"లేదు. వాళ్ళ నాన్నగారు చదువు చెప్పిస్తూండగానే అనుకున్న సంబంధాలు దాటిపోయేయిట."

విశాలాక్షి ఎరిగి వుండి ఆడిన ఆ అబద్ధానికి స్వరాజ్యం ఆశ్చర్యంతో నోరు తెరిచింది.

రామనాధం పాక ముందు భాగంలో రెండు కొబ్బరి తడకలు వేసి ఆహ్వానించేడు.

"రాండి, వచ్చి కూర్చో అమ్మా."

స్వరాజ్యం మరో చిట్టి తడక తెచ్చుకొని వేసుక్కూర్చుంది.

ఆమె ఏం చేస్తుందో అర్థంగాక అంతవరకూ నిలబడే కబుర్లు చెబుతున్న రాజమ్మ సంతృప్తిపడి తానూ కూర్చుంది. చదువుకున్న

అమ్మాయికి ఆచారాలు తెలుసునో లేదో? తాను కూర్చున్న చాపలోనే కూర్చుంటే తాను మైలపడిపోవాలి. తరవాత ఏమనుకొన్నా, ఏమన్నా

లాభం ఏమిటి?

"ఈ చిట్టి తడకలు చాల బాగున్నాయి."

రాజమ్మకు కనిపిస్తున్న బాగు వానిలో ఇద్దరు కూర్చునేటందుకు చోటులేక పోవడమే. ఆమె సంతృప్తికి రామనాధం నవ్వేడు.

"ఎందుకురా ఆ నవ్వు?" అంది రాజమ్మ.

"ఈ కొబ్బరి తడకల్ని పొగుడుతుంటేనూ, ఆ స్వరాజ్యంగారి యింట వాళ్ళు తివాచీలు వాడుకుంటారమ్మా!"

స్వరాజ్యం నవ్వింది.

"ఓ రోజున పై పెద్ద మనిషి వచ్చేరని మర్యాదకి వేసిన తివాచీ చూసి మేం గొప్పవాళ్ళము అనెయ్యకండి."

"మర్యాదకు వెయ్యాలన్నా మా దగ్గర లేదు కదా." అన్నాడు రామనాధం.

"ఇంత అందమైన తోట వుంటే...."

రామనాధం ఆమె పొగడ్తకి చాల ఆనందపడ్డాడు. చుట్టూ చూస్తూ అన్నాడు.

"ఋష్యాశ్రమంలా వుంది కదూ?" అన్నాడు.

అక్కడున్న నలుగురికీ ఋషులూ తెలియదు. వారి ఆశ్రమాలూ ఎరుగరు. నిర్జన ప్రదేశంలో, నిశ్శబ్ద వాతావరణంలో, నిరాడంబరంగా

వేసుకొన్న చిన్న పాక, చిన్న తాటాకుటిల్లును మెచ్చుకోడానికి అదో మాట. అంతే.

రాజమ్మకు ఆశ్రమం అనే మాట ఏదో అపశ్రుతిలా వినిపించింది.

చెరువుకట్ట మీద ఎదురుగా అక్కడ అవధూతస్వామి మఠము, ఇక్కడ ఆశ్రమం. అతని వయస్సు ఆశ్రమాల్లోనూ, మఠాల్లోనూ

వుండవలసిందా? ఆనందంగా పెళ్ళాన్ని తెచ్చుకొని, సుఖంగా గడపవలసిన వయస్సులో సన్యాసులల్లే ఆశ్రమవాసం ఏమిటి? అనుకొంది.

"ఓఘాయిత్యం మాటలనకు, భడవకానా" అని కోప్పడింది.

రామనాధం నవ్వేడు. సంభాషణ కుటుంబ విషయాలలో తిరుగుతుండడం గమనించి తానక్కడ వుండడం మర్యాద కాదని స్వరాజ్యం లేచింది.

"వచ్చి చాలా సేపయింది. పోయివస్తానండి."

రామనాధం కూడా లేచేడు.

"ఒక్క నిముషం ఆగండి. పుల్లాయి వస్తాడు తోడు."

అతడు పుల్లాయిని తీసుకు రావడానికి వెళ్ళేడు. మరునాడు తమ యింటికి రమ్మనమని విశాలాక్షి ఆహ్వానించింది.

"లేదండి. ప్రొద్దుటే వెళ్ళిపోతున్నా, నాన్నగారు ఒక్కరే వుండాలి."

"మీ అమ్మగారు?"

"పిన్నికి సాయం కావలసి ఓ పది రోజులుంటుంది ఇక్కడే."

పుల్లయ్య వచ్చేడు. స్వరాజ్యాన్ని రోడ్డు వరకూ సాగనంపుతూ రామనాధం వెంబడించేడు.

"ఆదివారం మరిచిపోకండి. సభ ఏర్పాట్లు చేయిస్తున్నారు నాన్నగారు."

రామనాధం అలాగే అన్నాడు.

"సభలేమిటి?" అని రాజమ్మ అడిగింది. పరాయి పడుచువాడిని పెళ్ళికాని పడుచుపిల్ల పిలవడమే ఆమెకందులో వినిపించింది. తండ్రి

గుడ్డివాడు. వున్నా లేనట్లే. తల్లి వూళ్లో లేదు. ఒక్క పిలుపులో రాజమ్మ పెద్ద వ్యూహాన్నే కనిపెట్టింది.

"కూతురు ఎక్కడికెళ్ళినా తల్లీ తండ్రీ ఏమీ అనడం వుండదా?"

"మర్యాద, మంచితనం వున్న పిల్ల. ఎంత కలుపుగోలుతనం?" అంది విశాలాక్షి.

తిరిగివస్తున్న రామనాధం కూడా ఆమెతోపాటు తానూ మాట కలిపాడు.

"మంచి చొరవ! వ్యవహార దక్షత! మనవాళ్ళూ వున్నారు దద్దమ్మలు. గుడ్డి తండ్రి, ఇంటికి మరో దక్షత లేదు.

వ్యవహారాలన్నీ ఆవిడే చేసుకొంటుందట... అల్లా వుండాలిగాని...."

