కామేశ్వరరావు సలహా వేరు.
"వాళ్ళనే చెర్లో ముంచుకు పొమ్మంటే వదిలిపోతుంది.
రామన్న దానికి అభ్యంతరం చెప్పేడు. శాస్త్రీయంగా భిన్న కులాల మధ్య వుందనుకొనే హెచ్చుతగ్గుల్ని ఆతడు విశ్వసించడు. ఈ
అస్పృశ్యత మూలంగానే దేశ ప్రజలలో కొందరి సహాయం విదేశీ పాలకులకు లభిస్తూందనేది అతని అభిప్రాయం. కాని--
"వూరివాళ్ళ మాటేమిటి?" అని అతని ప్రశ్న.
"ఓ కడివెడు నీళ్ళ కోసం పడిగాపులు పడివుండడంతో పనివాళ్ళు పనుల్లోకి ఆలస్యంగా వస్తున్నారు."
అని సూరప్ప నీళ్ళ సమస్య పరిష్కారం కావలసిన అవసరానికి ఆర్థిక కారణం చూపించేడు.
"అంతేనా, ఆ పూట పని ఎగగొట్టాలనిపించినప్పుడు నాలుగు అరిటాకులు కోసి కట్టకు వచ్చి అటు రోడ్డుమీదనో, ఇటు కొట్లోనో,
అటు చెరువుగట్టునో నిలబడి కేకలు ప్రారంభిస్తున్నారు. ఆ కేకలు ఎవరికి వినిపిస్తాయి? ఎవరి ద్వారానో మళ్ళీ ఊళ్ళోకి
కబురు చెయ్యాలి. కబురు పట్టుకెళ్ళిన వాళ్ళు మరచిపోకుండా వుండాలి. ఇంటి వాళ్ళు రావాలి. ఇంక ఆ పూటకి మనిషి కూలి
చెడిందనుకున్నా పని జరగడమే లేదు." అన్నాడు కామేశ్వరరావు. స్థూలంగా అస్పృశ్యతను పాటించడం వలన కలుగుతున్న
ఇబ్బందుల్ని వుదహరిస్తూ.
రామనాధం ఇంకో దిశనుంచి తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి ఆశ చూపించేడు.
"గాంధీగారు అస్పృశ్యతా నివారణ గురించి చెప్తున్నారు. మన వూళ్ళో ఓ చిన్న పనిచేసి మన శాయశక్తులా ఆయన కృషికి
తోడ్పడదాం" అన్నాడు.
ఆ చిన్న పని, చెరువులో నీళ్ళని అస్పృశ్యులు ముంచుకొని పోయేటందుకు వదిలిపెట్టించడము.
ఏ కాశీనాథుని నాగేశ్వరరావుగారినో, ఉన్నవ లక్ష్మీనారాయణగారినో రప్పించి అస్పృశ్యులకు ఊరి చెరువులో నీరు ముంచుకొనే
అవకాశానికి ప్రారంభోత్సవం చేయిస్తే మరీ అద్భుతంగా వుంటుందని కామేశ్వరరావు సలహా.
"నాగేశ్వరరావుగారినే పిలుద్దాం. ఆయనే అయితే తమ ఖర్చులు తామే పెట్టుకు వస్తారు. ఆంధ్రపత్రిక ఆయనదే కనక పత్రికలో
ఆ వార్త బాగా వేస్తారు"
--అంటూ హెచ్చు ఖర్చులేకుండా ముంగండకి కలిగే పేరు ప్రతిష్ఠలను అతడు వర్ణించేడు.
రామన్న నాగేశ్వరరావుగారినో, మరొకరినో పిలిచే అభిప్రాయాన్ని అభినందించేడు.
"ఆమధ్య గుంటూరులో జరిగిన ఆంధ్రమహాసభలో వారిని కలుసుకొన్నాను. విశ్వనాధంగారు పరిచయం చేశారు. పిలిస్తే వారినే పిలవాలి.
కాని......"
చెరువులో అస్పృశ్యులకు ప్రవేశం ఇవ్వాలంటే అది ఊరు ఉమ్మడి వ్యవహారం అని అతని ఆటంకం.
"ఈశ్వరుడి పెళ్ళికి ఊరందరం పెద్దలమే" అని కామేశ్వరరావు తమకందరికీ ఆ ఉమ్మడి వ్యవహారంలో వాటా, హక్కూ వున్నదని
నిరూపించేడు.
శివకామయ్య అంగీకరించలేదు.
"ఇప్పటివరకూ వూళ్ళో పార్టీలంటూ లేకుండా నడిచిపోతూంది."
సూరప్ప అతనిని సమర్థించేడు.
"లేనిపోని పేచీలు తెచ్చి వూళ్ళో చిచ్చుపెట్టకండి" అన్నాడు.
అనేక సలహాలు, అభ్యంతరాలూ మధ్య సమస్య ఎక్కడిదక్కడే నిలిచింది.
"నీదీ నాదీ అయితే నా యిష్టం అనొచ్చుగాని" అంటూ శివకామయ్య తన అభ్యంతరాన్ని వివరిస్తూంటే చటుక్కున రామనాధం
అందుకున్నాడు.
"పోనీ, మా నూతిలోంచి తోడుకుపొమ్మందాం...."
రామన్నకు ఆ ఆలోచన అభ్యంతరం కాదు. కాని ఆలోచిస్తే గాని అడుగు వెయ్యడానికి ఇష్టపడలేదు.
"ఉండు. తొందరపడకు. ఆలోచించుకోనీ......"
పదిహేడు
వారి ఆలోచనలు తేలక పూర్వమే గ్రామంలో గగ్గోలు బయలుదేరింది. ఆ రోజు సాయంకాలమే సాంబావధాన్లు పెద్ద పావంచాల రేవులో
నిలివెడు బాణాకర్రతో పరవళ్ళు తొక్కేడు. గట్టుమీద కర్రతో తాటిస్తూ గంతులేస్తున్నాడు.
"చెరువులో దిగితే పుర్రెలు ఎగిరిపోతాయి."
