చేతిలో పీష్వా సేనలు ఓడిపోయాయి. ఆ యుద్ధంలో పాల్గొన్న పీష్వా సేనానాయకులలో ఒకడైన విశ్వనాధరావు అనే ఆయన
తప్పించుకొని, తనకు పరిచితులూ, మిత్రులూ అయిన పండితుల సాయంతో సన్యాసిగా ముంగండలో శేషజీవితం గడిపారని నాకు నాటక
అలంకారశాస్త్రాలు పాఠం చెప్పిన ఉపద్రష్ట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు చెప్పారు. ముంగండకు సన్యాసులకు ఆశ్రయం ఇచ్చే
సంప్రదాయం వుంది. నేను బాగా చిన్నప్పుడు ఓ అవథూత స్వామి, దిగంబరంగా వీధుల వెంట నడిచిపోతుండడం చూశాను. ఆయన కోసం
గ్రామస్థులు మంచినీళ్ళ చెరువు గట్టుమీద ఆశ్రమమూ చెరువులోని కంటా పావంచాలు కట్టించి ఇచ్చారు. ఈ మఠం 1930 తర్వాత
గ్రంథాలయానికి, గ్రామ యువజన సంఘానికి స్థావరం అయి 1942 వరకూ పోలీసు దాడులకు గురి అయింది. దిగంబర స్వామి అనంతరం
అగ్నిహోత్రస్వామి (ఈయనే మా అమ్మగారి మేనమామ), ఆయన తరువాత పొట్టి స్వాములు, చివరగా తల్లావఝుల
శివశంకరశాస్త్రిగారి సోదరుడు(ఈయనే ఆఖరి వారు. 1936 వరకూ జీవించివున్న జ్ఞాపకం.) అటు తరవాత మఠం శిథిలం
అయిపోయింది. మా కోసం సాగిన పోలీసు దాడులకు బెదిరిపోయారో ఏమో కొత్తవారు రానూ లేదు. ఈ పోలీసు దాడులలో మాకు గ్రామీణుల సాయం
బాగా వుండేది. ఒక రోజున తెల్లవారేసరికి పోలీసు బలగం చెరువు గట్టున వున్న మఠం, గ్రంథాలయం, యువజన కార్యాలయం
సముదాయాన్ని చుట్టు ముట్టుతున్నారన్న వార్త వచ్చింది. ఆ రోజుల్లో మా వద్ద ఒక రివాల్వరు (పాతది, తూటాలు లేనిది)
ఉండేది. దానిని పొరపాటున గ్రంథాలయపు బీరువాలో పుస్తకాల వెనుక పడేసి, రాత్రి ఇంటికి వెళ్ళాను. దానిని తీసెయ్యాలి. వెంటనే
వెళ్ళి గ్రంథాలయ కార్యదర్శికి విషయం చెప్పాను. ఇద్దరం ఆలోచనలో పడి మఠం కాంప్లెక్సుకి బయలుదేరాం. మా కంగారును చూసి
పక్కింటి పడుచు ఒకామె చెరువుకు మంచినీటికి బయలుదేరినట్లు బిందె చంకన వేసుకుని బయలుదేరింది. నా మిత్రుడు పోలీసు ఆఫీసరును
మాటలలో పెట్టి చెరువు వేపు తీసుకెళ్ళాడు. నేను వెనక తలుపు తెరచి గ్రంథాలయంలో ప్రవేశించి, బీరువాలో వున్న రివాల్వరు
తీసి, కిటికీలోంచి క్రింద వున్న పొదల్లో పడేశాను. మా వెనక వస్తున్న యామె చూసింది. దారిన పోతున్నట్లు వచ్చి, దానిని
బిందెలో పెట్టుకొని ఏమీ ఎరగనట్లు వెళ్ళిపోయింది. ఊళ్ళో ఇంటికి వచ్చిన వాళ్ళు పేడనీళ్ళు తొక్కి రావాలని శాసించే శివరామయ్య
తల్లులూ, పురోహితునింట తిండి తినడం పాపంగా భావించే నరసమ్మలూనేనా వున్నది. పైన చెప్పిన ఘటనలోని శీతమ్మలూ ఉండేవారు.
