తిరిగి చూసేడు. సుబ్బన్నశాస్త్రి.
"నువ్వా?"
సుబ్బన్నశాస్త్రి మళ్ళీ ప్రశ్నించేడు.
"ఎవరు ఆవిడ? చూసిన గుర్తుంది."
"చిరతపూడి. నాయుడుగారి తాలూకా."
"అల్లా చెప్పు, సూరన్నకాపు ఇంట్లో చూశాను నిరుడు సత్యనారాయణ వ్రతానికి. ఎక్కడా చూశాను అనుకొంటున్నా."
సుబ్బన్నశాస్త్రి పౌరోహిత్యాలు చేయిస్తుంటాడు. ఆ విధంగా చుట్టుప్రక్కల నాలుగైదు మైళ్ళలోపు గ్రామాలలో జరిగే ప్రతి చిన్న
విషయమూ, ప్రతి కుటుంబ చరిత్రలోని సుఖదుఃఖాలూ అతనికి హృత్కవిలి.
"మగడొదిలేసి మళ్ళీ పెళ్ళి చేసుకొన్నాడు......"
చదువుకొన్నదనే కక్షతో భర్త తీసుకెళ్ళడం లేదనే గాని మిగిలిన గాథలు రామనాధానికి తెలియవు.
సుబ్బన్నశాస్త్రి మహోత్సాహంతో చెప్పుకుపోయేడు. అబ్బాయినాయుడు బాగా సంపాదిస్తున్నాడు. ఆస్తి వుంది. ఒక్కర్తే కూతురు అనే
ఆశతో చాగల్నాటి సంబంధం వచ్చింది. వాళ్ళూ బాగా వున్నవాళ్ళేనన్నారు. అప్పటికే ఈ అమ్మాయి ఏదో చదువుతూంది. పెళ్ళయ్యాక
అత్తవారు ఆమెను చదివించవద్దన్నారు. నాయుడు ససేమిరా అన్నాడు. రెండేళ్ళు గుసాగుసీ పడ్డారు. చివరకు అతడీమెను వదిలేసి
మరో పెళ్ళి చేసుకున్నాడు.
రామనాధం ఆ వార్త విని మ్రాన్పడిపోయాడు. మరుక్షణంలో సర్దుకొన్నాడు.
"దురదృష్టవంతుడు....."
"అంటే....."
"అంత మంచిపిల్ల పెళ్ళాం కావాలంటే మాత్రం యోగ్యత వుండొద్దూ?"
సుబ్బన్నశాస్త్రి గబగబ ముందుకు అడ్డంగా వచ్చి వెక్కిరింతగా ముఖంలోకి తొంగి చూసేడు.
"అప్పుడే కత్తు కలిపేశావేం?"
"ఏడిశావు."
అంతకంటె స్వరాజ్యం మర్యాద రక్షణకి మరో మాట తోచలేదు రామనాధానికి.
"లేకపోతే మంచేమిట్రా నీ మొహం. మంచట మంచి. ఆ నాయుడు బ్రహ్మసమాజికం గాళ్ళతో కలిసి నానా కూళ్ళు కుడిచేడు. ఆ పాపం
వూరికే పోతుందా? కళ్ళు రెండూ పోయి మూలబడ్డాడు. బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి ప్లీడరు గుమాస్తా పని వదులుకోవలసి వచ్చింది.
రెండుచేతులా సంపాదించేది పోయి వున్నది కాస్తా దావాలనీ, వ్యాజ్యాలనీ హారతి కర్పూరంలా హరించిపోయింది. ఒక్కొక్కళ్ళు పుట్టిన వేళా
విశేషం, చమురు కాళ్ళ తల్లులు. ఆ మగడు పీనుక్కి ఇంత తిండి తినే యోగము వుంది కాబోలు, బయటపడ్డాడు....."
ఆ వాక్ప్రవాహాన్ని అరికట్టడానికి చేసిన ప్రయత్నాలను దులపరించేసుకొని సుబ్బన్నశాస్త్రి తాను అనదలచుకొన్నవన్నీ
అనేశాడు.
అతని మాటలలో దేనిని కాదనాలో, దేనికి సమాధానం ఇవ్వాలో అర్ధం కానట్లు రామనాధం ఒక్క క్షణం నిలబడిపోయాడు. శాస్త్రి
విజయ హుంకారం చేసి, ముక్తాయింపు సాయించేడు.
"మంచి పిల్లట! యోగ్యత వుండాలిట.......హు"
నాయుడు కళ్ళు పోగొట్టిన మశూచి రోగానికి బ్రహ్మసమాజ మతం మీద ప్రత్యేక కక్ష లేదన్న మాట శాస్త్రి చెవి దూరలేదు.
మనిషి పుట్టిన వేళల్ని బట్టి వ్యాజ్యాలు రావడం, ఆస్తులు చేరడం వంటివి జరగవనే హేతువాదం అతడికంగీకారం కాదు.
"మీ ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళకిదో జబ్బు. మశూచికం ఆయనకే ఎందుకు రావాలి? అది వచ్చిన వాళ్ళందరికీ కళ్ళు పోతున్నాయా?
ఆయనకే ఎందుకు పోవాలి....?"
నూరు ప్రశ్నలు. అన్ని ప్రశ్నలకీ సమాధానాలు దొరకవు. అందరికీ దొరకవు. రామనాధానికి కొన్ని తెలుసు. మశూచికం ఎందుకు
వస్తుందో తెలుసును. శాస్త్రం చెపుతూంది. కళ్ళు ఎల్లా పోయాయో చెప్పవచ్చు. కాని నాయుడికి వచ్చిన జబ్బులోనే ఆ తికమక
ఎందుకు రావాలంటే....? తాను చెప్పలేడు.
"నాకిల్లాంటి కబుర్లు చెప్పకు."
శాస్త్రి సలహాను పాటించక తప్పదని రామనాధం ఎరుగును. అట్టే శ్రమ పడకుండా చెప్పడానికి కారణాలు కనిపిస్తూంటే, ఊహా బలం
అవసరమయ్యే హేతు ప్రమాణాల్ని శాస్త్రి అంగీకరించడు. అతనిని ఒప్పించడానికి ప్రయత్నించడం కూడా వట్టి కంఠశోషయని
ఎరుగును. అయినా వూరుకోలేకపోయాడు.
