ఈలాగ ఒకదానికొకటి అల్లుకుపోతున్నాయి. పనులు పెరుగుతున్నాయి. పనులతోపాటు మిత్రగణం పెరిగింది. పత్రిక చదివే వాళ్ళ

సంఖ్య పెరిగింది. గ్రామంలో ఒకటి రెండు చోట్ల పత్రికా పురాణాలు నడుస్తున్నాయి. చదవడంతోపాటు చర్చలు సాగుతున్నాయి.

"ఈవేళ పత్రికలో ఏం వేశారోయ్‌?" అని అడుగుతున్నవాళ్ళ పలకరింపులు హెచ్చవుతున్నాయి.

వర్షాలు వెనకబట్టేయి. అస్పృశ్యులకు నూతి వద్ద నీళ్ళు తోడుకొనే అవకాశం కలిగించేటందుకు తేదీ నిర్ణయం అయింది. సరిగ్గా

నెల రోజుల్లో కార్తీక పౌర్ణమి వస్తూంది. మొదట అనుకొన్నట్లు విజయదశమికి సాధ్యం కాలేదు. ఈ ఏడు తూర్పు వర్షాలు

కుండపోతగా పడ్డాయి.

రామనాధం పెద్ద రావి క్రింద గ్రంథాలయం అరుగుమీద ఆనాటి పత్రికను చదివి వినిపించడం ముగించి అప్పుడే మకాం చేరుకున్నాడు.

రాత్రి ప్రొద్దుపోయింది. కాళ్ళ బురద వదుల్చుకొని పాకలో అడుగు పెట్టేసరికి పడక కుర్చీలో పడుకొని నిద్రపోతున్న

చంద్రశేఖరం కనిపించేడు. ఎవరా అనుకుంటూండగానే అలికిడికి లేచేడు.

"ఇంక ఈవేళకి రావేమో, ఏం చెయ్యడమా అనుకుంటూంటే నిద్ర పట్టేసింది."

"ఎంతసేపయింది వచ్చి?"

ఎంతసేపయిందో చెప్పడంతోపాటు చంద్రశేఖరం తన భోజనం అయిపోయిందనీ, తన కోసం ఏర్పాట్లేవీ చేయనక్కర్లేదనీ అన్నాడు.

రామనాధం అతనిని మనస్సులోనే అభినందించేడు. లేకుంటే ఈ వేళప్పుడు అతడికి ఏం పెట్టగలడు? సాయంకాలం ఓ పావుశేరు బియ్యం

అత్తెసరు వేసుకుని అల్లా వీధిలోకి వెళ్ళేడు. పనిమనిషి పెరుగు తెచ్చి ఉట్టిమీద పెట్టి పోయి వుంటుంది. తానైతే వుప్పూ,

ఊరగాయా లేకుండా ఇంత పెరుగు పోసుకుని తిని లేచిపోగలడు. కాని, ఆ భోజనం అతిథికి పెట్టడం ఎల్లాగ? చేతనైనా, ఆ

రాత్రివేళ వంట ఏం చేస్తాడు? చంద్రశేఖరం భోజనం చేసే వచ్చేననే సరికి ప్రాణం కుదుటపడింది. కాని మర్యాదకన్నా అసమ్మతి

తెలుపకుండా ఊరుకోలేకపోయాడు.

"అదేమిటండీ, ఆ మాత్రం...."

చంద్రశేఖరం నవ్వేడు.

"మర్యాద పేరుతో అబద్ధాలాడకయ్యా! ఇప్పుడు నే భోజనం చేస్తానంటే నువ్వు వొండి పెట్టగలవా?"

"ఉలకం"

"ఇంతకీ నీ భోజనమయిందా?"

"లేవండి. ఎప్పుడు తిన్న తిండో."

"ఇద్దరం పంచుకు తిందాం...."

"సహనౌభునక్తు" అంటావు.

చంద్రశేఖరం ఏమీ అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పేసేడు. పైగా రామనాధం విస్తరి వేసుకొనేవరకూ ఊరుకోలేదు. అతని తిండి చూసి

మనస్సులో జాలిపడ్డాడు.

"రోజూ ఇంతేనా?" అన్నాడు.

"మన దేశంలో ఈ మాత్రమూ దొరకని వాళ్ళు కోట్ల మంది."

చంద్రశేఖరం ప్రశ్నకు ఆర్థికం మూలకం కాదు. కాని, రామనాధం తెలివిగా మాట మళ్ళించేడు. కొంతసేపు ఇద్దరూ ఆమాటా, ఈ మాటా

మాట్లాడేరు. కాని అసలు విషయానికి రావడానికి ఇద్దరూ జంకుతున్నారు.

"ఏమిటీ హడావిడి అంతా.....?"

తోటలో పందిళ్ళకి సామాను తెచ్చి పడేసేరు. నూయి ఎత్తు చేయడానికీ, గచ్చు చేయడానికి తెప్పించిన ఇటుకా, ఇసుకా

అస్తవ్యస్తంగా వున్నాయి. రామనాధం తన ప్రయత్నాలన్నీ చెప్పేడు. అన్నీ విని చంద్రశేఖరం చేసిన వ్యాఖ్య రామనాధానికి

ఆశ్చర్యం అనిపించింది.

"మనిషివి చిక్కేవు. ఆరోగ్యంగా వున్నావా?" అని చంద్రశేఖరం.

రామనాధం ఛాతీ, దండలూ చూసుకొన్నాడు.

"చిక్కేనా? నాకు తెలియడం లేదు."

అనారోగ్యం ఏమీ లేదని ముఖమే చెప్తూంది. అయితే మనిషి నల్లబడ్డాడు. నవకం తగ్గి మనిషి దృఢపడ్డాడు.

చంద్రశేఖరం కాస్సేపు ఊళ్ళో కబుర్లూ అడిగి చివరకు అతని మకాము కాకినాడకో, మద్రాసుకో మార్చమని సలహా ఇచ్చేడు.

"తర్వాత ఏం చేసినా, ఆ బి.ఏ. పూర్తి చెయ్యరాదూ? ఇంతలో వ్యవహారాలూ చక్కబడతాయి."

