"బలాత్కారంగా కొందరిని హింసించి కత్తి బలంతో నెలకొల్పిన ప్రభుత్వం కత్తితోనే కూల్చివేయబడదా?"

రామనాధానికి అనేక ప్రశ్నలు.

రంగనాధరావు మహదావేశంతో ప్రత్యాఖ్యానం చేశాడు.

"నిలబడకపోతే మాత్రం ఏమవుతుంది? ఆ భావాల బలం ఏమవుతుంది? ఫ్రెంచి విప్లవం మొదట అపజయమే పొందింది. కాని, ఆ భావాలు

యూరపునంతనూ కదిలించి వేశాయి. ఫ్రాన్సు దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించకపోయినా ఐరోపా ఖండంలోని తక్కిన దేశాలలోనన్నా

ఆ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కొద్దీ గొప్ప లభించేయి. మనుష్యుని జీవితానికి ఉత్సాహం కలిగించేవి కార్యాలు కావు. విప్లవాలు

కార్యాలు. అవి విఫలమే అయినా ఆ కార్యాలకు ప్రోత్సాహం ఇచ్చిన, ప్రేరేపించిన మహోద్దేశాలు మానవునికి నిజంగా ఉత్తేజం

ఇస్తాయి."

[NOTE: 31వ ప్రకరణంలో రష్యను విప్లవం గురించి రంగనాధరావు తెలిపిన అభిప్రాయాలు 1921 నాటి ఆంధ్రపత్రిక

సంవత్సరాది సంచికలో శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులుగారు వ్రాసిన 'సోవియట్టులు' అనే వ్యాసం నుంచి స్వీకరించాను.

-గ్రంథకర్త]

ముప్ఫయి రెండు

రేవులో అడుగు పెట్టేసరికి పడవల గుమాస్తా పెద్ద హడావిడి చేస్తూ ఎదురొచ్చేడు.

"పంతులుగారూ! రండి, మొదటి పడవ గెంటేస్తున్నారు. మీ కోసమే మొదటి గది వుంచేశాను ఎవ్వరికీ ఇవ్వకుండా."

అతడా గది సౌకర్యాలు వర్ణించే ప్రయత్నంలో వుండగా రామనాధం చిరునవ్వు నవ్వేడు.

"అమలాపురం పడవకి వెడుతున్నా. ఎక్కడుంది? ఎంతసేపట్లో బయలుదేరుతుంది?"

"ఆ పడవకే వెళ్ళండి. మీకు గది ఏర్పాటు చేసేస్తానుగా, హనుమయ్యగారి పడవ వుండగా అయ్యగారు మరోటి

ఎక్కుతారనుకున్నారేమిటి?"

ఎదుటలేని పోటీదారుల్ని కవ్విస్తూ గుమాస్తా పద్దయ్య సరంగుల్ని కేకవేసేడు.

పడవగదిలో పక్క పరుచుకొని సావధానంగా కూర్చున్నాక రామనాధం అమలాపురం వెళ్లేక తాను ఏం చెయ్యాలో, అక్కడి ఘటనలు ఎలా

వుండగలవో ఆలోచించుకోవడం ప్రారంభించేడు.

వెనుకటి అనుభవం రీత్యా తాను కాలవగట్టున కనబడగానే ఏ బావమరదులో, ఏ మరదలో చూస్తారు. కాలువ రేవులో కాళ్ళూ ముఖం

కడుక్కుని గట్టెక్కేసరికి తాను వచ్చిన వార్త ఇంట్లోకి అందిపోతుంది. గుమ్మంలోకి వెళ్ళేసరికి అత్తగారు స్వాగతం పలుకుతుంది.

కాలువలో కాళ్ళు కడుక్కుని వచ్చినట్లు ఎరిగి కూడా నీళ్ళు తెప్పిస్తుంది. పోలీసు జవాను ఒకడు ఎప్పుడూ గుమ్మంలో వుంటాడు గనక

తడుముకోకుండా వేళనిపట్టి సింగు కొట్టులోంచి మిఠాయిలో, కోర్టు దగ్గర అయ్యరు హోటలులోంచి ఇడ్డెన్లో తెప్పించుతుంది. మరదులూ,

మరదళ్ళూ చుట్టూ చేరి కబుర్లు చెపుతూంటే ఆమె వంట పని చూచుకుంటూ మధ్యమధ్య వచ్చి ఏవో పలకరించి వెడుతూంటుంది.

మామగారు ఇంట్లో వుంటే వీళ్లెవ్వరూ రారు. ఆయనే యోగక్షేమాలు, ముంగండ కబుర్లు, కాలేజీ చదువులు గురించి తెలుసుకొంటాడు.

ఇన్ని విధాలుగా ఇందరు తన చుట్టూనే వుంటారు. కాని ఆ ఇంటితో తనకు బాంధవ్యం కలుపుతున్న ఆమె మాత్రం ఎన్నడూ కనిపించదు.

ఆమె మాట కూడా వినబడదు. ఒక్కొక్కప్పుడు అసలు ఆ అమ్మాయి ఇంట్లో వుందా అనే అనుమానం కలుగుతూంటుంది కూడా.

ఎప్పుడూ వెంట వదలని కుర్రవాళ్ళూ, పెద్దవాళ్ళూ మధ్య వాళ్ళకు తెలియకుండా, ఎప్పుడూ కనిపించని భార్యతో మాట్లాడాలి.

అదెల్లాగ జరుగుతుందో అర్థం కాలేదు. అనేక కోణాలనుంచి ఆలోచించీ అది సాధ్యం కాదని తేల్చుకున్నాడు.

ఇంక ఒక్కటే మార్గం.

పడవ గదిలో కూర్చుని తన ఆలోచనలన్నింటినీ కాగితంమీద పెట్టి ఓ సుదీర్ఘమయిన జాబు తయారుచేసేడు. నాలుగుమార్లు

చదువుకొన్నాడు. తన అభిప్రాయం స్పష్టంగా లేదనిపించినచోట ఒకటి రెండు వాక్యాలు సర్దేడు. సంతృప్తి కలిగింతర్వాత జాగ్రత్తగా

మడిచి జేబులోపెట్టుకున్నాడు. ఏ క్షణంలోనో ఆమె కనిపించినప్పుడు ఆ వుత్తరం ఆమె చేతిలో పెట్టి దౌత్యం నడపాలి. దానికి

తగిన సన్నాహంలోనే వచ్చేడు.

