తేవడం వుద్దేశం కూడా అదేననీ అతని ఆలోచన. కాని, రామనాధం ఆ ఆశను ఊదేసేడు.
"సాయంకాలం షావుకారు వెంకటరత్నానికి కొబ్బరికాయ వేస్తానని ఓ పాతిక తీసుకొన్నా."
ఆ మాట విని శంకరశాస్త్రి నిర్విణ్ణుడయ్యేడు. రాజమ్మ "అదేం పనిరా?" అంది.
శాస్త్రి ఒక్కక్షణంలో సర్దుకొన్నాడు. రామనాధం మనస్థితి అర్థమయింది.
"సరే బాగానే వుంది."
వ్యవహారం అడ్డం తిరిగిందని రాజమ్మ గ్రహించేలోపునే తానిన్నాళ్ళూ భయపడుతూన్న మాటలే శంకరశాస్త్రి నోట వచ్చేశాయి.
"అదేదో చేసిందేదో చేశాడు. వదిలెయ్యి, ఇంక అల్లా చెయ్యనక్కర్లేదు. ఇతర విషయాలలో స్వతంత్రుడివే అయినా, నీ ఆస్తి
వ్యవహారాలన్నీ నా చేతిమీదుగా జరుగుతున్నాయి. కనకనే డబ్బు నీది వున్నా అప్పుచేసుకోవలసి వచ్చింది. ఇది ఇల్లాగే జరిగితే
నిన్ను నా చాటువాడి క్రిందనే లెక్కగడతారు. అది మనకిద్దరికీ క్షేమం కాదు. పొద్దున్నే మీ విశ్వనాధం పెదనాన్నని పిలు.
ఆయన ఎదుట అన్ని లెక్కలూ చూసుకొని వొప్పచెప్పేసుకో. తర్వాత నీ యిష్టం. మా సాయం కావాలంటే వస్తావు. లేకపోతే
లేదు...."
ఆస్తి వ్యవహారాల విషయం అడగటం ఎల్లాగా అనుకుంటున్న రామనాధానికి ఆ సమస్య అంత సులభంగా పరిష్కారం అయినందుకు మనస్సు
తేలికపడింది. మరిడమ్మ అరువు పెట్టి శేరు బియ్యం తెచ్చి యిచ్చేవరకూ తనకు గతిలేకపోయిందని మనస్సు ఎంతో బాధపడింది.
అప్పయ్యవధాన్లు వద్దకు వెడితే ఎనిమిది నెలల క్రింది ఘటనలు తలుచుకొని తాను ఏగాని ఇవ్వలేనన్నాడు, ఆ విసురున వెళ్ళి
కొబ్బరికాయ దింపు తీసి వేస్తానని ఒక పాతిక తెచ్చుకోవలసి వచ్చింది.
ఇంకా స్థితి వుండరాదనుకొంటూనే వచ్చేడు. ఆ మాట తెస్తే చాలా గొడవ అయిపోతుందేమోననుకొంటూ వుంటే శాస్త్రి తనంత తానే ఆనేశాడు.
సంతోషం కలగవలసింది. కాని రామనాధం సిగ్గుపడ్డాడు.
"అదేమిటి బాబయ్యా! మరొకరూ, మరొకరూ ఎందుకు?"
కాని శంకరశాస్త్రి వినిపించుకోలేదు.
"అది వ్యవహారధర్మం!"
అయిదు
రాత్రి తెల్లవార్లూ వర్షం కొట్టి కురిసింది. పక్కలనుంచి వచ్చే జల్లులకి మకాం పాకలో రక్షణ లేదు. మధ్య మధ్య పై నుంచి
కూడా వర్షం పడ్తూంది. రామనాధం తెల్లవార్లూ మంచం అటూ ఇటూ జరుపుకుంటూనే వున్నాడు. ఏమూలా కూడా ఒక్క మంచం పట్టేంత మేర
కూడా చినుకు పడని చోటు లేదు. పడుకుంటే కాళ్ళ మీదనో, తల మీదనో చినుకు. ఇంక కూర్చున్నాడు.
అలాగే తెల్లవారింది. ఆకాశం ఇంకా మూసుకొని పోయే వుంది. వర్షం తగ్గింది కాని, సన్నని తుప్పర ఇంకా పడ్తూనే వుంది. ఆ
పూటకి అమలాపురం వెళ్ళే ప్రయత్నం మాని తన మకాం పాక సంగతి చూసుకోవాలనుకొన్నాడు. లేకపోతే ఒక్కరోజు నడిచేలాగ లేదు.
అనుకుంటుండగానే శివకామయ్య నెత్తిన అంగవస్త్రం వేసుకుని చెరువు గట్టు దిగి వచ్చేడు.
"రాత్రి వర్షానికి పాక వుందిట్రా! వుండమన్నా వున్నావు కాదు. ఏమయ్యేవో అని ఒకటే అనుకున్నాం."
"ఇంతమాత్రానికేనా?"
మాటలోనే సూరప్ప వచ్చేడు. నరసింహులు, రామన్న వచ్చేరు.
రామన్న పాకలోకి వెళ్ళి అంతా పరీక్షించేడు. విషయం గ్రహించేడు.
"నేను పైకెక్కుతాను కాని, మీరెవరో నాలుగు ఆకులు అందివ్వండిరా" అంటూ పంచె విరిచి కట్టుకొనసాగేడు.
"ఏమీ అక్కర్లేదురా. ఇల్లు నేతగాళ్ళని పిలుచుకొస్తాను."
"ఈ వర్షంలో నీకు పనివాడెవడు దొరుకుతాడురా. దొరికితే మంచిదే, లేకుంటే..." అన్నాడు నరసింహులు.
ఆ మాటను సూరప్ప సమర్థించేడు. ఆతడప్పుడే పాలెంలోకి వెళ్ళి వచ్చేడు.
"రాత్రి కురిసిన వర్షంతో ఊరూ వాడా ఏకం అయిపోయేయి. అమ్మవారి గుడికంటా ఒకటే నీరు. ఇప్పుడు నీకు మనిషి కావాలంటే మాత్రం
ఎలా వస్తాడు? ఎవడిల్లు వాడు సర్దుకోవడంలో వుంటాడు."
శివకామయ్య సూరప్ప మాటలకి ఆమోదం తెలిపేడు..."బాగా చెప్పేవు."
