"నిన్ను మాత్రం ఎక్కమన్నామేమిటి?" అన్నాడు నారాయణమూర్తి.

"ఇల్లాంటి వాటినే అనిచ్ఛాప్రారబ్ధాలంటారు. మరి నాకు తప్పదుగా."

అందరూ ఒక్క నిముషం వూరుకున్నారు. మరల రామనాధమే ప్రారంభించేడు.

"మీ పెద్దవాళ్ళ అభిప్రాయాలు నాకు తెలిశాయి. తెలియచెప్పడంలో మీరేమీ సందేహం మిగల్చలేదు. కాని, మీ అమ్మాయి ఆలోచన ఏమిటో

తెలుసుకోవాలని గాని...."

కాని అన్నపూర్ణమ్మే అది సాధ్యం కాదంది. "చిన్నపిల్ల, దానికేమి తెలుసు?"

ఇంక నీతో మాట్లాడేది లేదు. నడవ్వచ్చునన్నట్లు నారాయణమూర్తి కుర్చీలోంచి లేచేడు.

తాను వచ్చిన పనేదో తేలేవరకూ కదిలేది లేదన్నట్లు రామనాధం కుర్చీలో కూర్చున్నాడు.

"మీరు చేస్తున్న పని కష్టసుఖాలననుభవించేది ఆవిడ" అన్నాడు.

"ఒకటే సుఖం." అంటూ అన్నపూర్ణమ్మ ఒక్క నిట్టూర్పు విడిచింది.

"అయిందేదో అయిపోయింది" అన్నాడు నారాయణమూర్తి.

రామనాధం ఒప్పుకోలేదు.

"మీకంతే కావచ్చు. నాకూ ఆమెకూ అల్లా కాదుగా. మా ఇద్దరిలో ఎవరు బ్రతికివున్నా తప్పదు. అయిపోయిందనుకోలేము."

ఆ దంపతులకేమీ సమాధానం తోచలేదు. ఒక్క నిముషం ఆగి రామనాధం మళ్ళీ అన్నాడు.

"నిజానికి నేనూ మీలాగే అనుకున్నాను. కాని దువ్వూరి సుబ్బమ్మగారు వొట్టు వేయించుకున్నారు. అభం శుభం ఎరగని ఆడపిల్లని

బ్రతికున్నంత కాలం ఏడిపిస్తావుట్రా అని వేధించుకుతింది ఆవిడ. అందుకు వచ్చేను గాని..."

దువ్వూరి సుబ్బమ్మగారి ప్రోత్సాహంతో వచ్చేననేసరికి నారాయణమూర్తికింక పట్టరాని కోపం వచ్చింది.

"వెళ్ళి అల్లరి చేయమని ఆవిడ పంపుతూందన్నమాట."

ఆ ఆరోపణ విని రామనాధానికి కోపం వచ్చింది. అసహ్యమూ కలిగింది. రామనాధం అనవసరమన్నట్లు తల తిప్పుకున్నాడు. కాని

నారాయణమూర్తి వదలలేదు.

"మళ్ళీ మళ్ళీ వచ్చి....."

మాట మధ్యలోనే రామనాధం అందుకున్నాడు.

"మీ ఇంటికి రావడానికి మహా సంతోషపడుతున్నాననుకోకండి..."

ఆ మాటకి కష్టం తోచినా అన్నపూర్ణమ్మ ఏమీ అనలేదు. నారాయణమూర్తి ఆ అభిప్రాయాన్ని హర్షించేడు.

"కోర్టు సమన్లు వచ్చినా సంతోషమే....."

రామనాధం ఆశ్చర్యం కనబరిచేడు.

"ఎందుకు?"

"పిల్లను పంపడం లేదని కోర్టుకెక్కినా నా అభ్యంతరం లేదు."

"చాల్లెండి" అని అన్నపూర్ణమ్మ మగడిని మందలించింది.

"పిల్ల బ్రతుకు నవ్వులపాలు చేయకు నాయనా! ఇప్పటికి అయిందానికి అది దిగులు పడిపోయింది." అని రామనాధాన్ని

బ్రతిమాలుతున్నట్లంది.

భార్యను తెచ్చుకోనేటందుకు కోర్టుకెళ్ళమన్న తరువాత రామనాధం ఇంక కూర్చుండడం అనవసరం అనుకున్నాడు. లేచేడు.

"ఇంత వరకూ నాకా ఆలోచన కలగలేదు. ఇంక ఆలోచిస్తాను. అయితే మీ అమ్మాయి అభిప్రాయం నాకు స్పష్టంగా తెలియాలి. నేను

అక్కర్లేని పెళ్ళాన్ని తెచ్చుకొని నాకేం సుఖం? ఆవిడకేం సుఖం? కాని ఆమె ఆలోచన తెలియాలి..."

"మేం చెప్తున్నాంగా......" అన్నాడు నారాయణమూర్తి

"చిన్నపిల్ల దానికేం తెలుసు?" అంది అన్నపూర్ణమ్మ

"మీరు చెప్పినట్లు మీ కూతురు చిన్నది. మిమ్మల్ని కాదనలేకుందేమో" అన్నాడు రామనాధం.

"పెద్దదయ్యాక చెప్తుందిలే"

నారాయణమూర్తి అవహేళనను రామనాధం లెక్కచెయ్యలేదు.

"మగడి దగ్గరికి పంపే వయస్సు వచ్చిందని మీరంతా ఏడాది క్రితమే అనుకున్నారు. ఆపాటి వయస్సుగలామె మగడికి కబురు

చెయ్యాలంటే దారే వుండదా?"

ఆ మాట లోపల వుందనుకున్న సుందరికి వినబడేలాగున గట్టిగానే అన్నాడు.

"మా పిల్లల్ని భయభక్తులూ, సిగ్గూ బిడియాలూ ఎరగకుండే లాగ పెంచలేదు" అని నారాయణమూర్తి సగర్వంగా చెప్పుకున్నాడు.

"వాటి రంగూ, రుచీ, వాసనా వంటి లక్షణాలెల్లా వుంటాయో తమ సహవాసంలో తెలుసుకోగల అదృష్టం లేదు నాకు. ఏం చేస్తాం. అంతే

పెట్టిపుట్టేనా" అంటూ ఎగతాళిచేస్తూ రామనాధం నమస్కరించేడు.

