"రెండేళ్ళు ఎంతసేపులో తిరిగి వస్తాయి. మా పిల్లదాని వయస్సు ఏం మించింది. పంధొమ్మిది వెళ్ళి ఇరవయ్యే కదా. మరో రెండేళ్ళు

ఆపినా ఈ రోజుల్లో పరవాలేదు. అదో వయస్సా? ఈ లోపున అతడేదో మంచి వుద్యోగం చూసుకో గలుగుతాడు."

అర్ధం అయింది. హనుమంతరావు వెనకంజ వేసేడు. పైగా ముక్తాయింపుగా మరోమాట అనేసేడు.

"నాదిగా ఓమాట చెప్పు. ఈ రెండేళ్ళూ పోయి చదువుకోమను. ఇంక డబ్బుదా! మొత్తం అంతా నే పెట్టలేకపోయినా, అప్పుడూ అప్పుడూ

వందో రెండు వందలో కావాలంటే ఏ తలో తాకట్టు పెట్టి సర్దుతాను."

అల్లుడుగా కట్నం పుచ్చుకో నిరాకరించినవాడు పైవాడుగా చదువుకు డబ్బు అడుగుతాడనే భయం లేకపోవడంచేతనే హనుమంతరావు అంత

ధారాళంగా అనేసేడు.

"అతడు కావాలననే అక్కర్లేదు. పుచ్చుకోననడని తోస్తే చాలు చదువు ఖర్చు అంతా నేనే పెడతాను. కాని ఒప్పుకోడు కదా.

స్కూల్ ఫైనల్ అయ్యాక నేనే బెజవాడ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొన్నా. బసా, భోజనం వరకు ఎల్లాగో సర్దుకొన్నాడు. అంతే.

ఎక్కడెక్కడో ట్యూషన్లు చెప్పుకొని జీతం, బట్టలూ గడుపుకొన్నాడు. బి. య్యే. అయ్యేక అదీ లేదు. పోయి వుద్యోగంలో చేరేడు.

హనుమంతరావు చాలా ఉదారంగా ఆ అభిమానాన్ని మెచ్చుకొన్నాడు.

"ఈనాడు అటువంటి నీతి నియమాలూ, దీక్షా కుర్రవాళ్ళల్లో కనబడడంలేదు. అందుకే అతనంటే నాకిష్టం. అల్లాంటి వుత్తమాదర్శాలను

మలిన పరచకూడదు. స్వశక్తిమీద ఆధారపడడం చాల మంచిది. చాల పవిత్రం. దానిని పంకిలం చెయ్యకూడదు. ఈ ఇబ్బందులనుంచి

బయటపడి రమ్మను. రాగలడులే. నాకా నమ్మకం వుంది.

ఇరవైఅయిదో ప్రకరణం

నాలుగు రోజులుగా భాగ్యలక్ష్మి తమ ఇంటి ఛాయలకు కూడా రాలేదు. ఆ రోజున సుపర్ణ తన చెల్లెలు ఆశలూ, నిరాశలూ గురించి

చెప్పేవరకూ సుశీలకు ఆ మాట తోచనేలేదు. కాని, ఇప్పుడు ఆలోచిస్తూంటే భాగ్యలక్ష్మి ఎప్పుడు వచ్చినా రామారావు ఇంట్లో వుండే

వేళప్పుడే ననిపిస్తూంది. మళ్ళీ అతనిని పలకరించేది కాదు. వీలు చిక్కితే, మాటవస్తే వెక్కిరించడమో, వెటకారం చెయ్యడమో

తప్ప ఎప్పుడూ సజావుగా మాట్లాడేది కాదు. అదేమి ప్రణయమో అర్ధంగాక పోయినా సుశీలకు ఆమె యెడ జాలి మాత్రం కలిగింది.

నిరుపయోగకరమైన ఆ మనస్తత్వం రాను రాను స్థిరపడిపోయి ఆమె జీవితాన్నే భగ్నం చేస్తుందన్న జాలి. వీలయితే ఆమెను

హెచ్చరించి దారిన పెట్టాలన్న ఆదుర్దా, ఈ నాలుగు రోజుల నుంచీ ఆమె కోసం ఎదురు చూస్తూనే వుంది. చివరకు పిల్లగానిచేత కూడా

కబురు పెట్టింది. వస్తున్నానందేగాని రాలేదు.

సాయంకాలం వచ్చింది. వస్తూనే ఆమె అందించిన కబురేమిటో సుశీలకు అంతు పట్టలేదు.

"హనుమంతరావుగారు తన కూతురు నిచ్చేదిలేదు పొమ్మన్నాట్ట. ఆ సంబంధం జరగదు." అన్నది, భాగ్యలక్ష్మి.

"ఎవరా హనుమంతరావు? ఏమాకథ" అంది, నిశ్వాత్ముని నరసింహమూర్తిగారి బొమ్మల పంచతంత్రం పాత్ర బాణీలో.

అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా భాగ్యలక్ష్మి అడ్డుప్రశ్న వేసింది.

"రామారావింకా వూరినుంచి రాలేదా?"

"నేనొకటడుగుతే నువ్వొకటి చెప్తావేం....ఈ వేళ వస్తానన్నారా?"

"రాలేదా అంటే వస్తానని చెప్పినట్లు అర్ధమా? గడుస్తనం పోతున్నావు."--భాగ్యలక్ష్మి అదిలింపును సుశీల చిరునవ్వుతో

దాటేసింది.

"ఎవరా హనుమంతరావు?"

భాగ్యలక్ష్మి మళ్ళీ తన మొదటి ధోరణికి మళ్ళింది.

"హనుమంతరావు అనే ఆడపిల్లతండ్రి ఒకాయన వున్నాడీ కృష్ణాజిల్లాలో."

"ఏవంగుణ విశేషణ విశిష్టులైన ఏతన్నామధేయులు ఈ జిల్లాలో ఒకరేం ఖర్మ, ఊరికో అరడజను మందున్నారు."

"వుండనీ, మనకి కావలసింది ఈయన ఒక్కడే."

"సరే, వున్నాడు."

"అతడు తన ‘కన్యాం కనక సంపన్నాం" రామారావనే కాలేజీ ట్యూటరుకు ఇవ్వడానికి...."

విషయం అర్థం అవుతూందనిపించింది, సుశీలకి.

"ఆయనిప్పుడు ట్యూటరు కాదు."

