపత్రికనెవరు తెప్పిస్తారు?

ఎవరు చదువుతారు? అనే. ఆ పాఠకులు సామాజికంగానూ, రాజకీయంగానూ పురోగామి భావాలు కలిగి వుంటారనీ, వారి మనస్సులు సోషలిస్టు

భావాన్ని ఆకళింపు చేసుకోగలుగుతాయనే మా అభిప్రాయం. సాధారణంగా వారు మమ్మల్ని మాట్లాడనిచ్చేవారు, వినేవారు. మర్యాదకైనా

పుస్తకాలు తీసుకొనేవారు. ఆ విధంగా ఆంధ్ర ప్రజలలో రాజకీయ, సామాజిక సంస్కారం కలిగించిన ఆంధ్రపత్రికను 'అమృతాంజనం

అమ్ముకోడానికి పుట్టిందని' నిందించడం నాకు కష్టం అనిపించింది. దీనికి కారణం జాతీయోద్యమ పురోగతికి ఏయే శక్తులు ఏ విధంగా

తోడు పడ్డాయో తెలీకపోవడమే అనిపించింది.

ఆ రాసిన వారొక కమ్యూనిస్టు రచయిత. బహుగ్రంథకర్త. అంతేనా? ప్రజాసంఘాలతో సంబంధం వున్న కార్యకర్త.

కమ్యూనిస్టు వుద్యమం పుట్టుక నుంచీ కాంగ్రెసు వ్యతిరేకతను జీర్ణించుకున్న వుద్యమం. కాంగ్రెసు జాతీయోద్యమంలో Identify

అయి విస్తరిస్తూంటే కాంగ్రెసు ఆస్తిపరుల (బూర్జువాల) సంస్థ అనీ, అది శ్రామిక వర్గ ప్రయోజనాలకు శత్రువనీ, కనుక

దానిని సర్వాత్మనా వ్యతిరేకించవలసిందేననీ Cadre ను నమ్మింపచేసింది. దాని ఫలితమే ఈ వ్యాసధోరణి అనిపించింది. కనక

జాతీయోద్యమ విజృంభణకు దేశంలో మూలం ఎక్కడుందో చూపడం, Educate చేయడం అవసరమనిపించింది.

ఎప్పుడో 1936-40 మధ్యకాలంలో నేను Hidden Springs of the Russian Revolution అనే

పుస్తకం చదివేను. అది ఓ చరిత్ర గ్రంథం. ఆ పేరు గుర్తు వచ్చింది. జాతీయోద్యమ విజృంభణకు మూలం అయిన సామాజిక

పరిణామాలను నా నవలలో చిత్రించాలి.

* * * * *

మన జాతీయోద్యమం చాలామంది భావిస్తున్నట్లు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమైనది కాదు. కులమత భేదాలను, ద్వేషాలనూ

నిరాకరించడంలో, నిర్మూలించడంలో దాని భవిష్యత్తు ఆధారపడి వుంది. సమాజంలో సగం మంది వున్న స్త్రీలను ముందుకు తీసుకురావడం,

సమానస్థాయి కల్పించడం మీద దాని పురోగతి ఆధారపడి వుంది. అస్పృశ్యతనూ, అసమానతనూ పోనాడి వెనకబాటుతనంతో అవమానాలకు

గురి అవుతున్న వర్ణ పంచమత్వాన్ని నిరాకరించడం, వారికి మిగిలిన వారితో సమాన ప్రతిపత్తిని కలిగించడం ఆ వుద్యమ

పురోగతికి ఆయువుపట్టుగా వుంది. ఫ్యూడల్‌ ఆచారాలనూ, ఆలోచనలనూ, అలవాట్లనూ పోనాడి, జనంలో తలెత్తుతున్న

కొత్త ఆలోచనలకూ, ఆచారాలకూ పుష్టినివ్వాలి. వానిని అలవాటు చెయ్యాలి.

చరిత్ర గతి క్రమంలో ఆంధ్ర ప్రజ ఫ్యూడల్‌ సమాజపు కట్టుబాట్లు, ఆచారాలు, ఆలోచనలు మానవతకు విరుద్ధంగా

వున్నాయని అనుమానించడం, నిరసించడం, ధిక్కరించడం శతాబ్దాలుగా సాగుతూనే వుంది. అయితే 19వ శతాబ్దంలో బెంగాల్‌ నుంచి

వలస వచ్చిన బ్రహ్మసమాజం ప్రభావం వానికో రూపాన్ని ఇచ్చింది. వాని బలంతో జాతీయోద్యమం పుంజుకుంది. దాని వత్తాసుతో అవి

మరింత పుంజుకున్నాయి. ఆ కథలూ, గాధలూ చరిత్రగా రూపొందుతున్నట్లు గ్రహించకపోతే జాతీయోద్యమ గతీ, దానిలో మన పాత్రా

అర్థం కావు.

