పక్షి అనుకొనే మంగమ్మనుంచి ఆ మాట!
"ఏమిటి వ్యవహారం?" అన్నాడు.
ఆ నిర్లక్ష్యానికి మంగమ్మకు కోపం వచ్చింది.
"నీ దస్తావేజిచ్చి ఆవిణ్ణే పంపించాలా?"
మంగమ్మకి తెలిసిన దస్తావేజేమిటో తెలియని రామనాధం ఆశ్చర్యంతో చూశాడు.
"దస్తావేజేమిటి?"
"ఆవిడెవరు?"
"ఎక్కడికి పంపేను?"
అంటూ ఒక్కొక్క ప్రశ్న వేసి రాబట్టితే తప్ప అతనికి మంగమ్మ చెప్పదలచుకున్నదేమిటో అర్థం కాలేదు.
జరిగిన సంగతి తెలిసేక రామనాధం నిలువునా నీళ్ళు కారిపోయేడు.
అతనికింత గ్రంథం జరిగిందని తెలియదు. స్వరాజ్యం ఏమీ చెప్పలేదు. పని కట్టుకొని ఇంటికి వెళ్ళి అడిగినా చెప్పలేదు ఇదంతా.
అమలాపురం వెళ్ళినప్పుడేం జరిగిందని తెలుసుకోవాలనుకొన్నా పనుల తొందరలో కుదిరింది కాదు. ఉత్సవం రోజు వరకూ ఆమె వూళ్ళోనే
వుంది. ఆ రోజున సభకు కూడా వచ్చింది. మర్యాదకేవో ఒకటి రెండు మాటలాడేడేగాని అంతకన్న అవకాశం లేకపోయింది.
తరవాత పదిహేను రోజుల వరకూ వ్యవసాయం పనులతో కుదిరిందే కాదు. అవన్నీ ముగించుకొని చిరతపూడి వెళ్ళేటప్పటికి ఆ ఉత్కంఠ
లేకపోయింది. దస్తావేజు ఇచ్చేశానంటే సరేననుకున్నాడు.
అటు తర్వాత కూడా ఈ నెల రోజుల్లోనూ ఒకటి రెండు మార్లు వారి ఇంటికి వెళ్ళేడు. ఆమె ఏమీ చెప్పలేదు. అంత అవమానకరంగా
వ్యవహరిస్తే ఒకమాటన్నా అనదూ--అనిపించింది.
కాని, మంగమ్మ అబద్ధం చెప్తూంది అనిపించలేదు. నిజమేనా అని అడగలేకపోయేడు.
"నీకెవరు చెప్పేరు?" అని మాత్రం అనగలిగేడు.
"ఒకరు చెప్పడం ఎందుకు? నేనక్కడే వున్నాను. నీకు తెలుసో లేదో స్వరాజ్యం నేనూ, వాళ్ళ నాన్నగారూ కలిసే వచ్చేం. ఆవిణ్ని
ఆ మాట అంటూంటే నా ప్రాణం చచ్చిపోయింది. మరి వుండాలనిపించలేదు. వాళ్ళ బండిలోనే వచ్చేశాను.
రామనాధం ఆలోచించేడు.
"ఏమంది?"
"ఆవిడకి నీతో స్నేహం వున్నదన్నమాట మరోమాటు వినాలని సరదాయా?"
మంగమ్మ ఆ మాట అన్నాక ఇంక ఏదీ అడగాలనిపించలేదు.
అటు తరువాత స్వరాజ్యం మొహం చూడాలన్నా చూడలేననిపించింది. అనవసరంగా వద్దంటున్నా బయలుదేరినందుకు కోపం, మాటలు
అనిపించుకున్నందుకు దుఃఖం కలిగింది. పది రోజులు అటు మొగం చూపలేకపోయేడు.
తర్వాత అంతకన్న క్షమాపణ చెప్పుకోవడం న్యాయమనిపించింది.
వెళ్ళేసరికి తండ్రికి పత్రిక వినిపిస్తూంది స్వరాజ్యం.
"చాల రోజులనుంచి కనబడ్డం లేదేమండీ?" అంది స్వరాజ్యం.
తాను వచ్చిన పనినెలా ప్రారంభించాలో అర్ధంగాక రామనాధం చాలసేపు తటపటాయించాడు. చివరకు తప్పంతా ఆమెదే అయినట్లు--"మీరు
అల్లా దాచి వుంచడం న్యాయం కాదు" అన్నాడు.
స్వరాజ్యం విస్తుపోయింది.
"ఏం దాచేను?"
"మీరు అమలాపురం వెళ్ళినప్పుడు....."
స్వరాజ్యం తేరుకుంది.
"ఏం, మంగమ్మగారు ఏమన్నా చెప్పేరా?"
నాయుడు నవ్వేసి, అన్నాడు.
"అల్లాంటివన్నీ మనస్సులో వుంచుకోకండి. నేనే చెప్పవద్దన్నాను."
"మీరు బాధపడతారనే చెప్పవద్దన్నాను" అన్నాడు మరో నిముషం ఆలోచించి.
"మీకు జరిగిన అవమానం కన్న ఆమె అభిమానం కోసం బాధపడతాను. అంతేకదూ?"
"తప్పేముంది రామనాధంగారూ! ఏవో పరిస్థితులలో ఆమె తెలివితక్కువగా వ్యవహరిస్తూన్నా ఆమె మీ భార్య. ఆమె
చెడ్డదనిపించుకోవడం మీకు బాధ కలిగించదూ?"
రామనాధం నాయుడు వేలుపెట్టి చూపించేవరకూ ఎంత సంబంధం లేదనుకున్నా సుందరిని కేవలం పరాయిదానినిగా భావించడమే లేదు అనిపించలేదు.
"తప్పు నాదే. ఆమె మనఃస్థితి ఎరుగుదును, ఆ రోజున అమలాపురంలో మీ యింట్లో మామధ్య జరిగిన సంభాషణను మీకు
చెప్పేవుంటే..."
