Produced by Volunteers at Pustakam.net
అగ్నిగుండం
మహీధర రామమోహనరావు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
చంద్రం బిల్డింగ్స్, విజయవాడ-520004
ప్రచురణ సంఖ్య : 939
ప్రతుల సంఖ్య : 2000
ప్రథమ ముద్రణ : ఫిబ్రవరి, 1980
వెల : రూ. 8/-
ముద్రణ:
స్వతంత్ర ఆర్టు ప్రింటర్స్.
విజయవాడ-520004
పూజ్యమిత్రులు
శ్రీపాద లక్ష్మీనరసింహంగారి
స్మృతికి
జాగ్రత్త పడవలసిన ఘట్టం
ఒక పెద్ద పోలీసు అధికారి ఒక మేధావుల సభలో హైద్రాబాద్‌లో ప్రసంగిస్తూ ప్రజలలో హింసా ప్రవృత్తీ, దౌర్జన్య
దృక్పథం పెరిగి పోయిందన్నారు. పోలీసు బలగానికికూడా ఇదే వర్తిస్తుందని ఆయన చెప్పినా, ప్రజలలో ఆ ప్రవృత్తి తీవ్రం
కావడంచేతనే పోలీసులలోనూ దాన్ని ప్రతి క్రియారూపంలో చూస్తామనేది ఆయన వాదన సారాంశం.
ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ వర్గాలు, పాలక వర్గాలలో పెచ్చు పెరిగిపోతున్న అవినీతి, ప్రజా వ్యతిరేకత, హింసా
ప్రవృత్తికి ప్రతిక్రియగానే ప్రజలలో దౌర్జన్యకాండమీద మొగ్గుదల ప్రబలుతూంది. ఒక లారీనో బస్సునో తగలపెట్టేరన్నా,
ఒక పోలీసు స్టేషను మీద రాళ్ళు విసిరేరన్నా, ఒక ఆఫీసరునో, కళాశాలాధికారినో చెయ్యి చేసుకున్నారన్నా, ప్రత్యర్ధిని
ఒంటరిగా చిక్కించుకొని పొడిచేశారన్నా చివరికి నక్సలైట్ వుద్యమం చెలరేగిందన్నా ఇది సమాజంలో నోరుగలవాళ్ళూ, అధికారం
గలవాళ్ళూ నిర్భయంగా సాగిస్తున్న అన్యాయాలూ, దురంతాల ప్రతిక్రియగా వస్తున్నదేగాని వేరుకాదు. నా 'రధచక్రాలలో' ఒక
వాక్యం వుంది: "నిప్పు ముట్టించేవాళ్ళమూ మనమే, చెయ్యి కాలి ఏడ్చేవాళ్ళమూ మనమే"--నని. నిజానికి పాలకవర్గాలు
చేస్తున్నదదే.
ఈ నవలలోని ఘటనలన్నీ నేనే అనుభవించినవో, స్వయంగా చూసినవోనే. వానికి నవల రూపం ఇవ్వడంలో వెనక ముందులూ, కొన్ని
సర్దుబాట్లూ, తగు మాత్రపు సాగదీయడాలూ వున్నా ఇవన్నీ జరిగినవే. అయితే అవి జరిగినవి 12-13 ఏళ్ళ క్రితం.
ఈనాడవి మరింత తీవ్రరూపం ధరిస్తున్నాయి. ఇటీవలి డాక్టర్లు, లెక్చరర్లు, బ్యాంకు ఉద్యోగులు మొదలయిన వారి సమ్మెలు
ప్రభుత్వ, పాలక వర్గాలలో పెచ్చు పెరిగిపోతున్న హింసా ప్రవృత్తికి ప్రతిక్రియా రూపమేగాని వేరుకాదు. సాధ్యమైనంతవరకు
ఒరగ దోసుకుపోయే స్వభావంగల మధ్యతరగతులలోకి కూడా ఈ ఆత్మరక్షణ భావం బలపడిందంటే సామాజిక పరిస్థితులు ఎంత
క్షీణిస్తున్నాయో అర్థం చేసుకోగలం.
తెలుగు దేశం నాకో అగ్నిగుండంగా కనిపించింది. ఈవేళ ఆ స్థితి మరింత క్షీణించింది. హింసా, అన్యాయాలను ప్రభుత్వం తన విధానంగా
మార్చుకొంది.
ఇదో జాగ్రత్త పడవలసిన ఘట్టం.
మహీధర రామమోహనరావు
1-2-1980
అమీర్‌పేట
ఒక మాట
1967 జూన్‌లో ప్రభుత్వపు రిట్రెంచిమెంటు పథకంతో తెనుగు దేశం అట్టుడికి నట్లున్నప్పుడు మిత్రులు కొసరాజు
శేషయ్యగారూ నేనూ ఆనాటి పరిస్థితిని యితివృత్తంగా తీసుకొని నవలలు వ్రాయాలనుకున్నాం.
ఆ రోజు మొదలుకొని ఒకటి రెండు నెలలు నేను చూసినవి, వింటున్నవి, అనుభవిస్తున్నవి, చదువుతున్నవి కాగితం మీద పెట్టేను.
అలవాటు పడిపోవడంచేత మనకు కనిపించని భయానకమైన సామాజిక విశీర్ణత-గతి వానిలో కనిపించింది.
ఆ ఘటనలకు ఒక కథా రూపం కల్పించి ఆనాడే కాగితం మీద పెట్టేను. కాని, ఆ కథకు ముగింపు ఎలాగో అర్థం కాలేదు. వానిని
కట్టగట్టి పెట్టెలో పడేశా.
రెండేళ్ళ అనంతరం శ్రీకాకుళం, ఖమ్మం, వరంగల్లు జిల్లాలలో నక్సలైట్ పోరాటాలు, విద్యావంతులలో వ్యాపిస్తున్న నిహిలిస్టు
ధోరణులు, ప్రభుత్వ వర్గాల నిర్లక్ష్యం, ప్రజా వ్యతిరేక ధోరణులు, రాజకీయ పార్టీల విచ్ఛిన్న స్థితి, నిస్తబ్ధస్థితి
నుంచి బయటపడటానికి కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న కృషి చూసేక, నా నవలకు ముగింపు అర్థం అయిందనిపించింది.
ఒకటి రెండు మార్పులూ, చేర్పులూ, చివరన రెండు మూడు ప్రకరణాల జోడింపుతో నవల పూర్తి అయింది.
అదే 'అగ్నిగుండం' అదో అగ్నిగుండం. మీ ముందుంది.
-రచయిత
24-12-71
మద్రాసు
ఒకటో ప్రకరణం
ఆంధ్రప్రభుత్వం తలపెట్టిన పొదుపు ప్రయత్నం ఊళ్ళంపట ఊరేగింపులు సాగిస్తున్న మంత్రుల ప్రయాణపు ఖర్చుల్ని గాక, తన
బతుకు తెరువుకు ఏకైకాధారంగా వున్న ఆ రెండు వందల యాభై రూపాయల నెల జీతాన్నీ సమూలంగా కోసేస్తున్నదని తెలిసేవరకు రామారావు
నిర్విణ్ణుడే అయాడు.
"ఇప్పటికే కొన్ని సబ్జక్ట్సుకి లెక్చరర్లు లేరు. ఉన్నవాళ్ళు చాలక కొన్ని క్లాసులు జరగడం లేదు. ఇంకా వున్నవాళ్ళని
తగ్గించడం వలన చదువులు మరింత చెడతాయి...."
"వెరీ....వెరీ సారీ. నేను చెయ్యగల దేమీలేదు."--అని ప్రిన్సిపాలు మరోమారు ఇంగ్లీషులో తన బాధా, తెలుగులో తన
అసమర్థతా కనబరిచేడు.
"మనది అసలే దరిద్రదేశం. ప్రక్కనున్న రాష్ట్రంతో పోలుస్తే మనకి చదువూ తక్కువే. అటువంటప్పుడు ఉన్నవాళ్ళచేత
పకడ్బందీగా పని చేయించుకొని దేశాన్ని సుందరంగా, సౌభాగ్యవంతంగా...."
స్వాతంత్ర్యదినోత్సవపు ఉపన్యాసధోరణిలో పడిపోతున్నాననిపించి రామారావు మాట మధ్యలోనే ఆగిపోయేడు.
"డబ్బు లేనప్పుడు ప్రభుత్వం మాత్రం చెయ్యగలదేముంది? ప్రభుత్వమే చెయ్యి వెతకవేస్తే కాలేజీ కమిటీ ఏంచేస్తుంది?"--అంటూ
ప్రిన్సిపాలు టీచర్లను తగ్గించవలసి రావడాన్ని సమర్ధించడానికి ప్రయత్నించేడు. కాని, ఆయన కంఠస్వరంలో ఆ విశ్వాసం
వినబడలేదు.
"కమిటీ చెయ్యగల దేమీ లేదా?"
ప్రిన్సిపాల్ ఎటోచూస్తూ సమాధానం ఇవ్వలేదు. తన ప్రశ్నకు తానే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాడు, రామారావు.
"ఇప్పటికే కాలేజీలో టీచింగ్ స్టాఫ్ కన్నా నాన్‌టీచింగ్ స్టాఫ్ ఎక్కువగా వుంది."
ప్రిన్సిపాల్ నిట్టూర్పు విడిచాడు.
"పనులు అల్లావున్నాయి...."
"ప్రిన్సిపాల్ గారూ! ప్రమాదం వచ్సినప్పుడేనా మొగమాటాలూ, భయాలూ వదలిపెట్టాలి. కాలేజీ నిర్వాహణ ఖర్చులో 80 శాతాన్ని
యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషను భరిస్తున్నప్పుడు టీచింగ్ స్టాఫ్ ని గట్టిపరుచుకోవాలి. కాని, మన కాలేజీ కమిటీ...."
"మన దనేదేమిటి? అన్నిచోట్లా జరుగుతున్న పనే ఇక్కడా చేశారు."--అని ప్రిన్సిపాల్ యథాశక్తి కాలేజీ పాలకకమిటీ
అపరాధాన్ని తగ్గించేందుకు ప్రయత్నించేడు.
"అందరూచేస్తే దేశద్రోహం ఘరానాపని అవుతుందా సార్! కమిటీ సభ్యులు పోటాపోటీగా తమ అనుచరుల్నీ, బంధువుల్నీ, వారి
సిఫారుసుల్నీ తీసుకొని, పని లేకపోయినా గుమాస్తాలుగా, అట్టెండర్లుగా, వేసేస్తూంటే పట్టనట్లు వూరుకున్నాం. ఈవేళ...."
"వాళ్ళని తరిమెయ్య మంటావు...." అన్నాడు ప్రిన్సిపాల్ అతని వాదం సమర్థనీయం కాదన్నట్లు.
"కాలేజీలు చదువుకోసమా, కాక సెక్రటరీగారి తమ్ముడు మామగారి మేనల్లుడికి అట్టెండరు వుద్యోగం ఏర్పాటు కోసమా--అన్నదానిని
పట్టి వుంటుంది."
ప్రిన్సిపాల్ నిరుత్తరుడయ్యేడు. ఒక్క క్షణం వూరుకొని--"నా చేతుల్లో ఏమీలేదు, రామారావూ నా చేతుల్లో ఏమీలేదు అన్నాడు."
ఆయన బాధ ఎరిగిన రామారావు నిరుత్తరుడయ్యాడు. నిరుడు ఒక ఇంగ్లీషు లెక్చరరు అనవసరంగా ఒక విద్యార్థిని అవమానించేడు.
కాలేజీ పిల్లలంతా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండుచేస్తూ సమ్మె చేశారు. ఆ లెక్చరరుకు కమిటీలో వెనకదన్ను వుంది. చాలా
గొడవ జరిగింది. తెలివైన ఇద్దరు విద్యార్థులకు టి. సి. లిచ్చి పంపెయ్యవలసి వచ్చింది. ఆ లెక్చరరు ఇక్కడే వుండి రోజూ
ఏవేవో సమస్యలు తెచ్చి పెడుతూనే వున్నాడు. ప్రిన్సిపాల్ ఏమీ చెయ్యలేక పోతున్నాడు. అదే ఒక్కమాటలో చెప్పేడు.
"నా చేతుల్లో పనా? నీ వెర్రిగాని...."
"కాలేజీ కమిటీని కలుసుకోమంటారా?"
