"మార్క్సు ఊహించినా చూసి ఉండని పరిణామాల్ని లెనిన్ పెట్టుబడిదారీ విధానంలో చూసేడు. సామ్రాజ్యవాద దశలో మన ఎత్తుగడలు

ఇల్లా ఉండాలన్నాడు. తరవాత యునైటెడ్ ఫ్రంట్ ఎత్తుగడల్ని...."

"అవీ కొత్త కాదండి, అసలు వర్గపోరాట సూత్రానికి మార్క్సే...."అంటూ రామారావు మాట కలపబోయేడు, కాని నారాయణ మాట

సాగనివ్వలేదు.

"డైలెక్టిక్సు స్వామీ డైలెక్టిక్సు. ఫాసిజం మార్క్సు కాలానికి లేదు, లెనిన్ కాలానికీ లేదు...."

"కాని, అది వూహించలేని విషయం కాదు. జాక్ లండన్ తన 'ఐరన్ హీల్ 'లో దానిని వూహించాడు...."

"రాజకీయ పోరాటాన్ని వూహల మీద పెంచుకు పోడానికి వీలులేదు. ఆ స్థితి 35 నాటికి వచ్చింది. అయితే ఈ వేళ పరిస్థితి

వేరు...."

రామారావు నిశ్శబ్దంగా వింటున్నాడు. హఠాత్తుగా నారాయణ ప్రశ్నించేడు.

"వింటున్నావా?"

"ఆ"

"దోపిడీ, దౌర్జన్యాలూ ఉత్పత్తి విధానంతోపాటు సామాజికం అయ్యాయి. ప్రతివాడూ పక్కవాడిని దోచుకుంటున్నాడు. రెండో వాడిమీద

దౌర్జన్యం చేస్తున్నాడు. ఈవేళ దోపిడీ, దౌర్జన్యాలు వర్గాల సరిహద్దుల్ని చెరిపేస్తున్నాయి. అసలు దోపిడీకీ, దౌర్జన్యానికీ

మూలాన్ని దొరకపుచ్చుకోడం ఈవేళ అసాధ్యం. 1943లో బెంగాలు కరువుకి 50 లక్షల మంది చచ్చిపోయారన్నారు. ఎలకలూ,

దోమలూ, ఈగలూ కన్నా హీనం ఆ కరువు మనుష్యకృతం. కాని ఏ మనిషి? అల్లాంటి పరిస్థితే నెహ్రూ అధికార కాలంలో కూడా ఏ

చిన్న ప్రయాణంలోనైనా రాకపోలేదు. వచ్చినప్పుడు దానికి కారకుల్లో ఒక్కడిని పట్టుకు ఉరితియ్య గలిగేడా?"

"అంటే అర్ధం దానికి కారణం ఎవడో ఒక వ్యక్తి కాదనీ, అసలు కారణం సమాజ నిర్మాణంలోనే ఉన్నదనీ కాదా."

"అదే నే చెప్పేది, ఘోరాలు జరిగి పోతుంటాయి. దానికి బాధ్యత ఎవరో చెప్పడానికి ఉండదు. కనక నిశ్శబ్దంగా చావవలసిందేనా?

1943లో ఎలకల్లా చచ్చిపోయిన ఆ 50 లక్షలమందీ, ఒక్కో నూరుమంది ఒకణ్ణి పట్టుకొని నలుచుకు తినేస్తే సంఘం ఇల్లా

వుండేనా? ఆ పనికి ఎగబడి వుంటే అంతమంది చావనక్కర్లేకుండానే వ్యవహారాలూ సర్దుకొని వుండేవి కావా?"

"మీ మాటలు అర్ధం కావు. ఒక వేపున కనిపించిన వాడినల్లా కొట్టమంటారు. రెండోవేపున పదిమందీ ఏకం అయి దెబ్బలాడమంటారు.

ప్రతి వాడినీ తన్నడం ప్రారంభిస్తే పదిమందీ ఏకం కావడం జరుగుతుందా?" అని సుశీల అడ్డం వచ్చింది.

"ఆ సామూహిక వీరత్వం రావాలంటే ఎంత నిర్మాణం కావాలి, ప్రజల్లో ఎంత ప్రబోధం కావాలి? ఎంత అనుభవం వుండాలి? కాని, మీరు

చెప్తున్న పద్ధతిలో ఆ మూడూ కూడ నష్టమేనే." అన్నాడు రామారావు.

"ఈత వస్తే గాని నీళ్ళలో దిగవద్దంటావు. అల్లా మంచంమీద పడుకుని కాళ్ళూచేతులూ కొట్టుకొంటూవుండు. ఈత చేతనవుతుంది." అని

చిరాకుతో నారాయణ లేచేడు. ఆయన వెనకనే సుశీల లేచింది.

తొమ్మిదో ప్రకరణం

"లెక్చరరుగారు ఇంట్లోలేరేమిటి? ఎక్కడా అలికిడి వినబడ్డం లేదు." అంటూ భాగ్యలక్ష్మి ఎగతాళిగా రామారావు వాటా వేపు తల

ఎగరేసింది.

అందులోని వెక్కిరింతను అర్ధం చేసుకోనట్లే సుశీల మాట్లాడేసింది.

"పాపం, ఈ రిట్రెంచిమెంటు కత్తి ఆయన మీద పడింది. ట్యూటరు వుద్యోగం కాస్తా పోయింది. ఏం చెయ్యడమా అని దిగులు

పడుతున్నారు."

"దానికింత పాపం; తాపం ఎందుకు? నాలుగెకరాలున్నదాన్ని చూసుకున్నాడుగా. ఆ తరవాయేదో పూర్తయితే...."

"అల్లాంటి వాడైతే ఎకరాలతో పాటు ఓ చిన్న వుద్యోగం వున్నదాన్ని కూడా చేసుకోవచ్చు. దానికైతే వెతకనే పనిలేదు...."

"సడే. సంబడం. చేసుకొంటూ, చేసుకొంటూ...." చటుక్కున భాగ్యలక్ష్మి నిగ్రహించుకొని మాట మార్చేసింది. "సినీమాకిగాని

వస్తావేమో అడిగి రమ్మంది, అక్క."

"యింకా పిల్లలు యింటికి రాలేదు. ఏ పనీ కాలేదు, ఇంట్లో. ఈ వేళ రానులే."

