కదా. తండ్రి యిచ్చేదాంట్లో రెండెకరాలు అమ్మితే కనీసం యిరవై వేలు వస్తాయి. మొగుడూ, పెళ్ళాం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి
చేసుకోడమే కాదు. డాక్టరేట్ చేయాలనుకొన్నా కొంత దూరం ఈడుస్తుంది."
కూతురు ఆలోచన బాగానే వున్నదనిపించింది.
"కాని, ఒప్పుకుంటాడా?"
"మీరు నచ్చచెప్పడంలో వుంటుంది. అభిమానం వుండడం మంచిదే. కాని, అది మూర్ఖత్వం కాకూడదు."
సత్యనారాయణ సాలోచనగా తలవూపేడు.
పదిహేనో ప్రకరణం
అలారం గణగణలాడుతూంటే రామారావు వులికిపడి లేచేడు. నాలుగయింది. అనేక ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న మనస్సుకి విశ్రాంతి
లేదు. నిద్ర పోయినట్లే అనిపించడం లేదు. కాని తప్పదు. పాల సప్లయిదార్లు హోటలు వాళ్ళని లొంగదీయడం కోసం ఊళ్ళోవాళ్ళ
మీద సమ్మె ప్రారంభించేరు. రోజూ నారాయణ తన ఇంటికి పంపే పాలతో తనకూ పంపుతున్నాడు. నిన్నటి నుంచి వాళ్ళ యింటికే పాలు
లేవు. వారితో పాటే తనకూ లేవు. ఇంక తనతో పాటు వాళ్ళ కోసం కూడా గవర్నమెంటు పాలబూత్‌కు పోవాలి. ఆ క్యూలో
గంటో, అరగంటో నిలబడవలసిందే. తప్పదు. లేచేడు.
తీరా పాలబూత్‌కు వెళ్ళేసరికి అక్కడ విచిత్రమైన దృశ్యం కనబడి తెల్లబోయేడు. బూత్ ముందు మూడు నాలుగు గజాల దూరం
వరకూ ఓటి డబ్బాలూ, సీసాలూ, చిన్న పెద్ద రాళ్ళూ వరసగా పేర్చివున్నాయి. పెద్దవాళ్ళంతా ఒక చోట చేరి కబుర్లు
చెప్పుకొంటున్నారు. కుర్రవాళ్ళు గుంపులు గుంపులుగా చేరి గొడవ చేస్తున్నారు. "ఇవన్నీ ఏమిటి?"
అవన్నీ క్యూలో నిలబడవలసిన వాళ్ళ ప్రతినిధి స్వరూపాలని చెప్పి డాక్టరు చలపతిరావు పక్కున నవ్వేడు.
"రాత్రి పదిగంటల వేళ కనకయ్యగారు వచ్చి, ఒక స్టీలు పాత్ర పెట్టి పొద్దిటి క్యూలో తన స్థానం నిరుకు
చేసుకున్నాననుకున్నారు. కాని, తెల్లవారగట్ల వచ్చి చూసుకొనేసరికి గిన్నె లేదు. దానితో ఆయన స్థానమూ పోయింది. అప్పటినుంచీ
వచ్చిన వాళ్ళంతా తమ కోసం, తమ మిత్రుల కోసం ఆ విధంగా స్థానాలు నిరుకు చేసుకుంటున్నారు."
రామారావు నవ్వేడు. అయితే ఆ సమస్య అంత సులభం కాదు. ఆ సీసా ఎవరిది? ఈ రాయి ఎవరిది? తనదేనని ఒకడంటే
కాదనడానికి సాక్ష్యం ఏమిటి?
ఇదో కొత్త బెడద. డాక్టరుకూ, అక్కడే ఉన్న మరో పదిమందికి ఏమీ తోచలేదు. ఆ రాళ్ళన్నీ పాత్రలయి ముందుకు నడుస్తే
చివరనుండే తమకు పాలు రావు.
"అరలీటరు కన్న ఎక్కువ ఎవరికీ పొయ్యరనేసరికి ప్రతి మనిషీ నాలుగైదు గిన్నెలతో వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళకి
పట్టుకెళ్ళాలన్నారు. ఎవరికి కావలిస్తే వారే వస్తారనీ, రావాలనీ ఆ సహకారబుద్ధిని భగ్నం చేశాం. మళ్ళీ ఇప్పుడిదో
బెడద." అన్నాడు డాక్టరు.
"సరిపడేంత సరుకు వచ్చేవరకూ ఈ బెడదలు తప్పవు." అన్నాడు రామారావు.
"అయ్యా! వూళ్ళల్లో పాలు లేకనా? ఎవరికి వాళ్ళే మింగుడుగాళ్ళుగా తయారయ్యారు. లంచాల కోసం పాలు కలెక్టు చేసేవాళ్ళు మీటరుకి
రావడం లేదని రైతుల్ని ఏడిపిస్తూంటే వాళ్ళు పాలు పొయ్యడం మానేసేరు. లేకపోతే ఈ దరిద్రం ఏమిటండి?" అన్నాడు, కనకయ్య.
పాల కలక్షన్ కేంద్రాలలో జరుగుతున్న అన్యాయాల గురించి ఎంతోసేపు సాక్ష్యంమీద సాక్ష్యం విన్నా, ఇక్కడ వోటి సీసాల,
డబ్బాల యజమానుల్ని గుర్తించడం ఎల్లాగో ఎవరికీ తేలలేదు.
"ఇంకా పాలు రాలేదు కదా. అప్పుడే తేలుతుంది, చూద్దాం." అన్నాడు, డాక్టరు.
మరో పదినిమిషాల్లోనే తేలిపోయింది.
దూరంలో లారీ హెడ్‌లైట్లూ, మోతా వినిపించినట్లయింది. అంతవరకూ ఆడుకుంటున్న కుర్రాళ్ళంతా బర్రున వచ్చేసేరు.
డబ్బాలూ, సీసాలూ గుర్తించడంలో పేచీ వచ్చింది. ఆ తోపులాటలో అన్నీ చెదిరిపోయాయి. కొన్ని వందలున్నాయనిపించిన రాళ్ళ స్థానంలో
పదిహేను ఇరవయిమంది వున్నారు. వాళ్లంతా ఒకరినొకరు అత్తుకొని నిలబడ్డారు. తోసుకుంటున్నారు.