ఆ అమాయకత్వానికి జాలి పడుతున్నట్లు ప్రిన్సిపాల్ ముఖం పెట్టేడు. అదేం లాభంలేదని ఆయన ఎరుగును. కనక ఉపశమన
వాక్యాలతో సంతృప్తి పరచ దలిచేడు.
"కలుసుకోడంలో తప్పేమీ లేదు. కాని, వాళ్ళూ ఏం చెయ్యలేరు. అనవసరం. ఈ పాడు వుద్యోగం లేకపోతే బతకలేక పోతావట.
గోల్డ్ మెడలిస్టువి. తెలివి ఉంది. చొరవ ఉంది. కుర్రవాడివి, బోలెడు జీవితం ముందున్న వాడివి...."
"అన్నీ వున్నాయికాని అంచుకు తొగరే లేద"ను కున్నాడు రామారావు. పైకిమాత్రం అవహేళనను మిళితం చేసి, తన బాధ తెలిపేడు.
"అదేనండి దుఃఖం. ఇంత బతుకు గడవాలే ఎల్లాగరా యనే...."
"ఠట్, ఠట్." కోప్పడుతున్నట్లు ధ్వనించేడు ప్రిన్సిపాలు.
రామారావు మరింత ఉక్రోషం కనబరిచేడు.
"యయాతి వంటి వాడెవరన్నా దొరికితే బాగుండును. ఓ ఏడాది బతికే దారి చూపుతే జీవితం అంతా ఇచ్చేద్దును."
ప్రిన్సిపాల్ కళ్ళలో హాసరేఖలు తోచేయి.
"మేథమెటిక్సు వాడివి. ఆర్టిలరీలోకి నీవంటివాళ్ళ అవసరం వుంటుంది. యయాతి ఆధునికావతారమే దేశభక్తి. పోయి సైన్యాలలో
రిక్రూట్ కారాదూ?"
రామారావు తెల్లబోయేడు. ప్రిన్సిపాల్ లేచివచ్చి అతని భుజం తట్టేడు.
"ఒక్క చిన్న దెబ్బకే జీవితం అంతా కొల్లబోయినట్లే బాధ పడితే ఎల్లాగయ్యా! జీవితం అంటే ఏమిటనుకొన్నావు? జీవించేందుకు
నిరంతరం సాగించే ఘర్షణే జీవితం అంటే."
"ఇది చిన్న దెబ్బా? ప్రిన్సిపాల్ గారూ! రామారావు బతుకు దృష్ట్యా చూసినా ఇది చిన్న దెబ్బేం కాదు. దేశం దృష్ట్యా చూసినా
కాదు. ఈవేళ వుద్యోగంనుంచి తీసేస్తున్నది నన్నొక్కడినే అనుకోను."
"కాదు...."
"రిట్రెంచిమెంటు ఆలోచనను ఎన్నికలకోసం వెనక్కి పెట్టేరు. ఏరు దాటడం అయిపోయింది. కనక తెప్పలకి ఇప్పుడు నిప్పు
ముట్టిస్తున్నారు. దేశంలో చదువు కనీస ప్రమాణానికి కూడా చేరలేదు. పరిశ్రమలు లేవు. ప్రాజెక్టులు లేవు. హాస్పిటళ్ళు లేవు.
పదివేలమందికో డాక్టరన్నా లేడు. ఉన్నవాళ్ళని కూడా మాకొద్దు పొమ్మంటున్నారు. దేశం ఏమవాలి? దేశంలోని జనం ఏమవాలి?
ఇరవయ్యేళ్ళ స్వాతంత్ర్యం దేశానికీ, మనకీ, తెచ్చిందీ, ఇచ్చిందీ ఈ దుఃఖమూ, ఈ నిర్వేదమూ మాత్రమేనా? దీనినేనా మీరు
చిన్నదెబ్బ అనేది?"
ఆ ఆవేశం చూసి ప్రిన్సిపాల్ తెల్లబోయేడు. ఏం చెప్పడానికీ తోచలేదు. టేబిలుమీది కాగితాలు సర్ది, పేపర్ వెయిట్ లు మార్చడం
మొదలు పెట్టేడు.
రామారావు ఒక్క నిముషం ఆగి, తన అభిప్రాయం స్పష్టం చేసేడు.
"మనుష్యుల్ని తోసెయ్యగల వాళ్ళకి దేశం కాబట్టదు. దేశాన్ని గౌరవించలేనివాడు మనుష్యుల్నీ మన్నించలేడు."
ప్రిన్సిపాల్ పరధ్యాన్నంగానే అనేసేడు--"అంతేలే, అంతేలే...."
"సెలవిప్పించండి."
"వెళ్ళిరా. ఆందోళన పడకు, అన్నీ సర్దుకొంటాయి."
ప్రిన్సిపాల్ అనునయం, ఓదార్పు అతని చెవి చొరడంలేదు. దేశభక్తి గురించి ఆయన చేసిన వ్యాఖ్య మనస్సులో మెరుగుతూంది.
వెనక్కి తిరిగిన వాడే మళ్ళీ ఆగేడు.
"దేశభక్తిని అంత చులకనగా తీసుకోలేనండి. దేశ రక్షణ కోసం ఆయుధాలు తీసుకోడం, సైన్యాలతో చేరడం తప్పు కాదు. కాని,
కిరాయి కోసం, తిండిలేక సైన్యంతో చేరవలసిన స్థితి మనిషికీ, దేశానికీ కూడ ఆరోగ్యం కాదు."
ప్రిన్సిపాల్ తెల్లబోయేడు. కనుబొమ్మలు ముడిచేడు. అంతలో నవ్వేడు.
"ఇదిగో, చూడు. నా వయస్సేమిటి? సూపర్ ఆన్యుయేషన్ కూడా ముగుస్తూంది. ఇంకో నాలుగు నెలలు, ఈ వయస్సువాడి నుంచి ఆక్రోశం,
అనుతాపం తప్ప ఆశించి లాభం లేదు."
ఈ మారు తెల్లబోవడంవంతు రామారావుది. పడుచువాళ్ళు ఆక్రోశపడీ, ఆవేశపడీ లాభంలేదని చెప్తున్నాడా అనిపించింది. వయస్సులో
వున్నావు. అమీ, తుమీ తేల్చుకో. దేశం అంటే వున్న అభిమానాన్ని క్రియతో చూపమనడమా, ఆ మాటకు అర్థం?
అంతలో సర్దుకొన్నాడు. ఆ దూరాన్వయమూ, కవ్వింపు ఆలోచనా ఆయనకు వుండవనిపించింది. అంతలో ఆయనే అన్నాడు.
"ధైర్యంగా వుండు. నే చెప్పగలదంతే. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకొని వస్తూండు. సబార్డినేట్ ననే సంకోచం కూడా ఇంక
అక్కర్లేదు."
"చిత్తం. సెలవు."
రెండో ప్రకరణం
"ఏమిటిహ."
--అన్నాడు, వెనకనుంచి హడావిడిగా వచ్చి, కాలేజీ గేటులో అందుకున్న సహభాగి రామలింగేశ్వరరావు. పరధ్యానంగా, ఏదో
ఆలోచించుకుంటూ పోతున్న రామారావు వెనక్కి తిరిగేడు.
"నువ్వా."
"ఇంక పనేముంది మరి."
అంత మానసిక వ్యధలోకూడ అతనిని చూడగానే కలిగిన తేలిక భావాన్ని రామారావు దాచుకోలేక పోయేడు. ఆ రోజున తనతోపాటు
ఉద్యోగంనుంచి తీసివేయబడిన వారిలో అతనూ వున్నాడని తెలుసు. అయినా, అడిగేడు.
"ఏం? నీకూనా?"
రామలింగేశ్వరరావు ముందు తలాడించేడు. అంతలో ఆ మాటలో ఏదో హేళన భావం ధ్వనించినట్లు తోచింది.
"నీకూనా, అంటే?"
"ఎన్నికల్లో అంత చాకిరీ చేసేవు. నెగ్గించేవు. విజయోత్సవంతో బొంగురుపోయిన గొంతుక స్వాధీనం కావడానికి పదిరోజులు పట్టింది.
అంతల్లా నినాదాలు ఇచ్చేవు. ఆయనమీద అన్ని ఆశలు పెట్టుకున్నావే--అని."
రామలింగేశ్వరరావుకి కోపం బదులు విచారం కలిగింది.
"వారం క్రితంకూడా అదే అన్నాడోయి--మనమాట మాటే. నీ వుద్యోగానికి ఏం ఢోకాలేదు. వెళ్లిరా--అన్నాడు. చివరకి ముంచేసేడు."
"ఆయన మాటల్లో తఖావతు ఏమీలేదు. నిజమే చెప్పేడు. ఆ వుద్యోగానికి ఢోకా ఏం వుంది? అదల్లాగే వుంటుంది. వాళ్ళవాడెవడో
వచ్చేదాకా వుంటుంది. మధ్యన పొయ్యేది నువ్వు...."
"అంతేనంటావా?"
"చూస్తాంగా." అన్నాడు, రామారావు తేలికగా. కాని, రామలింగేశ్వరరావు అంత తేలికగా తీసుకోలేకపోయేడు.
"నీకేం బ్రహ్మచారిగాడివి, ఒంటరిగాడివి. ఏ ట్యూషన్లు చెప్పుకున్నా నీ పొట్ట నిండుతుంది. నేనేం చేసేది? పెళ్ళాం, ఓ పిల్లవాడూ
నాకు తోడు. వాళ్లనేం చెయ్యను?"
"బ్రహ్మచారిగాడివి నీకేం--" అన్నమాటకు రామారావుకు నవ్వొచ్చింది. "రేపెల్లాగరా" అని తాను బాధ పడుతున్నాడు.
అతని నవ్వు చూస్తే రామలింగేశ్వరరావుకి అభిమానం అనిపించింది.
"ఈ లం....జా....కొడుకుల్ని వురితీసినా పాపం లేదు."
"ఎన్నుకొని పంపింది, వురితియ్యడానికా, పాపం!"--రామారావు కృత్రిమమైన జాలి నభినయించేడు.
"నేను దేశానికి నిజంగా ద్రోహం చేసేననే అనిపిస్తూంది."
రామారావు అతని ముఖంవంక చూసేడే తప్ప ఏమీ అనలేదు.
"ఏమంటావు?"
"రిట్రెంచిమెంటు ఆలోచనలు జరుగుతున్నాయని ఎన్నికలకు ముందే అందరూ ఎరుగుదురు. ఎన్నికలైన మర్నాడే ఖజానా ఖాళీ అయిపోయిందని
తెలుసుకొన్నారనుకోకు."
"ఊ."
"నీ కానాడు అనిపించలేదు."
"వాళ్ళ మాటలు నమ్మేను."
"నీ దాకా వచ్చి వుండకపోతే ఇప్పుడూ ఆ నమ్మకం చెదిరి వుండేది కాదు."
ఆ ఆరోపణలో నిజం లేకపోలేదని రామలింగేశ్వరరావు ఎరుగును. ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా ఇద్దరూ ఒకరి ప్రక్కనొకరు
నడుస్తూ బస్సు స్టాపువేపు వెడుతున్నారు.
కొంతదూరం వెళ్ళేక రామారావే అన్నాడు.
"ఈ రావులూ, రెడ్లూ నిజాయితీ లేనివాళ్ళు అనను. అయితే వాళ్ళ మినహాయింపులూ, పరిధులూ, పరిమితులూ వేరు."
రామలింగేశ్వరరావు తెల్లబోయేడు.
"వాళ్ళు తను ఎన్నికల వాగ్దానాలను నెరవేరుస్తున్నారనే అంటావేమిటి, కొంపతీసి."
"చిన్న పిల్లాడల్లే మాట్లాడకు"--అని రామారావు గదిమేడు--"ఒక మనిషేమిటి? పార్టీయే అనే దేమిటి? వాళ్ళ నిజాయితీ
తెలుసుకోడానికీ, కొలవడానికీ మాటలు కాదు, చూడవలసింది. చేతలూ వాటి ఫలితాలూను."
"ఔను." అన్నాడు రామలింగేశ్వరరావు. కాని, ఆ మాటలో విశ్వాసం వినిపించలేదు.
"ఏమిటి నీ సందేహం?"
"కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన ఈ ఇరవయ్యేళ్ళ తరవాత దేశం 1947లో వున్నట్లుగానే లేదు."
"ఉందని ఎవరన్నారు?"
"చదువులు....పరిశ్రమలు....ప్రాజెక్టులు....దేశం మొత్తం మీద చూడు."
