"ఇప్పుడేనా చెప్తారా, అబ్బాయినాయుడిగారిల్లు ఇదేనా?" అన్నాడు బాలకృష్ణ తిరిగి.
"ఎవరు పంపించేరు?" అంది స్వరాజ్యం కొంటెతనంగా.
"అదొకటి మిగిలిపోయిందన్నమాట? కాని, నేను చెప్పను ముందు మీరెవరో చెప్పండి."
"అబ్బాయినాయుడుగారు మా నాన్నగారు."
"మీ పేరు?"
"స్వరాజ్యం."
"మీ తోట్లో ఎన్ని కొబ్బరి చెట్లున్నాయి?"
"ఎందుకు?"
"ఏం, మీరు అన్ని ప్రశ్నలు వేయగా లేంది, నేను ఆమాత్రం అడక్కూడదా?"
"ఎందుక్కూడదు? కాని అవసరం ఏమిటాయని గాని...."
"ప్రస్తుతం అటువంటి అవసరం లేదనుకోండి. కాని, అబ్బాయినాయుడుగారి యిల్లు ఇదేనో కాదో, ఆయన ఎక్కడున్నారో అవసరం
వుంది."
"వస్తారు కూర్చోండి."
"ఆయన ఇల్లు ఇదేనో కాదో చెప్పేరు కాదు."
"వస్తారు అంటే ఇది ఆయన యిల్లు అనే కదా...."
"కాదు. ఆయన ఇల్లయితే వుంటారు. పరాయి ఇంటికి వస్తారు."
స్వరాజ్యం కళ్ళు తిప్పింది.
"ఓహో, అదీ నిజమే, సరే. ముందు ఇల్లా దయచెయ్యండి."
బాలకృష్ణ వచ్చి అరుగు మీద కూర్చున్నాడు.
"ఏమిటి సంగతి? మా యిల్లు ఎలా పట్టుకొన్నారు?"
బాలకృష్ణ ఇంకా కొంటెతనం పక్కకు పెట్టలేదు.
"ఇదెవరి ఇల్లో తెలియందేనా?"
స్వరాజ్యం పక పకా నవ్వింది. ఇంతలో అబ్బాయినాయుడు గుమ్మంలోకి వచ్చేడు.
"ఎవరు కావాలంటారాయన?"
"అబ్బాయినాయుడుగారిల్లు కావాలంటారు. ఎందుకంటె చెప్పరు. వస్తారంటే ఆయన ఇల్లేదంటారు."
నాయుడుకూడా మాటల చెలగాటంలో ప్రవేశించేడు.
"నాయుడుగారు కావాలో, వారిల్లు కావాలో మరి?" అన్నాడు.
"అవును అది మరిచేపోయేను... ఏమంటారు? మీకు కావలసినది?" అంది స్వరాజ్యం.
"నాయుడుగారిల్లు...."
"ఇదే మరి....."
"అయితే నాయుడుగారు....."
ప్రశ్నా, సంబోధనా తేలని కంఠస్వరం విని స్వరాజ్యం సమాధానమిచ్చింది.
"ఈయనే....."
బాలకృష్ణ పకపక నవ్వేడు.
"నేను ఎవరని అడగలేదు. నాకు తెలుసు. అందుకే ఆయన్నే పిలచేను" అంటూ బాలకృష్ణ ఒక కవరు తీసి ఆయనకిచ్చేడు.
"ఇది మా మామయ్య మీకివ్వమన్నాడు."
నాయుడు ఆ కవరు కూతురుకు అందచేసేడు. ఆమె విప్పి జమకట్టిన ప్రోనోటు తీసింది.
"ప్రోనోటు పంపించేరు."
"అంత తొందర ఏం వచ్చింది? పాపం చిన్నాయన్ని శ్రమపెట్టేరు."
"నాకేం శ్రమ లేదండోయి. నేను ప్రతివారం రెండుమూడుమాట్లు మీ వూరు వస్తూనే వుంటాను."
"ఎవరింటికి?"
బాలకృష్ణ సమాధానం ఇవ్వలేదు.
"ఎందుకేమిటి?" అని నాయుడు ప్రశ్నించేడు.
"నే చెప్పనా?" అంది స్వరాజ్యం.
"ఊ."
"కోపం చెయ్యరు కదా?"
"ఉహు"
"ఆచార్లుగారింటికి..."
ఆచార్లుగారు పిచ్చాసుపత్రి నడుపుతారు. బాలకృష్ణ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచేడు. పొరపాటున అనేశాడు.
"నన్నెప్పుడు చూసేరు?"
"ఔనా కాదా.......?" అని నిలదీసింది స్వరాజ్యం.
"మీరెప్పుడో చూసేరు....."
"ఎప్పుడూ చూడలేదు."
"జగన్నాధాచార్లు చెప్పి వుంటాడు--" లేకపోతే తెలియడానికి వీలు లేదన్నంత ధీమాతో.
నాయుడు కూతురు కొంటెతనం, అంత పెద్ద కబుర్లు చెప్పే బాలకృష్ణ అమాయకత్వం చూసి నవ్వేడు.
స్వరాజ్యం తానన్న కొంటెమాట అర్ధం చేసుకోనందుకు చాల సంబర పడింది. వెంటనే జగన్నాధాచారి పేరు విని ఆమె అనుమానపడింది.
"నేనెందుకో చెప్పనా?" అని మళ్ళీ కవ్వించింది.
"మీరు చెప్పుకోలేరు."
"పందెం."
"పందెం."
"సరే!"
"సరే!"
"ఎంతెంత?"
బాలకృష్ణ జేబు తడిమి బేడకాసు తీసేడు.
"మా నాన్నగారు మధ్యవర్తి" అంది స్వరాజ్యం.
"సరే!"
నాయుడు నాణెం తడిమి చూసి నవ్వేడు.
"మరి నువ్వు కూడా ఇవ్వాలి" అని కూతుర్ని అడిగేడు ఆయన.
స్వరాజ్యం అక్కడినుంచి కదలకుండానే తల్లిని కేకేసింది. మాణిక్యమ్మ గుమ్మంలోకి రాంగానే ఒక రూపాయి అడిగింది. విషయం విని
మాణిక్యమ్మ బాలకృష్ణను వెనకవేసుకు వచ్చింది.
"చిన్నవాడిని చేసి...."