"మరి సెలవా? నమస్కారం."

అతని వెక్కిరింతనూ, నిర్లక్ష్యాన్నీ చూసి విస్తుపోయి నిల్చున్న ఆ దంపతుల్ని వదలి గుమ్మం వరకూ నడిచేడు. మళ్లీ అంతలో

ఆగి వెనక్కి తిరిగేడు.

"ఆమె అభిప్రాయం తెలిస్తే బాగుండునన్నానని చెప్పండి."

మరల వెనుదిరిగి వీధిలోకి నడిచేడు. నారాయణమూర్తి గర్జించేడు.

"ఎవరోయ్‌ అక్కడ?"

"సార్‌!" అంటూ వాకిట్లో వున్న పోలీసు బంట్రోతు బెల్టు సవరించుకుంటూ గుమ్మం ఎక్కేడు.

"తేలు వచ్చిందట, చెప్పు ఒకటి తీసుకెళ్ళు" అని అతనికి సలహా ఇచ్చి రామనాధం వెళ్ళిపోయేడు.

మగని గొంతునూ, రామనాధం పోలీసువానికిచ్చిన సలహానూ విని అన్నపూర్ణమ్మ ఉలికిపడింది. భర్త మాట్లాడే లోపునే పోలీసువానికి

పని చెప్పింది.

"ఆ కుర్చీ తీసి వాకిట్లో వెయ్యి."

తేలును చంపడానికి చేతిలోకి తీసుకున్న కాలి చెప్పునేం చెయ్యాలో అర్ధంగాక పోలీసువాడు తటపటాయించేడు. నారాయణమూర్తి అప్పటికి

నిగ్రహించుకొన్నాడు.

"అక్కర్లేదు. పోయిందిలే" అన్నాడు.

తొమ్మిది

తన తండ్రిని పురుగు మాదిరిగా దులపరించేస్తున్న రామనాధం మాటలకి సుందరి వుడికిపోతోంది. తన అభిప్రాయం ఏమిటో తెలిస్తే

బాగుండునన్నప్పుడు ఎదుటపడాలనే అనిపించింది. నీతో కాపురం చెయ్యడం కన్న గోదావరిలో దిగడం సుఖమనుకుంటున్నానని

చెప్పెయ్యాలనుకుంది. కాని పస్తాయించింది.

ఆతడు వెళ్ళిపోయేక తల్లితో అనేసింది కూడా.

"నేను వచ్చి చెప్పేస్తే ఈ పీడా వదిలిపోయేది కదే అమ్మా!"

"పీడ అనకు. తప్పు." అని అన్నపూర్ణమ్మ మందలించింది.

"పీడగాక ఏమిటీ రభస అంతా" అని సుందరి రెట్టించింది.

దానినేమనాలో అన్నపూర్ణమ్మకు తోచలేదు. చిన్ననాటి నుంచీ పెరిగిన అలవాట్లలో భర్తను పీడగా భావించడం మహా పాపంగా

భావిస్తూంది. తల్లిగా తన వయస్సు వచ్చిన కూతురు జీవితమంతా భర్తకు దూరంగా వుండాలా అనుకొని తల్లక్రిందులూ అయిపోతూంది.

కాని, కాని.......

అల్లుడు రాజకీయాలలో పడి తన భవిష్యత్తునంతనూ పాడుచేసుకొన్నాడే యనే బాధ వేరు...

జైలులో నానాకూళ్ళూ కుడిచి కులం చెడి, ప్రాయశ్చిత్తానిక్కూడా నిరాకరించడం వేరూను....

కులం చెడిన వాడితో కూతురు కాపురం మాటను కూడా భరించలేదు. అతడెన్నటికేనా ప్రాయశ్చిత్తానికి అంగీకరించడా అనేది ఆమెకు

మిగిలిన ఆశ. అదెల్లా సాధ్యమవుతుందో ఆమెకు తెలియదు. ఆ ఆశలేమన్నా వున్నా ఈవేళతో అవి భగ్నమయాయనే తోచింది. కాని,

ఆ తగవులూ, గొడవలూ, తమకు మాత్రమే పరిమితం కావాలనీ, కూతురుకు దానిలో సంబంధం వుండరాదని ఆమె ఆలోచన.

కూతురు మనస్సులో రేగుతున్న కల్లోలం ఆమెకేమీ తెలియదు. తమ సూటిపోటి మాటలు, ద్వేష ప్రకటనలతో ఆమె మనస్సు

విరిగిపోయిందనే సంగతి ఆమె అర్థం చేసుకోవడమే లేదు.

"తప్పు తల్లీ! లెంపలు వేసుకో!" అంటూ కూతురు బదులు తానే లెంపలు వేసుకొంది.

ఆ పాతివ్రత్య ప్రబోధం వినేసరికి సుందరి ఒళ్ళు రగిలిపోయింది. తమకూ, తమ కుటుంబానికీ అవమానాలు కలిగించడమే పరమావధిగా

వ్యవహరిస్తున్నాడనుకొంటున్న మనిషి పీడగా వున్నాడనుకోవడం తప్పా? "లక్ష మాట్లంటాను. పీడ, పీడ." అంటూ సుందరి

ఉడుకుబోతుతనంతో భళ్ళున ఏడ్చేసింది. గదిలోకి పోయి తలుపు గడియపెట్టేసుకుంది.

ఆ వేగం తగ్గేక కూడా ఆమె తలుపు తియ్యలేదు. సరంబీ వేపు కన్నార్పకుండా చూస్తూ ఏవేవో ఆలోచనలలో కొట్టుకుపోయింది.

పండుగలకూ, సెలవులకూ వచ్చినప్పుడల్లా రామనాధం ఇంట్లో ఎంతో సరదాగా వుండేవాడు. తమ్ముళ్ళూ, చెల్లెళ్ళతో కబుర్లు చెప్తూ

గంతులు వేస్తూంటే చాటునుంచే తాను ఎంతో పొంగిపోయేది. అటువంటి వాడు ఒక్కమారెల్లా అయిపోయేడు. మాటలలో ఆ అవహేళన, వెక్కిరింత,

కోపం, ద్వేషం........ ఎందుకొచ్చాయి?