"ఔను."
"అందుచేతనే మోసపోయాను. వానిని చూపించే మోసపుచ్చేరు."
రామారావు నవ్వేడు.
"ఇంకా అల్లాగే మోసపోతుండడానికి ఇప్పుడు వచ్చిన అభ్యంతరం ఏమిటి?"
తనదాకా వచ్చిందనే తప్ప, రామలింగేశ్వరరావుకి మరో కారణం కనబడలేదు. అయితే ఆ మాట ఒప్పుకోలేదు. తప్పించుకున్నాడు.
"నువ్వే చెప్పు"
రామారావు చెప్పేడు. దేశం మొత్తం మీద పెట్టుబడిదారీ – ధనిక భూస్వామ్య వ్యవస్థను ఏర్పరచేందుకు ప్రభుత్వం చేస్తున్న
పనులన్నీ ఎల్లా తోడ్పడుతున్నాయో చెప్పేడు.
"కనకనే పెట్టుబడిదారీ విధానంతో పాటుగా దాని వెనువెంబడి వుండే పీడలన్నీ మనకూ అనుభూతం అవుతున్నాయి."
రామలింగేశ్వరరావు నవ్వేడు.
"ఎలక్షన్ వుపన్యాసం యిచ్చేవు."
రామారావుకు అభిమానం అనిపించింది. తన మాటల్ని అంత తేలిగ్గా తోసెయ్యడమా?
"ఉత్పత్తి ఒక మూల పెరిగింది. రెండో మూల ధరలూ పెరిగేయి. నిజానికవి తగ్గాలి, కాని, అలా జరగడంలేదు."
ఆలోచనకు వ్యవధినిస్తూ, రామారావు ఒక్క క్షణం ఆగేడు. కాని, రామలింగేశ్వరరావు ఆలోచనకు నిరాకరించేడు.
"నేను ఎకనమిక్స్ వాడిని కాదు."
"అక్కర్లేదు. పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలకే అది ముడిపడ్డం లేదులే."
"మరి?"
"ఉత్పత్తికీ, పంపిణీకీ సంబంధం లేదు. ఎవరి వాయిద్యాలు వారివి. తీర్ధానికి తీర్ధం, ప్రసాదానికి ప్రసాదంగా వున్న ఈ
పరిస్థితి మారాలి."
"అంటే కమ్యూనిజం రావాలి." అన్నాడు. రామలింగేశ్వరరావు ఎకసక్కెంగా.
రామారావు నవ్వేడు.
"పేర్లమీద అంత ఎలర్జీ పెంచుకోకూడదు. అది అట్టే ఆరోగ్యకరమయిన లక్షణం కాదు. పోనీ సోషలిజం పేరు నచ్చితే అల్లాగే
పోనిద్దాం."
"ఆ మాట కాంగ్రెసే అంటూంది కదా."
"ఇంకనేం. దాని ఫలితాల గురించి విచారం ఎందుకు?"
"దాని అర్ధం ఒక్కటే. సోషలిజం సంఘంలోని బాధలకు విరుగుడు కాదు."
"సోషలిజం అనే మాటను గబ్బు పట్టించడమే కాంగ్రెసు వారి వ్యూహమనీ, అంతవరకూ ప్రజలలో సోషలిజం యెడవున్న అభిమానాన్ని
ఎక్స్‌ప్లాయిట్ చెయ్యడం దాని ఎత్తుగడ అనీ అంటే ఓ మాటు నా మీద పడిపోయావు గుర్తుందా?"
రామలింగేశ్వరరావు వూరుకున్నాడు.
"ఇప్పుడేమంటావు?"
"నీ అభిప్రాయం తప్పంటా."
"అన్నీ తెలిసి ఆత్మహత్య చేసుకోదలిచినవాడిని ఆపడం కష్టం. అసంభవం."
"దొంగ వర్తకుల్ని ఉరి తియ్యాలని నెహ్రూ అన్నట్లు మీరు తరుచు జ్ఞాపకం చేస్తుంటారు, సరిగ్గా అదే మందు. వాగ్దానాలను
అమలు జరపని వాళ్ళని ఓ అరడజను మందిని ఉరితీసేస్తే సంఘంలో సమస్యలన్నీ సర్దుకుపోతాయి." అంటూ రామలింగేశ్వరరావు
సగర్వంగా చూసేడు.
రామారావు నవ్వేడు.
"మందు మంచిదే. ఎక్కడి నుంచి ప్రారంభిస్తావు? ఎప్పుడు మొదలెడతావు?"
మూడో ప్రకరణం
ఎటూ కానివేళ కాలేజీ నుంచి తిరిగి వస్తున్న వాళ్ళిద్దర్నీ చూసి కిళ్లీ బడ్డి రత్తమ్మ చిరునవ్వుతో పలకరించింది.
"ఏం బాబులూ! అప్పిడే ఎలిపోతుండారు. ఎండగావుంది. దయి సేయిండి. ఓ సోడా తాగి పోదురుగాని...."
వారి సమాధానం కోసం ఎదురు చూడకుండానే రత్తమ్మ కిందనున్న నీళ్ళ తొట్టెలోంచి రెండు సోడాకాయలు తీసింది. రెండు గ్లాసులు తొలిచి
సిద్ధం చేసింది. నిమ్మ చెక్కలు తీస్తూంది. రెండో వేపున మాటలు చెప్పుకు పోతూంది.
"రామారావు బాబూ! మావోడికి ఎక్కడన్నా కుసింత పని సూపించలేవా బాబూ! వూరకే తిరిగి సెడిపోతున్నాడు. ఏదన్నా పనిలో వుంటే
నన్ను డబ్బులకి పీక్కు తినడవేనా తగ్గుతుంది. నువ్వెరగవేంటి? ఈ కొట్టు మీదున్నదే గంద నా ఆస్తి. పెద్దదాన్నయిపోనా. నే
తిన్నా, ఆడికెట్టినా దీని మీదే గంద. రోజూ పై కరుసుకి కూడా "తేముండా" అంటే ఎక్కడ సచ్చేది బాబూ!"
ఆమె అభ్యర్ధన విని రామలింగేశ్వరరావు మందహాసం చేసేడు.
"అడుగుతూ, అడుగుతూ మంచివాళ్ళనడిగేవు, మామ్మా!"
రత్తమ్మ చాల నొచ్చుకుంది.
"సదువుకున్నోళ్ళు, మీరే అల్లాగంటే."
"రేపు ఈ కాలేజీ వేపు రావలసిన పని మాకే లేదు. ఈ క్షణం నుంచి మేమూ నీ మనమడూ...."
రత్తమ్మకి ఆ మాట అర్ధం కాలేదు.
"టురాన్స్‌పర్ గీనా? ఎక్కడికి? ఏ వూరెల్తుండారు?"
"ఎక్కడకుంది?--ఇంటికే."
"రత్తమ్మ తెల్లబోయింది. అసలు విషయం చెప్పకుండా అల్లా నలిపి చంపడం రామారావుకి నచ్చలేదు.
"మమ్మల్ని వుద్యోగాలనుంచి తీసేశారు. డబ్బివ్వలేం. పొమ్మన్నారు."
"డబ్బుల్లేవూ?"
"వాళ్ళన్నారు. ఇచ్చీది వాళ్ళు కదా." అన్నాడు రామలింగేశ్వరరావు.
"ఉట్టిది బాబూ! దొంగ నాయాళ్ళు కితం వోరమే గందా, కర్రిపద్దాలు కొడుక్కి కాలేజీలో బంట్రోతు పనేసిండ్రు. అల్లాగే మావోడికీ
ఇత్తారేమోననుకుంటే మిమ్మల్ని తీసేశారూ."
"మళ్ళీ కనిపిస్తుంటాంలే మామ్మా. ఇక మీద తీరుబడేగా." అంటూ రామారావు ముందడుగేసేడు. ఓ నిముషం అక్కడ నిలబడదామనీ,
కిళ్ళీబడ్డీ రత్తమ్మ సానుభూతి వాక్యాలు వినాలనీ వున్నా, మిత్రుడు నడుస్తుండడం చేత రామలింగేశ్వరరావూ కదలవలసి వచ్చింది.
"ఎల్లి రాండి బాబూ! నోట్లో ముక్కున్నోళ్ళు. ఇంత దేశంలో బతకనేక పోతారంట." అంటూ రత్తమ్మ ధైర్యం చెప్తూంటే "అంతేలే,
అంతేలే" అని సాచేసేరు.
పత్రికల్లో నిరుద్యోగం గురించి వస్తున్న వార్తలకు సాక్ష్యంగా రత్తమ్మ పక్క కొట్లవాళ్ళకి తమరిద్దరినీ చూపి చెప్పడం
వెనుకనుంచి వినిపిస్తూంటే ఆ ఇద్దరూ ఆమెను గురించే ఆలోచిస్తున్నారు.
ఆమెలాగ కిళ్ళీ కొట్టేనా పెట్టుకుని బతకగలమా అని రామారావు ఆలోచన.
రామలింగేశ్వరరావు ఆలోచనలో కొంచెం తేడా వుంది.
"ఈ ముండకి మనమడుగా పుట్టినా సుఖపడుదుం. ఈ ముండా వుద్యోగాలు వుండడం, పోవడం ఏడుపు లేకుండా వున్నన్ని రోజులూ
జల్సాగా...."
"మళ్ళీ మనమడుగా ఎందుకు? ఆ ముండగా పుడితే మంచి మనస్సేనా వుంటుంది కదా." అంటూ, రామారావు మిత్రుని ఆలోచనకు చికాకు
పడ్డాడు.
"మనస్సు మంచిదైతే అన్నం వుంటుందంటావా? లేదు సోదరా! కాదు, వట్టి భ్రమ. ఎంతమంది నెత్తిన చెయ్యి పెట్టగలుగుతే అంత
అన్నం ఇది ఈ ప్రపంచ సూత్రం. సిద్ధాంతాలనేవి వట్టి హంబగ్."--రామలింగేశ్వరరావు మాటమీద మాటగా ఆవేశంతో
అరిచేస్తున్నాడు.
రామారావుకి ఆశ్చర్యం కలిగింది.
"ఏమిటీ వుప్పెన."
తాము నడిరోడ్డు మీద వున్నామనీ, ఆ అరుపుల అవసరం ఏమీ లేదనీ, అప్పుడే దారినపోతున్న వారొకరిద్దరు నిలబడిపోయి,
ఆశ్చర్యంగా తమరిని చూస్తున్నారనీ గమనించి రామలింగేశ్వరరావు గమ్మునైపోయాడు.
అంతలో బస్సు రావడంతో ఇద్దరూ కంగారు కంగారుగా దానిలో ఎక్కేసేరు.
నాలుగో ప్రకరణం
ఏలూరు రోడ్డు సెంటరులో బస్సు దిగుతూనే రామారావు ఎదురుగా వున్న హోటలు కేసి దారి తీసేడు.
"రా. ఓ అర కప్పు కాఫీ తాగితే, ఓపిగ్గా దుఃఖ పడొచ్చు."
అతడు దారి తీసిన హోటల్లో ప్రవేశించడం రామలింగేశ్వరరావుకి ఇష్టం లేదు.
"ఆనాడు ధరలు పెంచేసి గంద్రగోళం తెచ్చిన ప్రబుద్ధులలో వీడొకడు. ఈ వేళ మళ్ళీ పాల వాళ్ళతో పేచీలు తెచ్చేడని తెలిసింది.
వీళ్ళని అభిమానించడం ద్రోహం."
"అమ్మన్న అమ్మకి మొగుడు. విస్సన్న తల్లికి మొగుడూను. ఇందులో తక్కువ తిన్నవాడెవడూ కాదు. సరే నడు. నీ మాటెందుకు
కాదనాలి."
ఇద్దరూ హోటలులో అడుగుపెట్టేరు. లోపల మబ్బు మబ్బుగా వుంది. గోలగా వుంది. సెర్వరొకడు ఖాళీగా ఉన్న టేబులు చూపేడు.
టేబిలు మీద పరచిన మొజాయిక్ స్లాబు బీటలువారీ, పెచ్చులూడీ వుంది. అంతక్రితం తినిపోయినవారి ఎంగిలిపాత్రల స్థానాల్ని గుర్తు
చేస్తున్నట్లు ఈగలు పోగులు పోగులుగా ముసిరి పచార్లు చేస్తున్నాయి. వచ్చే పోయే వారితో హోటలు బిలబిలలాడుతూంది. చిత చిత,
నీళ్ళు, ఎంగిలి పళ్ళేలు, సెర్వర్ల వెర్రికేకలతో ఆ ప్రదేశం ఎప్పుడూ తోచనంత అసహ్యంగా వుంది.