తనను చిన్నవాడనేసరికి బాలకృష్ణకు అభిమానం వేసింది. తాను స్వరాజ్యం చేతిలోంచి రూపాయి లాగేస్తున్నట్లే గంతువేసేడు.
"ఏం ఫర్వాలేదు. కాయమనండి."
కూతురు ఎత్తు గ్రహించిన నాయుడు బాలకృష్ణను హుషారు చేసేడు.
"వెనకతియ్యవద్దు పంతులూ! ఏమిటో చెప్తుందిట చూద్దాం."
స్వరాజ్యం నవ్వింది. ఓడిపోతావు సుమా అన్నట్లు కవ్విస్తున్న ఆ నవ్వు చూసి బాలకృష్ణ అభిమానపడ్డాడు.
"చెప్పండి చూద్దాం."
ఒక నిముషం ఆగి పందెంలో వున్న అన్యాయాన్ని గుర్తు చేసేడు.
"పోతే నాది బేడ. కాని మీది రూపాయి సుమండి."
"నాది పోదు."
"అయినా ఎందుకేనా మంచిది? తగ్గించుకోండి"--అన్నాడు బాలకృష్ణ.
"ఫర్వాలేదు."
స్వరాజ్యం కొద్దిసేపు ఆలోచిస్తున్నట్లు నటించింది.
"చెప్పెయ్యనా?" అని కవ్వించింది.
"ఊ, త్వరగా చెప్పాలి."
"కాచుకోండి చెప్పేస్తున్నా. జగన్నాధాచార్లు మీకు ఓ పుస్తకం ఇస్తానన్నాడు."
"అది చాలదు. ఆ పుస్తకం ఏమిటో చెప్పాలి." అన్నాడు బాలకృష్ణ ఆదుర్దాతో.
స్వరాజ్యం నవ్వింది. కాని, నాయుడు బాలకృష్ణను సమర్థించేడు.
"వారిద్దరూ ఒక క్లాసు వాళ్ళు. ఒక స్కూలులో చదువుతున్న వాళ్ళూను. వాళ్ళు ఒకరి పుస్తకాలనొకరు పుచ్చుకోవడంలో ఆశ్చర్యం
లేదు. పుస్తకం కోసం వచ్చేడంటే చాలదు."
బాలకృష్ణ ఔనన్నాడు.
"అందులో గొప్పేం లేదు. ఏం పుస్తకమో చెప్పాలి."
"అల్లాకాదు. పుస్తకం కోసం వచ్చేవని నాకేం తెలుసు. ఊరికే రాకూడదూ? అంతే. ఆ బేడ ఇల్లా ఇవ్వండి."
"చాలదు" అన్నాడు బాలకృష్ణ.
"చాలదు" అన్నాడు అతనిని సమర్థిస్తూ నాయుడు.
"అన్యాయం" అంది స్వరాజ్యం.
"ఏమీ కాదు" అన్నాడు బాలకృష్ణ.
"అంతే" అన్నాడు నాయుడు.
"చెప్పలేకపోతే ఓడిపోయినట్లే...." అని బాలకృష్ణ.
"ఏమంటావు, ఆలోచించుకో...." అని నాయుడు వంత.
స్వరాజ్యం ఆలోచన నటించింది.
ఆమె ఓడిపోతుందనే నిర్ణయంతో నాయుడు ఆ రూపాయిని ఎలాగ ఖర్చు పెడతావని అడిగేడు.
"రానీండి చెప్తా." అని బాలకృష్ణ సంతోషం కనబరిచేడు.
"మిఠాయి కొనుక్కోవచ్చు"నని నాయుడు సూచన.
"ముందు రాజస్థాన కథావళికి ఆరణాలు అయిపోతాయి."
"రాజస్థాన కథావళా?" అన్నాడు నాయుడు ఆశ్చర్యంగా. బాలకృష్ణ తల వూపుతూ ఆ పుస్తకం వివరాలు ఇచ్చేడు.
"చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు వ్రాసేరు. రాజపుత్ర వీరుల కథలు. చాలా బాగుంటుంది."
"చదివేరన్నమాట. అందులో ఓ కథ చెప్పండి చూద్దాం" అంది స్వరాజ్యం ఆసక్తి కనబరుస్తున్నట్లు.
"మాట మార్చేస్తున్నారు. మన పందెం తేల్చండి ముందు"--అని తక్షణ కర్తవ్యం గుర్తు చేసేడు బాలకృష్ణ.
"చదివిన పుస్తకం మళ్ళీ ఎందుకు?" అది నాయుడు ఆలోచన.
బాలకృష్ణ అది దగ్గరుండవలసిన పుస్తకం అన్నాడు.
అతడు స్కూలు లైబ్రరీలో తెచ్చి చదివేడు. జగన్నాధాచారి అతని వద్ద చదువుకొనేటందుకు పుచ్చుకొని దాని నిండా సిరా పోసేసేడు.
అది ఇస్తే మేస్టారు తంతారు. కనక ఓ పుస్తకం కొని ఇచ్చేస్తాడు.
స్వరాజ్యం కథ అంతా విని నవ్వేసింది. "నాకు తెలిసింది."
"ఏమిటమ్మా తెలుస్త?" అని డెకారించేడు హేళనగా నాయుడు.
"చెప్పెయ్యనా?"
"చెప్పమనవయ్యా!" అన్నాడు నాయుడు హుషారిస్తూ.
"ఎప్పుడో చెప్పేను ఆ మాట..."
"పైకి చెప్పను, చెవిలో చెప్తా" నంది స్వరాజ్యం.
"కాదు బయటికే చెప్పాలి" అన్నాడు నాయుడు.
"నాకు భయం వేస్తూంది. నిజం కాదేమోనని."
ఆమె భయం అన్న తర్వాత బాలకృష్ణ మరింత తొందరపెట్టసాగేడు.
"చెప్పండి. అలాగే."
అయితే స్వరాజ్యం మరో పేచీ వేసింది.
"మీరు కాదంటే--నేను ఔనంటే తీర్పు ఎల్లాగ?"
అదీ సమస్యే. బాలకృష్ణ ఆలోచించేడు.
"నేను నిజం చెప్తాను."
"సరే."
బాలకృష్ణకు ఆలోచన తట్టింది.
"కాగితం మీద వ్రాసి నాయుడుగారికి ఇస్తాను....." అన్నాడు.
