కలిగించింది. అతని మాటలు విన్నాక రాజమ్మ తన అవజ్ఞతకు లెంపలు వాయించుకుంది.
కాని, తన కొడుకును భర్త మీదికి రెచ్చగొడుతున్న ఈ చర్యకు మూలం అమెయేనన్న అభిప్రాయం మాత్రం మార్చుకోలేదు.
అయితే డబ్బు సమస్యను పరిష్కరించే విషయం అల్లాగే వుండి పోయింది. భర్తముందు ఆ ప్రసక్తి తేవడానికామె సిద్దంగా లేదు.
రామనాధం కూడా ఇప్పుడే డబ్బు మాట ఎత్తకూడదని ఆమె సలహా.
"కాస్త కోపం తగ్గేక పంపొచ్చులే."
కాని, డబ్బు పంపడం తన ప్రతిష్టతో ముడిపడి వుందనిపిస్తూంది. ముక్కు మొగం ఎరుగని తనకు, రాజమండ్రి వదిలి వెళ్ళిపోతున్న
వాడికి ఏభయి రూపాయల బట్టలు అప్పిచ్చి పంపడానికి ఆమె చూపిన నిబ్బరాన్నీ, మానవులపై ఆమెకు గల విశ్వాసాన్ని చూశాక
ఆమె మీద విపరీతమైన భక్తి పెంచుకున్నాడు. రెండు రోజుల్లో డబ్బు పంపుతాననీ, తరువాతనే తీసుకెడతాననీ చెప్పివచ్చేడు.
ఇప్పుడా మాట తప్పితే తన మర్యాద ఏముంటుంది?
రామనాధం ఒక్కక్షణం ఆలోచించి నిశ్శబ్దంగా లేచిపోయేడు. అతని ముఖం చూశాక రాజమ్మకు చాలా వేదన కలిగింది. ఇంతకాలం చేరదీసి
పెంచిన కొడుకు దూరమైపోతున్నట్లనిపించింది.
"ఒరే రాముడూ?"
ఏదో నచ్చచెప్పాలనీ, సర్దుబాటు చెయ్యాలనీ తపన. కానీ అతడు అప్పటికే గుమ్మం దిగేసేడు. ఆమె పిలుపు వినబడనేలేదు.
పదమూడు
వంటింటి తలుపు గొళ్ళెం పెట్టి సావిట్లోకి వచ్చేసరికి, ఎవరో కిటికీకి ఎదురుగా మడత మంచం వాల్చుకొని పడుకుని వుండడం చూసి,
విశాలాక్షి చటుక్కున ఆగింది. అంతలో రామనాధాన్ని గుర్తుపట్టి ముందుకు అడుగు వేసింది.
"నువ్వుట్రా, హడలిపోయేను."
రామనాధం కళ్ళ మీద చెయ్యి తీసేడు.
అతడు వచ్చేసరికి విశాలాక్షి లోపల ఏదో పని చేసుకొంటూంది. బద్దకంగా వుండి మంచం వాల్చుకు పడుకున్నాడు.
"ఈ లోపున ఏ దొంగాడైనా ఇల్లంతా చక్కపెట్టుకు పోవచ్చు. అంత బేఫరవాగా వున్నారు."
"ఇప్పటివరకూ నాన్న ఇక్కడే వున్నాడు. ఎంగిలాకు పారేసి రావడానికి దొడ్లోకి ఇప్పుడే వెళ్ళేను. నువ్వు భోంచేసేవా?"
"చేసే వస్తున్నా."
"మరి ముఖం అల్లా వుందేం?"
రామనాధం మంచం దిగి గోడనున్న అద్దం ముందు నిలబడ్డాడు. ముఖం డీలా పడ్డట్లు తనకూ తోచింది.
"రాత్రి పడవలో సరిగ్గా నిద్రలేక అయివుంటుంది."
"కాస్సేపు పడుకో. వుండు, తలగడ తెచ్చిస్తా."
విశాలాక్షి లేచింది.
రామనాధం వెనక్కి తిరిగేడు.
"వద్దు, ఇప్పుడు నిద్ర రాదు. పనుంది కూడాను."
"ఏమిటా ముంచుకుపోయే పని?"
ఆ మాట అంటూనే లోపల నుంచి ఓ తలగడ తెచ్చింది. మంచం మీద అమర్చింది.
"పడుకో."
అతడు ఏ సమాధానమూ యిచ్చే లోపునే వీధి గుమ్మంలోంచి పిలుపు వినిపించింది.
"వదినా!"
పిలుపు వెనకనే మంగమ్మ లోపలికి అడుగు పెట్టింది. విశాలాక్షి "రావే" అంటూ ఆహ్వానించింది.
"పైవాళ్ళెవరూ లేరు. మా తమ్ముడు."
"ఎవరు, కలెక్టరు బావా?"
రామనాధం ఇంగ్లండు చదువుకొనేటందుకు వెళ్ళడానికై చేస్తున్న ప్రయత్నాలు బంధువులలో కలిగించిన ఆశల ప్రతిధ్వని. మంగమ్మ
అతని పెద్ద అత్తగారి కూతురు. రామనాధం నవ్వేడు.
విశాలాక్షి చాపమీద కూర్చుంటూ ఆమెనూ ఆహ్వానించింది.
"రావే. అందరివీ భోజనాలయేయా? ఇప్పుడే చెయ్యి కడుక్కున్నా."
మంగమ్మ--"పోవాలి తల్లీ! నీకేం కూర్చోమంటావు" అంటూనే గోడను ఆనుకొని దూరంగా వట్టి నేలనే కూర్చుంది.
రామనాధం హాస్యం చేశాడు.
"నువ్వు చాపలో కూర్చోమనాలి కాబోలునే అక్కా!"
మంగమ్మ ఎంతో విసువూ, ఆయాసమూ కనబరచింది.
"కూర్చున్నట్లే వుంది. వారం రోజులనుంచి ప్రాణాలు తోడేస్తున్నారు."
రామనాధం అర్ధంగాక అక్క ముఖం వంక చూసేడు.
"వాళ్ళ చెల్లెలి పెళ్ళి కాదుట్రా? పనులు చేస్తున్నారు."
"ఓస్ అంతేనా? ఊరందరి పనులూ నెత్తిన పడిపోయినట్లు అంటూంటేను."
