నారాయణమూర్తి ఇంటిలో వున్నాడు. ఆయన వియ్యంకుడు ఇంటిలోకి రావడానిక్కూడా వీలులేదనే ఆంక్షను జారీ చేశాడు.
సబ్ జైలులోకి కొడుకును చూడబోతే వేళ కాదని అక్కడ నిరాకరించేరు.
శంకరశాస్త్రి అక్కడినుంచి తిన్నగా ఎరిగి వున్న ఒక వకీలు ఇంటికి పరుగెత్తేడు.
ముప్ఫయ్యారు
జైలు గదులలో పడేశాక అన్నం పెట్టడం అవసరం వుంటుందనే ఆలోచన కనీసం ఒక రోజయినా గడిచేక గాని పోలీసులకు కలగడం
అసాధారణ విషయం. రామనాధం విషయంలో కూడా అంతే జరిగింది. ఎవ్వరూ జేబులోంచి ఖర్చుచేసి హోటలు నుంచి తెప్పించేటంత శ్రద్ధ
చూపలేదు. మేజిస్ట్రేటుకు హవాలా చేసే సరికి ఆ రోజుకు రేషన్లు తీసుకొనేటందుకు వ్యవధి దాటిపోయింది. అందుచేత రాత్రికూడా భోజనం
దక్కేలాగ లేదు. ఆకలివేస్తూంది. కాని, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పక్క గదిలోంచి ఖైదీ నెమ్మదిగా కాపలా పోలీసును
పిలిచేడు.
"జవానుగారూ! ఓ అణా మిఠాయి కొమ్ములయినా తెప్పించండి. కుర్రవాడు ప్రాణం కడబట్టేను."
పోలీసువాని ఖర్చుకి కూడా ఓ అణాయిస్తేగాని ఆ మాత్రం సరుకు జైలులోకి రావడం సాధ్యం కాదు.
"పంతులుగారూ! డబ్బు ఏమీ జాగ్రత్త చేయలేదూ?" అని పోలీసు జవాను యోగక్షేమాలు వాకబు చేసేడు.
తన పర్సూ, డబ్బూ బెడ్డింగులోనే వుండిపోయిన మాట రామనాధానికి జ్ఞాపకం వచ్చింది. కాని ఆ మాట చెప్పడం ఇష్టం లేకపోయింది.
"ముంగండకి కబురు చేస్తే మా వాళ్ళు వస్తారు."
"వస్తే వచ్చేరులెండి. ఇప్పుడు మాటేమిటి?" అని తోడి ఖైదీ కర్తవ్యం ప్రశ్నించేడు.
ఆ సమయంలో కోర్టు వద్దనున్న హోటలు అయ్యరు కొడుకు అన్నపు కారియరుతో వచ్చేడు.
ఖైదీలకు అన్నం తెస్తూండడం ఆ కుర్రవాడికి అలవాటే.
ఆ పురమాయింపు ఎవరిదో ఆ కుర్రవాడు చెప్పలేకపోయేడు. కాని నాలుగు వందల రెండు పోలీసు జవాను వచ్చిన సంగతి గుర్తుంది.
అతడెవరో పోలీసు బంట్రోతు చెప్పగలిగేడు.
"ఈ వేళ సర్కిల్ అయ్యగారింటి వద్ద డ్యూటీ అతనిదే."
సర్కిల్ ఇన్‌స్పెక్టరో, ఆయన ఇంట్లోవాళ్ళో చేసిన ఏర్పాటిది. ఆ భోజనం చేయడమా, మానడమా అని
రామనాధానికి పెద్ద సమస్య అయి పట్టుకుంది.
పక్క గదిలో ఖైదీ ఫక్కున నవ్వేడు. తాను తటపటాయించడానికి కారణం ఏమిటో అతడు గ్రహించేడు.
"పొరుగువాడింట ఓ విస్తరెళ్ళినా వెళ్ళడమే."
ఆ తర్కానికి రామనాధం మనస్సు ఒప్పుకోలేదు. పొద్దుటి నుండి మాడి వున్న పొట్టమీద ఆ ఇంటి వాళ్ళని శత్రువులుగా తప్ప
బంధువులుగా భావించరాదనే ఆవేశంలోకి వచ్చేడు. ఆ శత్రువులు పంపిన భోజనం, వాళ్ళని అవమానపరచడానికయినా
తిప్పెయ్యాలనిపించింది.
కాని తోడి ఖైదీ వూరుకోలేదు.
"మీ భార్య ఆ యింటనే వుంది కదా?"
రామనాధం ఆలోచించేడు.
తన డబ్బు ఖర్చుచేసి అన్నం పంపించేటందుకు ఆమె ఏర్పాటు చేసేటట్లు కబురు చేస్తాడు. ఆ మాట తోచేకనే అతడు భోజనం చేసేడు.
తాను తెచ్చిన అన్నం తినడమా మానడమా అనే చర్చను ఆ అయ్యరు కుర్రవాడు ఎన్నడూ ఎదుర్కోలేదు. భోజనం బాగులేదని తిట్టిన
వాళ్ళున్నారు. ఇదో కొత్త పద్ధతి.
రామనాధం చెప్పిన ప్రకారం డబ్బు తెచ్చుకొనేటందుకు సర్కిల్ ఇన్‌స్పెక్టరుగారింటికి వెళ్ళినప్పుడు అయ్యరు
కుర్రవాడు ఆ సరికొత్త సమాచారాన్ని అన్నపూర్ణమ్మకు చెప్పడం మరిచిపోలేదు.
ఆ మాటలు విని ఆమె నిస్తబ్ధురాలైపోయింది. కన్నీళ్ళు పెట్టుకొంది.
తండ్రిమీద కోపంతో అల్లుడిక కూతురును ఏలుకొనడనే ఆమె విచారం.
"పిల్లదాని అదృష్టం ఎలాగుందో?"
"దాని అదృష్టం బాగానే వుంది గనకనే వేళకి వచ్చేను. ఈపాటికి నోరు ముయ్యి" అని నారాయణమూర్తి గర్జించేడు.
"చాలులెండి ప్రజ్ఞ" అన్నపూర్ణమ్మ ఈసడింపు వినేసరికి నారాయణమూర్తికి కోపమే వచ్చింది.