"ఒరేయి కుర్రాళ్ళు. మీ గిన్నెలు ఎక్కడికీ పోవుగాని, అక్కడుంచి దూరంగా నిల్చోండి. వరసగా వెళ్ళి తెచ్చుకుందురుగాని."
రామారావూ, మరో యిద్దరు ముగ్గురూ కలిగించుకుని, చెప్పి, బలవంతపెట్టి గిన్నెలు కింద పెట్టించడం మహాకష్టం అయింది. గిన్నెలు
క్రింద పెట్టేరుగాని వాని పక్కన కాపలాగా తాము నిలబడవలసిందేనన్నారు. తమ గిన్నె స్థానం మారుతే?
కాని, గిన్నెకు సరిపడిన చోటు మనిషికి చాలదు. తోసుకుంటారు. ఆ గలాభాలో గిన్నెలు తన్నేసుకుంటారు. మళ్ళీ వానిని యథాస్థానంలో
వుంచాలి. కాని, దేని తరవాత ఏది?
ఇప్పుడదే జరిగింది.
"ఇది నా చోటు" అంటున్నాడు ఒకడు.
"వీడు నా తరవాత వచ్చేడు" అంటాడు రెండోవాడు.
తన్నుకుంటున్న ఇద్దర్నీ చెరోచేత్తో పట్టుకొని రామారావు గుంపులోంచి వారిని బయటకు తెచ్చేడు.
"మీ గిన్నెలు ఏమీ అవవు. కూర్చోండి. బుద్ధిగా."
కాని, వాళ్ళని పట్టుకోవడం అంత సులభం కాలేదు. గిజాయించుకొంటూంటే కోప్పడ్డాడు.
"మీరు గొడవ మానకపోతే మీ గిన్నెలు చివర పెట్టేస్తాం." అని బెదిరించేడు, డాక్టరు.
"ఎందుకు పెడతావేం?"
ఆ ఏకవచన ప్రయోగానికి డాక్టరు కంగు తిన్నాడు.
"రెండుచ్చుకోండి, మహా ఎగురుతున్నాడు"--అని రంగాచారి టీచరు సలహా యిచ్చేడు.
ఆ గొడవా, గంద్రగోళం, గిజాయించుకోడం, ఎదిరించడం చూస్తూంటే రామారావుకు చిరచిరలాడుతూంది. ఒక్కటుచ్చుకోవాలనిపించింది. కాని,
నిగ్రహించుకున్నాడు. శిక్షణ మంచిదా, చెడ్డదా అన్న సందేహం కాదు. అది తేలేదీ, చచ్చేదీ కాదు. పెద్దవాళ్ళు వచ్చిపడతారు.
కోతిపుండు బ్రహ్మరాక్షసి అవుతుంది. అదీ భయం. అందుకు నిగ్రహం.
అయితే ఇక వానిని పట్టుకోలేదు. వదిలేసేడు. వానితో రెండోవానినీ వదిలేసేడు.
"తేల్చుకోండిరా, బాబూ! తేల్చుకోండి. మీ బాబులు ఇంట్లో ఏమన్నా మిగుల్చుకున్నారేమో హాస్పిటళ్ళకీ, డాక్టర్లకీ పోద్దురుగాని"
"మీ బాబు ముల్లె దాచిపెట్టేవు--" అంటూ ఆ కుర్రాడు ఎదుర్కొనే సరికి అంతా తెల్లబోయేరు.
"ఈ కాలం కుర్రాళ్ళని కదిలించి లాభం లేదు"--అన్నాడు, కనకారావు.
"ఎవరి బుల్లోడేం?" అని ఆడాళ్ళలో చర్చ.
వ్యవహారం ముదురుతున్నదని గ్రహించి మిగతా కుర్రవాళ్ళు గప్‌చిప్‌గా సర్దుకొన్నారు.
తన ఎదుర్కోలుతో అంతా సద్దుమణిగినట్లుండడం ఆ కుర్రవానికి ధైర్యం ఇచ్చింది.
"నా గిన్నె ఇక్కడ కాదు. నా సీసా ఇంకా చాలా ముందు పెట్టుకున్నాను"
--అంటూ ముందుకు బయలుదేరేడు.
డాక్టరు చలపతిరావు మండిపడుతున్నాడు. ఒక్క కేక పెట్టాడు. "ఆ"--
ఆ కేకకు కుర్రవాడు నిలబడిపోయేడు.
"వెళ్ళు చూస్తా. నువ్వూ, నీ గిన్నే కూడ ఈ చుట్టుపక్కలుండరు."
కుర్రవాడు ఆ కంఠస్వరం విని హడలిపోయేడు. దిక్కులు చూసేడు. అంతక్రితం అందరూ నిశ్శబ్దంగా తన వీరత్వాన్ని
మెచ్చుకున్నారనుకొన్నాడు. వాళ్ళు ఇప్పుడూ నిశ్శబ్దంగానే వున్నారు. ఒకరి ముఖంలోనూ మెచ్చుకోలు కనబడలేదు. అభిమానం వేసింది.
నిలబడ్డపాటున ఏడ్చేసేడు.
రామారావు వాని భుజంమీద చెయ్యివేసి సముదాయించబోయేడు.
"ఏడుపెందుకు? నీ గిన్నె ఎవరూ తియ్యరులే. కూర్చో."
ఆ ఓదార్పు విరుద్ధ ఫలితం ఇచ్చింది. వాడాతని చేయి విదిలించేసేడు.
"నా గిన్నె తీసేస్తారు. నా కొడుకులు." అంటూ ఏడుస్తూనే పదడుగులు వేసేడు. అవసరమైనంత దూరంలో వున్నట్లు తోచేక బూతులు
తిడుతూ పరుగు ప్రారంభించేడు.
నలుగురూ నిర్ఘాంతపోయేరు. చెయ్యగలదేమీ లేక ఫక్కున నవ్వేరు.
ఆ నవ్వులు ఆగక పూర్వమే ఆ కుర్రవాని తల్లీ తండ్రీ రంకెలూ, బొబ్బలూ పెడుతూ రంగం మీదికి వచ్చేరు.
"మా వాడి గిన్నె తీసి పారేసిన నా కొడుకు ఎవరు?"
"ఆళ్ళకి పిల్లల్లేరా? మావోణ్ణి కొట్టేడంట! ఆడింట పీనుగెళ్ళ!"