చక్కబడవలసిన వ్యవహారం అల్లా అత్తవారి తోడిదే.... అంటే, తాను బి.ఏ. చదువు పేరుతో ముంగండ వదలాలి. అల్లుడు

దారిన పడుతున్నాడనే విశ్వాసం మామగారికి ఏర్పడుతుంది. భార్యను పంపుతాడు, అటు తర్వాత నా పరుగు అందుకోమంటే ఏం

చేస్తాడేం?.... అని కాబోలుననుకొన్నాడు.

రామనాధం ఆ ఆలోచనను అంగీకరించలేదు. తాను ముంగండలో కొన్ని పనులు తలపెట్టేడు. వానిని సాగించడం మాట ఎలా వున్నా భార్యను

తెచ్చుకొనేటందుకు ఒక పెద్ద నాటకం ఆడడం, ఆషాఢభూతి వ్యవహారం నడపడం అతనికి సమ్మతం కాలేదు.

కాని చంద్రశేఖరం ఒప్పుకోలేదు.

"వంట చేసుకోలేక ఈ చప్పిడి కూడుతో ఎంతకాలం?"

పెళ్ళాం అవసరం వంట చేసిపెట్టడానికేనా అనిపించింది. అంతే అయితే ప్రస్తుతం బాధ లేదు. జైలులో చప్పిడికూడు తినడం అలవాటు

అయింది. ఇప్పుడు తినమన్నా కారం తినలేడు. మజ్జిగ అన్నంలోకి ఉప్పు కూడా పని లేదు. పైగా తనకి వంట బాగానే చేతనవును.

అందుచేత తిండికి సంబంధించినంత వరకూ పెళ్ళాం రావలసిన అవసరం లేదు. ఆమాటే చెప్పేడు.

"మరి నీ ఉత్తరం ఏమిటి?"

రామనాధం క్లుప్తంగానే పరిస్థితి వివరించేడు.

"మీ సలహా ఏమిటి? నా ఎడ కనీసపు సుహృద్భావం మీకుంది. ఆ వేపున చెల్లెలు, నన్ను ఏం చెయ్యమంటారు?"

ఆ ప్రశ్న మర్యాద కోసం వేసిందేగాని వేరు కాదనిపించింది. రామనాధం ఒక అభిప్రాయానికి వచ్చేవున్నాడనిపించింది.

"నీ అభిప్రాయం ఏమిటో చెప్పు?"

"మీరు తండ్రిగారింటికి వెళ్ళేరు. బహుశా నే చెప్పిన దాని కన్నా మీకు వివరంగానే తెలిసి వుండాలి సంగతులు. నా అభిప్రాయంలో

ఆనాటికీ, ఈనాటికీ తేడా లేకపోలేదు."

చంద్రశేఖరం కాలక్రమంలో అన్నీ సర్దుకొంటాయి అన్నాడు.

"ఇప్పుడేమీ తొందరపడకు, తొందరపెట్టకు. అన్నీ సర్దుకొంటాయి."

"నాదో చిత్రమైన స్థితి. తల్లిదండ్రులూ, పెద్దవాళ్ళూ వెనక దాగడానికి లేదు. నేనే ముందుకు రావాలి."

"అదేమిటిలే, బోలెడు బలగం వున్నవాడివి. ఏదో ఘట్టంలో ఎడంగా వున్నా, ఎప్పుడూ అలాగే వుంటుందా?"

చంద్రశేఖరం తన అభిప్రాయాన్ని అర్ధం చేసుకోలేకపోయేడని ఈమారు స్పష్టంగానే చెప్పేడు.

"పూర్వం తల్లీదండ్రీ ఈ వ్యవహారాలు చూసేవారు. వాళ్ళ రోజుల్లో ఇన్నిమాట్లు అడగడం, అసలు అడగడమే అవసరం వుండేది

కాదు. అవసరం వస్తే మరీ ఆలోచించేవారూ కాదు. ఈనాడు నేను వాళ్ళ మాదిరిగా ఆలోచించలేకుండా వున్నాను. అందుకే పదే పదే

ప్రయత్నం చేశాను.

"విన్నాను. వాళ్లు చెప్పేరు."

"బహుశా మీరు విని వుండనిది ఒకటుంటుంది."

"ఏమిటది?"

"మీ చెల్లెలితో మాట్లాడారా?"

మాట్లాడేడు. ఆమె అభిప్రాయం అతనికి అంతు పట్టలేదు. కనక అబద్ధమే ఆడేడు.

"లేదనే చెప్పాలి."

"నేను మాట్లాడేను."

చంద్రశేఖరానికి ఆ మాట ఎవ్వరూ చెప్పలేదు.-- "ఎరగరా?"

"ఏం అంది?"

"విశేషం ఏమీ లేదనుకోండి. తాళి కట్టేను కదా. ఏవో కొన్ని బాధ్యతలు ఏర్పడ్డాయి. కనక ప్రయత్నించేను. ఆమెను గాని, మీ

వాళ్ళను గాని అల్లరి పెట్టి అప్రతిష్ఠ పాల్జేసి ఆ బాధ్యతలను నెరవేర్చాలనే ఆలోచన నాకు లేదు. ఒక స్నేహితుల కుటుంబ

సహాయంతో ఆమెను కలుసుకొని మాట్లాడగలిగేను."

పర్యవసానం నోటితోగాక, తల అడ్డంగా తిప్పడంతో సూచించేడు.

చంద్రశేఖరం ఏమీ అనలేదు. ఆ పరిస్థితిని అతడూ గ్రహించేడు. కాని చెయ్యగలదేమీ కనపడ్డం లేదు. సుందరిది చిన్నతనం.

దేశంలో విడాకులు అధికారం లేదు. అందుచేత ఈనాడు ఎలా వున్నా జ్ఞానం తెలిసిందంటే, ఆమెకీతడే దిక్కు, మరో వ్యక్తితో

జీవించడం--ఆమెకాతడెంత ఇష్టుడే అయినా ధర్మ బాహ్యమూ, నీతి బాహ్యమూను. దానిని వూహించను కూడా లేడు. ఆమె నీతిగా

బ్రతికేందుకయినా రామనాధం తెగతెంపులు చేసుకోకుండా వుండాలనిపించింది.