"ఇల్లాంటి పిచ్చి నమ్మకాలు...."
ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళలో వ్యాపిస్తున్న జబ్బుకు ఉదాహరణగా శాస్త్రి మరో ఉపపత్తి తెచ్చి చూపించేడు.
"నీ పక్కచుట్ట పాకలోకి తీసుకెళ్ళిందెవరో చెప్పరాని వాడై వుంటాడు."
"చెప్పరాని వాడనేది మొహంమీద రాసిలేదన్నమాట."
"అప్పుడే అనుకున్నా."
"ఏమని?"
"అదే....."
"బ్రహ్మ సామాజికులు కులభేదాల్నీ, అంటుసొంటుల్నీ పాటించరు. బ్రహ్మ సామాజికుల కుటుంబంతో అంత లొల్లాపత్తుగా వుండే రామనాధానికి
మాత్రం ఆ గాలి సోకకుంటుందాయని ఆలోచన శాస్త్రిది.
"రేవుల్లో కూలీలంతా....."
వాళ్ళని అంటరాని వాళ్ళెందరో అన్న ప్రశ్నను అతడు చెవి చొరవనివ్వడు.
"తెలియక చేసింది పాపం కాదు. బయట ఏం చేశావో, ఏ మూల కూళ్ళు కుడిచేవో నాకక్కర్లేదు. ఊళ్ళో ఆ వెర్రివేషాలేం కుదరవు."
"అయితే అక్కడితో రాజీపడగలవన్నమాట."
ఎక్కడ చేసినా అనాచారం అనాచారమేనన్న ఆలోచనతో పోలిస్తే ఇది రాజీయే.
స్నేహితుని వద్దనున్న చనువుతో హాస్యధోరణిలో మాట్లాడుతున్నా, అతని మాటల వెనుకనున్న ఆచార బలాన్ని రామనాధం ఎరుగును.
చదువుకొనేటందుకే అయినా సముద్రాలు దాటి సీమకెళ్ళినందుకు ఆవుపేడ తినిపించి, ప్రాయశ్చిత్తం చేయించేటంత బలం దానికుంది.
అందులోనూ ముంగండ.
బ్రాహ్మణ గ్రామం. అగ్రహారం కాకపోయినా, అగ్రహారాలకున్న అలిఖిత శాసనాలన్నీ ఆచార బలంతో సాగించుకొంటున్న ఊరు. ఆ
ఆచారాలకు తానూ ఎన్నో మార్లు గర్వపడ్డ వాడే. ఇప్పుడు మాత్రం తనకా అభిమానం లేదూ? తన ఊరి వీధుల్లో పంచముల్ని
నడవనివ్వకపోవడం, గొంతు ఎండిపోతున్నా సరే చెరువులో నీటిని పంచములెవ్వరూ ముట్టుకోరాదనడం. చెర్లో చేపలు పట్టకుండా
బరిసెలూ, బాణాకర్రలతో కాపలాలు కాయడమూ అగ్రహార బ్రాహ్మణుల నైష్ఠికత్వానికీ, భూతదయకూ ప్రమాణాలుగా చెప్తూంటే నిన్నటికి
నిన్న పడవలో భుజాలు కుదిలించుకొని గర్వపడ్డాడు.
అంటరానితనం మాన్పించడానికై వారం క్రితం బహిరంగ సభలో చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకమే రాలేదు ఆ సమయంలో.
శాస్త్రి కా సమస్యలేవీ పట్టవు. అతనికి కావలిసింది తన గ్రామంలో ఆచార భంగం జరగకూడదు. ప్రపంచంకేసి చూడాలంటాడు
రామనాధం.
"మన ఊరు దాటనంతవరకే. పొలిమేర దాటండి...."
"దేశం అంతా తగులబడిపోనీ, మా కంఠాలలో ప్రాణం వుండగా అనాచారం మన ఊళ్ళో అడుగు పెట్టడానికి వీలులేదు."
రామనాధం నవ్వేడు.
దేశం అంతా ఓ దారిన పోతూ వుంటే ముంగండ ఒక్కటే మనువు ప్రళయకాలంలో ఎక్కిన ఓడలా మిగిలిపోవడం జరగదు. ఆ అలల
తాకిడిలో, మంటల వేడిలో, అటూ ఇటూ కాక తప్పదు. ఒడిలి నురగక తప్పదు.
శాస్త్రికి ఆ నవ్వు అర్ధం అయింది. ఆ మాట అసత్యం కాదని తెలుసు. ఇంక మాట్లాడలేదు. ఒక నిముషం ఉన్నాక లేచి క్రింద
వేసుక్కూర్చున్న తుండు దులిపి భుజాన వేసుకున్నాడు.
"నీ మూలంగా స్నానానికి ఆలస్యమయింది. ఊళ్ళోకి రావూ?"
రామనాధం వెంటనే ఇంటికి వెళ్లి పెదతండ్రి యెదుట పడడానికి సిద్ధంగా లేడు. ఓ నిముషం తోటలో కూర్చుని, ఆలోచనలు
కూడదీసుకోవాలి.
శాస్త్రి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఓ క్షణం నిలబడ్డాడు.
"కాలేజీ మానేసేవటగా....?"
"స్మార్తం చెప్పుకోవాలనుంది. 'కులవిద్యకు సాటిరాదు గువ్వలచెన్నా' అన్నాడు."
"మేమందరం తింటున్నాం. ఇంక నువ్వు తరువాయి."
తమ కులవిద్య కూడూ, గౌరవం ఇవ్వలేదన్న నిరుత్సాహంలో సుబ్బన్నశాస్త్రి మిత్రుని అవహేళనకు అవకాశం ఇచ్చేడు.
"హూణ విద్య చదవడం వట్టి అనాచారం..."
"అనాచారమని మానావా? స్వాతంత్య్రం వస్తుందంటూ ఎవరో గాంధీ చెప్పేడు గనక మానావా?"
"కారణం ఏదయినా ఫలితం ఒక్కటే. ఆ ఫలితం మంచిదా? చెడ్డదా?"
"కార్యకారణ సంబంధం ఉండదూ? అనాచారం దృష్టితో చదువు మానితే ఆచార రక్షణకోసం తాపత్రయ పడతావు. మీ గాంధీ మాటమీద
మానితేనే పంచముడిచేత పక్క బట్టలు తెప్పిస్తావు."
