అంటూ దాని ప్రాశస్త్యాన్ని నిరూపించడానికి, కనుబొమ్మలు మిటకరించేడు.

అన్నపూర్ణమ్మ ఎర్రబారి చూసింది. శాస్త్రి మరల భుజం మీది కండువా సవరించుకొన్నాడు.

ప్రత్యామ్నాయ సూచనను శంకరశాస్త్రి వియ్యపురాలి ముందుంచేడు. నారాయణమూర్తి అక్కడున్నట్లు కూడా గుర్తించడం ఇష్టం లేనట్లు

ఆయనకు వీపు తిప్పేడు.

సుందరిని ఎరగాచేసి రామనాధాన్ని పట్టెయ్యాలనేది ఆయన సూచన. అయితే తెలివిగా ఆ మాటను తిప్పి తిప్పి వారి ముందు పెట్టేడు.

ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. దంపతుల్ని కలిపేస్తే అన్నీ సర్దుకొంటాయన్న ఆలోచనను అన్నపూర్ణమ్మ ఆలోచించవలసిందే

అనుకొంది.

నారాయణమూర్తి గర్జించేడు.

"అదేం కుదరదు."

శాస్త్రి ఆ అభ్యంతరాన్ని పట్టించుకోకుండా తన పథకం ప్రాశస్త్యాన్ని వివరించేడు.

కొత్తగా కాపురానికి వచ్చిన పడుచు పెళ్ళాం మరులలో రామనాధం ఇంటిపట్టునే ఉంటాడు. ఈలోపున వ్యవసాయం అవీ ఆయన

వప్పచెప్తాడు. కదలడానికి వీలూ వుండదు. అసలు అనిపించదు. ఓ యేడాది గడిచిందంటే ఈ పట్టుదలలేవీ వుండవు. అన్నీ

మరిచిపోతారు. ఈలోపున ఒకళ్ళిద్దరు పిల్లలు కలిగేరా ఇహ చెప్పనక్కర్లేదు.

"నన్నెక్కడ కూర్చోమంటావే--అని దిక్కులు చూసే దర్జాలే. మనం యెరగని మొహాలా ఏమిటి?" అని శాస్త్రి వియ్యంకుని వేపు

చూసేడు.

ఐ.సి.యస్‌. అయి ఏ కలక్టరుగానో వస్తాడనుకొన్న అల్లుడిని గురించి ఆ విధంగా ఆలోచించడం ఏదోలా వుంది

అన్నపూర్ణమ్మకి. నారాయణమూర్తికి కసి వుబికి వస్తూంది.

"ఏదో ఉద్ధరిస్తాడనుకొంటే....."

అన్నపూర్ణమ్మ సర్దుబాటు చెయ్యడానికి ప్రయత్నించింది.

"ఇప్పుడేమంత వయస్సు మీరిందనీ, ఇరవయ్యేగా, ఇంకా ఐదేళ్ళు, రేపు జూన్‌లో వెళ్ళమంటే సరి."

నారాయణమూర్తికి భవిష్యత్తు గురించి ఆ విధమయిన ఆశ లేశం కూడా మిగలలేదు.

"ఇవి అల్లా వదిలే జబ్బులు కాదు. ఓమారు వచ్చేక మనిషి సర్వనాశనం అయ్యేవరకూ వదలవు. అప్పుడూ వదలవు. వంశంలో

జీర్ణించిపోతాయి. సెలల్లా బయటవేస్తూనే వుంటాయి."

నారాయణమూర్తి పోటు ఏమిటో శాస్త్రి గ్రహించేడు. రామనాధం అతని పెదతండ్రి విశ్వనాధంమీద జంటదాడి.

తన పుత్రుడు తొందరపడ్డాడనీ, తాత్కాలికావేశంలో కాలు జారేడనీ తలుస్తూ దానిని సరిదిద్దుకోవాలనుకొంటూంటే 'కుదరని జబ్బులూ,

వంశం నుంచి వదలని జబ్బులూ అంటాడేమిటీతడి నీలుగు'. అనిపించింది శాస్త్రికి. ఓ మారు దులిపెయ్యాలనుకొన్నాడు. అయితే ఈ మారు

కొత్త పద్ధతి తొక్కేడు.

"అంతేనండి వియ్యంకుడుగారూ! కొన్ని జబ్బులున్నాయి చూశారూ, అవి ఉద్యోగాన్ని బట్టో, ఇంట్లో వున్న బంగారాన్ని బట్టో, ఒంట్లో

వున్న హుమ్మస్సును బట్టో సంక్రమిస్తుంటాయి. నాలుగు పిచికలు చేరేసరికి క్రిందూ మీదూ తెలియదు. ఏమంటారు? ఆ హోదా, బంగారం,

రక్తం వడి మళ్ళేసరికి ఏడ్పు మొహం పెట్టేస్తారు. అల్లాంటి వాళ్ళను గురించే అన్నాడెవడో మహానుభావుడు, సత్యదర్శి...."

శంకరశాస్త్రి ఆ అప్రత్యక్ష కవికి చేతులు జోడించి నమస్కరించేడు.

"....ఉద్యోగాంతము నందు చూడవలెరా ఆ యయ్యసౌభాగ్యముల్‌."

అంత అవమానకరంగా తన ఉద్యోగపు హోదాను ఎద్దేవా చేసిన వాడు వియ్యంకుడైపోవడం చేత గాని, మరొకరూ, మరొకరూ అయితే వళ్ళు

హూనం చేసివేసేద్దునని నారాయణమూర్తి పళ్ళు కొరికేడు.

శంకరశాస్త్రి చర్రుమన్నాడు. కండువా మడత దులుపుతూ, అపహాస్యంగా వియ్యంకుణ్ని విసిరేశేడు.

"ఇదే పతకం అయితేనా...."

...."అమ్ముకు తిననా" అన్న తరువాయి మాట ప్రక్షిప్తం.

ఏదో గొప్పతనం చూసి పతకం ఇస్తారు. కాని, దానిని అమ్ముకు తినెయ్యడం వరకే అతనికి దాని విలువ తెలుసు. ప్రపంచం

తనకిచ్చిన విలువ నాతడు ఆ పతకం విలువకే కుంచించుకుంటాడు. అంత పరమఅజ్ఞానివే నువ్వూనని శంకరశాస్త్రి వెక్కిరింత.

