తెల్లబోయింది.
భోజనానంతరం అన్ని పనులు తెముల్చుకొని, రమణమ్మ జయప్రదను చిక్కించుకుంది. రామారావుతో సంభాషణనంతనూ తెలుసుకుంది.
"దురుద్దేశంతో నిన్ను చేత చిక్కించుకొని, మీ నాన్నని నొక్కదలచుకొన్నవాడైతే నీ సూచనను వెంటనే ఒప్పేసుకొనేవాడు. రిజిస్ట్రార్
ఆఫీసు ఏర్పాట్లు గప్ చిప్ గా జరిగించేసేవాడు."
కాని, జయప్రద మనస్సులో గట్టి అనుమానం పాదుకొంది.
"ఆయనకు కావలిసింది ఆస్తి. మనిషి కాదు. మనుష్యుల స్వభావాలు బయటపడడానికి ఇటువంటి ఘట్టాలే సాయపడతాయి. స్వభావం
తెలిసింది. చాలు."
"ఏమ్మాటే అది. చేతిలోంచి కానీ ఖర్చు చేయనక్కర్లేకుండా అతడే మనని కూడా భుజాన వేసుకుంటే అందరం అభినందిస్తాం. అతని
ఆదర్శాలకి మీ నాన్నలాగే జోహారులర్పిస్తాం. ఓహో, ఆహా అంటాం. కాని...."
"ఏమిటా కాని...." అని జయప్రద రొక్కించింది.
"కాకపోతే ఏమిటే. నిజం చెప్తే నిష్ఠూరమేగాని, నిన్నీ పళాన పెళ్ళి చేసుకోడం అతనికి అదనం బరువు. ఆ బరువు
తగ్గించడానికి నువ్వు చేసే సాయం ఏమిటే?"
"పెళ్ళి అనేది మనిషి కోసమా, డబ్బుకోసమా"
"తర్కానికి మంచి విషయమే. కాని, అన్ని సందర్భాలలోనూ ఈ తర్కం సరిపడదు. కడుపు నిండని చోట ప్రేమా, ఆప్యాయతా
నిలబడవన్నాడన్నావు. చాలా తెలివైన మాట."
జయప్రద ఒక నిముషం ఆగింది.
"నేనూ వుద్యోగం చేస్తానన్నాను."
"ఇదివరకే వున్న అతని వుద్యోగం సౌరభ్యం అల్లా వుంది. ఇంక నీది తరవాయి. పోనీ ఒకవేళ ఇద్దరికీ వుద్యోగాలు వుంటాయనే
అనుకున్నా మూడేసి నెలలక్కూడా జీతాలందని ఈ గవర్నమెంటులో మీరేం తింటారు?"
"అయితే ఈ చదువులెందుకేం? భూమీ, నగలూ అమ్ముకొని...." అంది జయప్రద ఏడుపు మొహంతో.
"ఏభయ్యేళ్ళ క్రితం లోయర్ సెకండరీ పెద్ద చదువు. నలభయ్యేళ్ళ క్రితం స్కూల్ ఫైనలు. ముప్ఫయ్యేళ్ళ క్రితం బి.ఏ. ఈ
వేళ పోస్టుగ్రాడ్యుయేషన్ కూడా కాదు. ఫారిన్ డిగ్రీ. ఈ పోటీలో కూర్చోడానికి లేదని మావారు పై చదువుకంటూ ఇంగ్లండు
పరుగెత్తేరు. పరిశ్రమలు పెరగని దేశంలో డిగ్రీలు పెంచుకుంటూ పోడం తప్ప పోటీలో నిలబడే దారి లేదన్నారు. ఇంగ్లాండు చూసి
రావడానికి తయారు చేసిన సిధ్ధాంతం అనుకున్నా. కాని, రామారావు స్థితి చూసేక నిజమే అనిపిస్తూంది."
జయప్రద ఆలోచనలో పడింది. రమణమ్మ మాట మార్చింది.
"ఇది మీరు ప్రేమించుకొని, చేసుకొన్న నిర్ణయం అనుకొంటాను."
ప్రేమించుకోడం అన్న మాటకు జయప్రద మనస్సు ఒప్పలేదు.
"ఇద్దరికీ ఇష్టం అయింది."
రమణమ్మ చెల్లెలు వంక నిరసనగా చూసింది.
