అవమానించాలనే భావం నారాయణమూర్తిలో కలగడానికి తన చర్యలే కారణమని అతని మనస్సు బాధపడుతూంది. తన మూలంగానే ఆమె
అవమానం పాలయింది.
ఆమె తన భార్య. చట్టం, ఆచారం అంగీకరించకపోయినా ఆమె తన భార్య. ఆ దృష్టితోనే ఆమెతో మెలగేడు. తన వ్యవహారంలో
అనుచితమేదీ లేదు. వెకిలితనం లేదు. ఎండవేళ దాహం అనుకుంటే మంచినీళ్ళు స్వయంగా తెచ్చి యిచ్చేడు. ఆమెకు తమలపాకులు వేయడం
అలవాటు, ఎప్పుడూ ఆమె కోసం ఒక కిళ్ళీ జేబులో వుంచుకున్నాడు. బుగ్గను కాటుక అంటుకుంటే తుడుచుకొనేటందుకు తన జేబు రుమాలు
ఇచ్చేడు. ఎండలో ఎక్కడ అలిసిపోతుందోనన్నట్లు ఆమె మీదనే తన ప్రాణాలన్నీ నిక్షేపించేడు.
కాని, ఆమె తన భార్య, సాంప్రదాయక పద్ధతిలో వివాహం చేసుకొన్నది కాదని నారాయణమూర్తికి తెలుసు. ఆమె ఎవ్వరో తెలియదు.
కాని, సుందరి కాదు. సుందరితో తనకు తెగతెంపులు చేసినది ఆయనే. రాజకీయంగా తనకు వ్యతిరేక పక్షం వాడు. శత్రుకూటంలోని
వాడు. ఆ శత్రుత్వాన్ని తన కుటుంబ జీవితంలోకి కూడా పాకించినవాడు. నారాయణమూర్తే. అతడెరుగును.
అటువంటివాని ముందు తాను భార్యగా ఎన్నుకొన్న ఈమెను ప్రదర్శించడంలో ఆమె యెడ గౌరవం, ప్రేమ, అనుభూతి చూపడంలో ఒక
విధమైన కసి తీర్చుకుంటున్నాననే భావం మనస్సులో ఒక్కక్షణం కలగకపోలేదు.
నారాయణమూర్తీ, తానూ ఒకరితో ఒకరు సంబంధం వుండరాదనుకొన్నారు. కాని ఒకరినొకరు సాధించుకోవాలనే ఈ మనస్తత్వానికి కారణం
ఏమిటి? తామిద్దరూ పోగడి స్వరాజ్యాన్ని అవమానం పాలు చేశామేయని రామనాధం ఎంతో బాధపడిపోయేడు.
మరునాడు ఉదయం స్టేషనుకు వెళ్ళినప్పుడు రామనాధం స్వరాజ్యంతో సహా నారాయణమూర్తి గుడారాన్ని వెతుక్కుంటూ వెళ్ళేడు.
స్వరాజ్యాన్ని పరిచయం చేసేడు. "ఈమె నా భార్య, మీరు ఎరగరు...."
రామనాధం తనను ఎగతాళి చేయడానికి పనికట్టుకు వచ్చినట్లు మండిపడ్డాడు నారాయణమూర్తి.
"ఎన్నో భార్య?"
స్వరాజ్యం గతదినం తనకు అవమానం చేసినవాడు ఎవరో తెలిసేక మండిపడిపోతోంది. ఈ అవహేళనతో ఓర్పు కోల్పోయింది.
"భర్తృత్యాగినిని భార్యగా చెప్పుకోవడం అవసరమైతే నేను రెండో దానిని...."
నారాయణమూర్తి ముఖం జేవురించింది.
"ఆతనికి నీవు అయినట్లే నీకు కూడా అతడు రెండో మగడేనా?"
పరస్పరం అవమానించుకొనే ప్రయత్నంలో వారు ఎంతదూరం వెడతారోననిపించింది. వెంటనే రామనాధం కలుగచేసుకున్నాడు.
"మీరు సరిగ్గానే గ్రహించేరు. అయితే మా ఇద్దరి మొదటి పెళ్ళిళ్ళూ చెడిపోయినందుకు మేము విచారపడ్డం లేదు. మేమిద్దరం
ప్రేమించుకున్నాం. పెళ్ళి చేసుకున్నాం. మీ మనస్సులో మరెట్టి దురభిప్రాయాలూ మిగలకుండేందుకే నేనిప్పుడు వచ్చేను. మరి సెలవా?"
మూడు
ఒక ఆడకూతురు మర్యాదను కాపాడడంలో తాను చూపిన సాహసమే ఒక గాధ అయి, ఆనాటి చరిత్రాత్మక సమావేశాన్ని
కల్లోలపరచడానికి కారణం కావడం రామనాధానికి ఎంతో ఆశ్చర్యమూ, బాధా కలిగించేయి.
సమావేశంలో జనాన్ని సర్ది కూర్చోబెట్టవలసిన వలంటీర్లు ఆ రోజున వున్నట్టుండి హర్తాళ్ చేసేరు. వలంటీరు దళాల
నాయకుడు యూనిఫారానికి జరిగిన ఒక అవమానానికి క్షమాపణ చెప్పుకొంటే తప్ప ఒక్క వలంటీరు పని చెయ్యడని ప్రకటించేడు.
పని స్తంభించింది.
జనాన్ని సర్ది కూర్చోబెట్టే వాళ్ళు లేకపోవడంచేత నాయకుల్ని చూడడానికీ, వారి మాటలు వినడానికీ వేదికమీదికి ఎగబడ్డారు.
వారు ఏ నాయకుడినీ దగ్గర నుండి చూడ్డం పడడం లేదు. వారి మాటలు దగ్గరవాళ్ళకి కాని వినబడ్డం లేదు. కాని
వలంటీర్లున్నప్పుడు, వారి సరిహద్దులు దాటడానికి వీలులేకుండా వుంది. ఇప్పుడు ఆ ఆటంకం లేకపోయేసరికి ప్రతి ఒక్కరూ ముందుకే
తోసుకువచ్చేరు. అసంఖ్యాక ప్రజల ప్రేమాభిమానాలనుంచి గాంధీగారిని ప్రాణాలతో కాపాడడానికి వస్తాదు రాజు సోదరుల భుజదర్పం
అవసరం అయింది.