కానీ, తీరా గుమ్మంలోకి వచ్చేసరికి తన సన్నాహాలన్నీ అనవసరమేననిపించేయి.

వాకిట్లో ఒక్కరూ కనబడలేదు. సాధారణంగా వుండే పోలీసు జవాను కూడా లేడు. ఇంటి తలుపులు తెరచే వున్నాయి. కాని, ఎవ్వరూ

తిరుగుతున్న జాడ కూడా లేదు. ఆశ్చర్యం కలిగింది, సావిట్లో బెడ్డింగు పెట్టి గుమ్మంలోకి వెళ్ళేడు.

"అత్తయ్యగారూ!" పిలిచేడు.

లోపలినుంచి గొంతు వినిపించింది. సుందరిదా గొంతు.

"ఎవరు వారు?"

ఎన్నడూ మాట్లాడి వుండని కొత్తదనంతో ఆ పలకరింపుకు సమాధానం ఇవ్వలేకపోయేడు. ఏదో గొణిగేడు.

"ఎవరది, కూర్చోండి వస్తున్నా"నంటూ సుందరి వంట గదిలోంచి బయటకు వచ్చి నాలుక కొరుక్కొని వెనక్కి తగ్గింది.

అతనిని చూడడంతో ఆశ్చర్యం కలిగింది. సిగ్గు ముంచెత్తుకు వచ్చింది. ఏం చెయ్యాలో తెలియలేదు.

"ఎవ్వరూ కనబడరేం?"

తనలో అనుకున్నట్లూ కాదు, చాటున వున్న సుందరిని అడిగినట్లు కాకుండా రామనాధం గట్టిగానే స్వగతంగా ప్రశ్నించుకొన్నాడు. ఆ

ప్రశ్నతో సుందరి ఆలోచనలనుంచి తేరుకుంది. నెమ్మదిగా వెనకడుగు వేసి వంట యింట్లోకి వెళ్ళి ఓ చెంబుతో నీళ్ళు అక్కడే గడప

బయట పెట్టింది. గృహిణి ప్రథమ ధర్మం పూర్తిచేసింది. కాని, రామనాధం దానిని స్వీకరించగల స్థితిలో లేడు.

అది అతడు ఎదురుచూసి వుండని పరిస్థితి. అసలు కనిపించదనుకొన్న ఆమె ఎదుట వుంది. ఒకర్తే వుంది. ఆమెకివ్వడానికై తాను

తయారు చేసుకున్న ఆ లేఖ అనవసరమే. గృహిణి ధర్మ నిర్వహణలో తన ఎదుటకే వస్తూంది. ముఖాముఖీ మాట్లాడవచ్చు. కాని,

ఆమెఅంతగానూ అతడూ సిగ్గుపడుతున్నాడు.

సుందరి స్థితి మరీ కష్టంగా వుంది. కన్నెతనంలో భర్తను పలకరించడం సిగ్గుచేటు పనిగా భావించుతారు. కాని, ఇప్పుడు తానే

అతనికి సమస్త పరిచర్యలూ చేయవలసి వచ్చింది. తల్లిచాటున తప్పుకొన్నట్లు పారిపోవడానికి వీలులేదు. అల్లా పారిపోవడం

ఇప్పుడు అవినయం.

వంట యింటి గుమ్మంలో పెట్టిన నీళ్ళ చెంబును అతడు తీసుకొనేటందుకు రాలేదు. ఓ నిముషం చూసింది. గృహిణీ మర్యాద తప్పడానికి

వీలులేదు. తానే పట్టుకు వచ్చి సావడిలో గుమ్మంలో పెట్టింది. అతడది తీసుకొని అటు వీధిలోకో, పెరట్లోకో కాళ్ళు

కడుక్కునేటందుకు వెడితే, అదో సందు వెళ్ళి తుండుతెచ్చి యివ్వాలి. గదిలోకి వెళ్ళాలంటే హాలులోంచి వెళ్ళాలి. అతడక్కడ కూర్చుని

వుండగా వెళ్ళడం ఎల్లాగ? గుమ్మంలోనే నిలబడింది.

అంతవరకూ ఇంట్లో ఎవరో ఒకరు వుండేవుంటారనుకున్న రామనాధానికి ఇప్పుడింక ఆలస్యం చేస్తే ఎవరన్నా వచ్చేస్తారేమోనని భయం

పట్టుకుంది. వారంతా ఎక్కడికెళ్ళేరో తెలియదు. కాని లేరు. ఎప్పుడొస్తారో తెలియదు. కనక వెంటనే సుందరితో మాట్లాడెయ్యాలి.

ఇంత ఏకాంత అవకాశం మరి దొరకదు.

"ఏమోయ్‌!" -- అని పిలిచేడు.

తన బావమరిదిలాగా తను భార్యను పేరు పెట్టి పిలవాలనీ తమ వూళ్ళో వాళ్ళలాగ ఏమే, ఇదిగో, ఆ, ఇల్లా చూడు, లాంటివి

ఆమె పేరుకు పర్యాయపదాలు చేయకూడదనీ అతడు పడవలో వచ్చేటప్పుడు కూడ పది మాట్లనుకున్నాడు. కాని, తీరా ఆ అవకాశం

వచ్చేసరికి రక్తమాంసాలలో జీర్ణించిపోయిన ఆచారబలం, అలవాటూ నాలికను పట్టేసింది. 'ఏమే'కు బదులు 'ఏమోయ్‌' తో

సంతృప్తి పడవలసి వచ్చింది.

ఎవరినాయని సుందరి లోనికి తొంగిచూసింది. అక్కడ మరెవ్వరూ లేరు. ఆ పిలుపు తననేనని అర్ధం అయింది. నవ్వునాపుకొనేటందుకు

వోణి చెరగు నోటికి అడ్డం పెట్టుకుంది. అతడు తన పిలుపును ధృవపరుస్తూ 'నిన్నే' అనేసరికి ఆమె గోడ పక్కకు మరింత

తప్పుకుంది.