ఈ జంట కవిత్వం చెవిని బడగానే వ్యవహారం ముదిరిందని అంతా గ్రహించేరు. రామారావు ఎదురెళ్ళి "తొందరపడకండ"ని ఆ జంటని
సముదాయించ బోయేడు.
"ఎవరయ్యా నువ్వూ. తొందరపడ్డామా? కుర్రాడినల్లా కొట్టేస్తే?"
ఆ మనిషి గుర్రం మీద లేడని, మన లోకంలోనే వున్నాడని గ్రహించేక సమస్య కష్టం అనిపించలేదు.
"మీ కుర్రాడు ఏం చెప్పేడేం?"
తన సుపుత్రుడు చెప్పింది ఆద్యంతం అబద్ధమని తేలేక అతడు తెల్లబోయేడు.
"ఏరా?"--అని కొడుకును నిలేసేడు.
"మీరు కుర్రాడి మాట పట్టుకొని దెబ్బలాటకొచ్చేరు. కనుక్కోవలసిందే. కనుక్కుని మరీ హడావిడి చేస్తే బాగుండేది. అలా
చెయ్యలేదు. మీ అలుసు చూసుకొనే మీవాడు అబద్ధాలు చెప్పగలిగేడు. ఇక్కడ మిగతా కుర్రాళ్ళతో పేచీ పడింది మీవాడు. విడతీస్తే
నానా కూతలూ కూసిందీ మీ సుపుత్రుడు. అయినా తనని ఎవరో కొట్టేసేరని అమ్మనీ నాన్ననీ సాయం తెచ్చుకున్నాడు. మీరెప్పుడూ
అతనికా సాయం ఇస్తూనే వున్నారన్న మాట. అందుకే అంత ధైర్యం"--అని రామారావు తండ్రిని నిలేసేడు.
మిగిలినవాళ్ళు ఆడ, మగ కూడ తలోవేపునుంచీ అదే మాటలంటూంటే ఆ పెద్ద మనిషి బిక్కచచ్చిపోయేడు. సిగ్గనిపించింది. ఆ సిగ్గును
కమ్ముకొనేందుకు కొడుకు మీద పడిపోయేడు.
ఇప్పుడింకో సమస్య. ఆ కోపంతో కుర్రవాడిని చంపెయ్యకుండా నలుగురూ ఆపవలసి వచ్చింది. తండ్రి చేతుల్లోంచి కాపాడడానికి
కుర్రవానిని తల్లి దగ్గరకు తీసుకుంది.
"పాలు దొరక్క ఇక్కడికి పంపుతే ఈ గొడవలు...."
అక్కడున్న వాళ్ళదే తప్పంటున్నట్లు అనిపించి రంగాచారి వప్పచెప్పేడు.
"మీ పెంపకం సరిగ్గా వుంటే చిల్లర గొడవలు సర్దుకోవచ్చమ్మా!"
"మేం వచ్చిందీ పాలకే."
"మీవాడు చేసిందీ, తిట్టిందీ చాలనట్లు మీరూ, మీ ఆయనా మీ చిట్టినాయనకు సాయం వచ్చేరు"--నలుగురూ నాలుగు వేపులనుంచి అంటూంటే,
ఆమె తెల్లబోయింది.
"మేము దెబ్బలాటకు రాలేదండోయ్" అంటూ కుర్రవానినీడ్చుకుంటూ భర్త వెనకే వెళ్ళింది.
పదహారో ప్రకరణం
ఈ గంద్రగోళానికంతకూ మొదట వినిపించిన లారీ పాల లారీ కాదు. ఇసకో, ఇటికలో పట్టుకొని అది తన దారిన పోయింది. జనం
మళ్ళీ సర్దుకున్నారు.
ఈ గలభాతో రామారావుకి చిరాకనిపించింది. పొద్దుటే లేచి, తిట్లాటలూ, కొట్లాటలూనా? ఆ మాటకి వస్తే ఒక్క పొద్దుటే నేమిటి?
రోజంతా తగువులు పెట్టుకోవలసే వస్తూంది. లేకుంటే విస్తట్లోకి అన్నం రాదు.
"ప్రతి చిన్న వస్తువు కోసం తగువులాటే. అడిగిన ఖరీదు యిచ్చి ఎదుటివాళ్ళతోనో, పక్కవాళ్ళతోనో కయ్యమాడితే తప్ప
పావులీటరు పాలు రావు. రాళ్ళు కలపని బియ్యం దొరకవు. ఛెస్. వెధవ బతుకు."
డాక్టరు చలపతిరావు అంగీకరించేడు.
"ఆనక వెళ్ళి పంచదార కార్డు కోసం రూపాయో, రెండో ముడుపు చెల్లించుకొని, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి."
అక్కడ చేరిన వారెవరికీ ఇంకా ఆ గొడవ అందినట్లులేదు. నాలుగు దిక్కులనుంచి ప్రశ్నలు--పంచదార కార్డేమిటి? మార్పించుకోవడం
ఏమిటి?
డాక్టరు గంభీరంగా నలుగురి ముఖాలు చూసి ప్రారంభించేడు.
"ఏముందీ. నిన్న సాయంకాలం పేషంట్లనెవరినో చూడ్డానికి బయలుదేరబోతూంటే మా గృహదేవత సడెన్‌గా "పంచదారండోయ్" అంది.
సరే, తప్పుతుందా? తిరిగి వచ్చేటప్పుడు మార్కెటు దగ్గర ఆగి మా షావుకారుని అడిగా. కోటా వచ్చిందట. కాని, ఇవ్వవద్దని
అధికారుల నుంచి తాఖీదు. ఇప్పుడున్న కార్డులన్నీ రద్దు చేశారట. కొత్తవి తెచ్చుకోవాలి--అన్నాడు. అదేమిటయ్యా అంటే అది
అంతే నన్నాడు. పత్రికల్లో వెయ్యలేదే అన్నా. తొందరేమిటండి--బాబూ! వేస్తే కాస్త ఊపిరేనా తీసుకోకుండా తెల్లవారేసరికే వచ్చి
కూర్చుంటారనుకొని వుంటారు. వేస్తారు ఎప్పటికో--అన్నాడు. ఇంతకీ అర్థాంతరంగా ఈ మార్పెందుకు కావలసి వచ్చిందో తెలుసా?"--అని
నలుగురి ముఖాలూ పరీక్షగా చూసేడు.
"కార్డుకో రూపాయో రెండో వడుక్కోవాలి అనిపించి వుంటుంది."--అన్నాడు రంగాచారి టీచరు.