రామనాధం తేలికగా తీసివేయడాన్ని మంగమ్మ సహించలేకపోయింది.
"మీకేమిటోయి మగ మహారాజులు! అన్నీ అమర్చి విస్తట్లో పెడితే 'ఓస్ ఇంతేనా' అని తేలికగా చప్పరించేస్తారు."
ఆడవాళ్ళకు జరుగుతున్న అన్యాయాలన్నింటికీ రామనాధమే కారణం అన్నంత ఆవేశంతో మంగమ్మ చర్రుమనేసరికి అతడు పకపక
నవ్వేడు.
విశాలాక్షి చిరునవ్వు నవ్వింది.
"నీ మెత్తదనం అనుకోక వాడి మీద కోపపడతావెందుకే?"
అనవసరంగా ఆవేశపడ్డందుకు మంగమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. విశాలాక్షి లేచింది.
"కనీసం వాళ్ళ పనులన్నా వాళ్ళను చేసుకోమనాలి."
మంగమ్మ ఉడుకుబోతుతనంతో బుంగమూతి పెట్టింది.
"నే వద్దంటున్నానా?"
"వద్దనవు. కాని చెయ్యలేననీ అనవు."
మంగమ్మ తన బలహీనతను సమర్ధించుకొంటున్నట్లు నసిగింది.
"ఇంక వాళ్ళ చేత దెబ్బలు తినడం ఒకటి తరవాయి."
దెబ్బల మాట వచ్చేసరికి రామనాధం విస్తుపోయాడు. కాని నమ్మలేకపోయేడు.
"నిజంగా?.....'
అప్పటికే తాను బయటపెట్టకూడనివి చాలా తేలిపోయినట్లు మంగమ్మ భయపడి లేచింది.
"మీతో మాటలు పెట్టుక్కూర్చుంటే అయిందే. పోతా."
"ఓ అర ఘడియలో నేనూ వస్తున్నా కూర్చో. అప్పుడే వాయ పెట్టేరా?"
"రోకలి కోసం వచ్చా."
"పంచలో వుంది పట్టుకెళ్ళు."
మంగమ్మ లోపలికెళ్ళింది. విశాలాక్షి అనుతాపం తెలిపింది.
"నోరూ, వాయీ లేదు. ఎల్లా బ్రతుక్కొస్తుందో పాపం! ఇరవయ్యేళ్ళు నిండలేదు. ఈ బతుకు యెంతకాలానికి తెల్లవారను?"
రామనాధం అక్కగారి ముఖం వంక చూసేడు. ఒక్క మంగమ్మ కోసమేనా ఆమె విచారం? తనకి మాత్రం వయస్సెంతుంది? తన బ్రతుకేమిటి?
కొడుకొకడున్నాడు గాని......
విశాలాక్షి ఆ హడావుడి ఎందుకో చెప్పింది.
"పెళ్ళికి అటుకులు అంటూ ఓ బస్తాడు కొట్టిస్తున్నారు. అవన్నీ ఈ వెర్రిమొహం చేతి మీదుగా నడవాలి కాబోలు. ఇల్లు పట్టిన
విధవ కూతుళ్ళుంటే ఊరికే పోనిస్తారూ...?"
"పెళ్ళిళ్ళకి కూలీల్ని పెట్టి కొట్టించుకోకూడదూ?"
"మడి ఎల్లాగ?"
మడి అన్నది బ్రాహ్మణ్యానికి లక్షణమాయె. రామనాధం నిరుత్తరుడయ్యేడు.
"నువ్వు పడుకో ఓ నిముషం. నాలుగు వాయల్లో పోటు వేసి చక్కా వస్తా."
రామనాధం ఏమనడానికీ అవకాశం ఇవ్వకుండానే విశాలాక్షి లోపలికి వెళ్ళింది. బట్టలు మార్చుకొని తిరిగి వచ్చేసరికి అతడు
పడుకుని వున్నాడు. వీధి తలుపు జేరవేసి వెళ్ళిపోయింది.
ఆమె రావడం, వెళ్ళడం ఎరిగి వున్న రామనాధం కళ్ళమీది చెయ్యి తియ్యలేదు. ఏమేమో ఆలోచిస్తూ అలాగే పడుకుని వుండిపోయాడు.
ఆ ఆలోచనలలో వుండిపోయి మంగమ్మ లోపలికి రావడాన్ని అతడు గమనించనేలేదు.
మంగమ్మ ఒక్క నిముషం నిలబడింది. కళ్ళను మూసి వున్న చేతి క్రింద అతడు నిద్రపోతున్నదీ లేనిదీ తెలియలేదు. కాలి
బొటనవేలు పట్టుకుని కదిలించింది. రామనాధం వులికిపడి లేచి కూర్చున్నాడు.
"మీరా?"
మంగమ్మ మందహాసం చేసింది. నెమ్మదిగానే అయినా వేళాకోళం చేయకుండా వుండలేకపోయింది.
"ఎవరనుకొన్నావేం?"
అతడు సమాధానం ఇవ్వడానికి అవకాశం ఇవ్వకుండానే తాను వచ్చిన పని చెప్పింది.
"ఇందాక నేను అన్నది మనస్సులో పెట్టుకోకేం. మళ్ళీ ఎవరి దగ్గరా అనకు."
ఎవరి దగ్గరా అనకూడని మాట ఆమె ఇందాక ఏమందో అతనికి అర్ధం కాలేదు. అదే అడిగేడు.
మంగమ్మకు ఆశ్చర్యం కలిగింది.
"అతిశయం పోకు."
"నిజంగానే...."
"దొంగాడు చెయ్యి కరుస్తాడే--అన్నట్లు జ్ఞాపకం చెయ్యడం కూడా ఎందుకులే."
అన్నదే కాని ధైర్యం లేకపోయింది. రామనాధం ఆమె ముఖం వంక చూస్తూ, అడగడానికి సందేహించేడు.
"ఒక్కటి అడుగుతాను. ఏమీ అనుకోరు కదా?"
ఆమె అనుమానిస్తూనే అంది.
"ఏమిటది?"
"పార్వతి అభిమానంగా చూస్తుందా?"
పార్వతి మంగమ్మకు అన్న భార్య. ఆమె రామనాధానికి బంధువురాలు కూడాను. మంగమ్మ మనస్సులోది చెప్పడానికి జంకింది.
"అందరూ అభిమానంగానే వుంటారు."
