నాయకుడు కూడా ఏర్పడ్డాడు. ఆయన మీద మీ అందరికీ వుండుకున్న విశ్వాసం నాకు లేదు."
బావగారి అవిశ్వాసాన్ని పోగొట్టడానికి రామనాధం మాటమధ్యలోనే అందుకున్నాడు.
"మనదేశంలో విదేశీయుల పరిపాలన వున్నదనీ, దానిని తొలగించి మన పరిపాలనను మనం సాగించుకోవడం అవసరమనీ వొప్పుకుంటారా?"
చంద్రశేఖరం చరిత్రాధ్యాపకుడు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇప్పుడీ దేశంలో వుంటున్న ప్రజల పూర్వీకులంతా బయటినుంచి వచ్చిన
వాళ్ళే. ఇచ్చటి ఆదివాసులీనాటికీ ఆదివాసులుగానే వుండిపోయారు. ఈ గడ్డ దురదృష్టం ఏమిటోగాని విజేతలుగా వచ్చినవాళ్ళు తమ
తరువాత వచ్చిన వాళ్ళ చేతుల్లో ఓడిపోతూండడమే చరిత్రలో పొడుగునా కనిపిస్తుంది. ఈ గడ్డమీద స్వతంత్రం అనుభవించడం
ఎన్నడూ జరగనేలేదని అతని అభిప్రాయం.
ఆ వాదనలను ఖండిస్తున్న అనేకమంది వుపన్యాసాలను రామనాధం విన్నాడు. దేశంమీద దండెత్తిన వాళ్ళని ప్రతిఘటించిన వారి
చరిత్రలూ, స్వాతంత్య్రం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహావ్యక్తుల కధలూ విన్నాడు. కాని, ఆ వీరచరిత్రలు ఆ
చరిత్రాధ్యాపకుడికి సంతృప్తి కలిగించలేదు.
రామనాధం ఈమారు చరిత్రకి అర్థశాస్త్రం కూడా జతపరిచేడు.
వెనుకటి రోజుల్లో దేశాన్ని ఎంతమంది ఆక్రమించినా వాళ్ళు తమ తరంలోనే దేశంలో స్థిరపడిపోతూ వచ్చేరు. వాళ్ళూ దేశీయులే
అయిపోయారు. ఆఖరున వచ్చిన ముసల్మానులు కూడా ఇక్కడ వాళ్ళలోనే కలిసిపోయారు. ఇదే తమదేశం అనుకున్నారు. ఇక్కడి
వాళ్ళతోపాటే కష్టసుఖాలు పంచుకొంటున్నారు.
"కానీ ఇంగ్లీషువాళ్ళు అల్లా కాదు. వాళ్ళకీ దేశం రావడం డబ్బు సంపాదనకో మార్గం. ఆ లాభం దేశం నుంచి దండుకుపోతున్నారు. మన
దేశం అంతకంతకు దరిద్రంలో కూరుకుపోతూంది...."
రామనాధం గోల్డ్ ఎక్సేంజి స్టాండర్డు గురించీ, కౌన్సిలు బిల్లులూ, రివర్స్ కౌన్సిల్ బిల్లుల
మోసం గురించీ చెప్పుకుపోయేడు.
"స్వరాజ్య సంపాదనమే దీనికి మంచి మందు".... అని తేల్చేడు.
గోల్డు స్టాండర్డు వగైరా పితలాటకాన్ని చిన్న చిన్న వుదాహరణలతో చక్కగా చెప్తూంటే ఇంతసేపటినుంచీ కట్టుగుడ్డలు చూసి
తేలికగా భావించిన లెక్చరర్లందరూ దగ్గిరికి చేరేరు ఒక్కొక్కరు. ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నారు. పంజాబు దురంతాలూ,
జలియన్వాలాబాగ్ హత్యలూ కథోపకథనంతో వస్తున్నాయి. చంద్రశేఖరం సంకోచంలో పడ్డాడు.
"లేవండి వెడదాం."
ఇద్దరూ రోడ్డుమీదికి వచ్చేరు.
"మన ఇంటికి వెడదాం."
రామనాధం అలవాటులేమిని ఒక్క క్షణం తటపటాయించేడు.
చంద్రశేఖరం అతని ముఖం వంక చూసేడు....
"అనుమానమేమన్నా వుందేమిటి?"
రామనాధం సర్దుకొని "అటువంటిదేమీ లేదు" అన్నాడు.
"అంత అభ్యంతరం వుంటే భోజనానికి మళ్ళీ వచ్చేద్దువుగాని ఇక్కడికే. ఇంటికి రావడానికేం పోతుంది?"
మనస్సులో బెగటు, హేళన వగైరాలు లేకుండా అంత సరళంగా సంఘంలోని తన స్థితిని అంత నిర్వికారంగా తీసుకోగలిగిన
చంద్రశేఖరాన్ని చూస్తూంటే రామనాధానికి సిగ్గు కలిగింది.
చంద్రశేఖరం ఏ కులానిదో తెలియని అనాథశరణాలయపు అమ్మాయిని పెళ్ళి చేసుకొన్నాడు. వారిద్దరూ కలిసి చదువుకున్నారు. ఇద్దరూ
చెరో ఉద్యోగమూ చేసుకుంటూ జీవిస్తున్నారు. అతడా పెళ్ళి చేసుకొన్నాక బంధువులు యావన్మందీ తల్లీ తండ్రితో సహా అతనిని
వెలిపెట్టేరు. ఇంటికి రానివ్వకూడదనుకొన్నారు. అతడూ వారికా అవకాశం కలిగించతలచుకోలేదు. అటు తర్వాత తల్లిని చూడ్డానికి
కూడా ఇంటికి వెళ్ళలేదు.
అగ్రహారంలో పుట్టిపెరిగిన రామనాధానికి కులాంతరంలో వివాహాలు అనూహ్యం. కులాంతరులతో సంబంధాలు కలవాళ్ళని చాలామందిని చూసేడు.
తన పెదతండ్రే వున్నాడు.
అయితే ఆ స్త్రీలతో వారి సంబంధం పడకగదికి మాత్రమే పరిమితం. వాళ్ళ చేతినుంచి మంచినీళ్ళు కూడా తీసుకోరనేది ఓ సంతృప్తి.