1929లో 2-3 వందల మంది సత్యాగ్రహులతో కాకినాడలో ఉప్పు సత్యాగ్రహానికి వూరేగింపుగా వెడుతూ వచ్చిన బ్రహ్మాజోస్యుల
సుబ్రహ్మణ్యం గారికి ప్రతి వీధిలో వారులు పోసి, పుష్పహారతులిచ్చిన బాలలు, పడుచులు, గృహిణులు ఎందరో గ్రామంలో
ఛాందసులున్నారు. కాని వారి సంఖ్య తగ్గిపోతూంది. బ్రహ్మ సమాజ బోధనల బలంతో అందరినీ గౌరవంగా పిలవాలనే నియమం మా
నాన్నగారిది. అందరూ పుల్లిగా అని పిలిచే ఒక పనివాడిని ఆయన పుల్లన్నా అని పిలిచేవారు. ఆ పిలుపుతో అతడు కనబరచిన
ఆనందం, ఆత్మాభిమానం నాకు గుర్తుంది. ఈ పరిణామాలన్నీ ఏ బ్రహ్మ సమాజ మతబోధనలతో ప్రభావితులైన యువకుల ప్రభావమే
అనుకోకూడదు. ముంగండ దేశ చరిత్రలో ఒక భాగంగానే వుంది. 19వ శతాబ్ధపు ప్రథమ పాదంలో పిండారీ దండుల చివరి దశలో ఒక
దండు ముంగండ మీదపడి ధ్వంసం చేసింది. కాని అంతలో గ్రామంలోని యువకులు తేరుకుని కూడగట్టి, తిరిగిపోతున్న దండులో చివరనున్న
ఇద్దరిని పట్టుకున్నారు. వారిద్దరినీ కట్టేసి బ్రతికి వుండగానే మంటలలో వేసి చంపేశారు. వారి పేర్లు రాజిగాడు, గన్నడు.
వారిని ఆ విధంగా చంపించిన పాప పరిహారానికై ఆ జట్టు నాయకుడు తన ఇంటి మొదటి సంతానానికి వారి పేర్లు పెట్టుకుంటానని
మొక్కుకున్నాడట. ఆ సంప్రదాయం ఆ కుటుంబంలో నేటికీ పాటిస్తున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ముంగండవాసి చెల్లూరి
సుబ్బారాయుడు అనే ఆయన ఝాన్సీరాణి సైన్యాలలో పనిచేశాడు. ఆమె ఓటమి అనంతరం ఆయన నానాసాహేబ్ తమ్ముడు రావు
సాహేబ్ దళాలతో హైద్రాబాద్ వచ్చి, ఆ బలగం విచ్ఛిన్నం అయాక ముంగండ తిరిగి వచ్చేశారు. ఝాన్సీ
సేనలలో తాము చేసిన దురంతక చర్యలను (పట్టుబడిన ఆంగ్లేయుల్ని స్త్రీలు, పిల్లలు అనే విచక్షణ లేకుండా చెరుకు గానుగల
కందించి చంపారట) గొప్పగా కథలుగా చెప్పుకునేవాడట. ఆ కథలన్నీ నా చిన్నప్పుడు కూడా గ్రామంలో చెప్పుకునేవారు. ఆయన
ఇంటికి వచ్చాక అకారణంగానే భార్యను గునపం ఒదె వేసి చంపేసిన ఘటన చూశాక ఆయన చెప్తూండిన ఘాతుకాలు నిజమే అయివుంటాయని
గ్రామం నమ్మింది. అసహ్య పడింది. తరువాత ఆయన రెండో పెళ్ళాం ఆయనకు కలిగించిన అవమానాలు, పెట్టిన తిప్పలు జనం
హాస్యంగా చెప్పుకుని ఆనందించేవారు. దురంతక చర్యలలో పాల్గొన్నాడని అసహ్యించుకున్నా, ఒక ముంగండ వాసి దేశ స్వాతంత్య్ర
పోరాటంలో పాల్గొన్నాడనేంత వరకే ఇక్కడ ప్రసక్తి. ఈయన నా భార్య ముత్తాత తమ్ముడు.