వారు సెర్వరు చూపిన టేబిలు వద్దకు వెళ్ళడానికి సందేహిస్తూ, శుభ్రంగావున్న మరో చోటు కోసం చూస్తూండడం కౌంటరులో వున్న
యజమాని పద్మనాభయ్య గమనించేడు.
"ఒక్క క్షణం ఆగండం"టూ లేచి వచ్చేడు. ఓ కుర్రవాడిని పిలిచి, దగ్గరుండి టేబులు శుభ్రం చేయించేడు.
"ఇల్లా దయ చెయ్యండి."
వారిద్దరినీ కూర్చోబెట్టేక, సెర్వర్ని కోప్పడ్డాడు.
"మనుష్యుల్ని చూసుకోవద్దూ. ఏం కావాలో జాగ్రత్తగా ఇయ్యి." అని పురమాయించి వెళ్ళి తన స్థానం అలంకరించేడు.
పద్మనాభయ్య వెనక తిరిగేక సెర్వరు అతడిని తినేసేలా చూసేడు. కాని, ఏమీ అనలేదు. లోపలి కెళ్ళి రెండు గ్లాసుల నీళ్ళు
తెచ్చి బల్ల మీద టప్పున పెట్టేడు. అతని వేళ్ళనున్న జిడ్డు సంక్రమించిందో, గ్లాసులనే జిడ్డు వుందో, అసలు నీళ్ళే
మురికివో గ్లాసులోని నీటిమీద జిడ్డు పొర మిలమిల లాడుతూంది. ఇద్దరూ ఆ నీరు ముట్టుకోలేక పోయేరు.
"ఒక కాఫీ, ఒక టీ."
సెర్వరు వెళ్ళిపోయేడు.
"నీ అభిమానాలూ, అహంకారాలూ చాలా ఎలిమెంటల్ సుమా."
ఆ వ్యాఖ్య ఏమిటో, ఎందుకో అర్ధంగాక రామలింగేశ్వరరావు తెల్లబోయేడు.
"హోటలు రేట్లు మొదట పెంచినది ఇతడు కాదనేదొక్కటే నీకు తృప్తి. కాని, ఈ హోటలు వున్న తీరు నీ బుర్రకి
తట్టలేదు...."
మరుక్షణంలో సెర్వరు రెండు గ్లాసులలో పొగలు చిమ్ముతున్న ద్రవపదార్ధాన్ని వారిముందు పెట్టేడు. ఒక గ్లాసులోది వొడుపుగా బార
ఎత్తునుంచి, ఒక్క చుక్క చిందకుండా, ధారగా చల్లారబోసి రామలింగేశ్వరరావు ముందుంచేడు. తాను బిల్లు వ్రాయడానికి చెవి వెనక
నుంచి పెన్సిలు తీస్తున్నాడు.
"పనిలో పని నా కాఫీ కూడా సాగతీసి పెట్టు" అన్నాడు రామారావు గంభీరంగా.
సెర్వరు ముఖాన చిరునవ్వు.
"అవసరం వుండదు. చూసుకోండి."
రెండు గ్లాసులలో వున్న ద్రవ పదార్ధం ఒకే రంగులో వుండడం చూసి, రామలింగేశ్వరరావుకి అనుమానం కలిగింది.
"నా గ్లాసులో పదార్ధం ఏ జాతిదయ్యా."
"తమరడిగిందే తెచ్చా, సార్" అన్నాడు సెర్వర్, అడిగిందానికి సమాధానం ఇవ్వకుండా.
"అతన్నడగాలా....? చప్పరించి చూడు. కిరోసిన్ వాసన వున్న వేడి శబరి నీళ్ళు కాఫీ. వాటికే కించిత్తు తారు వాసనుంటే
టీ. అంతేనా?" అన్నాడు రామారావు సెర్వరును ధ్రువపరచమన్నట్లు.
హోటలులో సరుకుల మంచి చెడ్డల బాధ్యత తనదెంత మాత్రమూ కాదన్నట్లు ముఖంపెట్టి సెర్వరు అంతక్రితం కనబడిన చిరునవ్వు
చెరిపేసుకొన్నాడు. మాట్లాడకుండా, ఇద్దరి మధ్యా, బల్ల మీద వున్న నీటి మడుగులో బిల్లు అద్ది, వెళ్లిపోయేడు.
అయిదో ప్రకరణం
కౌంటరులో ఉన్న పద్మనాభయ్యకు వారి సంభాషణ వినబడే అవకాశం లేదు. కాని, అతని కళ్ళకి అసాధారణ గ్రహణ శక్తి
వుంది. ధుమధుమలాడుతున్న మొహాలతో వేర్వేరు బల్లల వద్ద కూర్చున్న వారందరికీ ఓదార్పుగా "బజారంతా మండిపోతూంది." అని తానే
ఏడ్పు మొహం పెట్టేడు.
ఇడ్లీ మీద వూది అది గాలిలో చక్రంలా లేవగలదేమో పరీక్షిస్తున్న యువకుడికది ఓదార్పు.
గారెలోకి సాంబారు కావాలంటే మరో అయిదు పైసలవుతుందంటున్న సెర్వరు కది సమర్ధన.
మినపట్టులోకి కొబ్బరి పచ్చడి తెమ్మంటున్న గ్రామీణుడికి అది అసాధ్యమని చెప్పడం.
కాఫీ, టీలు అసహ్యంగా వున్నాయన్న తమ వ్యాఖ్యకు అది సమాధానంగా తీసుకున్నాడు, రామారావు.
కోపం వచ్చింది. కాని, కోపం వచ్చి ఏం చెయ్యడం? అసలు కోపగించవలసినది ఎవరి మీదనో కూడ అర్ధం కావడం లేదు. దానిని
ఎల్లాగ ప్రకటించాలి? అదీ తెలియలేదు కనక వెక్కిరింత, అపహాస్యం ఆసరా చేసుకున్నాడు.
"ఆ మంటలమీద వెచ్చబెట్టేరా ఏం, కాఫీకి పొగ వాసనొచ్చింది?"
ఆ మాటకు హాలంతా తలెత్తి చూసింది. ఎవరో కోపంగా ఖాళీ గ్లాసు చప్పుడయ్యేలాగ బల్ల మీద దప్పున పెట్టేరు.
"ఈ ముండా వేడి నీళ్ళకి ఇరవై పైసలుట"
రామారావు వెక్కిరింతకే మనస్సు లోలోపల కుతకుతలాడుతున్న పద్మనాభయ్య యీమారు ఆగ్ బబూలా అయిపోయేడు. గ్లాసు చేసిన
చప్పుడును బట్టి ఆయనెవరో ఆ "ముండా వేడి నీళ్ళ"ని ఖర్చు చేసినట్లే గ్రహించేడు. ఇచ్చింది తాగేసి పైగా వ్యాఖ్యలా?
సమాధానం అనేక పాఠాంతరాలలో మనస్సుకు వచ్చింది. ఎదటి మనిషికి సంఘంలో ఉండగల బలం, హోటలులో తన వాళ్ళ వత్తాసుపట్టి
ఇదివరలో ఇటువంటి సమయాలలో అనేకమార్లు వుపయోగించినవే. ఒక్కొక్కప్పుడు చెయ్యి చేసుకోడం దాకా వెళ్ళిన ఘట్టాలూ వున్నాయి.
కాని, అతనికిప్పుడా కోపం చూపగల ధైర్యం లేదు. ఏడెనిమిది నెలల క్రితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళన కాలంలో జనసమూహం
రవీస్ కాలవ ఒడ్డునున్న పోలీసు స్టేషను, ఏలూరు కాలవ లాకుల వద్దనున్న సంజీవరెడ్డి విగ్రహంతో పాటు మూడు నాలుగు
హోటళ్ళని కూడా ధ్వంసం చేసిన విషయాన్ని అతడు మరవలేదు.
తినే పదార్ధాల ధరలు పెంచేరనీ, నాణ్యం తగ్గించేరనీ కొన్ని రోజులు గలభా జరిగేక, ఆ రోజున జనం తమ కసి
తీర్చుకున్నారు.
తన హోటలుకి ఎదురుగా ఓ నూరు గజాలలో పోలీసులు జనం మీద కాల్పులు జరిపి ఇద్దరిని చంపేసేరు. కొందరికి గాయాలు తగిలేయి.
ఆనాడు పోలీసులు పెట్టిన కేసుల్లో కొందరు యీనాటికీ అవస్థలు పడుతున్నారు. ....జనం వెనక్కి తగ్గేరు. కాని, వాళ్ళ
గుండెల మంట చల్లారలేదు. పొగలు చిమ్ముతూంది. మొగాలలో ధుమ ధుమ అల్లాగే వుంది.
అందుచేతనే పద్మనాభయ్య తన కోపాన్ని ఏ రూపంలోనూ కనబరచడానికి ధైర్యం చెయ్యలేకపోతున్నాడు. బల్లల వద్ద నడుస్తున్న
వ్యాఖ్యలు విన్నప్పుడూ, టిఫిన్ తిని డబ్బులిచ్చేటప్పుడు వారి చూపులు గమనిస్తుంటేనూ అతనికి వెన్నుపూసలోంచి వణుకు
పుట్టుకొస్తూంది. 1966 అక్టోబరు 1 వ తేదీని మళ్ళీ చూడాలనే ఉత్సాహం అతనికి ఏ కోశానా లేదు. కనక అంత కోపం
చల్లార్చుకొని మాటల ప్రవాహంలో ఆత్మరక్షణకు పూనుకొన్నాడు.
"ఏప్రిల్ నెలలో పంటలు నాలుగు మూలలా అందివచ్చినప్పుడు ఏటికి అవతలా, ఇవతలా గ్రామాలలో అపరాల పంటనంతనూ
ప్రాణధారిమల్ కోనేసేడు. క్వింటాలుకి డెబ్భై నుంచి నూట పాతిక వరకూ ధర పెట్టేసేడు. అతడికి కావలసిన పెట్టుబడినంతనూ
బేంకులిచ్చేయి. పంటంతా చేతబట్టుకొని నిలవ పోసేక ఇక నా పరుగందుకోండి అన్నాడు. ఒక్క వారంలో కందుల ధర క్వింటాలుకి
రెండువందల యాభైకి పెంచేసేడు. ఇదేమి అన్యాయమని అడిగే నాధుడు లేడు. ముండా గవర్నమెంటు."
తానిస్తున్న నీళ్ళ కాఫీకీ, హెచ్చు ధరలకీ, రుచీ పచీ లేని తినుబండారాలకీ, హోటలు అపరిశుభ్రతకీ కీలకం ఎక్కడుందనుకోవాలో
పెద్ద గొంతుకతో వినిపించేడు. ఆ సమాచారం తక్షణ ఫలితం ఇచ్చింది. జనం నోరు విడింది.
"వీళ్ళమ్మా! అంతా తోడి దొంగలు."
"లం....జా....కొడుకులు."
ఎన్నికైన పదసాహిత్యం హాలు నలుమూలల నుంచీ వినిపిస్తూంది. ఆ బూతులూ, తిట్లలో తనకూ వాటా వున్నా, పద్మనాభయ్య
పట్టించుకోలేదు. తన ప్రయత్నం విజయవంతం అయింది. అంతేచాలు. ఆ ధోరణి వదలకూడదు.
"ఈ మధ్యనే మార్వాడీవాడు కొట్టు కట్టించేడు. దానిలో అన్ని దుకాణాలతోపాటు మంగలి దుకాణం పెట్టిస్తున్నాడు. ఆ దుకాణం
తెరవడానికై రావలసిందిగా మొరార్జీ దేశాయిని అడగటానికి ప్రాణధారిమల్ మొన్న ఆదివారం నాడు స్వయంగా డిల్లీ వెళ్ళేడు...."
అటువంటి వార్త అసంభవం కాకపోవడమే, అందరూ దానిని నమ్మడానికి కారణం.