కాని ఇక్కడి స్థితి వేరు. చంద్రశేఖరం ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. ఆమె వంట తింటున్నాడు. అది గొప్ప అపరాధం, అనాచారం
అని శంకరశాస్త్రి కొత్త రోజుల్లో పరవళ్ళు తొక్కేడు.
అన్నగారు మరో కులం పిల్లను పెళ్ళి చేసుకొన్నాక ఆ చెల్లెల్ని ఇంకా కోడలుగా స్వీకరించవచ్చునా అనే విషయం మీద తమ ఇంట్లో
కొన్నాళ్ళు చర్చలు జరగడం రామనాధం ఎరుగును. ఆ ఆలోచనలను రామనాధం ఆనాడే హర్షించలేదు.
పెళ్ళి అయినాక ఏవో పనులమీద చంద్రశేఖరం రాజమండ్రి వచ్చేవాడు. చెల్లెలి భర్త మీద అతనికెంతో అభిమానం. వచ్చినప్పుడు
తప్పకుండా అతనిని కలుసుకొనేవాడు. హోటలులో పొత్తిపంచె కట్టుకొనే రామనాధం భోజనానికి కూర్చున్నా, బావతో సహపంక్తిని
కూర్చోడానికెన్నడూ ఆలోచించలేదు.
--అయితే అతని తల్లిదండ్రుల ఆచారపు ఆలోచనలు వీధిదాకా రాకుండానే ఆగిపోయాయి. దానికి కారణం నారాయణమూర్తి బహుశ్రద్ధగా
సాగించే లలితా ఉపాసనా కాదు, రామనాధాన్ని ఇంగ్లండు పంపుతాడన్న ఆశా కాదు. పోలీసు ఉద్యోగి దుర్దాంత కోపభయం ఆ ప్రమాదాన్ని
తప్పించింది.
ముంగండలో ఒకరిద్దరు ఆ సమస్యను తీసుకురా ప్రయత్నించినా శంకరశాస్త్రి ఉపద్రష్ట జగన్నాధ పండితరాయలు మొగలుదర్బారులోని
రాజనర్తకిని దర్జాగా పెళ్ళిచేసుకొని చెప్పిన శ్లోకాలని రాగవరసలో చదివి వినిపించి నోరు మూయిస్తూ వచ్చేడు.
ఈ వాదోపవాదాలనూ, చర్చలనూ చంద్రశేఖరం వినలేదనుకోలేము కాని, అవేవీ అతని మనఃస్థైర్యాన్ని కదిలించలేదు. తన రాకకు
ఇబ్బంది పడనివారి ఇంటికే అతడు వెడతాడు. తన ఇంటికి రావడానికి అభ్యంతరం లేకుంటేనే పిలుస్తాడు. ఇంటికి వచ్చేకకూడా
అడిగితేనేగాని మంచినీళ్ళు కూడా ఇవ్వడు. మంచినీళ్ళు త్రాగేటందుకు సందేహం కనబరచినా అతడు నొచ్చుకోడు.
ఆ నిర్వికార స్థితి చూసి రామనాధం సిగ్గుపడ్డాడు. అలవాటు లేకపోవడం తప్ప అభ్యంతరం ఏమిటో అతనికి తెలియదు.
"అబ్బెబ్బే! అదేమిటల్లా అంటారు? నా వరకు అటువంటి పట్టింపులేమీ లేవు" అన్నాడు.
"మరి......?"
"ఏమీలేదు. రావడమే....."
"నీ సామాను ఎక్కడుంది?....."
"రుక్కమ్మ హోటలులో పడేశాను."
"నేనిక్కడే వుంటాను. వెళ్ళి తీసుకొచ్చెయ్యి. నీతో నన్ను కూడా చూసిందేమో, మరి నీకెప్పుడూ మంచినీళ్ళు కూడా ఇవ్వదు."
ఇరవయ్యయిదు
లెవల్ క్రాసింగ్ అవతల కొద్ది దూరంలో సర్పవరం రోడ్డుమీద, విశాలమైన ఆవరణలో లోపలగా
కనిపిస్తున్న చిన్న బంగాళా పెంకుటింటి ముందు ఆగింది బండి.
"బావగారూ, దిగండి" అంటూ చంద్రశేఖరం ముందు దిగేడు. "బెడ్డింగు లోపలకి తీసుకురావయ్యా" అని బండి అతనికి పురమాయిస్తూ
"అదే మా దివ్యభవనం" అన్నాడు.
కోరడి గుమ్మానికి ఓ పాతికగజాల దూరంలో వుంది యిల్లు. అక్కడి వరకూ దారికి అటూ ఇటూ పలు ఛాయలలో ముద్దబంతిపూలూ,
చంద్రకాంతలూ, బంగాళాబంతిపూలూ బరాబరులు చేస్తున్నాయి.
కన్నుల పండువుగా వున్న ఆ దృశ్యాన్ని చూసి రామనాధం సంతృప్తి వెలిబుచ్చేడు.
"చక్కగా, ప్రశాంతంగా వుంది."
"కదూ" అని చంద్రశేఖరం ఎంతో సంతృప్తి ప్రకటించేడు.
"సునందకి పువ్వులంటే మహా ప్రాణం."
"ఆమె ఇంట్లో లేరు లాగుంది" ద్వారానికి తగిలించి వున్న తాళం చూస్తూ రామనాధం అన్నాడు.
"వుద్యోగం చేస్తోంది కదా. ఈవేళ నేను పెందరాళే వచ్చేను. గాని సాధారణంగా ఇద్దరం కలిసే వస్తుంటాం."
"మరి పిల్లవాడు?"
భార్యాభర్తలిద్దరూ వుద్యోగాలు చేస్తే పిల్లలూ, ఇల్లూ ఏమిటవుతాయనే ప్రశ్నను ఎలా పరిష్కరిస్తున్నారో రామనాధం
తెలుసుకోగోరేడు. ఆడవాళ్ళు చదువుకోవాలనీ, వుద్యోగాలు చెయ్యాలనీ తానెప్పుడన్నా అంటే తన మిత్రులు ఈ బ్రహ్మాండమైన సమస్య
తెచ్చి నోరు నొక్కేస్తున్నారు.