ఈ విధంగా ముంగండ చరిత్ర గతిలో దేశంతోపాటు ముందుకు అడుగు వేసింది. దేశం అంతటితోపాటు మంచి చెడ్డల్ని అనుభవించింది. ఈ
దృష్టితోనే నేను ఒక్క 'కొల్లాయి గట్టితేనేమి'లోనే కాదు. అన్ని నవలల్లోనూ దానినే కార్యరంగంగా తీసుకున్నాను.
అలాగే నవలలోని పాత్రలు, ఘటనలు మాతృకలు నిజజీవితంలో చూసినవీ అనుభవించినవే. అయితే చాలా మందిలాగ "నేను చూసినవే
రాశానర్రోయ్" అని చెప్పను. ఏమంటే మనం చూసిన మనుష్యుల జీవితాలు వేరు. వారిని యధాతథంగా చిత్రించలేము.
'కొల్లాయి గట్టితేనేమి?' నవలలో స్వరాజ్యం పాత్రకూ, దాని మాతృకకూ పోలిక వారికి చదువుమీద గల ఆసక్తి కుటుంబ
జీవితాన్ని భగ్నం చేసిందన్నంత వరకే. రామనాధం పాత్ర అంతే. వీరేశలింగం గారి ప్రభావంతో బాల్య వివాహం చేసుకోకూడదనుకున్నాడు.
చేసుకొన్నాడు. చిన్నప్పుడే భార్యతో కాపురం వద్దనుకున్నాడు. సాగలేదు. ఆ విషయం వరకు రామనాధంలో నవలా రచయిత తనను
చూపించుకున్నాడు. తర్వాత అతని జీవితం అంతా భిన్నమే. బాలకృష్ణ అస్త్రాలు సంపాదించడానికి ప్రయత్నించిన కథా, రాజకీయాలకు
Protest గా టోపీలు తీసెయ్యడం, టీచరు కొట్టడం, దానిమీద తాతగారు (తండ్రిగారు) వెళ్ళి హెడ్ మాస్టరును
సంజాయిషీ కోరడం ఘటనలు నా జీవితంలోనివి. కాని బాలకృష్ణ జీవితం నాకు ప్రతిబింబం కాదు. అలాగే గాంధీగారిని గన్నవరం వద్ద
గోదావరి దాటడానికి వీలుగా అక్విడక్టులోకి సొలుపులు చేయించిన ఇంజనీరు కథ నిజం. ఆ ఇంజనీరు కొడుకు, అతని కథా కల్పితం.
నిన్ననే ఆ నవల చదివిన ఒక అమ్మాయి "గాంధీగారు నిజంగా ముంగండ వచ్చారా?" అని రాసింది. రావడమే కాదు. ఆయనకు "యదా
యదాహి ధర్మస్య' శ్లోకం తాటాకు మీద రాసి, పసరు పూసి కనబడేలా చేసి ఇవ్వడం కూడా నిజమే. కాని, తరువాత నవలలో
కనిపించే 'సుందరమైన రాట్నమే' పాట అబద్దం. నిజానికి ఆ క్షణంలో నేను అక్కడే వున్నాను.