అల్లుడిప్పుడే కార్యం చేసుకోనన్నాడనీ, తామంతా నచ్చచెప్పి దారిలోకి తెస్తూంటే నారాయణమూర్తే అంతా భగ్నం చేసేడనీ, దాని ఫలితం
అనుభవించండనీ సాయంకాలమే శంకరశాస్త్రి తిట్టిపోయిన మాటలామె మనస్సులో ఇంకా కలక వేస్తున్నాయి.
"పిల్లవాళ్ళిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ గదిలో వుంటే....."
నారాయణమూర్తి ఆమె తెలివిహీనతను నిరూపించేటందుకు సుందరికి వ్రాసిన రామనాధం వుత్తరాన్నే ఆధారం చేసుకున్నాడు.
పిల్లదాన్ని మంచి మాటలతో తీసుకుపోయి ఎక్కడో వదిలెయ్యాలనేది రామనాధం సంకల్పం. చదువు అనేది వట్టి సాకు. అది
నారాయణమూర్తి అభిప్రాయం.
శుభ్రమైన పిల్లను తీసుకొనిపోయి ఎక్కడో వదిలెయ్యడం ఎందుకు? అదీ ప్రశ్నే?
నారాయణమూర్తి పోలీసు ఆఫీసరు. పోలీసులు బ్రిటిష్ ప్రభుత్వానికి అభిమాన పాత్రులు.
రామనాధం సత్యాగ్రహం చేసేడు.
సత్యాగ్రహం అంటూ తెచ్చినవాడు గాంధీ. గాంధీ ఇంగ్లీషు గవర్నమెంటుకి వ్యతిరేకం.
"నా మీద శత్రుత్వంతో కూతురు జీవితం నాశనం చేసి కసి తీర్చుకోదలిచేడు" అని మగడు చెప్తూంటే అన్నపూర్ణమ్మ సందిగ్ధంలో
పడింది.
"ఉన్నవ లక్ష్మీనారాయణగారి వద్ద వుందువుగాని అన్నమాట ఎంతవరకు నిజమో, తీసుకుపోయి ఏ భోగం వాళ్ళకేనా అమ్మేసునో
ఏమో?"
ఆ మాటలు గోడ పక్కనుండి వింటున్న సుందరి అటువంటి భవిష్యత్తును తలచుకొని వొణికిపోయింది.
"ఛ, అబద్ధం" అనుకుంది.
కాని ఆ అభిప్రాయాన్ని కూడా నారాయణమూర్తి ఎంతోసేపు నిలువనీయలేదు.
ఉన్నవ లక్ష్మీనారాయణ వీరేశలింగంగారిలా విధవా వివాహాలు చేస్తున్నవాడు.
"ఆయన్ని కులంలోంచి వెలివేసేరు. అత్తగారివాళ్ళు కూతుర్ని పంపించక పోతే ముందుగా ఏడాది పిల్లవాణ్ని ఎత్తుకుపోయి భార్యను
వస్తావా చస్తావా అన్నాడు. పాపం ఏం చేస్తుంది? వెళ్ళి ఆ ఇల్లాలు వూళ్ళో విధవముండలకీ, మాలగూడేల వాళ్ళ పిల్లలకీ నానా
చాకిరీచేస్తూ పడివుంది".
నారాయణమూర్తి చెప్పిన ఈ వృత్తాంతం తెలిసినాక తన మగడు తననొక మహాప్రమాదంలోకి తోసేస్తూంటే తన తండ్రి కాపాడాడనే
అభిప్రాయం సుందరిలో ఏర్పడడం కష్టం కాలేదు.
మగని లేఖలోని అంశాలు చదివినప్పుడే ఆమెకు ఇష్టం కాలేదు. తండ్రి చెప్పిన ఈ వివరాలు తెలిసి కాదు. కాని, ఇప్పుడు తండ్రి
చెప్తూన్న కథలు వింటూంటే సుందరి పైప్రాణాలు పైనే పోయాయి.
వితంతు వివాహాలు....
వెలి......
సమాజంలోంచి వెలిబెట్టిన వాళ్ళవద్ద తనను విడుస్తాననడం....
రాత్రి తెల్లవార్లూ ఆలోచిస్తూంది. తన మగడికి అన్యాయం జరిగిందా....? లేక తనను తండ్రి మగడి బారినుంచి
కాపాడేడా......?
తెల్లవారగట్ల వెళ్ళి తల్లి ప్రక్కలో కూర్చుంది.
"ఏమిటే అమ్మా"--అని ఆమె దగ్గరకు తీసుకొంది..."ఇల్లా పడుకో...." అని చోటు ఇచ్చింది.
సుందరి పడుకోలేదు. చాలాసేపటి వరకూ మాట్లాడలేదు. చివరకు అడిగింది.
"నాన్న చెప్పింది నిజమేనా?"
నారాయణమూర్తే ఆ మాట విని లేచి వచ్చేడు. ఉద్యోగరీత్యా తాను గుంటూరులో రెండేళ్ళు వున్నాడు. అప్పటికి సుందరి చిన్నపిల్ల.
ఆరోజుల్లో లక్ష్మీనారాయణగారు చేసిన అకార్యకారణాలనీ, సనాతనపరులు ధర్మరక్షణకు చేసిన కృషినీ వర్ణించేడు.
ఆనాటి సంగతులు తనకు బాగా తెలుసునని నిరూపించడానికి నారాయణమూర్తి ఉన్నవదంపతుల తల్లిదండ్రులను గురించి, వాళ్ళ వూళ్ళను
గురించీ చెప్పేడు.
కొండవీడుకు దగ్గరలో అమీనాబాద్ కరణం లక్ష్మీబాయమ్మగారి తండ్రి. ఆ దగ్గరలోనిదే వేమలూరుపాడు
లక్ష్మీనారాయణది. తండ్రి శ్రీరాములుగారు బహు యోగ్యుడు.
"దేవుడులాంటి మనిషి ఆయన. ఆయన మొహం చూసి పిల్లనిచ్చేం; చూడండి నారాయణమూర్తిగారూ, చివరకి తల ఎత్తుకు తిరిగే పని
లేకుండా చేసేడు.... అని శీతారామయ్యగారు ఒకటే ఇదయి పోతూండేవారు..."
శీతారామయ్యగారు లక్ష్మీబాయమ్మగారి తండ్రి.