"ఇష్టం అంటే వేరే పిల్లా! రోగిష్టి కాకుండా వుండి, సుమారుగా పర్వాలేదులే అనుకునేటట్లుంటే మొగుడూ పెళ్ళాలాట ఆడుకొనేందుకు
ఇష్టంగానే వుంటుంది. కానీ, ప్రేమ వేరు...."
"నాకేం తెలియదు." అని జయప్రద విసురుకుంది.
"తెలియదని నాకూ అర్ధం అయింది. వరదిట్టం వుంది. ఏ మాత్రమో చదువుంది. సంపాదించుకొంటున్నాడు. అన్నింటికీ ముఖ్యం పెద్ద
బాధ్యతలుండవు. అంచేత నీకిష్టంగానే వుంటుంది. కట్నం ఇవ్వక్కర్లేదు. ప్రదానంలో పంచెల చాపు కూడా వద్దన్నాడు. అది మీ
నాన్నకు నచ్చింది."
"మా నాన్న ఆయన్ని ఎరగనే ఎరగడు. కట్నం ఇస్తాననే అన్నాడు. లోపం చేయాలనుకోలేదు...."
"అంటే నువ్వే ఏరికోరి తెచ్చుకున్న వరుణ్ణి అర్ధంలేని అనుమానాలతో చెండనాడుకొంటున్నావన్నమాట."
"లేనిపోని మెలిక వేస్తున్నది నేను కాదు."
"నువ్వే చెప్పినట్లు విని పెళ్ళికి సిధ్ధపడి వుంటే ఏమయ్యేది? కోపం కొద్దీ మీ నాన్న ఆస్తి ఇవ్వడు. చదువుకి సాయం
చెయ్యడు. ఆయనకా వుద్యోగం లేదు. ఏం తింటారు? ఒకరి మొగం ఒకరు చూసుకుంటూ కూర్చుంటే కడుపు నిండదు. ఆయన ఎరుగును. నిన్ను
కూడా బురదలో దింపడం ఇష్టం లేదన్నమాట నిజమే. ఆయన చాల తెలివిగలవాడు...."
"నీవన్నీ....ఔనుగాని, పోయి చదువుకో, చదువు ముగిసేక నీకింకా ఈ దృష్టి వుంటే అప్పుడాలోచిద్దాం. ఇప్పుడు మీ నాన్న మాట
వినుకోమని ఎందుకంటారు?"
"అదన్నమాట అపరాధం." రమణమ్మ జాలిపడుతున్నట్లు చూసింది. "రెండేళ్ళకి నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవుతుంది. తాను?
ఇంతకంటె పెరగకపోవచ్చు. నీ దృష్టి మారవచ్చు. డబ్బులో తక్కువ. చదువులో తక్కువ. వీడు మొగుడేమిటనిపించడం సహజం.
నిన్ను బంధించి వుంచడం అన్యాయం అనుకున్నాడని దాని అర్ధం...."
"ఇదంతా నీ వూహ. అంతే." అంది, జయప్రద దృఢంగా. రమణమ్మ కాదనలేదు.
"నీ మనస్సు నిరుకు చేసుకొన్నావు. మంచిదయింది. తరవాత బాధ పడనక్కరలేకుండా."
ముప్ఫయినాలుగో ప్రకరణం
పక్కవాటా తలుపు తీసిన చప్పుడయి, సావిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సుశీలా, భాగ్యలక్ష్మీ వులికి పడ్డారు.
"చూడు ఎవరో." అంటూ లేచి, సుశీల అరుగుమీది లైటు వేసింది.
"రామం వస్తాడా?" అంటూ భాగ్యలక్ష్మి తలుపు తీసింది.
వీధిలో లైటు వెలగగానే లోపలివాళ్ళ ఆదుర్దా అర్థమయింది, రామారావు.
"నేనేనండి" అన్నాడు.
సుశీలా, భాగ్యలక్ష్మీ ముఖాలు చూసుకున్నారు. వాళ్ళు అరుగు మీదికి వచ్చేసరికే అతడు గదిలోంచి కుశలప్రశ్నలు వేస్తున్నాడు.
"అంతా బాగున్నారా?"
"ఇప్పుడెందుకొచ్చేవు?"
సుశీల ప్రశ్నకు రామారావు వెనుతిరిగి చూసేడు. ఆ ప్రశ్న అతని కర్ధం కాలేదు. తప్పుగా వినిపించినట్లు తోచింది.
