గౌరవార్ధం సాయంకాలం టౌన్‌హాలులో సభ జరిగింది. వర్షం మూలంగా హెచ్చుమంది రాకపోయినా వచ్చినవాళ్ళు చాలు, అతనిలో
వుత్సాహం రేకొనడానికి. జైలుకెళ్ళడం "గౌరవమే గాని, లాఘవము కాదు" అని చిలకమర్తి లక్ష్మీనరసింహంగారే దిలాసా ఇస్తూ వుంటే
మనస్సు కుదుటపడింది.
రాత్రి భోజనం చేసి కూర్చున్నప్పుడు సుబ్బమ్మగారే కదిపింది. ఏడెనిమిది నెలల క్రితం తీసుకువచ్చిన సమస్య ఏమయిందో ఆమె
ఎరగదు.
"తమ్ముడూ! మరదలుపిల్ల ఎక్కడుందిరా?"
జరిగిన ఘటనలన్నీ విన్నాక ఆమె అనుతాపం తెలిపింది. అప్పుడాతడు తన నిర్ణయం తెలియపరచేడు.
మామగారి చేతిలో ఆ అమర్యాద జరిగేక అతడు అసలు తనకు పెళ్ళి అయిందనీ, తనకో భార్య వున్నదనీ చెప్పుకోడానికి ఉత్సాహం
చూపడం లేదు. ఆ విషయమే మరచిపోవాలనుకుంటున్నానన్నాడు.
కాని సుబ్బమ్మగారు అంగీకరించలేదు. పైగా 'అభం-శుభం ఎరగని ఆడపిల్ల జీవితం పాడుచేస్తావట్రా....' అని కోపం చేసింది.
"ఆ అమ్మాయి నిన్నేమన్నా అందా?"
"లేదు కాని, అభిమానమూ చూపలేదు."
"అంటే?"
"అభిమానం చూపే మార్గాలు బోలెడు."
భారతదేశంలో ఆడపిల్లల పరిస్థితుల గురించి సుబ్బమ్మగారు ఎంతో ఆవేశంతో వర్ణించింది. "వాళ్ళని ఉంచే కట్టడీ, పెట్టే ఆరడీ
ఎరగవుట్రా....." అంది.
చట్టున స్వరాజ్యం, మంగమ్మా అతని మనస్సులో మెదిలేరు. తాను వెళ్ళినప్పుడు సుందరి చూపిన ఆదరణ గుర్తు వచ్చింది. కొంచెం
మెత్తపడ్డాడు.
"వాళ్ళు పంపరు."
"వెళ్లి తీసుకొచ్చెయ్యి."
"ఆమె రాదు. నే వెళ్లను."
రామనాధం మనస్సులోని అభిమానం ఆమెకు అర్ధం అయింది.
అతడు వెళ్ళి తీసుకురాడు. ఆమె తండ్రి పంపడు. ఆ రెండింటిలో ఏ ఒకటన్నా జరగకుండా తెలుగుదేశంలో ఆడపిల్ల తనంతగా సాహసం
చేసి భర్త వద్దకు వచ్చెయ్యడం జరగగల పని కాదు.
"మీ బాబాయెవరో వున్నారన్నావు కదూ?"
తాను జైలులో పడిన రోజు సాయంకాలం ఆ బాబాయి తన అత్తవారింటికి వెళ్ళి అవమానపడిన విషయం గుర్తు వచ్చింది. అక్కడికి
మళ్ళీ వెళ్ళమనలేడు. ఆయన వెళ్ళరు కూడా.
"నీకు దగ్గరగా వుండే వాళ్ళ వాళ్ళే ఎవరూ లేరూ?"
తన బావమరిదీ, ఆయన భార్యా వున్నారు. వాళ్ళకీ ఆ గుమ్మంలో అడుగుపెట్టడం 'మనా'యే.
సుబ్బమ్మగారు ఆలోచించింది.
"మనం ఏ పని తలపెట్టినా ముందు దెబ్బ తగిలేది ఆడదానికి. పోనీ అని ఆ దెబ్బ తట్టుకొనే అవకాశమన్నా ఆమెకుండదు."
కాని రామనాధం సంతృప్తి పడలేదు.
తనవంతు పని తాను చేశాడు. ఆమెను బయటకు తీసుకురావడానికి సిద్ధం అయ్యేడు. ఆ ప్రయత్నంలోనే అవమానం పాలయ్యేడు. జైలులో
నానా బాధలూ పడ్డాడు.
ఆ రోజుల్లో ఒక్కమారు, సబ్‌జైలు ఇంటికంతదూరంలో వున్నా, ఆమె ముఖం చూపించలేదు.
అతని అభిమానం చూసి సుబ్బమ్మగారు నవ్వింది.
ఇవ్వాళ తన కోసం జైలు బయట ఎవరన్నా వుంటారేమోనని చూసేడు.
సుబ్బమ్మగారు చిన్నపుచ్చుకుంది.
"నువ్వు ఈవేళ విడుదల అవుతావని తెలియదు. ఇంకో వారం రోజులు తరవాత గాని విడుదల చెయ్యరనుకున్నాం."
ఆమె గాని, ఇతర కాంగ్రెసు వారు గాని జైలు వద్దకు వచ్చి ఎదురు సన్నాహం చేయలేదని ఆతడనలేదు. కాని తన మాటకు ఆ
అర్థం రావడంతో రామనాధం సిగ్గుపడ్డాడు.
"నేనన్నది అది కాదు."
కాని, ఈమారు సుబ్బమ్మగారింకో దిశ నుంచి తన అభ్యంతరాన్ని ఎదుర్కొంది.
"నీ వయస్సెంత?"
హఠాత్తుగా వేసిన ఆ ప్రశ్న ఎందుకో అర్ధంగాక రామనాధం బిక్కమొగం వేసేడు.
"నీకంటె ఆమె ఎంత చిన్న?"
"నువ్వు ఏం చదువుకొన్నావు? ఆమె చదువు ఏపాటిది?"
"పడవ ఖర్చుకన్నా పావలా డబ్బులు ఆమె వద్ద వుంటాయా?"
"అంత నిస్సహాయ స్థితిలో వున్న చిన్నపిల్ల మీదనా ఆ కసి" అంటూంటే రామనాధం ఆలోచనలో పడ్డాడు.