"అందుకే ఆయన తాను మామను కాదలచుకోలేదన్నాడుట."

"ఎవరితో, ఎప్పుడు."

"నాన్నగారి దగ్గర...."

సుశీలకా సమాచారం నమ్మతగినదిగా తోచలేదు, నవ్వింది.

"ఇప్పుడామాట ఎందుకొచ్చింది? ఈయనే ఇప్పుడా తలపులో లేడుకదా."

"ఇప్పుడియనగారు సిద్ధంగానే వున్నాడు. నువ్వు చెప్పేది ఒకనాటి మాట."

ఆ చెప్పడంలో సంతోషం, ఉత్సాహమే గాని సానుభూతిలేదు. కసీ కనబడ్డంలేదు. తనకు దారి నిరాటంకం అయిందన్న ఆలోచనా? అదే

అయితే ఈ ధోరణితో ఆమె విజయం పొందలేదు. చెప్పాలి. నేర్పాలి,-- అనుకొంది, సుశీల.

"రామారావుకు ఏమాత్రం అపకారం జరిగినా మేలేనన్నట్లు ఆ మాటేమిటి?"

భాగ్యలక్ష్మి తెల్లబోయింది. అంతలో సర్దుకొని, తనని సమర్థించుకొంటూ "అతని కంతే జరగాలి," అంది.

"అబ్బో. అతనికెంత నీలుగు? ఎంత గర్వం? తానే అందగాడినని, తన్నుచూసి ఆడపిల్లలంతా మూర్ఛ పోతారని...."

ఆ ఆరోపణలకు సుశీల విస్తుపోయింది. తన మాటలకు ఆ ముఖంలో విశ్వాసం కనబడకపోవడంతో భాగ్యలక్ష్మి ముక్తాయింపుగా

వినిపించింది.

"అతని సంగతి నీకేం తెలుసు. నన్నడుగు చెప్తా, నా పదోఏట నుంచి చూస్తున్నా."

"నిజంగా నమ్మకం వుండే అంటున్నావా?"

రామారావు అందవికారంగా ఉండడేగాని అందగాడు కాదు. వయస్సులో వున్నాడు. ఆరోగ్యవంతుడు. నిరాడంబరంగా ఉన్నా నీటుగా ఉంటాడు. అదే

చూడముచ్చటగా వున్నాడనిపించే లక్షణాలు. మంచి తెలివిగలవాడవును. ఆ పరిజ్ఞానం ఆయనకుంది. ఆ రెండూ వున్న వాళ్ళలో

సాధారణంగా కనిపించే అహంభావమూ వుంది. కాని, ఎవ్వరినీ మాట తూలడు. ఆడవాళ్ళవద్ద ప్రతి యువకుడూ కనబరిచే ఆత్మ

ప్రకటనాసక్తివుంది. కాని వాళ్ళ వెంటబడతాడనుకోలేం. మర్యాద దాటడు.

కాని భాగ్యలక్ష్మి సుశీలకున్న సదభిప్రాయాన్ని నిరాకరించింది.

"నీకేం తెలుసు? మా యింట్లో నాలుగైదేళ్ళున్నాడు. నాకు తెలుసు."

"కాని, మీ అక్క అభిప్రాయం వేరు. దానికి ఆయన మీద...."

"దానికి అతని మీద మంచి అభిప్రాయం ఉండకేం. ఏం లేకపోతే, మేలుకొన్న పది పదహారు గంటలూ అతని వొడిలో దూరిందా?"

సుశీలకు కోపం వచ్చింది.

"ఒళ్లెరిగే మాట్లాడుతున్నావా? నోటికేంవస్తే అది అనెయ్యడమేనా?"

భాగ్యలక్ష్మి భయపడింది. ఉడుకుబోతుతనమూ కలిగింది. చర్రున లేచింది. కాని సుశీల పోనియ్యలేదు. చెయ్యి పట్టుకు లాగి

పక్కన కూర్చోబెట్టుకుంది. గడ్డంపట్టుకుని, వంచుకున్న తలను పైకెత్తింది. కళ్ళల్లోకి చూస్తూ తల అడ్డంగా తిప్పింది.

"నీ మనస్సు చెప్పడానికి మార్గం ఇదనుకున్నావా?"

"నాకెవరిమీదా మనస్సూ లేదు. మనస్సు తెలియచెప్పవలసిన పనీ లేదు."

మాట అనేసేక గాని గుర్తు రాలేదు. తన విషయం సుశీలకు ఎంత తెలుసో ఏమోగాని తాను బయట పడిపోయింది. అభిమానపడి గమ్మున

లేచింది. సుశీల మళ్ళీ చేయి పట్టుకుంది.

"వదులు."

"కూర్చో. నీతో మాట చెప్పాలి."

"ఏమీ చెప్పనక్కర్లేదు. అతణ్ణిచూస్తే ఒక్కొక్కమాటు పీక పిసికెయ్యాలనిపిస్తుంది. నీకేం తెలుసు. వట్టి దొంగవేషం. ఏమీ

ఎరగనట్లుంటాడు. మోసగాడు. వట్టిమోసం."--అంటూ భాగ్యలక్ష్మి ఏడ్చేసింది.

ఆమె ఆవేశం, ఆ వేగం చూసి సుశీల జాలిపడింది. వీపు నిమురుతూ తొందరపడవద్దని సముదాయించింది.

"నీ అభిప్రాయం ఆయనెరుగునా?"

ఆ సానుభూతికి భాగ్యలక్ష్మి పెంకెతనం, పెడసరితనం అన్నీ ఎగిరి పోయేయి. తాను అతి నిగూఢంగా దాచుకుంటున్న అంతరాంతరాల

ఆశల్ని బయటపెట్టేస్తున్నానన్న ఆలోచనకూడా ‘లేకుండా’ తెలుసునన్నట్లు తల తిప్పింది.

ఆమె కిష్టం వుంది. ఆయన కామె మీద మనస్సు లేదు – అనే అభిప్రాయానికి వచ్చి చిన్నప్పుడు హైస్కూలులో తెలుగు మేష్టారు

చదువుతూండిన శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకొంది. "యాం చింతయామి సతతం మయి సావిరక్తా, సాప్యన్యమిచ్ఛతి...." ఇల్లాంటి ఘట్టాలు

నిత్య జీవితంలో ఎదురవుతూండేవే. వానికి సమాధానం ఏం ఉంది? లేదు గనకనే భాగ్యలక్ష్మి ధూర్తపధ్ధతిలో ఎదుర్కొంటూంది. దాని

వలన అనుకొన్న ఫలితాలు రావు సరికదా, వ్యతిరేక ఫలితాలనిస్తూందని నాలుగు రోజుల నాటి రామారావు మాటలు చూపుతున్నాయి.