"వాడికేం తెలుసు. రాండిరా" అంటూ రామన్న రంగంలోకి దిగాడు.
రామనాధం పాకలోంచి చూపుతూంటే చినుకు పడుతున్నచోట్లన్నింటా ఆకు దోపేరు. బణిపిలోంచి కొబ్బరాకు తెచ్చి కప్పుమీద వేసేరు.
"ఇంక ఫరవాలేదు" అంటూ రామన్న పైనుంచి దిగివచ్చేడు. ఒక్కమారు లోపలికి వెళ్ళి నాలుగు పెణకలూ చూసేడు. ఎక్కడా వెలుతురు
సందులు కనబడ్డం లేదు.
"మరి పక్కదడులు మాటేమిటి?" అని అతడు మిత్రుల్ని కదిపేడు. రామనాధం స్నేహితులకు ఆ శ్రమ ఇవ్వడానికి
సందేహిస్తున్నాడు.
"ఎందుకొచ్చిన పీడరా మీకు. రాండి, కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకోక...."
"అఘోరించేవులే. వెర్రికబుర్లు చెప్పకు...." అని శివకామయ్య కోప్పడ్డాడు. రాత్రి తమ ఇంటి వద్ద పడుకోవడానికి
నిరాకరించిన మాట చెప్పేడు.
సూరప్ప నవ్వేడు.
"నువ్వు అరుగుమీద కూర్చున్నావా? సావిట్లోకెళ్ళేవురా?" అని అడిగేడు రామనాధాన్ని.
"బల్లమీద కూర్చున్నా."
"అయితే మీ ఆవిడ ప్రాణం తోడ్తూంటుంది ముసిలిది. పెందరాళే ఇంటికిపో. ఆ బల్లా అదీ వాకిట్లోకి పట్టి కడగాలి" అని
శివకామయ్యకి సలహా ఇచ్చేడు సూరప్ప.
రామనాధం చిరునవ్వు నవ్వేడు. మిగిలిన వాళ్ళు గొల్లుమన్నారు. శివకామయ్య తల్లిది వెర్రి ఆచారం. వీధిలోంచి గుమ్మం ఎక్కితే
చెంబెడు పేడ నీళ్ళు కాళ్ళ మీద పోయించుకోవలసిందే. లేకపోతే వంటా గింటా వదలి ఇల్లు అలుకుతూ కూర్చుంటుంది.
శివకామయ్య సిగ్గుపడ్డాడు.
"చంపేస్తూందిరా" అని వొప్పుకొన్నాడు. కాని తల్లిని అంతకన్న ఏమీ అనలేకపోయేడు.
"ఎవరి ఏడుపు వాళ్లు ఏడుస్తారు, ఈ వేళ వాళ్ళని మనం మరమ్మతు చేయగలమేమిటి?"
మళ్ళీ రామన్న పనికి దింపేడు. కమ్మ నరికేసి కొబ్బరి ఆకు చుట్టూ దగ్గరగా నేలలో గుచ్చేడు. అవి లాగినాక కదలకుండా
మూడు ఎత్తుల్ని పెండె కట్టేరు. పాక మూడు దిక్కులు మూసేసేక గాని వాళ్ళు ఊపిరి తీసుకోలేదు.
"మిగిలింది. మధ్యాహ్నం చేద్దాంలే. ఈవేళ దూడని కూడా విప్పకుండా ఇల్లా వచ్చేశాను." అంటూ నరసింహులు హడావుడిగా వెళ్ళిపోయేడు.
* * * * *
భోజనం చేసేక ఒక్క నిముషం కూర్చుందామనుకుంటూంటే బాలకృష్ణ పరుగెత్తి వచ్చేడు. బట్టలన్నీ బురద అయిపోయేయి. చెరువు కట్ట
మీది నుంచి దిగుతూంటే కాలుజారి పడిపోయేడు.
"ఈ వర్షంలో నువ్వెందుకు వచ్చేవు? కొద్దిసేపట్లో నేనే వస్తున్నాను కదా....." అని రామనాధం కోపం చేసేడు.
బాలకృష్ణ ఏమీ మాట్లాడలేదు. ఆ బాడీతో వీధుల్లోంచి ఇంటికెల్లాగ వెళ్ళడమా అని ఆలోచిస్తున్నాడు. ఆ అనుమానం పసికట్టి
రామనాధం నవ్వేడు.
"ఏం ఫర్వాలేదోయ్. మన ముంగండ వీధుల్లో పడి బట్టలు బురద చేసుకోని మగాడెవరోయ్?"
బాలకృష్ణకి సందేహం కలిగింది.
"నువ్వూ పడ్డావా?"
"ఓస్. రాజమ్మ అమ్మమ్మని అడుగు. మామయ్య సొట్టపడగొట్టిన బిందేది చూపించమను. తెలుస్తుంది."
ఎంతో తెలివైన వాడనుకొనే మేనమామ బురదలో కాలుజారి పడ్డాడన్న వృత్తాంతం బాలకృష్ణకి నవ్వు కలిగించింది.
"ఎల్లా పడ్డావు, ఎందుకు పడ్డావు--చెప్పు మామయ్యా!"
అదంతా విన్నాక బాలకృష్ణకి ఫర్వాలేదనిపించింది. ఇంటికి వెడుతూనే ముందు తల్లితో ఆ విషయమే చెప్పేడు.
"మామయ్య కాలు జారిపడి బింద సొట్టపోగొట్టేడుట. నువ్వెరుగుదువా?"
ఆ ఘటన అప్పుడే జరిగినట్లు భావించి విశాలాక్షి కంగారు పడింది.
"ఏ కాలేనే నెప్పి పెట్టలేదుగద."
ఆ సంభాషణ వింటున్న రామనాధం సావిట్లో నవ్వుతున్నాడు. నవ్వు విని విశాలాక్షి వచ్చింది.
"ఏమిరా, నీకేం చెప్పేను? భోజనానికి రమ్మంటే ఎందుకు రాలేదు?"
"నేను రానని చెప్పేను కాదా."
"ఒరేయి. శంకరం బాబాయి ఏదన్నా అంటాడనే భయం లేదు నాకు. ఎందుకనాలి ఎవరు మాత్రం? అకార్యకరణం ఏం చేశామని అనాలి?"