"నాకిప్పుడేం చెప్పడానికీ తోచడం లేదు. కాకినాడ వచ్చినప్పుడు నీకో సలహా ఇచ్చేను. నువ్వానాడు అంగీకరించలేదు. అంగీకరించి ఆ

విధంగా జరిగి వుంటే ఎంతో బాగుండేది. ఈనాడు తొందరపడుతున్నావు. ఆనాడు ఆ శుభకార్యం జరిగిపోతే చాలునన్న మా నాన్న నేడు

ససేమిరా పనికిరాదంటున్నాడు. మీరుభయులూ చెరోవేపూ లాగి ఆ చిన్నపిల్ల మనస్సు క్షోభ పెడుతున్నారు."

తన తండ్రినీ, తననూ ఈ పరిస్థితికి సమానకారకులనుగానే లెక్క కడుతున్నాడని, రామనాధం కష్టపెట్టుకొన్నాడు. ఆ కష్టంలో

తాను ఆనాడు అమలాపురం వెళ్ళడానికి ఆ సలహాయే కారణం అనేశాడు.

"కాకినాడలో నేను ఏమనివున్నా, నేను మీ సలహా ప్రకారమే చేశాను. అమలాపురం అందుకే వెళ్ళేను."

"నేను అమలాపురం వెళ్లమనలేదే...."

"అది నా పైత్యం వేడి, మీరు కాపురానికి తెచ్చుకొని, తర్వాత ఆమెతో మాట్లాడమన్నారు. నేను ముందు మాట్లాడి కర్తవ్యం

ఆలోచించాలనుకొన్నా."

"పోనీ వెళ్ళేవనుకో. నీ పని చూసుకొని లేచిరాక, మా నాన్నకి సత్యాగ్రహోపదేశం ఏమిటి?"

"ఏమిటి మీ అభిప్రాయం? అదంతా వట్టి దొంగ కేసు. మీ నాన్న మొహం కూడా నేను కోర్టులో తప్ప చూడలేదు."

చంద్రశేఖరానికది నమ్మదగిందిగా కనబడలేదు.

"నిజంగా......?"

రామనాధం ఆనాటి ఘటనలు చెప్తూంటే చంద్రశేఖరం తల్లడిల్లిపోయేడు.

"కోర్టులో ఎందుకు..."

"మీ నాన్న, ఆ కోర్టులూ ఒకే గవర్నమెంటు తాలూకు. వానిమీద నాకు నమ్మకం లేదు."

"నీ నమ్మకం, అపనమ్మకం సమస్య కాదు....."

రామనాధం ఏమీ అనలేదు. ఇంక ఆతడు ఆ విషయం చర్చించనిష్టపడడం లేదని గ్రహించి చంద్రశేఖరం ఆగేడు.

"మా అమ్మకిదంతా తెలుసా?"

"తెలుసుకోవాలనుంటే తెలుసుకోవడం కష్టమేం కాదు."

చంద్రశేఖరం ఓ నిముషం వూరుకుని తానివ్వగల సలహానిచ్చేడు.

"తొందరపడకు."

"తొందరపడడం అంటే మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు. నేను మళ్ళీ పెళ్ళి చేసుకోవడం గురించా?"

ఆ ఆలోచనతోనే చంద్రశేఖరం అన్నాడు. కాని బహిరంగంగా వొప్పుకోలేకపోయేడు.

"అబ్బెబ్బే నువ్వంత అజ్ఞానప్పని....."

"ఇష్టం లేని అమ్మాయిని యిబ్బంది పెట్టడానికి బదులు నచ్చిన పిల్లను పెళ్ళి చేసుకోవాలనుకోవడం అజ్ఞానం పనేనంటారేమిటి?"

చంద్రశేఖరం తెల్లబోయేడు.

"భార్య అనుకూలవతి గావాలంటారు మీరే. పెళ్ళి నాటికి పదేళ్ళకు మించకపోయినా ఆమె మంచి స్వభావం గురించి మీరే చెప్పేవారు.

అందుకు విరుద్ధంగా తయారయితే తప్పు మీది కాదు. బాధ్యతా మీది కాదు. దానికి అనేక కారణాలుంటాయి. నా భార్య నా శత్రుకూటానికి

చెందరాదు. అదొక్కటే నా కోరిక....."

"ఫర్వాలేదు."

"నాకు విశ్వాసం కలగడం లేదు."

"ఆమె తల్లీదండ్రీ దగ్గరేనయ్యా వున్నది."

"అదే దురదృష్టం..."

చంద్రశేఖరం గతుక్కుమన్నాడు. నిజమే ఆ మాట. కాని, వినడానికి కష్టం అనిపించింది.

"మీ చెల్లెల్ని తీసుకెళ్ళి మీ దగ్గర వుంచుకోరాదు? నాలుగేళ్ళు చదువుకోనిద్దాం. ఆనాటికి ఆమెకు సర్దుకోగలిగిందా....."

చంద్రశేఖరం లేచేడు.

"నీకు నా మీద ఆ మాత్రం విశ్వాసం మిగిలినందుకు సంతోషం కాని...."

"అది జరగదు....." అంటూ రామనాధం మాటను పూర్తి చేశాడు.

అతడు బావగారిని రోడ్డుమీదకంటా సాగనంపేడు. గుర్రపు బండి ఎక్కించి సెలవు తీసుకున్నాడు.

ఆఖరున అన్నాడు.

"మీరు రావడం వలన నా పని ఒకటి తేలిక అయింది. మీ చెల్లెలితో ఒక్కటి చెప్పండి."

"ఊరికే మనస్సు పాడు చేసుకోకు."

"మనస్సు పాడు చేసుకోవడం లేదు. ఏమీ లేదు. ఇదొక్కటే చెప్పండి."

"ఒక్కటీ లేదు, రెండూ లేదు."

"జరిగిపోయిన పెళ్లిని తుడిచివేయడానికి ఏమాత్రం మార్గం వున్నా తప్పకుండా చేసేసేవాడినే. కాని, ఆ సందర్భంగా నే చెయ్యగలది

లేదు. ఇంక ఒకటి చెయ్యగలను. నాకో పది ఎకరాల భూమి వుంది. అందులో రెండెకరాల ఊడ్పు చేను విడిగా ఆసుపత్రి కాలవ

క్రింద వుంది. చేను మంచిది. పది బస్తాలు ఎకరానికి ఎవడన్నా మక్తా ఇస్తాడు. అది ఆమె పేర వ్రాసేస్తాను. వారం

పదిరోజుల్లో దస్తావేజు రిజిస్టరు చేసి పంపేస్తాను. ఆమె జీవితంలోకి మరెప్పుడూ రానని చెప్పెయ్యండి.