"పిన్నిగారున్నారుగా, ఓ పూటకి ఆమె దగ్గిర వుండలేరా?"

"వుండడం ఒక్కటేనా? వాళ్ళకెన్ని చేస్తే వుండడం మాటొస్తుంది."

ఆమె మాట పూర్తికాకుండానే వీధిలోంచి "అమ్మా" పిలుపు వినబడింది.

సుశీల ముఖం విచ్చుకుంది.

"అరుగో వచ్చేసేరు." అంటూ లేచింది.

"రాక ఎక్కడికి పోతారేం? మా అక్క, నువ్వు, మా వదిన మీరంతా ఒకే పాఠాలు చదివినట్లున్నారు. డ్రైనేజీ గోతులు, లారీలు,

పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు....అబ్బ!"

"పెళ్ళి చేసుకొని ఓ పిల్లవాణ్నో, పిల్లదాన్నో కన్నాక చెప్దువులే...."

"నాకు పెళ్ళివద్దు. పెళ్ళయినా పిల్లలు వద్దు. వున్నా మీలాగ భయపడను."

సుశీల చిరునవ్వు నవ్వింది.

"ఆడ, మగ భేదం లేకుండా, ప్రతివాళ్ళూ వరసక్రమంలో ఏదో రోజున చెప్పే మాటలే. కాని తరవాత ఒక్కటీ గుర్తుండదు...."

"సరే. చూద్దుగానికా."

వీధి గుమ్మంలో ఆరేళ్ళ హేమ కనబడింది. అక్కడినుంచే ఫిర్యాదు చేసింది.

"అన్నయ్య రావడంలేదే, అమ్మా! ఒరేయ్, అమ్మతో చెప్పేస్తున్నా...."

ఆయాసపడుతూ హేమ లోపలికి వచ్చింది. ఆమె రెండు భుజాలనీ రెండు పుస్తకాల సంచులు, రెండు చేతులలో రెండు కేరియర్లు. ఆ వేషం

చూసి భాగ్యలక్ష్మి ఫక్కున నవ్వింది. ఆ నవ్వు చూసి హేమకి సిగ్గేసింది. ఏదో అవమానం జరిగినట్లు ఏడుపుమొహం పెట్టింది.

"చూడే అమ్మా! తన సంచీ, కేరియరూ అన్నయ్య అరుగుమీద పారేసేడు."

సుశీల వెళ్ళి కూతురు భుజాలనున్నవీ, చేతులలోవీ తీసుకుంది.

"వాడి సంగతి చెప్దాంలే. ఏడీ వాడు? ఇంట్లోకి రాకుండా ఏం చేస్తున్నాడు?"

ఆ మాటలింకా పూర్తికాకుండానే వీధిలో పెద్దగోల వినబడింది. సుశీలా, భాగ్యలక్ష్మీ అటు పరుగెత్తేరు.

"చంద్రం కాలుజారి పడిపోయేడండి." – అన్నమాట విని, సుశీల ఒక్క వురుకున కందకం గట్టున నిలబడింది.

"వద్దంటున్నా వినలేదండి." అంటూ కుర్రవాళ్ళు ఆ ప్రమాదం బాధ్యత తమది కాదని చెప్పుకొంటున్నారు. ఆ మాటలేవీ సుశీల చెవిని

చొరడం లేదు. కందకంలో నిలబడి వెర్రినవ్వులు నవ్వుతూ తన సాహసాన్ని గొప్పగా వర్ణించుకుంటున్న కొడుకును చూస్తూ గమ్మున

లోపలికి వురికింది. ఆ వురకడంతో కాలు మడతపడి చదికిల బడిపోయింది. కూర్చునే కుర్రవాడిని దగ్గరకు లాక్కుని ముద్దులాడింది.

"దెబ్బ ఎక్కడ తగిలిందిరా, నాన్నా."

అంతమందిలో తనకేదో దెబ్బ తగిలినట్లు ఆదుర్దా చూపడం, ముద్దు చేయడం చంద్రశేఖరానికి చాలా చిన్నతనంగా కనిపించింది. తల్లి

చేతుల నుంచి విడిపించుకొని, దూరంగా జరిగి, తన సాహస చర్యను సాభినయంగా వర్ణించసాగేడు.

"అందరికన్నా దూరం దూకేనమ్మా. మట్టిగడ్డ మీద కాలుపడింది. గోవిందా అని ఇల్లా పడిపోయేను."

పడిపోయిన విధాన్ని అభినయించి చూపడంలో మళ్ళీ తల్లికి దొరికిపోయాడు. యీమారామె వానిని వదలలేదు.

"గొప్పపని చేసేవులే."

"అల్లా కూర్చునే వున్నారేమిట"న్న ప్రశ్న వినబడి, సుశీలకు తాను కూర్చునే వున్న విషయం గుర్తు వచ్చింది. చటుక్కున

లేవబోయింది. కాని సాధ్యం కాలేదు. అంతవరకూ కొడుకును గురించిన ఆదుర్దాతో ఆమెకు కాలు బాధ గుర్తు రాలేదు. ఇప్పుడు

లేవలేకపోతూంది.

"ఏమయిందేమిటి?" – అని భాగ్యలక్ష్మి ప్రశ్నిస్తూంది. పరిస్థితి గమనించి ఆమె ఇంట్లోంచి నిచ్చెన తెచ్చి వేసుకొని దిగి

వచ్చింది. ఆమెతోనే వచ్చిన సుశీల తల్లి గట్టు మీదనుంచే "ఏమయిందే అమ్మా!" అంటూంది.

అంతవరకూ తోచివుండని బాధ కాలినరాల్ని తోడేస్తూంటే సుశీల "అబ్బా" అంటూంది. కాలు రాయడానికి భాగ్యలక్ష్మి చెయ్యి జాపింది.

కాని సుశీల మొర్రో అనేసరికి వదిలేసింది.

"చూడు. నీ మూలంగా అమ్మ కాలు నొప్పెట్టింది." అని భాగ్యలక్ష్మి కోప్పడుతూంటె చంద్రశేఖరం బిక్కమొహం వేసేడు.