"అదేమీ కాదు. ఇదొక రోజుతో అయ్యేది కాదు. పొయ్యేది కాదు. ఒకరోజు వైభోగానికి మొగమంతా మసి అన్నట్లు లేనిపోని గొడవలు
తీసుకురావడం నాకిష్టం లేదు."
ఆతడు సంసారం ఏర్పరచుకొనే దాకా తమ యింటనే వుండమంది విశాలాక్షి. కాని రామనాధం ససేమిరా అన్నాడు.
"వొద్దు. నన్ను బలవంత పెట్టవద్దు. వదిలెయ్యండి."
విశాలాక్షి ఏమీ తోచక ఒక్క నిముషం వూరుకుంది.
"వస్తూనే ఆస్తి లెక్క చెప్పడం మాట ఏమన్నా వచ్చిందా? శంకరం బాబాయి నాన్నని రమ్మన్నాడట."
రామనాధానికి ఏం చెప్పడానికీ తోచలేదు. నసిగేడు.
"అది కాదురా, ఇంతకాలం పెంచి పెద్దవాడిని చేశాడుకదా. వాళ్ళ ఆచారాలూ, చాదస్తాలూ ఏవో వుంటాయి. అంత మాత్రం చేత
నువ్వు....."
రామనాధానికి ఆశ్చర్యం వేసింది. శంకరం బాబాయి అలాగ్గాని చెప్తూన్నాడేమిటి?
"అల్లా చెప్పేడా బాబాయి!"
"ఏమో నాకేం తెలియదు. కాగితాలూ అవీ చూడాలి. నువ్వు కూడా వుండాలి అన్నాడట పొద్దున్న. ఆ మాట మీద నేను
అనుకున్నా....."
"నేనల్లా అంటానో అననో నీకు తెలియదా అక్కా!"
విశాలాక్షికి ఆ అనుమానం అనిపించింది. కాని, ఏమో అది తప్పుగా తోచింది. అడిగేసింది. మనుష్యులు ఎప్పుడూ ఒక్కలాగే
వ్యవహరిస్తారా? ఏ సమయంలో ఎటువంటి కక్ష కనిపిస్తుందో ఎవరన్నా చెప్పగలరా?
రామనాధం తానా మాట అనలేదని చెప్పేడు. జరిగినవన్నీ చెప్పేడు. విశాలాక్షి తమ్మునిదే తప్పని చెప్పింది.
"ఒరేయి, నువ్వు నోటితో చెప్పాలట్రా, వెంకటరత్నానికి తీయబోయే దింపుల బాపతు కాయవేస్తానని డబ్బు తెచ్చుకుంటే దాని అర్ధం
ఏమిటి? బాబయ్య వెర్రివాడనుకున్నావా?"
కాదని వొప్పుకున్నాడు. కాని, ఆస్తి వ్యవహారాలు ఎప్పటిలాగే ఆయన చేతిలోనే వదిలిపెట్టమన్న అభిప్రాయానికి అంగీకరించలేదు.
"నేను తన చాటు వాడిని లాగే వుండడం కూడదన్నాడు బాబాయి. అది నిజమైన...."
"ఆయన కోపంతో అన్నమాట...."
రామనాధం అసలు ఆ విధంగా ఆలోచించడమే తప్పన్నాడు.
"ఎందుకు అనుకోవాలి? అలా అనుకోవడం ఎందుకు? మనస్సు పాడు చేసుకోవడం ఎందుకు? ఆయన నిజంగానే అన్నాడనుకొని ఆయనని
గౌరవిద్దాం. అంతేకాని."
విశాలాక్షి ఒప్పుకోలేదు.
"ఏమోరా! ఈ సహాయ నిరాకరణం అంటూ వచ్చేక నీకు మంచీ, చెడ్డా తల్లక్రిందులుగా కనిపిస్తున్నట్లున్నాయి."
"కాదక్కయ్యా! ఒక్కటాలోచించు. ఆయన కోపంతో అన్నాడనే అనుకొందాము. దాని అర్ధం ఏమిటో? నిజంచేత నా ఆస్తి మీద తన
పెత్తనమే జరగాలనుకుంటున్నాడనడమే కదా. అది ఆయనకు ప్రతిష్ఠయా?"
"ఏమోరా బాబూ."
"అది వదిలెయ్యి. రెండోవేపున నేనున్నాను. ఆ మాట అనడం నా వ్యవహారాలు నేను చూసుకోదలచుకోవడం లేదనడమే కదా....."
"అప్పుడే ఆస్తి వ్యవహారాలు చూసుకొనేపాటి వాడివయేవా?
రామనాధం నవ్వేడు.
"నిరుడు అప్పయ్య అవధాన్లుగారికి నోటు వ్రాసి యిచ్చాను. నిన్న ఆయన అప్పు ఇవ్వనన్నాడు గనుకనే వెంకటరత్నానికి దింపు
తీయబోయే కాయ అమ్మవలసి వచ్చింది. దాని అర్థం ఏమిటి? నా వ్యవహారాలు నేను చూసుకోక తప్పని పరిస్థితి వచ్చిందనే
కదా."
ఆమె ఆశ్చర్యంతో అతనికేసి చూస్తూ కూర్చుండిపోయింది.
రామనాధం మాట మార్చేడు.
"మరి పెద్దనాన్న ఏమన్నాడుట."
"అదేం మాట. వాడినిప్పుడు వదిలేస్తావా? అన్నాడుట."
"ఊఁ"
"కుటుంబ భారం మీదపడడం కష్టసుఖాలు తెలిసి రావడానికి అవసరమన్నాడుట. శాస్రి బాబయ్య. వాడి యోగక్షేమాలు కోరేవారెవ్వరూ
ఆటంకం చెప్పవద్దన్నాడుట."
"ఆయన చాల తెలివిగలవాడు" అని రామనాధం మెచ్చుకున్నాడు.
"ఎవరోయి ఆ తెలివిగలవాడు?" అంటూ మంగమ్మ గుమ్మంలో కనబడింది.
"రావే మంగమ్మా!" అంటూ విశాలాక్షి ఆహ్వానించింది.
"నిన్న ప్రొద్దుటనగా వచ్చి ఒక్కమారు కూడా రాకూడదటయ్యా!" అని మంగమ్మ నెపం పెట్టింది.