దగ్గరలోనే ఓ ముసలమ్మ వుంది. ఆమెకు నెలకు ఏదో ఇస్తూంటారు. ఆమె చూస్తూంటుంది. కానీ...
చుట్టుప్రక్కల యిళ్ళేం లేవు. ఒంటరితనం అనిపించదూ? ఆడా, మగా కూడా ఇల్లు వదిలిపోతే ఎల్లాగ? దొంగల బెడద వుండదా?
కాలేజీకి దూరం అయింది. రోజూ బళ్ళకి బోలెడు అయిపోతుందే? అనంత సందేహాలు.
బాగుందనే యింటిక్కూడా అనేక ఈతిబాధలు.
చంద్రశేఖరం నవ్వేశాడు. అతడు దూరంగా, ఈ ఒంటరి కాపురమే బాగుందనుకున్నాడు.
"ఏదో పోదూ, వాళ్ళనడుమ అనుకోవడమేగాని అక్కడుండేదంతా కశ్మలం."
అందని ద్రాక్షపళ్ళ రుచిలాంటి మాటకాదని ఆ యిల్లు చూస్తూనే రామనాధం గ్రహించేడు. మురుగుకాలవలూ, దుర్వాసనా లేదు. శుభ్రమైన
గాలి.
చంద్రశేఖరం చెప్పిన కశ్మలం ప్రాదేశికమే కాదు, ప్రజల మనస్సుల్లో వున్నది కూడా అతడి వుద్దేశంలో వుంది.
నిజమే. అతడు కులం తెలియని పిల్లను కట్టుకున్నాడు. కులం బలం మీద ఏర్పడిన సంఘం మధ్య వారికి నిలవ నీడ దొరకడం
కష్టం.
"అదీ నిజమేలెండి" అన్నాడు. "ఇంత అందమైన చోట వుంటే అన్నం, నీళ్ళూ కావాలనిపిస్తుందా?" అంటూ అతడు పువ్వుల మొక్కలు
చూస్తూ మురిసిపోయేడు.
అగ్రహారం ఇళ్ళల్లో కూడా ఏవో పువ్వుల మొక్కలుంటాయి. ములుగోరింట అక్కడ మహాపుష్పం. దేవపూజకి పది పవ్వులుంటాయి.
అంతకన్నా కాస్త శ్రద్ధగల వాళ్ళు ఓ నందివర్ధనమో, కరవీరమో, పారిజాతమో వేస్తారు. దేనికైనా ప్రయోజనం ఒక్కటే.
పువ్వులు పూజ కోసం. కనక తెల్లవారే సరికి మొక్కలన్నీ బోడిగా కనిపిస్తాయి.
ఇక్కడ ప్రతి మొక్కకీ ఒకటో రెండో పువ్వులున్నాయి. రంగు రంగుల పువ్వులు.
మొక్కలకు సమీపంగా వరల నుయ్యి. బారెడులో నీరు. రామనాధం చేద వేసేడు.
"నీరు బాగానే వుంది."
"ఈ నీరే మేము త్రాగేది"
ఇద్దరూ కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి ఇంట్లోకి వచ్చేరు.
ఇద్దరూ హాలులో వున్న కుర్చీలలో కూర్చున్నారు. చంద్రశేఖరం ఇంక మళ్ళీ మొదటికి వచ్చేడు.
"ఏమిటో ఇప్పుడు చెప్పు, కాలేజీ ఎందుకు మానినట్లు?"
రామనాధం చెప్పినంతసేపూ అతి జాగ్రత్తగా విన్నాడు. చివరకు ఒక్క ప్రశ్న వేసేడు.
"గురజాడ అప్పారావుగారనే ఆయన ఒక దేశభక్తి గీతం వ్రాశారు విన్నావా?"
రామనాధం వినలేదు. తలతిప్పేడు.
"అందులో ఆయన మీరంతా చెప్పే దేశం అంటే ఏమిటో చెప్పేరు."
"ఏమన్నారు?"
చంద్రశేఖరం గురజాడ కవి గీతం వినిపించేడు.
"దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుజులోయ్"
రామనాధం కళ్ళు విప్పారితాలయ్యాయి. ఎంత గొప్ప భావం.
బంకించంద్రుడు ఆనందమఠంలో దేశానికి జోహారులర్పించిన గీతం నేడు ఒక మహోద్యమానికే తలకట్టయింది.
గురజాడకవి దృష్టిలో దేశంలోని జనతే దేశం. ఎంత ఆత్మీయత.......
"పద్యం అంతా చదవండి."
చంద్రశేఖరం జ్ఞాపకం వున్నంత వరకు చదివేడు. రామనాధం ఆలోచనలో పడ్డాడు.
"చాలా వుదాత్తంగా వుంది."
చంద్రశేఖరం ఒక్కక్షణం వూరుకొని, అతడు ఆలోచించుకొనేటందుకు అవకాశం ఇచ్చేడు.
రామనాధం గీతం చరణాలు గుర్తుచేసుకుంటూ పాడుతున్నాడు.
"స్వంతలాభం కొంతమానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్.
--బ్రహ్మాండమైన వూహ."
ఆ పద్యంలో రామనాధాన్ని ఆకర్షించిన చరణం వింటూనే చంద్రశేఖరం విస్తుపోయేడు.
"మీరు నా చెల్లెలి భర్త కనక చెప్పవలసిన బాధ్యత కొంత నాకూ వుందనుకుంటున్నాను."
"తప్పేం వుంది?"
"మన దేశాన్ని వుద్ధరించడానికి చదువులెందుకు మానుకోవాలి? నాకర్థం కావడంలేదు. చదువు విజ్ఞానం కలిగిస్తుంది. అజ్ఞానం
అభివృద్ధిని ఎలా సాధిస్తుంది?
ప్రజలలో విపరీతమైన మూఢాచారాలు, అజ్ఞానపుటలవాట్లూ పాతుకు పోయి వున్నాయి. అంటురోగాలూ, కులమత కలహాలతో జాతి అంతా
చివికి, శిథిలం అయిపోతూంది. వాళ్ళ అజ్ఞానం పోవాలి. కులాచారాల మూర్ఖపు కట్టుబాట్లు పోవాలి. దానికి విద్య, ఆధునిక విద్య
ఒక్కటేదారి..... అదీ ఆయన అభిప్రాయం.