అతనితో సుఖమయమైన జీవితం గడపగలదని తన వాళ్ళంతా తన అదృష్టానికెంతో మురిసిపోయేవారు. ఇప్పుడంతా తన్ను

దురదృష్టవంతురాలంటున్నారు. ఆ అదృష్టం, దురదృష్టం తన జీవితంలో ఏ రూపంలో ప్రతిబింబిస్తున్నాయో ఆమెకే తెలియదు. ఒకటే

తెలుసును. అతడు వస్తున్నాడంటే తనకు సంతోషం కలగలేదు. భయం వేసింది. వచ్చి వెళ్ళేక భయం కూడా లేదు. ఇప్పుడు ఎంతో కసి

ఏర్పడింది.

"తన అభిప్రాయం కావాలట."

సుందరి గబగబా లేచి కూర్చుని తండ్రి డ్రాయరునుంచి కాగితం, ఫౌంటెన్‌పెన్నూ తీసింది.

కాని ఎలా ప్రారంభించాలో ఆమెకు తోచలేదు. తను నేర్చుకొన్న అలవాట్ల ప్రకారం "బ్రహ్మశ్రీ వేదమూర్తులైన" అని

ప్రారంభించింది. కాని అంతలో ఆ వేదమూర్తి తమ వూరి మాదిగ పుల్లడి చేతి అన్నం తిన్నానని గొప్పగా చెప్పుకొన్న మాట గుర్తు

వచ్చింది. చిన్న నవ్వు, అంతో వెలపరం. కాగితం చింపేసింది.

మరల వ్రాసింది. తీసేసింది. మరల వ్రాసింది. చివరకు ఆ కాగితాలన్నీ నలిపి పారేసి, కలం సొరుగులో పెట్టేసింది.

కాని, తన అభిప్రాయం రామనాధానికి చెప్పాలి. లేకపోతే.....

తన అభిప్రాయం తెలిసే కోర్టుకి వెడతానన్నాడో, తెలియక వెడతానన్నాడో రామనాధం మాట ఆమెకు స్పష్టంగా అర్థం గాలేదు.

ఆమె ఆలోచనలన్నీ కోర్టుకెళ్ళాలిసి వొస్తుందేమోనన్న సమస్య మీదకు క్రమంగా కేంద్రీకృతమయ్యేయి.

రాత్రి తల్లీ-తండ్రీ ఆ విషయమే మాట్లాడుకుంటూ వుంటే గోడ పక్కనుంచి వినడానికి ప్రయత్నించింది.

"ఆతడు కోర్టుకెడితే పిల్లలెవ్వరికీ పెళ్ళిళ్ళు కావు. అందరూ వేలుపెట్టి చూపిస్తారు" అని తల్లి భయం.

వీళ్ళు కూతుళ్ళని కాపురానికి పంపించరు. అల్లుళ్ళని కొడతారు. చివరకు కోర్టుకెళ్ళవలసి వస్తుందన్న మాట చిన్నదేం కాదు.

అటువంటి ఘట్టం రాకుండా ఏం చెయ్యాలో ఆ దంపతులకు అర్ధం కాలేదు. మగడు మతాంతరుడైతే భార్యను రప్పించుకొనేటందుకు కోర్టు

అనుమతిస్తుందేమో రేపు వకీలుగారిని అడిగి వస్తానని తండ్రి ఆలోచన....

"కోర్టులో గొడవ తప్పదంటారా?"

అయితే జైలుకెళ్ళి కులం చెడినా, ప్రాయశ్చిత్తం చేయించుకోకపోవడం అనేది మతాంతరుడు కావడంగా లెక్కలోకి వస్తుందో రాదోయని

నారాయణమూర్తి ఆలోచన.

రామనాధం తన కోసం కోర్టుకెళ్ళడం స్థిరమే అయినట్లు సుందరికి భయం పట్టుకొంది.

దానిని నివారించడం ఎల్లాగ?

ఈ విషయం ఆలోచించిన కొద్దీ రామనాధంతో మాట్లాడడం అత్యవసరమని అమెకే అనిపించసాగింది.

ఏమి మాట్లాడుతుంది? ఎలా మాట్లాడుతుంది?

మరో రెండు రోజులు పోయాక పెత్తల్లి కొడుకు సత్యం వచ్చేడు. అతడిచ్చిన వార్తా సమాచారాలతో తల్లి మరీ ఆందోళన పడింది.

'కోర్టులో ఓ కాగితమ్ముక్క పడెయ్యవోయ్‌' అని వూళ్ళో వాళ్ళు సలహాలిస్తున్నారని అతడి వార్త.

'అనవసరంగా గొడవలు పెంచుకోకండ'ని ఆమె అక్క మగడు రామమూర్తి సలహా. అన్నపూర్ణమ్మ చతికిలపడిపోయింది.

సత్యం చెప్పిన మాటలనుపట్టి తాము కోర్టుకు భయపడి పిల్లను పంపేసినా అక్కడ సుఖపడుతుందనే ఆశ లేదు.

రామనాధం తోటలో పాకలోనే మకాం పెట్టేడు. చుట్టూ దగ్గరలో ఇళ్ళు లేవు. ఒంటరిగా పలకరించే ఆడవాళ్లు కూడా లేకుండా కాపురం

చెయ్యాలి? అతడు తన వద్ద వున్న డబ్బూ, అప్పు చేసి తెచ్చిన డబ్బూ ఖద్దరు వొడికించడం, నేయించడం మీద పెడుతున్నాడు.

ఓ పాతిక మందికి రాట్నాలు కొని యిచ్చి వొడికిస్తున్నాడు. ఎప్పుడూ ఇంటిపట్టున వుండడు. సంధ్య వగైరాలు గూర్చి ఇప్పుడంతగా

ఎవరూ చెయ్యడం లేదు గాని, జందెం వేసుకోననీ, తద్దినాలు పెట్టననీ కూడా అంటున్నాడు.....

రామనాధం అపరాధ సహస్రాన్ని ఎటు తిప్పి తిరగేసినా ఆశారేఖ కనబడ్డం లేదు.

తల్లి ఆవేదన చూడలేక సుందరి తన్ను పంపించెయ్యమంది.