"ఎందుకు రాకూడదూ? కాని ఇప్పుడు నేనెవరినో, నా స్థితి ఏమిటో? నాకే అర్థం కాకుండా వుంది. అందుచేతగాని.... ఎందుకు
రాకూడదూ?"
రామనాధం వుద్దేశం ప్రాయశ్చిత్తకాండ మీద వచ్చిన రభసను గురించి. కాని మంగమ్మ మరో విధంగా అర్ధం చేసుకొంది. రామనాధం
భార్య ఆమెకు పినతల్లి కూతురు.
"బాగుందయ్యా! మీకూ వారికీ లేనిది మధ్య మాకు వచ్చిందేమిటి?"
"ఏమిటే అదీ?" అని విశాలాక్షి
మంగమ్మ ఆ రోజు వుదయం తన తండ్రిని శంకరశాస్త్రి అమలాపురం పంపించిన వార్త చెప్పింది.
"ఎందుకు?" అంటూ విశాలాక్షి తమ్ముడివంక చూసింది.
"ఆయనకు ఒక ఆలోచన మనస్సులో పడింది. ఇంక దాని అంతేదో చూడాలి. బహుశా పెదనాన్నని పిలిచినట్లే ఆయనకీ కబురు
పంపేడేమో."
అతనికి ఆ పద్ధతి ఏమీ నచ్చలేదు. ఆమాటే చెప్పేడు. రాత్రి మళ్ళీ పనికట్టుకొని శంకరశాస్త్రి బాబాయిని
కలుసుకున్నప్పుడు.
"నాకు ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళనీ, యోగక్షేమాలు పంచుకోని వాళ్ళనూ మీరు కబురంపడం ఏమిటి? నాకిష్టం లేదు."
"ఒరేయి కష్టపెట్టుకొని లాభం లేదు. నాకు మాత్రం ఇష్టం వుండి కబురంపేనంటావా. ఒకరి ఆస్తిపాస్తులు చూడడం వుందే మంత్రసాని
పని లాంటిది...."
ఇంక సాగతియ్యడం లాభంలేదనుకున్నాడు రామనాధం.
"వాళ్ళూ వీళ్ళూ ఎవరూ వద్దు. మీకు తోచినవారిని ఒకరిని మీరు పిలవండి. నాకు తోచిన వారొకరిని నేను పిలుస్తాను."
శంకరశాస్త్రి ఆలోచించేడు. నారాయణమూర్తి నుంచి నిరాకరిస్తూ కబురు అప్పటికే అందింది. ఆయన తోడల్లుడు రామమూర్తి కూడా తనకు
ఆ ప్రమేయం పెట్టవద్దన్నాడు. ఇంకెవరిని పిలవడం అనుకుంటూంటే ఈ మాట వచ్చింది.
"కానియ్యి, రేపు తేల్చేసుకోవాలి.
రామనాధం తననే కోరబోతున్నాడని శంకరశాస్త్రి కలలో కూడా వూహించలేదు. ఆ మాట విని ఒక్కక్షణం విస్తుబోయేడు. అంతలో వెర్రి
నవ్వు నవ్వేసేడు.
"దేవాంతకుడివిరా...."
అతడు ఎంతో ఆనందపడ్డాడు.
"సరే. సరే."
ఆరు
ఊళ్ళోకి వచ్చి రెండు రోజులైనా లచ్చమ్మను చూడలేదనుకుంటూ రామనాధం పెదతండ్రి తోట మకాంవేపు బయలుదేరేడు. ఈ రెండు రోజుల నుంచీ
కురుస్తున్న వర్షాలతో చాకలి చెరువు నిండిపోవడమే కాదు. పుంతదార్లు మునిగి మోకాలులోతు నీళ్ళలో వున్నాయి. రోడ్డు మీది రావి
క్రింద నిలబడి ఎటు వెళ్ళడమా అని ఆలోచిస్తూంటే చాకలి నారాయుడు చూసేడు. అతడికి తమ యిళ్ళ మధ్య నుంచి మెరకగా వున్న
గట్టు మీదుగా దారి చూపించేడు.
చెరువుగట్టు మీద చాకళ్ళ ఇళ్ళు వున్నాయనే గాని, అతడెన్నడూ ఆ యిళ్ళవేపు వెళ్ళలేదు. ఇప్పుడే మొదటి మారు ఆ యిళ్ళ
మధ్య అడుగుపెట్టేడు. ఇంటిమీద ఇల్లు, ఇళ్ళ ముందూ వెనకా తాళ్ళమీద బట్టలు గాలికి ఆరగడుతున్నారు.
"మీ యిళ్ళు ఇవా?"
"ఇవి యిళ్ళేంటండి? గుడిసెలు. వాటికన్నా కాస్త నయం...." అన్నాడు నారాయుడు.
"వర్షాలకి ఎల్లా వున్నాయి?" గడచిన రాత్రంతా పాకలో పొడిగా వున్న జాగాలేక జాగారం చేసిన విషయం జ్ఞాపకం వచ్చి
అడిగేడు.
"తాటాకు ఇళ్ళకి వర్షాల్లో ఎల్లావుండడానికేం వుందండి."
మాట్లాడుకుంటూనే ఇళ్లు దాటేరు. సెలవు తీసుకుంటానంటూ నారాయుడు వెనక్కి తగ్గేడు. ఎవరికో తనను గాంధీగారుగా పరిచయం తెలుపుతూండడం
విని రామనాధం నవ్వుకున్నాడు. ఆ మాట అనడంలో వ్యక్తం చేసిన భక్తీ, ప్రపత్తీ అతనికెంతో గర్వం కలిగించేయి. ఆ
వుత్సాహంలో ఈ రెండు రోజులుగా కలిగిన శారీరక-మానసిక వ్యధ మరచిపోయేడు.
అతడు వెళ్ళేసరికి లచ్చమ్మ రాట్టం ముందు కూర్చుని వుంది. చాలా సంతోషం కలిగింది.
"ఇదెప్పటినుంచమ్మో!" అన్నాడు.
"గాంధీగారు చెప్పినట్లు మీరంతా జైలుకెడుతూంటే మేమీపాటి పనేనా చెయ్యలేమా?" అంది లచ్చమ్మ.