"మతిగాని పోయిందా" అని చంద్రశేఖరం కోపపడ్డాడు.

"పోలేదు. వుంది గనకనే."

రామనాధం వెనక్కి తిరిగేడు. బండి కదిలింది.

ఇరవై రెండు

కనుచీకటి పడబోయే ముందు పంటకాలవ గట్టున వెడుతున్న రామనాధాన్ని స్వరాజ్యం గుర్తుపట్టింది. ఆ వేళప్పుడు ఎక్కడి నుంచి

వస్తున్నాడో అనుకుంది. తమ యింటికి తిరగవలసిన దారి వదిలి ముందుకు పోతూంటే ఒక్కక్షణం అతడేనా అని అనుమానం కలిగింది.

కాని నడక!

లాంతర్లు వెలిగిస్తున్న సూరాయిని పిలిచింది.

"ఆ వెడుతున్నదెవరురా?"

వాడూ గుర్తించి తోటకి అడ్డంపడి పరుగెత్తేడు. పది నిముషాలలో రామనాధాన్ని వెంటపెట్టుకు వచ్చేడు.

"కాలవ గట్టునే వెడుతూ మొహం చూపకపోవడానికి మేం చేసిన అపరాధం ఏమి"టని స్వరాజ్యం కష్టపెట్టుకుంది.

"చీకటి పడిపోతూంది. మళ్ళీ రేపో ఎల్లుండో వద్దామని..." అంటూ రామనాధం క్షమాపణ చెప్పుకున్నాడు.

"ఎక్కడి నుండి వస్తున్నారు?" అని నాయుడు.

"చీకటి పడుతూంటే ఈ పూట ఇక్కడ ఆగకూడదా?"

"అనవసరమైన శ్రమ కాదుటండీ. ఎటూ కాని వేళ....."

స్వరాజ్యానికి ఈమారు నిజంగానే కోపం వచ్చింది. ఆమె కంఠాన్ని గమనించి నాయుడు రామనాధాన్ని ఆపేసేడు.

"ఇప్పుడెక్కడికెడతారు? వుండిపోండి"

రామనాధం ఆగక తప్పింది కాదు. కాళ్ళు కడుక్కుని వచ్చి సూరాయి వేసిన పడకకుర్చీలో కూర్చుంటూ నాయుడు కొంతసేపు క్రిందట వేసిన

ప్రశ్నకు సమాధానం ఇచ్చేడు.

"కొత్తపేట రిజిస్ట్రారు ఆఫీసుకి వెళ్ళేను."

రిజిస్ట్రారు ఆఫీసుకి పోయి వస్తూన్న కారణం విని నాయుడూ, భార్యా దిగ్భ్రమ చెందేరు. కాని ఇద్దరూ మాత్రం పరస్పర

విరుద్ధమైన అభిప్రాయాలు తెలిపేరు.

"చాల మంచి పని చేశావు నాయనా?" అన్నాడు నాయుడు. తన యెడ విముఖత చూపుతున్న భార్యకు జీవనాధారం కల్పించడంలోని

ఔదార్యాన్ని నాయుడు అభినందించేడు.

కాని మాణిక్యమ్మ అభిప్రాయం దానికి భిన్నం. చిన్నతనం గనక సుందరి ఈవేళ తల్లిదండ్రులకు తాళం వేస్తూందిగాని, వయస్సు

వచ్చి తనకూ ఓ కుటుంబం కావాలనుకొనేసరికి ఏమంటుంది? భర్తకి బదులు రెండెకరాలు ఆమెకు తృప్తిని ఇవ్వగలవా?

"మంచి పని చెయ్యలేదు నాయనా!" అంది ఆమె.

స్వరాజ్యం ఏమీ అనలేదు. సుందరిని దురదృష్టవంతురాలు అనుకొంది. అంతే.

ఆమాటే చాటున తల్లి వద్ద అంది. తల్లి జాలి కనబరచింది.

"ఇప్పుడేం తెలియదు....."

స్వరాజ్యం ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ఏదో తోచి రామనాధం నుంచి దస్తావేజు తీసుకుంది. దానిని అందిస్తూ రామనాధం స్పష్టంగా

చెప్పేడు.

"రేపు కరణంగారి చేత పట్టా బదలాయింపు చేయిస్తా."

వ్యవహారాన్నంతనూ పకడ్బందీగా చేయదలచుకొన్నానన్న ఆ సూచనకు మాణిక్యమ్మ నవ్వింది.

"దస్తావేజు పుట్టాక పట్టా బదిలీలో విశేషం ఏముందిలెండి."

రామనాధం తన చర్యను సమర్థించుకున్నాడు.

"ఏమో! ఏ సమయంలో నాలో ఎటువంటి మార్పులు వస్తాయో, ఆమె జీవిత భరణం కోసం వాళ్ళు అడగక మానరనీ, అప్పుడామెను

పంపమని నిగ్గదీయవచ్చుననీ చాలామంది సలహా ఇచ్చేరు."

"ఆ తల్లీదండ్రీ వున్నంతకాలం ఆమెకే లోటూ రాకపోవచ్చూ, కాని, వారు శాశ్వతమా? మీరు కూడా తెగతెంపులు చేసుక్కూర్చుంటే..."

మాణిక్యమ్మ మాట పూర్తి కాకుండానే రామనాధం అందుకున్నాడు.

"నామీద కోపం, కసీ, అయిష్టమూ వున్నా తిండి కావలసి వుంటుంది గనక రాక తప్పదనా? అంతకంటె ఆ అమ్మాయికి మరో అగౌరవం

ఏం వుంటుంది? వద్దండి. అటువంటి దురభిప్రాయం కలగకూడదనే....."

స్వరాజ్యం దస్తావేజును చేతిలోకి తీసుకుంటూ తానూ తండ్రీ మరునాడు అమలాపురం వెడుతున్నామంది.

"నాన్నగారిని ఒకమారు డాక్టరుగారికి చూపించి వద్దామని. వెళ్ళినప్పుడు వారి యింటికి వెళ్ళి ఆమెను చూసి మాట్లాడి

రావాలనుకొన్నాను. అప్పుడే ఇది ఇచ్చేస్తాలెండి."

రామనాధం హడలిపోయేడు.