అన్నపూర్ణమ్మ అతి కష్టంమీద వియ్యంకులిద్దరినీ సమాధానపరిచింది. కూర్చోబెట్టింది. కాని, నారాయణమూర్తి ఓ పట్టాన మనస్సు

కుదుటపరచుకోలేక పోతున్నాడు.

అన్నపూర్ణమ్మ మాటతప్పించి కాస్త వ్యవధానమిస్తేనేగాని వ్యవహారం తెమలదని అర్ధం చేసుకొంది.

"సుందరీ!"

"పీటలు వేశానమ్మా" అని లోనుంచి సుందరి సన్నగా సమాధానమిచ్చింది.

"లేవండి అన్నగారూ!" అంటూ తొందరపెట్టి మగణ్ణి హెచ్చరించింది.

"లేవండి మీరు కూడా. ఆ దుస్తులు తియ్యండి. అమ్మా! నాన్నగారి పంచె చూడమ్మా!"

ఉపాహారాలయి మరల ముగ్గురూ సావిట్లోకి వచ్చి కూర్చున్నారు. మొదటి ఆవేశం చల్లబడి మగవాళ్ళిద్దరూ నిలకడగా మాట్లాడే

స్థితిలో వుండడం చూసి అన్నపూర్ణమ్మ సంతోషించింది. విషయం ప్రస్తావన చేసింది.

"అన్నయ్యగారి ఆలోచన బాగానే వుందనుకుంటా. మీరేమంటారు?"

నారాయణమూర్తి ఓ నిముషం ఆలోచించేడు.

"పిల్లదాన్ని కూడా ఈ గొడవలో దింపితే?"

"వాళ్ళిద్దరూ చూసుకొంటారు. ఎవరు ఎవరిమాట వినాలనేది మనం చెప్పితే జరిగేదా యేమన్నానా?" అన్నాడు శాస్త్రి.

"ఇప్పుడైతే నా కూతురుకూ అతనికీ సంబంధం లేదనొచ్చు"

పై అధికార్లు ఏదో అంటారనే భయంతో తన మగడు కూతురు కాపురమే చెడగొడతాననడం అన్నపూర్ణమ్మకు నచ్చలేదు.

అల్లుడితోపాటు కూతురు కూడా దూరం కావడం మనస్సుకు కష్టంగానే వుంది. ఇదివరకే ఓ కొడుకు వర్ణాంతర వివాహం చేసుకొని ముఖం

చూడకుండా అయ్యేడు. ఇప్పుడు కూతురు. కారణం ఏదయితేనేం?

కాని తప్పనిసరి. కూతురు సంసారాన్ని భగ్నం చెయ్యలేదు. ఆ మాటే చెప్పింది.

"మనకి దూరంగా వున్నా వాళ్ళిద్దరూ కలిసి వుంటారు. అంతగా అయితే మనింటి ఛాయలకు రావద్దందాం. అంతేగాని, మనకేదో కష్టం

కలుగుతుందని పిల్లదాని జీవితం...."

తన ప్రయత్నం ఇద్దర్నీ దూరం చేసుకోడానికి కాదని గుర్తుచేశాడు శాస్త్రి.

"కుర్రాణ్ని కూడా దగ్గిరికి తెచ్చుకోవాలనిగాని....."

నారాయణమూర్తి రుసరుసలాడేడు.

"మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. ఈ ప్రయత్నాలకు ఇదే మొదలు ఇదే ఆఖరు కూడా."

అన్నపూర్ణమ్మ భర్త ముఖం వంక చూసింది. ఆ చూపు అర్ధం గ్రహించేడు నారాయణమూర్తి.

"ఏమల్లా చూస్తావు?"

"బంధుత్వాలు చూసుకోవలసిన చోట కూడా మీ వుద్యోగపు దాస్టీకమేనా?"

"నా వుద్యోగానికి సంబంధించినంతవరకూ అల్లుడూ లేడు, కూతురూ లేదు." నారాయణమూర్తి చిరచిరలాడుతూ లేచేడు.

"మీరే నిర్ణయం చేసుకున్నా సరే. కాని, ఆ కుర్రవాడు నా యింట అడుగు పెట్టడానికి వీలు లేదు. ఆ కార్య కరామత్తులకు నేను

రాను."

"మరి?" అని అన్నపూర్ణమ్మ ఆయన ముఖంలోకి చూసింది.

"అది అంతే. ఓ చీర పెట్టి పిల్లను పంపించెయ్యి. ఆ శుభకార్యం వాళ్ళింట్లోనే చేసుకుంటారు."

"అదెల్లాగ?"

"ఎల్లాగో నన్నడిగితే లాభం లేదు" అంటూ నారాయణమూర్తి వీధిలోకి వెళ్ళిపోయేడు.

శంకరశాస్త్రి ఓ నిముషం ఆలోచించేడు.

"సరే. మీరేమంటారు?"

అన్నపూర్ణమ్మ అతనికి ధైర్యం చెప్పింది.

"మీ ఆలోచన భేషుగ్గా వుంది. అన్నయ్యగారూ! కానీండి. శుభస్య శీఘ్రం. ముహూర్తం పెట్టించండి."

"ఎక్కడ అని....."

"మీ వూళ్ళోనే, మా చెల్లెలిగారింట జరపడానికి మీకేమన్నా అభ్యంతరం వుందా?"

శాస్త్రికి అభ్యంతరం లేదు.

ఆయన అక్కడికక్కడ ముహూర్తం నిర్ణయం చేసేడు. ఆమె సంతృప్తికి సిద్ధాంతిని పిలిపించేడు. అతడు ముహూర్తం ఏమిటో కూడా

ఎరక్కుండానే శాస్త్రిని పొగిడేడు.

"భేష్‌! బ్రహ్మాండంగా వుంది. సందేహము ఏమీ అక్కర్లేదు." అన్నాడు.

"చొరవ ఆలోచన మీనుంచే వచ్చినట్లు నడపండి" అంటూ చూచాయగా హెచ్చరించి శాస్త్రి వచ్చేశాడు.

అంత కష్టపడి తయారు చేసిన పథకం అంతా టప్పున ఎగిరిపోతున్నట్లు నిర్విణ్ణుడయ్యేడు.