తనకు తెలిసినవీ, తెలియనివీ, జరిగినవీ, జరగనివీ, కలిపి చెప్పేసేడు. అంత తిరుగులేని సమాచారం విన్నాక తల్లీ కూతుళ్ళు
ఇద్దరూ ఒక్క నిట్టూర్పు విడిచేరు.
నారాయణమూర్తి తన కార్యక్రమానికీ ఇంట్లోంచే రాగల వ్యతిరేకతను నిర్జించేడు. విజయాన్ని ధృవపరచుకొంటూ తన ఆదేశాలు
జారీచేశాడు.
"ఈ వుత్తరం మాట పైకి తీసుకురావద్దు. వచ్చిందా పిల్లదానిని సాక్ష్యాలూ, సంపన్నాలూ అంటూ తిప్పుతారు" అన్నాడు.
అన్నపూర్ణమ్మ ఇంక సర్దుకోలేకపోయింది.
"ఆ దిక్కుమాలిన గాంధీ ఎవడో, నిక్షేపంలాంటి ఇంట్లో చిచ్చుపెట్టేడు."
గాంధీని గురించి మంచి, చెడ్డలు ఏర్పరచుకొనే వయస్సూ, అనుభవమూ లేకపోయినా సుందరి ప్రస్తుతం చర్చిస్తున్న అన్యాయానికీ
గాంధీని నెపం పెట్టడం న్యాయం అనుకోలేదు.
"కట్టుకున్నదానిని ఎక్కడికో తీసుకుపోయి వదిలెయ్యమని ఆయన చెప్పేరేమిటిలే" అంది.
ముప్ఫయ్యేడు
మరునాడుదయం అడ్వొకేట్ రామసోమయాజులు రామనాధాన్ని సబ్‌జైలుకు వచ్చి చూసేడు.
ఆయనను గురించి కూడా వచ్చిన సబినస్పెక్టరు పరిచయం చేశాక రామసోమయాజులు తాను వచ్చిన పని చెప్పేడు.
"మీ నాన్నగారు పంపించేరు. మీ తరఫున డిఫెన్సులో నేను వాదిస్తాను."
కాని, రామనాధం తాను డిఫెన్సు పెట్టుకోదలచలేదని ఖండితంగా నిరాకరించేడు.
"నేను సత్యాగ్రహంలో పాల్గొంటానని వాగ్ధానం చేసేను. ఆ సహాయ నిరాకరణం పాఠశాలకు మాత్రమే పరిమితం కాదు. గాంధీజీ కోర్టులు
కూడా బహిష్కరించమన్నారు."
రామసోమయాజులు ఆ యువకుని ధృఢ సంకల్పానికి మెచ్చుకొన్నారు.
"కాని, మీ నాన్నగారు చెప్పిన దానిని బట్టి ఇది అబద్ధపు కేసు గదా. మీరు డిఫెన్సు పెట్టుకోకపోవడం అబద్ధాన్ని పెంచి
పోషించినట్లే కదా, సత్యాగ్రహి అసత్యాన్ని ప్రోత్సహించినట్లవుతుంది కదా... అది న్యాయమా."
గత రాత్రి శంకరశాస్త్రి ఒకరిద్దరు వకీళ్ళు ప్రభుత్వ భయంతో సత్యాగ్రహి తరఫున వాదించడానికి నిరాకరిస్తే తన వద్దకు
వచ్చేడు. తాను ఎన్నో ఆశలు పెట్టుకొన్న కొడుకు తన జీవితాన్నే నాశనం చేసుకొంటున్నాడని చెప్పి ఆయన కళ్ళనీళ్ళు
పెట్టుకొన్నప్పుడు తనకు నవ్వు వచ్చింది.
రామసోమయాజులు తన బంధువుల కుర్రవాడు పది పన్నెండేళ్ళ వాడున్నాడు. చూద్దురు గాని వుండండి అన్నాడు.
ఆ కుర్రవాడొచ్చి నిలబడ్డాడు.
"నీ చేతులు ఆయనకు చూపరా అబ్బాయి."
వాడు చాపి చూపేడు. అరచేతులు రెండూ జువ్వ దెబ్బలతో కమిలిపోయి వున్నాయి. శంకరశాస్త్రి విస్తుబోయేడు.
"ఏమిటది?"
ఆ కుర్రవాడు అంబాజీపేటలో చదువుతున్నాడు. రామనాధాన్ని అరెస్టు చేశారన్న వార్త విని అసమ్మతి ప్రకటనగా మూడోఫారం
కుర్రాళ్ళు టోపీలు లేకుండా బళ్ళోకి వెళ్ళేరు.
టోపీలు తీసెయ్యడం ఎందుకో శంకరశాస్త్రికి అర్ధం కాలేదు. కాని, టోపీ తీసివెయ్యాలని తోచినందుకు రామసోమయాజులుకి ఆశ్చర్యం.
పాఠశాలల్లో కుర్రవాళ్ళకి టోపీలుండి తీరాలనే నిబంధనా, నిర్బంధం ఉంది. నిబంధనలను ధిక్కరించడం తమ అసమ్మతి తెలపడంగా
తోచి ఉంటుంది ఆ కుర్రాళ్ళకి.
తీసేశారు. క్లాసు టీచరుకి మండింది. అందర్నీ బల్లలెక్కించి నిలబెట్టేడు. నాయకులన్న వాళ్ళని ఓ నలుగురిని పేకబెత్తం
విరిగిపోయేవరకూ కొట్టేడు.
"ఇంటికెడితే వాళ్ళ నాన్న తంతాడని అటు పెదపూడి వెళ్ళకుండా మా యింటికొచ్చేడు" అన్నాడు.
"దెబ్బలు తిన్న వాళ్ళలో మీ వూరి కుర్రాడే ఒకడున్నాడట. అతడే అసలు దీనికంతకూ కథానాయకుడట" అన్నాడు కూడా.
ఆ కథానాయకుడు రామనాధం మేనల్లుడేనని తెలిసి సోమయాజులు ఆశ్చర్యపడ్డాడు.
"శాస్త్రిగారూ! ఈ ప్రపంచంలో సుఖం, బాగుపడడం వగైరాలను గురించి మీకూ మాకూ వున్న అభిప్రాయాలే వేరు. ఇప్పటి కుర్రవాళ్ళు
ఆలోచనలు వేరూను."