ఆడదానిలో చొరవ, వ్యవహార దక్షత కావాలంటున్న తమ్ముడి ముఖంవేపు విశాలాక్షి ఆశ్చర్యంతో చూసింది. సాధారణంగా ఆడదానిలో

అవి రెండూ అవలక్షణాలుగా చూడడం ఆమె ఎరుగును. తండ్రి చాటున దాగి, అతడు గదిమేస్తూంటే, మగడికి అన్యాయం జరిగిపోతూన్నా

చూస్తూ వూరుకున్న సుందరితో స్వరాజ్యాన్ని పోల్చి చూస్తున్నట్లనిపించి విశాలాక్షి గతుక్కుమంది.

"అదేమిటిలే, చదువుకొని పట్నవాసంలో పెరిగిన పిల్ల మరి...."

"పట్నాల్లో వుంటే మాత్రం...."

అంతలో తాను స్వరాజ్యాన్ని మెచ్చుకోవడం అతి అవుతున్నట్లనిపించి రామనాధం మాట మధ్యలోనే ఆగిపోయేడు. మాట మార్చేడు.

"చెట్టున ములక్కాడలున్నాయి. దారినపోయే వాళ్ళంతా కోసుకుపోతున్నారు. మరిడమ్మకిచ్చి పంపిస్తా."

ఔను, కాదు అనకుండానే ఆతడు గెడ ఒకటి తీసుకొని ములక్కాయలు కోసుకురావడానికి వెళ్ళేడు.

అతడటు వెళ్లాక రాజమ్మ నెమ్మదిగా అడిగింది.

"ఏమిటంటాడు? ఏమి చేద్దామనుకొంటున్నాడు?"

"భార్యను తెచ్చుకోడానికి అతడు నారాయణమూర్తిగారి వద్దకు పెద్ద మనుష్యుల్ని పంపేడు. తానుగా వెళ్ళేడు కూడా" అని విశాలాక్షి

సమాధానం ఇచ్చింది. అది రాజమ్మ ప్రశ్నకు సమాధానం కాదు. ఆ సమాచారం ముంగండలో అందరికీ తెలిసి ఎన్నో చిలవలూ, పలవలూ

వేసింది కూడా. అసలు రాజమ్మ సమాధానం కోరి వేసిన ప్రశ్నకూడా కాదు. మనస్సులో వుడికిపోతున్న బాధకది వాగ్రూపం అంతే.

"అల్లుడంటే ఎంత సంబర పడేవాడు? చూసిన మంచి గుడ్డల్లా కొని బహుమతి ఇచ్చేవాడు. ఎక్కడికో లండను పంపుతాననేవాడు.

'కలక్టరయి వస్తాడు అక్కయ్యగారూ! మన రెండు కుటుంబాలకీ ఎంత ప్రతిష్ఠ, ఎంత పేరు!' అని తెగ మురిసిపోయేవాడు. కాదటే

విశాలాక్షీ!"

రాజమ్మకు వియ్యంకుడి మీద సదభిప్రాయమేగాని, ఏమాత్రం కష్టం పెట్టుకుంటున్నట్లు కూడా లేదు. అంత మంచివాడు ఇప్పుడిల్లా

తయారయ్యేడంటే తన కుమారుడి దురదృష్టమే కారణమని ఆమె నమ్మకం. ఆ దురదృష్టం గాంధీ రూపంలో నెత్తికెక్కిందని ఓ విచారం.

"దిక్కుమాలిన కాంగిరేసూ, దిశమాలిన గాంధీ......ఎక్కడ దాపరించేరే తల్లీ. పచ్చగా ఎక్కివస్తూన్న మొక్కని

తుంపేసినట్లయింది కాదే అమ్మా!"

ఆమెను ఎలా సమాధానపరచాలో విశాలాక్షికీ అర్థం కాలేదు. ఇంగ్లీషువాళ్ళు దేశంలోంచి వెళ్ళిపోయి తీరాలిసిన అవసరం గురించి తండ్రి

చెప్తూండగా వింది. జలియన్వాలాబాగ్‌లో కాల్పులు కాల్చి, గాయపడ్డ వాళ్లని బ్రతికి వుండగానే నూతిలో

పారవేశారన్నప్పుడు అల్లాంటి దుర్మార్గులు మన దేశంలో వుండకూడదనే అనుకొంది. కాని, ఆమె ఆలోచించినంతవరకు ఇంగ్లీషువాళ్లు

వచ్చేక ఎన్నో లాభాలు కలిగేయనే ఆమె నమ్మకం. వీరేశలింగంగారి స్వీయ చరిత్ర చదివింది. రామమోహనరాయ్‌,

ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ల చరిత్రలు చదివింది. అవన్నీ చదివినకొద్దీ ఒక్కటనిపించింది. ఇంగ్లీషువాళ్ళు రాకపోతే

ఆడపిల్లలకి ఓ చదువనీ, మోడైపోయిన అమాయకురాళ్ళ బ్రతుకులకు ఓ దారనీ ఏర్పడేదేనా అని ఆమె ఆలోచన. అందుచేత

బ్రిటిష్‌ వ్యతిరేకత ఆమెలో అంతంతమాత్రం. 'నారాయణమూర్తి దుష్టుతనమేగాని, ఇంగ్లీషువాళ్ళు అల్లుడిమీద కేసు

పెట్టమన్నారా' అనే అనుమానం కూడా ఆమెకు లేకపోలేదు. ఆ మనఃస్థితిలో విశాలాక్షి ఏం చెప్పగలదు?

అందుచేతనే రామనాధం తన కుటుంబాన్ని నిలపుకునేటందుకు చేస్తున్న ప్రయత్నాలను చెప్పి, ఆమెను సంతృప్తి పరచడానికి

ప్రయత్నించింది.

"ఇల్లా వుందని బావమరిదిక్కూడా వ్రాశానన్నాడు?"

రాజమ్మ కళ్ళు చక్రాల్లా చేసింది.

"కాకినాడలో వున్న అతనికా?"

"ఇంకెవరున్నారు? మిగిలినవాళ్ళంతా చిన్నవాళ్ళే కాదా పిన్నీ!"

రాజమ్మ ఇంకా ఆశ్చర్యంనుంచి తేరుకోనేలేదు.

"ఆ బ్రహ్మసమాజంగాడికి?"

ఆమె మాట విని విశాలాక్షి నవ్వింది.

"ఇంక ఈ కాపురం ససిపడినట్లే " అని రాజమ్మ నిరుత్సాహపడింది.