"ఆ ఎద్దడినీళ్ళు తేగలవుటే కూతురా..."యని అంగలార్చింది అన్నపూర్ణమ్మ.

"తేలేకపోతే అందులో పడి చస్తాను. వాళ్ళ ప్రాణం తేలిక పడుతుంది."

విసువు, నిస్పృహ, ఆగతికత్వంతో యధాలాపంగా అన్నమాటైనా అన్నపూర్ణమ్మ నిజంగా అదిరిపోయింది.

"అల్లాంటి పనెప్పుడూ చెయ్యకే తల్లీ. ఇన్నేళ్ళూ పువ్వుల్లో పెట్టి పెంచినది నిన్ను ముంగండ చెరువుకు వప్పచెప్పడానికి

కాదమ్మా! చచ్చి ఎవరిని సాధిస్తాము.."

అన్నపూర్ణమ్మ ఆత్మహత్య వలన కలిగే పాపం, అది సాధించలేని ప్రయోజకతా గురించి చెప్తూంటే సుందరికో ఆలోచన తట్టింది.

ఆ భర్తతో కాపురం తనకిష్టం లేదని చెప్పేస్తుంది. నెమ్మదిగా చెప్పడం కాదు గట్టిగా చెప్పేస్తుంది.

కాదు కూడదని అతడంటే నడవమంటుంది.

"కాని, నీతో కాపురం చెయ్యను, ముట్టుకున్నావంటే చెర్లో పడి చస్తాను" అని కూడా చెప్పేస్తుంది.

అతడు వినకపోతే నిజంగా చచ్చిపోతుంది. పెళ్ళాన్ని చంపేసేడని అతని మీద కేసు అవుతుంది. ఆ విధంగా కసి తీర్చుకుంటా...

అనుకుని ఒక విధంగా మనస్సుని సంతృప్తి పరచుకొంది.

మధ్యమధ్య తన నిర్ణయం తలచుకొని మనస్సులో వ్యధపడుతూంది. తాను బలవంతంగా మరణిస్తే ఎవరెవరు దుఃఖపడతారో,

వ్యవహారాలు ఎలా మారతాయో వూహించడానికి ప్రయత్నించసాగింది. ఆ కల్పనలు ఒక్కొక్కప్పుడు భయం కలిగించినా కసి తీర్చుకోవాలనే

ఆశను పురిగొల్పసాగేయి.

రామనాధానికి చెప్పెయ్యాలి.

"కులభ్రష్టుడితో తనకేం పనిలేదని చెప్పేస్తుంది. వినడూ.... అనుభవిస్తావు సుమా యని చెప్పేస్తుంది."

నిర్ణయమైతే చేసింది కాని, రామనాధంతో చెప్పడమెలాగ? అతనిని చూడడం ఎక్కడ? తమ యింట్లో కూడదు. తాను ముంగండ వెళ్లదు.

మరి?

స్వరాజ్యం జ్ఞాపకం వచ్చింది. మొన్ననాతడు వచ్చినట్లు ఆమే చెప్పింది. వాళ్ళింటికి వస్తూంటాడేమో....

పది

మరునాడు మాటవరసకు అడిగినట్లు స్వరాజ్యమే ఆసుపత్రిలో కనిపించినప్పుడు అడిగింది.

"మీ భర్త వున్నారా?"

"వుంటే మళ్ళీ కనిపించరా?" అని సుందరి టక్కున సమాధానమిచ్చింది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆమె ముఖంలో సిగ్గు గాని,

సంతోషం గాని కనబడకపోవడం స్వరాజ్యానికి అనుమానం కలిగించింది. మాటకూడ తుంచేసినట్లే వుంది.

ఆమెకు భర్త యెడ ఇష్టం వుండీ, తల్లిదండ్రులదే ఆటంకమైతే తానా భార్యాభర్తలను సమ్ముఖపరచడంలో అర్థం వుంది. చిన్న

చిన్న మనఃక్లేశాలున్నా సర్దుకొంటాయి. కానీ, ఆమెకే వ్యతిరేకత అయితే మధ్యన తాను ఇరుకున పడవలసి వస్తుంది అనుకొని

వూరుకుంది.

కాని, అటుతర్వాత సుందరే తన ప్రయత్నాలకు సాయపడుతున్నట్లు అనిపించి స్వరాజ్యం ఆలోచనలో పడింది. ఆ ఆలోచన తేల్చుకొనే

లోపునే ఆమె స్వరాజ్యాన్ని తమ యింటికి ఆహ్వానించింది. ఆమెచేత ఆహ్వానం ఇప్పించుకొంది....

ఆ రోజున వుదయం ఆస్పత్రిలో కనిపించినప్పుడు సుందరి స్వరాజ్యాన్ని పలకరించింది.

"మీరు సోమవారం వెళ్ళిపోతారంటున్నాడు కాంపౌండరు. నిజమేనా?"

స్వరాజ్యం అంగీకరించింది.

"మీ నాన్నగారికి బాగా సులువు చిక్కిందా?"

"ఆ. ఇంట్లో తిరుగుతున్నారు."

"మీరు మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఎందుకు కలుస్తారు? వెళ్ళేలోపున మా యింటికి ఓ మారు రాండి."

స్వరాజ్యం అంగీకరించింది. వెంటనే సమయ నిర్దేశం కూడా చేసింది.

"ఇప్పుడు రాండి."

"మందు ఇంటి వద్ద ఇచ్చి...."

"ఓస్‌. అంతేనా? మీ ఇల్లు ఇక్కడే కదా, నడవండి. మీ నాన్నగారిని నేనోమారు చూసినట్లూ అవుతుంది. ఇద్దరం

కలిసే మా ఇంటికి వెడదాం."

ఇద్దరూ బసకు వచ్చేరు. సుందరి పది నిముషాలు కూర్చుంది. అబ్బాయి నాయుడు యోగ క్షేమాలు తెలుసుకొంది. స్వరాజ్యం ఇచ్చిన

బరణి అందుకొని బొట్టు పెట్టుకుంది. పండూ, తాంబూలమూ తీసుకుంది.

ఆమె అక్కడున్న పది నిముషాలూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టే స్వరాజ్యానికి అనిపించింది.