ఆ మేములో పెదతండ్రి కూడా వున్నాడని విన్నాక రామనాధం సంతోషానికి మేరలేదు. తనకు వ్యతిరేకంగా వెంకటరమణ కోర్టులో సాక్ష్యం
ఇచ్చిన రోజు నుంచి వారిద్దరూ రాట్టం వొడుకుతున్నారు.
"ఈ ఆరు నెలల్లో మాకు కావలసిన పంచెలూ, చీరలూ నేయించుకోగలిగేం. తెలుసా అబ్బాయిగారూ!" అంది లచ్చమ్మ.
అంతేకాదు వారిద్దరూ తీసిన నూలుతో నేయించిన పంచెలచాపు చేతిలో పెడుతూంటే అతడి ఆనందానికి మేర లేకపోయింది.
"ఈ నూలు మీరు తీసిందే?"
నూలు చాలా సన్నగా వుంది. ఎనభయి నెంబరు వుంటుందనిపించింది. అది పైడిపత్తి పింజెతో, దంజ్యాల కదురు మీద తీసింది. ఆ పత్తి
కోసం దొడ్లో పది పైడిపత్తి చెట్లు వేసేరు. చూపించింది. అవన్నీ చూసేక రామనాధానికి తాను చదివిన అర్థశాస్త్రం జ్ఞాపకం
రాలేదు. ఖద్దరులో అర్థశాస్త్ర ప్రాముఖ్యం కన్న విశేషమైన ప్రాముఖ్యం వున్నదనడంలో గాంధీగారి వుద్దేశమేమిటో లచ్చమ్మ
ముఖంలో అర్థమైనట్లు తోచింది. బట్టలు సాపుగా లేవని కాని, నూలు గొగ్గిగొగ్గిలుగా వుందని కాని ఆమె చిన్నపుచ్చుకోవడం లేదు.
ఒక్క అంచుకి తప్ప చీరకి రంగు లేదు. కాని అవేవీ ఆమె వుత్సాహాన్ని తగ్గించలేదు.
"చేతివడుకుబట్ట తప్ప మరొకటి ఎరగని దశలోనే మన స్వాతంత్య్రం పోయింది."... అన్న తమ అర్థశాస్త్ర లెక్చరరు
కలిగించిన అనుమానాలిప్పుడాతనికి విశ్వసనీయంగా కనబడలేదు. మనస్సులోనే ఒక నిర్ణయానికి వచ్చేడు. తాను కూడ నూలు
తియ్యాలి.
రామనాధం కూర్చున్నాక తాను రాజమండ్రిలో వెంకటరమణను చూసి వచ్చిన విషయం చెప్పేడు.
"ఆరోగ్యంగానే వున్నాడు."
"వాడి మాట చెప్పకు, దుర్మార్గుడు."
తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు ఆమె కొడుకును క్షమించలేకుండా వుంది. రామనాధానికామె మాట నచ్చలేదు.
"నిన్న మొన్నటిదాకా నేనూ పెద్ద ఉద్యోగాలు చేయాలనుకున్న వాడిని కాదా? ఈ వేళంటే నా కళ్ళు
తెరుచుకున్నాయనుకుంటున్నాగాని...."
కాని, తన పర తెలియనక్కర్లేదాయని ఆమె ఆక్రోశం.
వెంకటరమణ మనస్సులో వున్న కష్టం రామనాధం ఎరుగును. లచ్చమ్మకూ తెలుసు. సంఘంలో వున్న కులబేధాలు అతనిని
అవమానిస్తున్నాయి. ఆ అవమానాలు అతని మనస్సుని గాయపరచాయి.
కులాల పట్టుదలతో ఆతడు అన్నగారికీ, తండ్రికీ ఎదురు తిరగడమా అని లచ్చమ్మ అభ్యంతరం.
కులభేదాలు దేశ స్వాతంత్య్ర యుధ్ధానికి ఆటంకకారులుగా వున్నాయని రామనాధం విచారం.
చాతుర్వర్ణ్యం మయాసృష్టం
గుణకర్మ విభాగశః||
అంటూ గీతా శ్లోకాలు రోజూ పఠిస్తూన్నారు. దానికెంతో విశదంగా వ్యాఖ్యానం చెప్తూనే వున్నారు, తమ వూరి బ్రాహ్మణీకం. నిత్య
జీవితంతో ఈ గుణాలకీ, కర్మలకీ సంబంధంలేని కుల కట్టుబాట్లు ఆచరిస్తున్నారు. వాటిని కదిలించబోతే కరుస్తున్నారు.
అటువంటప్పుడు వెంకటరమణననవలసిన పనేమిటి?
తప్పు మనది.....
లచ్చమ్మకు కులభేదాలు కృత్రిమం అంటే అర్ధం కాదు. వాని మధ్యనే ఆమె పుట్టి పెరిగింది. అంతకు మించిన ప్రపంచం ఆమెకు
తెలియదు. కాని విశ్వనాధం సులభంగానే ఔననగలిగేడు.
"వాడి మనస్సుకి బాధ నావల్లనా కలిగింది" అన్నాడు.
"ఇక్కడ సమస్య వాడి మనస్సు నొప్పించడం కానే కాదు పెద్దనాన్నా! మన జీవితం, మన బ్రతుకు పద్ధతులూ ఎలా వుండాలి?
మనం ఇంతవరకూ అలవాటు పడిన జీవితపద్ధతులు ఏవీ హేతువాదానికి నిలబడడం లేదు. అవి మన నడకకి అడ్డం అవుతున్నాయి.
సంఘ సంస్కర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వున్న పేచీ చెప్తున్నారు. కాని, అసలు మన జీవిత పద్ధతి యావత్తూ
మారిపోవలసే వస్తూంది. అలాగ మారకపోతే వెంకటరమణ ఒక్కడే కాదు. ముప్పయికోట్ల మంది వెంకటరమణలుగానే తయారు అవుతారు.
కాదు! రమణలుగానే వున్నారు. వాళ్ళని దారిని పెట్టడం సులభం కాబోదు. వాళ్ళని మార్చాలి. మార్చి తీరాలి."
ఏడు
అమలాపురం కోర్టుల దగ్గరికి వచ్చేసరికి తన్నెవరో పిలుస్తున్నట్లు అనిపించి రామనాధం నిలబడ్డాడు. అటూ ఇటూ చూసేడు.
