తల్లి ప్రశ్నకు వెంకటరమణ అమాయకంగా సమాధానం ఇచ్చేడు.
"నేనేం అబద్ధం సాక్ష్యం చెప్పబోవడం లేదమ్మా!"
నిజమే అయినా దానిని సాక్ష్యంగా చెప్పి వానికి అపకారం చెయ్యవలసిన పనేమిటి?
"రామనాధం తన అభిప్రాయాలను దాచుకోదలచలేదు. మామగారితో కూడ ఆ మాటలే అన్నాడట కదా."
పైగా అతడు సత్యాగ్రహం చేయడానికి ప్రతిజ్ఞ తీసుకొన్నాడు. సహాయ నిరాకరణంలో భాగంగా చదువు మానేసేడు. కోర్టులో డిఫెన్సు
పెట్టుకోనన్నాడు. అతనికి తన సాక్ష్యం అపకారం చెయ్యదు.
పైగా అతడు తాను చెప్పింది ఆచరిస్తాడనీ, ఆ ఆచరణ ఇతరులెవ్వరికో వుపదేశించి తన వాళ్ళని మినహాయింపులో పెట్టుకొనే కొందరి
మాదిరిగా కాదనీ తాను నిరూపించినట్లవుతుంది.
"అది అతనికే ప్రతిష్ఠ" అన్నాడు.
వెంకటరమణ అమాయకత్వం నటిస్తున్నాడని విశ్వనాధం గ్రహించేడు.
"ఆ సంభాషణ మీ ఇద్దరి మధ్యా నడిచింది. ప్రభుత్వానికి దానిని సాయం ఎందుకివ్వాలి?" అన్న విశ్వనాధం ప్రశ్నకు
వెంకటరమణ ఎంతో ఆశ్చర్యం, విసువూ కనబరిచేడు.
"అల్లా అంటారేం బాబాయి! నేనేమన్నా సహాయ నిరాకరణం చేస్తున్నానా ఏమన్నానా?"
"కాని, గవర్నమెంటుకి సాయం చేస్తాననీ అనలేదుగదా...."
ఈమారు వెంకటరమణ నిజంగానే విసువు చూపించేడు.
"ఎందుకనలేదు? సబినస్పెక్టర్ సెలక్షనుకి దరఖాస్తు పడేసింది. సహాయ నిరాకరణం చేస్తానికి కాదుగా--"
విశ్వనాధానికి సమాధానమేమీ తోచలేదు.
"నీ వాళ్ళని కాదనుకొని ఎవరిపంచో కాగుతావట్రా?" అని లచ్చమ్మ ఆక్రోశించింది.
నైతికమైన విలువలను అర్ధం చేసుకోలేనిచోటా, చేసుకోదలచనిచోటా వాదనలు నిస్సహాయతకే దారితీయక తప్పదు. తర్కరీత్యా
వెంకటరమణ వాదనలో లోపం లేదు. అక్కడ సౌజన్యమే. ఆ సౌజన్యాన్నే కోరి వాదించడం నిష్ప్రయోజనం...
ఈమారు వెంకటరమణ భారతీయ వేదాంతాన్ని ఆసరా తీసుకున్నాడు.
"నీవాళ్ళూ, నావాళ్ళూ! అది నాకేనా? పిల్లనిచ్చిన మామగారికి ఆ మాట ఎవ్వరూ చెప్పరేం? ఆయన వుద్యోగస్తుడు గనకనా?
లేక దేవీపూజచేసే సద్బ్రాహ్మణుడు గనకనా?"
"ఆయనేదో గడ్డితిన్నాడని..."
"ఆ గడ్డి మేయాలనేకదా నేనూ దరఖాస్తు పడేసింది. మరి పేచీ లేదు..."
లచ్చమ్మ తిడుతుందనీ, గోలు గోలున ఏడుస్తుందనీ విశ్వనాధం భయపడ్డాడు. కాని, ఆమె అటువంటిదేమీ చేయలేదు. బహు గంభీరంగా
లేచి నిలబడింది.
"పిల్లల్ని కనగలంగాని, వాళ్ళ బుద్ధుల్ని కనలేం, నడవండి పోదాం...."
విశ్వనాధం ఆమెను సర్దుబాటు చేయబోయేడు. "కూర్చో, తొందరపడకు."
కాని, ఆమె అంగీకరించలేదు.
"నీవాళ్లూ నావాళ్లూ ఏమిటని శాస్త్రం చెప్తున్నాడు. ఆ మొండిచెయ్యే మనకీను.... ఎందుక్కూర్చోడం?"
ఇంకా ఆమె సంభాషణలో పాల్గోలేదు. సంభాషణ కూడా విశేషంగా సాగలేదు. వెంకటరమణ లేచేడు. విశ్వనాధం తాను తెచ్చిన ఒక పాతిక
రూపాయలు అతనికి ఇవ్వబోయేడు. కాని, రమణ తీసుకోలేదు.
"కావలసింది వాళ్ళు పంపిస్తున్నారు. నిన్ననే ఓ వంద ఇచ్చి వెళ్ళారు" అన్నాడు.
వాళ్లు అత్తారివాళ్లు. వంద ఇచ్చి వెళ్లేరన్నమాట. తన దగ్గర డబ్బుంది, మరి అవసరం లేదని చెప్పడమేనా? లేక నాకు
వందలిచ్చేవాళ్లున్నారు. నీ పాతికలెవరికి కావాలని వెక్కిరించడమా?
విశ్వనాధం వూరుకున్నాడు.
వెంకటరమణ లేచేడు.
"మీ అందరికీ కోపం వస్తుంది. నేను ఎరుగుదును. కాని, మీకీ దేశంమీదా, మనుష్యులమీదా ఎంత ప్రేమా, అభిమానమూ వున్నాయో ఆ
మాత్రం నాకూ వున్నాయి. దేశం బాగుపడాలంటే ఇంగ్లీషువాడుండాలిసిందే. వాడు వచ్చేకనే మనకు ఆనకట్టలు, రైళ్లు, చదువులూ అంటూ
వచ్చేయి. మాబోటిగాళ్లకి ఓ చదువనీ, వుద్యోగమనీ...."
"మా బోటిగాళ్ళంటే..."
"బ్రహ్మిగాడు కానివాడికి..."