ఇక్కడ ఒక చిన్న ఉదాహరణనిస్తాను. కొల్లాయి గట్టితేనేమికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య ఎకాడమీ 1968లో

అవార్డునిచ్చింది. ఆ అవార్డు తీసుకోడానికి హైద్రాబాద్‌ సారస్వత పరిషత్తు హాలుకు వెళ్ళేను. అక్కడ నోరి

నరసింహశాస్త్రిగారూ, పోలూరి ఆంజనేయ ప్రసాదుగారూ కనిపించేరు. శాస్త్రిగారు నన్నభినందించి-- "నీ నవల రెండు వడపోతలయి

జడ్జిమెంటుకి వచ్చింది. నీ పుస్తకం నేను చూడలేదు. మార్కెట్టులో ప్రయత్నించినా దొరకలేదు. చివరకు అతను (ఆంజనేయ

ప్రసాదు) తెచ్చి ఇచ్చాడు. చదివేను. నా చిన్ననాటి జీవితం గుర్తు వచ్చింది. చాలా అద్భుతంగా రాసేవు." అన్నారు. " నీ

పుస్తకానికి నా వోటు వేశా."

"సంధ్యావందనాదికాన్నీ, సాంప్రదాయికాచారాల్నీ అపహాస్యం చేశానే మీకది ఎట్లా నచ్చింది" అన్నా. శాస్త్రిగారూ, నేనూ 1936

నుంచి మిత్రులం. వారి నైష్ఠికత నాకు బాగా పరిచితం. మల్లారెడ్డి (శాస్త్రిగారి నవల) నవల పీఠిక గురించి నేనాయనతో

భేదించడం, తనను సమర్థించుకుంటూ ధర్మశాస్త్రాలను ఉదహరిస్తూ ఒక రాత్రంతా ఆయన వాదించడమూ 1960లో కథ.

"ధర్మ శాస్త్రాలు సరే, అవి ఈనాడూ అమలు జరుగుతాయనీ, జరగాలనీ మీరంటారా? నేనంగీకరించను" అన్నాను అప్పుడు. ఇప్పటి

నా ప్రశ్నకి మూలం అది. శాస్త్రిగారు నవ్వుతూ. "అది నీ కమ్యూనిస్టు గోరోజనంలే, కాని చాల గొప్పగా రాసేవు.

కమ్యూనిస్టువయిపోయావు గాని, తెలుగువాళ్ళు నీకు బ్రహ్మరథం పట్టేవారు కాదటోయ్‌" అన్నారు.

"కమ్యూనిస్టునయ్యాను గనుకనే బ్రహ్మరథం పట్టించాలన్నట్లు వ్రాసేననుకోండి" అన్నాను.

శాస్త్రిగారు గొప్ప జాతీయవాది. రెండో వేపున కట్టర్‌ సంప్రదాయ వాదిన్నీ. అందుకే ఈ సంభాషణను ఇక్కడ

వుదహరించాను. ఆయనలోని సాంప్రదాయికత జాతీయోద్యమంలో వస్తున్న భిన్న ధోరణులకు వ్యతిరేకం కాలేదు. వానికి సహకరించింది.

శాస్త్రిగారు నా నవలలో తమ చిన్ననాటి జీవితాన్ని చూసుకున్నాను అంటే నవలలో జీవిత వాస్తవాలు చిత్రించబడినాయనుకోవాలి. అంటే

సమాజంలో వస్తున్న మార్పులు, అవి తమ సాంప్రదాయక పంథాకు భిన్నంగానే వున్నా "అది కమ్యూనిస్టు గోరోజనంలే" అని

సాచివేయగలంతగా అలవాటయిపోయింది. అంటే ఆ మార్పులు జీవితంలో భాగాలయిపోయాయి. ఆ మార్పులు దేశ జీవితంలో భాగాలనడాన్ని

కార్యకారణ సంబంధాలుగలవిగా చూపడం చేతనే ఆయన నవలలో తన చిన్ననాటి జీవితాన్ని చూడగలిగేరు.

మాలపల్లి స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన నవలే. కొల్లాయి గట్టితేనేమి లాగ 1920 ప్రాంతాల నాటి వుద్యమాన్నే అందులో

చిత్రింప బూనుకున్నారు. అయితే అందులో వుద్యమాన్నిidealistic పంథాలో చిత్రించారు. కాని, నేనీ నవలలో 'ఒక యుగసంధితో

భిన్న చారిత్రక ధర్మాల మధ్య జరిగే చారిత్రక సంఘర్షణను వ్యక్తుల వ్యక్తిత్వాలలో జరిగే అంతస్సంఘర్షణ'గా చిత్రించ

ప్రయత్నించాను. చాల అరుదైన ఈ కళాభిజ్ఞతను సమకూర్చినది మార్క్సు వివరించిన చారిత్రకభౌతికవాద విజ్ఞానమే.

1936-37లలో మార్క్సేయ గతితర్కాన్నీ, చారిత్రక భౌతికవాదాన్నీ చదివాను అని మాత్రమే చెప్పగలను. ఆ రోజుల్లో మాకు

దొరికిన మార్క్సిస్టు సాహిత్యమే తక్కువ. లెనిన్‌ రాసిన 'Two Tactics', 'what is to be

done' లాంటివి దొరికేవి. అయితే రష్యను రాజకీయ పార్టీల Polemics మీద నాకు ఎందుచేతనో ఆసక్తి కలుగలేదు.