పక్కనున్న ఇంటి గుమ్మంలో ఓ ఇరవయ్యేళ్ళ పడుచు తప్ప మరెవ్వరూ కనబడలేదు. తాను తిరిగి చూడడంతోనే ఆమె ముఖాన
గుర్తింపు కూడా కనబడినట్లే తోచింది. కాని, ఆమె తననే పిలిచి వుంటుందనే అభిప్రాయం లేక మరల ముందడుగు వేయబోయేడు.
"రామనాధంగారు కాదూ?"
ఆ పిలుపు తననే, కాని ఆమె ఎవరో తనకు అర్థం అయినట్లు లేదు.
"ఔను"
ఆమె ఆతడు తనను గుర్తుపట్టలేదని గ్రహించింది.
"మరిచిపోయేరన్న మాట."
మరిచిపోయేనని చెప్పడానికి రామనాధం సిగ్గుపడ్డాడు. కాని జ్ఞాపకం లేదు. అందుచేత సమాచారం ఆవిడ నోటనే చెప్పించాలనే
ప్రయత్నంలో జాగ్రత్తగా అడ్డుప్రశ్న వేశాడు.
"మిమ్మల్ని హఠాత్తుగా ఇక్కడ చూసేసరికి ఎవరా అనుకున్నాను. సరి, ఏమిటి ఇక్కడ వున్నారు?"
హాస్పిటలుకు వైద్యానికి వచ్చినవాళ్ళు సాధారణంగా వుండే యిళ్ళు అవి. కనక తరువాతి ప్రశ్న కూడా తగిలించేడు.
"అంతా బాగున్నారా?"
ఎరిగిన ముకం కనిపించిన సంతోషంలో ఆమె అతని మాటలలోని సందిగ్ధతను గమనించలేదు
ఆమె తండ్రికి టైఫాయిడ్ వచ్చింది. చిరతపూడి వైద్యం మీద నమ్మకం లేక ఇక్కడికి తీసుకువచ్చేరు.
ఆమె చిరతపూడి అనడంతోనే అర్థం అయింది. స్వరాజ్యం. అబ్బాయి నాయుడు కూతురు.
"ఇప్పుడెల్లా వున్నారు. నడవండి, చూస్తాను."..... అన్నాడు ఆదుర్దా తెలిపిన కంఠంతో.
"ప్రస్తుతం తగ్గింది. పథ్యం పెట్టేరు. కాని ఇంకా మంచం దిగి వీధిలోకి రాగల ఓపిక లేదు. డాక్టరుగారు మరో వారం
ఉండమన్నారు."
వాళ్ళ అమ్మగారు నిన్ననే ఇంటికి వెళ్ళేరు. నాలుగైదు రోజుల్లో తామూ వెడతారు.
"సోమవారం మంచిరోజుట."
అబ్బాయి నాయుడు వీరేశలింగంగారి శిష్యుడు. ఆయనకా మంచీ చెడ్డా రోజుల పట్టింపు! నవ్వు వచ్చింది.
"ఆ పట్టింపు ఎవరిది?"
"అమ్మది. ఇదివరలో నాన్నగారు తోసిపారేసేవారు. ఇప్పుడూరుకున్నారు."
అతనిని తీసుకెళ్ళి స్వరాజ్యం తండ్రిని చూపింది.
"నాన్నా! ఎవరో వచ్చేరు చెప్పుకోగలవా?".....అంది.
"ఏం, నాయుడుగారు?" అంటూ రామనాధం కుశలప్రశ్నవేశాడు.
గుడ్డివాళ్ళకి గ్రహణశక్తి చాలా నిశితంగా వుంటుందన్నమాటను నాయుడు రుజువు పరిచేడు. ఏడాది క్రితం ఒక్క రోజున ఓ గంటసేపు
తనతో మాట్లాడిన రామనాధం కంఠస్వరాన్ని ఆయన గుర్తుపట్టేశాడు. చాల ఆనందంతో ఆహ్వానించేడు
"ఎప్పుడు వచ్చేరు బాబూ?"
నాయుడు జబ్బుచేసి అమలాపురంలో వున్నట్లే తెలియదని రామనాధం చాలా నొచ్చుకొన్నాడు.
"బాలకృష్ణ రోజూ స్కూలు వదిలిపెట్టేక తప్పకుండా వచ్చి ఓ గంటసేపు కూర్చునే వెడుతున్నారు. ఆయనే చెప్పేడు మీరు జైలునుంచి
వచ్చేరని..."
అంది స్వరాజ్యం.
రామనాధం వూళ్ళోకి వచ్చిన రోజున బాలకృష్ణ బడికి బయలుదేరుతున్నాడు. రోజూ ఇంటికి రాలేడు. గనక ఇక్కడే హైస్కూలు
దగ్గరలో బస చూసుకొని వుంటున్నాడు. శని, ఆదివారాలు ఇంటికి వెడుతూంటాడు.
"ఏదీ, నిల్చుని మాట్లాడినదేదీ? ఈ వేళ శుక్రవారం కదూ, రాత్రికి వస్తే తెలిసేది మీ పరిస్థితి" అన్నాడు రామనాధం.
నాయుడు చాలసేపు తన పరిస్థితి వివరించి బాలకృష్ణతో కలిగిన పరిచయాన్ని ఎంతో సంతోషంగా వర్ణించేడు. "మంచి పిల్లవాడు."
మీరిచ్చిన కరేలాలూ అవీ తిప్పుతున్నాడుట. ఓ అరడజను మందిని పోగుచేసేడుట."
నాయుడు నవ్వేడు. టోపీలు తీసేసి హర్తాళ్ చేయాలనే ఆలోచన కలిగినందుకు ఇద్దరూ నవ్వుకున్నారు.
వారిద్దరినీ కబుర్లకి వదిలి స్వరాజ్యం డాక్టరు వద్దకు బయలుదేరింది. వెళ్ళేముందు తాను వచ్చేవరకూ కదలవద్దని
రామనాధాన్ని కోరింది.
"మీరేదయినా పనిమీద వెళ్ళడం లేదుకదా? రెండు మాటలు చెప్పి మందు తీసుకు వచ్చెయ్యడమే."
