గుమ్మంలో హాజరయ్యింది.
వస్తూనే అడిగేసింది.
"ఏమిటి నాన్నా! ఇందాకా మీరన్న మాటకు అవసరం ఏం వచ్చింది?"
ఆమె కంఠం నిండి వుంది. కోపంతో, అభిమానంతో మాటలు ముద్ద ముద్దగా వినిపించేయి.
ఆమె గొంతు వినగానే అబ్బాయి నాయుడు మంచంమీద లేచి కూర్చున్నాడు.
"నువ్వేనా? రా తల్లీ! పిలవాలనుకొంటూంటే నువ్వే వచ్చేవు. రా కూర్చో."
తండ్రి కంఠంలోని మమతా, తానే పిలవాలనుకొంటున్నాననడమూ ఆమెను దిగ్భ్రమ చెందించేయి. ఆవేశం దెబ్బ తింది. కాని, పట్టుదల
సడలలేదు.
మాట్లాడకుండా కుర్చీ లాక్కుని కూర్చుంది. తానే అడగాలని వచ్చిన సంగతి మరచి ఆయన ఏమంటాడోనని ఎదురు చూసింది.
"చెప్పండి."
"రామనాధంగారు మన యింటికి తరచు రావడం పోవడం బాగాలేదు. చిన్నవాడు. తెలియకపోవచ్చు...."
నిజానికి రామనాధం తరచుగా వస్తున్నాడన్న మాట అసత్యమని ఇద్దరూ ఎరుగుదురు. ఎప్పుడేనా పదిహేను ఇరవయి రోజులు వరుసగా
కనిపించకపోతే నాయుడే పదిమాట్లు అనుకొనేవాడు. ఈ పర్యాయం అతడు వచ్చి నెల రోజులయింది. కాని, నాయుడు అభిప్రాయం వేరు.
ఆ మెత్తని మందలింపునకు స్వరాజ్యం భగ్గుమంది.
"ఈవేళ కొత్తగా, హఠాత్తుగా ఈ ఆలోచన ఎందుకు కలిగింది?"
అబ్బాయి నాయుడు ఏం చెప్పగలడు? నెల రోజుల క్రితం స్వరాజ్యానికి అమలాపురంలో అవమానం జరగిందని విని, తాను క్షమాపణ
చెప్పుకొనేటందుకు వచ్చినప్పుడు రామనాధం వెలిబుచ్చిన అభిప్రాయం నాయుడిని హెచ్చరించింది. తాను కట్టుకొన్న భార్య కన్నాస్వరాజ్యం
ఆత్మీయురాలనడం నాయుడు మనస్సులో అనుమానాలు కలిగించింది. పది రోజుల క్రితం కూతురు తీర్థంలో రామనాధం కనిపించేడనీ, ఇంటికి
రమ్మన్నాననీ చెప్పినప్పుడు అతడు మనస్సులోనే భయపడ్డాడు. కూతురు ఆలోచనలేమిటో అనిపించింది. అవన్నీ ఆమెకు
చెప్పలేకపోయేడు. తన మనస్సులోని అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పనూ లేకపోయేడు.
"ఇప్పుడు మాత్రం మనం రావద్దంటామా? కాని, రాకపోకలకి వేళాపాళా వుండాలిగాని, ఇల్లాగ సాయంకాలానికి వచ్చి రాత్రి మకాం వేస్తే
చూసేవాళ్ళు ఏమనుకుంటారు?"
"ప్రపంచం ఏదన్నా అనుకుంటుందనే భయం మీకు ఎప్పటినుంచేం?"
మాణిక్యమ్మ ఆమాట కోసమే ఇదివరకు ఎంతో బాధపడింది. కూతురికి పెళ్ళి చేస్తే ప్రపంచం ఏమంటుందని ఆమె భయం. ఆ భయంతోనే
కోపం తెచ్చుకొని, భర్తను లొంగదీయడానికై ఇంట్లోంచి వెళ్ళి, చెల్లెలిగారింట మకాం పెట్టింది. అయినా నాయుడు లెక్కచేయలేదు. తన
మనస్సుకు తప్పుకాదనుకున్న దానిని చెయ్యడంలో ఎవ్వరినీ లెక్కచేయననుకొంటాడు. కూతురుకు చిన్నప్పటి నుంచీ అదే
తరిఫీదునిచ్చాడు. ఆ పాఠమే కూతురు వప్పచెప్పే సరికి నాయుడుకు కోపం వచ్చింది.
"స్వరాజ్యం నువ్వు చిన్నపిల్లవూ, చితకపిల్లవూ కాదు. ప్రపంచం చూసేవు. చదువుకొన్నావు......"
"చదువుకుంటే మనమూ మనుష్యులమేననే మాట మరిచిపోవాలా?"
కూతురి అభిప్రాయం ఏమిటో తెలియక ఒక్క నిముషం నాయుడు ఆగేడు.
"ఏమీ కాదు. ఎరిగి మసులుకోవాలి, అంతే! ఇంట్లో నువ్వొక్కర్తెవు. మీ అమ్మయినా లేదు. అతడు పరాయివాడు. మీ మనస్సులు
ఎంత నిర్మలమైనవయినా....."
"ఆయనను నేను పరాయివాడనుకోవడం లేదు."
నాయుడు ముఖం వెల్లనయింది.
"ఏమిటీ....?"
స్వరాజ్యం జోడు కరిచింది.
"మేము పెళ్ళి చేసుకోవాలనుకొంటున్నాం."
నాయుడు మరి పట్టలేకపోయేడు. ఖణేల్మన్నాడు.
"ఛట్! నోర్ముయ్!"
స్వరాజ్యం లేస్తూ కుర్చీని వెనక్కు తోసేసి నిలబడింది.
"ఎందుకు?"
నాయుడు వణికిపోతున్నాడు.
"కూర్చో."
ఆ అదిలింపుకు కంగారుపడి స్వరాజ్యం చటుక్కున కూర్చుంది.
"చెప్పండి. ఎందుక్కూడదు?"
దెబ్బలాట వలన ఆ సమస్య తేలేదీ, పెట్టేదీ కాదు. సర్దుకొంది. అదేదో తేల్చుకోవాలన్నట్లుంది ఆమె కంఠం.... నాయుడు
అనాలోచితంగా అనేశాడు.