మార్క్సు గురించి లెనిన్‌ వ్రాసిన వ్యాసం చిక్కింది. కాంగ్రెసు నాయకుడు కళా వెంకట్రావుగారు మార్క్సు రాసిన

Capital మొదటి సంపుటం ఇచ్చాడు. దానినింక వదలలేదు. అందులో ఆయన గతితర్క సూత్రాలను రాజకీయాలకి సమన్వయం చేయడం

18th బ్రూ మెయిర్‌లో చూశాను. జీవితానికి గతితర్క సూత్రాలనన్వయించడం, ఆ కోణం నుంచి జీవితాన్ని అర్థం

చేసుకోవడం మీదనే నా దృష్టి అంతా.

మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నాక ఆ కోణం నుంచి నా అనుభవాలన్నీ కొత్త అర్థంలో కనబడసాగాయి. నేను చదువుకొన్నది

సంస్కృతం, తెలుగు, హిందీ ఈ మూడు భాషలలోనూ సాహిత్యాన్ని బాగానే చదివాను. మార్క్సిజం చదివాక ఆ చదువుకొన్నదంతా కొత్త కోణం

నుంచి కనబడింది. శాకుంతలంలో కాళిదాసు 'సతాం హి సందేహ పదేషు వస్తుషః ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః' అంటూ మంచివాళ్ళకి మంచి

ఆలోచనలే వుంటాయి అనే ఆనాటి జనంలోని విశ్వాసాన్ని నొక్కి చెప్పాడు. తరువాత ఓ వెయ్యేళ్ళకు పుట్టిన అయ్యప్పదీక్షితుల

వారు తమ 'చిత్ర మీమాంస'లో ఆ శాకుంతల శ్లోకాన్నే వుదహరించి దాన్ని ఒక అలంకారం--ఆత్మ ప్రత్యయాలంకారం అనేవాడు. అంటే

కాళిదాసు కాలం నాటి విశ్వాసం అప్పయ్య దీక్షితుల కాలం నాడు--ఒక అందంగా చెప్పిన అబద్ధం! మనుష్యుని సంస్కారంలో ఎంత

మార్పు వచ్చింది? ఆ కాళిదాసే కుమార సంభవంలో 'భవనేత్ర దహ్ని' మన్మధుణ్ని మసి చేసేసిందంటాడు. అక్కడ 'భవ' శబ్ద

ప్రయోగం ఔచిత్య భంగం అంటాడు, ఓ వెయ్యేళ్ళ తరవాత పుట్టిన క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చలో. ఈ మధ్యకాలంలో

శబ్దార్థాలలోనే మార్పు వచ్చిందా? పాణిని వ్రాసినట్లు మేమంతా శతాంధువుల్లాగ చదివాం (శతాంధాః కూపం ప్రవిశంతి శతాంధుః)

అన్నమాట. చదువుతున్న రోజుల్లో దేనికదే చదివాం. కంఠోపాఠం చేశాం. మార్క్సిజం చదివాక ఆ చదువుల లోపం కనబడసాగింది.

'హయ్యంగనీనమాదాయ ఘోష వృద్ధానుసస్థితాన్‌' అనే శ్లోకం ఆనాటి సామాజిక నిర్మాణాన్ని ఆలోచింప

చేస్తున్నదనుకొన్నామా? 'సమ్పణ్శయే వీత హిరణ్మయ త్యాత్‌ పాత్రేనిధా యార్ఘ్యమనర్ఘశీలం' అనే శ్లోకంలో రఘు

మహారాజు చేశాడని సూచించిన విశ్వజిద్యాగం వంటివి, సమాజంలో పెచ్చు పెరుగుతున్న కలిమిలేముల అవ్యవస్థను సరిదిద్దడం కోసం

సమాజం విధించిన ఉపశమన క్రియలనే భావం మార్క్సిజం చెప్పే వరకూ వూహలకెందుకందలేదు?

అలాగే జీవితంలో అనుభవించినవి, చూసినవి, విన్నవి అవగాహన కావడం మార్క్సిజం చదివాకనే. గత జీవితానుభవాలను కొత్త

వెలుతురులో అవగాహన చేసుకొనేందుకు నేను నిత్యం ఆలోచిస్తుండేవాడిని. ముంగండలో సంస్కృత పాఠశాల పెట్టాలనే ప్రయత్నం మూన్నాళ్ళ

ముచ్చటయింది. ఎందుచేత? అంతక్రితమూ, అటు తర్వాత కూడా గ్రామంలో వారాలు చేసుకుంటూ చదువుకొంటూండిన విద్యార్థులే ఆ పాఠశాల

బాలురు. అంతవరకూ మాకు సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం చెప్పిన-చెప్తూన్న పండిత గురువులే ఆ పాఠశాల

వుపాధ్యాయులు. కాని అది మూడు రోజులైనా నిలవలేదు. ఎందుచేతనన్న ప్రశ్నకు చారిత్రక భౌతికవాదం సమాధానం ఇచ్చే వరకూ నాకు

తట్టలేదు. చరిత్ర గతిని చూపి, జ్ఞానోదయం కలిగించిన మొదటి అంశం అది.