"ఆరు నెల్ల క్రితం కాకినాడ వెడతానన్నవాడు అమలాపురంలో తేలేడు కాదుటే విశాలాక్షీ! తండ్రికీ ఆ కొడుక్కీ పడదు. ఈయన

గొప్ప మంత్ర శాస్త్రవేత్తా. వాడూ దేవుడూ నై. దెయ్యమూ నై గాడూను. ఎల్లా కుదురుతుంది? అడుగుతూ, అడుగుతూ సలహా దొడ్డవాడి

నడిగేడు. వాడేదో ముడ్డిగిల్లి పంపేడు. ఈ చవలమ్మ పోయి మామగారితో పేచీ పెట్టుకున్నాడు."

రామనాధం జైలులో పడడానికి గల కారణాలను తన వూహకందినంత వరకు చెప్పి ఒక్క మాటలో తేల్చేసింది.

"వీడి తాత వాడు. వీడు జైలుకుపోయి మాలకూడూ, మంగలికూడూ తినొస్తే వాడు జైలుకెళ్ళడం కూడా ఎందుకని ఓ మాదిగదాన్నే

కట్టేసుకున్నాడు."

విశాలాక్షికి ఏమనడానికీ తోచలేదు.

తన బావమరిది భార్య చాలా మంచిదని రామనాధం చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది.

"ఆ అమ్మాయి చాల తెలివీ, మంచితనమూ గలదటమ్మా!"

విశాలాక్షి కూడా అంత అనాచారాన్ని సమర్ధించడం రాజమ్మకు నచ్చలేదు.

తెలివీ, మంచితనమూ వుంటే మాత్రం కులం ఏమవుతుంది?

విశాలాక్షి ఏమీ అనలేదు. రాజమ్మ మళ్ళీ అంతలో సరిపుచ్చుకుంది.

"సరేలే ఎవరి కర్మకు ఎవరు కర్తలు."

విశాలాక్షి క్షీణ స్వరంతో "అంతే, అంతే" అంది.

పదమూడు

తోట చివరకు వచ్చి రామనాధం మరిడమ్మ కోసం కేక వేసేసరికి ఆమె దగ్గరలోనే ఎక్కడో పలికింది.

"ఎక్కడున్నావు?"

పాతిక గజాలలో వున్న రావి మూల రేవులోంచి మరిడమ్మ గట్టెక్కింది.

"ఏమయ్యగారూ!"

"ఓమారు తోటలోకి రా."

మరిడమ్మ వెంటనే బయలుదేరబోయింది. అక్కడున్న ఒకళ్ళిద్దరు పంచముల ఆడవాళ్ళు ఆమెను బ్రతిమాలుకోసాగేరు.

"అమ్మమ్మ! ఈ ఒక్క కడవ పోయి తల్లీ. నీ కడుపున పుడతా. ఇంటికాడ పిల్ల ఏడుస్తుండది."

"అయ్య పిలుస్తుండరు. ఇంకెవరన్నా వస్తారు. నన్ను పోనీ...." అంటూ మరిడమ్మ విదిలించుకు వచ్చేయడం వినిపించింది.

తెల్లవారింది మొదలుకొని జామురాత్రి వేళ దాకా మూల రేవులో కుండలు వరసగా పెట్టుకొని ఎవరన్నా పరోపకారులు రాకపోతారాయని

ఎదురుచూస్తూ, బతిమాలుతూ మాలపల్లె వాళ్ళు నిలబడి వుండడం ముంగండ చెరువు వద్ద ఒక సాధారణ దృశ్యం. పాతిక ఎకరాల

వైశాల్యం గల అంత పెద్ద చెరువులో ఏమూలనా కూడా మాలమాదిగలు దిగడం నిషిద్ధం. పావంచాలు కట్టిన రేవులన్నీ బ్రాహ్మణ

వీధుల్ని ఆనుకొనే వున్నాయి. ఆ రేవుల ముందు అస్పృశ్యులు నిలబడ్డానికే వీలు లేదు. అస్పృశ్యత నిషేధం లేకపోయినా

బ్రాహ్మణేతర కులాల వాళ్ళు కూడా సాధారణంగా ఆ రేవుల్లో కనపడరు. కారణం ఏమీ లేదు. వాళ్లు వుంటున్న పాలెములు

రోడ్డుకావలనే వున్నాయి. అసలు చెరువే దూరం. పావంచాల రేవులు మరీను. కనక మూల రేవుల్లోనే వాళ్ళు నీళ్ళు ముంచుకుపోతూంటారు.

ఆ మూల రేవులోనే గట్టు లోపలా, వెలుపలా కుండలు పెట్టుకొని పల్లె వాళ్ళు కాపలా వేస్తారు. బారెడు దూరంలో నీలాల వంటి

నీళ్ళు. ఒక్క కడివెడు ముంచుకోవడం మాట అటుంచి, నీటి అంచుకు వెళ్ళడానిక్కూడా వీలు లేదు. ఎవరో దయతలచి ఓ కడివెడు

పోయవలసిందే.

జ్ఞానం తెలిసినప్పటి నుంచీ చూస్తున్న దృశ్యమే అది. కాని, ఆనాటి వరకు దానినాతడు గమనించనేలేదు. మరిడమ్మకు ఒక సీసాడు

కిరసనాయిలు తెచ్చిపెట్టమని దుకాణం మీదికి పంపించేడు. ఆమె వెళ్ళి పావుగంట దాటింది. కాని రేవులో ఆడవాళ్ళిద్దరూ అక్కడే

వున్నారు. వాళ్ళకి తోడు మరో నలుగురు కూడా వచ్చేరు. పొలాల నుంచి తిరిగి వచ్చినవాళ్ళు ఒక్కొక్కరే చేరుతున్నారు.

అది చూస్తూంటే రామనాధం మనస్సు బాధపడింది. మరిడమ్మను తానేదో పనిమీద పంపడం వలన అక్కడ వాళ్ళకి నీళ్ళు

లేకపోయాయనిపించింది. పోనీ తానే వెళ్ళి పోస్తే? ఇప్పుడింకా స్నానం కూడా చెయ్యాలి కదా! అంతలో ఎవరో రెండు బిందెలు నీళ్ళు పోయడం

కనిపించింది. అంతలో, తనకు పనుందని అతడూ వెళ్ళిపోయేడు. బ్రతిమాలుకుంటూంటే విదిలించుకుపోయేడు.