"మీ కులాలు ఒకటి కావని ఎరుగుదువా?"
"కులాల పట్టింపు మీకెప్పటినుంచి?"
అబ్బాయి నాయుడీమారు నిర్వాక్కుడే అయ్యాడు. పెద్దతనం, రోగిష్టితనం వచ్చి పల్లెటూరు చేరేక వచ్చేయిగాని, ఇన్ని అనుమానాలు,
రాజమండ్రిలో వున్నంతకాలం అసలు ఆమాట చొరనివ్వలేదు. పంతులుగారు చేసిన ప్రతి సంస్కరణ వివాహానికి హాజరయ్యేడు. వాళ్ళతో
భోజనాలకు కూర్చున్నాడు. రఘుపతి వెంకటరత్నం నాయుడుగారిని చూపించి కులాల తేడాలను హాస్యం చేసేడు.
తన కూతురు పదిహేను-పదహారేళ్ళు వచ్చేవరకూ ఆ వాతావరణంలో పెరిగింది. ఆ వాదనలలో జ్ఞానం సమకూర్చుకుంది. ఇప్పుడామె ముందు
కులాల తేడా తేవడం నాయుడు తగ్గేడు.
"పెళ్ళి అయి, పెళ్ళాం సజీవంగా వున్నవాడు......"
"నాకూ అయింది......"
తమ వివాహాలు ఒకే దశలో వున్నాయంటున్న కూతురుకు ఏం సమాధానం ఇవ్వాలో నాయుడుకు అర్థం కాలేదు.
అమలాపురంలో జరిగిన ఘటనలను తాను చెప్పినప్పుడు నాయుడు ఎంతో నొచ్చుకున్నాడు. రామనాధం సహృదయతను వాళ్ళు దురుపయోగం
చేస్తున్నారన్నాడు. ఆ స్థితిలో మళ్ళీ పెళ్ళి చేసుకోవడం ఏమాత్రం తప్పు కాదన్నాడు. బహుశా రామనాధం మీద స్వరాజ్యం మనసు
పెట్టుకోడానికి తండ్రి అభిప్రాయాలే ప్రధాన కారణం అయితే కావచ్చు. అటువంటివాడు ఇప్పుడు రామనాధానికొక మారు పెళ్ళి అయివుండడం
అతని అనర్హతగా చెప్తే.....
కాని అబ్బాయి నాయుడు ఆమె ఆలోచనలు వేటినీ అంగీకరించలేదు
భిన్నకులాల మధ్య సంబంధం...
ఇద్దరూ పెళ్ళయినవాళ్లు.....
ఇద్దరికీ వివాహాలు భగ్నం అయిపోయినట్లే..... అయినా ఇద్దరికీ రెండో పక్షం వారు సజీవంగా వున్నారు.
ఇద్దరికీ కూడా విడాకులు చట్టరీత్యా సాధ్యం కాదు. ఆచారాలరీత్యా మారు మనువులు లేని కులాల వాళ్ళే ఇద్దరూ....
వాళ్ళ సంబంధాన్ని ప్రజలు వివాహాలుగా గుర్తించరు. వ్యభిచారం అంటారు.
"ఉంచుకొన్నాడంటారు. దానికదే పేరు. ఫలానా నాయుడు కూతుర్ని ఎవడో లేవదీసుకుపోయేడంటారు....." ఆ ఆలోచననే అతడు
సహించలేకున్నాడు.
కాని, కూతుర్ని ఒప్పించడం ఎల్లాగో తెలియదు. ఆమె వాదనలను కాదనలేడు.
"నేను నీ కూతురునై వుండడం ఒక్కటేనా అభ్యంతరం......?" అని అడుగుతున్న ఆమెకేమి సమాధానం ఇవ్వగలడు? అతడు గతంలో
అనేకమంది విషయంలో బాగున్నాయని సమ్మతించిన అనేక విషయాలకన్న ఈ పెళ్ళికి ఎన్నోరెట్లు బలీయమైన అనుకూల్యాలు వున్నాయి.
నిజమే. కూతురు చెప్పవలసిన పనేముంది?
రామనాధం అందగాడని తన భార్య ఎన్నోమార్లంది. ఆరోగ్యవంతుడు. మంచి చదువు వుంది, సంఘ సంస్కరణ దృక్పథం వుంది. దేశం అంటే
ప్రేముంది. నాయుడు అభిమానించే అన్ని లక్షణాలూ వున్నాయి. కాని అతనిని కూతురు వరుడుగా అంగీకరించలేకున్నాడు. చేతకావడం లేదు.
ఆ అభ్యంతరం ఏమిటో ఆలోచనకు అందడం లేదు.
కూతురు ఎంచుకున్న వరుడు కన్న తాను మంచివాడిని తేగలడా అంటే.....
స్వరాజ్యం చివరకు అనునయంగానే చెప్పింది.
"అలవాట్లనీ, ఆచారాల్నీ ధిక్కరించినా, ప్రశ్నించినా ఎవరయినా ఈ చిక్కుల్ని ఎదుర్కోవలసిందే, మీరు నాకు పెళ్ళి చేయడానికి
సిద్ధంగా వున్నారు. కాని ముక్కూ, మొగం ఎరగనివానినెవరినో తెచ్చి....."
నాయుడు ఇంకా సర్దుకోలేకనే వున్నాడు.-- "ఈయనగారిని గురించి నువ్వేం ఎరుగుదువు?"
"ఒక ఏడాది నుంచి నేనెరుగుదును. అంతకన్నా మేమిద్దరం ప్రేమించుకొంటున్నాం."
మళ్ళీ అదే సమస్య. అదే అభ్యంతరం. అదే నిరుత్తరత. సమాధానం చెప్పలేక మనస్సు ఉడికిపోతూంది. ఏమీ చెయ్యలేని
అశక్తత వలన మనస్సు మరిగిపోతూంది.
అబ్బాయి నాయుడు గుడ్డి కళ్లు మూసుకొని ఎంతో సేపు అలాగే కూర్చుండిపోయేడు. మధ్యలో కూతురు లేచి వెళ్ళిపోవడాన్ని కూడా
అతడెరుగడు.