"సుబ్బారావు?"
సుబ్బారావు ఆమె అన్న.
ఆ ప్రశ్నలకు ఆమె చిరాకు కనబరచింది.
"అమ్మా, నాన్నా వుండగా ఒకరి అభిమాన దురభిమానాలతో పనేం వుంటుంది."
ఒక్క నిముషం వూరుకున్నాక తాను వచ్చిన పని చెప్పేసింది.
"నేనేదో ఇబ్బందులు పడిపోతున్నానని మళ్ళీ ఎవరి దగ్గరన్నా అంటావేమో సుమా...."
ఆమె భయం అతనికి అర్ధం అయింది. జాలీ, విచారమూ కలిగేయి. కాని తానామెకు ఏ విధంగా సాయం చెయ్యగలడు? వీరేశలింగం పంతులు
గారి శరణాలయం జ్ఞాపకం వచ్చింది. కాని, ధైర్యంగా ఆ సూచన ఇవ్వలేకపోయేడు.
సులభంగా చెప్పగలదీ, ఆమె వరకు తప్పు పట్టుకొంటుందనే భయం లేనిదీ ఒక్కటే. తన్ను ఏమన్నా అన్నారంటే నోరుకొక్కేసెయ్యమని
చెప్పడానికి మనసు ఒప్పలేదు. అమాయకంగా ఎప్పుడూ నవ్వుతూ వుండే ఆమె ముఖాన్ని కసీ, కార్పణ్యంతో వూహించలేడు.
అందుచేత మాట తప్పించాలనుకొన్నాడు.
"మీ చదువు జరుగుతూందా?"
మంగమ్మ కళ్ళనీళ్ళు తిరిగినట్లనిపించింది.
"ఎక్కడో ఏదో దేశంలో ఆడపిల్లలు పుట్టగానే నదిలో మొసళ్ళకి పారేసే వారంటూ ఆ మధ్య చెప్పేవు. మన దేశంలో కూడా ఆ
ఆచారం వుంటే ఎంత బాగుండునో....."
రామనాధం తన నెత్తిన ఎవరో మొత్తినంత బాధపడ్డాడు. మనస్సులో ఎంత బాధ వుంటే ఆ మాట అని వుంటుందనిపించింది. తానా బాధకి
ఏమి వూరడి ఇవ్వగలడు?
రామనాధం వూరుకున్నాడు.
"ఒక చిన్న సాయం చెయ్యగలవా?"
తానామెకు చేయగల సాయం ఏమిటో? కాని, తానేదో సాయం చేయగలనని ఆమె అనుకోవడం చాలా గొప్ప అనిపించింది.
'చేయగలిగిందైతే'--అనే మినహాయింపు కూడా వుంచుకోకుండా మహోత్సాహంగా మంచం దిగేడు.
"చెప్పండి."
మంగమ్మ అటూ ఇటూ తొంగి చూసింది.
"వీరేశలింగంగారి అనాథ శరణాలయంలో ఆడవాళ్ళకి చదువు చెప్పిస్తారట కదూ."
తాను చేయదలచిన సూచన అదే. ఇప్పుడామె ఆ ప్రతిపాదన తెచ్చింది. తీరా ఆమె నోటినుంచే ఆ మాట వచ్చేసరికి అన్నీ
అనుమానాలే కలిగేయి.
బంధువులందరినీ కాదని శరణాలయంలో చేరాలి. ఆమె తండ్రి, అన్నలూ అంగీకరించి పంపరు. అక్కడ వితంతు వివాహం చేసేసుకొంటుందని
భయం. తనంత తానుగా వెళ్ళితే మాత్రం, వెతకరూ? కనిపిస్తే లాక్కు వచ్చేస్తారు. నిగ్రహించి నిలబడగలదా? అన్నింటికన్నా
పెద్ద చిక్కు వేరే వుంది. అగ్రహారాచారాల మధ్య పెరిగింది, అన్ని కులాల వాళ్ళతో కలిసి వుండగలదా? అన్నీ అనుమానాలే.
"అదే అడగాలనుకొన్నా? ఏమనుకొంటారో....."
మంగమ్మ అతని మాట పూర్తికాకుండానే ముందు కర్తవ్యం సూచించింది.
"నువ్వు నాన్నని ఒప్పించాలి."
రామనాధానికి నిరుత్సాహమే అనిపించింది.
"జరిగినట్లే....."
"ఒప్పించాలి మరి...."'
అతనికి నమ్మకం లేదు.
"నేను అడగమన్నట్లు చెప్పేవు గనక....."
ఔచిత్యానౌచిత్యాలు ఎరగని కుర్రవానికి చెప్పినట్లు చెప్పడం అతనికి కష్టం తోచింది.
"అంత తెలియనివాడిననుకొన్నారా యేమిటి?"
"అదికాదోయి."
రామనాధం కష్టపెట్టుకొన్నట్లు ఒక్క నిముషం వూరుకున్నాడు.
"కోపం వచ్చిందా?"
"మనస్సు నొచ్చే మాటకి కోపం ఎందుకేమిటి?"
మంగమ్మ అంత భయమూ, ఆదుర్దాలోనూ నవ్వేసింది.
"మళ్ళీ వదిన వచ్చేస్తుంది. మరిచిపోకు. మా నాన్నకి నచ్చ చెప్పాలి."
గిర్రున వెనుతిరిగింది. తన మాటమీద ఆ విశ్వాసం వుంచుతారనే ఆ దిలాసా ఏమిటో, అడుగుదామనుకుంటుండగానే ఆమె వెళ్ళిపోయింది.
పద్నాలుగు
విశాలాక్షి అటుకుల వడ్లపోటు నుంచి తిరిగి వచ్చేవరకూ రామనాధం అక్కడే కూర్చున్నాడు. తన సమస్యకు పరిష్కారమార్గం
అతడెరగడు. అడగడానికైనా అక్కకన్న దగ్గరవాళ్ళూ, మనసిచ్చే వాళ్ళూ కనబడలేదు. ఆమె చూపాలి దారి. వస్తూనే
విశాలాక్షి తమ్ముడక్కడే వుండడం చూసి, ఆశ్చర్యం కనబరచింది.