తన మేనల్లుడొకడు చదువు పాడుచేసుకొని కాంగ్రెసు వుద్యమంలోకి తమందరి వుద్దేశాలను కాదని దిగిన సంగతి చెప్పేడు.
"ఏమో ఒకనాటికి వాళ్ళ ఆలోచనలే సరి అయినవవుతాయేమో...." అన్నాడు సోమయాజులు.
"సరి అవడం గురించి మనం అనుకొనేది వాళ్ళమీది ప్రేమవల్లనే గాని, తమకూ ఆ విశ్వాసం వుందని చెప్పగలరా?"
అని శాస్త్రి నిలవదీసేసరికి రామసోమయాజులు వద్ద సమాధానం లేకపోయింది. ఏమంటే తాను ఆ నమ్మకం లేదు గనుకనే కోర్టును
బహిష్కరించలేక పోయేడు.
అప్పుడే అనిపించింది.--ఆ కుర్రవాడెవరో ఓ మాటు చూడవలసిందే....
వచ్చేడు.
కాని, ఇప్పుడాతడు చూపుతున్న పట్టుదల ఆయనకు చాల ఆశ్చర్యం కలిగించింది.
"మీరు చేసినట్లు వాళ్ళు చెపుతున్న నేరం...."
రామనాధం అడ్డు తగిలేడు.
"అది నేరమంటారా?"
"వాళ్ళు చెప్పేది అంతేకదా?"
"వాళ్ళు చెప్పింది బ్రహ్మవాక్కు కాదు. అది....."
"అయితే సర్కిలినస్పెక్టరుగారిని మీరు ఉద్యోగం మానమన్నారా?"
రామనాధం ఆలోచించేడు.
"లేదు."
"మరి ఇది అన్యాయమూ, అబద్ధమూనే కదా."
"అసలీ ప్రభుత్వం ఉండడమే అన్యాయం, అధర్మం, ఈ అధర్మపు దొరతనం క్రింద పనిచేసే కోర్టులకి న్యాయం, ధర్మం ఏమిటి?
వాళ్ళ న్యాయాన్ని నేను వొప్పుకోను. నాకు న్యాయవాదితో పనిలేదు."
రామసోమయాజులు నవ్వేడు.
"జగన్మిథ్య అని శంకరుడు చెప్పినంత మాత్రాన ఇప్పుడు నీ మీద వచ్చిన కేసు మిథ్య కాదు, దీనికి శిక్ష పడితే ఏడాదో,
ఆరు నెలలో మీ ఇష్టానిష్టాలూ, వొప్పుకోటంతో నిమిత్తం లేకుండా జైలులో వుండడమూ తప్పదు."
రామనాధం ఇంక తాను చెప్పవలసిందేమీ లేనట్లు వూరుకొన్నాడు.
రామసోమయాజులు ఆ యువకునితో పరిచయం కలిగినందుకు సంతోషం తెలియబరచి లేచేడు.
"మీరు మీ అభిప్రాయం మార్చుకొన్నట్లయితే కబురు చెయ్యండి. మీ విషయంలో....."
"సోమయాజులుగారూ! సర్కిల్ ఇన్‌స్పెక్టరుగారితో మాట్లాడడానికి వ్యవధి దొరికివున్నట్లయితే, తప్పక
చెప్పి వుండేవాడిని. ఈ 'నేరం' చేసి వుండేవాడిని. మా వెంకటరమణకి మొన్న చెప్పేను. వింటారా అంటే అది వేరు మాట. కాని,
మనం తప్పనుకొన్నది చెప్పడం న్యాయం."
వెనక తిరిగినవాడే రామసోమయాజులు ఆగేడు.
"మీకు తెలిసి వుండకపోవచ్చు నిన్న మీ మేనల్లుడట...."
తన అరెస్టుకు అసమ్మతిగా కుర్రవాళ్ళు చూపిన ధిక్కారం మాట విని రామనాధం నవ్వేడు. వాళ్ళందరినీ టీచరు కొట్టినందుకు
విచారపడ్డాడు.
"కొండ కొమ్ము కదిలింది. జారడం ప్రారంభమయింది. జరుగుతున్నది అన్యాయమని పిల్లలు సహా గుర్తించేరు. నేను దానిని కోర్టులో
నిరూపించనక్కర్లేదు."
"ఆ కుర్రవాడు మీ మేనల్లుడేనయ్యా స్వామీ...."
"వాడొక్కడే. కాని మీ బంధువుల అబ్బాయి. క్లాసులో వున్న మిగిలిన ముప్పయి మందీ? వాళ్ళ మాటేమిటి?"
రామసోమయాజులు తల పంకించేడు.... "నిజమే...."
ముప్ఫయ్యెనిమిది
ఒక్కక్షణం వూరుకోకుండా కబుర్లు చెప్తూండే బాలకృష్ణ ఏమీ మాట్లాడకుండా బడినుంచి రాగానే పక్క వేయడంతో విశాలాక్షి కంగారుపడింది.
మడికట్టుకొన్న విషయం కూడా మరచి ముట్టుకు చూసింది. ఒళ్ళు పేలిపోతూంది. కంగారుగా మృత్యుంజయుడు కోసం పరుగెత్తింది.
అప్పుడే పొలం నుంచి తిరిగి వస్తున్న మృత్యుంజయుడు ఆమె ఆదుర్దా చూసి కదిలేడు.
"ఈవేళ బడికి వెళ్ళేడా?"
"బడినుంచి జ్వరంతోనే వచ్చేడు."
"ఏం భయం లేదు. కంగారు పడకమ్మా! విశ్వనాధం బావగారు ఇంటికి రాలేదా? ఈ మధ్యన కనబడ్డమేలేదు. కాంగ్రెసు కబుర్లు ఏమీ
చెప్పడం లేదు."
ఆమె మనస్సుని ఆందోళన నుంచి బయటపడెయ్యడానికి దారి పొడుగునా కబుర్లు చెప్తూనే వచ్చేడు.
మంచానికి ప్రక్కనే వేసిన పీటమీద కూర్చుని మృత్యుంజయుడు బాలకృష్ణకి కప్పిన దుప్పటి తీసి నాడి చూడ్డానికి చెయ్యి
అందుకోబోయేడు. బాలకృష్ణ కెవ్వుమన్నాడు.
"ఏమిట్రా నాన్నా! ముత్తన్నతాత చెయ్యి చూస్తాడు. ఒక్కమాటు చెయ్యి చాపరా నాన్నా."