"నీకూ కులం పట్టింపు వుందన్నమాట." అన్నాడు విశ్వనాధం. రగులుతున్న కోపాన్ని అణుచుకుంటూ....
"మీ అందరికీ వుంది గదా..."
"కాని నీదిప్పుడే కులం?" అన్నాడు విశ్వనాధం వెటకారంగా.
"ముంగండవాళ్లు మా నాన్నవేపు బంధుత్వాన్ని ఒప్పుకోరు. చివరకు మా అక్కే వొప్పుకోదు...."
విశ్వనాధం నిర్వాక్కుడయ్యేడు.
"మీరు పెళ్ళి చేసి నా కులం ఏమిటో తేల్చేరు అనుకుంటున్నా...."
మహా కసితో అంటున్నట్లున్న కొడుకు మాటలు విని విశ్వనాధం గోడకి జేరబడిపోయేడు. తన దాడిని వెంకటరమణ ఇంకో అడుగు ముందుకు
వేయించేడు.
"నా తల్లి వేరు కులానికి చెందినది కావడంచేత మీవాళ్లు మీ కొడుకునే దూరంగా వుంచేసేరు. మా అమ్మ కులం వాళ్లు నన్ను
కలుపుకున్నారు. దూరం పెట్టలేదు. వాళ్లకి నా తండ్రి తెలుసు...."
"తర్వాత మాటకూడా అనేసెయ్యి."
అసలు విషయం తప్పించేడు. సంఘంలో అవమానకరంగా భావించే తమ దాంపత్య స్థితిని అతడూ నిందిస్తున్నాడనే భావంలో విశ్వనాధం
కస్సుమన్నాడు.
వెంకటరమణ తల్లివంక తిరిగేడు.
"అమ్మా! నేనిప్పుడు కావాలన్నా నా యింటికి పిలవలేను. రెండేళ్ళలోపున ఏదో వుద్యోగం, ఓ ఇల్లూ ఏర్పడుతుంది. ఆ ఇల్లు
నీదీను. ఆ రోజున..."
లచ్చమ్మ చాలా అభిమానం కనబరిచింది.
"మీ నాన్నగారి ధర్మమా అని నాకో ఇల్లు ఏర్పడింది. ఎవరి ఇంటికో..."
"నా ఇల్లు ఎవరిదో ఏమిటమ్మా--"
"అది నీ ఇల్లు. సుఖంగా వుండండి. ఆ యిల్లు నాది ఎల్లా అవుతుంది?..."
విశ్వనాధం తన భార్య విషయం తాను చూసుకోగలనన్నాడు.
"ఆమెకు తోస్తే ఏనాడైనా ఎక్కడికైనా వెడుతుంది. కాని, ఆమెకో ఇల్లు వుంది. ఆ విషయంలో నువ్వు ఇబ్బంది పడనక్కర్లేదు."
నలభయ్యొకటి
ముంగండ స్నేహితులు సాయంకాలం హాస్పిటలులో రామనాధాన్ని పట్టుకొన్నారు. కేసులో వాదించుకోవడానికి ఒప్పుకోవడం లేదన్న మాట విని
వాళ్లు నలుగురైదుగురూ కట్టకట్టుకు వచ్చేరు. సబ్‌జైలులో కలుసుకోవడానికి వస్తే పోలీసులు తరిమేశారు. ఇంక సాయంకాలం
మామగారు ప్రసాదించిన దెబ్బలకి కట్టుకట్టించుకొనేటందుకు హాస్పిటలుకు వస్తున్నాడన్న వార్త విని కాపలా వేసేరు.
వకీలు రామసోమయాజులుకిచ్చిన సమాధానాన్నే రామనాధం వాళ్ళ వద్ద వల్లించేడు.
"ఈ ప్రభుత్వం వుండడమే అన్యాయం...."
"ఇది అబద్ధం కేసు అవునా కాదా?" అన్నారు మిత్రులు
ఆ విషయం ఒప్పుకోడానికి అతనికి అభ్యంతరం లేదు.... "అవును"
"అబద్ధాన్ని సహించడం దాన్ని ప్రోత్సహించడమే" అన్న మామూలు వాదాన్నే రామన్న పలికాడు.
కాని శివరామయ్య వాదం భిన్నంగా వుంది. మామగారిని కోర్టులో నిల్చోబెట్టి అల్లరి చేసెయ్యాలని అతని అభిప్రాయం. "నువ్వేం
మాట్లాడనక్కర్లేదు. ఆ పనేదో వకీలు చూస్తాడు. విని ఆనందించడం వరకే నీ పాత్ర..." అని సలహా.
రామనాధం దానికి అంగీకరించలేదు. గాంధీగారు కోర్టుల విషయంలో కూడా సహాయ నిరాకరణం చేయమన్నారనే కాదు. వాదన పెట్టుకొని
రంగంలోకి దిగితే తన భార్యని కూడా ముగ్గులోకి దింపవలసి వస్తుందనే ఆలోచన కూడా మనస్సులో ఓ మూల లేకపోలేదు. ఆనాడు
జరిగిన ఘట్టాలు వీళ్ళెవరికీ తెలియదు. తానూ ఆ ప్రసక్తి రానివ్వడం లేదు.
"ఇదివరకు, ఇంతవరకూ నేనే వుద్యోగినీ సహాయ నిరాకరణం చెయ్యమని చెప్పలేదనుకో...."
"మరింకనేం?" అన్నాడు రామన్న.
"అది కాదురా. ఒకవేళ చెప్పేవుంటే ఆ చెప్పడం తప్పా అనేది ప్రశ్న. తప్పు కాదని నా నమ్మకం. తప్పని వాళ్ళ
అభిప్రాయం. ఆ అభిప్రాయం వాళ్ళకి చట్టంకన్న బలవత్తరం. నా నమ్మకం నాకు ఏ చట్టం కన్నా బలవత్తరం. ఇంక
వాదాలకీ, న్యాయాలకీ అవకాశం ఏం వుంది?"
శివరామయ్యకి కోపం వచ్చింది. నాలుగు తిట్టేడు. నవ్వుతో సమాధానం ఇచ్చేడు రామనాధం.
"ఒకడు ఏదయినా నేరం చేస్తే అంగీకరించి శిక్ష పొందాలి. నేరం చేయకపోయినా శిక్షిస్తారనుకో. దానికి అవమాన
పడనక్కర్లేదు." అన్నాడు.