ఈ వారం పదిరోజులలోనూ ఈ ప్రశ్న అనేక రూపాలలో చర్చకు వచ్చింది. పాఠాంతరాలతో ప్రత్యక్షమయింది. అనేక కోణాలనుంచి
రామనాధం దానికి సమాధానాలనిచ్చేడు.
ఇంగ్లీషు చదువుకోని మన పూర్వులు అజ్ఞానులా?......కాదు.
వేల సంవత్సరాలుగా భారతదేశం అనేక నాగరికతలను కళ్ళ చూచింది. ఔను.....
ఆ మాటలనెవ్వరూ కాదనలేదు. చంద్రశేఖరమూ అనడం లేదు.
"కాలేజీ చదువూ, ఇంగ్లీషు చదువూ మాత్రమేనా విజ్ఞానం కలిగించేది?" అనే ప్రశ్నకు మాత్రం "తప్పకుండా"-- "సందేహం
ఏముందీ?"-- "ఇంకా అనుమానమా?" వంటి సమాధానాలనే ఇచ్చేడు.
"ఆధునిక విజ్ఞాన శాస్త్రాలలో వాళ్ళు నిధులు"--అన్నాడు.
రామనాధం దానిని అంగీకరించలేదు. వాళ్ళకి విజ్ఞాన శాస్త్రాల పరిజ్ఞానం వుంటే మాత్రం మనకేం వొరుగుతుందన్నాడు.
"తమకు కావలసిన గుమస్తాలను తయారు చేసుకొనేటందుకు విదేశ పాలకులు తయారుచేసిన పథకం కాదా యిది, మెకాలే...."
"మెకాలే ఏమన్నా అననీ, అనుకోనీ. వాళ్ళు ఏ వుద్దేశంతో ఈ చదువులు ప్రవేశపెట్టినా, ఆ చదువులే మన కళ్ళు తెరిచాయి."
అది చంద్రశేఖరం అచంచల విశ్వాసం-- "గురజాడ కవి చెప్పినట్లు దేశం అంటే ప్రజ. దేశం బాగుపడడం అంటే ప్రజలు
బాగుపడటం. వాళ్ళలో విజ్ఞానం కలగాలి. మూఢాచారాలు పోవాలి. అప్పుడే ప్రజలు, దేశం బాగుపడుతుంది."
అంతవరకే అయితే రామనాధానికీ అభ్యంతరం లేదు. "కాని, అదొక్కటే కర్తవ్యం అంటే ఎల్లాగ?"
రామనాధం అతని మాటలనే మరొక దృక్కోణంలోంచి వివరించి చంద్రశేఖరం వాదాన్ని అతనికే ఎదురుతిప్పేడు.
దేశం అంటే ప్రజ. ప్రజలు బాగుపడడమే దేశం బాగుపడడం. ఈవేళ దేశం మహా దారిద్య్రంలో వుంది. తిండిలేనివాడు చదువు ఏం
చదువుతాడు? వానికి తిండి కలిగించాలి. తిండిలేకుండా చేస్తున్న ప్రభుత్వాన్ని తొలగించాలి. అందుకే గాంధీజీ ఖద్ధరు ఉద్యమమూ,
సహాయనిరాకరణమూ అన్నారు--అని అతని వాదం.
సమస్య మెలితిరిగింది. ఏది ముఖ్యం? కడుపునకు తిండా? మెదడుకు పుష్టియా? ఏది ముందు? ఏది వెనుక?
ఆంగ్లేయుల వైజ్ఞానిక సంపదమీద బావగారికిగల అభిమానాన్ని తగ్గించేటందుకు రామనాధం ఎత్తుకున్నాడు.
"మన పూర్వులు చాలా మేధావంతులు. పాశ్చాత్యులు నేడు సాధించేమన్న శాస్త్రజ్ఞానం మనవాళ్ళకి ఏనాడో వుంది...."
చంద్రశేఖరం చిరునవ్వు నవ్వేడు.
"వారి శాస్త్రపరిజ్ఞానము గురించి ఈవేళ కొలతలు తియ్యడం సాధ్యం కాదు. కనక వొప్పేసుకొందాం. పేచీలేని పని, కాని బావా!
ఈనాడు మన స్థితి ఏమిటి? మా తాతలు నేతులు త్రాగేరు. మా మూతులు వాసన చూడమనా?"
రామనాధం తన వుత్సాహం నుంచి ఇంకా తేరుకోలేదు.
"మనం మహాభారత యుద్ధ కాలం నాటికే....."
"ఇంగ్లీషువాళ్ళకి గోచీ పెట్టుకోవాలనే జ్ఞానం కూడా లేదు...." అని చంద్రశేఖరం ఆ భావాన్ని పూర్తి చేశాడు.
"కాదంటారా?"
"ఎందుకనాలి? ఎంతో ఆలస్యంగా మేలుకున్నా వాళ్ళు మనల్ని మించిపోయేరు."
రామనాధం ఆ మాటల్ని అంగీకరించే ధోరణిలో లేడు. ప్రాచీన కాలంలోనే భారతీయులు నౌకలపై దేశవిదేశాలతో వర్తక వాణిజ్యాలు,
సంస్కృతీ ప్రచారం సాగించిన కథల నాతడెన్నింటినో చదివేడు. వేలి వుంగరంలోంచి ఏడెనిమిది మూరల కట్టుబట్ట దూర్చేటంతటి సన్న
వస్త్రాలు తయారుచేసిన నిపుణుల కథలూ చదివేడు. విన్నాడు. తాజ్‌మహల్ వంటి సుందర నిర్మాణం అనాగరికుల
పనా?
చంద్రశేఖరం నవ్వేడు.
"తాజ్‌మహల్‌ను నిర్మించిన శిల్పిని గురించి కాదు, మనం మాట్లాడుతున్నది. ఈనాడు ఈ దేశపౌరులమయిన మన
స్థితి ఏమిటని ప్రశ్న."
రామనాధం వెనకడుగు వేయనే లేదు.
"ఆధ్యాత్మిక సంపదలో మనం వాళ్ళకన్న చాలా ఉన్నత దశలో వున్నాం."
నిజంగా నమ్మకంతోనే చెప్తున్నావా ఆ మాట అన్నట్లు చంద్రశేఖరం నిశితంగా చూసేడు.