అల్లాగే బెజవాడ ఎఐసిసి బహిరంగ సభలో ఆలస్యం మూలంగా గాంధీ గారి భోజనం ఆగిపోవడం, ఆ జనం మధ్య నుంచి కోడూరు వస్తాదు
సోదరులు ఆయనను భుజాన ఎత్తుకొని బస చేర్చడం నిజం. అయ్యదేవర కాళేశ్వరరావు గారి మీద అయిష్టంతో గోపాలకృష్ణయ్యగారు
రామదండు వలంటీర్లను Withdraw చేయడం నిజం. కానీ పేచీకి కారణంగా చెప్పింది అబద్దం. ఆ ఘట్టంలో చిత్తరంజనదాసు,
అయ్యదేవర వారు చేసుకొన్న హాస్యాలు "మీ తెలుగు వాళ్ళకి తెలుగు అభిమానం జాస్తి"-- "అది మీ బెంగాలీల వద్ద
నేర్చుకొన్నవే" అనే వాక్యాలు యదార్థం. ఆ రోజున దాసుగారికి సహాయకులుగా వున్న వలంటీరు కాట్రగడ్డ మధుసూధనరావు గారు
చెప్పినవవి. దానినక్కడ ఆ రూపంతోనే అమర్చాను. ఆ విధంగా జరిగిన వానిని యధార్థంగానే చిత్రించాను. కాని వాటి పూర్వాపరాలు
భిన్నం.
ఈ విధంగా వాస్తవాలు కథ నడకలో కలిసిపోయినందుచేతనే నోరి నరసింహశాస్త్రిగారు దానిలో తమ చిన్ననాటి జీవితాన్ని
చూసుకున్నట్లు భ్రమపడ్డారు. ఇందులోని కథా భాగం ఏదీ సత్యం కాదు. ఉదాహరణకు అమలాపురం హాస్పిటలులో కాంపౌండరుతో జరిగిన
ఘర్షణ కథ. కాని ముంగండలో శంకరశాస్త్రి జ్వరపడినప్పుడు పూజారి వైద్యుడితో జరిగిన పంతం (పాత్రలు మినహా) యథార్థం.
ఫలితం ఏమయింది? నవలలో ఏ అంశమూ అసత్యం కాదు. ప్రతి ఒక్కటీ ఎక్కడో ఒకచోట, ఎవరికో ఒకరికి ఏదో రూపంతో
అనుభూతమైనవే. కాని అవి అల్లాగే జరిగేయనుకున్నా ఈ పాత్ర నేనేనర్రోయ్ అన్నా, నన్ను చూసే రాశాడన్నా
తామెరిగిన వ్యక్తుల్ని పాత్రలలో చూసినా అది అసత్యం, వట్టి భ్రమ.
ఇంక నా నవలలో ఎప్పుడూ ఎక్కడా ఎరిగివుండి ఎవరినో, ఎవరి చేష్టలనో బయటపెట్టాలనీ, దుయ్యబట్టాలనీ ఆలోచించలేదు.
సామాజికంగా ఎదురయ్యే మంచిచెడ్డలను గానే వానిని పరిగణించాను. అందుచేత ఎవరి ముఖమైనా వానిలో కనిపించవచ్చు. పైన స్వరాజ్యం
కథకీ చరిత్రగా మారిన ఒక ఘటనకీ గల పోలిక చెప్పేను. రామనాధం బావమరిది చంద్రశేఖరరావు అనాధ శరణాలయం పిల్లని
పెళ్ళి చేసుకున్నట్లు రాశాను. నిజజీవితంలో కంభంపాటి తారకంగారు అటువంటి వివాహం చేసుకున్న వుదాహరణ వుంది. కాని, బ్రహ్మ
సమాజం ఆంధ్ర సమాజంలో ప్రవేశపెట్టిన సంస్కరణల స్వభావం, అవి కాలక్రమంలో కులాంతర వివాహాలకు దారితీసిన ప్రథమ
సంఘటనలుగా చూపడానికే వుపయోగించాను. ఇల్లా చెప్పుకుపోతే నవలలోని ప్రతి పాత్రకీ ఒక ఉద్దిష్ట లక్ష్యం నిజజీవితంలో ఓ
సాక్షీ వున్నారు.