"రావడం అయితే జనతాలోనే వచ్చేను. ఎప్పటిలాగే అది ఒక జీవితకాలం లేటు. మళ్ళీ ఎక్కడ వెళ్ళగలమని వస్తూ, వస్తూ
ఆత్మారాముణ్ణి శాంతపరచే వచ్చేను."
"హోటల్లో భోజనం చేసి వస్తున్నావా?" భాగ్యలక్ష్మి మాటలో వ్యక్తం అవుతున్న భయాన్నిగాని, ఆశ్చర్యాన్నిగాని అతడు
గుర్తించలేదు.
"మనకోసం వంటలు వండించి, పళ్ళేలు కూడా పరిచి వుంచేరు. బాబూ! ఆకలేస్తూండి వుంటుంది. మళ్ళీ ప్రాణం కడబట్టగలదు. దయచేసి
నాలుగు మెతుకులు కొరికి వెళ్ళండి--అంటూ దారికాచి, మైకుల్లో ఆహ్వానిస్తూంటే తోసేసుకు రమ్మంటావా? మంచిదానివి కదూ, సిధ్ధాన్నం
కాలదన్నుకు వస్తే మళ్ళీ అన్నం పుడుతుందా?"
అతడు మామూలుగానే మాట్లాడేస్తున్నాడు. కాని, మనస్సులోని ఉద్విగ్నతను మాటల ప్రవాహం మాటున కప్పిపుచ్చుకుంటున్నట్లు
కనబడింది. ఎందుకా ఉద్విగ్నత? విషయం ఎరిగి మొండితనం, నిర్లక్ష్యం చూపుతున్నాడా? సుశీల మెదడులో ఎన్నో ఆలోచనలు.
"ఈ వారం పదిరోజుల్లో పోలీస్ సి.ఐ. ప్రతిరోజూ మీరు వచ్చేరాయని మనుష్యుల్ని పంపుతూనే వున్నాడు."
"మనం ఇంకా వుద్యోగం వెలిగిస్తున్నామన్న భ్రమలో వున్నాడేమో మహానుభావుడు. మనం ఇప్పుడు స్వేచ్ఛా జీవులం అని చెప్పక
పోయేరా. ఈమారు మరొకర్ని వెతుక్కున్నేమో పాపం."
"ఆయన ఎరుగును"--అంది భాగ్యలక్ష్మి.
"మన సిఫార్సులు వినే అభాజనుడున్నాడని భ్రమపడుతూండి వుంటాడు, అయితే."
అతని బేఫర్వా ధోరణి చూస్తే తమది వట్టి అనుమానమేమోనని ఇద్దరికీ ఒక్క క్షణం అనిపించింది.
"ఆయనకు మీతో పనేమిటి?"
"ఆయనకా? ఓ సుపుత్రుడున్నాడు. నాన్నగారి వుద్యోగం ధర్మమాయని వాడు వట్టి వెధవాయిలా తయారయాడు. స్కూలు ఫైనలులో
మూడుమాట్లు డింకీలు కొట్టేక మూడువేలు తనవి కావనుకున్నాడు. వాడు గట్టెక్కేడు. వాళ్ళ నాన్నకి, అంటే సి.ఐ. గారికి
దేశప్రజల ఆరోగ్యం గురించీ, వంతెనలు, రోడ్లు మొదలైనవి దేశంలో వృధ్ధి పొందడంలేదే అనీ తపన పట్టుకొంది. ఇప్పుడా
సుపుత్రుడికి మెడిసిన్లోనో, ఇంజనీరింగ్లోనో సీటు కావాలని నా సలహాలు అడిగేడు. అది గాకుంటే ఆ
పెద్దమనిషికి మనలాంటి దిగంబర సన్యాసితో పనే లేదు."
"ఏమీ కాదు."--అంది సుశీల.
"నీ మీద వారంటు వుందిట తెలుసా?" అంది భాగ్యలక్ష్మి.
రామారావు తెల్లబోయేడు. ఆమె ముఖం వంక చూసేడు. సుశీలను చూసేడు. నమ్మకం కుదరలేదు, నవ్వేడు.
"ఎవరండీ, మనల్ని అరెస్టు చేయ్యాలనుకునే మూర్ఖుడు. ఎందుకోసం? మన ప్రభుత్వం ఎంత పనికిమాలినదైనా, అంత తుగ్లక్
ప్రభుత్వం అనుకోను. నన్ను అరెస్టు చెయ్యడం తప్ప వాళ్ళకి మరో...."