అదీ మామూలే, వచ్చిన వాళ్ళల్లా సాయపడరు. కాని అందరినీ అమ్మా, బాబూ అనాలిసిందే. కొందరు వినిపించుకోరు. కొందరు

విసుక్కుంటారు. ఎవరికో జాలి కలుగుతుంది. అతనికీ పని వుంటుంది. అయినా వెళ్ళలేడు. తన పని మానుకుని పది కుండల నీళ్ళు

పోస్తాడు. దానికి అంతం ఏం వుంటుంది? ఎంత సేపని నిలవగలడు? మిగిలిన వాళ్ళు బ్రతిమాలుకుంటున్నా వినిపించుకోకుండా పారిపోతాడు.

మళ్ళీ ఎవరో రాకపోరు. వస్తారు. వస్తే మాత్రం ఎవరికా తీరుబడి? ఏదో పని చేసుకొంటేగాని పొట్ట గడవని మనుష్యులు.

నీళ్ళ కోసం వచ్చిన వాళ్ళూ అంతే, వాళ్ళూ కూలిపనులకి పరుగెత్తే వాళ్ళే, పిల్లా జెల్లా గలవాళ్ళే. ఆ కుండెడు నీళ్ళూ

తీసుకెళ్ళి కూడు వుడకేసుకోవలసిన వాళ్ళే.

రామనాధం వాళ్ళ బాధ చూడలేకపోయాడు. కంచె వొత్తిగించి పుంతలోకి వచ్చేడు.

"వుండండర్రా. నే పోస్తాను."

దగ్గరలో వున్న కంసాలుల ఇంటి వద్ద ఓ బిందె తీసుకొచ్చేడు.

"ఇప్పుడే తెచ్చి ఇస్తా. పాపం చాలామంది చాలాసేపటి నుంచి నిలబడి వున్నారు" అని కంసాలి కామయ్యకు దిలాసా ఇచ్చేడు.

"మా ఇంట్లో వున్నదీ ఒక్క బిందేనండీ" అంటూ కంసాలి కామయ్య నీళ్లు పారపోసి బిందె తెచ్చి యిచ్చేడు.

రామనాధం పావుగంట అనుకున్నది అరగంట, గంట అయింది. ఈలోపున కామయ్య ఇంట్లో నీళ్ళ కోసం బిందె కావాలని రెండుమాట్లు

వచ్చేడు. ఇంక బాగుండదని మూడోమారు వచ్చినప్పుడు నీళ్ళతో తెచ్చి ఇవ్వబోయేడు.

కాని కామయ్య ఆ నీళ్ళతో వున్న బిందె పుచ్చుకోడే.

"ఆ బిందెడూ ఆ కుండలో పోసెయ్యండి. నేను పొయ్యలేకపోవడమే గాక వాళ్ళకి తెచ్చినవి కూడా నే తీసుకొంటానా? మహాపాపం!"

అన్నాడు.

మొదట్లో అర్థంగాకపోయినా తర్వాత అర్ధం అయింది. కంసాలి కామయ్య తాను తెచ్చిన నీళ్లు ముట్టుకోడని జ్ఞాపకం వచ్చింది. తాను

జైలుకి వెళ్లి రావడం చేతనే కాదు. విశ్వకర్మ కులంలో పుట్టినందుకు కామయ్యకు తన కులం ఇంకా ఎక్కువదని అభిప్రాయం. కాని

పైకి చెప్పడానికి భయం.

కులాలంటే అపహాస్యంగా కనబడుతున్న కొత్త దశలో వున్నాడేమో కామయ్యను ఏడిపించాలని తోచింది రామనాధానికి.

"అబ్బెబ్బే! అదేమిటీ? మీ యింట్లో నీళ్లు పారపోయించి తెచ్చేను కూడా. నీళ్ళు మిమ్మల్నే తెచ్చుకోమనడం ఏం ధర్మం?"

పట్టుకెళ్ళి నీళ్ళతో బిందె అరుగు మీద పెట్టేసి మరొకరి ఇంటినుంచి బిందె తేవడం కోసం పరుగెత్తేడు.

"మీచేత పని చేయించుకున్న పాపం తెచ్చిపెట్టకండి" అంటూ కామయ్య అంగలార్చేడు. రామనాధం ఇంక వినిపించుకోనేలా లేడని

ఉస్సురన్నాడు. ఆ నీళ్ళు తానే పారపోసేడు. వానిని ముట్టుకొన్నందుకు స్నానం చెయ్యాలి. చేసేడు.

* * * * *

ఓ పాతిక బిందెలు పోసినట్లు అనిపించింది. నీళ్ళ బిందెతో గట్టు ఎక్కనూ దిగనూ ఒళ్ళు హూనం అయిపోయింది. వంట చేసుకోలేకపోయేడు.

పెరుగులో ఇన్ని అటుకులు నాన వేసుకొని తిని పడుకున్నాడు.

పడుకున్నా చాలసేపటి వరకూ నిద్ర పట్టనే లేదు. తాను నీళ్లు పోస్తున్న సమయంలో వాళ్లు చెప్పుకుంటున్న మాటలు మనస్సులో

మెదిలేయి. ఒక్క బిందెడు నీళ్లు పోసినందుకు వాళ్లు చూపిన సంతోషం, చేసిన అభినందన గుర్తు వచ్చాయి. ఇందాకా అవి సంతోషమే

కలిగించేయి. కాని, ఆలోచిస్తున్న కొద్దీ అతనికి బాధ కలుగుతూంది.

ఆ చెరువులో నీరు పెట్టేది పల్లెల వాళ్ళే. కాని చెరువు లోతట్టుకు నీరు చేరేక వాళ్ళు ముట్టుకోరాదని నిషేధం పెడతారు.

ఇప్పుడు తనబోటివాడెవడో దయ తలిస్తే తప్ప వాళ్ళకి కడివెడు నీళ్ళకు గతిలేదు.

ఆ మహాపరాధానికి తానే కారణం అయినంత బాధపడ్డాడు రామనాధం. ఆ అపరాధానికి శిక్ష... తాను వాళ్ళకి నీళ్లు

పోయడమేననిపించింది.

ఆ నిశ్చయాన్ని అమలు జరపడానికి తెల్లవారకుండా ఒక బిందె తీసుకొని రావిక్రింది మూలరేవులో హాజరయ్యేడు.

ఆ పూట అతని స్నానానికి పొద్దుపోయింది. సిద్ధాంతిగారు అతడు ఆ పని చేస్తూంటే ఓ నిముషం నిలబడి చూసి వెళ్లిపోయేరు.