* * * * *

ఒక్క క్షణానికి సర్దుకొని ప్రశ్నించాడు "ఏడీ వాడు?"

తాను చెప్పిన మాటకు మగని ముఖంలో కనిపించిన వైలక్షణ్యం చూసి రాజమ్మ భయపడింది. రామనాధం అభ్యంతరం వెనక ఏదో

లోతులుంటాయనిపించింది. సంకోచిస్తూనే సమాధానం ఇచ్చింది.

"ఇంకా భోజనానికి రాలేదు."

శంకరశాస్త్రి ఏమీ అనలేదు. ఏదో ఆలోచిస్తూనే భోజనం ముగించేడు. వీధి అరుగుమీదికి వచ్చేసరికి దారినపోతున్న

సుబ్బన్నశాస్త్రి కనిపించేడు.

"ఎవరు సుబ్బన్నా! ఎక్కడినుంచోయి?"

"పావంచాల రేవునుంచి మామగారూ!" అంటూ సుబ్బన్నశాస్త్రి నిలబడి కబుర్లు ప్రారంభించేడు.

"భోజనమయిందా?"

"ఇప్పుడే అయింది."

--అంటూనే రామనాధం ఎక్కడన్నా కనిపించేడా యని వాకబు చేశాడు శాస్త్రి.

"మధ్యాహ్నం చిరతపూడి వెళ్ళేడు. వచ్చేడా?"

అదో కొత్త వృత్తాంతం. చిరతపూడి ఎందుకు వెళ్ళేడాయని కుతూహలం కలిగింది.

సుబ్బన్నశాస్త్రి విశేషప్రోత్సాహంతో నిమిత్తం లేకుండానే రామనాధం ఎక్కడికి ఎందుకు వెళ్ళేడో తనకు తెలిసిన సమాచారం

తెలియపరిచేడు.

"పొద్దు ఆవేళప్పుడు కుంపటి పొలంగట్టున కనబడ్డాడు. చిరతపూడి అబ్బయ్యనాయుడిగారిని చూసివద్దామని వెడుతున్నానన్నాడు."

"నాయుడుగారితో వీడికి పరిచయం ఏమిటి?"

సుబ్బన్నశాస్త్రి సమాధానం విన్నాక శంకరశాస్త్రి కనుబొమ్మలు ముడిసేడు.

ఆడపిల్లకి మగవాడితో పరిచయం అన్నమాటకర్ధం ఏమిటి? పడవలో కలిసి ప్రయాణం చేసినంతమాత్రాన వాళ్ళ ఇంటికి వెళ్లాలా?

వయసొచ్చిన పిల్ల పిలవడమేమిటి? వీడు బయలుదేరడం ఏమిటి? శంకరశాస్త్రి అనేక అనుమానాలతో కొట్టుకుపోయేడు.

కూడా వున్న తల్లి ఎరగదా? గుడ్డివాడైతే మాత్రం తండ్రికి అర్ధం కాదా? ముక్కు మొగం తెలియని పడుచువాడు పని కట్టుకుని

తనతో పరిచయం పేరుతో ఇంటికి రాకపోకలు ప్రారంభిస్తే ఏమిటో, ఎందుకో గ్రహించలేడూ?

కొడుకు తన భార్య వద్ద తెలిపిన అభ్యంతరానికి మూల కారణం దొరికిందనిపించింది. ఇదే కారణమయితే అతని అభ్యంతరం

నామమాత్రంగానే వుంటుంది.

శంకరశాస్త్రి అబ్యయ్యనాయుడి ఆస్తి వ్యవహారాలూ, కుటుంబ పరిస్థితులూ తెలుసుకోవడం మాటున స్వరాజ్యం చదువు సంధ్యలూ, రూపు

రేఖలూ వివరాలూ తెలుసుకున్నాడు. గ్రామ పురోహితుడుగా సంగ్రహించిన సమాచారంతోపాటు నాలుగురోజుల క్రితం తాను చూసిన మనిషిని కూడా

సుబ్బన్నశాస్త్రి పరిచయం చేసేడు. తను చేసిన వేళాకోళం మాట చెప్పకుండా రామనాధానికి ఆమె యెడగల సదభిప్రాయాన్ని

వివరించేడు.

"మనవాడు ఆమె చాల మంచిపిల్ల అన్నాడు. చదువుకున్నదీ, మర్యాదలెరిగినదీ, మంచి దక్షురాలూ అన్నాడు."

ఒక్క రాత్రి పడవలో పక్క గదుల్లో ప్రయాణం చేసినంతమాత్రానే అంతా అర్ధమయిపోయిందేం అనుకున్నాడు శాస్త్రి. అసలు విషయం

తెలియకుండానే, తాను సకాలంలో సరియైన పని చేస్తున్నాననిపించింది.

'ఇంక ఫర్వాలేదు.' అనుకొని బేఫర్వాగా వీధిలోకి బయలుదేరేడు.

ఇరవై

కాని మరునాడు మధ్యాహ్నం భోజనాలయ్యాక రామనాధం తాను పడుకున్న చోటికి వచ్చి అసలు విషయంలోకి దిగాక గాని తన పొరపాటు

శంకరశాస్త్రికి అర్ధం కాలేదు.

"ఏమిటి కథ......"--అన్నాడు యథాలాపంగా ఎదుట నిల్చున్న కొడుకును చూచి.

"మీరేదో ప్రయత్నంలో వున్నారని తెలిసింది."--ఆ ప్రయత్నం దేనిని గురించో చెప్పడానికి సిగ్గుపడ్డాడు.

శంకరశాస్త్రి పనుల తొందరలో చెప్పడం మరిచినట్లూ, అతడు జ్ఞాపకం చేస్తేనే గుర్తు వచ్చినట్లూ కొద్ది చిరాకు నటించేడు.

"ఆ. ఔనౌను. చెప్పడం మరిచేను, మీ అమ్మను చెప్పమన్నాను గదా. మొన్న అమలాపురం వెడితే మీ మామగారు చెప్పేరు. పిల్లను

పంపుతాం తీసుకెళ్ళమన్నారు. ఏదో మాటవరసకు అన్నారనుకున్నాను. నిన్న వుత్తరం వ్రాశారు. నాలుగైదు రోజుల్లో ముహూర్తం పెట్టి

కబురు చేస్తామన్నారు..."