ముప్ఫయ్యొకటి
మంచం ఎటున్నదో, మనిషి తల ఎటు పెట్టుకున్నాడో మనసులోనే అంచనాలు కట్టుకొని అబ్బాయి నాయుడు కర్ర ఎత్తేడు. ఒక్క
దెబ్బతో తల పగిలిపోవాలన్నంత కసితో కర్ర లేచింది.
--మనోవ్యాపారాలు స్తంభించినట్లయి చాలసేపు అలాగే కూర్చుండిపోయాక నాయుడికి హఠాత్తుగా తెలివి వచ్చినట్లయింది. ఇంట్లో ఎక్కడా
అలికిడి వున్నట్లే లేదు. పిలిస్తే స్వరాజ్యం పలకలేదు. ఏమయింది? ఇంట్లోనే ఉన్నదా?
లేచి మండువా సావిట్లోకి వచ్చేడు. ఎక్కడా చప్పుడు లేదు. ఆయనకు మనస్సులో ఎంతో భయం కలిగించింది. కూతురు ఇంట్లో వుందా?
లేక.....
వెంటనే రామనాధం వున్నాడా అనిపించింది. నెమ్మదిగా వీధి తలుపు గడియ తీసేడు.
మంచం ఎక్కడున్నదీ కంటికి కనిపించకపోయినా మనస్సుకు తెలుసు. జాగ్రత్తగా ఆలకించేడు. వూర్పు తీసికొంటున్న చప్పుడు
వినిపించింది. రామనాధం వున్నాడు. కనక స్వరాజ్యమూ వుండే వుంటుంది.
ఆమె ఇల్లు విడిచి అతనితో వెళ్ళిపోయిందేమోనన్న భయం తీరాక ఇప్పుడు మరో భయం పట్టుకుంది. తన గుడ్డితనాన్ని ఆసరా
చేసుకొని వాళ్ళు.....
అటువంటి ఆలోచనను కూడా భరించలేకపోయేడు. వెర్రెత్తినట్లయిపోయింది. ఆ కక్షతో తాను వచ్చేసరికి తలుపులు లోపలి వేపునే వేసి
వున్నాయనే మాట తోచలేదు. వాళ్ళిద్దరూ ఏకశయ్యాగతులయి వుంటారనే ఆలోచన మిగిలిన మానసిక వ్యాపారాలన్నింటినీ స్తంభింపచేసింది.
తన ప్రతిష్ఠనూ, కుటుంబ ప్రతిష్ఠనూ ధ్వంసం చేయడానికి వచ్చిన ఈ ముల్లును తీసివెయ్యాలనే కసి ఒక్కటే సర్వగ్రాసిగా
నిలిచింది. ఇంట్లోకి వచ్చేటప్పుడు గుమ్మం మూలలో విడిచిపెట్టే కర్రను చేతిలోకి తీసుకున్నాడు.
కాని ఎత్తిన కర్రను చేతిలోంచే వెనక నుంచి ఎవరో లాగివేసేసరికి నాయుడు తూలిపోయేడు.
"ఏమిటీ దురంతం. నిండుప్రాణం తీసేద్దువే....."
అంటూ వెనుక నుంచి స్వరాజ్యం గొంతు వినిపించింది. దూరంగా విసిరేసిన కర్ర నేలబడిన చప్పుడు.
నాయుడు అరుగు మీద చతికిలపడిపోయి రోదించేడు.
"నా కూతురు ఎవడికో వుంపుడుకత్తె గావలసిందేనా భగవంతుడా?"
ఆ గంద్రగోళం విని లేచి కూర్చున్న రామనాధానికి నాయుడు ఆవేశమూ, స్వరాజ్యం రొప్పూ అర్థం కాలేదు. ఆయన మాట కూడ
చాలాసేపటి వరకు అర్థం కాలేదు.
అర్థం అయిన తర్వాత రామనాధం తల్లక్రిందులయిపోయాడు. ఎంతో సిగ్గనిపించింది. దుఃఖమూ కలిగింది.
"అదేమిటి నాయుడుగారూ! అటువంటి మాట ఎందుకు వచ్చింది? నేను స్వరాజ్యాన్ని పెళ్ళి చేసుకొందామని చెప్పడానికే వచ్చానండీ."
నాయుడు ఎంతో ఉక్రోషం కనబరిచేడు. ఆక్రోశం వెల్లడించేడు.
"మీకు పెళ్ళేమిటి? మీది పెళ్ళీ కాదు, పెటాకులూ కాదు. దాని పేరు....."
ఎంతో అవమానకరంగా వినిపించే ఆ మాటను నొక్కి నొక్కి పలకడంలో నాయుడు సంతృప్తి కనబరుస్తూంటే రామనాధం చెవులు మూసుకొన్నాడు.
"నా వలన స్వరాజ్యానికి అవమానం కలగనివ్వనండి. కలగదండి!"
"పెళ్ళి! మీకు పెళ్ళి." అనుకుంటూ అబ్బాయి నాయుడు లేచి లోపలికి నడిచేడు. రామనాధానికి అనుమానం కలిగింది. తానూ లేచాడు.
స్వరాజ్యానికి నాయుడు ఏమన్నా అపకారం తలపెడతాడేమో, నాయుడు వెనుకనే అంత దూరంలో అతడూ ఇంట్లోకి నడిచేడు. కాని, నాయుడు
అటువంటిదేమీ తలపెట్టలేదు. భారంగా కాళ్ళు ఈడ్చుకుంటూ తన గదిలోకి పోయి తలుపు వేసుకొన్నాడు.
స్వరాజ్యం ముందే తన గదిలోకి వెళ్ళిపోయింది.
రామనాధం మండువా అంచున వెన్నెల పొడలో ఒక్క నిముషం నిలబడి ఆలోచించేడు.
ఏమిటీ గంద్రగోళం! ఈ ఘట్టం ఎందుకు వచ్చింది? ఇప్పుడేం చెయ్యాలి? అతనికి ఈషణ్మాత్రం కూడా అర్ధం కాలేదు.