ఇద్దరూ కలిసి సుందరిగారింటికి వెళ్ళేరు. తిరిగి వచ్చేసేటప్పుడు స్వరాజ్యం తామిక వుండే నాలుగైదు రోజులలో ఎప్పుడేనా ఓమారు

రావలసిందని ఆహ్వానించింది. కాని అన్నపూర్ణమ్మ 'అమ్మో' అంది.

"గుమ్మం కదిలిందని వింటే వాళ్ళ నాన్నగారు కోపం చేస్తారు తల్లీ....!"

సుందరి మామూలుగా అనేసింది.

"మీ అమ్మగారు వస్తారన్నారు కదూ. వచ్చేక ఓ మారు వస్తాలెండి."

--అంటూనే తల్లి భయానికి సమాధానం ఇచ్చింది.

"డాక్టరు శాస్త్రిగారి ఆసుపత్రికి రెండిళ్ళ అవతలేనమ్మా వీరు వుంటున్నది."

స్వరాజ్యం ఇంకేమీ అనలేదు.

శనివారం ఉదయం తన తల్లి వచ్చినట్లు చెప్పగానే సుందరి బయలుదేరింది.

అదంతా చూస్తూంటే ఆమె కోరికా, నిర్ణయమూ ప్రకారమే తాను రామనాధాన్ని రప్పిస్తున్నట్లు అనిపించి, స్వరాజ్యం కంగు తింది.

తన తల్లిని పలకరించి పది నిముషాలు కూర్చుని 'ఇంక వెడతానండి" అని సుందరి లేస్తూండేసరికి వీధిలో మాట వినిపించింది.

మంచం మీద కూర్చుని వున్న నాయుడు ఆ కంఠాన్ని గుర్తించేడు.

"రామనాధంగారు వచ్చేరమ్మా!"

మరు నిముషంలో గుమ్మం ఆవల నుంచి రామనాధం ప్రశ్న వినిపించింది.

"తేలికగా వున్నారా నాయుడుగారూ?"

"దయచేయండి....ఆఁ......మీ దయవలన బాగానే వుందండి."

అంటూ నాయుడు కూతురుని పిలిచి కుర్చీపీట దగ్గరగా వేయమన్నాడు.

రామనాధం గదిలో పైవాళ్ళు కూడా ఎవరో ఉన్నట్లనిపించి గుమ్మంలోనే నిలిచిపోయేడు.

"ఎందుకులెండి. ఇక్కడ కూర్చుంటా."

మాణిక్యమ్మ ఆహ్వానించింది.

"లోపలికి రండి బాబూ! పైవాళ్ళెవ్వరూ లేరు" అంది.

"మీరెప్పుడు వచ్చేరు? వారం రోజుల క్రితం వచ్చినప్పుడు మీరు లేరు..."

అతడు లోపలికి కాలు పెట్టబోయి ఇంకా పైవారెవరో వున్నట్లు చూసి ఆగేడు.

మాణిక్యమ్మ నవ్వుతూనే అంది-- "ఈ అమ్మాయి ఎవరో ఎరుగుదురా?"

రామనాధం లోనికి చూసేడు.

ఈ ఏడాది లోపలా సుందరి బాగా సాగింది. కొంత వొళ్ళు చేసింది. ఏడాది క్రితం ఓ పదినిముషాలు మాత్రమే చూసిన సుందరి కాదు

ఇప్పుడాతని ఎదుట వున్నది. పైగా అతడామె అక్కడకు రాగలదనే ఆలోచనలో కూడా లేడు. ఒకమారు చూసేడు. సుందరి తల

తిప్పుకొంది. ఇంకా కొత్త అమ్మాయిని దీక్షగా చూడడం మర్యాద కాదని తనూ తల తిప్పుకున్నాడు.

"నేనెరిగినట్లు గుర్తు రావడం లేదు."

సుందరి క్రింద పెదవి కరచుకొంది. స్వరాజ్యం ఫక్కున నవ్వింది.

"వాళ్ళిద్దరూ పరిచయం చేసుకుంటారు మీరు రండి. భోజనం చేద్దురు గాని" అంటూ మాణిక్యమ్మ భర్తను లేవదీస్తూంటే రామనాధానికి

ఆశ్చర్యమూ, సిగ్గూ కలిగేయి. తన భార్యనే తాను గుర్తుపట్టలేకపోయేడు. ఆమె సుందరియేనా? అనుకొన్నాడు.

పదకొండు

ఆతడాశ్చర్యం నుంచి తేరుకొనేలోపున నాయుడు కుటుంబం వంట గదిలోకి వెళ్ళిపోయేరు. రామనాధమూ-సుందరీ మాత్రమే ఆ గదిలో మిగిలేరు.

ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ, తనలో తాననుకున్నట్లు అన్నాడు.

"గుర్తు పట్టలేకపోయేను."

'గుర్తు కూడా పట్టలేని మనిషి కోసమేనా అంత రగడ చేశాడు' అనుకొంది సుందరి.

అతడీ మారు సర్దుకొన్నాడు.

"డాక్టరు దగ్గరకు వస్తున్నావన్నారు. ఏమిటనారోగ్యం? ఇప్పుడు నెమ్మదిగా వున్నావా?"

"చూస్తున్నారుగా" అని సుందరి పుల్లవిరిచినట్లు అంది.

రామనాధం ఉలికిపడ్డాడు.

మాట కటువుతనంలో ఆమె తండ్రికి ఏ మాత్రమూ తీసిపోదు అనిపించింది. ఆ కంఠస్వరాన్ని తాను భరించలేడు. భార్యాభర్తలు నవ్వుతూ,

తుళ్లుతూ సరదాగా వుండాలనేది అతని ఆశ. కాని, ఇదేమిటి?

అయినా అంత త్వరలో ఓర్పు కోల్పోయే స్వభావం కాదు. ఆమె అని తెలిసిన వెంటనే మనస్సులో మెదిలిన అభిప్రాయాన్నే పైకి

చెప్పేసేడు.

"ఇదివరకు చూసినప్పటికన్న బాగా సాగేవు."

ఆమె ఏమీ అనలేదు. అతని కళ్ళలో కనిపించిన మెచ్చుకోలుకు ఆమె ముఖం ఎర్రబడింది.

"గుర్తు పట్టలేకపోవడంలో ఆశ్చర్యం ఏం వుందీ...." అన్న ఆత్మ సమర్థనకు కూడా ఆమె ముఖంలో కదలిక రాలేదు.