రామనాధం నిర్ద్వంద్వంగా ఆ ప్రయత్నం ప్రస్తుతానికి పనికిరాదని చెప్పేడు.

"ఆమె చాల చిన్న వయస్సుది....."

తన వయస్సు ఏ మాత్రం ఎక్కువ. పందొమ్మిదో ఏడు నడుస్తూంది. అప్పుడే సంసారం ఏమిటి? పనికిరాదని చెపుతూంటే శంకరశాస్త్రి

ఆశ్చర్యంతో నోరు తెరిచేడు.

శరీర శాస్త్రరీత్యా భార్యాభర్తలుగా జీవించడానికి తగిన వయస్సు గురించి తాను చదువుకున్నవీ, విన్నవీ అనేక సంగతులు

రామనాధం వివరిస్తూన్నాడు.

కొడుకు మాటలు వింటూంటే శంకరశాస్త్రికి అరికాలి మంట తలకెక్కుతూంది. ఆ శరీర శాస్త్రాలూ, మనశ్శాస్త్రాలూ గురించి ఆయనకే

మాత్రం నమ్మకం లేదు.

ఆ అమ్మాయి రజస్వల అయింది. ప్రకృతి పెట్టిన అడ్డు తీరింది. ఆమెకన్న రామనాధం అయిదేళ్లు పైగా పెద్దవాడు. వరహీనం

మనిషి కాదు, ఒడ్డూ పొడుగూ పాతికేళ్ళ వాడల్లే ఉంటాడు. మరెందుకా అభ్యంతరం. పెంకితనం కాకపోతే.....

పైగా తాను స్వయంగా వెళ్ళి వాళ్ళని కదిలించి, చేసుకువచ్చిన ఏర్పాట్లవి. ఆ మాట పైకి చెప్పకపోయినా జరిగిందది.

నారాయణమూర్తిని గదిమి, వియ్యపురాలిని వొప్పించి చేసుకువచ్చిన ఏర్పాటు, ఇప్పుడు వయస్సు, శరీర శాస్త్రంలాంటి అర్ధం పర్ధం

లేని ఆటంకాలు తెస్తూ, దానినంతనూ కాదంటూంటే వొప్పుకోవలసిందేనా--అనుకున్నాడు.

"అవతల పెద్ద మనుషులతో పని....."

రామనాధం వెనక్కి తగ్గలేదు. తాను మాట ఇచ్చేనంటే 'ఎవరిమ్మన్నారు?'... అదే అడిగేసేడు.

"నన్ను అడగందే......"

పెళ్ళీ, కుటుంబ జీవితం అనేవి వానిననుభవించేవాళ్ళ అభిరుచీ, ఇష్టానిష్టాలు బట్టి జరగాలనే ఆధునికాభిప్రాయం రామనాధానిది.

అలవాట్లూ, ఆచారాల రీత్యా శంకరశాస్త్రి దృష్టిలో అది చాల చిన్న విషయం.

తమ బిడ్డలకి పెళ్ళి చేయడం తల్లిదండ్రుల కర్తవ్యాలలో ఒకటి. పిల్లల్ని పాడు చెయ్యాలని ఎవ్వరూ అనుకోరు.

అదీగాక......

చిన్నవాళ్ళకి ప్రపంచ జ్ఞానం ఏం వుంటుంది? వాళ్లు ఏం చెప్పగలరు? పిల్ల అందంగా వుందో లేదో చూస్తామనుకొంటారు. కాని, వాళ్ళ

మొహం! సిగ్గుపడుతూ, భయపడుతూ, కన్ను ఎత్తగానే సరా? ఎర్రగా బుర్రగా వుంటే సరేనా? కను, ముక్కు తీరు

వుండనక్కర్లేదూ? కుటుంబ గౌరవం, వంశ సంప్రదాయం, రోగాలు-భోగాలు ఎన్ని చూడాలి? పిల్లల భవిష్యత్తునాలోచించి, ఏది మంచిదో

చూసి తల్లిదండ్రులే ముడిపెట్టెయ్యాలి గాని.... శంకరశాస్త్రి ధోరణి అది....

ఆ విధంగానే ఆయన రామనాధం పెళ్ళి చేసేడు. పెళ్ళికి వొప్పించడానికి ఓ మొట్టికాయ వేయవలసి వచ్చినా, అప్పుడే సంఘంలో

కొత్తగా అలవాటు అవుతున్న పద్ధతి ప్రకారం అతనిని తీసుకెళ్ళి పిల్లనోమారు చూపించేడు.

"ఇదిగోరా అబ్బాయి! నీ పెళ్ళాం. చూసుకో...." అన్నాడు.

ఆ మాట వినేసరికి అంతవరకూ తల్లిని ఒత్తుకొని, తలవంచుకొని నిలబడ్డ ఆ తొమ్మిదేళ్ల పిల్ల సిగ్గుతో ఉక్కిరిబిక్కిరి

అయిపోతూ తల్లి పట్టు విడిపించుకొని ఇంట్లోకి పారిపోయింది. నలుగురూ నవ్వేరు.

ఆ క్షణం వరకూ ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దని గునుస్తూ ముఖం మాడ్చుకుని వున్న రామనాధం చక్కగా వున్న ఆ సిగ్గరిని చూసేక

మరి గునసలేదు. ముఖం విడింది.

ఆ విషయాన్నే శంకరశాస్త్రి జ్ఞాపకం చేసేడు.

వయస్సు వచ్చేక దంపతుల్ని కలపడం కూడా వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యతలలోనిదేనని అతడు భుజాలు కుదిలించుకున్నాడు.

అది ఓ కర్తవ్యం. తమ కర్తవ్య నిర్వహణ గురించి పిల్లల నడిగేదేముంది? అడిగితే మాత్రం ఏం చెప్తారు? అడిగితే

సిగ్గుపడతారు. అందుచేత అడగరు. తాము ఆడదానికోసం అలమటించిపోతున్నట్లు హాస్యం పట్టిస్తారని భయపడి అప్పుడే కాదంటారు.

కాని, కార్యం చేసేస్తే వూరుకుంటారు. నవ్వుకుంటూ పిల్లల్ని కనేస్తారు.