పైగా ఆ మాటల్ని జనం నమ్ముతారా అన్నది ముఖ్యం కానే కాదు. వారి మనస్సులకి ఏదో పని కల్పిస్తూ, మాటలు దొర్లించడం
ముఖ్యం. ప్రభుత్వం, బ్యాంకులు, మార్వాడీలు....వాళ్ళు చేస్తున్నదే ఇదంతా. తాను ఆ ప్రవాహంలో ఒక పూచికపుల్ల మాత్రమేనని
జనానికి నచ్చచెప్పగలుగుతే మంచిది. అదో అదనపు లాభం.
"దొంగలూ, దొంగలూ వూళ్ళు పంచుకొంటున్నారు."
"గాడిద కొడుకులు."
"తల్లివేపునుంచా, తండ్రివేపునుంచా"--అంటూ ఒకరు తిట్లతో చమత్కారం ఒప్పించడానికి ప్రయత్నించేరు. ఆ మాటకి పద్మనాభయ్య
పెద్దగా నవ్వేడు. అతడాశించినట్లు ఎవ్వరూ ఆ నవ్వు నందుకోలేదు.
"వాళ్లకి సిగ్గూ, శరం లేదు. జనం తిడుతున్నారన్న బాధలేదు. ఎవరెన్ని తిడితేనేం? వాళ్ళపని జరిగిపోతూంది. తిట్ల వలన
శరీరం మీద గాయాలేం కావు."--అంటూ పద్మనాభయ్య బాధితులలో తానూ ఒకడినన్నట్లు సాయించేడు.
హాలులోంచి ఒకరు అందించేరు.
"రాష్ట్రానికి ఒక నక్సల్‌బరీ అంటుకుంటే తప్ప ఈ రోగానికి మందు లేదు."
చమత్కారాలనుంచి భయానక రసానికి దారితీసిన తన వాగ్ధోరణికి తానే హడలిపోయాడు, పద్మనాభయ్య. చటుక్కున మాటలు నిలిపి
గల్లా డ్రాయర్ మూసేసేడు, దాని మీద దాడి జరుగుతుందేమో నన్నట్లు.
ఆ ప్రిస్క్రిప్షన్ వినవచ్చిన వేపు తిరిగి చూసేడు, రామారావు. తాను పనిచేసిన కాలేజీలో చదువుతున్న కుర్రాడే. అతనిపక్క
మరో పడుచువాడు. అదీ ఎరిగిన ముఖమే అనిపించింది. కాని, గుర్తు రాలేదు.
"నక్సల్‌బరీలో వుద్యమం ప్రారంభమయ్యాక అక్కడ ఇడ్డెన్లు పెద్దవి చేసి, మంచి కాఫీ ఇస్తున్నారా
యేమయ్యా!"--అని రామారావు హాస్యమాడేడు.
బల్లల దగ్గరున్న వాళ్ళు ఫక్కున నవ్వేరు. ఆ యువకుడు తిరగబడి చూసి, తల తిప్పుకొన్నాడు. అతడెవరో తన్ను గుర్తు
పట్టేడని రామారావు గ్రహించేడు అతనెవరు?
"నక్సల్‌బరీ ఈ వేళ ఫేషనయిపోయింది" అని రామలింగేశ్వరరావు విచారం వెలిబుచ్చేడు.
జనం దృష్టి తన హోటలు మీదినుంచి మళ్ళిందని పద్మనాభయ్య ప్రాణం కుదుట పడింది. ఇద్దరు విద్యావంతులు తనకు ఆసరాగా
వున్నారనే ధీమా ఏర్పడింది. ఆ అవకాశం పోనీదలుచుకోలేదు.
"ఇంతింత కుర్రాళ్ళుకూడా రాజకీయవేత్తలూ, దేశ నాయకులూ అయిపోతున్నారు. అందుకే దేశం ఈకాడికి వచ్చింది. కాకపోతే మన దేశంలో
పెద్దవాళ్ళంటే ఎంత భయం, ఎంత భక్తి? మర్యాదా, మప్పితం లేకుండా మసలడం ఎప్పుడేనా ఎరుగుదుమా?"
మాటల ఆవేశంలో పద్మనాభయ్య రేడియో వాల్యూం బాగా పెంచేసేడు. ఎనౌన్సరు మాటలు కొట్టవచ్చినట్లు వినిపించేయి. మధ్యాహ్నం
రెండుగంటలవేళ వెంకటేశ్వర స్వామికి ఎవరో మేలుకొలుపులు పాడుతున్నారు.
మేలుకోవయ్య -మ
మ్మేలుకోవయ్య.
గూబ మీద కొట్టినట్లయి రామారావు గమ్మున లేచేడు.
"ప్రస్తుతానికి మేలుకొనే వున్నాం. లేచిపోతున్నాం కూడా. కాస్త ఆ గోల ఆపవయ్యా స్వామీ."
ఆ కుర్రవాని మాటను ఎగతాళి చెయ్యడం పద్మనాభయ్యకు అలుసు ఇచ్చిందని మనస్సు కలక వేస్తూంటే ఈ గోల ఒకటి.
"లేస్తావా, రామలింగం! లేక వెంకటేశ్వరుడిలాగా నువ్వూ మొద్దు నిద్దర్లోనే వున్నావా?"
వారిద్దరూ వెళ్ళిపోతే తనకు మాట ఆసరా వుండదన్నంత భయంతో పద్మనాభయ్య అంత వేగంగానూ రేడియో వాల్యూం తగ్గించేసేడు.
"కూర్చోండి. కూర్చోండి. తగ్గుతోనే పెడతా. అసలెందుకులెండి. తీసేస్తా."
పద్మనాభయ్య రేడియో గొంతుక నొక్కేసినా వారు కూర్చోలేదు.
నక్సలైట్ల ప్రసంగం తెచ్చిన కాలేజీ స్టూడెంటూ, అతనితోవున్న యువకుడూ కౌంటరు వద్ద బిల్లు చెల్లిస్తున్నారు.
"నీ పేరు వెంకట్రావు కదూ!"--అడిగేడు రామారావు.
"ఔనండి." అంటూ అతడు సిగ్గుపడి వెనక్కి తగ్గేడు.
"చూడు. నీ నక్సల్‌బరీ వుద్యమం ఏదో ఈ హోటలునుంచే ప్రారంభం చెయ్యకూడదూ. బెజవాడ ఆరోగ్యమేనా బాగుపడుతుంది."
"అబ్బే అదేం లేదండి."
"నీ వెనకాల మేమంతా వుంటాంలే"
ఆ మాటల్లో పద్మనాభయ్యకు పిసరంత కూడా హాస్యం కనబడలేదు. చటుక్కున డ్రాయరు మూసేసి, తాళం కూడా తిప్పేసేడు. మొగాన
కత్తివాటు వేసినా, నెత్తురు చుక్క లేదు. పెదవులు అదురుతున్నాయి.
ఆ ముఖం చూసేక రామారావుకి తృప్తి కలిగింది. క్షణం క్రితం వున్న చింత, కలక తీరింది.
వెంకట్రావుతో వున్న మిత్రుడికి ఆ ఎగతాళి నచ్చలేదు.
"అన్‌సంగ్, అన్‌వెప్ట్ జట్టులో పడిపోకుండా మేస్టారికి నీపేరు తెలిసింది. ఇంక ఫర్వాలేదు" అన్నాడు.
ఆ మాట వెనక నున్న పొడుపు అర్థమయి రామారావుకి కోపం వచ్చింది. 'ఇది యు.జి. వెలుగు కాబోలు' ననుకొన్నాడు.
"వెంకట్రావూ! నీపేరు తెలియకుండా రహస్యంగా వుంచుతున్నావనుకోలేదు సుమా. కాలేజీకి వస్తూపోతూ వుంటే మా అందరిలాగే
వుంటున్నావనుకొన్నా. అల్లా చెప్పు."
ఆ హేళనకు వెంకట్రావు కంగారుపడ్డాడు. "అదేం లేదండి"
రామారావు మెట్లు దిగుతూ రెండోవాని వేపు చూసి "సెలవు మేస్టారూ!" అన్నాడు.
రోడ్డు మీదికి వచ్చేక రామలింగేశ్వరరావు అడిగేడు.
"ఆ రెండో అతడెవరు, మన కాలేజీ స్టూడెంటేనా?"
"అల్లాంటి అనవసరపు ఆసక్తి చూపవద్దనే అతని సలహా. ఎవరైతేనేం, అంజనా సుతుడు"
వెనక్కి తిరిగి చూసేసరికి వారిద్దరూ కిల్లీలు బిగించి సిగరెట్లు తీసుకొంటున్నారు. నిలుచున్న తీరు చూసేక అతడెవ్వరో చటుక్కున
గుర్తువచ్చింది.
ఆరో ప్రకరణం
1966 అక్టోబరు 1 సాయంకాలం నాలుగు-అయిదుగంటల మధ్య.
ఏడెనిమిది నెలల క్రితం--ఇదే రోడ్డుమీద--ఆ ఫోటో స్టూడియో. మేడమీద చూసిన మొహమే.
ఆనాటి ఘటనలన్నీ మెదడులో సుళ్ళు తిరుగుతూంటే రామారావు ఆ యువకుని వేపే చూస్తూ నిలబడిపోయేడు. అతడు ఎందుకు ఆగినదీ
అర్థంగాక రామలింగేశ్వరరావు ఆదుర్దా చూపుతున్నాడు.
"రోడ్డు మీద అల్లా నిలబడిపోయాడేమిటి? ఆత్మహత్య చేసుకోవాలనుందా? మనం నడుస్తున్నది బెజవాడ రోడ్డుమీద అని
మరిచిపోకు."
రామారావు అతనికే సమాధానం ఇచ్చేలోపునే వెంకట్రావూ, అతని మిత్రుడూ దగ్గరకొచ్చేసేరు.
"నేనెవరో తెలుసుకోవాలని ఇందాకటినుంచి మీరు మహా యిదైపోతున్నారు." అనేశాడు వెంకట్రావు మిత్రుడు.
ఆ మాటలలోని కటుత్వాన్నికూడా అర్థం చేసుకోలేనంత ఆనందం కలిగింది రామారావుకి.
"గాయాలు పూర్తిగా మానిపోయేయా? మేస్టారూ! సంతోషం. గుర్తుపట్టలేదు, మొదట. చాల సంతోషం!"
రామారావు ముఖంలోనూ, మాటలలోనూ కనిపిస్తున్న, వినిపిస్తున్న సంతోషాన్నీ, ఆప్యాయతనూ ఆ యువకుడు లెక్క చేయలేదు.
"ఆ మాటే చెప్దామని వచ్చా. మీరు రివిజనిస్టులయి వుంటారు. లేకపోతే అంత తెలివిగా, మాకుపకారం చేస్తున్నట్లు నటిస్తూ,
పోలీసాళ్ళకి వప్పచెప్పడం మరొకరివల్ల జరగదు."
గూబకు బెత్తెడు చూసి కొట్టినట్లయింది. రామారావు ఆ ఆరోపణకు దిగ్భ్రమ చెందేడు.
ఆ రోజున--,
ఏలూరురోడ్డే వస్తున్న రామారావుని సందుమూలలో వున్న పోలీసులు రైఫిళ్ళు చూపి నిలవబెట్టేసేరు. ముందుకు పోనివ్వమన్నారు. ఏం
చెయ్యడానికీ తోచక అతడు ఎదురుగా తెరిచివున్న ఓ ద్వారంలో చొరబడ్డాడు. అది మెట్లగది. పైకి వెళ్ళేడు. అక్కడ తుపాకీ
రవ్వలు తగిలి రక్తం కారుతున్న ముగ్గురు యువకులకు నలుగురైదుగురు మిత్రులు ఉపచారాలు చేస్తున్నారు.
ఆ గాయాలు సెప్టిక్ అయి కుర్రవాళ్ళు నిష్కారణంగా చచ్చిపోతారని, వారిని తాను హాస్పిటలుకు చేర్చేడు. చేర్చేందుకు ఎంత
గొడవయింది. అడుగడుగునా పోలీసుల అదలింపు. రైఫిళ్ళు చూపి బెదిరింపు. కాని డబాయించి, దెబ్బలాడి వారిని హాస్పిటలుకి చేర్చేడు.
"మీ మాటలకి మోసపోయి వాళ్ళిద్దరూ హాస్పిటలు బెడ్ ఎక్కేరు. నాకు మొదటినుంచీ అనుమానమే. మొదట మీ మీద కాదులెండి,
హాస్పిటలులో ఇచ్చే సహాయంమీద అపనమ్మకం. అయితే ఆ అపనమ్మకమే నన్ను 'సేవ్' చేసింది...." అంటున్నాడు ఆ
యువకుడు....