"నీ సాహసగాధ గాదు గాని, తెలుగుదేశానికి మహా అప్రతిష్ఠ చుట్టుకొని వుండేది" అన్నాడు వెంకట్రావు. గాంధీగారికి తప్పిన
ప్రమాదాన్ని తలుచుకొని.
"బెజవాడకు తీరని అప్రతిష్ఠ తెచ్చిపెట్టేవయ్యా దేముడా?" అన్నాడు బెజవాడ మిత్రుడొకడు.
మ్యూజియం హాలులో ఎ.ఐ.సి.సి. సమావేశాలు. ఆ రోజు వుదయం దేశనాయకులు సభా స్థలానికి వెడుతున్న సమయంలో జరిగిన ఒక
చిన్న ఘటన ఇంత ఉత్పాతం తెచ్చి పెడుతుందని ఆ క్షణంలో ఎవ్వరూ వూహించనుకూడా లేదు.
రామనాధాన్ని ఆముదాల మిల్లు వద్దకు వచ్చేసరికి ఆ దారిన వెడుతున్న అయ్యదేవర కాళేశ్వరరావుగారు గుర్తించేరు. ఆయన
వెంటనే వెర్రి ఆనందంతో తన్ను పిలిచేరు. నిలబడగానే తమతో వున్న చిత్తరంజన్‌దాసుకు పరిచయం చేసేరు. ఆతని
వీరకృత్యాన్ని అభినందించేరు. అభిమాన ప్రకటనగా చెవి పట్టుకొన్నారు. వీపుమీద తట్టేరు. "గట్టివాడివి. గట్టి వాడివి"
అని అభినందించేరు.
"మా తెలుగు కుర్రాళ్ళు ఎల్లాంటి వాళ్లనుకున్నారు? మెరికలు మెరికలు" అంటూ ఎంతో గర్వం, అభిమానం ప్రకటించారు.
కాళేశ్వరరావుగారి ముఖం చూసి, చిత్తరంజనదాసు మేలమాడేరు.
"మీ తెలుగువాళ్ళకి తెలుగు అభిమానం జాస్తి."
"మీ బెంగాలీల వద్ద నేర్చుకున్నది తప్ప అది సహజ లక్షణం కాదు" అని కాళేశ్వరరావుగారు మాట వప్పచెప్పేరు.
ఆమాట విని నలుగురూ నవ్వేరు. నలుగురితో తానూ నవ్వేడు. అంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయేరు.
పదిమంది మధ్య, చిన్నపిల్లాడిని చేసినట్లు చెవిపట్టుకోవడం చిన్నతనం అనిపించినా, అది దురుద్దేశంతో చేసింది కాదని రామనాధం
ఎరుగును. నాయకుల హాస్యాలూ, నవ్వుతాలూలో పాల్గొన్న వుత్సాహంలో ఆ విషయం బాధాకరమూ కాలేదు, అది జ్ఞాపకమూ లేదు.
అతనికది బాధ కలిగించలేదు గాని, ఇతరులు కొందరికి అది కష్టం అనిపించింది. రామనాధం మరచినా వారు మరువలేకపోయేరు.
చెవి గుంజినందువలన కలిగిన చిన్నతనం కాళేశ్వరరావుగారి క్షమార్పణ చెప్తే సరిదిద్దబడదనే భావం రామనాధానికి లేదు.
కాని వలంటీరు దళాల అధినాధుడు దానిని వలంటీరు దుస్తుల్ని చిన్నపరచడంగా భావించేడు.
దానికి కాళేశ్వరరావుగారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.
కాని, కాళేశ్వరరావుగారు నిరాకరించేరు.
అయితే వలంటీర్ల పని బంద్ అని ఆయన ప్రకటించేడు.
ఫలితంగా ఒక్క వలంటీరు కనబడలేదు.
దీనికంతకూ తానే కారణమయినట్లు రామనాధం తల్లడిల్లిపోయేడు.
ఒక్కొక్క చిన్న సంఘటన ఎంతెంత దూరం, ఎటువంటి ఫలితాలనిస్తుందో కండ్లారా చూస్తూ రామనాధం ఎంతో దుఃఖపడ్డాడు.
ఆ సాయంకాలం బహిరంగ సభ కల్లోలం మధ్య ముగియడం ఒక్కటేనా?
ఆ పూట గాంధీజీకి ఆహారం లేకుండా పోయింది.
గాంధీజీ సరిగ్గా ఆరు గంటలకు ఆహారం తీసుకుంటారు. ఆ సమయంలో ఆయన సభా స్థలంలో వుండాలి, ఆ వుద్దేశంతోనే ఆయన ఆహారాన్ని
అక్కడికే తీసుకెళ్ళేరు.
కాని, ఆహారం తీసుకోవలసిన వేళకి ఆయనను కోడేరు వస్తాదు రాజు సోదరులు బసలోకి తీసుకువచ్చేరు. ఆయన ఆ వేళ దాటితే
మరేమీ తీసుకోరు. బసకు వస్తూనే నిరాహారంగానే తమ పనికి వుపక్రమించేరు.
ఆయన నిరాహారం వుండవలసి రావడం ప్రతివారికీ వ్యధ కలిగించింది. కాని ఆయన అది అతి సామాన్య విషయంగా త్రోసిపుచ్చేరు.
"తరుచుగా ప్రయాణాల్లో ఇంతే. దీనివలన నా ఆరోగ్యం చెడదు" అన్నారు.
అయినా మనసుకేమిటో కష్టంగానే వుంది. రైలెక్కే వరకూ ఆ ఘటన మనస్సుని కోస్తూనే వుంది.
నాలుగు
రాజమండ్రీలో దిగేక గాని గోదావరి కాలువలు కట్టేసి వుంటారనే సంగతి గుర్తు రాలేదు. వానపల్లి కాలువ కట్టేసి వుండరు. కాని,
కాలువల్లో నీళ్ళు వుండవు. పడవలు సరిగ్గా వెడతాయనే నమ్మకం లేదు. నలభయి మైళ్ళలో వున్న ముంగండ చేరాలంటే అంచె బళ్ళ
మీద రెండు రోజులు పట్టేలా వుంది.