"నిల్చున్నావు.....రా ఈ కుర్చీపీట మీద కూర్చో......"

"ఎందుకు లెండి......."

"నువ్వు నిల్చుంటే నాకు కాళ్ళు పీకుతున్నాయి." అంటూ రామనాధం మేలమాడేడు. సుందరి ముఖంలో నవ్వూ, ఉత్సాహమూ కనబడలేదు.

రామనాధం మరింత చొరవ చెయ్యబోయేడు."

"అంత సిగ్గు పనికిరాదు రా.....కూర్చో" అని చేయి పట్టుకొనేటందుకు ముందుకు అడుగువేసేడు.

అసహ్యకరమైన పురుగు మీదకు వస్తూంటే జంకినట్లు సుందరి ఒక అడుగు వెనక్కి వేస్తూ ముణుచుకుంది.

"ముట్టుకోవద్దు."

ఆ భంగిమా, కంఠం చూసి రామనాధం గతుక్కుమన్నాడు.

"నేను ముట్టుకొంటేనే మైలబడిపోతావా?"

సుందరి చురుక్కుమనేలా చూసింది. నీ ప్రశ్నకు సమాధానం కూడా అవసరమా అన్నట్లనిపించి రామనాధం వెనక్కి తగ్గేడు.

తమ దాంపత్య జీవితం ఇల్లాగే నడవాలి కాబోలనిపించి రామనాధం చిన్నపుచ్చుకొన్నాడు. ఆమె అన్నగారూ, అతని భార్యా మధ్య

వున్న అన్యోన్యతను చూసి కలలుగన్న మనస్సుకు ఈ ప్రారంభం చురుక్కుమనిపించింది.

"ఏడాదిక్రితం లేని మడి-మైల వచ్చిపడ్డాయి. కాని మన ఇంటికి వెళ్ళేక."

"మన ఇల్లంటే.....?"

రామనాధం ఆమె ముఖం వంక నిశితంగా చూశాడు.

"చెరువుక్రింద తోటలో ఒక కుటీరం వేస్తున్నాను. అది మనది...."

మనది అన్న మాటలో నొక్కు వినిపించి సుందరి తల తిప్పుకొంది.

నీకిష్టమేనా అంటే లేదంటుందనిపించి నాలుక చివర వరకూ వచ్చిన ఆ ప్రశ్నను అంగిట్లోనే అణచివేసుకొన్నాడు రామనాధం.

"ఈ వారం పది రోజులనుంచీ నిన్ను ఓమారు కలుసుకోవాలని నా ప్రయత్నం. ఈ వేళ అనుకోకుండా తటస్థపడ్డావు."

"విన్నాను."

అతడామె ముఖంవంక చూసేడు.

"నాలుగు రోజులనాడు మీ యింటికి వచ్చేను....."

"......."

"మీ నాన్న, అమ్మా కనిపించేరు."

"......."

"వారితో కన్న నీతో మాట్లాడడం అవసరమని వారికి చెప్పేను."

"ఆ మాట మీరు చెప్తూంటే విన్నా. ఒకమారు కాదు. రెండుమాట్లన్నారు. ఆ మాటలో వెటకారం వినిపించి రామనాధం చురుక్కుమనేలా

చూసేడు. కాని, అంతలో నిగ్రహించుకొన్నాడు.

"విని కూడా నిన్ను కాదన్నట్లు వూరుకొని వుండకపోతే....."

"వూరుకోలేదు కనకనే ఇక్కడ వున్నాను."

స్వరాజ్యం ప్రయత్న ఫలితం కాదన్న మాట ఈ దర్శనం. తానుగా కలుసుకొనడానికి వచ్చిన మనిషిలో ఆ మాట, పెళుసుతనం

ఏమిటి? దెబ్బలాటకు వచ్చినట్లు ఆ కవ్వింపు ధోరణి ఏమిటి? తండ్రిగారి పోలీసు ఆఫీసరు హోదా తరిఫీదా ఏమిటి,

ప్రారబ్ధం... అనుకుంటూ ఒక్కనిముషం వూరుకున్నాడు.

"దానికోసం అలగడం అవసరం లేదు." అంది సుందరి.

"అలగడమా.......?" రామనాధం ఆశ్చర్యంగా ఆమె వంక చూసేడు.

"ఔను."

"అలగడం అవసరమనుకుంటే నీతో ఈ మాటల అవసరమే లేదు."

సుందరి ఏమీ అనలేదు. ఇద్దరూ ఒక నిముషం వూరుకొన్నారు. మరల రామనాధమే అన్నాడు. ఈమారతని కంఠంలో చికాకు వినిపించింది.

"సరే, నా ప్రశ్నకూడా అర్థమయ్యే వుంటుంది."

సుందరి అంగీకారంగా తల తిప్పింది.

"నీ అభిప్రాయం ఏమిటి?"

సుందరి అతని వంక చురుక్కుమన్నట్లు చూసింది.

"మా అమ్మా నాన్న చెప్పేరు....."

"నేను పెళ్ళి చేసుకొన్నది నిన్ను....."

ఆమె ఏమీ అనలేదు.

"నీ ముఖతః వినాలని నా కోరిక...."

"నేనూ అలాగే అనుకుంటూంటే"--అంది.

అతడు ఆమె నోట అటువంటి సమాధానం ఆశించని వానిలాగ కొద్దిసేపు నిర్వాక్కుడుగా నిలబడిపోయేడు.

"ఆలోచించే అంటున్నావా? ఏదో ఆవేశంలో....."

సుందరి టక్కున తెంపేసినట్లు అనేసింది.... "బాగానే ఆలోచించేను..."

అతడు ఏమీ అనలేకపోయేడు.

"మీరు కోర్టులో అడిగినా అదే మాట చెప్తాను...." అంది.

రామనాధం ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు.

"కోర్టు మాటెందుకు వచ్చింది?"

తానాతడు కోర్టుకెళ్ళకుండా ఆగమనాలనే వచ్చింది. కాని, చివరకాతనిని ప్రోత్సహిస్తున్నది తానే యన్నట్లనిపించి సుందరి

చటుక్కున వూరుకొంది.