సుబ్బమ్మగారు అంతతో వదలలేదు.
"ఈవేళ మీ తమ్ముడిని చూసి వచ్చేనన్నావు కదూ" అంది.
మధ్యాహ్నం భోజనం కాగానే అతడు మొదట చేసిన పని కాలేజీ హాస్టలుకి వెళ్ళి తమ్ముడిని చూడడం. నామీద సాక్ష్యం చెప్పినా
నీమీద కోపం లేదు సుమాయని చూపదలచేడు. వెళ్ళేడు. అతని రాకకు వెంకటరమణ సిగ్గు పడలేదు. వుత్సాహమూ చూపలేదు. కించిత్తు
అయిష్టం చూపేడనిపించింది. తనతో సంబంధం వుందంటే వచ్చిన సెలక్షన్ కాస్తా తప్పిపోతుందేమోననుకొంటున్నాడనిపించింది. ఓ
నిముషం కూర్చున్నాడు. "మీ అమ్మతో ఏమన్నా చెప్పమంటావా?" అన్నాడు. "ఏమీలేద'నిపించుకుని లేచి వచ్చేడు. సహాయనిరాకరణంలో
అసూయాద్వేషాలకు తావు లేదన్న గాంధీగారి మాటను అమలులో చూపడానికే అతడు వెళ్ళేడు.
"అటువంటి ఉదారాశయాలు గలవాడివి. నీకేమి అపకారం చేసి వుండని అసహాయురాలి మీదనా కక్ష....."
రామనాధం సిగ్గుపడ్డాడు. ఈమారు నిజంగానే సిగ్గుపడ్డాడు.
"మళ్ళీ ప్రయత్నిస్తాను."
ఆమె సంతోషించింది. ఎల్లా చేస్తావు? ఏమి చేస్తావని అడగలేదు. ప్రయత్నిస్తానన్నాడు చాలు. ప్రయత్నిస్తాడు. అభినందించింది.
* * * * *
ప్రయత్నిస్తానన్నాడేగాని ఎలా ప్రయత్నించాలో అతనికీ తెలియదు.
.....ఊరు సమీపించేడు. ఆ రోడ్డు మొగలో స్వరాజ్యం సెలవు తీసుకొంటూ తమ వూరు రమ్మంది. ఆ మాట విన్న తన మిత్రుడు
వేళాకోళం చేసేడు. అన్నీ గుర్తు వచ్చేయి.
"ఏం మనుష్యులు?" అనుకొన్నాడు.
ఆ రోజున వాళ్ల స్వరాజ్యం కాపురం ఫొక్తు పరచడానికెళ్ళేరు. "ఇప్పుడు నా కోసం వెడతారేమో" అనుకున్నాడు.
నవ్వు వచ్చింది. ఆ ఆలోచనే నవ్వుతాలుగా కనిపించింది.
రెండు
చేతిలో వున్న రైలుసంచి తోటలో పాకలో పడేసి రామనాధం సరాసరి ఇంటికి బయలుదేరాడు. పెద్ద పావంచాల రేవులో బట్టలుతుక్కుంటున్న
ఆడవాళ్ళు ఆతన్ని చూడగానే తమ చేతిలో పని నిలిపి తిరిగి చూసేరు. పలకరించేరు.
"ఎప్పుడొచ్చేవురా? బాగున్నావా?"
రామనాధం ప్రాణం లేచివచ్చినట్లయింది. నిలబడ్డాడు. వాళ్ళ ప్రశ్నలకి సమాధానం ఇస్తూ మరల బయలుదేరేడు. వెనకనుంచి
సానుభూతి, సానుతాపం వినబడుతూంటే నవ్వొచ్చింది.
"ఏమిటో, దురదృష్టం కాకపోతే, ఏమిటి? ఏదో పెద్ద వుద్యోగస్థుడవుతాడనుకొంటే ఇల్లా అయ్యేడు, జైళ్ళూ......"
మిగిలిన మాటలు రాతి మీద బట్టలు బాదిన చప్పుళ్ళలో కలిసిపోయేయి.
ఇంటికి వచ్చేసరికి శంకరశాస్త్రి అరుగు మీదనే కూర్చుని వున్నాడు. వ్యాసపీఠం మీద పుస్తకం వుంది. రామనాధం, ధర్మశాస్త్ర
గ్రంథం తిరగేస్తున్నట్లు గ్రహించేడు.
మెట్టుమీద అడుగుపెడుతూ, పలకరించబోయేసరికే శంకరశాస్త్రి తల ఎత్తి చూసేడు. పలకరించేడు.
"ఎప్పుడు విడుదలయ్యేవురా? ఒంట్లో ఏం లేకుండా వున్నావా? రా. కూర్చో."
సమాధానం వినిపించుకోకుండానే లోపలున్న భార్యను పిలిచేడు.
"ఏమేవ్! ఏం చేస్తున్నావు? రావే. రా. ఇడిగో మన అబ్బిగాడు వొచ్చేడు."
తనను ఇంట్లో అడుగు పెట్టకుండా చేసే ప్రయత్నం ఆ పలకరింపులోనూ, పిలుపులోనూ గమనించి రామనాధం గతుక్కుమన్నాడు. రాత్రి
పడవలో వచ్చేటప్పుడు మంచినీళ్ళు అవసరమయ్యాయి. అంతసేపు తన కబుర్లు వింటూ హుషారు చేస్తున్న సరంగు చేద ముట్టుకుంటే మరి
ఆవల పారెయ్యవలసి వస్తుందనేశాడు.
అది తాటాకుతో కట్టింది. తడిసి నాని వుంది. రామనాధం బ్రాహ్మడు. మామూలు పరిస్థితులలో దానిని ఉపయోగించితే అతడు
మైలపడతాడు. కాని, జైలు నుంచి వస్తున్నాడు. ఇప్పుడాతడు ముట్టుకొంటే ఆ చేద మైలపడుతుంది.
ఆ జ్ఞాపకంతో రామనాధం మనస్సు చివుక్కుమంది. నిలబడిపోయేడు.
భర్త పిలుపు విని రాజమ్మ ఇంట్లోంచి పరుగెత్తి వచ్చింది. కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ--"వచ్చేవురా నాయనా!" అంటూ అతని చుట్టూ
అలగం తొక్కింది. "ఎల్లా వున్నావురా? ఎన్నాళ్ళయిపోయిందిరా!" అని కళ్లు తుడుచుకొంది.