"నిజమే...." సుశీల ఎంత దృఢంగా చెప్పినా అతని కది విశ్వసనీయం అనిపించలేదు.
"పోనీలెద్దురూ, ఉద్యోగం ఎల్లాగూ లేకుండా చేశాం కదా. కొన్ని రోజులు మన ఖర్చుల మీద అన్నం, బస చూపిద్దామనుకున్నారేమో,
పాపం. వాళ్ళ సత్సంకల్పాన్ని మనం ఎందుకు వద్దనాలి."
అతనిని కంగారు పెట్టకుండా అసలు విషయం చెప్పాలన్న వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. అతడు వారి మాటలు చెవి చొరనివ్వడంలేదు.
అక్కడే అరుగుమీది గదిలో అతన్ని నిలబెట్టి వుంచడం న్యాయంగా తోచలేదు.
"నడవండి లోపలికి."
ముగ్గురూ లోపలి గదిలోకి నడిచేరు.
"మీ హడావిడి నాకు అర్ధం కావడంలేదు. చెప్పండి. నా మీద వారంటు ఏమిటో."
"పిల్లలు ఒక్కళ్ళున్నారు, తలుపులు తీసి వున్నాయి, చూసొస్తా. భాగ్యలక్ష్మీ, నువ్వు చెప్తూండు, వస్తా."
సుశీల తన వాటావేపు హడావిడిగా వెళ్ళింది.
"నారాయణగారిని అరెస్టు చేశారు. తెలుసా?"
"తెలియదు. పాలవాళ్ళ సమ్మెలోనా?"
"ఔను. హోటలువాళ్ళ పాల వేన్ తగలపెట్టి, డ్రైవరు బుర్ర పగలకొట్టేరని ఆయన మీద కేసు పెడుతున్నారు."
"అన్నంతపనీ చేశారన్నమాట."
"అదెంతవరకు నిజమో, నిజమే అయితే ఆ పని చేసిందెవరో," అంది భాగ్యలక్ష్మి.
"అయితే ఆ పనికి నేను సలహాదారుణ్ణా, సహాయకుణ్ణా? నా పాత్ర ఏమిటి?" అన్నాడు, రామారావు హాస్యం ఎగతాళీ జతకలుపుతూ.
అతనికి తన స్థితి ఏమీ గ్రహింపు లేదని భాగ్యలక్ష్మి అర్ధంచేసుకొంది.
"అడిషనల్ తాసీల్దారు చెంపలు వాయగొట్టేసినందుకుట."
చటుక్కున పంచదార కార్డుల కోసం వెళ్ళిన నాటి ఘట్టాలు గుర్తు వచ్చేయి. ఆ రాత్రే తాను ప్రయాణం అయి వెళ్ళిపోయేడు. తన
గొడవల్లో తిరుగుతూ ఆ మాటే మరిచిపోయేడు.
"ఆంతవరకు రాలేదులే," అన్నాడు పరధ్యానంగా, 'ఏం? ఎవరు చెప్పేరు?"
"ఎవరు చెప్పడం ఏమిటి? ఊరంతా చెప్పుకుంటూంటే."
రామారావు ఆ మాటకు పకపక నవ్వేడు. భాగ్యలక్ష్మి గదిమింది.
"ఏమిటా నవ్వు? నువ్వు వచ్చినట్లు వూరంతా తెలియాలేమిటి?"
"అదొకటా. నేనిప్పుడు 'అండర్ గ్రౌండ్' కావాలేమిటి ఖర్మ."
భాగ్యలక్ష్మి నిస్పృహ కనబరచింది. "నవ్వకోయ్ బాబూ!"
"ఇంత గొప్ప జోక్ చెప్పి నవ్వవద్దంటే ఎల్లా భాగ్యం! అడిషనల్ తహశీల్దారు చెంపలు వాయగొట్టడం న్యాయమేనన్న సహృదయత
ప్రజలలో వుందన్నమాట. ఔనుగాని, నారాయణ గారు ఎవరి బుర్రో పగలేశారన్న వార్త కూడా అటువంటి సద్భావ ఫలితమే
కాదుకద?"
"అది చూసిన వాళ్ళు లేరు. కాని నువ్వు పంచదార కార్డు కోసం వెళ్ళడం, తాశీల్దారును కొట్టడం, ఫోన్ తెంపెయ్యడం, ఆఫీసు
తగలపెట్టి అందర్ని చంపేస్తానని బెదిరించడం, వూరంతా గుబ్బుగా చెప్పుకుంటూంది."