స్వరాజ్యం స్థితి ఏమిటి? ఆమె ఇంత గంద్రగోళం జరిగేక కూడా తన మొదటి ఆలోచనలోనే వుంటుందా? వెనక్కి తగ్గుతుందా?
రామనాధం స్వరాజ్యంతో మాట్లాడి తేల్చుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఆమె గదిని అతడెరుగును. గబగబ అటు నడిచేడు.
గదిలో కిటికీ వద్ద మంచంమీద వెన్నెల పొడలో స్వరాజ్యం పడుకొని వుంది. అతని రాక నెదురు చూస్తున్నట్లు తల ఎత్తింది.
దగ్గరకు రాగానే కూర్చోమన్నట్లు చోటు ఇస్తూ పక్కకు జరిగింది. మంచంమీద కూర్చున్న అతని ఒడిలో తల పెట్టుకొని వెక్కి
వెక్కి ఏడ్చింది.
అతడామెను చేతులలోకి తీసుకొని కళ్ళు తుడిచేడు. "కోపం తెచ్చుకోకండి. నన్ను వదలి పోవద్దు" అంటున్న ఆమె పెదవుల్ని ముద్దు
పెట్టుకున్నాడు.
అతనిని చుట్టుకొని, గుండెలపై తల పెట్టుకొని కరుచుకుపోయిన ఆమె తల, వీపు నిమురుతూ రామనాధం చాలసేపు ఆమెను ముద్దులతో
నింపేసేడు.
"నిన్ను వదలి ఎక్కడికి పోతాను స్వరాజ్యం. నీకు పెళ్ళి చేయాలని మీ నాన్నగారు సంబంధాలు చూస్తున్నారని తెలిసి ఈ పది
రోజుల నుంచీ నేను పడ్డ తపన నీకు ఎల్లా చెప్పమంటావు? నీ ఇష్టం మీదనే ఆయన సంబంధాలు వెతుకుతున్నారని ఎంతో అభిమాన
పడ్డాను. స్వరాజ్యం! నువ్వు నాదానివని గ్రహించేక ఏ అవమానాలూ, ఎవరి అయిష్టాలూ నన్ను కదిలించలేవు."
కన్నీళ్ళతోనే తల ఎత్తి అతని కళ్ళలోకి చూస్తూ ఆమె అతని కంఠం కౌగలించుకొంది.
ఇద్దరూ చాలాసేపు అలాగే వుండిపోయారు.
సావిట్లో చప్పుడైనట్లయింది. స్వరాజ్యం తాచుపాములా తల ఎత్తి ఆలకించింది.
"ఎవరది?"
--అంటూనే స్వరాజ్యం మంచం దిగింది. నాయుడు కంఠం.
"మేలుకొని వున్నావా?"
రామనాధం మంచం దిగి గుమ్మంవేపు అడుగు వేస్తూ స్వరాజ్యాన్ని చేయి పట్టుకు వెనక్కి లాగేడు. కాని, ఆమె అతని దారికడ్డంగా
నిలబడింది.
"ఈమారేం తరవాయి, కత్తి తెచ్చేవా?"
నాయుడు ఒక్క నిముషం మాట్లాడలేదు. స్వరాజ్యం గద్దించింది.
"మాట్లాడవేం?"
"రామనాధంగారూ!' నాయుడు కంఠంలో తప్పనిసరి పరిస్థితులకు సర్దుకోక తప్పదన్న భావం వినిపించింది.
తానా గదిలో వున్నట్లు ఆయన వూహను స్థిరపరచడమో, మానడమో తేల్చుకోలేక రామనాధం ఒక్క క్షణం తటపటాయించేడు. అతని
సమాధానం కోసం ఎదురు చూడకుండానే నాయుడు తన నిర్ణయం తెలిపేడు.
"మీరిద్దరూ ఇంట్లోంచి తొందరపడి వెళ్ళిపోకండి. పెళ్ళి చేసుకోండి."
సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా నాయుడు వెనుతిరిగిపోయేడు. తిరిగిపోతూ విడిచిన దీర్ఘశ్వాసకు ఆ యిద్దరూ ముఖముఖాలు
చూసుకొన్నారు.
తమ భవిష్యత్తు అంత సులభంగా పరిష్కారం అవుతుందని వారు నమ్మలేకుండా వున్నారు. అంత సులభంగా పరిష్కారం కావడంతో కూడ ఏదో
ఆశంక, అనిష్టభయం, ఆ భయాన్నుంచి ఒకరినొకరు కాపాడుకొనడానికి ప్రయత్నిస్తున్నట్లు పరస్పరం వొరుసుకుంటూ మంచం మీద
కూర్చున్నారు.
"నిజమేనా?"
తెల్లవారేవేళ నాయుడు లేచిన చప్పుడు వినగానే రామనాధం-స్వరాజ్యం ఆయన గది గుమ్మంలో నిలబడ్డారు. వారి రాకను గమనించి
నాయుడు మంచంమీది నుంచే సమాధానం ఇచ్చేడు.
"ఏదో తప్పు చేస్తున్నట్లు ఎరిగివున్న వాళ్ళకి ముఖం మాటు చేసుకొనే మనఃస్థితి మీ పెళ్ళికి ప్రధానమయిన శత్రువు. మన
సంఘంలో వున్న ఆచారాలూ, అలవాట్లూ ఆ మనఃస్థితికి మూలం, దాని నుంచి బయటపడి..."
నాయుడు కంఠం గద్గదికం అయింది. ఆయన మాటలు అర్థంగాక గుమ్మంలో ఇరువురూ ముఖాలు చూసుకొన్నారు.
"స్వరాజ్యాన్ని పెళ్ళి చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. కాని తప్పు అనే ఆలోచన......"
నాయుడు ఒక నిట్టూర్పు విడిచేడు.
"నువ్వనుకుంటే వచ్చే ఆలోచన కాదు అది. మన అంతరాంతరాలలో అణగివున్న మన సాంప్ర్రదాయిక ఆలోచనల ప్రభావం మన
బ్రతుకులలో ఎప్పుడు, ఏ రూపంలో బయటపడుతుందో చెప్పలేము. కానీండి.... వివాహం ఆలోచనలో వుండండి... కాని, కాని...."
