"అల్లాగేలే."
సుపర్ణ వెళ్ళిపోయేక మంగమ్మ అడిగింది.
"ఏం కథ?"
"తెలియదు".
మంగమ్మ ఆ మాట నమ్మలేదు కాని పైకి తేలలేదు. లోకాభి రామాయణం వాడేసింది. రెండు మూడు నిముషాల లోపల సుపర్ణ మగడు పెద్ద
వుద్యోగస్థుడనీ, బాగా సంపాదిస్తున్నాడనీ అతని దృష్టికి తెచ్చింది.
"ఆయన్ని నువ్వు చూడనే లేదనుకుంటా."
"లేదు. పెళ్ళి నాటికి నేను వూళ్ళో లేను."
"మనం ఆ పేరు చెప్తేనే హడలి చచ్చే సబినస్పెక్టర్లూ, సర్కిలినస్పెక్టర్లూ ఆయన ఎదట అగ్గగ్గలాడుతూ నిల్చుంటారు. ఆ
భోగం చెప్పలేం. ఏమయినా అను. ఆడదానికి అదృష్టం ఉండాలి, అనుకో."
మంగమ్మ ఆ ప్రసంగం ఎందుకు తెచ్చిందో రామారావు ఎరుగును. కాని ఆమె ఆశించినట్లు అతడు వుడుక్కోలేదు. ఆమె మాటలకు
సంపూర్ణామోదం తెలిపేడు.
"సందేహం ఏముంది?"
"మా అత్తగారు అంటుండేవారు. జిల్లా కలెక్టరు పెళ్ళాం అవుతుందనే వారు. చచ్చి ఏ స్వర్గాన ఉన్నారో గాని."
"ఆమెకు గొప్ప వాక్శుద్ధి ఉంది."
"నిజం చెప్పేవు."
"ఓ మాటు నా భవిష్యత్తు గురించి చెప్పేరు. జ్ఞాపకం ఉందా?"
"గుర్తు లేదోయ్, ఏమన్నారు?"
"గొప్పగా చెప్పేరులే. 'కరతల బిక్షా, తరుతల వాసః’’' నీ బ్రతుకు అంతకన్న మించదురా--అన్నారు. నాకిప్పటికీ
గుర్తు."
రామారావు కంఠధ్వనిలో వెక్కిరింత గాని, కష్టం పెట్టుకున్నట్లుగాని సడి దొరక్కపోయినా మంగమ్మ కంగారుపడింది. అతని ముఖంలోనూ
ఆ ఛాయలు కనబడలేదు. నమ్మలేకుండా వుంది. అత్తగారి తోడ్పాటు లేకపోతే రామారావుతో సుపర్ణ పెళ్ళి తప్పించడం సాధ్యమయ్యేది
కాదని మంగమ్మ నమ్మకం. ఆ ఘట్టాలు జరిగి ఇంకా అయిదేళ్ళు కాలేదు. అవేమీ జరగనట్లూ, జరిగినా వానితో తనకేమీ
సంబంధంలేనట్లూ రామారావు మాట్లాడడం నమ్మతగిందిగా తోచలేదు.
"ఎప్పుడేనా కోపం మీద ఏదన్నా అన్నారేమోగాని, ఆమె మనస్సు చాలా మంచిదోయ్."
అత్తగారు బ్రతికి ఉండగా ఆమె విషయంలో మంగమ్మ అంత సద్భావం కనబరచిన సాక్ష్యం లేదు. ఈ సదభిప్రాయానికి మూలం ఏమిటో
రామారావు ఎరుగును. అందుచేత ఆశ్చర్యపడలేదు.
"ఆమె మనస్సు మంచితనం నేనెరగనా. ఆ రోజుల్లో మీరు చెప్తుండే వారు అందుచేతనే, ఆ వాక్శుద్ధి...."
ఆ రోజుల్లో అత్తగారిని గురించి తాను ఏం చెప్పేదో మంగమ్మ మరిచిపోలేదు. రామారావును హుషారు చెయ్యడం అవసరమనిపించింది.
"శుభ్రంగా వుద్యోగం చేసుకొంటున్నావు. నెలకో మూడు నాలుగు వందలు తెచ్చుకుంటున్నావు. నీకు లోటేమిటయ్యా."
రామారావు అట్టహాసంగా నవ్వేడు. అప్పుడే డ్రింక్సు తీసుకొని హాలులోకి వస్తున్న సుపర్ణ ఆ నవ్వు విని నిలబడిపోయింది.
"నాకేదో లోపం అని కాదు. ఆవిడ వాక్శుద్ధికి ఉదాహరణ నేనేననడం మనస్సులో కష్టం పెట్టుకుని కాదు. ఏ గుమ్మంలో భిక్ష ఆ
గుమ్మంలోనే వేసుకొంటావన్న మాటకి ఆధునిక పాఠమే మేస్టరీ. అసలు ఉద్యోగాలన్నీ ఇంచుమించు అంతే. ఏదో మీ అల్లుడిగారివంటివి
చాలకొద్ది. ఈ ఉద్యోగాల వాళ్ళంతా అంతే. కరతల భిక్షా. తరుతల వాసః. ఏమంటావు సుపర్ణా! గొప్ప సత్యం."
సుపర్ణ గ్రహించింది. అతని మనస్సులో చాలా ఆందోళన ఉంది. పైకి కనిపిస్తున్న ప్రశాంతి వట్టి నటన.
"పోదూ. పాడు ఉద్యోగం. అదిపోతే ప్రపంచమే పోయినట్లు మాట్లాడతావు." అంటూ సుపర్ణ అతనిని గదిమింది.
"మంచి గదులలోనే
సంచరిస్తాయి మీ ఊహలు
అన్నాడు శ్రీశ్రీ. నువ్వు అదృష్టవంతురాలివి సుపర్ణా."
దాని తరువాతి చరణం గుర్తువచ్చి సుపర్ణ తెల్ల బోయింది.
ఎంతో ఇబ్బందిగా తయారవుతున్న సంభాషణ సత్యనారాయణ రాకతో తేలిపోయింది.
"ఎంతసేపయిందోయి వచ్చి?"
"మీరు అల్లా వెళ్ళేరు, వచ్చేడు." అంది భాగ్యలక్ష్మి.