సూరప్ప వచ్చి అతనితోపాటు నాలుగు బిందెలు పోసి తన పనిమీద వెళ్ళిపోయేడు. కొంతసేపున్నాక శివకామయ్య వచ్చేడు. అతడు

కొంతసేపు బిందె అందుకున్నాడు.

"నువ్వు వెళ్లు. వంట చేసుకోవాలిగా, నేను పోస్తానులే."

కాని, రామనాధం కదలలేదు.

పెద్దరేవులో స్నానం చేస్తున్న వాళ్ళూ, నీళ్ళు పట్టుకొనేందుకు వచ్చిన వాళ్ళూ అక్కడి నుంచే చూశారు.

"కాలేజీ మాని మంచి పనే పెట్టుకొన్నాడు" అంది సోదెమ్మ.

అందరి మనస్సులలో వున్న మాటనే ఆమె పైకి అనేసింది. అంతే.

పావంచాలలో తులిసెమ్మ ముందు కూర్చుని జపం చేసుకుంటున్న సోమయాజులు తావళం తిప్పడం మానకుండానే తన అభిప్రాయం చెప్పేడు.

"గాంధీ ఒకడు వచ్చేడుగా, వీళ్ళంతా స్వరాజ్యం తేవడం మాట ఎల్లావున్నా ముందు దేశాన్ని మాల మంచం చేసి పెడతారు."

మంచానికి ఒక వేపున కొంతమేర నులక నెయ్యకుండా త్రాడు పెట్టి బిగిస్తారు. ఆ దిక్కు కాళ్ళగట్లు. అస్పృశ్య కులాలు తమ

మంచాలకు కాళ్లగట్ల తాడు వుపయోగించడం కులాచారాల రీత్యా అభ్యంతరం. అటువంటి మంచానికి కాళ్ళగట్ల-తలాపియని తేడా ఏముంటుంది?

తేడా పాడాలు, హెచ్చు తగ్గులు లేనిది మాలమంచం--అగ్రహార పరిభాషలో

ఆ వ్యాఖ్యానం వినేసరికి రామనాధం వొళ్ళు మండింది.

"చెరువుకు నీరు పెట్టిన కూలీలంతా అస్పృశ్యులే. వాళ్ళ కాళ్ళ మీదుగా దొర్లిన నీరు కాదూ ఇదంతా? ఆ నీరు చెర్లో పడగానే

వాళ్ళు ముట్టుకుంటే మైలపడిపోతుందా?" అని తన పెదతండ్రి రావికింద ఎన్నో మాట్లు వాదనలు వేసుకోవడం తెలుసు. నిన్న సాయంకాలం

తాను నీళ్ళు పోస్తున్నప్పుడు పల్లె స్త్రీలు తమలో తాము చెప్పుకొన్న మాటల్లో తాత్పర్యం కూడా అదే....ఆ మాటలు మరోమారు

జ్ఞాపకం చెయ్యాలనిపించింది.

శివకామయ్య వారించేడు.

"వాదన వేసుకొంటే తేలేవి కావురా యివి. మనకు చేతనైంది చేసుకు పోవడమేగాని"

రామన్న ఆ మాటను సమర్థించేడు. రామనాధం మాట్లాడలేదు.

"అంతేలే."

పద్నాలుగు

అతడు ఆదివారం వెళ్ళేసరికి చిరతపూడిలో కాంగ్రెసు సభకు వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడి వుంది. సబినస్పెక్టరు వచ్చి ఆ

రోజు వుదయం టముకు వేయించేడు. 'సభకు ఎవ్వరూ వెళ్ళవద్దు.' అని పేట పేటకూ చాటింపు వేయించేడు. పెద్ద కుటుంబాల వాళ్ళ

యింటికి కబురులు పెట్టించేడు. కాంగ్రెసు సభలకు వెడితే ప్రభుత్వం ఒప్పుకోదు. అసలు ఆ వూళ్ళోనే పెట్టనియ్యవద్దు--అని

ఆదేశించేడు.

ఆ ఆదేశాలు పాటించబడేటట్లు చేయడానికి మునసబు ఇంటి వద్ద ఒక పోలీసు కానిస్టేబులును వదిలి వెళ్ళేడు.

ఆ వృత్తాంతం తెలియగానే అబ్బాయి నాయుడు ఆలోచించేడు. ఇంకా ఒంట్లో ఓపిక బాగా చేరలేదు. కనక ఇల్లు వదలి వెళ్ళడానికి

శక్తి లేదు. తన స్నేహితులయిన ఇద్దరు ముగ్గురిని తన ఇంటికి రప్పించేడు. ఆలోచించేడు.

సభ జరుగుతుందని వూళ్ళో అందరితో చెప్పేరు. ఉపన్యాసకుడిని కూడా మాట్లాడేరు. ఆయన వచ్చేడు. ఇప్పుడు పోలీసువాడు పనికి

రాదన్నాడని మానేస్తే వూరికెంత అప్రతిష్ఠ? తమ పరువు మాటేమిటి? ఒక పెద్ద సమస్య ఎదురయింది.

ప్రతిష్ఠ సమస్య మీద, పంతానికి, జనం వచ్చినా రాకపోయినా, వూరి మధ్య సభ పెట్టేద్దామని ఓ నిముషం అనిపించింది. కాని,

ఎక్కడ పెట్టినా, ఆ దగ్గరలో వున్న యిళ్ళవాళ్ళు అభ్యంతరం చెప్పేలా కనిపించేరు. వాళ్ళ ఇంటి ఎదుట ఎందుకు

పెట్టుకోనిచ్చేరని పోలీసులు కేసు పెడతారని భయం.

"అయితే మా యింటి ముంగిట చాపలు వేయిస్తా...." నని నాయుడు నిశ్చయం తెలిపేడు.

"మొన్ననే జబ్బుపడి లేచేవు. మరల పోలీసువాళ్లు ఏవన్నా గొడవలు తెస్తే...." అని మిత్రుల భయం.

కాని, నాయుడు వినిపించుకోలేదు.

"మీరు తొమ్మిది గంటలకి రాండి."

మిత్రులు వెళ్ళిపోయేక రామనాధం భోజనం విషయమై ఏర్పాట్ల సమస్య వచ్చింది. మీటింగు స్థలం అంత సులభంగా పరిష్కరించేదిగా ఈ

సమస్య కనబడలేదు.