"చదువుంది. రూపం వుంది. పరిచయంవుంది. అన్నింటికీ మించి ఆయనే కావాలంటున్నావు. ఈ స్థితి ఎందుకొచ్చింది?"

గతం తలుచుకొని భాగ్యలక్ష్మి ఏడ్చేసింది. ఎన్నాళ్ళ నుంచో అణచిపెట్టుకొన్న ఆవేదన ఒక్కమారు కట్టలు తెంచుకుంది.

"అతనికి బోలెడు మంది. కాని, నాకాతడొక్కడే. అతడే కావాలనే కోరికను నేనెప్పుడూ అణచుకోలేకపోయేను. అలాగ విస్పష్టంగా

చెప్పనూ లేకపోయేను. ఆ రోజుల్లో అక్కా అతనూ కలిసివుండేవారు. ఇంట్లోవున్నా కాలేజీకెళ్ళినా జంట విడేవారు కారు. అది చూస్తే

వాళ్ళిద్దరి గొంతులూ పిసికెయ్యాలనిపించేది. అది మరొకర్ని పెళ్లి చేసుకొంటూందన్నప్పుడు అతని మొహం చూడాలి. వెంటనే దాని తల

పగల కొట్టాలనిపించింది."

"ఓ యింట్లో వుండడం, కలిసి కాలేజీ కెళ్ళడం, రావడం, స్నేహంగా వుండడం – వీటికి నువ్వెంత విపరీత వ్యాఖ్యానం చేస్తున్నావో

తెలుసా?"

జాలి పడుతున్నట్లు భాగ్యలక్ష్మి ఆమె వంక చూసింది.

"ఇష్టంగా వుండడం వేరు. పెళ్లి చేసుకోడం వేరు."

"ఉహూ." అని సాగదీసుకొంది, భాగ్యలక్ష్మి.

"ఆయన మీద ఆ మమకారమే వుంటే పెళ్లి చేసుకోడానికి దానికి అడ్డేముంది?"

"మా అమ్మ, పెద్దమ్మ, నాయనమ్మ అంతా ససేమిరా అన్నారు."

"అయితే మాత్రం?"

"ఐ. పి. యస్. వాడిని చూసే సరికి అదీ ఐసయిపోయింది."

సుశీల నమ్మలేదు.

"ఆయన్ని ప్రేమించి పెళ్ళిచేసుకొందని విన్నాను."

"ఎవ్వడూ లేనప్పుడు రామారావు పనికొచ్చేడు. అల్లాగని మరెవ్వరినీ ప్రేమించ కూడదేమిటి?"--అంది భాగ్యలక్ష్మి కసిగా.

సుశీల వెంటనే ఏమీ అనలేదు.

"నువ్వే మీ అక్క స్థితిలో వుంటే ఏం చేసే దానివి?"

"అంటే"

"మరొకరిని పెళ్ళాడనంటావా?"

భాగ్యలక్ష్మి ఆలోచనలో పడింది.

"నేనతని మీద ఆశ వదులుకోలేకుండా వున్నాను. పెళ్ళి అయిపోయివుంటే ఏమి చేసే దానివంటావేమో. ఒక్కొక్కప్పుడు భయంకరమైన

ఆలోచనలు కలుగుతుంటాయి."

"అందరూ ఒక్కలా వుండరు నిజమే. కాని మగవాడు తనకు చనువైన ఆడుదాన్ని అంత సులభంగా మరిచి పోలేడు. కాని, ఆడది అల్లా

కాదు. ఒక్క గంటలో గతాన్ని పక్కకు నెట్టెయ్యగలదు. ఎప్పుడేనా ఈ విషయం ఆలోచించేవా?"

"చూసేను కాదా!"

"మరి నువ్వు కావాలనుకొన్న మగవాణ్ణి నీవేపు తెచ్చుకోడానికి నువ్వు అనుసరిస్తున్న ఈ పద్ధతేమిటి?"

భాగ్యలక్ష్మి చుర్రుమనేలా చూసింది.

"అతని పక్కలో చేరమనా?"

సుశీల తల తిప్పింది.

"నీకు అభ్యంతరం ఏపాటిదుందో నాకు తెలియదు. అయితే నా వుద్దేశ్యం అది కాదు."

"నా నియమాలు నాకున్నాయి."

"అవసరమే. కాని, నా ప్రశ్న నియమం, నిగ్రహం గురించి కాదు. ఆయనతో నువ్వు వ్యవహిరిస్తున్న తీరు గురించి నే

చెప్తున్నా. చీటికీ, మాటికీ ఆయనని సూటి పోటీ మాటలంటున్నావు, కజ్జా పెట్టుకుంటున్నావు, మొన్నటికి మొన్న నీళ్ళు పట్టుకెళ్ళి

ఇచ్చి వచ్చేవు. ఏమన్నావో తెలియదు. కాని, ఆయన చాల బాధ పడ్డట్లనిపించింది. ఏదో ఆని వుంటావు. అదేం పధ్ధతి?"

భాగ్యలక్ష్మి ఒక్క నిముషం వూరుకొంది.

"కోపం తెచ్చుకోకు. అతడు ఎవరితోనన్నా మాట్లాడితే, ఎవరినన్నా ముట్టుకొంటే...."

సుశీలకు అర్థం అయింది. ఆశ్చర్యంతో కళ్ళింతలు చేసుకు చూసింది. భాగ్యలక్ష్మి అపరాధం చేసినట్లు తల వంచుకుంది.

"నా మెదడులో శూలాలు గుచ్చినంత బాధ. అతడొక్కడి విషయంలోనే నన్ను నేను నిభాయించుకోలేను."

సుశీల ఆమె తల మీద చెయ్యి వేసి జాలిగా నిమిరింది.

"పిచ్చిదానా!"