"అంచుకి వెళ్ళకండర్రా. మీరు కూడా పడిపోతారు!" అని గట్టు మీద పిల్లల్ని బతిమలాడుతూంది. ఆ గోల గంద్ర గోళం విని

ఇరుగు పొరుగులు వచ్చేసేరు. తొంగి చూడడంతో వాళ్ళు కూడా తమ మీద పడే ప్రమాదం వున్నదని అప్పుడే దిగి వచ్చిన రామారావు

గ్రహించేడు. నిద్రలో బయట కేకలు విని ఉలికిపడి అతడు పరుగెత్తి వచ్చేడు.

"ముందు నువ్వు పైకెక్కు."

భాగ్యలక్ష్మి తిరగబడి చూసింది. నువ్వా నన్ను ఆజ్ఞాపించేదన్నట్లు. కానీ రామారావు మరో మాటకు అవకాశం ఇవ్వలేదు.

"ఊ. త్వరగా పిల్లవాడినందుకో."

సుశీల చూపు కూడా గ్రహించి, భాగ్యలక్ష్మి గబగబ నిచ్చెన నెక్కేసింది. ఆమె ఇంకా పై మెట్టు మీద వుండగానే క్రింది నుంచి

రామారావు కంఠం.

"గట్టిగా పట్టుకో."

వెనుతిరిగి చూసింది. పిల్లవాడిని పైఎత్తున నిలబెట్టి రామారావు సుశీలను లేవదీయబోతున్నాడు.

"లేవగలరేమో చూడండి."

ఆమె కాలు రాసుకుంటూ లేవబోయింది. కాని, మరల చదికిలబడింది.

లాభంలేదు. రామారావు నొప్పిపెట్టిన కాలు తొక్కిపెట్టి, ఆమె నడుముకు చేతులు చుట్టి బలంగా లేవనెత్తి గుంజేడు. అదురు తిన్న

నరాలు కొంతవరకు సర్దుకొన్నాయి. కాని, కాలు నేల మోపగల స్థితిలో లేదు. నిచ్చెన ఎక్కడం ఎల్లాగ? జనం కందకం అంచుకు

చేరి తలో సలహా ఇస్తున్నారు. సలహాలు వుపయోగం ఉన్నా, లేకపోయినా గట్టుతో సహా వారంతా తమ మీద పడే ప్రమాదం వుంది.

రామారావు వొంగి చటుక్కున సుశీలను భుజాన వేసుకొన్నాడు.

"భయపడకండి."

తీసుకెళ్ళి మంచం మీద కూర్చోపెట్టేడు.

"ఎర్రమన్ను వుడికించి కట్టండి."

"చింతపండూ, సున్నం అయినా సరే."

ముసలమ్మ ఆశీర్వదిస్తూంటే రామారావు తన గది వేపున నడిచేడు.

పదో ప్రకరణం

వినోదం చూడవచ్చిన వారూ, ప్రమాదాన్ని పరామర్శించ వచ్చిన వారూ వదిలిపెట్టేవరకూ ఎంత చిరాకుగా వున్నా, చెప్పిన మాటే

చెప్తూ, రామారావు అరుగు మీదనే నిలబడిపోవలసి వచ్చింది.

వారంతా వెళ్ళిపోయాకనే అతడు తన వాటాలో ప్రవేశించేడు. చికాకుగా వుంది. ఉక్క, చెమట, స్నానం చెయ్యాలని ఆశ.

వెళ్ళి, కుళాయి తిప్పేసరికి అది కంయ్ మంది. పక్క వాటాలోంచి సుశీల తల్లి కేకేసింది.

"ఈవేళ కుళాయిలు రాలేదు నాయనా!"

"కృష్ణానది పక్కనుండగా నీళ్ళ కరువు. దరిద్రగొట్టు మునిసిపాలిటీ." అని తిట్టుకున్నాడు. ప్రాణం వుసూరుమంది. నిలబడి

పోయేడు.

"ఎక్కడో బాగులో, దోగులో తగులడుతూండి వుంటారు" – అన్నాడు కోపం పట్టలేక.

"నీళ్ళు రావు. జాగ్రత్త పడండి – అనేనా చెప్పి చావరు" – అంది ముసలమ్మ లోనుంచే.

నోటీసు పంపడం ఇంటింటికీ చెప్పడం అనవసర శ్రమ కాదా? బాధ ఎల్లాగూ తప్పదు. ముందుగానే చెప్పి ఏడిపించడం ఎందుకనుకొని

వుంటారు. అన్నాడు తిట్టలేక కసి పట్టలేక.

"పండుగొచ్చేసరికి ముసిముసినవ్వులు నవ్వుకుంటూ మామూళ్ళ కోసం ముష్టికి బయలుదేరడం కష్టమనిపించదు." అంది ముసలమ్మ.

"త్రాగడానికా? స్నానానికా?"

"స్నానం చెయ్యాలనేమో ఇందాకా పనిమనిషిని మీ స్నానాల గదిలో కూడ నీళ్ళు పొయ్యమని చెప్పేను చూసుకోండి." అంది, ఆ సంభాషణ

అంతా వింటున్న సుశీల.

"బాల్చీలు కావేసినట్లున్నాయి. మరిచిపోయి వుంటుంది. అదేనా తక్కువ తిన్నది." అన్నాడు, రామారావు తెచ్చికోలు శాంతంతో.

"మా గదిలో పోయించాను. వాడుకోండి."

పక్కనే వున్న భాగ్యలక్ష్మికి పని పురమాయించింది.

"ఆ చెంబూ, బాల్చీ, సబ్బూ కాస్త ఆ గదిలో పెట్టి రావే."

రామారావు వద్దన్నాడు.

"తరవాత చూస్తాలెండి"

అలా అన్నాడేగాని కూజాలో నీళ్ళు చూశాక మరో ఆలోచన తోచింది. హస్పిటళ్ళలో రోగులకు చేయించే "సోప్ బాత్" గుర్తొచ్చి అంత

చిరాకులోనూ నవ్వొచ్చింది.

"Simple living and high thinking. భారతదేశపు పారమార్థికతకి ప్రపంచం జోహార్లు చెప్పక

చస్తుందా?"

పదకొండో ప్రకరణం

తన వెనకవేపున బరువు బాల్చీ దబ్బున పెట్టిన చప్పుడయి, రామారావు ఉలికిపడి, ఈలపాట ఆపేడు.