"ఇతి గాంధీ ఉవాచ" అని వెక్కిరించేడు సూరప్ప. ఈ అరగంటలోనూ అతడు ఆరుమాట్లు గాంధీ పేరు వుచ్చరించేడని అంతక్రితమే
అతడు లెక్క తేల్చి చెప్పేడు.
రామనాధం పకపక నవ్వేడు.
"అత్తవారింట్లో లాగ అన్ని పరిచర్యలూ జరిగిస్తూంటే...." అంటూ మందు పరికరాలు తీసుకువచ్చిన కాంపౌండరు ఈసడింపుగా
అన్నాడు.
రామనాధం నవ్వు టక్కున ఆగిపోయింది. ఈ నాలుగైదు రోజుల నుంచీ కాంపౌండరు ధోరణి చూస్తూంటే అతడికి వొళ్లు మండిపోతూంది. హోటలునుంచి
అన్నం తెచ్చిపెట్టడం, గాయాలకి కట్లు కట్టించడం అవినయాన్ని పెంచుతుందని ఆ కాంపౌండరు భయం.
"పుచ్చి చావనివ్వాలి" అని అతని సూచన. కాని దానిని అధికారులు పాటించేలా కనబడలేదు. కనుక యధాశక్తి తానే రామనాధాన్ని
హాస్పిటలుకు దూరంగా వుండేటట్లు చేయ ప్రయత్నించేడు. కట్టు కట్టడంలోనూ, విప్పడంలోనూ, మందు రాయడంలోనూ చాల మోటుగా పనిచేసి
చాలా బాధ కలిగించేడు. అందుచేత రామనాధం మొదటి రెండు రోజులూ అయ్యేక హాస్పిటలుకు రానన్నాడు. మిత్రుల్ని చూసి ఈవేళ మళ్ళీ
బయలుదేరేడు. కాంపౌండరు మాట వినగానే శివరామయ్య వేళాకోళం చేసేడు.
"కాంపౌండరు గారికి అత్తవారింటికి వెళ్ళడం అంటే కట్లు కట్టించుకోడానికే తప్ప మరెందుకూ కాదని అనుభవం కాబోలు..."
మిత్రులు ముగ్గురూ నవ్వేరు.
ఆ మాట మెలిక అర్థం కాదేమోనని సూర్య తేలిక అయిన తెలుగులోకి అనువదించేడు.
"సాధారణంగా సావిట్లో దుడ్డుకర్ర వుంటుంది కాబోలు. పాపం పోనీ చీపురు కట్టయినా వాడమని చెప్పకపోయేరా?"
కాంపౌండరు మండిపడ్డాడు.
"మీరంతా ఎందుకిక్కడ వున్నారు?"
రామనాధం వెక్కిరింతగా అతనిని వెనకవేసుకు వచ్చేడు.
"పాపం ఏమీ అనకండర్రా. ఈ వెధవ కాంపౌండరీగిరీ కాస్తా పోతుందేమోనని ఆయన గుండెలు పీచుపీచుమంటూ వుంటాయి."--అని రెండు చేతుల
వేళ్ళూ దగ్గిరికి తెస్తూ, తెరుస్తూ అభినయించేడు.
శివరామయ్య చాలా జాలి కనబరుస్తూ....."చ్..చ్.. చ్చు" అన్నాడు.
కాంపౌండరుకి వొళ్ళు మండిపోయింది. అతనికి సహాయనిరాకరణలూ అవీ తెలియవు. బ్రిటిష్ ప్రభుత్వం మీద సాగుతున్న ఈ
వుద్యమం ఆ ప్రభుత్వం తెచ్చిపెట్టిన సామాజిక పరిణామాలమీద వ్యతిరేకతగా కనిపిస్తూంది. అతడు దిగువ కులాలకు చెందినవాడు.
సమాజంలో అడుగున పడి నలిగిపోతున్న ఆ కులాలకి చదువు ఇంగ్లీషు ప్రభుత్వం వచ్చేకనే సాధ్యం అయింది. రామనాధమూ, మిత్రులూ
అంత ఈసడింపుగా చూస్తున్న కాంపౌండరుగిరీయో, గుమాస్తాగిరీయో, బంట్రోతుపనో దొరుకుతూంది ఇప్పుడే. ఆ అవకాశాలు చూసి వోర్వలేక
పైకులాలు చేస్తున్న అల్లరి తప్ప సత్యాగ్రహాలకు మరో ఉద్దేశం లేదని అతని విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ఆ బ్రాహ్మణ
కుర్రవాళ్ళ వేళాకోళాలూ, ఎకసక్కేలూ విని చర్రుమన్నాడు. ఆ కోపంలో నోరు జారింది.
"యెదవ నాయాళ్ళంతా....."
మాట పూర్తికాకుండానే గూబ అదిరిపోయేటట్లు ఛెళ్లున లెంపకాయ తగిలింది.
పరధ్యానంగా, దూరంగా నిల్చున్న కానిస్టేబులు ఆ ధ్వనికి తిరిగి చూసేడు. మామూలు పద్దతిలో గేటులోంచి వెళ్లేటంత తీరుబడిలేక
ఎవరో ఆవరణ గోడ దాటిపోతున్నది మాత్రం కనబడింది.
ప్రశాంతంగా వున్న ఆసుపత్రి వరండా మరుక్షణంలో కేకలూ, గంద్రగోళంతో నిండిపోయింది.
తగిలిన దెబ్బ అదురుకు మూతబడిపోయిన కళ్ళు తెరిచేసరికి కాంపౌండరు ఎదుట తన్ను కొట్టిన మనిషి కనబడలేదు. పోలీసు
బంట్రోతుని ఆక్రోశించేడు.
సూరయ్య గోడ దాటేసి సురక్షితమైనంత దూరంలో వున్నాడనిపించేక శివరామయ్య కాంపౌండరును ఓదార్చడానికి ప్రయత్నించేడు.
"అల్లా మాటలు మిగలడం తప్పు కాదూ కాంపౌండరుగారూ. పాపం! దుష్టుడు ఎంత దెబ్బకొట్టేడూ, అయిదు వేళ్ళూ అంటిపోయేయి.
చ్.చ్. చ్చు. కాస్సేపు కూర్చోండి. కొంచెం మంచినీళ్ళు...."