ఆమె మడి కట్టుకొని వంట చేసుకొంటూంది. పొయ్యి దిగమండి పోతూంది. ఆతణ్ణి నాలుగు కబుర్లూ అడగడానికి తీరుబడిలేదు. దగ్గర
కూర్చోడానికీ లేదు.
"కూర్చోరా. పొయ్యి మీది అన్నం దింపేసి వస్తా. కూర్చో."
కూర్చోమనే గాని లోనికి రమ్మనలేదని అతడు గ్రహించేడు. ఆమె లోపలికి వెళ్ళింది. శంకరశాస్త్రి లేచేడు. అరుగుమీది గది
తలుపు తెరిచేడు.
"తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. బట్టలు ఇందులో పెట్టుకో. స్నానం చేసిరా. నూతిదగ్గరికి గంత తలుపు తెరుస్తా. భోజనం
చేసేక....."
జైలుకి వెళ్ళివచ్చిన తనకి అగ్రహార సమాజంలో స్థానమేమిటో స్పష్టమైంది. తనను ఇళ్ళల్లోకి రానివ్వరు. రాత్రి సరంగు
అభ్యంతరానికి కనిపించని అవమానం ఇప్పుడు తోచింది. ఈ పిలుపులూ, ఏర్పాట్లూ చూశాక తాను ఇంటికి ఎందుకు వచ్చేనా అనిపించింది.
తోటలో వుండిపోవలసిందనుకొన్నాడు. అయితే భోజనం సమస్య. అక్కడ ఏ విధమైన ఏర్పాట్లూ లేవు. అయినా సరే ఇక్కడ ఇంక
భోజనం చెయ్యవద్దనుకొన్నాడు.
"ఎందుకు? నా బట్టలూ, పాతలూ తోటలో మకాంలో పడేశాను. మళ్ళీ ఇప్పుడీ గది ఎందుకు? అక్కడే వుంటాను."
శంకరశాస్త్రి అర్థంకానట్లు వెనక్కి తిరిగి చూసేడు.
"భోజనానికి అంత దూరం నుంచి వస్తూ పోతూండడం కష్టం. వర్షాలు కూడాను. అదీగాక రెండు రోజుల పనికి...."
ఈమారు రామనాధం తాను వంట కూడా అక్కడే చేసుకొంటానని స్పష్టం చేశాడు. కప్పు కురుస్తూందంటే నాలుగు ఆకులు దోపిస్తానన్నాడు.
కట్టెపుల్లలు అన్నీ తడిసి వుంటాయి చేసుకోలేవంటే చెట్లక్రింద వుంటున్న వాళ్ళంతా వంటలు చేసుకోవడంలేదా అన్నాడు.
శంకరశాస్త్రికీ కష్టం అనిపించింది. ఆ సమాధానాలు ఆతనికి నచ్చలేదు. అతని అభిమానం అర్థం అయింది.
"ఎంతయినా బ్రాహ్మలం కదా? జైలుకి వెళ్ళి వచ్చేవు...." అన్నాడు.
ఈ ఏడెనిమిది నెలల్లో రామనాధం మానసికంగా పది పదిహేనేళ్లు పెరిగేడు. వెనకటి బెదురు, సంకోచం లేవు. ఏడాది క్రితం
ఇవ్వలేని సమాధానాలు నేడు శంకరశాస్త్రి వింటున్నాడు.
"ఏ పని చేసినా జైళ్ళకు వెళ్ళకుంటే మన బ్రాహ్మణ్యం నిలబడుతుందన్న మాట."
శంకరశాస్త్రికి సమాధానం ఏమీ తోచలేదు. విసువు కలిగింది.
రామనాధం వచ్చిన వార్త విని ఆ వీధిలో వాళ్లు నలుగురూ చేరేరు. తండ్రీ కొడుకుల అభిమానాలు గ్రహించి కుర్రవానిని
ఓదార్చడానికి ప్రయత్నించేరు.
"ఇంక రెండు రోజులు. ఇంతలో నువ్వు వంటేమిటి? తోటలో మకాం ఏమిటి?"
రామనాధం వాళ్ళ ముందు తన అభిమానం ప్రకటించకూడదనుకొన్నాడు. కాని తన పట్టుదల వదలదలచుకోలేదు.
"నేను వండుకోగలను. జైలులో పులుసూ, కారమూ లేని చప్పిడికూడు తినడం అలవాటయింది. మజ్జిగ, పెరుగు, నెయ్యి, నూనె ఏమీ
పనిలేదు. ఆపాటి వంట కష్టం కాదు."
ఎవరెన్ని చెప్పినా ఆతడు వినిపించుకోలేదు.
శంకరశాస్త్రి ఇంక లాభంలేదనుకొన్నాడు.
"పోనీ, ఈపూట స్నానం చేసి జంధ్యం మార్చుకో. ఇదిగో పట్టుకెళ్లు" అంటూ వ్యాసపీఠం మీద పుస్తకంలో గుర్తుగా పెట్టిన జందెంపిడి
చేతిలోకి తీసుకొన్నాడు.