తన మామగారు కూడా వారం రోజుల క్రితం అదే మాట అన్నట్లు గుర్తు వచ్చింది.

"నాకా వుద్దేశం లేదు. ఇష్టం లేని భార్య కోసం కోర్టుకెళ్ళాలనే ప్రయత్నం వట్టి దండుగ."

సుందరి ఆ మాట నిజమేనా అన్నట్లు అతని ముఖం వంక చూసింది. ఆ చూపును గ్రహించేడు.

"నేను సత్యాగ్రహిని. నా కేసునే నేను వాదించుకోలేదు. తెలుసు కదా....."

ఆమె ఆలోచనలో పడింది.

"మీ వాళ్ళే పంపుతే....."

"తాళి కట్టించుకొన్నాక తప్పుతుందా?"

రామనాధం ఒకమారాగేడు.

"అప్పుడైనా ఇష్టం వుండి కాదన్నమాట."

సుందరి ఏమీ అనలేదు.

రామనాధం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తోచింది.

"సరి. నీకు ఇబ్బంది కలిగిస్తే ఏమీ అనుకోకు......"

"మీరు మళ్ళీ...."

రామనాధం తల తిప్పేడు.

"ఏమీ భయపడకు. మరల నీ ఛాయలక్కూడా రాను...."

"నేను వెళ్ళిపోయేనని చెప్పు."

గుమ్మంకేసి రెండడుగులు వేసి అంతలో ఆగేడు. మళ్ళీ అంతలో మనస్సు మార్చుకొని వెళ్లిపోయేడు.

తాను వచ్చిన పని విజయవంతంగానే ముగిసినా సుందరికి ఎందుచేతనో సంతృప్తి కలగలేదు. రామనాధం అంత సులభంగా అంగీకరిస్తాడని

ఆమె అనుకోలేదు. తాను అనెయ్యాలనుకొన్న మాటలూ, చేసుకొన్న నిర్ణయాలూ వినకుండానే సమస్య పరిష్కారం అయిపోయింది. అది

సంతోషించదగిన విషయమో, విచారించదగినదో అర్థం కాలేదు.

అతడు వెళ్ళినవేపే చూస్తూ సుందరి కొంత సేపు నిలబడి, తరవాత తలుపు జేరవేసి తానూ వెళ్ళిపోయింది.

పన్నెండు

పెంచిన ప్రేమ మనస్సుని పీకుతున్నా రాజమ్మ ఒక్క మారుకూడా తోటలోకి వెళ్ళలేకపోయింది. రామనాధానికేం సహాయం కావాలో

తెలుసుకుందామన్నా కుదరడం లేదు. ఏదో వేళప్పుడు అతడే వస్తాడు. ఏమన్నా కావాలా అంటే ఏమీ వద్దంటాడు. ఏం పెట్టినా

వద్దంటాడు. తింటున్నాడో, మానుతున్నాడో చూడలేకపోయింది. దూరమూ, భారమూ కాదు. తాను నిత్యమూ నీళ్ళు తెచ్చుకొనేటందుకూ,

బట్టలుతుక్కునేటందుకూ వెళ్ళే పెద్ద చెరువు, పెద్ద రేవుకి నూరు గజాల్లో చెరువు పల్లంలోనే వుంది ఆతడి తోట. అందులో వున్న

పాకను బాగు చేయిస్తున్నానన్నాడు. ఎంతవరకు వచ్చిందో?

ఆ రోజునింక వుండబట్టలేక పోయింది. చెరువుకెడుతూ అప్పుడే తయారుచేసిన ఇంత కొబ్బరిపచ్చడి గిన్నెలో పెట్టి బిందెలో పెట్టుకుంది.

రామనాధానికి కొబ్బరికాయ పచ్చడి ఇష్టం.

గుమ్మం దిగేసరికి సుబ్బన్నశాస్త్రి కనిపించేడు.

"మా రామన్న తోటలో వున్నాడటోయి!"

అతడు ఒక నిముషం ఆగి ఆలోచించేడు.

"సరిగ్గా చూడలేదమ్మా! కాని విశాలాక్షీ, ఇంకెవరో అమ్మాయీ వున్నట్లున్నారు. మరి వాడు...."

పావంచాలలో బిందె వదలిపెట్టి పచ్చడి గిన్నె పైట చెంగుమాటున దాచుకొని రాజమ్మ తోటవేపు బయలుదేరింది.

అప్పుడే చెరువుకు వస్తున్న రామలక్ష్మమ్మ పలకరించింది.

"తోటలో కొడుకు కాపురం చూడడానికా మరదలా?"

ఇరవయ్యేళ్ళు వచ్చేదాకా ప్రాణాలన్నీ వానిమీదనే పెట్టుకొని పెంచినవాడు. ఈ వేళ తోటలో వేరే వండుకు తింటున్నాడనడానికి మనసు

వొప్పుకోవడం లేదు. కాని వూళ్ళో ఎవరెరుగని రహస్యం? శంకరశాస్త్రి ఆచారపు పట్టుదలను అభినందించినంత బలంగానూ, అదంతా

చాదస్తం అని అంత చులకనగా త్రోసిపుచ్చిన వాళ్ళూ వున్నారు.

"కుర్ర నాగన్న ఏం చేస్తున్నాడో ఓమారు చూసివద్దామనండీ వదిన గారూ?"

"కాదమ్మా మరీ!.....ఔనుగాని."

రాబోయే ప్రశ్న రాజమ్మకు తెలుసు.

"ఔనుగాని....మీవాడు కూడా వెళ్ళి పెళ్ళాన్ని పంపమని అడిగేడట....."

"వాళ్ళ బాబాయి చెప్పేరు. 'తొందరపడకురా. మగవాడి వాళ్ళం మనమే వెడితే వెలితి అయిపోతాం,' అన్నా వినలేదమ్మా."

"ఈ గాంధీగారి జనం అంతా అదో మచ్చులే. పెళ్ళాంతో కూడా వీడే...."

"ఆహా! లంక అంతా చుట్టపెట్టి వచ్చినట్లే చేసుకొచ్చేడమ్మా."

రాజమ్మ తన అసంతృప్తిని వెలిబుచ్చింది. వియ్యంకుడి మీదా, కోడలి మీదా కారాలు నూరింది.