"అది లోపాయికారీ మాట. పైకి అల్లా చెప్పగలరా? రిక్షా లాగే వాళ్ళూ, అంట్లు తోముకు బతికేవాళ్ళూ సంపాదించుకొన్న పావుకిలో,
అరకిలో కార్డులు అమ్ముకుంటున్నారుట. అసలు తినేవాళ్ళకి చాలడం లేదట. మనం నష్టపడుతున్నామనీ, మన కోసమే ఈ బాధ
అంతా...." అన్నాడు, డాక్టరు.
"బద్మాష్‌లు, రిక్షా వాడు టీ తాగడు! వాడికేం అక్కర్లేదు!"
"వేగన్లకు వేగన్లు బ్లాక్‌మార్కెటు చేస్తూంటే అడిగే నాధుడు లేడు. పావుకిలో పంచదార పనిచేసుకు బతికే మనిషి
అమ్ముకున్నదని నిఘా."
"ఈదో సందులో మిల్లుల వాళ్ళూ, కోటాల వాళ్ళూ, తలా పిడికెడూ పంచుకొంటారు."
ఆ ఊహలకు అంతులేదు. చర్చలకు అంతులేదు. ఎప్పటిలాగే ఇప్పుడూ పాపం ప్రజల సమస్యలు పట్టించుకోడంలేదని రాజకీయ పార్టీల
మీదకు తిరిగింది.
"ఇది వరలో యిటువంటి పనులకి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు పూనుకునేవారు."--అన్నాడు డాక్టరు.
అర్ధోక్తిలోనే అదేం లాభం లేదన్నాడు, రంగాచారి.
"వాళ్ళలో ఎవరు తప్పు చేస్తున్నారో తమ పార్టీ ఏ పనీ చెయ్యకుండా చేతులు ముడుచుక్కూర్చోవలసి వస్తూందో తేల్చుకోవడానికే
వాళ్ళకి ఎంత టైమూ చాలడంలేదు. ఈ సంగతేదో చూడండర్రా బాబూ అంటే వాళ్ళ పేచీలకు మూలం ఎక్కడుందో మనం వినవలసి
వస్తూంది...."
"మీరు చెప్పింది చూశారూ....డాక్టరుగారూ! అది బతికున్న రోజులనాటి మాట. జీవత్సు తాతపాదేషు...." అని నిట్టూర్పు
విడిచేడు రంగాచారి.
అందులో అసత్యం ఎంతో లేదనిపిస్తున్నా తన అభిమాన పార్టీ తిట్లు తినడం రామారావుకు ఒప్పిదం కాలేదు.
"మనం కూడా కదిలితే తప్ప పార్టీలు ఎన్ని పనులకి కదులుతాయి? మనం చేసుకోవలసినవి ఎవరి భుజానికో ఎత్తి వాళ్ళు
చెయ్యలేకపోయారనడం అందరం నేర్చుకున్నాం." అన్నాడు.
పదిహేడో ప్రకరణం
పెద్దవాళ్ళ సమస్యలకి ఏమాత్రం తగ్గవు పిల్లకారు సమస్యలు. వాళ్ళకేసి ఓ చెవి పడేసి వింటున్న రామారావు సంజ్ఞ చేయడంతో
పెద్దవాళ్ళు తమ సంభాషణ నిలిపేరు.
అందరూ ఒక్కమారు ఊరుకోడం చూసి, "ఏమిటది?"--అన్నాడు కనకయ్య.
పక్కనే డ్రైనేజీ గొట్టాలమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న పిల్లవాళ్ళవేపు తల ఎగరేసి, రామారావు మాట్లాడవద్దని సంజ్ఞ
చేసేడు.
"ఇంకేం లాభం లేదురా. ఈవేళ టి. సి. ల మీద సంతకం పెట్టితే గానీ మేం కదలం, మిమ్మల్ని కదలనియ్యం అని
కూర్చోవలసిందే...." అంటున్నాడు ఓ కుర్రాడు.
"టి. సి. లు కావలసిన వాళ్ళం వున్నదల్లా ముగ్గురం."
"పెట్టనంటే ముగ్గురం ఏం చేస్తాం?"
"నిన్న క్లాసులో వాళ్ళతో చెప్తే వాళ్ళంతా వొస్తామన్నా"రన్నాడు మొదటి కుర్రాడు.
పత్రికలూ, ప్రభుత్వాలూ, నాయకులూ గగ్గోలుపెట్టి బుడి బుడి దీర్ఘాలు తీస్తున్న "ఘెరావో" బెజవాడలో ప్రత్యక్షం కాబోతూంది.
ఏ కార్మికులదో, వుద్యోగులదో ఆలోచన కాదది. పది పన్నెండేళ్ళ పిల్లలు! పిలక పట్టుకోడానికి సిధ్ధమైతే తప్ప తెమలని
సమస్యలే వాళ్ళవీ.
"ఏం వొచ్చిందిరా గురునాథం!" అని అడిగేడు కనకయ్య.
"వీళ్ళ నాన్నగారు ఎలక్ట్రిక్ డిపార్టుమెంటులో పని చేస్తున్నారండి. ఈ మధ్యనే రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యారు." అంటూ
గురునాధం ఒక కుర్రవాడిని పరిచయం చేశాడు.
"ఔనండి, వారం నుంచి టి. సి. కోసం అడుగుతున్నా యివ్వడం లేదండి. మళ్ళీ రాజమండ్రిలో సీటు లేకుండా పోతుందని కూడా
చెప్పుకున్నానండి."
"ఏమంటారు?"
"కొత్త హెడ్మాస్టరు వచ్చి ఇస్తారంటారండి."
"తానేమయ్యాడు?"
"ఈయన్ని కృష్ణలంక కేశారట. ఇంకా వెళ్ళలేదు. కొత్తాయన రేపే వచ్చినా ఆయన మాత్రం ఇస్తారా? అన్నీ సర్దుకోవాలని
ఆయన వాయిదా వేస్తారండి."
"ఎల్లాగ? ఔను. అంతా ఒక బడిలో చదువుకున్నవాళ్ళేగా."
ఏం చెయ్యాలో ఎవరూ చెప్పలేకపోయారు. రంగాచారి సూచన చేసేడు.
"మీ నాన్నగారే వెడితే పని జరుగుతుందిరా."