"అక్కర్లేదు. మీ మాటమీద నమ్మకం వుంది" అంది స్వరాజ్యం.
ఆమె మాటను నాయుడు బలపరిచేడు.
లోపలి నుంచి మాణిక్యమ్మ వచ్చి తాను కూడా కలిసింది ఆ ఆటలో.
"మీ చేత అన్నీ చెప్పించేసి...."
"ఏమీ భయంలేదు. చెప్పమనండి."
స్వరాజ్యం అతనిని దగ్గరగా తీసికొని చెవిలో ఒక్కమాట చెప్పింది.
ఆమాట వినగానే బాలకృష్ణ వెలవెలపోయేడు. ఆమె ఎలా చెప్పగలిగిందో అతనికి అర్ధం కాలేదు!
"మీకెల్లా తెలిసింది?" అన్నాడు ఆశ్చర్యంతో.
తాను సరిగ్గా చెప్పినట్లు స్వరాజ్యం అతని ముఖకవళికలను పట్టి గ్రహించ గలిగింది. పందెం నెగ్గినందువలన కలగవలసిన
వుత్సాహం ఆమెలో లేదు.
"నిజం!"
బాలకృష్ణ తల వూపేడు.
"మీకెల్లా తెలిసిందో చెప్పండి--" అని ఆమెను తొందర చేసేడు.
ఆమె చెప్పింది సరిగానే వున్నదని తెలిశాక నాయుడు కూడా వుత్సాహం చూపలేదు. కాని ఆమె ఏం చెప్పిందో....
"అధర్వణవేదం.... అన్నాను." అంది స్వరాజ్యం.
"అధర్వణ వేదమా.....?" అన్నాడు ఆశ్చర్యంతో నాయుడు... "ఆ పేరు నీకెందుకు తోచింది. అసలు."
"జగన్నాధాచార్లుగారు అప్పుడప్పుడు వస్తూంటారు కదూ, ఆయన ఎప్పుడు వచ్చినా అధర్వణ వేదంలో ఏవేవో నారాయణాస్త్రం,
బ్రహ్మాస్త్రం లాంటి వానికి మంత్రాలున్నాయిట నిజమేనా, అని అడుగుతుంటారు. అదేదో సంపాదిస్తే ఇంగ్లీషు వాళ్ళని దేశంలోంచి ఒక్క
దెబ్బని తరిమెయ్యగలం కాదండీ అంటూంటాడు. ఆయన పేరు వస్తే ఆ మాట జ్ఞాపకం వచ్చేసింది. చెప్పేను."
ఆ మాట విని బాలకృష్ణ ఆశ్చర్యపడ్డాడు.
"ఆచార్లుగారింట్లో వుందని చెప్పేడే.... వాళ్ళింట్లో వుందన్న మాట అబద్ధమేనా...." తాను పందెంలో వోడిపోయిన దాని కన్న ఆ
వార్త బాలకృష్ణకు మరింత బాధ కలిగించింది.
"అబద్ధాలకోరు" అన్నాడు.
అధర్వణవేదం పని బాలకృష్ణకు ఏం వచ్చిందో అన్న ఆశ్చర్యం స్వరాజ్యాన్ని వేధించింది.
"ఏం చేద్దామనుకున్నారు ఆ పుస్తకం వుంటే...."
బ్రిటిష్‌వాళ్ళు పంజాబులో ఎన్నో దురాగతాలు చేశారు. జలియన్వాలాబాగ్‌లో డయ్యరు అనేవాడు ఇంచుమించు రెండువేల
మందిని కాల్పించి చంపించేసేడు. వాడినింక బ్రతకనీయకూడదనుకొన్నారు ఆ కుర్రవాళ్ళు ఎల్లాగా?
వాళ్ళకి మంత్ర తంత్రాలు సులువుగా కనిపించేయి. జగన్నాధాచారి తమ యింట్లో అధర్వణవేదం వున్నదన్నాడు. దానికోసం తిరుగుతున్నాడు
బాలకృష్ణ.
నాయుడు కుర్రవాళ్ళ ఆలోచనలకు నవ్వేడు. స్వరాజ్యం బాలకృష్ణ భుజంమీద చేయివేసి దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టుకుంది.
"మరేమంటాడు?"
"ఆ పుస్తకం అటకమీద వుందిట. తన తండ్రి చూడకుండా తియ్యాలి. ఎప్పుడొచ్చినా సరిగ్గా దాని క్రింద కూర్చుని ఆయన జపం
చేయడమో, నిద్రపోవడమో చేస్తుంటాడు. ఆయన కదిలేవరకూ కూర్చోబెడుతున్నాడు. మరునాడు రమ్మంటున్నాడు. తిప్పుతున్నాడు.
కాని డయ్యరును చంపెయ్యాలనే కక్ష, పట్టుదలతో బాలకృష్ణ అతడు రమ్మన్న రోజు, వేళకే వస్తున్నాడు. కాని, అది
దొరకనే లేదు.
"అవన్నీ వట్టి బూటకం నాయనా! జగన్నాధాచార్లు గారింట్లో అధర్వణవేదం వుండడం ఎంత నిజమో, అందులోని మంత్ర తంత్రాలు పని
చెయ్యడమూ అంతే నిజం." అన్నాడు నాయుడు.
తాను కొన్ని నెలలుగా పెంచుకున్న ఆశలనూ, చేసుకున్న కల్పనలనూ ఒక్కమాటలో కొట్టిపారవేస్తూంటే బాలకృష్ణ సహించలేకపోయేడు.
మంత్రశక్తిని గురించి ముంగండలో అనేక కథలు అతడు వింటూంటాడు. అతి ప్రశాంతంగా కూర్చుని రాత్రింబగళ్ళు జపం చేసుకొనేవారు ఆ
వూళ్ళో వున్నారు. వారు గొప్ప మంత్ర శాస్త్రవేత్తలని ఎంతో గౌరవం చూపడం చూస్తుంటాడు. పెద్ద కుంకం బొట్టుపెట్టి, మీసాలూ
వాళ్ళూ భయంకరంగా వుండే తంత్రశాస్త్రవేత్తలూ వూళ్ళో వున్నారు. వారిని చూసి జనం భయపడ్డం చూస్తున్నాడు.
ఒక్కమాటతో అవన్నీ కొట్టిపారేస్తూంటే ఎల్లా నమ్ముతాడు?