"మన ఆధ్యాత్మిక సంపద ఏ మాత్రం పటిష్ఠంగా వుందో మీ గాంధీగారి అస్పృశ్యతా నివారణ ప్రయత్నాలకు లభిస్తున్న ఆదరణ
చెప్పడం లేదూ?"
రామనాధం ఉడికిల్లేడు.
"తెల్లవాళ్ళు దక్షిణాఫ్రికాలో అల్లాంటిపనే చెయ్యడం లేదూ?"
"గాంధీగారిని దర్బాన్‌లో అవమానించేరు గనక ప్రతీకారంగా ముంగండ చెరువులో పంచములని మంచినీళ్ళు ముట్టుకోకూడదని నిషేధం
పెట్టేరా?"
తన వరకూ, తన గ్రామం వరకూ వచ్చేసరికి రామనాధం చల్లబడ్డాడు. చంద్రశేఖరం వెంటనే సర్దుకొన్నాడు.
"మన లోపాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడంలో తప్పు లేదు. ఆ ప్రయత్నంలో మన లోపాల్ని దిద్గుకోగలమనే ధైర్యం వుంటుంది.
వెనుకటి రోజులు తలుచుకొని, మురిసిపోవడం మన పతనానికి ఒక మెట్టు. మనం నేర్చుకున్న మంచినికూడా మరచిపోడానికి అది ఒక
దారి...."
అంటూ తన ముఖంలోకి చూస్తుంటే ఆ మాటలలో ఏదో ప్రత్యేకమయిన అర్థం వున్నట్లనిపించింది.
ఉదాహరణకి... అంటూ చంద్రశేఖరం తన జేబులోంచి ఒక శుభలేఖ తీసి చేతికిచ్చాడు.
రామనాధం చదివి తిరిగి ఇచ్చేశాడు. తాను మాట్లాడడానికి వచ్చిన సమస్యను ఎలా ప్రారంభించాలో అర్థంగాక
కొట్టుమిట్టాడుతున్నవాడికి దారి దొరికినట్లయింది.
"ఔను."
"చూడు, నీ పెండ్లికి పూర్వమూ, తర్వాతా కూడా నాతో కొన్ని విషయాల మీద చర్చ వేసుకొన్నావు. జ్ఞాపకం వుందా?"
తొమ్మిది పదేళ్ళ చెల్లెలికీ, పదిహేను, పదహారేళ్ళ వయస్సున్న తనకూ వివాహం కుదిర్చింది చంద్రశేఖరమే. అప్పుడు తాను
అమలాపురం హైస్కూలులో చదువుతున్నాడు. ఓ రోజున ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తన్ను చూసేడు. పరిచయం
అయింది. ఆ క్షణం నుంచి తమకు పెళ్ళి కావడానికి పదిహేనురోజులే వ్యవధి. ఆ పదిహేనురోజులూ అతడు తన్ను విడువలేదు.
పెళ్ళిళ్ళ వయస్సు గురించి తాను చెప్పినవన్నీ అతడు ఒప్పుకొన్నాడు. తాను చిన్నతనపు పెళ్ళిళ్ళంటే అయిష్టం చూపించేడు. అయినా
తాను మెత్తబడ్డాడు. దానికి చంద్రశేఖరమే ప్రధాన కారణం.
తాను పెళ్ళిచేసుకోవాలనే ప్రయత్నంలో ఆయన తనను పెళ్ళికి వొప్పించేడని తర్వాత అనుకొన్నాడు. లేకపోతే సుందరికి పెళ్ళి కావడం
సాధ్యం కాదు. అన్న కులాంతరురాలని పెళ్ళి చేసుకోవడం ఆమె పెళ్ళికి పెద్ద ఆటంకం అయి కూర్చుంటుంది. అందుకే తన్ను వొప్పించేడు.
ఇరవయ్యేళ్ళు వచ్చేక మగవాడు పెళ్ళి చేసుకొంటానంటే స్త్రీకి 15-16 ఏళ్ళుండాలిసుంటుందని వాదం తెచ్చాడు. సంఘంలో పదేళ్ళకుమించి
ఆడపిల్లల్ని వుంచడం లేదు, గనక ఇరవయ్యేళ్ళవాడు తనకంటె పది పన్నెండేళ్ళ చిన్నపిల్లను కట్టుకోవలసి వుంటుంది. అది
సరికాదన్నాడు.
ప్రస్తుత స్థితిలో పెళ్ళికి ప్రధానంకన్నా విలువలేదన్నాడు. సంసారం ప్రారంభించడం ఇరవయ్యేళ్ళు దాటాకనయితే తన విశ్వాసం
నిలబడ్డట్లేనంటూ ఒక్క ప్రశ్న వేసేడు.
"నీకు నా చెల్లెలు నచ్చిందా?"
నచ్చడం ఏమిటి, చాలా బాగా నచ్చిందనుకొన్నాడు రామనాధం.
"ఊ."
"అయితే చేసుకో. లేకపోతే మా నాన్న వుంచడు. పెళ్ళికాక పూర్వమే రజస్వల అయిపోతే ఆయన పూర్వులకు పుట్టగతులుండవని
ఆయన భయం."
సుందరి కావాలనుకొంటే తాను వెంటనే పెళ్ళిచేసుకోవలసిందేనన్నాడు. వాయిదా వేయడం ఆమె మీద ఇష్టం లేదనుకోవాలన్నాడు.
పదిహేనేళ్ళవాడికి పదేళ్ళ పిల్లమీద ఇష్టం వుండడం, లేకపోవడం ఏమిటో ఆతడు ఆలోచించగల స్థితి లేదు. ఊళ్లో వున్న
ఆడపిల్లలకన్న సుందరిలో ప్రత్యేకత ఏమిటో తెలిసే వయస్సూ, అనుభూతం అయ్యే వయస్సూ కాదు. కాని సుందరిని
చెయ్యిజారిపోనీకూడదనుకున్నాడు.
సరేనన్నాడు.
ఆనాడు తొందరపెట్టినవాడు ఈ రోజున "సుందరి వయస్సెంత? నీ వయస్సేమిటి?" అంటున్నాడనిపించింది.
