"అయితే కావచ్చుననుకో, చదువులూ, పరీక్షలూ, ఏదో హడావిడి. దానికి తోడు మనం వుత్తరం వ్రాయలేదని వేధిస్తూంటే...."

విశ్వనాధం ఆమెను వూరుకోబెట్టేందుకు చెప్తున్నాడో, నిజంగానే నమ్ముతున్నాడో రామనాధానికి అర్ధం కాలేదు. కాని, దానిని సూచనగా

తీసుకోవడంలో ఆటంకం కనిపించలేదు. రమణ చదువులో ఎంత శ్రద్ధ చూపుతున్నాడో, తిండి వేళప్పుడు కూడా అతని చేతిలో పుస్తకం

ఎలా తెరిచే వుంటూందో వర్ణించేడు.

"నేను వచ్చేసే రోజున వాడిని కలుసుకొందామని హాస్టలుకెళ్ళేను. గదిలో లేడు. కూర్చున్నా, ఎంతకీ వాడు రాడు. ఇంతలో ఎవరో

చెప్తే భోజనాలకేసి వెళ్లేను. అక్కడో చెట్టు క్రింద మనవాడు చదువులో మునిగిపోయి కాఫీకి గంట కొట్టిన సంగతి కూడా

ఎరుగడు."

రామనాధం అతని శ్రద్ధను సుదీర్ఘంగా వర్ణించి, వర్ణించి అతని తరఫున క్షమాపణ వేడుకున్నాడు.

"పాపం నలిగిపోతున్నాడు. ఒక్క క్షణం కూర్చోడం లేదు. కాలేజీ ఫస్టు రావాలనే పంతంతో చదువుతున్నాడు....."

విశ్వనాధం ముఖం ఉత్ఫుల్లమయింది.

"డబ్బుకేం ఇబ్బంది పడ్డం లేదు గదా."

"మీ పెదనాన్నకి డబ్బు రంధి తప్ప వేరే లేదు. అబ్బాయి 'పెద్ద చదువులు చదివించడానికి డబ్బు ఇస్తారు. బాగా వున్నవాళ్ళు

పైకి తీసుకువస్తార'ని ఆ సంబంధం చేశారు. కొడుకుని మాకు కాకుండా చేసేశారు వాళ్ళు. ఈయన పనే ఇదంతా."

విశ్వనాధం ఆ ఆరోపణను స్వీకరించలేకపోయేడు.

"ఏమిటో నీ పిచ్చిగాని, వాడికి ఏం లోటు చేశారు? హాస్టలులో పెట్టి చదివిస్తున్నారు. చదువయ్యేక మంచి ఉద్యోగం వేయించుకొంటారు.

మన కోసమా, వాళ్ళ పిల్ల సుఖం కోసం చేసుకొంటారు గాని....."

"తల్లీ, తండ్రీ అనే పేగును చంపేసే చదువులెందుకంట. ఏదో వుద్యోగం లేకపోతే బతకలేడా? నాలుగెకరాల కొండ్ర దున్నుకుంటే జీవితం

వెళ్ళమారుతుంది."

లచ్చమ్మ సంతృప్తి విశ్వనాధానికి లేదు. తన కొడుకుగా అతనికి సంఘంలో గౌరవస్థితి కల్పించలేడు.... అందుచేతనే వెంకటరమణ

స్కూలు ఫైనల్‌ ప్యాస్‌ కాగానే పెద్ద ధనవంతుల సంబంధం వచ్చేసరికి చటుక్కున వొప్పుకున్నాడు. వాళ్ళు

లచ్చమ్మ కులం వాళ్ళే. ఆ కులంలో వివాహ క్రతువుకు పెద్ద పట్టింపు లేదు, చదువుకుంటున్నాడు, చక్కగా వుంటాడు అనేసరికి

రాయబారం పెట్టేరు. పెళ్ళి అయిపోయింది.

పెళ్ళికి విశ్వనాధం వెళ్ళలేదు.

ఆ వెళ్ళకపోవడం చేతనే వెంకటరమణకు తన జన్మస్థితిలో వున్న అల్పత్వం అర్ధమయింది. విశ్వనాధం తనకు కుదిర్చిన

సంబంధాన్ని, తన వియ్యంకులనుగా, బంధువులుగా అంగీకరించలేడు. ఆ సంగతిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని రమణ చాలా

కష్టపెట్టుకొన్నాడు. ఇంక అటువేపు సంబంధం సాగించడానికి మనసొప్పలేదు. పెళ్ళి అయినాక ఓమారు రెండు మార్లు తల్లిని

చూడబోయినా, అతడు తనకు దూరమయిపోయాడని లచ్చమ్మ గ్రహించడం కష్టం కాలేదు. తానంటే అయిష్టం లేకపోయినా తల్లిని మాత్రం

గౌరవించలేక పోతున్నాడని విశ్వనాధమూ అర్ధం చేసుకోగలిగేడు. మొదట కొంచెం బాధ అనిపించినా త్వరలోనే తట్టుకోగలిగేడు. కాని,

లచ్చమ్మ సర్దుకోలేకపోతూంది. అతడు దూరమవుతున్నాడనిపించేక, దగ్గరకు తెచ్చుకొనేటందుకు మార్గాల నన్వేషించ సాగింది. వారం

వారం ఎవరినో పట్టుకొని ఓ కార్డు వ్రాయించేది. కొత్తగా వూళ్ళో తెరిచిన పోస్టాఫీసును నిలవబెట్టుకునేందుకు గ్రామస్థులు

చేస్తున్న ప్రయత్నంలో ఆమెకు వుత్తరాలు రాసిపెట్టేందుకు మనుష్యుల లోటు లేదు. ఏదన్నా వుత్తరం వస్తే చదివిపెట్టేందుకూ లోటు

లేదు. అసలు లోటల్లా వుత్తరం రావడమే.

కొడుకు అభిమానాన్ని గ్రహించినా ఆమె దానిని స్వీకరించే స్థితిలో లేదు. ధనికులయిన అత్తవారు బీద అయిన తనతో సంబంధం

పెట్టుకోరాదని శాసించి వుంటారని కారణం కల్పించుకొంది. ఆ సంబంధం చేసినందుకు విశ్వనాధాన్ని తప్పు పడుతూంది.