ఈ సందర్భంలో ఇంకొక్కటి గుర్తు వస్తూంది. 'కొల్లాయి గట్టితేనేమి' ఆంధ్రపత్రికలో బు.వెం.ర, (బహుశా మిత్రులు బులుసు
వెంకట రమణగారేమో) స్వాతంత్రోద్యమ ప్రచారానికి రామనాధం తలపెట్టిన ఒకే ఒక పని చిరుతపూడిలో బహిరంగ సభ
పెట్టబోవడం. కానీ తీరా చూస్తే ఆ సభ జరగలేదు అని హాస్యం చేసేరు తమ సమీక్షలో. మనస్సులోని కోరికలు, వేసుకొన్న
పథకాలకీ, అవి క్రియారూపం ధరించడానికీ మధ్య ఎంతదూరం వుంటుందో మనకు తెలుసు. రామనాధం తానే పెట్టుకొన్న వివాహ
వయోనియమాన్ని మరచి పెళ్ళి ఆడేశాడు. కారణం అటువంటి నియమాలు సమాజ సంస్కారంలో భాగం కాలేదు. భార్యతో కాపురం వెంటనే
పెట్టుకోవడం తప్పు అనే ఆందోళనతో బయలుదేరి అత్తవారింటికి వచ్చినప్పుడు ఒంటరిగా చిక్కిన భార్యతో చెలగాటం ప్రారంభిస్తాడు.
ఆ ఘట్టం చాల సహజంగా, చక్కగా వున్నదని రంగనాయకమ్మ గారు ప్రశంసించారు. ఈ రెండు విషయాలలోనూ రామనాధానికి నేనే
ఉదాహరణా, సాక్ష్యమూను. వీరేశలింగం గారి ప్రభావంతో వివాహం చిన్నతనంలోనే చేసుకోరాదని మనస్సులోనే అనుకున్నా. ఆ రోజుల్లో
అంటే-- ఈ శతాబ్ద ప్రారంభంలో మగవానికి పదేళ్లు, ఆడపిల్లకు ఎనిమిదేళ్లు వస్తుండగానే వివాహ సంబంధాలు వెతికేవారు.
బ్రహ్మసమాజ ప్రభావంతో మా యింట మూడు నాలుగేళ్ళు గ్రేస్ పీరియడ్‌గా వదిలేరు. నేను 13 ఏళ్ళ
వయస్సులో వుండగా మా వీధిలో, మా యింటికెదురుగా ఇల్లు కొనుక్కుని పొరుగూరు నుంచి ఒక కొత్త కుటుంబం కాపురం వచ్చింది. మర్నాడు
ఉదయం మా ఇంటి గుమ్మంలో కొత్త అమ్మాయి 10 ఏళ్ళది -- పచ్చని ఛాయ, నవ్వు ముఖం, నల్లని మస్లిన్
దుస్తులతో హాజరయింది. ఆనాటి ఆ విగ్రహం 70 ఏళ్ళ తర్వాత కూడా నా కళ్ళముందు కనిపిస్తూంది. దానికి ప్రేమా, దోమా అని
పేరు వద్దు. ఆడ మగ మధ్య వుండే ఆకర్షణ. అప్పటి నుంచి ఆమె మా యింటికే ఒక విధంగా అతుక్కుపోయింది. ఓ ఏడాది పోయాక
ఆమెతో పెళ్ళి అన్నారు. నేను వీరేశలింగంగారి హితబోధ మరచిపోయేను. ఎగతాళిచేసి లాభం లేదు. వ్యక్తులు ఏర్పరచుకొనే నియమాలు
సమాజగత సంస్కారంగా మారే లోపున వ్యవధి తీసుకుంటుంది. ఆ లోపున ఈ మాదిరి వైఫల్యాలు కలగవచ్చు. కాని ఇక్కడ ప్రధానం
సంస్కరణల ఆలోచన ప్రారంభం కావడమే. అది సమాజంలో నిలదొక్కుకోవడంలో వ్యవధి పడుతుంది. "రాశి పెరగడం వాసిలో మార్పు."