"ఇక్కడే వున్నావుట్రా, వెళ్ళిపోయేవనే అనుకొన్నా, అక్కడ నరసం పిన్ని ఏదో గొడవలు విడేసింది, వదుల్చుకు రావడం మర్యాద
కాదు. అక్కడికీ వీధి తలుపు గొళ్ళెం పెట్టి వచ్చేనని చెప్పి వచ్చేశా."
"నువ్వు రాలేదని....."
"ఉండు, వస్తున్నా కాళ్ళు కడుక్కుని."
కాళ్ళు కడుక్కుని వస్తూ నాలుగు అరటి పళ్ళు తెచ్చింది.
"తీసుకో, దొడ్లో నూతి దగ్గరున్న అమృతపాణీ బోదె వేసింది. మంచి గెల పడింది.
విశాలాక్షి మళ్ళీ లోపలికెళ్ళి గుండ్రటి కంచు చెంబుతో మంచినీళ్ళు తెచ్చి మంచం పక్కనే వున్న కిటికీలో పెట్టింది.
గృహస్వామినిగా తన బాధ్యతలు పూర్తి అయినాక చాప పరుచుకొని కూర్చుంది.
"ఏమిట్రా సంగతులు? ఏమిటి ఇప్పుడొచ్చేవు, సెలవులేమన్నా వున్నాయా?"
ఇంతవరకూ ఆ ప్రశ్న రాలేదేమనుకొంటున్న రామనాధానికి తాను కాలేజీ వదిలి వచ్చేసిన సంగతి తన అక్క చెవిన పడనేలేదని
అర్థం అయింది.
దాపరికం ఏముంది? చెప్పేసేడు. అతడు గాంధీగారి ఆదేశానుసారం కాలేజీ మానేశాననేసరికి విశాలాక్షి మ్రాన్పడిపోయింది.
భవిష్యత్కార్యక్రమం గురించి అస్పష్టంగా వున్న తన ఆలోచనలు ప్రస్తరించేసరికి ఒక్క నిట్టూర్పు విడిచింది.
"బాగుంది నాయనా! బాగుంది."
ఆ కంఠంలోని నిరసన భావాన్ని గమనించినా అతడు గుర్తించదలచుకోలేదు. డబ్బు పంపించవలసిన అవసరం అతనికి మరో ఆలోచనను
తోచనివ్వడం లేదు.
"శంకరం బాబాయి ఎక్కడికో వెళ్ళేడు. ఇప్పుడు మని ఆర్డరు చెయ్యాలి. ఏభయి రూపాయలు అవసరం."
ఎందుకని అడగను కూడా లేదు. ఆ మొత్తం వినేసరికే ఆమె హడలిపోయింది.
తమవన్నీ చిన్న చిన్న సంసారాలు. నిల్చున్నపాటున ఏభయి రూపాయలు సర్దగలవాళ్ళు అసలా వూళ్ళో మాత్రం ఎందరున్నారు?
మిగిలిన వాళ్ళకన్న రామనాధం వాళ్ళే నయం. శంకరం బాబయ్యకి వడ్డీ వ్యాపారం కూడా వుంది.
ఆ విషయాన్నే మరో విధంగా చెప్పింది విశాలాక్షి.
"ఏభయి రూపాయలే, బాబాయి వచ్చేలోపున అంత తొందరేం వచ్చింది?"
రామనాధం నిరుత్సాహంగా అన్నాడు... "వచ్చింది."
విశాలాక్షి ఒక్క నిముషం ఆలోచించింది. ఆమెకు వేరు దారి తోచలేదు.
"బాబాయి వూళ్ళోనే వుండాలిరా. పొద్దుట చెరువుకెడుతూ రావి క్రింద చూశాను. ఎక్కడికెడతాడు?"
ఇంక ఆ అవసరం ఏమిటో చెప్పక తప్పలేదు. అంతా విని విశాలాక్షి ఒక్క నిట్టూర్పు విడిచింది.
"ఇహ నీదన్నమాట వంతు."
వంతు ఆస్తి పాడు చేసుకోవడంలోనని విశాలాక్షి వుద్దేశం. ఇంత క్రితం ఆమె తండ్రి తన వంతు పని చేసేడు. కాంగ్రెసు సభలనీ,
ఆంధ్రరాష్ట్ర మహాసభలనీ, రాజకీయ సమావేశాలనీ వెళ్ళి రావడానికి ఆయన తన వంతుకు వచ్చిన అయిదు ఎకరాలలో సగం
ఇప్పటికే అమ్మేశాడు. మిగిలిందానికి సరిపడా అప్పు వుంది. వ్యవసాయ పంటలకి కాస్త ధరలు పలుకుతున్నాయి గనుక అప్పులాళ్ళు
వూరుకున్నారు గాని, లేకుంటే అది కూడా ఎప్పుడో అయిపోయేది.
శుభ్రంగా చదువుకుంటున్న తమ్ముడు కాలేజీ వదిలేసేనన్నప్పటికన్న బట్టల కోసం ఒక్కమారుగా ఏభయి రూపాయలు అప్పు చేసేననే
సరికి ఆమెకు ఎక్కువ భయం, ఆదుర్దా కలిగింది. వుండబట్టలేక పోయింది. తన తండ్రి ఆస్తి పాడుచేసేడనే అభిప్రాయాన్ని ఆమె
ఎన్నడూ బయటకు తేలేదు. తనకో నాలుగెకరాలు వుంది. తిండికీ, పిల్లవాడి చదువుకీ లోటు లేదు. ఆయనకు మాత్రం ఆ భూమి మిగిలి
ఏం వుద్దరిస్తుంది? మరింకెవ్వరు మాత్రం వున్నారు? అని సర్దుకొంది. ఎవరన్నా తన తండ్రి ఆస్తి పాడుచేసేడన్నా ఒప్పుకొనేది
కాదు.
ఆయనతో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు తమ యింటికి అప్పుడప్పుడూ రావడం పెద్ద గొప్పగా అనిపించేది. ఓ మారు తమ ఊరిలోని
వివేకోదయ పుస్తక భాండాగారానికి వార్షికోత్సవం జరిగినప్పుడు కాశీనాథుని నాగేశ్వరరావు వచ్చేరు. ఆయన తమ ఇంటనే బస
చేసేరు. అల్లాంటి పెద్దవాళ్ళతోడి పరిచయాలు, ఆ గొప్పదనం ఆస్తి పోతూందన్న కష్టాన్ని తోచనీయలేదు.