ఆ"సోప్‌బాత్" ఇంచుమించు తడిగుడ్డతో తుడుచుకోవడం వంటిదే అయినా, ఆమాత్రానికే ప్రాణం ఎంతో హాయిగా వుంది. చిరాకు

తగ్గి ఈలపాట దానంతట అదే వచ్చేసింది. ఆ హుషారులో భాగ్యలక్ష్మి నీళ్ళ బాల్చీతో రావడాన్ని అతడు గమనించలేదు. బాల్చీ

చప్పుడు విని తిరగబడి చూసేడు. భాగ్యలక్ష్మి, నడుమున రెండు చేతులూ పెట్టుకొని ఆయాసపడుతూ నిల్చునుంది. తడిసిన

అండర్‌వేర్‌తో ఇంచుమించు నగ్నంగా వున్న తన స్థితికి సిగ్గుపడి అతడు కూర్చున్న పీటమీదనే వెనక్కి

తిరిగేడు.

"ఏమిటిది?"

"నీళ్ళు"

"అది సరిలే. ఎందుకూ అని."

"తమరు తానమాడాలని."

"అదీ బాగానే వుంది. నీకీ శ్రమ ఎందుకని....వద్దన్నా కాదా?"

ఒక్కక్షణం భాగ్యలక్ష్మి ఏమీ మాట్లాడలేదు. ఆమె చూపులు తన వొళ్ళంతా తడుముతున్నట్లనిపించింది.

"బాగుంది. Thanks--వెళ్ళు."

"నాకెందుకు. ఆ సుశీలమ్మగారికి చెప్పుకో. ఓ బాల్చీడు నీళ్ళు యిచ్చిరా తల్లీ! ఆ వొళ్ళు వేడేనా తగ్గుతుంది అని తరుముతే

తెచ్చేను."

"నా ఒళ్ళు వేడి ఆమెకెందుకు తెలిసిందబ్బా!" అన్నాడు, రామారావు వెక్కిరింతగా.

ఆ ప్రశ్నకోసమే కాచుక్కూర్చున్నట్లు భాగ్యలక్ష్మి చటుక్కున అనేసింది.

"కౌగలించుకున్నప్పుడు తెలిసి వుంటుంది."

భాగ్యలక్ష్మి స్వభావం ఎరిగిన రామారావు ఎర్రబారి చూసేడు.

"సంతోషించాం. వెళ్ళిరా."

భాగ్యలక్ష్మి కదలలేదు. పైగా--

"ఏమిటి నీ వుద్దేశం? అంతమంది ముందు, పట్టపగలు, పరాయి ఆడదాన్ని, నీకన్నా పెద్దదైతే మాత్రం, పిల్లల తల్లిని అల్లా

కౌగలించుకోడం, చేతుల్లో ఎత్తుకుని రావడంలో నీ వుద్దేశం ఏమిటి? రేపు ఆవిడ తల ఎత్తుకోవాలా?"

సుశీలయందున్న గౌరవం కొద్దీ అతడామాటను సాగదియ్యలేకపోయాడు. అందుచేత వెక్కిరింత, వేళాకోళంతో తోసివెయ్యబోయేడు.

"ఔను సుమా!" అన్నాడు. ఆ కందకంలో ఆవిడను వదిలేసి, మీ అందరి సానుభూతి ప్రదర్శనలకూ అవకాశం ఇవ్వకుండా పైకి తేవడం

ని....ఝం....గా చాలా....తప్పు."

భాగ్యలక్ష్మి కళ్ళు చురచురలాడేయి....

"సిగ్గు లేకపోతే సరి."

ఆమె కోపం ఏమిటో, ఎందుకో రామారావు ఎరుగును. కానీ గుర్తించదలచుకోలేదు.

"నిజమే. మనిషికి అభిమానం, అహంకారమే గాక సిగ్గు కూడా అవసరమైన ఆడగుణాల్లో ఒకటని నాకు గుర్తులేదు సుమా."

"ఆడది కనిపిస్తే నీకేమీ గుర్తుండదు. ఎదో పేరున ముట్టుకోవాలి."

ఆ మాటతో రామారావు కళ్ళు నిప్పులు కురిసేయి. అతికష్టం మీద కంఠాన్ని నిగ్రహించుకున్నాడు.

"నీకు నీమీద అభిమానం కన్న ఇతరుల పాతివ్రత్యం కాపాడ్డం మీద ఎక్కువ శ్రధ్ధ సుమా."

ఒక్కనిముషం క్రితం కలిగిన సిగ్గు మాట మరిచిపోయాడు. లేచి ఆమె రెక్క పట్టుకొని వరాండా గుమ్మంవేపు నడిపించేడు.

"సినీమాలూ, నాటకాలూలో లాగ లెంపకాయకొట్టే ఆలోచన పెట్టుకోకు. అప్పుడు నిజంగా విలన్‌నైపోతా."

చెయ్యి విడిపించుకుంటూ భాగ్యలక్ష్మి రుసరుసలాడింది.

"చెయ్యొదులు."

"ఆడదానివి. చెయ్యేనా పట్టుకోకపోతే నీ ఆడతనానికే అవమానం కాదూ"

గుమ్మం వెలుపల నిలవబెట్టి తలుపు వేసుకుంటూ హితోపదేశం చెసేడు.

"మీ యింట్లో వుండడంలేదనీ, మీరంతా నా ఆరోగ్యం, నా మర్యాదా గురించి ఇంత శ్రధ్ధ తీసుకోనక్కర్లేదనీ నీకు ఎల్లా

నచ్చచెప్పడమో తెలియడం లేదు. ఇక అనవసరంగా...."

తరవాత ముగింపు ఏమిటో తలుపు చప్పుడుతో భాగ్యలక్ష్మికి వినిపించనేలేదు.

పన్నెండో ప్రకరణం

సుశీల పడుకుని వున్న గది గుమ్మంలో నిలబడి "కాపడం పెట్టేరా? ఎల్లా వుంది?" అని అడుగుతున్న రామారావుని లోపలికి

ఆహ్వానించింది.

"రాండి. ఆ కుర్చీ లాక్కోండి. అప్పుడే స్నానం అయిపోయిందా?"

"ఎంతసేపేం?"

"ఇప్పుడే కదా భాగ్యలక్ష్మి బాల్చీ పెట్టి వచ్చింది?"

"ఆమె వచ్చేసరికే నా స్నానం అయిపోయింది."

"నీళ్ళెక్కడివి? మొగమోటపడ్డారా?"