"ఆయన డ్యూటీలో జాయినయిపోయారండి. వూళ్ళోలేరు."
"ఇంత చిన్న పనికి, పనిమాలా ఆయన రాజమండ్రి నుంచి రావాలా!" అని రంగాచారి ఉక్రోశం ప్రకటించేడు.
తాను చేయవలసిన చిన్న పనిని ఎగకొట్టి ఒక సమస్యను సృష్టిస్తున్న హెడ్మాస్టరును నలుగురూ బూతులతో ఆశీర్వదించేరు.
"కుర్రవాళ్ళలో అవిధేయత ప్రబలిపోయిందని ఆ గావుఏడ్పులేడ్చేది ముందు వీళ్ళే." అన్నాడు డాక్టరు.
"ఏడ్చేరు." అనేసేడు, రామారావు బహు నిర్లక్ష్యంగా. ఆ కుర్రవాళ్ళని చూస్తే అతనికి ఎంతో ఆనందమనిపించింది.
"మనకంటె కుర్రాళ్ళు తెలివిగా వున్నామనిపిస్తున్నారు. వాళ్ళకి ఈ ఘెరావో ఆలోచన ఎవరు చెప్పేరు? జీవితం! అవసరం! ఘెరావో
అంటే ఇదేనని కూడా వాళ్ళెరగరు. వాళ్ళామాటే విని వుండరు. కాని, నీతీ నిజాయితీ లేనివాళ్ళని దారిలో పెట్టేందుకు...."
మాటల సందడిలో దగ్గరకు వచ్చేవరకూ పాల లారీని ఎవ్వరూ గమనించనే లేదు. దాని హోరులో రామారావు మాటలు వినిపించలేదు. అంతా
గొల్లున లేచేరు.
"డాక్టరుగారూ! లేవండి. క్యూ చెదిరిపోకుండా కాస్త చూద్దాం." అని రామారావు ముందుకొచ్చాడు.
"తప్పుతుందా? మళ్ళీ ఎవరో అమ్మ వచ్చి ఆశీర్వదించేదాకా...." అంటూ డాక్టరు లేచేడు.
క్యూలో మొదటి స్థానం మిగుల్చుకొన్న కనకయ్య ముందుకెళ్ళాడు.
పాలకాన్ లు లోపలికెళ్ళి పదినిమషాలయినా పంపిణీ ప్రారంభం కాలేదు. బడ్డీలో మాటలు వినిపిస్తున్నాయి. ఆడవాళ్ళూ, చిన్నవాళ్ళూ
కిటికీకేసి ఎగబడుతున్నారు.
విషయం తెలుసుకునేందుకు బూత్ లో కెళ్ళిన కనకయ్య తిరిగి రాలేదు.
దాక్టరు వెళ్ళి వచ్చేడు.
"పాల కాన్లలో పాలు తక్కువ వున్నాయి. కనీసం పది లీటర్లేనా తగ్గినట్లున్నాయి. ముదరా నే నెక్కడిచ్చుకోనని
ఏడుస్తున్నాడు."
"వాడివ్వడం ఎందుకు?"
"ఇంకెవరిస్తారు? కాన్ లు ఒప్పచెప్పినట్లు సంతకం చేయించుకొని పోయుంటారు." అని రంగాచారి వూహ మీద వివరించేడు.
"ఎల్లా తగ్గుతాయి?" అని మళ్ళీ రామారావు అమాయిక ప్రశ్న.
"ఎల్లా తగ్గడం ఏమిటి స్వామీ! దార్లో ఆఫీసర్ల ఇళ్ళకి తలో రెండూ, మూడూ లీటర్లు పట్టి ఇచ్చేసుండవచ్చు. లేకపోతే
డ్రైవరూ, లారీతో వచ్చే గుమాస్తా చెరో నాలుగు లీటర్లూ వొంచేసుకోవచ్చు. మన భారతదేశంలో ఎల్లా జరిగిందన్న ప్రశ్నకి అర్ధం
లేదు." అంటూ డాక్టరు కనుబొమలు ముడేసేడు.
కనకయ్య వచ్చేడు.
"కాన్‌లు యిచ్చినట్లు వాళ్ళు సంతకం చేయించుకు పోయారు. కనక వాళ్ళకింకేం బాధ్యత లేదు. అడంగుని ఎన్ని పాలు
కాన్‌లో నింపేరో రికార్డు వుంటుంది. పాలు తగ్గినట్లు సాక్ష్యం ఏమిటి? నువ్వే అమ్ముకుని డబ్బులు జేబులో
వేసుకున్నా"వంటారు.
అంతా దిగాలుపడి కూర్చున్నారు. యింకా పాలపంపకం ప్రారంభమే కాలేదు. ఇళ్ళవద్ద బోలెడు పనులు.
"కొంచెం కొంచెం తగ్గించి పొయ్యమంటే"--అన్నది రంగాచారి సూచన.
"ఖరీదు మామూలుగా తీసుకొనా?"--అని ఒకరు అభ్యంతరం చెప్పేరు.
"అర లీటరు, పావు లీటరులో ఇంకా కొరవా?" అన్నది వేరొకరి అభ్యంతరం.
రామారావు ఒక సూచన చేసేడు.
"కాన్‌లలో పాలు కొలుద్దాం. ఎన్ని వున్నాయో లెక్క వ్రాసి అందరం సంతకాలు పెట్టి ఇద్దాం."
"విచారణ తతంగానికి పనులు మానుకుని పరుగులెత్తుతుండాలి." అన్నాడు డాక్టరు. కాని అంతకు మించి ఆ క్షణంలో చెయ్యగలది
లేదు.
నలుగురూ ఆ మాట చెప్పి దిలాసా ఇవ్వడానికి బూత్ వేపు కదిలేరు.
పద్ధెనమిదో ప్రకరణం
మధ్యాహ్నం సత్యనారాయణ, రామారావు గదికి వెళ్ళేడు. కూతురు చెప్పిన ఆలోచన ఆయన మనస్సుని దొలుస్తూంది. కాని గదికి తాళం
వుంది.
"రామం వూళ్ళో వున్నాడా అమ్మా!" అంటూ సుశీలను పలకరించేడు.
"రాండి, బాబయ్యగారూ!" అంటూ సుశీల మంచం మీదనే లేచి కూర్చుని అహ్వానించింది.