జైలులోకి అడుగుపెడుతున్న క్షణంలో గార్డు రూమ్ ముందు కూర్చోబెట్టి తన బట్టలతో పాటు తన జంధ్యాన్ని కూడా
తీసేసుకున్న మాట రామనాధానికి జ్ఞాపకం వచ్చింది. ఆనాటి వరకూ ఆతడు దానినెంతో భద్రంగా వుంచుకున్నాడు. సంధ్యావందనం
ముప్పొద్దుల నుంచి రెండు మార్లయి, కేవలం ఉదయకాలానికి మాత్రమే పరిమితమయి పోయింది. కాని, తన కుల చిహ్నంగా దానిని
కాపాడుకొంటూనే వచ్చేడు. ఇప్పుడు దానిని నిలుపుకోవడం సాధ్యం కాలేదు. లాక్కున్న బట్టలకి జైలు బట్టలిచ్చేరు. కాని జంధ్యానికి
ప్రత్యామ్నాయంగా ఏమీ యివ్వలేదు. ఖైదీ నెంబరు వేసిన కర్రబిళ్ళ ఇచ్చారు. అయితే అది జంధ్యానికి ప్రత్యామ్నాయం కాగలదని
అతడు భావించలేదు. ఆ అభిప్రాయాన్ని బయటికి స్పష్టంగా చెప్పేసరికి పక్కనే నిల్చున్న వార్డరు చేతిలోని కర్రతో రెండు
దెబ్బలేసేడు. వాళ్లు ఇచ్చిన పొట్టిలాగుకి వుండవలసిన బొందునూ, తన జంధ్యాన్నీ ఒకే హోదాలో చూస్తారని అటు తరవాత
తెలిసింది. 'కరుప్పుకుళ్ళాయి'(నల్లటోపీ)గాడొకడు చెప్పేడు; ఖైదీలు వురిపెట్టుకు చచ్చిపోకుండేందుకు తాడులాంటి వస్తువును దేనినీ
వాళ్ళకు అందనివ్వరు. లాగుబొందూ, మెడలో జంధ్యమూ వాని వుపయోగాలూ, వుద్దేశ్యాలూ ఏవయినా రెండూ తాళ్ళే, కాకుంటే తాడులాంటి
వస్తువులు.
"మెళ్ళో జంధ్యం వాళ్ళు లాగేసుకున్నారు" అంటూ రామనాధం దానిని అందుకొన్నాడు.
శంకరశాస్త్రీ, అక్కడ చేరినవాళ్ళూ ఎంతో కష్టం కనబరిచేరు.
ఇంగ్లీషువాళ్ళు హిందూమత విధ్వంసానికి సాగిస్తున్న చర్యలలో అదొకటిగా నిర్ణయించి తలొక విధంగా తమ కోపాన్ని ప్రకటించేరు.
"ఇన్ని నెలలూ మెళ్లో జంధ్యం లేదూ, చుచ్‌చ్చు."
రామనాధం తల ఆడించేడు.
అందరూ ఏకగ్రీవంగా శంకరశాస్త్రికి సలహా ఇచ్చేరు.
"మామా! రేపటికే ఏర్పాట్లు చేసెయ్యి, ప్రాయశ్చిత్తం, ఉపాకర్మ జరిగించడానికి ఆలస్యం ఎందుకు?"
మూడు
ప్రాయశ్చిత్తం, ఉపాకర్మ మళ్ళీ ఆతడికి బ్రాహ్మణ కులంలో స్థానం కలిగిస్తాయి.
కాని,
ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా రామనాధం వానికి ససేమిరా అన్నాడు.
ఆ పేరున పెద్ద తంతు నడపబోమనీ, టూకీగా తేల్చివేస్తామనీ చెప్పినా అతడు అంగీకరించలేదు.
సంఘసంస్కరణ భావాల ఉద్వేగం అది--అనే ఆలోచనతో విశ్వనాధం కొంచెం సర్దుబాటు చేయాలని చూసేడు.
సంఘాన్ని ధిక్కరించినట్లూ, అనుసరించినట్లూ గాకుండా పక్కపక్కన వొరగేసుకుపోవాలనేది ఆయన ఆలోచన, చాల కాలం వరకూ
వీరేశలింగం పంతులుగారు తల్లిదండ్రుల ఆబ్దికాలను యథావిధిగా పెడుతూండిన విషయాన్ని ఉదహరించాడు.
కాని, రామనాధం అభ్యంతరం అది కానే కాదు.
అటు పోలీసు వుద్యోగియైన మామగారూ, ఇటు ఛాందసుడైన తండ్రీ ఈ ఇద్దరూ కూడబలుక్కుని తన చేత తను చేసిన పనికి క్షమాపణ
చెప్పించాలని చూస్తున్నట్లు అనిపిస్తూందతనికి.
పిల్లనిచ్చినవాడు బ్రిటీష్‌వాళ్ళ తాబేదారు. తాను సత్యాగ్రహం చేయడం ఆయనకు కోపం. ఆ కోపంతో దొంగకేసు పెట్టి
జైలుశిక్ష వేయించేడు. తన తండ్రీ, బంధువులూ ఆ దొంగ కేసును పెట్టిన పెద్దమనిషిని, ఏమీ అనడం లేదు. జైలులో వున్నందుకు
తనకు ప్రాయశ్చిత్తం కావాలట. తాను ఇష్టపడి జైలులో కూర్చున్నాడా యేమన్నానా?
ఈ వేళ తాను ప్రాయశ్చిత్తం చేసుకోవడమంటే తాను చేసిన పని తప్పు అని వొప్పుకోవడమన్నమాట. ఇక అటువంటి తప్పు పని
చేయనని వాగ్దానం ఇవ్వడం అన్నమాట.
తాను చేసిన తప్పేమిటి? జైలులో వుండడమా? తన కులం కాని వాళ్ళ చేతి అన్నం తినడమా?
సబ్‌జైలులో వున్ననాడు హాస్పిటలు కాంపౌండరు తన కళ్ళు తెరిచేడు. అప్పటినుంచీ అతడీ కులభేదాలను గురించి కొద్దిగా
చదివేడు. చాలా ఆలోచించాడు. అతనికి ఆ విచక్షణ అర్థరహితమని తోచింది. అతనికి జైలులో అన్నం తినబుద్ధి కాలేదు.
రోగపడ్డాడు. దానికి కారణం వండినవాడూ, వడ్డించినవాళ్లూ తన కులంవాళ్ళు కాకపోవడంచేత కానే కాదు. బ్రాహ్మడే వండి వడ్డించినా
ఆ జైలు మెతుకులంతే. ఇంక అటువంటి అర్థరహితమయిన అభ్యంతరాన్ని తాను పాటించడు! అది నిశ్చయం.
ఇంక ప్రాయశ్చిత్తం. జైలులో పడవలసి వచ్చే నేరం చేసినందుకా? తాను చేసిన నేరం ఏమిటి? దేశంలో పరాయి పాలన పోవాలన్నాడు.
ఆ పరాయి పాలనకు సహాయం ఇవ్వనన్నాడు. చేతితో వడికి చేతితో నేసిన బట్ట కట్టుకున్నాడు. ఆడపిల్లకు కనీసం
పద్దెనిమిదేళ్ళయినా వస్తే గాని సంసారబంధం తగిలించకూడదన్నాడు. ఈ నేరాలు ఇకముందు కూడా చేయదలచుకొనే వున్నాడు.