ఆ కేకలు విని రాట్టం వడుక్కుంటూన్న వాడల్లా ఏమిటోనని రామనాధం తోటలోంచి బయటకు వచ్చేడు. కర్రతో పరవళ్ళు తొక్కుతున్న
సాంబావధాన్లని చూసి ఏమిటో గొడవ కనుక్కోవాలి అనిపించింది. హడావుడిగా పెద్ద రేవు వేపు నడిచేడు.
అతన్ని చూస్తూండగానే అవధాని కంఠం ఖంగుమంది.
"నాలుగెకరాల భూమి వుండే సరికి క్రిందూ, మీదూ కనబడ్డం లేదు."
రామనాధానికి విషయం ఏమిటో తెలియలేదు. అడిగేడు.
"ఏమిట్రా బావా?"
అవధాని మరోమారు తన ప్రతిజ్ఞ వినిపించేడు.
"ఇదేం, తడాఖా, ఏమనుకుంటున్నారో, కొబ్బరి పుచ్చెల్లా ఎగిరి పోవలసిందే."
ఆవేశం చూస్తే రామనాధానికి నవ్వు వచ్చింది.
"భేషుగ్గా వుంది. అర్ధమయింది. పుర్రెలు కొబ్బరి పుచ్చెల్లా ఎగరగొట్టేస్తావు. కాని, అసలు సంగతి చెప్పవేం? ఎవరిది?"
అతని నవ్వు చూసి అవధాని నిర్ఘాంతపోయేడు. కోరచూపు చూస్తూ మీసం దువ్వేడు.
"అంత వేళాకోళంగా వుందేం?" అన్నట్లున్నాయి ఆ చూపులు.
అంతవరకూ చెరువులో స్నానం చేస్తూ, అవధాని కేకలూ, గంతులూ విని ఆనందిస్తున్నవాళ్ళొకరిద్దరు నీళ్ళలోంచే సలహా ఇచ్చేరు.
ఇదేదో కొట్లాటదాకా వస్తుందేమోనని వాళ్ళ భయం.
"ఎవరివీ లేదుగాని, ఒరేయి రామనాధం! నువ్వెళ్ళిపో బాబూ!"
ఆ సలహా విన్నాక ఆ గొడవ తనను గురించేనని అర్ధం అయింది.
సాంబావధాని ఇంకా తీండ్రంలోనే వున్నాడు.
"ఎవరివేనా సరే."
"చంపేసేవు. ఎందుకేం?"
ఈమారు సాంబావధాని గుట్టుగా వుంచలేదు. "ముంగండ ప్రతిష్ఠకి ఏమాత్రం ఘాటా వచ్చినా సరే రక్తం పారుతుంది." అని ప్రతిజ్ఞ
వినిపించేడు.
అయితే తన తోటలో బావిలోంచి తోడుకోమంటే ముంగండ ప్రతిష్ఠకి నష్టం వస్తుందా అని రామనాధం చల్లగా ప్రశ్నించేడు.
సాంబావధాని చటుక్కున చల్లబడ్డాడు కాని, పూర్తిగా నమ్మకం చిక్కలేదు.
"అంతేనా?"
"కాక, మరి!"
"అల్లా చెప్పు."
"ఏదీ, నువ్వెవరినడిగేవు? ఎవరిని చెప్పనిచ్చేవు? మొత్తం మీద కౌశిక గోత్రంవాడిననిపించేవు" అని రామనాధం ఎగతాళి చేసేడు.
సాంబావధాని అడగలేదు గాని రామశాస్త్రి అడిగేడు. సుబ్బావధాన్లు, వెంకప్ప దీక్షితులు, ఆఖరుకి బండ సుబ్బడు సహా
అడిగేసేరు. ఒకటే ప్రశ్న పలు రూపాల్లో వచ్చింది.
"తోట నూతిని మైలపరిచేస్తావుషోయ్" అన్నాడు దీక్షితులు.
"దర్భాసనాలూ, ఝారీచెంబులూ తలొకటీ ఇస్తావుటేమిటోయ్" అన్నాడు బండ సుబ్బడు. తోటలో నూతి నుంచి నీళ్ళు తోడుకోమనడం
పల్లెల వాళ్ళకి ఏదో మతం ఇవ్వడంలా కనిపించింది అతనికి.
"నుయ్యి మైలపరిచేస్తారని మీ బాబాయి ఈ తోటకి మాల పాలేరుని కూడా పెట్టలేదోయ్" అన్నాడు సుబ్బావధాన్లు.
ఇంకా ఆ విషయంలో ఓ ఆలోచన జరగలేదు. నిర్ణయం అనుకోలేదు. ఎవరి ఆస్తో కొల్లబోతున్నట్లు ఎవళ్ళకి వాళ్ళే గందరగోళం
చేసేస్తున్నారు.
రామనాధానికది సవాలులాగ కనిపించింది. నిర్ణయం చేసేసుకొన్నాడు.
"అదే అనుకుంటున్నా, మామగారూ!"
మామగారూ అన్నా, బాబాయీ అని పిలుపు తేడా తప్ప అదే సమాధానం.
"అట్లాంటి తెలివితక్కువ పనులు తలపెట్టకు"మని రామశాస్త్రి మందలించేడు.
ఏనాటి నుంచో వున్న కులాచారాల ప్రాముఖ్యం వర్ణించేడు. శరీరాంగాల ప్రత్యేకోపయోగాలను చూపించి వర్ణవ్యవస్థని సమర్థించడానికి
ప్రయత్నించేడు.
వెకిలి ఉపమానాలూ, వెర్రిమొర్రి ప్రతివాదాలూ అనవసరం అనిపించేయి.
"నిన్న రాత్రి వెంకిని తోడుకు పొమ్మన్నా" అని తన దృఢ నిశ్చయాన్ని వినిపించేడు రామనాధం.
తేలు కనిపించినట్లు సుబ్బావధాన్లు వులికిపడ్డాడు. మైలపడిపోయిన నూతి నీళ్ళతో తానా వుదయం స్నానం చేసేడేమో, ఖర్మ!
"ఏ వెంకి? వెంకి ఎవరు?"
రామనాధానికి ఆ వెంకి ఎవరో తెలియదు. చీకట్లో చూడ్డం గుర్తు తెలియలేదు. చెప్పలేకపోయేడు.
సుబ్బావధాన్లే జ్ఞాపకం చేయడానికి ప్రయత్నించేడు.
"నల్లగా.......కుదిమట్టంగా......"