"ఇటువంటి బాధ నా కొక్కర్తికేనా. అందరికీ వుంటుందా? జీవితం మీద విరక్తి కలుగుతుంటుంది. నేనెందుకీ వుద్యోగం చేస్తున్నానో

తెలుసా? ముఖ్యంగా అతని మాటకోసం. అమ్మ పెద్దమ్మ తిట్టేరు. నాన్న వద్దన్నారు. పోయి ఎం.ఎస్‌సి.,

చదువుకోమన్నారు. నేనే ఒప్పుకోలేదు. అతనికి దగ్గరగా వుండడం కోసం. అతను ఆడది వుద్యోగం చేసుకోవాలంటాడు. ఆ మాట కోసం.

అతనది గుర్తించాలని నా ఆశ. కాని ఎదురు వెక్కిరించేడు. కాని నేను మానలేదు. మానను. కోపం మాత్రం వచ్చింది. గయ్

మంటున్నాను."

"గయ్ మంటావు సరే. కాని దాని ఫలితం ఎల్లావుంటుందో ఎప్పుడేనా ఆలోచించేవా? గయ్ మనే ఆడదాన్ని చూస్తే మగాడికి తన మగతనం

గుర్తుండదు."

ఆ మాట అర్థం ఏమిటాయని భాగ్యలక్ష్మి సుశీల ముఖంలోకి గుచ్చి చూసింది.

"ఆడదాని దగ్గరకు వచ్చేసరికి మగవాడు చాల ఇన్ఫీరియారిటీ ఫీలవుతాడు. ఒక్కమాట, ఒక్కచూపు, ఒక ఆదరంతో ఆడది

మగవాణ్ని కుంగదియ్యగలదు. కుంగి పోయినవాణ్ని ఉద్ధరించనూగలదు. దూరం తరిమెయ్యగలదు."

"నేనల్లా చేసేనంటావు."

"అది నువ్వాలోచించుకో. ఏది ముందో, ఏది వెనకో తెలియదు. చెఖోవ్ కథ 'కిస్' చదివేవా? దాంట్లో రియా బోవిష్ పాత్ర

గుర్తుందా? రావి శాస్త్రిగారి అల్ప జీవిలో సుబ్బయ్య? ఆడది మగవాడిలో ఎటువంటి ఉత్తేజం కలిగించ గలదో అవి

చెప్తాయి...."

ఈ సాహిత్య చర్చ తన కెల్లా నప్పుతుందో ఆలోచిస్తూంది భాగ్యలక్ష్మి.

"నీ జెలసీకి అర్థం వుందా?"

"లేదంటావు...."

"వుందా? ఎప్పుడన్నా ఆయన...."

భాగ్యలక్ష్మి చర్రుమంది.

"ముట్టుకుంటే చంపేస్తాను."

సుశీల నవ్వింది.

"మరి పేచీయే లేదు. నీ ఏడుపెందుకు?"

"అర్థం లేనిదే....కానీ...."

మాట పూర్తిచేయకుండానే భాగ్యలక్ష్మి లేచింది.

ఇరవైయారో ప్రకరణం

కాస్త పెద్దదిగా వున్న వూళ్ళో నల్లా తెలుగు దేశం అంతటా తల ఎత్తిన కమిటీ కాలేజీలూ, హైస్కూళ్ళలో ఎక్కడన్నా కాస్త

జాగా దొరక్కపోతుందాయని బయలుదేరిన రామారావు వారం నాటికి నరసాపురం రేవులో తేలేడు. మొట్టమొదటి రేవు నావలో గోదావరి డెల్టాలో

అడుగు పెట్టాలని తెల్లవారగట్ల నాలుగున్నరకే రేవులోకి వచ్చేడు. రాత్రి పడుకున్న చోట దోమలు. ఉక్క. వానిని మించి

ఆలోచనలు. రాత్రి తెల్లవారూ నిద్రే లేదు. అలసటగా వుంది. కాని బయలు దేరేడు.

రేవులో ఒక పక్కగా వున్న పాకలో మసి బారిన లాంతరు ముందు కూర్చుని రేవు చీట్లు అమ్ముతున్నారు. రేవు దగ్గర లైట్లు లేవు.

చీకటి పాకవేపుగా నాలుగడుగులు వేసే సరికి పెద్ద కంకరబండ కొట్టుకొని తూలిపోయేడు. కాలిన జోడు ఉండడంచేత కాలివేళ్ళకు

తగలలేదు. తూలి చేతిలోని సూట్ కేసు మీద ఆనుకోవడంచేత మొగం పగలలేదు. రాతికి కొట్టుకొని మోకాలి మేడక కొట్టుకుపోయింది.

ప్ర్రాణం జిలార్చుకుపోయింది.

కంకర రాళ్ళు రేవులో పరిచేరు. ఏటి గట్టు రివిట్ చేసేరు. మిగిలిపోయిన రాళ్ళన్నీ గట్టుమీద చెల్లా చెదురుగా పడేసి

వున్నాయి. పట్టణంలో రోడ్ల మీది లైట్ల వెలుతురులోంచి వచ్చిన కళ్ళకి అక్కడి చీకటి మరింత దట్టం. ఏమీ కనబడదు.

ప్రయాణీకులెవ్వరో తూలిపడిన చప్పుడు విని పాక దగ్గరలో వున్న రేవు పడవ కళాసీ జాగ్రత్త చెప్పేడు.

"జాగ్రత్త బాబూ! రాళ్ళు."

దెబ్బ తగిలిం తర్వాత చేసిన ఆ హెచ్చరికకి రామారావు ఒళ్ళు రగిలి పోయింది. మోకాలు పట్టుకొని ఆ రాయిమీదనే కూర్చుండిపోయాడు.

"ఓ లైటు ఇక్కడ తగలేస్తే మా కాళ్ళు విరగవు. మీ దరిద్రం పెరగదు."

పడవ ఆసామీ ఆ మాటకు కోపం తెచ్చుకోలేదు.

"మీ దొక్క రోజు పని. మాది రోజూ, రోజంతా పని. లైటుంటే మాకూ బాగే బాబూ!"

అదీ నిజమే. దెబ్బ తగిలిన బాధలో ఎవరినో తిట్టెయ్యాలనిపించింది. పొరుగూరు. పళ్ళు కొరుక్కుని వూరుకున్నాడు.

"బాగా తగిలిందేటండి." అంటూ కళాసీ దగ్గరకు వస్తూ పరామర్శించేడు.

"కాలు విరగలేదు...." అంటూ రామారావు రాయిని పట్టుకొని లేచేడు.