"భాగ్యలక్ష్మిని పాపం ఎందుకు శ్రమ పెట్టేరు? అంత పెద్ద బాల్చీని నీళ్ళతో ఈడ్చుకొచ్చి, పాపం వొగిర్చేసింది. నాకు అవసరం

అనిపిస్తే నేను తెచ్చుకోకపోయేనా? మీ యింట్లోనా నాకు మొహమాటం?"

ఆ రెండు కుటుంబాల మధ్య దగ్గరదో, దూరపుదో బంధుత్వం వుందని సుశీల ఎరుగును. రాకపోకలున్నాయి. కాని, వ్యవహారాలు చూస్తే

ఎక్కడో ఏదో లోపం వుందనిపిస్తుంది. ముఖ్యంగా భాగ్యలక్ష్మి.

"అబ్బే. యిందులో ఏం వుంది? భాగ్యలక్ష్మి ఒకరికి సాయం అంటే వెనక తియ్యదు. చాలా మంచిపిల్ల."

"నేనెరగనా? పి.యు.సి., బి.ఎస్.సి., లు నేను వాళ్ళింట్లో వుండే చదువుకొన్నా. మీరెరగరేమో."

"మీ అమ్మగారు అంటుంటారు."

"నాకు తెలుసు. అయితే ఆమెకు శ్రమ ఇవ్వడం అనవసరం అని గాని...."

సుశీల యింకా ప్రసంగాన్ని సాగతీయదలచుకోలేదు. మాట మార్చింది. కొంతసేపు డాక్టరుకు కాలుచూపడం అవసరమా, ఆయన్ని

తీసుకురావడమా, లేకుంటే వెళ్ళడం ఎల్లాగ--అనేక విషయాలు కబుర్లలో దొర్లేయి.

ఒక నిమిషం ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పి రామారావు లేచేడు.

"చూడండి, మీ విషయంలో నేనేమన్నా అనుచితంగా వ్యవహరించి వుంటే క్షమించండి."

సుశీల తెల్లబోయింది.

"మీమాట నాకర్ధం కాలేదు."

"అర్ధం కాకపోతే బాధ లేదు. వదిలెయ్యండి. సరే, పోయొస్తా."

సుశీల ఆలోచనలో పడింది. ఆ క్షమాపణకి యిప్పుడవసరం ఏమిటి? భాగ్యలక్ష్మి ఏమన్నా అందా? ఆమెకు అతడంటే ఏదో

చులకనభావం. మగాడు, గడుసువాడు కనక తేలడు. కాని, రామారావుకీ వుంది అటువంటిదేదో. వాళ్ళ వైమనస్యాలమధ్య తన

ప్రసక్తి ఏమిటి?

"మనుష్యులకి ఒకరినొకరు పీక్కు తినడం ఆనందమా, కాలక్షేపమా?"

పదమూడో ప్రకరణం

"సినీమాకొస్తావేమో అడిగి రమ్మంటే కాలు విరుచుకున్నావని ఓ గంట పోయాక కబురు తెచ్చింది, భాగ్యం. చూసొద్దామని బయలుదేరా"

నంటూ వచ్చిన సుపర్ణను చూసి సుశీల సంతోషంతో ఆహ్వానించింది.

"రావే. రా. నిద్ర రానప్పుడు మంచం మీద పడుకుని వుండవలసి రావడం ఎంత కష్టమే. అబ్బ." అని చిరాకు పడింది.

"పడుకో, లేస్తావెందుకూ? కుర్రాడు ఏడీ? వాడికేం దెబ్బ తగలలేదు కద." అంటూ సుపర్ణ మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని

కూర్చుంది.

"పిల్లలిద్దర్నీ తీసుకొని అమ్మ ఇప్పుడే పక్క యింటి కెళ్ళింది. అదీ అదృష్టమే, వాడికేం తగలలేదు."

"పోనీలే. పిల్లగాళ్ళు కారుగాని...."

"ఒక్క నిమషం కాలూ, చెయ్యీ వూరుకోదు కద."

పిల్లల మాటలూ, అల్లర్లూ గురించి కొంతసేపు విచారం, సంతోషం, విసువు, ఉత్సాహం వారి మాటలలో మారి మారి వినిపించింది. తరువాత

ప్రమాదం ఎల్లా జరిగిందో, ఆ క్షణంలో తన మనస్స్థితి ఏమిటో సుశీల కొంతసేపు వర్ణించింది. అదీ విసుగనిపించింది.

"అబ్బ, పాడుదెబ్బ. కాస్సేపు మరో కబుర్లేవేనా చెప్పు. పిల్లని తీసుకొచ్చేవు కాదేం? ఏడాది వెళ్ళిందా? మీ ఆయన ఎప్పుడు

వస్తారుట. నీ ప్రయాణం ఎప్పుడు?"

"వుద్యోగరీత్యా హైద్రాబాదు వెళ్ళేరు. ఆదివారం మెయిలుకి టిక్కెట్లు తీసుకొని రెడీగా వుండమన్నారు."

"ఎల్లుండి పొద్దుటేనా?"

"కాదు. పైవారం."

"ఎక్కడికి పార్వతీపురమేనా?"

"ఆ. అంతా గొడవ గొడవగా వుంది. కొండవాళ్ళనీ, కోయవాళ్ళనీ రెచ్చగొట్టి వూళ్ళు దోసిస్తున్నారు, కమ్యూనిస్టులు."

"మొగుడు పోలీసు ఆఫీసరు అయినందుకు నీకు పాఠాలు బాగానే వంటబడుతున్నాయి."--అని నవ్వింది

సుశీల, సుపర్ణ తెల్లబోయింది.

"అదేమిటే, అల్లా అంటావు? మాకు తెలిసిన కుటుంబం ఒకటుంది. వర్తకులు, ఇంక ఆ ప్రాంతాలకు వెళ్ళం బాబోయని యింటిదగ్గిరే

కూర్చుంటున్నారు. వాళ్ళు చెప్పే మాటలు వింటే...."

"వీళ్ళు ఏంచేసి ఎందుకు భయపడుతున్నారో. చెప్పేటప్పుడంతా సుగుణాభిరాములే."

