"ఇల్లాంటివి పైవాళ్ళు చెప్పదగినవి కాదు. ఎవరికివారు ఆలోచించుకోవలసినవి గాని." అంది ఆమె.

రామనాధం చటుక్కున కుడిచేతి చూపుడువ్రేలూ, మధ్యవేలూ ముందుకు చాపి మేనల్లుడికి చూపేడు.

"గమ్మున నీకు తోచిన వేలు పట్టుకోవోయ్‌?"

చంద్రశేఖరం, సునంద ఫక్కున నవ్వేరు-- "లాటరీ వేస్తున్నావా?"

"ఏం చెయ్యను? మీరు చెప్పింది నాకు నచ్చడం లేదు. నామాట మీదే కూర్చుంటే చాల మందితో విరోధం కొని తెచ్చుకోవలసి వుండేలా వుంది.

ఈ దశలో లాటరీ తప్ప మార్గం ఏం వుంది?"

కేశవచంద్ర మేనమామ ఆదేశాన్ని పాటించేడు. రామనాధం నవ్వేడు.

"మీవాడు ఆదర్శం వొదులుకోవద్దన్నాడు."

చంద్రశేఖరం ఆదుర్దాతో ప్రశ్నించేడు.

"కొంపతీసి ఆలోచన, హేతువాదం కట్టిపెట్టేసి ఈ లాటరీ మీద ఆధారపడి పనిచేస్తావేమిటి?"

"ఇంతకన్న మంచి మార్గం తోచకపోతే నామాట మీదనే వుండదలచుకొన్నాను. అంతే."

తెల్లవారగట్ల రైలుస్టేషనుకి దిగబెడుతూ చంద్రశేఖరం మరల ఒకమారు హెచ్చరించేడు.

"నాకు తోచినంత వరకు సుందరిని తెచ్చేసుకోమనే అంటాను. మా నాన్నకి వ్రాస్తాననుకో. కాని, మా మధ్యనున్న సయోధ్యల దృష్ట్యా

అది జరగదు. ఆలోచించుకో, మరెవరినేనా అడుగు."

"మీకంటె నాకు ఈ విషయంలో అడగడానికి చనువున్న సన్నిహితులెవరున్నారు? కానీండి."

బండి కదిలే వరకూ చంద్రశేఖరం అక్కడే నిలబడి ఆ కబురూ ఈ కబురూ చెప్పేడు.

ఇంటికి తిరిగి చేరుకొనేసరికి సునంద అతని రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుని వుంది.

"వెళ్ళేడా?"

పరధ్యానంగానే సమాధానం ఇచ్చేడు. "ఆ". ఉభయులూ ఒకనిమిషం వూరుకున్నాక మరల చంద్రశేఖరం ప్రారంభించేడు.

"హఠాత్తుగా నాన్నగారికి ఈ ఆలోచన ఎందుక్కలిగిందోగాని, చెల్లాయి చిక్కుల్లో పడుతుంది. ఇంత చిన్న విషయంమీద ఒక సంసారం

భగ్నమయిందంటే సిగ్గుచేటు."

"అంత మంచిగా, నెమ్మదిగా కనిపించినవాడు ఎంత పట్టుదల చూపుతున్నాడు?" అంది సునంద ఆశ్చర్యంతో.

"అతనికి నచ్చచెప్పగల కీలకం మనకి దొరకలేదు." అని చిరాకుతో చొక్కావిప్పి సోఫాలో గిరాటువేసి హాలులో అటూ ఇటూ పచార్లు

ప్రారంభించేడు చంద్రశేఖరం.

ఇరవయ్యెనిమిది

రాజమండ్రి స్టేషనులో దిగే వరకూ అక్కడ ఏం చెయ్యాలో రామనాధానికి ఓ ఆలోచన అంటూ లేదు. తన తమ్ముడు వెంకటరమణను

చూడడం ఒకటి ముఖ్యం.

బెడ్డింగు కూలివాని నెత్తికెత్తి కాలేజీ హాస్టలుకు బయలుదేరాడు. గేటులోకి వచ్చేసరికి రాజరత్నం ఎదురయ్యేడు. అతడు హాస్టలులో

తన పక్క గదిలోనే వుండేవాడు, కూలివాని నెత్తిన బెడ్డింగు పట్టించుకొని వస్తున్న మిత్రుని చూసి అతడెంతో వుత్సాహం

ప్రకటించేడు.

"వచ్చేశావట్రా. చాలా మంచి పని చేశావు. నా గదిలో పెట్టించు."

తన పాత మిత్రుని కలుసుకొన్న ఆనందంలో అతని మాటలలోని ప్రత్యేకతను రామనాధం గ్రహించలేదు.

"మా తమ్ముడు"

"తమ్ముడెక్కడికీ పోడులే. రా!" అని రాజరత్నం అతనిని తన గదికే తీసుకుపోయేడు.

రామనాధం వెళ్ళిపోయినాక కాలేజీలో జరిగిన ఘటనలన్నింటినీ రాజరత్నం పదినిముషాలలో వివరించి కర్తవ్యం నిర్దేశించేడు.

"పోయి వెంటనే ప్రిన్సిపాల్‌ని చూడు."

రామనాధం వంటి విద్యార్థి కాలేజీ, చదువూ మానడం ప్రిన్సిపాల్‌కు ఎంతో అసంతుష్టి కలిగించింది. ఏదో తాత్కాలికావేశంలో

తొందరపడి వుంటాడనీ, పేరు తీసెయ్యకుండా కొన్నాళ్ళు చూసి, తిరిగివస్తే చేర్చుకుందామనుకుంటున్నాడనీ రాజరత్నం వార్త.

అసలటువంటి ప్రశ్న రావడమే రామనాధానికి చాలా అవమానకరం అనిపించింది. తాను వట్టి అనాలోచనాపరుడనుకోవడం చిన్నతనంగా

తోచింది.

"ఆ రోజున బహిరంగ సభలో చప్పట్లు కొట్టించుకొని...."

రాజరత్నం హేళనగా నవ్వేడు.

"ఆ చప్పట్లు కొట్టింది అభినందిస్తూననుకోవడం చేతనే ఈ పుట్టి మునక, పెళ్ళిభోజనాలూ, విందుల్లో గోవిందా కొడతారు ఎరగవూ!