ఆ వివాహాన్ని సంఘం వొప్పుకోదు. చట్టం వొప్పుకోదు. ప్రాచీన సంప్రదాయ పద్ధతి వారి వివాహ బంధాన్ని కూర్చలేదు. ఆధునిక
సంప్రదాయం అంటూ ఏర్పడలేదు. ఆ విషయం నాయుడికి అప్పుడుగాని అర్థం కాలేదు.
"నా ఆశీర్వచనం ఒక్కటే వీరిని సుఖవంతులు చేయగలుగుతే...."
కానీ చేయగలుగుతుందనే ఆశ లేదనిపించింది. అంతలో లోపలి నుంచి ధ్వని విని ఆ యువదంపతులు ఒక్క నిట్టూర్పు విడిచి
వెనుతిరిగేరు.
మూడోభాగం
ఒకటి
ఆ సమయంలో రావలసిన రైలు ఏదీ లేదు. కాని బెజవాడ స్టేషను జనంతో కిటకిటలాడుతూ వుంది.
అఖిలభారత కాంగ్రెసు కమిటీ సమావేశం ఈమారు బెజవాడలో జరుగుతుంది. సమావేశాలకు దేశం నలుమూలల నుంచీ నాయకులు వస్తున్నారు.
వారిని చూడడానికీ, వారి వుపన్యాసాలు వినడానికీ తెలుగు దేశమే తరలి వస్తూంది.
వస్తూన్న జనాన్ని సర్దడానికీ, నాయకుల ఏర్పాట్లు చూడడానికీ రాష్ట్రం నాలుగు చెరుగుల నుంచీ ఉత్సాహవంతులయిన యువకులు
వందల సంఖ్యలో వచ్చేరు.
వచ్చిన వాళ్ళనీ, వస్తున్న వాళ్ళనీ, రాగల వాళ్ళనీ కనిపెట్టి వుండడానికీ వాళ్ళ మనస్సులలో భయం కలిగించడానికీ రాష్ట్రం
అన్ని మూలల నుంచీ పోలీసుల్నీ, పోలీసు ఆఫీసర్లనీ అధికార్లు రప్పించేరు. స్టేషనులో ప్లాట్‌ఫారం మీద డేరాలు బిగించి
వాళ్ళని దింపేరు.
అప్పుడే స్టేషన్‌లో అడుగుపెట్టిన రామనాధం ప్లాట్‌ఫారం మీద ఒక చోట జనం పోగుపడి వుండడాన్ని గమనించి
అటువేపు నడిచేడు. గోదావరి జిల్లా నుంచి వచ్చిన కొంతమంది వాలంటీర్లకు అతడిని కెప్టెనుగా చేసి స్టేషను వద్ద వుంచేరు.
వస్తూన్న నాయకుల్ని ఆహ్వానించి వారికి నిర్ణయించిన బసలకు దిగబెట్టడం పని అతని దళానికి వప్పచెప్పేరు. అంతక్రితమే
ఒక బండి వచ్చింది. దానిలోంచి దిగిన నాయకులు నలుగురైదుగురిని బసలకు పంపేడు. అంతట్లో వచ్చే రైలేదీ లేదు. స్వరాజ్యాన్నీ,
మరో ఇద్దర్నీ స్టేషనులో వుంచి అతడు కొద్దిసేపు స్టేషను వెలుపలికి వెళ్ళేడు. రావడం కొంచెం ఆలస్యమయింది. బహుశా ఏదన్నా
బండి వచ్చిందేమో? ఎవరన్నా నాయకులు దిగేరేమో? అనుకుంటూ జనసమ్మర్ధం వేపు గబగబా నడిచేడు.
కాని, అక్కడ చూచిన దృశ్యం అతనిలో మంటలు పుట్టించింది.
స్వరాజ్యాన్ని ఒక పోలీసువాడు గదిమి నెట్టుతున్నాడు. ఆమె ఏడ్పు మొగం పెట్టి బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తూంది. ఆమె
కదలడానికి నిరాకరిస్తూంటే పోలీసువాడు భుజంమీద చెయ్యేసి నెట్టుతున్నాడు.
చుట్టూ జనం వున్నారు. అందరి మొహాలు క్రోధఘూర్ణితంగా వున్నాయి. గొణుగుతున్నారు. జరుగుతున్న ఘటనకు దిగ్భ్రమ చెంది
నిస్సహాయంగా చూస్తున్నారేగాని, ఇదేమనలేకుండా వున్నారు.
మొదట ఎవరో పోలీసువాడు ఒక పల్లెటూరి అమ్మాయిని బెదిరిస్తున్నాడనే ఆలోచనలతో ఆమెను విడిపించడానికి రామనాధం జనంలో
దూరేడు. లైటు స్థంభాన్ని పెట్రోమాక్సు లైటు వెలుగుతున్న జనం నీడలలో ఆమె ఎవరో అతనికి మొదట అర్థం కాలేదు. అర్థం
అయ్యేందుకు అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. కాని, అటువంటి సంఘటన జరిగే అవకాశం వున్నదని ఎవరూ వూహించలేదు. అందుకే ఆ
దిగ్భ్రమ.
స్టేషన్‌లో స్వరాజ్యం ప్రొద్దుటి నుంచీ వుంది. అందరూ చూస్తూనే వున్నారు. కాని పోలీసువాడి అభిప్రాయం వేరు.
ఆమె వేట కోసం స్టేషన్‌లో కాపలా వేసిందని ప్రకటించి స్టేషనుకు నడవమన్నాడు.
సమాజంలో ఆస్తిపాస్తులనే కాదు, నీతినియమాలను కాపాడవలసిన పూచీ కూడ పోలీసు శాఖ మీదనే వుంది. అందుచేతనే ఆమె
ప్రతిఘటించినా లెక్కచేయకుండా తిట్టి, తోసి అయినా పోలీసుస్టేషనుకు తీసుకుపోయే ప్రయత్నంలో వున్నాడు.