"వాళ్ళేమిటి? చెయ్యడం ఏమిటి? నువ్వు మరీను. అక్కడి సరుకు తెచ్చి ఇక్కడా, ఇక్కడిదక్కడా అమ్ముకొనే రకం. ఒకరి

జోలికీ సొంటికీ పోయేరకం కాదు."

"ప్రపంచం మనకు కనిపించేటంత అమాయకంగా వుందనుకోకు. సరిలే. ఏమిటి కథ. భాగ్యలక్ష్మికింకా పెళ్ళి మాట ఆలోచించడంలేదా?"

అంటూ మాట మార్చింది, సుశీల.

ఆ ప్రశ్న రాగానే సుపర్ణ అటూ, ఇటూ చూసింది. నెమ్మదిగా గొంతు తగ్గించి--"రామం ఇంట్లో వున్నాడా?" అంది.

తాను భాగ్యలక్ష్మి పెళ్ళి సంగతి అడుగుతూంటే, సుపర్ణ రామారావు వున్నాడా అని అడగడం సుశీలకు వింతగా తోచింది. కాని ఏమీ

తేలలేదు.

"లేరు. ఇంతక్రితమే బజారుకెళ్ళేరు. భోజనం అవీ పూర్తి చేసుకుని ఏ తొమ్మిదింటికో చేరుకుంటారు. ఇంటిదగ్గిర కనిపెట్టుకొని వుండే

వాళ్ళెవ్వరూ లేరు కదా. తోచినప్పుడు రావడం-పోవడం...." అంటూ సుపర్ణ అడిగినవీ, అడగనివీ అన్నింటికీ సమాధానం

ఇచ్చింది.

"తల్లి?"

"కూతురు కొత్తకాపరం సరిదిద్దడానికి వెళ్ళేరు కదా. ప్రస్తుతం కూతురూ, అల్లుడూతో కొండకెళ్ళేరుట. వస్తారు, ఎప్పుడో."

సుపర్ణ నవ్వింది.

"తెలుగునాట దైవభక్తి డేంజరుగా మారుతూంది."

"పెళ్ళికాక ముందునుంచే ప్రభావతి శనివారాలుంటూంది."

"అదేముందిలే. ఈవేళ హాస్టల్సులో ఆడపిల్లలందరికీ అదో ఫేషనయిపోయింది. లావు తగ్గించేందుకనీ, వెంకటేశ్వరుణ్ణి మంచి

చేసుకొనేందుకనీ ఉమ్మడిగా ఉపవాసాలు చేసేస్తుంటారు," అంది సుపర్ణ. సుశీల నవ్వింది.

"ఎదటివూరునపట్టి రాంలింగయ్యో రామభద్రయ్యో అయినట్లు--"

"అదేంకాదు, సిగ్గా ఏమిటి? ఎవరో ఒకరూ, ఇద్దరూ అల్లా చేస్తేనది. అందరూ అదే పడవలో వున్నప్పుడు ఎవరికోసం ఆ

భయం?"

"నువ్వూ చేస్తున్నావా?"--అంది ఆశ్చర్యంగా సుశీల. సుపర్ణ చిన్నపుచ్చుకొంది.

"యూనివర్సిటీ హాస్టలుకెళ్ళేక నలుగురినీ చూసి నేనూ ప్రారంభించా. అంతకు పూర్వం రామారావుది ఇన్‌ఫ్లుయన్సు. ఆ పద్యం

ఆ రోజుల నాటిదే."

"మీ భాగ్యలక్ష్మికి లావు భయం, దేవుడి భయం కూడా లేవు." అని మెచ్చుకుంది, సుశీల.

సుపర్ణ ఒక్క నిముషం తటపటాయించి, ఎత్తుకుంది.

"మాట వచ్చింది కనక చెప్తాను. నీకు చేతనైతే దానికి నచ్చచెప్పడానికి ప్రయత్నించు. మళ్ళీ ఎక్కడా అనకు."

అదేదో కుటుంబ విషయం అయివుంటుందని గ్రహించి సుశీల సందేహించింది.

"రహస్యమైతే చెప్పకు."

"అది ఇక్కడినుంచి వచ్చి గదిలో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంది."

సుశీల ఆశ్చర్యపడింది.

"ఎందుకు? ఏం జరిగింది? వెళ్ళేటప్పడు మామూలుగానే వుందే."

కొద్దిసేపటి క్రితమే రామారావు వచ్చి భాగ్యలక్ష్మితో నీళ్ళు ఎందుకు పంపించేరని అడిగిన మాట గుర్తు వచ్చింది.

అతడేమన్నా....తన తప్పును కమ్ముకోనేందుకు ముందుకాళ్ళ బంధంలా ఆ మాట అనలేదుగదా అనిపించింది.

"అదే అడిగేసరికి భళ్ళున ఏడ్చేసింది."

"ఎందుకంటుంది?"

"రామారావు మీద దానికి....వెర్రి మమకారం."

సుశీల వులిక్కిపడింది. తన అంచనా తప్పన్నమాట.

"అదేమిటే....ఆయనకి పెళ్ళి స్థిరపడింది కాదటే...."

సుపర్ణ ఏమీ అనలేదు.

"మీది పొరపాటేమోనే....అతనంటే దానికేమాత్రం గౌరవం లేదు."

"నీకు తెలియదు, అదో పెద్దకథ."

సుపర్ణ ఆ కథనంతనూ చెప్పలేదు. కాని, అసలు విషయం చెప్పింది.

"మా అమ్మా, నాయనమ్మా అంటే అతనికి పరమ అసహ్యం. వాళ్ళకి అతనంటేనూ అంతే. భాగ్యలక్ష్మి ఆశ విఫలం కావడానికి మూలం

అదే. దానికి అతడు తప్ప మరెవ్వరూ ఆనరు. ఆ విషయం తెలియబరిచే పధ్ధతినది ఎరగదు. ఫలితంగా దాని పరిస్థితి

తెలియకుండానే అతడు చెయ్యి జారిపోయేడు."

"చిత్రమేనే."

"నే నెరుగుదును."

"ఎరిగినదానివి సర్దుబాటు చెయ్యడానికి నువ్వెందుకు ప్రయత్నించేవు కావు? ఈ పరిస్థితినింతదాకా ఎందుకు రానిచ్చేవు?" సుపర్ణ

ఒక్క నిముషం ఆలోచించింది.

"దాని స్థితి నాకు అర్ధం అయ్యేసరికి రామారావుకు సలహా ఇవ్వగల స్థితి లేకుండా పోయింది."