కాని బాలకృష్ణ చెయ్యి చాపడానికి ససేమిరా ఒప్పుకోలేదు.
"దీపం దగ్గిరిగా చూపించమ్మా."
మృత్యుంజయుడు బాలకృష్ణ అరచేతిలో వున్న నల్లని చారికలు చూసి తల్లివంక చాల తీవ్రంగా చూసేడు.
"ఏమిటీ దెబ్బలు?"
విశాలాక్షి కంగారుపడింది.
"దెబ్బలేమిటి?"
బాలకృష్ణ దాచలేకపోయేడు.
మేనమామ రామనాధాన్ని అమలాపురంలో అరెస్టుచేసి జైలులో పెట్టేరని చెప్పేరు. తామంతా హర్తాళ్‌గా టోపీలు తీసేసి
బడికెళ్ళేము. ఆ పనికి ప్రోత్సహించిన నన్నూ, మరో ముగ్గురినీ మేస్టారు కొట్టేరు. క్లాసు అందరినీ బెంచి ఎక్కించేరు.
విశాలాక్షి తన కొడుకును ఆ విధంగా బాదేసిన టీచరును తిట్టేసింది.
"ఆ టీచరు మనిషా, పశువా?"
ఆ విషయం తెలుసుకోడానికి తెల్లవారకుండానే విశ్వనాధం అంబాజీపేట బయలుదేరేడు.
ఆయన ఆకారాన్ని చూసి హెడ్మాష్టరు హడలిపోయేడు. తన అసిస్టెంటును సమర్థించడానికి క్షీణ ప్రయత్నం చేసేడు.
"అలా కొట్టడం తప్పే అనుకోండి."
విశ్వనాధం చర్రుమన్నాడు.
"కొంచెం కొట్టడం మంచిదన్నమాట. మీకు ట్రెయినింగ్ ఇస్తున్న నిర్భాగ్యులెవరయ్యా? పిల్లల్ని బుజ్జగించి చదువు
వచ్చేటట్లు చెయ్యాలనీ, వాళ్ళ ఆలోచనల్ని అరికట్టకుండా, సరియైన దార్లో పెట్టాలనీ ముండా ఉపన్యాసాలిస్తారెందుకయ్యా?"
"చూడండి విశ్వనాధంగారూ! కోపంలో వున్నారు..."
"ఆ దెబ్బలు కొట్టింది నేనయి, ఆ పిల్లవాడు మీ పిల్లవాడయి వుంటే ఆ కోపం తాపం తెలిసేది."
హెడ్మాస్టరు తాను చేసి వుండని తప్పుకు తన్నులు తింటూన్నట్లనిపించింది. విశ్వనాధం కోపం చూస్తే ఆయన పిల్లల్ని కొట్టిన
లెక్కల మేస్టరు కళ్ళముందే వుంటే గొంతుపిసికేసేలా వున్నాడు.
టీచరు కొంచెం అతి చేసినా పిల్లలు చెడిపోతున్నారే అనే బాధతోనే శిక్షించుతాడనే వాదం తీసుకొన్నాడు.
"ఇంతకీ పిల్లలు ఏం చేసేరో ఎరుగుదురా?" అని ప్రశ్నించేడు.
ఆయన ధోరణికి విశ్వనాధం మరింత మండిపడ్డాడు.
"పెద్దవాళ్ళం అయినా మనకి బుద్ధిలేదని చూపించేరు. పంజాబులో అన్ని ఘోరాలు జరిగితే పట్టలేదు. గాంధిగారిని అరెస్టుచేస్తే చీమ
కుట్టినట్లనిపించలేదు. మన వొంట్లోది రక్తంకాదు మనం మనుష్యులమనిపించుకోలేకపోయేము. దేశం కోసం నిలబడ్డ వాడిని ఒకడిని
అరెస్టుచేసినందుకు వాళ్ళ గుండె మండిపోయింది. తమకి బుద్ధి వుందని చూపించేరు. దేశానికి భవిష్యత్తు వుందని చూపించేరు."
హెడ్మాస్టరు సిగ్గుపడ్డాడు.
"కాని, ఈ చిన్నతనంలోనే వీళ్ళు ఇంత..."
విశ్వనాధం మాట మధ్యలోనే అందుకున్నాడు.
".......ఉత్తమమైన మనస్సు కనబరిస్తే, పెద్దవాళ్ళయ్యేక ఎంత దేశభక్తులవుతారో, ఎంత త్యాగమూర్తులవుతారోయని
సంతోషించాలి కాని, విచారపడకూడదు."
విశ్వనాధం లేచేడు.
"మా పిల్లలకి చదువు చెప్పమనీ, దేశానికి పనికివచ్చేలా చేస్తారనీ పిల్లల్ని బళ్ళకి పంపుతున్నాంగాని వాళ్ళని కైమా వండమని
కాదు. వాళ్ళ బుద్ధి వికాసాన్ని పేకబెత్తానికి బలిచేయమని కాదు."
హెడ్మాస్టరు ఆయనను వీధిలోవరకూ సాగనంపేడు. ఆయన లెక్కల మేస్టరు ఇంటికెళ్ళి మళ్ళీ రంతు చేస్తాడేమోనని సంకోచం కలిగింది.
"ఆ మేస్టారితో మాట్లాడుతా. నాకు చెప్పడం మంచిపని చేసేరు."
"మా పిల్లలు తప్పుపనులు చేస్తే దారిని పెట్టాలనే మా కోరిక..."
హెడ్మాస్టరు నవ్వేడు, ఇప్పుడీ గంద్రగోళం ఎందుకన్నట్లు. విశ్వనాధానికి చుర్రుమంది.
"తప్పు వొప్పులు తెలియనివాళ్ళు మాస్టర్లు అయ్యేరు కనక ఇంక ఆ బాధ్యత మేమే తీసుకోవడం మంచిది. చదువు మీరు చెప్పండి
చాలు. వాళ్ళు తప్పుచేస్తే మాకు చెప్పండి. మేం నేర్పుకుంటాం..."
నెత్తిన నీళ్ళు దిమ్మరించినట్లు హెడ్మాస్టరు ఉక్కిరిబిక్కిరి అయిపోయేడు.
ముప్ఫయితొమ్మిది
భోజనం చేస్తూ చేస్తూ నారాయణమూర్తి తలఎత్తి చూసేడు.