From quantity into quality--అనే గతి తర్క సూత్రం వినియోగం ఇక్కడే వుంది. ఆ దృష్టితోనే నా
అనుభవంతో రామనాధం పాత్రను తీర్చేను. ఆ పాత్ర వేసిన ప్రతి అడుగులో వాస్తవ జీవితంలో ఎవరిదో ఒకరి అనుభవం వుంది.
వివిధ భాషలలో నేను చదివిన అనంత సాహిత్యం నాకు ఎందరివో, ఎక్కడెక్కడివో అనుభవాలను సమకూర్చి పెట్టాయి. దానికి ఒక్క
ఉదాహరణనిస్తా.
రామనాధం అమలాపురంలో సుందరితో సరాసరి మాట్లాడి ఆమెను సుముఖం చేసుకొనే ప్రయత్నం కథాఘట్టం. (2వ భాగం 11వ ప్రకరణం)
సుందరి విముఖత కనబరచింది. "మీవాళ్ళే పంపుతే"? "తాళి కట్టించుకున్నాక తప్పుతుందా?" ఈ ఘట్టం రాస్తుంటే నేను ఎప్పుడో
చదివిన దేశిరాజు పెదబాపయ్య గారి జీవితం గుర్తు వచ్చింది. అందులోని మాటలే కాకపోవచ్చు. కాని అటువంటి ఘట్టంలో పలికించే
మాటలు ఒకే విధంగా వుంటాయి. అయనా, భార్యా శాశ్వతంగా విడిపోయే ముందు జరిగిందన్న సంభాషణ నా మనస్సులో నిలిచిపోయింది.
శ్రీ నోరి నరసింహశాస్త్రిగారితో నేను "సంధ్యావందనం వగైరాలను అపహాస్యం చేశానే" అని గుర్తు చేసినట్లు పైన రాశాను. కాని,
అస్త్రాలు, మంత్రాల మీద మనకున్న నమ్మకం Childishness తప్ప వేరు కాదు. ఆ పేరుతో మనల్ని మోసం
చేస్తున్నారని కథలోకి ప్రవేశపెట్టిన ఘట్టం స్వానుభవం. జలియన్‌వాలాబాగ్ దురంతాలు జరిపించిన
బ్రిటిష్ జాతిని, బ్రిటనును భూతలం నుంచి తుడిచెయ్యాలన్నంత కోపం వచ్చింది. ఎల్లాగ? అగ్రహారంలో చెప్పే గొప్పలూ,
భారత రామాయణాది హరికథల్లో వర్ణించిన అస్త్రాలు, కథలూ విన్న మా అన్నదమ్ములకు వాటిని సంపాదిస్తే పని
తీరిపోతుందనిపించింది. అప్పటికి నాకు పదకొండేళ్ళు, మా తమ్ముడు జగన్మోహనుకి తొమ్మిదేళ్ళు. అప్పటికే నేను
3వఫారమ్ పాస్ అవడం, సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా చదువు మానెయ్యడమూ జరిగింది. సహాయ నిరాకరణం
కాదు. అసలు సహాయం ఇవ్వవలసిన వాడే లేకుండా చేసే ప్రయత్నం ప్రారంభించేం. మా తరగతిలో తురగా శేషగిరిరావనే అతను
చదివాడు. మాకంటె పెద్దవాడు. స్కూలులో చదివే రోజుల్లోనే తన తండ్రిగారి నైష్ఠికత్వం గురించీ, తమ అటక మీద వున్న తాటాకు
పుస్తకాలు గురించీ, వానిలో వున్న అస్త్ర శస్త్రాల మంత్రాలు గురించి తెగ వర్ణించేవాడు. అతన్ని పట్టుకున్నాం. అతను
ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎండ వాన అనకుండా ఓ ఆర్నెల్లు తిరిగేం... చివరకు వాడు చెప్పేవన్నీ గొప్పలని అర్ధం అయింది.