దేశంలోని ఆచారాలకీ, జాతీయోద్యమానికీ, అంత వ్యతిరేకత వుంటుందనే మాట అతని కంతవరకూ తోచనే లేదు. స్వగ్రామం తిరిగివచ్చి
ఏవో కార్యక్రమాలు చేపట్టాలని. ఊరికీ - దేశానికీ ఏదో సేవ చెయ్యాలనీ ఆవేశంతో వచ్చేడు. ఏ సేవ చేస్తాడు? ఏమిటి నీ
కార్యక్రమం అంటే--అంతా అస్పష్టంగానే వుంది. తెర వేసినట్లుంది.
అయితే శాస్త్రి ఆ తెర చింపేసేడు. ఆ తెర వెనుక ఉన్న అలవాట్లూ, ఆచారాలూ, అహంకారాలూ, అభ్యంతరాలూ ఒక్కమారు
విశ్వరూపం చూపేసరికి అతని మనస్సు చెదిరిపోయింది.
దానిని కూడదీసుకోవాలి.
పది
నాలుగుగోడల నడిమికి చేరుకొనే వరకూ ఉగ్గబట్టుకు వచ్చిన శంకరశాస్త్రి భార్యను చూడగానే ఒక్కమారు చక్రకాయలా భగ్గుమని
నిప్పులు చిమ్మేడు. అంటుగిన్నెలు తోముకుంటున్న రాజమ్మ తన వెనక వేపున ఆ ధూంధాంలు వినబడేసరికి ముడుచుకుపోయింది. "ఏదో
అపరాధం వచ్చిందిరా భగవంతుడా" అనుకుంటూ గబగబ చేతులు కడుక్కుంది. ఆమె నడుం యెత్తే లోపున మళ్ళీ పిలుపు.
"ఏమే....."
"వస్తున్నా....."
చేతులు చీర కొంగుకి తుడిచివేసుకుంటూ గబగబ యెదటికి వచ్చింది.
"ఈ వేళ మరిడమ్మ రాలేదు. అంట్లు తోముకోవలసి వచ్చింది."
క్షమార్పణ చెప్పుకొంటున్నట్లున్న ఆ సమాధానాన్ని శంకరశాస్త్రి వినిపించుకోలేదు.
"నీ సుపుత్రుడు దేశంలో దిగేడు."
సుపుత్రుడిని గురించీ, అతడు చదువు మానడం గురించీ ఈ వారం రోజులుగా ఇంట్లో చర్చలు జరుగుతూనే వున్నాయి. ఇక ముందు తమ
కర్తవ్యం ఏమిటో కూడా ఆలోచించుకున్నారు తామిద్దరూ.
కాని తమ నిర్ణయాలకు విరుద్ధంగా మగడు ఈ విధంగా ఝణఝణ లాడుతూంటే ఆమె ఏమీ అర్థంగాక నిలబడిపోయింది. మనస్సులోని
వ్యధను నిరాశ, నిస్పృహలను వెలిగ్రక్కుతూ ఇంటి వెంబడి చిందులు తొక్కుతూంటే వారం రోజుల ప్రశ్నలూ, సమాధానాలూ, బెదిరింపులూ,
అనునయాలూ మళ్లీ ఓమారు భార్యాభర్తల మధ్య ఆవృత్తం అయ్యాయి.
రాజమ్మకు కాన్పులూ, సంతానమూ కూడా నిలవలేదు. చెల్లెలు కొడుకు రామనాధాన్ని తల్లీ-దండ్రీ కూడా కరువైన పసిగుడ్డును తెచ్చి
పెంచింది. అతనినామె యెన్నడూ పరాయమ్మ కన్న బిడ్డగా భావించలేదు.
శంకరశాస్త్రికి కూడా రామనాధంమీద అభిమానం, ప్రేమా లేకపోలేదు. కాని అతడు తన కొడుకు కాదనే విషయాన్ని మరచిపోలేదు.
విశేషమైన కోపం వచ్చినా, విపరీతమైన అభిమానం ప్రదర్శించినా శంకరశాస్త్రి అతనిని రాజమ్మ 'సుపుత్రుని'గానే పేర్కొంటాడు.
ఈ క్షణంలో ఎంతో కోపం, కసితోనో ఆ సుపుత్రుణ్ణి తలచేడని రాజమ్మ యెరుగును. కాని ఇతర సమయాలలో మాదిరిగా ఆమెకీ మారు
కోపం రాలేదు. అతని మీద పెట్టుకొన్న, పెంచుకొన్న యెన్నో ఆశలు ఒక్కమారు తల్లక్రిందులయే సరికి భర్త తట్టుకోలేకుండా
ఉన్నాడని ఆమె గ్రహించింది. అతని మీద జాలి కలిగింది. కాని యెలాగ సర్దుబాటు చేయాలో ఆమెకు అర్ధం కాలేదు. నలభయ్యేళ్లు
పైగా కాపురం చేస్తున్నా ఏ మాటకాతనికి కోపం వస్తుందో, ఏది సర్దుబాటు చేస్తుందో ఆమెకింత వరకు తెలియదు.
భయపడుతూనే సన్నగా, సర్దుబాటుగా కొడుకు రాకకు ఏవేవో కారణాలు చూపబోయింది. అవన్నీ ఒకటికి పదిమార్లు ఈ వారంలో
చెప్పుకొన్నవే.
"ఏ వంట్లోనో బాగుండక వచ్చేడేమో, మీదంతా....."
అంత కోపంలోనూ శాస్త్రి ఒక్కమారుగా నవ్వేడు.
కలిపోసినా వుట్టికేసి చూడడంగా శాస్త్రి దానిని జమకట్టేడు.
"ఏమిటోయ్ శాస్త్రీ! రాజమ్మ వున్నదా?" అంటూ మూడుకాళ్ళ ముసలమ్మ నరసమ్మ గుమ్మాలెక్కింది. రాజమ్మ అమ్మయ్య
అనుకుంది.
"రాండి అత్తయ్యగారూ!"
నరసమ్మ కర్ర నేలపడేసి గోడకి జారబడి కూర్చుండిపోయింది. ఆయాసం తీర్చుకున్నాక ఆకాశం వంక చేతులెత్తి మొక్కి అంగలార్చింది.