రామనాధం స్వరాజ్యం వంక చూసేడు. ఆమె తల అడ్డంగా తిప్పింది. భర్తను విడిచి ఒక్క రోజు కూడా దూరంగా వుండేందుకు ఆమె
సిద్ధంగా లేదు.
"నేనూ బ్రహ్మాండంగా నడిచెయ్యగలను."
రామనాధం ఒక్క క్షణం ఆమె వంక చూసేడు. తాము తొందరగా వూరు చేరాలి. దారిలో పడవ ఎక్కడన్నా మెరకపడితే దానిని
కదిలించేవరకూ కూర్చుందామన్నా కుదరదు. వెంటనే కదలవలసి వుంటుంది. ఎక్కడ ఆ అవస్థ తటస్థపడుతుందో.....
అతని అభిప్రాయాన్ని, తటపటాయింపును గమనించి స్వరాజ్యమే చొరవ తీసుకుంది. గుర్రబ్బండీని కేకేసింది.
"ధవిళేశ్వరం."
రామనాధం ఒక చిన్న సవరణ పెట్టేడు.
ఇంత బెడ్డింగు మోయడం కష్టం. అవసరమైనవి జోలె సంచులలో తీసుకొని మిగిలినవి రంగనాధరావు మేస్టారి ఇంట పడేసి పోదామని
అతని సలహా.
వారిని చూసి రంగనాధరావు దంపతులు బ్రహ్మానందపడ్డారు. వారు దంపతులయ్యేరని విని రంగనాధరావు ఆశ్చర్యపడ్డాడు.
"ఎప్పుడు చేసుకున్నావు? నన్నెందుకు పిలవలేదు?"
కాని, అసలు కథ విన్న తరువాత రంగనాధరావు ఔడు కరిచేడు.
"భార్య వుండగా, భర్త వుండగా రెండో పెళ్ళి చేయడానికి బ్రహ్మసామాజికులు వొప్పుకోరు. హిందూమతం వొప్పుకుంటుంది. కాని మీరు
వేర్వేరు కులాల వాళ్ళు. కనక అదీ వొప్పుకోదు."
"కనకనే మాస్టారూ! మేము వివాహపు తంతుకి ప్రాముఖ్యం ఇవ్వం అనుకొన్నాం. మా మనస్సులు కలిశాయి. మేము ఆ క్షణంలోనే పెళ్ళి
అయినట్లే భావించుకొన్నాం."
"పెళ్ళి అనేది ఒక భావన. అది మన మనస్సులలో కొన్ని అనుబంధాలను కల్పించి వుంచింది. ఈనాడు పెళ్ళిని తోసెయ్యగలం. కాని
ఆ అనుబంధాలను కూడా తోసివేయగలిగినప్పుడే...."
"అంటే...."
"ఆ అనుబంధాల బాహ్యరూపం తప్పు చేస్తున్నామనీ, తప్పు చేస్తున్నామన్న సంకోచాలూ, సంతోషాలూను."
రామనాధం, స్వరాజ్యం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
"మేము ప్రపంచాన్నే ధిక్కరించి నిలబడతాము మాస్టారూ! మేం చేస్తున్నది తప్పు కాదు. మాకు ఏర్పడిన పరిస్థితులలో ఆ
పెళ్ళిళ్ళ నుంచి విముక్తి కావాలి. అది దొరకదు. మా వివాహాన్ని గుర్తించని సమాజాన్ని మేమూ గుర్తించము."
"ఆ ధైర్యం అవసరం. మంచిదే, అయితే ఆ ధైర్యానికి అప్పుడప్పుడు సామాజికమైన ఆలంబన అవసరం. కనీసం ఆ ఆలంబన
వున్నదనే భావనయన్నా అవసరం."
ఆ అవసరం మనస్సుకి అనిపించినప్పుడు ఆ యువదంపతుల్ని రాజమండ్రి రమ్మని ఆహ్వానించేడు రంగనాధరావు.
"మీకు వివాహం నేను చేయిస్తా."
"దానికి సంఘబలం వుంటుందా మేస్టారూ!"
"మీ యిద్దరికీ జరిగిన ప్రథమ వివాహాలతో సంఘబలం ఏం కనిపించింది? అది ఒక భావన మాత్రమేనని చెప్పాను. మన మనస్సులు
కొన్ని కార్యకలాపాలకి అలవాటు పడిపోయాయి. వానిని మనం పాటించకుండా తోసేస్తూనే వుంటాం. కాని, ఆ కార్యకలాపాలతో ముడిపడి
వున్న భావనలు మన మనస్సుల్ని పట్టుకొనే వుంటాయి. లేకుంటే వివాహబంధం విచ్ఛేదం చేసుకొనే అవకాశం కావాలనే మీ కోరికకు అర్థం
ఏమిటి? అవి ఏనాడో విచ్ఛిన్నం అయేయికదా."
రామనాధం ఆ మాటలోని నిజాన్ని అర్థం చేసుకోగలిగేడు. కాని, మనస్సులో అనేక అనుమానాలు.
స్త్రీ పురుష సంబంధాలకు సామాజికమైన హద్దు అనేది లేకుండా చేసి కేవలం వ్యక్తి నిష్ఠమైన ప్రేమను మాత్రమే ప్రాతిపదికగా
అంగీకరిస్తే రోజుకి ఒకళ్ళను మార్చే ఘట్టం ఏర్పడుతుంది కదా. అటువంటి స్వేచ్ఛా, ప్రేమ సంఘానికి గాని, వ్యక్తికి గాని
లాభమా?
"కాదు...." అని ఖచ్చితమైన కంఠంతో రంగనాధరావు స్పష్టం చేశాడు.
"స్త్రీ పురుష సంబంధాలు కేవలం వైయక్తికాలు కావు. అవి సాంఘికమైనవి మాత్రమే కూడా కాదు. అందుచేత కనీసావసరములైన
పరిమితులతో వానిని ఆమోదించవలసి వుంటుంది. రష్యాలో వాళ్ళు అటువంటిదేదో తలపెట్టినట్లు తోస్తుంది. వాటిని నిందిస్తూ వస్తున్న
అభిప్రాయాల్ని బట్టి అసలు ఏమిటో వూహించవలసి వస్తున్నదే గాని, యథార్ధస్థితి తెలియడంలేదు" అంటూ ఆయన మరల రష్యాను
గురించి చెప్పాడు.