అందుచేతనే పెళ్ళిళ్లూ, పునస్సంధానం విషయంలో దాని కష్టనష్టాలననుభవించే వాళ్లు గదా యని ప్రత్యేకంగా పిల్లవాళ్ళని

అడగరు. అడగాలనీ అనుకోరు. ఇంట్లో హడావిడితోనే వాళ్ళకి అర్ధం అవుతుంది. ఎవరన్నా చెప్పినా మాటవరసగా మాత్రమే.

అలాగే శాస్త్రీ వ్యవహరించేడు.

ఇప్పుడు తన్ను అడిగి వుండవలసింది--అంటే? తన కర్తవ్యంలో అదో భాగం. దానికీ ఒకర్ని అడగాలా యని శంకరశాస్త్రి

ఆశ్చర్యం ప్రకటించేడు.

రామనాధం ఆ కర్తవ్యాన్ని పూర్తిగా నిరాకరించేటందుకు సిద్ధంగా లేడు.

"బాగుంది, కాని నాకది అభ్యంతరం అన్నప్పుడు....."

కొడుకు పట్టుదల చూస్తున్న కొలది శంకరశాస్త్రికి తామసం కలుగుతూ వుంది. అతని అభ్యంతరం తాననుకున్నట్లు నామమాత్రం

కానందుకు చికాకుపడుతున్నాడు. తన మాటకెదురు పలకనివాడు అడ్డు చెప్పేంత వాడయ్యాడా అని కసి పుట్టింది. కాక..... నాయుడు

కూతురితో వ్యవహారం పెళ్ళామే వద్దనేంతవరకూ వెళ్ళిందా అని కూడా అనిపించింది.

ఆ అడ్డు తీర్చేసి కోడల్ని ఇంటికి తెచ్చేస్తే తప్ప లాభం లేదనుకున్నాడు.

'ఆవిడ నట్టింట కనబడేవరకే ఎగిసిపాట్లన్నీ--' అనుకున్నాడు. అయితే వ్యవహారజ్ఞానం వున్నవాడు గనుక కోపతాపాలు చూపి

రెచ్చగొట్టరాదనుకున్నాడు.

ఈమారు శంకరశాస్త్రి బ్రహ్మాండమైన కారణం తీసుకొచ్చేడు.

"అన్నీ సిద్ధం అయ్యేక ఏ కారణం లేకుండా శుభకార్యమిప్పుడు చేసుకొనేది లేదంటే లోకం ఏమంటుంది? పోనీ చదువుతున్నాడు, పరీక్షల

ముందు ఇదేమిటంటావా? అదీ మానుకుకూర్చున్నావాయె."

పోనీ ఈ పేరునన్నా మళ్ళీ కాలేజీకి వెడతానులే అంటాడేమోనని శాస్త్రి ఒక్క నిముషం ఆగేడు.

రామనాధం ఆ ధోరణిలోనే లేడు.

"ఇప్పుడిదేమీ తలపెట్టద్దు. కనీసం రెండేళ్లు....."

శాస్త్రి మాట మధ్యలోనే అందుకున్నాడు.

"ఇప్పుడు అలా అనడం మంచిది కాదు. నేనెందుకు చెప్తున్నానో విను. ఇప్పుడు మనం కాదన్నామంటే మనలో ఏదో లోపం వుంది

అనేస్తారు. అల్లాంటి మాట వచ్చిందంటే ఎంత అప్రతిష్ట!"

ఆ 'ఏదో లోపం' పుంస్త్వహీనతకు సూచన. పడుచువానిని పట్టుకుని అతని పుంస్త్వం గురించి అస్తినాస్తి విచికిత్స

ప్రారంభిస్తారనడం కన్న రెచ్చగొట్టే మాట మరొకటి వుండదు. ఆ మానవ బలహీనతను శంకరశాస్త్రి ఉపయోగించుకోదలచేడు.

కాని, రామనాధం మెత్తబడలేదు.

శాస్త్రి ఈ మారు ఇంకాస్త నొక్కేడు.

"మీ మామగారు చాలా అసాధ్యుడు. అందులో పోలీసు ఆఫీసరు. ఇల్లాంటి మాటొకటి పుట్టిందా మన్ని అల్లరి పెట్టేస్తాడు. పెద్దవాళ్ళ

పరీక్షలనీ, డాక్టరు పరీక్షలనీ.... ఇంక తలెత్తుకు తిరగలేం..."

ఆ పరీక్షల బెదిరింపులక్కూడా రామనాధం లొంగలేదు. రాజకీయ కారణాలతో కాలేజీ మానెయ్యడం ఏమిటంటే చెప్పడానికీ, వాదించడానికీ

ఇంకా పటుత్వం చేకూరలేదు. కాని, సంఘ సంస్కారానికి సంబంధించిన విషయాలమీద అతడు చాలా విన్నాడు, చదివేడు. వీరేశలింగంగారి

ప్రహసనాలూ, సంఘ సంస్కరణలను సమర్థిస్తూ ఆయన తెచ్చిన శ్రుతి-స్మృతి-పురాణ ప్రమాణాలూ అన్నీ అతనికి హృత్కవిలి. ఆ

సమస్యలపై అతడెందరితోనో వాదించేడు. వానిని గురించి అతనికి స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.

ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గవలసిన అవసరం కనబడలేదు. పైగా ఇదేమంత సంస్కారం?

సంఘ సంస్కరణ వాదనలు తెచ్చేసరికి శంకరశాస్త్రి మనస్సులో అబ్బాయి నాయుడు మెదిలేడు. సుబ్బన్నశాస్త్రి చెప్పిన వృత్తాంతం

కళ్ళముందు కదిలింది.

"నాయుడు కూతురు చెప్తున్న పాఠాలు బాగానే వొంటబడుతున్నట్లున్నాయే...."

శంకరశాస్త్రి తప్పుమాట అన్నట్లు కనిపించకుండానే తన అనుమానాలు, అభిమానాలు అన్నీ అర్థం అయ్యేలా చేశాడు.

నాయుడు కూతురు మాట వినగానే రామనాధం ఆశ్చర్యపడ్డాడు. వారితోడి పరిచయాన్ని అతడు దాపరికం చేయాలనుకోలేదు. కాని, అది

తండ్రికెల్లా తెలిసిందాయని అతని ఆశ్చర్యం. అప్రయత్నంగానే అడిగేడు.