సభలకి వస్తున్న జనానికి, నాయకులకూ స్వాగతం చెప్పడానికై వచ్చిన వాలంటీరునంది ఆమె. ఆమె కట్టుకున్న ఖద్దరు చీర
ఆమెకు గట్టి సాక్ష్యమే. కాని, పోలీసువాని ఆరోపణలో ఆమె నిలువ చచ్చిపోయింది. కళ్ళనీళ్ళు పెట్టుకొని, నోటమాట లేకుండా
నిలబడిపోయిన ఆమెను పోలీసువాడు సులభంగానే అదిలించేసేడు. వాని చేతిలోని కర్రనూ, రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చి
స్టేషనులోనూ, చుట్టూనూ, డేరాలు బిగించి, బైఠాయించి వున్న పోలీసు బలగాన్నీ చూస్తున్న జనం అసలు విషయం తెలిసినా పోలీసువాని
చేతి నుంచి ఆమెను కాపాడగల స్థితిలో లేరు. కాని ఆమెను గెంటుతూన్న పోలీసువాడు ఎంత అరచినా దారి మాత్రం ఇవ్వకుండా కమ్ముకొని
నిలబడి వున్నారు.
రామనాధం వస్తూనే పోలీసువానిని గద్దించాడు.
"ఏయ్, ఏమిటిది?"
జరుగుతున్నదేమిటో తెలియకపోయినా, పోలీసువాళ్ళ మంచితనంమీద ఏమాత్రమూ నమ్మకం లేని రామనాధం ఆ పోలీసువాడు ఏ పల్లెటూరి
మనిషినో అల్లరి పెడుతున్నాడని మాత్రమే అనుకున్నాడు.
ఎర్ర టోపీని డబాయించగల మనుష్యులింకా తెలుగుదేశంలో పుట్టలేదనుకుంటున్న పోలీసువాడు ఆ అదిరింపు తననే అనుకోలేదు. కాని, ఆ
కంఠం విని జనం విరగబడి చూసేరు. వారి కంఠాలలో అమ్మయ్య అన్నమాట వినిపించింది.
"వాళ్ళ నాయకుడు వచ్చేరు."
--అన్నమాట నలుమూలలా వినిపించింది. అతనికి దారి ఇచ్చేసేరు. రామనాధం వస్తూనే ఆమె భుజంమీద వున్న పోలీసువాని చేయి
లాగేశాడు. "ఏమిటిది?"
అప్పుడు చూసేడు. స్వరాజ్యం! అతని మనస్సు భగ్గుమంది. ఒక్క అడుగులో ఆమె ముందుకు వచ్చేసేడు. తన చేతి నుంచి
జారిపోతున్న ఆమెను పట్టుకోడానికి పోలీసువాడు అడుగు ముందుకు వేసేడు.
రామనాధం మరి కోపం పట్టలేకపోయేడు. మీదకు వస్తున్న పోలీసువానిని గుండెలమీద చెయ్యేసి ఒక్క త్రోపు త్రోసేశాడు. వాడు
తూలిపోయి జనంమీద పడ్డాడు. మరుక్షణంలో పోలీసువాని స్పర్శను భరించలేని జనం ఎవరికి వారు తమ మీద పడ్డప్పుడు
త్రోసివేస్తూ వెనక్కి తప్పుకొన్నారు.
ఒక్క క్షణకాలంలో జరిగిపోయిన ఈ ఘటనకు పోలీసువాడు నిర్వాక్కుడయిపోయాడు. ఒక్క నిముషం జనం ఎటు తోస్తే అటు తూలిపోయాడు.
మధ్యలో ఒకమారు సాయం కోసం ఈల వూదబోయేడు. కాని, అది నోటి వరకూ వెళ్ళక పూర్వమే ఎవరో దానిని గుంజేశారు. ఆ
గుంజుబాటులో ఈల, అది తగిలించిన బొత్తామూ సహా ఊడిపోయేయి. మరుక్షణంలో ఆ ఈల ఎక్కడో రైలు పట్టాల మీద పడి కంగుమంది.
స్వరాజ్యానికి కలిగిన అవమానానికి ఉద్రిక్తుడై రామనాధం చొక్కా చేయి పైకి తోసి ముందుకడుగువేసేడు.
"వీడి నెత్తురు కళ్ళచూస్తా."
పోలీసువాడు ఆ వ్యవధిని రామనాధానికివ్వలేదు. నోటి వద్దకు వచ్చిన ఈల ఎగిరిపోగానే గొల్లుమన్నాడు.
"హెల్ప్! హెల్ప్!"
మరుక్షణంలో రంగం మీదికి హాజరయన పోలీసు ఆఫీసరును చూసేసరికి రామనాధానికి అసలు విషయం అర్థం అయింది. స్వరాజ్యాన్ని
అల్లరి పెట్టడానికి మూలకారణం తన మీద వున్న కసి.
చేతిలో రివాల్వరును జడిపిస్తూ వచ్చినవాడు అమలాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నారాయణమూర్తి,
రామనాధం మామగారు.
రెండు రోజుల నుంచీ వలంటీరు దళంలో స్టేషనుకు వస్తూ పోతూన్న రామనాధం ఆయనను ఎన్నోమార్లు అక్కడ చూసేడు. ఆ రోజు ఉదయమే
రైలులో వచ్చిన స్వరాజ్యానికి రామనాధం ఎంతో ప్రేమతో ఎదురు వెళ్లినప్పుడు ఆయన అక్కడే వున్నాడు.
మధ్యాహ్నం ఆమె అతని దళంతోనే స్టేషనుకు వచ్చింది. ఆ నవదంపతుల హావభావాలను గమనించేడు నారాయణమూర్తి.
కొత్త వూరు, పని కొత్త. ఉత్సాహం వున్నా బెరుకు, ఆమె ప్రతి చిన్న పనికీ రామనాధంవేపే చూస్తూంది. అతని మీదనే
ఆధారపడుతోంది. అలాగ అధారపడడం కూడా అతనికి ఉత్సాహంగానే వుంది. ఎండలో ముఖం కంది, చెమటలు పట్టినప్పుడు తన జేబు
రుమాలు ఇచ్చేడు. దాహంగా వుందంటే మంచినీళ్ళు తెచ్చిపెట్టేడు.
అవన్నీ నారాయణమూర్తి చూస్తూనే వున్నాడు. వారిద్దరినీ పక్క పక్కనే చూస్తూంటే నారాయణమూర్తి మనస్సు తుకతుకలాడిపోయింది.