రామనాధం భార్యతో లేచేడు.
"వెళ్ళి వస్తాం మేస్టారూ!"
లాకుల వద్ద బండి దిగి ఆనకట్ట మీదికి వెడుతూంటే స్వరాజ్యం వెనక్కు తగ్గింది.
"రా, మళ్ళీ ఆలస్యమయిపోతూంది."
ఆమె అతని చాటుకి వచ్చింది. తల బాగా వంచేసుకుంది. ఆమె స్థితి అతనికి అర్ధం కాలేదు. కాళ్ళు అప్పుడే
మెత్తపడిపోయాయనుకున్నాడు. జాలిపడ్డాడు.
"రాళ్ళు గుచ్చుకుంటున్నాయి కదూ."
"రాళ్ళూ లేవు, ఏమీ లేవు. నడవండి."
ఇద్దరూ ఆనకట్టమీదికి వచ్చేరు. అప్పుడు చెప్పింది. ఆ కారణం వింటూ వుంటే ఆశ్చర్యం కలిగింది.
ఆమె రాజమండ్రిలో వున్న రోజుల్లో వారి పొరుగునున్న ఒకళ్ళిద్దరు సర్ ఆర్థర్ కాటన్
విగ్రహం దగ్గర పచ్చిక మీద కూర్చుని వున్నారు. వాళ్ళ కంటబడడానికి ఆమె సిగ్గుపడింది.
బెజవాడలో ఆమె తనను భర్తగానే చెప్పింది కాని, ఇక్కడ కూర్చున్నవాళ్ళు ఆమె భర్తను--ఏలుకోడానికి నిరాకరించిన
భర్తను--ఎరుగుదురు. ఈవేళ రామనాధాన్ని ఎవరంటే ఏమి చెప్తుంది? అదీ భయం.
రంగనాధరావు చెప్పిన మాటలకర్థం ఇదన్నమాట అనుకున్నాడు.
"మీరు భయపడరా?" అని స్వరాజ్యం అడిగింది.
భయపడననే అనుకొన్నాడు. కాని, ఒక్క అరగంటలో తన ఆలోచన వట్టి అబద్ధమని తేలిపోయింది.
ఆమె ఆ ప్రశ్న వేసినప్పుడు రామనాధం ఎగతాళి చేసేడు.
"ఏం తల తీస్తారా? నడు. పలకరించిపోదాం."
నిలబడిపోయిన రామనాధాన్ని స్వరాజ్యం నెట్టింది.
"పలకరించి వచ్చే లోపున పడవ దాటిపోతుంది....."
భుజాన వున్న సంచిని సర్దుకుంటూ రామనాధం ముందడుగు వేశాడు.
"ఇల్లా ఇవ్వండి, కొంత దూరం నేను తెస్తాను" అంది స్వరాజ్యం.
"అది నాకిస్తావా?"
నిజానికి ఆమె సంచీయే కొంచెం పెద్దదిగా వుంది. అయినా ఆమె దానిని అతనికివ్వడానికి అంగీకరించలేదు.
అతడు నవ్వేడు. తన భుజాల వంకా, ఆమె వంకా చూశాడు.
"నిన్ను చేతుల్లో ఈ వేపునుంచి ఆవేపుకంటా తీసుకుపోగలను. ఎంత పందెం..."
ఆమె అతని వంక చూసి కళ్ళతోనే నవ్వింది.
"వద్దులెండి."
ఆనకట్ట మీద కొంత దూరం వెళ్ళేక ఇద్దరు యువకులు ఎదురయ్యేరు. వాళ్ళని చూసి రామనాధం నిలబడ్డాడు.
ఎదురుగా నాలుగైదు తలుపుల మేర ఆనకట్టమీద నీరు పొర్లుతూంది. చప్టా పాకుడు పట్టి వుంది. జాగ్రత్తగా నడవాలి. ఆ పాకుడు
మీద తప్పుకోవడం కష్టం.
"వాళ్ళని వచ్చెయ్యనీ...."
వాళ్ళు వచ్చేశారు. ఎదుటకు వచ్చేశాక ఆ యువకులలో ఒకడిని తన మిత్రుడూ, సహాధ్యాయిగా గుర్తించేడు.
అతడూ వారిద్దరినీ గుర్తించేడు.
"ఇదిగో రామనాధం! బెజవాడనుంచి వస్తున్నావనుకొంటాను...... మీ పేరు స్వరాజ్యం కాదూ, జ్ఞాపకం వున్నానా? మనం ఇద్దరం
మెట్రిక్‌లో......."
"గుర్తుంది. మీ పేరు మంగరాజు కాదూ." అని స్వరాజ్యం తన జ్ఞాపకాన్ని ప్రకటించింది.
"ఇప్పుడేం చేస్తున్నారు?" అంది.
"ఇంజనీరింగ్ కాలేజీలో చేరేను." అన్నాడు మంగరాజు.
రామనాధము ఆశ్చర్యం కనబరచేడు.
సహాయ నిరాకరణంగా కాలేజీ మానేస్తున్నానని తనతోబాటు బయటకు వచ్చిన నలుగురైదుగురు యువకులలో మంగరాజొకడు. కాని
సూపరింటెండింగ్ ఇంజనీరు తండ్రి మర్నాడే అతనిని కాలేజీకి తెచ్చి వదిలేసేడు. అతడు లక్షణంగా చదువుకొని డిగ్రీ
తీసుకొన్నాడు. వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు.
ఆ ఏడాదికి చదువు పూర్తి చేసుకొన్నాడంటే పోనీలే అనిపించింది. కాని, కొత్త కోర్సులో చేరేడని విన్నాక రామనాధం అతని వంక
చూసిన చూపుకు మంగరాజు నవ్వేడు.
"స్వరాజ్యం వచ్చేక టెక్నికల్ బలగం మనకెంతో అవసరం, ఆనాడు అద్దద్ద అంటే ఎక్కడ వస్తారు? ఆ విజ్ఞానం
సాధించుకోలేకపోతే స్వరాజ్యం సంపాదించుకున్నాక మళ్ళీ నువ్వు వెనక్కేనా వెళ్ళాలి. లేదా మళ్ళీ ఆ ఇంగ్లీషువాడినో, మరొకడినో
భంగపడాలి" అన్నాడు.