"చదువు పూర్తి చేసుకోకుండా అప్పుడే సంసారం ఏమిటి?" అన్నాడు చంద్రశేఖరం.
"ఆ విషయం మీతో మాట్లాడాలనే వచ్చేను. మీ చెల్లెలు చిన్నపిల్ల, నేనూ ఆ మాటే అన్నాను. ఇప్పుడు కాదంటే విపరీతార్ధాలు
తీస్తున్నారు. మగతనం లేక టలాయిస్తున్నానంటారంటారు బాబాయి. ఆ పిల్ల అంటే ఇష్టంలేక టలాయిస్తున్నానంటారు పెద్దనాన్న."
అదంతా చిత్రంగా వినిపించింది చంద్రశేఖరానికి.
"నువ్వు మా నాన్నగారితో చెప్పకపోయావా? చెప్పించకపోయావా?"
"నా అభ్యంతరం మా బాబాయి తెలుపుతారనుకొన్నాను. తెలుపమన్నాను. కాని మీ వుత్తరం చూస్తే చెప్పినట్లు లేదు. లేక చెప్పినా
లెక్క చెయ్యలేదో. పరిస్థితులు చెప్పి మీ నాన్నగారికి వ్రాయించడానికే వచ్చేను."
"ఇష్టం-అయిష్టం మాటెందుకు వచ్చింది?" అని చంద్రశేఖరం ముందుమాట గుర్తు చేసుకొన్నాడు.
"నేను సహాయనిరాకరణం చేశాను."
"అయితే?"
"మీ నాన్న పోలీసు ఆఫీసరు. బ్రిటిష్‌వాళ్ళ వుద్యోగి."
"ఓహో."
సావధానంగా జరిగిందంతా విన్నాక చంద్రశేఖరం అసలు పరిస్థితి అర్ధం అవుతూందనుకొన్నాడు. కాలేజీ మానడానికీ, ఈ శుభకార్యం
తలపెట్టడానికీ ఎక్కడో సంబంధం వుందనిపించింది. కానీ, అదెటువంటిదో అర్థం కాలేదు.
అయితే చంద్రశేఖరానికి తండ్రి స్వభావం తెలుసు. అల్లుడు సత్యాగ్రహం చేస్తే తన వుద్యోగానికి ఏం ప్రమాదమోనని భయపడే
మనిషి. అదొక్కటే అయితే ఒక విధం. బ్రిటిష్ పరిపాలన పోవాలనే వాళ్ళు వట్టి సన్యాసులని ఆయన ఖచ్చితమైన
అభిప్రాయం.
ఆయన తన కూతుర్ని సత్యాగ్రహి అల్లుడి దగ్గరకు కాపురానికి పంపనన్నాడంటే నమ్మగలడు. కాని ఇదేమిటి? తన
అలవాట్లకూ, అభిప్రాయాలకూ విరుద్ధంగా ఈ కార్యం తలపెట్టడం ఏమిటి? ఈ తొందర ఎందుకు? అల్లుడు కాలేజీ మానినట్లెరగడా?
చెప్పలేదన్నాడు రామనాధం. అతడింతవరకు అమలాపురం వెళ్ళనే లేదు.
"కాని తెలియకుండా వుండడం సాధ్యం కాదు. ఆ అవసరం మాత్రం ఏముంది?" అన్నాడు.
చంద్రశేఖరం ఆలోచించేడు. ఆయనకు తెలియకుండా వుండడం సాధ్యం కాదు. ఇంకా గొడవయ్యాకనయితే కూతురు కాపురం చెడుతుందని తల్లి
చేసిన ఏర్పాటేమోననిపించింది. ఆలోచించిన కొద్దీ అదే స్థిరపడింది. 'అంతే' అనుకొన్నాడు.
ఇరవయ్యారు
వంట మధ్యలోనే సునంద వచ్చేసింది. గుమ్మంలోంచే పలకరించింది.
"ఈ వేళ బాగా పొద్దుగల్లనే వచ్చేశారన్నారు. ఎక్కడికెళ్ళేరో అనుకున్నా" నంటూ ఆమె సావట్లో అడుగుపెట్టింది.
అక్కడ భర్తతో మరొకరు కూడా వుండడం గమనించి ఒక్కక్షణం ఆగింది.
ఆమె మాట వినబడగానే చంద్రశేఖరం సంతోషంతో లేచేడు.
"అదిగో ఆమె కూడా వచ్చేసింది" అంతలో గుమ్మంలోపల అడుగుపెట్టి ఆమె నిలబడిపోవడం చూసి నవ్వేడు.
"నందా! ఈతడెవరో ఎరుగుదువా?" అన్నాడు.
సునంద లోనికి వచ్చి చేతులు జోడించి, నమస్కారం చేసి తనకు తెలియదన్నట్లు తల తిప్పింది.
చంద్రశేఖరం నవ్వేడు. రామనాధం లేచి తానే పరిచయం చేసుకొన్నాడు.
"మీరు నన్నెరగరు. రామనాధం నా పేరు. వీరి చెల్లెల్ని....."
చంద్రశేఖరం మాట మధ్యలోనే అందుకొని "మా చెల్లెలి మగడు." అన్నాడు.
"శేఖరం గారు చెప్తూంటారు. వినడమేగాని చూడలేదు" అంది పరిచయం లేమికి క్షమాపణ చెప్పుకొంటున్నట్లు.
శేఖరం అంటే ఎవరో అతనికి అర్థం కాలేదు. అలవాటులేమిని భర్తనే ఆమె పేరున పిలుస్తూందని తోచలేదు. "శేఖరంగారు ఎవరు?"
అన్నాడు.
"మీ బావగారే. రోజూ ఓమారేనా మీ ప్రసక్తి తెస్తూంటారు. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో మొట్టమొదటి మారు
బంతి అందివ్వడం అందుకోవడంతో మీకు పరిచయం అయిందిట కదూ."
రామనాధం నవ్వేడు.
"మరిచిపోలేదన్నమాట" అన్నాడు చంద్రశేఖరం వేపు చూస్తూ.
"ఎల్లా మరిచిపోతాను. ఆ చిన్న వూళ్ళో అంత ఆటగాడు కనబడతాడనుకోలేదు"
"అదేమిటండీ, అమలాపురం హైస్కూలు జట్టుకు ఫుట్‌బాల్‌లో జిల్లాలు దాటి పేరుంటేను."