"నాయుడు కూతురేమిటి?......"

శంకరశాస్త్రి విదిలించేడు.

"పిల్లి కళ్ళు మూసుకొని తన్నెవరూ చూడడం లేదనుకుంటుంది. రాజమండ్రి నుంచి కలిసి పడవలో రావడం, ఆవిడ తమ యింటికి

రమ్మనడం, నిన్న పగటివేళంతా నువ్వు అక్కడే వుండడం ఎవరికీ తెలియదనుకోకు. ఎన్నాళ్ళనుంచేం ఈ పరిచయం....?"

ఇదివరకు ఏమన్నా గోప్యంగా వుంచినా ఈమారు శాస్త్రి తన ప్రశ్నలో దాపరికం మిగల్చలేదు.

రామనాధం నిర్విణ్ణుడైపోయేడు. ఒక్క క్షణం కోపం వచ్చింది. అడుగుతున్నది తండ్రిలాగ పెంచినవాడు. ఏమీ అనలేని స్థితి.

కోపాన్ని దిగమింగుకున్నాడు. కాని, కంఠంలో ఆ కసి ప్రత్యక్షరంలో తొణికింది.

"పెంచిన పెద్దరికం చూసి మీరు నన్ను ఏమన్నా చెల్లుతుంది. కాని, వాటిక్కూడా ఓ పరిమితి వుండాలి. ఇంక నామీద కోపం వుంటే

నాతోనే సరిపుచ్చడం మంచిది. నాకు తెలిసిన వాళ్ళనీ, ఎప్పుడో ఓమారు మాట్లాడిన వాళ్ళనీ, అందులో ఆడపిల్లల్నీ

నిందించడం...."

అంతకన్న నీతో మాట్లాడవలసిన పని ఏమీ లేదన్నట్లు రామనాధం వెనక్కి తిరిగేడు, మాట కూడా పూర్తి చేయకుండా.....

తాను నీతి తప్పలేదని సమర్థించుకోడానికి రామనాధం కోపం చూపినా, నిస్సహాయత చూపి కళ్ళనీళ్ళు పెట్టుకొన్నా, అటువంటి

అనుమానాలకాధారం లేదని ఘటనలు ఏకరువు పెట్టినా శంకరశాస్త్రి నమ్మి వుండేవాడు కాదు. కాని అతడు చూపిన అభిమానం,

నిర్లక్ష్యం చూసేక తన అనుమానం అర్థరహితమని గ్రహించేడు. పొరపాటున మాట జారేనేమో అనిపించింది. కాని అంతవరకూ వచ్చేక

వెనక్కి తగ్గడం చేత కాలేదు. పైగా తాను తయారుచేసిన వలను ఏం చేయడం....

తానూ అభిమానం, నిర్లక్ష్యం చూపించడం తప్ప మార్గాంతరం లేదనుకొన్నాడు.

"ప్రాప్తేతు షోడశే వర్షే.... అని పెద్దలూరికే అన్నారా..... కన్న కొడుకు విషయంలోనే ఆమాట అన్నప్పుడు పెంచడం

తప్ప ఇతర రక్త సంబంధం కూడా ఏమీ లేని నేను నా పరిమితిలో వుండడం మంచిదే. సరే, ఇప్పటినుంచే వుంటాను. నీ ఇష్టం

వచ్చినట్లు చేసుకో. ఆ మామగారికి సమాధానం ఏమిస్తావో నువ్వే చూసుకో"

శంకరశాస్త్రి విసురుకుని వెళ్ళిపోయేడు.

ఇరవయ్యొకటి

"ఏడీ, వీడేడీ."

--అని అపోశనపడుతూ, శంకరశాస్త్రి రామనాధం గురించి వాకబు చేశాడు.

"చీకటి పడుతూనే ఆకలేస్తూందని అన్నం పెట్టించుకొని తిని వెళ్ళిపోయేడు."

రామనాధం రాత్రి ఇంటికి రాలేదు. కాని, ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. ముంగండ పెద్ద చెరువులో చేపలు ఎవ్వరూ పట్టకుండా

కాపలా కాయడం ఓ అలవాటుంది. వూళ్ళో పడుచుకారుకు అదో తరిఫీదు. వెన్నెల రాత్రులూ, హుషారు పుట్టినప్పుడూ కర్రసామూ వగైరా

నేర్చుకొంటూంటారు. చెరువు కాపలాకి వెడుతూంటారు. చాలా కుటుంబాలు ఆ అలవాట్లని ప్రోత్సహిస్తాయి.

రామనాధం కూడా వూళ్ళో వున్నప్పుడు ఆ జట్టులోనే వుంటాడు. వాళ్ళతోపాటు ఏ చెరువుగట్టుమీదనో కండువా పరుచుకు పడుకుంటాడు. బహుశా

అలాగే అనుకున్నారు ఈవేళాను.

పొద్దుట కూడా రాకపోయేసరికి రాజమ్మ ఎందుచేత చెప్మా అని విశాలాక్షికి కబురంపించింది. కబురు రాగానే చేతిలో పని వదిలిపెట్టి

విశాలాక్షే వచ్చింది.

"ఏమిటి పిన్నీ! రాత్రి పడవకి వెడుతున్నానన్నాడే, నువ్వెరక్కపోవడం ఏమిటీ? చెప్పలేదా?" అంది.

"ఆ మాటేం చెప్పలేదే" అని రాజమ్మ ఆశ్చర్యపడింది.

ఆ మాట విని శంకరశాస్త్రి మరొకలాగా సంతోషించేడు. గతరోజు గంద్రగోళం పనిచేసిందనుకున్నాడు. భార్యను తీసుకురాకుండా

తప్పించుకోడానికి మళ్ళీ కాలేజీకే వెళ్ళి వుంటాడని భావించేడు. బహుశా తమతో చెప్పడానికి సిగ్గుపడి వుంటాడు.

ఆ సంతోషం ఎంతోసేపు వుండలేదు. పదిగంటలవేళ పొలం నుంచి వస్తూ విశ్వనాధం పలకరించేడు.

"అబ్బిగాడు రాత్రి మెయిల్‌బోటుకి వెళ్ళాలన్నాడు. వెళ్ళినట్లేనా? కాకినాడ కూడా పోయిరావాలన్నాడు."