"మీరిస్తారా? వద్దు. వద్దు. పోస్టులో పడేస్తాలెండి."

పోస్టులో పంపవలసినవాడు దస్తావేజు ఇంటికి తీసుకుపోవడం ఎందుకు? రిజిస్ట్రారాఫీసులో పోస్టేజీ చెల్లించి చిరునామా ఇచ్చేస్తే వాళ్ళు

పంపుదురు కాదా. కాని, అంతరాంతరాలలో తన భార్యను దారికి తీసుకురాగలననే ఆలోచన ఏ మూలనో వుంది. తన సౌజన్యంతో,

మంచితనంతో ఆమెను దారికి తేగలననే ఆలోచన వుంది. ఆ వుద్దేశంతోనే దస్తావేజు కూడా తెచ్చుకొన్నాడు. దానితో భార్యకు ఓ చిన్న

వుత్తరం కూడా వ్రాయాలనుకున్నాడు. కాని, ఆ మనఃస్థితి అతనికే స్పష్టంగా లేదు.

ఉత్తరం వ్రాయడంకన్నా ఒక మనిషి ద్వారా పంపి, ఆమెతో మాట్లాడించడం మరీ మంచిదనే అభిప్రాయం లేకపోలేదు. కాని, వెళ్ళగల

మనిషి అతనికి కనబడలేదు. సుందరిని కలుసుకొని ఆమెతో మాట్లాడగల వాళ్లు అతనికెవ్వరూ కనిపించలేదు. కనుక పోస్టు

అనుకొన్నాడు.

కాని తీరా స్వరాజ్యం తాను వెడతాననేసరికి భయం వేసింది.

"వాళ్ళేమన్నా అంటే నాకు...."

"ఎవరుమాత్రం ఎందుకేమంటారు? నాకూ ఆమెకూ స్నేహం ఉన్నదండీ."

ఆ స్నేహం సంగతి రామనాధానికి తెలుసు. కాని, ఆమె ఎరుగనిది కూడా ఆతడెరుగును. ఆమె నాలిక మహా చురుకు. ఎంతమాటయినా

అనెయ్యగలదని, ఆమెతో మాట్లాడిన పదిహేను-ఇరవై నిముషాలలోనూ ఆతడు గ్రహించేడు. స్వరాజ్యాన్ని అవమానం చేసి మాట్లాడితే!

పుణ్యానికిపోతే పాపం ఎదురుకావడం మాట అలా వుండగా, తనను తాను క్షమించుకోగలడా?

"వద్దు. మీరు ఎరగరేమో, వాళ్ళు ఏమన్నా అంటే...."

ఆ 'వాళ్ళు'లో భార్యను స్పష్టంగా పేర్కోలేకపోయేడు.

కూతురు ఆలోచనా ధోరణిని గ్రహించిన నాయుడికి కూడా ఆ రాయబారం ఫలిస్తుందనే ఆశలేదు.

"కాని...... నువ్వు కలగచేసుకోవడం మంచిది కాదేమోనమ్మా!"

"ఆ రోజున రామనాధంగారిని కలుసుకోడానికి ఆవిడే స్వయంగా నా సాయం కోరింది నాన్నా!"

ఆ సమాచారం రామనాధానికి కొత్త.

ఇంక అంగీకరించక తప్పలేదు. సరేనన్నట్లు మాటమార్చేడు.

"ఇంక నాలుగు రోజులే వుంది. మీరు అమలాపురం నుంచి ఇక్కడికి తిరిగి రావద్దు. సరాసరి ముంగండే రాండి" ఆ రెండు రోజులూ అక్కడే

వుండి తోటలో జరిగే వుత్సవానికి పాలెం ప్రజలను సమీకరించాలని అతడి కోరిక.

పాలెంలో హెచ్చుమంది కాపులు నివసిస్తున్నారు. వాళ్ళలో నాయుడికి బంధువులున్నారు. ఆయన మాటంటే వాళ్ళకి గౌరవమూ వుంది.

"స్వరాజ్యంగారూ! మీరూ అమ్మగారూ ఆ రోజున సభకి పాలెపు ఆడవాళ్ళని తీసుకురావాలి సుమండీ!"

ప్రొద్దుటే బయలుదేరే వేళకి తోటలో పనులు పురమాయిస్తున్న స్వరాజ్యం వద్ద సెలవు తీసుకుంటూ మరోమారు జ్ఞాపకం చేసేడు.

"మిమ్మల్ని అవమానిస్తారేమోననే నా భయం. అదే జరిగితే వాళ్లనీ జీవితంలో..."

అతని భయానికి స్వరాజ్యం నవ్వేసింది. "ఏమీ పర్వాలేదండీ."

ఇరవైమూడు

గుమ్మంలో ఆగిన రెండెడ్ల బండి చప్పుడు విని వంటింట్లో అన్నపూర్ణమ్మా, గదిలోంచి సుందరీ, మంగమ్మా ఒక్కమారే సావట్లోకి

వచ్చేరు.

స్వరాజ్యం మెట్లు ఎక్కుతూ నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేసింది.

"డాక్టరుగారి దగ్గరకు ఓమారు వచ్చాం. ఓమారు మిమ్మల్ని చూసి పోదామని ఇల్లా వచ్చాను."

వాళ్ళ నాన్నగారి యోగక్షేమాలు అడుగుతూ అన్నపూర్ణమ్మ లోనికి దారితీసింది.

సూరాయి బండిలోంచి ఒక అరటిగెల తెచ్చి వరండాలో పెట్టాడు.

"మా దొడ్లో చెట్టున మగ్గిన గెల. లోపల పెట్టించండి" అంటూ స్వరాజ్యం నిలబడింది.

"ఎందుకమ్మా ఇది తెచ్చేవు?" అంటూ అన్నపూర్ణమ్మ పనిమనిషిని పిలిచి గెల లోపల పెట్టించింది.

సుందరి తన మిత్రురాలికి మంగమ్మను పరిచయం చేసింది.

"ఈవిడను ఎరుగుదురా? మా పెద్దతల్లిగారి కూతురు మంగతాయారు."

"వీరేశలింగంగారి వుద్యమం గురించి వచ్చినప్పుడు రామనాధం ఒకటి రెండుమార్లు చెప్పింది ఈవిడను గురించేనన్నమాట" అనుకొంది

స్వరాజ్యం.