తన భార్య తనతో ఆడిన మాటల తీరునాతడు చెప్పలేదంటే ఆమె వానిని మార్చుకుంటుందనే ఆశయేనా వుండి వుండాలి. లేదా, తనకూ
ఆమెకూ పొసగదనుకొన్నా ఆమె మర్యాదను కాపాడడంలో చూపిన శ్రద్ధ చూస్తే ఆమెయే తనకు సన్నిహితమైనదనే భావన అంతరాంతరాలలో
వుండివుండాలి. లేకపోతే... అంత మాట అనడు--
నాయుడు అతనిని శాంతపరచడానికి ప్రయత్నించేడు.
"ఆ మాట అనిపించుకోవడం మర్యాద కాదు, అనుకోండి...."
రామనాధం మాట సాగనివ్వలేదు.."శత్రువునైనా అనడానికి సందేహించ వలసిన మాటను--తనకు ఉపకారం చేయడానికి బయలుదేరిన
మనిషిమీద ప్రయోగించింది. స్వరాజ్యంగారూ! మీరు సందేహించేరు తప్పు లేదు. ఆప్తులయిన మిమ్మల్ని పరాయి వాళ్ళనుగానే చూసేను.
అందుచేతనే మీకు చెప్పకుండా కొన్ని సంగతులు దాచిపెట్టేను. అక్కడికి వెళ్లనిచ్చేను. అవమానం పాల్జేసేను. తప్పు నాది.
క్షమించండి."
రామనాధం ఎంత హఠాత్తుగా వచ్చేడో అంత హఠాత్తుగానూ వెళ్ళిపోయేడు.
అతనిని పిలుద్దామనుకున్న మాట స్వరాజ్యం గొంతులోనే మిగిలిపోయింది.
నాయుడు ఒక్క నిట్టూర్పు విడిచేడు.
"మంచిదే అయినా కొత్త అనేసరికి ఇంత మనఃక్లేశమూ తప్పదు. తప్పదు."
ఇరవయ్యారు
ఆ రోజున క్షమాపణ చెప్పుకున్నా రామనాధం మనస్సుకి శాంతి అనేది లేకుండాపోయింది. ఏదో పొగొట్టుకొన్నట్టూ, ఏదో మరచిపోయినట్లూ
మనస్సు తల్లడిల్లి పోతూంది. మనశ్శాంతికి ఉపకరణం అని గాంధీగారు వర్ణించిన నూలు వడకడం కూడా మనశ్శాంతిని ఇవ్వలేకుండా
వుంది.
ఖద్దరు వుత్పత్తి కార్యక్రమం ఇప్పుడించుమించు లచ్చమ్మ చూసుకొంటూంది. ఊళ్ళో రావి క్రింద రాత్రి పేపరు చదివి వినిపించే
కార్యక్రమాన్ని శివకామయ్య తీసుకొన్నాడు. పంచమ పేట వాళ్ళకి చెరువులో నీళ్ళు తోడి పోయవలసిన కార్యక్రమం తగ్గిపోయింది.
నూతిలోంచి ఎవళ్ళకి వాళ్లు తోడుకు పోతున్నారు.
పొలం పనులు ప్రధానమైనవి పూర్తి అయ్యాయి.
పని రద్దీ లేని రోజులు ఇదివరకు అంతగా వుండేవి కావు. అలాంటి రోజున తప్పకుండా చిరతపూడి నాయుడుగారింటికి వెళ్ళేవాడు.
అక్కడ తండ్రీ కూతుళ్ళతో ఏవో కబుర్లు చెప్తూంటే కాలం ఇట్టే గడిచిపోయేది. అతడూ ఆ యింటి వారిలో ఒకడుగానే పరిగణించేటంత
చనువు ఏర్పడింది.
ఇప్పుడు పని రద్దీ అంతగా వుండడం లేదు. కాని నాయుడు ఇంటికి వెళ్ళడానికి ఏదో సంకోచం. ఇప్పుడా స్వేచ్ఛ చూపలేకున్నాడు.
ఆ స్వేచ్ఛ చూపలేకున్నా ఆ కుటుంబం నిత్యం, అనుక్షణం తన కళ్ళముందే వున్నట్లుంటుంది. ముఖ్యంగా స్వరాజ్యం. ఆమెను
అవమానించిన సుందరి, స్వరాజ్యం గుర్తువచ్చినప్పుడల్లా జ్ఞాపకం వచ్చేది. ఆమె మీద ఎంతో అసహ్యం కలిగేది.
క్రమంగా ఆ అసహ్యం తనమీదకే తిరిగింది. ఎంత పని చేశాను? అని పదిమాట్లు అనుకొనేవాడు. ఆమె ముఖం ఎల్లా చూడగలను
అనుకొన్నాడు.
కాని, జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఆమె తన ఖద్దరు దుకాణం ఎదుట కనిపించేసరికి ఏ సందేహాలూ, సంకోచాలూ, సిగ్గూ ఏమీ
కనిపించలేదు. మనస్సూ-శరీరమూ ఆనందంతో నిండిపోయాయి. ఉత్ఫుల్లమయాయి.
దుకాణాన్ని మిత్రుడు రామన్నకి వప్పచెప్పి బయటకు వచ్చేడు. ఇద్దరి కళ్ళలో ఒకే ప్రశ్న కనిపించింది. "ఎంతకాలానికి
కనిపించేవ"న్న ఆనందం గొంతుకలలో వినిపించింది.
కొద్ది దూరం ఆ జన సమ్మర్దంలో నిర్జనారణ్యంలో నడిచినట్లు బాహ్య స్పృహ లేకుండా నడిచేరు. చెరుకు గానుగ వద్ద నిలబడే
ఇద్దరూ చెరో గ్లాసూ రసము త్రాగేరు.
మొట్టమొదటి మారుగా రామనాధమే పలకరించేడు.
"మీ బండి ఎక్కడుంది?"
మురుగుకోడుకి ఆవల కొబ్బరితోటలో వుంది. ఇద్దరూ కొబ్బరి దుంగలతో వేసిన వంతెన మీదుగా ఆవలిగట్టుకు వెళ్ళేరు. ఇంకా
ఇద్దరూ నిశ్శబ్దంగానే నడుస్తున్నారు.
"మీకింకా కోపం తగ్గనే లేదూ?"
రామనాధం కళ్లనీళ్ళు తిరిగినట్లనిపించింది. బలహీనంగా చిరునవ్వు నవ్వేడు.
"నాకు కోపమా? మీ మొహం చూడడానికి చెల్లక....."