మొదట వూళ్ళో బ్రాహ్మణ కుటుంబాలు కూడా మీటింగుకి కలిసి వచ్చేటట్లు మాట్లాడేరు. సుబ్రహ్మణ్యం పంతులుగారింట అతనికి భోజనం

ఏర్పాటు అనుకున్నారు.

కాని, ఇప్పుడంతా తల్లక్రిందులైంది. మీటింగుకి భయపడ్డవాళ్లు భోజనం పెట్టగలుగుతారా? పెడతానన్నా వెళ్ళడానికి రామనాధం

ఒప్పుకోలేదు.

వాళ్ళు అననిదే తానే నాయుడింట భోజనం చేస్తానని చెప్పుకోడానికి రామనాధం బిడియపడ్డాడు.

బ్రాహ్మణుణ్ణి తమ యింట భోజనం చేయమనడానికి అబ్బాయి నాయుడికి భయం. ఏమనుకొంటాడో ఏమో.

స్వరాజ్యమే చొరవ తీసుకొంది.

"జైలులో వండి వడ్డించిన వాళ్ళకన్న తీసిపోయేమా?" అంది.

చివరకి రామనాధం అనేశాడు.

"కులాల తేడా అర్థంలేనిదనుకొనేవాళ్ళం మనకి కూడా ఈ పట్టింపులవసరమేనా?"

నాయుడు ఎంతో సంతోషపడ్డాడు.

"మీకా అభిప్రాయం వుంటే అంతకన్నా కావలసిందేముంది?.... అమ్మా!"

పదిహేను

పంతానికి రామనాధం రెండు వారాల పాటు పొద్దుటా-సాయంకాలం బిందె తీసుకొని పల్లె జనానికి నీళ్ళు పోసేడు. అక్కడికీ ఆలస్యంగా

వచ్చిన వాళ్ళు నలుగురో ముగ్గురో దిగబడిపోతూనే వున్నారు.

వాళ్ళకి తోడు అతని పనులన్నీ కూడా మిగిలిపోతున్నాయి. ప్రతిరోజూ తెల్లవారేసరికి స్నానం చేయడమూ, కొంతసేపు ఆసనాలు వేయడమూ

ఆతనికి అలవాటు. సాయంకాలం మిత్రులతో కలిసి వూళ్ళో వున్నప్పుడు కర్రసాము తప్పకుండా సాధన చేయడం ఓ అలవాటు.

ఇప్పుడీ రెండూ కూడా సాధ్యం కావడం లేదు. పైగా వంటా, ఇతర స్వంత వ్యవహారాలూ చూసుకోవడం ఇబ్బందే అవుతూంది.

సూరప్పో, శివకామయ్యో, రామన్నో ఒకరికొకరు నలుగురైదుగురు చేరేరు. సాయం చేస్తున్నారు. ఏదన్నా పనిమీద వూరికెడితే ఏ

మిత్రుడికో వప్పచెప్పుతూనే వున్నాడు. కాని, వాళ్ళకేదన్నా పని తగిలితేనో, మరిచిపోతేనే పల్లెలవాళ్లు గంటల తరబడి

నిలిచిపోతున్నారు. ఇది ఎలా పరిష్కరించాలో అతనికి అర్ధం కాలేదు.

ఇదొక పూటతోనో, రోజుతోనో తెమిలేదేనా? ఎవరికి వారు చేసుకోగలదీ, చేసుకోవలసినదీను ఆ పని. దానిని ఆటంకపరచేరు. ఆ

అపరాధానికి ప్రాయశ్చిత్తంగా ఈ పనిని చేయాల్సిందేనని విసుపు కలిగినప్పుడు ఓమారు తత్వబోధ చేసుకొంటాడు. ఆ వేడిలో రెండు

రోజులు బాగానే సాగుతుంది. మళ్ళీ ఎక్కడో ఏ రాజకీయాలను గురించో మంచి ముమ్మరంగా చర్చ సాగుతున్నప్పుడు నీళ్ళబిందెకి వేళయిందని

పరుగెత్తుకు రావలసి వచ్చేది. అటువంటి సమయంలో ఎంతో కష్టమే కలిగేది.

స్వరాజ్యం అతని ప్రాయశ్చిత్త భావన విని నవ్వింది.

"ఎవరు చేసిన పాపానికీ ప్రాయశ్చిత్తం?" అంది.

ముంగండ వూళ్ళోవాళ్లు చేశారనాలా? బ్రాహ్మణ కులానిదనాలా? లేక కులం వర్ణం అంటూ ఎన్నో భేదాలూ, తేడాలూ సృష్టించుకొన్న

సమాజానిదనాలా? అతనికి అర్థం కాలేదు.

ఆమె తెచ్చిన మరో ధర్మసందేహం అతనికి కొరుకుడు పడనేలేదు. పైగా తాను చేస్తున్న పనికి అర్థమే లేదనిపించింది.

"ప్రాయశ్చిత్తం చేసుకొంటున్న పాపాన్నే మళ్ళీ నిత్యం చేస్తూండడమూ, అదే సాగిస్తూండడమూ ధర్మమేనా?"

ఆ క్షణంలో దానిని వేళాకోళంగా తోసేశాడు.

అది మా బ్రాహ్మలకి అలవాటే. రోజూ ముమ్మారు మా పాపాలు ప్రక్షాళనం అయిపోతూనే వుంటాయి" అన్నాడు.

సూర్యశ్చ మా మన్యుశ్చ

మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః

పాపేభ్యో రక్షంతాం

యద్రాత్యా పాపమకార్షం

మనసా వాచా హస్తాభ్యాం

పద్భ్యాముదరేణ శిశ్నా

రాత్రిస్తదవలుంపతు

యత్కించ దురితం మయి

ఇదమహం మా మమృతయోనౌ

సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా!!

.....అని సంధ్యావందన భాగం చదివి వినిపించేడు.

కాని అది ఆమె ప్రశ్నకు సమాధానం కాదు. మంచి పండితురాలు అనుకొనే విశాలాక్షి కూడా ఆ చిక్కు విప్పలేకపోయింది.

ఊళ్ళో వీధుల్లో అస్పృశ్యుల్ని నడవనీయకపోవడమూ, వడగొట్టి చస్తున్నా అస్పృశ్యుల్ని చెరువునీళ్ళు

తాకనివ్వకపోవడమూ..... రెండూ ముంగండ పరిశుద్ధతకి రెండు భుజకీర్తులు.