ఆ ఘట్టం చదివి మంచికీ, చెడ్డకీ వ్యాఖ్యానించిన వాళ్ళు చాల మంది తగిలేరు.
అలాగే ఆ దురంతాలకి అసమ్మతి తెలుపుతూ టోపీలు తీసేసి క్లాసుకి వెళ్ళి దెబ్బలు తిన్న ఘటన. దానిలోనూ ప్రధాన పాత్రను
నేనే. ఆ రోజుల్లో టోపీయో, తల పాగాయో వుండి తీరాలనే స్కూళ్ళలో నిబంధన ఉండేది. దానిని నిరాకరించాం అసమ్మతి తెలపడానికి,
"ఇల్లాంటి చర్యలే జాతీయోద్యమ చరిత్రలో భాగాలు" అంటూ. పూర్వకాలపు పిచ్చి నమ్మకాల నిరాకరణం జాతీయోద్యమ పురోగతికి ఓ
ఆలంబనం. టోపీ పెట్టుకోమని వ్యతిరేకించడం ఆ వుద్యమంలో ఒక సాధనం. అవి చిన్న చిన్న ఘటనలే కాని రాశిగా విస్తరించి
జాతీయ జీవనంలో ఒక అడుగు ముందుకు వేయిస్తాయి, వాశి హెచ్చుతుంది.
దీనికి తరవాయి కథగా ఎత్తుకున్న 'దేశం కోసం', 'జ్వాలాతోరణం' నవలలు వాసి పెరుగుదల దశలు చూపుతున్నాయి.
ఇక్కడ ముంగండ గ్రంథాలయం గురించీ, గ్రామ యువజన సంఘం గురించీ కొంత రాస్తే తప్ప గ్రామంలో వచ్చిన పరిణామాలు స్పష్టంగా
తెలియవు.
ముంగండ గ్రంథాలయం జిల్లాలోనే మొట్టమొదట ఏర్పరచిన వానిలో ఒకటి అని మా నాన్న చెప్పేవారు. గ్రామంలో మొదట రెండు
గ్రంథాలయాలు పోటాపోటీగా ఏర్పడ్డాయి. ఒకటి మా నాన్న, ఆయన మిత్రులు పుల్య కృష్ణయ్యగారు ఏర్పరచిన రామమోహన
గ్రంథాలయం. దీనిలో కొత్తగా వస్తున్న గ్రంథాలు వుండేవి. రెండోది గ్రామంలోని పండితులు పోటీగా పెట్టిన గజానన గ్రంథాలయం.
తెలుగు కావ్యాలు, పురాణాలు మొదలైనవి ప్రధానంగా వుండేవి. 1910 ప్రాంతంలో రెండింటిని ఏకంచేసి, వివేకోదయ పుస్తక భాండాగారం
అని పేరు పెట్టేరు. నాకు గుర్తు తెలిసిన అయిదవ ఏడాది నాటికి ఆ గ్రంథాలయం మా చావడిలో ఉండేది. నా చదువు దానిలోనే
గనక నాకు బాగా తెలుసు.