ఆ పరిణామాలు చూసి రామనాధం చాల విచారపడ్డాడు. మిత్రులు నలుగురూ వచ్చిన హుషారులో కాంపౌండరును రెచ్చగొట్టడంలో తానూ చాలా
దూరం వెళ్ళేననిపించింది. తానే కాంపౌండరుకు క్షమాపణ చెప్పుకొన్నాడు. కాని అతడు దెబ్బతిన్నవాడు. గూబ ఇంకా మండుతూంది. ఆ
మంటలో క్షమాపణను స్వీకరించే మనఃస్థితిలో లేడు.
"మీరంతా తోడి దొంగలు. కేసు పెడతా. జైలునేయిస్తా. మీ పేర్లు చెప్పండి."
అతడు రాసుకొనేలాగ జేబులోంచి పెన్సిలు తీసి కాగితం కోసం వెతుకుతూంటే రామనాధం మిత్రులకు కన్ను గీటేడు.
"కొనుక్కొస్తానుండు" అంటూ శివరామయ్య చరచర వెళ్ళిపోయేడు. అంతా అతనివేపు తిరిగివున్న క్షణంలో రామన్న తప్పుకొన్నాడు.
ఈమారు రామనాధం బిర్రబిగిసేడు.
"కేసు పెట్టుకో. పెట్టి తలకొట్టి మొలవేయిస్తావా యేం? నోరు కొవ్వి తిడితే వూరుకుంటారా?"
కాంపౌండరు ఇంకా చల్లబడలేదు. అతనిని డబాయించి, గదిమి నోరునొక్కడానికి కొంతసేపు పట్టింది.
అయితే అతని నోరు మూయించినా, తన మనస్సులోని ఆలోచనలను మూయించడం రామనాధంకు సాధ్యం కాలేదు.
కాంపౌండరు కులానికి ఓ ఎరుకలి--అని విన్నాడు. అతను కలిపి యిచ్చిన మందుల్ని అన్ని కులాలవాళ్ళూ త్రాగుతున్నారు. తమ
వూళ్ళో పూజారి సుబ్బన్న చెయ్యి ముట్టుకొని నాడి చూస్తే బట్టలు తడిపెయ్యాలిసి వస్తుందని అంత జ్వరంలోనూ బాబాయి శంకరశాస్త్రి
చిన్నగావంచా కట్టుకొని చాపలో పడుకున్నాడు. ఓ మారు ఆ ఘట్టం జ్ఞాపకం వచ్చింది. సుబ్బన్న చెయ్యి చూడడం పూర్తి అయినా
కదలడు. బాతాఖానీ ప్రారంభించేడు. ఆయనకు తెలుసును. తాను ముట్టుకొంటే ఈ శ్రోత్రియులు మైలపడ్డామనుకుంటారని. కాని వూళ్లో
వైద్యుడు తాను, మంగలి వెంకన్న ఒకడు. అంచేత తప్పదు. తన్ను పిలుస్తారు. కాని, తన ఎదట బట్టలు తడిపించి అవమానం
చెయ్యలేరు. కనక ఎంతో బాధగా వున్నా ఓర్చుకుని, ఆయన వున్నంతసేపూ ఆ గోచీతోనో, గావంచాతోనో క్రిందే పడివుండేవారు. వాళ్ళని
ఏడిపించడానికి సుబ్బన్న ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్తూ ఓ అరగంట అయినా కూర్చునేవాడు. ఆ మాదిరి సమాజంలో ఈ కాంపౌండరు
ఏ కులంవాడైనా, ఏ నీళ్ళిచ్చినా తాగుతున్నారు. ఇంత మార్పు ఇంగ్లీషువాళ్లతోనే వచ్చిందనడంలో సందేహం అక్కర్లేదు. వెనుకటి
పద్ధతే సాగేటట్టయితే క్రింద కులాల వాళ్ళకి ఆపాటి చదువూ సాధ్యమయ్యేదా? ఆ మాత్రం పనేనా ఇచ్చేవారా? అసలు ఆస్పత్రులే
వుండేవి కావు. వాళ్ళు ఉద్యోగం చెయ్యడం, మందులు ఇవ్వడంలాంటివేమీ జరిగేవి కావు.
అవన్నీ ఇంగ్లీషువాడి పాలనతో వచ్చాయి. తాము అంతా ఇంగ్లీషువాడి పాలన పోవాలంటున్నారు. దానితోపాటు ఆస్పత్రులు మూసేస్తారా?
తక్కువ కులాల వాళ్ళకి వుద్యోగాలూ, చదువులూ లాగేస్తారా?" వాళ్ళ చేతి మందు త్రాగడానికి నిరాకరిస్తారా?
ఈ వాదనలనే తన బావ తెచ్చినప్పుడు అతడు వెక్కిరిస్తున్నాడనుకొన్నాడే గాని, దాని వెనుకనున్న సామాజిక వ్యగ్రత అతనికి
అర్ధం కాలేదు.
ఒక్కటి స్పష్టంగా తెలుసు.
--మూసెయ్యరు, వుద్యోగాల్లోంచి తీసెయ్యరు.
అంతేకాదు, ఇంగ్లీషువాళ్ళు తగినంత వేగంగా విద్యావ్యాప్తి కానివ్వడం లేదని, వృత్తి విద్యాలయాలు పెరగనివ్వడం లేదని,
పరిశ్రమలూ అవీ పెట్టుకోనివ్వడం లేదని తాము అంటున్నారు.
అయితే అసలు ప్రశ్న వేరు.
వాళ్ళని మర్యాదగా చూడడం, వాళ్ళచేతి నీళ్లు త్రాగడం, వాళ్ళతో కలిసి భోజన భాజనాలలో పాల్గోవడం, కులాంతరుల మధ్య
పెళ్ళిళ్ళు... ఇవన్నీ ఇంగ్లీషువాడి రాకతో వచ్చినప్పటికీ దేశంలోని సామాజిక వ్యవస్థకి సంబంధించిన ప్రశ్నలు. ఆ విషయంలో
తాము ఏం చెయ్యాలి? ఏం చెప్పాలి?
ఈ హెచ్చుతగ్గుల్ని పాటిస్తారా? పాటించేటంత కాలం కాంపౌండరు వంటివాళ్లు తమ మార్గానికి ఎదురే తిరుగుతారు. ఇంగ్లీషువాళ్ళ పంచ
కాగుతారు.