రామనాధానికి ఆ వాదం నచ్చలేదు. స్వరాజ్యం సాధించడం కోసం నానా హింసలూ పడేది తాము. దానిని సుస్థిరం చేయడం పేరుతో ఇప్పటి
నుంచీ అంగోస్త్రాలు పరుస్తున్నారన్నమాట అనుకున్నాడు.
పైకి "ఆమాట నాకు తోచనే లేదు సుమా, తోస్తే బహుశా ఇంగ్లండులో వుండేవాడిని" అన్నాడు.
మంగరాజు దానికి సమాధానం ఇవ్వలేదు. అతనికీ రామనాథం కథ అంతా తెలుసు.
"మా మామగారు నిన్ననే వెళ్లేడిల్లాగ, గాంధీగారు డెల్టా సంచారం వస్తున్నారటగా, గుండెలు కొట్టుకుంటూ పరుగెత్తుతున్నాడులే" అంటూ
నవ్వేడు.
రామనాధం కనుబొమ్మ ముడిచేడు. క్షణంలో ఏదో నిర్ణయించుకొన్నట్లు ముఖం విప్పారింది.
"నీకు పరిచయం చెయ్యడం మరిచిపోయేను. ఈమెను నువ్వు మీ క్లాస్‌మేట్‌గానే ఎరుగుదువు. ఈవిడ నా భార్య."
మంగరాజు అంతవరకూ ఆలోచిస్తున్న సమస్యకు అర్థం దొరికింది. ఏవిధమయిన బంధుత్వమూ, పరిచయమూ కూడ వుండడానికి అవకాశం
లేదనుకునే వీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తూండడం అతనికి ఆశ్చర్యంగా వుంది. ఆమె కులం అతని కులం ఒకటి కాదని
అతడెరుగును. ఈ విషయం అతనికి మరీ ఆశ్చర్యంగా వినిపించింది. కాని మర్యాదకి బయటపడకుండా అభినందనలు తెలిపేడు.
"మీ దంపతులిద్దరూ ఈవేళ మా యింటిలో వుండిపోండి....."
రామనాధం మెత్తపడలేదు.
"గాంధీగారు వస్తున్నారని ఎరుగుదువుగా, అందుకే ఈ పరుగు."
బెజవాడ సభలో తిలక్ స్వరాజ్యనిధి కోటి రూపాయలు వసూలు చెయ్యాలని కాంగ్రెసు నాయకులు నిశ్చయించుకొన్నారు. ఆ
వసూళ్ళ కోసమే గాంధీగారి పర్యటన.
ముంగండకి గాంధీగారిని తీసుకువచ్చి తను నడుపుతున్న ఖద్దరు వుత్పత్తి కేంద్రానికి ఆయన ఆశీర్వచనం సంపాదించాలని రామనాధం
ఆలోచన.
కానీ, గాంధీగారిని ముంగండ తీసుకురావడం సాధ్యం కాదంటున్నారు కళా వెంకట్రావుగారు. ఆయన కార్యక్రమాన్ని డెల్టాలో సక్రమంగా
నడిపించే బాధ్యత వెంకట్రావుగారిది. ఆయన గాంధీగారి ప్రయాణంలో ముంగండ చేర్చడానికి వీలు లేదంటున్నాడు. రాజోలునుంచి గన్నవరం
మీదుగా అమలాపురం రావడానికి వీలుంటే ముంగండ గాంధీగారు రావడం సాధ్యమే. కాని, మధ్యలో వశిష్ట మీద ఆక్విడక్టు వుంది. దానిని
దాటడం ఎలాగ?
"ముందు ముంగండ వెళ్ళాలి. అక్కడికి వెళ్లేకనే ఏ ఆలోచన అయినా."
కాని, అది మాటవరసకు ఇచ్చిన సమాధానం మాత్రమే. ఏం చెయ్యాలో అతడప్పుడే ఓ పథకం వేసుకున్నాడు.
తిలక్ నిధికి తమ వూళ్ళో కూడా ఓ నూటపదహార్లు ఇస్తామంటే గాంధీగారి కార్యక్రమాన్ని అనుకూలంగా సర్దుబాటు
చేస్తారని అతని ధైర్యం. బెజవాడలో ఆ నిధికి పెద్ద విరాళం ఇచ్చిన వర్తక ప్రముఖుని యింటిలో గాంధీగారి బస ఏర్పాటు
చేశారు. అదీ అతని ధైర్యం.
అతని ఆలోచన విని మంగరాజు ఆలోచించేడు.
"కాలువలు కట్టేశారు కాదటయ్యా?"
ప్రశ్న అడగడంలో మంగరాజు వుద్దేశం వేరు. రామనాధం అర్థం చేసుకొన్నది వేరూను.
"వానపల్లి కాలవలో పడవలు వెడుతున్నాయి."
మంగరాజు ఇంక ఆతనిని ఒత్తిడి పెట్టదలచుకోలేదు. స్వరాజ్యం వేపు తిరిగేడు.
"మీ మాటేమిటి? నాన్నగారు రేపు కారులో రాజోలు ప్రయాణం పెట్టుకున్నారనుకుంటాను. వారి కారు ముంగండ మీదుగానే వెడుతుంది మీరు
ఆగండి."
ఆమె ప్రయాణంలో ఇబ్బంది పడలేదనే ఆలోచనతో రామనాధం ఆమె ముఖం వంక చూసేడు. కాని, ఆమె నిరాకరించింది.
"కాదండి క్షమించాలి. ఇద్దరం వెళ్ళాలి."
అయిదు
ఊళ్ళో అడుగు పెట్టేసరికి దేవుడి గుడి వీధిలోంచి ప్రభాతభేరీ సాగుతూంది.
సుందరమైన రాట్నమే.
పసందు బాంబురా.....
విశాలాక్షి నవ్వుతూ ఆ హడావిడి ఏమిటో వివరించింది.
"మేనమామ పోలికలు వట్టినే పోవు. ఈయనగారు హైస్కూలు పూర్తి చేయకుండానే చదువు మానుతాడో ఏమో కొంపతీసి."
ఆమె కంఠంలో ఆదుర్దాయేగాని కోపం వినిపించలేదు.