తన స్థితి రామనాధానికే అర్ధం కాలేదు. తన కంఠంలో ఏదో అడ్డుపడినట్లు మాట రాలేదేం? కళ్ళనీళ్ళు తిరిగినట్లింత
దైన్యస్థితి ఎందుకు?.....
ఆమె ఏదో ఆలోచిస్తున్నట్లు తోచింది.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?"
"పెద్ద ఏమీలేదు. మీ సలహా కావలసి వచ్చింది. ఈ పదిహేను, ఇరవై రోజులనుంచీ మీ కోసమే చూస్తున్నాను...."
ఆమె తన కోసం ఎదురు చూస్తూందన్న మాటకు అతడు పరవశుడైపోయేడు.
"కబురు చేయకపోయేరా?"
"కబురు చేసే వరకూ రానంతటి కోపం వచ్చిందా?......"
రామనాధం నిర్విణ్ణుడైనాడు.
"చెప్పేను కాదూ. మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్కటి చెప్తా."
స్వరాజ్యం సందేహం. ఉత్కంఠ కనబరచింది.
"ఈ నెల రోజుల్లో మిమ్మల్ని గురించి తలచని రోజు లేదు అంటే నమ్ముతారా?"
ఆ మాట వినడం వలన కలిగిన సంతోషాన్ని స్వరాజ్యం హాస్యం మాటున దాచుకోడానికి ప్రయత్నించింది.
"అంత కలలోకి వచ్చేటంత భయంకరంగా వున్నానా?"
"నిజంగా....."
అప్పుడే అటు వస్తున్న సూరాయిని గమనించి స్వరాజ్యం నెమ్మదిగా అంది.
"మీతో మాట్లాడవలసినవి వున్నాయి. ఒకమారు ఇంటికి రాండి."
తిరిగి వెళ్ళేటప్పుడు మరల జ్ఞాపకం చేసింది.
"ఎప్పుడు రాగలరు?"
"ఈ క్షణం రమ్మంటే దుకాణం వదిలేసి వచ్చేస్తాను." అందామనిపించింది. కాని, ఆమాట ఆమెకే మర్యాద కాదనిపించింది. మామూలుగానే
అనేశాడు.
"వస్తాను. తప్పకుండా వస్తాను."
ఇరవైయ్యేడు
మధ్యాహ్నం భోజనం చేసి కూర్చున్న వేళకు సూరన్న కాపు కొడుకును వెంటబెట్టుకొని మాణిక్యమ్మ తోటలోకి వచ్చింది. ప్రొద్దున్నే
పనుల తొందరలో వెళ్ళలేకపోవడం చేత స్వరాజ్యమే తల్లిని వెంటబెట్టుకొని వచ్చిందనుకున్నాడు. అంత అవసరమైన కార్యమేమిటో
అనుకొన్నాడు.
మనస్సులో సంకోచంతోనే మాణిక్యమ్మకు చాప పరిచేడు.
"కూర్చోండి. నాయుడుగారి ఆరోగ్యం బాగుంది కదా. చాలా రోజులు అయింది చూసి, ఈవేళ వద్దామనుకుంటున్నా, ఏరీ స్వరాజ్యంగారు
రాలేదు?" అంటూ కుశల ప్రశ్నలు వేసేడు.
మాణిక్యమ్మ తాను నాలుగు రోజులయి వచ్చేనంటూంటే, గడచిన రోజున తీర్థంలో స్వరాజ్యం తన తల్లి కనిపించిందా అని అడిగిన మాట
గుర్తు వచ్చింది. బహుశా తీర్థంలోనే ఇద్దరూ చెరోదారీ అయివుంటారనుకున్నాడప్పుడు. తల్లి కోసమే తీర్థం వచ్చిందన్న మాట
అనుకున్నాడిప్పుడు.
"నిన్న స్వరాజ్యంగారు తీర్థంలో కనిపించేరు. మీరు కనిపించేరాయని అడిగేరు. అక్కడే ఇద్దరిదీ చెరోదారీ అయిందనుకున్నాను.
లేదన్నాను."
చాలసేపు మాణిక్యమ్మ ఆమాటా ఈమాటా చెప్పి అసలు తాను వచ్చిన పని తేల్చింది.
నాయుడికి వయస్సు వచ్చిన కొద్దీ మంచీ చెడ్డా మరిచిపోతున్నాడని ఆమె వ్యధ. లేకుంటే కూతురికి మళ్లీ పెళ్ళి చేస్తానంటాడా?
తక్కువ కులాలలో వాళ్ళకి మల్లే మారుమనువు తలపెడతారా? రామనాధం వెళ్ళాలి. ఒక్కమాట చెప్పాలి. ఆతని మాటంటే నాయుడికి
మంచి గురియని మాణిక్యమ్మ అభిప్రాయం.
"బాబ్బాబు! నీ కడుపున పుడతా. ఈ దుర్మార్గం ఆపండి. ఇంతవరకయినదానికే ఐన వాళ్ళలో తలెత్తుకోలేకుండా వున్నాను. ఈమారు
లోతుగా చూచుకు దిగడం తప్ప మరి దారి వుండదు" అని మాణిక్యమ్మ అంగలారుస్తుంటే రామనాధానికి ఏమిచెప్పడానికీ తోచలేదు.
నాయుడిది సరియైన ఆలోచనే అనిపించినా మాణిక్యమ్మను కేవలం నిరుత్సాహపరచడానికి మనస్సు ఒప్పలేదు. ఆమెను సంతృప్తి
పరచడానికై అటూ ఇటూ గాకుండా చెప్పడం సాగించేడు.
"మీరు ఆందోళన అనవసరంగా పడుతున్నారనుకుంటాను. నాయుడు గారు ఎప్పుడూ కాని పని చేస్తారనుకోను....."
నాయుడు తలపెట్టిన పని మంచిదంటున్నాడో, కాని పని అంటున్నాడో మాణిక్యమ్మకు అర్ధం కాలేదు. తన వాదనలు, మగని పెంకె
సమాధానాలూ వరసన ఏకరువు పెట్టింది.
"ఆయన సంగతి మీకు బాగా తెలియదు. బహు పెంకె మనిషి. ఆయనకు ఎంత తోస్తే అంతే, మరొకరు చెప్తే వినే ఘటం కాదు...."