ఆమె అక్కడకు వచ్చినట్లే గమనించి ఉండని రామారావు తిరిగి చూసేడు.
"ఆ మాట చెప్పనేనాలేదేం?"
"చెప్తే వెంటనే వెళ్ళిపోయివుండే వాడివా?"--అంది భాగ్యలక్ష్మి.
"నన్ను ఆపాలనే చెప్పలేదన్నమాట."
"ఈ యింట్లో నువ్వు పరాయివాడివా ఏమిటోయ్. నువ్వంటే అందరికీ ఇష్టమే."--అంది మంగమ్మ.
రామారావు డ్రింకు తాగి గ్లాసు బల్లమీద పెడుతూంటే సుపర్ణ చటుక్కున అందుకుంది.
సత్యనారాయణ లోపలికి దారి తీసేడు.
"రా. పైకిపోదాం."
ఇరవయ్యో ప్రకరణం
ఒకే విమూఢస్థితిలో మేడ దిగి వచ్చేడు, రామారావు. తాను సత్యనారాయణ వద్ద అంగీకరించినది నీతిబద్ధమో, నీతిబాహ్యమో
అతనికి అర్థం కావటం లేదు.
కట్నం కోరరాదనేది తన నియమం. కాని, ఇదేమిటి? తనకు స్థిరపడిన కన్యకు తండ్రి రాసి ఇవ్వగల భూమిని అమ్మించి ఆ
ధనంతో తన చదువు పూర్తి చేసుకొనాలని ఆలోచించడం ఆ నియమానికి అనుగుణమా?
ఆ భూమి కోసం--ఆ కన్యమీది ఆసక్తితో మాత్రం కాదు--తాను ఇంతవరకూ వాయిదావేస్తూ వచ్చిన పెళ్ళికి తొందరపడడం నీతి
బాహ్యమని మనస్సు ఎదురు తిరుగుతూంది. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఆమె అనుకుంటుందనే కాదు. వాస్తవం అదే కదా! ఏదో
ఉద్విగ్నస్థితిలో, ఎవరి మీదనో కసితో, ఎప్పటికేనా తప్పదుకదా యని, వివాహానికి ఆనాడు వొప్పుకొన్నాడు. కాని, ప్రదానం
చేసుకోడం దశ దాటి ముందుకు అడుగు వెయ్యలేకపోయాడు. వధువు చదువు పూర్తికాకపోవడం. తన చెల్లెలి పెళ్ళి అవసరం కొంతకాలం
అతనిని ఆదుకున్నాయి. ఆమె చదువు ఒక దశకు వచ్చింది; చెల్లెలు పెళ్ళి అయింది. కాని అతడు ఉత్సాహం చూపలేదు. వధువుకు
ఉన్నత విద్యావసరం పేరున మరల వాయిదా కోరేడు. గతంలో తను ప్రేమించిన కన్య ఉన్నత విద్యకని వెళ్ళి తనను
మరిచిపోయినట్లే ఈమె కూడా తప్పిపోతుందని ఆశ అతనిది. ఈ సంబంధం తప్పిపోవాలనే తాను కోరుతున్నాడు. అయితే ఆ మాట
తప్పేననే అప్రతిష్ట చుట్టుకోకుండా బయటపడాలని తన ఆశ. కాలయాపనతో పనిలేకుండా తన ఆశ నెరవేరే అవకాశం ఇప్పుడుంది.
సెంటు భూమి లేక, వున్న వుద్యోగం ఊడి, కాని సంపాదన లేని తనకు కూతురునిచ్చి పెళ్ళిచేసే ఉత్సాహం హనుమంతరావుకు ఉండదు.
తెలిసో, తెలియకో, తన చెల్లెలు ప్రోత్సాహం వల్లనో తనను కోరుకొన్న జయప్రదకూ ఈ దశలో యిదివరకటి పట్టుదల
ఉండదు--తాను బయట పడడానికి, ఈ వుద్యోగం పోవడం ఒక విధంగా సాయపడుతుందను కుంటూంటే--ఇప్పుడీ మెలిక. తనను పునరాలోచింప
చేస్తున్న ఈ సంబంధం తన భవిష్యత్తుకి సోపానం కావచ్చు. కాని, ఇది తన నైతిక ధర్మదీక్షను గబ్బు పట్టించేస్తుందే! ఆ
అమ్మాయి పట్టుదల అలాగే వుంటే తన సంసిద్ధత చూసి హనుమంతరావు పెళ్ళి చేయవచ్చు. కాని, భూమి అమ్మడం, దానితో
చదువుకోవడం ప్రతిపాదన విని ఆ భూమిని కూతురుకు వ్రాయకపోవచ్చు. అప్పుడేమౌతుంది? తనదే కాదు. ఆ అమ్మాయి భవిష్యత్తూ
చెడుతుంది కనక పెళ్ళికి ముందు ఆ భూమి రాసివ్వాలనేది ఒక షరతు కావాలి. తప్పదు. తానంత సుముఖంగాలేని అమ్మాయితో పెళ్ళి.
తన నియమానికి భంగకరంగా కట్నం కోరడం వంటిదే ఆ షరతు. తనలోని ఈ లొసుగుకు అభిమానపడి ఆ అమ్మాయి తనమీద
అపనమ్మకంతో భూమి అమ్మడానికి నిరాకరిస్తే? అసంభవం కాదు. మళ్ళీ పెళ్ళిముందే దానిని అమ్మి తీరాలని షరతు పెట్టాలి.
అప్పుడు కూడా దానిని ఆమె పేరనే బ్యాంకులో పెట్టకూడదు. తనకూ అధికారం ఉండే లాగ యిద్దరి పేరనా పెట్టించాలి.
సత్యనారాయణ ఎన్నోవిధాల నచ్చచెప్పినా రామారావుకి ఈ ఏర్పాట్లు ఒప్పందం కాలేదు. అయితే ఏదో మూల ఆశా కనిపించక పోలేదు.
ఈనాటి దుర్భర స్థితి నుంచి బయటపడడానికి లేదా దుర్భర నైతిక పరిస్థితి నుంచి బయటపడాలంటేనూ ఈ ప్రయత్నమే
తోడ్పడవచ్చుననిపించింది. కన్యా వధువుతో ఈ విషయం పూర్తిగా చర్చించనిదే ముందుకు అడుగు వెయ్యకుండేందుకు సత్యనారాయణ చేత
ఒప్పించడం ఒక గొప్ప విజయం అనుకున్నాడు. ఈలోపున సత్యనారాయణ తన ప్రయత్నాలు చేస్తాడు.