"సరేలే, తేగలు కాల్చేవనుకుంటా, తీసుకురా. కొత్తింబరి కారం వుందా? ఇంత ముద్ద నెయ్యి కూడా వెయ్యి. ఏమిరా అబ్బాయి?"

లచ్చమ్మ అరిటాకులో నెయ్యీ కారం వేసి, ఇన్ని తేగలు తెచ్చి వారి ముందు పెట్టింది.

"ఇప్పుడే పకోడీలు తిన్నా"నంటూ రామనాధం ఓ తేగను ఒలిచి చీరేడు.

"అప్పుడే కూటం తోటలో చేరేరన్నమాట"--అన్నాడు. రామనాధం స్నేహితుల అలవాట్లు తెలిసిన విశ్వనాధం.

రామనాధం చిరునవ్వు నవ్వేడు.

విశ్వనాధం "స్కూలు మానేశావట. రమణ వ్రాసేడు" అన్నాడు.

"చెప్పేడు" అంటూ రెండో వాక్యానికి మాత్రమే సమాధానం ఇచ్చేడు రామనాధం.

ఆ మాట వింటున్న లచ్చమ్మ చటుక్కున అందుకుంది. ఆ రెండో భాగాన్నే.

"వెంకటరమణ వుత్తరం వ్రాశాడా?"

దొరికిపోయినట్లు విశ్వనాధం గతుక్కుమన్నాడు. కాని నిజం చెప్పక తప్పింది కాదు.

"నాలుగు రోజులయింది."

"నాతో చెప్పేరు కాదేం?"

అతడికి ఏం చెప్పాలో తెలియలేదు. ఆ వుత్తరంలో తల్లిని గురించిన మాట ఒక్కటీ లేదు. చదివి వినిపిస్తే లచ్చమ్మ గోల

పెట్టేస్తుంది. కనుక చెప్పవద్దనుకున్నాడు. కాని, ఇప్పుడు దొరికిపోయేడు.

"చెప్దామనుకుంటూనే మరిచిపోయా."

కాని, లచ్చమ్మ ఆ సమాధానానికి సంతృప్తి పడలేదు. కోపం వచ్చి విసురుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది.

విశ్వనాధం ముఖం కమిలినట్లయింది. తమ్ముని కొడుకు ఎదుట అటువంటి పరిస్థితి ఎదురవడం సిగ్గు అనిపించింది.

"చదువుకుంటున్నాడన్నమాటే గాని ఉత్తరాలు వ్రాయడం కూడా చేత కాదు. తల్లి పేరు చెప్పి ఆమె ఎట్లా వుందని వ్రాస్తే తప్ప

ఆమెకు సంతృప్తి వుండదు. ఏదో కుర్రాడు మరిచేపోయేడేమో అనుకోదు."

ఆ మాటలకు రామనాధం ఏమీ చెప్పలేదు. చెప్పాలని విశ్వనాధం వుద్దేశ్యమూ కాదు, ఒక్క నిముషం ఊరుకుని మరల ప్రస్తుతానికి

వచ్చేడు.

"తొందర పడ్డావనుకుంటా."

"ఇంక చదువు సాగించడం దేశానికి ద్రోహం చేయడమే ననిపించింది."

విశ్వనాధం 'ఎందుచేత' అని ప్రశ్నించలేకపోయాడు.

స్కూళ్ళు, కాలేజీలు, కోర్టులు, వుద్యోగాలూ మానేసి పరాయి ప్రభుత్వంతో సహాయ నిరాకరణ చేస్తే వాళ్ళు దేశం నుంచి వెళ్ళిపోక

తప్పదనే విశ్వాసాన్ని తాను రోజూ రావి క్రిందా, పెద్ద రేవులో, పొలం గట్టునా అనేక రూపాల్లో చెపుతూంటాడు. బహుశా తన మాటలు

ఈ కుర్రవాని నిర్ణయానికి కారణమేమో కూడా.

ఒక్క నిముషం ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. మరల విశ్వనాధమే ప్రారంభించేడు.

"ఏం చెయ్యాలని?"

"పునర్నిర్మాణ కార్యక్రమం...."

"అంటే.......?"

ఆ కార్యక్రమం బహుముఖం. ఖద్దరు వుత్పత్తి, ప్రచారం, పాఠశాలలు నడపడం, గ్రంథాలయాలు నిర్వహించడం, గ్రామాలలో

పారిశుద్ధ్యం గురించి ప్రబోధం. అంటరానితనం నివారించేటందుకు కృషి. మద్యపాన నిషేధ ప్రచారం...

"నేనేం అనుకోలేదు."--అన్నాడు రామనాధం అసహాయత చూపుతూ.

విశ్వనాధం ఓ నిముషం ఆలోచించేడు.

"స్వయంతీర్ణంపరాన్‌ తారయతి" అన్నాడు ఒక నిముషం పోయేక.

"అంతే మరి."...... అని అంగీకరించేడు రామనాధం.

మరల ఓ క్షణం ఇద్దరూ వూరుకున్నారు.

"ముందు మనూళ్ళో గ్రంథాలయం మూలబడింది. కుర్రాళ్ళు నలుగురినీ పోగుచేసి దానిని నడిపించడానికి ప్రయత్నం చెయ్యి."

ముంగండ గ్రంథాలయం అయిదారేళ్ళ క్రితం వరకూ జిల్లాలోకే పేరుపడ్డ గ్రంథాలయాలలో ఒకటి. అంతవరకూ నిర్వహించిన వాళ్ళు సంసార

జంజాటంలో పడి శ్రద్ధ చూపలేకుండా అయ్యారు. కొత్త వాళ్ళు వచ్చి ఆదుకోలేదు. ఎప్పుడన్నా, ఎవరన్నా పడుచువాళ్ళు ఉత్సాహం

చూపబోయినా వాళ్ళ పట్టుదలమీద పెద్దవాళ్ళకు విశ్వాసం వుండేది కాదు. చివరకది మూలబడింది.

ఆ అవిశ్వాసాన్నే రామనాధం జ్ఞాపకం చేసేడు. విశ్వనాధం దిలాసా ఇచ్చేడు.

"వాళ్ళు మాత్రం ఏం చేసుకొంటారు? ఎంతో కష్టపడి పోగుచేసిన గ్రంథాలయం ఎందుకూ కాకుండా పోతుందని కాని. నువ్వు నిలబడతానను."

రామనాధం ఆలోచించుకోకుండా ఏ మాట ఇవ్వదలచుకోలేదు.