అన్నపూర్ణమ్మ గెలలోంచి బాగా మగ్గిన అరటిపళ్ళు ఓ పది పళ్ళెంలో పెట్టి తీసుకువచ్చింది.

"సుందరీ, ఒక చెంబుతో మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా!"

"ఇంకేం వద్దండీ, బండిలో ఇంకా వున్నాయి మాకు" అంటూ స్వరాజ్యం మర్యాదకు ఒక్క పండు తీసుకొని పక్కన పెట్టుకొంది.

పడుచు వాళ్ళను ముగ్గురినీ కబుర్లు చెప్పుకొనేటందుకు వదలిపెట్టి మాణిక్యమ్మ పని చూసుకొనేటందుకు లోనికి వెళ్ళింది.

స్వరాజ్యం నెమ్మదిగా కబుర్లు ముంగండ వేపు తిప్పింది.

"మీ వూళ్ళో మంచి హడావిడిగా వున్న సమయంలో మీరిక్కడ వున్నారే?" అని మంగమ్మను కదిపింది. ఆమె చేత అస్పృశ్యులను

రామనాధం తన తోటలో నూయి నీరు తోడుకోనివ్వడానికి తలపెట్టిన కార్యక్రమాన్ని వివరంగా చెప్పించింది. మంగమ్మ రామనాధానికి ఆ

యింట్లో వున్న గౌరవ స్థితి ఎరిగి వుండటంచేత అతని పేరును తలపెట్టకుండానే కబుర్లు చెప్తోంది. సుందరి ఆ మాటలలో ఏమాత్రం

ఆసక్తి కనబరచకపోయినా కదలలేదు.

"మేం వస్తూంటే అంబాజీపేటలో కనిపించేరు. అన్నట్లు మరిచిపోయాను" అంటూ స్వరాజ్యం అప్పుడే గుర్తుకువచ్చినట్లు లేచింది. ఇప్పుడే

వస్తున్నానంటూ బండి వద్దకు పరుగెత్తుకు వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి ఆ ఇద్దరి ముఖాలు ఎర్రబడి వున్నాయి. కాని

గమనించనట్లే తాను తెచ్చిన కవరు ఒకటి సుందరి చేతికిచ్చింది.

"ఏమిటిది?" అంటూనే ఆమె అందుకొంది.

"నాకూ తెలియదు. చూడలేదు. ఏదో దస్తావేజు అన్నారు. అమలాపురం వెడుతున్నానంటే మీకు ఇవ్వవలసిందన్నారు."

"ఎవరు?" అంది మంగమ్మ.

"వారి భర్తగారు."

సుందరి చేతిలోని కాగితాలను పక్కనున్న టేబిలు మీద పడేసింది.

"ఏమిటో చూసుకోరూ?"

"ఏముంటుంది? ఏవో మదపిచ్చి వ్రాతలయి వుంటాయి."

స్వరాజ్యం గతుక్కుమంది. మంగమ్మ తెల్లబోయింది.

"ఏం మాటలే అవి?" అంది.

"నీకంత సరదా వుంటే చదువుకో" అంది సుందరి.

"తప్పు తప్పు" అని స్వరాజ్యం మందలించింది.

"ఈ వుత్తరాలు మోయడం మీకు అసహ్యంగా లేదూ?"

స్వరాజ్యం తేరుకుని బహు తాపీగా సమాధానం ఇచ్చింది.

"రామనాధంగారిని బాగా ఎరుగుదును. ఆయన నోట సిగ్గుపడవలసిన మాట ఎన్నడూ వినలేదు. నేను పట్టుకురావడానికి

సిగ్గుపడవలసిన కాగితాన్ని ఆయన తన భార్యకు పంపుతారనుకోను" అంది.

ఒక నిముషం ఆగి మళ్ళీ అంది.

"మీ నాన్నగారు వచ్చేక ఇవ్వండి."

ఏడెనిమిది నెలల క్రితం భర్త తనకు ఇచ్చిన ఉత్తరాన్ని తండ్రికిచ్చిన ఘటనను ఎగతాళి చేసినట్లు సుందరి ఉడికిల్లింది.

"మీ ఇద్దరికీ పరిచయమూ, స్నేహమూ వున్నదని ఆయనక్కూడా తెలియాలా?"

"ఆ, ఆ" అంది మంగమ్మ.

"ఆ మాటలు వింటూంటే ఆమె వయస్సును గురించీ, అమాయకత్వం గురించీ తనకు గల అభిప్రాయం తప్పేననిపించింది స్వరాజ్యానికి. కాని

కోపం తెచ్చుకోలేదు.

"బ్రాహ్మలం కాదు గదా తల్లీ! అల్లాంటివన్నీ మాకేం తెలుస్తాయి? మగడు భార్యకు పంపే కాగితాలు తేవడం తప్పని తెలియదు.

తప్పు పట్టుకోకండి."

సుందరికింక అక్కడ వుండాలనిపించలేదు. మర్యాద కూడా మరచి చరచరా వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తనకు మంగమ్మ ఎంతో

సిగ్గుపడింది. బయలేదేరడానికి లేచిన స్వరాజ్యాన్ని అనునయిస్తూ "ఏమనుకోకండి" అంది.

"ఇందులో ఏం అనుకోడానికేమిటుంది? సెలవు."

"ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఇదో జబ్బు. ఎంతెంత మాటలూ అనేస్తారు" అంటూ మంగమ్మ గొణిగింది.

స్వరాజ్యం చిరునవ్వు నవ్వింది. మాట మారుస్తూ--"మీ వూళ్ళో మీటింగు రోజుకి రారూ?" అంది.

"మధ్యాహ్నం వెళ్ళిపోతాను."

"మేము ముంగండే వెడుతున్నాం. సభలయ్యేవరకూ అక్కడే వుంటాం."

"అయితే అక్కడ మళ్ళీ కలుసుకుంటాము."

"మేమయినా పొద్దు వాలే వరకూ బయలుదేరం. వస్తే మా బండిలో రాండి. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పోవచ్చు."

మంగమ్మకది ఇష్టమే. కాని ఎల్లా సాధ్యపడుతుంది?"

"బయలుదేరేటప్పుడు సూరాయిని బండిలో పంపుతాను."

"మా పిన్నితో చెప్తాను."