ముప్పయి ముప్ఫయి అయిదేళ్ళు ఆ వ్యక్తితో చేసిన కాపురంలో కలిగిన అనుభవాలు అనేకం. వానిలో సూచన ప్రాయంగా రెండు మూడు
మాత్రం వుదహరించింది. వారి కుటుంబపు వ్యవహారాలు వినడం సిగ్గనిపించి రామనాధం మాట మార్చడానికి ప్రయత్నించేడు.
"ఇంతకీ స్వరాజ్యంగారు ఏమంటారు? పెళ్ళి చేస్తానన్నా చేసుకొనేదీ, మానేదీ ఆమె కదా......"
మాణిక్యమ్మ పావుగంటసేపు చెప్పిన సమాచారం పట్టి స్వరాజ్యం ఆ ప్రయత్నానికి పూర్తిగా వ్యతిరేకం కాదనిపించింది. తండ్రిని
తొందరపడవద్దనడంలో ఆమె వుద్దేశ్యం ఏమిటో--అనిపించి రామనాధం మనస్సు ఉత్కంఠితమయింది.
తల్లి అభిప్రాయం ప్రకారము తండ్రి ప్రయత్నం ఆమెకు ఇష్టం కాదు. అయితే.... తనను రమ్మని నొక్కి నొక్కి చెప్పినది
తండ్రిని వొప్పించడానికేనా?
ఆ సమాధానం మనస్సుకి వొప్పిదం కాలేదు. ఆమెకు పెళ్ళి దృష్టి వుందనుకోవడం అతనికి సంతృప్తి కలిగిస్తూంది. లేకపోతే తొందర
పడవద్దనదు. ఖచ్చితంగా చెప్పెయ్యగలదు? తండ్రి ఆమె అభిప్రాయాన్ని కాదని ఏమీ చెయ్యలేడు. చెయ్యడు.
అటువంటి అనుమానమే మాణిక్యమ్మకు కూడా కలిగింది కాబోలు. దానికామె వేరొక విధంగా సమాధానం చెప్పుకుంది. జబ్బుపడినప్పటి నుంచీ
తండ్రిని చంటిపిల్లవాడిని చూసినట్లు చూస్తూంది. ఇప్పటినుంచి వొప్పించటమెందుకులే యని సాచివేస్తూంది కాని మరేమీ కాదని సమాధానం
చెప్పుకుంది. అదే రామనాధాన్నీ నమ్మమంది.
ఆ పూటనే చిరతపూడి వెళ్ళి నాయుడుతో మాట్లాడతానని మాణిక్యమ్మకు మాట యిచ్చేడు. కాని ఆమె వెళ్ళిన గంటక్కూడా కూర్చున్న
కుర్చీలోంచి లేవలేకపోయేడు. లేచినప్పుడు కూడా పెద్ద వుసిరిచెట్టు క్రింద తిన్నెమీదికి బదలా అయ్యేడే తప్ప
బయలుదేరలేకపోయేడు.
నిన్న మధ్యాహ్నం జగ్గన్నతోట తీర్థంలో స్వరాజ్యం ముఖం చూశాక ఆ నెల రోజుల తపన ఏమిటో, ఎందుకో అర్థం అయింది.
తనకు స్వరాజ్యం కావాలి. ఆమె తన దగ్గర వుండాలి. ఆమెతో కబుర్లు చెప్పాలి, ఆమె నవ్వు వినాలి, ఆమె కోసం తన
శరీరం, మనస్సు అణువణువునా, అనుక్షణం తపించిపోతున్నాయి. తీర్థంలో ఆమెను చూసిన మరుక్షణం నుంచీ అతనికి అనుభూతం
అయినదది.
స్వరాజ్యం కూడ తన మానసిక స్థితికి అనుగుణంగానే వున్నట్లు అనిపించింది. ఆమె మాటలను, చూపులను, అనునయాన్ని--అన్నింటినీ
అతడు ఆ విధంగానే అర్థం చేసుకున్నాడు.
తన పథకం కూడా దానికి అనుగుణంగానే వేసుకున్నాడు. ఉదయమే వెళ్ళి తన ప్రేమను స్వరాజ్యానికి తెలుపుకుంటాడు. తరువాత
నాయుడిని అడిగేస్తాడు.
స్వరాజ్యం ముందు తన ప్రేమనెల్లా తెలుపాలో, నాయుడు ముందు ఏమని చెప్పాలో మాటలు మార్చి మార్చి మనస్సులో ఒద్దికలు
వేసుకున్నాడు. అతనికి మాణిక్యమ్మ అస్తిత్వమే గుర్తు రాలేదు.
కాని, తెల్లవారి లేచేసరికి పనులు వెంటాడేయి. వానిని తెముల్చుకోలేకపోయేడు. అనుక్షణం స్వరాజ్యం తన రాక కోసం గుమ్మంలో
నిలవబడివున్నట్లే అనిపించింది. ఏ క్షణానికాక్షణం మాట్లాడుతున్న వాళ్ళని పంపేసి చేతిలో వున్న పని వదిలేసి
పోదామనిపిస్తూంది. కాని వెళ్ళలేకపోయాడు.
ఇప్పుడు మాణిక్యమ్మ వెళ్ళిపోయాక మరింకే పని లేకపోయినా అతడు కదలలేననుకొన్నాడు. వెంటనే చిరతపూడి వెడతాననీ నాయుడుతో
మాట్లాడుతాననీ ఆమెకు మాట యిచ్చేడు. కాని అడుగుపడలేదు.
రాత్రినుంచీ అనుభూతమైన ఆ వుత్సాహము, ఆశ, మనఃస్థైర్యము ఇప్పుడు కలిగించుకోవాలన్నా సాధ్యం కావడం లేదు.
ఇదివరకు తాను మాణిక్యమ్మ ప్రసక్తిని వూహించియే వుండలేదు. కాని, ఆమె తన ఆలోచనలకు ప్రధానమైన అభ్యంతరం అనిపించింది.
తన మనస్సులోని ఆలోచన బయటకు రాకుండానే ఆ యింట్లో ఆమె వేపు నుంచి ప్రతిఘటన ప్రారంభమయింది.