"నలుగురినీ అడుగుతా."

గ్రామానికి గ్రంథాలయ అవసరం ఎంతుందో విశ్వనాధం బహుముఖాలుగా వర్ణించేడు.

మధ్యలో లచ్చమ్మ తిరిగి వచ్చింది.

"రాంబాబూ! తమ్ముణ్ణి కూడా తీసుకువచ్చెయ్యకపోయారా."

"వాడు రాకేం?" అన్నాడు విశ్వనాధం.

"ముందు మీకు ఇష్టం వుందా?" అని లచ్చమ్మ కవ్వించింది.

ఆ ప్రశ్నకు విశ్వనాధం వద్ద సమాధానం లేదు. అతడా ప్రశ్ననెన్నడూ ఆలోచించలేదు. చదువు మాని, వుద్యోగాలను త్రోసిపుచ్చి

గ్రామాలకు తిరిగి రావలసిన వాళ్ళల్లో ఆయన ఎన్నడూ రమణను లెక్కవెయ్యలేదు.

"ఇది ఒకరు చెప్పి చేయించవలసిన పనిటమ్మా! ఎవరికి వారు ఆలోచించుకోవలసిందిగాని" అని రామనాధం పెద్దతండ్రిని

సందిగ్ధస్థితి నుండి తప్పించేడు.

విశ్వనాధం ఏదో తప్పుచేస్తూ దొరికిపోయినట్లు, ఎదురుగా వున్న చింతచెట్టు చివరి రెబ్బలవేపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు.

"వాడి ఆలోచనలు తెలుసా?"

రామనాధం తల వూపేడు.

"ఎప్పుడేనా మాట్లాడేవా?"

"ఉహు."

"నేను చెప్పేను. కాని వాడికి పోలీసు ఆఫీసరు కావాలనే పట్టుదల. పట్టుదల కాదు, జీవితాశయం. మరేవీ వాడి

తలకెక్కలేదు."

"కానీండి. వాడికది నచ్చింది. వుద్యోగం అయినప్పుడు ఏదైతేనేం?"

విశ్వనాధం అతనివంక ఆశ్చర్యంగా చూశాడు.

"ఏదైతేనేమా?"

"పెద్దంత తేడా వుందా?"

విశ్వనాధం ఒక్క నిముషం తటపటాయించేడు.

"వుంది. చాలా తేడా వుంది. తన కుటుంబానికే ఆ ఆలోచన శత్రువును చేసి పెడుతుంది. నువ్వు విదేశీ పాలన పోవాలంటున్నావు. వాడి

ఉద్యోగం ఆ పాలనకు కాపలాకాయటం. అన్నా, తమ్ముడూ, తండ్రీ, కొడుకూ శత్రువులుగా బతుకుతారు...."

రామనాధం ఆ భయాన్ని లెక్కచేయలేదు. తన మామగారు ఓ పోలీసు ఆఫీసరేనాయె. అదేమాట మరొక విధంగా గుర్తు చేశాడు.

"మనకిదివరకే వున్న బంధుత్వాలకన్న ఇందులో వచ్చి మునిగేదేముంది?"

రామనాధం చేసుకున్న సంబంధం విశ్వనాధానికెంతమాత్రం ఇష్టం లేదు. ఆ మాట స్పష్టంగా చెప్పి శంకరశాస్త్రీ వాళ్ళ చేత మాటపడ్డం

కూడా అయిపోయింది. పెళ్ళి జరిగి నాలుగేళ్ళయిపోయినాక ఇప్పుడా అయిష్టాన్ని బయటపెట్టడం న్యాయం అనిపించలేదు. అందుచేత

సాచేశాడు.

"సరేలే. ఏదెల్లా జరగాలో మనమేమన్నా కర్తలమా?"

తండ్రికి కొడుకు ఆలోచనలు నచ్చలేదన్నంతవరకే అర్ధం అయిన లచ్చమ్మ తన కొడుకుని ఇంటికి రప్పించెయ్యడానికి అదొకదారి

కావచ్చుననుకుంది.

"పెంచి, చదువు చెప్పిస్తున్న బాబయ్యగారినే కాదనేంత వాడయ్యాడా? మాట విననప్పుడు చదువు మానిపించేసి తీసుకొచ్చెయ్యకపోయారా?"

విశ్వనాధం సమాధానం చెప్పకపోయేసరికి ఆమె తన వాదాన్ని ప్రస్తరించసాగింది. అప్పటికీ సమాధానం రాకపోయేసరికి తన వాదానికి

అభిమానాన్ని జోడించింది.

"అసలు మీకు ఇష్టం లేదు."

"ఏమిటి?"

"వాడు ఇంటికి రావడం....."

విశ్వనాధం నవ్వేడు.

"నువ్వు చెప్తే ఇంటికి రాడు. నేను చెప్పానని ఆ ఉద్యోగం ఆశా వదులుకోడు."

"ఏం?"

"కారణం ఒక్కటే...."

రామనాధం ముందు ఆ కారణం ఏమిటో ఎన్ని మార్లడిగినా విశ్వనాధం చెప్పలేదు. అతడు వెళ్ళిపోయేక తానే పిలిచి చెప్పేడు ఆమెకు.

"తన తల్లి కులం చిన్నదనేది తప్ప ఆమెగాని, తానుగాని ఈ అగ్రహారంలో వారికి ఏ విధంగా తీసిపోతామని వాడి అభిమానం. నీ

కులం చిన్నదనం నీకూ పట్టలేదు. నాకూ పట్టలేదు. ఓ భోజనం దగ్గర నేనింకా అంగీకరించలేకపోయేను. వాడు నా కొడుకు. నువ్వు

నా భార్యవు. నీ చేతి అన్నం తినలేను. వాడిని పంక్తిని కూర్చోబెట్టుకోలేను. అది అభిమానం అనిపించదూ...."

లచ్చమ్మ ఆ సంగతి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆశ్చర్యపడింది.

"వాడికా....."

ఆమె మాటను విశ్వనాధం పూర్తిచేయనీయలేదు.

"వూళ్ళో చిన్నా పెద్దా అందరూ వాడిని ఏమిరా అంటూంటే వాడందరినీ ఏమండీ అనాలి. ఎవరింటికేనా వెడితే దూరంగా అరుగు చివరన ఆనీ

ఆననట్లు కూర్చోవాలి. ఋషి పంచమి నోముల ప్రసాదాలు తినే అర్హత వాడికి లేదు. ఇవన్నీ అన్యాయాలే. అయితే మనకవి

తోచలేదు. అలవాటు పడిపోయాం. వాడికి అవి శూలాలు అయేయి."