"పెట్టె ఇల్లా ఇవ్వండి. పడవలో పెడతా. నెమ్మదిగా వెళ్ళి టిక్కెట్టు తెచ్చుకోండి. దారిలో దుంగలున్నాయి."

"రక్షించేవు." అన్నాడు వెక్కిరింతగా "ఇల్లా ఎందరికి చెప్తావు. ఆ రాళ్ళూ, దుంగలూ తీసేస్తే మాకూ, నీకూ కూడ క్షేమమే

కదా."

అతడేం సమాధానం ఇవ్వలేదు.

రామారావు కుంటుకుంటూ వెళ్ళి టిక్కట్టు తీసుకున్నాడు. తీసుకుంటూ తన మనస్సులోని అక్కసు వెళ్ళగక్కేడు.

"ఇంత డబ్బు వసూలు చేస్తున్నారు. రేవులో రెండు లైట్లు ఎందుకు వెయ్యరు?"

గుమాస్తా ఏదో గొణిగేడు. మాట తెలియలేదు. మోకాలు సలుపుతూంటే రామారావు చుర్రుమన్నాడు.

"గొణుగుతావేం. మాట సరిగ్గా చెప్పు."

గుమాస్తా ఇల్లాంటి వాళ్ళ నెందర్నో చూసేడు. ఎందరో అతడినదే ప్రశ్న వేసేవుంటారు. అనేక మందికి చెప్పగా చెప్పగా అతనికి

రాజాలాంటి సమాధానం ఒకటి దొరికింది. దానికి ఎక్కడా తిరుగులేదు.

"ఇంట్లో పెళ్ళాన్ననుకున్నావా, కోప్పడుతున్నావు. నన్నడుగుతావేం. పోయి కంట్రాక్టరు నడుగు."

అంత బాధలోనూ రామారావుకు నవ్వొచ్చింది.

"నీలాంటి పెళ్ళాం ఇంట్లో వుంటే జీవితంలో ఆడదాని వాంఛే కాదు. అసలు జీవితం మీదనే వాంఛ పోతుంది. ఆ కంట్రాక్టరుకూ అదే అనిపించి

వుంటుంది. నిన్నిక్కడికి తోలేడు."

తిరుగులేదనుకున్న తనమాటకి సమాధానం వచ్చేసరికి గుమాస్తా తెల్లబోయేడు.

"ప్రతివాడికీ గుమాస్తాగాడే లోకువ."

తన అసలు ప్రశ్నకు సమాధానం రానేలేదు. వస్తే మాత్రం తానేం చెయ్యగలడు? ఏమీలేదని రామారావుకు తెలుసు. కంట్రాక్టరు

ఒక్కడేనా? ఈ రేవు పాట ఈవేళే కొత్తగా ప్రారంభం కాలేదు. పట్టణంలోకి కర్రెంటు వచ్చికూడా చాలాయేళ్ళయింది. కంట్రాక్టర్లు

మారేరు. గవర్నమెంట్లూ మారేయి. మునిసిపాలిటీ ఎన్నో పాతకూసాలు విడిచింది. ప్రతి ఒక్కరికీ రేవు పాట సంగతే పట్టింది.

ప్రయాణీకుల సమస్య ఎవరికీ పట్టలేదు. కనీసం రేవులో లైట్లు కూడా లేవు. ఆ మాట ఎవరికీ తోచలేదనలేరు. చాల మంది

గుర్తుచేసి వుంటారు. కాని దాని ఖర్చు ఎవరు భరించాలో తేలి వుండదు. మునిసిపాల్టీయా? కంట్రాక్టరా? పబ్లిక్‌వర్క్స్

డిపార్ట్‌మెంటా?

పాక వద్ద గుమాస్తా కంఠం విన్నాక గట్టుకింద రేవులోంచి కళాసీ కంఠం వినిపించింది.

"పడవ తోసేస్తున్నాం, రాండి, బాబూ."

తన ప్రశ్నకు సమాధానం రాబట్టే ప్రయత్నం చెయ్యకుండానే రామారావు కుంటుకుంటూ రేవులోకి నడిచేడు. పాకలో గుమాస్తా సాధింపు

వినిపిస్తోంది.

"ఈ మగాడొచ్చాడిన్నాళ్ళకి. కంట్రాక్టరేడిట కంట్రాక్టరు."

పడవలో కూర్చున్నాక కళాసీ చెప్పిన మాటల్ని పట్టి ఒకటి అర్థం అయింది. రేవు కేవు వసూలు చేసే హక్కు ఎవరిదో తెలుస్తూనే

వుంది. కాని లైట్లు వేయవలసిన బాధ్యత యింకా ఎవరిదో తేలలేదు.

"మీరడిగింది పాకలో గుమాస్తా గారిని. ఆ గుడ్డి దీపం ముందు కూర్చుని చీట్లుకోయడం ఆయనకి మాత్రం సరదా యేటండి."

కాలికి తగిలిన దెబ్బ చిమచిమ లాడుతూంటే మనస్సు సమాధాన పడలేకుండా వుంది. ప్రజలలో వున్న పిరికితనం,

సివిక్‌సెన్సు లేకపోవడం చూసుకొని అడ్డమైన గాడిద కొడుకులూ జనాన్నీ, దేశాన్నీ పీల్చేస్తున్నారన్నాడు.

"మనకంటే కోడీ, మేకా నయం. గొంతు కోస్తూంటే అరుస్తాయి. పారిపోవడానికి గిజాయించుకుంటాయి. మనం అదీ చెయ్యం." అన్నాడు.

"అసలు రేవు పాడినోడు రేవు సాయలకి రాగా నేనెన్నడూ సూడలేదండి. వచ్చేదల్లా ఆరు పంపే గుమాస్తా. ఆయనకి తోడుగా

రౌడీసుగాళ్ళని ఏర్పాటు చేస్తారు. మీ అదురుట్టం బాగుంది. ఆ నంజకొడుకక్కడ నేడు. నేకుంటే పెద్ద గొడవయిపోయేది."

ఇరవైయేడో ప్రకరణం

పడవ దిగి బస్సు వద్దకు నడుస్తూంటే చటుక్కున గుర్తు వచ్చింది. రేపే బలరామ్ పెళ్ళి. ఇక్కడే సెంట్రల్ డెల్టాలో వూరు.