చీకట్లో గట్టుమీద నిలబడి పల్లంలో వున్న మనిషిని చూడ్డం, మట్టం, రంగూ ఏం చెప్తాడు? పైగా వానా, ఎండా అనకుండా కూలి
పని చేసుకొనే వాళ్ళు నల్లబడిపోవడం అసాధారణ విషయం కాదు. ఆ యక్ష ప్రశ్నలు చూస్తే మనసు రగిలిపోయింది.
"కాదు, పొడుగ్గానే కనిపించింది. పచ్చగానే వున్నట్లనిపించింది."
మాలలలో కన్నా, మాదిగలలో పచ్చనివాళ్ళు హెచ్చు సంఖ్యలో కనిపిస్తారు. సుబ్బావధాన్లు ఆలోచన ప్రారంభించేడు.
"పెసరబద్దగాడి కూతురు కాదు కదా."
మనుష్యుణ్ణి గుర్తించడం కోసం గాక వినోదం కోసమూ, వెక్కిరింత కోసమూ సృష్టించుకొనే అనంతకోటి ఉరఫులలో రాజయ్య వంతుకు వచ్చిన
పర్యాయనామం పెసరబద్దగాడు. అతడు కులానికి మాదిగ.
రామనాధానికి ఆ వివరం తెలియదు. కనక నిశ్శబ్దంగా తలవూపేడు.
అవధాని భగ్గుమన్నాడు.
"తోడుకెళ్ళిందా లంజ......"
ఆయనను అల్లరి చేయడానికి తాను ప్రయత్నిస్తే మధ్యనెవరో అమ్మాయి తిట్టు తినడం భావ్యంగా తోచలేదు. చటుక్కున అనేశాడు.
"లేదు."
అవధాని సంతృప్తితో జంధ్యం తడుముకున్నాడు.
"ప్రశాంతంగా వుంటుందని అక్కడే స్నానం, జపం చేసుకొంటూంటాను, ఎరుగుదువుగా" అన్నాడు.
ఆయనను హుషారు చేస్తూ "ఇప్పుడు మాత్రం మీకు అడ్డు ఏమిటి మామగారూ?" అన్నాడు రామనాధం
అతడు నూయి పంచమపేట వాళ్ళకి వదిలిపెడతానన్నది కేవలం ఆటకేననిపించింది. సుబ్బావధాన్లు సంతోషపడ్డాడు.
"నువ్వు మరొకలా చేస్తావా? తులసి వనంలో గంజాయి మొక్క పుడుతుందా? శంకరశాస్త్రి తరిఫీదులో...."
ఆ అభినందన పూర్తికాకుండానే ఆయన కోసం తాను కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయించగలనని రామనాధం హామీ యిచ్చేడు.
"నీళ్ళ కోసం వచ్చే పోయే వాళ్ళతో సందడిగా వుంటుందనుకొంటే పాక వెనకాల పెద్ద వుసిరి క్రింద అరుగు బాగు చేయిస్తా."
"ఏమిటీఁఁఁఁ!"
తనంత శ్రోత్రియుణ్ని అస్పృశ్యులు మైలపరచిన నూతి నీళ్ళల్లో స్నానం చేయమంటాడా? సుబ్బావధానులు నిర్ఘాంతపోయేడు.
అంతక్రితమే అతని పెంపకాన్ని మెచ్చుకున్నంత సులభంగానూ ఇప్పుడు నిందించలేకపోయేడు.
"జైలుకెళ్ళి వచ్చేక నీకు మడీ, మైలా బొత్తిగా తెలియడం లేదోయి!"
"అదేమిటి మామగారూ! అల్లా అంటారు."
రామనాధం కంఠంలో వినిపించిన అమాయకత్వానికి అవధాని వెనక్కి తగ్గేడు.
"నేను మైలపడిన నూతి నీళ్ళలో స్నానం చేస్తాననేనుటోయ్."
రామనాధం ఆలోచనలో పడ్డట్లు ఒక నిముషం ఊరుకుని అన్నాడు.
"ఔను సుమండి. ఆమాటే తోచలేదు."
ఇద్దరూ ఒకరి ఆలోచనలను వేరొకరు పరీక్షించుకొంటున్నట్లు ఒక్కక్షణం నిలబడిపోయేరు.
"పోనీండి. పెద్ద చెరువు వుండనే వుంది. స్నానానికి నీళ్లు లేకపోయేయా?"
"అంతేనంటావు?"
"పోనీ మీరే చెప్పండి" అన్నారు. రామనాధం పల్లెవాళ్ళ నీటి అవసరాన్ని గుర్తుచేస్తూ.
"మామూలుగా పోస్తూనే వున్నావు కాదటోయ్."
ఆ స్వార్థానికి మనస్సు రగులుతున్నా రామనాధం నవ్వేసేడు.
"నాకదే వుద్యోగం అంటారు."
తన సలహాలో వినిపించిన సంకుచితత్వమూ, స్వార్థమూ అవధానికి అర్థం అయినట్లే లేదు. దానినింకా సాగతీసేడు.
"ఇంతవరకూ నువ్వే పోశావేం? ఇక్కడికిన్నేళ్లు గడిచాయి."
"నిజమేననుకోండి."
"లేకపోతే మనిషిని పెట్టుకొంటారు......"
ఆ స్వార్థం చూస్తూంటే రామనాధం అవహేళన చేయకుండా వుండలేకపోయేడు.
"ఔనండి. ఇంతవరకు తోచనేలేదు సుమండి. రేపో మనిషిని చూసి పంపిస్తాను. బేరం ఆడి కుదర్చండి.
"నెలకి ఇంటికి అణో బేడో వేసుకుంటే వాడి కూలి వెళ్ళిపోతుంది. ఎవ్వరికీ ఏ కష్టం వుండదు."
ఆ సులువు ఇంతవరకు తోచలేదన్నప్పుడు సుబ్బావధానికి కలిగిన సంతోషం ఎంతోసేపు మిగలలేదు.
రామనాధం ఆ ఖర్చు వాళ్ళ మీద వెయ్యడమేమిటన్నాడు.
సుబ్బావధాని తెల్లబోయేడు. మంచినీళ్ళు తాగేది పల్లెలవాళ్లు. కూలి తానిచ్చుకోవడం--అందులోని సబబు ఏమిటో అతనికి అర్థం
కాలేదు.