లచ్చమ్మ జ్ఞాపకం చేసుకొంది.

"బాలకృష్ణని 'ఏమిరా' అంటే విశాలాక్షమ్మ కోప్పడ్డారట."

"నాతో చెప్పలేదు."

"నేనే వద్దన్నాను."

విశ్వనాధం ఎంతో అభిమానంతో ఆమె వంక చూసేడు.

"పోలీసు ఆఫీసరైతే తప్ప తనకీ అగౌరవాలు తప్పవని, ఎవ్వరూ గౌరవించరనీ వాడి మనస్సులో పడింది."

కొడుకు మనస్సులో పడిన ఆ అభిమానం లోతుల్నీ, విస్తృతుల్నీ ఆలోచించుకుంటూ ఆ దంపతులు చీకట్లు దిక్కుల్ని అలుముకోడాన్ని కూడా

గమనించలేదు.

పదిహేడు

ముఖం కడుక్కుని లేస్తూ, తోట్లో అడుగు పెడుతున్న సూరాయిని రామనాధం ఆప్యాయతతో పలకరించేడు.

"ఏమిరా సూరాయి! పొద్దున్నే వచ్చేవు...."

"ఏం లేదయ్యగారూ"--అన్నది కేవలం మాటవరసకు అన్నమాట. అబ్బయ్య నాయుడు తోడి అల్లుడుగారికి తోలిపెట్టిన ఆవును

తీసుకొచ్చేడు.

"పెద్ద కాపుగారికి ఆవుపాడి లేదండి. చంటిపిల్ల పాలకి పెద్ద అయ్య ఆవుని తోలిపెట్టారు. తీసుకొచ్చేనండి."

"మీ పెద్దయ్యగారు బాగున్నారా?"

"చిత్తమండి. తమ కాలి దెబ్బ ఎల్లాగుందో కనుక్కుని చూసి రమ్మని చిన్నమ్మ ఈ సీటి ఇమ్మన్నారండి."

సూరాయి ఎంతో భక్తి ప్రవత్తులతో చేతిలో వున్న చీటీని దూరంగా ఒక రాయిమీద పెట్టి పక్కకు తప్పుకున్నాడు. రామనాధం తీసి

చదువుకొన్నాడు. అతని ముఖం ఉత్పుల్లమయింది.

"మీ చిన్నమ్మగారు ఏం రాశారో ఎరుగుదువట్రా?"

"నాకేం తెలుసుద్ది బాబూ! ఏవన్నా పుస్తకాలు ఇస్తే తెచ్చిపెట్టమన్నారండి."

రామనాధం కాస్సేపు ఆ మాటా ఈ మాటా చెప్పి అసలు విషయానికి వచ్చేడు.

"మధ్యాహ్నం వచ్చి మీ అయ్యగారి దర్శనం చేసుకుంటానని చెప్పు. పుస్తకాలు అప్పుడు నేను తెస్తానులే."

మధ్యాహ్నం మూడుగంటల వేళ రామనాధం అవిడి కాలవగట్టుమీద కనిపించగానే సూరాయి తోటలోంచి కేకవేసేడు. నూతి వద్ద నిల్చుని

మాణిక్యమ్మ పలుకరించింది. గుమ్మం వద్ద ఎదురయి స్వరాజ్యం ప్రశ్నించింది.

"మీ కాలు ఎలా వుందో ముందు చెప్పండి. చూసిరారా అంటే సూరాయి మరిచిపోయానన్నాడు. సన్నాసి."

కాలుమీది దెబ్బ అంత పెద్దది కాదన్నా స్వరాజ్యం అంగీకరించలేదు.

"కాస్త మానేవరకూ ఓ కట్టు వుంచండి. తగిలిన వేలికే తగులుతుందని సామెత కూడాను."

"సామెత కనక తగులుతుందా?" అని ఎగతాళి చేసేడు రామనాధం.

సావిట్లో కూర్చున్న అబ్బయ్య నాయుడు వుత్సాహంతో స్వాగతం ఇచ్చేడు.

"ఎవరు రామనాధంగారా, నమస్కారం పంతులుగారూ! దయచేయండి.... అమ్మా! ఓ కుర్చీ వేయించేవా... రాండి, బాబూ!.....

మిమ్మల్ని గురించి మా ఇంటిదీ, అమ్మాయీ నిన్నటి రోజంతా ఒకటే చెప్పడం. వచ్చి దర్శనం చేసుకుందామన్నా అవధ్యుణ్ణి. తమరినే

శ్రమ పెట్టవలసి వచ్చింది... అమ్మా! సూరాయిని పిలిచి ఈశాన్యం మూలలో చెట్టు నుంచి రెండు లేత బొండాలు తీసి

తెమ్మను...."

తనకిస్తున్న పెద్దరికానికి రామనాధం చాల సిగ్గుపడుతున్నాడు. అతని అభ్యంతరాలను ఎవ్వరూ పట్టించుకోడం లేదు.

మాణిక్యమ్మ పళ్ళెంలో రెండు పట్టెడేసి మినప సున్నివుండలు పెట్టుకొని వచ్చింది.

స్వరాజ్యం నాలుగు అమృతపాణీ అరటిపళ్ళు తెచ్చి ఎదురుగా బల్లమీద పెట్టింది.

"మా దొడ్లో చెట్టువి. మంచి రుచిగా వున్నాయి, చూడండి."

ఇంతలో సూరాయి నాలుగు లేత కొబ్బరి బొండాలు చెలిగి సిద్ధం చేసి తెచ్చి కత్తితో సహా తెచ్చిపెట్టేడు.

రామనాధం నిస్సహాయుడుగా ఒక్కొక్కరి ముఖాలే చూసి నవ్వేడు.

"నేనేమన్నా వృకోదరుణ్ణా? మీకు నా మీద ఇంత చెడ్డ అభిప్రాయం ఎలా కలిగింది?"

అబ్బయ్య నాయుడూ, భార్యా కూడా ఏక కంఠంతో అనునయం తెలిపేరు.

"తమబోటి గొప్పవాళ్ళు మా యిళ్లకు రావడమే గొప్ప."