మొదట విశ్వనాధం కొంచెం దిగతీసినట్లు కనబడ్డా, ఆయన రామనాధం వాదనలకి కావలసిన ఆలోచనలను సమకూరుస్తూ వచ్చేడు.
పురాణాలనుంచీ, పూర్వ గ్రంథాలనుంచీ, శ్రుతులనుంచీ, స్మృతుల నుంచీ ఆలోచనకి కావలసిన సంబారాలన్నీ అందచేసేవాడు. ఆ ఆచారాల్ని
ఎగతాళి చేసేడు. కాని, పూర్తిగా ఇల్లా చెయ్యమని చెప్పడు.
"ఇవన్నీ ఒకరికొకరు చెప్పవలసినవి కావు, చదువుకున్నవాడివి నీకు నేను చెప్పడమేమిటి? ఎవరికి వాళ్లు
నిర్ణయించుకోవలసినవిగాని......"
--అంటూనే మరో మెలిక వేసేవాడు.
"ఒరేయి రామం. మనకి విశ్వాసం లేని పని ఒకరు చెప్పేరని చేసెయ్యకూడదు. ప్రాయశ్చిత్తం ఎందుకని నేనంటే కాబోలనుకోవడమూ,
మరొకరు కాదు కూడదంటే సరేననడమూ పనికి రాదు. ఇది నీ జీవితంలో ఓ సంధి దశ...." అని హెచ్చరించేడు. వెనువెనుకనే
మరో వాదన.
"జరిగిందేదో జరిగిపోయింది. చేసింది తప్పో, వొప్పో, ఏదయినా సర్దుకొనేటందుకింకా వ్యవధి వుంది. ప్రాయశ్చిత్తం చేసుకొని కులంలో
చేరవచ్చు. ఏదో కాస్త ఆస్తి వుంది. జరుగుబాటుకు లోటు లేదు. పోయి కాలేజీలో చేరవచ్చు. ఇంగ్లండూ వెళ్ళొచ్చు. ఐ. సి.
ఎస్. కాకపోతే బారిస్టరయి రావచ్చు. ఉన్నవ లక్ష్మీనారాయణగారు అలా వెళ్ళి రాలేదూ? ఈ ఏడాది చదువు చెడిందని
తప్ప పెద్ద నష్టం ఏమీ వుండదు. ఏదో వుద్యోగం దొరుకుతుంది. లేదా బల్ల కడతావు. స్వతంత్రమైన వృత్తి. మామగారు పిల్లను
పంపుతారు. సుఖంగా రోజు గడుస్తుంది.....
తన సుఖమయ జీవితానికి ప్రాయశ్చిత్తకాండ ప్రాతిపదిక కాగలదని చెప్పడంలోనే విశ్వనాధం దానికి వ్యతిరేకంగా మనస్సును
మేల్కొలిపాడు.
రెండో దిశన ఈ సుఖమయ చిత్రానికి రెండవ పెడ నాతడు వర్ణించలేదు. అది రామనాధానికి అనుభవంలోకి వచ్చేసింది. దానికితోడు
మామగారు పిల్లను పంపక పోవచ్చుననే సూచన వుంది. రామనాధం ఆ ఆలోచనలనన్నింటినీ త్రోసి పుచ్చేడు.
"నేను గాంధీజీ..."
విశ్వనాధం నివారించేడు.
"తొందరపడకురా. తొందరపడి వాగ్దానాలూ, ప్రతిజ్ఞలూ చేసెయ్యకు. ఆలోచించుకో...."
రామనాధం ఆలోచించేడు. వెనక్కి తిరగవలసిన అవసరం కనబడలేదు.
ఈమారు శంకరశాస్త్రి పితృదేవతలయెడ కుమారుడుగా ఆతడు నిర్వహించవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేసేడు. రామనాధం ఆలోచనలో
పడ్డాడు.
సుబ్బన్న శాస్త్రులు వెంటబడ్డాడు. ఓమారు ఆతడు పితృతిథులు గుర్తుచేస్తూంటే విశ్వనాధం అక్కడుండడం తటస్థపడింది.
వూరుకోలేకపోయేడు.
"నరసమ్మత్త పోయి ఆరు నెలలయిందనుకుంటాను."
"అంతా వారం అయింది షాణ్మాసికం పెట్టి....."
అతనికి తద్దినాలూ, మాసికాలూ పెట్టడంలో వున్న శ్రద్ధను పొగుడుతూ విశ్వనాధం వుబ్బేసేడు.
"గార్లూ, అరిసెలూతో యధావిధిగా జరుపుతున్నాడు...."
"కొంతమందిలాగ రెండేసి, మూడేసి నెలలు ఎగబెట్టి, ఒక్కమారే జరపడం వట్టి పాడు పని...." అని తన ప్రత్యేకతని
చెప్పుకున్నాడు సుబ్బన్నశాస్త్రి
ఆ మాట మీద విశ్వనాధం చల్లగా అంటించేడు.
"నువ్వు గార్లు వండేవో, అరిసెలు చేయించేవో పాపం ఆవిడ చూడవచ్చిందేమిటి గాని, నువ్విప్పుడొక్క మాసికానికి చేస్తున్న ఖర్చు
ఆవిడ మనోవృత్తికి కలిపివుంటే, వెర్రిముండ మరో పదేళ్ళు బ్రతికేది....."
నెలకో రూపాయి మనోవృత్తి చాలడం లేదనీ, మరో రూపాయేనా కావాలనీ నరసమ్మత్త గోల పెట్టేది. కాని సుబ్బన్నశాస్త్రి
ఇవ్వలేదు. విశ్వనాధం ఆ మాట జ్ఞాపకం చెయ్యడంతోనే సుబ్బన్నశాస్త్రి వెల్లబోయేడు.
"ఆవిడని మా యింట్లోనే వుండమన్నాను. కాని....."
"ఎరుగుదును, ఎరుగుదును.. ఆవిడిదో తిక్క. పొత్తర్లబియ్యం తింటానా అంది. నాకు తెలుసు. బ్రాహ్మణకర్మ అయినప్పుడు చేస్తే
తప్పేముంది?... ఒక్కొక్క ఘటం అల్లా వెళ్ళిపోవలసిందే."