తాను విన్న కథల బలంతో అతడు చెప్తూంటే నాయుడు అనుభవంగాని, స్వరాజ్యం తెలివిగాని పనిచెయ్యలేదు.
వాళ్ళ తాతయ్య తేలుమంత్రం వేస్తాడు, నరసమ్మవ్వ చప్పి మంత్రం వేస్తూంది. భైరవశాస్త్రిగారు పాము మంత్రం వేస్తారు.
ఏనుగుపల్లి రాజుగారు పుప్పిపన్ను మంత్రం వేస్తారు.
ఆ అనంతకోటి సాక్ష్యాలకు సమాధానం వుంది. కాని, తనకు కొన్నే తెలుసు. తెలియనివి చాలా. దేని కారణాలు దానివి. అన్నింటికీ
ఒకే సమాధానం కాజాలదు. ఆ సమాధానాలకు శాస్త్రజ్ఞానం కావాలి. కొన్నింటికింకా శాస్త్రాలు కూడా కారణాలు పట్టుకోలేకపోయాయి. ఇంకా
పరిశీలించాలి.....
నాయుడు చర్చను మళ్ళిస్తూ వాళ్ళూరు కబుర్లు అడిగేడు. బాలకృష్ణ విజయశంఖం పూరించి నవ్వేడు.
"ఓడిపోయారన్న మాటేనా...?" స్వరాజ్యం నవ్వింది.
ఇంత ప్రజ్ఞావంతుడివి కనక నీకో పుస్తకం బహుమతి ఇస్తాం అని లోనికి వెళ్ళి వీరేశలింగం పంతులుగారి స్వీయచరిత్ర తెచ్చి
యిచ్చింది.
అది చూసి బాలకృష్ణ ఆనందించేడు.
"మా వూళ్ళో లైబ్రరీలో చాలా మంచి పుస్తకాలున్నాయిట. కాని అది తీయటం లేదు, పుస్తకాలిచ్చే వాళ్ళూ లేరు."
తర్వాత కొంత సేపు కబుర్లు చెప్పి బయలుదేరేడు.
"మీ మావయ్యగారికి వందనాలు చెప్పండి." అన్నాడు నాయుడు.
"ఆయన రాజమండ్రి వెళ్ళేడు."
"ఎందుకు?"
తండ్రీ కూతుళ్ళ మనస్సులలో ఒకే ఆశంక కలిగింది.
"ఎందుకు?"
బాలకృష్ణ ఎరగడు. 'ఏమో'
"ఎప్పుడొస్తారు?"
"అదీ తెలియదు."
ప్రతి ఆదివారం వస్తూండడానికి వాగ్దానం తీసుకొని స్వరాజ్యం అతనిని కాలవగట్టు ఎక్కించింది. వెళ్ళేముందు తమ పందెం కేవలం ఆట
మాత్రమేననీ అతడు వోడడం లెక్కకాదనీ చెప్పింది. కాని బాలకృష్ణ ఏ మాత్రం ఒప్పుకోలేదు.
"ఆ బేడ నాకక్కర్లేదు."
స్వరాజ్యం నవ్వుతూ 'సరే'నంది.
ఇరవైమూడు
"నిన్న సాయంకాలం డబ్బు మాట ఏదో చెప్పేవు...." అంటూ శంకరశాస్త్రి చేస్తూన్న సంధ్యావందనం మధ్యలో ఆపి ఆ దిశగా
వచ్చిన భార్యను ప్రశ్నించేడు. ఆ ప్రశ్న ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు.
"డబ్బేమిటి? నేనేం చెప్పేను?"
తన ప్రశ్నను అర్ధం చేసుకోలేని తెలివి తక్కువదనానికి శాస్త్రి ఆమె మీద చుర్రుమన్నాడు.
"ఆ మాత్రం తెలివుంటే లేకపోయిందేమిటి? మన ప్రబుద్ధుడు డబ్బు కావాలన్నాడన్నావు...."
రాజమ్మ 'అదా?' అంది.
"నిన్న కాదు, రాజమండ్రి నుంచి వచ్చిన రోజునే అడిగేడు. ఆ మాట నిన్న జ్ఞాపకం వచ్చింది."
"ఏడవలేకపోయేవు."
ఆ సలహా తీసుకొని రాజమ్మ గబగబ లోనికి పోయింది. ఇంకెన్ని తిట్లు తినవలసి వస్తుందోనని ఆమె భయం.
"యదహ్నా కురుతే పాపం! తదహ్నా ప్రతిముచ్యతే....."
శాస్త్రి మరల సంధ్యావందనంలో మునిగిపోయేడు. కాని అతని మనస్సు దానిమీద లేదు.
నాలుగైదు రోజుల క్రితం తల్లిని డబ్బు కావాలన్నవాడు తననెందుకు అడగలేదు? ఆ అవసరం ఏమయింది?
ఇప్పుడు ప్రయాణానికి కావలసిన డబ్బు ఎక్కడిది? కాకినాడ కూడా వెళ్లాలంటే ఆరోజున కావాలన్నదానికన్న ఎక్కువే కావాలి
మరి?
శంకరశాస్త్రి ఆలోచనలు ఉన్నట్లుండి అప్పయ్య అవధాన్లు వేపు మళ్ళేయి.
పెద్దవాళ్ళచాటు కుర్రకారుకు డబ్బు అప్పు కావాలంటే తమ వూళ్ళో మొదట జ్ఞాపకం వచ్చేది అప్పయ్య అవధాన్లు.
ఇంకెవరిదగ్గరకెళ్లినా పుచ్చుకొనే వడ్డీ తీసుకొంటూనే లక్ష హితోపదేశాలు చేస్తారు. పెద్దవాళ్ళతో కూడా చెప్పేస్తారు. విషయం
కాస్తా వీధిన బడుతుంది. అప్పయ్య అవధాన్లు అసలు సంగతి ఆస్తి మునిగిపోయే దశ వచ్చేవరకూ పైకి పెట్టడు.
పైగా విశ్వనాధం సలహా సహాయాలతో రామనాధం పనిచేస్తున్నాడనిపించేక డబ్బు సమస్య వచ్చే సరికి అవధాన్లు పేరే గుర్తురావడంలో
ఆశ్చర్యం లేదు. విశ్వనాధం ప్రోనోటు మీద వ్రాలు చెయ్యడం నేర్చుకొన్నది అవధాన్ల వద్దనే. ఇంతవరకూ భూమి అమ్ముకొన్నదీ,
అమ్ముకోగా మిగిలింది తనఖా పెట్టినదీ అప్పయ్య అవధాన్లు వద్దనే. కనుక తమ్ముని కొడుకుచేత కూడా అక్కడనే కాతా
పెట్టించాడనిపించింది.