కాని, మెట్లు దిగుతూంటే మళ్ళీ సందేహం. తాను కూడదనుకున్న పనిని చర్చకు పెడతాననడం మాత్రం విజయమా? ఆ అమ్మాయిని
కలుసుకోడం ఎల్లాగ? ఏదో ఎవరో బంధువులింట పెళ్ళికి ఆమె ముంగండ వెళ్ళిందని తన చెల్లెలు వ్రాసింది. ఎప్పుడు వస్తుంది?
ఎల్లా కలుసుకోడం? ఎల్లా మాట్లాడడం?
ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ హాలులోకి వచ్చేసరికి భాగ్యలక్ష్మి ఎదురయింది. ఆమెను చూడగనే తనను గురించి ప్రిన్సిపాలుకు
అభ్యర్థించిన సమాచారం మనస్సుకు వచ్చింది. అంతక్రితమే ఆమె ఆలోచనలు తనకు తెలుసు. ఈ ఘటన ఆమె మీద ఆప్యాయతను
పెంచింది. మొదట అది తెలిసేసరికే తాను మరొకరికి అతుక్కు పోయేడు. విడుదల అయ్యే అవకాశం వచ్చేసరికి మళ్ళీ ఈ మెలిక.
దీనితో తాను మరీ అతుక్కుపోవడమో, నిరుద్యోగంతో వివాహార్హతనే కోల్పోవడమో! తన చిత్ర పరిస్థితి తోచగనే నవ్వొచ్చింది.
నవ్వుతూనే ఆమెను అభినందించేడు.
ఆ అభినందన భాగ్యలక్ష్మికి కోపం తెప్పించింది.
"ఉద్యోగం పోయినా నీకు విరగబాటు తగ్గలేదు."
"నీబోటిది సాయం ఉండగా...."
"హు--సాయం"--భాగ్యలక్ష్మి ముక్కి, చర్రున లేచింది.
రామారావు మరింత నవ్వేడు.
"జీవితం ఓ చిత్ర విచిత్రాల కథ భాగ్యం!"
ఆ సంబోధనకు ఆశ్చర్యంతో తిరగబడి చూసింది. "భాగ్యం." అన్నమాట ఆమె పెదవులుదాటి బయటకు రా నిరాకరించింది.
ఇరవయ్యొకటో ప్రకరణం
అప్పుడే హోటలునుంచి వచ్చి చదవడానికి పేపరు తీసుకున్నాడు. వీధిలో పిలుపు--"మేష్టారూ?"
"ఇలా"--అంటూ రామారావు వెళ్ళి తలుపు తీసేడు. వీధి దీపం ఉన్నా క్రీనీడలో ఎవరో తెలియలేదు.
"నేనండి, బలభద్రాన్ని."
అయినా అర్థం కాలేదు. లోపలికి ఆహ్వానించేడు.
దీపం వెలుతురులో గుర్తు తెలిసింది. తమ కాలేజీలోనే పి. యు. సి. పాస్ అయ్యాడు. మానేసేడు. తాను చేసుకోదలచిన అమ్మాయికి
ఏదో బంధువు.
"నువ్వుటోయ్! గుర్తు తెలియలేదు. బాగున్నావా?" అని కుశల ప్రశ్నలు వేసేడు.
"ఇంట్లో అమ్మగారు లేరా"--అని ఎదురుప్రశ్న వేస్తూ, బలభద్రం సిగ్గుతో ఒక కవరు అందించేడు.
"మీరు తప్పక దయచేయాలి."
కవరు అంచులకున్న పసుపు మరక చూస్తూనే, రామారావు చిరునవ్వుతో "పెళ్ళా యేమిటోయ్!" అన్నాడు.
బలభద్రం సిగ్గుపడ్డాడు. లోపలి శుభలేఖ చూసి రామారావు సంతోషం తెలిపేడు.
"కంగ్రాట్యులేషన్స్. బాగుంది, పిల్ల పేరు విజయలక్ష్మా! ఏమన్నా చదువుకుందా?"
"మెట్రిక్ చదువుతూందండి."
ఇటీవల తెలుగు దేశంలో ఆడపిల్లలవాళ్ళూ--మగపిల్లల వాళ్ళూ రెండోవారు ఏం చదువుతున్నారని ప్రశ్నించడం మామూలు అయింది. దానితో
జనం ట్యుటోరియల్ స్కూళ్ళకి ఎగబడడం మొదలెట్టేరు. ఏం చదువుతున్నావంటే మెట్రిక్ అనొచ్చు. అబద్ధం చెప్పేవనలేదు. దానికో
ప్రవేశ పరీక్షంటూ లేదుగనక, ఇంగ్లీషు అక్షరాలు గుర్తుపట్టడం నేర్చుకుంటున్న వానిది కూడా తక్షణ గమ్యం మెట్రికే. ఏ
అమెరికాకో ప్రయాణంకట్టి బెజవాడలో రైలెక్కిన వాడు కూడా "స్టేట్స్"కే వెడుతున్నానంటాడు.
చదువు గురించి మరి రామారావు తరచలేదు.
"కట్నం ఏమాత్రం ఏమిటి?"
"ఏమీ లేదండి. ఆ పేరు చెప్తే వొప్పుకోనన్నాను."
"చాలా మంచిపని చేసేవు. బాగుంది."
అంత విశాల, దృఢాభిప్రాయం తెలిపిన ఆ కుర్రవానికి ఇంకా యిరవయ్యేళ్ళేనా వుండవు. తెనుగుదేశపు కుర్రకారులో అటువంటి ఉదాత్త
భావాలు వ్యక్తమవుతున్నందుకు చాల ఉత్సాహం కలిగింది. అయితే తన చదువే ఇంకా ప్రారంభదశలో వుంది. అటువంటప్పుడు చదువు ఇంకా
ప్రారంభమేనా కాని పిల్లని పెళ్లిచేసుకొంటున్నాడు. ఈ తొందరేమిటనిపించింది.
"మీ నాన్నగారు బాగా సంపాదించారనుకుంటా, ఏం చేస్తుంటారు?"