"బలవంతంగా పంపితే చెర్లో దిగి చస్తానందిట ఆ మహాతల్లి."

"అదో పాపం కూడానా? తూర్పు వాళ్ళ సంబంధాలు!"

"అంతా కర్మ."

నారాయణమూర్తి తన కూతురును కాపురానికి పంపకపోవడానికి ఆయన తూర్పువాడు కావడం కారణమో, రామనాధం కర్మ ఫలితం కారణమో

తేలకుండానే రాజమ్మ కదిలింది.

తల్లిని అంతదూరాన చెరువుకట్ట దిగుతూండగా చూసి రామనాధం ఎదురు వచ్చేడు. నాలుగు రోజుల నుంచి ఒక్కమారేనా ఇంటివేపు తొంగి

చూడక పోయేసరికి ఆమెయే తన్ను వెదుక్కుంటూ వచ్చింది. ఆ గుర్తింపు మనస్సుకి బాధ కలిగించింది. క్షమాపణ చెప్పుకుంటున్నట్లు

సంజాయిషీ యిచ్చుకొన్నాడు.

"సర్దుబాట్లు చేసుకోవడంతో తీరుబడి లేకుండా వుంది. దీనికితోడు వర్షాలు. ఎప్పటికప్పుడు రావాలనుకోవడమే కాని....."

ఆ సర్దుబాట్లు ఏమిటో చూపించడానికి కూడా వుండి తీసుకెళ్ళేడు. తోటలో అడుగు పెట్టేసరికి గేటువద్దనున్న సంపెంగ పొదలవద్ద

విశాలాక్షి, మరొక అమ్మాయీ కనిపించేరు. విశాలాక్షి దారిలో నిల్చుని వుంది. రెండో ఆమె పొదకి ఎగబడి పువ్వులకోసం వెతుకుతూంది.

"ఏం పిన్నీ! ఇంతవరకూ నువ్విటు రానేలేదనుకుంటాను. చూడు మన పెంకుటిళ్ళ కన్నా తమ్ముడి తాటాకు పాకే ఎంతో బాగుంది."

పాక అయితే మామూలుదే. రెండు నిట్రాళ్ళది. ఒక నిట్రాటి భాగాన్ని మట్టి మెత్తిన పత్తి కంప దడులతో గదిలాగ చేశారు. ముందు

భాగం తెరపిగానే వుంచారు. పాకకు ముందు మరో పందిరికూడా వేశారు. పదిమందీ కూర్చునేందుకు వీలుగా.

అసలు అందమంతా పరిసరాలది. అప్పుడే కాపు పట్టిన కొబ్బరితోట, పెద్ద మోట బావి. బావికి దగ్గరలో తెల్లటి

నందివర్ధనాలూ, ఎర్రటి కరవీరాలూ పువ్వులతో కళకళలాడుతున్నాయి. ఆ మొక్కలకి ఆవలనుంచి వయస్సులో వున్న పోకబోదెల

వరసలు.

నీరు అందని దూరంలో మామిళ్ళు, పనసలు.

కట్టవలలో అక్కడక్కడ సంపెంగ పొదలు, సాయంకాలం అయ్యేసరికి ఎంత వెతికినా దొరకని పువ్వుల పరిమళం చెరువుకట్ట మీదికంటా

విస్తరిస్తూ దారిన పోయేవాళ్ళని ఆశపెడుతూంటుంది. దారిన వచ్చేపోయేవాళ్ళు పది నిముషాలయినా పని మానుకొని వెతక్కుండా ముందడుగు

వేయలేరు.

ఆ పరిమళాల మధ్య పచ్చని పరిసరాల మధ్య, ఉండడమే ఆ పాక ప్రత్యేకతా, సౌందర్యమూను.

రాజమ్మ పాక వద్దకు వస్తూనే పైట చెంగున దాచి తెచ్చిన పచ్చడి గిన్నెను చేతికిచ్చింది.

"ఎందుకమ్మా యిది" అన్నాడు.

"తమ్ముడు కారాలు తినడం లేదు" అంది విశాలాక్షి.

"చెప్పేను... సరేలే తెచ్చేవు కదా." అని దానిని తీసుకొని పాకలో గదిలో వున్న కావడిపెట్టెలో దాచేడు రామనాధం.

రాజమ్మ గోడలూ, అవీ ముట్టుకు చూసింది.

"ఇంకో పూత పెట్టాలి."

"వెల్లవేయిస్తే వెలుతురు వస్తుంది" అంది, అప్పుడే వచ్చిన స్వరాజ్యం సంభాషణలో కలగచేసుకొంటూ.

విశాలాక్షి తిరిగి చూసింది.

"ఏమన్నా దొరికేయా?"

"మంచి పువ్వు ఒకటీ, ఓ గుడ్డి పువ్వూను. ఇంకా వున్నాయి."

"వాసన బ్రహ్మాండంగా ఆశ పెడుతుంది. కాని ఆకుల మాటున ఒక్కటీ కనబడదు" అని రాజమ్మ తన అనుభవాన్ని చెప్పింది.

స్వరాజ్యం తాను తెచ్చిన మంచి పువ్వును ఆకు గుత్తితో సహా ఆమెకిచ్చింది.. "పెట్టుకోండి."

"నాకెందుకమ్మా! నువ్వు పెట్టుకో తల్లీ."

విశాలాక్షి ఆమెను పరిచయం చేసింది.

"చిరతపూడి నాయుడుగారి అమ్మాయి. మెట్రిక్యులేషన్‌ చదివింది. ఈవూరు పింతల్లిగారింటికి వచ్చింది."

రాజమ్మ ఆ బంధువులెవరో తెలుసుకుంది కాని, వారిని ఆమె ఎరగదు.

"పావంచాలరేవూ, మా పడమటిల్లూ మధ్యనున్నదే నా ప్రపంచం. నేనెవరినీ ఎరగను." అని క్షమాపణ చెప్పుకొంటున్నట్లు అంది.

"పెళ్ళి అయిందా తల్లీ...." అని ప్రశ్నించింది.

స్వరాజ్యం టక్కున సమాధానం చెప్పడానికి సందేహిస్తూంటే విశాలాక్షి అనేసింది.

కొల్లాయి గట్టితే నేమి? · 第 14 / 22 段