"మీరు ఇంత అభిమానం చూపిస్తే మళ్ళీ రావడానికి సాహసం వుంటుందా?"

చాలా సేపు లోకాభిరామాయణం సాగించి రామనాధం లేచేడు.

"ఒక్క నిముషం కూర్చోండి."

అబ్బాయి నాయుడు కూతురును పిలిచేడు.

"అవధాన్లుగారి నోటు లెక్కకట్టేవు కద. ఇవ్వవలసింది..."

స్వరాజ్యం సంకోచిస్తూనే రామనాధాన్ని సాయం కోరింది.

"మీ వూరు అవధాన్లుగారి వద్ద మేము కొంచెం అప్పు తెచ్చేం. అది ఇచ్చెయ్యాలని ప్రయత్నం...."

"ఆయన దొరకడు. రోజూ ఆడకూతురు ఎక్కడ వెళ్ళగలదు? ఆయననే రమ్మంటే రావడం లేదు" అని పూర్తి చేశాడు నాయుడు.

"పోతుందనే భయం లేనప్పుడు ఆయన తొందరెందుకు పడతాడు?"--అన్నాడు రామనాధం. అప్పయ్యావధాన్లు స్వభావాన్ని గురించి స్వయంగా

ఎరక్కపోయినా వూళ్లో బోలెడు కథలు విని వున్నాడు.

"ఆయనకు తొందర లేకపోయినా మనకుండాలి కదా, రోజు తెల్లవారిందంటే బోలెడు వడ్డీ పెరిగిపోతూంది" అన్నాడు నాయుడు.

రామనాధం తను సలహా ఇవ్వకుండా ఉండలేకపోయేడు.

"ఏ సూరయ్య కాపునో పంపితే తీరిపోతుందిగా...."

అబ్బయ్య నాయుడు ఒక్క క్షణం ఏమీ అనలేదు. తన సూచన ఆయనకిష్టం కాదని రామనాధం గ్రహించేడు.

"మీరు ఎరుగరనుకుంటా! మా సూరయ్య కాపుగారికీ, అవధానులు గారికీ మధ్య జరిగిన గొడవ తరవాత జాగ్రత్త అయినవాళ్ళ

ద్వారా గాని పంపడానికి మనసొప్పడం లేదు...."

రామనాధం ఏమీ అనలేదు. ఓ నిముషం వూరుకొని నాయుడే తన సంకల్పం వెలిబుచ్చేడు.

"తమరు ఆ డబ్బు కాస్తా జమ కట్టించిపెట్టాలి...."

"రేపు పది గంటల వేళ సూరాయికి డబ్బు ఇచ్చి పంపండి. నేను చూస్తాను. దానిదెంత పని?"

"సూరాయి ఎందుకులెండి."

స్వరాజ్యం చిన్న కాగితం పొట్లం తెచ్చి తండ్రికిచ్చింది. ఆయన దానిని రామనాధానికి అందించడానికి చేయి జాపేడు. రామనాధం

ఉలిక్కిపడ్డాడు.

"ఏమిటండదీ?"

"మీకే ఆ శ్రమ ఇస్తాను. తప్పదు."

రమారమి వెయ్యి రూపాయల భారాన్ని నెత్తిన పెట్టుకోడానికి రామనాధం జంకేడు. అవధానులుగారినే పంపిస్తానన్నాడు. స్వరాజ్యమే

వస్తే దగ్గరుండి ఆ పని పూర్తి చేయించి పెడతానన్నాడు. ముక్కు మొగం ఎరుగని వాడిని వారు నమ్మినా, ఆ గౌరవం తాను

దక్కించుకోవడానికైనా ఆ సాహసం చెయ్యలేనన్నాడు.

కాని నాయుడు కుటుంబం ముగ్గురూ అతని భయాలకు నవ్వేశారు.

చివరకు రామనాధానికి తప్పలేదు. "మీరు ఒక్కటి చూసుకోండి. నోటు చెల్లు రాసి చేతికిస్తే గాని చెయ్యి వదలకండి. సూరయ్య

కాపు గోలకి మూలం అదే" అన్నాడు నాయుడు.

"నాకు భయంగా వుంది సుమండి."

"కాలేజీలో చదువుకొచ్చిన వారికీ, సామాన్య రైతుకీ తేడా లేదా? అతనిని చేసినట్లు మిమ్మల్ని మోసం చెయ్యలేడు."

"ఇంకో విధంగా చెయ్యొచ్చు. వడ్డీ లెక్క తప్పు కట్టవచ్చు కదా...."

అదో పెద్ద సమస్య కాదన్నాడు నాయుడు.

"ఆయన మొహం చాటు చేస్తుంటే నెల రోజుల నుంచి రోజుకి రూపాయికి అర్ధణా పోవడం లేదూ...."

రెండు రోజుల నుంచి ఓ యేభయి రూపాయల అప్పు కోసం తాను ఆయనవద్దకే వెళ్ళాలనుకొంటున్న విషయం మరిచిపోయి, అంత దగాకోరు అని

ఎరిగీ అప్పయ్యావధానులుగారి వద్దనే ఎందుకు అప్పు తెచ్చారని ప్రశ్నించేడు.

నాయుడు నవ్వేడు.

అప్పు చేసేవాడి మనస్తత్వం గురించి హాస్యం చేసేడు.

"ఏమి నా మీద పెద్దభారం పెట్టేరు. అది పూర్తి చేసే వరకూ నిద్ర కూడా రాదు..." అంటూ రామనాధం లేచేడు.

"తమరు దేశం కోసం ఒక త్యాగం చేశారు. నాబోటి అవధ్యుడికి సాయం చెయ్యడంతో మీ దేశ సేవ ప్రారంభం కావాలని

కోరుకోరూ......."

అందరి వద్దా సెలవు తీసుకొని గుమ్మం దిగుతూంటే స్వరాజ్యం ఆహ్వానించింది.

"మళ్ళీ ఎప్పుడొస్తారు?"

"ఇదో పని పెట్టేరు కదా, పూర్తి కావడంతోనే వస్తా."

"ఈ పనితో మీ రాక ముడిపెట్టకండి. తీరిక ఉన్నప్పుడెప్పుడన్నా వస్తూండండి. పుస్తకాలు చదివినాక సూరాయి చేత పంపిస్తా.

మళ్ళీ ఏవన్నా ఇద్దురు గాని."