రామనాధానికి సమయం మించిపోతుందనిపించింది. తానూ సిగ్గుపడి లాభం లేదు. ఈ దాగుడు మూతల మధ్య ఎవరన్నా వస్తే.....?

జేబులో వుత్తరం చేతిలోకి మార్చుకున్నాడు. గుమ్మంలోకి వచ్చేడు. ఆమె మరింత తల దించేసుకుంది. ఆమెను చూస్తే నవ్వు వచ్చింది.

ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువచ్చి మాట్లాడెయ్యాలనిపించింది. కాని, ఆమె మెరుపులా వంట యింట్లోకి పరిగెత్తింది. ఇప్పుడు

తొందరపడకూడదు. జాప్యము కూడదు. అతడూ వంట యింట్లోకి వెళ్ళేడు.

"సుందరీ."

ఆమె మాట్లాడలేదు. ఆమె చేతినందుకొని తన జాబు చేతిలోది పెట్టేడు.

"ఇది చదువు. నేనింతలోకి నీళ్ళు పోసుకు వస్తాను. చదివి నాకు సమాధానం చెప్తావు కదూ."

చేతిలో కాగితం వంక చూసి, ఆమె గుప్పిడి మూసుకొంది.

అతడు వెనుతిరిగి గుమ్మం వరకూ వెళ్ళి తిరిగి చూసేడు. ఆమె నెమ్మదిగా అంది.... "వేణ్ణీళ్ళు వున్నాయి."

"మాటలు వచ్చునన్నమాటే....."

ఆమె తల వంచుకొని నవ్వుకొంది. అతడు మరల దగ్గరకొచ్చేడు. గడ్డం క్రింద వేలు పెట్టి తలపైకెత్తేడు. కళ్ళు

మూసుకొందేగాని, దరహాసం మూయడం సాధ్యం కాలేదు. రామనాధం కనురెప్పల మీద వూది నవ్వేడు.

"ఏం?"

"ఊఁ"

అతనిని తప్పించుకొని ఆమె దొడ్లోకి వెళ్ళి స్నానాల గదిలో వేడినీళ్ళు పెట్టి, సబ్బు బిళ్ళ వుంచింది. ఈమారామె అంత సిగ్గు

పడలేదు. గదిలోకి వెళ్ళి తుండు తీసుకువచ్చి గుమ్మంలో అతని కోసం నిలబడింది. అతడు వచ్చేక స్నానాల గది వరకూ ముందు

నడిచింది.

"మీ వాళ్ళంతా ఏరీ?"

"వస్తారు"--అంది.

ఆ మాట వినడంతోనే అతను కంగారు పడ్డాడు. స్నానాలగది తలుపు జేరవేస్తూ హెచ్చరించేడు.

"త్వరగా చదివి, సమాధానం చెప్పు."

ఆమె నవ్వుకుంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది.

అతడు స్నానంచేసి బట్టలు మార్చుకొనేసరికి ఆమె ఎప్పుడు తయారు చేసిందో ఫలహారపు పళ్ళెం తీసుకొని హాలులోకి వచ్చింది. ఒక్క

క్షణం నిలబడి గదిలోకి వెళ్ళింది.

ఆమె రాకను అతను గమనించలేదు. బెడ్డింగులోంచి తాను తెచ్చిన చీరలూ, జాకెట్టు గుడ్డలూ బయటకు తీస్తున్నాడు.

అతని దృష్టిని ఆకర్షించడానికి ఆమె గదిలో కుర్చీని లాగింది. ఆ సంకేతం అర్థం అయింది. అతడు "వస్తున్నానోయ్‌."

అంటూ లేచేడు.

రామనాధం తనతో తెచ్చిన చీరను పట్టుకొని లోపలికి వచ్చేడు.

"ఇది నీకు నచ్చుతుందా?"

ఆమె ఒక్కమారు దానివేపు తల తిప్పి చూసింది. సుందరమైన అంచూ, బుటేదారీపని చేసివున్న సాధారణమైన ఖద్దరు చీర. బాగానే

వున్నదనిపించింది. అది తనకోసమే, తన భర్త తీసుకొని వచ్చేడన్న విషయం గుర్తు వచ్చి సిగ్గుపడింది. ఆమె కళ్ళలోనే

సంతోషాన్ని చదివి రామనాధం సంతృప్తి పడ్డాడు.

"నీకు నచ్చుతుందనే తెచ్చేను."

"కూర్చోండి. మంచినీళ్ళు తెస్తాను." అంది రహస్యం చెప్పినట్లు.

రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆమె వెళ్ళిపోయింది.

మరు నిముషంలో మంచినీళ్ళ చెంబుతో హాజరయింది.

"మీ నాన్నగారు వూళ్ళోలేరూ?"

ఆమె తల అడ్డంగా తిప్పింది.

"క్యాంపుకు వెళ్ళేరా?"

ప్రశ్న వేశాక తన పొరపాటు అర్థం అయింది. ఆ ప్రశ్నలోనే సమాధానం కూడా వుంది. నోరు విప్పకుండా తల తిప్పితే సమాధానమే.

ఆమె మరల తల తిప్పింది.

"మీ అమ్మగారు...."

ఆమె తలవంచుకు సమాధానం ఇవ్వలేదు.

"తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ..."

లేరన్నట్లు ఆమె తల మళ్ళీ తిప్పింది.

"ఎక్కడికెళ్ళేరు?"

"ముంగండ...."

అతనికి ఆశ్చర్యమయింది.

"ఎందుకు?"

ఆమె సిగ్గుపడింది.

తమ్ము కలిపేటందుకు ఏర్పాట్లు చూసుకొనడానికే ఆమె వెళ్ళింది. వారందరూ అక్కడుండడం చూసే భర్త వచ్చి వుంటాడని ఆమె యింతవరకూ

అనుకుంటూంది. అతడు కాకినాడ వెళ్ళినట్లు ఎరగదు. అతని వుత్తరంలో ఆ మాటా లేదు.

ఆమె వెనక్కి తిరిగి పోబోతూంటే రామనాధం చటుక్కున వోణి పట్టుకున్నాడు. ఆమె నిలబడింది. భుజాలు పట్టుకొని తనకేసి

తిప్పుకున్నాడు.

"చదివేవా?"