"అబ్బో, నా వీరకృత్యాల గాధ ఇంత వుందన్నమాటే మరచిపోయాను సుమా." అని మరల నవ్వు ప్రారంభించేడు.
"ఇల్లాంటి కథలు కల్పించుకోగల ఇమేజినేషన్ ప్రజల్లో బ్రహ్మాండంగా వుంది. ఆ రోజున తాశీల్దారు పనికి సాయం చేశాగాని అడ్డం
పెట్టలేదు. మిగిలిన కథలా, ఓస్!"
"అబధ్ధం అయితేనేం, చూసినట్లు కథల్లా చెప్పుకుంటూంటే."
"పోలీసాడు ఎందుకో వస్తే మీరీ భ్రమలు పెంచుకున్నారనుకుంటా."
"కాదు రామం. నిజమే. నీ మీద వారంటుందన్నాడట ఎస్.ఐ. నాన్న చెప్పేడు."
రామారావు ఆశ్చర్యంతో ఆమె మఖం వంక చూసేడు. వారంటు వార్త కన్న ఆమె 'రామం’ అని ఆప్యాయంగా పిలవడం అతనికి
ఆశ్చర్యంగా వుంది. ఆ పిలుపు ఆమె నోట వచ్చి రెండేళ్ళు అయింది. ఈ రెండేళ్ళూ ఆమె తనతో 'కంయ్' మంటుందేగాని సౌమ్యంగా
మాట్లాడడం లేదు. దానికి కారణంగా తాను అనుకొంటున్నది వట్టి భ్రమ యేమోననిపించిన సమయాలు కూడా వున్నాయి. జయప్రదతో తనకు
సంబంధం తెగిపోయిన వార్త ఆమె దాకా వచ్చిందా అప్పుడే--అనిపించింది.
"థేంక్స్. కూర్చో, స్నానం చేసి వస్తా."
భాగ్యలక్ష్మి చటుక్కున అతని భుజం పట్టుకుంది.
"వెళ్ళిపో. నేను చెప్తున్నది నిజమే. తాశీల్దారుకోసం పోలీసాళ్ళు నీమీద కారాలు నూరుతున్నారు. "
"తాశీల్దారుకు నూరే ఓపిక లేదా."
"నిజం, రామం."
"మీ నాన్న చెప్పేరా?"
ఆమె తల తిప్పింది.
"జనానికి కార్డులిప్పించినందుకే?"
మళ్ళీ తల తిప్పింది.
"ఉహూ"--అతడాలోచనలో పడ్డాడు.
"నువ్వు తప్పించుకు తిరుగుతున్నావని పోలీసులు అనుకుంటున్నారు. మళ్ళీ ఎందుకొచ్చేవు?"
తాను ఓ.వి. (ఔటాఫ్ వ్యూ) అన్నమాట వింటే మళ్ళీ నవ్వొచ్చింది.
"ఎందుకేమిటి? నేనెందుకు యు.జి. కావాలి. అయి చేసేదేమిటి?"
భాగ్యలక్ష్మికి ఆశ్చర్యం వేసింది. కమ్యూనిస్టులు పోలీసులకి దొరక్కుండా తప్పించుకు తిరుగుతారని ఆమె వింది. దానినే యు.జి.
కావడం అంటారని తెలుసు. అండర్‌గ్రౌండ్ కమ్యూనిస్టుల అద్భుత సాహస గాథలు ఆమె ఎన్నో వింది. అన్నీ నమ్మింది
కూడా. రామారావు కమ్యూనిస్టని అందరూ అంటారు. నగరంలో ప్రచారం అవుతున్న సాహస గాధలు విన్నాక అతడు
అండర్‌గ్రౌండ్ కావడం తధ్యమేననుకొంది. ఆమె గర్వపడింది. అటువంటిదిప్పుడు ఇంటికి వచ్చేసేడు, పోలీసులకి ఎందుకు
కనుమరుగు కావాలంటున్నాడు. అతనిని పట్టుకొని జైలులో పడేసి హింసలు పెడతారని ఆమె భయం.
ఏం చెప్పలేక పోయింది. తల తిప్పుకుంది. ఆమె ఏడుస్తూందని గ్రహించేడు.