అయితే అటువంటి గొప్పతనం కోసం తన తమ్ముడు ఆస్తి పోగొట్టుకోడం ఇష్టం లేదు. తన తండ్రి అంటే వయసు మళ్ళినవాడు. తాను
తప్ప ఆయనకెవరూ లేరు. తనకాయన ఆస్తి లేకపోతుందనే బాధ లేదు.
కాని రామనాధం కుర్రవాడు. అతని విషయంలో ఆమె వూహించుకుంటున్న గొప్పతనం వేరు. బాగా చదువుతూంటే పెద్దరికం వుంటుంది. పెద్ద
వుద్యోగస్థులతో బంధుత్వాలు కలిస్తే అంతస్థు పెరుగుతుంది. మంచి ఉద్యోగం అయిందంటే ఆ అంతస్థు నిలబడడమే కాదు, పెరుగుతుంది.
ధనం లభిస్తుంది. ఈ మాదిరి కల్పనలతో ఆమె తమ్ముడి భవిష్యత్తు గురించి ఊహలల్లుతూంది.
దానికి తగినట్లుగానే అతని జీవితం నడుస్తూంది. బాగా చదువుతున్నాడు. సర్కిలినస్పెక్టరంత వాడు వెతుక్కుంటూ వచ్చి
పిల్లనిచ్చేడు. ఇంగ్లండు పంపించి, ఐ.సి.ఎస్. చదివించాలనే ప్రయత్నాలలో వున్నారు. ఏ జిల్లాకో కలక్టరయి
వస్తాడు.
తమ వూళ్ళో ఘనాంత స్వాధ్యాయులున్నారు. భాష్యాంత వైయాకరణులున్నారు. పేరున్న మంత్ర శాస్త్రవేత్తలున్నారు. కాని ఇంగ్లీషు
పెద్ద చదువులు చదువుతున్నది చాలా కొద్దిమంది. ఓ పుంజీడుకు మించరు. ఒక్క నాలుగైదేళ్ళలో అంత పెద్ద పరీక్ష నిచ్చేవాడు
తమనాట అతడొక్కడే వుంటాడు.
అదెంత గొప్పదనం? తమ కుటుంబానికే ఎంత ప్రతిష్ఠ!
హఠాత్తుగా ఈ వార్త విన్నప్పుడు దాని ఫలితాలు ఏ విధంగా వుంటాయో ఆమె కర్థం కాలేదు. ఉన్న బట్టలు తగులబెట్టేసి, మరల
అప్పుచేసేడన్న వార్త వినేసరికి దాని లోతులు అర్థం అయినట్లు తోచింది. ప్రాణం వుసూరుమంది. తన తండ్రి అప్పులు చేయడం,
ఆస్తి పోవడం గుర్తు వచ్చింది. ఆ సాంప్రదాయాన్ని అందిపుచ్చుకున్నాడో యేమో! ఆ ఆవేశంలో అంది.
"ఇంక నీదన్నమాట వంతు."
రామనాధం తిరగబడి చూసేడు.
అతని సమస్యకు దారి చూపుతున్నాననుకోకుండానే విశాలాక్షి హితోపదేశం చేసింది.
"నాన్నలాగ ఇంక అణాబిళ్ళ మీద సంతకాలకు దిగుతావు కాబోలు, అటువంటి పని మాత్రం చెయ్యకు. శంకరం బాబాయి ఆవాలన్నీ
ముద్దచేసి నువ్వేదో నిర్వాకం చేస్తావని జాగ్రత్త పెట్టేడు."
తనకు ఉపకారం చేస్తున్నవారి మనస్సులు నొప్పిస్తున్నాననే ఆరోపణకు రామనాధం సిగ్గుపడ్డాడు.
"ఇంతకీ ఏం చేశావో బాబయ్యకి చెప్పేవా?"
ఔను, కాదు తేలని విధంగా రామనాధం తల వూపేడు.
"అమ్మకి చెప్పా."
"ఏమంది?"
"ఏమీ అనలేదు."
ఆ మాట నమ్మలేక విశాలాక్షి అతని ముఖం చూసింది. తాను చదువు మానినట్లు విన్నాక పెత్తల్లి రాజమ్మ ఏమందో వరసగా
చెప్పలేకపోయేడు. ఏదో అంది. తిట్టలేదు, కోప్పడా లేదు, అంతే. అంతవరకే చెప్పగలిగేడు.
రామనాధం లేచేడు. తాను చేసిన పనికి కనీసం తన పెదతండ్రిగారింటి వద్దనైనా అభినందన లభిస్తుందనుకున్నాడు. కాని, నిరాశ
కలిగింది.
ఎక్కడో చోట డబ్బు చూచి మనియార్డరు చెయ్యాలి. ఎవరిస్తారు. ఆలోచించుకొనేటందుక్కూడా విశాలాక్షి అవకాశం ఇవ్వడం లేదు.
"కూర్చో, ఇప్పుడెక్కడికెడతావు?"
"కాదు, బాబాయిని పట్టుకోవాలి."
విశాలాక్షి ఏమీ అనలేకపోయింది.
"అప్పులు మాత్రం మొదలెట్టకు. ఓ రోజు ఆలస్యమయితే మునిగి పోయింది లేదు."
"ఊ"--అన్నాడేగాని ఆలోచిస్తే మరోలాగ తోచింది. శంకరం బాబాయితో ఇప్పుడే డబ్బు కోసం పేచీ పడడం కూడా మంచిది
కాదనుకున్నాడు.
తర్వాత ఎలాగూ తప్పదు. ఇప్పుడు కాదు, మరి!
ఒక్కటే దారి!
పదిహేను
తోటలోకి తిరిగి వెళ్ళేసరికి మిత్రబృందం నలుగురూ పాక ఎదుట మామిడిచెట్టు క్రింద కొబ్బరితడకలు పరచుకొని కూర్చుని వున్నారు.
అతడిని చూడగానే నలుగురూ ఏక కంఠంతో వుత్సాహం తెలిపేరు.
"అడిగోరా."
"నీ కోసమే ఎదురు చూస్తున్నాం."
రామనాధం కూడా వాళ్ళని చూసి అంత సంతోషమూ ప్రకటించేడు.
"వీధిలో ఎవ్వరూ కనిపించలేదు. ఏమయిపోయారా అనుకున్నా. ఇక్కడ తేలేరన్నమాట."
రామనాధం అటూ ఇటూ చూశాడు.