"వ్యవసాయమేనండి, అదీ ఎక్కువ కాదు. మాకున్నది మూడెకరాల చిల్లర. నలుగురైదుగురు పిల్లల్లో నేనే పెద్దవాణ్ణండి."
అనేక ప్రశ్నలు వేసి రాబట్టిన ఈ సమాచారం విన్నాక, రామారావుకు మరింత ఆశ్చర్యం కలిగింది. వయసు వస్తున్న దశలో కను
ముక్కు తీరు చూసి మిగతా ప్రపంచం మరిచివుంటాడనిపించింది.
"అమ్మాయి నచ్చిందా?"
బలభద్రం వెంటనే జేబులోంచి ఓ కవరు తీసి అందించేడు.
"అమ్మాయి చక్కగా వుంది." అన్న మెచ్చుకోలుకు బలభద్రం ఉబ్బి తబ్బిబ్బయిపోయేడు.
"అవునండి."
"మీ మామగారు ఏం చేస్తుంటారు?"
"పెద్దగా ఏం లేదండి."
"ఆస్తి బాగా వుందనుకుంటా."
"అదీ ఏం లేదండి. పది పన్నెండు ఎకరాలు వుంటుందేమో."
"బావమరుదులు?"
"ముగ్గురండి. ఇద్దరు కూతుళ్ళు."
"వాళ్ళేమన్నా వుద్యోగాల్లో వున్నారా?"
"పెళ్లికూతురే పిల్లలలో పెద్దది."
పాతికేళ్ళుదాటినా పెళ్ళంటే తనకు అనిపిస్తున్న భయం వీనికెందుకనిపించడంలేదు. రామారావుకి ఆశ్చర్యంగా వుంది.
"మా నాన్నగారికి నాచేత మెడిసిన్ చదివించాలని వుందండి. అందుకే ప్రీ – ప్రొఫెషనల్ కోర్స్ లో చేరేనండి."
"మంచిదే. ఈ రోజుల్లో బి. ఏ. లూ, ఎం. ఏ .లూ కావడం కన్న, ఇంజనీర్లు కావడం కన్న మెడిసిన్ చదవడం మేలు.
ప్రాక్టీసు పెట్టుకు బ్రతకొచ్చు. ఆయన ఆలోచన మంచిదే."
"కాని, మేమంత సాగగలవాళ్ళం కామండి."
"మరి."
"మా కాబోయే మామగారి తండ్రిగారు రెండు మూడు డొనేషన్ కాలేజీలకు ఏజంటు. పేరు వినే వుంటారు. పట్టాభిరామయ్యగారని. ఆయన సీటు
ఇప్పిస్తానన్నారు. డబ్బు కట్టనక్కర్లేదు. ఆయనే చూసుకొంటారు."
"సీట్ దొరికితే చదువు అయిపోతుందా? మరో పాతిక వేలేనా అవదూ"
"ఆ అమ్మాయి పెత్తల్లి వాళ్ళవద్ద పెరుగుతూంది. వాళ్ళు వున్న వాళ్ళు. అభిమాన పుత్రిక. కాకినాడ వాళ్ళది. చదువు
చెప్పించడం తమరు చేస్తామన్నారండి."
"గట్టి వాడివే."
"లేకపోతే బి.ఏ. కన్న చదవలేను. వుద్యోగాలు దొరక్క బాధపడుతున్న ఈ రోజుల్లో బి.ఏ. మొహం ఎవరు చూస్తారు?"
తానే స్వయంగా నిదర్శనం. రామారావు నిస్సంకోచంగా ఒప్పుకున్నాడు.
కాని, అనేక ఆలోచనలు.
బలభద్రం ఏర్పాటు కట్నంగా భావించవచ్చునా! ఇప్పుడు తాను అదే స్థితికి రావడంతో ఆ విషయాన్ని తేల్చుకోడం అత్యవసరంగా
కనిపించింది.
యిప్పుడే కాదు. ఇంతకు పూర్వమూ యిటువంటి ఘట్టం వచ్చింది. సత్యనారాయణే చదివిస్తానన్నాడు. కాని, తానే ఒప్పుకోలేదు. పోయి
ఉద్యోగంలో చేరేడు. డబ్బు కూడబెట్టి తానే చదువుకోవాలని ఆశ. నాలుగేళ్ళయింది. ఒక్క ఏడాది చదువుకు కావలసినది కూడా
సమకూడ లేదు. ఇప్పుడా వుద్యోగం పోయింది. ఆ అమ్మాయీ చెయ్యిదాటి పోయింది. తన నియమ నిష్ఠ తన జీవితాన్నే దెబ్బ తీసింది.
ఆ దృష్టితో చూస్తే, బలభద్రం చేస్తున్నది తెలివైన పనే అనిపించినా మంచిదనిపించడం లేదు.
ఆ అమ్మాయి తండ్రి కాలేజీ సీటు యిప్పించలేకపోతే. ఆమె పెత్తల్లిగారి వాళ్ళు సాయం చెయ్యలేకపోతే? రెండు, మూడు కుటుంబాల మధ్య
అగ్నిహోత్రమే కద. అంతకన్న కట్నం నిర్ణయించుకొని వసూలు చేయడం సుఖం కదా.
ఆ ఆలోచన అనిపించేక తన విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేడు. తన కాబోయే భార్యకు పరిస్థితులన్నీ చెప్పి, అన్ని
ఏర్పాట్లూ అందరికీ అంగీకారమయి, స్పష్టం అయితేనే పెళ్ళికి సిద్ధం కావాలి. ఎక్కడా ఏ మాత్రం లొసుగు పనికిరాదు. ఆ
నిర్ణయానికి వచ్చేక "బలభద్రం" అని పిలిచేడు.
"అయ్య."
"నిద్ర పోలేదా?"
"కొత్త చోటు కాదాండి."
"మీ జయప్రద ఎక్కడుంది?"
"స్పష్టంగా తెలియదండి? వాళ్ళ వూరెడుతున్నా. తెలుసుకు రాయమంటారా? కాని, నా పెళ్ళికి వస్తుందండి. పెళ్లికూతురావిడ పింతల్లి
కూతురే."
"సరే వ్రాయి." అన్నాడు.