నుయ్యి గలవాళ్లు అస్పృశ్యులకు దానిని వదిలి పెడతామంటూంటే తను ఆటంకపరచడం, పైగా కూలి ఇచ్చి తోడించుకోమనడం ఏమిటో
రామనాధానికి అర్థం కాలేదు.
"నీళ్ళు చింది మళ్ళీ అందులోనే పడడానికి మళ్ళీ అదొకటా? ఇంక నుయ్యి పనేముంది? చెర్లోంచే పోస్తాడు."
రామనాధం సహనం కోల్పోయినా, మర్యాద తప్పలేదు.
"ఏం చేయడం మరి? ఊరి వారందరిదీను ఆ చెరువు. నీళ్ళు కూడా మన తాత ముత్తాతల ఆస్తి కాదు. అయినా మనం వాళ్ళని ఆ
దరిమానాలక్కూడా రావద్దంటున్నాం. పోనీ అది అగ్రహారపు సబబు అందాం. కాని, నా తోటలో వున్న నూతి నీళ్ళు వాళ్ళని
పట్టుకెళ్ళమనడానికి ఒకరి అభ్యంతరం ఏమిటి చెప్పండి? మీ సౌకర్యాల కోసం అడ్డం పెడతానంటారు. అల్లాంటప్పుడు దానికయ్యే
ఖర్చు ఇచ్చుకోవద్దూ?"
ఒక్క నిముషం ఆగి తన అభిప్రాయాన్ని కొంచెం మోటుగానే తేల్చేడు.
"సామెత చెప్పినట్లు త్రాగేవాడే తాటి పన్ను ఇచ్చుకోవద్దా?"
నిర్వాక్కుగా నిలబడిపోయిన సుబ్బావధాన్లని వదలి రామనాధం చరచరా విసురుకు లేచిపోయాడు.
పద్దెనిమిది
ప్రతిఘటన వస్తున్నకొద్దీ రామనాధానికి పట్టుదల ఎక్కువయింది.
"గాంధీగారు చెప్పినట్లు అస్పృశ్యతను వదిలించలేకపోతే మానె, కనీసం వాళ్ళకి కాసిన్ని మంచినీళ్ళకైనా మార్గం చూపించలేకపోతే
ఎల్లాగ పెదనాన్నా?"
"తప్పకుండా చెయ్యవలసినదే. అయితే...."
విశ్వనాధం సంఘ సంస్కరణ కావాలనే అంటాడు. కాని, దానికి అందరినీ కలుపుకొని రావాలి కాని, మనం ముందే గోదాలోకి
వురకకూడదంటాడు.
ఆ అభ్యంతరాన్ని రామనాధం సహించలేకపోయేడు.
"కాదు పెదనాన్నా! దీనికెక్కడో ఒకచోట హద్దు పెట్టక తప్పదు." ఎట్టకేలకు విశ్వనాధం 'సరే' అన్నాడు. కాని, మరో
మెలికపడింది.
"అయితే ఆ ప్రారంభం ఏ పెద్ద నాయకుణ్ణో రప్పించి వారి చేత చేయిస్తే మంచిది."
"ఎందుకు పెదనాన్నా! లేనిపోని ఆర్భాటం? మన తోట్లో నూతి నీళ్ళు మన యిరుగు పొరుగు వాళ్ళను తోడుకుపొమ్మనడానికి ఇంత
ఆర్భాటం నవ్వుతాలుగా వుంటుంది. చెరువులో నీళ్ళకైతే అది గాని."
కాని, విశ్వనాధం చెప్పిన ఆ ఆర్భాటం కూడా అవసరమేనని తర్వాత అనిపించింది.
మిత్రులు వొప్పుకొన్నారు. ఊళ్లో కూడా "పోనీ, కానీ" అనే స్థితికి వస్తున్నారు. కాని, పేటల వాళ్ళదే పెద్ద సందేహం
అయిపోయింది.
"ఏదో జరిగిపోతూంది పోనీండి. ఊరివారితో పేచీలెందుకు బాబయ్యా?" అని పుంతమాలపల్లి పెద్ద సుబ్బయ్యే నాన్పుడు పెట్టేడు.
అస్పృశ్యులందరికీ పుంతలలోనేనా ఇళ్ళ స్థలాలు లేవు. చాలమంది ఎవరెవరి తోటల్లోనో గుడిసెలు వేసుకొని వుంటున్నారు. నిలబడాలంటే
యజమాని దయాధర్మాల మీద ఆధార పడాలి. ఇదేమిటని వారికి కోపం వస్తే? పొమ్మంటే ఏం చెయ్యాలి?
ఊరి వాళ్ళంతా ఇష్టాపూర్తిగా 'సై' అంటే తప్ప వాళ్ళ వేపు నుంచి కదలిక కలిగేలా తోచలేదు. అప్పుడు పెద్దనాన్న మాటలోని
సత్యం అర్థం అయింది.
"ఖర్చే అనుకోరా అబ్బాయి, ఆర్భాటమే అనుకో, కాని అనవసరం కాదనుకుంటా. ఇల్లాంటి మంచి పనులు కొన్ని ఆ ఆర్భాటంలో వున్న
ఆనందం కోసమే జరుగుతూంటా" యన్నాడు ఆయన.
"అలాగే చేద్దాం" అనిపించింది.
"ఒకరోజు పెట్టుకుందాం. నవరాత్రులు వస్తున్నాయి. విజయదశమి లోపున్న ఆ తొమ్మిది రోజుల్లోనూ ఒకరోజు పెట్టుకుందాం."
దానికీ అంగీకారమే.
మిత్రులతో అదివరకే జరిగిన చర్చల దృష్ట్యా కాశీనాథుని నాగేశ్వరరావు గారిని పిలుద్దామనిపించింది.
"వారిని నువ్వెరుగుదువు గనుక నువ్వే వెడితే బాగుంటుంది."
విశ్వనాధానికి అభ్యంతరం లేదు. గాని రామనాధమే వెళ్ళడం శ్రేయమని ఆయన పట్టుదల. దానికి బోలెడు కారణాలు చెప్పేడు.