అదే జరిగితే తానీ పదిహేను, పదహారేళ్ళుగా పడ్డ శ్రమ అంతా వ్యర్థమే. పైసా పైసా చొప్పున జాగ్రత్త చేసికొన్నదీ,
అసలు వున్నదీ కూడ చూస్తూ చూస్తుండగా హరించి పోతుంది.
ఆ ప్రమాదం కనిపించేక మరి సంధ్యావందనం కూడా సాగలేదు.
'కోప్పడీ, బెదిరించీ ఇల్లాంటి అలవాట్లు మాన్పించలేము' అనుకున్నాడు.
డబ్బు అవసరం కనబడకుండాలి. లేదా ఇచ్చేవాడు దొరక్కపోవాలి. అంతేకాని, ఒకమారు అప్పుకేసి మళ్ళిన వ్యక్తి చిన్న
అవసరం వచ్చినా అప్పులాడి కోసం వెతుకుతాడనే విషయం కొద్దీ గొప్ప వడ్డీ వ్యాపారం తిప్పుతున్న శంకరశాస్త్రికి
తెలియకపోలేదు.
ఇంక డబ్బు అవసరం వుండకపోవడం ఏమిటి? అందులో ఈనాటి చదువులూ, అలవాట్లూ లోనే డబ్బును మంచినీళ్ళకన్న ధారాళంగా ఖర్చు
పెట్టించే స్వభావం వుంది. తాను కానీ ఖర్చు లేకుండా పంచకావ్యాలూ, అలంకార శాస్త్రం చదువుకొన్నాడు. కట్టుకొనేందుకో అంగవస్త్రం,
భుజాన వేరొక అంగవస్త్రం తప్ప చదువుకొనే రోజుల్లో మారు దుస్తులు ఎరుగడు. కాని రామనాధం చదువు ప్రారంభించిన ఈ
పదిహేనేళ్ళలోనూ పదేళ్ళలోపు వయస్సులో వంటింట్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఎప్పుడు పెట్టుకున్నాడో తప్ప గోచీ ఎరగడు.
చొక్కాలు, లాగూలు, టోపీలు వీటి కోసం ఒక్క ఏడాదిలో అయిపోతున్న ఖర్చు తాను చదువుకొన్న మొత్తం కాలంలో బట్టలమీద చేసిన
ఖర్చును మించిపోతూందని శాస్త్రి కొడుకును ఎన్నో మార్లు మందలించేడు. పుస్తకాలకయ్యే ఖర్చుకి అసలు పోలికే లేదు. ఏడాదికేడాదికి
ఎన్నో పుస్తకాలు, ఏవేవో పుస్తకాలు, పైన తిండి ఖర్చు, బసలకి ఖర్చు.
ఇన్ని ఖర్చులకి అలవాటుపడ్డ వాళ్ళకి డబ్బు విలువ ఏం తెలుస్తుంది? చదువుకొన్న రోజుల్లో తాము సంభావనలకు వెళ్ళి,
బ్రాహ్మణార్థాలు చేసుకొనీ తెచ్చుకొన్న డబ్బుల్లో తమ ఖర్చు వెళ్ళిపోయేది. ఇప్పుడల్లా వెళ్ళడం నామోషీ కాకున్నా ఆ ఖర్చులకి
ఈ డబ్బులు ఏ మూలకి?
అందుచేత డబ్బు అవసరం అసలీనాటి చదువుల్లోనే వున్నదని శాస్త్రి దృఢ నిశ్చయం. చేతికి ధారాళంగా డబ్బు చిక్కనివ్వకపోడమే
ఆ అవసరాన్ని అదుపులో పెట్టేటందుకు మార్గమని తలచేడు. ఇంతవరకూ ఆ బిగింపు తాను చూసుకొన్నాడు. కాని ఇప్పుడు?
రామనాధానికీ వయస్సు వచ్చింది. అతనికి వెనక ఆస్తి వుంది. అప్పు ఎవరేనా ఇచ్చేస్తారు. అల్లా ఇవ్వకుండా కొంచెం
గట్టెయ్యాలి--అనుకొన్నాడు.
రాత్రి అంతా ఆలోచించేడు. అసలు అప్పయ్య అవధాన్లు వద్ద అప్పు తెచ్చేడో లేదో తెలుసుకోవాలి.
ప్రొద్దున్న తోటనుంచి వస్తూంటే దారిలో రావి క్రింద అవధాన్లు కనిపించేడు. ఆయనే పలకరించేడు.
"దింపు తీయిస్తున్నావా? పొద్దుపోయింది" అన్నాడు.
అవధాన్లు కొబ్బరికాయ కమీషను వ్యాపారం కూడా చేస్తూంటాడు.
"దింపువాళ్ళు వస్తామన్నారు. కాని. ఏదో పనుందని రామని కబురు పెట్టేరు. ఎల్లా వుంది పచ్చికాయ?"
ఆ మాటా ఈమాటా చెపుతూ శాస్త్రి యధాలాపంగా అన్నట్లు అప్పు ప్రసక్తి తెచ్చేడు.
"వారంనాడు మా వాడు ఏ మాత్రమో డబ్బు కావాలంటే లేకపోయింది. అవధాన్లు మామ దగ్గిరికెళ్ళి తీసుకోమని పంపేను. వచ్చాడా?"
అవధాన్లు చటుక్కున అబద్ధం ఆడలేకపోయేడు.
"పట్టుకెళ్ళేడు."
"రేపో ఎల్లుండో దింపుకాయ అమ్మేసి ఇస్తాను" అన్నాడు శాస్త్రి.
అప్పుడుగాని అవధాన్లుకు తాను చేసిన పొరపాటు అర్థం కాలేదు. రామనాధం నోటు వ్రాసి ఇవ్వడమే ఆ విషయాన్ని చెపుతూంది.
శాస్త్రి ఆ అప్పు విషయం గ్రహించేసేడు. నలుగురిలో తన చేత ఔననిపించేడు. ఇంక సర్దుకోలేకపోయేడు.