బాలకృష్ణ ఈ వారం నుంచీ తన యీడు కుర్రకారును పోగుచేసి తెల్లవారగట్ల ప్రభాతభేరీ ముగించుకొని బడికి పరుగెత్తుతున్నాడు.
రామనాధం నవ్వుకున్నాడు.
"ఎక్కడో పాటలు కూడా సంపాదించేడు."
విశాలాక్షికీమారు కోపం వచ్చింది.
"ఏవో స్వరాజ్య గీతాలంటూ తెచ్చేడు. కుర్రనాగమ్మనిచేసి పుస్తకం ఖరీదు రెట్టింపు వసూలు చేశాడురా."
రామనాధం ఆ మాటకు ఎక్కువ శ్రద్ధ చూపలేదు. కాని మాటవరసకు అడిగేడు.
"ఎవరది?"
"మన గవరయ్యే."
"ఉహూఁ" అన్నాడు.
గాంధీగారికి గ్రామంలో స్వాగతం ఇవ్వడానికై చేస్తున్న ప్రయత్నాలలో ఆ గవరయ్య ఆ రెండు రోజులూ తన వెనకనే వున్నాడు.
కుర్రవాడికి స్వరాజ్యగీతాలు కావాలనే ఆసక్తిని వుపయోగించుకొని లాభం తీయడానికై అతడు ప్రయత్నం చేశాడన్న విషయం అతని
మనస్సును గంద్రగోళ పరుస్తూనే వుంది. తీరా చేస్తే ఆ పుస్తకం మీద అతడు తీసిన లాభం రెండణాలే. అక్కడ డబ్బు ఎంత అని
గాదు సమస్య. ఆ ధోరణిలో వున్న ప్రజాద్రోహ చింతన అతనిని బాధిస్తూంది.
చివరకు వుండబట్టలేక రెండో రోజున అడిగేసేడు. అయితే గవరయ్య నవ్వేడు. తప్పు అనుకోలేదు. సిగ్గు పడలేదు.
"లేకపోతే ఈ తిరగడానికి డబ్బులేవీ, పన్నెండు పుస్తకాలు అమ్మేను. రెండు రోజుల భత్యాలొచ్చేయి" అన్నాడు.
కాని రామనాధం మనస్సు సంతృప్తి పడలేదు. దేశభక్తీ-మోసమూ పొత్తు కుదరని భావాలు.
ఆ సమ్మిశ్రణం వెనుకనున్న స్వార్థాన్ని రామన్న చాల మోటుగా వివరించేడు.
"దేశభక్తీ కాదు, దిబ్బభక్తీ కాదు, బీడీముక్క కావలసివస్తే పెళ్ళాన్ని కూడా ఆమ్మేస్తారు. ఇల్లాంటివాళ్ళే."
అవమానకరమైన ఆ వ్యాఖ్యకు పెద్ద పేచీ వస్తుందని రామనాధం భయపడ్డాడు. కాని గవరయ్య నిశ్శంకగా నవ్వేశాడు.
"గాంధీగారు వస్తున్నారన్నా, ఒక్కపూట సెలవు పెట్టి ఏదన్నా పని వున్నా చేయడానికి రారుగాని, వచ్చేవాళ్ళకి వెధవ
నీతులు....."
రామన్న కొత్తగా ఓ ఎలిమెంటరీ స్కూలులో మాస్టరీ సంపాదించేడు. ఒంటిపూట బడి, రెండోపూట వచ్చి పనిచెయ్యడం గవరయ్య దృష్టికి
చాలడం లేదు. డబ్బుకోసం కట్టుబడిపోయాడని అతని అభ్యంతరం.
రామనాధం అప్పటికి వాళ్ళని సర్దుబాటు చేశాడు. కాని, ఖచ్చితంగా అతని అభిమానం రామన్నవేపే. అతడు శ్రమపడి
పనిచేస్తున్నాడు. తనకు కావలసిన డబ్బు సంపాదించుకొంటున్నాడు. మిగతా వేళల్లో వచ్చి గ్రామ ఉమ్మడి పనుల్లో పాల్గొంటున్నాడు.
గవరయ్య ఇరవై నాలుగు గంటలూ పని చేయగలుగుతున్నానంటూ తన ప్రక్కనున్న వాళ్ళని మోసం చేస్తున్నాడు.
"నేనెవ్వరినీ మోసం చెయ్యలేదు. రెట్టింపు ఖరీదు ఇస్తే పుస్తకాలు ఇస్తానన్నాను. బలవంతం ఏం వుందీ? నేను మీ వాడిని కొనమని
ఏడిశానా ఏమన్నానా? అమ్ముడుకాకపోతే నాకు నష్టం కలగదా. నష్టం-లాభం....."
రామనాధం అతని వాదనను ఒప్పుకోలేదు.
ఆ గవరయ్యే సుబ్బావధాన్లు తిలక్‌నిధికి రూపాయన్నా ఇవ్వలేదని ఏమీ పుచ్చుకోకుండా లేచివచ్చేడు.
ఆయన నిధికి రెండణాలు మాత్రమే ఇవ్వబోయేడు. గవరయ్య "ఇదా ఇచ్చేది" అని విసిరేసేడు.
అంతకన్న ఏమీ ఇవ్వనని అవధాన్లు పొమ్మన్నాడు.
ఆ విషయంలో కూడా రామనాధం గవరయ్యనే తప్పుపట్టేడు.
"ఆ గాంధీగారు దీనిని 'పైసా ఫండు'గానే వసూలు చెయ్యమన్నారు. ఆ విధంగా కోటానుకోట్లమందికి కాంగ్రెసు ఆశయాలు ప్రచారం
అవుతాయని....."
గవరయ్య నవ్వేడు.
"పైసా లెక్కన తేలిందే కూలిపని చేసుకొనేవాడు కూడా ఒక కానీ సులభంగా పడేస్తాడు."
"పడేస్తే మంచిదే. ఇష్టాపూర్తిగా ఇచ్చినదే..."
ఈమారు రామనాధం దొరికేడని గవరయ్య గంతువేసేడు.
"ఇష్టాపూర్తిగా కుర్రాళ్ళు నా పుస్తకానికి ఇచ్చిన ఖరీదు మోసం అన్నావు. ఇప్పుడిది...."
ఆ వ్యాఖ్యానం, సమర్థన విన్నాక గవరయ్యకు రామనాధం నమస్కారం చేయడం తప్ప మరో మార్గం లేదు.