దానికీ దీనికీ అర్థం ఒక్కటే. 'ఓరి చవట పెద్దమ్మా! నీ బ్రతుకింతే సుమా' అని తాటేకులు కట్టిన చప్పుడురా నాయనమ్మా!

అది."

ఆ రోజున సహాయ నిరాకరణ ప్రకటించిన అయిదుగురిలో మంగరాజు నాలుగోరోజున వచ్చి కాలేజీలో చేరిపోయేడు.

రామనాధానికి చాలా ఆశ్చర్యం కలిగింది. నిజానికి ఆరోజున తనకు హుషారునిచ్చింది ఆ మంగరాజే.

"నిజంగా?"

"వెళ్ళి తెలుసుకో"మన్నాడు రాజరత్నం నిర్లక్ష్యంగా.

నాలుగోరోజున మంగరాజును వాళ్ళ నాన్నగారు కారులో కూర్చోబెట్టుకొని కాలేజీకి తీసుకొచ్చేరు. ఇద్దరూ సరాసరి ప్రిన్సిపాలు గదిలోకి

వెళ్ళేరు. అక్కడినుంచి మంగరాజు క్లాసులోకి ఎలా వచ్చేడో, వాళ్ళ నాన్నగారు కారులో ఏ విధంగా నిష్క్రమించేరో రాజరత్నం

సాభినయంగా వివరించేడు.

"వెంకటేశ్వర్లు నిన్న వచ్చేడు. సూపరింటెండింగ్‌ ఇంజనీరు కొడుకు గనక మంగరాజును మాట్లాడకుండా చేర్చుకొన్నారుగాని,

వెంకటేశ్వర్లుగాడికెవరున్నారు? వట్టి అనాధప్రేతం. కనక సంజాయిషీ అడిగి, పదిహేను రోజులు సస్పెండు చేశారు.

ఆ అన్యాయానికి రామనాధం చాల బాధపడ్డాడు.

"అంటే పరీక్షకు కూర్చోడానికి వీలు లేకుండేటన్ని రోజులు సస్పెండు చేశారు. వాడు నెత్తిన గుడ్డేసుకొని పోయేడు."

"మీరంతా చూస్తూ కూర్చున్నారు."

"ఏం చెయ్యమంటావు? ఆ నక్కకోసం మమ్మల్ని తోకలు తెగ్గోసుకోమంటావా?"

పది పన్నెండేళ్ళక్రితం ఇదే కాలేజీలో గాడిచర్ల హరిసర్వోత్తమరావనే ఆయన వందేమాతరం బాడ్జి పెట్టుకు వచ్చినందుకు

ప్రిన్సిపాలు ఆయనను సస్పెండు చేశాడు. ఆ శిక్షను వ్యతిరేకిస్తూ కాలేజీలో పెద్ద తిరుగుబాటే వచ్చింది. దాని ఫలితం చాలావరకు

వెళ్ళింది కూడా. న్యాపతి సుబ్బారావుగారి వంటి ప్రముఖులు కదిలేరు. ప్రభుత్వం మోచర్ల రామచంద్రరావుగారితో విచారణ కమిటీని

వేయవలసి వచ్చింది.

ఆ విధంగానే విద్యార్ధులు నేడు కూడా ప్రతిఘటించి ఐక్యత కనబరచాలని రామనాధం చెప్పబోయేడు.

కాని ఆ నాటి ఘట్టం వేరు. నేటి స్థితి వేరు. ఆనాడు గాడిచర్లవారు లొంగనందుకు ప్రిన్సిపాల్‌ సస్పెండు చేశాడు.

కనకనే కాలేజీ అంతా ఆయన వెనక నిలబడింది. కాని, ఈ రోజున?

వెంకటేశ్వర్లు లొంగిపోయేడు. అందుచేతనే ఆయన సస్పెండు చేయగలిగేడు.

"ఆ బలహీనతను సమర్ధించమనా నీ అభిప్రాయం?" అని అడుగుతూ వుంటే రామనాధం నిరుత్తరుడయ్యేడు.

ఒక్క నిముషం ఆలోచించి రామనాధం తన ఆలోచనకు తప్పు వ్యాఖ్యానం చేశావన్నాడు.

"ఇక్కడ బలహీనత సమస్యే కాదు. ఒకే పనిచేసిన ఇద్దరికి చెరొకలాగా..."

"అంటే మంగరాజుని కూడా సస్పెండు చెయ్యాలంటావు."

రామనాధం విసుక్కున్నాడు.

"నీకు తప్పు అర్థమేకాని కనబడదేమిట్రా?"

తన్ను సమర్ధించుకోడానికి రాజరత్నం వెంకటేశ్వర్లు మరో అపరాధాన్ని వివరించేడు.

"ఆ చచ్చు పీనుగ వస్తూవస్తూ శుద్ధ కోరా, ముతక బట్టలతో హాజరయ్యేడు. ఆ వేషం చూసేసరికి రంగనాధరావు లెక్చరరు

మండిపడ్డారు. కాలేజీ మానేశానన్న వాడు మళ్ళీ రావడంగాక ఖద్దరు బట్టల ఏడ్పు ఎందుకు? చెప్పు, ఏం నోరు మూసుకొన్నావేం?

ముందు మాలో ఎవరి దగ్గరకైనా ఏడిస్తే బట్టలిచ్చేవాళ్ళంగా! తిన్నగా రంగనాధరావు లెక్చరరు వద్దకు వెళ్ళాడు. ఆయన

కస్సుమని ఆ బట్టలు మీ నాన్న మొహాన పారేసి రమ్మన్నాడు.

లెక్చరరుకు కోపం ఎందుకు వచ్చిందో రామనాధానికి అర్థం అయిందనిపించింది. రంగనాధరావు మాటవచ్చేక అబ్బాయినాయుడు రష్యా విప్లవం

గురించి అడిగిన మాట జ్ఞాపకం వచ్చింది, ఆయనకేమన్నా తెలుసునేమో "అడగాలి......" అనుకొన్నాడు.

"నేను ప్రిన్సిపాల్‌ని కలుసుకుంటాను."

రాజరత్నం అతనిని ఆపాదం చూసేడు.

"ఆ బట్టలతో వెళ్ళకు, నా పాంటూ, కోటూ వేసుకెళ్లు."