"అంత తొందరేముందిలే, చేతిలో వున్నప్పుడే ఇద్దువుగాని...."
ప్రక్కనే వున్న భగవచ్ఛాస్త్రులు హాస్యమాడేడు.
"అణాబిళ్ళ మీద సంతకం చేయించే వుంటాడు. అదీ ఆ ధైర్యం."
కాదనడానికి అవకాశం లేకుండా శాస్త్రి అందుకున్నాడు.
"బిళ్ళ ఇచ్చే పంపేను. చేబదులంటే అర్ధం తెలియదు. అది నేర్పకూడదు. ఈనాటి కుర్రాళ్ళకి డబ్బు విలువ బొత్తిగా తెలియకుండా
పోతూంది."
"పంపించే వాళ్ళుంటే..." అని వెంకప్ప తన కొడుకు తోడి అనుభవం తలుచుకొని అంగలార్చేడు. ఆయన కొడుకు ఎప్పుడూ అమలాపురం
బోగంవాళ్ళ ఇళ్ళలోనే వుంటాడు. డబ్బు కావలసినప్పుడే ఇంటికి వచ్చి తెస్తావా, చస్తావా అని కూర్చుంటాడు.
"అడిగిన వెంటనే డబ్బిస్తే దాని విలువ అర్ధం కాదు. ఎక్కడో చూడలేకనా? అవధాన్లు మామనడిగి నేనే తేలేకనా? కాని,
వాళ్ళకీ కష్టసుఖాలు తెలిసిరావాలి....."
శాస్త్రి చెప్తున్నదంతా అబద్దమేనని మనస్సుకి తోస్తూ వున్నా ఏమీ చెప్పలేక అంతకన్న లోతుకి వెళ్ళడం ఇష్టమూ లేక
పిలుస్తున్నా వినిపించుకోకుండా అవధాన్లు పని వుందని వెళ్ళిపోయేడు.
అందులో ఏదో రహస్యం వుందని గ్రహించిన భగవచ్ఛాస్త్రులు అడిగేడు.
"ఏమిటి వ్యవహారం?"
"మామూలే."
"గుణం పోనిచ్చుకున్నాడు కాదు." అని వెంకప్ప తన అసహ్యం వెలిబుచ్చేడు. తాను ఇవ్వవద్దని చెప్పినా కొడుక్కు అవధాన్లు
అప్పిస్తూనే వుంటాడు. "ఇచ్చి చెప్పడు. వడ్డీ పెరిగి ఇనప్పెట్టె నిండాలి." అంటూ ఆయన బాధ వెళ్ళకక్కుకున్నాడు.
ఒకరోజు పోనిచ్చి శాస్త్రి డబ్బు తీసుకొని అవధాని ఇంటివద్ద హాజరయ్యేడు. అతని రాక చూసి అవధాని కొబ్బరి బేరానికి
వచ్చిన వాళ్ళ పని ఆపి వారు దగ్గరుండేటట్లు చేసుకొన్నాడు.
శాస్త్రికి మహచెడ్డ కోపం. చెయ్యి దురుసుతనం కూడా ఎక్కువే.
ఆయన వస్తూనే అసలు విషయం ఎత్తుకుంటాడనుకొన్నది. అలా చెయ్యలేదు. ఆ మాటా ఈ మాటా చెపుతూ హాస్యమాడుతూ కూర్చున్నాడు.
ఆలోపున వీధిన పోతున్న వాళ్ళూ వీళ్ళూ చేరేరు. తన భయం అనవసరం అనిపించింది అవధాన్లకి. కబుర్లు చెప్తూ చెప్తూ
హఠాత్తుగా శాస్త్రి అసలు సంగతి ఎత్తుకున్నాడు.
"మామా! నోటు తీసుకొచ్చి చెల్లు రాయి. డబ్బు తెచ్చేను".
"నోటేమిటి?"--అనేసేడు అప్పయ్య శాస్త్రి. పొరపాటున అంతలో సర్దుకున్నాడు. ఇంట్లో లేని కొడుకును పెద్దగా గొంతెత్తి
పిలిచేడు.
"భానూ! భానూ!"
లోనుంచి భార్య సమాధానం ఇచ్చింది.-- 'అంబాజీపేట వెళ్ళేడు, కొబ్బరి సంతకని. మీతో చెప్పలేదా?"
ఆవిడ కీ యిచ్చి వదిలిపెట్టినట్లు అల్లాగే రెండు రోజులయినా అదే విషయం మీద మాటలు చెపుతూనే వుంటుంది. ఇంట్లో లేడని ఎరిగి
వుండే ఎందుకు పిలిచేనా అని అప్పయ్య అవధాన్లు మనసులో గుందిల్లేడు. తాను కొడుకుకి చెప్పి పంపిన మాటలు కూడా ఆమె
బయటపెట్టేస్తుంది. భార్య నోరు మూయించాలని అవధాని గర్జించేడు.
"ఈపాటికి నోరు ముయ్యి. తెలిసిందిలే. ముండావాగుడు."
ఆ ఆదేశం వినిపించేక ఆమె మరి మాట్లాడలేదు. అవధాని ఇంక కార్యక్రమం ప్రారంభించేడు.
"ఇనప్పెట్టిలో పెట్టి మావాడు వెళ్ళిపోయేడు. తరువాత చూసుకొందాం. నీ దగ్గరుంటే ఒకటీ, నా దగ్గరుంటే ఒకటీనా?"
శాస్త్రి అంత అభేదభావాన్ని చూపించలేకపోయేడు.
"అంత నమ్మకం వున్నవాడివి చేబదులివ్వక నోటు ఎందుకు వ్రాయించుకొన్నావు?"
ఆ అప్పు పత్రం అంతతో ముగించకూడదని అవధాని ప్రయత్నం.
"శాస్త్రీ! నీతో అబద్ధమాడతానటోయ్. నిజమే, మా వాడి దగ్గరుంది అది. అంతగా దగ్గరుంటే మరోలాగ
ఖర్చయిపోతుందనుకొనేటట్లయితే డబ్బు ఇచ్చి వెళ్ళు. అబ్బాయి రాగానే నోటు పంపిస్తా"
శాస్త్రి విషయంలో అవధాన్లు మోసం చెయ్యకపోవచ్చు. అంత మంది ముందు తీసుకొన్న సొమ్ము లేదనకపోవచ్చు. కాని, ఒకరిద్దరి
వద్ద డబ్బు తీసుకొని చెల్లు రాయకుండా మళ్ళీ వసూలు చేశాడని వూళ్ళో గొడవలు వున్నాయి.