మళ్ళీ ఆలోచనలు. ఎదటి పక్షం ఎక్కడ సందేహించినా తన పెళ్ళి నిలిచిపోతుంది. అది తనకు ఇష్టమే. కాని, జీవితంలో చాలా
నష్టం.
వాళ్ళు అంగీకరిస్తే తన యిష్టం ఏమంటుంది? ఎన్నడూ వూహించని స్థితి.
మొత్తం మీద ఇష్టం--పెళ్ళి--చదువు--డబ్బు ఇవన్నీ ఒకదానికొకటి పొసగని అంశాలేనా? ఎవరికివారు, తమకు కావలసినవీ,
చేతికి అందినవీ ఒక పోగులోంచి లాక్కుని, దానితో తృప్తిపడో, ఏడ్చో, కొట్లాడుతూనో కాలక్షేపం చెయ్యవలసిందేనా?
అతనికి భయం కలిగింది.
ఇరవై రెండో ప్రకరణం
పంచదార కార్డు చేత బట్టుకొని అడిషనల్ తహసీల్దారు ఆఫీసు దగ్గరకెళ్ళేసరికి, ఆ జనాన్ని చూసి రామారావు గుండెలు
అదిరిపోయాయి. కొన్ని వందలమంది గుంపులు, గుంపులుగా ఆఫీసు వరండాలలో, ఆవరణలో చెట్ల క్రింద వున్నారు. రోడ్డుమీద
వచ్చేటప్పుడు తన పక్కన నడిచిన వాళ్ళేగాని, ఎదురు వచ్చిన వాళ్ళున్నారా, జ్ఞాపకం చేసుకొనేందుకు ప్రయత్నించేడు. ఎక్కువ
మంది కనిపించలేదు....ఈ వేళ కాదు. వారం రోజులైనా తనకి కొత్త కార్డు పుడుతుందా? తిరిగి పోదామనిపించింది. మరో రూపాయి
అవుతుంది గాని, తాను కొనే పంచదార మాత్రం ఎంతలే అనీ అనిపించింది. అయినా వెనకకు తిరగలేదు. ఓ ప్రయత్నం చేసి మరీ
పోదామనుకున్నాడు.
ఆవరణలో కెళ్ళేక వాకబు చేస్తూంటే ఎవరో పలకరించేరు.
"మీరా మేస్టారూ. యిల్లా వచ్చేరు. పంచదార కార్డుకేనా?"
ఆ యువకుడినెక్కడో చూశాననిపించింది. కాని, గుర్తు రాలేదు. అతని వేపు తెల్లబోయి చూస్తుంటే తానే చెప్పేడు.
మరిచిపోయారన్నమాట. ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళనలో కాల్పుల రోజున బజారులో మేడమీది నుంచి హాస్పిటలు చేర్పించినది నన్నేనండి."
అంటూ నవ్వేడు.
"గుర్తు వచ్చిందా?"
రామారావు సంతోషంతో అతని చేయి పట్టుకుని గిజాయించేడు.
"చాల సంతోషం. గాయాలు మానిపోయాయా?"
"అవి అప్పుడే మానిపోయాయండి. కాని లంజ కొడుకులు కేసుల్లో పెట్టి తిప్పి చంపుతున్నారు."
"ఔనుట. మీ అన్నగారోమాటు చెప్పేరు."
"మీరెవరో నాకు చెప్పిందీ ఆయనే."
"ఆ రోజున మిమ్మల్ని బలవంతంపెట్టి హాస్పిటలుకు చేర్చకపోతే ఈ కేసులుండేవి కాదు గదా. మరి మీకు కోపంగా లేదూ, నా మీద."
"అప్పారావు గాని ఏమయినా అన్నాడేమిటండి." అంటూ అతడు పకపక నవ్వేడు.
"ఆ మూడో అతని పేరు అప్పారావా! రెండు మూడు రోజుల క్రితం బజారులో హోటలు వద్ద చూశా."
"ఏమన్నా అన్నాడేమిటండి. ఏమీ అనుకోకండి సర్! మనిషి మంచివాడు. కాని అదోరకం."
"అర్ధం అయింది. మీరిల్లా మాట్లాడుతున్నారు గాని, ఆయన...."
"పలకరిస్తే కరిచేసుంటాడు" అంటూ నవ్వేడు. "కాని తెలివి తక్కువదనం. మీరేం చేసేరు. మాకు ఏమవుతుందోనని కంగారుపడి
హాస్పిటలుకు తీసుకెళ్ళారు. ముండా గవర్నమెంటుది అంతా లాలొచీ వ్యవహారం. ఆ నిరశన వ్రతంగాడు మాత్రం నిజాయితీవాడా. జనం
యిచ్చినవే ముప్ఫయి, నలభై వేలు స్నేహితుల ద్వారా దాటించేడుట. పారిపోయేడు. వాడిని నమ్మి ముఫ్పై మంది ప్రాణాలిచ్చేరు. యిది
వాస్తవం. మా కేసులు కొసరు. మధ్య తిట్లు మీరు తిన్నారు."
యిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఆఫీసు వరండా ఎక్కేరు.
"మీకెవరేనా తెలుసాండి."
"నాతో చదువుకున్న అతడొకడుండాలి మరి. మీరిక్కడే వుండండి. చూసి వస్తా."
రామారావు ఒక్క మారు వరండాలో చుట్టు తిరిగి వచ్చేడు. ఒక కిటికీ వద్ద తాను ఎరిగిన ముఖం కనిపించింది. కాని, పేరు గుర్తు
రాలేదు. అతడు తల వంచుకొని తెగ రాసేస్తున్నాడు. పక్కన ట్రేలో రాయవలసిన కార్డుల బొత్తి, పెద్దది కనిపిస్తూంది. మరో
రెండు కిటికీల వద్ద కూడా గుమాస్తాలు కనిపించేరు. వాళ్ళవద్దా కార్డుల బొత్తులున్నాయి. పని బహు తాపీగా జరుగుతూంది. లోపలి
గదిలో తాశీల్దారు కాఫీ సేవిస్తూ ఫోనులో ఎవరితోనో మాట్లాడడం వినిపిస్తూంది.
ప్రతి ఆఫీసులో కనిపించే వాతావరణమే. చేసేవాడు చేస్తుంటాడు. సాచేసేవాడు సాచేస్తూంటాడు. కనుక్కొనే నాధుడుండడు.