పద్దెనిమిది

రామనాధం సాయంకాలం ఇంటికి వచ్చేసరికి తల్లి మహోత్సాహంతో చెవినవేసిన శుభవార్త విని మ్రాన్పడిపోయేడు.

"ఈ నెలలో ఇంటికి కోడలు వస్తుందిరా అబ్బాయి."

మొదట ఆ వార్తకాతడు అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. అప్పుడప్పుడు తన భార్యను తీసుకువచ్చి ఓ పదిరోజులుంచుకు పంపేస్తూండడం

అలవాటుందని అతడికి తెలుసు. ఇప్పుడూ అటువంటి రాకగానే భావించేడు.

రాట్టం ఆకులకు దారం బిగిస్తూ యథాలాపంగా సమాధానం ఇచ్చేడు.

"బాగుందమ్మా!"

"ముహూర్తం పెట్టించి, మళ్ళీ కబురు చేస్తామన్నారు."

"అమలాపురం నుంచి ముంగండ వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళేందుక్కూడా ముహూర్తాలు కావలసొచ్చిందేమమ్మా."

రాజమ్మ కొడుకు అన్నీ ఎరిగి అమాయకత్వం నటిస్తున్నాడనుకొంది. ఆ కొంటెతనం తలుచుకొని నవ్వింది.

"పెళ్ళాం వచ్చేక కూడా ఆవిడ ముందు ఆ ఏకుల బుట్టా, నువ్వూ తయారవుతావా యేం! నవ్వుతుంది."

"ఎందుకమ్మా నవ్వడం?"

"ఏమిట్రా నీ ఎందుకులూ, నువ్వూనూ? కాలేజీ చదువు మాని ఏకులొడుకుతాననే వాడిని చూస్తే ఎవరయినా నవ్వుతారు."

ఆమె అభ్యంతరాన్ని నవ్వులో తేల్చివేయడానికి రామనాధం ప్రయత్నించేడు. అతని నవ్వు చూసేసరికి రాజమ్మకు కోపం చేసింది.

"రేపు వియ్యాలవారి తరఫున శుభపత్రిక తీసుకొని ఎవరో వస్తారు. శుభమా యని నువ్వు....."

అప్పుడు అర్ధం అయింది. తల్లి చెప్పే ముహూర్తానికి ఓ ప్రత్యేకార్థం ఉందని.

"ఏమిటమ్మా నువ్వనేది?"

రాజమ్మ చెప్పింది.

"మీ మామగారు కబురుచేశారు. నాన్నగారు వెళ్ళారు."

అయిదారు నెలల క్రితం సుందరి రజస్వల అయినప్పుడే రాజమ్మ కోడల్ని వెంటనే ఇంటికి తెచ్చుకోవాలనుకొంది. కాని వియ్యంకుడే

అభ్యంతరం చెప్పేడు. కూతురుకు పదమూడేళ్ళయినా నిండలేదనీ, ఆ చిన్న వయస్సులో దంపతుల్ని కలపడం ఆరోగ్యకరం కాదనీ

అన్నాడు.

ఆ సమస్య ఆనాడు తనదాకా రాలేదు కనక తాను అభ్యంతరం చెప్పవలసిన అవసరం కలగలేదు. మామగారికి మనస్సులోనే

అభినందనలు తెలిపేడు.

ఈవేళ ఆయనే ప్రోత్సాహమిస్తున్నాడని తల్లి చెపుతూంది. ఇంక తాను వూరుకోడానికి వీలులేదు. బయటపడక తప్పదు.

ఆడపిల్లలకు కనీసం పదహారేళ్ళూ, మగవానికి ఇరవయ్యేళ్ళూ వస్తే గాని దాంపత్య జీవితం ప్రారంభించరాదని అతని విశ్వాసం.

కాలేజీలో లెక్చరర్లూ, బయట సంఘసంస్కరణవాదులూ శారీరక మానసిక ఆరోగ్య సూత్రాల బలంతో ఆ అభిప్రాయాన్ని మనస్సుకు

నాటించేరు. మామగారికి లలితపూజా వగైరా ఛాందసాలున్నా ఆ మాత్రం కాలానుగుణంగా ఆలోచించగలిగినందుకు ఆనాడు సంతోషపడ్డాడు.

అయితే, ఆయన తన భార్యా వాళ్ళూ రాసి రంపానపెడితే మెత్తపడ్డాడు కాబోలుననుకొన్నాడు. ఆయన మెత్తపడ్డాడని తాను

మెత్తపడాలా?

ధృఢస్వరంతో నిరాకరణ తెలిపేడు.

"నీ కోడల్ని ఇప్పుడు తీసుకురావటం పడదమ్మా."

"అదేమిట్రా అల్లా అంటావు? శుభమా యని కోడల్ని తీసుకు రావాలనుకొంటూంటే..."

ఆమె కంఠంలో ఆశ్చర్యం, ఆదుర్దా వినిపించింది. ఆ అభ్యంతరంలో ఆమెకు కేవలం అశుభ శంక మాత్రమే కనిపించింది. రామనాధం

గ్రహించేడు.

"కోడల్ని పంపమను. ఆవిడ వుంటానన్నంత కాలం వుంచుకోండి. పంపించండి. అంతేగాని...."

ఒక్క నిముషం ఆగి ఆ దృఢస్వరంతోనే ఆ అభిప్రాయాన్నే మరో రూపంలో వివరించేడు.

"నాతో చెప్ప పనిలేదు."

"నీతోగాక ఇంకెవరితో చెప్తాను? ఎవరన్నా వింటే నవ్వుతారు. యెందుకా కోపం? వాళ్ళేం చేశారని?....."

అయిదారు నెలల క్రితమే తన భార్యను పంపనందుకు కోపం వచ్చిందనీ, అదే ఈ అభ్యంతరానికి మూలమనీ ఆమె అనుకొంది. ఆమెకు

ఎల్లా సమాధానం చెప్పాలో రామనాధానికి అర్ధం కాలేదు.

"ఇప్పట్నుంచీ...."

కొడుకు మాటను మధ్యలోనే త్రోసిపుచ్చింది రాజమ్మ.

"పెద్ద మనిషి అయిన పిల్లను వాళ్ళెంత కాలం మాత్రం వుంచుకుంటారురా?......"

"కూతురు బరువుగా వుంటే పంపెయ్యమను. దానికి ముహూర్తాలూ...."