"ఆయన ఇప్పుడే వీధిలోకి వెళ్ళేరనుకుంటా. ఇంతవరకూ రామలింగేశ్వరరావుగారనుకొంటా....ఆయన కొలీగు--ఇద్దరూ కబుర్లు
చెప్పుకుంటూ ఇక్కడే వున్నారు."
"ఆహా." అంటూ సత్యనారాయణ సావట్లో అడుగు పెట్టేడు.
"నీ కాలుకి దెబ్బ తగిలిందంది సుపర్ణ. ఎల్లా వుంది?"
"కూర్చోండి బాబూ! పెద్ద ప్రమాదం తప్పిపోయింది." అంటూ మహాలక్ష్మమ్మ లోగుమ్మంలోంచి సమాధానం ఇచ్చింది.
"ఎదో ఆ ఏడుకొండలవాడి దయ. తల్లీ, పిల్లవాడూ పెద్ద దెబ్బలేం తగలకుండా బయటపడ్డారు."
"అంతే లెండి. కాకపోతే మనదేముంది?" సత్యనారాయణ అమోదించేడు.
"దేవుడు తప్ప మనకీ దేశంలో రక్షణ లేదనే నిర్ణయానికి మీరూ వచ్చేరేమిటి బాబయ్యగారూ!" అంటూ సుశీల నవ్వింది.
సత్యనారాయణ తెల్లబోయేడు.
"తప్పు, తప్పు." అంటూ మహాలక్ష్మమ్మ కూతురు అవిశ్వాసానికి తాను లెంపలు వేసుకుంది.
"కూర్చోండి, బాబయ్యగారూ. ఈవేళ భాగ్యలక్ష్మి రాలేదు. ఏం చేస్తూంది."
"నేనూ చూడలేదమ్మా! వాళ్ళ ప్రిన్సిపాల్‌ను కలుసుకోవాలంది. వెళ్ళిందేమో."
సుశీల మాట మారుస్తూ రామారావు వుద్యోగం పోయిన వార్త చెప్పింది.
"ఉన్న చిన్నపాటి వుద్యోగం కాస్తా పోయింది. చాల యిదైపోతున్నారు."
"కాదు మరీ. చదువు తప్ప మరో ఆధారం లేదు. దానికిదీ గతి."
అసలు చదవడమే దండగమారిపని అన్నట్లు అనిపించింది.
"మరీ అన్యాయంగా వుంది మన వాళ్ళ ప్రభుత్వం. చదువుకొన్నవాళ్ళు దేశానికి పెద్ద ఆస్తి. దేశంలో ప్రతి ఒక్కళ్ళకీ చదువు
వుంటే బాగుంటుందనుకొంటూ రెండోవేపున వున్నవాళ్ళని వుపయోగించుకోలేకపోవడం...."
"గవర్నమెంటు మాత్రం ఏం చేస్తుంది?"
""యావత్తైలం తావద్వ్యాఖ్యానం" చేతిలో వున్న డబ్బును ఖర్చు చేస్తుంది. దానికో పరిమితి వుంది కదా, చేసినంతవరకు ఎక్కువ
లాభకరంగా వుండేలాగ చూసి చేస్తుంది."
సుశీల అతని వాదాన్ని ఒప్పుకోలేదు.
"ఉన్న డబ్బు అంటారు. డబ్బు వచ్చే వనరులన్నీ ఎవరెవరి చేతులకో వప్ప చెప్పెయ్యడం. అదిచాలదన్నట్లు జనం దాచుకున్న
డబ్బు కాస్తా వాళ్ళని దోచేస్తున్న వాళ్ళకు వొప్పచెప్తున్నారు. ఇంకా మిగిలితే మనువర్తులు పంచిపెడుతున్నారు."
"అంటే--బాంకులు స్వాధీనం చేసుకోవాలి. వర్తక వ్యాపారాలు చేత పట్టుకోవాలి. మహారాజులకిచ్చే భరణాలు ఆపెయ్యాలి." అంటూ
అతివాద పార్టీలు దేశ ప్రభుత్వం చేయాలంటున్న పనులను ఎకసక్కెం చేస్తూ సత్యనారాయణ నవ్వేడు.
"ఔను. ఏం చెయ్యకుండా మీ కంట్రాక్టర్లకి బిల్లులు ఎల్లా చెల్లుతాయనుకొన్నారు? ఈ ప్రాజెక్టులు పూర్తవడం ఎల్లాగ?
ఇంజనీర్లనీ, పనివాళ్ళనీ తగ్గిస్తారు. అవి పూర్తి కావడానికి మరో నాలుగేళ్ళు పడుతుంది. వాటి ఖర్చు ఈవేళ పూర్తయితే
అయేదాని కన్న రెట్టింపు తేలుతుంది. మీరు ఏం పొదుపు చేసినట్లు?"
సత్యనారాయణ కాంగ్రెసువాది. కంట్రాక్టరు. నాగార్జునసాగరు కాలవల తవ్వకాలతో ఆయనకు కంట్రాక్టు వుంది. రమారమీ మూడు
నాలుగు లక్షల రూపాయల బిల్లులు రావలసివున్నాయనీ, మనిషి ఆర్థిక ఇబ్బందులలో వున్నాడనీ నిన్ననే సుపర్ణ చెప్పింది.
తన ప్రయోజనం నెరవేరాలన్నా ప్రభుత్వం తను సమర్థించబోయిన పధ్ధతికి భిన్నంగానే వ్యవహరించడం అవసరం. అది అర్థం
అయినా సత్యనారాయణ ఒప్పుకోలేకపోయేడు.
"వ్యవధి కావాలమ్మా! ఓర్పుండాలి. దేశం ఒక్కరోజులో సర్వసంపన్నం కాగలదంటావా? ఇదేం గారడీయా. కళ్ళముందు సాయిబాబాలా
బూడిదరాసులు కుమ్మరించడానికి?"
"కాదు. తెలుసు. వ్యవధి కావాలి. సరే. ఎంత? ఓర్పుండాలి. ఎందుకు? మీరు ఏం చెయ్యదలుచుకున్నారు?"
"ఇందిరాగాంధీ చెప్తూంది, అంతక్రితం నెహ్రూ చెప్పేడు. సోషలిజం మా లక్ష్యమని. అందుకే ఈ పని అనీ...."