"సూరప్ప కనిపించడేం?"
"జగ్గయ్య కొట్టుకెళ్ళేడే."
ఎందుకో చెప్పవలసిన పనిలేదు. ఏ పకోడీలో వేసుకొనే ప్రయత్నంలో సరుకులు తేవడానికి వెళ్ళేడు అన్నమాటే--
మిత్రులు నలుగురూ తలో అణా వేసుకొని సరుకులు తేవడం, ఏ పకోడీలో, ఉప్మాయో చేసుకుని తింటూ కాలక్షేపం చేయడం ఆ కూటానికో
అలవాటు, హఠాత్తుగా ఏ అర్థరాత్రి ఎవరికి గుబులుపుట్టినా కూటాన్నంతనూ లేపుకొస్తాడు. ఊరికి అతి సమీపంలో పెద్ద
చెరువుగట్టు నానుకొని రామనాధం పొలం, మకామూ వుండడంచేత చోటుకోసం వెతుక్కోనక్కర్లేదు. ఏ చెట్టుక్రిందనో పొక్కిళ్ళు
పెట్టేస్తారు.
"ఇంకా ఇల్లా కూర్చున్నారేం?"
"నీ కోసమే."
"లేవండి."
నరసింహం లేచి, క్రింద పరుచుక్కూర్చున్న తుండు తీసి దులిపి పైన వేసుకున్నాడు.
"నువ్వే వెళ్ళి ఓ అరడజను అరటికాయలు విరుచుకురా."--అని రామనాధానికి పని పురమాయించేరు.
"మీరెవరన్నా తెస్తే....."
అర్ధోక్తిలోనే నరసింహం భయం ప్రకటించేడు.
"వద్దురా నాయనా! మీ బాబాయి దూర్వాసుడి అవతారం."
"ఆ. మీరు మరీరా. మనం ఇక్కడ ఏం చేస్తున్నామో ఆయన ఎరగడంటావా? ఎప్పుడూ ఏమీ అనలేదు."
"ఔననుకో.....అయినా..... నువ్వు కోసిన దారి వేరు.... కనీసం నువ్వుండగా కోసినా...."
"సింగినాదం కాదూ..."
ఈ మాదిరి సంభాషణ పాఠభేదాలతో తరచు సాగుచుండేదే. కాని ఎవ్వరూ, ఎప్పుడూ ఆ హద్దులు దాటడానికి ప్రయత్నించలేదు.
మిత్రులకు దిలాసా ఇస్తున్నా రామనాధం తానే ఏ కొడవలో తీసుకొని బయలుదేరకనూ పోలేదు. ఇప్పుడూ అంతే జరిగింది.
"నిచ్చెన ఎక్కడుందో చూసేరట్రా."
"ఇంతోటి దానికి నిచ్చెన కూడా ఎందుకు? రా." అని నరసింహం ముందుకి అడుగు వేసేడు.
"ఏ చెట్టు నున్నాయో కూడ చూసి ఏర్పాట్లు చేసినట్లే వుందే?"
నరసింహం చిరునవ్వు నవ్వేడు.
"ఉండు. కొడవలి తెస్తా."
నరసింహం అదీ అనవసరమేనన్నాడు. అతడు చెట్టు ప్రక్కన నిలుచుంటాడు. రామనాధం అతని భుజంమీద నిలబడి గెల నుంచి కాయలు
విరచి పడేస్తాడు.
"చొన బట్టల మీద పడి తగులబడతాయిరా?"--అని రామనాధం భయపడ్డాడు. కాని నరసింహానికి ఆ భయం లేదు. తన భుజంమీద
వుండేది రామనాధం.
విరిచి క్రింద పడేసిన అరటి కాయల్ని ఏరుతూ నరసింహం హఠాత్తుగా ప్రశ్నించేడు.
"ఏమిట్రా. నువ్వు కాలేజీ మానేశావు అన్నారు నిజమేనా?"
"ఎవరన్నారు?"
"ఎవరంటేనేం? నిజమేనా, కాదా?"
సరాసరి సమాధానం ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలతో అసలు విషయాన్నిసూచించడం అగ్రహారపు సంభాషణ పద్ధతి.
"మానడం మంచిదంటావా, కాదంటావా?"
"అదేమి ప్రశ్నలే."
"ప్రశ్న కాకేం?"
రామనాధం తన మనస్సులో చెలరేగుతున్న ఆందోళనను నాలుగు మాటలలో చెప్పేడు.
కాలేజీ మానేసిన మాట నిజం. ఆ రోజున సభలో ఆ ప్రతిజ్ఞ తీసుకొన్నప్పుడు అంతా చప్పట్లు కొట్టేరు. రాజమండ్రి కాలేజీ
ప్రతిష్ఠను నిలబెట్టేడన్నారు.
"బ్రహ్మరథం పట్టేరనుకో."
వందేమాతరం వుద్యమం రోజుల్లో రాజమండ్రి కాలేజీలో చదువుతున్న గాడిచర్ల హరిసర్వోత్తమరావు అనే యువకుడు వందేమాతరం బాడ్జి
పెట్టుకుని కాలేజీకి వెళ్ళేడు. ప్రిన్సిపాల్ ఎగిసిపడ్డాడు, ఆయనను పంపేసేడు. ఇంక అంటుకుంది. వెన్నేటి
సత్యనారాయణ మొదలయినవారు అనేకమంది హరిసర్వోత్తమరావుననుసరించేరు. అదో పెద్ద వుద్యమమే అయింది. దానికి ఫలితంగా
రాజమండ్రిలో జాతీయ పాఠశాల ఒకటి ఏర్పడింది.
ఆ పాఠశాలలోనే చదువుకొన్న నరసింహానికి రామనాధం నిర్ణయం చాలా సంతోషం కలిగించింది. కాని....
రామనాధం భవిష్యత్తుమీద అతని బంధువులు పెట్టుకొన్న ఆశలు వారికే పరిమితంగా లేవు. అందుచేతనే ఆ సంతోషంలో కూడ ఏదో వెలితి
కనిపిస్తూనే వుంది.
"కాని...కాలేజీ వదిలెయ్యడం మంచిదేనా!" అని మిత్రుడు ప్రశ్నిస్తూంటే నరసింహం ఏమీ చెప్పలేకపోయేడు.