"ఇంకా ఎంత కాలమయ్యా భగవంతుడా?"
"నీకేం పిన్నీ పుణ్యాత్మురాలివి. బోలెడు బలగం ఉన్నారు. నీ బరువు ఎవరికి?"
శంకరశాస్త్రి మర్యాదకు ఓదార్చాడు. నరసమ్మ మర్యాదకే అభినందించింది.
"మీరంతా వుండగా నాకు లోటేమిటోయి శాస్త్రీ? కాలూ, చెయ్యీ కదపలేని దశ వచ్చాక ఈ బ్రతుకు ప్రపంచానికే భారం కాదుటయ్యా!"
మరల మనస్సులో లేని మాటలతోనే ఓదార్పు.
"దేముడిచ్చినదానికి వెక్కసపడితే పోతుందా?"
"ఆయువిచ్చిన దేవుడు అన్నానికీ, గుడ్డకీ తిప్పటపెడితే ఎట్లాగోయి."
మరల దిక్కుమాలిన గొడవ ప్రారంభమయిందని శంకరశాస్త్రి మనస్సులోనే తిట్టుకున్నాడు.
రాజమ్మ పరిస్థితిని గ్రహించి మాట మార్చటానికి ప్రయత్నించింది.
"ఈ వేళ పనిమనిషి రాలేదు. ఇంకా మజ్జిగ చెయ్యలేదు. చేసి తెద్దామనుకొంటూనే ఉన్నా, పాపం నిన్న ఉపవాసం కూడా కాబోలు. నే
తెచ్చిపెడుదును కదా....."
అసలు ఆమె ఎందుకు వచ్చిందో ఎరిగిన శంకరశాస్త్రి అసలు విషయానికి వచ్చేశాడు.
"ఈ ఏడాది ఇవ్వవలసింది ఎప్పుడో ఇచ్చేశానన్నాడు కదా పిన్నీ!"
"ఇచ్చేడు. నే లేదనలేదుగా. కాని, ఎంత నాయనా! ఏడాదికి పన్నెండు రూపాయలు. ఎప్పుడో రూపాయకి పాతిక శేర్లు బియ్యం
కొలిచిన రోజుల్లో ఇచ్చినట్లే నాలుగు శేర్లిచ్చేటప్పుడూ ఇస్తానంటే యెట్లాగోయ్. యెవరిపంచనో పడి వుంటాననుకో.
రాజమ్మ ధర్మమా అని ఇంత మజ్జిగ పోస్తుంది. ఎవరో ఓ కూర ఇస్తారు. నేనొక్క పూటే తింటా. అయితే మాత్రం ఆ రూపాయితో
తిండి గడుస్తుందంటావా?"
"పోనీ నీకీ బాధలూ, తిప్పలూ ఎందుకూ? ఆవిడే ఇంత వుడకేసి నలుగురితో పాటు పడేస్తుంది. తిని రామా, కృష్ణా అనుకుంటూ
కాలక్షేపం చేసేదానికి...."
దేవుడికి పెట్టినంత విసురుగానూ నరసమ్మ మరో నమస్కారం పెట్టింది.
"ఒద్దు నాయనా! ఆ అనాచారం చూడలేను. ఓ మడీ, మైలా లేదు."
"అదేమిటి అత్తయ్యా.....!"
"చయనులుగారింట పుట్టేను, సోమయాజులుగారింట మెట్టేను. ఇంత బ్రతుకూ బ్రతికి గ్రామ పాచకుడి ఇంట ఎలా తిననోయ్."
కొన్ని వందలో మారు శంకరశాస్త్రి జ్ఞాపకం చేసేడు.
"మరి డబ్బు ఇవ్వమనేది కూడా గ్రామ పాచకుడినే కదా?"
"నా మెడకురి పోసి అర్ధాంతరపు చావు చచ్చిన ఆ పెద్ద మనిషికి ఆస్తంటూ వుంది కదా. ఏ పొత్తర్ల బియ్యమో పొయ్యక్కర్లేదు
కదా."
మళ్ళీ కొన్ని వందలోమారు ఆమె వాదం ఎంత తప్పో శాస్త్రి నచ్చ చెప్పడానికి ప్రయత్నించేడు.
షోడశ కర్మలు చేయడం అవసరమని చెప్పి, అవి చేయించడం బ్రాహ్మణ ధర్మమని చెప్పి, మళ్ళీ చేయించేవాడిని గ్రామ పాచకుడంటూ
నీచంగా చూస్తే ఎలాగ?
మగడు నరసమ్మగారికి బోధ చేయడం ధోరణిలో పడ్డాక రాజమ్మ బ్రతుకు జీవుడా అని బయటపడింది. ఇంట్లో మాట మూడోకంటి వాని
చెవిని పడనీయరాదంటాడు శంకరశాస్త్రి. అంత జాగ్రత్తగానూ ఉంటాడు.
"క్షణంలో మజ్జిగ తిప్పేస్తా, కూర్చో అత్తయ్యా!"
"వెళ్ళిరా తల్లీ, లేవలేను. ఇక్కడే కూర్చుంటా."
రాజమ్మ వెళ్ళిపోయేక నరసమ్మ ఒక నిట్టూర్పు విడిచి శంకరశాస్త్రి సలహాకు సంతాపం తెలిపింది.
"మిమ్మల్ని ఎవర్నీ అని లాభం లేదు నాయనా! కాలం! కాలం!"
శంకరశాస్త్రి ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం మానలేదు.
"మళ్ళీ సుబ్బన్నశాస్త్రి కదా నీకు కర్మ చేసినా, పిండ ప్రదానం చేసినా, వాడి యింట."
నరసమ్మ విసిరేసింది ఆ సలహాను.
"చచ్చేక చూడొచ్చేనా ఎవడు కొరివి పెట్టేడో....."
ఒక్క నిముషం ఊరుకొన్నాక మళ్ళీ అన్నది.
"బ్రతికుండగా పిడికెడు మెతుకులకి మొహం వాస్తున్నానా! పరలోకానికి ముట్టకపోతుందని విచారం."
"పరలోకం అంటూ ఒకటి వుందనుకుంటే, ఈ లోకంలో వాళ్ళు చేసే పిండప్రదానం అక్కడికి అందుతుందనుకొన్నాక......"