రామనాధం కళ్ళు విడినట్లయింది. విశ్వనాధం అంతతో వదలలేదు. ముక్తాయింపుగా మరో వాక్యం జతపరిచేడు. దానితో సుబ్బన్నశాస్త్రి
తడిసిన పిల్లిలా చల్లగా జారుకున్నాడు.
"చచ్చిపోయినవాళ్ళంతా వొచ్చి విస్తరి పరుచుక్కూర్చుంటే ఏడాదికోమారే ఆయెను. ఒక్కపూట ఇంత అన్నం పెడతామంటావా? ఆ రోజుకెన్ని
అభ్యంతరాలొస్తాయి? గార్లమీదా, అరిసెలమీదా మనకున్న వాంఛని తీర్చుకోడానికిదో దారి చేసుకుంటున్నాముగాని...."
ఆ సంభాషణ అక్కడితో ఆగలేదు. తద్దినాలు పెట్టకుండా రామనాధాన్ని విశ్వనాధమే ప్రోత్సహిస్తున్నాడని వీధిలో పడింది. విని
విశ్వనాధం నవ్వి వూరుకున్నాడు.
కానీ సత్యం అన్నప్పుడు వూరుకోలేకపోయేడు.
"నువ్వు పితృస్థానంలో కూర్చుంటానను. వాడు ప్రాయశ్చిత్తం చేసుకొని...."
సత్యం, అతని అన్నదమ్ములూ, బ్రాహ్మణార్ధాలకు వెళ్ళడం నీచంగా భావిస్తున్నారు. ఆ సంగతి తెలియకా, తెలిసి పంతం కోసమూ
వాళ్ళని పిలిచి అనేక మంది సిగపట్లవరకూ తెచ్చుకొన్నారు. వారికి ప్రతిక్రియగా మరికొందరూ బ్రాహ్మణార్ధాలకూ పోనిరాకరించారు.
సత్యం ముఖం ఎర్రబడిపోయింది.
"మీరు గనక....."
విశ్వనాధం నవ్వేడు.
"తొందరపడకు, ఇది బ్రాహ్మణ కర్మ. అది నేనొక్కడినే చెయ్యగలిగేది కాదు. ఇంకో ఇద్దరిని ఆమంత్రించాలి కదా?"
"ముంగండలో బ్రాహ్మణులే దొరకరా?"
"ఎందుకు దొరకరు? వున్న బ్రాహ్మణుల యిళ్ళల్లో మీదొకటి....."
సత్యం ముఖం ఎర్రబడింది. ఈమారు కళ్ళు కూడా నిప్పులు కురిశాయి.
"మేము బ్రాహ్మణార్ధాలు చేసుకొనీ, పీనుగుల్ని మోసీ బ్రతికే దశలో లేము."
విశ్వనాధం తొందరపడకుండానే అంట కాల్చేడు.
"నీకు బ్రాహ్మణార్థం బూతయింది. మరి ఆ తప్పు పని చేయించమని బావమరిదిని ప్రోత్సహిస్తావేం?..."
* * * * *
రామనాధం ఒక నిశ్చయానికి వచ్చేడు.
"ఇంక లాభంలేదు. ముసుగులో గుద్దులాట ఎందుకు? నేను ప్రాయశ్చిత్తానికి ఒప్పుకోను. నేను తప్పేం చెయ్యలేదు."
శంకరశాస్త్రి సమస్యను బిగతీయ తలచలేదు. తోటలో వండుకొనేందుకభ్యంతరం చెప్పలేదు. భోజనానికి ఇంటికే రమ్మందామని రాజమ్మ
గోల చేసినా వినిపించుకోలేదు.
"కష్టసుఖాలు తెలిసిరానీ, కుసులు వొంగితేగాని..." అన్నాడు.
కాని, తరువాతి కథలూ, పరిణామాలూ విన్నాక తన అంచనా తప్పేననిపించింది. సుబ్బన్నశాస్త్రీ, సత్యం తమ అనుభవాలు తమకు
జ్ఞాపకం వున్న విధంగా చెప్పేరు. అన్నీ విని ఒక్క నిట్టూర్పు విడిచేడు.
"తా చెడ్డకోతి వనమెల్లా చెరిచింది" అన్నాడు.
ఆ చెడిపోయిన కోతి విశ్వనాధమో, సుబ్బన్నశాస్త్రో, సత్యనారాయణో తేలలేదు.
విశ్వనాధం పితృకర్మలు చేస్తూనే వున్నాడు. ఆ మాట గుర్తుచేసుకొని సత్యనారాయణా, సుబ్బన్నశాస్త్రీ ఒకరికొకరు
వూరడించుకొన్నారు.
"ఎన్ని చెప్పినా వాళ్ళంతా ఒకటేరా."
నాలుగు
తోటలో మకాంలో గిన్నె మాడ్చడానికి నిశ్చయించుకోవడంతో తన ఆస్తిపాస్తుల్ని వప్పగించుకోకపోతే రోజు నడవదని రామనాధం
గ్రహించేడు. రాజమండ్రిలో పడవ ఎక్కే ముందు అప్పు తీసుకొన్న రూపాయితో ఏవో కొద్ది అణాలు మాత్రం మిగిలేయి. ప్రాయశ్చిత్తం
విషయం తేల్చుకొనే ఆదుర్దాలో శంకరశాస్త్రి డబ్బు విషయం ఆలోచించలేదు. అప్పుడే జైలు నుంచి వస్తున్నవాడి చేతిలో డబ్బు ఉండక
పోవచ్చుననే మాట తోచలేదు. తిరిగి వెళ్ళిపోతూంటే వూరుకున్నాడు.
తోటలోనికెళ్ళేసరికి తమ యింటి పనిమనిషి మరిడమ్మ అక్కడ కూర్చుని వుంది. ఆతడు పుట్టక పూర్వం నుంచీ ఆమె ఆ యిళ్ళల్లో
పని చేస్తూంది. ఆతడు విడుదల అయి వచ్చేడని తెలియగానే పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆతనిని చూడగానే బ్రహ్మానంద పడింది.
ఆమె అకృత్రిమానందం చూసి రామనాధం కళ్ళనీళ్ళు తిరిగేయి.
"బాగున్నావా మరిడమ్మా!"