"నేను వెడుతున్నానని కూడా చెప్పండి."

మంగమ్మ లోపలికెళ్ళింది. అన్నపూర్ణమ్మ వస్తూనే అడిగింది.

"అప్పుడే వెళ్ళిపోతున్నారా? వచ్చారు. వెడుతున్నారు. కూర్చుని మాట్లాడ్డానికేనా పడలేదు. ఏది సుందరి? బొట్టు పెట్టుకు మరీ

వెళ్ళండి."

స్వరాజ్యం చిరునవ్వుతో అంది.

"ఆమె భర్తగారు నా చేతికి ఓ దస్తావేజు ఇచ్చి పంపేరు. స్వయంగా తెచ్చి ఇవ్వాలిగాని మధ్య ఈ దాసీ వ్యవహారం ఏమిటని

ఆమెకు కోపం వచ్చింది."

సుందరి భర్త మాట వచ్చేసరికి అన్నపూర్ణమ్మ ఉలికిపడింది.

"దస్తావేజు ఏమిటి? దాసీతనం ఏమిటి?"

పది రోజుల క్రితం కొడుకు ముంగండ వెళ్శి వచ్చానంటూ, అల్లుడు ఏవో భూముల వ్రాతకోతలు గురించి మాట్లాడాడని చెప్పినట్లు గుర్తు

వచ్చింది. కానీ దాని గురించి తామెవ్వరూ పట్టించుకోలేదు.

"దస్తావేజు ఏమిటి?" అంది మళ్ళీ.

"అదిగో టేబిల్‌ మీద వుంది, చూసుకోండి. సెలవా!"

ఆ మాట పూర్తికాకుండానే లోపలి నుంచి సుందరి విసవిసా వచ్చి టేబిలుపైనున్న కవరును గుమ్మంలోకి విసిరేసింది.

"మాకెవ్వరూ మనోవృత్తులివ్వక్కరలేదు. మేమంత గతి లేకుండా లేము" అంది.

ఆ రోజున కొడుకు మాటమీద తండ్రి యిచ్చిన సమాధానమే అది. అయితే ఆ మాటలు కూతురి నోట రావడం అన్నపూర్ణమ్మకు

నచ్చలేదు. కాని ఏమీ అనలేదు.

స్వరాజ్యం తన కాళ్ళ వద్ద పడి వున్న కాగితాలను చూడను కూడా లేదు. ఎడ్లను బండికి పూన్చమని సూరాయికి పురమాయించింది.

"బండి తిప్పరా."

--పురమాయిస్తూనే వెనక్కి తిరిగింది.

"కాగితాలను వీధిలో పారేసినా ఇంకేమీ జరగదు. ఆయన చేసే పనేదో బ్రహ్మ భేద్యంగా చేశారు. భూమి మీ పేర వ్రాసెయ్యడమే

కాదు, పట్టా ట్రాన్స్‌ఫర్‌ కూడా అయిపోయిందనీ, ఇంక ఈ ఏడు పంట కూడా మిమ్మల్నే చూసుకోమని

చెప్పమన్నారు. ఇప్పుడాయన తీసుకోవాలన్నా సాధ్యపడదు. అక్కర్లేకపోతే మీ చేత్తోటే తోసి పారేసుకోవాలి. అంతే..."

రెండడుగులేసింది. ఈమారు మంగమ్మతో అంది.

"జాము పొద్దువేళకి బండి పంపుతాను. సిద్దంగా వుంటారు కదూ?"

మంగమ్మ పినతల్లి ముఖం వంక చూసింది.

"మీకు లేనిపోని ఇబ్బంది కాదూ?" అంటూనే ఆమె సరేనంది.

మళ్ళీ అంతలో "మీరు ముంగండే వెడుతున్నారుట కదూ" అని వాకబు చేసింది.

"ఔనండి మీ అల్లుడుగారి తోటలో పెద్ద సభ జరుగుతుంది. నాయకులెవరో వస్తున్నారు. చూడాలని సరదా--సరే సెలవా మరి? అంత

పొద్దు వేళ మళ్ళీ....." అంటూ స్వరాజ్యం బండి ఎక్కింది. బండి కాలవగట్టు రోడ్డు ఎక్కేవరకూ ముగ్గురూ అక్కడే

నిలబడ్డారు.

అన్నపూర్ణమ్మ ఒక్క నిట్టూర్పు విడిచింది.

"ఆ కాగితాలు తీసి నాన్నగారొచ్చేక ఇయ్యి. గోదావరి జిల్లావాళ్ళు చచ్చి కూడా సాధించే రకం. ఏం తెస్తారో ప్రాణానికి....."

ఇరవైనాలుగు

తెల్లవారేసరికి తోట ముందు గుర్రపు బండీలోంచి దిగిన రంగనాధరావు దంపతులను చూసి రామనాధం చాలా ఆశ్చర్యపడ్డాడు. వారు

ప్రత్యేకంగా మరునాడు జరిగే కార్యక్రమాలలో పాల్గొనేటందుకే వస్తున్నారని వినేసరికి ఎంతో సిగ్గుపడిపోయాడు. అతడు వారికి

ఆహ్వానపత్రిక వ్రాయనే లేదు.

"పత్రికలో చదివేరు. ఆనాటి నుంచీ ఒకటే పాట" అంది గురుపత్ని మల్లికాంబ.

"ఇదో పెద్ద ఘనకార్యంగా భావించలేదు" అంటూ రామనాధం ఆహ్వానించనందుకు క్షమాపణ చెప్పుకుంటున్నట్లు సమాధానం ఇచ్చేడు.

"నో, నో..... అల్లాంటిదేం పెట్టుకోకూడదు. ఒక మంచి పని చేస్తున్నావు, నిన్నభినందించాలనిపించింది" అన్నాడు రంగనాధరావు.

"నా మీద తమకటువంటి దయ వుంది" అని రామనాధం వినయం తెల్పేడు.

ఆ దంపతులకి తన పాక గదిలో విడిది ఇవ్వడం తప్ప రామనాధానికి మారు మార్గం తోచలేదు. ఆయన కూడా సంఘ బహిష్కృతుడు.