"త్వరగా రావాలి. నేనో చిన్న పని పెట్టుకు వచ్చేను." ఆ పని ఏదో చెప్పేడు. తన భార్యను తీసుకు వెళ్ళడం గురించి ఒక
వకీలు గారినీ, హైస్కూలు హెడ్మాస్టరు గారినీ మామగారి వద్దకు కబురంపేడు. ఇప్పుడు రాజకీయాలకు తోడు, సాంఘిక బహిష్కార
అభ్యంతరం కూడా అడ్డం పెట్టుకొని ఆయన ఆ ఆలోచనలను త్రోసిపుచ్చేడు. తాను సరాసరి ఆ అమ్మాయితో మాట్లాడుదామని వచ్చేడు.
అన్నీ విని స్వరాజ్యం ఓ సలహా యిచ్చింది.
"వారింటివద్దనైతే ఆ అమ్మాయి దైర్యంగా మాట్లాడకపోవచ్చు."
మరి! ఆమె రోజూ ఏదో మందు కోసం డాక్టరు శాస్త్రిగారి వద్దకు వస్తూంది. సరిగ్గా వచ్చే వేళయింది. ఆమెతో మాట్లాడి
తీసుకురావడానికి ప్రయత్నిస్తానని స్వరాజ్యం వాగ్దానం చేసింది.
"వద్దు. మీకంత పరిచయం వుంటే నేను ఆమెతో సరాసరి మాట్లాడదలచి వస్తున్నానని చెప్పండి చాలు..."
స్వరాజ్యం తిరిగి వచ్చి "చెప్పే"నంది.
తాను వద్దన్నమాట కూడా మరచి రామనాధం "ఆమెనిక్కడకు రమ్మంటానన్నారు కదూ!" అన్నాడు.
"మీరు వద్దన్నారని...."
కాని, మళ్ళీ అంది.
"చెప్పేననుకోండి. ఆవిడ ఔను, కాదు అనే లోపునే ఆమెకు తోడుగా వచ్చిన పోలీసు బంట్రోతు తొందర పెట్టడంచేత
వెళ్ళిపోయేరామె..."
రామనాధం నిరుత్సాహపడ్డాడు.
"సరే. కానీండి."
రామనాధం లేచేడు.
"మీరు తిరిగి వచ్చేటప్పుడు కనిపిస్తారా?" అని నాయుడు ప్రశ్నించేడు.
రామనాధం సందేహించేడు. తాను వెడుతూన్న చోట పని ఫలితాలనుబట్టి తన మనస్సు ఎలా వుంటుందో, ఆ గొడవలతో వీరిని బాధపెట్టడం
అవుతుందనిపించింది.
"కాదు, చీకటి పడేసరికి ఇంటికి వెళ్ళాలి. ఇంకోమారు కనిపిస్తాను."
స్వరాజ్యం తాము వెళ్ళిపోయే రోజు గుర్తుచేసింది.
"వీలయితే వచ్చే శనివారం పొద్దుట వస్తారా?"
"ఏమన్నా పని వుందా?"
"మీరు వస్తానంటే..."
"సరే........"
"తప్పకుండా రాండి."
"పనేమిటో చెప్పకూడదా?"
"చెప్తే అందం ఏం వుంది? మీరు వచ్చినప్పుడే తెలుస్తుంది."
రామనాధం వెళ్ళేడు. ఆయన వెళ్ళేక నాయుడు అడిగేడు.
"ఎందుకమ్మా! ఆయనను......"
"మనకేం పనిలేదు. ఆ రోజున ఆ అమ్మాయిని తీసుకురావచ్చుననుకొన్నాను."
నాయుడు ఏమీ అనలేదు. స్వరాజ్యమే చెప్పుకుపోయింది.
ముంగండ వాళ్ళంటే ఏదో అపనమ్మకం. మగడంటే ఏదో భయం. ఆయన కులం చెడ్డాడని బెదురు. తల్లిదండ్రులు విషం నూరిపోశారు.
ఇప్పుడేనా ఆమెను ఎదుట బెడతారని స్వరాజ్యానికి నమ్మకం లేదు.
నాయుడు ఒక్క నిట్టూర్పు విడిచేడు.
"కొత్తదారి ఏది తొక్కినా ఈ గొడవలు తప్పవు కాబోలు."
చదువుకొన్న తన కూతురును భర్త నిరాకరించడం ఆయన మనస్సులో మెదిలింది.
ఎనిమిది
రామనాధాన్ని వాకిట్లోనే నిలబడి వున్న సబినస్పెక్టరు ముందుగా పలకరించేడు.
"ఏమిటిలా వచ్చేరు?"
ఎవరో పరిచితుడైన వ్యక్తిని, వూహించి వుండని చోట చూసినప్పుడు అడిగినట్లున్న ఆ ప్రశ్నకు రామనాధం తేరిపార చూసేడు.
అప్రయత్నంగానే అలవాటు కొద్దీ అనేశాడు.
"నమస్కారం."
సబినస్పెక్టరు ప్రతినమస్కారం చేసేడు--"నన్ను గుర్తు పట్టలేదనుకుంటాను." అన్నాడు.
"క్షమించాలి."
"నేను అంబాజీపేటలో వుండేవాడిని."
"ఓహో."
అంటూ రామనాధం ముందడుగు వేయబోయేడు. సబినస్పెక్టరు మరల అడ్డు వచ్చేడు. "ఆగండి....."
"ఎందుకు? నాతో తమకేమన్నా పనుందా?"
"ఏమీలేదు."
"మరి."
"సర్కిల్‌గారు ఏదో పనిలో వున్నారు. తమరిని కలుసుకొనేటందుకు వచ్చేవారికిప్పుడు వీలు కాదని చెప్పమన్నారు."
రామనాధం ఒక్కక్షణం నిలబడ్డాడు. వెళ్ళిపోదామనిపించింది. కాని, అంతలోనే తాను వచ్చిన పని పూర్తి చేసుకోనిదే పోరాదని మళ్ళీ
అనిపించింది. అతని మనస్సులో కలిగిన సందిగ్ధభావాన్నికనిపెట్టినట్లు సబినస్పెక్టరు మళ్ళీ ప్రారంభించేడు.
"అందుకే నేనిక్కడ నిల్చున్నాను."
"సర్కిల్‌గారి కోసం వెడుతున్నానని ఎందుకు అనిపించింది?"
సబినస్పెక్టరు అదో ప్రశ్నా అన్నట్లు నవ్వేడు.
"ఈ ఇల్లు సర్కిల్‌గారిది కనుక."