కాని, కాలేజీలో తన్ను చేర్చుకోమని అడగడానికిగాక వెంకటేశ్వర్లుకి అన్యాయం చేయడం గురించి అడిగేస్తానంటూంటే రాజరత్నం

కంగారుపడ్డాడు. అతడు బెడ్డింగు తన గదిలో వుంచి ప్రిన్సిపాల్‌ని కలుసుకుంటే తాను పంపినట్లు మాట వస్తుందని

భయపడసాగేడు.

"ఏడవకురా...."

"నీకేమిరా బాబూ! ఏదో పదెకరాల భూమి వుంది గనక ఎన్ని గంతులేనా వేస్తావు. ఎప్పుడు పరీక్ష పూర్తిచేస్తానో, వుద్యోగంలో

చేరతానో అని మా ఆవిడ పుట్టింట పిల్లవాడితో ఎదురుచూస్తూంది." అన్నాడు రాజరత్నం.

రామనాధం ఏమీ అనలేదు.

"మధ్యాహ్నానికి కనిపిస్తానని మా రమణతో చెప్పు." అంటూ కూలీని పిలిచి బెడ్డింగుతో సహా నాళంవారి సత్రం వేపు వెళ్ళాడు.

ఇరవైతొమ్మిది

నాళంవారి సత్రంలో గుమాస్తా చూపిన గదిలో సామాను పడేసుకొని తిన్నగా గోదావరికెళ్ళి స్నానం చేసి వచ్చేడు. బట్టలు మార్చుకొని

వీధిలోకి వచ్చేసరికి చిన్న ఖద్దరు బట్టల మూటతో సొట్టకాలుతో కుంటుకుంటూ ఇన్నీస్పేటలోకి మళ్ళుతున్న దువ్వూరు సుబ్బమ్మగారు

కనిపించింది.

ఆమె అతన్ని చూడగానే ఆప్యాయంగా పలకరించింది.

"వచ్చేవురా తమ్ముడూ."

వెనువెంటనే తన భుజాన వున్న బట్టలమూట అతనికిచ్చింది.

అందుకోవడమయితే అందుకున్నాడు కాని, భుజాన పెట్టుకోలేకపోయేడు.

ఆమె వుద్దేశ్యం అర్ధం అయింది. ఆ మూటతో ఆమె తనను వీధులవెంట తిప్పుతుంది. ఇంటింటికీ తిప్పుతుంది. ఆమె మాట తాను

కాదనలేడు. అయినా బట్టలమూట భుజానవేసుకొని వీధులవెంట బయలుదేరడం ఎంతో సిగ్గనిపించింది. ఆ విధంగా తిరిగి

అమ్ముకొనేవాళ్ళున్నారు. తానా కులం వాడు కాదు. అదో అభ్యంతరం. కానీ అంతకన్నా పెద్ద అభ్యంతరం నామోషీ. చిన్నతనం.

పడవలోంచీ, రైలులోంచీ పక్కచుట్ట దింపడానికి కూడా కూలివాడు కావలసి వస్తుంది. అల్లాంటిది బట్టలమూట భుజాన వేసుకొని

ఇన్నీస్పేట వీధులలో అమ్మాలంటే.....

అతని తటపటాయింపును సుబ్బమ్మగారు కనిపెట్టేసింది.

"సిగ్గేస్తూందట్రా వెర్రినాయనా?"

ఆ సిగ్గును ఒప్పుకోడానికి కూడా ధైర్యం లేదు.

"అబ్బే అదికాదక్కగారూ!"

అతడు ఏవో సాకులు చెప్పబోయేడుగాని ఆమె అవకాశం ఇవ్వకుండా నవ్వేసింది.

"ఆ హోదా తక్కువ పనికి దిగేవని మెళ్ళో వేసే దండ...."

"ఆ దండ పడిపోయిందంతే.....!"

"మరింకేం. పేచీయే లేదు. రా."

రామనాధానికి మరి మాట తోచలేదు. ఆమె పక్కన పిల్లిలా నడుస్తూ ఆలోచనలో పడ్డాడు.

ఈమె తన సమస్యకు ఏమన్నా పరిష్కారమార్గం చూపించగలదేమోననిపించింది.

"అక్కగారూ!"

"ఏమిట్రా, కొత్త పని ఏదన్నా జ్ఞాపకం వచ్చిందా?"

"వుండడం అయితే చాలా పనులున్నాయి. కాని మీతో మాట్లాడాలండీ...."

"ఏమిటది?"

రామనాధం ఇంటికి వెళ్ళేక తన పరిస్థితి చెప్పేడు. అంతా విని ఆమె సులభంగా చెప్పేసింది.

"అక్కడ విడిచిపెట్టకు. వెంటనే తీసుకువచ్చెయ్యి."

అతడా సలహాకు నోరు తెరిచేడు. తన నియమం మాటేమిటి?"

సుబ్బమ్మగారు నవ్వింది.

అతని ఆలోచనా లేమికి జాలిపడింది. "ఓరి వెర్రినాగన్నా" అంది.

"ఎప్పటికేనా అసలంటూ పెళ్ళాం కావాలనుకుంటున్నావా?" అంది.

"ఆ పెళ్ళాం కాస్త అనుకూలంగా వుండేది కావాలా?" అంది.

"సంసారంలో సుఖం, శాంతీ లేకుండా చేసుకోవాలనుకుంటున్నావా?" అంది.

సుందరికి కుటుంబ జీవితంలో ప్రవేశించే వయస్సు లేకపోవచ్చు. కాని చూసింది ఇట్టే పట్టుకొనే వయస్సులో వుంది. జీవితాన్ని మలిచే

అనుభవాల్ని నేర్చుకొనేది ఈ వయస్సులోనే, ఈ స్థితిలో ఆమెను ఒక పోలీసు ఉద్యోగి పెంపకంలో వదల వద్దని ఆమె సలహా.

"విషం నూరిపోసేస్తాడు. దానికి మరి విరుగుడు కూడా దొరకదు. యావజ్జీవం నీకు ఓ సమస్య అయి కూర్చుంటుంది."

భార్య తనకో సమస్య అయి కూర్చుంటుందనే సరికి రామనాధానికి మగతనపు అహంకారం దెబ్బతింది. చర్రుమన్నాడు.