ఆమె అభ్యంతరము చెప్పినా నాయుడు కూతురు పెళ్ళి చేయాలని ఆలోచిస్తున్నాడని వినేసరికి కలిగిన ఉత్సాహం అతడు వరుని కోసం
రఘుపతి వెంకటరత్నం నాయుడుగారికి కాకినాడ కబురంపించాడంటే చప్పబడిపోయింది.
అన్నింటికన్న స్వరాజ్యం మనస్సు ఏమిటో అతనికి అర్థం కాలేదు. నిన్నటి నుంచీ తాను చేసుకొంటున్న కల్పనలన్నీ వట్టివేనా?
తాను కనిపించేడు గనక ఇంటికి రావడంలేదేమని మర్యాదకి అడిగిందేమో, ఇంట్లో వచ్చిన ఈ గంద్రగోళంలో తన తండ్రిని
వొప్పించడానికే తనను రమ్మన్నదేమో, లేకపోతే ఇరవయి రోజుల నుంచి ఈ గంద్రగోళం జరుగుతుంటే, నిన్న తాను జగ్గయ్యపేట
తీర్థం వస్తాడని కలగందా?
ఆ ఆలోచన తోచేక చిరతపూడి వెళ్ళాలనిపించలేదు. స్వరాజ్యం ఆలోచనలుగా తాను వూహించుకుంటున్నవన్నీ అత్యాశలు మాత్రమేననిపించేక
మరిక వెళ్ళడం అర్థం ఏమిటి? నాయుడు ప్రయత్నాలన్నీ దిగతీయడానికా? స్వరాజ్యం ఇష్టం లేనిదే ఆయన ఒక్కడుగు ముందుకు
వేయలేడు, వేయడు. తొందర పడవద్దన్న ఆమె సలహాకు మాణిక్యమ్మ చెప్పినదే అర్థం అయితే.....
నాయుడు స్వయంగా ఆ వుత్తరాలు రాయలేడు. చెప్పి కూతురుచేత వ్రాయించవలసినవాడేగాని, ఆమెకిష్టం లేక వ్రాయను అంటే ఆయన
చెయ్యగలది ఏముంది?
కనక వివాహం చేసుకోవడం స్వరాజ్యానికి ఇష్టమే. తన వరుని ఎన్నికలో తన తండ్రితోపాటు తానూ వెంకటరత్నం నాయుడుగారి సహాయం
కోరుతూంది. అంటే తాను భావిస్తున్నట్లు ఆమె తన కోసం ఎదురుచూడ్డం లేదు. తనను మనసులో వుంచుకొనే తండ్రిని తొందర
పడవద్దంటున్నదని చెప్పుకొన్న సమాధానమూ సరికాదు.
ఆ మాట అనిపించేక మరి రామనాధానికి నాయుడి ఇంటికి వెళ్ళాలని గాని, స్వరాజ్యం ప్రసక్తి పెట్టుకోవాలనిగాని అనిపించలేదు.
ఆ పూటకింక అన్నం వండుకోవాలని కూడా అనిపించలేదు.
రెండు రోజులు, మూడు రోజులు ఒక వారం గడిచిపోయింది.
రామనాధానికి మనస్సు ఎంత నిలవరించుకొందామనుకున్నా సాధ్యం కావడం లేదు. స్వరాజ్యం అతని ఆలోచనల నుంచి వైదొలగడం లేదు.
తీర్థంలో కోడు మీది కర్రలవంతెన వరకూ వచ్చి తనకు జాగ్రత్త చెప్పిన ఆమె కళ్ళు అతని మనస్సుని వదిలి పోవడం లేదు.
తన సలహా అవసరం వచ్చిందన్నప్పటి గొంతులో వినిపించిన అనునయం, ఆశ కాదనుకున్నా మనస్సుని వదలడం లేదు.
"స్వరాజ్యం నాది కాకపోతే మరి బ్రతికి ఎందుకు?" అని పదిమాట్లు ప్రశ్నించుకున్నాడు. ఆమె వద్దకు పోయి తన మనస్సుని
ఆమె ముందు స్పష్టంగా పెట్టేద్దామని పదిమాట్లు అనుకున్నాడు. కాని,......
ఆమెకిష్టం కాకపోతే......ఇష్టం లేదంటే.....
అల్లరిచేస్తే......
భారతదేశంలో పెళ్ళి చేసుకోవాలనుకున్న యువతీ యువకులు తామే చొరవ తీసుకొని నిర్ణయం చేసుకోవడం ఎక్కడుంది? అల్లాంటి అలవాట్లు
లేవు. ఎవరన్నా ఎక్కడన్నా అలా నిశ్చయించుకొన్నా అవి పైకి రావు. ఆ విధమైన పని అవినయంగా జమకట్టి పెద్దవాళ్ళు
ఎక్కడికక్కడ కమ్మేస్తూంటారు. అందుచేత అతడు విన్నవల్లా అల్లాంటి ఘట్టాలలో జరిగిన అల్లర్లను గురించి మాత్రమే.
తనకిష్టం లేని పడుచువాడు తన ప్రేమను ప్రకటిస్తే పడుచులు అల్లరిచేసి అవమానించిన ఘట్టాలు విన్నాడు. ఇద్దరికీ ఇష్టం
వున్నా తమ రహస్యం ఇతరుల కంటబడిందనిపించినప్పుడు పడుచులు అల్లరి పెట్టడం విన్నాడు. తన ఆలోచనలకు మగవాడు
ప్రతిస్పందించనప్పుడు కసితో అల్లరి చేసిన ఘట్టాలు కథల్లో చదివేడు.
స్వరాజ్యం అలా చేయదని పదిమాట్లు ఆత్మ విశ్వాసం కలిగించుకొన్నాడు కాని,
జీవితంలో తాను చూసినవీ, విన్నవీ ఘటనలు ఆ విశ్వాసాన్ని నిలవనీయడంలేదు.
నిజంగానే అలా జరుగుతే అంతకన్న మహావమానం ఏం వుంటుంది? చచ్చిపోవాలే తప్ప మరి వూళ్ళోవాళ్ళకి మొగం చూపగలడా? చచ్చిపోయినా
అప్రతిష్ఠ పోతుందా?
రామనాధాన్ని ఆ అప్రతిష్ఠ భయం ఒకటి రెండు రోజుల కన్నా బాధించలేకపోయింది. అయితే తన కార్యవిధానం మార్చుకోవాలనుకొన్నాడు.