రామారావు వెనక్కి వచ్చి—"మా మిత్రుడున్నాడు. వ్యవహారం తెలుసుకు వస్తాను. మీ కార్డు ఎవరిదగ్గర కెళ్ళిందో చూసొస్తా.
వుండండి. అన్నట్లు—మీ పేరేమిటి?"
"శ్యామలరావు"
లోపలికి వెడితే ఎల్లాగోలా యామారి పని చేయించుకోవచ్చుననిపించి, రామారావు గుమ్మంవేపు వెళ్ళేడు.
అతనిలాగే మరికొందరు అక్కడ చేరి వున్నారు. కాని బంట్రోతు వారిని పోనివ్వడం లేదు. అంతమంది తన్ను చూసి జంకుతూ నిలబడి
పోతూండడం, తిరిగి పోతూండడం చూస్తుంటే ఆ బంట్రోతుకి దర్పం పెరిగిపోతూంది. తనను అడుగుతున్నవారిని కసురుకుంటున్నాడు.
"పోండయ్యా బాబు! నన్ను సంపితే నేనేం సేసేది? ఎల్లి కూకోండి. దొరవారు నన్ను తిడుతుండారు, ఆ గోలేంటని! నేనే పిలిసి
కార్డులిత్తున్నా గంద."
తన వాగ్దానానికి సాక్ష్యంగా బంట్రోతు నాలుగు పేర్లు పిలిచేడు.
"పునుగు చలమయ్య."
"గంటా ఘటోత్కచుడూ."
"బాగోతుల మాణిక్యమ్మ."
"అవిటి లచుమన్నా."
బాబ్బాబు--అంటూ నాలుగుపేర్ల వాళ్ళూ పరుగెత్తి వచ్చేరు.
"ఏమయ్యోవ్! అయినకాడికి రూపాయీ పుచ్చుకొని ఎనకటల్లే అరకిలోయే వేయించావేం." అని మాణిక్యమ్మ పేచీ పెట్టుకుంది.
"అసలిచ్చేరనుకోక మళ్ళీ గునుస్తావేం." అని బంట్రోతు గదిమేడు. ఆమె ఇంకా అరుస్తూనే వుంటే, అసలు రహస్యం బయట
పెట్టేడు.
"చూడండయ్యా! ఈవిడేమో పావలాకి, అర్థకీ అమ్ముకుంటుంది. ఇసుమంటోళ్ళ మూలంగానే కావలసినోళ్ళకి దొరకకుండా పోతాంది."
ఆమె పేరు వినగానే రామారావుకు తన మిత్రుని పేరు గుర్తుకు వచ్చింది. "మాణిక్యాలరావు." ఆ పేరు నుపయోగించుకొని లోపల
చొరబడ్డాడు. బంట్రోతు వెనకనుంచి కేకేసేడు.
"మూడో నెంబరు టేబులండి."
"తెలుసునయ్యా దేవుడా!"
లోపలికెళ్ళేక తనదొక్కడిదే ప్రజ్ఞ కాదనీ, తనకన్నా ముందో అయిదారుగురు ఆ టేబులు అగల బగల తచ్చాడుతున్నారనీ
గ్రహించేడు. అంటే తన మిత్రుడు అంత ఆశ్రిత సులభుడు కాదన్నమాట. ఆ మాట తోచినప్పుడు సంతోషమే కలిగింది.
"నమస్తే."
మాణిక్యాలరావు తల ఎత్తేడు.
"మీరా!"
ఎరిగిన ముఖం కనబడగానే మాణిక్యాలరావు తన బాధ చెప్పుకున్నాడు.
"చచ్చిపోతున్నానండి. వ్రాసినకొద్దీ కట్ట పెరిగిపోతూంది."
"ఇంత హఠాత్తుగా ఈ మార్చడం ఆలోచన ఎందుకొచ్చింది?"
"మార్చాలనుకొన్నారనుకోండి. వార్డు తరవాత వార్డు ఏడిస్తే ఎంత బావుండేది? లేదా వార్డుకో గుమస్తా నిచ్చినా బాగుండును."
"వాళ్ళకా అంత బుద్ధి. అయ్యో." అన్నాడు, రామారావు.
"మేం చెప్పేం. ముప్ఫయి, నలభయి వేల కార్డులు రాయాలంటే నెల రోజులు కూడా చాలదన్నాం."
"అయినా కాదన్నారేం!"
"కాదంటే, అదో అందం. ఓ నెల పంచదార అందకపోతే చచ్చిపోరులే--అన్నాడు ఆఫీసరు."
"అమ్మ బద్మాషు."
ఆ తిట్టుతో మాణిక్యాలరావుకు తెలివి వచ్చినట్లయింది. తాను తొందరపడి ఆఫీసు రహస్యాలు బయట పెట్టేశానని కంగారు పడ్డాడు.
చటుక్కున తల వంచి రాతకి తలబడ్డాడు.
రామారావు ఆలోచించేడు.
జనం పొద్దుటినుంచీ ఎండలో మాడిపోతున్నారు. తనకీ కార్డు కావాలి. మళ్ళీ రాత్రి ఊరుకు పోతే ఏమవుతుందో. పోనీ, కొందరు కార్డులు
రాయడానికి సాయపడితే పని త్వరగా జరుగుతుందనిపించింది.
"కొన్ని కార్డులు నే వ్రాయనా?"
"మీకెందుకండీ బెడద. మీ కార్డు వీటిలో వుందా?"
"లేదు. కానీ, ఏం వ్రాయలేనా?"
"బ్రహ్మ విద్యా ఏమిటి?"
"మరింకనేం. మరో నలుగురిని లాక్కొస్తా. పని త్వరగా జరుగుతుంది."
"తాసిల్దారు ఒప్పుకోడు." అన్నాడు మాణిక్యాలరావు, తనకభ్యంతరం లేదని సూచిస్తూ.
తాసిల్దారు ఒప్పుకోడన్న మాటకు రామారావులో పట్టుదల పెరిగింది. వెనకటి రోజున కుర్రాళ్ళు గురునాధం మేష్టరును ఘెరావో
చెయ్యాలనుకోడం గుర్తు వచ్చింది.
"సాయం చేస్తామంటున్నాం గాని, మరొకటి కాదు కదా. అయినా...."