ప్రస్తుతం అస్పృశ్యులకు వదలిపెట్టే నుయ్యి రామనాధానిది.
అతడు సహాయ నిరాకరణం చేసి జైలుకు వెళ్ళేడు. అతడే వెడితే పంతులుగారు మహానందపడతారు. ఇంకేవన్నా పనులున్నా పక్కకు
పెట్టి తప్పకుండా వస్తారు.
కాని......
రామనాధం అప్పటికే రెండు మూడు పనులు నెత్తిన వేసుకున్నాడు. ఈ ప్రారంభోత్సవం అంటూ పెట్టుకొంటే కొన్ని అదనపు పనులు
తగులుతాయి.
ముంగండలో ఊళ్ళో ఇచ్చిన పాతిక ముప్పయి రాట్టాలకీ ఏకులివ్వడమూ, నూలు తీసుకోవడమూ, నేతపని కనుక్కోవడమూ లచ్చమ్మ
తీసుకుంటానంది.
"నాకూ పని లేక తోచడం లేదు బాబూ! ఎప్పుడేనా కాస్త చూసుకొంటూండు, నేనే ఆ పని చూస్తా" అంది.
చెరువులో నీరు పల్లెలవాళ్ళ కడవలకి పోసే పని రామన్న తీసుకుంటానని ముందుకు వచ్చేడు.
కాని అతడికి చిన్న చిన్న కమిషను వ్యాపారాలున్నాయి. వున్నట్లుండి పని తగులుతే, షావుకారు పనిమీద వెళ్ళిపోతూంటాడు.
కాని సూరప్ప, శివకామయ్య తమ సంసిద్ధతను తెలిపేరు. సూరప్ప అతని ఎదురుగానే అంగోస్త్రం నడుముకి బిగించేడు.
"రాత్రీ, పగలూ చెట్టుకిందే కూర్చుంటా, నీకెందుకు పోయిరా."
"చీకటి పడ్డాక కాస్త పాట పాడుకుంటూ కూర్చో" అన్నాడు శివకామయ్య.
లేకుంటే ఎవళ్ళేనా దయ్యమని జడుసుకుంటారన్నమాట అనకుండానే అర్థమయింది. నలుగురూ నవ్వేరు. సూరప్పది చిక్కని నలుపు. ఆ
నల్లని ముఖాన నవ్వు విరిసినప్పుడు ఎర్రని ఇగుళ్ళూ, తెల్లని పళ్ళూ చాలా భయంకరంగా వుంటాడని మిత్రులు అతనిని ఎగతాళి
చేస్తుంటారు.
అదీ తేలిపోయింది.
నూతి చుట్టూ ఇటిక పరిపించడం, సిమెంటు చేయించడం, గిలకలు వేయించడం బాధ్యతలు విశ్వనాధం తీసుకొన్నాడు.
"దసరా సెలవులిస్తారు. బాలకృష్ణ వస్తాడు. తోరణాలూ, అలంకారాలూ వగైరా పనులన్నీ వాడు చూస్తాడు" అంటూ విశాలాక్షి అతడికి
మరో అత్యవసర విషయం గుర్తు చేసింది.
"శాస్త్రి బాబయ్యతో చెప్పేవా?" అని గుర్తుచేసింది.
విశ్వనాధం "ఔనౌను" అన్నాడు.
"తీరా నాతో చెప్పలేదని ఆయనంటే లేనిపోనిది అదో గొడవ."
"అదేం మాటలే, ఆయనతో చెప్పకుండానా?" అంది విశాలాక్షి.
"లేనిపోని పట్టుదలకు పోకు. వెళ్ళి చెప్పు" అని ప్రోత్సహించింది.
పందొమ్మిది
"రా, రా. ఎక్కడా కనబడ్డం లేదు. వూళ్ళోనే వున్నావా? నిన్న తోట్లోకి వచ్చేను. కనపళ్ళేదు" అంటూ శంకరశాస్త్రి
రామనాధాన్ని సాదరంగా ఆహ్వానిస్తూనే, భార్యను పిలిచేడు.
"ఏమే, అబ్బాయి వచ్చేడు. ఏవీ, కొంచెం వేపుడు బియ్యానికి కొంచెం కారం రాసి పట్టుకురా."
రాజమ్మ వచ్చింది. "ఇన్ని రోజులకి తీరిక చిక్కిందిరా" అని నిష్ఠూరమాడుతూనే కుశల ప్రశ్నలు వేసింది.
"మీ బావమరిదికి ఏదో వుత్తరం వ్రాశావన్నారు. వాళ్ళ నుంచి ఏమన్నా సమాధానం వచ్చిందా?" అని ఆమె సంసార వ్యవహారాలను
గురించి ప్రశ్నలు ప్రారంభించింది.
"ఏం చేస్తున్నావు? ఎప్పుడో ఓమారు చేనిగట్టుకేనా వెళ్లి వస్తున్నావా? పోయి చూసుకుంటూండాలి. అన్నీ పనివాళ్ళమీద
వదిలెయ్యకూడదు. మూల చేను రెండోమారు కలుపుకు వచ్చిందనుకుంటాను" అంటూ శంకరశాస్త్రి పొలాలకూ, పంటలకూ సంబంధించిన కుశల
ప్రశ్నలు సాగించేడు.
ఆ దంపతులు కుశల ప్రశ్నలూ, లోకాభిరామాయణం మధ్య శంకరశాస్త్రి ఒక కొత్త ప్రతిపాదన తెచ్చేడు.
"వేద సంస్కృత పాఠశాల ఒకటి నడిపించాలని అనుకుంటున్నాం వూళ్ళో. ప్రశాంతంగా వుండే విశాలమైన చోటు కావాలి. వూరికి దగ్గర్లో
వుండాలి. పూర్వకాలపు ఆశ్రమాల పద్ధతిలో నడపాలని ఆలోచన.... ఆ సౌకర్యాలన్నీ వున్నది నీ తోట కనిపించింది...."