"అమ్మాయి ఏదీ?"
"వీధివేపున వుంది కాబోలు. పిలవమంటారా?"
"వద్దులే... " అని ఒక్క నిట్టూర్పు విడిచి అతడు మరల భోజనం సాగించేడు.
అతని మనస్సుని ఏదో విషయం బాధిస్తూన్నదని అన్నపూర్ణమ్మ గ్రహించింది. ఏదో ఏముంది? కూతురి మగని విషయమే అయి వుండాలి.
కాని, ఆ ప్రసక్తి మగనివద్ద తీసుకురాగల ధైర్యం లేకపోయింది.
"ఇందాకటి నుంచి మాట్లాడి వెళ్ళేరే, ఎవరో...?"
అసలా మాదిరి ప్రశ్నలు కూడా నిషిద్ధమే. కాని, ఏదో మాట్లాడాలి కదా అని అడిగింది, "నీకనవసరమైన వాటిల్లోకి
దిగకు"--అని సలహా కోసం ఎదురు చూస్తూనే.
కాని నారాయణమూర్తి గదిమెయ్యకుండా వూరుకోవడం ఆమెకూ ఆశ్చర్యం కలిగించింది. ఆ ప్రశ్నకి సమాధానంగా నారాయణమూర్తి తన
మనస్సుని వేధిస్తున్న ఆలోచనల పర్యవసానాన్ని వినిపించేడు.
"ఎగిరి ఎగిరి రాక్షసి మూక మధ్యకి వెళ్ళి పడ్డాం."
ఆ రాక్షసి మూక ముంగండ గ్రామస్థులని అన్నపూర్ణమ్మ అర్ధం చేసుకోవడం కష్టమేం కాలేదు. అయితే వాళ్లు రాక్షసి మూక అని
కూతురు సంబంధం చేయకముందూ, చేశాకా కూడా అనుకోలేదు. బ్రాహ్మణుల్లో తమ శాఖవాళ్ళే నివసిస్తున్న పెద్ద గ్రామం ముంగండ.
వేదపండితులు, సంస్కృత భాషాకోవిదులు, కవులు, వ్యాకరణ శాస్త్రవేత్తలు ఇంటింటా వున్నారని పేరున్న వూరు. కోరి తమ
దంపతులకు దీక్ష ఇచ్చిన గురువుగారిది ఆ ఊరు. ఆ వూళ్ళో తమ కూతురును ఇవ్వగలగడం తమ అదృష్టమని మురుసుకొన్నవాళ్ళే.
కాని, ఈనాడు తమ అల్లుడు తన జీవితాన్ని పాడుచేసుకోవడమేగాక తనను కూడా ఆ గోతిలోకే ఈడుస్తున్నాడనే వ్యధతో ఆ మాట
అంటున్నాడేగాని వేరు కాదని ఆమె ఎరుగును. ఏమీ అనలేదు.
"ముందుకు పోవడం తప్ప నిలబడడానికి కూడా వీలు లేని స్థితి తెచ్చిపెట్టేరు."
రెండురోజుల నుంచీ అప్రతిష్ఠ భయం చూపించి అల్లుడిమీద కేసూ ఏమీ లేకుండా చెయ్యమని మగడితో పోరుతున్న దానికి అది సమాధానం
అని ఆమె గ్రహించింది. పైకి ఎంత బిర్రుగా పనికి రాదంటున్నా లోపల ఆయన కూడా అల్లుడిని బయటపడెయ్యాలనే
అనుకుంటున్నాడన్నమాట. అన్నపూర్ణమ్మ చాల సంతోషించింది.
"ఆ కోపంలో ఏదో చేశారు గాని ఆయనకు మాత్రం బాధ వుండదేమిటి?" అనుకొంది. ఇప్పుడొచ్చిన పుట్టి మునక ఏమిటో....
"అంబాజీపేట స్కూల్లో మొన్న మూడోఫారం ఓ సెక్షన్ కుర్రాళ్ళు హర్తాళ్ చేసేరట."
హర్తాళ్ ఏదో కొత్తమాట. అదేమిటో తెలుసుకొని బుగ్గలు నొక్కుకొంది. వాళ్ళ హర్తాళ్ స్వభావం వింటే
ఆవిడకి నవ్వొచ్చింది.
"టోపీలు తీసేశారు నయం. గోచీలు పెట్టుకువచ్చేరు కాదు...."
అంత తేలికగా తోసివేస్తున్న భార్య మనస్సు తేలికతనం చూసి నారాయణమూర్తికి కోపం వచ్చింది.
"అంత నవ్వులాట మాట కాదిది."
ఆ టోపీలు తీసెయ్యడంలో వున్న అంతరార్థం విన్నాక అన్నపూర్ణమ్మ నోరు తెరిచింది.
"ఏమంటారు వాళ్ళు?"
నారాయణమూర్తి చిరచిరలాడేడు.
"ఇదేదో గంపసిరి అనుకొంటున్నారు. గేలపుసిరి అని ఎరగరు."
నారాయణమూర్తి పరిషేచన పట్టి లేచేడు. చేయి కడుక్కుని వచ్చి భార్య అందించిన తుండుగుడ్డ అందుకుంటూ ఇంక తనను వేధించవలదని
హెచ్చరించేడు.
"ఈ వేళవరకూ నేను తటపటాయిస్తూనే వున్నాను. అతని మీద కేసుకు ఏర్పాట్లూ చేయలేదు. తన తమ్ముడిని పోలీసు వుద్యోగానికి
వెళ్ళవద్దన్నానని గొప్పగా చెప్పుకున్నా వినిపించుకోకుండా ఒరగేసుకు వస్తున్నా....."
అన్నపూర్ణమ్మకది కొత్త సమాచారం. ఆశ్చర్యం వెలిబుచ్చింది. తన అల్లుడు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. అతడు
తమ్ముడనేదెవరినో ఆమెకు అర్థం కాలేదు.
"తమ్ముడెవరు?"
"వున్నాడుగా, ఆ పెత్తండ్రి, ఆయన వుంచుకున్నదాని కొడుకు....."
"వాడా తమ్ముడు....."