"ఏమో ఎవరు చూడొచ్చేరు? వుందనుకుంటున్నాం. చేస్తున్నాం. పరలోకం అంటూ ఉందో లేదో, ఉంటే అక్కడెల్లా ఉంటుందో చూసి వచ్చిన
వాడెవడూ లేడు. దానిని నమ్ముకొని ఇక్కడ అనాచారపు బ్రతుకు గడపమంటావు?"
ఆ చర్చలు తేలవు. చుట్టు తిరిగి మళ్ళీ మొదటికే వస్తాయి.
శాస్త్రికి ఆ క్షణంలో రామనాధం ఇంట్లో అడుగుపెట్టడం ఊపిరి తీసుకోడానికి వీలిచ్చింది.
"రారా, ఇంతసేపు చేసేవేం? బండి దొరికిందా?"
ఇంట్లో అడుగు పెట్టేసరికి పెద్ద రభస ప్రారంభం అవుతుందని తయారయి వచ్చినవానికి ఆ ఆహ్వానం చాల గంద్రగోళంగా వినిపించింది.
దానిని యెలా అర్థం చేసుకోవాలో కూడా తెలియలేదు. అప్రయత్నంగానే 'ఆ', 'ఊ'లతో సమాధానం ఇచ్చేడు.
"అమ్మేది?"
"లోపలుంది. నరసమ్మని పలకరించవేం...."
రామనాధం చటుక్కున తన పొరపాటు గ్రహించి సర్దుకున్నాడు.
"బాగున్నావా అవ్వా!"
"ఏదో ఇల్లా వున్నా నాయనా! చదువుకు వెళ్ళేవంది. సెలవలా ఇప్పుడు?"
"నీకు తెలియదు. మనవాడే కాలేజీకి సెలవిచ్చేసేడు........"
ఆ విషయాన్ని నరసమ్మకు అర్ధం అయ్యేటట్లు చేయడంలో శంకరశాస్త్రి యెదురు చెప్పడానికి వీలులేకుండా రామనాధాన్ని ఎగతాళి
చేశాడు. అన్నీ విని నరసమ్మవ్వ చిన్న ప్రశ్న వేసింది.
"తెల్లవాళ్ళు దేశంలోంచి పోవాలంటున్నాడా?"
ఈమారు రామనాధం మాట మార్చేందుకు అవకాశం దొరకపుచ్చుకున్నాడు.
"మనింట్లో ఎవడో వచ్చి పెద్దరికం చేస్తానంటే ఒప్పుకుంటామా అవ్వా!"
సరసమ్మవ్వ నమ్మలేనట్లు తల తిప్పింది.
"అరాజకమయి పోతుంది."
ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు, దోపిళ్ళు సాగుతాయి, కరువు పెరిగిపోతుందని అవ్వ నిశ్చితమైన అభిప్రాయం.
"నా వయస్సు తెలుసా?"
ఆమె తన చిన్ననాటి కథలూ, తాను విన్న కథలూ చెప్పే ధోరణిలో పడిందని నెమ్మదిగా శంకరశాస్త్రి సర్దుకున్నాడు. ఇంగ్లీషు
వాళ్ళు వచ్చేక దేశం బాగుపడిందని ఆమె కథలు చెప్తాయి.
బందిపోట్ల చేతుల్లో వాళ్ళ తాతగారు మరణించారు. పిండారీదండ్లు వస్తున్నాయనే సరికి వూళ్ళలో బీభత్సం ఎల్లా వుండేదో వాళ్ళ
అమ్మ చెప్పింది. ఆమె అయిదేళ్ళదయి వుండగా పెద్ద కరువు వచ్చింది. చూచాయగా మిగిలిన ఆ జ్ఞాపకాలు వింటేనే వొళ్ళు
జలదరిస్తుంది.
"తెల్లవాడొచ్చాక ఆ అరాజకం లేదు. ఆనకట్ట కట్టేక ఆ కరువు లేదు. వాళ్ళని పొమ్మని మీరేం చేస్తార్రా
కుర్రనాగమ్మల్లారా.....!"
వర్తక వ్యాపారాల్లో సాగిపోతున్న వందలకోట్ల రూపాయల దోపిడీ, పరిపాలనా వ్యవస్థలో జరుగుతున్న అన్యాయం. ప్రపంచ
ప్రజల మధ్య చేస్తున్న అవమానాలూ అవ్వకు అర్ధం కావు.
శంకరశాస్త్రి అతనినా ఇబ్బంది నుంచి బయట పడేశాడు.
"నీ లోకం వేరు. నా లోకం వేరు. వాడి లోకం వాడిది. ఒకళ్ళు చెప్తే వినేదుందా? అర్థం అయ్యేదుందా? ఎవళ్ళ దారి వాళ్ళది..
నువ్వు మీ అమ్మకు కనిపించి రారా! లోపలుంది. చల్ల చిలుకుతూంది కాబోలు. వెళ్ళు."
ఆ మాట వచ్చిందే తడవుగా రామనాధం నిశ్శబ్దంగా ఇంట్లోకి నడిచేడు. వెనక నుంచి నరసమ్మవ్వ నిర్వేదం వినబడింది.
"ఆచారాలు, కట్టుబాట్లు, మర్యాదలు, మన్ననలు అన్నీ పోతున్నాయి లోకం తల్లక్రిందులయిపోతోంది...."
పదకొండు
గుమ్మంలో రామనాధాన్ని చూడగానే శంకరశాస్త్రి తన కోపతాపాలకు అట్టే బలం వుండదనే విషయాన్ని గ్రహించడం కష్టమేం కాలేదు.
రామనాధం ముతక కోరా పంచె కట్టేడు. అల్లాంటిదే ఓ లాల్చీ వేశాడు. తెల్లవారగట్ల చీకట్లో గమనించలేదు గాని, అసలు
రామనాధం ఆకారమే మారిపోయినట్లనిపించేడు. ఇంగ్లండు పంపించి చదివించేటందుకూ, ఏ ఐ.సి.ఎస్సో ప్యాసై ఓ జిల్లా కలెక్టరుగా
రాగలిగేటందుకూ ప్రాతిపదికగా ఇస్తున్న వేషభాషల తయారీ లవలేశం కూడా మిగిలినట్లు లేదు. ఆ దుస్తులతో తన ముందుకు
రాగలగటం తన కోపతాపాల ప్రభావానికి ఆశ్వాసాంతం అని అర్ధం అయిపోయింది.