"అల్లాంటిది మన దగ్గర చెప్పకండి. మరీ సమస్య కావాలనుకుంటే వాళ్ళ నాన్నకే అవుతుంది."

కాని ఆ మాట అనేశాక రామనాధం నొచ్చుకున్నాడు. సిగ్గు పడ్డాడు. ఇంతకీ తానూ, మామగారూ తగవుపడి సుందరి మీదనా కసి

తీర్చుకోవడం?

ఆ మాటనే సుబ్బమ్మగారూ అనేక రూపాలలో చెప్పింది.

ఇదివరకే ఆడవాళ్ళకి అనంతంగా వున్నాయి బాధలు. వానిలో మరొకటి జతపరచడం ఆమెకేమాత్రం సమ్మతం కాలేదు.

నిజమే. సుందరి చేయగలదేముందనిపించింది. కాని....

తానిప్పుడు చేయవలసిందేమిటి? తీసుకువచ్చెయ్యడానికి చిన్న పిల్లాయె. వాళ్ళు పంపెయ్యడానికే ఏర్పాట్లు చేస్తున్నారు. అదీ

నిజమే. అయితే తన నియమం మాటేమిటి?

"నియమం నియమం అంటావేమి"టంది ఆమె. దానిని పరిస్థితులకు వీలుగా సవరించుకోమంది.

"అదే మీరు చెప్పండని అడుగుతున్నా"నన్నాడు రామనాధం.

తిరిగి తిరిగి సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది.

సుబ్బమ్మగారు ఆలోచించింది.

"ఇప్పటినుంచీ సంసారం పెట్టడం మంచిది కాదంటావు కదూ. పెట్టకు. ఉన్నవ లక్ష్మీనారాయణగారూ, భార్యా కన్యా విద్యాలయం

లాంటిదేదో నడపాలనుకొంటున్నారు.

"వారు నడపదలచుకొన్నది ఏదో ఆషామాషీ విద్యాలయం కాదు. స్త్రీలకు చదువుతోపాటు చిత్త సంస్కారమూ, దేశభక్తీ,

జాతీయాభిమానమూ కలిగించాలనేది వారి ధ్యేయం."

"ఆమధ్య అన్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నామన్నారు. వుత్తరం వ్రాస్తాను."

"కానీ, ఉన్నవవారి విద్యాలయం ఇంకా ఆలోచనల దశలోనే వుందాయె."

"నీ భార్యే వాళ్ళ విద్యాలయంలోనే మొదటి విద్యార్థిని అవుతుంది."

అదీ బాగానే వుంది....

"కాని....." మరల ఏదో అనుమానం. సుబ్బమ్మగారు నవ్వింది.

"ఇన్ని సమస్యలు తెచ్చుకొని, ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలేమిటని బుర్ర పాడుచేసుకొంటూ కూర్చుంటే జీవితంలో ఒక్క అడుగు

వెయ్యలేం."

భార్య అన్నగారి సలహా, సుబ్బమ్మగారి సలహా ఒక్కటే. భార్యను వెంటనే తెచ్చేసుకోమనే ఇద్దరి సలహా. అయితే ఆ సలహాల

వెనుకనున్న ఆలోచనా ధోరణులు వేరు.

ఉన్నవవారి విద్యాలయం ఏర్పడే వరకూ సుందరి బాధ్యతను తాను తీసుకోడానికి ఆమె సిద్ధపడింది.

"మా ఇంట్లో వుంటుంది. జాతీయ పాఠశాలలో చేర్పిద్దాం." అంది.

కాని వారిద్దరూ ఎరగనిదీ, తెలుసుకోక తప్పనిదీ మరో ముఖ్య విషయం వుంది.

ఆ పిల్ల ఏమంటుంది?

రామనాధం వరకు పంపుతారు గాని, దువ్వూరి సుబ్బమ్మగారి వద్ద రాజమండ్రిలోనో, ఉన్నవవారి విద్యాలయం వచ్చేక గుంటూరులోనో

వుంచుతానంటే పెద్దవాళ్ళు ఒప్పుకోరు. అత్తగారూ, మామగారూ మాట అటుంచి, తన్ను పెంచిన వాళ్ళే వొప్పుకోరు.

వాళ్ళందరిదీ ఒక ఎత్తూ, అసలు సుందరిది ఒక ఎత్తూను.

ఆమె ఏమంటుంది? బంధువులూ, భర్తా లేనిచోట వుండాలనేదొకటి? రెండోది ఉన్నవవారి విద్యాలయం అన్ని కులాలనూ సమీకరిస్తుంది. ఏ

జాతీయ విద్యాలయమయినా చేయవలసిందదే. ఆ మార్పుకు మెట్లు లేవు. కులభేదాలు పాటించడం, పాటించకపోవడం--అంతే, సుందరి ఏం

చేస్తుంది?

ఆమె స్వభావం ఎటువంటిదో అతడెరుగడు. తొమ్మిదేళ్ళ పిల్లప్పుడు పెళ్ళి అయిదురోజులూ కూడా వున్నదేదో అంతే. ఈ నాలుగైదేళ్ళలో

అతడు చాలామార్లు అత్తవారింటికి వెళ్ళేడు. కాని పరికిణీ మెరుపు, చేతి గాజుల గలగల, తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ ఆట

పట్టించినప్పుడు వినిపించే అణిచిపెట్టుకొన్న నవ్వు, కృత్రిమమైన విసుగుదల మాటలు తప్ప అతడు భార్య ముఖం చూసిన గుర్తు

కూడా లేదు. పరాకుగా వున్నప్పుడు ఎన్నడేనా తాను సందర్భపడితే, ఒక్క క్షణం మెరుపులా మాయమయ్యేది. ఇంక మాటా, పలుకూ

ఎక్కడ? ఆమె స్వభావం ఏం ఎరుగును? ఏం చెప్పగలడు?

పైగా మామగారు పోలీసు ఆఫీసరు. ఆయన బాలామంత్రోపదేశం పొందేడు. ఆ యింటి ఆడపడుచు.

అటువంటిదే ఏదో చంద్రశేఖరం సూచనగా చెప్పిన మాట కూడా గుర్తు వచ్చింది.

సుబ్బమ్మగారు ఇంత తటపటాయింపూ, మీన మేషాల లెక్కా పనికి రాదంది.