శుద్ధ శ్రోత్రియులమనుకొనే ముంగండ బ్రాహ్మణులు తమనాడు మధ్యన జరుగుతున్న ఈ అనాచారాన్ని గురించి చీమకుట్టినట్లుగా కూడ
పట్టించుకోకపోవడం ఆమెకు ఎంతో కష్టంగా వుండేది. కాని ఆ అనాచారంలో బంధుత్వం పాటించడం కూడానా?
"--అవ్‌వ్వ! అవ్‌వ్వ!"
ఆమాట సబినస్పెక్టరు విన్నాడు. పక్కగదిలో 'కరుప్పుకుళ్ళాయి'కే.డీ గాళ్లు విన్నారు. అయినా వాళ్ళ నోరు
నొక్కేద్దామనుకున్నాడు.
కాని, ఇదేమిటి?
ఇప్పుడింకా తాత్సారం చేస్తే తన ఉద్యోగానికి నీళ్లు వొదులుకోవలసిందే.
తాను రామనాధాన్ని ఎందుకు అరెస్టు చేసిందీ తానుగా ఇంకా పేరు పెట్టలేదు. కేసు పెట్టలేదు. కాని, వాళ్ళే పేరుపెట్టేసి
హర్తాళ్ చేసేరు.
"చేస్తే ఆ మేస్టరు పిల్లల్ని మందలించేడు. హత్తేరీ మందలిస్తావాయని ఆ 'శిష్టుపూస' ఓ దుడ్డుకర్ర వేసుకొని
హెడ్మాస్టరుమీదికొచ్చేడు. ఆయన ఏదో సర్దేసి పంపేసేడు. కాని, ఆ పాళాన్ని బుర్ర పగలేసి జైల్లో వుంచవలసిందే....."
"అంత ఆకతాయితనమా......" అని అన్నపూర్ణమ్మ కళ్ళు చక్రాల్లా చేసింది.
"బోడి ప్రజ్ఞ. అంతతో వూరుకోరాదూ? వాళ్ళా, వీళ్ళాయని వూళ్లో పెద్ద కోమట్లవద్దా, కాపులవద్దా తన మనమడిని మేస్టరు
చితక్కొట్టేస్తే జ్వరం వచ్చి పడివున్నాడని యాగీ చేసేడుట."
"పాపం కుర్రనాగమ్మని బాగా కొట్టివుంటాడు. లేకపోతే అంత కోపం రాదు. ఎప్పుడూ మాట్లాడలేదు గాని మంచివాడనే చెప్తారు."
"చెప్పేను! గంపసిరి కాదిది, కొడితే కొడతాడు. వెధవపని చేస్తే పైనా క్రిందా మూసుకు వూరుకోక ఈ బోడి ప్రజ్ఞలెందుకు?
వూళ్ళోవాళ్లు నలుగురూ పిలిచి ఆ మేస్టరుని చంపేస్తామన్నారుట. వాడు హడలిపోయి పరుగెత్తి వచ్చేడు. ఈ వూళ్ళో ఆయన
అన్నగారుంటే అతడు నాదగ్గరికి తీసుకొచ్చేడు."
ప్రొద్దుటినుంచీ మాట్లాడిన వాళ్ళెవరో అన్నపూర్ణమ్మకు అర్థం అయింది. వ్యవహారం వీధినబడింది. ఇప్పుడు తన మగడు వెనక
తగ్గలేడు. అల్లుడిమీద కేసు పెట్టించాలి. అందులో ఆయనే ప్రథమసాక్షి. ఆయన మాటల్నిపట్టి అల్లుడు తమ్ముడనుకొనేవాడు రెండో
సాక్షిగా సిద్ధం అవుతాడు.
కేసు బలం అవుతూంటే ఆ అల్లుడు వకీలును పెట్టుకోనంటున్నాడన్న వార్త గుర్తువచ్చి శిక్ష తప్పదన్నట్లు కనిపించి ఆమె
దిగులుపడి పోయింది.
కూతుర్ని కౌగలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. "నీ గొంతు కోసేమే తల్లీ." అంటున్న తల్లి కన్నీళ్లు చూసి సుందరి కుంగిపోయింది.
నలభయి
తన కొడుకు వెంకటరమణ రామనాధం మీది కేసులో ప్రభుత్వం తరఫు సాక్షులలో ఒకడని విన్నప్పుడు విశ్వనాధం మొదట
నమ్మలేకపోయేడు. కాని విశాలాక్షి పదేపదే చెప్తూంటే ఏమనుకోవాలి?
"సత్యం ఇంట్లో చెప్తూంటే విన్నానని మంగమ్మ చెప్పింది నాన్నా!"
సత్యం మంగమ్మ తమ్ముడు.
"వాడికి ఎల్లా తెలిసింది?"
"అదేమిటి నాన్నా అల్లా అడుగుతావు? వాళ్ళ పింతల్లిగారింటికి వెళ్ళేడు మొన్న, అక్కడొక రోజుండి రాత్రే వచ్చేడు."
"ఉహు." అనుకొన్నాడు.
సత్యం అమలాపురం పినతల్లిగారింటికి వెళ్ళి వుంటాడు. అక్కడ విన్న మాటలు ఇంట్లో చెప్పి వుంటాడు. ఆ మాటలు వాడి అక్కగారు
మంగమ్మ తన కూతురుతో చెప్పింది. వాళ్ళిద్దరూ స్నేహితులు... ఇవన్నీ నిజమే. కాని, అసలు విషయమే అతను నమ్మలేకుండా
వున్నాడు.
రామనాధం అంటే వెంకటరమణ ఎంతో అభిమానంగా వుంటాడు. రామనాధం కూడా రమణ అంటే చాలా ప్రేమగా వుంటాడు. తన కూతురు విశాలాక్షే
దూరంగా వుంచుతుంది గాని, రామనాధానికా ఎబ్బెట్టు లేదు.
అటువంటి సందర్భంలో రామనాధం మీద పోలీసులు కేసు పెడితే దాంట్లో పోలీసుల తరఫున సాక్ష్యం ఇస్తాడా? ఏమని?....
"రమణ ఇచ్చే సాక్ష్యం ఏమిటో అడక్కపోయేవా?"
"వాడిమీద నీకు చెప్పలేనంత నమ్మకం. పుట్టముంగిలా చూపులూ వాడూ....."
"విశాలాక్షీ! వాడేమన్నా చెడ్డవాడుగా తయారయితే దానికి ఇల్లాంటి మాటలూ, ఈ చిన్న చూపూ మాత్రమే కారణం అవుతుంది.