"అడిగి చూడండి."
అంతలో మరో ఆలోచన తోచింది. తీరాచేసి తాసిల్దారు సరేనంటే వ్రాసేందుకు ఎవరన్నా వస్తారో రారో....అనిపించింది.
అదేదో తేల్చుకొనేందుకు వరండాలోకి వెళ్ళేడు. ఆ సలహా విని శ్యామలరావు సిద్ధపడ్డాడు.
"నేను వస్తా"
"మరో నలుగురుంటే...."
ఇద్దరూ జనం గుంపుల మధ్య తమ ప్రతిపాదన పడేశారు.
"బాబ్బాబు. అల్లాంటిదేదో చెయ్యండి నాయనా. మళ్ళీ పనిమాలా రేపు రావాలంటే చచ్చిపోతాం."
నాలుగువేపుల నుంచీ జనం తమ ప్రతిపాదనను సమర్ధించేరు. కాని వ్రాతగాళ్ళు కావాలనేసరికి గొణుగుడు ప్రారంభమయింది.
"నాయాళ్ళు కలం పెడితే పని జరుగుద్ది గాని, ఊసులాడుతుంటే అవిద్దా?"
"కార్డుకి రూపాయి ఆడు తీసుకోడం, మనం వ్రాయడమూనా?"
"వీళ్ళ వీపులు విమానం మోత మోగిస్తాననక, వాళ్ళకి సాయం చేస్తానంటావే."
అనేక వ్యాఖ్యలు, విసుళ్ళు. కాని, క్రమంగా పదిమంది దొరికేరు.
బంట్రోతు వారిని అడ్డగించబోయేడు. కాని, రామారావు సమాధానం విని, జనంలో రేగుతున్న కోపతాపాలు చూసేక వదిలేసేడు.
"గొడవ సేయకండి. అయ్యగారు కోపం సేత్తారు. నెమ్మది. సద్దు సేయొద్దు."
ఇరవైమూడో ప్రకరణం
కాని, తన పనిలో వేరొకరు చెయ్యి పెట్టడాన్ని తాసిల్దారు మొదటే ఒప్పుకోలేదు. బంట్రోతును కేకేసేడు.
"వీళ్ళందర్నీ ఎందుకు వదిలేవు?"
"చిత్తం. చిత్తం. రాండయ్యా బాబు, రాండి." ఒకళ్ళనో ఇద్దర్నో మాత్రం తీసుకొని బంట్రోతు బయటకు నడిచేడు. రామారావు
కదలతలుచుకోలేదు. అంతవరకూ నిల్చున్నవాడు పక్కనున్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
"మీరు వెళ్లిపోండి. నెమ్మదిగా చెప్తున్నా, వినండి." అన్నాడు ఆఫీసరు.
"మేమూ నెమ్మదిగానే అడుగుతున్నాం. మీ పని జరగడం లేదు...."
"ఎల్లా జరిగించాలో మాకు తెలుసు."
"సందేహం ఏముందీ. అందుకే మేం సాయం చేస్తామనడం."
తాసిల్దారుకు మహా కోపం వచ్చింది.
"ఐసే. ప్లీజ్ గెటవుట్!"
రామారావు బిగిసేడు. అతని తోడివాళ్ళు దగ్గరకు జరిగేరు.
"మేం వెళ్ళడానికి రాలేదు సర్! వెళ్ళం. పంచదార కార్డులందరికీ ముట్టందే కదలం. కార్డుకి రూపాయి వసూలు చేయడం ఏమిటో అదీ
తేలుస్తాం."
అడిషనల్ తాసిల్దారు ఇల్లాంటి చాతుర్మాస్యలు చాలా చూసేడు. బెదిరింపులేగాని, చివరకి ఒక్కడూ నిలబడడు. అందుచేత నిర్భయంగా
తానే ఎదుర్కొన్నాడు.
"పోలీసుల్ని పిలిపించవలసి వుంటుంది."
"ఆ అందం చూద్దాం. పిలవండి. ఆ డ్రాయర్లలో చేరిన రూపాయల దొంతరలూ, ఇంతవరకు ఇచ్చిన కార్డులూ అన్ని సంగతులూ బయట
పడడం మంచిదే."
తాసిల్దారు ఒక్క క్షణం ఆలోచించేడు. ఏదో తోచింది. ఫోన్ మీద చెయ్యి వేసేడు.
ఆ క్షణంలో రామారావూ ఆలోచించేడు. ఆఫీసర్లూ, ఆఫీసర్లూ అన్నీ సర్దేసుకొంటారు. వెంటనే ఫోన్ నెత్తకుండా తాసిల్దారు చెయ్యి
నదిమి పెట్టేడు.
"తొందరపడొద్దు. నువ్వు పోలీసుకి ఫోన్ చేస్తావు. నేను వీధిలో వున్న జనానికి నీ వ్యవహారం చెప్తా. నీ పోలీసువాళ్ళు సర్దుకు
వచ్చేసరికి అరగంటేనా పడుతుంది. ఈ లోపున నిన్ను, నీ ఆఫీసుని, నీ రికార్డుల్ని ఒక్క డబ్బాడు కిరసనాయిలు పోసి
అగ్గిపుల్ల గీసేస్తారు. ఏం సరదాగా వుందా?"
రామారావు కుర్చీలోంచి లేస్తూ, రిసీవరును ఒడుపుగా ఒక్క గుంజు గుంజేడు. తాసిల్దారు తెల్లబోయేడు. కొద్దినెలలు క్రితమే ఉక్కు
ఫ్యాక్టరీ ఆందోళన సందర్భంగా నగరంలో జరిగిన భీభత్సాన్ని అతను మరిచిపోలేదు. సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
పోలీసు స్టేషను అంటించేసేరు. హోటళ్ళు తగలపెట్టేరు....ఒకరు చెప్పనక్కర్లేకుండా జనం వీధుల్లోకి వచ్చేసేరు. ఇక్కడ
అల్లాకూడాకాదు. పొద్దుటి నుంచి జనం ఎండలో మాడుతూ, మండిపడుతున్నారు. వుసిస్తే రామారావు చెప్పినంతపనీ చేసేస్తారు. అతని
వాలకం చూస్తే అందుకు సిద్ధమై వచ్చేడనిపించింది. అంతవరకూ చూపిన నిబ్బరం సడిలింది. మోకాళ్ళలో వణుకు పుట్టింది.