"తిన్నగా వెళ్ళు, ఆ పిల్లతో మాట్లాడు. రెండు ఖద్దరు చీరెలు, లంగాలు, ఓణీలు తీసుకెళ్ళు, కట్టుకోమను...."

పొందూరు రకాల సన్నబట్టలు చూచి మరీ ఇవ్వండి--అనాలనిపించింది. కాని ఆమె ఏమంటుందో అని భయపడ్డాడు. ఆమె నోరు మహా

చెడ్డది.... ఎవరో ఆఫీసరు పెళ్ళాం "నేనింత బరువు బట్టలు కట్టలేనండోయి" అందిట. దానిమీద సుబ్బమ్మగారు అనేసిన మోటు

మాట చెప్పుకొని ఇప్పటికీ పక్కలు పట్టుకొని దొర్లిదొర్లి నవ్వుతుంటారు. 'ఆరు మణుగుల మగడిని మోస్తున్నావు. అరవీశ చీర

నీకు బరువయిందా?" అనేసరికి అంత ఆఫీసరు పెళ్ళాం నిలువునా చచ్చిపోయిందట.

ఆ మాట జ్ఞాపకం వచ్చేసరికి అతడికీ నవ్వు వచ్చింది.

"ఎందుకురా నవ్వుతున్నావు?"

ఈ మాటతో అతడు పైకే నవ్వేశాడు.

"చూస్తే హడలిపోయేలా గాకుండా బాగా సన్నరకం చూచి మరీ ఇప్పించండి. ఈ వందా తీసుకోండి. ఇంకా పడితే.."

అతని నవ్వూ, సందేహమూ చూచి సుబ్బమ్మగారు ఒక్కక్షణం విస్తుపోయి, తరువాత తనూ నవ్వేసింది.

"మొగం ఎరక్కపోయినా పెళ్ళామంటే ఆ అభిమానం, సానుభూతి వుండాలి. ఆ పిల్ల ఎవరో అదృష్టవంతురాలు. వెళ్ళు వెళ్ళు."

ముప్ఫయి

హాస్టలు గదిలో వెంకటరమణ దొరికేడు. మనిషిలో ఇదివరకటంత ఆప్యాయత కన్పించలేదు. ఏదో మాటవరసకి అడిగినట్లు

"ఎప్పుడొచ్చేవు?" అన్నాడు.

"ఏమిటల్లా వున్నావు?" అంటూ కుశలప్రశ్న వేసి, కొద్దిసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడేడు. చటుక్కున ప్రశ్నించేడు.

"మీ అమ్మకి వుత్తరం వ్రాయలేదుట. ఆవిడ బాధపడుతూంది."

హఠాత్తుగా ఎదురయిన ఆ ప్రశ్నకు వెంకటరమణ కంగారుపడ్డాడు.

"ఏదో వ్రాయలేదు. బాబయ్యగారికి వ్రాశా కదా అని...."

"అందులో మీ అమ్మమాటే రాయలేదట. అది వినిపిస్తే బాధపడుతుందని ఆయన వుత్తరం వచ్చిందని చెప్పకుండా దాచిపెట్టేడు. ఆమె

ఒకటే గొడవ."

వెంకటరమణ ఏదో అస్పష్టంగా గొణిగేడు. రామనాధం మరో విషయం ఎత్తుకున్నాడు.

"నువ్వు సైంటిస్టువి కావాలని బాబయ్య అభిప్రాయం."

"కాని, ఎల్లా చదవడం? ఆ అత్తవారి వాళ్ళ డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. బాబయ్య ఇవ్వలేరు. ఇంకో ఆరేడేళ్ళు

చదవడం మాటలా?"

అది యథార్థం. బాబయ్య డబ్బు ఇవ్వగల స్థితిలో లేడు. ఏమన్నా ఇచ్చినా అది పెట్టుకొని చదువు కొసకంటా సాగించడం సాధ్యం

కాదు. తనకు సాయపడాలని వుంది. కాని, తనకే ప్రస్తుతం దారి లేదు. బట్టలు కొనుక్కొనేటందుకు నోటు వ్రాయవలసి వచ్చింది.

ఇప్పుడు తన భార్య సంగతి తేల్చుకోవలసి వుంది. ఆమెను ఎక్కడ వుంచినా డబ్బు కావాలి. ఆస్తిపాస్తుల విషయం ఏదో

తేల్చుకొంటేనే గాని, తనకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు.

కాని చదువు చెప్పించుకుంటామని తీసుకెళ్ళిన అత్తవారి వద్ద డబ్బు తీసుకోననడం ఏమిటో రామనాధానికి అర్థం కాలేదు. ఏమన్నా

గొడవలు వచ్చేయో ఏమిటో... ఆ విషయాన్ని ప్రస్తావించడం ఎల్లాగో అర్ధం కాలేదు.

"వాళ్ళు చదివిస్తామంటున్నప్పుడు ఎందుకు సందేహం? ఏం జరిగింది?"

వెంకటరమణ ముఖం నల్లబడిపోయింది. కాని పైకి ఏమీ చెప్పలేదు.

"నాకిష్టం లేదు."

ఇద్దరూ ఒక్క నిముషం వూరుకున్నారు. తమ్ముని అభిమానాన్ని ఎరిగిన రామనాధం ఇంక ఆ విషయం కదపతలచుకోలేదు.

"పోనీ, ఉద్యోగమే చేయాలనుకొన్నప్పుడు మరొకటి లేదా?"

"దానికేం?"

"బాబయ్య కిష్టం లేదు."

"బాబయ్య కిష్టం లేదు. ఆయన కిష్టం అయింది. పెళ్ళి చేసేడు. ఆ పెళ్ళిచేసి నాకెంత అపకారం చేసేరో ఆయనకి తెలియదు. నాకు

తెలుసు. ఇంక నా కష్టసుఖాలు నాకు వదిలెయ్యడం మంచిది."

అతని అసంతృప్తి ఏమిటో అర్ధం కాకపోయినా ఏదో మనస్సులో చాలా బాధపడుతున్నాడనిపించింది. ఇంతకాలం తమకెవ్వరికీ చెప్పలేదు.