తరవాత రెండుమూడు నెలలకి విశాలాంధ్ర షోరూమ్‌లో తనకు బాగా పరిచితుడైన ఒక కమ్యూనిస్టు నాయకుడు కనిపించి ఆ
రోజున తన తమ్ముడిని హాస్పిటలులో చేర్పించి వుండకపోతే ఇప్పుడు నడుస్తున్న కేసుల బెడద వుండేది కాదన్నాడు. ఆ విషయాన్నే
ఈ యువకుడు మరో మాటలలో చెప్తున్నాడు.
"జనాన్ని కాల్చి చంపుతున్న పోలీసులు మిమ్మల్ని మేం వున్న మేడ దాకా ఎందుకు రానిచ్చేరు? అక్కడ ఎవరో వున్నారని మీకు
ఎల్లా తెలిసింది? మీకు వాళ్ళతో లాలూచీవుంది, కనక వదిలేరు. మొదట తోచలేదు గాని మీరు కిందికెళ్ళి రిక్షాకూడా ఎల్లా
తేగలిగేరు? వాళ్ళతో షరీకయ్యేరు గనకనే సాధ్యమయింది."
ఇన్నాళ్ళకు ఓ ప్రజాద్రోహిని నడివీధిలో పట్టుకొని కడిగేసే అవకాశం దొరికిందని ఆ యువకుడు ఊగిపోతున్నాడు.
ఆ అన్యాయారోపణకు దిగ్భ్రమ చెంది, ఆందోళనలో ఆరిపోయిన పెదవులు నాలికతో తడుపుకున్నాడు, రామారావు. అంతవరకూ సాగించినట్లు
వెక్కిరింతలూ, వేళాకోళాలా మాటున తన అసమ్మతిని ప్రకటించడం మంచిది కాదు. సరాసరి సమాధానం చెప్పుకోవాలి.
"అన్యాయం, మిస్టర్! సబినస్పెక్టరుతో ఎంతో ఘర్షణపడి, గాయపడ్డ వాళ్ళని హాస్పిటలుకు తీసుకెళ్ళడానికి ఒప్పించగలిగా."
"ఎక్జాట్లీ, ఆ సబినస్పెక్టరుది మట్టిబుర్ర. వాడే కాదు. రవీస్ కాలవ వంతెన మొగలో తాలూకాఫీసు మూలలో, ఏలూరు కాలవ
లాకు మొగ వద్ద పోలీసువాళ్ళు మిమ్మల్ని ఆపేరు. మీరు అదే సమాధానం ఇచ్చేరు. మేం విన్నాం. ఆ మాటలోనే అసలు 'క్లూ'
వుంది--యిందాకా మీరు కాల్పులు కాల్చినపుడు గాయపడ్డారురా గాడిదలూ! అంటే--ఆ ఘర్షణలలో ముందు పేటీన వున్న వాళ్ళు అర్థం
చేసుకోరేం--అని చెప్పినట్లే. ఆ రోజున మాకు అర్థం కాలేదు. మొదట పోలీసు వాళ్ళూ తెలియకనే అడ్డం పెట్టేరు. మీ మాట విని
తెలివి తెచ్చుకున్నారు. మా వాళ్ళో, కేసుల్లో పడేవరకూ తెలుసుకోలేదు."
రామారావుకి సహనం పోయింది. చర్రుమన్నాడు.
"అర్థం చేసుకోడానికి మెదడు సరియైన స్థితిలో ఉండాలి. మీలో లోపం అదేనని తోస్తూంది."
--అంటూ రామారావు గిరుక్కున తిరిగేడు. ఆ యువకుడు ఫక్కున నవ్వాడు.
"మీ ఫ్రెండ్స్‌కి కాస్త కబురందించరాదూ. ఫలానా వాడు ఇక్కడే తిరుగుతున్నాడు. ఆ రోజున హాస్పటల్‌లో
చేరకుండా తప్పించుకు పోయేడు...."
రామారావు టక్కున వెనక్కి తిరిగి ఆ యువకుడికి సమీపంగా వచ్చేడు. పళ్ళు కొరుకుతూ, మాటల్లో అసహ్యం ఉమిసేడు.
"ఇల్లాంటి పనికిమాలిన ప్రజ్ఞలకు, దురహంభావానికీ మూలం అర్థం అయింది....నీకు కాదులే, నాకు. నీకు చచ్చినా అర్థం కాదు,
నాకు తెలిసింది. యిందాకా హోటలులో నీ నోటి దురద విన్నా, అదో ఫేషనయి పోయిందన్నాడు మా ఫ్రండు. కాదు, చేతకాని దురహంభావం నీ
చేత అల్లా అనిపించింది. నీ రాజకీయాలు అంతే. లేకపోతే మనిషిలో యింత "కార్యకారణ వివేచన శక్తి" ఏర్పడదు. ఫస్టుగా
ఉంది. పోనీ బండి. యిందాకా హోటలు కౌంటరు వద్ద వెంకట్రావు నూరడించేవు. కాని, ఆ వూరడింపు నీకే."
రామారావు విసురు చూసి వెనుకంజ వేసిన మిత్రుణ్ణి వెంకట్రావు వెనక్కి లాక్కుపోయేడు.
"నీ విసురు చూస్తే దవడలు వాయించేస్తావని కంగారు పడ్డా"నని రామలింగేశ్వరరావు మిత్రుని చేయి పట్టుకొని తీసుకుపోయేడు.
రామారావు నెమ్మదిగా చేయి విడిపించుకొన్నాడు. "నడు పోదాం"
యిద్దరూ నడుస్తున్నారు.
"ఎవరతడు?"
"యిందాకా గుర్తురాలేదు. ఉక్కు వుద్యమం సందర్భంగా ఈ వూళ్ళో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ వాళ్ళలో ఒకడు. ఆ రోజున
ఇతడినీ, మరో యిద్దరినీ నేను హాస్పటలుకు చేర్చా. ఆ జన సమ్మర్దంలో యితడు తప్పిపోయేడు. మిగిలిన యిద్దరినీ మాత్రం
చేర్చేను. యితడూ చేరే వుంటాడులే అనుకున్నా. చేరలేదన్న మాట. అప్పటికి యిప్పుడే చూడడం. పోలీసాళ్ళకి వప్పచెప్పడానికే
హాస్పిటలులో చేర్చానంటాడు. వాలకం చూస్తే రాజకీయ అతివాదం మాటున మతిభ్రష్టుతనాన్ని కమ్ముకుంటూన్న నోటి దురదగాడల్లే
వున్నాడు. తనమీద కాల్పులు కాల్చిన వాళ్ళ మీదకన్న గాయాలకు కట్టు కట్టించబోయినవాని మీద కసి చూపడం మరో మనిషి
చెయ్యడు"
రామలింగేశ్వరరావు నవ్వేడు.
"మంచి అనుశీలన, పరిశీలన గలవాడు. లేకపోతే నీ రాజకీయాలు అంత నిశితంగా పట్టెయ్యలేడు."
మిత్రుని మాటలు వినిపించుకొనే స్థితిలో లేడు, రామారావు. ఈ ఘటన అతని మనస్సును కలచివేసింది. ఏదో ఆలోచిస్తూ,
నడుస్తూన్నాడు.
"అరకొరగా చేస్తే మంచిపని అయినా మంచి ఫలితం యివ్వదు. గాయాలతో చచ్చిపోతారని హాస్పిటలులో చేర్చా, మంచిదే. కాని,
అవకాశం తీసుకొని పోలీసువాళ్ళు వాళ్ళని కేసుల్లో దూర్చేరు. తప్పు నాదేనా? కాదా? నేనేం చేసి వుండాలి?--ఎప్పుడూ
ఆలోచించనేలేదు."
ఆ ఆలోచనను రామలింగేశ్వరరావు అంగీకరించలేదు.
"మనుష్యులు బాధలో వున్నారని చెయ్యగల సాయం చేసేవు. వుద్యోగం మానుకొని హాస్పటళ్ళ వెంటా, తరవాత కోర్టుల వెంటా కూడా
తిరగాలా? అదే అయితే మీ చావు మీరు చావండని వూరుకోడం నయం అంటాను...."
రామారావు ఆ వాదాన్ని ఒప్పుకోలేదు.
"మనం వాళ్ళ వెంట హాస్పిటళ్ళకు తిరిగేమా? కోర్టుల వెంట తిరిగేమా అన్నమాట వాళ్ళకీ అంత ముఖ్యం కాదు. తమర్ని విడిచి
పెట్టలేదనే ధైర్యం, తమరిని బలపరిచే వాళ్ళు కొందరున్నారనే సంతృప్తీ కావాలి. ఆ భాగం నా వలన సమకూడలేదు. హాస్పిటలులో
చేర్చేక మరి నేనటు తొంగికూడా చూడలేదు, నా పని తీరిందనుకున్నా. కాని, ఆ అరకొర పని నా రాజకీయాల్ని కూడా అవమానం
పాల్చేస్తూంది...."
రామలింగేశ్వరరావు తన ప్రశ్నకి సమాధానం రాలేదన్నాడు.
"వుద్యోగం మానుకుని నువ్వు వాళ్ళ మంచాల వద్దా, కటకటాల యివతలా పరిచర్యలు చెయ్యవలసిందేనా?"
రామారావు ఆలోచిస్తున్నాడు.
"చెప్పవేం?"
"దారిపొడుగునా పోలీసులతో పేచీ పెట్టుకుంటూనే హాస్పిటలుకు తీసుకెళ్ళేనా లేదా...."
"అయితే...."
"అల్లాగే...."
"కోర్టు కేసుల్లో కూడానా?"
"కేసు అన్యాయమైనదవునా కాదా. దానిమీద జనాన్ని కూడగట్టడం, గొడవ చెయ్యడం అవసరమే. మనం వున్న వ్యవస్థలో
ఏమరుపాటు పనికిరాదని దాని అర్థం."
రామలింగేశ్వరరావు నిస్పృహతో ఒక్క దండం పెట్టేడు.
"నీ రాజకీయాలు తగలడ్డట్టే వున్నాయి. వీధేపోయే పెద్దమ్మా మా యింటి దాకా వచ్చివెళ్ళమన్నట్లు లేనిపోని తద్దినాలు తెచ్చుకోక
తప్పదనేటట్లయితే పరోపకారం ఏటిలో కలవనీ. ఈ ప్రజాసేవ చెయ్యకపోతే కొంప మునిగిపోదు."
ఏడో ప్రకరణం
ఇంటికి వచ్చేసరికి వీధి అంతా పిల్లలతో నిండి గోలగా ఉంది.
డ్రైనేజీ గొట్టాలు వేయడానికై తవ్విన కందకాల మీద కుర్రవాళ్ళు 'లాంగ్ జంప్' ప్రాక్టీసు చేస్తున్నారు. అంతా పది
పన్నెండేళ్ళలోపు వాళ్ళు. రెండు నిలువుల లోతున్నట్లున్న ఆ గోతులలో పడిపోరు కదా--అనిపించింది.
కాని, వాళ్ళకా భయం వున్నట్లే లేదు. పెద్దవాళ్ళు భయపెట్టకుండా వొదిలేసేరనుకోలేము. కాని, కుర్రవాళ్ళకి ఆడుకొనేందుకు
స్థలాలు కావాలి. అవే లేవు. పట్టణం పెరిగిపోతూంది. దానికో క్రమం లేదు. అందుకు ప్రయత్నమూ లేదు. నడిరోడ్లు జనతా పాకీ
దొడ్లు. వీధులు ఆది వరాహ విహార భూములు. మునిసిపల్ ఆఫీసులు లంచగొండితనం నేర్పే కళాశాలలు. పాఠశాలలు అసమర్థ
పరిపాలనకు సాక్షీభూతాలు.
ఇంక కుర్రవాళ్ళ ఆట స్థలాల సంగతి ఎవరికి పట్టింది? వాళ్ళదారి వాళ్ళు చూసుకొంటున్నారు. ఉన్నంతలోనే కొంచెం వినోదం, కాస్త
వ్యాయామం కల్పించుకొంటున్నారు.
వాళ్ళ వుల్లాసం, వాళ్ళ గంతులు, కవ్వింపులు, కీచులాటలు చూస్తూనే రామారావు తన కోపం మరచిపోయేడు. తన మానసిక వ్యధ
మరచేడు. ఒక్క నిముషం నిలబడి వాళ్ళ ఆటలు చూసేడు. వాళ్ళకి ఒకటి రెండు సలహాలు ఇచ్చేడు. కాని, వాళ్ళు
వినిపించుకోలేదు. నవ్వొచ్చింది.