కాని ఏమీ చేయలేకపోయేడు.
ప్రజల్ని రెచ్చగొట్టే పనులేవీ చెయ్యరాదని పోలీసు అధికారులలో ఆలిఖితములయిన ఆదేశాలు ప్రచారంలో వున్నాయి.
దేశం అంతటి నుంచీ కాంగ్రెసు నాయకులు బెజవాడ వస్తున్నారు. కలకత్తా స్పెషల్ కాంగ్రెసు తరవాత నాగపూరు మహాసభ
నాటికీ, ఆనాటి నుంచి బెజవాడ కాంగ్రెసు కమిటీ సమావేశం నాటికీ కాంగ్రెసులో గాంధీజీ పలుకుబడి పెరుగుతూ వస్తూంది. ఆయన సహాయ
నిరాకరణ సూత్రానికి కాంగ్రెసును అనుబద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వానిపై నిర్ణయాలు తీసుకోవలసిన
చరిత్రాత్మక సమావేశం జరగనుంది. తెలుగుదేశమే కాదు, యావత్తు భారతదేశమూ బెజవాడవేపు చూస్తూంది. ఆ దిశగా కదులుతూంది.
బెజవాడకు జనం రాకుండా చేసేందుకు టిక్కట్లు ఇవ్వవద్దని అధికార్లు ఆదేశాలిచ్చారు.
ఈమారు జనం టిక్కట్లు లేకుండానే రైళ్లెక్కేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తున్న వాళ్ళని బాధించడానికై కర్కోటకులైన టిక్కెట్టు
కలక్టర్లనీ, వాళ్ళకి వత్తాసుగా పోలీసు బలగాన్నీ స్టేషనుకు తెచ్చేరు.
ఈమారు జనం మరో అడుగు ముందుకేసేరు. స్టేషను సమీపిస్తూందనగానే గొలుసు లాగి, బండి ఆపి జనం దిగిపోయారని అప్పుడే వార్త
వచ్చింది. లేక వారంతా స్టేషనులోనే దిగినా వారిని ఆపగల శక్తి తమకు లేదని అధికార్లు ఎరుగుదురు. ఆ రహస్యం ఇంకా
ప్రజలకు తెలియదు. తెలియనిచ్చే వుద్దేశం అధికార్లకు లేదు.
అందుచేతనే నారాయణమూర్తికి మనస్సులో ఎంత క్రోధం వున్నా తొందరపడలేదు. ఆ కసీ, కోపం, ద్వేషం అడుగడుగునా పొంగేయి.
సాయంకాలం చీకటి పడే వేళ తన కసి తీర్చుకొనేటందుకు అవకాశం కనబడింది. ఆ కోపం తీర్చుకోవడానికి స్వరాజ్యమే ఆయనకు
కనిపించింది.
సాయంకాలం ఆమె ఒక్కర్తే స్టేషనులో వున్నట్లు చూసేడు. రామనాధం లేడు. మరొకళ్ళిద్దరు వలంటీర్లూ, జనం వున్నా భయం
లేదనుకున్నాడు. ఆ అవకాశం చూసుకొని నారాయణమూర్తి విషం కక్కేడు.
హెడ్ కానిస్టేబులును పిలిచి స్వరాజ్యాన్ని ఈడ్చుకు రమ్మని పురమాయించేడు. ఆమె మగాళ్ళ వేటకోసం వచ్చిందని కారణం
చెప్తూంటే ఆ హెడ్‌కానిస్టేబుల్ మీసాలలోనే నవ్వుకున్నాడు.
సిగ్గూ, దుఃఖమూతో స్వరాజ్యానికి మాట రావడం లేదు. రామనాధాన్ని ఆతని వెనక జనాన్నీ చూసేక హెడ్డుకు కాళ్లు ఆడడం లేదు.
కాని, చేతిలో రివాల్వరును వూగిస్తూ నారాయణమూర్తి రంగం మీదికి వచ్చేసరికి జనం నిలబడిపోయేరు. హెడ్‌కు ధైర్యం
పుంజుకుంది.
నారాయణమూర్తి గర్జించేడు.
"కదిలేరంటే కాల్చేస్తా!"
"వీడు నన్ను కొట్టేడండి" అంటూ హెడ్ రామనాధం చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే స్వరాజ్యం ఆ చేతిని విసిరికొట్టి
తానాతని పక్క నిలబడింది.
"ముట్టుకుంటే జాగ్రత్త" అని కళ్ళు ఎర్ర చేసింది. పరిస్థితులలో వచ్చిన మార్పుతో ఆమెలో భయం, సంకోచం ఎగిరిపోయేయి.
పరిణామాల వేగానికి ఒక్క క్షణం నిస్తబ్ధుడుగా నిలబడ్డ రామనాధం ఆమె స్పర్శకు తేరుకున్నాడు. ఆమె జాగ్రత్త చెప్తూంటే
ఆప్యాయంగా భుజంమీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు.
ఆ జంటను చూస్తూంటే నారాయణమూర్తి తల తిరిగిపోయింది. చేతిలో రివాల్వరు నిలబడింది.
రివాల్వరు ఝుళిపిస్తూ ఎదుట నిలుచున్న సర్కిల్‌ను చూడగానే రామనాధానికి తమ బాంధవ్యం, తమ ద్వేషాలు మనస్సులో
మెదిలేయి. మనస్సులో పేరుకున్న అసహ్యంలో ఎదుటనున్న ఆ వ్యక్తి పురుగులా కనిపించేడు. ఆ ఆయుధం క్షణంలో తన్ను
చంపగలదనే ఆలోచన ఆ అసహ్యం ముందు ఒక లెక్క అనిపించనే లేదు.
"కాలుస్తావేం?"
తన భుజం పట్టుకున్న స్వరాజ్యం చేయి విడిపించుకొన్నాడు. చొక్కా గుండీలు వూడదీస్తూ ఒక్కడుగు ముందుకు వేసేడు.
"ఏదీ కాల్చు."
ఎవ్వరి ముఖానా నెత్తురు లేదు. నోట మాట లేదు. అందరి చూపులూ నిగనిగలాడుతున్న ఆ రివాల్వరు గొట్టంమీదనే వున్నాయి.