తాము పట్టించుకోనూ లేదు. అదేదో సర్దుబాటు చేయవలసి వుటుంది. బాబయ్యతో చెప్పాలనుకొన్నాడు రామనాధం.

"పోనీ నీకయినా పోలీసుశాఖ ఎల్లా నచ్చింది?"

వెంకటరమణ మొండిగా మాట్లాడినట్లనిపించినా రామనాధం పట్టించుకోలేదు.

"ఏం, దానికేం లోటొచ్చింది?" అని రమణ ప్రశ్న.

"బ్రతకడానికి ఏ వుద్యోగమైతేనేం?"

"హోదా, ఫాయిదా లేని చచ్చు మేస్టరీకన్న ఇది నయం."

వెంకటరమణ ప్రశ్నల్నీ, నిశ్చితాభిప్రాయాల్నీ వివిధ దృక్కోణాల నుంచి ప్రత్యాఖ్యానం చెయ్యడానికి రామనాధం ప్రయత్నించేడు.

పోలీసు వుద్యోగంలో వున్న హింసా ప్రవృత్తిని వర్ణించేడు. పై అధికారులకు ఎంత హెచ్చుగా లొంగివుండాలో చెప్పేడు.

"ఆ విధంగా లొంగి చేతులు నలపడం ఎందులోనైనా తప్పదు." అన్నాడు రమణ.

"దేశం అంతా విదేశీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి పెద్ద వుద్యమం నడిపిస్తూంటే నువ్వు ఆ ప్రభుత్వానికి కొమ్ము కాయాలి."

"అంటే.....?"

"దేశాన్నీ, బంధువుల్నీ కాదనాలి."

వెంకటరమణ చురుకు చురుకున చూసేడు.

"అది నా ఒక్కడి విషయంలోనేనా?"

అతని అభిప్రాయం గ్రహించి రామనాధం చిరునవ్వు నవ్వేడు. తల అడ్డంగా తిప్పేడు.

నాలుగేళ్ళ క్రితం పోలీసు సర్కిల్‌ ఇన్స్‌పెక్టరు కూతుర్ని కోడలుగా తెచ్చుకోవడం తమ కుటుంబానికే గొప్పగా

భావించేరు తమవాళ్ళు. ఆనాటి స్థితి వేరు. నేడు తాను ఐ.సి.ఎస్‌.కి వెళ్ళాలన్న సన్నాహాలను కూడా కట్టిపెట్టుకొని

జాతీయోద్యమంలో చేరేడు.

"కాని, మీరాయనతో తెగతెంపులు చేసుకోబోవటం లేదు కదా..."

"అంటే....?"

"ఈవేళ ఆయన నీకు మామగారు కాకపోతారా, ఆ సర్కిలినస్పెక్టరు కూతురు భార్య కాకపోతుందా?"

"ఎందుకు కారు? కాని, మామగారు పోలీసు ఆఫీసరు అయినంత మాత్రాన నువ్వు దేశద్రోహివి గావాలా?"

రామనాధం చర్చలలో తన సోదరుడి మనస్సు నొప్పించగలిగేడే గాని అతనిని వొప్పించలేకపోయాడు.

ఆ మాట తోచి అతనికెంతో బాధ కలిగింది. కాని ఏమనడానికీ తోచలేదు.

"సరే కానియ్యి."

ఇద్దరూ బయటకు వచ్చేరు. గదికి తాళం వేస్తూ వెంకటరమణ ప్రశ్నించేడు.

"నువ్వు ప్రిన్సిపాల్‌ను కలుసుకోవా....?"

"లేదు. మొదట అల్లా అనుకొన్నా, కాని, వెంకటేశ్వర్లుకే పట్టింపు లేనప్పుడు...."

"రాజరత్నంగారు చెప్పినప్పుడే అనుకొన్నా, నువ్వు అనవసర విషయంలో కలగచేసుకొంటున్నావని..."

"మొదట అల్లా అనుకోము... ప్రపంచంలో సమస్యలన్నీ మన సమస్యలే అనుకొని ప్రారంభం అవుతాము."

అది వెంకటేశ్వర్లును గురించి అన్న మాటో, తననుద్దేశించినదో రమణకు అర్ధం కాలేదు. ఏదయినా దానికి సమాధానం ఇవ్వవలసి

వుంటుందనుకోలేదు.

"తండ్రి బాధ పడలేక ఆయనను సంతృప్తి పరచడానికి ప్రిన్సిపాల్‌ను కలుసుకొన్నాడు. ఆయన కాదన్నదే చాలునని

బ్రహ్మానందపడ్డాడు. నిజంగా వెంకటేశ్వర్లు గారికి కాలేజీలో చేరాలనే వుంటే ప్రిన్సిపాల్‌ను సంతృప్తిపరచడమేం గగనం

కాదు."

"...... నే తోచింది."

ఇదివరకటి మాదిరిగా తన తమ్ముడు తనతో గేటు వరకూ రాలేదనీ, తనతో వుండడంలో వుత్సాహం చూపలేదనీ గ్రహించేక రామనాధం

నవ్వుకొన్నాడు.

"నాతో కనిపిస్తేనే పోలీసు ఉద్యోగానికి ముప్పు మూడుతుందని భయం కాబోలు" అనుకొన్నాడు.

ముప్ఫయ్యొకటి

కూలివాని నెత్తిన బట్టల మూట పట్టించుకొని రామనాధం గుమ్మం మెట్లెక్కుతూంటే రంగనాధరావు ఆశ్చర్యం కనబరచేడు.

"నమస్కారం గురువుగారూ! ఏదో పనిమీద ఊళ్లోకి వచ్చేను. తమ దర్శనం చేసుకుపోదామని....."

రామనాధం కూలివాని నెత్తిమీద మూట దింపి డబ్బులిచ్చి పంపేసేడు.

"ఏమిటయ్యా ఇది?"

"తమతో మాట్లాడాలనుకొన్నా, పోనీ ఎలాగూ వస్తున్నాకదాయని దుప్పట్లూ, వగైరా పట్టించుకొచ్చా. తమ యింట్లో వాడకానికి మంచి

రకాలు వున్నాయి."

రామనాధం చూపుతూంటే రంగనాధం, భార్యా కొన్ని దుప్పట్లూ, డోర్‌ కర్టెన్లూ, టేబుల్‌క్లాతూ తీసుకొన్నారు.