స్వరాజ్యమే తనను సలహా కావాలని ఆహ్వానించింది. ఆమె తల్లి నాయుడుగారితో మాట్లాడడానికి వెళ్ళమని నియమించింది. ఆ
అవకాశాలను వుపయోగించుకొంటాడు. వెడతాడు. స్వరాజ్యాన్ని చూస్తాడు.
తండ్రితో మాట్లాడబోయే ముందు ఆమె అభిప్రాయం తెలుసుకొనేటందుకు ప్రయత్నిస్తాడు.
అంతవరకూ మార్గం దొరికేక రామనాధం బయలుదేరేసేడు. ఇంకేవో కొత్త అనుమానాలు బయలుదేరి మరల వెనక తీస్తానేమోనని అతనికే
భయం పుట్టింది.
"ఈవేళ ఏదో తేల్చుకోవాలి. ఇంకిల్లా బ్రతకడం సాధ్యం కాదు...."
ఇరవయ్యెనిమిది
నీరెండెల వేళ గుమ్మంలో ప్రత్యక్షమయిన రామనాధాన్ని చూసి స్వరాజ్యం ఆశ్చర్యం కనబరచింది.
"దారి తప్పినట్లున్నారే?"
రామనాధం ఏదో గొణిగేడు. కాని, ఆ మాట వినిపించుకోకుండానే స్వరాజ్యం లేచి నిలబడింది.
"కూర్చోండి. నాన్నగారు కరణంగారి వీధికి వెళ్ళేరు. ఇప్పుడే వస్తారు" అంటూ ఆమె ఇంట్లోకి బయలుదేరింది. రామనాధం కంగారుగా
ఆమెను పిలిచేడు.
"ఏమండీ!"
స్వరాజ్యం నిలబడి గ్రీవాభంగంలో ఏమన్నట్లు చూసింది.
"క్షమించాలి....."
"ఎందుకు?"
రామనాధం కంగారుపడ్డాడు. ఆమె ఏదో సహాయం కావాలి, ఓమాటు మా యింటికి రమ్మంది. తాను వెళ్ళలేదు. పది రోజులు పోయాక వచ్చి
క్షమించమనడంలో అర్థం ఏమిటి?
స్వరాజ్యమే ఆ అభిప్రాయాన్ని మరో రూపంలో చెప్పింది.
"అదేముందండి. వీలు లేకపోయింది."
రామనాధం "అదేం కాదు" అన్నాడు.
"పోనీ ఇష్టం లేకపోయింది. ఈ తగవుల్లో మనం తలదూర్చడమెందుకనుకున్నారు"
"అబ్బెబ్బే! అదేం కాదు."
మరి ఏం చెప్పాలో అతనికి అర్ధం కాలేదు. ఒక్క నిముషం చూసి స్వరాజ్యం ముందడుగు వేసింది.
"పోనీలెండి, రాలేకపోయారు. రాలేదు. దానికి క్షమాపణ ఎందుకు? మీరు కూర్చోండి. నాన్నగారు వొచ్చేస్తారు."
--అంటూ ఆమె లోనికి వెళ్ళిపోయింది. నీతో నాకేం పనిలేదన్నట్లు ఆమె మాట వినిపించి రామనాధం నిర్విణ్ణుడై అలాగే చూస్తూ
నిలబడిపోయేడు.
మరునాడు తప్పక వస్తానన్న మనిషి రాకపోయేసరికి స్వరాజ్యం చాల నిరుత్సాహపడింది.
తండ్రి తనకు పెళ్ళి చేస్తానని సంబంధాలు వెతుకుతున్నాడు. పెళ్ళి తనకూ ఇష్టమే. కాని ఆమె చూపు వేరొకచోట వుంది.
కాని--అతని అభిప్రాయం ఏమిటో.....
తీర్థంలో కనిపించినప్పుడు రామనాధం కండ్లలో కనిపించిన ఆసక్తి, మాటలలో వినబడిన ఆప్యాయత ఆమెకు ఆశ కలిగించేయి. తన
తండ్రి ప్రయత్నం తెలిస్తే ఆతడు బయటపడతాడు. అందుకోసమే అతనిని ఇంటికి పిలిచింది.
కాని, అతడు రాలేదు. రెండు రోజులు పనుల తొందరకు జమ కట్టుకుంది. అటు తర్వాత అది సాధ్యం కాలేదు. తొందరపడిపోయేనే
అనుకుంది. తనను అలుసు చేస్తాడని భయం కలిగింది. అవమానకరంగా వ్యవహరిస్తే ఏం చెప్పాలో మాటలు కూడా ఆలోచించుకుంది.
మరో రెండు రోజులు పోయేసరికి అభిమానం వెనక ఆసక్తిని దాచుకోలేకపోయింది. ఏ అనారోగ్యమైనా కలిగిందేమో, లేవడం లేదేమో,
పరిపరి విధాల ఆలోచనలు పోయేయి. ఎంతో ఆదుర్దా కలిగింది.
కాని, తీరా అతడు కట్టెదుట కనిపించేసరికి వల్లమాలిన అభిమానం పట్టుకొంది. నీతో నాకేం పనిలేదన్నట్లు "మా నాన్నగారు
వస్తారు. కూర్చోమ"ని లేచిపోయింది.
లోపలికి వెళ్ళేక అతడు వెళ్ళిపోతాడేమోనని భయం కలిగింది. అతనిని మర్యాద చెయ్యకపోయినా, తాను వ్యవహరించిన తీరు
తప్పకుండా అవమానమనిపిస్తుంది. అతడెప్పుడు వచ్చినా కూడా వుంటూ కబుర్లు చెప్పే మనిషి ఇప్పుడు ఇల్లా వ్యవహరిస్తే
ఏమనుకుంటాడు?
ఆమాట తోచి స్వరాజ్యం తిరిగి వచ్చింది. అతడక్కడే అప్పటికీ నిలబడిపోయి వున్నాడు. నొచ్చుకుంది.
"ఏమిటల్లాగే నిలబడి వున్నారు? కూర్చోకుండా....."
"సెలవిప్పిస్తారా? చెప్పిపోదామని ఆగేను..."
స్వరాజ్యానికి కష్టం అనిపించింది.