"ఎందుకు ఏడుస్తావు?"
భాగ్యలక్ష్మి మాట్లాడలేదు. తల తనవేపు తిప్పుకోబోయేడు, అతని ప్రయత్నం సాగకుండా ఆమె అతనికి జేరబడిపోయి, భుజం మీద
తల దాచుకుంది. చేయగలది లేక రామారావామెను పొదివి పట్టుకున్నాడు. ఆమె కన్నీళ్ళు చొక్కాలోంచి ఇంకి ఒంటికి వెచ్చగా తగులుతూంటే
జాలి వేసింది. వీపు నిమిరేడు, జాకెట్ హుక్కులు చేతికి తగులుతున్నాయి. ఆమె మరింత కరుచుకుపోతూంది. ఏడుస్తూనే ఒక చేయి అతని
నడుము చుట్టూ వేసింది.
"నువ్వు వెళ్ళిపో, దొరక్కు."
రామారావు ఆమెను ముద్దు పెట్టుకొన్నాడు. చెక్కిళ్ళు నిమిరి చిరునవ్వుతో ఎగతాళి చేసేడు.
"నేను దొరికితేనేం, భాగ్యం,"
ఆ ప్రశ్న "నీకేం" అన్నట్లు వినిపించి భాగ్యలక్ష్మి వొణికింది, గద్గద కంఠంతో.
"ఎక్స్క్యూజ్ మీ" అంది.
"ఏమీ ఫర్వాలేదోయ్."
అతను కౌగలించుకుని ముద్దు పెట్టుకొంటూంటే నాలుగురోజులనాడు తన ముందర చేసిన ప్రతిజ్ఞ భాగ్యలక్ష్మికి గుర్తేలేదని అటు
వస్తున్న సుశీల గ్రహించి వెనక్కి తప్పుకుంది. నవ్వుకుంది.
ముప్ఫయ్యయిదో ప్రకరణం
స్నానం చేసి బట్టలు మార్చుకు వచ్చి భాగ్యలక్ష్మి పక్కనే మంచం మీద కూర్చుని రామారావు ఆమె అభ్యర్ధనను పెక్కు కోణాల
నించి నిరాకరించేడు.
"నేనెందుకు అండర్ గ్రౌండ్ కావాలి?"
"అయి ఏం చెయ్యాలి?"
"యు.జి. కావడం ఫేషనా?"
"సులభమా?"
"అవసరమా?"
"ప్రజలకేమన్నా సాయం చేస్తే, చేస్తూంటే మనకి రక్షణ ఇస్తారు కాని, నాకెందుకు ఇస్తారు? ఇవ్వాలి?"
"ఏ పనీ చెయ్యకుండా, పోలీసాళ్ళు నన్ను పట్టుకుంటామంటున్నారు నన్ను కాస్త దాచండంటే దాస్తారా? అదంత సులభమనుకున్నావా?"
"వట్టినే కూర్చుంటే తిండి ఎల్లాగ? వీధిలోకెళ్ళను. నాకింత అన్నం మీరే పెట్టాలంటే అర్ధం ఏమిటి?"
అతనిలో సహజంగా వున్న మొండి పట్టుదలే ఈ నిరాకరణకు కారణం అనుకుంటున్న భాగ్యలక్ష్మి అతనిననేక కోణాలనుంచి
ఒప్పించడానికి ప్రయత్నించింది.
"మీ పార్టీ మీకు సాయపడదా? ఇల్లాంటప్పుడు వాళ్ళు నిన్ను నీ మానాన వదిలేయవలసిందేనా?"
రామారావు నవ్వేడు.
"నేను పార్టీ సభ్యుడిని కాను."
"అడిషనల్ తాసీల్దారును రెండేసేవంటే అతని మీద కోపమా నీకు, జనం...."
రామారావు నవ్వేడు.
"నేనెవరినీ కొట్టలేదు మొర్రో అంటే నువ్వే నమ్మడంలేదే. ఇంక కోర్టుని నమ్మించడం ఎల్లాగ?"
భాగ్యలక్ష్మి వూరుకొంది.
"చూడు భాగ్యలక్ష్మీ! ప్రజలలో పనిచేస్తున్న వాడూ, అతడు బయట వుండకపోతే పనులు చెడతాయన్న వాడూ యు.జి. కావడం
అవసరం. ఒకప్పుడు అటువంటి వాళ్ళు కూడా రహస్యంగా వుండడంకన్న అరెస్టు కావడం వల్లనే పని ఎక్కువ జరుగుతుంది. ఇంక నా
మాట అంటావూ, నన్ను అరెస్టే చేస్తే...."