వీధిలో అస్పృశ్యులు నడవడం నిషేధం గనక తన బాబాయి తన అవసరానికి వీలుగా కొన్ని మినహాయింపులు కల్పించుకొన్నాడు. వీధిలోకి

వచ్చిన గడ్డీ, గాదమూ పెరటి లోపలకు చేర్చవలసి వచ్చినా, పెరట్లో వున్న పెంటా-పేడా వీధిలో బండీలో పొయ్యవలసివచ్చినా

దొడ్డిగుమ్మాన పాలేళ్ళని వీధిలోకి రమ్మనేవాడు. సాధ్యమైనంత కొద్ది అడుగులలో, తక్కువ కాలంలో ఆ పనేదో వాళ్ళు చేసెయ్యాలి.

ఆయనను చూసి అటువంటి చిన్న చిన్న సర్దుబాట్లు మరికొందరు చేసుకొన్నా మొత్తంమీద గ్రామం మడిగానే వుండిపోతూంది. దానిని తుడిచి

పెట్టే తర్కం విశాలాక్షికీ నచ్చలేదు.

కనకనే రామనాధం స్వరాజ్యానికి ఒక చిన్న హామీ యిచ్చి సంతృప్తి పడదలచేడు.

"అటువంటి తప్పును దిద్దుకోడానికి మనం చెయ్యగలదంతా చేస్తాం. మనం మాత్రం అల్లాంటి పని చేయవద్దు.... చేయను....."

"అంటే..... ఇంకొకళ్ళు చేస్తూనే వుంటారు. మీరు చెయ్యని తప్పుకు ఓపికున్నంతగా ప్రాయశ్చిత్తం చేసుకొంటూనే వుంటారు. ఆ దోషం

మీది కాదు. ఒకరి కోసం చేసే ప్రాయశ్చిత్త ప్రక్రియ ఏమాత్రం చేసినా ఘనమే....."

ఆ అవహేళనకు రామనాధం వద్ద సమాధానం లేదు.

తప్పు దిద్దుకోడానికి పది బిందెల నీళ్ళు పోస్తే అయిపోతుందా? ఒక రోజో, ఒక వారమో, ఒక నెలో పోస్తే తీరుతుందా? మరేం

చెయ్యాలి?

అతనికీ ఆలోచనలు తెగలేదు. తాను చేస్తున్నది సరియైన పని అనిపించడం లేదు. ఆ ఆలోచనతోనే అతడు అంబాజీపేట సంత నుంచి

వచ్చేడు. కూడా తెచ్చిన ఏకుల మూట పాకలో పెట్టి నూతి వద్దనే స్నానం చేసేడు.

మామూలుగా అయితే అతడు స్నానానికి చెరువుకెళ్ళేవాడే. కాని, నేడు వెళ్ళాలనిపించలేదు. పల్లెలవాళ్ళు కూడా సంతకు వెళతారు.

వాళ్ళూ ఇప్పుడిప్పుడే వొస్తారు. తాను చెరువు వేపు వెడితే వాళ్ళు కనిపిస్తారు. నీళ్ళు పొయ్యకుండా తప్పించుకోలేడు.

తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం. చెరువుకు ముఖం చాటు చెయ్యడమే.

అతడా పనే చేశాడు. చేసినప్పుడు అనిపించకపోయినా తరువాత తానేదో తప్పు పని చేసి, మొగం చాటు చేస్తున్నట్లు అనిపించి

మనస్సుకి చాలా బాధ కలిగింది. అయినా వెళ్ళలేదు. వెళ్ళాలనిపించలేదు. తాను వున్నట్లు తెలియకూడదని హరికేన్‌

లాంతరు వెలిగించలేదు. ఆ చీకట్లోనే మంచం వాల్చుకు పడుకున్నాడు.

కొంత మందికి ఎవరో నీళ్ళు పోసి వుంటారు. తరవాత కొంతసేపు మామూలు వేడికోళ్ళు వినిపించేయి. ఎవరో ఒకామె తనను అభినందించడం

వినిపించింది.

"ఆ అయ్య తోటలో లేరల్లే వుంది. మారాజు ఈ నెల్లాళ్ళ నుంచీ ఎవర్నీ అడగనక్కర్లేకుండా ఓ కడవ నీళ్ళు పోస్తున్నారు."

రోజులో కనీసం మూడు నాలుగు గంటల కాలం తాను చేస్తున్న పనంతా ఒక్క కడవ నీళ్ళు పోయడమేనన్నమాట.

రామనాధం నిలువునా కుంగిపోయేడు. తాను చేస్తున్న శ్రమనంతా ఉఫ్‌న ఊదేస్తున్న ఆ మాటను అభినందనగా తీసుకోవాలో,

అభిశంసనగా తీసుకోవాలో అతనికర్థం కాలేదు. ఆమె అభినందనగానే అన్నా అది మాత్రం అతనికి సంతోషం కలిగించలేదు.

పదహారు

తన పరోపకార బుద్ధికి తానే బందీ అయిపోయినట్లనిపించి రామనాధం చాల విసుక్కున్నాడు.

ఊళ్ళోకెళ్ళి పెదతండ్రితో మాట్లాడాలి. తన మనస్సుని బాధపెడుతున్న ఈ సమస్యకి ఆయన మరో పరిష్కార మార్గం

సూచిస్తారేమోనని ఆశ. మాలపల్లె మంచినీటి సమస్యను పరిష్కరించేదెల్లాగ? ఇప్పుడు తాను చేస్తున్న పనిని ఎంతోకాలం సాగించడం

సాధ్యం కాదు. కాని వదిలెయ్యనూ లేడు. మనుష్యుడికి అవసరమైన మంచినీటి సమస్యా? మరొకటా? ఏం చెయ్యమంటారో, వెళ్ళి

అడగాలి.

కాని, ఆయన ఇల్లు రాజవీధిలో ఆ చివర వుంది. పెద్ద రేనిట్ల మీదుగా వెడితే పది నిముషాలలో వెళ్ళవచ్చు. కాని ఈ మూలలో

నీళ్ళ కోసం ఎవరన్నా కాచుక్కూర్చున్నారేమో. వాళ్ళు అడిగితే తోసుకుపోలేడు. అడక్కపోయినా, కడివెడు నీళ్ళ కోసం తన ముఖం

వేపు దీనంగా చూస్తూ నిలబడి వుంటే పట్టనట్లు వెళ్ళిపోయే మొండితనం లేదు. ఇంక చేయవలసిందల్లా రోడ్డు తిరిగి రాజవీధినే

వెళ్ళడం.