"అంత చెప్పుల్లో కాళ్ళు పెట్టుకు నిలబడ్డానికి.... మరి మీరెందుకు వచ్చినట్లు? ఎందుకు వెళ్ళిపోతామంటున్నట్లు? వచ్చి పది
నిముషాలు కాకుండా వెళ్ళిపోతానంటే...."
"అదీ నిజమే. ఎందుకు వచ్చేను" అనుకొంటున్నట్లున్నాయి అతని చూపులు.
"ఓమారు మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేను" అన్నాడు.
ఆమాటకామె మనస్సు సంతృప్తిపడింది. నవ్వు వచ్చింది.
"ఏడెనిమిది రోజుల క్రితం మీతో పని వుందన్నాను. మీకిన్నాళ్ళకి రావాలనిపించిందన్నమాట! బాగానే వుంది.
చూడాలనిపించింది--వచ్చేరు. వచ్చేరు గనక కూర్చోండి...."
రామనాధం కూర్చున్నాడు. ఇరువురి మధ్య మాట సాగటం లేదు. ఒక నిముషం కూర్చుని స్వరాజ్యం లోపలికి వెళ్ళి వచ్చింది. అప్పుడూ
అతడలాగే వుండిపోయేడు.
"మాటామంతీ లేకుండా అల్లా కూర్చున్నారు. ఒంట్లో బాగుందా?" అంటూ ఆమె అతని ముఖం వంక చూసింది.
మనిషి చిక్కినట్టున్నాడు. ముఖం కందిపోయినట్లు ఎర్రబడింది. కళ్ళు జ్యోతుల్లా వున్నా ఏదో దాచిపెడుతున్నట్లు చూపు
తప్పిస్తున్నాయి.
ఈమారామెకు నిజంగానే ఆదుర్దా కలిగింది. లేచి వచ్చి నుదురు ముట్టి చూసింది. ఆమె స్పర్శకు రామనాధం జలదరించేడు.
రామనాధం నుదుటి మీదనున్న ఆమె చేతిని రెండు చేతులా తీసికొని కళ్ళమీద పెట్టుకున్నాడు. స్వరాజ్యం పరవశత్వంతో అతని కుర్చీ
వీపున జేరబడి నిలబడిపోయింది.
చేతి వ్రేళ్ళకు తడి తగిలినట్లనిపించి స్వరాజ్యం కంగారుగా చేతులు తీసుకుంది.
"ఏం? ఏమయింది?" అనబోయింది. అతడు తడి కళ్ళను దాచుకొనేటందుకు చేసిన ప్రయత్నం చూస్తే నవ్వు వచ్చింది.
వీధిలో నాయుడు కంఠం వినిపించింది. ఇద్దరూ ఉలికిపడ్డారు. స్వరాజ్యం రెండు అరచేతులతో అతని బుగ్గలు అదిమిపెట్టి తల
తనకేసి తిప్పుకుంది. ఒక్క నిముషం అతని కళ్ళలోకి చూసింది. చిరునవ్వుతో ఇంట్లోకి పరుగెత్తింది.
ఇరవైతొమ్మిది
రామనాధం రాకకు అబ్బాయి నాయుడు మామూలు వుత్సాహం కనబరచలేకపోయేడు. కొంచెం చిరాకుపడ్డట్లేననిపించింది. అతడు వెనక్కి
తగ్గేడు.
నాయుడు గుడ్డివాడు. అవధ్యుడు. కూతురు వయస్సులో వుంది. ఒంటికత్తె. తల్లీ, తోడూ ఎవరూ లేరాయె.
రామనాధం వంటి ప్రథమ యౌవనంలో వున్న తరుణుడు తన యింటికి తరచు వేళ కాని వేళల్లో రావడం మంచి పని కాదు అని నాయుడు
వుద్దేశం.
ఆ వుద్దేశం అర్థం అయ్యేలాగునే అతడు అతి మర్యాదగనే చెప్పేడు.
"తోటల్లో గట్లవెంట పురుగూ, పుట్రా తిరుగుతూంటాయి. చీకట్లో కష్టం. మీకేమయినా అనిష్టం జరిగితే మా మనస్సులకెంతో బాధ.
ఎప్పుడొచ్చినా చీకటిలో పోనక్కర్లేకుండా వస్తూండండి."
ఆ మాటల అర్ధాన్ని పడుచువాళ్ళిద్దరూ గ్రహించేరు. రామనాధం తెల్ల మొగం వేసేడు. స్వరాజ్యం ముఖం గంటు పెట్టుకుంది.
"చీకటి పడ్డాక వెళ్ళనిస్తామా ఏమిటి?"
కూతురు మాటను అబ్బాయి నాయుడు కాదనలేదు. అలాగని రామనాధాన్ని వుండమననూ లేదు. అసలా విషయాన్ని గురించి తల పెట్టనే
దలచలేదు.
"నీళ్ళు కాగేయా?"
స్వరాజ్యం ఆయనకు సరాసరి సమాధానం ఇవ్వలేదు.
"రామనాధం గారూ! మీ కోసం వేడినీళ్ళు తోడి వుంచేను. నాన్నగారు బట్టలు మార్చుకొని వచ్చేలోగా వెళ్ళి స్నానం చేసి రండి"
అది తండ్రీ కూతుళ్ళ మధ్య కుస్తీలా కనిపించింది. తన సంకల్పం వెలువరించడానికి అది సమయం కాదు. నాయుడు ఏదో ఆవేశంలో
వున్నాడు. నాలుగు రోజులు పోనిచ్చి మళ్ళీ వస్తాడు. అప్పుడు మాట్లాడుతాడు. ఇప్పుడీ విధంగా ఆ యింట్లో కల్లోలం తీసుకురావడం
తమ ఆలోచనకే ఆటంకం అవుతుంది అనుకొన్నాడు.
"ఇప్పుడెందుకండీ, వెన్నెలగా వుంది. ఇంకా పొలాల మీద మనుష్యులు తిరుగుతూనే వుంటారు."
స్వరాజ్యం ఖచ్చితంగా చెప్పేసింది. చీకట్లో అతనిని వెళ్ళనియ్యదు.
నాయుడు ఆమె అభిమానాన్ని అర్థం చేసుకొని తగ్గేడు.
"ఇప్పుడెక్కడికి వెడతారు. లేవండి" అన్నాడు.