ఆ ప్రశ్నే పకోడీల బాణలి వద్ద మరో రూపంలో ప్రత్యక్షమైంది. బాణలిలో వేగుతున్న పకోడీని ఒక పుల్లతో గుచ్చి పైకి
లాగేటందుకు ప్రయత్నిస్తూ శివరామయ్య ప్రశ్నించేడు. "ఏం పనిరా?"
"ఏం చేస్తే బాగుంటుందంటావు?"
వేగుతూ వేగుతున్న పకోడీని పళ్ళ మధ్య గిట్టకరచి పట్టుకొని నోటి వూర్పుతోనే చల్లార్చ ప్రయత్నిస్తున్న శివకామయ్య ఆ
ప్రశ్నకు సమాధానం ఎరిగి వున్నా చెప్పలేదు.
అల్లాంటి ప్రశ్నలు సాంబావధాన్లకి మహా చికాకు. ముందేం వుందో చూసుకోకుండా ఏ మనిషీ అడుగు వెయ్యకూడదని అతని ఉద్దేశం.
చర్రుమన్నాడు.
"గాడిదల్ని కాయి."
సభాసదులంతా గొల్లున నవ్వేరు. శివకామయ్య నవ్వబోయి పెదవులూ, నాలుకా కాల్చుకున్నాడు.
ఆ గంద్రగోళంలో సమస్య కొంత వెనుకబట్టినా మళ్ళీ అదే ప్రశ్న వచ్చింది. ఏదో ఒకటి చెప్పాలి గనక రామనాధం చటుక్కున
అనేసేడు.
"వ్యవసాయం....."
"ఆ మాత్రం దానికయితే పరీక్షల ముందు కాలేజీ మానుకోవడం ఎందుకు?" అన్నాడు శివకామయ్య.
"అదీ ప్రశ్నే."
నరసింహం తన సమాధానం అందించేడు.
"ఇంగ్లీషు తెల్లవాళ్ళ భాష. వాళ్ళకి కావలసిన గుమాస్తాల్ని తయారు చేయడంకోసం మనకి చెపుతున్నారు. స్కూళ్ళూ, కాలేజీలలో
వాళ్ళు తమ గొప్పదనాన్ని నూరిపోస్తున్నారు. మనకి తాటేకులు కడుతున్నారు. మన అభిమానాల్ని చంపేసి తమకి తాళం వేసే
వాళ్ళనిగా చేస్తున్నారు.
ఆ ధోరణిలో నరసింహం ఎంత సేపన్నా చెప్పుకు పోగలడు. అదే అసలు ప్రశ్నకు సమాధానం కాదు. అవధానులు తృణీకరించేసేడు.
"పోరా పక్షీ! ఇంగ్లీషు చదువుకొని యెంతెంతటి డాక్టర్లవుతున్నారు?"
"గంటకు వేల రూపాయలు ఫీజు తీసుకొనే గొప్ప గొప్ప వకీళ్ళు మాత్రం?" అన్నాడు రామన్న.
సూరప్పకి ఇంగ్లీషు వైద్యులన్నా, వైద్యాలన్నా నమ్మకం లేదు. అతని తండ్రి ఆయుర్వేద వైద్యుడు. దిగ్దంతులనుకొనే ఇంగ్లీషు
వైద్యులు పేరు గూడా పెట్టలేని గడ్డు రోగాల్ని తానెల్లా కుదిర్చేడో, చరక సుశ్రుతాలూ, భావప్రకాశాల్లోంచి శ్లోకాల సాయంతో
ఆయన చెపుతూంటాడు. ఆ మాటల్నే మరికొంచెం నిందపాలు కలిపి సూరప్ప వివరించపోయేడు.
"తానూ మనిషే. తవుడూ, ఓ రొట్టె-నీ...." అంటూ సూరప్ప ప్రారంభించేడు.
".....ముండా రంగు నీళ్ళూ ఓ మందే..." అని అవధాని సూరప్ప మాటను మధ్యలోనే అందుకుని పూర్తి చేసేడు. మళ్ళీ కూటం
యావత్తూ ఫక్కుమంది.
సూరప్పకి కోపం వచ్చింది.
"తెల్లవాడు ఏం చేసినా నోరు తెర్రబెట్టుకుని హాహా. హోహో.... అని భజన చేస్తే."
"నాకు నచ్చిన మాటలు చెప్పేవురా. లేకపోతే...." అంటూ రామనాధం అతనిని ప్రోత్సహించబోయేడు. కాని సూరప్పకి నమ్మకం
లేదు, కోరచూపులు చూస్తూ విదిలించివేసేడు.
"ఒరేయి నాకు తైరు కొట్టకు."
అవధాని ఫక్కుమని నవ్వేడు.
ప్లీడరు వృత్తియెడ అక్కడున్న వారెవ్వరికీ సదభిప్రాయం లేదు. ఆ జీవితం అబద్ధాల పుట్టయని ఈసడింపు.
అనేకరకాల వాదనలు.
అనేక వృత్తులూ, ఉద్యోగాలూ, మంచిచెడ్డలూ పున:పునరావృత్తం అయ్యాయి.
సమస్యలు బయలుదేరిన చోటనే ఉండిపోయాయి, తాను చేయదలచుకోనివేమిటో రామనాధం లెక్క తేల్చేడు.
"నేను చదవదలచుకోలేదు."
"నేను ఉద్యోగం చేయదలచుకోలేదు."
"దేశానికి నష్టం కలిగించే పని చేయబోవడం లేదు."
అతడు చదువు మానడం, ఉద్యోగం చేయక పోవడం దేశానికి లాభమో నష్టమో చెప్పగల స్తోమత అక్కడున్న వారెవరికీ వున్నట్లు
లేదు.
శివకామయ్య సమాధానం వాళ్ళ మనఃస్థితిని ప్రకటించింది.
"దేశానికి కష్టమో, నష్టమో జరిగిపోయింది. జరుగుతూనే వుంది. పరీక్షలు నాలుగు నెలల్లో వున్నాయి. పరీక్ష ఇస్తే గుమాస్తా
పని చెయ్యాలనే నిర్బంధం ఏమీ లేదు కదా, ఆ పరీక్ష పూర్తి అయ్యేలోపున వచ్చే అదనపు నష్టం ఏమిటి?"