మరుక్షణంలోనే అతడక్కడ వంటబెట్టుకోబోతున్నాడని విని ఆమె చాల విచారం తెలిపింది. అంతమంది బంధువులుండగా చేయి
కాల్చుకోవడమేమిటని ఆమె అభ్యంతరం.
పట్టింపు వచ్చేక తమ యింట్లోనే అయితేనేం అతడు భోజనం చేయడు. పెదతండ్రి విశ్వనాధం యింటికి వెళ్ళవచ్చు. ఈ పట్టింపులలో
ఎవరింటికి వెళ్ళినా వాళ్ళమీద శంకరశాస్త్రి విరుచుకు పడిపోతాడు. కనక కష్టమయినా తన వంట తానే చేసుకొంటాడు.
ఉన్న రెండణాలూ ఆమె చేతికిచ్చి కుండలు తెమ్మన్నాడు.
"కుండలేం కర్మండి. అమ్మనడిగి గిన్నెలు తెస్తాను."
రామనాధం దానిని కూడా నిషేధించేడు. మరిడమ్మ చేసేదిలేక ఆ డబ్బులు తీసుకొని కుమ్మర్ల యింటికి బయలుదేరింది.
ఆమెను అలా పంపించి రామనాధం కోమటింటికెళ్లేడు. అక్కడి వాళ్ళంతా కుశలప్రశ్నలు వేస్తూంటే ఆలస్యమయిపోతూంది. అక్కడ
అంతమందిలో తాను వేరే వంట బెట్టుకున్నట్లు చెప్పడం సిగ్గుచేటుగా కనిపించింది. పైగా ఓ అర్ధశేరు బియ్యం, ఓ సోలెడు కందిపప్పు
అరువు తీసుకోవడం తన హోదాకు తక్కువనిపించింది. ఆ మాత్రానిక్కూడా డబ్బులు లేవంటే ఏమనుకుంటారు? ఏమీ తీసుకోకుండా తిరిగి
వచ్చేడు.
మరిడమ్మ కుండలు తెచ్చి అక్కడ పెట్టుక్కూర్చుంది.
పరిస్థితి విని మరిడమ్మ నవ్వింది. "ఈ తిప్పలు ఎందుకు బాబూ?" అంటూనే వెళ్ళి అతని కోసం ఒక శేరు బియ్యం, గిద్దెడు
కందిపప్పు అరువు పట్టుకొచ్చింది.
తీరా తోటలోకి వచ్చేకగాని మరిడమ్మకి తాను తెచ్చినవి వుప్పుడు బియ్యమని గుర్తుకు రాలేదు. అవి బ్రాహ్మలు తినరు. మళ్ళీ
వెళ్ళబోతూంటే రామనాధం ఆమెను ఆపుచేసేడు.
"ఇల్లా తే! ఈ ఆరేడు నెలలూ జైలులో కిచిలీ సాంబా బియ్యమా మాకిచ్చింది? ఈ ఉప్పుడు బియ్యం ఇంకా శుభ్రంగా వున్నాయి. అవి
పుచ్చి పురుగులతో నిండి వుండేవి. అన్నం ముద్ద నీళ్ళలో కలిపేసి పైకి తేలిన పురుగుల్ని అడుక్కి చేరిన మేకుల్నీ తీసేసి
తిన్నాను. తే" అన్నాడు. అది విని మరిడమ్మ నోరు తెరిచింది. నమ్మలేకపోయింది. కాని, అతడు తాను తయారుచేసుకొన్న
పులగాన్ని ఇంత బెల్లం సాయంతో తినేసి సంతృప్తిపడడం చూసి నమ్మేసింది.
ఆ మాట చెప్తూంటే విని రాజమ్మ ఏడ్చింది. శంకరశాస్త్రికి అందులో ఆశారేఖ మాత్రమే కనబడింది.
"జైలులో ఏదో నానా గడ్డీ తిన్నామని బయట కూడా తినగలమనుకోకు."
కనక రామనాధం ఒకటి రెండు రోజులలోనే ప్రపంచంలో పడడం ఖాయమని తేల్చుకున్నాడు.
"వాడి డబ్బుండగా బాధపడడం ఎందుకు? సాయంకాలం వచ్చి కావలసింది పట్టుకెళ్ళమన్నానని చెప్పు" అని మరిడమ్మకు చెప్పేడు.
కాని ఆ దంపతులు భావించినట్లు రామనాధం కాళ్ళు కడుక్కోమనగానే భోజనానికి లేచే పద్ధతిలో రాలేదు. అతడు సాయంకాలం అవుతుండగానే
వంటా, భోజనం ముగించేసుకొని మరీ వచ్చేడు.
శంకరశాస్త్రి సావట్లోకి రమ్మన్నా రామనాధం లోపలికి వెళ్ళలేదు. అరుగు మీదనే కూర్చున్నాడు.
"కాళ్ళు బురదగా వున్నాయి. ఇల్లా కూర్చున్నాలే."
రాజమ్మ వీధిగూట్లో ప్రమిదలో దీపం పెట్టి వచ్చి కూర్చుంది.
రామనాధం ఏదో మాటవరసకు చెప్పినట్లుగా అన్నాడు.
"రేపు ప్రొద్దున్నే అమలాపురం వెడుతున్నానమ్మా!"
అమలాపురం మాట వినగానే శంకరశాస్త్రి చేస్తున్న సంధ్యావందనం త్వరగా ముగించి తానూ వీధిలోకి వచ్చేడు.
మామగారితో మళ్ళీ పేచీ పెట్టుకోడానికా అనిపించింది రాజమ్మకు. లేకపోతే అతనికిప్పుడక్కడ పనేమిటి? భార్యను తీసుకురావడానికి
తానే వెడుతున్నాడనుకోలేకపోయేడు శాస్త్రి. అది సంప్రదాయం కాదు. పైగా ఇంత గ్రంథం జరిగేక. అతడు జైలునుంచి వస్తూండగానే
పిల్లను పంపమనడం తెలివైన పని కాదని ఆ మధ్యాహ్నమే తానూ, భార్యా అనుకొన్నారు. అసలు రామనాధం తన భార్యను తెచ్చుకొనే
ప్రతిపాదనకు సుముఖుడుగా వుంటాడనే నమ్మకం వాళ్ళకి లేదు. జరిగిన దానిపై మహా కసిగా వుంటాడనీ, కాస్త చల్లబడే వరకూ ఆ
ప్రసక్తి తేరాదనీ వాళ్ళు అనుకొన్నారు. అందుకే అడిగేడు.