ముంగండ వేదశాస్త్రాలకి పుట్టినిల్లని పేరుంది. దక్షిణామూర్తి శాస్త్రులు గారూ, లక్ష్మీనారాయణ దీక్షితులుగారూ వంటి మహా
పండితులూ, ఋగ్వేద స్వాధ్యాయపరులూ ఇప్పుడు లేకపోయినా వారి శిష్యకోటి వున్నారు. వ్యాకరణ కేసరి అని పిలిపించుకొంటున్న
ఉమామహేశ్వర శాస్త్రి గారున్నారు. పండిత ప్రకాండులు బోలెడందరున్నారు. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వస్తున్నారు. ఏ
వారాలు చేసుకొనో, మధుకరము ఎత్తుకొనో తింటూ చదువుకొంటున్నవాళ్ళూ వూళ్లో ఏ రోజూ పదిహేను, ఇరవైమంది వుంటూనే వున్నారు. ఎవరి
ఇంటి అరుగు మీదనో కాలక్షేపం చేస్తున్నారు. చెరువుగట్టుమీది రావిచెట్ల క్రింద కూర్చుని పాఠాలు చింతన చేసుకొంటున్నారు.
ఇప్పుడు చేయదలచిందల్లా దానికో పాఠశాల రూపం ఇవ్వడం!
ఆ ప్రతిపాదన వివరాలు చెప్తూవుంటే రవీంద్రుని శాంతినికేతనమూ, పూర్వకాలపు గురుకులాలూ రామనాధం మనస్సులో మెదిలేయి.
ఆటంకాలనూహించలేని పడుచుదనపు భావనాబలం అతనిని వూహాలోకాలలోకి తీసుకు పోయింది. పెద్ద వుసిరిచెట్టు క్రింద కూర్చుని కౌముది
పాఠం చెప్తున్న శాస్త్రులుగారూ, పుంతమూల మామిడి కొమ్మల పంగల్లో కూర్చుని వాక్య పఠనం చేస్తున్నవాళ్ళూ మనోనేత్రం ముందు
మెదిలేరు. ఒకరి చదువుకు ఒకరు ఆటంకం కానక్కర్లేదు. బోలెడంతచోటు. బోలెడన్ని చెట్లు. తన తోట ఒక శాంతినికేతనం, ఒక
గురుకులం అవుతుందన్న ఆలోచనే అతనిని ఉక్కిరిబిక్కిరి చేసేసింది.
భారతీయ పద్ధతిలో విద్యాబోధన ఎంత చౌక! ఎంత నిరాడంబరం! ఎంత సులభం! అని మహానందపడిపోయేడు.
పాఠశాలకి భవనాలు అక్కర్లేదు. గురువులకు జీతాల పనిలేదు. శిష్యకోటికి ప్రత్యేక భోజనపుటేర్పాట్లు చేయవలసిన పనిలేదు.
వర్షాకాలంలో కాస్త ఆస్తరణ వుంటే చాలు....
"దానికేముంది మహా...."
రామనాధం సరేనంటే--
"ఏ పుణ్యాత్ముడో ఆ వేళకి ముందుకు వస్తాడు. 'దేశో విశాలః ప్రభవోప్యనంతాః...' " అన్నాడు శంకరశాస్త్రి.
అస్పృశ్యులకు తోటలో నూయి వదిలేటందుకు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారిని తీసుకురావాలనుకొంటున్న వార్త చెప్పగానే
శంకరశాస్త్రి ఎగిరి గంతేసేడు.
"చూసేవా. దేవుడు మన ప్రయత్నాలను ఆశీర్వదిస్తున్నాడనుకోవాలి" అని శాస్త్రి అభిప్రాయం తెలిపాడు.
లేకపోతే రామనాధానికి కాశీనాధుని వారి పేరు ఎందుకు తోస్తుంది? ఆయనే ఓ రెండు పాకలు వేయించేస్తారు. ఆయనే పాఠశాలను
ప్రారంభిస్తారు...
ఆ వుత్సాహంలో మధ్యన పంతులుగారిని తీసుకువచ్చే వుద్దేశం భిన్నమని గుర్తుకు వచ్చింది.
"ఔను గాని, పాఠశాల అక్కడ పెట్టుకొనేటట్లయితే నుయ్యి పల్లెలవాళ్ళకివ్వడం ఎల్లా వీలవుతుంది?" అన్నాడు.
అనేకానేక అభ్యంతరాలు.....
వేద పఠనం అస్పృశ్యుల చెవిని పడకూడదు. మహాపాపం!
అస్పృశ్యులు మైలపరచిన నూతి నీటిని వేదవేదాంగ విధులయిన పండితులూ, వారి శిష్యులూ వుపయోగిస్తారా? అది ధర్మ భాహ్యం కాదూ!
ఆ అభ్యంతరాలు రామనాధానికి తోచనిమాట నిజం. కాని, తనకో పెద్ద ధర్మ సందేహం పట్టుకొంది.
రామనాధం ప్రాయశ్చిత్తం చేయించుకోలేదు. ధర్మ భ్రష్టుడనేశారు. వూళ్ళోని కుటుంబాలన్నింటితో ఏదో బీరకాయపీచు బంధుత్వం వుండడం,
దగ్గర బంధువుల బలగమే పెద్దది వుండడం మూలానా వెలి అంటూ పెట్టి అల్లరి చెయ్యలేదుగాని, మరో వూళ్ళో అయితేనూ, ఈ
వూళ్ళోనే మరోవాడైతేనూ ఏడిపించేసేవారే కదా. అటువంటి తాను కూడా ఆ తోటలోకి అడుగు పెట్టరాదా? అడిగేసేడు.
"అబ్బెబ్బే! నువ్వు కదలనక్కర్లేదు." అని శంకరశాస్త్రి హామీ యిచ్చేడు.
"మరి పేచీ యేముంటుంది?" అన్నాడు రామనాధం.
"పెద్ద చెరువు పక్కనేకదా....."
పక్కనున్న నూతిని మైలపరుస్తాను. ఎదురుగావున్న చెరువుకు పొమ్మంటే అర్ధం ఏమిటి? తిట్టొద్దు, కొట్టొద్దు, పొగబెట్టు వాడే
పోతాడన్నట్లే కదా......
"పోనీ నీకిష్టం లేదంటే చెప్పు" అన్నాడు శంకరశాస్త్రి.
"మరో చోటు వెతుక్కుంటాం."
తనకు లేని భావాన్ని అంటగడుతూంటే రామనాధానికి కష్టం అనిపించింది.