వెంటనే శంకరశాస్త్రి సర్దుకొన్నాడు. ఆ వేళకు నరసమ్మ అక్కడ వుండడం ఎంతో సాయపడింది. ఆమె ఎదుట తన ఓటమిని
ప్రదర్శించుకోలేడు. కనక తెలివిగానే సర్దుకొన్నాడు.
"చెప్తే వినని పిల్లవాడు కాదు. ఒకవేళ పొరపాటున తొందరపడ్డా చెప్తే వింటాడా.." అని ఈ వారం రోజుల నుంచీ భార్య
చెప్తున్నా అతడు నమ్మలేకుండా వున్నాడు. ఇప్పుడు రామనాధాన్ని చూశాక తనలోని అవిశ్వాసాన్ని మనస్సాక్షి హెచ్చరికగా
తీసుకొన్నాడు.
రామనాధం పెంకితనాన్ని తాను వర్ణిస్తూంటే రాజమ్మ అతని మేదకత్వానికి ఒకే ఒక వుదాహరణను రెట్టిస్తూ వచ్చింది.
నాలుగేళ్ళ క్రితం తన కప్పుడే పెళ్ళేమిటని కూర్చున్నాడు. కనీసం ఇరవయ్యేళ్ళయినా వస్తేనేగాని పెళ్ళి చేసుకోనన్నాడు.
స్కూలులో తోటి వాళ్ళంతా వొట్టేసుకున్నారట. అంత పట్టుదలా మానుకొని, చెప్పినట్లు పెళ్ళి చేసుకోలేదా అంటుంది ఆమె.
ఆమెకేం తెలుసు? ఆ ఒప్పుదల కోసం తన ప్రతిష్ఠను సంపూర్ణంగా వెచ్చబెట్టేసిన సంగతినామె ఎరగదు. అమే కాదు. మరెవ్వరూ
ఎరగరు. అప్పటికాతని వయస్సెంత? పదిహేను! తోటలోకి తీసుకెళ్ళి రెండు గుద్దులూ, బుగ్గనులుములూ, గద్దింపులూ తగిలించేక కాని
అతనిని ఆలోచనలో పెట్టించలేకపోయేడు. పెంచిన అభిమానం యావత్తూ ఒడ్డేసేనని ఆ రోజునే గ్రహించేడు.
తమ కుటుంబంలో మంచి విద్యాంసులుండవచ్చు. కాని, మంచి వుద్యోగాలలో ఎవ్వరూ లేరు. సర్కిలినస్పెక్టరు నారాయణమూర్తి స్వయంగా
పిల్లనిస్తానన్నాడు. అదే గొప్ప అనిపించింది. ఆ దృష్టితోనే తాను అంత పట్టుదల చూపేడు. సర్వం ఒడ్డేసేడు. మరల అంత
అవసరం కలగవచ్చునని వూహించలేదు ఆనాడు.
కాని, అంత అవసరమూ వచ్చింది. ఇప్పుడు ఒడ్డకుండా మిగిలినదేమన్నా వున్నా--లాభం లేదు.
ప్రాప్తేతు షోడశే వర్షే
పుత్రం మిత్రవదాచరేత్ ||
రామనాధం తనకు పుత్రుడు కూడా కాదు. ఆ సంగతిని వెంటనే అర్థం చేసుకొన్నాడు.
కాని, ఇంతకాలంగా అతని మీద పెట్టుకున్న ఆశల్ని అంత సున్నితంగా వదలలేడు. ఆ ఆశలు కలిగించింది వియ్యంకుడు.
వ్యతిరేకిస్తారని ఎరిగి వున్నా, బ్రాహ్మణీకాన్ని కూడా లక్ష్యం చేయనంత ఆశ కలిగించేడు నారాయణమూర్తి. ఉన్న ఏడెనిమిది
ఎకరాలూ అమ్మేసి అయినా ఇంగ్లండు పంపాలి. అతడు ఐ.సి.ఎస్. అయి వస్తే అంతకు పదింతలు భూమి కొనుక్కుంటాడు.
హోదా కొలిచేటందుకు ఇప్పుడు ప్రాతిపదిక లేదు. తల్లిదండ్రులు లేనివాడిని పెంచి పెద్దను చేసిన తమకు, అతడే కలక్టరో అయి
వస్తే ఎంత ప్రతిష్ట! ఎంత మర్యాద!
అన్ని ఆశలూ చూస్తుండగా ఆవిరి అయిపోతూంటే తనకు పట్టనట్లు వూరుకోవడం సాధ్యం కావడం లేదు. కాని, తాను చెయ్యగలదేమిటో
అర్థమూ కాలేదు.
రాజమ్మ తన సలహాకు విలువ వుంటుందనే నమ్మకం లేకపోయినా వూరుకోలేకపోయింది.
"పిల్లనిచ్చిన మామగారున్నాడు. ఆయనకూ వుంది బాధ్యత. వెళ్ళి మాట్లాడండి. దూరం భారం కాదు. అమలాపురంలోనే కదా
వున్నాడు....."
తాను చెయ్యలేనిది వియ్యంకుడు చెయ్యగలగ వచ్చుననే ఆలోచన దుర్భరం అనిపించింది. విసుక్కుని విదిలించేసేడు.
"హు. చెప్పేవు. పోదూ."
కాని, ఆ మాట పూర్తికాకుండానే మెరుపులా ఓ ఆలోచన తట్టింది. చటుక్కున విదిలింపు నిలిపేడు.
ఆమె మాటలోనూ సబబు కనిపించింది. మామగారు పిల్లనిచ్చిన వాడు! నెమ్మదిగా అడుగు కూడదీసుకొన్నాడు.
"అవునేమో. అదీ చూద్దాం."
రాజమ్మ తన సలహాకు వినియోగం వుందనుకొనేసరికి కొండ ఎక్కినంత సంతోషపడింది.
శంకరశాస్త్రి వ్రేళ్ళు దులిపి 'ఛట్' మనిపించేడు. మనస్సులో ఆలోచనకో రూపం వస్తూంది...."అంతే!"
"అయితే తొరగా వంట కానియ్యి."
రాజమ్మ గబగబ కట్టు విడిచిన బట్టలు రెండు బిందెలో కూరి చెరువుకు బయలుదేరింది.