"ఇంకా సందేహమే?"
"రహస్యంగా వుండి నేను చేసేది లేదు. కేసు పెట్టనీ. ఈ గాడిద కొడుకులు ఆఫీసుల్లో పంది కొక్కుల్లా చేరి ఎల్లా
దోచుకుంటున్నారో, జనాన్ని ఎల్లా హింస పెడుతున్నారో, వాళ్ళకి పోలీసులూ, ప్రభుత్వమూ ఎల్లా సాయపడుతున్నారో కడిగేస్తా.
దిక్కుమాలిన ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు దేశాన్ని అగ్నిగుండం చేసి పెడుతున్నారు. తమకు తగులుతూందని దొంగ
ఏడుపులేడుస్తున్నారు. ఈ దొంగ ఏడుపులు మాని జనం సంగతి పట్టించుకోకపోతే నిజంగానే ఏడవవలసి వస్తుందని వాళ్ళకి తెలియాలి."
ముందు గదిలో బూట్ల చప్పుడు విని ఇద్దరూ లేచి అటు వచ్చే సరికి వెనక వసారాలో పోలీసువాడు ఎవరినో అటకాయిస్తున్నాడు.
"ఉండవమ్మా. లోపల పళ్ళ గంప ఏం లేదు."
"లే. నే వెళ్ళాలి." సుశీల గొంతుక.
ఎదురుగా వచ్చిన పోలీసాఫిసరును రామారావు,
"ఎవరు కావాలి?"
"మిమ్మల్ని అరెస్టు చేస్తున్నా."
"ఎందుకో అడగవచ్చునా?"
దానికి సమాధానం ఇవ్వకుండా సబినస్పెక్టరు ఎదురు ప్రశ్న వేశాడు.
"ఆమె ఎవరు? ఇక్కడెందుకుంది?"
సబినస్పెక్టరు ఆలోచనా ధోరణి అర్ధం అయిందనుకున్నాడు. తనను అరెస్టు చేయడమేకాదు. సాధ్యమైతే అవమానించడం కూడా వుద్దేశం
అన్నమాట. చటుక్కున అనేసేడు.
"నా భార్య."
భాగ్యలక్ష్మి వులికి పడింది. ఇనస్పెక్టరు ముఖాన విషపు నవ్వు ఒక్కక్షణం కనబడింది.
"మీరు అవివాహితులనుకుంటాను."
"మీ దయవలన కొద్దిరోజుల క్రితమే ఆ ఆశ్రమం వదిలాను. మీరు మాత్రం ఎప్పటిలాగే తప్పుడు సమాచారంతో దేశ రక్షణ
సాగిస్తున్నారు."
"ఉహూ. నడవండి. మా సమాచారం తప్పుడుదేమో అనుభవం మీద తెలుసుకొందురుగాని...."
"అదే అనుకొంటున్నాం." అన్నాడు రామారావు. "భాగ్యం గుడ్ బై. వుద్యోగం సద్యోగం లేని రోజుల్లో కాస్త జైలు ఎక్స్పీరియెన్సు
సంపాదించడం ఎందుకేనా మంచిది.....ఛెస్ ఏడుపెందుకు? ఎస్. ఐ. ఏమనుకుంటారు. మన్ని ఏడిపించగలిగేమనుకోరూ. కళ్ళు తుడుచుకో.
గుడ్ గరల్. సుశీలగారూ? మరి సెలవా? నారాయణగారిని చూస్తా లెండి. చెప్తా. అంతా బాగున్నారని."
ఇనస్పెక్టరు వెనక్కి తిరిగి పోలీసుకు సైగ చేశాడు.
"....కె.డి.గాళ్ళ కన్న తేలిగ్గా మాట్లాడేస్తున్నారు. ఇది తరవాయిలన్నీ...."
"సందేహం ఎందుకు? యథా రాజా తధా ప్రజా--అన్నమాట. తక్తు మీద వున్నది పరమ లుచ్ఛాలయితే, దేశంలో పరమ హంసలవుతారా,
ఇన్ స్పెక్టరుగారూ! భ్రమ. కేవలం భ్రమ."
--అంటూ రామారావు ముందుకు అడుగేసేడు.