శాస్త్రి వ్యవహారజ్ఞానం లేనివాడేం కాదు.
అవధాని సూచన విన్నాక కోపం చర్రుమంది. అప్పయ్య గడుసుతనం అర్ధం అయింది. నోటు చూస్తేనేగాని రామనాధం ఎంత అప్పు చేశాడో
తెలియదు. తాను ఎంత అని ఇస్తాడు? ఆ రహస్యం బయటపడితే తన చాటున కుర్రవాడు అప్పులు చేస్తున్నాడని నలుగురికీ
తెలిసిపోతుంది. అదొక విధంగా లోకువా, అప్రతిష్ఠా కూడా.
"ఇదిగో మామా! సూరయ్యకాపు అనుకుంటున్నావేమిటి?"
సూరయ్య కాపు నమ్మకం మీద డబ్బు అలాగే ఇచ్చి మూడెకరాల భూమి పోగొట్టుకొన్నాడని వూళ్ళో చెప్పుకుంటారు. అంతమాట విసిరేసినా
అవధాని కోపం తెచ్చుకోలేదు.
"నీకూ అదే తోచిందిటోయ్"--అని మాత్రం అన్నాడు. లేచి వెళ్ళిపోయి తలుపు వేసేసుకున్నాడు. ఇంకెందరు ఎన్ని పిలిచినా
మాట్లాడలేదు. తలుపు తియ్యలేదు. శాస్త్రి మహాకోపంతో అరుగు దిగి పైబట్ట నడుముకి బిగించేడు. వాలకం చూస్తే కలబడేలా
ఉన్నాడు.
దగ్గరున్నవాళ్ళు అతనిని శాంతింపచెయ్యటానికి ప్రయత్నించేరు. కాని శాస్త్రి వినిపించుకోలేదు.
"నిన్నిల్లా వదిలేస్తే నా పేరు శాస్త్రి కాదు....." అని ఘోర శపథం చేసేడు.
అయితే అంత కోపంలో కూడా తపోబలం, వాక్శుద్ధి బలం వంటి అతీత శక్తులు తనకిక్కడ సాయపడవనే మాటను మరిచిపోలేదు.
భౌతికశక్తుల్లో కూడ పోలీసుశాఖకున్న బలం, ప్రాభవం మరెవ్వరికీ లేవని కూడా గుర్తుంది. అందుచేత ఆ బెదురునే కలిగించడానికి
ప్రయత్నించేడు.
"వాడి మామగారు నారాయణమూర్తిగారే వచ్చి ఆ నోటు సంగతి చూసుకొంటారు ఇనప్పెట్టిలో వుందో, పోపులపెట్టిలో వుందో అయనే
చూస్తాడు."
అంత దుర్దాంత వ్యక్తి పేరు వుచ్చరించాక అవధాని బిగువు ఎంతోసేపు నిలువలేదు. మరుగంటలో రెండో కొడుకు చేతికిచ్చి నోటు
పంపించేసి, డబ్బు తెచ్చేసుకొన్నాడు.
శాస్త్రి బాకీ యిచ్చేస్తూ ఖబడ్దార్ చెప్పేడు.
"ఈమారు తండ్రిచాటు కుర్రాళ్ళకి డబ్బు యిచ్చేటప్పుడు వెనకా, ముందూ చూసుకొని మరీ చెయ్యమని చెప్పు మీ నాన్నతో."
రామలింగం అమాయకంగా ఎదురుప్రశ్న వేశాడు.
"అయితే డబ్బు కోసం నువ్వు పంపించలేదన్నమాట?"
జారినమాట కమ్ముకోవడం సాధ్యంగాక శాస్త్రి వానిమీద మండిపడ్డాడు.
"అతితెలివి! సంతోషించాం."
ఇరవైనాలుగు
రామనాధం కాకినాడలో రైలు దిగి దేవాలయం వీధిలో వున్న రుక్కమ్మ హోటలుకి తిన్నగా వెళ్ళేడు. అక్కడే స్నానం చేసి బట్టలు
మార్చుకొన్నాడు. భోజనం చేశాక తన బావ చంద్రశేఖరాన్ని వెతుక్కుంటూ పిఠాపురం రాజా కాలేజీకి బయలుదేరాడు.
చంద్రశేఖరం కాలేజీలో లెక్చరరు. రామనాధం వెళ్ళేసరికి అతడు క్లాసులో వున్నాడన్నారు. వచ్చేవరకూ ఎదురుచూస్తూ అక్కడే
టీచర్ల గదిలో కూర్చున్నాడు. ముతక ఖద్దరు బట్టలతో వున్న రామనాధంవేపు నలుగురూ వింతగా చూస్తుంటే అతడు ముళ్ళమీదున్నట్లు
కూర్చున్నాడు.
హఠాత్తుగా, అనుకోని విధంగా చూడడంచేత చంద్రశేఖరం మొదట అతనిని గుర్తుపట్టలేకపోయేడు.
"నీ కోసం ఎవరో వచ్చి కూర్చున్నారు." అని తోడి లెక్చరరు చెప్తూంటే చంద్రశేఖరం దగ్గరకు వచ్చేడు.
"తమరు...." అంటూ ముఖంకేసి చూసి చటుక్కున నిలబడ్డాడు.
"మీరు.....ఏమిటీ వేషం" అనబోయినవాడే సర్దుకొని "ఎంతసేపయింది వచ్చి" అన్నాడు.
తనను హెచ్చరించిన మిత్రునికి పరిచయం చేసేడు.
"మా చెల్లెలి భర్త."
తరువాత ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా గంటకొట్టి ఫ్యూనును పిలిచేడు. గదిలోనున్న సంఖ్యను చూసుకొని తేవలసిన కాఫీల సంఖ్య
చెప్పేడు.
"ఆరు తీసుకురా."
మిత్రులలో ఒకరు గుర్తుచేసుకొనేటందుకు ప్రయత్నిస్తున్నట్లు అన్నాడు.
"చెల్లెలు ఒక్కర్తేనన్నావు కాబోలు."
ఆ ప్రశ్నకు మూలం ఏమిటో గ్రహించనట్లు చంద్రశేఖరం నటించేడు.