"ఏది వుద్యోగాలు ఊడపీకడమా? ఇదిగో, బాబయ్యగారూ! గాడిదను చూపించి గుర్రం అనుకోమంటే అమాయకులూ, అజ్ఞానులూ కొంతకాలమేనా
నమ్ముతారు. కాని ఆ గాడిద మీద కూర్చుని జెట్ విమానంలో ప్రయాణం చేస్తున్నామనుకోమంటే ఎల్లాగ? మీ ఇరవయ్యేళ్ళ సోషలిజం
సాధన తర్వాత రామారావుగారి వంటి వాళ్ళని వీధిలో పారేస్తుంటే...అది."
"ఏం చెప్తావమ్మా!" అని సత్యనారాయణ నవ్వేసేడు.
"మీరే చెప్పండి. మీరు చెప్పే వోర్పుకి హద్దేమిటి?"
"నిజమే అనుకో."
"ఆయన వంటి స్థితిలోనే వున్న విద్యావంతులు నేటికి దేశంలో కొన్ని లక్షలున్నారు."
"నువ్వెన్ని చెప్పు. కాని ఒక్కటి మరవవద్దు. మన దేశ జనాభా ఎంత? అందులో ఈ నిరుద్యోగుల సంఖ్య ఏపాటిదంటావు."
ఆ లెక్క పధ్ధతికి సుశీల చిరునవ్వు నవ్వింది. వెంటనే సత్యనారాయణ సర్దుకున్నాడు.
"ఒక ఖండమంత దేశం. పెద్ద ఎత్తున జరుగుతున్న పునర్నిర్మాణం. పెద్దవో, చిన్నవో వెనకబాట్లు రాకుండా వుంటాయా? ఆ
తాత్కాలిక నష్టం, కష్టం చూపించి ఏమీ జరగలేదనడం...."
సుశీల తన తప్పును గ్రహించింది. దేశ సమస్యల్ని వ్యక్తి పరిమితం చెయ్యబోతే వచ్చే ప్రమాదం అది. కాని ఆ వోటమిని ఆమె
అంగీకరించలేదు. కొన్ని లక్షలమంది బతుకులయెడ కనబరచిన నిర్లక్ష్యాన్ని మాత్రమే గణనకు తీసుకొంది.
"సోషలిజం సర్వత్రా ఏర్పడే అవకాశం వున్నప్పుడు, అందుకోసం ప్రపంచ జనాభాలో సగం మంది చచ్చిపోయినా మా బాగే నన్నాడట
మావో. మీరయితే కొద్ది లక్షలమంది నిరుద్యోగం మాత్రంతో తృప్తి పడుతున్నారు. పెద్ద చూపూ, చిన్న చూపూ తప్ప తేడా
ఏమీలేదు."
మావోతో తనను పోలిక పెట్టడం గర్వకారణమనుకోవాలో, అపఖ్యాతి అనుకోవాలో సుశీల స్వరం పట్టి అర్ధం కాలేదు. నవ్వేసేడు.
సుశీల తన ధోరణిలోనే మరో అడుగు ముందుకు వేసింది.
"చచ్చిపోవలసిన జనాభా సగం మందిలో తానూ ఒకడు కావచ్చునని మావో అనుకొని వుంటాడా?"
"ఎవరు మాత్రం అనుకొంటారు? నేనూ, పిల్లలూ బాగుంటే మొగుడు లోకంతోపాటూ--అనే సామెత ఊరకే పుట్టలేదు. ప్రతివారూ తాను
బతకాలనీ, తాను సుఖపడాలనీ, తనవాళ్ళు బాగుండాలనే కోరుతారు...." అంటూ మహాలక్ష్మమ్మ ట్రేలో డ్రింకు గ్లాసులు పెట్టుకొని
వచ్చింది.
"మరి బాబయ్యగారు ఎందుకు వచ్చేరనుకొన్నావు. తన వాడి వుద్యోగం పోయిందని విన్నారు. ఆ లక్షల మందిలో ఈయనొకరని
వూరుకోగలిగేరా? తీసుకోండి బాబయ్యగారూ."
"ఈ ఎండలో వుడుకు కాఫీ ఇవ్వకుండా డ్రింకు ఇచ్చేరు. బాగుంది."
"ఇవ్వాలనుకున్నా కష్టమే"
"మీకూ పాలవాళ్ళ సమ్మె బాధేనా."
"అది ప్రారంభమే మా యింట్లోనండోయ్."
సత్యనారాయణ డ్రింక్ సిప్ చేస్తూ సాలోచనగా అన్నాడు.
"ఎవరు బాధపడుతున్నారన్నా మనస్సుకి ఎల్లాగో వుంటుంది. తప్పదు. మన చేతిలో ఏం వుంది? ఏ ఒక్కడికన్నా సాయపడగలమా?
వట్టి భ్రమ. సానుభూతి చూపుతాం. చిన్న సలహా యిస్తాం."
"అది మాత్రం ఎంతలో వుంది?" అంది మహాలక్ష్మమ్మ వుదారంగా.
సత్యనారాయణ లేచేడు.
"అతడు రావడం ఆలస్యం కావచ్చు. వచ్చి వెళ్ళేనని చెప్పండి. తీరిక చేసుకుని ఓమారు కనిపించమన్నానని చెప్పండి."
సత్యనారాయణ వెళ్ళిపోయేక మహాలక్ష్మమ్మ కూతురుని కోప్పడింది.
"మనిషి యింటికి వస్తే చాలు మీ రాజకీయాలూ, రగడలూయేనా! ఏం మనుషులర్రా! ఇల్లా తయారవుతున్నారు."
పంధొమ్మిదో ప్రకరణం
"మామయ్య ఎందుకో రమ్మన్నారుట. ఇంట్లో వున్నారా?" అంటూ రామారావు హాలులో అడుగుపెట్టేడు.
సోఫాలో కూర్చుని రేడియో వింటున్న భాగ్యలక్ష్మి ఆ పలకరింపు విని ఉలికిపడి తల ఎత్తింది.
"నువ్వా" అంది, ఆశ్చర్యంతో, రేడియో కట్టేస్తూ.
"అయివుంటుంది. నేనేనేమో." రామారావు ఎగతాళి చేస్తూ సోఫాలో కూర్చున్నాడు. భాగ్యలక్ష్మి తెల్లబోయింది.
"గుర్తు పట్టేవే."
భాగ్యలక్ష్మికి కోపం వచ్చింది.
"గుర్తు పట్టలేనంతగా కళ్ళు మూసుకుపోలేదు--" అంటూ చర్రున లేచింది.