రెండోది మాల, మాదిగలను వీధులలోకి రానివ్వని గ్రామ వీధుల్లో మే దినోత్సవం పేరున పేటల జనాన్ని వూరేగింపుగా తెచ్చేం.

గంద్రగోళం జరుగుతుందేమోనని భయపడ్డాం. కాని ఎక్కడా అభ్యంతరం మాటే వినబడలేదు. దీనికి సమాధానం మార్క్సు ఆర్ధిక

సూత్రాలలో దొరికింది. ఆర్ధికావసరాల దృష్ట్యా మాల మాదిగలను వూరి వీధులలోకి తీసుకురానివ్వాలనే దృష్టి గ్రామీణులలో అదివరకే

అంతర్గతంగా వుంది. అందుచేతనే ఆ వూరేగింపు ఒక విధంగా వారి వాంఛకు రూపం ఇచ్చింది. కనకనే చల్లగా వూరుకున్నారు.

రాజమండ్రిలో శ్రీపాద కామేశ్వరరావుగారని ఒక అడ్వకేట్‌ వుండేవారు. మంచి విద్యావంతుడు.

ద్విజేంద్రలాల్‌రాయ్‌ నాటకాలెన్నింటినో తెలుగులోకి అనువదించిన రచయిత. వీరు తమ కోడలు చదువులకెగబడి

కాపురానికి రావడం లేదని కోర్టుకెక్కేరు. ఆ కేసు విచారణలో ఒక రోజున 'వినోదం' చూడడానికి నేను కోర్టుకు హాజరయ్యేను.

తరవాత కేసు నుంచి విడబడి ఆమె స్కూళ్ళ ఇన్‌స్పెక్ట్రస్‌గా పనిచేసి రిటైరయి ఇప్పుడు విజయవాడలోనే

ఒక విద్యాసంస్థ నడుపుతున్నారు. ఆమె పేరు శీతారామమ్మ. నేనామెను ఇటీవలనే కలుసుకున్నా.

ఆమె స్త్రీవాద దృష్టిలో అత్తవారిమీద తిరుగుబాటు చెయ్యలేదు. చదువు కోసం ఆమె ఆసక్తి, స్త్రీలలో పెచ్చు పెరుగుతున్న

విద్యాభిలాషకి ఆమె తిరుగుబాటు ఒక సూచన. ఈనాడు కాలేజీలలో చదువుతున్న యువతులు, వివిధ ఉద్యోగాలలో వున్నవారు ఆమె

వారసులు. ఆ రోజుల్లోనే అనేదేమిటి? సెక్సు జీవితంలో భాగం. సమాజంలో పెచ్చు పెరిగిన కులభేదాలు ఆచార భేదాలు ఆ జీవన

సహజ వాంఛని వికృతం చేయగలవేగాని నిరోధించలేవు. మా పెత్తల్లిగారి మగడు ఒక బలిజ అమ్మాయిని చేరదీశాడు. ఆమెకో యిల్లు

ఏర్పరచేడు. భోజనం మినహా ఆయన మకాం అక్కడే. ఆయనకో కొడుకు కలిగేడు. ఆ కుర్రవానిని ఇంటికి తీసుకొచ్చి తన పంక్తిన

పెట్టుకొనేవాడు. చదువు చెప్పించేడు. పెళ్ళి మాత్రం తల్లి కులం పిల్లనే వెతికి చేశాడు. సంప్రదాయాచారాల ప్రకారం అయితే

ఆయనని వూరిలో వెలివేసి వుండేవారు. కాని ఎవ్వరూ నోరు విప్పలేదు. కాని ఆ కుర్రవానికి తన స్థితి అవమానకరంగా తోచింది.

ఒకరి ఉంపుడుకత్తెగా వుండిందని తల్లిమీద కోపం. తనతో సమంగా బ్రాహ్మణత్వం ఇవ్వనందుకు తండ్రిమీద కోపం. పెళ్లి అయి

వుద్యోగంలో చేరేక మరి వూరు వేపు రాలేదు. తల్లిదండ్రులను చూడలేదు. ఒక పాతిక ముప్పయ్యేళ్ళ తరువాత అతని కూతురు తన

కమ్యూనిస్టు భర్తతో మా వూరు వచ్చింది. ఆమెకు మా అమ్మగారు చీర పెట్టి సత్కరించింది. అది అప్రస్తుతం. అసలు విషయం

తండ్రి అనాచారాన్ని బ్రాహ్మణ సమాజం సహించింది. ఎందుచేత? ఆ కొడుక్కు తల్లిదండ్రుల మీద ఆ కోపం ఏమిటి? మార్క్సిజం

అధ్యయనం చేశాకనే ఆ ఘటనలు అర్థం అయ్యాయి. ఒకవేపున కులాచారాల పట్టు సమాజంలో శిధిలం అయిపోతూంది. కృత్రిమంగా

బిగిసివున్న ఆచారాలు కల్పిస్తున్న అవమానం సహించరాదనే జ్ఞానం, చైతన్యం కొత్తతరంలో మేల్కొంది. ఈ విధంగా సమాజం నూతన

సంబంధాలను ఏర్పరచుకోవలసిన రోజు వచ్చింది. సమాజం అటు వేపు కదులుతూంది. ఈ నిర్లక్ష్యాలు, కోపతాపాలు నూతన దశకు

హార్బింజర్సు (Harbingers) మాత్రమే. మార్క్సిజం చదవనంత వరకు ఈ ఘటనల మీద నా ఆలోచనలు ఆ వ్యక్తుల

చర్యలకు విరుద్ధంగానే వుండేవి. అవి సామాజిక ధర్మాలుగా తోచలేదు.