బేరం ముగించి రంగనాధరావు అభినందించేడు..."బలేవాడివోయి."

"అసలు నీకీ ఆలోచన ఎందుకు తట్టిందంట. వారం నుంచి బజారుకెళ్ళి కొన్ని బట్టలు తేవాలనుకుంటూనే బద్ధకిస్తున్నా" నంటూ

గురుపత్ని రెండు కప్పులతో టీ తెచ్చి ముందుంచింది.

"తీసుకోవయ్యా"--అంటూ రంగనాధరావు ఒక కప్పు అతనికందించి తానొకటి తీసుకొన్నాడు.

"ఇప్పుడు చెప్పు, ఖద్దరు ప్రచారం పట్టుకున్నట్లున్నావు? ఔను కాని, ఈ ఖద్దరు అమ్మితే బ్రిటిషువాళ్లని

పంపెపయ్యగలమనే అనుకుంటున్నారా మీరంతా?"

రామనాధం నిజం వొప్పేసుకున్నాడు. ఆ రోజు వుదయమే దువ్వూరి సుబ్బమ్మగారు ఖద్దరు మూట భుజానికెత్తేరు తప్ప అంతవరకూ అతడా

ఆలోచన కూడా చెయ్యలేదు.

"నేను స్వతంత్రంగా చేసిన మొదటి బేరం మీ యింటి వద్దనేనండి."

"మరీ పదిహేను రోజులనుంచీ ఏమి చేస్తున్నట్లు? ఏం చెయ్యాలనుకుంటున్నావు?"

రామనాధం ఇంకా ఏమీ నిశ్చయించుకోలేదు.

"నిజంచేత నేనీ పదిహేను రోజుల నుంచీ చూస్తున్నది నేనెరిగిన ప్రపంచమేనా అనిపిస్తూంది. మామూలు విషయాలు గాక ఏవేవో కొత్త

కొత్తవి చూసేననుకోకండి. నా చిన్నప్పటి నుంచీ చూస్తున్నవే. అయితే వానినీ దృష్టిలోంచి ఎన్నడూ చూడలేదు."

రంగనాధరావు శిష్యుని అనుభవాలను వినడానికి వుత్సహించేడు. అవన్నీ విని చాల ఆందోళన ప్రకటించేడు.

మంగమ్మ తన తల్లిదండ్రుల, అన్నదమ్ముల మధ్య నుంచి ఎక్కడికైనా పోయి చదువుకోవాలనుకొంటూంది. గ్రామాలలో చదువు సౌకర్యాలు

లేవు. ఉన్నవి వీలుగా లేవు.

స్వరాజ్యం ఏవన్నా చదవడానికి పుస్తకాలు కావాలని మూడు మైళ్ళ దూరం మనిషిని పంపింది. గ్రామాలలో పుస్తకాలు దొరకవు.

స్వయంగా తెప్పించుకోవడం అందరికీ సాధ్యం కాదు. అన్నీ తెచ్చుకోలేరు. ఆ లోటును గ్రంథాలయాలే తీర్చగలవు. కాని అవి వూళ్ళలో

లేవు. వున్నవి కూడా నిర్వహించే వాళ్ళు లేక మూలబడి వున్నాయి.

గ్రామాలలో కులం అహంకారాలు, సాంఘిక దురాచారాలూ చాలా బలంగా వున్నాయి. ఆ బాధ ఎదురవుతూనే వుంది. కాని దాని నుంచి బయట

పడలేకుండా వున్నారు.

మరీ ఘోరం. వూళ్ళలో వడ్డీ వ్యాపారస్తుల మూలంగా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. పల్లెటూళ్ళలో పరపతి సౌకర్యాలు

లేవు.

తన వూళ్ళో, తన చుట్టుపట్ల తాను చూసిన ఒకటి రెండు ఘటనలను దేశావసరాలనుగా వర్ణించడానికి అతనికేమాత్రం సందేహం

కలగలేదు.

నిజంచేత అతడు చూడనిదల్లా ఖద్దరు అవసరమే.

"గురువుగారూ! ఇంగ్లీషు వాళ్ళు తమ మిల్లు బట్టల మార్కెట్ ‌కోసం ఢాకాలో మస్లిను నేతగాళ్ళ బొటనవ్రేళ్ళు

నరికించేరంటారు. కావచ్చు కాని మా యింట్లో ఓ రాట్నం అటక మీద వుంది. అది అటక ఎక్కడానికి కారణం వేళ్ళు నరికించడం

కాదు. కళ్ళు పీకించడమూ కాదు. వ్యాపారం పోటీలో అది మూలబడింది. ఆ పోటీ అలా వుండగానే...."

రంగనాధరావు కూర్చుని వింటున్నవాడల్లా లేచి పచార్లు ప్రారంభించేడు.

"మీ గాంధీ దేశాన్ని కృతయుగం వేపుకు తిప్పాలనుకుంటున్నాడనుకోవాలి. అది జరిగే పని కాదు. గాంధీ వుద్యమానికి ఖద్దరు ఓ

'సింబల్‌' కావచ్చు. అంతేగాని, దేశం పురోగతికి మాత్రం దాని పాత్ర వుండదు. నువ్వు ఇన్ని ఘటనలు చెప్పేవు.

వానిని చూస్తే నీకు ఏమి అర్ధం అయింది?"

సాంఘికాదర్శాలూ, సంసార లక్షణాల యొక్క పద్ధతులూ, ధర్మాలూ పూర్తిగా మారవలసి వున్నాయంటూంటే రామనాధం ఆశ్చర్యంతో

వింటున్నాడు.

"వెనుకటి పద్ధతులూ, కట్టుబాట్లూ మధ్య జీవించలేమన్నమాట?"

వారం రోజులుగా తన్ను వేధిస్తున్న సమస్యలు గుర్తు వస్తూంటే రామనాధం తల వూపేడు.

"ఔను......"

హఠాత్తుగా వున్నట్లుండి రంగనాధరావు రామనాధం కట్టెదుట నిలబడ్డాడు

"రష్యాలో జరిగిన విప్లవం సంగతి ఏమన్నా విన్నావా?"

తాను దానిని గురించే అడగాలని వచ్చినట్లు రామనాధం చెప్పేడు.