"బట్టలుతుకుతూ కూర్చోకు."
"అబ్బే! ఇక్కడున్నట్లు రానూ!" అంటూ రాజమ్మ గుమ్మం దిగింది.
పన్నెండు
భోజనం చేస్తూ రామనాధం ఆగి తల ఎత్తేడు.
"నేను కాలేజీ మానేసి వచ్చానమ్మా!"
వడ్డిస్తున్న రాజమ్మ తల ఎత్తకుండా బహు తాపీగా సమాధానం ఇచ్చింది.
"మీ బాబాయి చెప్పేరు."
"నేనింకా ఆయనతో చెప్పలేదు."
రాజమ్మ ఏమీ అనలేదు. రామనాధం ఒక్క నిముషం వూరుకొని మళ్ళీ ప్రశ్నించేడు.
"కోప్పడ్డారా?"
"భోజనం చెయ్యవోయ్! తర్వాత వేద్దువుగాని ఆ ప్రశ్నలు."
ఒక నిముషం వూరుకున్నాడు. మళ్ళీ ప్రారంభించేడు.
"బాబయ్యకి కోపం వచ్చిందని ఎరుగుదును...."
"ఎరిగివుండే మానేవన్నమాట."
రామనాధం తల తిప్పేడు.
"మరి?"
రాజమ్మ చాలా సేపు సమాధానం కోసం ఆగింది.
"మీ మామగారినేనా ఓ మారు అడిగితే...."
రామనాధం కళ్ళతో నవ్వేడు.
"బాబాయికన్న ఆయన దగ్గర బంధువుటమ్మా!"
"దగ్గరికీ, దూరానికీ ఏముంది? ఆయన కాకపోతే మీ ఆవిడ వుంది....."
"దానికేం తెలుస్తుంది, చిన్నపిల్ల."
"నువ్వు మహా ఆరిందా అయ్యావు."
రామనాధం ధీమాగా తన వయసు చూపించేడు.
"నాకు ఇరవయ్యేళ్ళు వస్తున్నాయమ్మా!"
ఆ కంఠస్వరానికి రాజమ్మ నవ్వుకుంది. హేళన చేసింది.
"ఇంకో ఏడాదికి......"
"సంవత్సరాదికి కాదమ్మా నా పుట్టినదినం."
"సరే మూడు నెలల తేడా చెప్పాను."
రామనాధం ఆ మాట వినిపించుకోలేదు.
"బి.ఏ. చదువుతున్నా చిన్నపిల్లడినేనా?"
"మహ గొప్ప చదువు చదివేవు. కాని, నువ్వు చదువుతున్నావంటే...."
రామనాధం హాస్యం ఆడేడు.
"......ఆయనే కారణం అంటావు."
"కాకపోతే? మీ బాబాయి స్కూలు మానిపించి--'హరి ఓమ్ అనిపించే వారు."
"అదే బాగుండేదేమో....."
"కాని నువ్వు అప్పుడల్లా అనుకోలేదు."
"ఔననుకో....."
"నువ్వు చాలా తెలివిగలవాడివనీ, ఏదో పెద్ద చదువులకెడతావనీ....."
ఆ ఆలోచనే ఇష్టం లేనట్లు రామనాధం తుంపేసేడు.
"ఇంక చదివేది లేదు. అంతే."
రాజమ్మ ఏమీ అనలేదు.
అతడు భోజనం ముగించి లేచేడు.
చేయి తుడుచుకొన్న తుండు దండెం మీద ఆరవేస్తూ అడిగేడు.
"బాబయ్య మాట వినిపించదు. ఎక్కడికెళ్ళేడమ్మా?"
శంకరశాస్త్రి అమలాపురం వెడుతున్నానని చెప్పే వెళ్ళేడు. ఎందుకు వెడుతున్నదీ తామిద్దరూ మాట్లాడుకొన్నారు. కాని, ఆ విషయం
బయట పెట్టవద్దనుకున్నారు. వూరుకుంది.
రామనాధం ఓ మారు మిద్దెగదిలోనూ, వీధి అరుగుమీదా చూసి వచ్చేడు.
"లేడు."
అతని కంఠంలో ఏదో ఆతురత వినిపించి రాజమ్మ అన్నం తింటూ తల ఎత్తి చూసింది.
"తర్వాత మాట్లాడవచ్చునులే. ఏం తొందర?"
"మళ్ళీ టపా కట్టేస్తారు. మని ఆర్డరు చెయ్యాలి."
మని ఆర్డరు చెయ్యడం అనేసరికి రాజమ్మ కంగారుపడింది.
మని ఆర్డరు చెయ్యాలంటూ ఆయన కోసం వెతుకుతున్నాడంటే ఆయన డబ్బు ఇవ్వాలన్నమాట. తన చేతిలోంచి వెళ్ళే ప్రతి పైసాకూ
శంకరశాస్త్రి ఆరా తీస్తాడు. అందుచేత ఆయన్ని అడగాలంటే భయం. కాలేజీకి వెళ్ళేటప్పుడల్లా రామనాధం చేతికి డబ్బు చిక్కడం
ఒక చిన్నపాటి బ్రహ్మప్రళయం జరిగినాకనే. ఎన్నో చివాట్లు తినాలి. వుపన్యాసాలు వినాలి. గదిమి, గంద్రగోళం చేస్తాడు.
ఒక్కొక్కప్పుడు నిష్ఠూరంగా అనేస్తుంటుంది కూడా.
"వాడి డబ్బు వాడికివ్వడానికి ఇంత ఇదయిపోతారేం?"
శంకరశాస్త్రి ఓపట్టాన తగ్గడు.
"ఇప్పుడు డబ్బూ ఇవ్వాలి. తర్వాత లెక్కా చెప్పాలి. మరచిపోకు."
"మీరు తినేసేరని అనుకోరు లెండి."
తల్లిదండ్రులు చనిపోయిన నాటికి రామనాధానికి నాలుగెకరాల భూమి వుంది. ఆ పొలం మీద శిస్తు దాచి, పెంచి మరో నాలుగెకరాలు
కొన్నాడు. అయితే అది నాలుగేళ్ళ క్రితంనాటి మాట. ఈ నాలుగేళ్ళ ఆదాయం ఎప్పటికప్పుడు అతని చదువులకే సెలవయిపోతూంది.