"ఇప్పుడే వస్తున్నా, కూర్చోండి" అంటూ వారిని కబుర్లకి వదిలేసి సునంద లోనికి వెళ్ళింది.
ఆమె పదినిముషాలలో వచ్చినప్పుడు కొత్త మనిషిలా కనబడి రామనాధం ఆశ్చర్యంగా చూసేడు. అంతకు పూర్వం ముఖంలో కనిపించిన
నలుగుడు, అలసట అంతర్ధానమయ్యేయి. ముఖంలో దీప్తి, హుషారు కనిపించాయి. బట్టలు మారిపోయాయి. మనిషే కొత్తగా వుంది. ఆమె
గదిలోకి వస్తూనే అడిగింది.
"మీరు ఏమన్నా తీసుకొన్నారా? వట్టినే కబుర్లు చెప్తూ కూర్చోబెట్టేరా?"
వారు ఏమీ తినలేదని విని చాలా నొచ్చుకొంది. గబగబా లోనికి వెళ్ళి రెండు ప్లేట్లలో బిస్కట్లు పెట్టి వారి ఎదుట పెట్టింది.
"తీసుకోండి, చా చేసి తీసుకొస్తా."
"తీసుకురా, ముగ్గురం కలిసే త్రాగుదాం." అన్నాడు చంద్రశేఖరం.
ఆ యువదంపతుల జీవిత పద్ధతి చూస్తూంటే రామనాధానికి అంతా కొత్తగానే వుంది. సిగ్గుపడుతూ, ఏదో మూల ఒదిగి కూర్చోకుండా ఆమె
టీ కప్పుతో వచ్చి భర్త పక్కనే సోఫాలో కూర్చుంది. పరాయివాళ్ళముందు అంతగా మగణ్ని ఆనుకున్నంత దగ్గరగా కూర్చుని కబుర్లు
చెప్పడం సిగ్గుమాలినతనంగా భావించాలో, జీవితానందాన్ని అనుభవించడంగా అర్థం చేసుకోవాలో అతనికి అర్థం కాలేదు. వాళ్ళముందర తాను
సహజంగా ప్రవర్తించలేకున్నాడు. తాను వారి మధ్య సత్రకాయలా వున్నాననిపిస్తోంది.
అతని పరాకు ఏమిటో సునంద సులభంగానే కనిపెట్టేసింది. తమ అలవాట్లు అతనికి కొత్తగా వున్నాయనీ, ఉక్కిరిబిక్కిరి
చేస్తున్నాయనీ గ్రహించింది.
ఏదో పనిమీద లేచినట్లు లేచి ఈ మారు వేరే కుర్చీ లాక్కుని కూర్చుంది. రామనాధానికి కష్టం తోచింది. తన రాక వారికి ఇబ్బంది
కలిగిస్తోందనుకొన్నాడు.
మామగారు వ్రాసిన జాబు చూసేక సునంద అభినందనలు తెలిపింది. చంద్రశేఖరం నవ్వేడు.
"వారు తమ చెల్లెల్ని ఇంతవరకూ చూపించలేకపోయేరు. మీరేనా మీ భార్యను తీసుకువస్తారా?" అంటూ రామనాధాన్ని సూటిగా అడిగింది.
చంద్రశేఖరం తమ సంభాషణ సారాంశం అంతా చెప్పేక ఈమారు నవ్వడం వంతు ఆమెదయింది.
"మామగారి ఎత్తు చాలా పెద్దదే. చూడలేదుగాని, మా ఆడపడుచు ఎలా వుంటారు?
తనకు నచ్చిందా, రూపురేఖలు ఎలా వుంటాయని ప్రశ్నించినట్లనిపించి రామనాధం సిగ్గుపడ్డాడు. ఆ సిగ్గులో ఆమె మొదటి వాక్యం
అర్థం గురించి ఆలోచన తట్టలేదు.
"ఆ వయస్సులో సరిగా అలాగే వుండేవాడిననేది మా అమ్మ."
చంద్రశేఖరానిది చూడముచ్చటయిన ఆకారం. సునంద కళ్ళతోనే నవ్వింది.
"మరింకేం. నేనూ అదే అనుకున్నా."
ఆ సంభాషణ వెనకనున్న కొంటెతనమూ, అప్యాయమూ ఛాయగా చెవులకి తగిలి రామనాధం మనస్సులోనే ఆనందించేడు. తన సమాధానంలోని
కొంటెతనం కనబడకుండా సర్దడానికి చంద్రశేఖరం చెల్లెలి గుణవర్ణన ప్రారంభించేడు.
"ఆ చాదస్తపు ఇంట్లో వుండడం చేత రాణింపుకు రావడంలేదుగాని చాలా చురుకైనది. ఈడుకు మించిన తెలివి వుంది. చదివించి వుంటే చాల
పైకి రాగల వూహ వుంది."
"తమ్ముడుగారే చదివించుకోవచ్చు కదా...."
ఆ అభిప్రాయం బాగానే వుంది అనిపించింది చంద్రశేఖరానికి. ఉద్యమాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా తన తండ్రి లంగరులాగ సుందరిని
వుపయోగించతలచినట్లు సునంద సూచనను పట్టి అతడు గ్రహించేడు. అదీ బాగానే వుందనిపించింది.
కారణం ఏదయినా తాను చెప్పదలచిన మార్గమూ అదే.
అయితే రామనాధం ఆ అభిప్రాయాన్ని అంగీకరించలేకపోయాడు. చదువు చెప్పించుకోడానికి భార్యను తెచ్చుకోమన్న సలహా అతడికి ఏ
మాత్రం నచ్చలేదు.
"ఇందాకా ఏమన్నారో జ్ఞాపకం వుందా?"
చంద్రశేఖరం అంగీకరించేడు.
"కాని స్థితిగతులు...."
ఆ స్థితిగతుల్ని అనేక దృక్కోణాలనుంచి వివరించేడు.
రామనాధం రాజకీయాలు తన తండ్రికి నచ్చవు. ఆయనకు ఈ స్థితి తెలుసో, తెలియదో. ఏ కళనున్నాడో కూతుర్ని
పంపేస్తానంటున్నాడు. తెచ్చేసుకోవడమే మంచిది.