"నీబోటి తత్వవేత్త లభించినందుకు కాంగ్రెసు తల తీసి చంకన పెట్టుకోక తప్పదు."
గవరయ్య కోపం చేయలేదు. సిగ్గుపడలేదు. బహు తేలికగా ఆ నమస్కారం అందుకొని ఆశీర్వదించేడు.
"దీర్ఘాయుష్యమస్తు, ఆపాదశిరః పర్యంతం బహు-ఏదో-సమృద్ధిరస్తు....."
గవరయ్యవంటి వాళ్ళ ఉత్సాహమూ, భక్తీ కాంగ్రెసుకి ప్రతిష్ఠో, అప్రతిష్ఠో తేల్చుకోలేకపోయేడు రామనాధం. కాంగ్రెసు మాట ఎలా
వున్నా దేశానికీ, ప్రజలకూ నష్టమేగాని....
ఆ ఆలోచనలతో కొట్టుకుపోతూ అతడు వీధిన పోతూంటే అరుగుపై కూర్చుని జపం చేసుకుంటున్న సుబ్బావధాన్లు పిలిచేడు.
ఆయన తనకు గత దినం రాత్రి వచ్చిన కలను చెప్పదలిచేడు.
పెద్ద బుగ్గమీసాలున్న అజానుబాహువయిన వ్యక్తి కలలో కనిపించేడు. అతను అంగోస్త్రం వంటిది కట్టుకున్నట్లు అనిపించింది కాని
అది పట్టుది. "పీతాంబరం సుమీ" అన్నాడు అవధాని.
"చేతిలో ఏదో వుంది, ముందు రాట్నంలా అనిపించింది. కాని సరిగ్గా చూసేసరికి చక్రాయుధం, నా వళ్ళు పరవశమయిపోయింది.
'స్వామీ' అని ఒక్క సాష్టాంగం చేసేను. నా చేతిలోని ఒక్క తులసీ దళం ఆయన పాదాలమీద వుంచేను.
సుబ్బావధాన్లు ఆత్మవంచన చేసుకొంటున్నాడో, తమకందరికీ ప్రోత్సాహం ఇవ్వదలచేడో రామనాధానికి అర్థం కాలేదు. గాంధీగారిని ఆయన
విష్ణుస్వరూపుడిగా వర్ణిస్తున్నాడు.
గాంధీగారికి ఏ కొద్దియో ఇవ్వాలనుంది. కాని వసూలు చేస్తున్న వాళ్ళు నిరాకరించారు. అది కష్టం అనిపించింది.
ఎందుకో రామనాధానికి అర్థం కాలేదు. గాంధీగారు చెప్పిన అస్పృశ్యతా నివారణ ఆయనకిష్టం కాదు. అయిదారు నెలల క్రితం తన
తోటలో నూతి సమస్యపై ఆయన కనబరచిన స్వార్థబుద్ధికి అప్పుడు కోపం వచ్చింది. ఈవేళ గాంధీగారు ప్రారంభించిన వసూళ్ళలో
తన బేడా కూడ చేరాలని ఈ తాపత్రయం ఏమిటో. దానికై అబద్ధాలాడడానికీ, అభూత కల్పనలకీ కూడ సంసిద్ధం అవడం
ఏమిటో..... రామనాధం తేల్చుకోలేకపోయినా, ఆయనను విరాళం కోసం అర్థించేడు.
"పత్రం పుష్పం ఫలం తోయం... అన్నారు. గాంధీగారు కూడా దీనిని పైసా ఫండ్ గానే వసూలు చేయాలని..."
అవధాన్లు ముఖం వికసించింది.
"నిజంగా.....!" ముందుకు వంగి రహస్యంగా అడిగేడు.
"ఒక అణా ఇస్తే బాగుంటుందంటావా!" అన్నాడు.
రామనాధం కండువా కొంగు పట్టేడు.
సుబ్బావధాన్లు ఆశ్చర్యంతో ముఖం వంక చూస్తూ నాలుగణాలబిళ్ళ వేసేడు. రామనాధం నమస్కరించి సెలవు తీసుకున్నాడు.
"గాంధీగారు దీని విలువ కోటిరూపాయలతో సమంగా భావిస్తారు మామగారూ."
ఆరు
తోట మకాములోకి వచ్చేసరికి మంగరాజు కూర్చుని ఎదురు చూస్తున్నాడు.
"ఎంతసేపయింది వచ్చి?"
"ఇప్పుడే నాన్నగారు రాజోలు వెళ్ళాలనుకుంటున్నారన్నాను కదూ! వారితో వచ్చాను. వారు నన్నిక్కడ వదిలి గన్నవరం వెళ్ళేరు."
కారు అక్విడక్టు తొట్టిలోకి దిగేటందుకూ ఎక్కేటందుకూ ఇటు గన్నవరం వేపునా, అటు లంకల గన్నవరం వేపునా, సొలుపులు
చేయించమని మొన్ననే ఫోనులో చెప్పేడు. ఈ వేళ వచ్చేరు.
ఆ వార్త వినగానే మత్తు వదిలినట్లు రామనాధం లేచేడు.
"నడు, మీ నాన్నగారిని కలుసుకోవాలి."
"అభ్యంతరము ఏమిటిగాని, ఆయన ఇంకా గన్నవరంలో వున్నారాయని సందేహం."
పొంగుతున్న పాలమీద నీళ్ళు చల్లినట్లయి రామనాధం గమ్మున చప్పబడిపోయేడు.
"గుర్రబ్బండి చేసుకువెడదాం. ఆయన్ని ఎక్కడున్నా పట్టుకోవాలి."
ఆ ఆదుర్దా ఎందుకో మంగరాజు ఎరుగును. కాని, ఎరుగనట్లే నటించేడు.
"ఏమిటా వుప్పెన, ఎక్కడున్నారని వెడతాము? ఆయన కారులో వెడుతూంటే గుర్రబ్బండీలో వెంటబడతావూ? నయం కాదూ, ఒంటెద్దు బండిలో
వెడదామన్నావు కావు."
రామనాధం తన అవసరం చెప్పేడు. అక్విడక్టు తొట్టిలోంచి గాంధీగారి కారు రావడానికి అనుమతి కోరాలి.