ఆమె చిరునవ్వు నవ్వుకుంది. మామగారు వచ్చి తన తల్లితోనూ, తండ్రితోనూ మాట్లాడినవన్నీ ఆమె ఎరుగును. అతనిని మార్గంలో

పెట్టే ప్రయత్నంలో తన పాత్ర ఏమిటో కూడా ఆమె వింది. అతని రాక, ఆ చీర తీసుకువచ్చి చూపడం ఆమెకు సంతృప్తిగానే వుంది.

ఆ ఆలోచనలతో ఆ వుత్తరంలోని విషయాలకు పెద్ద ప్రాముఖ్యం ఇవ్వలేదు. అందులో ఏ ఒక్కటీ తాను ఒప్పుకోలేదు. కాని, ఆ

విషయాన్ని ఇప్పుడు చెప్పవలసిన పనేముంది? సరేనంటే వదలిపోతుంది... కాని కొంటెతనానికి తల తిప్పింది.

"ఎందుచేత?" అన్నాడు రామనాధం.

ప్రశ్నించేక గుర్తు వచ్చింది. పెళ్ళికాక పూర్వం నాలుగోక్లాసు చదువుతూంది అన్నారు. పెళ్ళి అయాక మానిపించేశారు. ఇప్పుడా

అక్షరాలన్నా గుర్తున్నాయో లేదో? తానా విషయమే వూహించలేదు. నిరుత్సాహం ప్రతిధ్వనిస్తూన్న కంఠంతో "చదవలేవా" అని

ప్రశ్నించేడు.

తాను చదవలేననుకోవడమూ బాగానే వుందనిపించింది. సమాధానం చెప్పడం ఎల్లాగా అనుకొంటూ వుంటే దారి దొరికింది. తలతిప్పి వోరగా

అతని వంక చూసింది. కంఠధ్వనితో ముఖాన్ని పోల్చుకోవాలని ప్రయత్నం. అక్కడ విసుగు కనబడలేదు.

"నిజంగా...." అని రెట్టించేడు.

ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. అంగీకారం తెలుపుతూ తల తిప్పింది.

అతనికి ఏం చెయ్యడానికీ తోచలేదు. ఆమెను చూసిన ఈ అరగంట నుంచీ ఆమెను ముట్టుకోవాలనీ, కూర్చోబెట్టి కబుర్లు చెప్పాలనీ

కోరిక మనస్సునావరించి వున్నా తన నియమం, నిష్ఠ గురించి మరిచిపోలేదు. ఆమె చదవలేకపోతే తానే చెప్పాలి. చెప్పడం కోసమేనా

ఆమెను దగ్గర కూర్చోబెట్టుకోవాలి. సిగ్గుపడి పారిపోకుండా పట్టుకొని కూర్చోపెట్టాలి.

రామనాధం లేచి ఆమె భుజాలు పట్టుకొని తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టేడు. ఆమె లేచిపోతూంటే ఎదురుగా నిలబడి, కుర్చీ

చేతులమీద ఆనుకొని, ముఖం మీదికి వొంగేడు. ఇప్పుడు ఆమె లేస్తే తన తల అతని ముఖానికి కొట్టుకొంటుంది.

సుందరి సిగ్గు తోసుకు వస్తున్నా మాట్లాడక తప్పలేదు.

"ఎవరేనా వస్తారు."

"ముందు టిఫిన్‌ తీసుకోండి."

"పొయ్యిమీద పాలు పెట్టేను. పొంగిపోతాయి."--అనేక సాకులు, భయాలు.

రామనాధం ఏమీ వొప్పుకోలేదు. నవ్వొక్కటే అతనికి సమాధానం. అతని ప్రశ్న ఒక్కటే.

"నిజం చెప్పు."

ఆమె నిజం చెప్పినా చెప్పకపోయినా ప్రమాదం లేదు. అవసరమూ లేదు. తాను చెప్పవలసినదానికి ఆ ప్రశ్నతో పని లేదు. కాని,

ఆమె నవ్వు-చిరునవ్వు అతనిలో చెలగాటాన్నే ప్రోత్సహించింది.

"నిజమేనా?"

"నిజమే....."

అతడది నమ్మదలచలేదు.

"కాదు."

ఆమె ధృవీకరించింది.

"ఔను."

"అబద్ధం...." అతడు తన అవిశ్వాసాన్ని తెలిపేడు.

"కాదు....." ఆమె ఆ అభిప్రాయాన్ని ప్రత్యాఖ్యానం చేసింది.

"కాదు."

"ఔను."

ముప్ఫయిమూడు

అప్పుడే ఎక్కడినుంచో వచ్చి సావట్లో అడుగుపెట్టిన నారాయణమూర్తికి గదిలోంచి వినిపించిన మాటల పేచీ అర్ధం అయ్యే అవకాశం

లేదు. ఒక గొంతు కూతురుదని తెలిసింది. రెండోది ఎవరిదో అర్ధం కాలేదు. గుమ్మంలోకి వచ్చేసరికి కనిపించిన దృశ్యం అతనికి

మహావేశం కలిగించింది.

కూతురు కుర్చీలో కూర్చుంది. ఆమె కదలకుండా మీదకు వొంగి ఎవరో పడుచువాడు నిల్చుని వున్నాడు. ఆ పడుచువాడు తన అల్లుడే అయి

వుంటాడనే ఆలోచన రాలేదు. ఆ పంచకట్టూ, లాల్చీలో వున్న రామనాధాన్ని అసలు గుర్తుపట్టనేలేక పోయేడు.

ఇంక వూహించగలిగిందీ, వూహించిందీ ఒక్కటే. ఇంట్లో ఎవరూ లేకుండా చూసి సుందరిని ఎవరో తుంటరి అల్లరి పెడుతూ వుండాలి.

రామనాధం వెనుతిరిగి వుండడంచేత మామగారిని చూడలేదు. మాటల ఆటలో సావట్లో బూట్ల చప్పుడును వారిద్దరూ వినలేదు.

గుమ్మంలోంచి "ఎవడ్రా అది" అని తండ్రి గర్జన వినిపించేసరికి సుందరి వులికిపడింది. సన్నగా "నాన్నా" అని లేవబోయింది.