విశాలాక్షి అన్నదని విన్నప్పుడు రాని కోపం విశ్వనాధం అన్నప్పుడు వచ్చింది. వూళ్ళో అందరికీ తెలుసు. తనకొక్కడికే

తెలియదు. ఆ కోపంలో విసుక్కున్నాడు.

"వాడి తోచినచోటికి వెళ్ళనీ కాకినాడ వెళ్ళినా సరే, కాశీ వెళ్ళినా సరే. నేను చదువు మాని రమ్మంటేనే వచ్చేడా? ఎవరి

కష్టసుఖాలు వాళ్ళవి. గడ్డాలూ, మీసాలూ వచ్చేదాకానే మన మాట. తర్వాత ఎవరి ప్రారబ్ధం వాళ్ళది."

పోకపొత్తిలో కట్టిన అరిటాకుల కట్టతో వాకిట్లోనే నిల్చుని వున్న విశ్వనాధం శాస్త్రి విసుగుదల చూశాక ఆ కట్ట అరుగుమీద

పెట్టేడు. తానూ అరుగుమీద కూర్చున్నాడు.

"నీకు నేను చెప్పవలసినవాణ్ణి కాదనుకో. అయినా, నువ్వంత చెండనాడుకోవడం మంచిది కాదనుకుంటా. బాగులేదు. పోనీ, వాడిది ఒక

పిచ్చే అనుకుందాం. చదువు చెప్పించేవు, పెద్దవాణ్ణి చేసేవు. ఇప్పుడు......"

మొదట విశ్వనాధం చెప్పేది ఏమిటో అర్ధంకాలేదు శాస్త్రికి. కాని క్రమంగా విశదమయింది. రామనాధం వద్దంటూంటే ఇప్పుడు కార్యం

చేసుకోమని నిర్బంధించడం బాగులేదని విశ్వనాధం బోధ. "ఏడిసినట్లే వుంది నీ తెలివి" అనుకున్నాడు ఓ మాటు మనసులోనే

శంకరశాస్త్రి. కాని, ఆ ఓర్పు ఎంతో సేపు నిలవలేదు.

సర్దుబాటుగా విశ్వనాధం మాట్లాడుతూంటే శంకరశాస్త్రి ఆగ్‌బబూలా అయిపోతున్నాడు.

విశ్వనాధానికి రామనాధం స్వయానా తమ్ముడి కొడుకు, అయినా అతని మంచిచెడ్డలూ, యోగక్షేమాలూ గురించి విశ్వనాధం ఎన్నడూ

పట్టించుకోలేదని శాస్త్రి అభిప్రాయం. నిజానికి విశ్వనాధం దగ్గరున్న వాడిని తానూ, భార్యా బ్రతిమాలి తీసుకువచ్చిన

మాటనెన్నడో అతడు మరిచిపోయేడు. ఏ అనారోగ్యమో అని విని చూసిపోవచ్చినప్పుడూ, పరీక్ష ప్యాసైన వార్త విని సంతోషం

తెలపడానికి వచ్చినప్పుడూ ఏదో పుల్లవిరుపుమాట అనేవాడు. ఈసడిస్తూ మాట్లాడేవాడు. అందుచేత విశ్వనాధం రావడం తగ్గించేడు.

ఊళ్ళో వుంటే రామనాధమే వెడతాడు పెదతండ్రిగారి యింటికి. అది శాస్త్రికి ఇష్టం వుండదు. కాని రామనాధం ఆ అభ్యంతరాన్ని

ఎప్పుడూ లెక్కచెయ్యలేదు. అది శాస్త్రికి మరీ కోపం.

కుర్రవాడు తనకు రక్తబంధువేం కాదు, భార్యకు అక్క కొడుకు. తమకు పిల్లలు లేరు. తల్లితండ్రీలేని పిల్లడు, చక్కనివాడు.

చేరదీద్దామంటే సరేనన్నాడు. ఆ కుర్రవాడి వాటా ఆస్తి, భూమి తానే చూసిపెట్టేడు. పెళ్ళిచేసేడు. చదువు చెప్పించేడు. తన

ఇల్లు వదిలేక ఈ రక్తబంధువు మాటమాత్రంగానయినా "పంటలు పండుతున్నాయా, వ్యవహారాలు ఎల్లా వున్నాయని" అడగలేదని శాస్త్రి

మనస్సులో కోపం.

అడిగితే చెప్తాడా అంటే అది వేరుమాట. చెప్పడు. అది తథ్యం. తన మీద నిఘా వుంచేవా అనేస్తాడు. అందుకే అడగలేదేమో

అనుకోడు. మాటకేనా అడగలేదంటాడు. అదో కక్ష. ఆ కోపాన్ని శాస్త్రి ఎన్నడూ రహస్యంగా వుంచుకోలేదు.

విశ్వనాధం ఆస్తి కరిగిపోయి, మనిషి ఆర్ధికంగా లుగసాను అవుతున్నకొద్దీ ఆ కోపం చిన్నచూపుగా మారింది. పిల్లవాడిని తాను

చేరదీసి వుండకపోతే వాని ఆస్తికూడా కరారావుడు చుట్టేసేవాడేననీ, తాను ఆ ఆస్తిని కాపాడడమే గాక మరో నాలుగెకరాలు చేసి

పెట్టేనని శాస్త్రికొక సంతృప్తి.

తనకు అంత చిన్నచూపు వున్న చోటి నుండి ఆ సలహా రావడం శాస్త్రికి ఎంతో అక్కసు కలిగించింది. అంతవరకూ తనకు తట్టివుండని

మాట ఒకటి స్ఫురించింది.

రామనాధం పెంకితనానికి వెనక మద్దతు వుందన్నమాట అనుకున్నాడు. దానితో మరికొంత వెనక్కి కూడా ఆలోచన సాగించాడు.

"కాలేజీ మానడాన్ని కూడా ఈ ప్రబుద్ధుడే ప్రోత్సహించి వుంటాడు" అనిపించింది.

దానికి శాస్త్రి దృష్టిలో బోలెడంత ఆస్కారం వుంది.