"మా ప్రక్క ఊళ్ళో ఒక గుడ్డి ఆయన వున్నారు. ఆంధ్రపత్రికలో చదివి వినిపించుకున్న వార్తలన్నీ ఆయనకు జ్ఞాపకం.

మొన్న వాళ్ళింటికెడితే ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు. నాకు వొక్కటీ తెలియదు. అవన్నీ నేనూ చదివేను. కాని వానిని గురించి

ఆలోచించలేదు. వొక్క లెనిన్‌ పేరినడం తప్ప....."

లెనిన్‌ పేరు చెప్పినప్పుడు రంగనాధరావు తానాయనను చూసి కూడా మాట్లాడలేకపోయేనని చాలా విచారపడ్డాడు.

బ్రిటిష్‌ మ్యూజియమ్‌లో చదువుకొంటున్న ఒక బట్టతల మనిషిని చూపించి ఆయనే లెనిన్‌ అన్నారు.

ఆ రోజుల్లో సావర్కరు ఆలోచనలలో వున్న నేను ఆయన గురించి వినిపించుకోలేదు. రెండేళ్ళక్రితం హఠాత్తుగా ఆయన పేరు

పత్రికల్లో కనిపించింది. ఆయన రష్యాలో తెచ్చి పేట్టేడన్న దుష్టపరిస్థితుల వర్ణన బ్రిటిషు పత్రికలలో చదివినకొద్దీ

ఆయనతో ఆనాడు పరిచయం పెట్టుకోలేక పోయానేయని బాధపడుతున్నాను."

రంగనాధరావు పత్రికల్లోని వార్తలను ఏ విధంగా అర్ధం చేసుకోవాలో హుషారుగా చెప్పుకుపోతున్నాడు.

"రష్యాలో యంత్రాలు, బ్యాంకులు, భూములు అన్నీ జనపరం చేశామన్నారు. అంతవరకు వానిమీద అపార ధనం ఆర్జిస్తున్న వారంతా

మిగిలిన జనంతోపాటు పనిచేయవలసి వచ్చింది. కష్టపడి పనిచేయడం చేతగాక దేశం వదలి పారిపోయి వచ్చారు. ఆ దేశం చూడబోయిన

వారీ రెండు మూడేళ్ళలో ఎవరన్నా వుంటే వాళ్ళు తమ తమ దేశాలలోకెల్ల భాగ్యవంతులు, తమ మిత్రులూ, బంధువులూ ఈనాడు వీధిలో

అందరితోపాటు మంచు ఎత్తిపోయడం దగ్గిరినుంచి చేస్తున్నారని వినేసరికి భరించలేక పోతున్నారు. నానా అవాకులూ వ్రాస్తున్నారు."

ప్రాక్పశ్చిమ దేశాల అధ్యాత్మిక-భౌతికాదర్శాల సమ్మేళనం నేటి రష్యాలోని వ్యవస్థయని రంగనాధరావు అభిప్రాయం.

యూరపులో యంత్రాలమీద వుత్పత్తి చేస్తున్నారు. ఫలితంగా అంత వరకు ఉత్పత్తికి కేంద్రంగా వున్న కుటుంబ వ్యవస్థ అంతరించింది.

యంత్రాల రాకతో కుటుంబాలు, సంసారాలు విచ్ఛిన్నమైనాయి. యంత్రాలకు ప్రజలు దాసులయ్యేరు. ఏ కొద్దిమందో భోగభాగ్యాలతో

తులతూగుతూంటే జన సామాన్యానికి తిండిలేక, వసతిలేక మలమల మాడిపోతూన్నారు.

ఫలితంగా పెట్టుబడిదారులకీ, పాటకపు జనానికీ పోరాటం ప్రారంభమయింది. యూరపు అంతటా వుందది. ఈ పోరాటం ధనము, ఆర్థిక

వసతి, గృహ సౌకర్యము కలిగిస్తే తీరిపోయేది కాదు. సంసార నిర్మాణము, సాంఘిక నిర్మాణము అనేక క్లిష్ట సందర్భాలకు చెందిన

సమస్య యిది. ఇది కేవలమూ కూలివాడు రాజ్యాంగాధికారాన్ని పట్టుకొన్నంత మాత్రంతో తెమలదు. అధికారంలో వుండేవారివే కావు,

సామాన్య ప్రజలయొక్క సాంఘికాదర్శాలూ, సంసార లక్షణాల పద్ధతులూ, ధర్మాలూ పరిపూర్ణంగా మారాలి.

"రష్యాలో జరిగిన మార్పు అది."

"సంఘం ఆ విధంగా విచ్ఛిన్నమైపోనివ్వడం, దానికోసం మరో మార్గం వెతుక్కోడం కన్న అసలు యంత్ర నాగరికతను

నిరోధించడం....." అని రామనాధం తన ఆలోచనను సూచించాడు.

"మీ గ్రామాన్ని ఓ వారం రోజులు చూసి వచ్చి నువ్వు లోపంగా వున్నాయని బాధపడుతున్నవేమిటి? చెప్పగలవా?"

రామనాధం ఆలోచించేడు. ఒక్క నిముషం ఆగి రంగనాధరావే సమాధానము ఇచ్చేడు.

"నువ్వు దేని నుంచి తప్పించుకోవాలనుకొంటున్నావో ఆ యంత్ర నాగరికత సుఖాల కోసమే అలమటించేవు...."

రామనాధం విస్తుబోయేడు.

"ఔను నువ్వు తప్పించుకోలేవు. వెనక్కి తిరగలేవు. కొరడా చేత పుచ్చుకొని కాలధర్మం నిన్ను తరుముతూంది. తప్పించుకోలేవు.

కనక నువ్వు చెయ్యగలదల్లా యూరపులో మాదిరిగా ఆ మార్పు జనానికి అధిక దుఃఖకరం కాకుండా మార్గం చూడడం"

"ఏ విధంగా?.....రష్యాలో మాదిరిగానా? అది మాత్రం నిలబడుతుందని నమ్మకమేమిటి? వాళ్ళు మాత్రం సరియైన

పనేచేస్తున్నారనేమిటి...."

"దౌర్జన్యం దౌర్జన్యాన్ని సృష్టిస్తుంది."

కొల్లాయి గట్టితే నేమి? · 第 8 / 22 段