"మీ నాన్నగారికి...."

"ఆయనకి తెలియదు. తెలిసినా ఏమీ చెయ్యగలిగి వుండేవారు కాదు."

"నువ్వేదో దాస్తున్నావు. రామారావుకి యీ సంబంధం కుదర్చడంలో మీ నాన్నగారి పాత్ర చాలా వుంది. నాకు తెలుసు. కూతురు ఆలోచన

తెలిసివుంటే ఆయన ఎందుకల్లా చేస్తారు?"

సుపర్ణ దానికేమీ సమాధానం ఇవ్వలేదు.

"అతనికా పెళ్ళేదో జరిగిపోతే బాగుండిపోను. ఇంకెల్లాగూ లాభం లేదని అదే సర్దుకొనేది."

"ఒక్కటి చెప్పు. భాగ్యలక్ష్మి మనస్సు తన మీద వున్నదని రామారావుకి తెలుసా?"

"చెప్పలేను. చెప్పలేను."

"తెలిసి మాత్రం ఏం లాభం? ఆయనకు ఇష్టం వుండాలి కద!"

"ఆ మాట దానికి నచ్చచెప్ప గలిగితే ఇంకేముంది? నీకేమన్నా సాధ్యమేమో ప్రయత్నించు."

పధ్నాలుగో ప్రకరణం

సుపర్ణ నెమ్మదిగా మేడమీదికెళ్ళి తండ్రి గదిలోకి తొంగి చూసింది. చుట్టపొగల మధ్య, చీకట్లో, కిటికీ దగ్గర, నిర్వికల్ప

సమాధిలో వున్నాడాయన. ఒక్క నిముషం తటపటాయించింది. కానీ, ఏదో నిర్ణయానికి వచ్చినట్లు గదిలో అడుగు పెట్టింది.

"ఇంత ఉక్కలో, ఈ పొగలో ఎల్లా కూర్చున్నారు? ఫాన్ అయినా వేసుకున్నారు కాదు." అంటూ ఆమె స్విచ్ వేసింది. వెలుతురు

వెల్లువలో కళ్ళు చికిలిస్తూ సత్యనారాయణ నవ్వేడు. సమాధిలోంచి లేస్తూ "ఔను సుమా!"

"ఏమిటి చదువుతున్నారు?"--అంటూ సుపర్ణ కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చుంది.

"ఈవేళ మీ అల్లుడుగారు ఉత్తరం రాసేరు."

"నాకూ వ్రాసేరు. అదే ఆలోచిస్తున్నా."

"అమ్మ వాయిదా వేస్తూంది...."

"ఏమంటుంది?"

"ఎదురుగా దసరాలు పెట్టుకుని ఇప్పుడు ప్రయాణమేమిటంటుంది."

"ఇప్పుడెక్కడ దసరాలు. ఇంకా జూలై కూడా వెళ్ళలేదు."--అన్నాడు సత్యనారాయణ ఆశ్చర్యంగా.

"ఔను."

"నువ్వేమనుకుంటున్నావు?"

"ఆయనకి కోపం వస్తుంది."

"ఆయనకి కోపం వస్తుందని బాధా? మొగుణ్ణి వదిలి వుండటం బాధా?" అంటూ, పెత్తల్లి కాంతమ్మ తుఫానులా గదిలో ప్రవేశించింది.

"మగడిదగ్గరకెళ్ళడం అపరాధమన్నట్లు మాట్లాడతారేమండి?"

"దసరాల పేరు చెప్పి ఇప్పటినుంచీ మఠం వెయ్యమంటావేమిటి? ఆనాటికి మళ్ళీ రావచ్చు"--అంది సుపర్ణ ఖండితంగా.

"అదే బాగుంటుందని నా అభిప్రాయం"

కాంతమ్మకు మరిది మీద మహా కోపం వచ్చింది. "సంసారం అంటూ చేసేవు గనక పిల్లలు పుట్టేరు. అంతకి తప్ప నీకు ప్రేమా, పేగూ

అంటూ వున్నాయా? వుంటే నువ్వే దానిచేత ప్రయాణం కట్టిస్తావా?" అంటూ వచ్చినంత దూకుడుగానూ వెళ్ళిపోయింది, కాంతమ్మ.

"వాళ్ళగొడవే వాళ్ళది. ఏమీ అర్థమయి చావదు"--అని విసుక్కున్నాడు, సత్యనారాయణ.

"మీరు కూడా అమ్మతో చెప్పండి."

వదినగారి మాట విన్నాక భార్య ధోరణి ఎలా వుంటుందో సత్యనారాయణ వూహించగలడు. ఆయన వ్యాపారానికి మూలధనం వాళ్ళ ఇద్దరి

ఆస్తీ. ప్రతి విషయంలోనూ, వారామాట మరిచిపోకుండా చూస్తుంటారు. వాళ్ళని ఏమాత్రం కాదన్నా అరికాలి కింద మంటలు పెట్టేస్తారు.

తెలుసును. కాని, కూతురుకు సాయం ఇవ్వాలి. ఆలోచించేడు.

"నేను వెడతాను." అంది, సుపర్ణ.

"నిలబడవలసింది నువ్వు."

ఆ మాటలో ఇదివరలో అతిముఖ్యమైన మరో విషయంలో నిలబడలేకపోయావన్న అర్ధం ధ్వనించి సుపర్ణ గమ్మునై పోయింది.

సత్యనారాయణ మాట మార్చేడు.

"పాప మాట వినబడదేం?"

"పడుకుంది."

"ఇప్పుడా? ఎటూ కాని వేళ."

"అల్లా సుశీలని చూసి వద్దామని వెళ్ళివచ్చేసరికి పడకేసేసింది."

"రామం వున్నాడా?"

"లేడు. ఏ హోటలులోనో భోంచేసి, ఏ పదింటికో ఇల్లు చేరుతాడట."

"వాళ్ళమ్మ లేదు కాబోలు."

"ఉహు."

ఒక నిముషం ఊరుకుని సుపర్ణే ప్రారంభించింది.

"ఎం తకాలం ఈలా అవస్థలు పడతాడు? సంబంధం కుదిరి అన్నీ నిశ్చయమయ్యాక కూడా ఈ నాన్పుడు ఎందుకు? ఆ పెళ్ళేదో

చేసుకోమనండి."