తాను జైలుకు వెళ్ళినందుకూ, ఆయన విదేశాలకు వెళ్ళినందుకూనూ. నాగేశ్వరరావు గారికైతే పెదతండ్రిగారి ఇంట బస ఏర్పాట్లు

చేస్తున్నారు. అక్కడే వీరికి కూడా ఏర్పాట్లు చేయడం తప్ప మరో మార్గం లేదు. కాని, విశాలాక్షి మీద ఇంతమంది భారం

పెట్టడానికి సందేహం. ఆమె ఒంటరిది. పైగా ఆమె కూడా మడీ, ఆచారం బోలెడు పాటించవలసిందని ఇతరులను బాధించదు కాని తాను

ఆచరిస్తుంది. ఆ యింట్లో గురుపత్నిని ఎలాగ వుంచడం? తాము మగవాళ్లు గనక వంటయింట్లోకి వెళ్ళరు. కాని ఆడవారిని

వంటయింట్లోకి రావద్దని గుమ్మం బయట నిలబెడితే ఎంతో చిన్నతనం అనిపిస్తుంది. ఆ విషయంలో ఆచారం పట్టింపు లేదని మగవాళ్ళ

దగ్గర నటించినట్లు ఆడవాళ్ళ దగ్గర నటించడం సాధ్యం కాదు.

గురుదంపతులకు తోట అంతా చూపి తీసుకువచ్చేక తెచ్చాడు అసలు సమస్య.

"ఇదే నా యిల్లు మేష్టారూ! ఇక్కడ మీకు ఏం సౌకర్యం చూపగలను? మా అక్కగారింటికి తీసుకువెడతా."

రంగనాధరావు "నో, నో" అని ఖచ్చితంగా నిరాకరించేడు. మల్లికాంబ భర్తను బలపరచింది.

"వద్దు రామనాధం! మీ గురువుగారు నీతో ఒకరోజు గడపాలని వచ్చారు. నీతోనే కలో గంజో....."

యూరోపియన్‌ పద్ధతులలో కొంతవరకు జీవిత పద్ధతులను అలవాటు చేసుకొన్న ఆ దంపతులు చెట్టు క్రింద కాపురం ఎలా

వుంటుందో ఆరోజున రుచి చూశారు. నిత్యం ఆ పద్ధతికే అలవాటు పడినవాళ్ళలా కొత్తదనమే అనుకోలేదు. రంగనాధరావు ఆ రోజంతా

బాలకృష్ణను వెంటేసుకుని ఊరంతా తిరిగి వచ్చేడు. బాలకృష్ణతో సమంగా తోటలోని గోదాలో పిల్లిమొగ్గలు వేసేడు. బట్టలు మాపుకొని

వచ్చేడు.

సాయంకాలం మాసిన బట్టలు చూపి, ఆ రోజు ఆడిన ఆటలు వర్ణిస్తూ రంగనాధరావు విరగబడి నవ్వుతూంటే రామనాధం

ఆశ్చర్యపడ్డాడు.

ఆ రెండు రోజులూ అతనికి అన్నీ ఆశ్చర్యంగానే కనిపించాయి. తాను వూహించి వుండని విధంగా పనులన్నీ సాగిపోతూంటే ఆశ్చర్యమే.

కాశీనాధుని నాగేశ్వరరావుగారు వచ్చేరు. ఆయన్ని పలకరించేవాడుండడేమోనని మొదటి నుంచీ రామనాధం దిగులు. కాని, ఆయన మత్తుమందు

చల్లినట్లు ముంగండ బ్రాహ్మణ్యాన్ని తన చుట్టూ తిప్పుకున్నారు.

నూతిని పంచమపేటలవాళ్ళు తోడుకొనేటందుకు ప్రారంభోత్సవం జరిగించడానికై వూళ్ళో యువకులు ఆయన వెంట పెద్ద వూరేగింపుగా వచ్చేరు.

తానూ పది మంది మిత్రులూ మాత్రం వుంటారనుకొన్నది నలభయి యేభయి మంది ఆయన వెంట వచ్చేరు. రాజవీధి వెంట వెడుతూంటే రెండు మూడు

యిళ్ల వద్ద దండలు వేసి హారతులిచ్చేరు.

మధ్యాహ్నం పెదతండ్రిగారి యింటి వద్ద విందు సమయంలోనూ అంతే. తానూ రంగనాధం దంపతులూ తప్ప నాగేశ్వరరావుగారి పంక్తిని

వేరెవ్వరూ వుండరని అతని అభిప్రాయం. చివరకు పెదతండ్రి విశ్వనాధం కూడా వడ్డన నెపంతో తమ పంక్తికి రాడని అతని వూహ.

కాని, తన స్నేహితులే ఓ అరడజను మంది తమ పంక్తికి వచ్చేరు. విశ్వనాధం కూడా కూర్చున్నాడు. సాంబావధాని తమకు వడ్డన.

ఊళ్ళో పెద్దలు పదిమంది తాము భోజనాలు చేస్తూంటే సావట్లో కూర్చుని వున్నారు. ఈ అనాచారాన్ని ముంగండ పండితులు

ఆశీర్వదిస్తున్నారా?

ఆ మాట వచ్చినప్పుడు శివకామయ్య నవ్వేశాడు.

"డబ్బురా నాన్నా! డబ్బు, నాగేశ్వరరావుపంతులుగారు ప్రొద్దుట ఓ అరడజను మంది శాస్తుర్లుగార్లకి తలో రూపాయి

పడేశారు....."

రామనాధానికి ఆ మాట నమ్మతగిందిగా తోచలేదు.

"నివాళులిచ్చిన వారికి హారతి పళ్ళెం వేశారా?"

లేదు.

"సభకు వచ్చినవారికి దక్షిణ ఇచ్చేరంటావా?"

లేదు.

"ఈ మధ్యన తోటలో చిరుతిండి చేసుకునే కార్యక్రమాలన్నీ మూతబడ్డాయి. ఎందుచేతనో ఎరుగుదువు. వాళ్ళే ఈవేళ నా ప్రక్కన

కూర్చున్నారు కదా."

ఔను.

"వీళ్ళందరికీ దక్షిణ తాంబూలాలు ముట్టేయా?"

లేదు.

"అందుచేత డబ్బు ఆశ కాదు కారణం, ఈ మార్పుకి."

మరి?

ఇద్దరికీ ప్రశ్నలే గాని సమాధానాలు దొరకనేలేదు.

ఇరవయ్యయిదు

కొల్లాయి గట్టితే నేమి? · 第 17 / 22 段