నాలుగెకరాలున్నప్పుడు మిగిలింది. ఎనిమిదెకరాలున్నప్పుడు చాలక పోయిందా అంటారని ఆయన భయం.
ఇదివరకు తాను కుర్రవాడికొక్కడికే సమాధానం ఇచ్చుకోవలసి వుండేదనీ, ఇప్పుడు వియ్యంకుడికి కూడా చెప్పుకోవలసి వస్తుందనీ
అంటాడు.
తమ తమ నెలవులు తప్పిన
తమ మిత్రులె శత్రులౌట తథ్యము..
అంటూ సుమతీ శతక పద్యాన్ని భార్యకు గుర్తు చేస్తాడు.
క్షణశ: కణశశ్చైవ
విద్యామర్థంచ సాధయేత్
అని రామనాధానికి బోధ చేస్తాడు. కొసిరి కొసిరి అడిగిన దానికన్న మరో పదిరూపాయలు చేతులో పెడతాడు.
"మళ్ళీ కావాలంటే పొరుగూళ్ళో ఎవరిస్తారు. ఈ పదీ దగ్గరుంచు" అంటాడు. అయినా అంత గందరగోళమూ, రభసా సాగవలసిందే.
ఆ అనుభవంతో రాజమ్మ కుమారుడి మాటకు కంగారుపడింది.
"నూరూ తీసుకెళ్ళి ఇంకా నెలేనా కాలేదు కాదట్రా."
తన అవసరం ఏమిటో చెప్పాలి. రామనాధం తల్లికెదురుగా వంటింటి గడపమీద కూర్చుండబోయేడు.
"పీట వాల్చుకో, గడపమీద కూర్చోకూడదు."
"కూర్చుంటేనేమమ్మా!"
మామూలు ప్రకారం అనేశాడేగాని, వాగ్వాదం పెట్టుకునే ధోరణిలో లేడు. మాట్లాడకుండా పీట వాల్చుకున్నాడు.
"ఖద్దరు బట్టలకివ్వాలి. ఓ ఏభయి కావాలి."
రాజమ్మ ఏదో భయానక వృత్తాంతం విన్నదానిలాగ గాభరా పడింది.
"ఇప్పుడు బట్టలేమిట్రా, మొన్ననేకదా కుట్టించుకొన్నావు...."
అందులోనూ అతడు దుప్పట్లూ, తుండ్లతోసహా తీసికొన్నానని చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపడింది.
"వెళ్ళేటప్పుడు దుప్పట్లు పట్టుకెళ్ళలేదూ?"
పట్టుకెళ్ళకేం? పట్టుకెళ్ళేడు. కాని, కాలేజీ ఎదట రోడ్డుమీద అగ్ని సాక్షాత్కారం అయిపోయాయి.
బట్టలను అగ్నిహోత్రంలో పడవెయ్యడంలో వున్న రాజకీయ ప్రాముఖ్యాన్ని అతడెంత చెప్పినా ఆమెకు అర్థం కాదు.
బట్టలే కాదు, ఏ వస్తువునైనా పొదుపుగా వాడుకోవడం, అనవసరపు, అదనపు ఖర్చులు చేయకపోవడంలో వున్న ఆర్ధిక ప్రాముఖ్యం
అతనికి అర్థం కాలేదు.
తాననుకొంటున్న దానికన్న ఈ వ్యవహారం చాలా లోతుగా వున్నదనిపించి రాజమ్మ చాలా నిరాశపడిపోయింది. ఇప్పటికే ఆస్తిపాస్తుల
వ్యవహారం వప్పచెప్పేస్తానని మగడు బెదిరిస్తున్నాడు. పెంచిన మమకారంలో ఆమె సర్దుబాటు చేస్తుందిగాని, ఆ మాటే అనేసింది.
ఆ నిరాశతో చేతిలో ముద్ద విస్తట్లో పడేసి, గోడకి జారబడిపోయింది.
"ఏమోరా! నీ పద్ధతి నాకేం బాగా లేదురా, బాగా చదువుతున్నావు. పైకొస్తావనుకుంటే, అది కాస్తా మానేశానంటావు. బోలెడంత
ఖరీదుపోసి నిక్షేపంలాంటి బట్టలు కొనుక్కొని నిప్పుల్లో పారేశానంటావు..."
హఠాత్తుగా అతని వొంటినున్న బట్టలు వెనకటివేనని గమనించింది.
"నన్ను ఆడిస్తున్నావట్రా భడవా!"
ఆమె చూపు గమనించీ, అభిప్రాయం గ్రహించీ రామనాధం తాను కట్టుకున్న బట్టలవేపు చూసుకొని సిగ్గుపడ్డాడు.
ఇంటిదగ్గర వాడుకొనేటందు కుద్దేశించిన నేతపంచె కట్టుకున్నాడు. నలిగిందని పెట్టెలో పడేసిన చొక్కా ఒకటి తొడుక్కున్నాడు. రెండూ
విదేశీ నూలుతో తయారు చేసినవే. విదేశీ వస్త్రాలు ముట్టకూడదని చేసిన ప్రతిజ్ఞను యద్దేవా చేస్తున్నట్లనిపించింది.
సుబ్బమ్మగారు పట్టుకెళ్ళమనే అన్నారు. అయితే డబ్బివ్వనిదే తీసుకోవడం తనకే ఇష్టంలేకపోయింది. వెంటనే కట్టుకోడానికి రెండు
జతలే తీసుకున్నాడు.
"ఏవీ? ఎక్కడ పెట్టేవు?"
ఈ నూతన వ్రతంలో అనాచారం కూడా ఒక భాగమేమోనని భయపడుతున్నట్లనిపించింది ఆమె కంగారు.
"తోటలో వదిలిపెట్టి నారాయడికి కబురు చేశాను."
ప్రయాణంలో మైలపడిన బట్టలు ఇంట్లో కలపనందుకు రాజమ్మ సంతృప్తిపడింది. కాని, కథంతా విన్నాక మరల వ్యధ పట్టుకుంది.
ఆ సుబ్బమ్మ ఎవరో కొరివిలా దాపురించిందనిపించి మండిపడింది.
"ఎవర్రా ఆ సుబ్బమ్మా, దిబ్బమ్మాను? మొగుడూ, మొద్దులూ ఎవరూ లేదా ఏమిటి, ఆవిడగారికి? ఇల్లా...."