ఆమె ఆ ప్రసక్తి తేవడం సత్యనారాయణకు ఆశ్చర్యం అనిపించింది. సుపర్ణ ఒక దశలో రామారావును పెళ్ళి చేసుకోవలసింది. అది

ఆమె పట్టుదలే కూడా. ఆ రోజుల్లో రామారావు తమ యింట్లోనే వుండి, కాలేజీలో చదువుకుంటున్నాడు. యిద్దరిదీ ఒకే తరగతి, ఒకే

వయస్సు. వాళ్ళు పెళ్ళి చేసుకుంటామనడం తనకు ఇష్టమే. డబ్బులేక తన యింట వుండి చదువుకొంటున్నా సత్యనారాయణకు రామారావు

మీద వెర్రి మమకారం వుంది. కుర్రవాడు. తెలివి గలవాడు. మంచితనం వుంది. చూపరి. ఆరోగ్యవంతుడు. అవన్నీ చూసే, స్కూల్

ఫైనల్ తో చదువు మానెయ్యకుండా తీసుకొచ్చి యింట పెట్టుకున్నాడు. పైకి చదివించేడు. అతడు తనకు అల్లుడు కావడం అప్రతిష్ఠగా

తోచలేదు, సత్యనారాయణకి.

కాని భార్య మంగమ్మ, వదిన కాంతమ్మ, వారితోపాటు తన తల్లి పిచ్చమ్మ కూడా ఆ సంబంధాన్ని మెచ్చలేదు. రగడ

ప్రారంభమయింది. చివరకు ఆ యిల్లు వదిలేసి, చదువు పూర్తికాగానే రామారావు వుద్యోగం వెతుక్కున్నాడు. ఎం. ఏ. చదవడానికి

సాయం యిస్తానన్నా నిరాకరించేడు. సుపర్ణ తల్లినీ వాళ్ళనీ ఏమార్చడం కోసం పోయి యూనివర్సిటీలో చేరింది. అది పూర్తి చేసుకు

వచ్చి రామారావును పెళ్ళి చేసుకుందామనే ఆమె వుద్దేశ్యం.

కాని, రెండేళ్ళయేసరికి ఆమెకు యింకా ఆ ఆసక్తి మిగలలేదు. అక్కడే బి. యల్. చదువుతున్న యువకుడు పరిచయం అయ్యేడు.

అతడు ఐ. పి. యస్.కు సెలక్టు కావడం చేత యింట్లో వాళ్ళకి అభ్యంతరం కాలేదు. పెళ్ళయిపోయింది. అటు తర్వాత ఆమె ఏదో

తప్పు చేసినట్లు రామారావును తప్పించుకు తిరుగుతూంది.

ఆమెయే ఈవేళ రామారావు పెళ్ళి ప్రసక్తి తేవడం ఆశ్చర్యమనిపించింది.

"ఇప్పుడా మాట ఎందుకొచ్చింది?"

ఏమని చెప్పాలో సుపర్ణకి అర్ధం కాలేదు. చెల్లెలి మాట చెప్పడమా? కాని ప్రయోజనం ఏమిటి, గొడవ తప్ప? వద్దనుకుంది.

యింక ఏదో ఒకటి చెప్పాలి.

"అతని వుద్యోగం పోయిందట."

"రిట్రెంచిమెంటా?"

సుపర్ణ తల తిప్పింది.

"బాగా పని చేస్తాడనీ, పిల్లలు అతని యెడ అభిమానంగా వుంటారనీ నాలుగు రోజుల క్రితమే కాలేజీ కమిటీ ప్రెసిడెంటు అన్నారే."

"మన దేశంలో సమర్ధతా, మంచితనం ఉద్యోగార్హతలు కావు నాన్నగారూ!"

"నీకీమాట ఎవరు చెప్పేరు?"

"సుశీల."

"నిజమే అయివుంటుంది." అన్నాడు సాలోచనగా...."అభిమానపడి పై చదువు మానుకున్నాడు. లేకపోతే....సరిలే. ఈ ముండా కాలేజీ

వుద్యోగం లేకపోతే బతకలేడట. నోట్లో అక్షరమ్ముక్క వున్నవాడు. ఇది కాకపోతే మరొకటి."

సుపర్ణ ఏమీ అనలేదు. సత్యనారాయణకి అప్పుడు గుర్తుకు వచ్చింది.

"లంఖణాల్లో మనుగుడుపులన్నట్లు వుద్యోగం పోయి అతడుంటే ఇప్పుడు పెళ్ళి చేసుకోమనడం ఏమిటి?"

"ఆ అభ్యంతరం అందరికీ చెల్లవచ్చు. కాని అతని విషయం వేరు."

"ఏమిటో."

"ఈ బి.ఏ.తో అతనికి వుద్యోగం దొరకడం మాటలు కాదు. ఏదో దొరికినా ఆ వచ్చే డబ్బులతో, పెరుగుతున్న ధరలతో అతని

కడుపు నిండదు."

"చెప్తే విన్నాడు కాదు...."

"పోనీండి. అతనికి కొన్ని అభిమానాలున్నాయి."

కూతురు చెప్పదలచుకొన్నదేదో స్పష్టంగా చెప్పడం లేదనిపించింది.

"చేతిలో నాలుగు రాళ్ళుంటే పోయి చదువుకోమందాం. తక్కువైతే ఇద్దాం. అంతేగాని ఇప్పుడే పెళ్ళి తగులాటం పెట్టుకోమనడం ఏం సబబు?"

"డబ్బు మీరిస్తారు. ఇదివరకే చెప్పేరు. కాని, మనిషికి పట్టుదలా, అభిమానమూ, వాటినేం చేస్తారు? ఈ స్థితిలో అతని

చదువుకు పెళ్ళొక్కటే మార్గం."

"అతడు కట్నం తీసుకోనంటాడు కద!"

"అందుకే పెళ్ళి."

సత్యనారాయణకు అందులో వున్న మెలిక అర్థం కాలేదు. సుపర్ణే వివరించింది.

"అతనికి ప్రథానం అయిన అమ్మాయికి వాళ్ళ నాన్నగారు నాలుగెకరాలు యిచ్చేరన్నారు కాదూ?"

"ఊ. ఇస్తానన్నాడు."

అగ్నిగుండం · 第 2 / 7 段