రామనాధం లేవబోతూన్న భార్య భుజంమీద చెయ్యివేసేడు. ఆమెతో పాటు ద్వారంకేసి తల తిప్పేడు. విషయం గ్రహించే లోపున

నారాయణమూర్తి చేతిలోని హంటరు అల్లుని వీపుమీద పడిపోయింది. వెనువెంటనే మరొకటి. సుందరి ఆ ప్రళయానికి దిగ్భ్రమచెంది

తేరుకొనేలోపున మూడో దెబ్బ తలపై పడింది. "అదేమిటి నాన్నా!" అనేమాట నోట రాకపూర్వమే రామనాధం మెడ బట్టుకొని సావట్లోకి

విసిరివేసేడు.

ఆ దెబ్బలకు ఉపక్రమణికగా చేసిన గర్జన విని హాలులోకి పరుగెత్తి వచ్చిన సబినస్పెక్టరూ, పోలీసులూ ఆయన చేతుల్లోంచి

రామనాధాన్ని అందుకున్నారు. వీపునా, తలమీదా తగిలిన దెబ్బలకు దిమ్మ తిరిగిపోయిన రామనాధం సావిట్లోకూడ మరో నాలుగు పోట్లు

తగలడంతో ఊపిరి పట్టేసినట్లయి కూలబడిపోయేడు. అతనిని రెక్కలు పట్టుకొని ఇద్దరు పోలీసులు అరుగుమీదికి ఈడ్చివేశారు.

మగనికి తగులుతున్న దెబ్బలు చూసి సుందరి నివ్వెరపోయింది.

"నాన్నా! నాన్నా!" అంటూ హాలులోకి పరుగెత్తబోయింది.

తాను పట్టుకొన్నవాడో దొంగ అనీ, ఒంటరిగా వున్న కూతురు పీక నొక్కి నగలు హరించే ప్రయత్నంలో వున్నాడనీ కల్పన

చేసుకొంటున్న నారాయణమూర్తికి కూతురు ఆదుర్దా అర్థం కాలేదు. ఆమె సావట్లోకి పరుగెత్తబోవడమూ, ఆమె ఆందోళనా అతనిలో

విపరీతమయిన అనుమానాలకు కారణం అయింది. మర్యాద కాపాడుకొనేటందుకు ఆతురత చూపేడు. ఆమె చేయిపట్టుకొని నిలిపేడు. ఆ

పట్టుకు చెయ్యి విరిగిపోతుందనిపించి సుందరి కెవ్వుమంది. ఒక్క లాగుతో ఆమెను గదిలో మూలకు తోసేసేడు.

"ఇవతలకి వచ్చేవంటే జాగ్రత్త."

తండ్రియెడ గల భయంతో ఆమె ఆ ఆదేశాన్ని ధిక్కరించలేకపోయింది.

అప్పటికప్పుడే సర్కిల్‌ ఇన్‌స్పెక్టరుగారి ఇంటిముందు ఆ హడావిడికి జనం చేరుతున్నారు.

కూతురు ప్రవర్తనమీద అనుమానం అంకురించిన మనస్సుతో నారాయణమూర్తి జనుల అధిక్షేపానికి హడలిపోయేడు. తాను వీధిలోకి రాకుండానే

పోలీసులకు ఆదేశించాడు.

"వాడిని లాకప్‌ చేయండి."

సబినస్పెక్టరు ఏదో చెప్పబోయేడు. గాని నారాయణమూర్తి వినిపించుకోలేదు.

"నే వస్తున్నా. నడవండి."

పోలీసులు రామనాధాన్ని తీసుకొని వెళ్ళిపోయేరు. జనం చెదిరిపోయేరు. వాళ్ళకీ అదేమిటో అర్ధం కాలేదు. ఎవరో దొంగ

సర్కిల్‌ ఇన్‌స్పెక్టరుగారింట ప్రవేశించి పట్టుబడిపోయేడని సమాధానం చెప్పుకొన్నారు.

ఏడుస్తున్న కూతురు నోట అసలు మనిషి ఎవరో గ్రహించేక నారాయణమూర్తి నిశ్చేష్టుడయిపోయేడు.

ముప్ఫయి నాలుగు

తమ అధికారి పట్టుకొన్నది తమ అల్లుణ్ణేయని సబినస్పెక్టరూ, జవానులు కూడ అతనిని అరుగుమీదకు తీసుకువెళ్ళినప్పుడే

గ్రహించేశారు. కూతురును భర్త వద్దకు పంపడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వారెరుగుదురు. ఆ అల్లుడు సత్యాగ్రహంలో చేరేడనే

వార్త కూడా వారి వరకూ వచ్చింది. ఆ కారణం చేతనే ఆ శుభకార్యం తన యింట్లో చేయబోవడంలేదని కూడా చెప్పుకున్నారు. కాని,

ఆ అల్లుడు ఇంటికి వస్తే కొడతారా? వారికి అందులో రహస్యం అర్థం కాలేదు.

కాని రామనాధం బట్టలవేపు చూసేక వారు కారణం అర్ధం అయింది అనుకున్నారు. అతడు శుద్ధ కోరా ఖద్దరు కట్టుకున్నాడు.

దేశంలో స్వాతంత్య్రం కోసం పెనుగులాట తీవ్రం అవుతూంది. సహాయ నిరాకరణ ఆలోచన జనాన్ని క్రమంగా ఆకర్షిస్తూంది. ఆ విధమైన

చర్యను రాజద్రోహంగా జమకట్టి కఠినంగా అణచివేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసుకొంటూంది. ఆ సన్నాహంలో భాగంగానే జిల్లా

కలెక్టరు పోలీస్‌ ఆఫీసర్లను సమావేశపరిచాడు.

ఆ సమావేశం నుంచే నారాయణమూర్తి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చేసరికి తన యింటివద్దనే రాజద్రోహి ప్రత్యక్షమయ్యాడు.

అతడు అల్లుడే అయితేనేం. పట్టుకొని తన కర్తవ్యం నిర్వహించేడని వాళ్ళు భ్రమపడ్డారు.

ఆ కర్తవ్య నిర్వహణలో అల్లుణ్ణి కొట్టడం, అందులోనూ రక్తాలు కారేలాగ కొట్టడం అవసరమా అనే ప్రశ్న కలగకపోలేదు.