తనను పోనిమ్మన్నట్లు రామనాధం దీనంగా స్వరాజ్యం వంక చూసేడు. ఆమె పనికిరాదన్నట్లు తల అడ్డంగా తిప్పింది.
"ఎంతో వేళ మిగలలేదండి" అన్నాడు నాయుడుకు సమాధానంగా.
తండ్రి గుడ్డితనాన్ని వుపయోగించుకోవడానికి స్వరాజ్యం సందేహించలేదు. రామనాధం చేయి అందుకొంది.
"ఇంక మీ మాట ఎవ్వరం వినదలచుకోలేదు."
భోజనాల వేళ ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలలో వారున్నారు. ఒక్క స్వరాజ్యమే మాట్లాడుతూంది. ఎవ్వరూ తిండి సరిగ్గా
తిన్నట్లు లేదు.
వారు చేతులు కడుక్కు వచ్చేసరికి రామనాధానికి వాకిట్లో అరుగు మీద మంచం వేసింది.
"అదిగో దుప్పటి, మంచం క్రింద మంచినీళ్ళూ, చెంబూ వుంచేను. ఏమన్నా కావలిస్తే లేపండి. మొగమాటపడక."
రామనాధం పరిస్థితులు ఆ రూపం తీసుకుంటాయనుకోలేదు. స్వరాజ్యం అభిమానం, ప్రేమా గురించే అతడీ వారం రోజులూ అనంతమైన వేదన
ననుభవించేడు. ఆమె తనదే, దృఢపడిపోయింది. కాని ఈమారు అభ్యంతరం వేరొక దిశ నుంచి ఎదురయింది. కూతురు పెళ్ళి
చెయ్యాలనుకొంటున్న నాయుడుకి తన విషయంలో ఎందుకు అభ్యంతరం వుండాలో తెలియదు. ఈ దశలో నాయుడుని రెచ్చగొట్టటం కన్నా
నెమ్మదిగా సర్దుకోవడం మంచిదని అతని అభిప్రాయం.
కాని, స్వరాజ్యం పద్ధతికి ఆమె కారణాలు ఆమెకు వున్నాయి. ఖచ్చితంగా తన పక్క నిలబడి రామనాధం తనకు సాయపడాలని ఆమె
కోరిక. కాని, రామనాధం నీళ్ళు నమలడం ఆమెకు నచ్చలేదు.
కాని, ఏమీ అనలేకపోయింది.
"చాలులెండి. అది మీ పక్క."
ముప్ఫయి
తమ సమాజంలోని ఆచారాలూ, అలవాట్లూ, నీతి-అవినీతి భావనలూ దృష్ట్యా తాను రామనాధం యెడ కనబరుస్తున్న మమకారం తప్పు.
కాని తమకిద్దరకూ మనస్సు కలిసింది. తమ యిద్దరి మధ్యా ఏర్పడిన ఆత్మీయత దృష్ట్యా అది తప్పు కాదు. తమ యింట్లో
నడుస్తున్న చర్చల దృష్ట్యా కూడ ఆమె తమ మధ్య ఏర్పడుతున్న మమకారం మంచి చెడ్డల్ని పరిశీలిస్తూంది.
తనకు పెళ్ళి అయిన మాట నిజం. ఆ మగనియెడ తనకు ఆత్మీయత పెరగడానికి తగిన అవకాశమూ లేదు. అవసరమూ లేదు,
పెళ్ళి అయన కొద్ది నెలల నుంచే రెండు కుటుంబాలూ దూరం అయాయి. అతడు రెండో పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. అయినా సరే సమాజంలోని
ఆచారాలనూ, అలవాట్లనూ అనుసరించాలనే ఆమె తలచింది. ఆ మొగుడి మీద మమకారం పెంచుకోగలుగుతాననే తలచింది. ఏమో, ఏం
జరుగునో అతడా అవకాశం ఇవ్వదలచలేదు. ఆమెకా అవసరం కలగనూ లేదు.
అల్లుని వద్దకు నడిచిన రాయబారం విఫలం అయ్యేక నాయుడుకి కూతురు భవిష్యత్తు యెడ ఎంతో దిగులు పట్టుకొంది. ఆమెకు మళ్ళీ
పెళ్ళి చేసేద్దామని ఆలోచన కలిగింది. చట్టరీత్యా ప్రతిబంధకాలున్నాయేమోనని వియ్యాలవారితో నడిపిన రాయబారాల పర్యవసానాలను
తెలుపుతున్న జాబులన్నీ ఎక్కడెక్కడున్నవీ భద్రం చేయించేడు. తన బ్రహ్మసమాజం మిత్రులందరికీ జాబులు వ్రాయించేడు.
వాటినన్నింటినీ స్వరాజ్యమే వ్రాసింది. ఆమె మనస్సులో మళ్ళీ పెళ్ళి చేసుకోవడం తప్పు కాదని శ్రుతి స్మృతి పురాణాలలోని
కథలూ, కవితలూ, శ్లోకాల బలంతో ఒక అభిప్రాయం ఏర్పడింది. పెళ్ళిచేసుకోవాలనే ఆలోచనా కలిగింది.
ఆ సమయంలో రామనాధం ఆమె ఎదుటికి వచ్చేడు. ఏ కులం వాడికైనా తండ్రి అంగీకరిస్తాడో లేదో అనే ఆలోచన ఆమెకు కలుగలేదు.
చదువుకున్నవాడు, ఏ వుద్యోగంలోనో వున్నవాడు కావాలనే గాని, ఫలానా కులం వాడేనని తండ్రి ఎప్పుడూ వ్రాయలేదు. కులాల భేదాలు
కృత్రిమాలనే భావం ఆ యింట్లో వుంది. ఒకవేళ అటువంటి అభ్యంతరాలు పెద్దవాళ్ళకున్నా, వానిని గమనించనీయని వయస్సు ఆమెది.
రామనాధం రూపసి. మంచి విగ్రహం, హృదయం ఇవ్వగలవాడు. ఈ పూటతో అతడు తనవాడేనని స్పష్టం అయిపోయింది. ఆ విషయంలో
ఆమెకెల్లాంటి సందేహమూ లేదు. అతడు తనవాడు. అతనిని ఏమన్నా అంటే పీకేస్తుంది. అతనిని కాపాడుకొంటుంది.