అదే జరిగితే ఆయన ప్రయాణం వెనకముందులు కావలసిన పని లేదు. అమలాపురం నుంచి రాజోలు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరగనక్కర
లేకుండా గన్నవరం మీదుగా ముంగండ వస్తారు. తన ఖద్దరు ఉత్పత్తిశాఖకు ప్రారంభం జరుపుతారు. ముందుకు వెడతారు. కొత్తగా మరో
నాలుగైదు గ్రామాలకు ఆయన వెళ్ళగలుగుతారు.
మంగరాజు అన్నీ విని వుపాయం చెప్పేడు. సబ్‌డివిజనల్ ఆఫీసరుగారికి ఆయన ఎక్కడ వున్నదీ తెలుస్తుంది.
అక్కడనుండి ఫోన్‌లో మాట్లాడవచ్చులే అన్నాడు.
కాని, అంతకన్న అదనం చెప్పడానికి మంగరాజు సిద్ధంగా లేడు.
గాంధీగారి ప్రయాణానికి సౌకర్యం కలిగించడానికి ప్రయత్నించినట్లు కనిపించకుండా సాయం చేయడానికే సూపరింటెండింగ్ ఇంజనీరు
రాజోలు ప్రయాణం పెట్టుకున్నాడని మంగరాజు ఎరుగును. కాని అతడేమి చెప్పలేదు.
ఆత్మాభిమానం చంపుకుని ప్రిన్సిపాల్‌కు క్షమాపణ చెప్పుకుని, కొడుకు కాలేజీలో చేరేటట్లు వొత్తిడి పెట్టిన ఇంజనీరు
ఈనాడు గాంధీగారి ప్రయాణం సౌకర్యం కోసమే రాజోలు ప్రయాణం పెట్టుకొని వుంటాడన్నది రామనాధం వూహలకు అందని విషయం.
"అయితే నడు, వెడదాం...."
"మరి ఇక్కడి పనులు ఏం చేస్తావు. పోనీ నేను వెళ్ళి చెప్పి వస్తానులే" అన్నాడు మంగరాజు.
"అక్కర్లేదు. స్వరాజ్యం వాళ్ళ నాన్నగారూ ఇక్కడే వున్నారు. వారే ఇక్కడి ఏర్పాట్లు చూస్తున్నారు."
మంగరాజు రెండు రోజుల క్రితం స్వరాజ్యం సమ్ముఖంలో వుండడంచేత అడగలేకపోయిన ప్రశ్న ఇప్పుడు అడిగేశాడు.
"మీరు వూళ్ళోనే కాపురం పెడతారా?"
అతని ప్రశ్నలకు మూలం ఎరిగిన రామనాధం ఆచి యాచి, తూచి తూచి సమాధానం ఇచ్చేడు.
"ఇంకా మా వివాహ వార్త ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ నాన్నగారు వొప్పుకున్నారు. మా పెత్తండ్రిగారికి చెప్పేను. ఈ హడావిడి
తగ్గగానే ఇక్కడే కాపురం పెడతాము. గొడవలు వస్తాయి......"
"వస్తాయని ఎరిగి వుండి ఈ పల్లెటూళ్ళో ఎందుకు? పట్టణం చేరుకోకా?"
ఏదో మహాపరాధం చేసినట్లు పారిపోతామా? ఇది మా వూరు. పుట్టి పెరిగిన చోటు, ఇక్కడ కొద్దిమందేనా నా తరఫున వుండే జనం
వున్నారు. మా ఆస్తులు ఇక్కడ వున్నాయి. ఈ చుట్టుప్రక్కల ఏదో పని చెయ్యాలని బోలెడంత కార్యక్రమం వేసుకున్నాం. ఇవన్నీ
వదులుకు పోవడమా...."
"నీ సాహసం! అన్నింటిలోనూ ఒక్కలాగే వున్నావు" అంటూ మంగరాజు మెచ్చుకొన్నాడు.
"ఇందులో నా సాహసం కాదు, స్వరాజ్యానిది చెప్పు."
మంగరాజు కొంతసేపు ఏమీ అనలేదు. చివరన లేస్తూ అన్నాడు.
"అదృష్టవంతుడివి."
ఆఖరు నిముషంలో గాంధీగారి ప్రయాణ మార్గంలో జరిగిన మార్పు చిన్నదే కాని, ఆ చిన్న మార్పు ఎందరినో వుత్సాహపరిచింది. ఆయన
రాకను విజయవంతం చేయడానికై ఎందరో ఉరుకులు, పరుగులుతో పని చేశారు.
చీకటి పడే వేళ శంకరశాస్త్రి ఒక కత్తిరించిన తాటాకు రేకు చేతబట్టుకొని తోటలోకి వచ్చేడు. తోట అంతా హడావిడిగా వుంది.
స్వరాజ్యం పిల్లవాళ్ళ సాయంతో మామిడి తోరణాలు, రంగు కాగితాల తోరణాలతో దారుల పొడుగునా అలంకరిస్తూంది.
శాస్త్రి స్వరాజ్యాన్ని అదివరకెన్నడూ చూడలేదు.
"ఎప్పుడూ చూడలేదు నువ్వెవరివమ్మా!"
స్వరాజ్యం నిలబడింది.
"చిరతపూడి నాయుడుగారి అమ్మాయినండి. రామనాధంగారు ఇక్కడ వున్నారండి...."
ఆమె ఎవరో తెలిసిన తర్వాత ఏడాది క్రితం సుబ్బన్నశాస్త్రి తనకు చెప్పిన సమాచారం జ్ఞాపకం వచ్చింది. ఒక్క క్షణం
ఎన్నో అనుమానాలు మనస్సులో మెదిలేయి. కాని, ఆనాటికి వలె కొడుకును ఏమీ అనేటందుకు వీలూ కాదు, సమయమూ కాదు.
శంకరశాస్త్రి సాలోచనగా రామనాధం వున్న దిశగా తిరిగేడు. పది రాట్నాలు మామిడిచెట్టు క్రింద పెట్టుకొని శరభయ్య వానికి
కావలసిన మరమ్మత్తులు చేస్తున్నాడు. పక్కనే లచ్చమ్మ కూర్చుని పనులు చేయిస్తూంది. విశ్వనాధం శంకరశాస్త్రిని చూడగానే
ఎదురు వచ్చేడు.