కాని తామందరూ కూడ తలో రెండు దెబ్బలు వేసేరు. రక్తం కళ్ళ చూసింది ఎవరో అందులో. అందుచేత ఆ ప్రశ్న పైకి రాకుండా

పక్కకు పెట్టేశారు. రాజద్రోహి అల్లుడేమిటి, కొడుకేమిటి? చీరి పారెయ్యవలసిందేనని మనస్సునూ సరిపుచ్చుకొన్నారు. తమ పై

అధికారి నిజాయితీని మెచ్చుకున్నారు.

స్టేషనుకి తీసుకెడుతూంటే రోడ్డు మీద ఒకరిద్దరు రామనాధాన్ని గుర్తించేరు. ఆ దెబ్బలేమిటో, పోలీసులు పట్టుకోవడమేమిటో

వాళ్ళకేమీ తెలియలేదు. కొంతసేపు గుసగుసలు సాగించేరు. పోలీసువారి వద్దకు వెళ్ళి ఏమిటిది అని అడగడానికి భయం. చివరకు

ఎరిగిన ఆమె ఒకరు అడిగేసింది.

"ఆయన దొరగారి అల్లుడు కాదూ?"

పోలీసువాడు అంగీకరించేడు.

"బాబుగారు లేరా? ఏం చేశాడేంటి?"

పోలీసు ఒక్క నిముషము ఆలోచించేడు. చివరకు అడిగిన మనిషిని పురుగును చూచినట్లు దులపరించుకొన్నాడు.

"ఆ బట్టలు చూడ్డం లేదూ?"

"ఏం?"

"ఖద్దరు బట్టలు....."

"ఔను కాబోలు"

"అంటే గాంధీగారి మనిషి."

ఆ ఆడమనిషి వరకూ గాంధీగారి పేరు రాలేదు. కనక దానిలో వున్న ప్రమాదం ఏమిటో అర్ధం కాలేదు.

"గాంధీగారు సర్కారు పోవాలంటారు." అని వివరించాడు పోలీసు.

ఆ ఆడమనిషికి ఆ గొడవలేమీ తెలియకపోయినా ఊ కొట్టడం క్షేమంగా భావించింది.

"ఆయన సత్యాగ్రహం చేశాడంట. దొరతనం పోవాలన్నాడంట...."

ఆ అంటలతో పోలీసువాడు పెద్ద కథ అల్లేశాడు.

రామనాధం మామగారిని వుద్యోగం మానెయ్యమన్నాడు. ఆయనను సత్యాగ్రహం చేయమన్నాడు. ఆయన నా కూతురును తీసుకువెళ్ళిపో. నా

జోలికి రావద్దని చెప్పాడు. ముహూర్తము పెట్టించేడు. కాని రామనాధం వూరుకోలేదు. ఇంటికే వచ్చాడు. వెంటబడ్డాడు. ఇంక ఏం

చెయ్యాలి?

"అయ్యగారు నిప్పంటిమనిషి, నిజాయితీ గలవాడు. అల్లుడైనా సరే, ఆడి అమ్మ మొగుడయినా సరే....."

అని పోలీసువాడు ముక్కేడు.

నారాయణమూర్తి నిక్కచ్చితనం, నిజాయితీ ఆ ప్రాంతాలలో అందరూ ఎరుగుదురు.

ఆ మధ్యనే పేటలోకల్లా ధనబలం, కులబలం గల కుటుంబం తాలూకు యువకుడొకడు తప్పతాగి ఆ వీధి గృహస్థు ఇంటిమీద పడి ఆగం

చేస్తూంటే నారాయణమూర్తి అరెస్టు చేయించేడు. ఆ కుర్రవాని తండ్రీ, బంధువులూ, అతనిని బయటకు తెచ్చుకొనేటందుకు సర్వవిధాలా

ప్రయత్నించేరు. డబ్బు ఆశను నారాయణమూర్తి లెక్క చేయలేదు. చంపేస్తారేమోనన్న భయాన్ని ఖాతరు చెయ్యలేదు. అదివరకే ఆ

కుర్రవాడిని గురించి తండ్రికి హెచ్చరికకూడా ఇచ్చి వుండడంచేత మరి ఆలోచనకూడా లేకుండా కీళ్ళు తిప్పించేసేడు. మళ్ళీ ఎక్కడన్నా

ఫిర్యాదు వచ్చిందంటే కాల్చిపారేస్తానని వాగ్ధానం చేశాడు. కోర్టుకీ, న్యాయస్థానానికీ దూరంగా చాటుగా జరిగిన ఈ కార్యక్రమానికి

సాక్ష్యం, సంవన్నం లేదు. ఇంక బంధువులంతా పోగడి వానికి జైలు శిక్ష తప్పించేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. అది

జరిగాక ఆ కుటుంబం తల ఎత్తుకోలేక ఓ ఏడాదిపాటు తీర్ధయాత్రలు చేసి వచ్చేరు. ఆ వీధి వాళ్ళంతా నారాయణమూర్తికి చెయ్యెత్తి

మొక్కేరు.

అటువంటి కథలతో ఒక వాతావరణం సృష్టించుకొన్న నారాయణమూర్తి సత్యాగ్రహం చేసినందుకు అల్లుణ్ణయినా అరెస్టు చేశాడంటే నమ్మడం

అసాధ్యం కాదు. నారాయణమూర్తి ఆఫీసుకి వచ్చేసరికి కథ చిలవలూ, పలవలూ చేర్చుకొని మంచి రసవత్తరంగా తయారయింది. దానిని

కాదనడానికి కూడా వీలులేనన్ని అలంకారాలు చేర్చుకొంది.

తాలూకా ఆఫీసుకి రాగానే ఎస్‌.డి.ఓ. స్వయంగా వచ్చి అతని రాజభక్తినీ, నిజాయితీని అభినందిస్తూంటే తన

సామర్ధ్యానికి తానే ఆశ్చర్యపడవలసి వచ్చింది.

నిజంచేత అందరిచేతా తిట్లు తినవలసి వస్తుందనీ, అపహాస్యం పాలయిపోతానేమోయనీ భయం మనస్సులో పీకుతూంటే ఏమి చెయ్యాలో తోచక

ఆపీసుకి వచ్చాడు నారాయణమూర్తి.