"పల్లెల వాళ్ళకి నీటి మాటేమిటి?"
శంకరశాస్త్రి ఒకదాని తర్వాత ఒకటి రెండు మార్గాలు సూచించేడు.
"విద్యార్థులు ఓ ఇరవయిమంది వుంటారు. వంతులువారీగా పల్లెల వాళ్ళకి నీళ్ళు పోయిద్దాం. నీ పనులకు ఆటంకంగా వుందని కదా ఆ
ఆలోచన? ఆ ఇబ్బందీ తీరుతుంది. విద్యార్థిగాళ్ళకి కాస్త పనీ వుంటుంది."
ప్రారంభంలో నీళ్లు లేక మాడిపోతున్న పల్లె వాళ్ళ మీది దయ కొద్దీనే రామనాధం వాళ్ళకి నీళ్ళు పోయడం పని తీసుకొన్నాడు.
తరువాత ఆ దయ నుంచి బయటపడలేకా, తన ఇతర పనులన్నీ చెడిపోతూంటే చూడలేకనే తన తోటలో నూయి వాళ్ళకి వదిలెయ్యాలనే
భావం కలిగింది.
కాని అస్పృశ్యత హిందూమతానికి మాసిపోని మచ్చ. ఒక మహానేరం. అస్పృశ్యతా నివారణకు జరిపే కృషి మానవుని ఘనతను
గుర్తించడానికి జరిపే కృషి--అంటూ గాంధీగారి వ్యాసాలూ, ఉపన్యాసాలూ చదువుతున్నకొద్దీ తన ప్రయత్నం వట్టి దయ మూలకంగానే
వుండకూడదనుకొన్నాడు. ఇప్పుడా నూతిని అస్పృశ్యులకి వదిలివెయ్యబోడం లేదు. దానిలో తనతోపాటు వాళ్ళూ తోడుకుంటారు. నాగేశ్వరరావు
పంతులుగారు వచ్చి ప్రారంభించబోయే కొత్త అలవాటు అదే.....
శంకరశాస్త్రి అప్పుడు తన రెండో ప్రతిపాదన తెచ్చేడు.
పుంతల్లో పల్లెవాళ్ళకి గవర్నమెంటు ఇళ్ళ స్థలాలు తలో సెంటూ ఇస్తానంటూంది. కాని చేలకి వచ్చిపోయే రహదారికి అడ్డు అనీ,
తమ చేలకి నష్టం అనీ వూళ్ళోవాళ్ళు పిటీషన్లు పెట్టేరు. అది నలుగుతూంది. నలుగురం పోగయి అక్కడ ఓ నుయ్యి తవ్వించి
పెట్టవలసిందని కోరితే నాగేశ్వరరావు పంతులుగారే తవ్వించి పెడతారు. దానినే ఆయన ప్రారంభించి వెళ్ళిపోతారు. పాఠశాల పాకలకు
మరో ధర్మాత్ముడిని అడగవచ్చును..... ఆ పద్ధతిలో అందరి ఆలోచనలూ నెరవేరుతాయి అని శంకరశాస్త్రి అభిప్రాయం.
"వెళ్ళు. ఔను, కాదు అని ఇప్పుడే అనెయ్యకు. ఆలోచించుకో. రెండు రోజుల్లో చెప్పు" అని సెలవిచ్చేడు.
ఇరవై
ఆ గ్రంథం అంతా విని శివకామయ్య ఫక్కున నవ్వేడు.
మీ బాబయ్య చాణక్యుడురా నాన్నా!"
అతని మిత్రులంతా సాహిత్యంతో తమకున్న పరిచయాన్నిపట్టి శంకరశాస్త్రిని యుగంధరుడు, యౌగంధరాయణుడు, అమాత్యరాక్షసుడు,
తిమ్మరుసు, అక్కన్న-మాదన్నలతో పోలుస్తుంటారు.
పల్లె వాళ్ళని బావి వద్దకు రాకుండా చేసేందుకు శాస్త్రి వేసిన ఎత్తు తప్ప పాఠశాలా లేదు, పాంథశాలా లేదు అని వాళ్ళ
వ్యాఖ్య.
రామనాధానికి పాఠశాల జరగకుండా తాను ఆటంకమయ్యేనేమోనని సందేహం మనస్సుని ఓ మూల బాధిస్తూనే వుంది.
ఆ సందేహం విని శివకామయ్య కోప్పడ్డాడు.
"తగ్గరా, వెర్రిపప్పాయి."
అతని వాదనలంత తోసివేయవలసినదిగా కనబళ్ళేదు.
"ఊళ్ళో అడుక్కు తిని, పీర్లపంజాలో కాచుకు తాగి, మా అరుగుమీద అష్టపదులు పాడుకోమంటే పాడే వెర్రికుట్టె ఎవరురా?"
అన్నాడు ఎగతాళిగా రామన్న.
"అంతేనంటావా?" అన్నాడు రామనాధం.
పండితులకు పావలా డబ్బులివ్వక్కరలేదు. విద్యార్థులకు భోజన సదుపాయాలు చూడనక్కర్లేదు. చివరకు పాకకో, పందిరికో
నాగేశ్వరరావు పంతులుగారినో, వేరొకరినో చూడవచ్చు. కాని, ముంగండ వాళ్ళకి వేద సాహిత్య పాఠశాలను నిర్వహిస్తున్న ప్రతిష్ఠ
దక్కుతుంది.
ఆ ఆలోచననే అతని మిత్రులు అపహాస్యం చేశారు.
కామేశ్వరరావు వూహలను మరికొంత సాగించేడు.
"మీ బాబాయి పాఠశాలకి ఓ నామకరణం కూడా చేసే వుంటాడు."
పండితరాయ జగన్నాథుడు ముంగండలో పుట్టేడు. ఆ విషయాన్ని ముంగండ వాళ్ళు ఎన్నటికీ మరిచిపోరు. ఎవరినీ మరిచిపోనివ్వరు.
జగన్నాథ పండితరాయలు వేదశాస్త్రాలు ఒక్క బ్రాహ్మల సొత్తుగానే కాదు, ఒక్క హిందువుల సొత్తుగానే అంగీకరించలేదు. దారా
షికోతో కలిసి ఉపనిషత్తుల్ని పారశీకంలోకి అనువదించేడంటారు. వివాహ విషయంలో కులాన్నీ, మతాన్నీ కూడా త్రోసి పుచ్చేడంటారు.