ఆ సలహా తన మగతనానికే పెద్ద అవమానంగా భావించి రామనాధం ససేమిరా అన్నాడు.
మగడు తీసుకెళ్ళడేమోనన్న భయం ఆడపిల్లవాళ్ళకుండాలేగానీ, తనకు బెదురేమిటనిపించింది. అటువంటి భయం కలిగించబోవడం చూసి,
చంద్రశేఖరం తనను వెర్రి పప్పాయిగా భావించడం లేదుగదా అనిపించింది.
కాని, ఆ దంపతులిద్దరూ ఏకకంఠంతో అదేమాట చెప్తూంటే ఆ విధంగా అనుమానించలేకపోయేడు.... అయినా....
ఆపద్ధర్మం పేరుతోనైనా తప్పు అనుకొంటున్నది చేయవలసిందేనా?
"అక్కడే నీ నిగ్రహం...."
--అంటూ చంద్రశేఖరం వుపదేశం చేస్తూంటే రామనాధానికి చాల విసువే కలిగింది.
ఒకే ఇంట వుండడం, ఏకశయ్య--కాని దాంపత్య జీవితం నుంచి నిగ్రహం సులభమేనా? సులభమేననుకొన్నా ఆమె ఏమనుకొంటుంది? ఎంత
గొడవ జరిగిపోతుంది?
ఆ మాట నిజమేనని చంద్రశేఖరం ఒప్పుకొన్నాడు. కాని--
ఈమారు మరో భయం సూచనగా తెచ్చేడు.
ఆ యింట్లో దేవతాపూజలూ, నోములూ, వ్రతాలూ, చాదస్తాలూ మాత్రమే పట్టుబడతాయి. ప్రపంచం ఏమిటో తెలియదు. ఇదే నేర్చుకొనే
వయస్సు. ఆమెనిప్పుడు తెచ్చుకోవడం మంచిది.
"సంగతులన్నీ చెప్పు, చదువు చెప్పుకో...." అంటున్నాడు.
వీధిలోనుంచి 'అమ్మా' అని కేకపెడుతూ కేశవచంద్ర తుఫానులా పరుగెత్తుకొని వచ్చేడు.
సునంద ఎదురెళ్ళి ఎత్తుకొని, అతనిని గుండెలకదుముకుని ముద్దు పెట్టుకుంది.
"చూడు ఎవరొచ్చేరో చెప్పుకో?"
ఆమె దగ్గరకు తీసుకువచ్చి నమస్కారం పెట్టించింది. "మామయ్య"
రామనాధం వానిని దగ్గరకు తీసుకొని చేతిలో ఓ అయిదు రూపాయలు పెట్టేడు.
"నీ మాటే గుర్తులేకపోయిందోయి."
ఇరవయ్యేడు
తాను వచ్చిన పని నెరవేరలేదు. అమలాపురంలో వాళ్ళ ప్రయత్నాలు వారు చేసుకుపోతున్నారు. ఇప్పటికే దానిని నిరోధించగల
అవకాశం దాటిపోయినట్లు అనిపిస్తూంది. ఇంక తను ఏమన్నా పెద్ద గొడవ అయిపోతుంది. కాని ఏమి చెయ్యాలి?
"ఆపద్ధర్మం పేరుతోనైనా తప్పు అనుకొన్నవి చేయవలసిందేనా?"
రాత్రి భోజనం వేళ చంద్రశేఖరం కొత్త దిశనుంచి కవ్వించేడు.
"నువ్వు బయటపడేందుకొక్కటే మార్గం. సునంద వడ్డిస్తూంటే నీ మేనల్లుడి పంక్తిని కూర్చుని భోజనం చేసినట్లు కబురందిస్తే
బయటపడతావు."
"శాశ్వతంగా దూరంగా వుంచుతారేమో మీ చెల్లెల్ని...." అంటూ సునంద భయం ప్రకటించింది.
"తాను సిద్ధంగా వున్నప్పుడు బావగారు ఓ చిన్న ప్రాయశ్చిత్తకాండకి తయారయితే మళ్ళీ సర్దుకొంటాయి" అని చంద్రశేఖరం
పరిష్కారమార్గం సూచించేడు.
"ఇప్పుడు నేను చేస్తున్న పని తప్పు అని ఒప్పుకోవాలా?"
"లండన్ వెళ్ళి వస్తే ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే, అదెంత అపరాధమో ఇదీ అంతే, మూర్ఖత్వాలకి హేతువులతో
నిమిత్తం వుండదు. కొన్నింటికి చూసీ చూడనట్లు సర్దుకుపోతూంటే తప్ప అడుగెయ్యలేం." అన్నాడు చంద్రశేఖరం.
కాని సునంద ఆవిధంగా సర్దుకుపోవాలనే భావాన్ని అంగీకరించలేదు.
"మీరు అలాగ సర్దుకుపోలేదేం?"
చంద్రశేఖరం నవ్వేడు.
"సర్దుకుపోయేటట్లూహిస్తే, బాబిగాడికి వాళ్ళ మామయ్య కులం చెడగొట్టే ఛాన్సు వుండేది కాదు."
కాని, సంభాషణ సాగినకొద్దీ సమస్యలంత సున్నితంగా పరిష్కారం గావనిపించి చంద్రశేఖరం ఆలోచనలో పడ్డాడు.
రామనాధం తొందరపాటు మనిషిగాకపోయినా నిశ్చితమయిన అభిప్రాయాలు గలవాడు. తన ఇంటివద్ద మనుష్యుల స్వభావం ఎరిగిన
చంద్రశేఖరానికి ప్రస్తుతం నడుస్తున్న పద్ధతిలో తన చెల్లెలు కుటుంబ జీవితం భగ్నమైపోయే ప్రమాదం వున్నదనిపించింది.
తాను చేస్తున్నది తప్పుకాదనిపించినాక రామనాధం వెనకడుగు వేయడు. తాను వేళాకోళానికన్న మాట కూడా నిజమయి ఇదివరకే వున్న
చిక్కులకు మరొకటి కూడా తోడవుతున్నట్లనిపించింది.
మేనల్లునితో కబుర్లు చెపుతూ చెపుతూ చటుక్కున సునందను అడిగేడు.
"మీరేమంటారు?"