"తప్పు, తప్పు...." రాజమ్మ మందలించింది.

"అలాంటి మాటెప్పుడూ అనకు. వింటే వాళ్ళేమనుకుంటారు. కూతురికి తిండి పెట్టలేని దురవస్థ లేదు వాళ్ళకి. రాజాలాంటి వుద్యోగం.

నౌకర్లు, చాకర్లు, బోలెడంత సంపత్తి. ఆ మాట అన్నావని తెలిస్తే....."

మాటకు మాటగా వచ్చేసినా, ఆ మాట అన్నందుకు రామనాధమే సిగ్గుపడ్డాడు.

"అది కాదమ్మా! ఆ సందేహం వుంటే పంపెయ్యమన్నమాటగా అన్నా గాని...."

రాజమ్మ సంతృప్తిపడింది. కాని అది జరిగేది కాదంది.

"అలా అడగనూ కూడదు. వాళ్ళు పంపనూ పంపరు. ఆ అడ్డు కాస్తా తీరితేగాని వాళ్ళెల్లా పంపుతారు? మనమెల్లా అడుగుతాం...."

ఈమారు రామనాధం తన మనస్సులో వున్న అభ్యంతరాన్ని బయటకు స్పష్టంగా చెప్పక తప్పలేదు.

"పదమూడేళ్ళన్నా నిండలేదమ్మా! ఇప్పటినుంచీ...."

ఆమె రజస్వల అయిందని రాజమ్మ గుర్తుచేసింది.

రజస్వల కావడం కుటుంబ జీవితానికి అర్హతగా తీసుకోరాదంటాడు రామనాధం.

"పెద్దమనిషైతే మాత్రం, వయస్సేం వుందమ్మా."

కొడుకు మాటలకు ఆశ్చర్యపడడంకన్నా రాజమ్మ ఎక్కువగా సిగ్గుపడింది.

భార్య వయస్సును గురించి అటువంటి సానుభూతిని తెలపడం ఆమె ఎన్నడూ ఎరగదు. ఆడపిల్ల పన్నెండేళ్ళు వెళ్ళినా పెద్దమనిషి

కాకపోతే నిషేకం జరిపెయ్యటం చూసింది. ఆడపిల్ల త్వరగా పనికిరావాలని అరటికాయను ఊదరపెట్టినట్లు తెగ మేపడం చూసింది.

ఆలస్యంగా రజస్వల అయ్యే సంప్రదాయం గల కుటుంబాల్లో ఆడపిల్లల్ని గురించి ఎదురుచూస్తూండడం ఎరుగును. పెద్దమనిషయితే చాలు

పదేళ్ళకే ఆడపిల్లను భర్తతో కలపడం తప్పుకాదనే ఆలోచనల మధ్య ఆమె పెరిగింది. ఇప్పుడు కొడుకు వేసిన ప్రశ్ననామె

ఎరగనే ఎరగదు.

"పోరా సిగ్గుమాలినవాడా!" అని సంభాషణను తుంపివేసి వంటపని చేసుకొనేటందుకు వెళ్ళిపోయింది.

పందొమ్మిది

ఆ అభ్యంతరాన్ని శంకరశాస్త్రి అతని భార్య అంత తేలిగ్గా తీసుకోలేక పోయేరు. ఆమెకు నవ్వు మాత్రమే తెప్పించిన ఆ మాట

చెవిని బడేసరికి ఎదురుదెబ్బ తిన్నట్లు దిగ్భ్రాంతుడయ్యేడు. పెళ్ళికి ఒప్పించడానికై తానెంత శ్రమపడవలసి వచ్చిందో అతడు

మరచిపోలేదు. అప్పటికీ, ఇప్పటికీ మధ్య నాలుగేళ్ళు గడిచేయి. పేరుకు నాలుగేళ్లు గాని, అంతక్రితం గడిచిన 15-16

ఏళ్ళ పెంపకమూ ఈ నాలుగేళ్ళ జీవితమూ ఒకదానికొకటి పోలిక లేదు. ఎవ్వరితో మాట మాత్రం కూడా చెప్పకుండా కాలేజీ వదిలేసి

రావడంలోనే అది కనబడింది.

పెంచిన బిడ్డను ఇంకా ఇంకా గొడవల్లో పడిపోకుండా చెయ్యడం కోసం తాను తయారు చేసిన పథకం అంత సులభంగా నిరుపయోగం కాగలదని

శాస్త్రి వూహించనే లేదు.

* * * * *

మధ్యాహ్నం భోజనం కాగానే ఓ కునుకు తీయడం ఆయన అలవాటు. ఆ రోజున ఆ అలవాటు తప్పించేడు. తిండి తిని చేయి కడుక్కుంటూనే

ఆమలాపురం పరుగెత్తాడు.

వియ్యంకుణ్ణి చూడగానే చూపిన వుత్సాహం, ఆయన చెప్పిన వార్త విన్నాక నారాయణమూర్తిలో కనబడలేదు. అల్లుని దేశహితైక

చర్యను విని నారాయణమూర్తి నిర్విణ్ణుడయ్యేడు. కాబోయే కలెక్టరుకు మామనవ్వాలన్న ఆశ మిగలలేదు. ముందు తన ఉద్యోగం

మాటేమిటని భయం పట్టుకొంది.

తన అల్లుడు. సాక్షాత్తూ తన కూతురు మగడు సహాయ నిరాకరణం చేశాడు. ప్రభుత్వం ఏమంటుంది? అల్లునిలో రాజభక్తి

కలిగించడమో, రాజభక్తి గల అల్లుడిని తెచ్చుకోవడమో తనదే బాధ్యత అనరా? మరో మరో ఉద్యోగం కాదు కదా. పోలీసు

డిపార్టుమెంటు. ప్రభుత్వానికి రెప్పలా భావించబడే శాఖ. ఉద్యోగుల నుంచే కాక, వారి బంధువుల నుంచి కూడా అచంచల భక్తి,

విశ్వాసాలు కోరే శాఖ. ఈ కథ తెలిస్తే తన స్థితి ఏమవుతుంది? ప్రమోషన్ల మాట దేవుడెరుగు. అసలీ ఉద్యోగం మాత్రం

వుంచుతారా?