పేరు జ్ఞాపకం వుంది. ముంగండ. కమ్యూనిస్టు సాహిత్యం ద్వారా పరిచితమైన వూరు. కాని, పెళ్ళివారి పేరు గుర్తు లేదు. శుభలేఖ

చూసినప్పుడు వెళ్ళ గలుగుతానని గట్టిగా అనుకోలేదు. ఉద్యోగాన్వేషణలో ఏమూల వుండేదీ నిశ్చయం లేదు. ఆ రోజుకి గ్రీటింగ్స్

పంపి వూరుకుందామనుకున్నాడు.

కాని, ఈవేళ ఆ వూరికి దగ్గరలోకి వచ్చామనుకున్నప్పుడు తాను జయప్రదతో మాట్లాడడం అవసరమనుకొన్నది కూడా గుర్తు

వచ్చింది. వూళ్ళంబడి వెంటబడి చెప్పడం మర్యాదా అనిపించక పోలేదు. కాని, ఈపాటికి సత్యనారాయణ హనుమంతరావు గారితో మాట్లాడి

వుంటాడు. గతంలో హనుమంతరావే అటువంటి ఆలోచన తెచ్చి వుండడం చేత ఇప్పుడాయన అంగీకరించక పోవడం వుండదని రామారావు

అభిప్రాయం.

కాని, అసలు విషయం ఆమె ఆస్తి మీదనే తానీ మేడలన్నీ కట్టాలి. ఆ మాట ఆమెకు తానే చెప్పాలి. తండ్రి చెప్పి

ఒప్పించడానికి ముందు అందులోవున్న అసలు మెలిక చెప్పేసి, ఆమె అన్నీ యెరిగి ఒప్పుకోవడమో, ఒప్పుకోక పోవడమో

తేల్చుకొనేలాచెయ్యాలి. కనక ముంగండలో ఆగాలనే నిర్ణయానికి వచ్చేసేడు.

కండక్టరునడిగేడు.

"ముంగండ ఎక్కడ?"

"మన బస్సు ఆ వూరు మీదుగానే వెడుతుంది. మీరెక్కడికి వెళ్ళాలి."

"ఆ వూరే వెళ్ళాలి."

"ఎక్కండి."

అంతలో అనుమానం. పెళ్ళివారిపేరూ, ఇంటిపేరూ తెలియకుండా ఎవరింటికని వెళ్ళడం. వూరు చిన్నదైతే ఫర్వాలేదు.

"ఊరు పెద్దదేనా?"

"నూరిళ్ళుంటాయి."

అయితే ఫర్వాలేదు. పట్టుకోవచ్చు. ఒకవేళ పట్టుకోలేకపోతే పలాయన మార్గం వుంటుందా? మళ్ళీ ప్రశ్న.

"దీని తరువాత ఆ వూరు మీదుగా వెళ్ళే బస్సు ఎన్నిగంటలకి?"

కండక్టరు చిరాకు పడ్డాడు.

"నాకు తెలియదు."

తోడి ప్రయాణీకుడొకడు చెప్పేడు.

"ఆవూరు మీదుగా అమలాపురం పోయే బస్సులు గంటకీ అరగంటకీ చాలానే వున్నాయి."

"ఇహనేం. ఇల్లు దొరక్కపోతే, కలుసుకోవలసిన మనిషి రాకపోతే తరవాతి బస్సు ఎక్కేద్దాం." అనుకున్నాడు.

కొబ్బరి తోటల మధ్యనుంచి, పంట కాలవలు దాటుకుంటూ బస్సు పోతూంది. తోటల మధ్యనే యిళ్ళు. ఇళ్ళ గుమ్మాలలో కాలవలు.

కాలవలమీద కొబ్బరి బొందలు రెండూ మూడూ చేర్చివేసిన వంతెనలు. ఏటిగట్టు దారిపొడుగునా దృశ్యాలు మనో రంజకంగా వున్నాయి. రోడ్డు

ప్రక్కనే చెట్లకింద పచ్చగా ముగ్గిన అరటి గెలలూ ఇన్ని సోడాలూ పెట్టుకొని చిన్నచిన్న పందిరి దుకాణాలూ, టీ కొట్లూ.

వంటచేలు, చెరుకు తోటలు, మళ్ళీ కొబ్బరి తోటలు--ఇంత పుష్కలంగా పండుతున్న దేశంలో దరిద్రం, తిండిలేక మాడడం. బీదరికం,

చదువు సంధ్యలు లేకపోవడం. చదువుకొని, పదిమందికి చెప్పడానికి తయారయిన తాను చదువు చెప్పించుకొనే వాళ్ళని వెతుక్కుంటూ రోడ్లు

పట్టి తిరగవలసి రావడం.

కాలవ అంచునే ప్రయాణం చేస్తూ బస్సు చెట్ల నీడ పొదలలో మిలమిల లాడుతున్న చిన్న చిన్న పల్లెలు దాటింది. వంతెనలు,

లాకులు, సీమచింత తోపులు దాటింది. ఎదురుగా గోదావరి. దానిమీద అక్విడక్టు కట్టి నీరు పారిస్తున్నారు. అక్విడక్టు మీద

కాలవ పక్కనే విశాలమైన మోటారు రోడ్డు. కాలవలో పడవలు, రోడ్డుమీద కార్లు. రిక్షాలు, మనుష్యులు. ఆ ఉదయకాలపు

నులివెచ్చని సూర్యకిరణాల బంగారు పూతలో ప్రకృతి బహు రమ్యంగా వుంది.

"ఈ వూరు నేమంటారు?"

"ఈ గోదావరి పాయమీద కట్టిన అక్విడక్టుకి ఆ కొసన, ఈ కొసన వున్న వూళ్ళని గన్నవరమే అంటారు. ఈ దిగువ వూరికి

డొక్కా శీతమ్మగారి ద్వారా జిల్లాలుదాటి పేరుంది."

ఆమె దాతృత్వం కథలు విన్న రామారావు ఆమె వుండిన యిల్లేనా కనిపిస్తుందేమో నన్నట్లు తల బయటకుపెట్టి చూడసాగేడు.

"తల బయటకు పెట్టకండి."--అని హెచ్చరించి కండక్టరు 'రైట్' అన్నాడు.

బస్సు మళ్ళీ కదిలింది.