తనచేత దెబ్బలు తిన్నది దొంగ కాదనీ, అల్లుడేననీ తెలిశాక నారాయణమూర్తి నిస్తబ్ధుడయ్యాడు. కూతురు, అల్లుడూ కూర్చుని

కబుర్లు చెప్పుకుంటూంటే తాను గుర్తించలేకపోయాడు. అల్లుణ్ణి దొంగ అనుకొన్నాడు. పెద్ద ప్రజ్ఞగా కొట్టేడు. చేతులలో వున్న పని

కనక జైలులో పడేశాడు. ఈమాట ప్రజలలో పడితే తన ఆబోరు దక్కదు. తనను ప్రతివాళ్ళూ రేపటినుంచి వేళాకోళం చేసేస్తారు.

తొందరపడ్డానే అన్న బాధ కన్న తన బ్రతుకు ప్రజలలో నవ్వుల పాలవుతుందేమోనన్న భయంతో నారాయణమూర్తి వొణికిపోయేడు.

నవ్వులపాలయింతర్వాత తానా ఉద్యోగాన్ని కాపాడుకోలేడు. కథ అందరికీ తెలుస్తుంది. పై ఆఫీసర్లదాకా వెడుతుంది. వాళ్ళు

నవ్వుతారు. నవ్వుతూనే తన భవిష్యత్తును త్రుంచేస్తారు. వైకుంఠపాళి ఆటలో పాము నోటపడ్డ కాయలాగ ఈ వున్న ఉద్యోగం కూడా

పోతుంది.

ఇన్ని ఆలోచనలలో కూతురు ఏడ్పు వొకటి. ఇప్పుడు అల్లుణ్ణి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఈ చిక్కు నుంచి ఎలా బయటపడాలో

తోచక కొట్టుమిట్టాడుతూంటే ఎస్‌.డి.ఓ. అభినందనా, పొగడ్తా దారి చూపుతున్నట్లు కనబడింది. దెబ్బలు తిన్న

అల్లుడి మీదకన్న, కొట్టిన తనమీద సానుభూతి వుండే అవకాశం కనిపించేక ఆయన వీపు నిలబడింది.

తనకు వినిపించేలా సబినస్పెక్టరు, పోలీసువాళ్ళు, తాలూకా ఆఫీసులోని చిన్న పెద్ద వుద్యోగులు అదేమాట చెప్పుకుంటున్నారు.

అవి వింటూంటే అపహాస్య భయం తీరింది.

గౌరవ ప్రపత్తులు, కీర్తి, బహుశా ప్రమోషను కూడా తనకోసం చేతులు చాచుకుని కూర్చున్నట్లుగానే కనిపించేయి.

అయాచితంగా లభించిన కీర్తిని కాదనవలసిన పని కనబడదు.

పైగా, వెనకడుగు వేయడానికి ఏమాత్రం వీలుగా లేదనిపించింది. అల్లుడని తానేమాత్రం వెనుకతీసినా పై ఆఫీసర్లకి రిపోర్టులు

వెళ్ళిపోతాయి.

అందరి కళ్ళు తనమీద ఉన్నాయి. తాను వింటూండగా, తాను కాదనలేని కథ ప్రచారమయిపోయింది. దానినిప్పుడు కాదనలేడు,

కాదనవలసిన అవసరమూ కనబడలేదు.

* * * * *

పోలీసు ఆఫీసర్లలో రాజద్రోహం ప్రచారం చేసేడన్న నేరంతో రామనాధం సబ్‌జైలుకీ, మాజిస్ట్రేటు కోర్టుకీ మధ్య సంచారం

ప్రారంభించేడు.

ముప్ఫయ్యయిదు

కాకినాడ వెళ్ళేడని విన్న అల్లుడు సబ్‌జైలుకు ఎలా చేరుకున్నాడో అన్నపూర్ణమ్మకు ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు.

పోలీసు రామస్వామి అంతకన్న ఒక్కమాట చెప్పలేనన్నాడు. అసలా మాటకూడా చెప్పదలచుకోలేదు. పొరపాటున చెప్పేడు. ఆ మాట

ఇంకెవ్వరి చెవినీ పడరాదని తన అధికారి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకొన్నాడు. ఆమెకు మళ్ళీ మళ్ళీ చెప్పేడు.

"గుర్రబ్బండీ రాను పోను కుదిర్చి అయ్యే పంపించేరు. మిమ్మల్ని నిల్చున్న పాటున తీసుకురమ్మన్నారు."

--అన్నదొక్కటే అతడు చెప్పదలచుకొన్నదీ, చెప్పిందీ, కాని, ఇంట్లో దిగవిడిచి వచ్చిన పెద్ద కూతురు ఈ రెండు రోజులనుంచీ

ఇంట్లో ఎలా వుండగలుగుతూందో తెలుసుకొనేటందుకు తాను ప్రశ్నలు వేస్తూంటే అతడు నోరుజారి అనేశాడు.

"మగణ్ణి జైల్లో పెట్టేక ఒకటే ఏడుస్తున్నారు."

ఆమె విస్తుపోయింది. "జైలేమిటి?"

తన పొరపాటును గ్రహించి రామస్వామి ఇంక ఏమి చెప్పడానికీ నిరాకరించేడు. "నాకేం తెల్దు" అన్నాడు.

తన భర్త వూరునుంచి వచ్చి కబురు చేశారని మాత్రమే చెప్పి అన్నపూర్ణమ్మ పిల్లలతో బండి ఎక్కింది.

అమలాపురం వచ్చి చూసేసరికి ఇల్లంతా అస్తవ్యస్తంగా వుంది. తనను చూడగానే చుట్టుకొని ఏడుస్తున్న కూతురును ఊరడించి ధైర్యం

చెప్పింది. తాను వచ్చిన వార్త విని పలకరించ వచ్చిన ఇరుగు పొరుగు అమ్మలక్కలు కూడా ఆమెకు ఏమీ చెప్పలేకపోయేరు.

సూర్యోదయం వేళ అల్లుడుగారు వచ్చేరు. ఒక గంటపోయేక అయ్యగారు వచ్చేరు. వచ్చేక కొద్దిసేపటికి సబినస్పెక్టరు

అల్లుడిగారిని తీసుకువెళ్ళిపోయారు.