వాటన్నింటినీ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కాని, ఆయన జీవితాధ్యవసాయాన్ని మనస్సుకు పట్టించుకోరు.
ఆ ధోరణిలోనే కామేశ్వరరావు పుట్టని పిల్లకు నామకరణం చేసి వెక్కిరించేడు.
"పండితరాయ వేదవేదాంగ సాహిత్య విద్యాలయం."
తన్ను పెంచి పెద్ద చేసిన వ్యక్తి శంకరశాస్త్రి. ఆయన తన్ను బోల్తాకొట్టించడానికే పాఠశాల ప్రయత్నం తలపెట్టేడంటే
రామనాధం ఇంకా పూర్తిగా నమ్మలేకున్నాడు.
కాని, మిత్రులు చెప్పిందీ సబబుగానే వుంది. తనకా వుత్సాహంలో అర్థం కాలేదుగాని, పండితులు బ్రతకడం ఎల్లాగ? వీళ్ళకు వచ్చి
రోజూ నాలుగ్గంటలో, అయిదు గంటలో పాఠం చెప్పాలంటే అంత మేరకీ తమ జీవిత వృత్తులు పక్కకి నెట్టాలి. ఇప్పుడు చెప్పడం లేదా
అంటే చెప్తున్నారు. ఆ చెప్పడానికో వేళాపాళా లేదు. ఓ ప్రత్యేక ప్రదేశం లేదు. అంబాజీపేట సంతకెడుతూనూ, నరేంద్రపురం పొలం
వెడుతూనూ, పనస చెప్పుకొంటున్నారు. ఒక్కొక్కప్పుడు నాలుగేసి రోజులు పాఠాలే వుండవు.
పాఠశాల అన్నాక అదెల్లా సాగుతుంది?
"ఈ కంచి గరుడ సేవకి మనూళ్ళో రెండు మూడుమాట్లు ఏర్పాట్లు జరిగేయి ఇదివరకు" అన్నాడు రామన్న.
"వేద పాఠశాల నడుపుకొనేందుకు వూళ్ళో చోటే లేదూ? పాపం అవధూత స్వామి ధర్మమాయని చెరువుగట్టుమీద మఠం ఒకటి వెలిసింది.
ఎవరన్నా స్వామి వస్తేనంటారా? ఇప్పుడు చేస్తున్నట్లే చెరువుగట్టు మీద బోలెడు రావిచెట్లూ కాదంటారూ, తమ తమ ఇంటి అరుగులు
వుండనే వున్నాయి."
"నిజమే"నని రామనాధం వొప్పుకున్నాడు.
"పల్లె వాళ్ళకి తాగేటందుకు నీరు మాటేమిటి?" అని రామన్న నిలదీశాడు.
రామనాధం స్థిరం చేసుకొన్నాడు.
ఇరవై ఒకటి
అటు పంచమకులాల పెద్దల్నీ, ఇటు గ్రామంలోని పెద్దల్నీ తాను తలపెట్టిన పనికి ఒప్పించే ప్రయత్నంలో రామనాధం రాత్రింబగళ్ళు
తిరుగుతున్నాడు. తన పథకాన్నంతనూ వివరంగా తెలుపుతూ నాగేశ్వరరావు పంతులుగారికి వుత్తరం వ్రాసేడు. ఎవరి తోటలోనో వున్న
ఒక నూయిని అస్పృశ్యులకు వదలడంలో విశేషం ఏమున్నదని పంతులుగారు రావడానికి నిరాకరిస్తారేమోనని అతని భయం. తాను వెడితే
పరిస్థితులు వివరంగా చెప్పగలడు. అగ్రహారం ప్రజల ఛాందసత్వాల మధ్య ఆ ప్రయత్నం యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పగలడు.
కాని, ఊళ్ళో ప్రతిఘటనను సర్దుబాటు చేయనిదే ఎక్కడికి వెడతాడు? పంతులుగారిని తీరా తీసుకువచ్చాక ఊళ్ళో వాళ్ళే కాకుండా,
అసలు దాని వుపయోగం పొందవలసిన వాళ్ళు కూడా రాకపోతే? అందుచేత వారికి తానో వుత్తరం వ్రాసేడు. వివరంగానే వ్రాసేడు.
దువ్వూరి సుబ్బమ్మగారికి కూడా సంగతులు తెలియబరచి, ఆమెను కూడా పంతులుగారికి వ్రాయమన్నాడు.
ఆ అవసరం లేకుండానే పంతులుగారి నుంచి ఆశీర్వదిస్తూ వుత్తరం వచ్చింది. తేదీ నిర్ణయించి తెలుపమంటూ. ఆ జాబుతోపాటు
ఆంధ్రపత్రిక పంపించడం కూడా ప్రారంభించారు.
ఆ రోజు నాటికి సుబ్బమ్మగారూ వీలుపడితే తానూ వస్తున్నానని తెలియబరచారు.
ఈ రెండు లేఖలూ రామనాధాన్ని, మిత్రకోటినీ విశేషంగా వుత్సాహ పరిచాయి. ఆ వుత్సాహంలో వారి ప్రయత్నాలూ విస్తరించాయి.
చుట్టుప్రక్కల రెండు మూడు మైళ్ళలో వున్న గ్రామాల నుంచి కూడా ఈ ఉత్సవానికి జనాన్ని పోగుచెయ్యాలనుకొన్నారు. నాయకులు
వస్తున్న వుత్సాహం, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సమావేశం కావడం దృష్ట్యా అగ్రహారం జనంలో ఏమన్నా వ్యతిరేకత ఉన్నా
అది బయటకు రాదు.
ఆ రోజున నాయకులు ఉపన్యాసాలిస్తారు. జనం కూర్చునేందుకు తోటలోనే పెద్ద పందిరి వేయడానికి సన్నాహాలు ప్రారంభించేరు. ఆ
సందర్భంలో విందు కూడా చేస్తే...?
విందు అన్నప్పుడు అన్ని కులాలవాళ్ళూ కలిసి కూర్చోగలిగితేనే అర్ధం వుంది. ఎంతమంది వస్తే అందరితోనే...