ఇరవైయెనిమిదో ప్రకరణం

బస్సు ముంగండ వద్ద ఆగింది. రోడ్డు పొడుగునా దుకాణాలు. పాకలూ, పందిళ్ళలో నైతేనేం కాఫీ దుకాణాలు. పళ్ళకొట్లు, సైకిలు

షాపులు, రెండో మూడో బట్టలకొట్లు, మందుల షాపులు. చిల్లర కొట్లు--ఆ సందడి చూసి రామారావు సందేహిస్తున్నాడు. ఇది చిన్న

వూరేమిటని అతని అనుమానం.

"ఇదే ముంగండ. దిగుతామన్నారు?"

తోడివాని హెచ్చరిక వినగానే రామారావు సూట్‌కేసు అందుకొని దిగేసేడు.

బస్సు నిష్క్రమించేక ఒక్క నిమషం నిలబడి ఇంకేమిటి చెయ్యడం అన్నట్లు ఆలోచించేడు. ఎదురుగా హోటలులోని రేడియోలోంచి ఎవరో

గాయకుడు తేలు కుట్టినట్లు అరుపుల సంగీతం వినిపిస్తున్నాడు. ఆ బాధ వినగలమా అని సందేహిస్తూనే, సాహసంచేసి పాకలో

ప్రవేశించేడు.

సెర్వరు కాఫీ తెచ్చేలోపున పక్కనున్న ఆసామితో పరిచయం చేసుకున్నాడు. కప్పు క్రిందపెట్టే వేళకి కావలసిన సమాచారం

సంపాదించేడు.--ఆ రోజున ఆ వూళ్ళో మూడు నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి.

"మగ పెళ్ళి వారు కృష్ణాజిల్లానుంచి వస్తున్నారు"

"పట్టాభిరామయ్యగారింటి కన్నమాట"

"వారిల్లు...."

"చూపిస్తారా" అని రామారావు అడగలేక పోయేడు. ఆయన కూడ పని మానుకువచ్చి చూపించడానికి సిద్ధంగాలేడు.

"చూడండి. ఈ పక్కనే ఉన్న వీధి. దీనిని రాజవీధి అంటారు. తిన్నగా వెళ్ళండి. కొంత దూరం వెళ్ళేక కుడియెడమలకి అడ్డవీధి

కనబడుతుంది. ఎడమ చేతికి తిరిగి కొద్ది దూరం నడుస్తే పెద్ద చెరువు. పావంచాల రేవు. దానికివతలే దగ్గర్లో పెళ్ళిపందిరి,

హడావిడి తెలుస్తూనే ఉంటుంది"

ముంగండ చెరువు మాట వినిపించేక రామారావు తన పని మరిచిపోయేడు.

"హరిజనులని నీళ్ళు ముట్టుకో నివ్వరంటారు, ఆ చెరువులోనేనా?"

ఆ ప్రశ్న ఆయనకి కొత్తగా గాని, అవమానంగాగాని తోచలేదు. నిజానికి కంఠంలో గర్వం ఛాయగా వినిపించింది కూడాను.

"ఆ."

"ఇప్పటికీ."

"ఒకప్పుడు మా వూరు చదువులకి ప్రసిద్ధి. ప్రస్తుతం వానితో పాటు మా భుజకీర్తులలో రెండోది ఇప్పుడు మీరు చెప్పిందేనండి."

అన్నారు వేరెవరో.

మొదటి ఆయనకు కోపం వచ్చింది.

"మీ కమ్యూనిస్టులు వచ్చేక మడీ, ఆచారం, పెద్దవాళ్ళంటే మర్యాదా అన్నీ తగలపెట్టేరుగా. చూడు. మాదిగ రత్తిగాడి కొడుకు

సైకిలు మీద ఎంత దర్జాగా పోతున్నాడో వూళ్ళోకి."

తానక్కడి ఆచారాలు, అలవాట్ల మంచిచెడ్డల చర్చకు రాలేదని రామారావుకి గుర్తొచ్చింది. మెల్లిగా మాట తప్పించడానికి

ప్రయత్నించేడు.

"పెళ్ళికూతురు తండ్రిగారి పేరు ఏమిటన్నారు?"

"పట్టాభిరామయ్య గారు."

అంతలో రోడ్డు మీద సైకిలు వేసుకు వెడుతున్న ఒకరిని చప్పట్లు కొట్టి పిలిచేడు.

"ఆయన పెళ్ళికూతురు పింతండ్రి."

ఇద్దరూ రోడ్డు మీదికి వచ్చేరు.

"శీతారాముడూ. పెళ్ళిపనుల హడావిడిలో వున్నట్లున్నావు. చూడు, వీరు మీ ఇంటికే వస్తున్నారు."

శీతారామయ్య ఎంతో వినయంగా నమస్కరించి, చాల ఆప్యాయంగా ఆహ్వానించేడు.

"ఇప్పుడే బస్సులో దిగేరా. దయచేయండి. ఇంటికి వెడదాం."

సూట్ కేస్ సైకిల్ కేరియరు మీద పెట్టించి. క్లిప్పు బిగించేడు.

"పడదులెండి. ఇల్లాంటి చిల్లర సామానులు ఇంటికి చేరెయ్యడానికే ఈ గార్ధభ రాజం."

రామారావు నవ్వేడు. పక్క పక్కనే నడుస్తున్నారిద్దరూ.

"మగపెళ్ళివారు వచ్చేరాండి."

"సాయంకాలానికి వస్తారు. ఉదయ ఘడియల్లో కదా పెళ్ళి."

మగపెళ్ళివారు రానిదే వారి తరఫు మనిషిగా తాను అప్పుడే పెళ్ళికి రావడం అసందర్భంగా కనిపించింది. కాని, అంతలో తాను వచ్చింది

ఆడపెళ్ళివారింటి మనిషి కోసం అనుకొని సర్దుకున్నాడు. అయినా సందేహం. జయప్రదను వెతుక్కుంటూ వచ్చేనంటే ఏమనుకుంటారో. తనకు

ఆహ్వానం పెళ్ళికొడుకు నుంచి గాని పెళ్ళికూతురు వారికి తన పేరు కూడా తెలియదు. నిలబడ్డాడు.

"నాకు అమలాపురంలో పనుంది. అది పూర్తిచేసుకొని పెళ్ళివారు వచ్చే వేళకి వచ్చేస్తా."

సీతారామయ్య ఒప్పుకోలేదు.