భయంచేతనో, ఆమె మనస్సు బాధించడం ఇష్టంలేకనో వారెవ్వరూ అల్లుడికి తగిలిన దెబ్బల విషయం చెప్పలేదు.

ఒక్క అరగంట అటుతిప్పి, ఇటుతిప్పి ప్రశ్నించినా తన అల్లుడి అపరాధం ఏమిటో వాళ్ళెరగరు. చెప్పలేదు. గొల్ల పుల్లమ్మ

చెప్పినమాటను పట్టి అల్లుడుగారు మామగారిని ఉద్యోగం మానేసి గాంధీగారి వుద్యమంలో చేరమన్నాడనీ, అందుకే అరెస్టు చేశారనీ వారు

అంటున్నారు.

వాళ్ళని పంపేసి కూతురుని ప్రశ్నించింది. కాని, ఆమె చెప్పిన దాని వలన ఏమీ అర్ధంకాలేదు.

మగడితో అల్లుడు ఒక్కమాట ఆడలేదు. ఆయన వస్తూనే కొట్టేశాడు... 'ఎందుకు?'

"ఏమో....."

కూతురుకూడా ఏదో దాస్తుందని ఆమె అభిప్రాయపడింది.

ఆ అభిప్రాయం కలిగేక అన్నపూర్ణమ్మకు మరో కుంటి సమాధానం కనబడింది.

కూతురూ, అల్లుడూ గదిలో వుండగా చూసేడేమో.

ఆచారం పట్టుదలా, తన ఆశలు వ్యర్థం చేశాడన్న అహంకారమూ కలిసిన కోపంతో కొట్టి....

అయితే మాత్రం కొట్టడం ఏమిటి? సాంప్రదాయక పద్ధతిలో ఏకం చెయ్యబడకపోయినా వాళ్ళు భార్యా భర్తలు, చిన్నతనంకొద్దీ

తొందరపడితే నవ్వుకుని వూరుకోవాలిగాని.....

కొట్టడం... పైగా జైలు...

కూతురు అదేమీ లేదంది.

అన్నపూర్ణమ్మ విసుక్కుంది.

"కర్రదెబ్బలేనా, కడుపుకేమన్నా పెట్టేవా?"

కొట్టినది తానే అన్నట్లు మాట్లాడుతున్న తల్లిని కౌగిలించుకొని సుందరి బావురుమంది.

అల్లుడు సహాయ నిరాకరణం చేశాడని మగడికి మహాకోపంగా వుందని తెలుసు. అతడు తన యింటికి రావడం ఇష్టం లేకనే శుభకార్యం

ముంగండలో ఏర్పాటు చెయ్యమన్నాడు. ఆ అల్లుడు ఇంటికి రావడం చూసి కోపంకొద్దీ....

ఎంత కోపం వున్నా మగడు అంత కసి చూపగలుగుతాడని అనుకోలేక పోయింది.

మరి....

ఆలోచన నిలిపింది. తాను వచ్చినట్లు తెలియడానికి చిన్నపిల్లల్ని తాలూకా కచేరివేపు పంపింది.

"నాన్నగారిని తొందరపెట్టకండి. కనిపించి లేచిరండి." అని వారికి బుద్ధిచెప్పింది.

ఇంక ఇల్లు సర్దడం ప్రారంభించింది. గదిలో బల్లమీద వున్న పలహారపు పళ్ళెమూ, మంచినీళ్ళ చెంబూ, పొయ్యిమీద అడుగంటి,

కాటుపోయి, క్రమంగా ఇగిరి మాడిపోయిన పాలగిన్నె కూతురు చెప్పిన మాటలకు సాక్షీభూతాలుగా కనిపించేయి. పొయ్యివద్ద కనిపించిన

నాలుగు పేజీల వుత్తరం చూసేక అసలు విషయం అర్ధమయిందనుకొంది. అందులోని విషయాలమీద మామగారూ, అల్లుడూ కుస్తీ

పట్టివుంటారనుకుంది. మరల కూతురు ఆ ఆలోచననే నిరాకరించింది.

"వస్తూనే మీదపడిపోయేరు. అసలు మాటా మంతీ ఏదీ?"

ఈ మారు అన్నపూర్ణమ్మ మరో సమాధానం సూచించింది.

"నీ భర్త కాకినాడనుంచి వస్తున్నాడని తెలుసా?"

ఆమె ఎరుగదు.

బహుశా ఈ మాటలు అల్లుడూ మామల మధ్య అక్కడే వచ్చి వుంటాయి. మామగారు ఒప్పుకొని వుండరు. అక్కడే మాటా మాటా పెరిగి

వుంటుంది. అని సమాధానం చెప్పుకుంది.

ఆమె సరాసరి నారాయణమూర్తినే ప్రశ్నించింది.

"ఏమిటీ అప్రతిష్ఠ...."

అల్లుడు రాజద్రోహం బోధించినట్లు. తాను వుద్యోగ ధర్మం పాటించి కర్తవ్యం నిర్వహించినట్లూ వీధిలో చెప్పుకొన్న విధంగా ఇంట్లో

చెప్పుకునేటందుకు నారాయణమూర్తికి ధైర్యం చాలలేదు. అదంతా అబద్ధం అనడానికి కూతురు సాక్ష్యం. ఆమె తల్లితో చెప్పే వుంటుంది.

కనక అతడు క్షేమకరమయిన మార్గాన్నే అనుసరించేడు. ఏ మాటా చెప్పడానికి నిరాకరించాడు. అతడు ఖండితంగా చెప్పిందల్లా

ఒక్కటేమాట.

"అతడు నా అల్లుడు కాడు. అతని పేరు ఇంటిలో రావడానికి వీల్లేదు..."

"మీరు కాదంటే పోతుందా? ఇంటిలో కూతురు ముఖం చూసి...."

మాట మధ్యలోనే నారాయణమూర్తి గఁయ్‌మన్నాడు.

అన్నపూర్ణమ్మ సర్దుకుని అప్పటికి వూరుకుంది.

* * * * *

కొల్లాయి గట్టితే నేమి? · 第 9 / 22 段