ఓ కుర్రవానిని పిలిచేడు.
ఆ పిలుపు విని ఇంటి ప్రధానద్వారం తెరుచుకొని ఒక తరుణి తొంగి చూసింది.
"పిలిచేరా"
"లేదండి."
ఆమె లోపలికి వెళ్ళిపోలేదు. పిల్లల ఆటలు చూస్తూ ఆమె కూడా అక్కడే నిలబడింది.
"ఓరి, మీ కడుపు ఉడక! పడ్డారంటే కుంటివాళ్ళయిపోతారర్రా!" అంటూ నవ్వింది. వెంటనే ఓ కుర్రవాడు కుంటి నడకను
అభినయించేడు. నలుగురు కుర్రవాళ్ళూ గొల్లున నవ్వేరు.
మరల కందకం మీదుగా దాటడం ప్రారంభమయింది. రామారావు ఓ కుర్రవానిని పిలిచేడు. గంతేముందు ఊతం కోసం పరుగు తీసే ప్రయత్నంలో
వున్నాడు వాడు. పిలుపు విని నిలబడ్డాడు.
"ఎందుకండి!"
"నీ పేరేమిటోయ్,"
వాడు చెప్పేలోపున వెనకనుంచి వేరొకడు అందించేడు,
"బాబండి"
"అది సరిలే. కృష్ణాజిల్లాలో మగపిల్లవాడిని బాబు అనడం, ఆడపిల్లను బేబీ అనడం ఓ ఫేషను. అసలు పేరు ఏమిటని?"
మరో కుర్రాడు వచ్చి నిలబడ్డాడు. వానికి ఈ ఆరా అంతా ఎందుకో తెలుసుకోవడం అవసరంలా తోచింది.
"ఎందుకేమిటండి?"
"అబ్బే మరేంలేదు. మీరెవరన్నా జారి పడిపోయి కాలు విరుచుకుంటారనుకోండి. హాస్పిటలుకి తీసుకెళ్ళాలి కదా. పాపం, ఎవరి కాలు
అనుకొని కట్టుకట్టాలి వాళ్ళు. వాళ్ళకి ఏం పేరంటే, ఏమని చెప్పాలి అని." అన్నాడు, రామారావు గంభీరంగా.
గుమ్మంలో నిలబడ్డ సుశీల ముఖాన చిరునవ్వు కనపడింది.
"ఓస్. అదా." అని కుర్రాడు వెనుతిరిగేడు.
మొదటి కుర్రవాడు తనపేరు 'సుబ్బారావు' అని చెప్పుకున్నాడు. మరుక్షణంలో "హూప్" అని కందకం అవతలికి గెంతేడు.
ఇంక వరసన పేరు చెప్పడం, గెంతడం ప్రారంభమయింది.
"రంగనాధం--హూప్"
"జయరాం--హూప్"
"సారథి--హూప్"
గుమ్మం లో ఉన్న సుశీల ఫక్కున నవ్వింది. ఆమెను చూసి రామారావూ నవ్వేసేడు.
"వాళ్లెవళ్ళూ మన మాట వినిపించుకొనే ధోరణిలో లేరు."
వాళ్ళని హాస్యం చేయబోయి, తానే హాస్యం పాలయినందుకు అతనికి కోపం రాలేదు. తలనెప్పీ, చిరాకూ అనిపించలేదు.
"నెల్లాళ్ళ క్రితం ఆ పై వీధిలో ఓ కుర్రాడు...." అంటూ ఆ ఘటన గుర్తు వచ్చి సుశీల వణికిపోయింది.
వర్షాలు పడి డ్రైనేజీ కందకాలు నిండేయి. పది పన్నెండేళ్ళ వాడు గట్టుమీద నడుస్తూ కాలుజారి కందకం లో పడిపోయేడు. మర్నాడు
మోటారు తెచ్చి నీరు తోడించేశాక గాని, అంచులు జారిపడిన మన్నులో కూరుకుపోయిన ఆ కుర్రవాని శవం దొరకలేదు.
ఆ మాట గుర్తు వచ్చి సుశీల ముఖం వివర్ణం అయింది.
"ఈ వీధులు ఎప్పుడు బాగుపడతాయో గాని, పిల్లలిద్దరూ ఇంట్లోకి వచ్చి కనబడేవరకూ ప్రాణాలు ఇల్లా ఉంటున్నాయి." అంది,
గుప్పిడి మూసి తెరుస్తూ.
రామారావు మాట తప్పిస్తూ....
"మీరు అప్పుడే వచ్చేశారే." అన్నాడు.
"శనివారం కదూ, బాంకు పని ఒంటిగంటకే అయిపోతుంది."
"మీ పనే బాగుందండీ."
కాని, సుశీలకి కాలేజీ ఉద్యోగాల మీద మోజు.
"మీ కంటేనా? వర్షాకాలం, వేసంకాలం, శీతాకాలం పేరుతో మూడు నెలలు సెలవులు. మిగిలిన వాళ్ళతో పాటు పండుగలూ, పబ్బాలూ
వుంటాయి." అందామె టీచర్లకు దొరికే సెలవులు తలుచుకొని లొట్టలు వేస్తూ.
రామారావులో ఆ వుత్సాహం కనబడలేదు. కాని ఒప్పుకొన్నాడు. "నిజమేలెండి."
ఎనిమిదో ప్రకరణం
"ఏమిటి, తలుపులన్నీ బిగించుకు పడుకున్నాడు?" అంటూ నారాయణ గది గుమ్మంలో నిలబడి ప్రశ్నిస్తూంటే, రామారావు లేచి కూర్చుని,
ఆహ్వానించేడు--"రాండి".
"ఒంట్లో బాగాలేదేమో, ఇందాక కూడా ఎల్లాగోనే కనిపించేడు." అంది, సుశీల వెనకనుంచి.
"విశేషం ఏం లేదండీ. కొంచెం తల నొప్పిగా వుంటే పడుకున్నా. దానికి తోడు ఈ కుర్రాళ్ళ గోల ఒకటి".
"వెళ్ళిపోయారు లేండి. తలుపులు తియ్యండి. కాస్త గాలేనా వస్తుంది"--అంటూ సుశీల లోపలికి అడుగుపెట్టి కిటికీ తలుపులు బారుగా
తెరిచింది.
"ఏం జ్వరం ఏమన్నా ఉందా? చూసుకొన్నావా?"
"వుండండి. వేడి వేడి కాఫీ పడితే అన్నీ సర్దుకొంటాయి. ఎండలో వచ్చేరు కదూ. అందుకు వచ్చి ఉంటుంది తలనొప్పి."
రామారావు వద్దంటున్నా వినిపించుకోకుండా సుశీల తమ వాటా లోకి వెళ్ళిపోయింది.
"అనవసర శ్రమ" అన్నా ఆమె వినిపించుకోలేదు.
"కాఫీ తాగడం శ్రమా?" అని నారాయణ హాస్యమాడేడు.
"వచ్చేటప్పుడు బజారులో తాగి వచ్చేనండీ."
"బజారులో తాగితే? ఇప్పుడింటివద్ద తాగు. యిదిగో యిప్పుడు నువ్వు మొహమాటపడితే నీతో పాటు నన్నూ ఎండగడతావు. మాట్లాడకు"
యింక రామరావేం మాట్లాడలేదు. మాట మార్చేడు.
"ఎటూకాని వేళ మీరు యింట్లో ఉన్నారు, ఏమిటి విశేషం?"
"పాల సప్లయిదార్లకీ, హోటళ్ళ వాళ్ళకీ ఖరీదుమీద పేచీలు వచ్చేయి."
"ఎందుకు?"
"కోవా సరిగ్గా రావడం లేదని మా డబ్బులు కోసేస్తున్నారు. తాము మాత్రం సరుకుల ధరలన్నీ పెంచేశారు. మా ధరా పెంచమన్నాం."
ఆ ధరల వివరాలేమీ తెలియని రామారావు ప్రశ్నలు ప్రారంభించేడు.
"యింతవరకేం యిస్తున్నారు? మీరేం అడుగుతున్నారు?"
"ఇప్పటి వరకు లీటరుకి 80 పైసలే."
"అబ్బ! అంత తక్కువా?"
"హెచ్చు మొత్తం తీసుకొంటారు. వాళ్ళే పెట్టుబడులూ పెడతారు."
"ఓహో"
"అయినా, అది చాల తక్కువ. మేము 83 పైసలు అడుగుతున్నాం."
ప్లేటులో రెండు కప్పుల నిండా పొగలు చిమ్ముతున్న కాఫీ పట్టుకొని, సుశీల వచ్చింది. వస్తూనే--
"రేపటి నుంచి వీరు మనకి పాలు లేకుండా చెయ్యబోతున్నారు." అంది.
"అదేమిటి?"
"టవునికి పాల సప్లయి బందు చెయ్యాలంటూ మనింట్లో మాత్రం రెండు శేర్లు పొయ్యమంటావు. ఆ పని చేస్తే మరి మన్ని చూసేక
ఎవ్వడూ కింద వుమ్మెయ్యడు."--అన్నాడు నారాయణ భార్య వేపు కొరకొరా చూస్తూ.
"నేననేదది కాదు. మీరు వూళ్ళోవాళ్ళకి ఎందుకు మానాలి? మీరు హోటలు వాళ్ళ నుంచి కోరుతున్న దానికన్న పన్నెండు పైసలు
ఎక్కువిస్తున్నారే."
రామారావు ఆశ్చర్యం కనబరిచేడు.
"సమ్మె అంటే అందరికీ సమ్మే. పంక్తితో బాలభిక్షం ఉండదు."--అని నారాయణ ముదలకించాడు.
సుశీల పేచీ ఏమిటో రామారావుకి చెప్పింది.
"హోటలు వాళ్ళు 80 పైసలు బదులు 83 పైసలు యివ్వమన్నారు గనక యిప్పుడే లీటరుకు 95 పైసలు యిస్తున్న మన మీద
సమ్మె ప్రకటిస్తున్నారు." అంది సుశీల, మగడిని కవ్విస్తూ.
"బహుశా మనల్ని తగ్గించి యివ్వమంటున్నారేమో, దానికైతే సమ్మె అనవసరం స్వామీ." అంటూ రామారావు సుశీలను బలపరిచేడు.
నారాయణకి ఏం చెప్పడానికీ తోచలేదు. డబాయింపు ప్రారంభించేడు.
"సమ్మెలు అన్నవి ఒక పెద్ద పోరాటానికి తయ్యారీ తినిపించడం వంటివి. సమష్టిగా పోరాటం జరపడంలో ప్రజలకి శిక్షణ
యివ్వడం అన్నమాట. దానిని అల్లాటప్పా వ్యవహారంగా చూడగూడదు." అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ, నారాయణ.
"యిప్పుడిస్తున్నట్లు లీటరుకి 95 పైసలు గాక రూపాయి యిమ్మన్నా జనం ఇస్తారు. మంచి పాలు పోస్తామని తీసుకుంటున్నారు కూడా.
మీరు హోటలు వాళ్ళ నుంచి కోరుతున్న దానికన్న ఎక్కువే యిస్తున్నారు కదా"--సుశీల అంది.
"అవును కదా"--అన్నాడు రామారావు.
"ఒకవేళ హోటలు వాళ్ళతో సమ్మె తప్పనిసరి అయితే జనాన్ని మీకు తోడు తెచ్చుకోవాలి. కొన్ని నష్టాలకి సిద్థపడయినా
చెయ్యవలసిన పని అది. యిక్కడ ఆ సమస్యా లేదే. అకారణంగా, అన్యాయంగా జనానికి యిబ్బంది కలిగించి వాళ్ళని వ్యతిరేకం
చేసుకోడం--యిదేమి పద్ధతి"--అని సుశీల మగణ్ణి నిలదీసింది.
"ఔను కదా." అన్నాడు రామారావు.
"అదీగాక, వూరి జనం ఎన్నడూ లీటరు పాలకి 20 తులాల కోవా వస్తూందా లేదా అని చూసుకోడం నే వినలేదు. మీరు కేవలం కుళాయి
నీళ్ళే ఇస్తే తప్ప ఇదేమిటనేనా అడగరు కదా." అన్నాడు.