అయితే అవసరం కొద్దీ అన్ని కులాల మధ్యా హెచ్చుతగ్గులు లేవనడం మనస్సుకి ఒప్పిదం కాలేదు.
సమానత్వాన్ని అంగీకరించడం మానవతాదృష్టి.
హెచ్చుతగ్గులు లేవనడం జాగా ఎరిగి బైఠాయించడం.
ఏది సత్యం? ఏదసత్యం? వర్ణాలూ, కులాలూ ఏమిటో? ఏదేశంలోనూ లేని పట్టింపులు మనదేశంలోనే ఎందుకు వచ్చేయో....
ఆ ఆలోచనలతో అతనికారాత్రి నిద్రే లేకపోయింది.
నలభయి రెండు
ఆ రోజున చీకటి పడే వేళప్పుడు బళ్ళో నుంచి వస్తూ వస్తూ జగన్నాధాచార్యులు గుమ్మంలో నిలబడే ఆ మధ్యాహ్నం తామంతా బళ్లో
చేసిన వీర కృత్యాన్ని వర్ణించేడు. ఆ కథనంలో రామనాధం అరెస్టు సంగతి తెలిసి స్వరాజ్యం మ్రాన్పడి పోయింది.
"ఎప్పుడు అరెస్టు చేశారు?"
"ఏ వూళ్లో చేశారు?"
"ఎందుకు చేశారు?" అనేక ప్రశ్నలు వేసింది.
ఈ వార్తలేవీ ఆచార్లు ఎరుగడు. కనుక్కోలేదు. రామనాధం మేనల్లుడు తమ క్లాసులో వున్నాడు. మంచి తెలివైనవాడు. వాడు
చెప్పేడు. వాళ్ల మామయ్య గాంధీగారి శిష్యుడు. అందుకు అరెస్టు చేశారు అని. తామంతా హర్తాళ్ చేయాలన్నాడు.
చేసేశారు.
వాళ్ళ మేస్టారు వేపబెత్తాలూ, చింతబరికలూ దొరికినంతవరకూ బాదేడు. అందర్నీ బెంచీ లెక్కించేసేడు.
"అబ్బ, మా స్నేహితుడు ఎంతసేపు కొట్టినా ఏడవలేదు. మేస్టారికి నొప్పి పుట్టి, ఆయాసం వచ్చేసింది. అంతే, వాడు నవ్వుతూ
బల్ల ఎక్కేసేడండీ."
అంటూ ఆశ్చర్యం ప్రకటిస్తూంటే స్వరాజ్యం కళ్ళనీళ్లు తిరిగేయి.
"రేపు మీ స్నేహితుడిని ఓమారు తీసుకురండి. నేనూ చూస్తాను. ఏం."
బాలకృష్ణకీ తనకూ గల సన్నిహిత మైత్రిని గురించి జగన్నాధాచార్యులు పదినిముషాలు చెప్పేడు. ఆ స్నేహానికి గల బలమైన
ఆకర్షణ ఎరిగిన స్వరాజ్యం నవ్వింది.
"ఏం, నవ్వుతున్నారు? నేను నిజం చెప్తున్నాను. ఒట్టు."
"ఊరికేనే నవ్వు వచ్చింది. కాశీమజిలీ కథలో వ్రాసిన తిరస్కరణీ మంత్రం తెలుస్తే ఇప్పుడెంత బాగుండునో..." అంది.
ఆ మాటలోని ఎకసక్కేన్ని జగన్నాధాచార్లు అర్ధం చేసుకోలేదు.
"ఎంతో బాగుంటుంది కదండీ!"
-- అని ఒక్క ఎగురు ఎగిరి అరుగెక్కేసేడు.
ఎగతాళి చేసి అతని వుత్సాహాన్నీ, చిన్నతనపు కలల్నీ అవమానం చేస్తూన్నట్లనిపించి, స్వరాజ్యం సర్దుకొంది. అతని
ప్రక్కనే కూర్చుని ఆ ఆటలో తానూ పాల్గొంది.
ఏదో మంత్రం చదివేసి ఎవ్వళ్ళకీ కనబడకుండా అయిపోగలుగుతే ఎంతెంత వీరకృత్యాలు చేయవచ్చో జగన్నాధం కలలు కనడం మొదలు
పెట్టేడు. పుస్తకాలు అరుగుమీద పెట్టేసి ఊహాలోకాలలోకి తేలిపోయేడు.
రామనాధాన్ని పెట్టిన గది తాళం ఎవ్వరికీ తెలియకుండా ఎత్తుకు తీసుకొచ్చెయ్యవచ్చు. తలుపు తీసి రామనాధాన్ని ముట్టుకుంటే
తనతోపాటు ఆయన కూడా అదృశ్యమయిపోతాడు. తీసుకొచ్చెయ్యడం. మళ్ళీ తాళం వేసేసి ఎప్పటి చోటే పెట్టేస్తాడు. ప్రొద్దున్నే
చూసుకుంటారు. ఏముంటుంది? తాళాలు ఎప్పటిలాగే వుంటాయి. రామనాధం వుండడు. కాశీమజిలీకథల్లో అటువంటివెన్నో చదివేడు.
ఆ ఘట్టం అధికారుల్లో ఎంత గందరగోళం కలిగిస్తుందో అనేక రూపాలలో వర్ణించేడు. తిరస్కరణీ మంత్రాన్ని అంతకంటే ఎక్కువ
దిగ్భ్రమ కలిగించేటట్లు వుపయోగించడం ఎలాగో అనేక పాఠాంతరాలతో వర్ణించేడు.
చివరకు రామనాధం కేసులో తీర్పు చెప్పెయ్యగానే తమ మంత్రబలంతో మాయం చేసి తీసుకుపోవడం చాల బ్రహ్మాండంగా వుంటుందని ఆమె కూడా
ఒప్పుకుంది.
"అల్లాంటి మంత్రాలుంటాయా?"
"అదేమిటండి. మంత్రాల్లో వున్న శక్తి చాలా గొప్పదండి. మా నాన్నకివి అన్నీ తెలుసునండి. కాని చెప్పమంటే నవ్వుతున్నారు."
ఆ మంత్రాలూ, తంత్రాలూ వట్టి అబద్ధమనీ, చిన్న పిల్లల వూహాలోకాలు తప్ప వేరేమీ కావనీ చెప్పడం ఎలాగో ఆమెకు అర్ధం
కాలేదు.