"క్షమించండి. మీ సర్కిల్‌గారితో నాకేం పనిలేదు. నా భార్య ఈ యింట్లో వుంది."
మరు సమాధానానికి ఎదురు చూడకుండా అతనిని తప్పుకొని రామనాధం చరచరా గుమ్మాలెక్కేడు. వెనకనుంచి "ఆగండి" అంటున్న
సబినస్పెక్టరును పొమ్మన్నట్లు చేయి ఆడించి, వెనుతిరిగి చూడకుండానే సావిట్లో అడుగుపెట్టేడు.
పడక కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్న నారాయణమూర్తి రామనాధాన్ని చూడగానే నిటారుగా కూర్చున్నాడు.
"వాకిట్లో సబినస్పెక్టరు లేడూ?"
"లేకేం వున్నారు. అయితే ఆయనతో నాకేం పనిలేదు. ఈ ఇంట్లో నా భార్య వుంది."
ఆ అవహేళనకు నారాయణమూర్తికి కోపం వచ్చింది.
"నీతో మాకు పనిలేదు. నాలుగు రోజుల క్రితం వెంకట్రామయ్య హెడ్మాస్టరుతో మాట్లాడేను."
"కలుసుకున్నా, వారు చెప్పేరు. అంతకు పూర్వం రామసోమయాజులుగారితోనూ చెప్పేరు......"
గుమ్మంలో కనిపించిన సబినస్పెక్టరుతో నారాయణమూర్తి తాను ఒక ఆరగంటలో పని పూర్తి చేసుకు వస్తాను వెళ్ళమన్నాడు.
"ఒక అరగంట టైమిచ్చేరన్నమాట."
"ఇంకా చాలా పనులున్నాయి" అన్నాడు నారాయణమూర్తి విసురుగా.
"నాకేం అభ్యంతరం లేదు. నేను......"
అతని పట్టుదలను చూసి నారాయణమూర్తి విస్తుపోయేడు.
"అభిమానం, సిగ్గు లాంటివి వదిలేస్తేగాని జైలుకు వెళ్ళలేరు" అన్నాడు.
"ఆ విషయంలో మీతో వాగ్వాదం పెట్టుకోవడం సరికాదు కాని, ఒకటి. మనిషి అయ్యేక కొన్ని బాధ్యతలుంటాయి. అభిమానపడితే
ఎల్లాగ?"
"ఓహో. బాధ్యతలు కొన్ని తెలుసునన్నమాట."
"కూతురునిచ్చిన అభిమానంతో గాకపోయినా ఇంటికి వచ్చిన పెద్దమనిషి అనే మర్యాదకయినా కూర్చోమంటారు బాధ్యతలు గలవాళ్లు.
కనీసం ఆ మాత్రం తెలియని వాళ్ళకన్న నేను చాలా నయం."
నారాయణమూర్తి ఓడిపోయానన్నట్లు ముఖం పెట్టేడు. కుర్చీలోంచి లేచేడు. రామనాధం ఆ వేడిమీద మరోపోటు పొడిచేడు.
"అయ్యయ్యో. తమరు పెద్దలు. తమరు లేచి నాకు చోటు ఇవ్వబోవడం మర్యాద కాదు. కనీసం నేనా మర్యాదను పాటిస్తాను."
కొరడా దెబ్బ తగిలినట్లు నారాయణమూర్తి విలవిలలాడిపోయేడు. ఉక్రోషమూ కలిగింది.
"నువ్వొస్తావని కలగన్నాం."
వాకిట్లో సబినస్పెక్టరు ఆటంకమూ, నారాయణమూర్తి వ్యవహారమూ చూశాక తాను వస్తున్న వార్త ఇంటికి చేరిందని అతడు
గ్రహించేడు. స్వరాజ్యం చెప్పిన మాటను సుందరి ఇంటిలో చెప్పింది. ఏం చెయ్యాలో వారికి అర్థం కాలేదు. ఎదుటపడకపోయినా ఇంటిలోని
వారంతా గుమ్మాల ప్రక్కనా, గోడల వెనకా దాగి వున్నారని రామనాధానికి అనిపించింది. కాని పైకి ఏమీ తేలలేదు.
నారాయణమూర్తి వీధిలో వున్న బంట్రోతును పిలిచి కుర్చీ తెప్పించి వేయించేడు. కూర్చున్నాక గృహస్తు మర్యాద గుర్తు వచ్చింది.
"మంచినీళ్ళు కావాలా?"
"ఇంటిలో ఎవరూ వున్న అలికిడి లేదు. కావాలంటే తమరు లేవాల్సి వస్తుంది. వద్దు."
నారాయణమూర్తి కసిగా అనేశాడు.
"మామూలు రోజుల్లో అయితే నువ్వు చెప్పిందే అనుకో. కాని, నీకిప్పుడా పట్టింపు వుండదు గదా. మా బంట్రోతు తెస్తాడు.
మొహమాటపడకు. వాడు ఈడిగ."
"అవసరం లేదు. అంతేకాని పట్టింపులకేముంది? జైలులో మాకు గంజి కాచి పోసింది, మీ వూరివాడేనట. మాదిగ పుల్లిగాడు."
అతని మాట వింటూనే లోపలి నుంచి అన్నపూర్ణమ్మ విసవిసా వచ్చింది. ఆవిడ కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి. కంఠం డగ్గుత్తిక
పడ్తూంది. ఆమెను చూడగానే రామనాధం నమస్కారం చేశాడు.
"నమస్కారం అత్తగారూ."
ఆమె అతని నమస్కారాన్నీ, మర్యాదనూ గమనించే స్థితిలో లేదు.
"ఎందుకు నాయనా! ఏదో మా కర్మం ఇల్లా వచ్చిందని తల ఎత్తుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తూంటే, పైగా మమ్మల్ని రచ్చ చేసి
బాధపెడతావు?"
ఆమె రాకకు మర్యాద చూపుతూ కుర్చీలోంచి లేచిన రామనాధం ఆమె అభియోగానికి నోరు తెరిచేడు.
"నేను బాధ పెడుతున్నానా?"
"కాకపోతే ఈ రాయబారాలేమిటి? ఈ రభసలేమిటి?"
"మా నాన్నగారిని గుమ్మం ఎక్కవద్దన్నాక చెయ్యవలసిందేమిటి?"