నన్ను 5వ ఏట బడిలో వేశారు. మొదటి రోజునే ఎందుకో గుర్తులేదు. మేష్టారు తొడపాశెం పెట్టారు. పసుపురాసిన పచ్చని ఒంటిమీద
నల్లగా కమిలిపోయిన తొడను చూసి మా నాన్న వెళ్ళి మేష్టారిని తిట్టి నన్ను బడి మానిపించేడు. ఇంటి వద్ద తానే అక్షరాలు
నేర్పి మా సావడిలోని గ్రంథాలయంలో వదిలేరు. ప్రథమలో నేను వాచకం నేర్చుకున్న "ఆర్య కథానిథి" పుస్తకాలు (వావిల కొలను
సుబ్బారావుగారివి) నాకిప్పటికీ గుర్తు. అలాగే సెట్టి లక్ష్మీనరసింహంగారి గ్రీకు పురాణ కథలు, చిలకమర్తి వారి రాజస్థాన
కధావళి, గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారి అబ్రహాము లింకను మొదలైనవి జ్ఞాపకం. ప్రపంచ యుద్ధ కథలను ఆంధ్రపత్రిక
సంవత్సరాది సంచిక బొమ్మలతో వేసేది. ఆ ఏడేళ్ళ వయస్సులోనే అవన్నీ బహు ఆసక్తిగా చదివేవాడిని. 5-6 ఏళ్ళ
వయసులోనే పట్టుబడిన పుస్తక పఠనాశక్తి ఈ 85 ఏళ్ళ వయస్సుకి కూడా తగ్గలేదు.
ఆ గ్రంథాలయం 1910 నాటికి మా యింటి నుండి మారింది. 1929లో గ్రామ యువజన సంఘం ఏర్పడింది. మొదట కర్రసాము
నేర్చుకోడానికి ప్రారంభమైన యువకుల సంఘం ఆనాడు నా యీడు వాళ్లు ఊళ్లో 10-15 మంది వుండేవారు. సత్యాగ్రహ ఉద్యమానికి
వాలంటీర్లను పంపడం, పోలీసుల చేత దెబ్బలు తిన్నవారిని రహస్యంగా దాచి, వైద్యం చేసి తిరిగి పంపడం వంటి పనులతో బలమైన
యువజన సంఘంగా ఏర్పడ్డాం. వారిలో సత్యాగ్రహ శిబిరంలో చేరిన నలుగురిలో నేనొకడిని.
ఆ ప్రాంతంలోనే మా వూరి చెరువు గట్టుమీద కట్టిన మఠంలో చేర్చి వున్న ఒక గది శిథిలం అయింది. దానిని గ్రామ యువజన సంఘం
మరల కట్టింది. డబ్బు కోసం వూరి చెరువుకి నీరు పెట్టడం బాధ్యత తీసుకొని ఓ పాతిక, గ్రామంలో లక్షపత్రి పూజలు
తలపెట్టిన ఇద్దరు ముగ్గురికి పదేసి రూపాయలు తీసుకొని పత్రి తెచ్చి యిచ్చే డబ్బు సంపాదించాం. మేస్త్రీ సాయంతో మేమే కూలి
పనిచేసి ఆ కొద్ది డబ్బుతోనే పడిపోయిన గదిని వేసేం. అందులోకి గ్రామ గ్రంథాలయాన్ని మార్చాం. నలిగిపోయిన పుస్తకాలను బైండింగు
పని నేర్చుకుని మేమే చేశాం. ఈ కార్యక్రమాలతో ముంగండ యువజన సంఘం పోలీసు రికార్డుల్లోకి ఎక్కింది. ఒక దశలో
ముస్తఫాలీఖాన్ (డివైఎస్పి) గ్రామం మీద దాడిచేసి సంఘం నామరూపాల్లేకుండా చెయ్యాలనే ప్రయత్నంలో వున్నట్లు
తెలిసింది. సమావేశం అయాం. పోలీసుల చేతిలో దెబ్బలూ, చావులూ తప్పవు గనుక, మనం వాళ్ళని చుట్టుముట్టి చంపేద్దామని
నిర్ణయించేసేం. కత్తులు, బల్లేలూ, ఒక రివాల్వరు, ఒక లైసెన్స్డ్ గన్ ( మా
బావమరిదిది) సిద్ధం చేసుకున్నాం. కాని ముస్తఫాలీ దాడికి రాలేదు. మేమూ సర్దేసుకున్నాము.
- మహీధర రామమోహనరావు
End of Project Gutenberg's Kollayi Gattite Nemi, by Rama Mohana Rao Mahidhara