రామనాధం ఆలోచించేడు. తాను చేసింది ఆవేశకృతమూ, అజ్ఞానకృతమూ మాత్రమేనా? ఆ మాటనాతడు ఒప్పుకోలేడు. సమాధానం ఇచ్చేలోపున
రామన్న సమాధానం ఇచ్చేడు.
"మంచిది కాదనుకొన్నాక ఆ పని పూర్తి చెయ్యకూడదా--అంటావేమిట్రా?"
శివకామయ్య అంతతో వూరుకొనే మనిషి కాదు.
"బాగుందోయ్. మంచిది కాదు. బ్రహ్మాండంగా వుంది. మరి మంచిదనుకున్నదేదో చెయ్యవద్దుట్రా."
రామనాధం తన మార్గాన్ని మళ్ళీ వారి ముందు పెట్టేడు.
"వ్యవసాయం...."
"మళ్ళీ అదే మాటా..." అని నరసింహం అడ్డు తగిలేడు.
అతడు కాకపోతే అతని వూరి వాళ్ళూ, జిల్లాలో వాళ్ళూ, దేశజనాభా నూటికి ఎనభయ్యయిదు, తొంభయి వంతుల మంది జీవనాధారమే
అదాయిరి. అది కూడా ఈవేళ నుంచి కాదు. వందలు, వేల యేళ్ళ నుంచి, తరాల తరబడి ఆ మంచి పనేదో చేస్తూనే ఉన్నారు.
అయినా దేశానికి అన్యాయం జరిగిపోతూనే వుంది. ఇంగ్లీషు వాళ్ళొచ్చేరు. అంతకు ముందు మరొకరు, వారి ముందు ఇంకొకరు. ఎవరికి
కావలసిన చదువులు వారు మన నెత్తిన రుద్దుతూనే వచ్చేరు. మనవాళ్ళు చేస్తూ వచ్చిన మంచి పని--ఆ వ్యవసాయం వాటిని
వేటినీ మార్చనేలేకపోయింది.
"ఇప్పుడు నువ్వు కూడా ఆ మంచి పనికి దిగుతానంటున్నావు. బాగుంది చెయ్యి. అంతోటి గుమాస్తాల్ని తయారు చెయ్యడానికి తెల్లవాళ్ళు
చేస్తున్న అన్యాయం ఏమవుతుంది? దానిని తొలగించడానికి నువ్వేం చేస్తావు?"
శివరామయ్య వాదనను వెక్కిరించడం తప్ప సభాసదుల వద్ద సమాధానం లేదు. ఆ లోపాన్ని మామూలు పద్ధతిలోనే పూర్తి చేశారు.
"మన సన్యాసికి అక్షరాలు వొంటబట్టలేదు గాని, గొప్ప వకీలు కావలసిన బుర్ర కాదూ, కొద్దిలో ఆ గీత తప్పిపోయింది
కాని...."
మళ్ళీ అందరూ ఫక్కున నవ్వేరు. ఆ నవ్వులలోనే అంత ముఖ్యమైన సమస్యనూ తేలగొట్టేసేరు. లేచారు.
పదహారు
"పెద్దనాన్న ఏరమ్మా?" అంటూ వాకిట్లోకి వచ్చిన రామనాధాన్ని చూస్తూనే లచ్చమ్మ ఎంతో సంతోషం ప్రకటించింది. అతని
ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనే ఆలోచన కూడా మరిచిపోయి అతనిని ప్రశ్నలతో ముంచెత్తింది.
"ఎప్పుడొచ్చేరు బాబూ!"
"రమణయ్య ఎల్లా వున్నాడు?"
కొడుకును గురించిన ప్రశ్నలకు అంతు లేదు. వెంకటరమణ ఆమె కొడుకు.
"ఒళ్ళు వెచ్చదనం లేకుండా వున్నాడా?"
"మీకు కనిపిస్తుంటాడా?"
ఆ వెనువెంటనే అతడు చూపుతున్న నిర్లక్ష్యాన్ని గోడు వెళ్ళబోసుకుంది.
"ఒక్క ఉత్తరం రాయడు."
"పోనీ వాడన్నా సుఖంగా వుండనీ"--అని మనస్సును ఊరడించుకోడానికి ప్రయత్నించబోయింది. కాని ఆ సంతృప్తి ఎంతోసేపు
నిలుపుకొనలేకపోయింది.
"అమ్మంటూ ఒకర్తి బతికివుందనేనా అనుకుంటాడా రాంబాబూ" అంది అక్కసు కంఠాన్ని రుద్ధం చేస్తూంటే...
రమణ మనస్సులోని కష్టం ఏమిటో రామనాధం ఎరుగును. రామనాధమే కాదు లచ్చమ్మా ఎరుగును.
ఆమె విశ్వనాధానికి చట్టరీత్యా భార్య కాదు. భార్య పోయిన తర్వాత విశ్వనాధం ఆమెను చేరదీశాడు. చాకలి చెరువు గట్టున
పొలంలో ఇల్లు కట్టి ఆమెనక్కడ వుంచేడు. వారికో పిల్లవాడు కలిగేడు. వాడు అతనిని నాన్నగారూ అనే పిలుస్తాడు. ఆ
పిల్లవానికి చదువు సంధ్యలు చెప్పిస్తున్నాడు. లోకవృత్తంలో వారు భార్యాభర్తలే.
గాని వారి కులం ఒకటి కాదు. అతడు భోజనం మాత్రం ఇంటి వద్ద చేసి, మిగిలిన గంటలన్నీఆమెతోనే గడిపినా సమాజం వారిని
భార్యాభర్తలుగా ఆమోదించలేదు.
వెంకటరమణ తన జన్మకారణమైన ఈ బాంధవ్యాన్ని గుర్తు చేసుకొనేటందుక్కూడా ఇష్టపడలేకున్నాడని రామనాధానికి తెలుసు.
కాని, ఆ మాటలను లచ్చమ్మకు చెప్పలేడు. లచ్చమ్మ చూచాయగా అర్థం చేసుకొనకపోలేదు. కాని, దానిని విశ్వసించేటందుకు
సిద్ధంగా లేదు.
"నీ వెర్రి నీది, ఒక వారం రోజులు వుత్తరం రాయడం ఆలస్యమైతే..." అంటూ విశ్వనాధం సర్దబోయేడు.
"ఒక వారమా, రెండు నెలలయింది." అంటూ లచ్చమ్మ తేదీలు లెక్కబెట్టింది.