"ఔను, ఆమె భర్త రామనాధం. ఈ ఏడాది విదేశాలకి వెళ్ళే ఆలోచనలో వున్నారని చెప్పింది ఈతనిని గురించే."
ఖద్దరు దుస్తులవాడు ఐ.సి.ఎస్.కు వెళ్ళాలనుకొంటున్నాడంటే మిత్రులకాశ్చర్యమే కలిగింది. కాని, తోటి మిత్రుడు
నొచ్చుకుంటాడని ఎవ్వరూ ఏమీ అనలేదు. అతని ప్రయత్నాన్ని అభినందించేరు.
రామనాధం చిరునవ్వుతో వారి అభినందనలను త్రోసిపుచ్చేడు.
"ఒకప్పుడా అభిప్రాయం వుండింది."
"ఇప్పుడు?"
"లేదు...."
చంద్రశేఖరం ఆ సంభాషణను ఆ విధంగా కొనసాగనివ్వడం ఇష్టంలేక మాట మార్చేడు.
"ఎప్పుడు బయలుదేరేవు?"
మిత్రులు అతని అభిప్రాయాన్ని గుర్తించేరు. ఓ నిముషం ఆమాట యీమాట చెప్పి తమ క్లాసులకి వెళ్ళిపోయేరు. తనకు ఆ గంట
పనేమీ లేదని రామనాధం కళ్ళలో కనిపించిన ప్రశ్నకు సమాధానమిచ్చేడు చంద్రశేఖరం.
"పరీక్షలు దగ్గిరికొచ్చినట్లే. బాగా చదువుతున్నావా?"
అతడు కట్టిన ఖద్దరు బట్టలు చూసేక మనస్సులో కలుగుతున్న భావాలను చంద్రశేఖరం నమ్మదలుచుకోలేదు. దేశంలో వ్యాపిస్తున్న
విదేశీ ప్రభుత్వ ద్వేషానికి చిహ్నంగా మాత్రమే ఆ దుస్తులను గుర్తించదలిచేడు. సత్యాగ్రహం, సహాయ నిరాకరణం చేసి
వుంటాడనుకోలేకపోయేడు. కాలేజీలో మొదటి మార్కుకోసం పోటీపడుతున్న వాడల్లా ఉన్నట్టుండి రంగాన్ని వదిలేస్తాడనుకోలేకపోయేడు. తన
ప్రశ్నకు సమాధానం విని తెల్లబోయేడు.
"పరీక్షలకు వెళ్ళడం లేదు."
"అంటే?"
"కాలేజీ మానేశాను."
చంద్రశేఖరం చాలా బాధగా అన్నాడు.
"సహాయ నిరాకరణం?"
రామనాధం తల ఆడించేడు.
"ఔను."
'ఎంతపని చేశావు?' అన్నట్లు చంద్రశేఖరం విచారంగా, జాలిగా చూసేడు. చాలాసేపటివరకూ మాట్లాడలేకపోయేడు.
అందరూ స్కూళ్ళూ, కాలేజీలూ మానవలసిందనీ, ప్రభుత్వోద్యోగాలకు రాజీనామాలివ్వాలనీ, కోర్టుల్ని బహిష్కరించాలనీ గాంధీగారు
ప్రబోధిస్తున్నారు. అలా చేస్తే ఏడాదిలో స్వరాజ్యం వస్తుందని ఆయన వాగ్దానం చేశారు. తామంతా ఆ కార్యక్రమం విని
నవ్వేశారు. పరీక్షలు ప్యాసుకాని మందమతులూ, బోర్డు డబ్బు కిట్టని వకీళ్ళూ దేశభక్తులయిపోవడానికీ, ప్రతిష్ఠ
కాపాడుకోడానికీ మంచి అవకాశం దొరికిందని వేళాకోళం చేశారు.
కాని, ఇదేమిటి; మంచి తెలివిగలవాడూ, భవిష్యత్తు వున్నవాడూ రామనాధం. అతడు చదువు కట్టిపెట్టేసి సహాయ నిరాకరణం
చేసేడు.
రామనాధం పెదతండ్రి ఒకాయన కాంగ్రెసువాడు ఉన్నారన్నారు. ఆయన్ని తాను చూడలేదు. తన తమ్ముడి కొడుకు పెళ్ళికికూడా ఆయన
రానే లేదు. ఆయన చదువుకోలేదని విన్నాడు.
కాని, రామనాధం చదువుకున్నవాడు. చెల్లెలిని అతనికిచ్చి పెళ్ళిచేయడానికి కారకుడు తానే అయివుండడం ఒక విశేషం. ఇప్పుడు
అందరూ తనమీదపడిపోతారనిపించింది. చంద్రశేఖరం లేచేడు.
"సెలవుచెప్పి వచ్చేస్తా, కూర్చో. ఇంటికి వెడదాం."
"వెళ్ళిరాండి."
తాను చేసిన పనినీ, తన వుత్సాహాన్నీ ఎంతోమంది అర్థం చేసుకోలేరని ఈ వారం పదిరోజుల్లోనూ రామనాధం గ్రహించేడు. చంద్రశేఖరం
వారిలో ఒకడు అయ్యేడు అంతే.
ఏడాదిలో స్వాతంత్య్రం వస్తుందని గాంధీ చెప్తూంటే నమ్మినవాళ్ళూ, సమర్థించినవాళ్ళూ కూడ సహాయ నిరాకరణంలో తమవంతు పాత్ర
ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడం లేదు. పరీక్షలయ్యేక అంతగా అయితే ఓ ఏడాది మానెయ్యకూడదేమిటి? అంటున్నారు. ఈ ఏభయివేల
రూపాయల కేసు ఒక్కటీ పూర్తిచేసి తర్వాత కోర్టు మానమని బంధువులూ, స్నేహితులూ చెప్పినా తాను వొప్పుకోలేదని అయ్యదేవర
కాళేశ్వరరావుగారు ఆరోజున సభలో చెప్పేరు. చేస్తూ చేస్తూన్న వుద్యోగం వదిలేసుకొన్నాక స్వరాజ్యం వచ్చి మాత్రం కూడూ, గుడ్డా
పెడుతుందా అని వాళ్ళ వాదన.
కాని చంద్రశేఖరం వాదనలు ఆ పంథాలో లేవు. తన సెలవు పని పూర్తిచేసుకువచ్చి చంద్రశేఖరం సావకాశంగా ప్రారంభించేడు.