సాకెట్ పట్టు వదిలి చేతిలోకి వచ్చిన రిసీవర్ను క్రేడిల్ మీద పెట్టేసేడు, రామారావు.
"అట్టే పేచీ పెట్టుకోకండి. జనం విసిగిపోయి వున్నారు. మీరు కోరే పోలీసు సాయం మీ శవ పంచాయితీకి పనికొస్తుంది. వాళ్ళు
మిమ్మల్ని కాపాడలేరు. మేము మీకు సాయం రావలసిన పనేం లేదు. జీతాలు మీరూ తీసుకుంటున్నది. అది చాలక ఒక కోటా వదిలి
పెట్టేందుకు మిల్లువాళ్ళతో లాలూచీ అయి, ఈ కార్డుల తతంగం పెట్టేరు. అక్కడికీ ఆశ తీరలేదు. కార్డుకు రూపాయి వసూలు
చేస్తున్నారు. అదీ చాలనట్లు జనాన్ని ఎండలో నిలబెట్టి హింస పెడుతున్నారు. మీరు చేస్తున్న పనికి ఏం చేసినా పాపం కాదు.
"సహేంద్ర తక్షకాయస్వాహా" అనేసి, అల్లాంటి మరో పది సర్పయాగాలు జరిగేందుకు దారి చూపిస్తే, నీబోటిగాళ్ళకి కాస్త ఒళ్ళు
తెలిసొస్తుందేమో, కాని మేమా పని చెయ్యడం లేదు. పైగా సాయం చేస్తామంటున్నాం. మీ కోసం కాదు. ఆ జనం కోసం. మీ ప్రాణానికి
అడ్డు పడుతున్నాం."
"మీరు చెయ్యలేరు. తప్పులు రాస్తే." అంతవరకూ లోపలే మంటనణుచుకొంటున్న శ్యామలరావు గంయ్ మన్నాడు.
"నీ బోటి విద్వాంసులు దేశంలో లేక గొడ్డుపోలేదు."
"ఎల్లా రాయాలో చెప్పండి." అన్నాడు రామారావు.
"మీకు చెప్పేకన్న మేం రాస్తే సరిపోదా?"
"మాకేం అభ్యంతరం లేదు. ఈ కార్డులన్నీ అయ్యేవరకు మేం కదలం. మీరెవ్వరూ ఈ హాలునుంచి బయటికి పోడానికి ఒప్పుకోము."
ఇరవైనాలుగో ప్రకరణం
నాలుగైదు నెలల క్రితం అయితే సత్యనారాయణ ప్రతిపాదనకు హనుమంతరావు ఎగిరి గంతేసి వుండేవాడు. నిజానికి అతడే ఓమారు ఆ
ప్రతిపాదన చేశాడు. అదీ మధ్యవర్తి ద్వారా కాదు, స్వయంగా.
"కట్నం డబ్బు సగం పిల్ల పేర పెడతా. సగం నీకిస్తా. వుద్యోగం మానెయ్యి. పోయి ఎం. ఏ. చదువుకో."
రామారావు వొప్పుకోలేదు. మామగారి డబ్బుతో చదవుకోడం అతనికి నచ్చలేదు.
ఆ నిరాకరణకు విసువే కలిగింది. కాని హనుమంతరావు తొందరపడలేదు. కూతురు జయప్రద అతనే కావాలంటూంది.
రెందోవేపున సంతోషమే కలిగింది. నీతీ నిజాయితీ కలవాడు అల్లుడుగా దొరకడం, సులభం కాదనిపిస్తున్న రోజుల్లో ఆ మాట.
తన కంటె ఎవరేనా ఎక్కువిస్తానంటే అటు జారిపోతాడేమో. కట్నం చాలక, అడగలేక వేస్తున్న అడ్డం కాదు గదా
అనిపించకపోలేదు. కాని తానే కాదనుకున్నాడు. అమాయకత్వం, ప్రపంచ జ్ఞానం లేకపోవడం కారణం అయివుంటుందని సర్దుకున్నాడు. కాని
ప్రపంచం చూసి గడుసుబారితే? ఈ నియమాలు నిలుస్తాయా? వెంటనే పెళ్ళి చేసేసి అల్లుడిలోని నిజాయితీని భద్రపరచాలనుకొన్నాడు.
కాని రామారావు ఒప్పుకోలేదు.
నెలలు గడిచాయి.
కూతురు పెళ్ళి చేసెయ్యాలని ఆనాడు పడ్డంత తొందర ఈవేళ హనుమంతరావులో లేదు. రిట్రెంచిమెంట్లనీ, ఉద్యోగాల నుంచి
తీసేస్తున్నారని వార్తలు చెవిన పడుతున్నాయి. ఈ ఊడూడు గోచీ వుద్యోగం గాడికి, వుద్యోగం తప్ప మరో ఆధారం లేనివానికి
పిల్లనివ్వడం మంచిదా అనిపించక పోలేదు. తొందర పడకూడదనీ అనిపించింది.
"ఇదిగో సత్యనారాయణా! ఇదివరలో తెలియక అతనిని తొందర పెట్టేననుకో. అప్పుడు ఆ తొందర చూపినా అర్ధం వుంది. కాని,
ఇప్పుడు? ఉద్యోగం పోయి అల్లాడుతున్న దశలో వెళ్ళి మా పిల్లని పెళ్ళి చేసుకోడం మాట ఏం చేసేవని అడగనా? సామ్యం చెప్పిన
తరవాయిగా వుంటుంది కదూ."
"ఆ మధ్య నువ్వు చెప్పమన్నావని, నాలుగు రోజుల క్రితం కనిపిస్తే చెప్పేను. చెల్లెలు పెళ్ళి అయిపోయింది. ఈ
అమావాస్యదాటితే గోదావరి పుష్కరాలు. వచ్చే యేడు కృష్ణా పుష్కరాలు. ఈ రెండేళ్ళూ పెళ్ళిళ్ళు చేయకూడదు కదా. ఈ మాటే చెప్తే
మెత్తపడ్డాడనిపించింది."
హనుమంతరావు రెండేళ్ళ ఆటంకాన్ని మాత్రమే చెవిని వేసుకున్నాడు.