రెబ్బాప్రగడ మందేశ్వరశర్మగారు, జోస్యుల అప్పురామమూర్తిగారు వంటి నైష్టిక దేశభక్తులు నాకు సన్నిహితంగా వుండేవారు. వారు

తమ ఆస్తులు, ఆరోగ్యం, కుటుంబాలు గురించి చూసుకోలేదు. ప్రజాసేవకు అమూర్తమైన దేశ సేవకు కాదు సుమండీ. గిరిజన, హరిజన

సేవకు జీవితాలను ఖర్చు చేశారు. కాని కులాచారాలను కొంచెం కూడా పట్టువిడవకుండా ఆచరించేవారు. దీనికి సమాధానం ఇచ్చినది

మార్క్సిజంలోని మానవత్వం, కార్యకారణ సంబంధాలను ఆలోచింపచేయగల తార్కిక శక్తిని భూతకాలం నుంచి వర్తమానంలోకి, వర్తమానం

నుంచి భవిష్యత్తులోకి వున్న మార్గాల క్రమ పరిణామాన్ని చూడగల అవగాహనశక్తిని అది అందించింది. నేను అందుకోగలిగేనని

ఇప్పుడు చదువుతున్న అమృతలాల్‌ సాగర్‌ 'అమృత్‌ ఔర్‌ విష' చెప్తూంది. 1960ల

నాటి లక్నో సమాజం, యు.పి., రాజకీయాలు దానిలో ప్రస్తుతం. 1960లలోనే నేను రాసిన కొల్లాయి గట్టితేనేమిలో చిత్రించిన

1920ల నాటి ఆంధ్రదేశపు గ్రామాల స్థితిని నైష్ఠికులైన నోరి నరసింహశాస్త్రిగారు తన కథే తను జీవించిన తెలుగు సమాజమే

అన్నంత తాదాత్మ్యాన్ని అనుభవించారు. అది ఆయన మాటే. 1960ల నాటి మన ఆంధ్ర సమాజ జీవితాన్ని నా నవల 'కత్తుల

వంతెన', 'ఎవరికోసం'లలో చిత్రించేను, ఈ మూడు చదివితే మన తెలుగునాడులో ఈ నలభై ఏళ్ళ మధ్య కాలంలో వచ్చిన

అభివృద్ధి కనబడుతుంది. ఆ దృష్టిలోంచి చూస్తే ఉత్తరప్రదేశ్‌ సమాజం 1920 నాటి తెలుగు సమాజం స్థాయికి కూడా

రాలేదనిపిస్తూంది. బి.జె.పి. ప్రభుత్వం ఏర్పడిన తీరే, సామాజిక పరిస్థితులే అక్కడ వున్నాయా? జాతీయోద్యమం

విస్తరించడానికి అవసరమైన సామాజిక పరిణామ క్రమం అక్కడ పనిచేయలేదా? ఆ విషయంలో ఆంధ్రదేశం చాలా చాలా ముందే వుంది.

ఇదెట్లా సందర్భపడింది? ఆంధ్ర జిల్లాలకు భౌగోళికమైన ఒక సౌలభ్యం వుంది. అది ఉత్తరానికి, దక్షిణానికీ మధ్య సేతువులా

వుంది. పశ్చిమాన వున్న మహారాష్ట్రంతో, కర్ణాటకంతో సుదీర్ఘమైన సరిహద్దు వుంది. ఫలితంగా ఏ దిశలో వచ్చిన భావ

విప్లవమూ ఆంధ్రకి ఇట్టే అందేది. ఈనాడు తెలుగునాడు ప్రతి గ్రామం కూడలిలోనూ జరుపుకొనే వినాయక నవరాత్రి ఉత్సవాలు మనకి

మహారాష్ట్రం నుంచి అందేయి. ఆంధ్రదేశపు వర్తమాన చరిత్రనే మార్చివేసిన బ్రహ్మసమాజం, రెండు వేల ఏళ్ల క్రితం ఆంధ్రలో

మూల మూలకంటా విస్తరించిన జైన బౌద్ధమతాలు ఉత్తరాది నుంచి వచ్చాయి. వీరశైవం కర్ణాటక దేశపు బహుమతి. వైష్ణవం తమిళ

బహూకృతి. ఇటీవలి కాలంలో పెరియార్‌ రామస్వామి నాయకరు Self-respect movement మన వైవాహిక