వందేమాతరం వుద్యమం రోజులప్పటి నుంచీ విశ్వనాధం వూళ్ళో స్వరాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. కేసరి పత్రికలో ఏదో వ్యాసం

వ్రాసినందుకు తిలక్‌ను ఆరేళ్ళు మాండలే జైలుకు పంపేరని రావిచెట్టు క్రిందా, పెద్ద చెరువు పావంచాలలోనూ గవర్నమెంటును

తిట్టిపోసేవాడు. విపిన్‌ చంద్రపాల్‌ వుపన్యాసం వినడానికి పనికట్టుకొని కాకినాడ వెళ్ళేడు. మొన్నటికి

మొన్న గాంధీని చూస్తానని బెజవాడ వెళ్ళేడు. ఆంధ్రపత్రికను ప్రచురిస్తానని నాగేశ్వరరావు పంతులుగారు అనుకొన్నారో లేదో కార్డు

రాసి పడేశాడు. ఆనాటి నుంచి నాగా లేకుండా తెప్పిస్తున్నాడు. పత్రిక ఆఫీసులోనన్నా వుంటాయో లేదోగాని, అతని వద్ద ఈ

ఆరేడేళ్ళ పత్రికలూ ఒక్కటీ బీరుపోకుండా నెలవారిగా కట్టలు కట్టి జాగ్రత్తగా వున్నాయి. తీరుబడిగా వున్నప్పుడు పాత

వుపన్యాసాలూ, వ్యాసాలూ చదువుతూంటాడు. కాంగ్రెసు సభలు ఎక్కడ జరిగినా వెళ్ళవలసిందే. ఆతనికి ఇంగ్లీషు రాదు, అసలే భాషా

రాదు. ఆంధ్రపత్రిక ధర్మమాయని తెలుగు వ్రాయనూ, చదవనూ వచ్చింది. నిత్యవ్యవహారానికి మించి హిందీ రాదు, సభల్లో ఎవరేం

మాట్లాడినా ఇంటికొచ్చి ఆంధ్రపత్రిక చదివి తెలుసుకోవలసిందే, అలాగని ఒక్క సభకు మానడు.

కాంగ్రెసుయెడ అతనికి గల భక్తీ, ఆసక్తీ ఆతని పరోక్షంలో గ్రామస్తుల హాస్యానికే గురి అవుతుంటాయి. ఏమంటే ఆ భక్తి

వేడిలో ఆస్తి కాస్తా హరించి పోయింది. అంతా ఆతనిని మంచివాడంటారు. న్యాయపరుడు అంటారు. కాని ఆర్ధికంగా చితికిపోయాడు. ఇంక ఆ

మంచికి బలం ఏదీ?

రామనాధాన్ని ప్రోత్సహించడానికి అతని దేశభక్తి కారణం అయి వుంటుందని కూడా శాస్త్రి అనుకోలేదు. అతని ఆస్తి మీద

కన్నుపడడమే కారణం అనిపించింది.

రామనాధం అతని మాటలలో పడి కాలేజీ మానేసేడు.

ఇప్పుడు భార్యను తీసుకురావద్దని కూడా మొరాయిస్తున్నాడు.

దానికీ విశ్వనాధం ప్రోత్సాహం వుందనడానికి ఎన్నో కారణాలు కనిపించేయి.

నారాయణమూర్తితో సంబంధం విశ్వనాధానికి మొదటి నుంచీ ఇష్టం లేదు. పోలీసు ఆఫీసరుతో సంబంధం ఏమిటని అప్పుడే అన్నాడు. వాళ్ళు

బ్రిటిష్ ‌వాళ్ళ తాబేదార్లు. ప్రజల్ని హింసిస్తారు కనక పనికిరాదన్నాడు.

చివరకాతడు పెళ్ళికి కూడా వెళ్ళలేదు. పోలీసు వాళ్ళంటే వున్న అసహ్యమూ, ద్వేషమూతో ఆ సంబంధం చెడగొట్టడానికే రామనాధానికి

ఈ ఆలోచన కలిగించేడనిపించింది. ఆ మాటే అనేసేడు.

"వాడి ముడ్డిగిల్లి ఇప్పుడీ సలహా ఇవ్వక మరేమంటావు?"

ఆ ఆరోపణ విన్నాక విశ్వనాధం చాలా చిన్నపుచ్చుకొన్నాడు. ఆ మాటకు అభ్యంతరం తెలుపడం కూడా అనవసరం అనుకొన్నాడు.

లేచేడు. కాని వెళ్ళిపోయే ముందు ఇంకొక్కమాటు హెచ్చరించకుండా వుండలేకపోయేడు.

"ఇదిగో శాస్త్రీ! మనస్సు చికాకుగా వుండి ఏదో అన్నావు. ఫర్వాలేదు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాని ఒక్కటి ఆలోచించు.

రామం చెప్పింది నాకు బేసబబుగా అనిపించలేదు. సంసారం మోసే ఈడు ఇద్దరిదీ కూడా కాదు. ఆలోచించు. చెండనాడుకోకు. నలుసంతవాడిని

ఇంతవాడిని చేశావు!"

శంకరశాస్త్రి కూర్చున్నవాడు బుస్సుమని లేచేడు. అంగోస్త్రం దులిపి భుజాన వేసుకున్నాడు.

"ఇంతమంది బంధువులుండగా వాడికేం లోటు? వాడికిప్పుడు నా అవసరం ఏం వుంది గనుక?"

ఇరవైరెండు

అబ్బాయినాయుడుగారి తోట ఇదేనా అని అడుగుతున్న కుర్రవాని గొంతు విని మాణిక్యమ్మ గుమ్మంలోకి వచ్చింది.

"ఎవరి కోసం నాయనా!"

"అబ్బాయినాయుడుగారి కోసం....."

"వారితో ఏం పని?"

"పనుంది."

"ఏ వూరు మీది?"

"ముంగండ."

"ఎవరి అబ్బాయివి....."

"మా అమ్మ పేరు విశాలాక్షి..."

"నాన్న పేరు?"

"ఆయన పేరు సుబ్రహ్మణ్యం. ఆయన లేరు. నా పేరు బాలకృష్ణ, నా వయస్సు పదేళ్ళు, అంబాజీపేటలో చదువుకుంటున్నా,

థర్డుఫారం. మా హెడ్మాస్టరు పేరు కూడా కావాలా?"

కొల్లాయి గట్టితే నేమి? · 第 5 / 22 段