మరిచిపోకు. వాడు...."
తానా మాట పూర్తిచేస్తే ఆమె ఏమంటుందో అతనికిదివరకే అనుభవం. విశాలాక్షికి తండ్రిమీద ఎంతో భక్తీ, అభిమానమూ వున్నా, ఆ
కులాంతరురాలితో సంబంధాన్ని హర్షించలేకపోయింది. ఆ సంబంధంలో కలిగిన సంతానాన్ని తన రక్తసంబంధీకుడేనని ఆమె బ్రాహ్మణీకం
అంగీకరించనీయలేదు. వినేమాటుంటే బాలకృష్ణని ఆ చుట్టుప్రక్కలకి చేరనివ్వకపోయేదే, కాని, అది సాగలేదు.
విశ్వనాధం ఒక నిట్టూర్పు విడిచి లేచేడు. తిన్నగా సత్యాన్నే అడుగుదామని బయలుదేరేడు. కాని, అతడు చాల సేపటివరకూ
కనబడలేదు. అక్కడుంటాడనీ, ఇక్కడుంటాడనీ, రెండు మూడు చోట్లకి వెళ్ళేడు. చివరకాతడు రావిక్రిందనే ఎదురయ్యేడు.
కనిపించగానే ఎంతో సంతోషం ప్రకటించేడు.
"ఇదిగో మామగారూ! మీ కోసం పొద్దుటినుంచి కనీసం పదిమందినైనా అడిగి వుంటాను...."
అదంతా వట్టిదని ఎరిగివుండీ విశ్వనాధం ఎరగనట్లు నటించేడు.
"ఏమిటి కథ?"
"ఇంకా మీదాకా రాలేదేమిటి?"
"అదేమిటో చెప్పందే నా దాకా వచ్చిందో లేదో తెలియడమెల్లాగోయి."
"అదేనండి అదే..."
"అయితే తెలిసిందిలే..." అన్నాడు విశ్వనాధం.
"ఏది?"
"అదే. అదే... నువ్వు అనుకొని మరిచిపోయిందే."
సత్యం ఫక్కున నవ్వేడు.
"రాండి. కూర్చోండి, ఓ ముఖ్యమైన మాట చెప్పాలి."
"చెప్పు ముందు, ఏపాటి ముఖ్యమైనదో తర్వాత ఆలోచిద్దాం."
"మా పిన్ని మీతో ముఖ్యంగా చెప్పమని గట్టిగా చెప్పింది." అన్నాడు సత్యం.
"అందుకేనా నిన్న రాత్రి వచ్చి ఇంతవరకూ కనబడనేలేదు...."
"అయితే మీకూ తెలిసిందన్నమాటే."
"అన్నమాటే అని సందేహం ఎందుకు? అదేదో చెప్పు. మా వియ్యపరాలుగారేమన్నారో..."
వియ్యపరాలు అన్న మాటలోని నొక్కును విననట్లు సత్యం అసలు విషయం ఏమిటో చెప్పేడు.
"రామనాధం బావమీది కేసులో సాక్ష్యం మీ రమణ ఇస్తున్నాడట."
"మీ బాబయ్య?"
మీ రమణ అన్నదానికది ఎదురుదెబ్బ, సత్యం తెలియనట్లు దాటేసేడు.
"మా పిన్ని మీతో చెప్పమని పదిమాట్లు చెప్పింది."
"ఆమెకు నా మీద అంత దయ వున్నందుకు సంతోషం. అయితే...."
సత్యం ఆగేడు.
"మా రమణ ఏమని సాక్ష్యం ఇస్తాడు?"
"నేనడగలేదు...."
"ఆవిడ చెప్పలేదూ...."
"లేదు..."
విశ్వనాధం ఫక్కున నవ్వేడు.
"నీ స్కూల్ ఫైనల్ చదువు వట్టి దండగోయ్. ఒక విషయం ఒకరితో చెప్పమన్నప్పుడు అదేమిటో,
ఎందుకో తెలుసుకోవద్దూ. పుల్లయ్య వేమవరం కథ ఎప్పుడేనా విన్నావా?"
సత్యం తగ్గేడు.
"అతడిచ్చే సాక్ష్యం ఏమిటో తెలియనిస్తారా ఏమిటండీ...."
"ఇంకా ఏం చెప్పమన్నారు మా వియ్యపురాలుగారు....."
తన మాటలు వట్టి తట్టాబాజీగా కట్టేశాడని సత్యానికి అభిమానం కలిగింది.
మీ రమణ సబిన్‌స్పెక్టరు సెలక్షన్‌కి కట్టేడుట. ఈ సాక్ష్యం ఇస్తే అతనికి సెలక్షన్
ఖాయమేనట."
విశ్వనాధం ఈమారు ఆ వార్తను నమ్మవచ్చుననుకున్నాడు. వెంకట రమణ ఉద్యోగ ప్రయత్నాలతో ముడిపడి వుందని అన్నప్పుడా
సమాచారాన్ని నమ్మవచ్చుననే అనిపించింది. దానితో అతడివ్వబోయే సాక్ష్యం స్వభావం కూడా అర్ధం అయింది.
అయితే--ఆ ఇచ్చేది అబద్ధపు సాక్ష్యమా? తమ్ముడుగదా అని చనువుకొద్దీ చెప్పిన హితవచనాలను సాక్ష్యంగా చెప్తాడా?
వెంకటరమణ స్వభావం ఎరిగిన విశ్వనాధానికి అతడు వెయ్యబోయే ప్రశ్న ఎలా వుంటుందో కూడ మనస్సుకి తట్టింది.
సరిగ్గా వెంకటరమణ అలాగే అడిగేడు. దానికి తను వూహించుకొన్న రీతినే లచ్చమ్మా సమాధానమిచ్చింది.
* * * * *
విశ్వనాధం ఆ మాట చెప్పగానే లచ్చమ్మ నిర్ఘాంతపోయింది. వెంటనే రెండు బట్టలు సంచీలో బెట్టుకుని నడవమంది.
"ప్రాణంలా చూసే రామనాధానికి అపకారం చేస్తాడూ..."
తాము వెళ్ళడమేగాని, అసలు వెంకటరమణ కనిపించకనేపోవచ్చునని విశ్వనాధం అభిప్రాయం.