అంత దర్పం, దాష్టీకం చూపే అంతమనిషీ ఆ ఆలోచన తోచేసరికి జావయిపోయేడు. ఎటువంటి వాడికి పిల్లనిచ్చానురా భగవంతుడా

అనిపించింది. వెతికి వెతికి తీసుకొచ్చిన సంబంధం ఇప్పుడేమనుకొంటే ఏం లాభం? తప్పు చేశాననుకున్నా దిద్దుకోవడం సాధ్యమా? తన

అసమర్థతకి ఉక్రోషం పుట్టుకొచ్చింది. ఆ ఉక్రోషంలో ముంగండ వాళ్ళందర్నీ కలిపి తిట్టేడు. ఆ వూళ్ళోని బ్రాహ్మణశాఖ వారి

బలహీనతను వెక్కిరించే ప్రస్తావిక శ్లోకం చదివేడు.

"మొత్తం మీద 'నోభయంగాళ్ళ'నే మాట సార్ధకం చేశారు" అన్నాడు.

మొదట కొంచెం సేపు ఓపిక పట్టి శంకరశాస్త్రి వియ్యంకుడికి తన పథకం నచ్చచెప్పడానికి ప్రయత్నించేడు. కాని, చచ్చిపోయిన

వాళ్ళనూ, బ్రతికివున్న వాళ్ళనూ, గ్రామాన్నీ, శాఖనూ కలిపి తిడుతూంటే ఎంతోసేపు సహించలేకపోయేడు.

కోపం మాట వస్తే శంకరశాస్త్రి తక్కువవాడు కాదు. ఎదుటివాడు పోలీసు ఉద్యోగి అయ్యేది, మరొకడయ్యేది.

ఝుణంఝణలాడించేడు. "తర్వాత ఏమిషయీది."--అనేసి పైనున్న కండువా కుర్చీలో పారేసి ఝయ్యిన లేచేడు.

రెండు గొంతులూ పెద్దవిగా వినబడేసరికి వియ్యంకుడికి ఫలహారం ఏర్పాట్లు చేస్తున్న అన్నపూర్ణమ్మ పరుగెత్తి వచ్చింది. గదిలో

మంచంమీద పడుకొని వారి మాటలన్నీ వింటున్న సుందరి లేచి వచ్చింది. ఆమె ముఖం చూడగానే తమ మాటలు ఆమె విన్నదని శాస్త్రి

గ్రహించేడు. ఆమెను బెదరకొట్టకూడదు. చటుక్కున సర్దుకు కూర్చున్నాడు. కాని, ముఖంలో ఆ ఉద్విగ్నత మాయలేదు.

అసలు సంగతి వినేసరికి అన్నపూర్ణమ్మ ముఖం నల్లబడింది. కాని, తెలివి కోల్పోలేదు. ముందు రంగంలోంచి కూతుర్ని పంపేసేటందుకు

పని పురమాయించింది.

"పొయ్యి చూడు తల్లీ."

ఆమె వెళ్ళిపోయేక ఉభయుల్నీ శాంతపరచ పూనుకొంది.

"ఆయనకు ప్రథమ కోపం అన్నయ్యా! వారిని ఎరగరా ఏమన్నానా? వారి మాటలే అంత. పైగా గవర్నమెంటుతో వ్యవహారమేయని

ఆందోళన. ముందుకు రావలసిన కుర్రాడు తప్పుదారి పట్టేశాడే అన్న విచారం. ఆ మాటలకు కోపం తెచ్చుకొంటే ఎల్లాగ? మీబోటి

వారు......"

అన్నపూర్ణమ్మ అటు మొగుణ్ని కసిరీ, కనుసంజ్ఞలతో బ్రతిమలాడీ మాట్లాడకుండా చేసింది. ఆ మాటా, ఈ మాటా చెప్పి వియ్యంకుణ్ణి

సముదాయించింది.

"మరిప్పుడేమిటి చెయ్యడం?"

అని ముందు ఆలోచనకు హెచ్చరించింది.

ఆమె తెలివీ, మాట నేర్పూ, ఓర్పూ చూస్తూ పరకాయిస్తున్న శాస్త్రి మనస్సులోనే ఆనందపడ్డాడు. ఈ తల్లి తరిఫీదులో పెరిగిన

పిల్ల తన కొడుకుని దారిలోకి తేగలిగేదేయని విశ్వాసం కలిగింది.

"......ఈ వరస చూస్తే ఇతగాడు అసలా అవకాశం ఇచ్చేలాగే లేడే..." అనుకొన్నాడు శంకరశాస్త్రి.

* * * * *

"జరిగిపోయిందేదో జరిగిపోయింది. అంతకంటె ముందుకెళ్ళి సభలనీ, ఖద్దరనీ...." అర్ధోక్తిలోనే అన్నపూర్ణమ్మ మాటకు అడ్డం

వచ్చేడు శాస్త్రి.

"అదేం మిగలలేదు. ఖద్దరుతోటే వచ్చేడు ఊళ్ళోకి."

ఖద్దరు వేసుకొన్న వాళ్లు ఎంత ఖరీదునైనా తమ పూర్వపు దిరీసుల్ని మంటల్లో పారేస్తున్న కథల్ని వింటున్న అన్నపూర్ణమ్మ

ఆశ్చర్యంతో నోరు తెరిచింది.

"అల్లుని వద్ద మంచి ఖరీదయిన బట్టలు...."

నారాయణమూర్తి పళ్ళు కొరుకుతున్నాడు. అవన్నీ మరి లేనట్లు శాస్త్రి తల తిప్పేడు.

అన్నపూర్ణమ్మ ఒక్క నిట్టూర్పు విడిచి ఆశ్చర్యం నుంచి తేరుకుంది. మళ్ళీ అదే ప్రశ్న....

"మరిప్పుడేమిటి చెయ్యడం!"

నారాయణమూర్తికి తన పోలీసు పద్ధతులపై అనంతమైన విశ్వాసం. దానికి అనుగుణంగానే ఉంది ఆయన సలహా.

అతి గారాం, తినడానికి మస్తుగా ఉండడం వగైరా అవలక్షణాల వలన ఈ మాదిరి ఔద్దత్యం పుట్టుకొస్తూంటుందని అయన నమ్మకం.

దానికొక్కటే మందుంది. ఆయన సంచికట్టులో.

"గూళ్ళు విరగబొడిచేసి, బొక్కలో తోసేస్తే...."

కొల్లాయి గట్టితే నేమి? · 第 4 / 22 段