"మీరు చిన్నవాళ్ళని చెప్పడం లేదేమో."
జగన్నాధాచార్యులు తాను చేసిన పొరపాటూ, అందువలన దేశక్షేమం ఏలాగ నష్టపడుతూందో రహస్యంలా చెప్పేడు.
డయ్యర్‌ను అవసరమయి అంతవరకూ వస్తే బ్రిటిష్ రాజును చంపెయ్యడానికి ఆ మంత్రం తనకి చెప్పమన్నాడు
తండ్రిని.
ఆ ఇద్దరి మధ్యలో ఎవ్వరెవ్వరిని చంపేస్తే గాని దేశం స్వాతంత్య్రం పొందదో అతనికి తెలియదు.
"మరి వాళ్ళ పెళ్ళాం, పిల్లలు గోలెత్తిపోరా..." అంది స్వరాజ్యం.
"అదే మా నాన్నగారూ అన్నారు. ఒకరికి బాధ కలిగించేలా మంత్రాన్ని ప్రయోగిస్తే అది మనకే ఎదురుకొడుతుందిట. అందుచేత
చెప్పనన్నారు"-- అంటూ తాను తొందరపడి మనస్సులో మాట పైకి చెప్పెయ్యడంతో దేశానికే ఎంత నష్టం కలిగిందో తలుచుకొని దిగులు
పడిపోయేడు.
అతని మంత్రాల మీది వ్యామోహాన్ని వదల్చడానికి స్వరాజ్యానికి దారి దొరికినట్లనిపించింది.
"కాదా మరి."
జగన్నాధాచార్లు చాల సులభంగానే సంతృప్తి పడ్డాడు. కాని, తరవాత బాలకృష్ణ వేసిన పేచీ విన్నప్పుడు ఆశ్చర్యం కలిగించింది.
"ఉపయోగించకూడనిది ఇంక వుందనుకోవడం ఎందుకూ?"
ఆ మంత్రాల కోసం వారం వారం రెండేసి రోజులు మిట్ట మధ్యాహ్నం చేలగట్ల వెంబడి పడి మూడేసి మైళ్ళు రావడమూ, గంటల తరబడి
అరుగులమీద పడి వుండడమూ జ్ఞాపకం వచ్చింది.
"ఆచార్లువన్నీ కోతలండీ!"
"ఎల్లా చెప్తావు?" అని స్వరాజ్యం ప్రశ్నించింది.
"బెడిసి కొడితే నష్టపోయేది మనం ఒక్కళ్ళమే కదా. ఇంగ్లీషు వాళ్ళ పీడ దేశానికి వదిలిపోయేటప్పుడు మనకొక్కరికీ నష్టం
కలిగితే మాత్రం ఏం?"
"ఏ ఒక్కళ్ళకీ నష్టం కలగకూడదని కదా...."
"అల్లా వూరుకున్నా ఆగిందా? పంజాబులో ఎంతమంది చచ్చిపోయేరు? ఒక్క జలియన్‌వాలా బాగ్‌లోనే రెండు వేలమంది
చచ్చిపోయేరు కదా...."
ఎవ్వరికీ నష్టం కలగకుండా ఏదో చేస్తామన్నది అబద్ధం అన్నాడు. మంత్రంలో పస లేదు. కనుకనే దానిని దాచిపెట్టేటందుకు
బెడిసికొడుతుందన్నారన్నాడు.
చేతబడులూ, శకునాలూ గురించి వీరేశలింగం పంతులుగారు వ్రాసిన ప్రహసనాలు చాల బాగున్నాయని అతడు చెపుతూంటే స్వరాజ్యం చాల
ఉత్సాహపడింది.
"నాన్నగారూ! బాలకృష్ణ" అని పిలిచింది.
మేస్టారు కొట్టిన దెబ్బలకి అదిరిపోయి జ్వరం పడినందుకు అనుతాపం తెలిపి నాయుడు ముందు కర్తవ్యం తెలిపేడు.
"అల్లా చిన్న చిన్న వానికి లొంగిపోకుండా శరీరం గట్టి పరచుకోవాలి పంతులుగారూ!"
ఆ ఆలోచన కుర్రవాళ్ళకి అప్పటికే తట్టింది.
"ఈ వేళనే మా తాతయ్య చాకలి చెరువుమీది ఇంటి వెనకాల ఇసకపోసి గోదా తయారు చేయించేడు.
నాయుడు చాల ఆనందపడ్డాడు.
"అమ్మా!"
"నాన్నా!" అని తానక్కడే వున్నట్లు స్వరాజ్యం సమాధానం ఇచ్చింది.
"ఆ మూల గదిలో అటకమీద నేను చిన్నప్పుడు చేయించుకున్న కరేళాలూ, డంబేల్సూ వుండాలి. సూరాయికిచ్చి పంపించు తల్లీ."
రెండోభాగం
ఒకటి
పది నెలల అనంతరం రామనాధం గన్నవరం రేవులో దిగేడు. జైలుశిక్ష అనుభవించినది ఆరు నెలలే అయినా ఎన్నో ఏళ్ళు
గడిచినట్లుంది. తెల్లవారే ముందర మసక వెలుతురులో ఆ పరిచిత ప్రదేశాలు చూస్తూంటే చిరకాలం జబ్బుపడి లేచి, మొట్టమొదటి
మారు వీధిముఖం చూసినవానికి కలిగే ఆనందం అనుభూతం అయింది.
ఆ రోజున తనతో చిరతపూడి నాయుడుగారి భార్యా, కూతురూ కూడ వున్నారు. వాళ్ళు ఎంతో ఆప్యాయంగా మాట్లాడేరు.... వాళ్ళ బండీ
వెనకనే నడిచి వస్తూంటే తనకు ఎదురుదెబ్బ తగిలిందిక్కడనే, స్వరాజ్యం ఎంత నొచ్చుకుంది. బండి ఎక్కేవరకూ వూరుకోలేదు.
అక్కడే ముగ్గు తీసుకొని కట్టుకట్టింది.
అంత మంచి అమ్మాయి. కాని తన బాబాయి ఆరోజున ఆ మాట అన్నాక వాళ్ళ యింటికి వెళ్లి ఓ మారు పలకరించి రావడం కూడా
మంచిదనిపించలేదు. ఆ అమ్మాయికి అప్రతిష్ఠ కలిగించినవాడినవుతాననుకొన్నాడు.