"ఊరికేనా?"
"మీ కోడలిని తీసుకు వచ్చేస్తా."
శాస్త్రి ఆందోళన కనబరిచేడు.
నారాయణమూర్తి మాత్రమే కాక, ఆయన భార్య కూడా రామనాధం మీద చాలా వ్యతిరేకత కలిగివున్నదని శాస్త్రి ఎరుగును. ఆ
వ్యతిరేకత వాళ్ళతోనే ఆగలేదు. ఆ వూళ్ళోనే వున్న అన్నపూర్ణమ్మ అక్కగారి కుటుంబం కూడా ఎంతో కక్షగా వున్నారు. రామనాధం
తమకేదో మహాపకారం చేసిసట్లు వాళ్ళు బాధపడుతున్నారు. ఈ ఆవేశాలు కాస్త సర్దుకోనివ్వాలి.
ఈ దశలో దిక్కు ఎవ్వరూ లేనట్లు రామనాధమే వెళ్ళి ఆ వ్యవహారం తేల్చమనడంలో వున్న అనౌచిత్యం మాట ఎలాగున్నా, అతడు
వెడితే అసలు వ్యవహారమే చెడుతుంది.
ఆ ఆలోచనతోనే శంకరశాస్త్రి ఆ ప్రయత్నం మంచిది కాదన్నాడు.
దానిని రామనాధం మరొకవిధంగా అర్ధం చేసుకొన్నాడు. నారాయణమూర్తి చేసిన అవమానమూ, అన్యాయమూ దృష్ట్యా తన భార్యను పుట్టింట
వదిలేసి తండ్రిని శిక్షించాలనుకుంటున్నట్లు భావించేడు. ఆ మాటే అన్నాడు.
"ఆయనదే కాని ఆమెదేం తప్పు?"
"తప్పు సమస్య కాదు, ఎవరు వెళ్ళాలని గాని, మనంత మనం సరాసరి వెడితే పని చెడుతుంది."
"నువ్వు జైలులో పడ్డ మొదటి రోజున బాబయ్య వెడితే ఆయనగారు నానా మాటలు అన్నాడుట" అంది రాజమ్మ.
"విన్నాను అందుకే...."
ఒక నిముషం ఆగేడు.
"ప్లీడరు రామసోమయాజులు గారినో, హైస్కూలు హెడ్మాస్టరు గారినో వెళ్ళి రమ్మందామని....."
ఒక్క క్షణం క్రితం సావిట్లో అడుగుపెట్టడానికి నిరాకరించినదానికన్న, తమ ప్రమేయమేమీ లేకుండా భార్యను తెచ్చుకొనేటందుకు తన
ఏర్పాట్లు తాను చేసుకుంటూండడం శంకరశాస్త్రికి కష్టమనిపించింది. ఆ పెంకితనం చూసి కోపమూ వచ్చింది.
వాళ్ళు పంపిస్తే మాత్రం? ఆమెను ఎక్కడ వుంచుతాడు? ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వుందనే మాట మరచి ఆ దంపతుల్ని తాను యింట్లో
పెట్టుకోగలడా? ఆ మాటనే అతడు వేరొక విధంగా అడిగేడు.
"ప్రస్తుతం నీ స్థితి ఏమిటి? ఆ మాట వాళ్ళూ అడుగుతారు కదా?"
శంకరశాస్త్రి మాటను రామనాధం మరొక విధంగా అర్థం చేసుకొన్నాడు.
"కులం వుందనుకొన్నా, చెడిందనుకొన్నా పెళ్ళంటూ అయింది కదా."
"--అంటే అమీ తుమీ తేల్చుకొనాలన్నట్లు బయలుదేరుతున్నావన్నమాట. అది మంచి పని కాదు..."
శంకరశాస్త్రి చాలసేపు అటు తిప్పి, ఇటు తిప్పి తన ఆలోచనలు చెప్పేడు. కొద్దికాలం వోపిక పట్టమనేది ఆయన సలహా. ఈ
లోపున వ్యవహారాలు సర్దుబాటు చేసుకోమన్నాడు. అతనికి లోకుల నుంచి ఏడెనిమిది వేలు రావలసి వున్నాయి. క్రమంగా వసూలు
చేసుకోవడమూ, ఓ యిల్లు అంటూ ఏర్పాటు చేసుకోవడమూ ముఖ్యమన్నాడు. పొలాలనీ, వ్యవసాయమనీ చూసుకొంటూంటే..... "ఆ స్థితిలో
నారాయణమూర్తి కూతుర్ని పంపక ఏం చేస్తాడు?" అన్నాడు.
"పంపకపోతే ప్రపంచంలో పిల్లలకే కరువా?" అన్నమాట నాలుక చివర వరకూ వచ్చింది. కాని, ఆ క్షణంలో నిగ్రహించుకొన్నాడు.
కాని, ఆ సూచనను రామనాధం ఒప్పుకోలేకపోయాడు. దాని అర్ధం ఏమిటి? తాను సహాయ నిరాకరణంలో పాల్గొన్నది తప్పేనని
ఒప్పుకోవడమే కదా? ఇంకెప్పుడూ అలాంటి పని చేసే ఉద్దేశ్యం లేదు. బుద్ధిమంతుడల్లే వుంటున్నా చూసుకోండి అని చూపించినట్లే కదా.
ఆ బుద్ధిమంతుతనం తన వుద్దేశం కాదు. దేశానికేదో సేవ చేయాలనే సంకల్పం చావలేదు. బలపడింది గాని.
తన సూచనను రామనాధం అంత స్పష్టంగా అర్ధం చేసుకోగలగడం శంకరశాస్త్రికి సంతృప్తి కలిగించలేదు. ఏమనడానికీ తోచలేదు.
"ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు నేను చెప్పవలసిందేదీ లేదు. సంపూర్ణ స్వతంత్రుడివిగా వెడితేనే బాగుంటుంది...!"
"ఇప్పుడు కానా.....?"
"కాదు.... రేపు భార్యను తీసుకురావడానికి వెడతానంటున్నావు. డబ్బు ఏదీ?"