ఆ విధంగా వెళ్ళడం దొంగపనిలా కనిపించి చెరువుకట్ట మీదుగానే బయలుదేరేడు.

కాని, మూల రేవు వద్దకి వచ్చేసరికి చెరువు గట్టు పల్లంలో ఎవరో నిలబడ్డట్లే కనిపించింది. పలకరించేడు.

"ఎవరు వారు?"

"నేనయ్యగోరూ, యెంకినండి."

ఆ చీకట్లో కూడా ఆమె కాళ్ళ వద్ద కడవ నీడ నల్లగా కనిపిస్తూంది. నీళ్ళు కావాలని ఆమె అడక్కపోయినా అతడే అడిగేడు.

"ఇంత రాత్రయ్యేదాకా వున్నావేం?"

"సంత చేసుకొచ్చేతలికి ఈ యేలయిందండి."

ఆమె చాలా సేపటి నుంచే అక్కడ కాచుకొని వుంది. కాని, ఆ దారిన ఎవ్వరూ రాలేదు. ఎవ్వరూ లేరు గదా యని ఆమె, ధైర్యం

చేసి దొంగతనంగానైనా ఓ కడివెడు నీళ్లు పట్టుకుపోలేకపోయింది. చీకటి చాటున తాను గమనించి వుండని వాళ్ళెవరన్నా తనను

చూస్తే..... కొంపలంటుకుపోతాయి.

ఇప్పుడింతసేపటికి ఒక మనిషి అటు వచ్చేడు. అతడు సాయం చేసేవాడే. కాని చేతిలో బిందే, కడవా లేదు. అడిగినా ఏం

చెయ్యగలడు. కనక అడగలేక పోయింది.

రామనాధం ముందుకు అడుగు వెయ్యలేకపోయేడు. హఠాత్తుగా ఏదో నిశ్చయం చేసుకొన్నాడు. వెనక్కి తిరిగేడు.

"రా. నాతో, కడవ తీసుకురా."

వెంకి అనుమానించింది. ఆమెకా సమయంలో తన పడుచుదనమూ, రామనాధం యౌవనమూ గుర్తు వచ్చాయి.

"ఏడకండి, బాబయ్యా?"

ఆమె అనుమానం అతనికి అర్థం కాలేదు.

"తోటలోకి, నూతిలోంచి తోడుకుపోదువుగాని రా, బాల్చీ యిస్తాను."

వేసవికాలంలో చెరువు నీరు బాగా తగ్గిపోయినా, పసరెక్కి పాడైపోయినా చుట్టుపక్కలనున్న బ్రాహ్మణ ఇళ్ళకు ఆ నూతి నీళ్ళే

గతి.

ఇతరప్పుడు, మామూలు రోజుల్లో కూడా సుబ్బావధాన్లూ, రామశాస్త్రీ, సిద్ధాంతీ మొదలయిన వాళ్ళు ఆ నూతి వద్దనే స్నానం

చేస్తారు. ప్రశాంతంగా వుంటుందని అక్కడే ఏ చెట్టు క్రిందనో జపం చేసుకొంటారు. వాళ్ళ కోసమని శంకరశాస్త్రి ప్రత్యేకంగా ఓ

నాలుగు మేడిచెట్లు వేసేడు కూడా.

తానా నుయ్యి మైలపరిచేస్తే వారంతా ఏమయిపోతారు? వెంకికి తన హద్దులు తెలుసు. తన మనస్సులోని అసలు భయాన్ని అతి వినయం

మాటున దాచి పుచ్చింది.

"ఒద్దండి బాబయ్యా! యారో ఓరు ఒత్తారు. ఓ కడివెడు నీళ్లు పోత్తారు."

ఆ అభ్యంతరం వినేసరికి రామనాధానికి చెడ్డ విసువూ-కోపమూ వచ్చేయి.

"మీ చావు మీరు చావండి." అని ఉమ్మడిగా ఓ తిట్టు తిట్టేడు. వెంకి ఏమీ అనలేదు. రామనాధం విసురుకు లేచిపోయేడు. వెంకి

అసలు అనుమానాన్ని అర్ధం చేసుకోలేక, ఆమె అభ్యంతరాన్ని మరొకలా వ్యాఖ్యానించేడు.

తన మెత్తదనం చూసి నీళ్లు తోడుకొనే శ్రమ కూడా ఎందుకనుకుంటున్నారు కాబోలు అనుకొన్నాడు.

అతడి చిరాకూ, చిడుముడిపాటూ చూసీ, జరిగిన ఘటన వినీ విశాలాక్షి వులికి పడింది. నిజంగా అతని మాట విని వెంకి నూతిలో

నీళ్ళు తోడుకుపోతే మరేమన్నా వుందా?

"చంపేశావు" అంది.

ఊళ్ళో వాళ్ళు చంపేస్తారు. పీకేస్తారు. గగ్గోలు పెట్టేస్తారు. ఇంకా నయం. పది నిముషాలలో పది రూపాలలో ఊళ్లో రాగల

కల్లోలాన్ని ఆమె వ్యక్తపరిచింది.

ఈ మారు రామనాధం వెంకికిచ్చిన సలహానే వూరి వాళ్ళకూ సూచించేడు.

"తన్నుకు చావమను."

కాని, వెంకి ముందు అన్నంత తేలికగా వాళ్ళ ముందు అనలేకపోయాడు.

ముందు తన ప్రయత్నానికి కొంత జట్టును కూర్చుకోవాలి. ప్రొద్దున్నే నీళ్ళు పొయ్యడానికి బిందె తీసుకు వచ్చిన శివకామయ్యను

కదిపేడు.

"ఈ వుద్యోగం వచ్చేక మిగిలిన పనులన్నీ మూలపడ్డాయి."

"ఔను" అన్నాడు ముక్తసరిగా, శివకామయ్య.

"నలుగురు మనుష్యులు రోజూ పని చెరుపుకోవలసి వస్తూంది" అన్నాడు సూరప్ప.

కొల్లాయి గట్టితే నేమి? · 第 15 / 22 段