ఒక్కమారు ఎరిగిన ముఖాల్నీ, స్నేహితుల్నీ వెళ్ళి చూసి రావాలని వున్నా చిరతపూడికి రాస్తా బందయిపోయినట్లే తోచింది.
* * * * *
ఈ ఆరేడు నెలలలో అభిమానించే ముఖాలకోసం వాచిపోయినట్లయింది. హాస్పిటలులో కాంపౌండరును అతని మిత్రుల కొట్టేక రామనాధాన్ని మరి
హాస్పిటలుకు పోనియ్యలేదు. ముంగండ వాళ్ళు మళ్ళీ ఏమీ అల్లర్లు చెయ్యకుండా విచారణలకు ఎవ్వరినీ కోర్టు చుట్టుపక్కలకు
రాకుండా నిషేధించేరు. కోర్టుకు తెచ్చేటప్పుడు చేతులకు బేడీలు వేసి, గట్టి బందోబస్తులో తీసుకెళ్ళారు. విచారణ కూడా దడదడా
పూర్తిచేసేశారు. ఆరు నెలలు కఠిన శిక్ష వేసేసి ఆ రాత్రికి రాత్రి కోటిపల్లి కాలవ పడవలో రాజమండ్రి చేర్చేసి,
తెల్లవారేసరికి రాజమండ్రి సెంట్రల్ జైలులోకి పంపేసేరు.
అమలాపురంలో తనకు కనిపించిన తన వాళ్ళు ఇద్దరే ఇద్దరు. తన మామగారు. పెదతండ్రి కొడుకూను. కాని, ఆ ఇద్దరూ తనకు
వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినవాళ్ళు. వాళ్ళు గాక తన వూరివాళ్ళు, మిత్రులూ, బంధువులూ ఎవ్వరూ కోర్టుకి కూడా
వచ్చినట్లు లేదు. వస్తే పోలీసువాళ్లు పంపేసేరో, లేక జైలులో పడ్డందుకు చూడడం అప్రతిష్ఠ అనుకొన్నారో? తన స్నేహితుల్ని
గురించి ఆ అపనమ్మకం లేదు. కాని పల్లెటూరులో....ఏమో....
జైలుకి వెళ్ళడం పల్లెటూళ్ళలో మహా అప్రతిష్ఠాకరమైన పని. హత్యలు చేసిన వాళ్లు, అప్పులు ఎగబెట్టినవాళ్లు, మోసగాళ్లు
అటువంటి సమాజ వ్యతిరేకులయిన వాళ్ళే జైళ్ళకి వెడతారు. రాజకీయ కారణాలక్కూడా జైళ్ళలో వుండడం పరిపాటి కాదు. అలాంటివాళ్లు
తానున్న ఈ ఆరు నెలలలోనూ జైలులో తగలలేదు. తనకు కనిపించిన వాళ్ళంతా దొంగలూ, ఒకటో రెండో ప్రాణాలు తీసినవాళ్ళూ, పచ్చి
మోసగాళ్ళూను.
వాళ్ళంతా తన్ను తమ తోడిదొంగగానే లెక్కేసేరు. అయితే తన భాష, అలవాట్లు చూసి కాస్త ఘరానా దొంగగా జమకట్టేరు. అంతే.
జైలు క్యాంటీన్‌లో అడుగుపెట్టిన మరు నిముషంలోనే వాళ్ళు తన కేసు సంగతి వాకబు చేసేరు. ఏం చెప్పాలో తెలియలేదు
తనకు శిక్ష వేసిన నేరం తాను చెయ్యలేదు. మరేం చేసినట్లు? ఎందుకు వచ్చినట్లు?
ఎవరో గాంధీ చదువు మానమనడం ఏమిటో, అది విని తాను చదువు మానేస్తే దేశానికి వుపకారం ఏమిటో, ఇంగ్లీషువాళ్ళని దేశంలోంచి
పొమ్మనడం ఏమిటో, ఎందుకో వాళ్ళకేమీ అర్థం కాలేదు. సర్కిల్ ఇన్‌స్పెక్టరు అతని మామగారనీ ఆయన
అతని మీద కేసు పెట్టించేడనీ, అదేదో అల్లుడు, మామల మధ్య తగాదాగా మాత్రమే కనబడింది.
"కసికొద్దీ మేనమామను, మావూళ్ళో సుబ్బయ్య షావుకారు అప్పుకోసం జైలులో పెట్టించేడు, నెలకో ఎనిమిదో, పదో చేతిడబ్బు
కట్టుకొని ఓ ఏడాది కాబోలు జైలులో వుంచేడు." అని ఒక ఖైదీ అల్లుడు మామల మధ్య తగాదాలెంత క్రూరంగా సాగుతాయో
వుదహరించేడు.
సెంట్రల్ జైలు లోపలికెళ్ళాక అక్కడివాళ్ళకి అతని కథ ఆద్యంతమూ అబద్ధంగానే కనిపించింది. సర్కిల్
ఇన్‌స్పెక్టరు అతని మామగారా? భార్యతో మాట్లాడడానికి వెళ్ళేడు. మాట్లాడడం జరగలేదు గాని ఆయన చేత దెబ్బలు
తిన్నాడు, పైగా అబద్ధపు కేసా, ఆరు నెలల శిక్షా...
అబద్ధం ఆడడం కూడా బాగా చేతకాని పసిపిల్లకాయనుగా జమకట్టారు.
ఒక్కడూ సానుభూతి చూపలేదు. గొల్లున నవ్వేరు. వాళ్ళలో ఒక శుద్ధమొండి వేళాకోళంగా అనేశాడు కూడాను.
"కన్నం వెయ్యడానికి వెళ్లి, అక్కడ కంటికి నదరుగా పిల్ల కనిపిస్తే అది పెళ్ళాం అనుకోకూడదు. అలా అనుకున్నావు. చూడు
తిన్నగా అత్తారింటికి పంపేశారు."
అయితే అందరూ ఒకందుకు మెచ్చుకున్నారు. పట్టపగలు సర్కిలినస్పెక్టరు ఇంటిలో దొంగతనానికి అంత జబర్దస్తీగా
వెళ్ళగలిగాడంటే... సామాన్యం కాదు. మంచి గుండె ధైర్యం కలవాడై వుండాలనే అభిప్రాయానికి వచ్చేరు.