సంప్రదాయాలను పూర్తిగా తల్లక్రిందులు చేసింది. నేడు ఆంధ్రలో పరిపాటి అయిపోయిన దండల పెళ్ళిళ్ళూ, సభాముఖంగా పెళ్ళిళ్ళూ

పద్ధతిని ప్రవేశపెట్టినదీ, అలవాటు చేసినదీ కమ్యూనిస్టులు. Self-respect వుద్యమ నాయకుడుగా పేరు పొందిన

జీవానందం మొదటి తరం కమ్యూనిస్టులకు ఆప్త మిత్రుడు. ఈ వివిధ భావాలూ, వుద్యమాలూ తెచ్చిన సంస్కారాన్ని ప్రజల సంస్కారంగా

మార్చిన ఘనత వీరేశలింగం, చలం గార్లదీ, మార్క్సిస్టు భావజాలానిదీ. మద్రాసులో నేను వుద్యోగం చేస్తున్న కాలంలో తమిళ,

కర్ణాటక మిత్రులతో పలుమార్లు ఈ విషయం మీద చర్చలు జరిగినప్పుడు తెలుగు యువకుల మనస్సుల తుప్పుదుళ్ళ కొట్టినదీ,

ఇతర రాష్ట్రాలు వారు వదుల్చుకోలేకుండా వున్న inhibitions పీడవదల్చినదీ వీరేశలింగం, చలమూనని వాదించేవాడిని.

కేరళీయులకు వారి సంస్కర్తలున్నారు. పంతులుగారిదీ, చలంగారిదీ ఋణం తీర్చగలది కాదు.

దేశ సాహిత్యంలో కొల్లాయి గట్టితేనేమి? నవలకున్న స్థానాన్ని అర్థము చేసుకోవాలంటే భారతీయ సమాజంలో ఆంధ్ర ప్రజాజీవితంలోని

ప్రత్యేకతలను అర్థము చేసుకోవాలి. మిత్రులు రాచమల్లు రామచంద్రారెడ్డి తమ 'సంవేదన' వ్యాసంలో ఇలా వివరించేరు.

".....1920 నాటి రాజకీయ వాతావరణంలో కొన్ని అంశాలు గమనార్హం. బెంగాల్‌లోనూ, పంజాబ్‌లోను ఆనాడు

టెర్రరిస్టు వుద్యమం బలంగా వుండింది. ఆంధ్రదేశ రాజకీయాల్లో అది ఎప్పుడూ ప్రవేశించలేదు. మహారాష్ట్రలోనూ, ఇతర ఉత్తర

భారత ప్రాంతాలలోనూ, జాతీయోద్యమంలో హిందూ మతాభిమానమూ, సనాతన ధర్మ పునరుద్ధరణ వాదప్రాబల్యమూ పెనవేసుకొని వుండినాయి.

ఆంధ్ర రాజకీయాల్లో వాటికెప్పుడూ స్థానమే లేదు. మతాభిమానమూ, సనాతన ధర్మమూ బ్రిటిష్‌వాళ్ళ తాబేదార్లుగా

వ్యవహరించాయేగాని దేశభక్తులెప్పుడూ వానిని ఆదరించలేదు. కాంగ్రెసు మంత్రులకూ, స్వతంత్ర పార్టీ నాయకులకూ తిరుపతి దేవుడు

ఈనాడు వేలుపైనాడు గాని, ఆనాటి జాతీయ నాయకులు ఉద్యమ ఫలసిద్ధికి తిరుపతి దేవునికెప్పుడూ ముడుపులు కట్టుకోలేదు. నిజానికి

తెలుగుజాతి జీవితంలో జాతీయోద్యమం కంటే ముందే సంఘసంస్కరణా, తదనుబంధంగా మత సంస్కరణా ఉద్యమరూపంలో ప్రవేశించినాయి. అనగా

1920 నాటికే తెలుగుదేశంలో మత విశ్వాసాలమీద తిరుగుబాటు, బూర్జువా మనస్తత్వ వికాసమూ బహుముఖాలుగా ప్రారంభమై వుండింది.

ఇది ఆనాటి ఆంధ్రదేశ ప్రత్యేకత అనుకోవచ్చు."

(సారస్వత వివేచన పుట-10)

ఆ సమాజంలో నిత్యజీవితం గడుపుతున్న వానికి ఈ లోతులు ఎప్పుడో కాని అర్ధం కావు. అర్థం అయినప్పుడు కలిగే ఆనందానికి

అంబరం వుండదు.

ఈ నవల రాస్తున్న రోజుల్లో ఓ మారు రాజమండ్రిలో మా తమ్ముడు జగన్మోహనుని యింటికి వెళ్ళేను. అప్పుడే అక్కడికి

సుప్రసిద్ధ కాంగ్రెసు నాయకులు వెన్నేటి సత్యనారాయణగారు వచ్చేరు. నేను రాస్తున్న నవల ప్రసక్తి వచ్చింది. నా

ప్రయత్నాన్ని అభినందిస్తూ నేనెప్పుడూ విని వుండని రెండు విషయాలు చెప్పేరు. గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారిని కాలేజీ నుంచి

బహిష్కరించిన కేసులో ప్రభుత్వం నియమించిన విచారణాధికారి మోచర్ల రామచంద్రరావుగారు విచారణానంతరం ఒక మాట అన్నారట. "నా

కొడుకే ఆ విధంగా వ్యవహరించి వుంటే ఎంతో సంతోషించేవాడిని"... అని.