"రక్షించేవులే. కూర్చో."--అని ఆమెను చెయ్యి పట్టుకు లాగి కూర్చోపెట్టేడు.
"నన్ను గురించి మీ ప్రిన్సిపాల్ కు ఎన్నో అబధ్ధాలు చెప్పేవుట. ఎన్నో ఆరోపణలు చేసేవుట. ఏమవసరం వచ్చింది."
అతని కంఠస్వరం విని భాగ్యలక్ష్మి తెల్లబోయింది.
"నేనా?"
"ఎవరు రామం?"--అంటూ సుపర్ణ హాలులోకి వచ్చింది.
రామారావు కంఠస్వరం వెంటనే మారింది. స్నిగ్ధంగా చూస్తూ--థేంక్స్--" అన్నాడు. సుపర్ణ వేపు తిరిగి "మామయ్య
లేరా!"--అన్నాడు,
"వస్తాడు కూర్చో."
"ఎందుకీవిడగారు కోపంగా ఉన్నారు?"--అన్నాడు కన్నెగరేస్తూ.
"నేనేం కోపంగా లేను."
సుపర్ణ చిరునవ్వుతో మాట దాటించ ప్రయత్నించింది.
"రిట్రెంచిమెంటు కత్తిరింపులో నువ్వూ పడ్డావుట కాదూ.’"
ఆ మాటకు సమాధానంగా రామారావు భాగ్యలక్ష్మిని ఆట పట్టించేడు.
"అయితే నీ కోపం కాలేజీ కమిటీ మీదనన్నమాట! బాగుంది. థాంక్స్."
భాగ్యలక్ష్మి చర్రుమంది.
"నీకుద్యోగం వుంటే నా కొరిగేదీలేదు. పోతే తరిగేదీలేదు."
"ఓహో, అలాగునా. అంత నిర్మమత్వం ఉన్నదానివి నాకు వుద్యోగం ఇమ్మని ఆవిడతో ఎందుకు సిఫార్సు చేసేవు."
అతని కళ్ళు నవ్వుతూంటే భాగ్యలక్ష్మి ఉడుక్కుంది.
"నేనేం నీకోసం చెప్పలేదు. ఆ మధ్య లెక్కల టీచరు కావాలనుకున్నారు. తమరు ఖాళీ అయ్యేరు ఉన్నారు, చూసుకోండి--అన్నాను,
అంతే."
"అందుకే థాంక్సు అన్నాను, మరి కోపం చేస్తావేం."
"నాకేం థేంక్సు చెప్పక్కర్లేదు," అంటూ భాగ్యలక్ష్మి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.
"దానినల్లా రెచ్చగొడతావెందుకు?"--అని సుపర్ణ గదిమింది.
"థేంక్సు చెప్తే కోప్పడుతూంది. చూడు, నేనేం చెయ్యను."--రామారావు అసహాయత నటిస్తూ నవ్వేడు.
"నీకు నవ్వెల్లా వస్తూంది?"
"నీతో ఎట్లా మాట్లాడగలుగుతున్నాను?" అంటూ ఆమె ముఖం వంక చూసేడు, సుపర్ణ గమ్మునైపోయింది.
"దేనిమీదనూ పెద్ద మమకారం పెంచుకోకూడదు సుపర్ణా! బతకలేం. అంటీ ముట్టనట్లుంటే తప్ప మనశ్శాంతి సాధ్యం కాదు."
"పెద్ద వేదాంతివయ్యేవు"--అంది సుపర్ణ చెల్లెలు వెళ్ళినవేపే చూస్తూ.
"జీవితం! సుపర్ణా! జీవితం"--అన్నాడు, జీవితాన్నంతనూ వాడి వడపోసినంత గంభీరంగా.
"మరిప్పుడేం చెయ్యాలనుకుంటున్నావు"
"నిజం చెప్పమంటావా? ఏమీ చెయ్యాలనిపించడం లేదు."
"మరి?"
"ఈ నాలుగేళ్ళ సంపాదనలో మిగిలించింది పదిపన్నెండు వందలుంది. అదయిపోయే లోపున ఏదో ఒకటి తోచక పోతుందా యని ధైర్యం!"
సుపర్ణ దిగ్భ్రమ చెందినట్లు చూచింది.
"చాలా పెద్ద మొత్తమే!"
"నా బతుక్కి అదేమంత చిన్న మొత్తం కాదు. కూర్చుని తింటే నాలుగైదు నెలలు నిరాఘాటంగా సాగిపోతుంది. తరవాత చూద్దాం."
"నాలుగు అయిదు నెలలే మన జీవితావధి అన్నట్లు మాట్లాడుతున్నావు."
"మనదేశపు సగటు ఆదాయం లెక్కన అది ఒక మనిషికి నాలుగైదేళ్ళ ఆదాయం తెలుసా? లేకపోతే నలుగురి సంవత్సరాదాయమన్నా
అనవచ్చు."
"ఈ కష్ట దినాలలో ఒక్కరు నలుగురి ఆదాయాన్ని జేబులో వేసుకోకూడదు. పాపం"--అంది సుపర్ణ ఎగతాళిగా.
"అన్యాయమే. అందుకే సోషలిజం స్థాపనకు నాందిగా ప్రభుత్వం నాబోటిగాళ్ళని ఉద్యోగాల నుంచి స్వస్తి చెప్పింది."
ఇద్దరూ ఒక్క నిముషం నిశ్శబ్దం అయిపోయేరు. లోపలినుంచి మంగమ్మ వచ్చింది. కూతురు కబుర్లేసుకున్న వ్యక్తిని చూసేక ఒక్క
క్షణం మొగం వివర్ణం అయింది. అంతలో సర్దుకుని ఆప్యాయంగా పలకరించింది.
"ఎంతసేపయిందయ్యా వచ్చి? ఎక్కడా కనపడ్డమే మానేశావు." అంటూ తానో కుర్చీ లాక్కుని కూర్చుంది.
"అదేమిటే సుపర్ణా! వచ్చిన పెద్దమనిషికి కాఫీయేనా ఇస్తావా. కబుర్లు చెప్పి పంపేస్తావా?"
ఆమె ముఖ్యమైన అభ్యంతరం కాఫీ ఇవ్వకపోవడం కన్న, కూర్చోబెట్టి కబుర్లు చెప్పడమేనని ఇద్దరూ గ్రహించేరు. సుపర్ణ
లేచింది.