"రాండి. స్నానం, భోజనం చేసి వెడుదురుగాని. ప్రతి గంటకీ ఏదో బస్సు ఉంటుంది. లేకుంటే ఏ రిక్షాయో చేసుకు వెళ్ళొచ్చు."

తప్పనిసరిగా రామారావు నడుస్తున్నాడు. అనేక ప్రశ్నలూ, కథోపకథనాలూ మధ్య అసలు ప్రశ్న జార్చేడు.

"జయప్రద మీ పినతల్లి కూతురనుకుంటాను. వచ్చిందనుకుంటాను."

"ఔను. ఆమెనేం ఎరుగుదురు?"

"మా చెల్లెలికి క్లాస్ మేటు. స్నేహితురాలు. మా యింటికి తరుచు వస్తుంటుంది. బాగా ఎరుగుదును."

"అయితే మరింకేం. మీకు సందేహం ఏమిటి?"

పెళ్ళి ఇల్లు చేరగానే సీతారామయ్య అరుగుమీద కుర్చీ వేసి రామారావును కూర్చుండబెట్టేడు.

"జయప్రదను ఒక్కమారు...."

"పిలుస్తా. ఏ పనిలో వుందో. పెళ్ళి యిల్లు కద."

"అందుకే నేనిక్కడ ఉండడం మీకు అదనపు పని, రెండోది అమలాపురంలో నా పనీ నిలిచిపోతుంది. జయప్రదతో చెప్పేసి వెడితే నే

వేళకి రాగలిగినా, రాలేకపోయినా ఆమె నా హాజరు చెప్పేస్తుంది."

"మళ్ళీ అదేమిటి? వుండండి. ఆమె ఏం చేస్తుందో చూసి, చెప్పి వస్తా."

"ప్లీజ్."

శీతారామయ్య లోపలికి వెళ్ళేసరికి తన అక్క రమణమ్మతో జయప్రద మాట్లాడుతూంది. ఇద్దరూ నవ్వుకుంటున్నారు.

"జయా! బెజవాడలో రామారావుగారట. ఎవరే?"

"అదేమిటోయ్! ఆ మహా పట్టణంలో ఆ పేరు గలవారు కనీసం వెయ్యిమందికి తక్కువుండరు. అందులో నేనే పదిమంది వరకూ ఎరిగి

ఉంటా. ఏం. వారింటిపేరు."

"తెలియదు."

"ఫో. డి. ఎల్. ఓ. (డెడ్ లెటర్ ఆఫీసు)కి రవాణా చెయ్యి. "

"నిన్ను ఎరుగుదురుట. వచ్చేరు. నీతో చెప్పమన్నారు."

"ఎందుకుట? అంది జయప్రద అనుమానిస్తూ.--"రావే, అక్కా చూద్దాం."

"ఆయన బస్సు దిగి మన ఇల్లు వాకబు చేస్తూంటే తీసుకోచ్చేను. నీ పేరు చెప్పేరు. ఓ మారు పిలవమన్నారు."

"ఆయన వొస్తారా?"

"చూడరాదా పోయి." అంది రమణమ్మ

"మనిషి ఎల్లా ఉంటారు?"

"పాతికేళ్లుంటాయి. పొడగరి. కాలు కుంటుతున్నారు."

స్త్రీలు ఇద్దరూ ముందు సావిట్లోకి వచ్చి కిటికీలోంచి చూసేరు.

జయప్రద ఆశ్చర్యపడింది. "ఆయనే" అంటూ గబగబ గుమ్మం వేపు నడిచింది. "మా మేస్టా"రంది శీతారామయ్య కోసం.

"ఎంతసేపయింది వచ్చి? ఎక్కడినుంచి వస్తున్నారు? రామారావుగారంటే ఎవరా అనిపించింది. మీరిక్కడికి...."

రామారావు కుర్చీలోంచి లేచేడు.

"నేనూ అనుకోలేదు. మొన్న, నిన్న నర్సాపురంలో వున్నా. ఈవేళ అమలాపురం వెడుతూంటే జ్ఞాపకం వచ్చింది. బలరామ్ పెళ్ళి

ముంగండలో ఈ వేళనే కదా అని. కాని బయలుదేరేటప్పుడు అనుకోలేదేమో శుభలేఖ చూసుకోలేదు; కాని ముంగండ పేరు గుర్తుంది. దారిలో

వుంది వచ్చాం. సంతోషిస్తాడు. కనిపించి పోదామని దిగా. తీరా చేస్తే ఎవరింటికెళ్ళాలో తెలియదు. అప్పుడు నీ పేరు

గుర్తువచ్చింది."

అనాహుతంగా. హఠాత్తుగా, ఇక్కడ కొచ్చేడేమిటనుకొంటుందేమోనన్నట్లు రామారావు మాటలు దొర్లించేస్తున్నాడు.

రమణమ్మ తమ్మునితో వాళ్ళ బాంధవ్యం చెప్పింది.

"జయ మగడు"

"అక్కా! వీరే రామారావుగారు. ఇందాకా నా క్లాస్ మేట్ అన్నానే ఆమె అన్నగారు. మా మేస్టారు." అని జయప్రద పరిచయం

చేసింది.

క్షణంలో ఇంట్లోకి ఉప్పందింది. అతిథి మాత్రుడుగా వచ్చినవాడు ఇంటల్లుడంతవాడు. ఆయనను కూర్చోబెట్టిన కుర్చీ సావిట్లోకి

మారింది. ఒక్కొక్కరే వచ్చి పలకరిస్తున్నారు. ఇద్దర్నీ పక్క పక్కన చూసి ఈడూజోడూ కుదిరిందని మెచ్చుకున్నారు. పెళ్ళి

అడ్డు తీరకపోయినా భార్య కాగల పడుచుకోసం అతడు వెతుక్కుంటూ రావడం, ఇద్దరూ అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకుంటూండడం

కొత్తగా వున్నా, అందరికీ ముచ్చటగా వుంది.

పెళ్ళికూతురు తండ్రి చిన్న అబద్ధం ఆడేసి రామారావు అనాహుతంగా వచ్చేనేయని చిన్నపుచ్చుకోనక్కర్లేకుండా ప్రయత్నించేడు.

"మీకు శుభలేఖ పోస్టు చేసేను. అందే వుంటుంది."

అగ్నిగుండం · 第 5 / 7 段