"అటు తర్వాత రాజమండ్రిలో జాతీయ కళాశాల పెట్టాలనే ఆలోచన వచ్చి టౌనుహాలులో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందు

డిప్యూటీ కలెక్టరూ, డి.వై.ఎస్‌.పి. వచ్చి కూర్చున్నారు. వారి రాక టౌను పెద్దలలో చాల మందికి బెదురు

పుట్టించింది. సభకు పిలిచిన న్యాయపతి సుబ్బారావుగారు అందరికీ ధైర్యం చెప్పేరు. సభను ప్రారంభించే ముందు ఆయన బంట్రోతును

పిలిచి కొత్తవాళ్ళు రాకుండా గేటు వేసెయ్యమన్నారు. తరవాత సభలో కూర్చున్న వారిలో ఆహ్వానాలు లేనివారిని పంపెయ్యమన్నారు. ఆ

మాట అనడంతో అనాహూతంగా వచ్చిన అధికారులు సభ విడిచిపోయారు" అంటూ "మీరు మితవాదులనేవారు చేసిన పని ఇది. మీరే అయితే

ఆ ధైర్యం చేసి వుండేవారా?" అని సవాలు విసిరేరు. నేను నవ్వేను. "మా కమ్యూనిస్టులకి ఆ ఉపాయం తోస్తుందా అంటే చెప్పలేను.

కాని ధైర్యం ఫర్వాలేదు" అన్నాను.

మిత్రులు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించినట్లు 'తెలుగుజాతి జీవనంలో జాతీయోద్యమం కంటె ముందే సంఘసంస్కరణా, తదనుబంధంగా మత

సంస్కరణా ఉద్యమరూపంలో ప్రవేశించాయి' ఎలాగ? ఎందుచేత? అనే ప్రశ్నలకి సమాధాన రూపంలో మార్క్సు రచనల నుంచి పేజీలకు

పేజీలు ఎత్తిచూపి నాకున్న పాండిత్యాన్ని ప్రదర్శించే బులపాటం లేదు. అంత అవసరమూ లేదు. నా మనస్సుని పట్టిపోయి, నా

ఆలోచనలను శాసిస్తున్న మార్క్సు సిద్ధాంతాలను నా మాటలలో చెప్పి వదిలేస్తా-- ఆర్థిక నిర్మాణం మారుతున్నప్పుడు

సమాజవ్యవస్థ యొక్క నిర్మాణ రూపాలు మారుతాయి. ఒక వ్యవస్థలో ఎంతో చక్కగా పనిచేసిన నిర్మాణరూపాలే మరో వ్యవస్థలో

పనిచేయవు. మనిషి ఎప్పుడూ తన సుఖాన్నీ, సౌలభ్యాన్నీ చూసుకొంటాడు. వానికి అనుగుణంగా జీవనపద్ధతిని సవరించుకుంటాడు.

అటువంటి సవరణల సంఖ్య పెరుగుతూ వచ్చి జీవన పద్ధతులే మారిపోతాయి. ఇదంతా చాపకింద నీరులా మారుతున్న మార్చుకుంటున్న

మనిషికి కూడా తెలియకుండా జరిగిపోతుంది. కొత్తపాతలని అర్థం చేసుకునేందుకు శాతాల నిర్ణయం పనికిరాదు. ఏది క్రమంగా

పెరుగుతూంది, ఏది క్షీణిస్తూంది గమనించాలి. నీ కోరికలతో నిమిత్తం లేకుండా ఈ పరివర్తన సాగిపోతూనే వుంది. ఆ క్రమంలో

మానవుడూ, వాని సమాజ నిర్మాణమూ సాగిపోతున్నాయి. మనం ఎంతో దుర్భరమూ, అన్యాయమూ అని అసహ్యించుకొనే బానిసత్వం కూడా

సామాజిక పురోగతికి అవసరంగానే ఏర్పడింది. అది సమాజంలోని ఆర్థిక పురోగతికి ఆటంకంగానున్నప్పుడే తొలగి పోతుంది. అమెరికాలో

నీగ్రో బానిసల శ్రమ ఉత్పత్తికి ఆటంకమైంది. కనుకనే ఉత్తర రాష్ట్రాలు బానిసత్వ నిర్మూలనకై పోరాటం జరిపాయి. ఈ

మార్పులన్నీ మనిషికి తెలియకుండానే జరిగిపోతున్నాయి. కారణం మార్పులకి మూలం ఎక్కడుందో వారికి అర్థం అయ్యే పరిస్థితులు లేవు.