"ఆ నపుంసకపు జడ్డితనాన్ని, మేకల్లా, కోళ్ళల్లా గొంతు కోసేస్తున్నా నోరు మూసుకు కూర్చోడాన్ని జనానికి వంటబట్టించేశారు.
అల్లాంటి దుస్థితి నుంచి జనాన్ని బయట పడెయ్యడం మా పని అనుకోలేదు. కాని, ఇప్పుడు నీ మాట విన్నాక మా సమ్మెకి
వున్నసామాజిక ప్రాముఖ్యం అర్థం అవుతూంది. ఇది మూడు పైసల పేచీ కాదు. అంత కన్న పెద్ద విలువవున్నదేనన్నమాట. థాంక్స్.
ఇంత మంచి, గొప్ప అంశాన్ని తోపింప చేసినందుకు రొంబ థాంక్స్."--అంటూ వెక్కిరింతగా, నారాయణ మూతి బిగించేడు.
"మీరు కోరినా, కోరకపోయినా మీ కోరిక ఫలిస్తుంది. అయితే మీరనుకున్నట్లు కాదు. ఈ సమ్మె ముగిసేసరికి సగం ఇళ్ళకి మీరు
పాలు పోసే పని వుండదు." అంది సుశీల.
"పాలు, మజ్జిగా మానేస్తారా?"
"మానరు. గవర్నమెంటు పాల బూత్స్ మీద పడతారు. వెన్న తీసేస్తారనీ, పాలపొడి పాలు ఇస్తారనీ, కాచి చల్లార్చడం వలన
పాల రుచి పోతుందనీ, జబ్బులు చేస్తాయనీ మీ వాళ్ళింతవరకు తెగ బోధిస్తున్నారు, బెదరకొడుతున్నారు. ప్రజలు కొత్తదంటే చూపే
భయంతో, బూత్ దగ్గరి కెళ్ళడం క్యూలో నిల్చోడం అంటే వున్న నామోషీతో, ఇంకా ఎన్నో కారణాలు--ఆ పాలో, పాపాలో మీ వద్దే
కొనుక్కుంటున్నారు. యింక ఆ జడ్డితనం వదిలిపోతుంది. " అంది సుశీల, వెక్కిరింతగా.
"పెట్టీ బూర్జువా మనస్తత్వం మీ సమ్మెతో చప్పగా వదిలిపోతుంది. " అన్నాడు రామారావు.
"రివిజనిస్టుల విశాలాంధ్రలో వాడు చెప్పినట్లే చెప్పేవు."--అన్నాడు నారాయణ, వెలపరం కనబరుస్తూ.
"అంటే మీ మిత్రులలో కొందరికింకా మెదడు పని చేస్తూందన్నమాట." అంది సుశీల.
"పని చేసేలా చేసేను. ఓ శకున పక్షి గాడు, పరమ అభాజనుడు నీలాగే మొదలు పెట్టేడు. ఎంత దెబ్బలాడవలసి వచ్చింది?"
రామారావు నవ్వేడు.
"వాళ్ళ నోరు నోక్కేసేరన్నమాట."
"అయితే అసలు జడ్డితనం వదలవలసినది వాళ్ళకి. తప్పని ఎరిగీ, మీ నోటికి జడిసి." "....అదయి వుండదు. మీరు
చేసేది తప్పని చెప్పేరు. మీరు పోరు పెట్టుకొన్నారు. సరే మనదేం పోయింది. మంచో చెడ్డో మీరు గోతులో దిగుతామంటే పేపర్లో
వెయ్యక తప్పదు కదా, వేసుంటారు." అని పూర్తి చేసింది.
పెళ్ళాం మాటలు వినేసరికి నారాయణ కోపం పట్టలేకపోయేడు.
"ఏడిశావు పోదూ, నీ బతుక్కి రాజకీయాలు అర్ధం అవుతాయా, ఏడుస్తాయా? అల్లా బాంకులో అంకెలు కూడుకుంటూ...."
తెగేదాకా లాగకూడదని ఎరిగిన సుశీల వెనక తగ్గింది. ఏదో పని కల్పించుకొనేందుకు వెళ్ళి, ఇంకా మూసే ఉన్న రెండో కిటికీ
తెరిచింది.
"ఫాను వేసుకొంటే మాత్రం మూసిపెట్టిన గదిలో గాలి ఆడుతుందా?" అంటూ మాట మార్చింది.
"బెజవాడ వీధులకీ, పరిశుభ్రతకీ చుక్కెదురు." అని రామారావు ఆమె ప్రయత్నానికి సాయపడ్డాడు.
"నిజమే అనుకోండి."
"ఆ మంచం కిటికీ దగ్గిరికి లాక్కో. గాలేనా వస్తుంది." అని నారాయణ సలహా ఇచ్చేడు.
"ఇవన్నీ ఎందుగ్గాని, ఆ కుర్చీలు అల్లా లాక్కోండి. కాస్సేపు మీరిద్దరూ కూర్చుని కబుర్లు చెప్తూంటే తలనొప్పి అదే
తగ్గిపోతుంది."
"తలనొప్పి తగ్గించే మాటలు ఒక్కరికే సాధ్యం. ఆ అవకాశం కాస్తా మీరే పాడు చేసుకొన్నారు."--అంది సుశీల.
"మీ అందరి మాటా వినివుంటే నా తలనొప్పి ఆవిడకీ, ఆమెనుంచి మీ అందరికీ కూడా చుట్టుకొనేది. నేను వినిపించుకోలేదో, మీరంతా
సుఖపడ్డారో...." అన్నాడు, రామారావు గంభీరంగా.
"మేమందరం అదనపు తలనొప్పి తెచ్చుకుని, అయ్యో కుయ్యో అంటున్నాం. పెళ్లి చేసుకోలేదో, బతికేవో " అన్నాడు నారాయణ.
"మీకేమండీ అదృష్టవంతులు. నెలకు నాలుగైదు వందలు తెచ్చే భార్య ఇంట్లో వున్నారు. ఎన్నేనా కబుర్లు చెప్తారు."
"అడుగడుగునా ఎన్ని గండాలు! ఎవరికి వాళ్ళే పక్కవాళ్ళ నెత్తిన చెయ్యిపెట్టాలని చూసేవాళ్ళే. కేంద్ర మంత్రి నుంచి మా ఏజంటు
దాకా, ఈ నాలుగు వందలలో ఎంత చొర్రి పెట్టగలమని చూసేవాళ్ళే."--
"వెధవముండకి నమస్కరిస్తే నన్ను పోలి బతకమందిట." నారాయణకేసి అంతా గుప్పించేరు.
"దేశం, ప్రజలూ ఏమయిపోయినా సరే పార్టీలు ముఖ్యం అనుకొనే నాయకత్వం వున్నంతకాలం మనం ఎవరికి నమస్కరించబోయినా
వెధవముండలే అయి కూర్చుంటారు."--అంది సుశీల విసురుగా.
ఆ మాట విసురు తన మీద వేసుకుంటూ రామారావు ఆ భార్యా భర్తలమధ్య దుమారం రేగకుండా సర్దేశాడు.
"చంపేశారు, నోరు నోక్కేసేరు."
సుశీల సర్దుకుని మాట మార్చింది.
"తిరపతమ్మ గారు ఏమన్నా వ్రాసారా? ఎప్పుడొస్తారు?"
రామారావు తల్లి తిరపతమ్మ. ఆమె కూతురు కొత్త కాపురంలో సాయం చెయ్యటానికి వెళ్ళింది.
"నా స్థితి ఏదో తేలేవరకూ ఆమె రాకపోవడమే మంచిది. అక్కడుండడమే సుఖం."
"మీరేం తిన్నారో, ఏలా వున్నారో ననుకుంటూ తిన్నన్నం వంట బట్టకపోవడం సుఖమా?"--అంది సుశీల.
"తేలడానికేముంది?"--అన్నాడు నారాయణ. "పెళ్ళి వాయిదా వేసుకోనే వేసుకున్నావు. పుష్కరాలు వచ్చేశాయి. ఈ ఏడాది గోదావరి
పుష్కరాలు. వచ్చే ఏడు కృష్ణా పుష్కరాలు. ఈ రెండేళ్ళూ పెళ్ళిళ్ళకు పనికిరాదు. ఇహ తేలడానికేముంది?"
"మీకు తెలియదులా వుంది. నా వుద్యోగం వైభోగం ఈ పూటతో ముగిసింది."
అదేదో అతి సామాన్య విషయం అయినట్లు చెప్పబోయినా అతని కంఠం పట్టేసింది.
దంపతులిద్దరూ ఉలిక్కిపడ్డారు.
"అయ్యో!" అంది సుశీల.
"రెట్రెంచిమెంటా." అన్నాడు నారాయణ.
రామారావు నిశ్శబ్దంగా తల ఆడించేడు.
"వూరుకోవద్దు." నారాయణ సలహా.
"ఉహు." అన్నాడే గాని, వూరుకోకపోవడం ఏమిటో రామారావుకు తెలీలేదు.
"మీ ఒక్కరికేనా?"
"మా కాలేజీలో ముగ్గురం. నాతో వస్తుంటాడు రామలింగేశ్వర్రావని, ఆయన...."
"ఆయనకూనా?" సుశీల ఆశ్చర్యం.
"ఆహా."
"వాళ్ళు పొమ్మంటే లేచి వచ్చేసేరా?" అంటూ నారాయణ ఆశ్చర్యం ప్రకటించేడు.
"ఏం చేయమంటారు?" అని సుశీల ఆశ్చర్యంగా మగని ముఖం వంక చూసింది.
"ఆ ప్రిన్సిపాల్‌ని నాలుగు తన్నాలి, ఏం చెయ్యడం ఏమిటి? జాతి నిర్వీర్యం అయిపోయింది. మిలిటెన్సీ చచ్చిపోయింది. ఏం
చేస్తారుట!"
మగనికి మతి వుండే మాట్లాడుతున్నాడా అన్నట్లు సుశీల తెల్లబోయింది. నారాయణ సాగించేడు.
"మనుష్యుల బతుకులతో చెలగాటం ఆడుతున్నారు. ఒక్క క్షణం పరాగ్గా వుంటే కాలి కింద గోతులు తవ్వుతున్నారు. వద్దు.
వూరుకోవద్దు. మనం బతికే వున్నామని చూపాలి. చూపడానికి ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఉహు. ఊరుకోవద్దు."
"నిజమేనండి. ఊరుకోకూడదు. కాని, ప్రిన్సిపాల్‌ని తన్నితే పని జరుగుతుందా?"--అంటూ సుశీల సందేహం కనబరచింది.
"మరొకరిని తన్నితే మాత్రం?" అన్నాడు రామారావు.
కాని నారాయణ ఒప్పుకోలేదు.
"రొట్టెకి రేవేమిటి? ఎవరికి వెష్ట మోసినప్పుడు వాళ్ళు బడితె బాజా ప్రారంభించెయ్యాలి. అసలుమనిషి వీడు కాకపోయినా
అసలువాడిచేతిలో కీలుబొమ్మ. అసలువాడెవరు? మిగులు వాడెవరని మీన మేషాలు లెక్కబెడుతూ కూర్చుంటే ఈ లోపున మనల్ని
నమలకుండానే మింగేస్తారు."
"అందుచేత ఎవరినో ఒకరిని తన్నడం తప్పదంటారు." అంది సుశీల. రామారావు తెల్లబోయాడు.
"మీరు వ్యక్తి దౌర్జన్యవాదాన్ని సమర్థిస్తున్నట్లుంది. మార్క్సిజం...."
నారాయణ వెడనవ్వు నవ్వేడు.
"అయ్యా, మార్క్సిజాన్నేగాని, మరో ఇజాన్నేగాని దేశ కాల పాత్రలకి సమన్వయం చేసుకోవాలి. అలాగాక ఆ బాధల్ని రూళ్ళకర్ర
సూత్రాలు చేసుక్కూర్చుంటే వచ్చే ఇబ్బందే ఇది. ఇన్ని యుగయుగాలుగా మహనీయులు చెప్పిన ఆశయాలూ, చూపిన ఆదర్శాలూ వారితోనే
గబ్బుపట్టి పోవడానికి కారణం ఏమిటంటావు?"
"ఏమో. నేనంతవరకు చదువుకున్నట్లు కనిపించడం లేదు"--అన్నాడు రామారావు.
ఆ వెక్కిరింత అర్ధమయిందో, లేదో అర్ధమయినా లెక్కచెయ్యదలచలేదో నారాయణ తన ధోరణినే సాగించేడు.