రామనాధం మరో అడుగు ముందుకు వేసేడు. అతని ప్రక్కనే స్వరాజ్యం. ఆమె తోడ్పాటుతో అతడు మృత్యువుని ధిక్కరించడానికి కూడా
లక్ష్యం చేయనట్లు కనిపిస్తున్నాడు. చొక్కా రెండు చేతులతో విడదీసేడు. "చూస్తావేం కాల్చు."
మృత్యువుకు గుండెలిచ్చి నిలబడ్డ రామనాధాన్ని చూస్తూంటే సర్కిల్ ఇనస్పెక్టరు ముఖం వెలవెలపోయింది. చావు యెడ
చూపుతున్న నిర్లక్ష్యం రామనాధం ముఖంలో ఒక విధమైన ఉత్తేజాన్ని కలిగించింది.
రివాల్వర్ గుర్రం మీదున్న వేలు వణుకుతూ వుంది. రామనాధం గదమాయింపుకే ఆ వేలు అదుముకొనేలా వుంది.
నారాయణమూర్తి అతి కష్టం మీద నిగ్రహించుకోగలిగేడు. రివాల్వరును నేలకు వాల్చేడు. జనం ఒక్కమారు వూర్పు తీసుకున్నారు.
జయ జయ ధ్వనులతో స్టేషనంతా మార్మ్రోగుతూ వుంటే తల వాల్చుకొని నారాయణమూర్తి వెనుతిరిగిపోయేడు.
పోలీసువానినీ, మృత్యువునూ ధిక్కరించిన ఆ యువకుణ్ని చూడడానికి జనం కళ్లు చాలలేదు.
జనం మధ్య నలిగిపోతున్న స్వరాజ్యాన్ని ప్రక్కనే వున్న బల్ల ఎక్కించేడు. ఆమె ప్రక్కనే తానూ నిలబడి మహాజనానికి
అభివాదన చేసేడు.
జనం కీర్తించింది.
"వందే.......మాతరం......"
రెండు
గాంధీజీ అభినందన వింటూన్నప్పుడుగాని రామనాధానికి తాను మృత్యువు యెడ చూపిన నిర్లక్ష్య భావం విలువ అర్థం కాలేదు.
రాత్రి స్టేషనులో జరిగిన కథ వేయి ముఖాలుగా వ్యాపించింది. అది విన్న ప్రతి ఒక్కరూ అతనిని చూడడానికి ప్రత్యేక శ్రద్ధ
చూపేరు. భేష్ అన్నారు. భుజం తట్టేరు. అయితే అవేవీ ఇవ్వలేని ఆనందాన్నీ, వుత్సాహాన్నీ కలిగించింది. తనను
గాంధీజీ బస వద్ద నియమిస్తున్నామని కాళేశ్వరరావుగారు అన్నప్పుడు.
తాను చేస్తున్నది సాహసకార్యం అని కూడా అతడు ఆ పని చేస్తున్నప్పుడు ఎరగనే ఎరగడు. దానికిగల తాత్విక ప్రాధాన్యం
పెద్దలు జరిపిన చర్చలు విన్నప్పుడే అర్ధం అయింది. హింస, అహింస, సత్యాగ్రహం, స్త్రీల మర్యాద రక్షణ, వీరత్వం,
ధీరత్వం అనేక సమస్యలు చర్చలోకి వచ్చేయి.
తన యింట్లో ఆడవాళ్ళకి అవమానం జరుగుతూంటే వూరుకొనేవాడు మనిషే కాదన్నారు గాంధీజీ.
అల్లాంటివాడు తండ్రి, తమ్ముడు, మగడు అనిపించుకొనే అర్హతను కోల్పోయాడని ఆయన సందేహానికి తావులేకుండా ఖరాఖండీగా తెలిపారు.
మృత్యుదేవతకు ముఖాముఖీగా నిలబడి, ఎవ్వరికీ హాని తలపెట్టకుండా నిర్భయంగా మరణించగలవాడు వీరాధివీరుడని ఆయన చెప్పేరు.
ఈ సమస్యలన్నీ తనను చూసినప్పుడల్లా నాయకుల బసలలో ఏదో రూపంలో చర్చకు వచ్చేవి.
తనను గురించి అంత చర్చ జరగడము ఆతనికి ఆశ్చర్యమూ, గర్వమూ కూడ కలిగించింది. దానితోపాటు ఎన్నెన్నో సందేహాలు, దానికి
ఎన్నో సమాధానాలు.
స్వరాజ్యం భుజం నుంచి పోలీసువాని చేతిని లాగెయ్యడంలో మోతాదును మించి తీవ్రభావం చూపలేదుగదాయని ఆలోచనలో పడ్డ వాళ్లు
లేకపోలేదు. అయితే పోలీసువానిని గుండెలమీద చెయ్యివేసి విసిరెయ్యడం మాంచి మగసిరి అయినపనిగా అభినందించిన వాళ్ళే ఎక్కువ.
బంతితో ఆడినట్లు పోలీసువానిని అటూ ఇటూ గెంటివేసిన దృశ్యం తలచుకొని వలంటీర్లు చాలమంది ఆనందించేరు.
రివాల్వరు ముందు గుండీలూడదీసి, గుండెలు చూపి నిలబడడం అసాధారణమైన వీరత్వం అన్నారు.
కాని, ఆ ఘట్టం అంతా అతి సాధారణంగా జరిగిపోయింది. తన దృష్టిలో హింస, అహింసలూ, వీరత్వం, భీరుత్వం గురించిన ఆలోచనలు
లేవు. ఆ విధంగా తప్ప మరొక విధంగా జరగడానికి వీలులేనంత సహజంగా అవి సాగిపోయాయి.
అతని చేతిలో ఒక రివాల్వరే వుంటే ఫలితాలు ఎలా వుండనీ ఆ హెడ్ కానిస్టేబుల్ని కాల్చి పారేసేవాడినే అనుకొన్నాడు.
రివాల్వరు లేదు గనక గుండె ఇచ్చి కాల్చమన్నానా అని అడిగితే అతడు ఖచ్చితంగా కాదని చెప్పేస్తాడు.