కారణం అర్థం కాకపోయినా ఫలితాలు చూస్తాడు. వాని ప్రతిబంధకత్వాన్ని చూస్తాడు. అనూచానంగా వస్తున్న నిర్మాణాలనూ, అచారాలుగా

మారిపోయిన అలవాట్లనూ ఎందుకు మార్చాలో తన ఆలోచనలకనుగుణంగా సిద్ధాంతీకరిస్తాడు. ఇదో అనంతమైన యాత్ర. ఆర్థిక

వ్యవస్థలో వచ్చిన పరిణామం, సమాజ పరిణామ సూత్రానికి భాష్యం చెప్పింది. దానిని అర్థం చేసుకుని పని చేస్తే సమాజ గతిని

త్వరితపరచగలం. ప్రస్తుతం తలెత్తి విజృంభిస్తున్న శాస్త్ర, సాంకేతికాభివృద్ధితో ముడిపడిన అధికోత్పత్తి విధానం యొక్క

పరిణామం సోషలిజంలోకి, దాని నుంచి కమ్యూనిజంలోకి పరివర్తనను తెచ్చి తీరుతుంది. ఆ పరిణామం ఎంతకాలంలో వస్తుంది? దాని

తరువాత రాగల వ్యవస్థ ఏమిటి? అనే విషయాన్ని వారు భవిష్యత్తుకే వదలివేశారు. ఇది స్థూలంగా, అత్యంత సంగ్రహంగా

ఘనీభూత రూపంలో గతి తార్కిక చారిత్రక భౌతిక వాద సిద్ధాంతం. కనీసం నేను అర్థం చేసుకున్నదీ, నాకు అర్థమయినదీ.

నా జీవితంలో 5వ ఏడాది నుంచి 40వ ఏడు వరకూ చూసినవీ, విన్నవీ, చదివినవీ విశదంగా గుర్తున్నాయి. వానికి ఈ

సిద్ధాంతాన్ని జోడించి అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించాను. దానిని చూసి మార్క్సు సూత్రాలకి జీవిత ఘటనల్ని

మెకానికల్‌గా అమరుస్తున్నానని 1941-44 జైలు కాలంలో ఎస్‌.వి. ఘాటే అధిక్షేపించారు. నేను

ఒప్పుకోలేదు. మన బంధుత్వపు పిలుపులు పెదనాన్న, చిన్నాన్న అనేవి పెదతల్లి, పినతల్లి అనేవీ వాళ్ళందరి పిల్లలూ,

అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళుగా పిలుపులూ--ఇవి మనలో కూడా ప్యువలాన్‌ కుటుంబాలు పరిపాటిగా వుండేవనడానికి సాక్ష్యం

అని నేను జైలులో క్లాసులు నడిపినప్పుడు చెప్పేవాడిని. దానికాయన మొదట ఒప్పుకోలేదు. కాని మన పిలుపులకు కారణం

ఏమయివుండాలని నేను మొదలకించా. ఏమీ చెప్పలేక అర్ధాంగీకారంగా వూరుకున్నారు. (ఫ్యువలాన్‌ కుటుంబం మొదలయిన వాని

వివరాలు ఏంగిల్సు రాసిన Origin of Family Private Property and State లో చూడండి) ఇటువంటి

నాలుగైదు సందర్భాలు తటస్థపడి నా ఆలోచనలు సరియైన దారిలోనే నడుస్తున్నాయనే విశ్వాసం కలిగింది. నా నవలలన్నీ ఆ

విధమైన సమన్వయ ధోరణితో రాసినవే-- నా 'కొల్లాయి గట్టితేనేమి?'ని సమాజ పరిణామ గతిని కథలో చూపడం కోసమే రాశాను.

ఆ నా వుద్దేశ్యాన్ని రామచంద్రారెడ్డి సరిగ్గానే గ్రహించారు. అయితే ఆయన కూడా దేశరాజకీయాలకే తమ అన్వేషణను పరిమితం

చేశారు. సమాజ పరిణామ క్రమగతి పరిశీలన ఆయన విశ్లేషణకు బయటనే ఉండిపోయింది. నేను ముంగండనే కథా రంగంగా తీసుకోవడం

మీద ఆయన తన వ్యాసంలో చేసిన వ్యాఖ్య అందుకు వుదాహరణ. "ఛాందసత్వాన్ని, ఈ వ్యవస్థ యొక్క(ఫ్యూడలిజం) పరమమైన

(Absolute) రూపాన్ని చూడాలంటే బ్రాహ్మణ అగ్రహారాలలోనే సాధ్యం. అందుచేత రచయిత ముంగండను కార్యరంగంగానూ,

రామనాధాన్ని కథా నాయకునిగానూ ఎన్నుకొన్నారు" అని రాశారు. ఇది రాజకీయ విశ్లేషణతో హేతుబద్ధమైన వ్యాఖ్యయే కాని,

సామాజిక పరిణామచిత్రణను ఉద్దేశించిన దృష్ట్యా సరి కాదు. ముంగండ బ్రాహ్మణ అగ్రహారమే. నేను విన్నంత వరకు 19వ

శతాబ్ధం ప్రారంభం నుంచీ దేశచరిత్ర గతితో దాని పాత్రను వింటున్నాను. 20వ శతాబ్ధారంభం నుండి సామాజిక పరిణామ గతి ఛాయలను

చూస్తున్నాను.

కొల్లాయి గట్టితే నేమి? · 第 21 / 22 段