కాని ఆ అభిప్రాయాన్ని రామనాధం హర్షించలేకపోయాడు. అతడు మరేమీ చెప్పలేదు. కాని చెప్పింది చాలు, వార్డర్లతో సహా అందరికీ
తెలిసింది. అందరూ నమ్మని వాళ్ళే. పైగా తానేదో గొప్పతనం నటిస్తున్నాడని అపనమ్మకం ఏర్పడింది. చులకన చేయడం
ప్రారంభించారు. వాళ్ళ మధ్య ఈ ఆరు నెలలూ జీవితం మహా దుర్భరం అనిపించింది.
జైలులోకి వచ్చిన మరునాడే ఈ వార్డరు ఒక చీటీ తెచ్చి యిచ్చేడు. ఎవరు పంపేరో తెలియదు. తరువాత తెలిసింది. వెన్నేటి
సత్యనారాయణగారు పంపేరని. అప్పటికి ఆ సంగతి తెలియదు. వ్రాత కూడా గుర్తుపట్టనూ లేదు.
అందులో వున్నదొక సీసపద్యం. అది తానిదివరకు విన్నదే. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు వ్రాసింది.
పాత దొంగలగుంపు
బంధువర్గము మాకు
పచ్చ జొన్నలకూడు
పాయసంబు
బలుకాలి సంకెళ్ళు
బిరుదుటందెలు మాకు
మురికి యోడెడి టోపి
బొమిడికంబు....
ఆ పద్యం చదువుకొని అడుగడుగునా హుషారు తెచ్చుకోడానికి ప్రయత్నించేడు కాని....
ఆ దొంగల గుంపును బంధువర్గమూ అనుకోలేకపోయాడు. పచ్చజొన్నల సంకటి పాయసమూ కాలేదు.
వాళ్ళు చెప్పుకొనే మాటలు, వాళ్ళ సంతోషాలు, ఏడ్పులు ఏవీ అతనిని కదిలించలేకపోయాయి. చిన్నచిన్న కొట్లాటలని ఇంగ్లండు
జర్మనీ యుద్ధాలనుగా వర్ణించేవారు. వందలమైళ్ళ రంగంలో కొన్ని వేల సైన్యాల్ని నడిపించిన సేనాధిపతి పాత్రను అభినయించేవారు.
మరికొందరుండేవారు. ఏదో మారుమూల తపస్సు చేసుకొంటూంటే పట్టి లాక్కొచ్చినట్లు చెప్పుకొనేవారు. అదంతా అబద్ధమని ఆ మాటలలోనే
కనిపించేది... వాళ్ళ దగ్గరకెళ్ళడం, మాట్లాడ్డం కూడా ఎబ్బెట్టుగానే వుండేది.
జొన్న సంకటికి తుప్పు వాసన తప్ప పాయసం వాసనేనా వుండేది కాదు. రుచి మాట ఎట్లా వుండనీ పైగా రోగం తెచ్చి పెట్టింది. రోగం
వచ్చినా గానుగ తిప్పడం తప్పలేదు. పద్యంలోని 'బంధువర్గం' అందరూ ఆపని నుంచి తప్పించుకొనేవారు. ఆ నేర్పు తనకు
పట్టుబడలేదు. తనవంటి అభాగ్యులే మరికొందరుండేవారు. కిచెన్‌లో పనిపడ్డా తమకు కుండీలో పోసిన జొన్నలు తొక్కి
కడిగే పనే పడేదిగాని మరోపని పడేది కాదు. ఒక్క అరగంటలో అరికాళ్ళు మంట పుట్టేవి. ఆ పనయ్యేసరికి చర్మం అంతా
కొట్టుకుపోయి ఒకే ఒక పుండుగా వుండేది. మళ్ళీ కుండీలో దిగడం మాట అటుంచి ఓ వారం రోజులవరకూ కాలు నేలమీద
పెట్టలేకపోయేవాడు. కాని కర్రపోట్లతో లేవక తప్పేది కాదు.
బరువుపని తప్పించుకొనే నేర్పు పట్టుబడని వాళ్ళు అతనితో మరికొందరుండే వారు. అయితే వారితో కూడా అతడు దగ్గరగా
వుండలేకపోయాడు. అతని చదువు దానికో పెద్ద ఆటంకమయిపోయింది.
జైలు గేటులో అతని దుస్తులిచ్చేసేరు. ఆ పంచె కట్టి, లాల్చీ తొడుక్కున్నాక తానూ మనిషినయ్యాననిపించింది. పడవ ఖర్చుకంటూ
ఇచ్చిన పావలా డబ్బులు వాకిట్లో వార్డరు చేతిలో పడేశాడు. అటూ ఇటూ చూసేడు. ఎరిగివున్న ముఖం ఒక్కటీ కనిపించలేదు. ఆ
రోజున తనతో విడుదలయినవాళ్ళు నలుగురైదుగురున్నారు. వాళ్ళందరినీ భార్యలో, పిల్లలో, అన్నదమ్ములో, తల్లిదండ్రులో ఎవరో
ఒకరు తీసుకెళ్ళడానికి వచ్చి వున్నారు. తనకోసమే ఎవరూ రాలేదు. తనతోబాటు విడుదలయినవాడొకడు అడిగేడు.
"ఎవ్వరూ రానట్లుందే పాపం!" అంటూనే విసవిసా బయట రోడ్డుమీద వున్న భార్యను కలుసుకొనబోయేడు.
రామనాధమూ రోడ్డుమీదకు వచ్చేడు. అటూ ఇటూ మర్రిచెట్లతో రోడ్డు చీకటి చీకటిగా వున్నట్లుంది. ఎదురుగా రోడ్డు మీదికంటా
శీతాఫలం చెట్లు గదుముకు వచ్చి అడవి మధ్యలోకి వచ్చినట్లు అనిపిస్తున్నాయి.
ఆకాశంలో మబ్బులు కమ్ముకు వస్తున్నాయి. గబగబా పట్టణం వేపు నడక అందుకున్నాడు. దానవాయిగుంట దాకా వచ్చేసరికి
తడిసిపోయేడు. జాంపేటకి వచ్చేసరికి ఇంక వేగంగా నడవవలసిన పనిలేదనిపించింది. నిలువున నీళ్ళోడుతున్న వానికి తడుస్తామనే
భయం ఎందుకు?